అన్నగారూ.. వాటీజ్ దిస్?

   

-బమ్మిడి జగదీశ్వరరావు

~

 

bammidi అన్నగారూ.. అన్యాయం అన్నగారూ.. యిది పూర్తిగా అసందర్భ సందర్భం అన్నగారూ.. యిప్పుడో- యిందాకో- మీరందించిన మీ చేతి చెమట నా అరచేతులకు అంటుకొని యింకా ఆరనే లేదు?! నాపక్కనున్న మీకు నేను మౌనం పాటించడం.. శ్రద్ధాంజలి ఘటించడం.. వర్తమానాన్ని గతం చేస్తూ జ్ఞాపకం చేసుకోవడం దుర్మార్గాలలోకెల్లా దుర్మార్గం కాదూ?

బుక్ రిలీజుల దగ్గరో- బరెల్ గ్రౌండ్ ల దగ్గరో కలుస్తూనే వున్నాం! అన్నగారూ అంటే అన్నగారూ.. అని పలుకరించుకుంటూనే వున్నాం! నా వురుకుల్లో నేను! మీ పరుగుల్లో మీరు! మాట్లాడుకుందామని మళ్ళీ యెప్పటిలాగే వాయిదాపడినప్పుడు వుపశమనంగా గుండెకు గుండె హత్తుకొని ఆలింగనం చేసుకొని పారిపోయేవాళ్ళం! ఈసారి మీరు మహా ప్రస్థానం దగ్గర ఆలింగనం చేసుకోకుండానే ఆగిపోయారు!

క్షమించు బాసూ.. నేనింకా పరిగెత్తుతూనే వున్నాను!

‘ఆగాలని వుంది.. అన్నగారూ.. ఈ రన్నింగ్ యెక్కువ కాలం చెయ్యలేం.. మానెయ్యాలని వుంది.. బయటికి మీలా వచ్చేయాలని వుంది.. ఫ్రీ అయిపోవాలని వుంది..’ తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో చెట్ల కింద మీరు చెపుతునే వున్నారు! ‘ఫ్రీ యెక్కడన్నగారూ.. మీరు బందీ అయి- చీకట్లోంచి వెలుతురులోకి రావాలనుకుంటున్నారు! నేనేమో పరిగెత్తీ పరిగెత్తీ వెలుతురెక్కువై లోపలకి వొచ్చి కూర్చోవాలనుకుంటున్నాను. అతి చీకటిలోనూ అతి వెలుతురులోనూ మన చూపు మనకు చిక్కదు!’ చెప్పాలనుకున్నాను. చెప్పలేదు! అన్నీ వాయిదా వేసినట్టు యెవరెవరివో పలుకరింపుల నడుమ ఆడే మాట కూడా వాయిదా వేసాను! అప్పుడూ అందరిలో వున్నా మన ఒంటరి పరుగులు మనం పరిగెత్తుతూనే వున్నాం.. కూర్చున్నా! నిల్చున్నా! నిద్రపోతున్నా!

రన్నింగ్ అన్ ఎండింగ్ కావచ్చు.. ఎండింగ్ అబ్రెప్ట్ గా వుంది! పోయెమ్ అబ్రెప్ట్ గా వుంటేనే వొప్పుకోరే మీరు! అలాంటిది యిది లైఫ్ కదా? ఎందుకిలా?

కారణాలు వెతికారు! తో’రణాలు’ కట్టారు! ‘నౌ అయామ్ వోకే’ అన్నారు! ‘రెడీ టు ఫైట్’ అన్నారు!…

ఆగండి అన్నగారు.. ప్లీజ్.. మీకే గదా మౌనం పాటిస్తా.. యెందుకిలా డిస్టర్బ్ చేస్తారూ.. వొక్క నిమిషం కూడా వొదలరా?

వొదినేడుస్తోంది.. పాపేడుస్తోంది.. వొదల్లేని మిత్రులూ కొలీగులూ యేడుస్తున్నారు.. యేడవడమూ చేతకాని నాలాంటి వాళ్ళు యెడంగా పోయి యేడుపుగొట్టు ముఖాలేసుకు నవ్వుతున్నారు!

చీమూ నెత్తురూ గడ్డకట్టి యెంచక్కా మీడియా నిన్ను షూట్ చేస్తూనే వుంది! డ్యూటీ చేస్తోంది! లైవ్ యిస్తోంది!

”వాళ్ళు నాకు కావాలి! డెడ్ ఆర్ లైవ్!” నే రాస్తున్న సినిమా డై‘లాగు నన్ను తొడుక్కుంటోంది. డెడ్డూ నువ్వే! లైవూ నువ్వే! నేనే నువ్వు.. నువ్వే నేను.. లేనిచో ఈ జగమే లేదూ..’ సాంగు కనెక్ట్ అయింది.. ఆవహిస్తోంది మీ శైలిలా! మీరే కాదు, నన్ను నేనూ డిస్టర్బ్ చేసుకుంటున్నానా..?

ఆత్మకు శాంతి చేకూరిందా? నీవిచ్చిన నీ మరణ వాగ్మూలం రాముడికి అందిందా? పాపికొండలమీద పడి రోదిస్తున్నావా? రెవెన్యూ రికార్డులనుండి తొలగించడం ఆపే పని కాదని- రెవెన్యూ రికార్డులనే తగలబెట్టాలని చూస్తున్న ఆదివాసీ అంతరాత్మలో నీ ఆత్మ ఐక్యమయ్యిందా? అరే రోహిత్ సరే, జేఎన్ యూ మీద అర్టికల్ రాయాలని వుంది కదూ? లవర్స్ డే కి యెప్పటిలాగే భజరంగ్ దళ్ పోలీసింగ్ చేస్తోంది.. పోయెం యేది గురూ?

సీన్ మారింది! స్క్రీన్ మారింది! లొకేషన్ షిఫ్ట్! ఇంటినుండి మీ tv5 ఆఫీసుకి! పరుగులతోనే చేరాను! మధ్యలో ఫోన్లు! నా కథ బాలేదు, మరో కథ బాగు చేద్దామని బయల్దేరి విజయవాడ వెళ్ళా.. స్టోరీ సిటింగ్.. వొచ్చేసా.. చేరిపోయానని చెప్పా! నిజంగా నిన్ను చేరానా? యిప్పటికిప్పుడు చేరేంత దూరమా నువ్వు వెళ్ళింది?

గాఢ నిద్రలో నువ్వు!

వాసాంసి – జీర్ణాని – యథా – విహాయ – నవాని – గృహ్ణాతి – నరః – అపరాణి

తథా – శరీరాణి –  విహాయ – జీర్ణాని – అన్యాని – సంయాతి – నవానీ – దేహీ

అన్నగారూ.. మీ బాడీని పెట్టుకొని భగవత్ గీతేంటి అన్నగారూ? అంత యేడుపులోనూ నవ్వొచ్చింది! చెప్తే వొళ్ళు తిమురనుకుంటారు.. అని ఆగ లేదు, అదే అన్నా.. ‘తను వినడం లేదు కదా అని సరిపెట్టుకో’మన్నారు మన మిత్రులు! పోని.. నా మాట వింటున్నారా?

శ్రీశ్రీ మహాప్రస్థానం మాత్రమే తెలుసు నాకు. ఈ మహాప్రస్థానం కూడా వుంటుందని యెరుక లేదు నాకు. ‘వల్లకాడు’లా వుంది బతుకు అని యికమీదట అనలేను! అంత బాగుంది.. రిచ్ గా! కాని యిక్కడ కూడా మతముంది గురూ.. ఘంటశాలగారు పాడిన గీతలోని పద్యాలన్నీ గోడలమీద చెక్కినవి చదువుకున్నా! మార్క్సిజమే కాదు, మతం కూడా బలమైందేననిపించింది! ‘పెట్టుబడి’ బలం పెరిగింది.. సారీ.. పెట్రేగింది బాసూ? వొగ్గలేదు, ఈ బరేల్ గ్రౌండూ లోకి చొచ్చుకొచ్చింది చూడు! ‘థర్టీ పర్సెంటు గవర్నమెంటూ.. ప్రవేటేమో సెవెంటీ పర్సెంటూ’ కోలాబిరేసను.. మిత్రుల మాట! నోరుండదు కదా.. ‘యిదేటి యిలగుంది?’ అంటే- కథ యెలగుందో బోధపడిపోయింది! వల్లకాల్లకీ వర్గముంటుందని మార్క్సే వొచ్చి చెప్పాలా? పంజాగుట్ట శ్మశానం చూసారు గదా? మన జీవితాలంత యిరుకు! ఇరుకులో సర్దుకోకుండా ఎలక్ట్రిక్ బర్నర్ కి యెడ్జెస్టయిపోయారా? బాడీ అంటే ఫిజిక్స్ కాదు, కెమిస్ట్రీ అన్నారే! మూలకాల సమ్మేళనం విద్యుత్తుకాంతిలో కరిగి కలిసిపోయిందా?

ప్రెస్ క్లబ్.. మీరు తిరిగిన చోటే- మీ జ్ఞాపకాలతో తిరుగుతున్నారు! మీ రూటే సపరేటు అంటున్నారు..

నాకు తెలుసు మీరు అందరిలా కాదు! అందరూ వొరుసలో నిల్చుంటే మీరు వొరుస తప్పి పక్కకి వెళ్లి నిల్చుంటారు! నిలబడ్డ చోటునే నిల్చుంటే ‘నిలువ’కు విలువలేదని మీకు తెలుసు! అందుకే నలుగురు నడిచిన దారి నాది కాదని వుద్దేశపూర్వకంగానే తప్పిపోతారు! తగువుపడ్డ వారిని తగుమాత్రం పట్టించుకోరు! మనం నిలబడ్డ చోటు మారితే చూసే దృశ్యం మారుతుందని మీకు తెలుసు! అందుకే మీరు మారుతుంటారు! అందరూ అటు వుంటే మీరు యిటు వుంటారు! అందరూ అమ్మ అంటే మీరు నాన్నంటారు! ఫెమినిజం పెల్లుబుకుతున్న రోజుల్లో మేల్ కొలుపులు పాడతారు! వి(మి)యార్ మేల్ అంటారు! మ్యాగ్జిమమ్ రిస్క్ తీసుకుంటారు! మ్యూజిక్ డైస్ అని మరణ మృదంగం వినిపిస్తారు! సామూహిక బృందగానంలో వుంటూనే మీ స్వరం మీరు వినిపిస్తారు! మీరు అపస్వరంగానైనా వుంటారే తప్ప అస్తిత్వావాన్ని కోల్పోరు!

ఇప్పుడు అందరూ మీ ముఖమ్మీది చిరునవ్వు గురించే మాట్లాడుతున్నారు! నేనేమో పదిహేనేళ్ళ వెనక్కి వెళ్ళా.. పంజాగుట్ట పక్కనున్న దుర్గానగర్లో ప్లాట్లో మనంపడ్డ పాట్లో? అప్పటికి ఆంధ్రజ్యోతి రీవోపెన్ కాలేదు! నేను ఆగ్రో నుంచి అప్పటికే రిటైర్ అయ్యాను! మానాన్నకన్నా ముందు నేనే రిటైర్ అయ్యానని గొప్పగా చెపితే- గొప్పల వెనక వున్న తిప్పలు తెలిసి- మీరు నడిపిన ‘వాసంతి’ మాస పత్రికలో ‘ఉడుతా ఉడుతా ఊచ్!’ పిల్లల శీర్షిక నాతో నడిపించారు. రెండుచేతులతో పేజీలు నింపే వాళ్ళం! చాలక జోగీబ్రదర్స్ కృష్ణంరాజు డైరెక్ట్ చేసిన ‘మధురం’ సీరియల్ కు స్క్రీన్ ప్లే మీరు, డైలాగులు నేనూ రాసాం! పచ్చామధు కెమెరా. అడవి శ్రీనివాస్ ఎగ్జిక్యుటీవ్ ప్రొడ్యూసర్. బల్లారివాళ్ళు ప్రొడ్యూసర్లు. అంతలోనే- కష్టమన్నగారూ.. అని అన్నీ నాకే అప్పగించారు. అప్పటికి రవిప్రకాష్ గారు జెమునిలో వుండి మన ఆఫీసుకు వొచ్చి కూర్చొనేవారు..

‘మీరు మాట్లాడండీ’ పక్కనున్న మిత్రుడు కదిపితే ఆలోచనలు చెదిరిపోయాయి! తలడ్డంగా వూపాను!

అన్నగారూ.. మీరు ఎడిటర్, సియ్యీవో యేవేవో అయ్యేక- పరిగెత్తినా పట్టుకోలేనంతగా మీ టైం యిరుకైపోతుందని తెలిసి కలిసేవాన్నే కాదు! మీరు నన్ను పట్టుకెళ్ళి హలీం తినిపించి ‘కారు కొనుక్కున్నానన్నగారూ’ అన్నారు! నేను యెప్పుడు హలీం తిన్నా మీరే గుర్తుకువస్తారు! ఎందుకంటే నేను ఫస్ట్ టైం హలీం తిన్నది మీతోనే! అప్పుడు నాముఖం చూసి నచ్చలేదా? అని అడిగారు.  నేను ఔనూ కాదూ అన్నట్టు అన్ని రకాలుగా తలవూపాను! ‘వేడి మీద తినండి బావుంటుంది.. అలవాటైతే వొదలరు’ అన్నారు! నిజమే!

మీరు ఫోన్ చేస్తూ వుండండన్నగారూ.. అన్నారు. అవసరమయినప్పుడే ఫోన్లు చేసాను. ఎవరో వూరినుండి వొచ్చి యిక్కడ సిటీలో యాక్సిడెంటయి పోతే శవాన్ని వూరు పంపించాలని మిత్రుడు సాయమడిగితే నేను మిమ్మల్ని అడిగాను! క్రైం రిపోర్టరుతో ఆ యేరియా రిపోర్టరుకు ఫోన్ చేయించితే- గుద్దిన ట్రక్ కంపెనీ వాడు.. శవాన్ని పెట్టుకు గేట్లో గొడవ చేసినా వినని వాడు.. దిగొచ్చి నష్టపరిహారం యివ్వకపోయినా యిచ్చిన ఆరువేలుతో శవం యింటికి చేరింది. మీ సాయం యిలాగే వేరే వేరే ప్రొబ్లెమ్స్ లో మళ్ళీ మళ్ళీ అడిగా, మీ పరిమితులు చెప్పారు! స్కూళ్ళ మీదా కాలేజీల మీదా సెల్ టవర్లు.. రేడియేషన్ ప్రొబ్లెమ్స్ దృష్టికి తెస్తే.. ‘కష్టం అన్నగారూ.. మాకు యాడ్స్ వొచ్చేది వాళ్లనుండే.. అప్పటికీ స్టోరీ చేసాం.. బట్..’ ఖాళీలను నేనూ పూరించుకున్నా, చాలా ఖాళీలు మిగిలిపోయాయి! యిలాగే మా వూళ్ళో విత్తనాలు అమ్ముకుంటున్న అగ్రికల్చర్ డిపార్టుమెంటు గురించి చెపితే – ‘మా వాళ్ళకీ.. రిపోర్టర్లకీ.. అందుతాయి.. అంచేత..’ యెప్పటిలా ఖాళీలను నేనూ పూరించుకున్నా.. పూరించినకొద్దీ ఖాళీలు! నేను కొత్తగా ప్రపంచాన్ని చూస్తున్నట్టు మాట్లాడితే – యిదెంత పాత ప్రపంచమో.. రోత ప్రపంచమో చెప్పి మనమెంత చేతకాని వాళ్ళమో చెవి తిప్పకుండా చెప్పి- ‘యింకేంటి అన్నగారూ కబుర్లు?’ మాట మార్చి అసంతృప్తినంతా అక్షరాల్లోకి యెత్తి పొగలు కక్కుతున్న కొత్త పోయెమ్ చేతిలో పెట్టేవారు మీరు.. అప్పుడు మీరు సారీ చెప్పారు. యిప్పుడు నేను సారీ చెపుతున్నా..

ఆగండి అన్నగారూ.. మీకు  ట్రీట్ మెంట్ యిచ్చి మీ ప్రాబ్లం ఫస్ట్ రికగ్నైజ్ చేసిన డాక్టర్ శాస్త్రిగారు మాట్లాడుతున్నారు..

‘అరుణ్ సాగర్.. రికవర్ అయ్యాడు! సర్జరీ అయ్యాక కేర్ గా వుండాలి! తనకా అవకాశం లేదు. విపరీతమైన వొత్తిడి, బహుశా తనున్న ప్రొఫెషన్ వల్ల కావచ్చు! తను జాగ్రత్తగా లేడు, కొంత స్వయంకృతం కూడా వుంది, సో..’ నేను తెగిపోయాను!

అన్నగారూ.. టీవీ ఛానెల్ రేటింగ్ అప్ అండ్ డౌన్ అయినప్పుడల్లా మీ పల్స్ రేట్ అప్ అండ్ డౌన్ అవడం బాలేదు! తెలుగులో అరవయ్యారు న్యూస్ ఛానెళ్ళు! పార్టీకో ఛానెల్! ఎవడి వెర్షన్ వాడిదే! మధ్యలో టీఆర్పీ పెంట! రోజూ పోటీయే! పూట పూటా పోటీయే! గంట గంటకూ పోటీయే! పోగ్రాము పోగ్రాముకీ పోటీయే! నిమిష నిమిషానికీ పోటీయే! ఎవ్విర్ సెకన్ కౌంటబుల్ యిక్కడ! దీనెమ్మా.. సారీ .. దీనెబ్బా జీవితం! దీనెబ్బా రేటింగ్! దీనెబ్బా టీఆర్పీ! ఛానెల్ వుంటే యెంత? పోతే యెంత? మనం ప్రాణాలతో వుండాలి గదా? మనోళ్ళు మిమ్మల్ని చూసయినా గ్రహించాలిగదా? అన్నగారూ.. ‘నాలాగ చావకండ్రా’ అని మీ మిత్రులకి మీరన్నా చెప్పండన్నగారూ.. దీనెబ్బా కెరీర్? మనల్ని తినేసే కెరీర్ యెందుకన్నగారూ? పులి మీద సవారీ లాగుందే!?

అన్నగారూ.. మీరు పోయిన వార్త- మీరు పనిచేసే ఛానెల్లో మొదట వొచ్చింది! వెంటనే ఓ మిత్రుడు అది చూసి తనూ తను పనిచేసే  ఛానెల్లో బ్రేకింగ్ న్యూస్ స్క్రోల్ చేసాడు! మీ ఛానెల్లో మీ మరణ వార్త అంతలోనే ఆగిపోయింది! ఇక్కడ వీడి గుండె ఆగిపోయింది! న్యూస్ అతి వేగం.. రోడ్డు మీద వాహన అతి వేగం కన్నా ప్ర్రమాదమైనది! వార్త నిజమా? కాదా? వేగంలో స్లిప్ అయితే ప్రమాదం మనకే! వుద్యోగం వుంటుందో పోతుందో? హమ్మయ్యా.. నువ్వు నిజంగానే పోయావ్.. తను బతికిపోయాడు!

ఏమిటిది అన్నగారూ.. మీరు టీవీ ఛానెల్లకు లైఫ్ యిచ్చారు! బట్ మీ లైఫ్ వాళ్ళు తీసేసుకున్నారు! చూడండి అన్నగారూ.. మీకు సంతాపం చెప్పేవాళ్ళే.. మీ హత్యలో భాగం పంచుకున్నారు అని నాలాంటివాడు అంటే నేరమవుతుంది! అసహనమవుతుంది! రాజ్య అసహనాన్ని అర్థం చేసుకుంటారు.. ఎటొచ్చీ నా అసహనమే అర్థం కాదు! కానట్టు వుంటారు! మీకుగాక యెవరికి చెప్పుకోను?

బాసూ.. మీరు గొప్పోళ్ళు బాసూ.. మీ వొత్తిడిని ముసుగేసి దాచేసి నవ్వితే- మీ నవ్వు బాగుంది అనుకున్నాం గాని కనిపెట్టలేకపోయాం.. క్షమించు!

ఈ ప్రెస్ క్లబ్ తాగుబోతుల అడ్డా కాదూ? రోజూ తాగి చచ్చేదేగా? ఆఫీసుల్లో బుర్ర పాడుచేసుకొనేది.. యిక్కడికొచ్చి పూటుగా తాగేది! మన కవులూ రచయితలూ తక్కువా? తాగి చచ్చేవాళ్ళే యెక్కువ! అన్నగారూ.. మానేసానన్నారు! మానేయ్యడాన్ని మానేసారా? ‘స్వయంకృతం కొంత’ అని డాక్టరుగారు అన్నారు! మీ మీద కూడా కోపంగా వుంది అన్నగారూ! అన్నగారూ.. యిక నన్నెవరు పిలుస్తారు ‘అన్నగారూ..’ అని?  పొండి అన్నగారూ.. మీతో జట్టు కట్! కట్ పీస్!

నేనింక మీతో మాట్లాడను!

సారీ అన్నగారూ.. ఎక్సుట్రీమ్లీ సారీ..

మీ

అన్నగారు

మీ మాటలు

 1. Endaro mitrulu..andari gyapakaaloo kavaali..

 2. అన్నగారూ……….

 3. nagabhushanam dasari says:

  బమ్మిడి జగదీశ్వరరావు గారు,

  గాలి బుడగ జీవితం. బ్రతుకుకూ చావుకు మధ్య లిప్త పాటు సమయం. దాంతో యెంత తేడా వస్తుంది. బ్రతికున్నోడు పెద్దవాడైనప్పటికిని చనిపోయిన చిన్న వయస్సు వాళ్లకు శ్రద్ధాంజలి ఘటించే సందర్భంలో పాల్గొనడం లాంటి విపత్కర పరిస్థితికంటే దరిద్రం ఇంకొకటి ఉండదు. అరుణ్ సాగర్ గురించి మీ గుండెల్లోంచి వచ్చిన అక్షర ప్రవాహం అత్యంత హృద్యంగా ఉంది. ఆయన చావుకు దగ్గర కావడానికి జరిగిన సంఘటనలు అన్వయించుకోవడానికి మాత్రమే పనికొస్తాయి. కాలం ముందు అందరమూ తలవంచాల్సిందే. అరుణ్ సాగర్ గారి రచనలూ మరియు వారి జ్ఞాపకాల వెల్లువే ఆయన్ని శాశ్వతంగా బ్రతికిస్తాయి. మిత్రులందరూ కలిసి అరుణ్ సాగర్ గారితో పంచుకున్న జ్ఞాపకాల నన్నింటినీ పుస్తక రూపంలో తీసుకు వస్తే బాగుంటుంది.

  నాగభూషణం దాసరి,
  8096511200.

 4. jilukara srinivas says:

  బమ్మిడి, చాల బాధగా ఉంది.

మీ మాటలు

*