మరల రాని మధుర “వసంతం”

 

 

 

వంగూరి చిట్టెన్ రాజు

~

chitten rajuఅది సెప్టెంబర్ 29, 2015. ఆ రోజు హ్యూస్టన్ మహా నగరం లోని నాసా అంతరిక్ష కేంద్రం చూడడానికి వెళ్ళిన వేలాది సందర్శకులు అక్కడి మిషన్ కంట్రోల్ భవనం మీద ఉన్న అమెరికా జాతీయ పతాకం సగం క్రిందకి దించబడి ఉండడం గమనించి “పాపం ఎవరో గొప్ప వ్యక్తి మరణించి ఉంటారు” అనుకున్నారు. మరో కొన్ని నెలలలో సందర్శకులు అదే ప్రాంగణం లో అమెరికా ప్రభుత్వ వ్యవస్థ అయిన నాసా వారు  మరణించిన ప్రముఖుల జ్ఞాపకార్థం సగౌరవంగా నాటిన వృక్ష సముదాయంలో మరో పారిజాతం పరిమళాలు వెదజల్లుతూ కనపడుతుంది. ఆ వృక్ష నివాళి లో భారతీయ సంతతి కి చెందిన వారు ఇద్దరే. ఇద్దరూ మహిళలే. మొదటిది 2003 లో జరిగిన “కొలంబియా” రోదసీ నౌక ప్రమాదంలో అసువులు బాసిన ఏకైక భారతీయ వ్యోమ గామి కల్పనా చావ్లా. రెండోది గత సెప్టెంబర్ 28, 2015 నాడు ఎవరూ, ఊహించని విధంగా “కపాల మోక్షం” చెందిన పదహారణాల తెలుగింటి ఆడపడుచు, నాసా శాస్త్ర వేత్త డా. పుచ్చా వసంత లక్ష్మి. ఆ వృక్షానికి నేను పెట్టుకునే పేరు “వసంత వృక్షం”. ఎందుకంటే అటువంటి పరిపూర్ణమైన మహిళ  కానీ, ఆ పేరిట కలకాలం నిలిచే వృక్షం కానీ న భూతో, న భవిష్యతి.

గత సెప్టెంబర్ 23, 2015 నాటి దౌర్భాగ్య దినాన ఎప్పటి లాగానే వసంత మధ్యాహ్నం లంచ్ సమయంలో “ఇప్పుడే అరగంట లో వస్తాను” అని తన సాటి వారితో చెప్పి, ఆ మర్నాడు ఒక కాన్ ఫరెన్స్ కోసం కాలిఫోర్నియా వెళ్ళడానికి ఏర్పాట్ల కోసం కారు లో బయలు దేరి, దారి తప్పి, సెల్ ఫోన్ లో ఒక సహా ఉద్యోగిని పిలిచి సరి అయిన దారికి మళ్ళుతున్న క్షణం లో …అంటే ఉదయం 11: 12 నిముషాలకి దేముడు పిలిచాడు. ఏ విధమైన సూచనలూ లేకుండా హఠాత్తుగా బ్రైన్ హేమరేజ్ వచ్చి, కారు అదుపుతప్పి, ఒక రెస్టారెంట్ వారి భవనం గోడ కి దూసుకు పోయింది. అది చూసిన వారు 911 కి ఫొన్ చెయ్యగానే ఆంబ్యులెన్స్ వారు వచ్చి ఆసుపత్రికి తరలించారు. వెను వెంటనే స్పందించిన పోలీసులు ఆమె ధరించిన నాసా బేడ్జ్ ని గుర్తించి, వివరాలు సేకరించి, ఒక ఆమె భర్త మల్లిక్ కి వసంత రోడ్డు ప్రమాదం వార్త మధ్యాహ్నం 1:30 కి అందించ గలిగారు. నాకు కూడా మల్లిక్ చెప్పగానే హుటాహుటిన నలభై మైళ్ళ దూరం లో ఉన్న హాస్పిటల్ కి 2:30 కి వెళ్లాను. ఆ తరువాత ఐదు రోజులు అన్ని రకాల వైద్యులు, ఎన్ని రకాల చికిత్సలు చేసినా వసంత ని మాకు దక్కించ లేక పోయారు. సెప్టెంబర్ 28, 2015 సాయంత్రం మా అందరి సమక్షంలో వసంత ఆ దేవుడి దగ్గరకి వెళ్ళిపోయింది. ఆ నాలుగు రోజులూ మేము ఎంత క్షోభ అనుభవించామో ఆ దేవుడు అంతే ఆపేక్ష గా వసంత కోసం నిరీక్షించి ఉంటాడు. నాకు అందుకే ఆ దేవుడంటే చాలా అసూయ.

NASA Award

ప్రతిష్టాత్మక నాసా పురస్కారం అందుకుంటూ..

నలభై ఏళ్లగా నాకూ, మా ఆవిడకీ ఏకైక గాఢ స్నేహితురాలిగా, మా పిల్లలకి “బొడ్డు కోసి పేర్లు పెట్టిన “పెత్తల్లి” గా వసంత గురించి వ్రాయాలంటే ఎక్కడ మొదలెట్టాలో తెలియక చాలా ఇబ్బందిగా ఉంది. అమెరికా లో ఫార్మకాలజీ శాస్త్రవేత్తలలో ఆమెకున్న అగ్రశ్రేణి స్థానం గురించి వారి కుటుంబానికీ, నాకూ తప్ప చాలా మందికి తెలియని విశేషాలు ముందుగా ప్రస్తావిస్తాను.

1946  లో అంబటిపూడి నరసింహం, శ్రీహరి దంపతులకి ఏకైక సంతానంగా కాకినాడ లో తాత గారైన మద్దూరి సోమయాజుల గారి ఇంట్లో పుట్టిన వసంత లక్ష్మి తండ్రి  గారి ఉద్యోగ రీత్యా విశాఖపట్నం, కాకినాడ, రాయపూర్, భిలాయ్ నగరాలలో బయాలజీ శాస్త్రాలలో మాస్టర్స్ డిగ్రీ దాకా చదువుకుంది. 1968 లో పుచ్చా మల్లిఖార్జున వెంకట సుబ్రమణ్యం (మల్లిక్) తో వివాహం అయిన తరువాత నాలుగేళ్ళు బెంగుళూరు లో మల్లిక్ భారత ఎలాక్రానిక్స్ కంపెనీ లోనూ, వసంత హెబ్బల్ లో అగ్రికల్చురల్ యూనివర్సిటీ లోనూ పనిచేసి, 1972 లో ముందు మల్లిక్, ఏడాది తరువాత నాలుగేళ్ల కొడుకు గిరీష్ తో వసంతా హ్యూస్టన్ వలస వచ్చారు. రాగానే వసంత యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ లో ముందు బయాలజీ లో చేరి, ఫార్మకాలజీ లోకి మారి వరసగా మాస్టర్స్ డిగ్రీ, డాక్టరేట్ డిగ్రీ 1980 లో పూర్తి చేసింది. వెనువెంటనే అమెరికా ప్రభుత్వం వారి నేషనల్ రిసెర్చ్ కౌన్సిల్ వారి పోస్ట్ డాక్టరల్ ఫెలోగా నాసా అంతరిక్ష కేంద్రం వారి బయో సైన్సెస్ విభాగంలో చేరింది.

అదే ఫెలో షిప్ తో కొన్నేళ్ళు నార్త్రప్ అనే కంపెనీ లో మూడేళ్ళు కొనసాగుతూ మంచి పరిశోధకురాలిగా పేరు సంపాదించుకుంది. ఆ కారణంగా నాసా వారు 1989 లో అక్కడ ఫార్మకాలజీ లేబొరేటరీ సంస్థాపన బాధ్యతలు వసంత కి అప్పగిస్తూ ఆ ప్రభుత్వ సంస్థ లోనే కీలకమైన పదవి లో నియమించారు అప్పటి నుంచీ వసంత ఇక శాస్త్ర వేత్తగా వెను తిరిగి చూడ లేదు. అచిర కాలం లోనే అమెరికాలో అత్యున్నత స్థాయి ఫార్మకాలజీ పరిశోధనాలయం నాసా వారిదే అనే విధంగా ఆ లేబోరేటరీని తీర్చి దిద్దింది.  నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, నేషనల్ స్పేస్ బయో మెడికల్ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్, అమెరికా ప్రభుత్వ నౌకాదళం మొదలైన జాతీయ స్థాయి సంస్థల నుండి అనేక మిలియన్ డాలర్ల రిసెర్చ్ గ్రాంట్స్ సంపాదించి అంతరిక్షం లో మానవ శరీరంలో వచ్చే మార్పులు, తీసుకోవలసిన జాగ్రత్తలు, కేవలం జీరో గ్రావిటీ లో మాత్రమే తయారు చెయ్యగల మందుల తయారీ మొదలైన అనేక శాస్త్రీయ విషయాలపై అగ్ర స్థాయి పరిశోధనలు చేసింది మన వసంత. అనేక అంతర్జాతీయ శాస్త్రీయ పత్రికలలో సుమారు వందకి పైగా పరిశోధనా పత్రాలు, పది విశ్వ విద్యాలయ స్థాయి పాఠ్య పుస్తకాలలో అధ్యాయాలు, మూడు పేటెంట్లతో నాసా లో ఉన్న నలభై వేల మంది ఉద్యోగస్తులలో సీనియర్ సైంటిస్ట్ లు పదముగ్గురి లో మన తెలుగు ఆడబడుచు వసంత ఉన్నత స్థానం లో నిలబడింది…కేవలం స్వయం కృషి తో. అంతే కాదు, తను చదువుకున్న యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ తోనూ, అనేక దేశాలలోని అగ్ర సంస్థల తోనూ నాసా తరఫునా, వ్యక్తిగతంగానూ విశేషమైన సేవలు అందిస్తూనే, నాసా వారికి ప్రవేటు సంస్థలతో అనుబంధం కలిగించి, అంతరిక్ష యానంలో ఏస్ట్రోనాట్స్ తరచూ వచ్చే మోషన్ సిక్ నెస్ నివారణకి తను స్వయంగా కనిపెట్టిన మందులు వ్యాపార పరంగా తయారు చెయ్యడానికి పూర్తి ఏర్పాట్లు చేసింది వసంత. మల్లిక్ కూడా నాసా లోనే ఉద్యోగం చేసేవాడు కాబట్టి వాళ్ళిద్దరినీ “స్పేస్ కపుల్” అని అందరూ పిలిచే వారు.

ఒక శాస్త్రవేత్తగా వసంత కి ఉన్న స్థాయి గుర్తింపు కి మరొక ఉదాహరణగా సెప్టెంబర్ 30, 2015 నాడు ఆమె అంతిమ యాత్రకి నాసా ఉన్నత అధికారులు వచ్చి, నాసా తరఫున అమెరికా జాతీయ జండాని ఆమె కుటుంబానికి తమ నివాళి గా సమర్పించారు. అమెరికా దేశంలో ఇది అత్యంత గౌరవప్రదమైన నివాళి గా పరిగణిస్తారు. వ్యక్తిగా వసంత అంటే ఆమె సహాధ్యాయులకి ఎంత గౌరవం అంటే నవంబర్ 8, 2015 నాడు “Celebration of Vasanta’s Life” అని ఆమె కుటుంబం నిర్వహించిన ఆత్మీయ కార్యక్రమానికి 35 సంవత్సరాల క్రితం వసంత మాస్టర్స్ & డాక్టరేట్ కి గైడ్ గా వ్యవహరించిన ప్రొఫెసర్ స్టువార్ట్ సేల్ద్మన్ గారు జార్జియా నుంచీ, ఆమెతో పని చేసిన నాసా డైరెక్టర్ డా. కేరోలైన్ హంటూన్,  ఇతర ప్రాంతాల నుండీ అనేక మంది సిబ్బందీ ప్రత్యేకంగా వచ్చి తమ జ్ఞాపకాలని పంచుకున్నారు.

 

వసంతకి ఉన్న ఒక గుణం ఏమిటంటే వృత్తి రీత్యానూ, ఒక అగ్రశ్రేణి శాస్త్ర వేత్త గానూ తను సాధించిన విజయాలని, ఎదురైన ఇబ్బందులనీ స్నేహ బృందంతో ఎక్కువగా పంచుకునే అలవాటు లేదు. కానీ ఆ అదృష్టానికి నేను నోచుకున్నాను. పైన ఉదాహరించిన చాలా వివరాలు అప్పటికప్పుడే నాకు వసంత పిలిచి చెప్పి సంబరపడుతున్నప్పుడు “మన వాళ్ళందరికీ చెప్పావా?” అని అడినప్పుడల్లా “ఎందుకు రాజూ, ఏదో గొప్పలు చెప్పుకుంటున్నాను అనుకుంటారు. పోనీ ఇదేమైనా ఓ ఆటా, పాటా వ్యవహారమా” అనేది. అందుకే ఆమె అసంఖ్యాక మిత్ర బృందానికి వసంత ఆటా, పాటల గురించే ఎక్కువ తెలుసును కానీ శాస్త్రవేత్త గా ఉన్న అఖండమైన ప్రఖ్యాతి తెలియదు.

ఇక నాకూ, వసంత కీ పరిచయం చిన్నపుడు పరోక్షంగానూ, అమెరికా లో ప్రత్యక్షం గానూ జరిగాయి. రెండూ తమాషా సంఘటనలే. అప్పుడు మా ఇద్దరికీ పదిహేనేళ్ళు ఉంటాయేమో. మేము కాకినాడ గాంధీ నగరంలో ఉంటే వసంత వాళ్ళ తాత గారు మద్దూరి సోమయాజుల గారింట్లో రామారావు పేట లో పి.ఆర్. కాలేజీ & కుళాయి చెరువు దగ్గర ఉండే వారు. మా ఇద్దరివీ లాయర్ల కుటుంబాలే కాబట్టి రాకపోకలూ, పేరంటాలూ వగైరాలు కూడా ఉండేవి కానీ నాకు అవేమీ తెలియదు. కానీ ఒక సారి మా నీల పిల్లి అనే భలే పేరు ఉన్న మా చాకలి వాడు ఉతికి తెచ్చిన బట్టల మూట లో మా బట్టల బదులు వసంత వాళ్ళ ఇంటి తాలూకు మూట పట్టుకొచ్చి ఇచ్చి వెళ్లి పోయాడు. ఆ తరువాత మూటల మార్పిడి జరిగింది కానీ నాకూ, వసంత కీ మొట్ట మొదటి పరోక్ష పరిచయం మాకున్న కామన్ చాకలివాడు నీలపిల్లి ధర్మమా అనే జరిగింది. ఈ విషయం మేమిద్దరం అమెరికా లో ప్రత్యక్షంగా కలుసుకున్నాక మాటల కాకినాడ కబుర్ల సందర్భంలో తెలిసింది. మరో ముఖ్యమైన మరో పరోక్ష పరిచయం మేమిద్దరం కాకినాడ పి.ఆర్. కాలేజ్ లో ప్రి యూనివర్శిటీ లో ఒకే బేచ్ వాళ్ళం. కానీ నాది MPL..అంటే మేథమేటిక్స్, ఫిజిక్స్ & లాజిక్ అయితే వసంత ది BPC, అంటే బయాలజీ, ఫిజిక్స్ & కెమిస్ట్రీ. అంచేత ఎక్కడా ఏ క్లాస్ లోనూ కలిసే  అవకాశం లేదు. ఆ రోజుల్లో అమ్మాయిల సంఖ్య అతి తక్కువ కాబట్టి ఇతర విద్యార్ధుల లాగా గర్స్ వైటింగ్ రూమ్ చుట్టూ తిరిగితే కనపదేదేమో కానీ నేను “రాముడు మంచి బాలుడు” కాబట్టి ఏదో నా చదువూ, నా క్రికెట్టు ప్రపంచాలలోనే ఉండే వాడిని. అంచేత నేనూ, వసంతా అప్పుడు ఒకళ్ళకి మరొకరం గుంపులో గోవిందా బాపతే. ఇది కూడా మేము అమెరికాలో కలుసుకున్నాక పి.ఆర్. కాలేజ్ సంగతులు మాట్లాడుకుంటూ ఉంటే తెలిసిన సంగతే.

Vasantha & Raju 1975

1975 లో…వసంతతో…

ఇక 1975 లో నేను హ్యూస్టన్ లో అడుగుపెట్టిన నెల తిరక్కుండానే మల్లిక్, వసంత లని కలుసుకోవడం కూడా తమాషాగానే జరిగింది. కొన్నాళ్ళ నిరుద్యోగం తర్వాత అప్పుడే నేను యూనివర్శిటీ ఆఫ్ హ్యూస్టన్ లో పోస్ట్ డాక్టరల్ ఫెలో గా చేరాను. ఒకరిద్దరు తెలుగు వారు కాని యూనివర్శిటీ విద్యార్థులు తప్ప ఎవరూ తెలియదు. ఓ వారాంతంలో మేము మాకు 200 మైళ్ళ దూరం లో ఉన్న సాన్ ఏంటోనియో నగరం చూడడానికి వెళ్ళాం. అక్కడ “రివర్ వాక్”…అంటే నదిలో బోట్ షికారు చాలా ప్రసిద్ది చెందింది. మా కుర్రాళ్ళం నలుగురం పైన వంతెన మీద నుంచుని క్రింద నదిలో పడవలలో విహరిస్తున్న మనుషులని చూస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఒక పడవలో మన భారతీయులలాగా కనపడుతున్న ఒక కుటుంబాన్ని చూశాం.  ఆ రోజుల్లో భారతీయులు కనపడడం అపురూపం కాబట్టి గబ గబా చేతులు ఊపేసి హాయ్ అని చెప్తూ నేను అనుకోకుండా ఉత్తినే వేళాకోళానికి “ఏమండీ బావున్నారా?” అని తెలుగు లో గట్టిగా అరిచాను. వెంటనే ఆ పడవలో అమ్మాయి “ఆ బావున్నాం. మీరెలా ఉన్నారూ?” అని తిరిగి అరుస్తూ చెయ్యి ఊపింది. ఆ అమ్మాయే వసంత. ఆ తర్వాత వాళ్ళు ఒడ్డుకి వచ్చాక పరిచయాలు చేసుకుని తక్షణం జీవిత కాల స్నేహితులం అయిపోయాం. అప్పటికి నేను బ్రహ్మచారిని. మల్లిక్, వసంత లకి కొడుకు గిరీష్ కి నాలుగేళ్ళు. వారి సహజ సిద్దమైన ఆప్యాయత కీ తొలి ఉదాహరణ ఏమిటంటే అలా సాన్ ఏంటోనియో లో కలుసుకున్న వారం రోజులలో నేను మా ఇంజనీరింగ్ లాబ్ లో పనిచేసుకుంటూ ఉంటే వాళ్ళిద్దరూ నన్ను వెతుక్కుంటూ పలకరించడానికి వచ్చి కేంటీన్ లో కాఫీ ఇప్పించారు. అప్పటి నుంచీ నా పెళ్ళయ్యే దాకా ఏదో వంక పెట్టుకుని వాళ్ళింటికి వెళ్లి పోయి వారానికి చాలా సార్లు అక్కడే తెలుగు భోజనం చేసేవాడిని. అందుకే మా అమ్మ తరువాత నాకు ఏమి ఇష్టమో వసంతకే ఎక్కువ తెలుసు. “రేపు గుమ్మడి కాయ వడియాలు చేస్తానురా” అనో “అరటి కాయ ఆవ పెట్టిన కూర నీకోసం రెడీగా ఉంది. వస్తావా?” అనీ “అనుజ్ గాడి కోసం ముక్కల పులుసు చేశాను. వాణ్ణి కూడా తీసుకోస్తావా. నీతో డబ్బాలో పట్టుకెళ్తావా? మీ పిల్లలందరికీ అది ఇష్టం మరి” అనో ఆప్యాయంగా వినిపించే ఆ వసంత పిలుపులు ఇక రావు.

Scan0036

వసంత, గిరిజ: ఇద్దరు నేస్తాలు

ఆ విధంగా 1975 మొదలైన మా పరిచయం గాఢ స్నేహంగా మారడానికి ఎన్నాళ్ళో పట్ట లేదు.  బ్రహ్మచారిగా ఉన్న మల్లిక్ & వసంత నాకు హ్యూస్టన్ లో మొట్ట మొదటి కుటుంబ స్నేహితులు కావడంతో నాకు కావలసిన కుటుంబ ఆత్మీయత వాళ్ళ దగ్గరే వెతుక్కుని తనివి తీరా ఆనందించాను. క్రమంగా మరో పది కుటుంబాలు పరిచయం అయినా పండగలు, పిక్నిక్ లు, షాపింగ్ లు, విహార యాత్రలు, సినిమాలు చూడ్డం, పేకాడుకోడం, దెబ్బ లాడుకోడం ..ఒకటేమిటి..అన్నీ వాళ్ళ తోటే. ఆ రోజుల్లోనే రత్న పాప కూడా అనిల్ కుమార్ ని పెళ్ళాడి హ్యూస్టన్ లో అడుగు పెట్టింది. అప్పటికే పాప చాలా పేరున్న కూచిపూడి నర్తకి. వసంత కి కూడా  చిప్పప్పటి నుంచీ శాస్త్రీయ నృత్యం, కర్నాటక సంగీతం లో ప్రావీణ్యం ఉండడమే కాక నలుగురినీ పోగేసుకుని ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమం చెయ్యడానికి తెగ ఉవ్విళ్ళూరుతూ ఉండేది. అందుకే యూనివర్శిటీ లో మాస్టర్స్ డిగ్రీలో చేరగానే ఇండియన్ స్ట్యూడెంట్స్ యూనియన్ కి సెక్రటరీ గా అందరినీ పోగేసి నానా హడావుడీ చేసేది.

ఆ రోజుల్లో  అదొక్కటే యావత్ హ్యూస్టన్ మహా నగరానికీ కలిపి ఉన్న ఒకే ఒక్క ఇండియన్ సంఘం. అప్పుడే ఇండియా కల్చర్ క్లబ్ అని గుజరాతీ వాళ్ళు, పంజాబీ వాళ్ళు మొదలుపెట్టి నప్పుడు మేమూ కలిసి మెలిసి రిపబ్లిక్ డే లాంటివి చేసే వాళ్ళం. ఊళ్ళో ఇండియన్ రెస్టారెంట్స్ లేవు కాబట్టి ఉన్న గృహిణులే ఆరు బయట కార్యక్రమాలకీ, అమెరికన్ ఫెస్టివల్స్ లో ఇండియన్ స్టాల్ పెట్టీ వంటలు చేసే వారు. అందులో దక్షిణాది వంటలకి వసంత ఎప్పుడూ ముందు ఉండి ఇడ్లీలు, దోశలు వందల కొద్దీ అలా వేస్తూనే ఉండేది. మేం అంతా మేత మేస్తూ సహాయం చేసే వాళ్ళం. 1975 ఏడాది చివరికి కేవలం తెలుగు కళాభిమానమే కాక కావలసిన ప్రావీణ్యం కూడా ఉన్న వాళ్ళం తగిన సంఖ్యలో హ్యూస్టన్ చేరడంతో అందరం తర్జన భర్జన పడి అమెరికాలో తొలి తెలుగు సాంస్కృతిక సంఘాల లో ఒకటయిన హ్యూస్థన్ తెలుగు సాంస్కృతిక సమితి కి శ్రీకారం చుట్టాం. తద్వారా అప్పటి దాకా దాసట, బీసటగా ఎవరో ఒకరి ఇంట్లో కొనసాగుతున్న చిన్నచిన్న సాంస్కృతిక కార్యక్రమాలూ, పండగలూ మొదలైనవి క్రమబధ్ధీకరించి స్థాయి పెంచడం లో కృతకృత్యులయ్యాం. మా సమితి మొట్ట మొదటి కార్య నిర్వాహక వర్గంలో ఊళ్ళో ఒక పెద్ద అయిన కోనేరు తాతయ్య గారు సమన్వయ కర్త, నేను సహా సమన్వయ కర్త కాగా వసంత, దువ్వూరి నారాయణ రావు గారు, పోతు నరసింహా రావు గారు & రాజేశ్వరి గారు, తమ్మారెడ్డి చంద్ర శేఖర్, పట్టిసపు గంగాధరం గారు, తుమ్మల కుటుంబ రావు సభ్యులు. అందులో పెద్దలు దువ్వూరి అనంత అచ్యుత నారాయణ రావు గారు 1957 లో హ్యూస్టన్ మాత్రమే కాక అమెరికా దక్షిణ రాష్ట్రాలకి వచ్చిన తొలి భారతీయుడు. ఆయన వసంత పెద నాన్న గారు. అంటే వసంత తల్లి శ్రీ హరి గారు, నారాయణ రావు గారి భార్య కి స్వయానా చెల్లెలు.

1979 (1)

 

వీరిలో అందరూ ఊహించినట్టుగానే సాంస్కృతిక కార్యక్రమాలకి చైర్ పెర్సన్ ఇంకెవరూ…వసంతే. తన తో పాటు రత్న పాప, అనిల్, నేను, హీరా & సూరి దువ్వూరి, బాల & రామం చావలి. పొలాని జానకి రామయ్య, రవి తమిరిశ మొదలైన వాళ్ళం కలిసి నాటకాలు, డాన్సులు, బొమ్మల కొలువులు, పిల్లలకి భోగి పళ్ళు. ఉగాది పచ్చడి, దీపావళి టపాసులు, వన భోజనాలు, ఆటల పోటీలు…..ఒకటేమిటి అనేక రకాల కార్యక్రమాలతో తెగ సంబడం గా ఉండేది. అందరిలోకీ ఎక్కువ సంబరంగా ఉండేది ఎప్పుడూ వసంతే! ఎప్పుడైనా పొరపాటున తనని సలహా అడగక పోయినా, మరొకరితో ఎక్కువ మాట్లాడినా ప్రాణం తీసేసేది వసంత. అప్పుడే కాదు …మొన్న మొన్నటి దాకా కూడా ..మళ్ళీ అన్నీ మామూలే…. ఆ అలక అంతా అ క్షణమే! మర్నాడు ముక్కల పులుసు రెడీ!

 

1976 లో మా టీసీయే (తెలుగు సాంస్కృతిక సమితి కి హ్రస్వ రూపం) కాస్త నిలదొక్కుకోగానే నాకు మనం ఒక పత్రిక పెడదాం అని ఆలోచన వచ్చింది. అయితే ఇతర నగరాలలో లాగా కేవలం కమ్యూనిటీ వార్తల కోసమే కాకుండా ఒక సాహిత్య పత్రిక లా కథలూ, కవితలూ వేస్తే బావుంటుంది అని కూడా అనిపించి, ముందు వసంత ని పిలిచాను. “నీ బుర్ర బానే పని చేస్తోందే…కానీ కథలు, కవితలు ఎక్కడి నుంచి వస్తాయి?” అంది వసంత….అలా అందే కానీ అప్పటికే ఆ ఐడియా నచ్చేసింది అని నాకు అర్థం అయిపోయింది. కాస్సేపు మాట్లాడుకుని “ఇద్దరం చెరో కథా ముందు రాద్దాం” అని అనేసుకున్నాం. అలా నేను నా మొట్ట మొదటి కథ “జుల పాల కథ “ అనో చిన్న కథ వ్రాస్తే, వసంత “ఆవగింజ ఆంతర్యం” అని ఓ చిన్న కథ వ్రాసింది. ఒకరి కథ మరొకరు చదువుకుని “పరవా లేదులే” అనుకున్నాం. ఇక పత్రిక పేరు “మధుర వాణి” పెట్టి నేను ప్రధాన సంపాదకుడి గానూ, వసంతా, దువ్వూరి హీరా సహ సంపాదకులుగానూ మాకు మేమే నిశ్చయించేసుకున్నాం. ఆ పేరు మీద తర్జన భర్జనలు  ముఖ్యంగా “మధుర వాణి” అని గురజాడ పాత్ర పేరులా వ్రాయాలా, లేక “మధుర-వాణి” అని మధురమైన వాణి అనే అర్థ వచ్చేలా వ్రాయాలా అనే దాని మీద మా ముగ్గురి తగాదా రత్న పాప తీర్చింది…”మధ్యలో ఆ గీత ఎందుకూ అడ్డంగానూ” అంటూ…

ఆ విధంగా “ఆవగింజ ఆంతర్యం” కథ వ్రాయగానే ఆగ లేదు వసంత. దానికి తన కలం పేరు “వలపు” అని పెట్టుకుంది…అంటే ..”వసంత లక్ష్మి పుచ్చా” కి కుదింపు….ఎంత పొందిక గా కుదిరిందో కదా. దటీజ్ వసంత..ఏం చేసినా సొంత ముద్ర ఉండాల్సిందే! ఆ తరువాత ఉద్యోగం లోనూ, ఇతరత్రానూ ఎక్కువ రాయ లేదు కానీ నా సతాయింపు భరించ లేక “అసంకల్పిత ప్రతీ కార చర్య” అని మరో కథా, “మధ్యాప్యం” మొదలైన కవితలూ అడపా దడపా రాసేది. పదేళ్ళ క్రితం తెలుగు కథ శత వార్షికోత్సవం సందర్భం గా స్వర్గీయ భార్గవీ రావు గారు  “ఈ శతాబ్దంలో మహిళా రచయితల హాస్య కథలు” సంకలనం వేసినప్పుడు నేను ఈ “ఆవగింజ ఆంతర్యం” పంపిస్తే ఆవిడకి ఎంతో నచ్చి, ఆ సంకలనంలో ఎంపిక చేశారు. దానికి వసంత చాలా సంబర పడింది.

వసంత కి డ్రామాలంటే భలే ఇష్టం. “నన్ను హీరోయిన్ గా పెట్టి ఓ డ్రామా రాయకూడదూ? అస్తమానూ మీ మగాళ్ళేనా వేసేది?” అనేది. తన కోసమే మేము స్త్రీ పాత్రలు ఉన్న “ఇల్లు అమ్మబడును”, “ఆదివిష్ణు రాసిన డ్రామా మొదలైనవి వేశాం. అంతెందుకూ?  ఓ సారి జంధ్యాల రాసిన “గుండెలు మార్చబడును” వేద్దాం అనుకుంటే అందులో స్త్రీ పాత్ర లేదు కానీ ప్రధాన పాత్ర అయిన మగ డాక్టర్ మధు పాత్రని ఆడ పాత్రగా వసంత కోసం నేను తిరిగి వ్రాయవలసి వచ్చింది.

Telugu drama 1

1970-80 దశకం లో  నేనూ, అశోక్ కుమారూ మరి కొందరు బ్రహ్మచారులమూ మల్లిక్ & వసంత, అనిల్ & రత్న పాప, బాల & రామం, కుమారి & సుసర్ల శర్మ  కుటుంబాలూ  ఒకే వయసు వాళ్ళం కాబట్ట్టి బాగా కలిసి మెలిసి ఉండే వాళ్ళం. 1978 లో నేను ఇండియా వెళ్లి మా అమ్మ చెప్పిన అమ్మాయి గిరిజతో పెళ్లి ముహూర్తం కుదిరినప్పుడు అమెరికాలో ఒక్క వసంత, మల్లిక్ లకే ఫోన్ చేసి ఆ వార్త చెప్పాను. ఆ రోజుల్లో అక్కడ నుంచి అమెరికా ఫోన్ చెయ్యడం అంటే తలప్రాణం తోకలోకి వచ్చేది. మా పెళ్లి సమయానికి అమెరికా నుంచి వచ్చిన ఏకైక గ్రీటింగ్స్ టెలిగ్రాం కూడా వసంత, మల్లిక్ ల దగ్గర నుంచే! పెళ్ళయ్యాక గిరిజ అమెరికాలో అడుగుపెట్టిన మొట్టమొదటి రోజునే మా మిత్ర బృందం అందరినీ కలుసుకున్నా “లవ్ ఎట్ ఫస్ట్ సైట్” వసంత తోటే. ఆ క్షణం నుంచీ వసంత మా ఆవిడని తనకి లేని సొంత చెల్లెలిలాగానే చూసుకుంది తన జీవితాంతం. మా ఆవిడకి కష్టం వచ్చినా, సుఖం వచ్చినా అన్నీ వసంత తోటే చెప్పుకునేది.

అన్నట్టు వసంత అమెరికా వచ్చిన కొత్తలో తనకి డ్రైవింగ్ నేర్పించిన ఘనత అశోక్ కుమార్ దే.  అతను కొన్నేళ్ళ క్రితం యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్థన్ లో ఉండగానే ఓ అమెరికా అమ్మాయిని ప్రేమించాడు. ఇక పెళ్లి కూడా చేసుకోడానికి నిశ్చయించుకోగానే ఎంతయినా గుంటూరు వాడు కాబట్టి మన హిందూ సాంప్రదాయం లో పెళ్లి చేస్తే బావుంటుంది అని అనుకున్నాం కానీ ఆ రోజుల్లో హ్యూస్టన్ లో ఏదో నామకహా గా గుజరాతీ వాళ్ళ గుడి ఒకటి ఉండేది కానీ మన తెలుగు పద్ధతికి అది పనికి రాదు కదా! ఇంకేముందీ…మల్లిక్ & వసంత పూనుకుని అశోక్ కుమార్ పెళ్లి తెలుగు పద్ధతిలో అప్పుడే కొనుక్కున్న వాళ్ల ఇంట్లోనే చేద్దాం అని నిర్ణయించుకున్నారు. కానీ పెళ్లి ఎలా చెయ్యాలో ఎవరికీ సరిగ్గా ఏమీ తెలియదు. అంచేత అందరం ఎవరికీ జ్ఞాపకం ఉన్న తంతులు, మంత్రాలు, సినిమాలలో ఉన్నవీ కలిపి, సన్నాయి వాయిద్యాలతో సహా “పెళ్లి చేయించుట ఎలా?” అని ఒక ఆడియో కేసెట్ తయారు చేసుకుని మల్లిక్ ని పురోహితుడిగా నియోగించాం. ఊళ్ళో ఉన్న తెలుగు వారినందరినీ పిలిచి అశోక్ & మేరీ ఏగ్నేస్ పెళ్ళి 1978లో అరిటాకులలో నేల మీద కూచుని భోజనాలు చెయ్యడంతో సహా అన్నీ వసంత ఆధ్వర్యంలోనే జరిపించాం. విశేషం ఏమిటంటే పురోహితుడు కూడా అయిన మల్లిక్, వసంత పెళ్ళిపీటల మీద కూచుని కన్యాదానం చేశారు. ఆ పెళ్లి ఫోటో లు గుంటూరులో ఉన్న అశోక్ తల్లి సరస్వతి గారు చూసి “అదేమిట్రా, జంధ్యం తప్పు వేశారూ?” అన్నారుట. ఆ విధంగా పెళ్లి తంతులలో ఎన్ని లోపాలు ఉన్నా అశోక్ & మేరీ ఏగ్నెస్ గత 38 ఏళ్లగా హాయిగా సంసారం చేస్తున్నారు.

raju1

అపూర్వ తో…

వసంత కి ఉన్న మరో వ్యాపకం మొక్కలు పెంచడం. అదైనా ఏదో సరదాగా నాలుగు వంగ మొక్కలు వేసేసి గొప్పలు చెప్పుకోడం కాదు. ఆ మాట కొస్తే 1970-80 లలో మన కూరగాయలలో ఒక్క టొమేటో, బెండ మొక్కలు తప్ప ఇంకేమీ దొరికేవి కాదు. అంచేత వంగ, దోస, తోటకూర, గోంగూర, పొట్ల, బీర వగైరా విత్తనాలు అన్నీ ఇండియా వెళ్ళినప్పుడు బంగారం లా జాగ్రత్తగా తెచ్చుకునే వాళ్ళం. ఇప్పటి లాగా ఎలక్ట్రానిక్ స్క్రీనింగ్ లేని ఆ రోజుల్లో విత్తనాలు ఎలాగో కష్టమ్స్ వాడి కళ్ళు కప్పి పెట్లో అట్టడుగున దాచేసి తీసుకు వచ్చే వాళ్ళం కానీ దొండ, తమల పాకులు లాంటి తీగెలు తీసుకు రావడం కోసం వసంత నాకు స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చేది నేను ఇండియా వెళ్ళే ముందు. అదేమిటంటే కణుపులతో ఉన్న దొండ పాదుకానీ, నాలుగైదు ఆకులతో ఉన్న తమల పాకు తీగె కానీ తడి గుడ్డలో చుట్టి పొట్టకి దారంతో గట్టిగా కట్టుకుని, పైన బనీను వేసుకుని నిటారుగా నడవడం నేర్పేది. కాకినాడ నుంచి బొంబాయి దాకా మామూలుగానే పట్టుకొచ్సినా, బొంబాయిలో అలా అవి పొట్టకి కట్టుకుని అక్కడ నుంచి న్యూ యార్క్ లో దిగే దాకా కూచున్నా, నుంచున్నా, నడిచినా నిట్టనిలువుగా జాగ్రత్తగా వాటిని పట్టుకొచ్చి వసంత కి ఇచ్చే దాకా ప్రాణం కటకటలాడిపోయేది. నలభై ఏళ్ల తరువాత కూడా ఈ నాడు మా హ్యూస్టన్ లో అందరి ఇళ్ళలోనూ పెరుగుతున్న దొండ పాదు, తమల పాకు తీగెలూ ఆ విధంగా స్మగ్లింగ్ అయి వచ్చిన నాలుగో తరం పాదులని చెప్పుకోడంలో అతిశయోక్తి లేదు. సరిగ్గా అలాంటిదే మనకి ఆత్మీయమైన మల్లె మొక్క. ఆ కొన్ని నర్సరీల లో సాండ్బాగ్ జాస్మిన్ అనే పేరుతో  ఇప్పుడు మల్లె మొక్కలు, కనకాంబరాలు  దొరుకుతున్నాయి. ఇక  వసంత ఎక్కడెక్కడి చైనా వాళ్ళ నర్సరీ లకి వెళ్లి అకడ నుంచి మామిడి, జామ, నంది వర్ధనం, సన్న జాజి, సంపెంగ, రక రకాల మందారాలు మొదలైనవి తెచ్చి తన తోటలో వేసి, రోజూ సాయంత్రం ఇంటికి రాగానే చీకటి పడే దాకా అక్కడే గడ్డి పీకుతూనో, నీళ్ళు పోస్తూనో అన్ని మొక్కలనీ పలకరిస్తూ మూడు, నాలుగు గంటలు గడిపాకే ఇంట్లో అడుగుపెట్టేది. అలాగే అన్ని రకాల కూరగాయలూ, దబ్బ, నిమ్మ, నారింజ, దానిమ్మ, జామ..ఆఖరికి నేరేడు మొక్క కూడా వసంత తోటలో ఉంటాయి.

ఆ నాటి ఇతర స్నేహితుల ఆర్ధిక స్థాయి పెరుగుతున్న కొద్దీ అంతరాలు కూడా పెరిగినా కేవలం వసంత తో అనుబంధం నలభై ఏళ్ల గా ఒకే స్థాయిలో మా కుటుంబానికి కారణం ఆమెకి ఉన్న ఎంతో సహజమైన ఆడంబరం… అదే కల్మషం లేని ఆత్మీయత. అనదల్చుకున్న మాట అనేయడం ఆ ఆత్మీయత వ్యక్తీకరణ లో ఒక భాగం. 1981 లో తనకి పుట్టబోయే అమ్మాయికి ఏం పేరు పెట్టాలా అనే సంప్రదింపులలో వసంత రమ్యశ్రీ అనే పేరు ఎంచుకుంది. నేను రమ్య అంటే చాలు, మళ్ళీ అదేదో కవి గారి కలం పేరులా రమ్యశ్రీ ఎందుకూ అంటే భలే కోప్పడింది. రమ్య పుట్టిన రోజు మల్లిక్ అందరికీ హవానా చుట్టలు పంపిపెట్టి ఆడపిల్ల పుట్టినందుకు మహానందపడిపోతే, ఆ క్షణం నుంచీ వసంత జీవితం రమ్య కేంద్రబిందువుగానే సాగింది అని చెప్పవచ్చును.

వసంత ఆత్మీయతకి చొరవకి అతి మంచి ఉదాహరణ 1988 లో జరిగిన రెండు విశేషాలు. ఆ ఏడు మా అమ్మ అమెరికా వచ్చి మా తమ్ముడి దగ్గర కాలిఫోర్నియాలో ఆరు నెలలు, హ్యూస్టన్ లో మా ఇంట్లో ఆరునెలలూ ఉండి ఇక వెనక్కి మళ్ళీ కాకినాడ వెళ్ళే ప్రయత్నంలో ఉంది. ఒక్కర్తినీ పంపించడం కుదరదు కాబట్టి మాలో ఎవరో ఒకరు తీసుకెళ్ళి దిగబెడదాం అనుకుంటూ ఉంటే వసంత “ఎందుకూ. మేము ఎలాగా గిరీష్ ఒడుగు చెయ్యడానికి ఇండియా వెళ్తున్నాం. మీ అమ్మ మా అమ్మ కాదా ఏమిటీ? నేను కూడా జాగ్రత్తగా తీసుకెళ్తాను” అని ఎంతో ఆత్మీయంగా, దారిలో విమానం ఎనిమిది గంటలు ప్రాంక్ఫర్ట్ లో ఆగిపోవలసి వచ్చినా మా 75 ఏళ్ల మా అమ్మకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఇండియా తీసుకెళ్లింది. అదే వసంత కాక పొతే మేము మా అమ్మని అలా పంపించే వాళ్ళం కాదు. ఆ తరువాత మరో పదేళ్ళు ఎప్పుడు మా అమ్మతో మాట్లాడినా “వసంత ఎలా ఉందిరా?” అనేదే మొదటి ప్రశ్న. ఇది వ్యక్తిగతం అయితే గిరీష్ ఉపనయనం వసంత వ్యక్తిత్వానికీ, చొరవకీ మరో ఉదాహరణ. అప్పటికి రెండేళ్ళ ముందు ఎన్టీ రామా రావు హ్యూస్టన్ వచ్చినప్పుడు మేం అందరం ఆయన్ని కలుసుకున్నాం కాబట్టి వసంతకి అది గుర్తుకి వచ్చి, హైదరాబాదులో తిన్నగా ముఖ్యమంత్రి సచివాలయానికి వెళ్లి గిరీష్ ఉపనయనం ఆహ్వానం ఎన్టీ రామారావు గారికి అందజెయ్యమని ఆయన సెక్రటరీకి ఇచ్చింది.  ఎవరూ ఊహించని విధంగా రామారావు గారు ఆ ఉపనయనానికి వెళ్లి ఆశీర్వదించి అందరికీ ఆశ్చర్యం, ఆనందం కలిగించారు. ఆ ఫోటో ఇక్కడ జతపరుస్తున్నాను. అదీ మా వసంత అంటే !

With NTR

నందమూరిని కలిసిన క్షణాలు…

ఇక మాకు ఇద్దరు అమ్మాయిలు, అబ్బాయి పుట్టినప్పుడూ పేర్లు  ఎంపిక చెయ్యడంలో వసంత ప్రధాన సలహాదారు. వాళ్ళు పుట్టిన దగ్గరనుంచీ పెద్ద వాళ్ళు అయ్యాక కూడా పుట్టిన రోజులు, హై స్కూల్ గ్రాడ్యుయేషన్, మా అమ్మాయిలు రత్న పాప దగ్గర కూచిపూడి నృత్యానికి సలహాలు, 1998 లో వాళ్ళ రంగ ప్రవేశానికి మేకప్ తో సహా అన్ని ఏర్పాట్లు, మా రెండో అమ్మాయి పెళ్ళి దగ్గర ఉండి జరిపించడం ..ఒకటేమిటి ….మా కుటుంబంలో అంతర్భాగంగా ఉన్న వసంత ఇప్పుడు కనుమరుగు అయినా మా అందరి మనోఫలకం లో కలకాలం ఉంటుంది. నా కంటే, మా కుటుంబం కంటే ఎక్కువ సన్నిహితులు వసంతకి ఉన్నారు. అందులో ఆశ్చర్యం లేదు. వారు ఇంత కంటే మంచి స్మృతులతో సమగ్రమైన వ్యాసం వసంత గురించి వ్రాయగలరు. నేను కూడా ఇంకా చాలా విశేషాలు వ్రాయగలను. కానీ కొన్ని లోపల దాచుకుంటేనే వాటికి ఎక్కువ విలువ. ఈ వ్యాసం లో వసంత గురించి కొంత అయినా అందరితో పంచుకోవాలని పించి, నా జీవన ప్రస్థానంలో ఒక ఆత్మీయ స్నేహితురాలిగా ఆమెకి ఉన్న స్థానాన్ని అక్షర రూపంలో ఈ ఆత్మకథలో పదిలపరుచుకునే ప్రయత్నం చేశాను.

2015 ఓ విధంగా మాకు చాలా బాధనే ఇచ్చింది. నా అమెరికా జీవితంలో తొలి రోజుల నుంచీ అత్యంత ఆత్మీయులైన స్నేహితులు అనిల్ కుమార్ గత ఫిబ్రవరిలోనూ, సెప్టెంబర్ మొదటి వారంలో సుసర్ల శర్మ, ఆఖరి వారంలో వసంత ఏ మాత్రం ఊహించలేని విధంగా పరమపదించారు. ఇక డిశంబర్ లో మా ఆస్థాన పురోహితుడు గుళ్ళపల్లి ఉదయ కుమార్ కేవలం 40 వ ఏట గుండె పోటు తో మరణించారు. వీరందరికీ ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ 2016 అందరికీ శాంతి సౌభాగ్యాలని కలిగిస్తుందని ఆశిస్తున్నాను.

*

 

 

 

 

 

 

 

 

మీ మాటలు

  1. Putcha Venkata Narasimham says:

    చిట్టెన్ రాజు

    మీరు చాల బాగా వ్రాస్తారని తెలుసుగాని స్వయంగా చదివి తెలుసుకున్నది మాత్రం ఇప్పుడే.

    నిజంగా మా వసంతపిన్ని విశేషాలు విజయాలు ఇన్ని ఉన్నాయని మాకు తెలియదు. తెలుసుకుని విచరించాలొ గర్వపాడలో తెలియటం లేదు. ఏమైనా వసంతపిన్నిది గొప్ప వ్యక్తిత్వం, జీవితం, మరియు ఉత్సవం. అవే జ్ఞాపకాలు నిలిచి ఉంటాయి బంధువులతోనూ మిత్రులతొనూ.

    • వంగూరి చిట్టెన్ రాజు says:

      ధన్యవాదాలు నాయనా. వసంత అందరికీ అనేక రకాలుగా ఆత్మీయత పంచిపెట్టిన వ్యక్తి. అందుకే ఆ జ్ఞాపకాలు అలాగే నిలిచి ఉంటాయి.

      • Putcha Venkata Narasimham says:

        చిట్టెన్ రాజు:

        థాంక్స్. మీరు Hyderabad వచ్చే తేదీలు ముందుగా తెలియజీస్తే మిమ్మల్ని కలుసుకుంటా.

  2. suresh babu says:

    రాజు సర్
    వసంత గారి లాంటి ఆత్మ బందువు ని కోల్పోవటం నిజంగా దురదృష్టం .అలాంటి వారి లోటు ఎవ్వురు తీర్చలేరు అలాంటి ఒక మహోన్నత మనిషి ఆత్మకు శాంతి కలగాలని మనసారా అ భగవంతుడుని వేడుకున్తున్నాము

    • వంగూరి చిట్టెన్ రాజు says:

      మీ స్పందనకి ధన్యవాదాలు సురేష్ బాబు గారూ.

  3. శాయి రాచకొండ says:

    రాజు గారు, మీరు వసంత గారి వ్యక్తిత్వం, ఆమెకున్న బహుముఖ ప్రజ్ఞ, మనుషులంటే ఆవిడకున్న అభిమానం, కళ్ళకు కట్టినట్లు చెప్పారు. ఆవిడ నాతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడడమే తెలుసు కానీ, ఆవిడ ఉద్యోగంలో ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నారనేది అస్సలు తెలియనివ్వలేదావిడ. మీరు చెప్పినట్లుగా భగవంతుడికి కూడా అలాంటి వాళ్ళంటేనే ఇష్టమేమో!

    • వంగూరి చిట్టెన్ రాజు says:

      నిజానికి రాయవలసినవి చిన్నా చితకా విషయాలు ఇంకా చాలానే ఉన్నాయి. అలాంటి చిన్న విషయాలలోనే మనిషి నిజమైన వ్యక్తిత్వం తెలుస్తుంది అని నా నమ్మకం. ఏవో మచ్చుకి కొన్ని మాత్రమే రాయగలిగాను..

      మీ స్పందనకి ధన్యవాదాలు, శాయి గారూ

  4. చిట్టెన్ రాజుగారూ,
    మనసు మారుమూలలని తాకిన చక్కని ఆత్మీయమైన స్మృతి.
    హృదయపూర్వక అభినందనలు.

  5. వంగూరి చిట్టెన్ రాజు says:

    మీ స్పందనకు ధన్యవాదాలు, మూర్తి గారూ

  6. srinivas Mullapudi says:

    శ్రీ చిట్టెం రాజు గారు, నమస్తే! వసంత గారి గురించి మీ జ్ఞాపకాలు హృదయం పులకిన్చేలా వ్రాసారు. ఆవిడతో నా పరిచయం తక్కువయినా, ఎక్కడయినా ఎదురు పడినప్పుడు, శ్రీనివాసు బావున్నారా! అని పలుకరించేవారు. ఆఖరుగా ఆవిడను సామవేదం షణ్ముఖ శర్మ గారి ప్రవచనం లో చూసాను. అ సందర్భంలో ఆవిడ మా అమ్మాయి గాయత్రి కచేరిని తిలకించి, నా దగ్గరకు వచ్చి నా భుజము తట్టి, శ్రీనివాసు ! మీ అమ్మాయి బాగా పాడుతోంది, మంచి భవిష్యత్తు వుంది, సంగీతాన్ని బాగా నేర్చుకోమని చెప్పు అని దీవించారు. హుందా తనము, అప్యాయిత మరియు ప్రతిభ, ఆవిడ పర్యాయ పదాలు. ఇంత మంచి వ్యాసాన్ని అందించిన మీకు ధన్యవాదములు – శ్రీనివాసు ముళ్ళపూడి

    • వంగూరి చిట్టెన్ రాజు says:

      వసంత తో కొద్ది పాటి పరిచయం ఉన్నవాళ్ళకయినా గుర్తుండేది ఆమె సహజత్వమే. మీ స్పందనకి ధన్యవాదాలు శ్రీనివాసు గారూ

  7. సత్యం మందపాటి says:

    రాజుగారు:
    మన అందరి హృదయాలలో కలకాలం నిలిచివుండే అసామాన్య స్నేహితురాలు వసంత గురించి మనసు విప్పి చాల చక్కగా వ్రాశారు. చదువుతుంటే కొన్ని చోట్ల కళ్ళు చెమర్చాయి కూడాను. ఆవిడ గురించి మాకు తెలియని ఎన్నో విశేషాలు చక్కగా వివరించారు. ధన్యవాదాలు.

    ఆవిడ గురించి ఎంత చెప్పినా తక్కువే. 1980 దశాబ్దం మొదటిలో మేము హ్యూస్టన్లో వున్నప్పుడు, మొదటిసారిగా కలిసాం మల్లిక్, వసంతలని. అప్పటినించీ ఎప్పుడూ ఎక్కడో ఒకచోట కలుస్తూనే వున్నాం. భార్యాభర్తలిద్దరూ ఎంతో ఆప్యాయంగా పలకరించడం, మా కష్టసుఖాలు పంచుకోవటం మా స్నేహాన్ని చాల దగ్గరచేసింది. వసంత నన్ను చూప్సినప్పుడల్లా, “మన సాహిత్య సదస్సులకి రాలేకపోతున్నాను, క్షమించాలి. ఆఫీసులో చాల బిజీగా వుంది” అనేవారు. Now we miss her not only in our literary meetings, but in our life too..

    సత్యం

    • వంగూరి చిట్టెన్ రాజు says:

      మీకూ, మీ కుటుంబానికీ ఆత్మీయురాలు వసంత. అందరికీ మంచి స్నేహితురాలు. మీ స్పందనకి ధన్యవాదాలు, సత్యం గారూ

  8. Ramarao Kanneganti says:

    I am very sorry to hear this news. I too remember the brief interactions when they visited Rice university. Didn’t their son go to Rice and was a marshal scholar? I had so many fond memories of madhuravani too working with kishore on that. I did not know of the many accomplishments of Vasantha garu.

    • వంగూరి చిట్టెన్ రాజు says:

      Yes, Ramarao garu, When you and Ananda Kishore were in Tice University, you were the only experts who can type in English and transliterate into Telugu script as is inventors. Vasnantha and I used to come to you for Madhura Vani articles, Their son Girish is also a Rice alumni, and A March fellow…He is now an MD PhD and much more..and is a very successful guy in Palo Alto…
      All of us who were acquainted with her and her family miss her.

  9. ఒక ఫ్రెండ్ గురించి మనసు లోతుల్లోంచి తడి ఆరని జ్ఞాపకాలు మాతో పంచుకున్నారు..మీ మాటల వాళ్ళ ఆమె నాకూ దగ్గర అనిపిస్తున్నారు..అయ్యో అనిపిస్తోంది..

    • వంగూరి చిట్టెన్ రాజు says:

      ధన్యవాదాలు, అమరేంద్ర గారూ, వసంత అమెరికాలో తొలి తరం తెలుగు వనితామణుల్లో అగ్రశ్రేణికి చెందిన వ్యక్తి.

  10. Nageswara Rao says:

    నివాళి కళ్ళు చెమరించేలా, హృదయానికి హత్తుకొనేలా రాశారు సర్, ధన్యవాదాలు. వసంతగారి పేరు కల్పనాచావ్లాకు నివాళి అర్పించిన సందర్భంలో వార్తలలో చదివాను. ఇంతగొప్పవారని ఈ వ్యాసం చదివేదాక తెలియదు. ఒక ప్రక్క వృత్తిలో అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తూనే, ఇంకొక ప్రక్క కల్చరల్ activities మరియు కమ్యూనిటీ సర్వీస్ లో ఇంత సేవ చేయగలిగారంటే నిజంగానే exceptional human being. జీవితంలో ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకొంటేగాని ఇన్ని విజయాలు సాధ్యపడవు. ఆ మహామనిషికి నా నివాళి

    • వంగూరి చిట్టెన్ రాజు says:

      ధన్యవాదాలు నాగేశ్వర రావు గారూ

  11. uma bharathi says:

    రాజు గారు,
    When this article was published I did not read it … as loss of Vasantha was still fresh in my mind…
    I read it now.. and learnt so much more about her versatility and personality… she instantly put every body at ease with her warmth and helping nature…
    What a marvelous woman she was… She will forever stay a beloved person in our minds…
    Miss her very much…
    Your article is a tribute to the multifaceted personality of our Vasantha garu… very nice ..

  12. Voleti Venkata Subba Rao says:

    ప్రియమయిన రాజు గారు —
    నమస్తే
    నా శ్రీమతి సీతాదేవి కాలధర్మం చెంది 12 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భం గా, 3 రోజుల క్రితం ఫేస్ బుక్ లో నా టైం లైన్ లో ఒక పోస్ట్ పెడుతూ – దానికి చెన్నై లో నా కుటుంబానికి ఆప్తులు , చిత్రకారులూ ,బాపు గారి సోదరుడు శ్రీ శంకర్ గారు వేసిన చిత్రాన్ని నేను జోడించడం జరిగింది – ఆ పోస్ట్ కి స్పందిస్తూ మిత్రులు మల్లిక్ గారు – వారి శ్రీమతి వసంతగారు కాలం చేసిన విషయాన్ని ప్రస్తావించి , నన్ను ఊరడించారు . ఇప్పుడు , వసంత గారి గురించి , ఆమె సౌజన్యం గురించి సంస్మరణ వ్యాసం లో మీరు వ్రాసినది చదువుతూంటే అప్రయత్నం గా నా కళ్ళు చెమ్మగిల్లాయి – వసంత గారి ఉన్నతమయిన వారి వ్యక్తిత్వం బహుధా ప్రశంసనీయము —

మీ మాటలు

*