అన్నమయ్య చెప్పిన వ్యక్తిత్వ వికాస పాఠం!

 

-ఫణీంద్ర

~

 

ఉగాది కొత్త ఆశలకీ, శుభకామనలకీ ప్రతీక. మనని మనం సంస్కరించుకోవడం కంటే శుభకరమైనది ఏముంటుంది? అందుకే మనలోని జడత్వాన్ని పారద్రోలి కార్యోన్ముఖుల్ని చేసే “మహినుద్యోగి కావలె మనుజుడైన వాడు” అన్న అన్నమయ్య గీతంతో ఉగాదికి స్వాగతం పలుకుదాం.

మహినుద్యోగి కావలె మనుజుడైన వాడు
సహజి వలె నుండి ఏమి సాధింపలేడు!

“ఈ లోకంలో మనిషన్నవాడు ఉద్యోగి కావాలి” అంటున్నాడు అన్నమయ్య. “ఉద్యోగి” అంటే నేటి అర్థంలో “ఉద్యోగం చేసేవాడు” అనుకుని “హమ్మయ్య! అన్నమయ్య ప్రాతిపదికకి సరితూగాను!” అని సంబరపడిపోకండి! అంత తేలిగ్గా మనని వదలడు అన్నమయ్య! ఇక్కడ “ఉద్యోగి” అంటే “ఉద్యమించే వాడు” (ప్రయత్నించే వాడు, పాటుపడే వాడు) అని అర్థం. నాకు చప్పున గుర్తొచ్చేది చిన్నప్పుడు సంస్కృత సుభాషితాల్లో నేర్చుకున్న శ్లోకం –

ఉద్యమేనహి సిద్ధ్యంతి కార్యాణి, న మనోరథైః
నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః

“ఉద్యమిస్తేనే పనులౌతాయి, కేవలం కోరిక ఉంటే సరిపోదు! సింహం నిద్రిస్తూ ఉంటే జింక నోట్లోకి వచ్చి వాలదు కదా!” ఆని భావం. ఎంత సింహమైనా వేటాడక తప్పదు, ఎంతటి ప్రతిభాసంపన్నుడైనా పరిశ్రమించక తప్పదు. శ్రీశ్రీ “తెలుగువీర లేవరా” పాటలో అన్నది కొంచెం మార్చుకుని “ప్రతి మనిషీ ఉద్యోగై, బద్ధకాన్ని తరిమికొట్టి సింహంలా గర్జించాలి” అని పాడుకుని ఉత్తేజం పొందాలి!

“సహజి లాగ ఉంటే ఏమీ సాధించలేడు” అని కూడా అంటున్నాడు అన్నమయ్య. “నేనింతేనండీ, నా నేచర్ అది” అంటూ ఉంటాం, సాధారణంగా ఓ సాకుగా! “మార్పు” అన్నది చాలా కష్టమైన విషయం ఎవరికైనా. “నేను మారను” అనే బదులు, “నా వల్ల కాదండీ! నేనిలాగే పుట్టాను” అనడం ఎంతైనా గౌరవప్రదంగా ఉంటుంది! ఈ ధోరణినే అన్నమయ్య తప్పుపడుతున్నాడు!

“నాకు సహజంగా పాడే టాలెంటు లేకపోతే నేను ఎంత ప్రయత్నించినా ఎస్పీబీని కాలేను కదా? నాకు సహజంగా ఉన్న ప్రతిభ పైనే దృష్టి పెట్టాలి కదా?” అనే ప్రశ్న పుట్టొచ్చు ఇక్కడ. ఇది నిజమే! “మీకున్న సహజమైన బలాలపైనే దృష్టి కేంద్రీకరించండి, బలహీనతలపై కాదు!” అని పదేపదే నొక్కి వక్కాణించిన మేనేజ్మెంట్ గురువు “పీటర్ డ్రకర్” కూడా, “మీ సహజమైన బలాలు సార్థకమవ్వాలంటే మీరు కష్టపడాలి, ఆ బలాలని ఉపయోగించుకోవాలి” అని చెప్పాడు! ఇదే అన్నమయ్య చెప్తున్నది కూడా!

వెదకి తలచుకుంటే విష్ణుడు కానవచ్చు
చెదరి మరచితే సృష్టి చీకటౌ!
పొదలి నడిచితేను భూమెల్లా మెట్టి రావచ్చు
నిదిరించితే కాలము నిమిషమై తోచు!

నిజానికి ఇదొక ఆధ్యాత్మిక గీతం, పల్లవిలో తెలియట్లేదు కానీ. ఆధ్యాత్మిక సాధకుడికి “తనని తాను గెలుచుకోవడం” లక్షమైతే, ప్రాపంచిక సాధకుడికి “ప్రపంచాన్ని గెలవడం లక్ష్యం”. కాబట్టి అన్నమయ్య ఆధ్యాత్మిక సాధుకుడికి చేసిన ఉపదేశం ప్రపంచంలో మన విజయానికీ దోహదపడుతుంది.

“వెతికి తలుచుకుంటే విష్ణువుని చూడొచ్చు, చెదరి మరిచేవా అంతా అంధకారమే!” అంటున్నాడు. “చెదరి పోవడం” (losing focus) అన్నది ఆధునిక జీవితంలో చాలా మంది ఎదుర్కొనే సమస్య. మన ఎటెన్షన్ కోసం సెల్ఫోన్లూ, సవాలక్ష విషయాలూ ప్రయత్నిస్తూనే ఉంటాయి, మనని గెలుస్తూనే ఉంటాయ్! ఒక లక్ష్యాన్ని మనసులో ప్రతిష్ఠించుకుని, అప్పుడప్పుడు కాస్త చలించినా చలనాన్ని మాత్రం ఆపకుండా, దారి తప్పకుండా, సాగే నేర్పరితనం మనదైతే కోరుకున్నది పొందడంలో కష్టమేముంది?

గొప్ప లక్ష్యాన్ని ఏర్పరుచుకున్నా, ఎంతో సంకల్పం ఉన్నా, బండి ముందుకి కదలకపోవడం మనకి అనుభవమే. ఆలోచనని ఆచరణలోకి పెట్టడానికి ఎంతో శ్రమించాలి. బద్ధకం వదిలించుకోవాలి. కోరుకున్న గమ్యం ఎంత సుదూరంగా ఉన్నా కనీసం ఒక అడుగైనా వెయ్యగలగాలి. ఆ అడుగుని నడకగా, తర్వాత గమనంగా మలచుకోవాలి. అందుకే అన్నమయ్య. “పొదలి నడిస్తే మొత్తం భూమినే చుట్టిరావొచ్చు!” అంటున్నాడు (పొదలి అంటే పెరిగి, వర్ధిల్లి అని అర్థం).

“చాలా టైం ఉందిలే!” అనుకున్నవాడికి తొందరా తాపత్రయం ఉండవు. ఒక “అర్జెన్సీ” రావాలి అంటే కాలాన్ని ఆషామాషీగా తీసుకోవడం మానెయ్యాలి. మనం ఏమరపాటుగా ఉంటే తెలియకుండానే జీవితం మొత్తం చేజారిపోతుంది. “నిదురిస్తూ ఉంటే కాలం ఓ నిమిషంలా మాయమైపోతుంది” అన్న అన్నమయ్య మాటలు సమయం విలువని తెలియజెప్పే స్ఫూర్తిదాయకమైన ప్రబోధాలు!

వేడుకతో చదివితే వేదశాస్త్ర సంపన్నుడౌ
జాడతో నూరకుండితే జడుడౌను!
ఓడక తపసియైతే ఉన్నతోన్నతుడౌ
కూడక సోమరి ఐతే గుణహీనుడౌను!

లక్ష్యాన్ని చేరడానికి మనని మనం ప్రేరేపించుకున్నాక, అడుగు ముందుకేశాక, ఆ లక్ష్యసాధనలో మనకి కావలసింది జ్ఞానం (knowledge). దీంతో పాటూ నైపుణ్యం కూడా. ఇవి శ్రద్ధగా, కుతూహలంతో సమకూర్చుకోవలసినవి కానీ కేవలం మొక్కుబడిగా ప్రయత్నిస్తే దక్కేవి కావు. అన్నమయ్య చెప్తున్నది ఇదే! వేడుక అంటే ఇక్కడ “కుతూహలం” అని అర్థం, “జాడ” అంటే “కేవలం నామమాత్రంగా” అని. “శ్రద్ధగా చదివితే వేదశాస్త్ర పారంగతుడివి అవుతావు, నామమాత్రంగా చదివితే మూర్ఖుడిగా మిగులుతావు” అంటున్నాడు.

అలాగే లక్ష్యసాధనలో కావలసిన ఇంకో ముఖ్యమైన లక్షణం ఓటములకి తల్లడిల్లకుండా ఉండగలగడం! ఉన్నతమైన శిఖరాలను అధిరోహించేటప్పుడు ఎప్పుడూ పైపైకి ఎగబాకుతూనే ఉండడం కుదరక పోవచ్చు. అప్పుడప్పుడు కొంత కిందకి పడొచ్చు, కొన్ని సార్లు కిందకి దిగాల్సి రావొచ్చు కూడా. ఇలా కిందకి దిగినా మళ్ళీ పైకి చేర్చే మార్గాన్ని చూసుకుంటూ సాగడమే తెలివంటే. అన్నమయ్య “ఓటములకి తలవంచని తపసివైతే మహోన్నతుడివౌతావు” అంటున్నాడు. “తపస్సు” అనే మాటలో కష్టనష్టాలని తట్టుకునే స్థైర్యం, సడలని ఏకాగ్రత వంటి లక్షణాలు దాగి ఉన్నాయి. ఈ తపస్సు సాధ్యపడాలంటే మనలోని శక్తియుక్తులన్నీ “కూడబెట్టి” పరిశ్రమించాలి. సోమరులకి దక్కేది కాదిది. అందుకే “సోమరిగా ఉంటే గుణహీనుడివి అవుతావు” అంటున్నాడు!

మురహరు గొలిచితే మోక్షము సాధించవచ్చు
వెరవెరగక ఉండితే వీరిడియౌను!
శరణంటే శ్రీవేంకటేశ్వరుడు రక్షించును
పరగ సంశయించితే పాషండుడౌను!

ఎంత పరితపించినా, ఎంత పరిశ్రమించినా కొన్నిసార్లు “ఫలితాలు” మన చేతిలో ఉండవు. గాఢంగా కోరుకున్నది దక్కనప్పుడు తీవ్ర నిరాశకి గురవుతాము. ఓటమి మన అసమర్థతనీ, అల్పత్వాన్నీ గుర్తుచేస్తుంది. అందుకే అన్నమయ్య మనకో చిట్కా (వెరవు) చెప్తున్నాడు. “నీ వంతు కర్తవ్యం నిర్వర్తించు, మిగిలినది దైవనిర్ణయం! బరువంతా నువ్వే మొయ్యడం ఎందుకు, నీ బండలని ఆ ఏడుకొండల వాడికి అర్పించు” అంటున్నాడు. ఇదే కర్మసిద్ధాంతం. ఇదే మోక్షాన్ని సాధించే మార్గం కూడా. “మోక్షసాధనకి నీ ప్రయత్నమే సరిపోదు, ఆ మురహరుని కరుణ ఉండాలి. ఈ ఉపాయం తెలియకపోతే నువ్వు ఒట్టి అవివేకిగా (వీరిడిగా) మిగులుతావు” అన్న అన్నమయ్య మాట ప్రాపంచిక సాధకులకి కూడా శిరోధార్యం.

ఆఖరుగా ఆణిముత్యం లాంటి వాక్యంతో ముగిస్తాడు అన్నమయ్య. “పరగ” అంటే “ఒప్పుకోలుగా” (agreeably) అని అర్థం. మన ప్రశ్నలు, సంశయాలు అన్నీ నిజాయితీ నిండినవైతే సత్యాన్ని చూపించే వెలుగురేఖలౌతాయి. కానీ చాలా సార్లు మన సంశయాలు మనం ముందుగా ఏర్పరుకున్న అభిప్రాయాలకీ, మన అహంకారానికీ దర్పణాలు మాత్రమే! . “ఇది సాధ్యమేనా?” అన్న ప్రశ్న నిజానికి “ఇది అసాధ్యం!” అని చెప్పడం మాత్రమే, నిజాయితీతో శోధించుకున్నది కాదు. దీనినే “ఒప్పుకోలుగా సంశయించడం” (పరగ సంశయించడం) అన్నాడు అన్నమయ్య. అలా సంశయించే వాడు సత్యాన్ని తెలుసుకోలేడు కానీ ప్రయత్నించానన్న భ్రమలో తనని తానే మోసం చేసుకుంటూ ఉంటాడు. అలాంటివాడు ఆధ్యాత్మిక సత్యాన్ని తెలుసుకోలేని పాషండుడు (వేదాలు చెప్పిన సత్యాన్ని అంగీకరించని వాడు) అవుతాడు. తన అహంకారాన్నీ, అభిప్రాయాలనీ విడిచి సత్యాన్ని శరణు కోరిన నిజమైన సత్యశోధకుడైనవాడు, వేదాలని కాదన్నా సత్యాన్ని పొందుతాడు! గెలుపుని కోరుకున్న వాడు ముందు తన మది తలుపులని తెరవాలి, పాతని పారద్రోలి కొత్తదనాన్ని ఆహ్వానించాలి!

ఈ అద్భుతమైన గీతాన్ని శోభారాజు గారు చాలా చక్కగా స్వరపరిచి గానం చేశారు. అది యూట్యూబులో ఇక్కడ వినొచ్చు.

*

మీ మాటలు

*