కలాలన్నీ కలిసి నడిస్తే…

 

 

-వి . శాంతి ప్రబోధ

అక్టోబర్ 25 వతేదీ
మధ్యాహ్న సమయం
సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని తెలంగాణా ప్రజా సంస్కృతిక కేంద్రం హాలు.
రచయితలూ , కవులూ , సాహిత్యకారులూ, సాహితీ సంఘాల ప్రతినిధులు, పత్రికా సంపాదకులూ ఒకొక్కరూ అక్కడ చేరారు. ఒకరు కాదు ఇద్దరు కాదు వందల మంది అయ్యారు.   విభిన్న నేపథ్యాలు, వివిధ అస్తిత్వాలు, వర్గాలకు, సంస్థలకు చెందిన  సాహితీ సాంస్కృతిక సృజనశీలురు  ఒకే  చోట చేరిన అపూర్వ సన్నివేశం అది. ఈ సందర్భంలో అంతా కలసి కలబోసుకున్న ఆలోచనల విషయం ఒకటే.
ప్రస్తుత సమాజంలో పెచ్చరిల్లి పోతున్న మతతత్వవాదం, అందులోంచి మొలకెత్తి నాటుకుపోతున్న విషబీజాలు,  నియంతృత్వ ధోరణులు, హింస మర్రి ఊడల్లా విస్తరిస్తూ  సామాన్య ప్రజలనుండి రచయితలు , కళాకారులు , మేధావులు అందరినీ తన కబంధహస్తాల్లో బందీ చేయాలని చూడడం, లేదంటే నామరూపాలు లేకుండా చేయడం జరుగుతోంది. పరమత సహనం నశించి మతమౌడ్యం వెర్రితలలు వేస్తున్న తరుణంలో ప్రజాస్వామ్య విలువలు మంటకలిసి లౌకిక ప్రజాతంత్ర వ్యవస్థకు ముప్పు వాటిల్లుతున్న పరిస్థితులు కలిగిస్తున్న  ఆందోళన అందరినీ ఒక దగ్గర చేర్చాయి. అందుకు  “వర్తమాన సామాజిక సంఘర్షణలు- రచయితల బాధ్యత” అన్న అంశంతో ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక నిర్వహించిన చర్చాగోష్టి దోహదం చేసింది.వివిధ సంఘాలుగా, సమూహాలుగా వ్యక్తులుగా విడివడి ఉన్న సృజన కారులు, సాహితీవేత్తలు ఒకటవ్వాలన్న ప్రయత్నం ఎనబయ్యో దశకంలో కొంత జరిగింది.
మారిన ఆనాటి పరిస్తితులతో సద్దుమణిగింది .  తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో. విభిన్న నేపథ్యాలతో,  అస్తిత్వాలలోని సృజన శీలురు, కలం యోధులు ఒక్కటవ్వాల్సిన  అవసరం ఇప్పుడు ఏర్పడింది.  అందుక్కారణం ఇప్పటివరకూ  ప్రజాస్వామిక, లౌకికవాదుల మౌనమే. అలసత్వమే అని చెప్పక తప్పదు.  మన శత్రువు చాపకింద నీరులా విస్తరిస్తూ పోతున్నా చూసి చూడనట్లు ఉండడం వల్లే  నేడీ దుస్థితి.  శత్రువు అది అవకాశంగా తీసుకుని పెచ్చరిల్లిపోవడం, ఆధిపత్య ప్రదర్శనలు చేయడం, అహంకారంతో  తన భావజాలాన్నిప్రజలపై  బలవంతంగా రుద్దాలన్న ప్రయత్నం చేస్తున్నాడు.

ఒకప్పుడు దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా సమాజం అంచులలో ఉన్నవర్గాలపైన, మహిళలపైన  దాడులు జరిగేవి. ఇప్పుడు వారితోపాటు మైనారిటిలపైనా దాడులు పెరిగిపోయాయి.  వారి ఆహారం, అబిరుచులపై నియంత్రణ మొదలైంది. వ్యక్తి స్వేచ్చ స్వాతంత్ర్యాలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. అది అక్షీకరించే  కలంయోధులపై దాడులు ఒక పథకం ప్రకారం జరిగిపోతున్నాయి. పెరుమాళ్ మురుగన్ పై దాడి,  కల్బుర్గి హత్య, దాద్రి సంఘటన వంటివి ముందు ముందు జరగబోయే అనర్ధాలకి  మచ్చు తునకలు మాత్రమే.   మనం మౌనం వీడక పొతే , నిరసన తెలపక పొతే, శత్రువు పై యుద్ధం ప్రకటించక పొతే  పరిస్తితి మరింత విషమిస్తుంది. ఈ నేపథ్యంలోనే హిందూత్వ ఛాందస వాదానికి, సంకుచిత్వానికి, అసహనానికి, ఉన్మాదానికి ప్రజాస్వామ్యం బలి అవుతుంటే చూడలేని ప్రజాస్వామిక వాదులు ప్రగతి కాముకులు ప్రభుత్వం ఇచ్చిన అవార్డులను నిరసనగా తిరిగి ఇవ్వడం మొదలైంది.  అది ఒక నిరసన రూపం మాత్రమే.

అంతకు మించి మరెన్నోవీలయినన్ని  మార్గాలలో మన నిరసనని తెలపాల్సిన అవసరం ఉందని సాహితీప్రపంచం అభిప్రాయపడింది.అసలు ఈ సమాజంలో ఏం జరుగుతోందో, రచయితలు అవార్డులు ఎందుకు తిరిగి ఇస్తున్నారో నేటి యువతకు తెలియని అయోమయ స్థితిలో ఉన్నారనీ,  వాస్తవ పరిస్థితిని వివరిస్తూ భవిష్యత్తులో జరగబోయే విపత్తు గురించి, ప్రజాస్వామిక విలువల వినాశనం గురించీ, విధ్వంసం గురించీ తెల్పుతూ యువతరంలోకి నవతరంలోకి వెళ్ళాలి.  లౌకిక భావజాల వ్యాప్తి విస్తృతంగా  జరగాలి. ఆదిశగా ప్రచారం జరగాలి.  విస్తృతంగా రచనలు రావాలి.  ఎవరికి వారుగా ఉన్న వ్యక్తులపై, సంస్థలపై శత్రువు దాడి చేయడం సులువు.   కాబట్టి సంఘటితంగా ఎదుర్కోవాలని, విశాల ఐక్యవేదిక ఏర్పాటు చేయడం అవసరం అని ఈ చర్చావేదికలో పిలుపునిచ్చారు వక్తలు. ఒక వైపు విధ్వంసం పెద్ద  ఎత్తున జరిగిపోతోంది. దాన్ని నిలువరిస్తూ నమ్ముకున్న విలువల్ని కాపాడుకోవడానికి మనం నిర్మాణాత్మకంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.  దాడులు ఎక్కువగా మహిళలపై జరుగుతున్నాయనీ వాటిని ఎదుర్కొంటూ నూతన సంస్కృతీ నిర్మాణం జరగాలనీ, వాదాలను , విభేదాలను పక్కన  పెట్టి ఒక్క తాటిపై ముందుకు సాగాలనీ అభిలషించారు వక్తలు.

సమాజంలో పెరిగిపోతున్న అసహనం , మత  దురహంకారం, నియంతృత్వం  అసలు సమస్యని తప్పుదారి పట్టించడం జరుగుతోంది. దేశాన్ని అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టివేస్తోంది.   ప్రగతిశీల శక్తుల పై ప్రభుత్వ అనుకూల  బృందాలు దాడులు చేయడం , .ఏకీభవించని వాడి  పీక నొక్కేయడం వ్యక్తి స్వేచ్చని హరించడం సాధారణం అయింది . మతం వ్యక్తిగతం అన్న స్థితి మారింది. దాన్ని  ప్రభుత్వం స్వీకరించింది, పండుగలు పబ్బాలు నిర్వహిస్తోంది.  అందుకు ప్రజా ధనం విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ మతాన్ని వ్యవస్థాగతం చేస్తోంది. మత దాష్టీకం కనుసన్నల్లోకి వెళ్ళిన రాజ్యం  వ్యక్తిగత ఇష్టాయిస్టాల్లోకి చొచ్చుకొచ్చి లౌకిక శక్తులపై దాడులకు పాల్పడుతూ భయబ్రాంతులను చేస్తోంది, మానవహక్కులను హరించివేస్తోందని అభిప్రాయపడ్డారు. సమాజాన్ని అంధకారంలోకి నెట్టివేసే ఇలాంటి ధోరణుల్ని రచయితలూ, కవులూ , సాహితీవేత్తలు , సృజనకారులు తీవ్రంగా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంలో జరిగిన  చర్చలో కార్యాచరణకు వచ్చిన నిరసన రూపాలు ఇవి:

* భిన్న నేపథ్యాల్లోని అన్ని అస్తిత్వ ఉద్యమాలు కలసి కట్టుగా  శత్రువుని ఎదుర్కోవడం

*  మౌనం వీడి కలాలకు , గళాలకు పదును పెట్టడం.
* హిందూ పాసిజానికి వ్యతిరేకంగా విస్తృతంగా రచనలు చేయడం.
* లౌకిక వాద భావ ప్రచారం చేయడం
* కళాశాల స్థాయిలో లౌకిక వాద భావ ప్రసారం, ప్రచారం జరిగే .కార్యక్రమాలు చేపట్టడం

*  రచయితల మార్చ్ పెద్ద ఎత్తున హైదరాబాద్ లో జరపడం

*నిరసన ప్రదర్శనలు , రౌండ్ టేబుల్ సమావేశాలు , చర్చా గోష్టులు , సభలు జరపడం
* జాతీయ స్థాయిలో రచయితలంతా ఒక తాటిపైకి రావాల్సిన అవసరం ఉంది
*  నిరసన తెలపడానికి వివిధ రకాల టూల్స్  ఎంపిక చేసుకోవడం
* నిరసన కార్యక్రమాలు ఒక ఉద్యమంలా చేయడం
* సోషల్ మీడియాని లౌకిక వాద భావప్రసారానికి సాధనంగా వాడుకోవడం
* చిన్న చిన్న బుక్లెట్స్ వేయడం

* కరపత్రాలు పంచడం

* వివిధ జానపద  కళారూపాల ద్వారా లౌకిక భావ వ్యాప్తితో పాటు వాస్తవ పరిస్తితుల పట్ల అవగాహన కలిగించడం
* సామూహిక స్వరం వినిపించడం
* రచయితల డిక్లరేషన్ ప్రకటించడం
* జిల్లాలలో , పట్టణాలలో నిరసన కార్యక్రమాలు జరపడం
* భావప్రకటన స్వేచ్చ కాపాడుకోవడం
* మత కలహాలు జరిగే ప్రాంతాల్లో , గ్రామాల్లో లౌకిక వాద ప్రచారం జరపడం
* ట్రేడ్ యూనియన్ ల్లోకి , విద్యార్థులలోకి , ప్రజల్లోకి వెళ్ళడం
* జాయింట్ ఆక్షన్ కమిటీ ఏర్పాటు చేయడం
* ప్రజల ఆహారపు అలవాట్లని శాసించదాన్ని ధిక్కరించడం
* వీధుల్లోకి వచ్చి నిరసన తెలపడం
* ఖండనలు , ప్రకటనలకి మాత్రమె పరిమితం కాకుండా ప్రత్యక్ష ప్రణాళిక ఏర్పాటుచేసుకోవడం
* సంతకాల సేకరణ రూపంలో నిరసన తెలపడం
* రచయితల భద్రత కోరుతూ ముందే పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేయడం

రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కాపాడుకుంటూ కార్యక్రమం ముందుకు తీసుకువెళ్ళడం కోసం         ” లౌకిక, ప్రజాస్వామిక సాహితీ సాంస్కృతిక వేదిక” ఏర్పాటైంది.  ఈ వేదిక తరపున కొండవీటి సత్యవతి, యాకూబ్ , బమ్మిడి జగదీశ్వ రావు, పసునూరి రవీందర్ కన్వీనర్లు గా ఒక కమిటీ ఏర్పాటయింది.  ఆ కమిటీ లో  వీరితో పాటు ఉష. s. డానీ, స్కై బాబా , అరుణోదయ విమల , G. S. రామ్మోహన్ , కాత్యాయనీ విద్మహే , శివారెడ్డి , తెలకపల్లి రవి , రెహనా, రివేరా  సభ్యులుగా ఉన్నారు. ఈ బృందం భవిష్యత్ కార్యాచరణ రూపకల్పన చేసి అమలు చేస్తుంది.

దాదాపు 200 వందల మంది పైగా  కలం యోధులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో  ప్రో . హారగోపాల్ , వరవరరావు , తెలకపల్లి రవి , అల్లం నారాయణ , కె. శ్రీనివాస్ , నందిని సిధారెడ్డి , రమా మెల్కోటే,  వీణ శత్రుఘ్న, విమల, అనిల్ అట్లూరి , నాళేశ్వరం శంకరం ,  N. వేణుగోపాల్ , కుప్పిలి పద్మ ,  వాసిరెడ్డి నవీన్ , కాకరాల , వేంపల్లి షరీఫ్ , కత్తి మహేష్ , దేవి , జ్వలిత , తిరునగరు దేవకీదేవి, రమాసుందరి, అరణ్య కృష్ణ, సుమిత్ర , ఇంద్రవెల్లి రమేష్ , శిలాలోలిత, తారకేశ్వర్ , రామారావు  , కృష్ణుడు , వినోదిని , యలవర్తి  రాజేంద్రప్రసాద్ , అలీ సిద్దికి , వర్మ , వనజ .C,  గోపరాజు సుధ, రజని , ధనలక్ష్మి ,రాజ్యలక్ష్మి , కందుకూరి రాము , ప్రరవే సభ్యులు కాత్యాయనీ విద్మహే , మల్లీశ్వరి , శాంతిప్రబోధ , భండారు విజయ , మెర్సీ మార్గరెట్ , పి. రాజ్యలక్ష్మి, కొండేపూడి నిర్మల ,తాయమ్మ కరుణ , కవిని ఆలూరి , కొమర్రాజు రామలక్ష్మి , బండారి సుజాత , సమతా రోష్ని , శివలక్ష్మి, , హేమలలిత, లక్ష్మి సుహాసిని  తదితరులు పాల్గొన్నారు .

ఈ కార్యక్రమం తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం సహకారంతో జరిగింది

వి. శాంతి ప్రబోధ , భండారు విజయ

ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక , తెలంగాణ

మీ మాటలు

 1. buchireddy gangula says:

  యీ వ్యవస్థలో —గళం ఎత్తడం —తిరుగ బడటం — నిరసన తెలియచేయడం అవసరం –
  మంచి మార్గం —
  ajenda.. బాగుంది —
  కలా ల న్ని — కలిసి నడువాలి —-కాని మన తెలుగు క లాల లో
  గ్రూప్ లున్నాయి — రాజకీయాలు ఉన్నాయి ( రాజకీయ పార్టీ ల లాగా )
  అన్ని పక్కకు పెట్టి — కలిసి కట్టుగా నడుస్తారని ఆశిస్తూ — నమ్ముతూ ——
  ———————————————————————————–
  buchi.reddy.gangula.

 2. వనజ తాతినేని says:

  సామాజిక బాధ్యతతో రచయితలందరూ ఏకతాటిపై నిలబడి తమ గళాన్ని వినిపించడం చాలా బావుంది. బుచ్చిరెడ్డి గంగుల గారి మాట తో నేను ఏకీభవిస్తున్నాను.

 3. ———-
  “వివిధ సంఘాలుగా, సమూహాలుగా వ్యక్తులుగా విడివడి ఉన్న సృజన కారులు, సాహితీవేత్తలు ఒకటవ్వాలన్న ప్రయత్నం ఎనబయ్యో దశకంలో కొంత జరిగింది.
  మారిన ఆనాటి పరిస్తితులతో సద్దుమణిగింది”.
  ———–
  అప్పుడేమి జరిగిందో వివరంచండి. ఇప్పుడు మళ్లీ అలా జరగకుండా ఏం చెయ్యాలో కూడా తెలియజెయ్యండి.

  – శశాంక

 4. ప్రరవే ప్రయత్నం మరీ మరీ అభినందనీయమే. బుచ్చిరెడ్డి గంగుల గారి మాట తో నేను ఏకీభవిస్తున్నాను అని మీరే అన్నారు. ఈ గ్రూపుల వల్లనే వచ్చింది చిక్కు., బయటి రాష్ట్రాలతో పోల్చితే ‘ఊదు కాలది పీరి లేవదీ’ అనే పరిస్తితి ఉందిక్కడ. ఆ రోజు వచ్చిన వాళ్ళంతా మహామహులే. మరి నాకెందుకో ఇలా అనిపించింది.

  సేద తీరి రాక తప్పదా అన్నట్లు
  వచ్చిన పౌర సమాజ ప్రవచన కర్తలు
  వేసిన క్యాసెట్లే మళ్లీ మళ్ళీ వేసి
  టాటా బై బై అంటూ జారుకున్నారు

  ‘ఇలాగే ఉంటుంది .వారినుండి ఇంతకన్నా ఏమి ఆశించగలం’ అంటే ఒకే ..

 5. //నాకూ… ఓ అవార్డును ఇప్పించండి//

  కలాలు… రకరకాల కలాలు
  నీలం.. ఎరుపు.. నలుపు.. పచ్చ
  మిత్రులారా నేను మాట్లాడుతున్నది
  కులాలను గూర్చి కాదు
  రంగు రంగుల సిరా కలాలను గూర్చి
  తోటి కలాల హత్యలకు నిరసనగా
  కొన్ని కలాలు
  తమ అవయవ సమానమైన
  అవార్డులను సైతం
  ఏలినవారికి
  అలవోకగా తిరిగిచ్చేస్తున్నాయి
  నాటిన విత్తుకి… చేతికందిన సొత్తుకి
  పొత్తు కుదరక
  పురుగులమందు తాగి
  పంటచేలు మరణించినప్పుడు
  నిప్పులు చెరిగిన కత్తులై
  కదిలిన కలాలు
  రెండు చేతులే తప్ప…
  మరే ఆదారం లేని ఆకలిగిన్నెల్లోకి
  అకారణంగా నెత్తురొలికినప్పుడు
  సిరాచుక్కలను కన్నీటిచుక్కలగా
  మలచిన కలాలు
  రాత్రనక… పగలనక
  రాసి రాసి అలసిన కలాలు
  చివరికి…
  శాలువా కౌగిలిలో సేదతీరాయి
  అవార్డు ప్రదాతల చేతులుకున్న
  రక్తపు మరకలను మరిచాయి
  తీసుకోవడం తప్పుకాదని
  నేడు… తిరిగివ్వడమూ
  గొప్పేనని తెలుసుకున్నాయి
  కొన్ని కలాలు…
  అదే బాటలో కదులుతున్నాయి
  మరికొన్ని…
  అడకత్తెరలో పోకచెక్కలై ఆలోచిస్తున్నాయి
  విజ్ఞులారా… వినండి
  ఈ కలాల చర్యలను ఖండిస్తూ
  నిరసనగా తిరిగిచ్చేయడానికి
  నాకూ… ఓ అవార్డును ఇప్పించండి

  * * *

 6. delhi subrahmanyam says:

  శాంతి గారూ డిల్లి నుంచి నేనూ కొంతమంది సాహితీ మిత్రులమూ మీతో ఉంటామని మీ కార్యక్రమం ముందు తెలిపాను. అది మళ్ళీ ఇక్కడ ద్రువీకరిస్ర్హున్నాను.

 7. Chandrika says:

  “ పెరుమాళ్ మురుగన్ పై దాడి, కల్బుర్గి హత్య, దాద్రి సంఘటన వంటివి ముందు ముందు జరగబోయే అనర్ధాలకి మచ్చు తునకలు మాత్రమే.”- అంటే ఇది వరకు ఉన్న ప్రభుత్వ హయాం( 60 ఏళ్ళు) లో ఏమి దుర్ఘటనలు జరగలేదా ? 26/11 పిట్టల్ని కాల్చినట్లు మనుష్యులిని కాల్చినపుడు ప్రభుత్వం ఏ రక్షణ కల్పించింది ఏ హామీ ఇచ్చింది ఒక సామాన్య మానవుడికి? అప్పుడు ఏమయిపోయారు మీ అందరూ ?ఇటలీ లో పుట్టిన వనిత భారత దేశం మీద పదేళ్ళు పెత్తనం చెలాయించింది కదా?అప్పుడు ఏమయిపోయారు మీ అందరూ ?కార్గిల్ యుద్ధం లో పోయిన అధర్మంగా చంపబడ్డ సౌరభ్ కాలియా గారి తల్లితండ్రులకి ఏ ప్రభుత్వం న్యాయం జరిపించలేదు. అతను, అతని తోటి వారంతా మీలాంటి భారతీయుల కోసమే కదా ప్రాణాలు అర్పించింది?అప్పుడు ఏమయిపోయారు మీ అందరూ ? కాశ్మీరీ పండిట్ లు వాళ్ళ రాష్ట్రం లోనే వాళ్ళే refugees గా మారారు కదా ? అప్పుడు ఏమయిపోయారు మీ అందరూ ?అంటే ఒక మైనారిటీ మీద నో, ఒక రచయిత మీద నో దాడి జరిగితేనే మీరు హింస గా భావిస్తున్నారా? అన్ని వేళల మనిషి ఒకే తీరు లో ఒకేలా ఉండాలి కదా? అందునా రచయితలు!!
  “ప్రజల ఆహారపు అలవాట్లని శాసించదాన్ని ధిక్కరించడం”- నిజమే ఏ మాంసం అలవాటు పడ్డ వారు అది తినవచ్చు. పోషకాహారం దొరకట్లేదని కదా అంటున్నారు. సరి అయిన పోషకాహారం దొరక్కపోతే మరి నర మాంసం అలవాటు పడేవారు కూడా తయారవుతారు. అపుడు నర మాంసం కూడా తినవచ్చు. ఏ పోషకాహారం అలవాటు పడలేని వారు తులసి తీర్థం తాగ వచ్చు. స్వంతంత్ర్య భారతి కదా !!
  “అందుకు ప్రజా ధనం విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ మతాన్ని వ్యవస్థాగతం చేస్తోంది”- నిజమే!! అన్ని మతాలకి వర్తించేలా చేస్తే బావుంటుంది. పుష్కరాలకి budget లే కాదు తీర్థ యాత్రలు చేయడానికి సబ్సిడీలు కూడా ఆపేయాలి.
  ఎందుకండీ ఈ నిరసనలు ? ఎవరికి నచ్చిన పోరాటం వాళ్ళు చేసుకోడం. తెలిసీ తెలియని మనుషుల్ని రెచ్చగొట్టడం !! మతం ముఖ్యం కాదు మనకి అందరం ఒకటే అన్నముక్క మాత్రం ఒక్కరూ చెప్పరు.

 8. buchi reddy gangula says:

  దేశాన్ని — ఒక్క family.. ఎక్కువ కాలం పాలించింది —మల్లి Rahul మా రాబోయే ప్రధాని అంటూ
  రాగాలు వినిపిస్తున్నాయి —దేశం విడిపోవడానికి కారణం — ప్లస్ యి వారసత్వ పాలన కు కారణం
  Nehru..గారే
  యి రోజు 2 తెలుగు రాష్ట్రాలలో రాజులు పాలిస్తున్నారు —
  జనం — కొలమానం –అదే మన ప్రజాసామ్యెం —-
  అ రోజు జిన్నా గారు ప్రధాని అయితే తప్పు ఏముం de..
  జియ్యెం gaaru– పితాది పతులు —- రోజు దేవుని తో మాట్లాడి — మనలో లేని పోనీ
  నమ్మకాలను — కలిగిస్తూ —
  స్వర్గాని కి visa..జియ్యెం గారు డబ్బులు యిస్తే యిప్పుడే యివ్వగలరు — అది మన
  జనం తిరు —-
  మతమార్పిడి తప్పు
  బీఫ్ తింటే నేరం — హత్యలు
  ముస్లిమ్స్ అంటే పరాయి వాళ్ళు — క్ష తరువులు
  దళితులు — అంటరాని వాళ్ళు —పోలిసుబల్గం — (u.p.) అడ -మగ ను నగ్నం గా
  నిలబెట్టి విచారించడం —?? ఉన్నోలకో న్యాయెం —- ఉన్నోల కు ఒక న్యాయెం —–
  లేనోళ్ళ కు ఒక న్యాయెం ??
  ఆర్థిక అసమానతలు
  సమానత్వం
  సామాజిక న్యాయెం
  ప్రజాసామ్యెం ——– దేశం లో ఉందా Chandrika .garu..
  మనిషి బతకడానికి కులం –మతం — అవసరామా

  యీ క లాల నిరసన అవసరం
  ————————————

  buchi.reddy.gangula.

  • Chandrika says:

   బుచ్చి రెడ్డి గంగుల గారు!! నేను పైన అడిగిన ప్రశ్నలకి మీ మాటలకి ఏమన్నా పొంతన ఉందా ?

  • సుజాత says:

   బుచ్చి రెడ్డి అను తింగరి బుచ్చి రెడ్డి

   ముందు తమరు ఎవరి దగ్గిర అయినా తెలుగు వాక్యం నేర్చుకొండయ్యా! ఎందుకు ఈ తుంట వాక్యాలతో మా ప్రాణాలు తోడేస్తున్నారు!? మీరేదో సత్యవ్రతులు అయినట్టు ఎందుకీ పిచ్చి కబుర్లు? తీరిక ఎక్కువయితే తెలుగు టీవీ చూసుకోండి.

   అయ్యా, ఎడిటర్ గారూ, మీరు మంచి మంచి ఆలోచనతో నిండుకున్న వ్యాఖ్యలకే కత్తిరింపు వేస్తారు కదా, ఈ తింగరి బుచ్చి పిచ్చి రెడ్డి నోటి దూలని మాత్రం ఎందుకు భరిస్తారో అర్ధం కాదు.

 9. సాహితి says:

  Chandrika garu.
  ప్రజాస్వామ్యమంటే మీ బోటి వారికి తెలిసే అవకాసం లేదు , మానవత్వం అంటే అర్ధం కాదు, కస్టాలు అంటే ఎరగనైనా ఎరిగినట్లు లేరు, అన్ని సుఖాలే అనుభవించే వారికి ఇన్ని తెలియాడానికి అవకాశమే లేదు, సందేహాలు రావడం లో అనుచితం కాదేమో గాని, – అయితే ఈమాత్రం నిరసనలు లేక పోతే నాజీ జర్మనీ, పాసిస్టు ఇటలీలా, దేశంలో పునరభివృఅద్ది చెందాలా? సామ్యాలు తెచ్చు కొని దభాయంచడంలో ముందంజలో ఉంటారు మీ పరివారం! సామ్యాలు తెచ్చినంత మాత్రాన పులి ఎప్పుడు మేక కాలేదు గదా? సామ్యాలు తెచ్చినంత మాత్రాన వాటిని, ఆ ప్రభత్వాలని సమర్దించినట్లా? – అందుకే గుడ్డిలో మెల్ల మేలు అన్న సామెతే వచ్చింది!

  • సాహితి గారు!! నా మానవత్వం ఏంటో నేను అడిగిన కొన్ని ప్రశ్నలలోనే ఉంది. దాన్ని దభాయించడం అంటారా? చూద్దాం ‘intellectuals’ అనబడే వీరు నా ప్రశ్నలకి ఏ సమాధానం ఇస్తారో ?నాకు కష్టపడటం అంటే ఏంటో తెలీక పోవచ్చు కానీ నెత్తి మీద రెండడుగుల మంచు కురిసినా, పిడుగులు పడ్డా నేను వారానికి 40 గంటలు పని చేయకపోతే నోట్లోకి ఐదువేళ్ళు వెళ్ళవనీ, నిలువ నీడ ఉండదని, కనీసం జ్వరం వస్తే కూడా ఆసుపత్రికి వెళ్ళలేనని తెల్సు. మీకు సమాధానం ఇవ్వటానికే నాకింత సమయం పట్టింది మరి!! ఇంత బాగా నిరసనలు చేయడానికి ఎక్కడనుంచి సమయం వస్తుందో మరి వీరికి. దేశాభివృద్ధి చెందాలంటే నిరసనలు చేయడం కాదు. నిజంగా దేశాభివృద్ధి చేసేవారు ఉన్నారు. భారత దేశం లోనే ఉన్నారు. అహర్నిశలు మళ్లీ గిరిజనుల కోసం పని చేస్తారు వారు. మన లాంటి సామాన్య మానవులే !! వాళ్ళ వివరాలు ఇవ్వమంటే ఇస్తాను శిష్యరికం చేయండి. ఎవర్నో ఒకర్ని దుమ్మెత్తి పోయటం, నిరసనలు చేయడం, అమాయక ప్రజల కష్టాన్ని బలి చేయటం ఇది కాదు మనకి కావలసినవి.

 10. Chandrika says:

  సాహితి గారు!! ఒక విషయం మరిచాను. “కస్టాలు అంటే ఎరగనైనా ఎరిగినట్లు లేరు, అన్ని సుఖాలే అనుభవించే వారికి” అని వ్రాసారు. రాజీవ్ గాంధీ గారి లాగా. రాహుల్ గాంధీ గారి లాగా బంగారు చెంచా నోట్లో పెట్టుకుని పుట్ట లేదు. డూన్ స్కూల్ కి వెళ్ళలేదు. భారత దేశం లో పుట్టి పెరిగాను. దాన్ని బట్టి మీరు అర్ధం చేసుకోవాలి నాకు కష్టాలు తెలుసో లేదో!!

 11. కృష్ణ చైతన్య అల్లం says:

  చదువుకున్న వాళ్ళూ, తెలివైన వాళ్ళు కూడా మతోన్మాదంలో మునిగి మాట్లాడే మాటలు చూస్తంటే ఎక్కణ్ణించి మొదలు పెట్టాల్నో కూడా అర్ధం అయితలేదు ఈ మధ్యన. ముస్లింలకు ప్రత్యెక దేశాలు ఉండంగా, హిందువులకు ప్రత్యెక దేశం ఉంటె తప్పేంది అని అడిగేవాళ్ళు ఉన్నరంటే నమ్ముతరా? మత సామరస్యం గురించి మాట్లాడితే హిందూ వ్యతిరేకులు అని ముద్ర వేసి మాట్లాడుతున్నారు. అందరికీ అందుబాటులో ఉండడం వల్ల వయసుతో సంబంధం లేని, అవగాహన లేని కొత్త తరం కూడా తమకు తెలవకుండానే ఈ ఉన్మాదంలో భాగస్వాములుగా మారుతున్నారు. చిన్న వయసులోనే లౌకిక వాద వ్యతిరేకులుగ మారుతున్నారు.
  అజెండా బాగున్నది.
  కొన్ని సూచనలు:
  కేవలం కలాలనే కాకుండా ఎక్కువ మందిని కార్యాచరణలో భాగస్వాములుగా చేయండి.
  డైనమిక్ భాగస్వామ్యం బాగుంటుంది.సమావేశాలు అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు. కాన్ఫరెన్స్ కాల్స్ బాగా ఉపయోగపడతాయి. మెసేజింగ్ గ్రూపులు లాంటివి. ఒక సమావేశం పెట్టుకుని, కలుసుకుని, మాట్లాడుకుని చేసే పనుల్లో జరిగే ఆలస్యం ఉండదు. చిన్న చిన్న పనులు తొందరగా పూర్తవుతాయ్. అప్పటిదప్పుడు రిసాల్వ్ అవ్వాల్సినవి అయిపోతాయి.

 12. చందు - తులసి says:

  అవును క్రిష్ణ చైతన్య గారూ…మీరన్నట్లు కార్యాచరణ అధికం చేయాలి.
  రచయితల సంఘాలు సోషల్ మీడియాను విస్తృతంగా వాడాలి…
  కొత్త తరం దీన్ని బాధ్యతగా తీసుకోవాలి..

మీ మాటలు

*