మరో బిగ్ బాంగ్


మహమూద్
~
కడలిలో కలిసే నదిలా
నాలో ఇలా కలిసిపోతావని అనుకోలేదు
నాలోని కణకణం నీ సంతకమై ప్రజ్వలిస్తోంది
నా అణువణువూ నీవై రగిలిపోతున్న
ఈ సందర్భంపై తళతళలాడుతున్న పేరు నీదే
భిన్నశక్తుల కలయికకు కూడలౌతున్న
ఈ మలుపు నీ మేలుకొలుపే
ఎంతలా కలిసిపోయావు నీవు నాలో
నా అంగాంగాన్ని సానబెడుతూ
నన్ను సాయుధుణ్ణి చేస్తూ
ఎంతలా వ్యాపించావు నీవు నాలో
లోలోపల నీ పేరుమీద ఓ విశ్వమే విస్తరిస్తోంది
నా పక్కన నిలబడ్డవాళ్ళ చేతుల్లో కాగడాలు
గెలాక్సీలై పరిభ్రమిస్తున్న ఆ వెలుతురంతా నీ చిరునవ్వుదే
ఎంతలా కదిలించావు నీవందరినీ
అందరిలో రుధిరమై సుడులుతిరుగుతున్నది నీవే
అంబేద్కర్ ప్రతిమ అందరి చేతుల్లో నిండుజ్వాలై
ధగధగలాడుతున్నది నీవల్లే
నువ్వు కోరుకున్న మార్పు వాస్తవమై
వెలివాడ కొత్త దేశాన్ని చెక్కడానికి సమాయత్తమౌతున్న శిల్పిలా ఉంది
నీ నీడను మీదేసుకున్న ఆ పరిసరాలు
నీవిచ్చిన పోరాటనినాదాలను వల్లెవేస్తున్నాయి
ఇపుడు నాదీ నక్షత్రాల నడకే
నువ్వు రాల్చిన నక్షత్ర ధూళి నుంచి
కొత్త ఖగోళాలు పుడుతున్నాయి
ప్రతి ఖగోళపు తల మీద
నీ చిత్రపటమే కిరీటం
ఎన్ని వేల కలల్ని కుప్పగా పోసి వెళ్ళావు
ఒక కల దగ్ధమౌతున్న చోట
మరో కల.ఖచ్చితంగా మొలకెత్తుతుందని
నిరూపించావు
వెలివాడలో తలదాచుకుంటున్న
ప్రతికన్నూ ఓ కలల నిధి
ప్రతికలా ఓ తారకల వీధి
యాతనను చివరి యాత్ర చేసుకొని
నలుదిశలనూ ఏకం చేశావు
పలుశాఖలై విస్తరిస్తున్న ఈ భూకంపం
నువ్వొదిలిన చివరి నిట్టూర్పుదే
మూతపడిన రెప్పలమధ్య
నీ లక్య్షం గడ్డకట్టలేదు
అది విద్యుదయస్కాంతమై
పాలపుంతలను దివిపైకి దించుతున్నది
అది నవీన విశ్వ ఆవిర్భావానికి
మరో బిగ్ బాంగ్ ను సిధ్ధం చేస్తున్నది.
*

మీ మాటలు

 1. Nagabhushanam Dasari says:

  మహమూద్ గారు,

  రోహిత్ పై మీరు రాసిన కవితలోని అక్షర పదవిన్యాసం పదునైన కరవాలంతో చీల్చి చెండాడినట్లుంది.

  నాగభూషణం దాసరి.

 2. చందు తులసి says:

  మహమూద్ గారూ… మీ కవితలో ఆవేదన, ఆక్రందనే కాదూ…కొత్త ఆశాభావమూ కనిపించింది. అది పాలపుంతలా మెరుస్తోంది

 3. నాగభూషణం, తులసి.గారు
  థ్యాంక్ యూ వెరి మచ్.

 4. విలాసాగరం రవీందర్ says:

  బాగుంది పోయెం మహమూద్ గారు

 5. THIRUPALU says:

  //మరో బిగ్ బాంగ్ ను సిధ్ధం చేస్తున్నది//
  చాలా చక్కగా చెప్పారు మహమూద్ గారు

 6. మహమూద్ సర్
  భాగా రాశారు — salutes….
  —————————————-
  reddy…

మీ మాటలు

*