అభ్యుదయ కవుల్లో భిన్న స్వరం!

alvidaa

-ఇంద్రగంటి శ్రీకాంత శర్మ

~

 

indraganti 1970ల దశాబ్దిని “కల్లోల దశాబ్ది” అనే వారు. అలనాటి మిత్రులు కౌముది గారు అప్పుడే పరిచయం.

కచ్చితంగా చెప్పాలంటే, పరిచయమైతే 1969 నుంచి- దాశరధి పాటలో పాదంలాగా – “మాట్లాడని మల్లె మొగ్గ  మాదిరిగా నడిచి వచ్చి”- పలకరించే ఆయన స్వరం నాకిప్పటికీ గుర్తు. ఆ కాలంలో తరుచూ ఆయన గేయ కవిత్వం వ్రాస్తుండే వారు. కవిత్వ ప్రసంగాల మధ్య ఆయన కమ్యూనిస్టు నిబద్ధత నాకు తెలిసేది కాదు. బుగ్గన పరిమళించే జరదా పాన్ వుండేది. ఉద్విగ్నంగా ఉపన్యాసాలిచ్చే స్వభావం కాదేమో అనిపించేది. ఆనాటికి నేనెరిగిన మల్లారెడ్డి అభ్యుదయ గీతాలకు వేరుగా కౌముది రచనలు నాకు తోచేవి.

అలాగే, అలనాటి ఇతర అభ్యుదయ రచనల్లో కనిపించే “మొనాటనీ”కి కౌముది దూరంగా కనిపించే వారు. ఆయన్ని సమకాలీన “చప్పుడు కవులు” చెడగొట్టకుండా ఉర్దూ కవులు ఆయన్ని రక్షించారనుకుంటాను. శబ్దం ఎంపికలో శ్రద్ధ, లాలిత్య విషయంలో ఔచిత్యం ఎరిగిన సాహిత్యవేట్టగా కౌముది గారంటే నాకు గౌరవం. వూరికే నోరు చేసుకోవడం కంటే కవిత్వాన్ని అనుభవించడంలో ఆయన చూపే శ్రద్ధ చాలా తక్కువ మందిలో చూశాను. ఆలోచనా శీలి అయిన కౌముది గారు తక్కువగా రచనలు చేశారంటే నేను ఆశ్చర్య పడను. ఆయన అంతర్ముఖీనత ఆయన ఇంటర్వ్యూల్లో స్పష్టంగానే కనిపిస్తుంది.

“రత్నం వెదకదు: వెదక బడుతుంది” అన్నాడు కాళిదాస కవి ఒక చోట. అలాగే, కవిత్వం కూడా వెల్లడి కాదు; వెల్లడింపబడుతుంది. దాని కోసం అన్వేషణ, అధ్యయనంలో వుందనే కిటుకు కౌముది గ్రహించడం వల్లనే బహుశా కవిత్వం పేరిటా, అభ్యుదయం పేరిటా వట్టి మాటలు ఉద్రేకాలను ఆయన వెలిగక్కలేదు.

లోకం తీరు, అందులో మనుషుల ప్రవర్తనల్లో ఎగుడు దిగుళ్ళూ, అందుకు కారణాలూ కౌముది వెల్లడిగా చూడగలిగారు. పైగా మాట్లాడ్డంలో నిదానం, స్పష్టత విశిష్టంగా ఎరిగిన వారు. ఆయన కవిత్వమంతా ఇవాళ వరసగా చదువుతూంటే, పాతగా పొగలాగా అనిపించదు. ఆ వాక్యాలకు, పదసంపుటికి పాతదనం లేదు. పునరుక్తి కాదు, కవిత్వ రహస్యమెరిగిన వ్యక్తి పడే జాగ్రత్త అది.

మరీ ముఖయ్మ్గా “ఏకాంత”, “ఒక వృక్షం”, “ఇంతకూ నేనెవర్ని?” అనే వచన పద్యాలూ, “కవినైతిని”, “వసంత గీతి” “విశ్వ శాంతి” “దీపావళి” “వికృత ప్రాకారాలు” – పద్యాలూ, “ఒక అనుభవం” రచన వంటివి కౌముది గారి కవిత్వాన్ని పాతబడనివ్వవు.

ఏకాంతం – కవితలో కౌముది అంటారు:

గుండెల మీద

ఘనీభవించిన దూరాలు

 

నిట్టూర్పుల నిప్పు కణికల మీద

ఉచ్చ్వాస నిశ్వాసాల పరిమళాల నివురు.

ఎక్కడో  ఎందుకో

మంచులా కురుస్తున్న చూపులు.

దిగంతాల దగ్గిర

అప్పుడే ముత్యాల పల్లకీ దిగిన సంధ్య

ఎర్ర దుమ్ము ఎగరేసుకుంటూ

సరుగుడు చెట్ల వెనక

నిష్క్రమించిన రథం

 

అప్పుడే

నిప్పుల నది ఈది ఈది

తీరం ఎక్కి

వగర్చుతూ ఒళ్ళు ఆరబెట్టుకుంటున్న ఒంటరి చుక్క.

 

మిణుగురు పురుగు రెక్కల మీద ఎగిరి వచ్చి

మెల్లగా వ్యాపించే

నీ

ఆలోచన.

*

తన కాలంలో మిగతా కవుల కంటే వేరుగా మాట్లాడగలిగితే – ఒక కవి తన గొంతులో మాట్లాడుతున్నాడని అర్థం.

కౌముది గారు అభ్యుదయ కవుల్లో సొంత గొంతున్న కవి.

నా మిత్రుని కవిత్వానికి నమస్కరిస్తున్నాను.

*

 

కౌముది కవిత్వ సంపుటి “అల్విదా” కోసం సంప్రదించండి: సాహితీ మిత్రులు, 28-10-26/1, అరండల్ పేట, విజయవాడ- 520 002. 

మీ మాటలు

  1. వహ్ వా……ఏమి కవిత …….కవిత లో నచ్చిన వాక్యం చెప్పాలంటే కవిత మొత్తం ఎత్తి రాయాలి…రాస్తే పోనీ తృప్తి గా ఉంటుందా…..ఖచ్చితంగా ఉండదు….ఏమి చెప్పినా ఎలా చెప్పినా ఆ కవిత లో గాడత…సాంద్రత…విభిన్నత…విశిష్టత చెప్పనేలేను….హృదయపూర్వక పాదాభివందనం అ లాటి కవిత రాసిన కౌముది గారికి….శ్రీకాంత్ గారికి కృతజ్నతలు చక్కటి పరిచయానికి….

  2. కౌముది గారి ఈ కవిత్వ సంపుటిని బుక్ ఎగ్జిబిషన్ ద్వారా పొందగలగడం , మొదలుపెట్టబోయే ముందు మీ చిన్ని పరిచయాన్ని చదివే అవకాశం కలగడం సంతోషంగా ఉంది .

  3. sasi kala says:

    డెబ్బై లలోనే ఇంత వచన కవిత్వ వికాసం గ్రేట్ . ఇలాంటి వారి వలెనే వచనం కొత్త పుంతలు తొక్కుతూ
    మిణుగురు రెక్కలు తగిలించుకుని ఎగురుతూ అందరిలో ఆలోచన రగిలిస్తూ ఎగురుతూ ఉంది

  4. అఫ్సర్ గారి కవిత్వం ఫై వారి నాన్నగారి కవిత్వ ప్రభావం నాకు కనిపిస్తున్నది

  5. కె.కె. రామయ్య says:

    కౌముది గారి కవిత్వ సంపుటి “అల్విదా” ప్రింటు పుస్తకం కోసం సంప్రదించండి :

    1) సాహితీ మిత్రులు, 28-10-26/1, అరండల్ పేట, విజయవాడ- 520 002.
    Ph No : 0866 – 2433359 email : “Visweswara Rao Sri Sri”

    ( అఫ్సర్ గారి నాన్నగారు, ఖమ్మం వాస్తవ్యులు “కౌముది” గారు నాకు మంచి మిత్రులు అని చెప్పారు పుస్తక
    ప్రచురణకర్త శ్రీశ్రీ విశ్వేశ్వర రావు గారు; త్రిపుర, ‘మో’ గార్ల నివాళి పుస్తకాలు ప్రచురించిన విశ్వేశ్వర రావు గారు )

    2) e-బుక్ కినిగె నుండి : http://kinige.com/book/alvida

మీ మాటలు

*