సంభాషణలకు ముగింపు మాటలు  

 

మిగతా విషయాల్లో ఎలా ఉన్నా … ఆహార నిద్రా భయ మైధునాలు మనిషి మౌలిక జీవలక్షణాలనే అంశంలో ప్రపంచమంతటా ఏకాభిప్రాయం ఉంది. ఇవి జీవ లక్షణాలే కాదు, జీవి చైతన్య లక్షణాలు కూడా. వీటి ఉనికిలోని హెచ్చుతగ్గులే జీవుల కార్మిక విధానాన్ని ప్రభావితం చేస్తాయి.

సంపాదించడం, నిల్వ చేయడం… ఆహార సంబంధ క్రియలు గానూ,

రాజకీయాలూ, కొట్లాటలూ, సాహసాలూ, అధికార కాంక్షలూ… భయ సంబంధులు గానూ,

పునరుత్పత్తి, జీవన పరంపర, వగైరాలను మైధున సంబంధులుగానూ…

విశ్రాంతిని, పునరుత్తేజాన్నీ, ఊహాశక్తినీ చేకూర్చే లలిత కళల వంటి ప్రక్రియలను నిద్రా సంబంధులు గానూ స్థూలమైన వర్గీకరణ చేయవచ్చు.

ఆహారం కావాలంటే ఎవరినైనా పోయి అడగవచ్చు, లేదా స్వంతంగా ఏదైనా ప్రయత్నం చేసి సంపాదించు కోవచ్చు. భయం కలిగితే రక్షణ కోసం ఎవరినైనా ఆశ్రయించవచ్చు లేదా స్వయంగానే తగు రక్షణ ఏర్పాట్లు చేసుకోవచ్చు. నిద్ర కోసం ఎక్కడైనా ఇంత నీడను కోరవచ్చు.

మైధున క్రియకు ఇలాంటి సౌకర్యం లేదు. ఒకప్పుడుండేది. ఇంటికి అతిథిగా వచ్చిన వాడికి కామతృష్ణను తీర్చడం గృహిణి ధర్మంగా ఒకప్పుడు భావించేవారు. ఈ ధర్మాన్ని ఉద్ధాలక మహర్షి కుమారుడైన శ్వేతకేతువు తీవ్రంగా వ్యతిరేకించి కొత్త ధర్మాన్ని ప్రతిపాదించినట్టు మనకు మహాభారతం ద్వారా తెలుస్తుంది. శ్వేతకేతువు గమ్యాగమ్యాలను నిర్దుష్టంగా నిర్వచించాడు. అంటే ఎవరు ఎవరితో గమించవచ్చు, కూడదు అనేవి స్పష్టం చేశాడు. కుటుంబ వ్యవస్థను బలోపేతం చేసే ప్రక్రియలో భారతీయ సమాజం వేసిన తొలి అడుగుగా దీన్ని మనం భావించవచ్చు. ఈ మార్పు తర్వాత లైంగికావసరాలకు వివాహ వ్యవస్థ ఒక్కటే సర్వామోదమైన వ్యవస్థగా రూపుదిద్దుకుంది.

వివాహ వ్యవస్థకు ఆవల ఉన్న వారికి, అందులో ఉండి కూడా మైధునానందం పొందలేని వారి అవసరాలు తీర్చే మార్గంగా బహుశా వేశ్యావృత్తి ఏర్పడి ఉండవచ్చు. ఈ ఊహకు అనేకమైన ఆధారాలు ఆరుద్ర రాసిన గుడిలో సెక్స్ అనే పుస్తకం లోనూ, తాతాజీ రాసిన దేవాలయాలపై బూతుబొమ్మలెందుకు అనే పుస్తకం లోనూ మనకు కనిపిస్తాయి. అంతే కాదు, కుటుంబ వ్యవస్థ స్త్రీ సౌశీల్యం మీద ఆధారపడి ఉందని నమ్మిన సనాతనులు వేశ్యావృత్తిని సమర్ధించారు. కుల స్త్రీల శీలం కాపాడు కోవడానికి ఈ వ్యవస్థ అవసరమని వాళ్ళు నమ్మారు. భారతదేశంలో దేవదాసీ వ్యవస్థను రద్దు పరిచి నప్పుడు, ఆ చర్య వల్ల కుటుంబ వ్యవస్థకు తీరని ప్రమాదం ఏర్పడుతుందని ఆనాటి సనాతనులు వాదించారు.

వేశ్యల పట్లా, ఆ వ్యవస్థ పట్లా నేటి సమాజంలో చాలా చిన్నచూపు ఉన్నప్పటికీ 19వ శతాబ్దం వరకూ ఆ వృత్తిలోని వారు గౌరవాదరాలతోనే జీవించారని చెప్పవచ్చు. భారతదేశంలోని ఎన్నో రాజవంశాల మూల పురుషులు, ప్రసిద్ధి చెందిన అనేక మంది ఋషులు వేశ్యల సంతతి వారే. వేశ్యలు కళాకారులుగా పండితులుగా గొప్ప కీర్తి నార్జించారు. వారు దేశంలో ఒక గొప్ప సాంస్కృతిక వ్యవస్థను నిర్మించారు. అనేక దేవాలయాలకు, సమాజ సంక్షేమ కార్యాలకు వారు భూరి విరాళాలిచ్చారు.

మనుషులు ఎంచుకొనే పనులు, వృత్తులు వ్యవస్థీకృతం కావడాన్ని భారత దేశంలో కులం అనే పేరుతో వ్యవహరిస్తారు. అలాగే వేశ్యావృత్తి కూడా తొలినాళ్ళలో కులం లేనిదిగా వ్యవహరించబడినా వ్యవస్థీకృతమయ్యే కొద్దీ కులం రూపు సంతరించుకుంది. ఐతే సంతానాన్ని పొందే విషయంలో ఉన్న పరిమితులవల్ల ఇతర కులాలనుంచి ఈ కులంలోకి ఆదానాలు బహుళంగా జరుగుతూనే వచ్చాయి.

దేశంలో బ్రిటిష్ ప్రభుత్వం బలపడ్డాక, బ్రిటిష్ భావజాలం ఇక్కడి మేధావుల మనసులు చూరగొన్నాక, ‘సామాజిక స్వచ్ఛత’ అనే అంశం బలంగా ముందుకొచ్చింది. వ్యభిచారం వ్యవస్థీకృతం కావడం సామాజిక స్వచ్ఛతను కళంకితం చేస్తుందని బ్రిటిష్ వారూ, నాటి సంఘ సంస్కర్తలూ ప్రచారం చేశారు. దేవదాసీల వంటి కొన్ని కులాలు సామాజిక స్వచ్ఛతకు భంగకరంగా ఉన్నాయని భావించి ఆయా వ్యవస్థలను నిషేధించారు. వేశ్యావృత్తి పురుషుల కామప్రవృత్తి వల్ల రూపుదిద్దు కుందనీ, స్త్రీలను అణిచివేసే భారతీయ సమాజపు దుర్లక్షణాలలో ఇది కూడా ఒకటనే వాదం కూడా ఈ నిషేధానికి కారణమయ్యింది.

1999లో నళినీ జమీలా రాసిన ‘ఒక సెక్స్ వర్కర్ ఆత్మకథ’ అనే పుస్తకం ఇలాంటి అభిప్రాయాలకు భిన్నంగా మాట్లాడింది. జమీలా సెక్స్ వర్కర్ గా పనిచేస్తూ వారికి సంబంధించిన ఒక స్వచ్ఛందసంస్థను నడుపు తున్నారు. ఆవిడేమంటుందంటే ‘సెక్స్ అనేది కేవలం మగవాళ్ళ అవసరం మాత్రమేనని, స్త్రీలకు దాని అవసరం లేదనీ అందరూ భావిస్తుంటారు. చాలామంది ఫెమినిస్టుల ఆలోచన కూడా అందుకు భిన్నంగా లేదు. ఇది తప్పు. మాకు కావాల్సింది మీ దయాదాక్షిణ్యాలు కాదు. మా అస్తిత్వానికి గుర్తింపు.’

ఏది ఏమైనా వేశ్యావృత్తి ఉండటం మంచిదా కాదా అని చర్చించడం నా ఉద్దేశ్యం కాదు. స్త్రీ పురుష సంబంధాలూ, కుటుంబ వ్యవస్థా తీవ్రంగా ఒడుదొడుకులకు గురవుతున్న కాలమిది. లెస్బియనిజమూ, హోమోసెక్సువాలిటీ పుంజుకుంటున్న కాలమిది. బాలికలపైనా, స్త్రీలపైనా మునుపెన్నడూ లేనంతగా లైంగిక వేధింపులు జరుగుతున్న కాలమిది. ఈ నేపధ్యంలో మానవుల మౌలికావసరాల్లో ఒకటైన సెక్సు గురించి, మనుషుల లైంగిక ప్రవృత్తుల గురించి విస్తృతంగా చర్చ జరగాల్సి ఉంది. కానీ సెక్స్ అనేది మర్యాదస్తులు బహిరంగంగా మాట్లాడదగ్గ అంశం కాదనే భావన నేటి సమాజంలో బలంగా ఉంది. అదేదో అధోజగత్సంబంధి అనే అభిప్రాయంతో ఈ అంశంపై ఉదాశీనతను, మౌనాన్నీ ఆశ్రయించడం జరుగుతోంది. కావచ్చు. కానీ, మిత్రుడు రాణీ శివశంకర శర్మ ఒకచోట చెప్పినట్టు ‘అధోజగత్తును అధ్యయనం చెయ్యనిదే ఎస్టాబ్లిష్డ్ వ్యవస్థను అర్ధం చేసుకోవడం అసాధ్యం.’

మనుషుల లైంగిక ప్రవృత్తులపై ఒక చర్చను ఆహ్వానించడమే సానివాడల సంభాషణల కూర్పు వెనక ఉన్న ఉద్దేశ్యం. క్రీస్తు శకం 1వ శతాబ్ది నుండి 19వ శతాబ్ది వరకు ఆ వ్యవస్థ పొందిన పరిణామం ఏమిటనేది, ఆ వ్యవస్థ ద్వారా మనుషుల లైంగిక ప్రవృత్తులు ఎలా వెల్లడయ్యాయనేది ఈ సంభాషణల ద్వారా చూచాయగా వ్యక్తమౌతోంది. ప్రసిద్ధులైన రచయితల సాహిత్యం నుండే వీటిని తీసుకోవడం జరిగింది. వీటిని ప్రచురణకు తీసుకుంటూ ఈ సంభాషణలు మంచి అధ్యయనానికి దారితీయాలని అఫ్సర్ ఆకాంక్షించారు. వీటిపై వచ్చిన స్పందన నిరాశాజనకంగా ఉన్నా పట్టువదలకుండా పూర్తయ్యేదాకా వీటిని ప్రచురించారు. వారికి ధన్యవాదాలు.

 

మీ మాటలు

 1. చందు says:

  వేశ్యల గురించి మాట్లాడడమే కాదు…వారి గురించి ఆలోచించడమే పరమ పాపంగా అపచారంగా భావించేవారు ఒకప్పుడు. ఇప్పటికీ మన సమాజం (కనీసం ఆలోచన రీత్యా…) మారలేదని మీ వెలివాడల…కొచ్చిన స్పందనను బట్టి అర్థం చేసుకోవాలి.
  నేను ఒకటి రెండు సార్లు..ఇవి అవసరమా అని అడిగాను. మీరు మీ వివరణ ఇచ్చారు.
  మొత్తానికి మొదలుపెట్టిన పని ఆపకుండా పూర్తి చేశారు…..మీకు అభినందనలు.
  ఇక స్పందన నిరాశ కలిగించడం గురించి…..ముందుగా నేను చెప్పినట్లు ఇక్కడ స్పందిస్తే ఎవరేమనుకుంటారో అని స్పందించకపోవచ్చు. అంతే…మరో మంచి పని మొదలు పెట్టండి రావుగారూ….

 2. buchi reddy gangula says:

  వేశ్య వృత్తి —వేశ్యలు ఉంటె తప్పు ఏమిటి ??
  SEX.. స్వంత వి శాయెం
  NO- అన్నపుడు సెక్స్ తీసుకోవడం తప్పు — నేరం —కాని
  అడ — మగ మధ్య — yes..interest.. ఉన్నపుడు — సమాజానికి — దేవునికి ఎందుకు లేని పోనీ
  బాదర బంది (just.like..beef..తింటే తప్పు ఏమిటి )
  తాగుడు — తినడం — సెక్స్ — మతం —
  యివి స్వంత విష యాలు

  జియ్యెం గారు ఆవు కు గడ్డి తినిపిస్తూ పేస్ బుక్ లో — ఉపదేశాలు యిచ్చినంతమాత్రాన
  ఆవు పవిత్ర మయినది అని నమ్మాలా –జియ్యెం గారు కూడా రాజకీయ నాయకుడే
  usa.. లో జియ్యెం గారు యింటికొచ్చి — పూజ చేస్తే పది వేల dollors…వారు అ యింట్లో అడుగులు
  పెట్టినందుకు ఫీజు ??? KCR.. గారి మూడు రోజుల యాగం తో తెలంగాణా — బంగారు తెలంగాణా గా మారి పోదు —-అంతా రాజకీయ నాటకాలు
  కొన్ని దేశాలో — వ్యబిచారం వేశ్యల వ్రుత్త్హి —-తప్పు ఏమిటి — ఎవరికి ఎందుకు అ గోకుడు ??
  ***************************************************************************************************
  buchi.reddy.gangula..

 3. నీహారిక says:

  బస్ స్టాండ్ లలోనూ, విమానాశ్రయాలలోనూ, పబ్లిక్ టాయిలెట్ల దగ్గరా శృంగార చిత్రాలు పెట్టుకుని చూసుకోవచ్చు కదా ప్రత్యేకంగా ఆలయాలలోనే శృంగార శిల్పాలు దేనికి ? అప్పట్లో బ్రాహ్మణులు ఆ చిత్రాలను ఎలా అనుమతించారు ?

 4. నీహారిక says:

  కుల స్త్రీల శీలం కాపాడు కోవడానికి ఈ వ్యవస్థ అవసరమని వాళ్ళు నమ్మారు.

  కులపురుషుల శీలం కాపాడుకోవడానికి ఎటువంటి వ్యవస్థ అవసరమో తెలుపగలరా ?

మీ మాటలు

*