ఏది నేరం ?! హజారీబాగ్ కథలు

hajaribagh

 

బి. అనూరాధ పుస్తకం “ఏది నేరం ?! హజారీబాగ్ కథలు” మీద డిట్రాయట్ తెలుగు లిటరరీ క్లబ్ సభ్యులు ఫిబ్రవరి 2016 లో జరిపిన చర్చాసారాంశం. పాల్గొన్నవారు: మద్దిపాటి కృష్ణారావు, పిన్నమనేని శ్రీనివాస్, వేములపల్లి రాఘవేంద్ర చౌదరి, నర్రా వెంకటేశ్వరరావు, భూపతి రాజు ఉష, రుద్రరాజు సుధ, వేములపల్లి పద్మ, ఆరి సీతారామయ్య.

చర్చా సమీక్ష: ఆరి సీతారామయ్య

విరసం ప్రచురించిన ఈ పుస్తకంలో 16 కథలున్నాయి. “కథల వెనుక కథ” అనే శీర్షికతో కథల నేపథ్యం గురించి రచయిత్రి వివరంగా రాశారు. ముందు ఈ నేపథ్యం గురించి మాట్లాడుకుందాం.

డిగ్రీ వరకూ చదివిన అనూరాధ కొంతకాలం  బాంక్ లో ఉద్యోగం చేశారు. 1990 లో పౌరహక్కుల సంఘంలో చేరి కార్యకర్తగా పనిచేశారు. 1993 నుండి మహిళా సమస్యలపై పనిచెయ్యడం మొదలుపెట్టారు. చైతన్య మహిళా సమాఖ్య / సంఘం లో రాష్ట్ర స్థాయిలో పనిచేశారు. 2006 నుండి బీహార్ ఝార్ఖండ్ రాష్ట్రాల్లో నారీ విముక్తి సంఘ్ వారితో పనిచేశారు. ఝార్ఖండ్ లో ఆదివాసీలు “మావోయిస్టు సిద్ధాంత మార్గదర్శకత్వంలో” మైనింగ్ కి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో పాల్గొన్నారు.

ఏపిఎస్‌ఐబి వారు 2009 అక్టోబర్లో రచయిత్రిని పాట్నాలో అరెస్ట్ చేసి, నాలుగు రోజులు  అజ్ఞాతంగా నిర్బంధించి, తర్వాత ఝార్ఖండ్లో అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. అప్పటినుండి ఆగస్ట్ 2013 వరకూ ఆమెను ఝార్ఖండ్‌లోని హజారీబాగ్ కేంద్ర కారాగారంలో ఉంచారు. తను రాజకీయ ఖైదీనని రచయిత్రి రాసుకున్నారు.

మన సమాజంలో “సంపన్నులు చెప్పిందే న్యాయం”. “దానిని  కాపాడేది రాజ్యం.” ప్రజాస్వామ్యం పేరిట ధనస్వామ్యం చలామణీ అవుతుంది.” “దోపిడీ సమాజంలో ఏ వ్యక్తి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలూ విడిగా ఉండవు. ఈ సమాజాన్ని ప్రస్తుతం పీడిస్తున్న భూస్వామ్యానికి, సామ్రాజ్యవాదానికి, వారికి ఊడిగం చేస్తున్న దళారీ నిరంకుశ పెట్టుబడిదారులకి వ్యతిరేకంగా ఎక్కుపెట్టబడిన నూతన ప్రజాస్వామిక విప్లవంలో భాగం కావడానికి నేను ఎంచుకున్న రంగం మహిళారంగం. దానికే పరిమితం కావాలని కూడా అనుకోలేదు. అంతిమంగా కమ్యూనిస్టు సమాజంలోనే మనిషిని మనిషి దోచుకోగలిగే పరిస్థితి అంతరిస్తుందనేదే నా స్పష్టమైన అవగాహన.” ఇవి అనూరాధ రాజకీయాభిప్రాయాలు.

మన సమాజం ప్రజాస్వామ్యం పేరుతో సాగుతున్న ధనస్వామ్యం అనేది నిస్సందేహం. రచయిత్రితో మేము పూర్తిగా ఏకీభవిస్తున్నాం. మన రాజ్యాంగాలు, న్యాయస్థానాలు, పొలీసు వ్యవస్థలు ధనికులకు అనుకూలంగా ఉంటాయి. వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచెయ్యవచ్చు, కాని వారి అధికారానికి ప్రమాదం లేనంతవరకు మాత్రమే. ప్రమాదం రావచ్చు అనుకుంటే వ్యవస్థ ఎన్‌కౌంటర్లు జరిపిస్తుంది. ప్రాణాలు తీస్తుంది. ముమ్మాటికీ నిజం.

కానీ, దీనికంతటికీ విరుగుడు కమ్యూనిజం అని రాశారు రచయిత్రి. వ్యవస్థకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాల్లో మావోఇస్టు మార్గాన్ని ఎంచుకున్నారు కూడా. కమ్యూనిస్టు సమాజాల్లో, మావోఇస్టు మార్గంలో ప్రజాస్వామ్యం ఉందా? లెనిన్‌, మావో, స్టాలిన్‌, పోల్ పాట్‌లు వారి వ్యతిరేకులను ఏం  చేశారు?   అంటే ధనస్వామ్యంలోనైనా కమ్యూనిజంలోనైనా అధికారానికి ప్రమాదం వస్తే పాలకులు సహించరనే కదా పాఠం. వారికి వ్యతిరేకంగా నిలబడ్డ వారిని మావోఇస్టులు ఏం చేశారు? అధికారం కోసం ప్రయత్నం చేస్తున్న మావోఇస్టులు ఇప్పుడే అధికారంలో ఉన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఇక అధికారంలోకి వస్తే వారు ప్రజాస్వామికంగా ప్రవర్తిస్తారా?

కుల, మత, వర్గ భేదాలు లేకుండా అందరికీ సమానావకాశాలు ఉండేలా చూడడం ప్రజాస్వామ్య లక్షం. ఆ గమ్యానికి చేరడానికి మిలిటెంట్ మార్గాలు చేపట్టిన వారు (రష్యా, చైనా) చాలా సాధించారు. కాని సాధించిన మార్పులను ఆ సమాజాలే తిరస్కరించాయి. సోవియట్ యూనియన్‌, చైనాల్లో జరిగిన దాన్నుంచి మనం ఏం నేర్చుకున్నాం? ఏమీ నేర్చుకోకుండా అదే దారిన మళ్ళా ప్రయాణం చేద్దామనడం అవివేకం కాదా?

“సంఘటితంగా చేసే ఈ పోరాటాలు ప్రజలలో మిలిటెన్సీని, చైతన్యాన్నీ పెంచుతాయి” అని రాశారు రచయిత్రి. చైతన్యాన్నీ, మిలిటెన్సీనీ పెంచుతాయని రాస్తే కొంత సబబుగా ఉండేదేమో. అయినా సంఘటితంగా చేసే పోరాటాలు మిలిటెంట్ గా ఉండనవసరం లేదు. స్త్రీవాద ఉద్యమం ఉదాహరణగా తీసుకుందాం. చైతన్య  వంతులైన  స్త్రీలు  వోటింగ్ హక్కుకోసం, కుటుంబ నియంత్రణ కోసం, సమాన జీతాల కోసం పోరాడారు. పోరాడుతున్నారు. ఈ  పోరాటాలు మిలిటెంట్ గా జరగలేదు, జరగడం లేదు. కానీ ఎంతో మార్పును తేగలిగాయి. అంటే చైతన్య వంతులైన వారంతా మిలిటెంట్ లు కానవసరం లేదు అనే కదా? మావోఇస్టులు మిలిటెన్సీని  చైతన్యం గా  భ్రమపెడుతున్నారు. దూరంగా ఆలోచించలేనివారు నమ్మేస్తున్నారు.

ఈ పుస్తకానికి శీర్షిక “ఏది నేరం?!” వ్యవస్థ చేస్తుంది నేరమా? దానికి వ్యతిరేకంగా పోరాడటం నేరమా?  రచయిత్రి దృష్టిలోలాగే మా దృష్టిలో కూడా వ్యవస్థదే నేరం, నిస్సందేహంగా. ఎలెక్షన్లు  జరుగుతున్నా  మన  ప్రభుత్వాలు  (ఇండియాలోనూ,  అమెరికాలోనూ) ప్రజల  చేతుల్లో  లేవనేది  నిస్సందేహం. కానీ వాటికి  వ్యతిరేకంగా  ప్రజాస్వామ్యం  కోసం  జరిగే  పోరాటాలు  ప్రజాస్వామికంగా, పోరాట  ఫలితాలు నాలుగు కాలాలపాటు నిలిచేవిగా జరగాలి. ప్రజాస్వామ్య పోరాట  మార్గాలమీద అన్వేషణ జరగాలి. ఇది వరకు జరిగిన తప్పులు మళ్ళా జరక్కుండా చూసుకోవాలి.  అలా కాకుండా ఊరికే  “ప్రజాస్వామ్య”  అని  పేరు  పెట్టుకున్నంత  మాత్రాన ఏ అప్రజాస్వామ్య  సంస్థనూ నమ్మే దశలో లేరు ప్రజలు.

*

ఇక కథల గురించి.

కథా, కథనం, భాషా, అన్ని విధాలా ఈ పుస్తకంలోని  కథలు మంచి కథలని చెప్పుకోవచ్చు. సులభంగా చదివించిన కథలు. తల్లులతోబాటు జైల్లో ఉంటున్న చిన్న పిల్లల గురించి రాసిన రెండు కథలు, “బేబీస్‌ డే అవుట్”, “చందమామని చూడని వెన్నెల,” మా అందరికీ ఎంతగానో నచ్చాయి. బయటి ప్రపంచం గురించి ఏమీ తెలియకుండా పెరుగుతున్న ఈ పిల్లల గురించి ఎంతగానో విచారిస్తూ రాసినా, పిల్లల సహజ ప్రవర్తనను, మాటల స్థాయినీ, అనుభవాలనూ చక్కగా ఆవిష్కరించారు రచయిత్రి.

“చందమామని చూడని వెన్నెల” కథలో “కానిచోట కాసావే వెన్నెలా, కారడవుల కాసావే వెన్నెలా,” పాట గురించి రాస్తూ, “అడివిలోనే పుట్టి పెరిగి అడివినే ఇళ్ళుగా చేసుకున్న వాళ్ళు”  కూడా  ఉన్నారన్న విషయాన్ని మరిచో, పట్టించుకోకనో, “అడవి కాచిన వెన్నెల” లాంటి సామెతలను వాడే వారిని సున్నితంగా ఖండించారు. “మనుషులు లేని అడవిలోనయినా ఎన్నో జీవాలూ, జంతువులు వెన్నెలని ఎంత ఆస్వాదిస్తాయి! వెన్నెలలో తడిసిపోతూ మిలమిలలాడిపోయే ఆకుపచ్చని చెట్లని చూస్తే వాటికి ఎంత గర్వంగా అనిపిస్తుండొచ్చు! సమస్త భూమండలాన్ని తన వెన్నెలతో గుబులు పుట్టించి, అశాంతిని రేపి, మళ్ళీ తానే సాంత్వన కలగజెసే చందమామ మీద హక్కు ఎ ఒక్కరిదో ఎలా అవుతుంది?” అని గొప్ప భావుకతతో ప్రశ్నించారు రచయిత్రి.

మంచి కథ రాయడానికి సూక్ష్మమైన పరిశీలనా స్వభావం సహకరిస్తుంది. “మున్నీ బద్‌నామ్‌ హుయీ” కథలో ఈ సన్నివేశం చూడండి. “నాకేం అర్థం కాలేదు. ఎందుకంత భావోద్వేగం కలిగిందామెకు? అని ఆశ్చర్య పోయాను. నా ఆశ్చర్యం గుర్తించి, చెప్తాను అనబోయింది కానీ, గొంతు గాద్గదికంగా అయిపోయింది. దానిని దగ్గు వెనక దాచేసి, గబుక్కున నవ్వేసింది. అయినా ఒక కంటినుండి బుగ్గమీదకు సగం వరకు ఒక కన్నీటి చుక్క జారిపడింది. జుట్టు వెనక్కి తోసుకుంటూ దానిని రెప్పపాటులో తుడిచేసింది. నేనుకూడా గమనించనట్టే ఊరుకొన్నాను. మంచినీళ్ళ సీసా తీసి నేను ఒక గుక్క తాగి, యథాలాపంగా అందించాను. తాను ఒక గుక్క తాగి, గలగల నవ్వేసి అంతకు కొన్ని క్షణాల ముందు ఉన్న మున్నీ ఆమేనా కాదా అని నాకే అనుమానం వచ్చేలా ఉత్సాహంగా మాట్లాడటం మొదలుపెట్టింది.” ఎంత  అద్భుతంగా రాసారో కదా! మనుషుల మానసిక స్థితిని అంత సూక్ష్మంగా పరిశీలించి రాయగలగడం గొప్ప విషయం.

ఈ కథలు “భారతీయ జైళ్ళలో ఉన్న అమానవీయ పరిస్థితి” ని అందరి దృష్టికీ తీసుకురావాలనే ఉద్దేశంతో  రాసినవి. “జైలును నేను బయటనుంచీ లోపల నుంచీకూడా చూశాను. ఆ బయటా – లోపలికీ మధ్య ఉన్న దూరం మాత్రం అనంతం. ఆ దూరాన్ని తగ్గించగలిగితే అప్పుడు ఏ దేశంలో అయినా ప్రజాస్వామ్యం ఉందని చెప్పవచ్చు,” అనీ రాశారు. ఈ కథల్లో ఒక్క హజారీబాగ్ జైలు గురించి మాత్రమే రాశారు కాబట్టి దేశంలోని ఇతర జైళ్ళలో పరిస్థితుల గురించి పాఠకులకు తెలిసే అవకాశం లేదు. కానీ రచయిత్రి ఆవిష్కరించిన జైలు జీవితం ఆధారంగా హజారీబాగ్‌లో పరిస్థితులు అమానవీయంగా ఉన్నాయనిపించదు. దీని గురించి తర్వాత మరోసారి ప్రస్తావిస్తాను. బయటికీ జైలు లోపలికీ ఉన్న దూరాన్ని తగ్గించ గలిగితే సమాజంలో ప్రజాస్వామ్యం ఉన్నట్లే అన్నారు రచయిత్రి. అంటే జైలుని బయటి సమాజం స్థాయికి పైకితీసుకురావాలనేకదా? అంటే బయటి సమాజంలో ప్రజాస్వామ్యం ఉన్నదనే కదా? అలా అయితే సమాజంలో ప్రజాస్వామ్యం లేదు, కమ్యూనిజం మావో ఇజం రావాలి అని ఇంతకు ముందు చెప్పిన అభిప్రాయాలు మర్చిపోయినట్లున్నారు రచయిత్రి.

ఇవి  జైల్లో స్త్రీల విభాగంలో ఉన్న వారి కథలు.  ఒక స్త్రీ జైల్లో ఉందంటే ముందు ఆమె నేరం చేసి ఉండాలి. లేక ఆమె మీద నేరారోపణ జరిగి ఉండాలి. పొలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. న్యాయ వ్యవస్థ దాని మీద విచారణ జరిపి,  ఆమె నేరం చేసిందని నిర్ణయించి శిక్ష వేసింది. ఇప్పుడు ఆమె జైల్లో ఉంది.  అంటే సమాజం, పొలీసు వ్యవస్థ, న్యాయవ్యవస్థ, జైలు – ఈ నాలుగు వ్యవస్థలకూ ప్రతి కేసులోనూ కొంత బాధ్యత ఉంటుంది. అనూరాధ కథల్లో ఉన్న పాత్రలను తీసుకుని ఈ నాలుగు వ్యవస్థలు వీళ్ళ విషయంలో ఎలా ప్రవర్తించాయో చూద్దాం.

మొదట సమాజం ఎలావుందో చూద్దాం. ఈ కథల్లో ఒక 14, 15 సంవత్సరాల అమ్మాయిమీద అత్యాచారం జరిగింది. ఆమె గార్డియన్లు ఆమెకు అండగా నిలబడలేదు. ఒకమ్మాయికి బాల్య వివాహం జరిగింది. భర్త ఆమెను తాగొచ్చి చితగ్గొట్టేవాడు. మరోమార్గం లేని ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. బలవంతులు బలహీనుల మీదా, పేదలమీదా నేరారోపణ చేసి కేసులు పెట్టిన సందర్భాలు రెండుమూడు కథల్లో ఉన్నాయి. కొన్ని కుటుంబాల్లో స్త్రీలకు ఎలాంటి మానవహక్కులూ ఉండవు. వాళ్ళకు సమాజంలోకంటే జైల్లోనే ఎక్కువ స్వేచ్ఛగా ఉంటుంది. ఒంటరిగా సమాజంలో బ్రతకటంకంటే జైల్లోనే భద్రత ఎక్కువ కాబట్టి బెయిల్ వచ్చినా జైల్లో ఉంటుంది ఒకామె. దేశంలో ఒకచోట ఉన్న ఆచారాలు (భర్త చనిపోయిన స్త్రీ మరిదిని పెళ్ళి చేసుకోవడం లాంటివి) మరోచోట నేరాలుగా పరిగణించబడతాయి.

న్యాయ వ్యవస్థ ప్రవర్తన: ఈ కథల్లో ఉన్నంత వరకూ న్యాయ వ్యవస్థలో ఉన్న ముఖ్యలోపం కేసులను విచారించడంలో జరుగుతున్న జాప్యం. ఈ కారణంగా నేరం చెయ్యని వారు కూడా చాలా  సంవత్సరాలు జైల్లో ఉండడం జరుగుతుంది.

పొలీసు వ్యవస్థ: అకారణంగా అరెస్ట్ చెయ్యడం, అరెస్ట్ చేసిన వారిని సకాలంలో మేజిస్ట్రేట్ ముందుకు తీసుకు రాకపోవడం, లంచాలు తిని నేరస్తులను అరెస్ట్ చెయ్యకపోవడం, ఇవీ ఈ కథల్లో ఉన్న వివరాలు.

ఇక జైల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో చూద్దాం. కథలన్నీ జైలు గురించి రాసినవి కాబట్టి ఈ వ్యవస్థ గురించి ఎక్కువ వివరాలున్నాయి.

ఖైదీలు పగలంతా  జైలు ఆవరణలో ఎక్కడైనా ఉండవచ్చు. ఎవరితోనైనా మాట్లాడవచ్చు. సాయంత్రం అందరినీ లెక్కపెట్టి లాకప్లో ఉంచుతారు.

జైలు శుభ్రంగా ఉంటుంది.

ఖైదీలు వారికి చేతనయిన పనులు చేసుకుని డబ్బులు సంపాదించుకోవచ్చు. ఒకావిడ స్వెట్టర్లు అల్లి అమ్ముకుంటుంది.

బయటి సమాజంలోకంటే “ఇక్కడ చాలామంది స్త్రీలు స్వేచ్ఛగా ఉంటారు.”

నియమాల ప్రకారం జైల్లో వంటా మంటా నిషేధం. కాని రెండూ జరుగుతూనే ఉంటాయి. అధికారులు చూసీచూడనట్లు పోతుంటారు.

ఐదు సంవత్సరాలలోపు వయసున్న పిల్లలు తల్లితో జైల్లో ఉండవచ్చు. ఆ తర్వాత బయట బంధువులదగ్గరో, శిశు సంక్షేమ శాఖవారి ఆధ్వర్యంలోనో ఉండాలి. కాని పది సంవత్సారాలు దాటిన పిల్లలుకూడా జైల్లో ఉన్నారు. అధికారులు చూసీ చూడనట్లు వదిలేస్తూంటారు.

జైల్లో పరిస్థితుల గురించి ఆలోచిస్తుంటే, రచయిత్రి కథల నేపథ్యంలో  ఆరోపించిన అమానవీయత మాకు కనపడలేదు. రచయిత్రి చెప్పినదానికీ, చూపించినదానికీ పొంతన లేదు.

మా అందరినీ ఆశ్చర్య పరిచిన సంఘటన “పేదింటిపొగ” కథలో జరిగింది. ఉష, ఆశ జైల్లో పడకముందు ఉద్యోగాలకోసం (డి ఆర్ డి ఎ లో) ఒక పరిక్ష రాశారు. జైల్లో పడిన తర్వాత ఒక రోజు వారి తమ్ముడు ఫలితాలు వచ్చాయనీ, ఇద్దరూ పాసయ్యారనీ, ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఎల్లుండనీ కబురు పంపాడు. ఇంటర్వ్యూలు టౌన్లో. పరిక్షల ఫలితాలుగానీ, ఇంటర్వ్యూకు కావాల్సిన సర్టిఫికేట్లుగానీ ఆ అమ్మాయిలదగ్గర లేవు. ఇంటర్వ్యూకు వెళ్ళాలంటే, జైలు అధికారి ఒప్పుకోవాలి, కోర్టు  అనుమతికి దరఖాస్తుపెట్టుకోవాలి, పొలీసువారు ఎస్కార్టు ఏర్పాటు చెయ్యడానికి ఒప్పుకోవాలి. ఇదంతా ఎల్లుండిలోగా జరగాలి. ఇదంతా బయటి సమాజంలో జరగడమే ఎంతో మందికి లంచాలుపెడితేగాని జరగని పని. కాని జైల్లో ఉన్న ఈ అమ్మాయిలు ఇంటర్వ్యూలకు వెళ్ళారు, వారికి ఉద్యోగాలు వచ్చాయి, సమయానికి బెయిల్ మంజూరయి ఆ అమ్మాయిలు ఉద్యోగాల్లో చేరారు. ఇదంతా వీలయ్యేట్లు చేసిన జైలర్‌ని అభినందించకపోగా, అంతా సక్రమంగా జరగడానికి కారణం జైలర్ కి ఉన్న కీర్తి కండూతి అని అభిప్రాయపడ్డారు రచయిత్రి.

ఈ జైల్లో 100-125 మంది స్త్రీలు ఖైదీలుగా ఉన్నారు. ఇక్కడి కథల్లో పరిచయమైన పదిమందిలో ఎక్కువభాగం నేరాలు చేసినవారు కాదు, నేరం మోపబడి అన్యాయంగా జైల్లో ఉన్నవారు. ఈ పదిమందీ కాక మిగతా వారిలో నేరం చేసి శిక్ష అనుభవిస్తున్న వారు ఎంత శాతం ఉంటారో చెప్పలేము. రచయిత్రి  ఎక్కడా వారి గురించి చెప్పలేదు. అందువల్ల జైల్లో ఉన్న స్త్రీలలో ఎక్కువభాగం అమాయకులు అనే అభిప్రాయం పాఠకులకు కలగవచ్చు. నిజానిజాలు ఈ పుస్తకం ద్వారా తెలిసే అవకాశం లేదు.

ఖైదీలు మాట్లాడేటప్పుడు వారి భాష అనుకోకుండా మారిపోతూ ఉంటుంది. ఉదాహరణకు శకున్‌ మాటలు చూడండి (పేజీలు 30-31):  “మా అమ్మ చిన్నప్పుడే చచ్చిపోయింది. మా చాచా, చాచీ నా పెళ్ళి చేసేశారు. ఎంత కాలం పోషిస్తారు? పెళ్లయితే ఇంక ఆళ్ళే చూసుకొంటారు కదా!” ఇలా మాట్లాడిన శకున్‌ వెంటనే మరో భాషలో మాట్లాడటం మొదలు పెడుతుంది: “మస్తు తాగుతడు. నన్ను చాలా కొట్టేది. — రోజూ తాగేది. నాకు ఇద్దరు పిల్లలయ్యింరు.” ఆ వరుసలో అన్న మాటల్లో,  “కొట్టేవాడు”, “కొట్టిండు”, “చచ్చిపోయిన్రు”  అంటుంది. ఈ ఉత్తరదేశం స్త్రీ మాటలకు తెలుగు మాండలీకాల అతుకులు ఎందుకు పెట్టారో, అదీ నిలకడగా ఒక భాషో యాసో కాకుండా ఒక యాసమాలిక ఎందుకు ఎల్లారో తెలియదు. ఇది ఒక్క శకున్‌ విషయంలోనే కాదు, మిగతా పాత్రల విషయంలోకూడా ఇలాగే చేశారు.

ఈ పుస్తకం శీర్షిక “ఏది నేరం?!”, ఉప శీర్షిక “జైలు కథలు”. జైల్లో ఉన్న వారు నేరం చేశారో లేదో నిర్ణయించేది జైలు వ్యవస్థ కాదు, న్యాయ వ్యవస్థ. పైగా ఈ కథల్లో జైలు వ్యవస్థ సమాజం కంటే, న్యాయవ్యవస్థ కంటే, పొలీసు వ్యవస్థకంటే మెరుగ్గా పనిచేస్తుందనిపిస్తుంది. రచయిత్రి చూపించదల్చుకున్న అమానవీయత నిష్కారణంగా, చట్ట విరుద్ధంగా అరెస్త్ చేస్తున్న పొలీసు వ్యవస్థలో,   సంవత్సరాలతరబడి విచారణ జరపకుండా జైల్లో ఉంచుతున్న న్యాయవ్యవస్థలో, అయినదానికీ కానిదానికీ బలహీనులమీద కేసులు పెడుతున్న సమాజంలో ఉన్నంతగా జైలు వ్యవస్థలో కనబడదు.

*

మీ మాటలు

 1. అజిత్ కుమార్ says:

  దోపిడీ వ్యవస్తకి విరుగుడు కమ్యూనిజమని దానిని చేరుకోవడానికి మావోయిష్టు మార్గాన్ని రచయిత్రి ఎన్నుకున్నారు. ఆ మార్గం ఆచరణ యోగ్యం కాదు. ఈ పుస్తకానికి ఏది నేరం? అనే పేరు పెట్టడం జరిగింది. వ్యాఖ్యాతలు భావించినట్లుగా వ్యవస్ధకు వ్యతిరేకంగా పోరాటం చేసే మార్గం తప్పు. అంటే ఈ వ్యవస్థలో అందరూ రోడ్డుకు ఎడమవైపుగా ప్రయాణించాలంటే, కొందరు దానికి వ్యతిరేకంగా ప్రయాణించుతూ ప్రమాదాలపాలవుతూ దానినే విప్లవమార్గం అనుకుంటున్నారు, దానినే బహుశా ఈ వ్యాఖ్యాతలు సమర్ధిస్తున్నారు. అది తప్పు. సరైన పద్ధతి ప్రజలను విముక్తి చెయ్యడం.
  జైలు విషయంలో – జైలును నేను బయటనుంచీ లోపల నుంచీకూడా చూశాను అని రచయిత చెప్పిన విషయాన్ని వ్యాఖ్యాతలకు ఆ అనుభవం లేనందున బహుశా అర్ధం చేసుకోలేకపోయివుండవచ్చు.

 2. Sudhakar Unudurti says:

  కమ్యూనిస్టు వ్యవస్థలో నిర్భందానికి గురైన రాజకీయ ఖైదీలు బయటకు వచ్చి (దేశం నుంచి పారిపోకుండా) తమ రచనలు, జ్ఞాపకాలు ప్రచురించిన దాఖలాలు ఎక్కడా లేవు. అదొక క్రూరమైన అమానుష, నిరంకుశ వ్యవస్థ అని చరిత్ర మళ్ళీమళ్ళీ చెప్పింది. ఒకసారి అధికారంలోకి వస్తే వాళ్ళని దింపే అవకాశమే లేదు.

  ‘స్టేట్ విల్ విదర్ ఎవే’ అని భ్రమ పడ్డారు పాపం మార్క్సు, ఎంగెల్స్ లు! ఉదాహరణకు – చూడుము: https://en.wikipedia.org/wiki/Withering_away_of_the_state

 3. కె.కె. రామయ్య says:

  ” మన సమాజం ప్రజాస్వామ్యం పేరుతో సాగుతున్న ధనస్వామ్యం అనేది నిస్సందేహం. మన రాజ్యాంగాలు, న్యాయస్థానాలు, పొలీసు వ్యవస్థలు ధనికులకు అనుకూలంగా ఉంటాయి. సమాజం కంటే, న్యాయవ్యవస్థ కంటే, పొలీసు వ్యవస్థకంటే మెరుగ్గా జైలు వ్యవస్థ పనిచేస్తుందనిపిస్తుంది ” అనే కఠోర వాస్తవాన్ని చెప్పిన ఆరి సీతారామయ్య గారు! … దోపిడీ వ్యవస్థకి విరుగుడు కమ్యూనిజం అవునో కాదో తరవాత తేల్చుకుందాం. ముందు మన దేశ మౌలిక వ్యవస్థల్లో మార్పు రావాలని కోరుకోవాలి కదండి.
  బి. అనూరాధ గారి “ఏది నేరం ?! హజారీబాగ్ కథలు” మీద డిట్రాయట్ తెలుగు లిటరరీ క్లబ్ సభ్యులు చర్చించటం ప్రశంసనీయం.

  ఉణుదుర్తి సుధాకర్ గారూ, కమ్యూనిస్టు వ్యవస్థలోని రాజకీయ ఖైదీలు …. 70వ దశకంలో సోవియట్‌ అసమ్మతివాద రచయిత బోరిస్‌ ఫాస్టర్‌ నాక్‌ Boris Pasternak (డాక్టర్‌ జీవాగో ) మరియు నోబెల్ సాహిత్య పురస్కార గ్రహీత అలెగ్జాండర్‌ సోల్జెనిట్సిన్‌ Aleksandr Solzhenitsyn (గులాగ్‌ ఆర్కిప్యాలెగో) గుర్తుకొస్తున్నారు.

  కిరణ్ బేడి జైళ్ల శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ గా ఉన్ననాళ్లల్లో తీహార్ జైలులో అమలు చేసిన సంస్కరణల పుణ్యమా అని ఖైదీలల్లో పరివర్తన తీసుకు రావటానికి, వృత్తి విద్యల్లో శిక్షణ, పై చదువు చెప్పించటం, మానసిక ఆరోగ్యానికి యోగా మెడిటేషన్ లాంటివి నేర్పించటం, సంగీతం లాంటి వినోద వ్యాపకాలు కలిగించటం జరిగినది. కాని, ఎక్కవ శాతం భారతీయ జైళ్ళులో పరిస్థితులు మెరుగు పడాల్సి ఉన్నాయి.

మీ మాటలు

*