ఎడతెగని జీవిత సంఘర్షణలు పెద్దింటి కథలు

IMG

-వెల్దండి శ్రీధర్

~

 

sridharకథ అనగానే అమ్మమ్మ ఆవహిస్తుంది. ఆమె చూపించే రంగుల ప్రపంచం మన ముందు పరుచుకుంటుంది. గుండె గదులకు అద్భుతాలు కొత్త పరిమళాన్ని అద్దుతాయి. ఒక్కో కథ ఒక్కో నూతన జగత్తును  చూపించి అంబరమంత సంబరాన్ని హృదయానికి పంచి వెళ్తుంది. రాజులు, రాణులు, మంత్రులు, భూతాలు, దయ్యాలు, మంత్రగాళ్లు, సామాన్యులు…ఇలా ఎందరెందరో గుర్తుకు వచ్చి ఆయా వ్యక్తిత్వాలకు మనల్ని మనం ఆకురాయిలా రాసుకుంటాము. లౌకిక కథలకి వచ్చినపుడు జీవితం మీద నిలబడి మనిషి చుట్టూ పరుచుకున్న నెలవంకల్నీ, బతుకు వంకల్నీ చూపెట్టిన వారు ఎంతో మంది. ఆ వరుసలో పెద్దింటి అశోక్ కుమార్ కథ చదవడమంటే ఒక చేత కన్నీటి కుండను, మరో చేత గాయాలకు పూసే ‘నల్లాలం’ పసరును పట్టుకోవడమే. తెలుగు కథా సాహిత్యంలో 1990ల నుండి తెలంగాణ జీవితాన్ని రికార్డు చేస్తూ చాలా ఆర్ద్రమైన కథల్ని రాస్తూ అనేక అవార్డుల్ని పొందుతున్న కథా రచయిత పెద్దింటి అశోక్ కుమార్. ఈయన కలం నుండి వెలువడిన సరికొత్త కథల సంపుటి ‘జుమ్మేకి రాత్ మే’.

సాధారణంగా పెద్దింటి అశోక్ కుమార్ కథంటే ప్రపంచీకరణ విధ్వంసం, కూలిపోయిన కులవృత్తులు, వలస, ఎడారి మంటలు, విచ్ఛిన్నమవుతున్న మానవ సంబంధాలు, కుదేలయిపోయిన వ్యవసాయం.. ఇవే కనిపిస్తాయి.  ఈ కథా సంపుటి కూడా అందుకు మినహాయింపు కాదు. దీన్నిండా కూడా పాఠకుడిని ఆపాదమస్తకం కదిలించి, రగిలించి, ఊగించే కథలే వున్నాయి. ఒక్కో  కథ ఒక్కో జీవిత శకలం. ఒక్కో శిథిల మానవ ప్రపంచం. శిల్ప రీత్యీ కూడా ఒక్కోటి ఒక్కో కొత్త శిల్పంలో నడిచిన కథలు. కథలన్నీ చదివి పుస్తకం మూసేసిన తరువాత ఈ కథలు నిజంగా మనకు అర్థం కావడం ప్రారంభమవుతాయి. సారాంశం మనసుకెక్కుతుంది, వెంటాడి వేదిస్తుంది. అంతః చేతనలోకి వెళ్లి అలజడి చేస్తుంది.  ప్రతి కథ ఒక విప్లవాన్ని, ఒక తిరుగుబాటును నూరిపోస్తాయి. ఇందులోని 18 కథల్లో మూడు కథలు తెలంగాణ ఉద్యమ నేపథ్యంగా నడిచిన  కథలు, రెండు ఎడారి దేశాల కథా వస్తువుతో రాసినవి, మరో రెండు విద్యా వ్యవస్థను ప్రశ్నించే కథలు  కనిపిస్తాయి. మిగతావి విభిన్న కథాంశాలతో కూడుకున్నవి.

పంచతంత్రంలోని కథలన్నీ పక్షుల, జంతువుల చుట్టూ తిరిగే కథలే అయినా అవి వాటికి సంబంధించిన కథలు కాదనేది స్పష్టం. మానవ ప్రవృత్తుల్ని, మానసిక చాంచల్యాన్ని చిత్రించిన కథలవి. అలాగే ఈ కథా సంపుటిలోని మొదటి కథ ‘అనగనగా ఓ కోడిపెట్ట’ కథంతా కోడిపెట్ట దృష్టికోణం నుంచి నడిచినా సారాంశంలో మనిషిని ఉద్దేశించిన కథ. జీవితం ఎంత సంక్లిష్టమో, ఎంత దుర్భరమో, మరెంత భయానకమో ధ్వన్యాత్మకంగా చెప్పే కథ. నిజానికి పైపైన చూస్తే కోడిపెట్ట పిల్లల్ని పెట్టడం, వాటిని కంటికి రెప్పలా కాపాడడం, వాటికి జీవితాన్నెలా ఎదుర్కోవాలో నేర్పించటం, యౌవనం వచ్చిన తరువాత తల్లికోడి నుండి ఎడబాసి స్వతంత్రంగా జీవించటం… ఈ జీవన వరుస క్రమం కనిపిస్తుంది. కానీ ఇవన్నీ మనిషికి బోధించిన జీవన సూత్రాలు. నైపుణ్యాలు. సంఘంలో మనిషిగా నిలదొక్కుకొని జీవితాన్ని ఎలా జీవించాలో నేర్పే కథ. ఈ కోవలోదే మరో కథ ‘ఏడిండ్ల పిల్లి కూన’ కథ. తల్లి తన బిడ్డలను కాపాడుకోవడానికి ఎంతగానో తపిస్తుంది. ఎంత సాహసానికైనా ఒడిగడ్తుంది. ఎవరినైనా ఎదిరిస్తుంది. చివరికి తనను కట్టుకున్న భర్తను కూడా. అలాంటి మాతృప్రేమ, ధైర్య సాహసాలు, ప్రసూతి వైరాగ్యం, గర్భంతో ఉన్నప్పుడు తన నొప్పిని ఎవరూ పంచుకోకపోయినా పరవాలేదు కానీ కనీసం తనకు సహాయం చేసే చేతికోసం ఎదురుచూసే ఒక తల్లి ఆవేదన ఇవన్నింటి మేళవింపు ఈ కథ.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమ మలి దశను చిత్రించిన కథలు అత్యధికంగా రాసింది పెద్దింటి అశోక్ కుమారే. ఈయన రాసిన మూడు కథలు మూడు భిన్న శిల్పాలతో అలరారుతాయి. ‘యుద్ధనాదం’ కథ ప్రత్యేక తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని సమగ్రంగా చిత్రించిన కథగా చెప్పుకోవాలి. ఉద్యమ క్రమమంతా చాలా నేర్పుతో అక్షరీకరించారు రచయిత. ఉద్యమం చుట్టూ పాఠకుడిని చేయి పట్టుకొని తిప్పుకొస్తుందీ కథ. ఆత్మ బలిదానం వద్దు చేయి చేయి కలిపి పోరాడుదాం అనే స్ఫూర్తిని నింపుతూనే ఉద్యమ సెగలతో మన మనసులు రాజుకునేలా చేస్తుంది. మరో కథ ‘రణనినాదం అను 7 ఎపిసోడ్ల కథ’. తెలంగాణ ఉద్యమాన్ని ఎవరెలా వారి వారి స్వార్థ ప్రయోజనాలకు, తమ పదవులు నిలుపుకొనుటకు వుపయోగించుకుంటున్నారో ధ్వన్యాత్మకంగా విప్పి చెప్పే కథ. టీవీలో కొనసాగే రోజువారి సీరియల్ లాంటి నడకతో మొదలైన ఈ కథ చివరిదాకా ఏదో సీరియల్ కథనేమోనని భ్రమిస్తుంది. కానీ చివరికి ఇది తెలంగాణ ఉద్యమ కథ అని దాని మలుపులు, రాజకీయ నాయకుల బొంకులు, పెద్దమనుషుల ఒప్పందం అన్నీ కళ్లకు కడుతాయి. ఉద్యమ తొలి దశ నుండి ప్రతి మలుపుని ఒక ఎపిసోడుగా చెప్తూ కథకుడు చాలా ఉత్కంఠను పాటిస్తాడు. మంచి శిల్పంతో కొనసాగే కథ. మరో ఉద్యమ కథ.  ‘రేపు మాపు అను ఓ విడాకుల కథ’ ప్రత్యేక తెలంగాణ విషయాన్ని ఏండ్లుగా నానబెడుతున్న కాంగ్రెస్ పార్టీని న్యాయవాది స్థానంలో, తెలంగాణ ప్రాంతాన్ని దగా పడ్డ భార్యగా, అవశిష్ట ఆంధ్రప్రదేశ్ ను భర్త స్థానంలో నిలబెట్టి కథ నడుపుతాడు. విడాకులు ఎందుకు కావాల్నో చాలా హేతుబద్దంగా వాదిస్తుంది భార్య (తెలంగాణ). ‘‘నా భర్త (సీమాంధ్ర) చదువుకున్నోడు…చాల్ బాజిగాడు. నన్ను ఎక్కిరిచ్చుడేగాదు బానిసలెక్క చూస్తుండు అన్నది. హక్కులు, బానిసపోరాటాలు అనే పదాలే  నాకు (కాంగ్రెస్) గిట్టయి. సంసారమన్నంక సర్దుకపోవుడు తప్పదు కదా అనుకున్న. భార్యా, భర్తల మధ్య బానిస ఏంది అనుకుంటాడు న్యాయవాది.

‘సార్… ఎంత ఖర్చయిన సరే! నాకు విడాకులు కావాలె’ అన్నది.

‘ఇంత చిన్నదానికేనా…సర్దుకుపోవాలమ్మా..’ అన్న.

‘ఆత్మగౌరవం చిన్న ముచ్చటనా సార్.. పెండ్లయ్యేనాటికే ఇద్దరికి ఇద్దరేసి పిల్లలు. వాళ్లు ఎప్పుడూ కలువలేదు. వాళ్ల ఇష్టాయిష్టాలు గూడా కలువలేదు. ఎప్పుడు కొట్లాటనే’ అన్నది.

‘ఆత్మగౌరమంటే నాకు మంట. అది సోమరిపోతులు అనే మాటలని నా అభిప్రాయం’

నమ్మిన న్యాయవాది పూర్తిగా మోసం చేసినా గుండెలో గాయాల్ని దాచిపెట్టుకొని ఆమె లాయర్ దగ్గరికి వస్తూనే ఉంటుంది. చివరాఖరికి ఆ లాయర్ ‘చూడమ్మా… ఇన్నేండ్లు తండ్లాడుతున్నవ్. కోర్టుల వెంట తిరుగుతున్నవు యాష్టకు రావడం లేదా? అని ప్రశ్నిస్తాడు.

దానికి ఆమె ‘సార్.. నేను కొట్లాడుతలేను. యుద్ధం చేస్తలేను. యుద్ధం చేస్తే గెలుపోటములుంటయి. నేను విముక్తి కోసం పోరాటం చేస్తున్న. ఇందులో గెలుపే తప్ప ఓటమి ఉండది’ అంటుంది. దాని ఫలితాన్ని మనం ఇటీవలి రెండు తెలుగు రాష్ట్రాల రూపంలో చూస్తున్నాం.

భారతీయ విద్యా వ్యవస్థను ప్రశ్నించి బోనులో నిలబెట్టే కథలు ‘ములాఖత్’, ‘ప్రొగ్రెస్’. నేత కార్మికుల జీవిత విధ్వంసాన్ని చాలా బలంగా చెప్పిన కథ ‘ఎదురు చేప’. పవిత్రమైన వైద్య వృత్తిలో ప్రవేశించిన వారు సామాన్య ప్రజలను ఎంతగా పీల్చి పిప్పి చేస్తున్నారో చేప్పే కథ ‘భయంగా ఉంది’. సాఫ్ట్ వేర్ రంగంలోని భార్యా, భర్తల మధ్య చోటు చేసుకున్న కొన్ని వేల కిలోమీటర్ల దూరాన్ని, వారి మానసిక సంఘర్షణను చెప్పిన కథ ‘రెండు నదులు’. నదుల్లా కలిసిపోవాల్పిన దంపతులు, రెండు వేర్వేరు నదుల్లా ఎందుకు విడిపోతున్నారు. దగ్గరగా కంటే దూరంగా ఉన్నప్పుడే ఎందుకు సంతోషంగా ఉంటున్నారు? ఇత్యాది అనేక ప్రశ్నలను రేకెత్తించే కథ ఇది. అందరికి చెందాల్సిన భూమి, నీరు, డబ్బు ఎలా ఉన్నోని పంచన చేరుతున్నాయి?. ఎవని చేతిలో బందీలుగా మారుతున్నాయని మంచి శిల్పంతో చెప్పిన కథ ‘బంధీలు’ కథ. ఒకప్పడు ఊరునంతా చైతన్యంతో నింపిన ఎడ్లకొట్టం ఇప్పుడు ఎంత దిగజారిందో, తద్వారా ఊరెంత దిగజారిపోయిందో ఎడ్లకొట్టం కేంద్రంగా మనసును రగిలించేలా చెప్పిన గొప్ప కథ ‘మా ఎడ్లకొట్టం @ 2010’. ఒకప్పుడు ఊరులోని ఎడ్లకొట్టం అన్ని కులాలకు, ఉద్యమాలకు ముఖ్యంగా నక్సలైట్ ఉద్యమానికి కేంద్రం. ఎన్నో దళాలు అందులో మీటింగ్ పెట్టుకొని పోరుబాటకు ఉద్యుక్తమయ్యేవి. పోలీసులు దాని మీద నిగా పెట్టేవారు.  ఈ పరిస్థితిలో అమ్మేయమని ఎవరు ఎన్ని సార్లు చెప్పినా వినకుండా అందులో బడి నడుపుతాడు కథకుడు. కాలక్రమంలో ప్రభుత్వం మద్యాన్ని ఏరులా పారించి గ్రామాలను మత్తులో ముంచివేస్తోంది. ‘మత్తు ఏదైనా సరే! ఏ రూపంలో ఉన్నా.. మత్తులో ఉన్నప్పుడు మనిషి ఆలోచించలేడు. ఆలోచించనప్పుడు ప్రశ్నించలేడు. ప్రశ్నించనప్పుడు ధిక్కరించలేడు. ధిక్కరించనంత వరకు రాజ్యానికి డోకా లేదు. అందుకే మత్తులో ఉంచడానికి మందును అందుబాటులోనికి తెచ్చింది. అది చెరకు గడ్డకు గండమాల పట్టినట్టు ఊర్లను పట్టుకొని తింటుంది’ ఇప్పుడా ఎడ్లకొట్టం  మద్యం విక్రయానికి కేంద్రంగా మారి మంచి ఆదాయానికి వనరుగా మారుతుంది. కథకుని మనస్సు చివుక్కుమంటుంది. వెంటనే దాన్ని నేలమట్టం చేసి ఇప్పడు దాని అడుగున కొత్త విప్లవాలేవో పూయాలని కలలుగంటాడు. సారా వ్యాపారం వెనకగల పెద్ద వలయాన్ని మన కళ్ల ముందు నిలబెట్టే కథ ‘వలయం’. ఈ వలయంలో సారా ఉత్పత్తి దారులు, పోలీసులు, రాజకీయ నాయకులు, పెట్టుబడిదారులు అందరూ పావులేనని ఈ వలయం నుండి ఎవరూ తప్పించుకోలేరని చెప్తుందీ కథ. వ్యవసాయం గ్రామీణులకు ఎలా బలహీనతగా మారిందో చెప్పే కథలు ‘ఇగ వీడు తొవ్వకు రాడు’, ‘గ్లాసియర్’. ఇగ వీడు తొవ్వకు రాడు కథ విప్లవాన్ని నూరిపోసే కథ. వానసత్వంగా వచ్చిన వ్యవసాయం లాభసాటి కాదని కథకుడు ఎంత చెప్పినా వినకుండా ఈ వ్యవస్థ మెడలు వంచి రైతే రాజని నిరూపిస్తానని హామీ ఇచ్చే కథ. వ్యవసాయానికి దూరంగా ఉండలేని ఒక యువతి కాల క్రమంలో ఎలా మానసిక రోగిగా మారిందో విప్పి చెప్పే కథ ‘గ్లాసియర్’. చివరికి ఆ రోగికి మందేంటంటే మళ్లీ వ్యవసాయాన్ని మొదలు పెట్టడమేనని చెప్పడం పాఠకుడిని కదిలించి వేస్తుంది.

మొత్తం కథా సంపుటిలో మనిషి లోపలి ‘కార్జాలు’ కదిలే కథలు ‘పామును తరిమిన చీమలు’, ‘ప్రాణం ఖరీదు వంద ఒంటెలు’, ‘జుమ్మేకి రాత్ మే’. తమ ఊరు చుట్టూ రోజు రోజుకు మాయమవుతున్న గుట్టలను, చెట్లను, పుట్టలను  ప్రజలే చైతన్యవంతులై రక్షించుకోవాలని నాటకీయంగా చెప్పే కథ ‘పామును తరిమిన చీమలు’. ఎడారి దేశాల్లో జీవితం ఎంత దుర్భరమో, ఇక్కడ పనులు లేక, కాలం లేక వలస బాట పట్టిన యువకులు అరబ్ దేశాలకు వెళ్లి ఎలా అర్ధాంతరంగా జీవితాన్ని చాలిస్తున్నారో! గుండెను మెలితిప్పే కథ ‘ప్రాణం ఖరీదు వంద ఒంటెలు’. కథ పూర్తయ్యాక పాఠకుడు తనకు తెలియకుండానే కన్నీటి పొరల్లో మునిగిపోతాడు. మస్కట్ నుండి దుబాయికి, దుబాయి నుండి మస్కట్ కు దొంగతనంగా బోర్డర్ దాటడానికి భారతీయులు ఎలా చావు అంచుల దాకా వెళ్లి వస్తారో ఒళ్లు గగుర్పొడిచేలా కళ్లకు కట్టించిన కథ ‘జుమ్మేకి రాత్ మే’. కంకర క్రషర్ లో దాక్కొని బోర్డర్ దాటుదామని ప్రయత్నించిన వారు బోర్డర్ వద్ద గస్తీ పోలీసలు క్రషర్ మిషన్ లో ఎవరూ లేరని చెప్పినా నమ్మకుండా ఒక్కసారే క్రషర్ ను  ఆన్ చేస్తే అందులో దాక్కున్న వాడు నుజ్జు నుజ్జు అయి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలకు మన దేహమంతా ఒక విద్యుత్ షాక్ కు గురవుతుంది.   మరణాన్ని రుచి చూపించే  కథ.

కొన్ని కథలు పెద్దింటి అశోక్ కుమార్ మాత్రమే రాయగల కథలున్నాయి. ఉబుసుపోకకు రాసిన కథ ఒక్కటి కూడా లేదు. ప్రతి కథ పిడికెడు కన్నీళ్లను గుప్పిట్లో పట్టుకుని రాసిందే. జోకొట్టే కథ ఒక్కటీ లేదు. అన్నీ చైతన్య భాస్వరాన్ని గుండెలకు అందించి మనిషిని నిలువెత్తు నిప్పుకణికల్లో ముంచి తీసి పుటం పెట్టే కథలు. నిత్యం తన కళ్లముందు కదలాడే మనుషులే తన కథల్లో పాత్రలుగా ఒదిగిపొయ్యారు. మొరందేలిన వాకిళ్లు, మూతపడ్డ ఇండ్లు, దగా పడిన జీవితాలు అనివార్యంగా ఆయనకు కథా వస్తువులయ్యాయి. పల్లె మధ్య, సంక్షోభం నడుమ నిలబడి వాటి చుట్టూ ఏం జరుగుతుందో వాటి పర్యవసానాలేమిటో ఒక్కో కథ చాలా బలంగా వ్యక్తీకరిస్తుంది. ఆయన కథలన్నింటికీ ఆయన ఊరే ఊటబాయి. అక్కడి  మట్టిని కెలుకుతూ అనేక కథలకు జీవం పోస్తున్నాడు. మాయమైన చెరువు దిక్కూ, ఎండిన వాగు దిక్కూ, కరిగిపోతున్న గుట్టల వైపు దిగులుగా చూసే పెద్దింటి మరిన్ని కథల్ని హామీ ఇస్తున్నాడు ఈ కథా సంపుటి ద్వారా.

 

*

 

 

 

                                                                                              

              

 

 

మీ మాటలు

  1. ప‌సునూరి says:

    మంచి స‌మీక్ష‌వ్యాసం. క‌థ‌ల్ని స‌మీక్షించి మంచి చెడులు చెప్పే విమ‌ర్శ‌కులు ప్ర‌స్తుతం తెలుగులో వేళ్ల‌మీదికే ప‌రిమితం. ఈ ప‌నిని కొంత వెల్దండి తీరుస్తున్న‌డు. మంచి క‌థ‌ల్ని మ‌న‌సుతో ప‌రిచ‌యం చేసిన తీరు బాగా కుదిరింది. పెద్దింటి క‌థ‌ల‌కు ఉన్న మూల‌సూత్రాన్ని శ్రీ‌ధ‌ర్‌గారు అద్భుతంగా ప‌ట్టుకున్నారు. పెద్దింటి అశోక్ కుమార్ కథ చదవడమంటే ఒక చేత కన్నీటి కుండను, మరో చేత గాయాలకు పూసే ‘నల్లాలం’ పసరును పట్టుకోవడమే.
    కంగ్రాట్స్ అశోకన్న, మరియు శ్రీధరన్న.
    Dr.PASUNOORI RAVINDER

  2. చందు - తులసి says:

    అవును….సమీక్ష నిజమైన సమీక్షలా…సమతుల్యంగా ఉంది.
    ఇక పెద్దింటి కథలగురించి కొత్తగ చెప్పేదేముంది..
    జగమెరిగిన కథకుడు..
    శ్రీధర్ గారి రచనా ( సమీక్ష)శైలి కూడా బాగుంది.

  3. sangishetty srinivas says:

    పెద్దింటి కథలు తెలంగాణ గ్రామీణ శిధిల బతుకులు, కులవృత్తుల గురించి మాత్రమే చేబుతాయని అనుకుంటాం.. అయితే వాటితో బాటుగా ఎండిపోయినా వాగుని, కరిగిపోయిన గుట్టల్ని, మాయమైన చెరువునీ రికార్డు చేసినాయి.. ఆ విషయాన్ని శ్రీధర్ సరిగ్గా గుర్తించిండు. అందుకు అభినందననలు..

  4. పెద్దింటి మంచి కథకుడు. బాగా రాస్తాడు. అనేది అందరికి తెలిసిన విషయమే.
    అంతకు మించి ఈ వ్యాసంలో కొత్తగా సమీక్ష ఏమి జరిగిందో ప్రముఖ విమర్శకులు పసునూరి , సంగిసెట్టి వివరించాలి.

    క‌థ‌ల్ని స‌మీక్షించి మంచి చెడులు చెప్పే విమ‌ర్శ‌కులు ప్ర‌స్తుతం తెలుగులో వేళ్ల‌మీదికే ప‌రిమితం అని చక్కగా అన్నారు పసునూరి. అది ఈ వ్యాసానికి కూడా వర్తిస్తుంది. మంచిని తప్ప చెడు లేదా లోపాలు ప్రస్తావించని ఇలాంటి సమీక్షల వల్ల పాటకులకు, రచయితలకు ఉపయోగంలేదు.
    -శశాంక

  5. చందు - తులసి says:

    శశాంక గారూ..మీరన్నది సమీక్షల మంచి చెడు రెండూ ఉండాలె. కనీ ఒక్కోసారి చెప్చెపటానికి చెడు ఉండకపోవచ్చు…ఉన్నా మనకు అవసరం కాకపోవచ్చు. ఉదాహరణకు అశోక్ కుమార్ కథలల్ల చెడు ఏమని చెప్పగలం. కొన్ని పరిమితులుంటే ఉండొచ్చు కానీ చెడు మాత్రం కాదు కదా…

మీ మాటలు

*