కొన్ని యువ హృదయాలూ – వాటి కలలూ!

testament-of-youth

-భవాని ఫణి
~

bhavaniphaniఅనగనగా అవి మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు రోజులు .

చదువే ప్రాణమైన ఓ బ్రిటిష్ అమ్మాయి .
రహస్యంగా వర్డ్స్ వర్త్ నీ,షెల్లీనీ,బైరన్ నీ చదువుకుంటూ, ఆ ప్రేరణతో తను రాసుకున్న కొద్దిపాటి రాతల్ని ఎవరికైనా చూపించడానికి కూడా మొహమాటపడి దాచుకునే ముత్యంలాంటి అమ్మాయి.
ఆత్మ విశ్వాసమే అలంకారంగా కలిగిన దృఢ మనస్విని.
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ లిటరేచర్ చదవడం  ఆమె ఆశయం . స్వప్నం.
ఎంతో కృషితో, పట్టుదలతో అక్కడ అడ్మిషన్ సంపాదించుకున్న ఆనందం,సంబరాలని అంబరానికి తాకిస్తున్న ఓ మంచి తరుణంలో అనుకోకుండా యుద్ధమొచ్చింది. అంతా తలక్రిందులైంది.
అన్న,స్నేహితుడు, ప్రేమికుడు అందరూ సైనికులుగా మారి , యుద్ధంలో ఉత్సాహంగా పాలు పంచుకుంటుంటే తనకి చేతనైనది తను కూడా చెయ్యాలన్న ఆశతో, కోరికతో, కలల సౌధమైన ఆక్స్ఫర్డ్ నీ, ఎంతో ఇష్టమైన చదువునీ కూడా వదిలిపెట్టి వార్ నర్స్ గా మారుతుంది ఆ ధైర్యశాలి.
పట్టుబడ్డ జర్మన్ సైనికులని ఉంచిన టెంట్ లో విధులు నిర్వహించే బాధ్యత ఆమెకి అప్పగించబడుతుంది.
అలా అక్కడ తీవ్రంగా కలిచివేసే పరిస్థితుల మధ్య,  గాయపడిన శత్రు సైనికులకి సేవలందిస్తుండగా అంతులేని శోకం వెతుక్కుంటూ వచ్చి ఆమె జీవితాన్ని మరింత అల్లకల్లోలం చేస్తుంది .
ముందుగా ప్రాణం కంటే ఎక్కువైన ప్రేమికుడు , తర్వాత ప్రాణప్రదమైన నేస్తం , ఆ తర్వాత ఆరో ప్రాణం వంటి సోదరుడు ఇలా ఎంతో ప్రియమైన వారంతా ఒకరి తర్వాత ఒకరు రక్కసి యుద్ధపు కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతూ ప్రాణాలు విడుస్తుంటే ఆ లేత మొగ్గ ఏమైపోవాలి? ఆ మారణ హోమానికి ఎలా నిర్వచనం చెప్పుకోవాలి?
 ఈ యుద్ధాలూ , ఈ పోరాటాలూ  ఇవన్నీ ఎందుకని ,ఎవరికోసమని లోలోపల బాకుల్లా పొడిచే సందేహాల గాయాలకి ఎటువంటి సమాధానాల్ని లేపనంగా పూయాలి?
ప్రాణాలు శరీరాలని విడిచి గాల్లో కలిసిపోతున్నప్పుడు ఏ మనిషి బాధైనా ఒకటి కాదా ? మనమంతా మనుషులమైనప్పుడు , మనుషులంతా ఒకలాగే ఉన్నప్పుడు ఒకర్నొకరు ఎందుకు చంపుకోవాలి? చంపుకుని ఏం సాధించాలి?
ఇటువంటి ప్రశ్నలు మాత్రమే చివరికి ఆ అమ్మాయి దగ్గర మిగిలినవి.
ఆప్తుల మరణం వల్లనా, ఎంతో క్షోభకి గురిచేసే యుద్ధ వాతావరణంలో పని చేసి ఉండటం వల్లనా ఆమె తీవ్రమైన మానసిక వత్తిడికి గురవుతుంది . ఒక స్నేహితురాలు అందించిన సహాయంతో ఆ క్రుంగుబాటు నుండి బయటపడి తన జీవితాన్ని ముందుకు నడుపుకున్నా తన వారిని మాత్రం జీవితాంతం గుర్తు పెట్టుకోవాలని బలమైన నిర్ణయం తీసుకుని , చివరి రోజుల వరకూ ఆ నిర్ణయానికి కట్టుబడే ఉంటుంది.
ఇదంతా వీరా మారీ బ్రిట్టైన్ అనే ఒక స్త్రీ వాది అయిన రచయిత్రి కథ . ఒక్కోసారి నిజ జీవితపు కథలు, కల్పన కంటే ఆసక్తికరంగా ఉండి హృదయానికి పట్టుకుంటాయి . ఎందుకంటే ఆ కథలోని పాత్రలు , మలుపులు ఎవరో ఏర్పరిస్తే ఏర్పడినవి కాదు .. అవి అలా జరిగిపోయినవి అంతే . అందుకే అవి ఎందుకు అలాగే జరిగాయని ఆలోచించి వాదించే  అవకాశం మనకి ఉండదు. వీరా కథలో అటువంటి ఆసక్తికరమైన మలుపులేవీ లేవు గానీ విధి ఆమెతో ఆడుకున్న విషాదకరమైన ఆట ఉంది .జీవిత కాలానికి సరిపడే దుఃఖమూ ఉంది . అవే ఆమెని యుద్ధ వ్యతిరేకిగా మారుస్తాయి. తర్వాతి  కాలంలో పాసిఫిస్ట్ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనేందుకు ఆమెని ప్రేరేపిస్తాయి.
వీరా బ్రిట్టైన్, తన జీవితంలో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలని వివరిస్తూ రాసుకున్న “టెస్టమెంట్ అఫ్ యూత్” అనే పేరుగల ఆత్మకథ ఆధారంగా ఈ చలన చిత్రాన్ని నిర్మించారు. సరళంగా ఉన్న స్క్రీన్ ప్లే, కథ అర్థం చేసుకోవడంలో మనకి ఇబ్బంది కలిగించదు . ఏదో నిజంగా అక్కడే జరుగుతున్నట్టే ఈ దృశ్య ప్రవాహం కళ్ల ముందు నుండి అతి సాధారణంగా సాగిపోతుంది .ఈ ఆత్మకథలో మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్ లోని సామాజిక పరిస్థితుల్ని కళ్లకి కట్టినట్టు చూపడం జరిగింది . అంతే కాక ఆత్మ విశ్వాసం , ధైర్యం మెండుగా కలిగిన ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తే అయినప్పటికీ స్త్రీ అయిన కారణంగా, వీరా తనకి ఇష్టమైన కెరీర్ ని ఎంచుకోవడం కోసం ఎంత ఘర్షణ పడాల్సి వచ్చిందో కూడా మనకి ఈ కథ వివరిస్తుంది.
ముఖ్య పాత్రధారిణి అయిన “అలీసియా వికండెర్” అత్యున్నతమైన నటనని కనబరిచి తన పాత్రకి సరైన న్యాయాన్ని చేకూర్చింది. ఉత్తమమైన ఆత్మకథల్లో ఒకటిగా పేరు సంపాదించిన ఈ వార్ టైం మెమోయిర్ ని అంతే ఉత్తమంగా తెరకెక్కించడంలో దర్శకుడు జేమ్స్ కెంట్ విజయం సాధించారు. కథలోని ఆత్మని పట్టుకుని దృశ్యంగా మలిచి మన కళ్ల ముందు నిలపగలిగారు.
*

మీ మాటలు

  1. Thilak Bommaraju says:

    యిటువంటి పరిచయ వాక్యాలు చాలా ఉత్సాహాన్ని కలిగిస్తాయి చదువరులకు.గొప్పగా వర్ణించారు భవాని ఫణి గారు.కంగ్రాట్స్

  2. Bhavani Phani says:

    ఈ రివ్యూ కి అసలేమీ రెస్పాన్స్ లేకపోతే బాగా రాలేదేమో అనిపించింది . మీ కామెంట్ తో ఉత్సాహం కలిగింది . ధన్యవాదాలు తిలక్ గారు

మీ మాటలు

*