మంటల ఫౌంటెన్

 

-రామతీర్థ

~

 

మాధ్యమాలన్నీ చెప్పేస్తున్నాయి నువ్విక మా మధ్య లేవని. అందిన పుస్తకమ్మీద సమీక్ష రాద్దామనుకున్నాము, చదువుతూ నీ పోలవరం కవిత్వాన్ని, చట్టి గ్రామం వద్ద ఒదిశా, ఛత్తీస్ ఘర్ , ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, నాలుగు రాష్ట్రాల మధ్య ఇరుక్కుపోయి ఇంకా బయటకు రాకుండా మేం ఉంటే, ఎలా సమయం వెదుక్కున్నావయ్యా నువ్వు నీ గుండెనాపేసుకోవడానికి.

బాగా చదువుకున్న వాడికి మంది బాగు కోరడానికీ,  ఎక్కువ తెలుసుకున్న వాడికి  ఎక్కువ కాలం బతికే అవకాశం ఉండడానికీ సంబంధం లేదేమో. కవిత్వం లోకి ఒక సమష్టి అశాంతి, కొంత వైయక్తిక అరాచకం ప్రవేశిస్తే, ఒకడు అలనాడు అల్లెన్ గిన్స్ బెర్గ్  అయ్యాడు. మాటలు వివాదాస్పదంగా విసిరి, సౌకర్యవంతంగా ఉండాలనుకునే భద్రలోగ్ సంఘానికి, ఆదిసూకర వేద వేద్యంగా, అడివి పందుల్లాంటి  గిరిజనులున్నారని, సిద్ధాంతాల వాగ్దాన భంగాలు జరిగి,  డబ్బు వేటాడుతున్న సమాజంలో, ఆధునిక, అత్యాధునిక ఆటవికులున్నారని చెప్పిన నీ వాక్యాలకు ఒక ప్రజాస్వామ్య ఉష్ణోగ్రత ఉంది.

ధన్య మనస్కంగా విభిన్న శృంగార హక్కుల పసి కేరింతలు, కసి  కసుర్లూ, అస్తిత్వ సంచార యాత్రలో, పోస్ట్ మాడర్న్ ఖెయాస్ లో మనిషికెవరూ దిక్కు లేరని చెప్పే వాతావరణ హెచ్చరికలూ, పలు జిహ్వల్లో నాగరికుల మిశ్రమ దుఖార్తి, నువ్వు రాస్తే, సంక్లిష్ట నిరసనయ్యింది.

రాయాల్సినంత రాశావా, చెప్పాల్సినంత చెప్పావా, లేక కొత్త ఉద్యోగాలయిన దృశ్య మాధ్యమాల్లో, నిన్ను నువ్వు ఖర్చు పెట్టేసుకున్నావా  ఎవరూ చెప్పరు. సాంకేతిక మాదక ద్రవ్యాలకు అలవాటు పడి, యంత్ర భూతముల కోరలు తోమే,   ఇనుప అడుగుల నాగరికత, ఇసుక రేణు సూక్ష్మ ఫలకం, సిలికాన్ చిప్ లో దాచిన జ్ఞాన బీజం, స్వార్థ స్వర్గాలకే పయనిస్తుందా, ఒంటి కంటి సిద్ధాంతపు, ఒంటి స్తంభ సంస్కృతుల, ఒంటరి పట్టా పై, మోనో రైలు లా – – అడగాల్సిన ప్రశ్నలున్నాయి.

పాత జవాబులేవీ రాయకుండా పరీక్షలు రాయాల్సిన రోజులివి. మార్కుల పద్ధతిని దాటిన జవాబు పత్రం కావాలి ఇవాళ కవిత్వం. ఠావు  అంతా ఖాళీగా ఉంచి, మార్జిన్ లోనే ఉంచిన వారిని,  ఫుల్ స్కేప్ బతుకు లోకి తీసుకురావాలి. అలా జవాబులు రాయవలసిన కాలం ఇది. కోటానుకోట్ల బతుకు పేపర్లను ఇలానే దిద్దాలి అంటూ దిద్దుతున్న వారిని, జన జీవన విద్యలో జ్ఞాన  శూన్యులు  గా కోలహాల ప్రకటన చేయాల్సిన రోజులివి.

కొత్త సహస్రాబ్దికి, ఇంకా పదిహేనేళ్ళే, నీకా అర్థ శతాబ్దపు ఆయుష్షు  నిండ  లేదు. ఆయుధమై పదునెక్కి, సాయుధ పటాలాలు గా   అక్షరాలను నడపాల్సిన నిర్ణాయక దశలో, మరణ వాంగ్మూలాన్ని పౌర సరఫరా చేసి, బతుకు లగేజీలు వదిలేసి, మరణాన్నే ఒక్క మూట  కట్టుకుని , జల క్రోధం జన క్రోధంగా  మారే దారి లో మోసుకెళ్తున్నావు.

కనిపించని డబ్బు కరిగిపోయిందని  స్టాక్ మార్కెట్లు మోరలెత్తి ఏడుస్తున్నాయి. పని లేని ఆయుధ సంపత్తి ఎవరి సంపదో చెప్పలేక రాజకీయం నీళ్ళు నముల్తోంది. ఏర్పడని దేశాల కోసం, ప్రజలు పురిటి పడకల నుంచే ఉద్యమ ఉంగాలాపనలు చేస్తున్నారు.  నాగరికుడా – నువ్వు స్వైర సంగీత జీవ శక్తిని ఆటవికతలో విన్నావు, అమెరికాలో విన్నావు. ఆటవికుడా, నువ్వు కోయ వేషంలో కూచుని ఏదో ఆండ్రోమెడా  చానెల్లో, ఆక్స్ ఫర్డ్  ఇంగ్లీష్ లో, అడవి బిడ్డల హక్కుల గురించి, బతుకులు అడవులైపోయిన ఆధునిక దిశాహీనత గురించి, మాట్లాడుతూ, మాట్లాడిస్తున్నావనుకోనా?

పాంటూ, చొక్కా వేసుకు తిరిగిన కోయ రాజా – నీకు పెన్ను నిండా గోదారి.  కూనవరం రేవే దగ్గర ఒంటరి పడవలో నువ్వొదిలేసిన అక్షరాలు ఇప్పుడిక  ఈ తరాలు రాయాలి.

అల్విదా జెంటిల్ జ్వాలారుణ  సాగరుడా,  నిప్పు పెట్టెల్లోంచి  పేలాల్సిన ప్రజాగ్రహ గంధక ధూళి, నీకు ఎప్పటికైనా  నివాళి.

 

*

 

మీ మాటలు

 1. వృద్ధుల కల్యాణ రామారావు says:

  అరుణ్ సాగర్ కవిత్వం ఎర్రగా,శత్రువులకు మంటగా, మిత్రులకు వెచ్చగా ఉంటుంది.రామతీర్థ గారితో నేనూ గొంతు కలుపుతున్నాను.

 2. విలాసాగరం రవీందర్ says:

  గొప్ప నివాళి

 3. చొక్కర తాతారావు says:

  గొప్ప కవికి మరో ప్రముఖ కవి అక్షరనివాళి.
  అక్షరసముద్రాన్ని అరచేతిలో చూపించారు.

 4. చొక్కర తాతారావు says:

  ఒక కవి మనల్ని విడిచి వెళ్తున్నాడంటే
  ఒకసత్యాన్ని మోసుకుపోతున్నట్టే
  ఎన్ని రాత్రుళ్లు తన కంటి రెప్పలమీద
  ఈ సమాజాన్ని మోశాడో
  అసువులు బాసిన అమరవీరుల
  నెత్తుటి గాయాల వెనుక
  తన కలంతో ఎంతటి చైతన్యాన్ని రగిలించాడో
  అన్నార్తుల దు:ఖాన్ని చానల్ వెలుగులో
  అశ్రువులుగా చిందించాడో
  మానవత్వాన్ని ముందుంచి
  మనుషుల్లో మంచిని పెంచాలనుకున్నాడో
  కంటికికనపడని ఎన్నో నిజాల్ని
  తన గుప్పిట్లో బందించి
  సమాజపు కళ్లు తెరిపించాడో
  వేదనని గుండెలో దిగమింగుకొని
  వెలుగుని లోకానికి పంచావు
  కవి ముందు సూర్యుడూ తక్కువే
  సూర్యుడు పగలే జీవిస్తాడు
  కవి రాత్రి పగలు జీవిస్తాడు
  కవి శాశ్వతం
  కవిత్వం శాశ్వతం
  సాహిత్యం సర్వజనీనం.
  (సాహితీమిత్రుడు ప్రముఖకవి అరుణసాగర్
  గారికి అక్షర నివాళి)
  ..చొక్కరతాతారావు,విశాఖ,9885488484.

 5. కె.కె. రామయ్య says:

  ” జెంటిల్ జ్వాలారుణ సాగరుడుకి, నిప్పు పెట్టెల్లోంచి పేలాల్సిన ప్రజాగ్రహ గంధక ధూళి నివాళి ” ని ఆశిస్తున్న రామతీర్థ గారితో గొంతు కలుపుదాం.

 6. కె.కె. రామయ్య says:

  ప్రముఖకవి అరుణసాగర్ ఆకస్మిక నిష్క్రమణ పట్ల ప్రఘాడ సంతాపాన్ని తెలియజేస్తూ పెద్దలు శ్రీ భమిడిపాటి జగన్నాథరావు గారు నివాళులు అర్పించారు.

  ‘మో’ గారికి అత్యంత ఇష్టుడైన కవిగా, అద్భుతమైన తెలుగు వాక్యాలు రాసిన వాడిగా (మియర్ మేల్, మాగ్జిమమ్‌ రిస్క్, మ్యూజిక్ డైస్, మేల్‌ కొలుపు వంటి తన ఎక్షేప్షనల్ రచనల్లో), త్రిపురకి ఆర్తితో కూడిన అక్షర నివాళి రాసిచ్చిన వాడిగా, భేషజాలకు దూరంగా చిన్నా పెద్దా వ్యక్తులందరితోనూ స్నేహపూర్వకంగా మసలిన మంచి మనిషిగానూ అరుణసాగర్ ని తలుచుకున్నారు.

మీ మాటలు

*