నాగలక్ష్మి పాడిన “మేలు”కొలుపులు

 

వేకువ పాట ముఖ చిత్రం

 

-సువర్చల చింతల చెరువు 

~

వారణాసి నాగలక్ష్మిగారి “వేకువపాట” కథాసంపుటి, వేకువనే పాడవలసిన “మెలకువ పాట” లా అనర్ఘమైనది. వేకువన మాత్రమే వినిపించే పిట్టల కువకువలా ఆహ్లాదమైనది.

వెదురు చివుళ్ల కోసం ఎగిరొచ్చే గువ్వలు ఈ కథాసంపుటి ముఖచిత్రం. రచయిత్రి చిత్రకారిణికూడా కావటంతో పుస్తకానికి ఈ బొమ్మ మరింత భావస్ఫోరకంగా నిలిచింది.  వేకువనే చిన్ని విహంగాలు తమ కలకలారావాలతో జగతిని మేలుకొలుపుతాయి. వెదురు పొదలు ఆమాత్రం గాలులకే ఈలపాటలు వినిపిస్తాయి. ప్రకృతిలో మమేకమైన  ప్రతి చిన్న ప్రాణీ తన జీవనగీతాన్ని సక్రమంగా పాడుకుంటుంటే.. మానవులం, అన్ని తెలివితేటలూ ఉన్నవాళ్లం చేస్తున్నదేమిటీ అనే ప్రశ్నే ఈ వేకువపాట అని  సూచించారేమో ఈ రచయిత్రి అనిపిస్తుంది. ఈ చిత్రాన్ని చూస్తుంటే ఈ చిన్ని పక్షులే, ఈ  వెదురు వేణువులే మనకాదర్శం అని చెప్పినట్లు తోస్తుంది.

ఇందులో కథలన్నీ  బెల్లం,మిరియాలు కలిపిన పాలు. పౌష్టికతతోబాటు, ఔషధీకృతమైనవి. పాల మనసులకు, తీయని మనసులకు అవసరమైన ఘాటైన సత్యాలు లేదా పరిష్కారాలను సూచించేవి. తిండి కలిగితే కండ కలగి, కండ కలిగినవాడే మనిషి అయినట్లు, ఇలాంటి పాలను సేవిస్తే మానసిక ఆరోగ్యం!  దారుఢ్యం! ఈ కథలు  సమాజపు ఆధునిక రుగ్మతలను ఎదుర్కోటానికి ఉపకరించే ఔషధాలు. వీటిని సేవించిన పాఠకుడు మనసైన మార్గాన్ని కాకుండా మనసున్న మార్గాన్నిఅనుసరించగలుగుతాడు .

ఈ కథల్లో తమ జీవితానుభవాలతో తీర్చిదిద్దుకున్న వ్యక్తిత్వాలను చూసి మన మెదళ్లు వికసిస్తాయి. ఇవి రచయిత్రి బోధించే నీతికథలు కాదు. జీవితాన్ని ఇష్టపడమని చెప్పే చేయూతలు! చదివించేతనం, మొదలుపెడితే చివరివరకూ ఆగనివ్వని తత్వం, మళ్లీ  చదివించే తీరు ఈ కథల్లోని ప్రత్యేకతలు.  ఈ సంపుటిలో ముందుమాటలో విశ్లేషించిన కథలను వదిలి మిగతా కథలను చర్చిస్తాను.

“ఆనాటి వానచినుకులు”: ఈ కథాసంపుటిలో విభిన్నమైనది “ఆనాటి వానచినుకులు” కథ. ఇది పచ్చకర్పూరం, కలకండ కలిపిన పాలలా..కమ్మని అనురాగగంధంతో ఘుమఘుమలాడింది. మితిమీరిన ఆశల, ఆశయాల సాధనలో పిచ్చిపరుగులు తీసిన జంట అలసిన తమ మనసులను తీపిసంగతుల భావుకతతో సేదతీర్చి మమేమకమైన ప్రేమకథ. ఏది అవసరమో అది తేల్చుకున్న గొప్ప కథ. ఎల్లలులేని వలపుల ఔన్నత్యాల విలువను తెలియచేసే  ఈ కథ ఈ కాలపు జంటలకో ఓ చక్కని వికాస బోధన!   కావ్యోపేతమైన ఈ కథలో ప్రతి ఒక్క పదం  వాసంత సమీరమే! మలయమారుత గమనమే! ఇది చదివినంతసేపూ ఒక ఆహ్లాదకరమైన లలితగీతం మనకు వినబడుతుంది.

పుష్యవిలాసం: పువ్వుల మాసం పుష్య మాసం  అంటూ మొదలయ్యే ఈ కథ పువ్వుల్లాంటి సుకుమారమైన హృదయాల వర్ణనతో  విలసితమైనదే! ఆటో నడిపే సూర్యారావు కి  కనువిప్పు కలిగించిన తల్లీకూతుళ్ల సంభాషణ, జీవితపు ఆవేశకావేషాలను, తొందరపాటు తనాలను ప్రశ్నిస్తుంది.   ఆటోలో కూతురు మాటాడే మాటలు ప్రేమలోని పౌరుషాన్ని చూపిస్తే, తల్లి మాటలు స్త్రీ అనుభవపు క్షమాగుణాన్ని చూపిస్తాయి.  అర్ధవంతంగా మలచిన సంభాషణలు, భాషతో ఊహాచిత్రాన్ని గీసిన  రచయిత్రి నేర్పు సౌందర్యభరితం!  ఈ కథ చదువుతున్నంతసేపూ ఏదో పునర్జీవనగీతం మనసుని తడుతూనే ఉంటుంది. కథన కౌశలం కమనీయం.

అమ్మా, నాన్నా ఓ కాలేజీ అబ్బాయీ, సరళీస్వరాలు: ఒకటి పిల్లలు తెలుసుకోవాల్సినదైతే, మరోటి పెద్దలు గ్రహించాల్సినది. తల్లిదండ్రుల పట్ల, తమ చదువు, నడవడికల పట్ల పిల్లలు ఎంత బాధ్యతాయుతంగా ఉండాలో, పిల్లల జీవితాన్ని తీర్చిదిద్ది, వారి జీవనరాగం అపశృతిలేకుండా చేయాలంటే తల్లిదండ్రులూ ముఖ్యాముఖ్యాలను దృష్టిలో ఉంచుకోవాలని, సరైన బాధ్యతాయుత  పెంపకం అదేనని రెండు కోణాలనూ విశదీకరిస్తూ, సమాజంలోని ఆకర్షణలు, రుగ్మతల గురించి ప్రస్తావిస్తారు ఈ రెండు కథలలో!  మానసిక విశ్లేషణతోబాటు ఓ సాంఘిక విశ్లేషణ అవసరాన్నీ సూచిస్తారు. కుటుంబ సంబంధాలను రచయిత్రి,  ముందే ఏర్పరుచుకున్న భావజాలంతో కాకుండా మన కళ్లముందు కనబడుతున్న సంఘటనల ఆధారంగా చిత్రిస్తారు. ఒకసారి,  మారిన వ్యవస్థలోని లొసుగులు మనముందు సున్నితంగా విప్పుతారు. మరోమారు,  కంటికి కనిపించే వ్యవస్థలో ఎవరికీ కనిపించని వాస్తవిక కోణాలను ఓసామాజిక విశ్లేషకురాలుగా తేటతెల్లంచేస్తారు. మానసిక విశ్లేషకులే ముక్కుమీదవేలేసుకునేంతగా, వారు చూడలేని లోతైన అంశాలను చెప్పిస్తారు. ఈరెండు కథలూ విద్యార్ధులకు పాఠ్యాంశాలు కాదగినవి.

“పాపాయి పుట్టినవేళ”  కథలో పాత ఆచారాలను మూఢాచారాలుగా కొట్టివేయకూడదన్న సత్యం తెలుస్తుంది. అంతేకాదు, చిన్న చిన్న సాయాలందించే ఆత్మీయహస్తం ఎంత విలువైనదో, అది తనవారికి మానసికంగా ఎంతటి ఊరటను అందిస్తుందో తెలియచేస్తుంది.   చాలారోజుల తర్వాత ఇంటికి వచ్చి ఆత్మీయంగా పెనవేసుకున్న బంధువులా అపురూపంగా అలరించే కథ ఇది

కొమ్మకొమ్మకో సన్నాయి : ప్రకృతికి, జీవితానికీ అన్వయంకూరుస్తారు ఎప్పుడూ రచయిత్రి అనిపిస్తుంది మనకు. ప్రకృతి నేర్పే పాఠాలను నిరంతరం ఓ భావుక హృదయంతో నేర్చుకోవాలని, ఋతువులకనుగుణంగా తమనితాము మార్చుకునే వృక్షరాజాలే మనకు ఆదర్శమనీ, ఒడిదుడుకులు ఎదురైనా ఉత్సాహంతో ముందుకు సాగే పరవళ్ల జలపాతాలే మనకు జీవనాడిని వినిపిస్తాయని  మృదువుగా హెచ్చరిస్తారు.

విముక్త : తల్లిదండ్రులను వదిలి తమ జీవితాలను విదేశాలలో కొనసాగించే పిల్లల్ని తప్పుబట్టకుండా, వారికోసం ఎదురుచూస్తూ నిరాశతో మనసుల్ని కృంగదీసుకోకుండా “నేనున్నాను, నన్ను స్మరించుకోండి, నాతో మాట్లాడండి” అంటూ పద్మశ్రీ శోభానాయుడుగారు కృష్ణుడిగా వేసిన కూచిపూడి నృత్యనాటికను చూసిన అనుభూతి కదిలింది  విముక్త కథ చదివాక. జీవితాలపై మోహం వద్దంటూనే జీవనాల్ని సమ్మోహనపరిచే కృష్ణతత్వం కనిపించిందీ కథలో.  ఎన్నో నేర్చుకోవాల్సినవి ఎప్పటికప్పుడు ఉంటూనే వుంటాయి. అతీతంగా జీవించాల్సిన సమయాన్ని గుర్తించి, గౌరవంగా ఆహ్వానించాలని చెప్పే ఈ కథంతా చదివాక గుండె బరువెక్కకమానదు.

పరిమళించే పూలు: మాలతి పాత్ర స్ఫూర్తినిచ్చేదిగా తోస్తుంది. ఈమెకి తన జీవితం పై చాలా స్పష్టత కనిపిస్తుంది. తనకేం కావాలో  ఖచ్చితంగా తెలిసిన పాత్ర ఇది. అలాగని స్వార్ధపరురాలుకాదు. తనపై నిందలువేసినవారిని సైతం జాలిపడి క్షమించి, మానసికంగా వారికి  చేయూతని అందించే మంచిమనసున్న అమ్మాయి. ఈ మాలతిలో రచయిత్రి మనసు కనిపిస్తుంది మనకు.

ఏ కథలోనూ, ఇబ్బందిపెట్టిన పాత్రలను   విమర్శచేయని విశాలదృక్పథం రచయిత్రిలో కనిపిస్తుంది.  కారణాలను విశ్లేషించుకోవాలేగానీ, అవే తమకు అడ్డంకులన్న సంకుచితత్వం వద్దని, తమనితాము మెరుగుపరుచుకోవాలేగానీ, పరదూషణ అత్యంత అనవసరమన్న విశాలతత్వం కనిపిస్తుంది.  ఈ  కథలలో కథానాయికలు పరిస్థితులకు బానిసలయినవారే కానీ బానిస మనస్కులు కారు.  ఆత్మాభిమానపు అస్తిత్వానికై తలపోసే సుమనస్కులు!  తమ గుర్తింపు తమకోసమే కానీ, ఇతరులకోసం కాదు అని, ఇతరులు తమని గుర్తించి చేయూతనందిస్తారని ఎదురుచూస్తూ, పరిస్థితులను తిట్టుకుంటూ కూర్చోవద్దని, తామిలా ఉండటానికి కారణం తామే కాని మరెవరూ కాదన్న నిజాన్ని తెలుసుకుని, చీకటిలోంచి తమంత తాముగా వెలుగుదారి వెతుక్కోవలసిన  అవసరాన్ని తెలియచేస్తారు.

పూర్వపు విలువలను ఏమాత్రం వదలని ఈ కథలు ఆధునిక విశ్వాసాలకూ అత్యంత ప్రాముఖ్యాన్నీ ఇస్తాయి. ఇప్పటి సామాజిక సమస్యలనే మన ముందుకు తెచ్చి, ఈ కాలానికి అవసరమైన దిద్దుబాట్లనే సూచించి వర్తమానాన్ని సంక్లిష్టతలనుండి కాపాడుకొంటూ పరిపక్వ హృదయాలతో ముందుకు సాగేలా  ఉంటాయి. మాసిపోయిన సమస్యలని లేవనెత్తని ముందడుగు రచనలుగా ఇవి నిలుస్తాయి.  వారణాసి నాగలక్ష్మిగారికి ఎన్ని అభినందనలూ చాలవు!

*

 

మీ మాటలు

  1. దేవికారాణి says:

    సువర్చల గారూ …నిజంగానే చాలా రోజుల తరువాత చక్కని పుస్తకం చదివిన అనుభూతి కలిగింది. అన్నికథలూ అద్భుతంగా ఉన్నాయి. నాగలక్ష్మిగారికి అభినందనలు

  2. “వేకువనే చిన్ని విహంగాలు తమ కలకలారావాలతో జగతిని మేలుకొలుపుతాయి. వెదురు పొదలు ఆమాత్రం గాలులకే ఈలపాటలు వినిపిస్తాయి. ప్రకృతిలో మమేకమైన ప్రతి చిన్న ప్రాణీ తన జీవనగీతాన్ని సక్రమంగా పాడుకుంటుంటే.. మానవులం, అన్ని తెలివితేటలూ ఉన్నవాళ్లం చేస్తున్నదేమిటీ అనే ప్రశ్నే ఈ వేకువపాట అని సూచించారేమో ఈ రచయిత్రి అనిపిస్తుంది. ఈ చిత్రాన్ని చూస్తుంటే ఈ చిన్ని పక్షులే, ఈ వెదురు వేణువులే మనకాదర్శం అని చెప్పినట్లు తోస్తుంది”- సువర్చల గారు, ఆ చిత్రం వెనుక నా భావన ఏమో గాని మీరు రాసిన వాక్యాలు చదువుతుంటే ఒక కొత్త కోణం లోంచి నా కథల్ని చూస్తున్నట్టనిపించింది! సమీక్షే అయినా ఆర్ద్రత, భావుకత పరిమళించేలా రాయడం మీకే చెల్లింది. ఆలస్యంగా స్పందించాను ఏమీ అనుకోరుగా…

మీ మాటలు

*