ఐనా …  మనిషి మారలేదు.

 

-ల.లి.త.

~

 

    ల.లి.త.

“ఎవరైనా సరే న్యాయాన్ని కాస్త తక్కువగా ప్రగతిని కాస్త ఎక్కువగా నమ్ముతారు” –  కొరాడో.

ఇదేదో గట్టి నిజంలాగే అనిపిస్తోంది.  తాతకంటే తండ్రి  మరికొంచెం ఎక్కువ సంపాదించి ఇంకొంచెం సుఖంగా బతుకుదామనుకుంటే, కొడుకు మరింత సంపాదించి విలాసాన్ని రుచి చూద్దామనుకుంటాడు. మనవడు విలాసాల అంతు చూద్దామని బయలుదేరతాడు. ఇదే కదా మనిషి ప్రగతి!  కానీ దీనికి కొన్ని కనీసన్యాయాలు అడ్డు వస్తాయి. ముఖ్యంగా ప్రకృతిన్యాయం. అది ప్రతీ ఒక్కరికీ అవసరమైనవన్నీ ఇస్తుందిగానీ అందరి విలాసాలనీ  తీర్చే శక్తి దానికిలేదు. ప్రకృతిన్యాయాన్ని పట్టించుకోకుండా మాయాబజార్ సినిమాలో తిండిముందు కూచున్న ఘటోత్కచుడిలా ప్రతీదీ ఈ జన్మలోనే తిని అరిగించుకోవాలని తెగబడుతున్నాం.  దేనిమీద బతుకుతున్నామో దానిమీదే ఇంతటి దురాక్రమణ ఇంకే జంతువూ చెయ్యదు.

***

“ఎవరైనా సరే న్యాయాన్ని కాస్త తక్కువగా ప్రగతిని కాస్త ఎక్కువగా నమ్ముతారు” –  కొరాడో.

ఈ నిజాన్ని బాగానే అర్థం చేసుకున్నాడు కాబట్టే ఇటాలియన్ దర్శకుడు Michelangelo Antonioni తన సినిమా ‘Deserto Rosso’ (ఎర్రని ఎడారి)లో మనిషితనానికీ పారిశ్రామిక అభివృద్ధికీ మధ్య ఉన్న ఘర్షణను చిన్నపాటి  సర్దుకోగలిగే సమస్యగా మాత్రమే చూపించాడు. ఇది యాభై ఏళ్ల కిందట తీసిన సినిమా. సినిమాగా గొప్ప కళాఖండం అని  చెప్పాలి.  Antonioni  పారిశ్రామికీకరణను సంతోషంగా ఆహ్వానించే లెఫ్టిస్టుల తరం దర్శకుడు. వామపక్షవాదం ఒక కన్నూ అస్తిత్వవాదం మరో కన్నూగా జీవించిన తరం అది. అతను ఈ కళ్ళతో మనిషి చేస్తున్న ప్రకృతి విధ్వంసాన్ని కూడా చూడకపోలేదు. అయినా సరే, ప్రగతిని ఎక్కువగా నమ్ముతాం కాబట్టి విధ్వంస ప్రకృతితో కలిసి బతకటానికి అలవాటు పడాలనే ధోరణి Deserto Rosso లో కనిపిస్తుంది. సర్దుకుని బతకటం పరిణామ సిద్ధాంతంలో భాగం.  పిట్టయినా, జంతువైనా, మనిషైనా చుట్టూ ఉన్న ప్రపంచంతో సర్దుకు బతక్క తప్పదు. అది చేతకాని జీవాలు నశిస్తాయి. కానీ అలా నశించేవి కూడా చాలావరకూ ప్రపంచానికి ఏదోవిధంగా పనికొచ్చేవే అయివుంటాయి. నిజానికి మనిషిజాతి నశిస్తే భూమికి జరిగే నష్టం ఏమీ ఉండదనీ, పైగా పుష్టిని పెంచుకుంటుందనీ, అదే చిన్నచిన్న కీటకాలు నశిస్తే భూమి ఉనికికే ప్రమాదం అనీ కీటక శాస్త్రజ్ఞులు చెప్తారు.

సినిమాలోని వద్దాం. జులియానా భర్త ఉగో, పెట్రో కెమికల్ ఫ్యాక్టరీలో ఉన్నతోద్యోగి. ఆమె తన ఏడేళ్ళ కొడుకుతో భర్తతో ఫ్యాక్టరీ పరిసరాల్లోనే  నివాసం ఉంటుంది.  ఉగో, అతని వ్యాపార సహచరుడు కొరాడో, అక్కడ పనిచేస్తున్నవాళ్ళూ అందరూ ఆ వాతావరణంలో నీటిలో చేపలంత సహజంగా బతుకుతుంటారు. అవే పరిసరాల్లో జులియానా ఒడ్డున పడ్డ చేపలా కొట్టుకుంటూ ఉంటుంది. ఉగోకు ఆమె కష్టం పట్టదు. కొరాడో ఆమెను ఆకర్షణతో కూడిన సానుభూతితో అర్థం చేసుకుంటాడు. పెద్ద పెద్ద ఫ్యాక్టరీ గొట్టాలు, గోడలు, కాలుష్యం నిండుతున్న చెరువుల మధ్య జులియానా చిన్ని చిన్ని వేర్లతో తేమను వెదుక్కుంటున్న మొక్కలా తోస్తుంది. ఎక్కడ ఎవరితో ఏ వస్తువుతో బంధం పెంచుకోవాలో తెలియక అశాంతిగా తిరుగుతూ వుంటుంది.  చుట్టూ వున్న మనుషులతో అర్థంలేని మాటలు మాట్లాడి బైటపడడానికి చూస్తుంది. మానసిక స్వస్థత దొరుకుతుందేమో అన్న ఆశతో కొరాడోతో శారీరకంగా కలుస్తుంది. ఆ బంధంకూడా ఆమెకు నిలకడ ఇవ్వదు. కొడుకు వలేరియోతో ఫ్యాక్టరీ ఆవరణలో తిరుగుతూ ఆ పిల్లాడు వేడి ఆవిర్లగొట్టాల వైపు వెళ్ళకుండా జాగ్రత్తగా చూసుకుంటూ రంగులూ పొగల మధ్య జడుసుకున్న కుందేల్లా వణికే చేతులు పిసుక్కుంటూ కాలం గడుపుతుంది. ఇదీ ఆమె కథ.

“ఆ పసుప్పచ్చ పొగలు ఏమిటమ్మా?”  – వలేరియో.

“అవన్నీ విషపు పొగలు”.  –  జులియానా.

“బుజ్జిపిట్టలు అటువైపు వెళ్తే చచ్చిపోవూ?”  –  వలేరియో.

“బుజ్జిపిట్టలు అటువైపు వెళ్లకూడదని అర్థం చేసుకుని వెళ్ళటం మానేశాయి.”  –  జులియానా.

***

ఇంత సాఫుగా ఉందా నిజం? పిచుకలు సెల్ టవర్లవైపు వెళ్తే గుడ్లు పెట్టలేమని అర్థం చేసుకున్నాయో లేదోగానీ బతికిన నాల్రోజులూ దిగులుగా రెండు గింజలకోసం, కాసిని నీటి చుక్కలకోసం దేవులాడుతున్నాయి. కొట్టేసిన చెట్లలోంచి, అడవుల్లోంచి బైటకొచ్చిన జంతువులు మనుషుల ఇళ్ళలో పొలాల్లో దూరుతున్నాయి. ఫ్యాక్టరీ గొట్టాల విష వాయువులు భోపాల్ లాంటిచోట్ల అర్థరాత్రి మెల్లగా జనం ఊపిర్లను కాజేశాయి. న్యూక్లియర్ రియాక్టర్లు ఎక్కడెక్కడో  విషం చిమ్మాయి. జనం నిశ్చింతగా బారైన వినాయక విగ్రహ నిమజ్జనాలు మహోత్సాహంతో చేస్తూ, పేపర్ టిష్యూలతో మూతులు తుడుచుకుంటూ, ఆన్ లైన్ షాపింగులు చేస్తూ, సెల్ ఫోన్లలో క్యాండీ క్రష్ ఆడుకుంటూ,  ఇంటర్నెట్ లో ప్రతి కొత్త ఒంటరి ఆటకూ అలవాటు పడుతున్నారు.

***

పానవట్టం, శివలింగం ప్రాచీన స్త్రీపురుష  ప్రతీకలైతే,  న్యూక్లియర్ రియాక్టర్లు,  పొగగొట్టాలు ఆధునికయుగం చేసిపెట్టిన సెక్సీ ప్రతీకలు. వీటిని అందంగా, బతుకు ఒత్తిడికి ప్రతీకలుగా, నిలువుగా అడ్డంగా జామెట్రీ  సిమెట్రీ కొలతలతో ఫోటోలు తియ్యటం ఒక కళగా వెలిసింది. ఇండస్ట్రియల్ ఫోటోగ్రఫీ అనేది ఒక పెద్ద ఫోటోగ్రఫీ శాఖ. యంత్రంతో మన్ని మనం పోల్చుకోవటం, మళ్ళీ విడదీసుకోవటం, యంత్రాన్ని ప్రేమించటం, మళ్ళీ అసహ్యించుకోవటం, యంత్రాల మధ్య ఒంటరిగా ఓ మూలకి పోవటం  … ఇలా ఎన్నో ప్రేరణలూ భావాలూ కవిత్వంలోలాగే ఫొటోగ్రఫీలోనూ వచ్చేశాయి.  Deserto Rosso లో Antonioni  భూతాల్లాంటి ఫాక్టరీలను, ఓడలను విస్మయ గౌరవాలతో చిత్రీకరించాడు.  ఏదో రహస్యం, మరేదో అద్భుతం  ఆ పెద్ద పెద్ద ఆకారాలను ఆవహించి ఉంటాయి. ఓడలో వంపులు తిరిగిన గొట్టాలు, చువ్వలు, టవర్లు, నూనెతెట్టులా పచ్చగా నీటిని ఆవరించిన రసాయనాలు, ఊపిర్లు భారంగా వదిలే ఆవిర్లు, జులియానాను తమలో కలుపుకునేట్టు కనిపించే గోడలు, ఆమె మీదకు వచ్చిపడుతున్నట్టు ఉండే లేత రంగులు … ఇవేవీ భయంకలిగించవు. ఆసక్తిగా తొంగి చూస్తున్న మనలోని చిన్న పిల్లను యంత్ర నాగరికత తన డిజైన్ ఏమిటో వచ్చి చూడమని ఆకర్షిస్తూ పిలుస్తున్నట్టు ఉంటుంది.  ఇది Antonioni  ఇంద్రజాలం.

lalita1

 

జులియానా  వాలెరోకు ఒక కథ చెప్తుంది. ఒక కౌమార ప్రాయంలో ఉన్న పిల్ల. గులాబిరంగు ఇసుకా, తేటనీళ్ళ బుల్లి అలల సముద్రమూ వున్నచోట  ఒడ్డున ఒక్కతే ఆడుకుంటూ, ఈదుతూ ఉంటుంది. ఓ రోజు సముద్రంలో ఎవరూలేని పెద్ద ఓడను చూస్తుంది. ఆ ఓడ ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోతుంది. మరునాటినుంచీ ఆ పిల్లకు ఒక పాట వినిపిస్తూ ఉంటుంది. ఆ పాట అలల్లోంచి, ఒడ్డునుంచి, మెత్తటి గోధుమ పిండిముద్దల్లా ఉన్న రాళ్ళ మధ్యనుంచి వినిపిస్తూ ఉంటుంది. ఆ పాట ఆ పిల్లకోసమే అన్నట్టు ఉంటుంది. దాన్ని వినగలిగే శక్తికూడా తనకొక్కదానికే ఉన్నట్టు ఉంటుంది.

Antonioni ఈ సముద్ర తీరాన్ని, ఆ పిల్లను, మెత్తటి రాళ్ళను, అతీత శక్తిలాంటి ఆ పాటను ఎంత బాగా చిత్రిస్తాడో ఫాక్టరీలను, పొగ గొట్టాల శబ్దాలను, ఓడలను గోడలను కూడా అంతే అందంగా అద్వైత భావంతో తీస్తాడు. (ఆ పాటనూ,  శబ్దాలనూ దృశ్యాలతో కలిపి చూస్తూ వినితీరాల్సిందే తప్ప మాటల్లో చెప్పలేం).  ప్రాకృతికమైన అందానికీ మానవ మేథ సృష్టించిన యంత్రలోకాల అద్భుతానికీ తేడా లేదు. మనిషి ఉభయచరంలా రెండుచోట్లా జీవించాలి.

***

రెండుచోట్లా బతుకుతున్నాడు మనిషి దేనికీ చెందకుండా…  తలెత్తకుండా పనికొచ్చేవీ పనికిరానివీ ఏవేవో తయారు చేస్తూ ఎవరికో డబ్బులు పోగేసిపెడుతూ… మధ్యమధ్యలో తల విదిలించి వారం పదిరోజుల పాకేజ్ టూర్లు కొట్టి నయాగరా జలపాతంలో వెలుగులని తాగి, సింగపూర్లో బంగారం కొని థాయిలాండ్ లో పెంపుడు పులులతో ఫోటోలు దిగుతున్నాడు.  అష్ట దిక్పాలకులను శాసించిన రావణాసురుడిలా దేశాలను పాకేజ్ టూర్లుగా అమ్ముతున్నాడు.

“ఐనా …  మనిషి మారలేదు. ఆతని కాంక్ష తీరలేదు”.  ….               

Antonioni ఈ పరిణామాన్ని ఎందుకు ఊహించలేదో !  పల్లెటూరంటే వట్టి ఆదర్శం తప్ప ఏమీ కానట్టు తీసి పారేసి మనం ఎంచుకున్న మహాపట్నాలు నిజంగా అంత బాగుంటే ఇన్ని రోగాలూ అభద్రతలూ దిక్కుమాలిన చావులూ ఎందుకు? అన్నిటినీ మించి,  ఎవరికీ దేనికీ చెందనితనపు మహా భారాన్ని మనిషి ఎలా మోయాలి ?

“నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే నా వస్తువులన్నీ తీసుకుపోతా ఆష్ ట్రే తో సహా!”  – జులియానా.

“ఇక వెళ్ళటం ఎందుకు? ఇక్కడే ఉండు. నా ఊరూ నా వీధీ అంటూ..”  – కొరాడో.

ఉన్నచోటే పాతుకు పోయేవాళ్ళూ, కాళ్ళలో చక్రాలున్నట్టు తిరిగేవాళ్ళూ అని మనుషులు రెండు రకాలు. పాతుకోవటం, తిరగటం తమ ఇష్టప్రకారం జరిగితే అది సహజత్వం. ఈ రెండు పనులూ మనమే సృష్టించుకున్న పరిస్థితుల వల్ల చెయ్యాల్సి వస్తే ఏమనాలి?

***

lalita2

“ఎవరైనా సరే న్యాయాన్ని కాస్త తక్కువగా ప్రగతిని కాస్త ఎక్కువగా నమ్ముతారు” –  కొరాడో.

ప్రగతిని కాస్త తక్కువగా నమ్మే సాయి పరాంజపే లాంటివాళ్ళు ‘దిశ’ లాంటి సినిమాలను తీస్తారు. 90లలో వచ్చిన ఈ సినిమా పల్లెటూరిలో సరిగ్గా బతకలేక ముంబై భీవండీ మిల్లుల్లో పని చెయ్యటానికి వెళ్ళి నాలుగు డబ్బులు కళ్ళ చూస్తూ 40 మందితో కలిసి జంతువుల్లా ఓ గదిలో బతికే గ్రామస్తుల కథ. ఊరినే నమ్ముకున్నవాడు పట్టుదలగా అనుకున్నది సాధిస్తాడు. ఇరుకు పట్నాల జీవితం చాలు, ఊరిదిశగా మళ్ళాలని సింపుల్ గా హెచ్చరిస్తుంది సాయి పరాంజపే.

ప్రగతిని హాలీవుడ్ ఎంతగానో నమ్ముతుంది.  ప్రకృతి ప్రదర్శిస్తున్న భీభత్సరసాన్ని, దానికి చాలావరకూ కారణమైన మనిషినీ చూడక తప్పని పరిస్థితి వచ్చేసింది మేధావులకు. స్పీల్ బర్గ్  ‘జురాసిక్ పార్క్’ తీస్తే, జేమ్స్ కామెరూన్ ‘అవతార్’ సినిమా తీశాడు.

“నీ కంటే ముందువాళ్ళు సంపాదించి అందించిన జ్ఞానంతో బాధ్యత, విచక్షణ లేకుండా హడావుడిగా సృష్టికి ప్రతిసృష్టి చేసేసి, పేటెంట్లూ పేకేజ్ లతో లంచ్ బాక్స్ లలో కూరి” చేస్తున్న వ్యాపారాన్ని ఎత్తి చూపిస్తూ డాక్టర్ మాల్కోం మాట్లాడే రత్నాల్లాంటి మాటలు జురాసిక్ పార్క్ లో చాలా ఉంటాయి.  చైనా ప్రగతి చూసి, వాళ్ళలాగే మేకిన్ ఇండియా వ్యాపారం చేసేద్దామని అనుకునే మన గొర్రె మనస్తత్వపు నాయకుల ఛాయల్ని జురాసిక్ పార్క్ లో దర్శించవచ్చు.  ‘అవతార్’ మరింత తాత్వికంగా ముందుకెళ్ళి వానర వారసులైన మనుషులను ప్రకృతితో తోకలు ముడేసుకోమని చెప్పింది. అంతే కాకుండా ఎప్పుడూ ప్రపంచాన్ని ఉద్ధరించే  తెల్లతోలు వీరుడు మూలవాసుడిగా డీ ఎన్ ఏ తో సహా మారిపోవటం నలుపు, గోదుమరంగుల వారికి మరీ నచ్చుతుంది.  తెల్లవాడు డీ-రేస్ అయిపోవటం కంటే సంతోషించేది ఏముంటుంది ప్రపంచానికి ? కనీసం ఇలాంటి ఫాంటసీల్లో అయినా సరే! ‘అవతార్’  కళారూపంగా చాలా నాసిరకం సినిమా అయినా భావం గొప్పది.

క్రిస్టఫర్ నోలన్ మరింత ముందుచూపుతో స్టీఫెన్ హాకింగ్ జోస్యాన్ని నమ్మాడు.  భూమి రిపేర్ చెయ్యటానికి వీల్లేనంతగా పనికిరాకుండా అయిపోయింది కాబట్టి,  భౌతికశాస్త్రంలో నాలుగవ, ఐదవ కొలతల గురించి కూడా  తెలుసుకుని గ్రహాంతరాలకు మనిషి ప్రయాణం కట్టాలని చెప్తాడు తన ‘ఇంటర్ స్టెల్లార్’ సినిమాలో.  మెరుగైన జీవితం కోసం కాదు,  గాలీ నీరూ కోసమూ  బతికి ఉండటం కోసమే మనిషి వెదుక్కుంటూ పోయే పెద్ద వలసను సూచిస్తాడు నోలన్.

***

ఇప్పుడు న్యాయాన్ని మరీ తక్కువపాళ్ళలో నమ్ముతూ ప్రగతినే భుజాలమీద మోస్తున్నాం మన సినిమాల్లో.  పాత విజయావారి తెలుగు సినిమాల్లో చందమామ చక్కగా నిండుగా కనిపించేది. నిజం చందమామ, నిజం జాజితీగలు అక్కడ లేకపోయినా ‘ఎచటినుంచి వీచెనో ఈ చల్లనిగాలి’ అనీ ‘రావోయి చందమామా’ అని పాడేవారు. సినిమాల్లో  సాంకేతిక పరిజ్ఞానం అంతగా వికసించక పోయినా “క్రూర మృగమ్ముల కోరలు తీసెను. ఘోరారణ్యములాక్రమించెను. హిమాలయముపై జండా పాతెను. ఆకాశంలో షికారు చేసెను. ఐనా…. మనిషి మారలేదు. ఆతని కాంక్ష తీరలేదు.” అని పాటలు రాసి తీసేంత తాత్వికత ఉండేది. జోలపాటలూ చిన్నపిల్లలూ, వెన్నెలా, ఊరూ జీవితంలో భాగాలుగా ఉండేవి కాబట్టే సినిమాల్లో కూడా అవి కనిపించేవి. మనకిప్పుడు వస్తువే సమస్తమైపోయింది కాబట్టి ఉపమాలంకారం నోకియా, నైకీ, కేపుచ్చినోలను అందిపుచ్చుకుంది. భాష  పట్టుతప్పి అద్భుతమైన విదేశీయ ప్రకృతి అందాల మధ్య కూడా  ‘చంపేస్తున్నావే నను నలిపేస్తున్నావే’ ‘పొమ్మన్నా పోవేంరా’ లాంటి చప్పటి మాటల్లోంచి దీనంగా చూస్తోంది.  ‘చాలులే నిదురపో జాబిలికూనా, ఆ దొంగ కలువరేకుల్లో తుమ్మెదలాడేనా..  తూనీగలాడేనా’ అనీ,  ‘నిదరోయే కొలనునీరు కదపకూడదు’ అనీ పాటలు రాసిన కృష్ణశాస్త్రీ, ‘బంతీ చేమంతీ ముద్దాడుకున్నాయిలే’ అనీ, ‘సందె పొద్దులకాడ సంపంగి నవ్విందీ’ అనీ మురిసిన వేటూరీ వారసుల్లేక  పైనుంచి నిరాశగా చూస్తున్నారు.  అమ్మో…  ప్రగతి నిరోధక రొమాంటిక్ ట్రాక్ లోకి వెళిపోతున్నా..

ఐనా  (ఇక్కడ గాయని పి.లీల లా రాగం తియ్యాలి) ….  ప్రగతిని కొంచెంగానూ న్యాయాన్ని చాలా ఎక్కువగానూ నమ్మే మనుషులు ఎక్కువైతే బాగుండును.

***

చివరగా, ఈ వ్యాసం చదివినవారు తప్పకుండా ఈ youtube లింక్ చూసి తరించాలి.

ముందుగా మిమ్మల్ని పెయింట్ డబ్బాలో అపార్ట్ మెంటులో లేక online  చెడ్డీలో కొనమని ad విజ్ఞప్తి వస్తుంది.  తర్వాత ఘంటసాల, లీలల పాట వస్తుంది.  చివరగా ‘మస్సాలా మిర్చీ పిల్లా మజ్జా చేద్దాం వస్తావా’  అనే పాట ad వస్తుంది. పింగళి పాటకు ముందూ వెనుకా ఘన నివాళులు ఇవి…

 

                                                                                  *

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

మీ మాటలు

 1. భాస్కరం కల్లూరి says:

  బాగా రాశారు. కానీ చాలా సీరియస్ సబ్జెక్టు. ఈ నిడివి సరిపోదు. విషయంలోకి వెడితే నిర్ధారణలకన్నా ప్రశ్నలూ, సందేహాలే ఎక్కువ. మనిషిని కేంద్రంగా చేసుకుని చూస్తే, ప్రగతి పేరుతో ఒక్కోసారి ముందుకు వెడుతున్నట్టూ, ఒక్కోసారి విధ్వంసం వైపు వెడుతున్నట్టు అనిపిస్తుంది. ప్రకృతినో, విజ్ఞానాన్నో, పరిణామాన్నో, ఏ అతీత శక్తులనో(దేవుదనే అర్థంలో కాదు), జీవన్మరణపోరాటాన్నో కేంద్రంగా చేసుకుని చూస్తే ఇది ఇలా కన్నా ఇంకోలా జరిగే అవకాశం లేదనిపిస్తుంది. మనిషే తన మంచి చెడులకు నిర్ణాయశక్తి అనడంలో నిజముందా అనిపిస్తుంది. “పింగళి పాటకు ముందూ వెనకా ఇది ఘన నివాళి” అని మీరు అనడంలో సామాజిక పరిశీలన కన్నా వ్యక్తిగత ఇష్టాయిష్టాలే కనిపిస్తున్నాయి. ప్రతి తరమూ తనకు కావలసిన సాహిత్యాన్ని, సంగీతాన్ని సృష్టించుకుంటుందనుకోవడం ఇక్కడ న్యాయమనిపించుకుంటుందా?

  • Lalitha P says:

   మీ వ్యాఖ్య ఆలోచింపజేస్తోంది భాస్కరం గారూ..ప్రకృతిని కేంద్రంగా చేసుకుని రాసిన వ్యాసమే ఇది. మనిషి కంటే కీటకం ఎక్కువ ఉపయోగకారి అనేంతగా ప్రకృతి కేంద్రితం. ప్రకృతి సూత్రాలను కనిపెట్టటం, వాటిని విధ్వంసానికి వాడటం (ప్రపంచ యుద్ధాలు, అణుబాంబులు) నష్టం జరిగాక ఏవో ఒప్పందాలు చేసుకోవటం… ఈ క్రమంలో ప్రస్తుత పరిస్థితి ఏమిటంటే, కనిపెట్టినఅన్నిటినీ సుఖాల కోసం మరిన్ని సుఖాల కోసం వాడుతూ ఆద మరచిపోవటం (ప్రతి మనిషికీ సొంత కార్ ఉండటం ఒక పెద్ద ఉదాహరణ). దీని పరిణామం ఏమిటో అణుబాంబు విషాదంలా తొందరగా బైటపడదు. నెమ్మదిగా మనిషినీ మిగతా జీవాలనీ చంపేస్తుంది. ఈ స్లో డెత్ మనకి అర్థం కావట్లేదా అంటే స్లో గానే అర్థం అవుతోంది.

   ప్రతీ తరం తయారు చేసుకుంటుంది నిజమే. దీనిని మీరు కొనసాగే సంస్కృతికి సంబంధంలేకుండా చూడగలరా? పాటల్లో ప్రకృతి వర్ణన అసలు లేకుండా పోవటానికి కారణం నా వ్యాసం వివరిస్తోంది. ఈనాటి గ్లోబల్ తరహా వ్యాపారంలో ఎక్కువగా పడిపోయిన జాతిలో భాష, సంస్కృతి మరింత తొందరగా మాయం అవుతాయి. మన తెలుగువాళ్ళలో పదిహేనిరవై ఏళ్లుగా వ్యాపారం ఏ స్థాయిలో ఉందొ గమనిస్తే మన భాష మన సినిమా ఈరోజు ఎందుకిలా ఉందొ అర్థం అవుతుంది. ఇది ఈ తరం కనుక్కున్న భాష కాదు. ఉన్నదాన్ని వాడుతున్నారు అంతే. కొందరు మనుషులు తాత్వికతను ప్రతీ తరానికీ అందించటానికి ప్రత్యేకంగా ఏర్పాటయిన వ్యవస్థ మన సమాజంలో ఉండేది. అది నశిస్తున్న కొత్తల్లో సినిమా పాటలు ఆ బాధ్యతను తీసుకున్నాయి. అప్పటి దర్శకులకు ఆ తత్వం ఏమిటో కాస్తయినా తెలుసు కాబట్టి అది సాధ్యపడింది. ఇప్పుడు వ్యాపార భాష తప్ప ఇంకేదీ తెలియదు మనకి.

   అందరికీ అంత సమాచారమూ అందటం వల్ల ఎవరికి కావలసిందిమాత్రం వాళ్ళు తీసుకుంటున్నారు. ఇది మరీ ప్రమాదకరం అనిపిస్తోంది. గ్లోబల్ వ్యాపారపు రుద్దుడు సమాచారం దెబ్బకి బుర్రలు పనిచెయ్యని పరిస్థితి ఉంది. కాదంటారా? పింగళి పాటకి ముందు వెనుకలు నాకు కొంత ironic గానూ మరికొంత bizarre గానూ అనిపించి, ఘన నివాళులు అనటం సబ్జెక్టివ్? ఆలోచించాలి…

   • భాస్కరం కల్లూరి says:

    చెట్ల కొమ్మలు ఇంటి మీద పడుతున్నాయనో, చెత్త పేరుకుంటోందనో చెట్లు కొట్టేస్తాం. ఆ తర్వాత చెట్లు లేవే, పచ్చదనం లేదే అనుకుంటూ చెట్లు నాటే పనిని ప్రారంభిస్తాం. ఇంట్లో కుండీ మొక్కలనో, బోన్సాయి చెట్లనో ఉంచుకుని ఆనందిస్తాం. మన అవసరాలకోసం అడవుల్ని నరికేసి వన్యప్రాణులకు నీడ లేకుండా చేస్తాం. మళ్ళీ ఇంట్లో వన్యప్రాణుల బొమ్మలు తెచ్చి పెట్టుకుంటాం. ఉపాధి కోసమో, చదువుకోసమో నగరాలకు వచ్చిపడతాం. మళ్ళీ జన్మభూమిని, పల్లెటూరుని కలలుగంటూ పదండి పల్లెకు అనుకుంటాం. ఈ పరస్పర విరుద్ధ ఊహల్లో వేటిని తోసిపుచ్చగలం? మనిషి అనే వాడికి ఒక నిలకడ, నిర్ణయం, తన జీవితాన్ని తన ఇష్టానుసారం మలచుకునే స్వాతంత్ర్యం ఉందని ఎలా అనుకోగలం? ఈ పరిస్థితి ఇప్పుడే ఈ గ్లోబల్ సందర్భంలోనే ఏర్పడిందని అనుకోగలమా? చాలా ప్రశ్నలు లలితగారూ…
    బహుశా మనిషి మనుగడ అంతా మొదటినుంచీ ట్రయల్ అండ్ ఎర్రర్ ప్రక్రియలోనే వెడుతోందనుకుంటాను. మీరన్నట్టు ఇది స్లో డెత్తే. అయితే ఈ డెత్ అంచులదాకా వెళ్లి, మళ్ళీ వెనక్కి తిరిగి జీవపునరుద్ధరణ చేసుకునే శక్తి , ఆ మేరకు స్వాతంత్ర్యం మనిషికి ఉన్నట్టున్నాయి. శతాబ్దాల గతంలోకి వెడితే మనిషి వివిధ ఘట్టాలలో ఇలాగే అపార విధ్వంసాన్ని చూశాడని తేలుతుంది. విధ్వంసంలో అణుబాంబు అత్యంతశక్తిమంతం, నిజమే. కానీ కత్తి లాంటి మారణాయుధాలు సృష్టించిన విధ్వంసమూ తక్కువది కాదు. అప్పటికి అదే ఎక్కువ. ఇప్పుడు అణుబాంబు ఉన్నా అది సృష్టించగలిగిన స్థాయిలో విధ్వంసం, రక్తపాతం జరగడంలేదు. మనిషిలోని ఒకానొక విచక్షణ, లేదా సొంత అస్తిత్వ కాంక్ష అణుబాంబును నియంత్రిస్తోంది. అణుబాంబు కన్నా కత్తి ఎంత చిన్న, పరిమిత ఆయుధమైనా దాని ప్రయోగంలో గతంలో అంత విచక్షణ ఉండేదని చెప్పగలమా? అలాగని నేను అణుబాంబును సమర్ధిస్తున్నానని దయచేసి అనుకోకండి. తులనాత్మకంగా చెబుతున్నాను అంతే. రేపు ఏ అమానవీయశక్తో అణుబాంబు ప్రయోగించబోదని గట్టిగా చెప్పగల ధీమా నాకు లేదు.
    తరాల అభిరుచుల మధ్య తేడాల్లోకి వెళ్ళి చూసినా ప్రశ్నలే తప్ప సమాధానాలు దొరుకుతాయా అని నా సందేహం. ఉదాహరణకు చూడండి…మన తరం పింగళి పాటల్ని, పెండ్యాల సంగీతాన్ని ఆనందించాం. ఇప్పటి తరాలు భిన్నమైన పాటల్ని, సంగీతాన్ని తెచ్చుకుంటున్నాయని బాధపడుతున్నాం. అదే మన తాతముత్తాతల తరానికి వెడితే వాళ్ళు పింగళిని పెండ్యాలను ఆనందించారని చెప్పలేం. ఏ శాస్త్రీయ సంగీతాన్నో, నృత్యాన్నో ఆనందించి ఉంటారు. ఇక్కడ కూడా మీరన్న స్లో డెత్ వర్తిస్తుంది. అందులోంచి జీవాన్ని మళ్ళీ పుట్టించడానికి ప్రతి తరమూ ప్రయత్నిస్తూనే ఉంటుంది.
    మీరూ, ఎ. కె. ప్రభాకర్ గారూ కూడా వ్యాపారం గురించి ప్రస్తావించారు. ఈ వ్యాపారం కూడా ఇప్పుడే నేటి గ్లోబలైజేషన్ లోనే పుట్టిందని అనుకోడానికి లేదు. మనిషి చరిత్ర పొడవునా వ్యాపారం ఉంటూనే ఉంది. కాకపోతే రూపంలో తేడా ఉండచ్చు కానీ సారంలో కాదు. ఆ మాటకు వస్తే, గ్లోబలైజేషనూ ఇప్పుడే పుట్టింది కాదు. మనుషుల మధ్య, గుంపుల మధ్య సంపర్కం ఎప్పుడైతే పుట్టిందో అప్పుడే ఇవన్నీ పుట్టాయి. వర్తమానం మన కళ్ళకు విచిత్రమైన గంతలు కడుతుంది. అందుకే వర్తమానానానికి గిరిగీసుకుని మనం ఆలోచిస్తాం. మనిషి మనుగడ గురించి సాకల్యంగా అవగాహన చేసుకోవాలంటే, మనం శతాబ్దాల, సహస్రాబ్దాల గతంలోకి వెళ్ళి చూడాలి.

   • ఇది చాల పెద్ద విషయమే మీరన్నట్టు… మొన్ననే ఎక్కడో చదివాను. మొహంజొదారో హరప్పా వాళ్ళు ఒక్కసారిగా ఎలా మాయం అయారు? పెద్ద నగరాలను ఎక్కువకాలం తట్టుకోలేక ఊర్లకి వలసలు పోయారేమో అని ఊహించారు ఎవరో.. ఇప్పటి నగరాల పరిస్థితి చూస్తే అలా కూడా ఆలోచించవచ్చు. ఆంథ్రోపాలజీ, హిస్టరీ, environmentalism లను కలుపుతూ రాస్తే ఇది మహా గ్రంథం అయే టాపిక్. మీరు ఈ మూడిటినీ కలుపుతూనే ఆలోచిస్తున్నారు. నేను పూర్తిగా ప్రకృతినే కేంద్రంగా చేసుకున్నా. ఇప్పుడు మనం పాడుచేసుకున్నంత స్థాయిలో ఎప్పుడైనా జరిగిందా అనేది కూడా ముఖ్యమైన టాపిక్ కదా. కత్తి వల్ల మనిషికి నష్టం గానీ ప్రకృతికి కాదు. రసాయన, అణు బాంబుల వల్ల భూమి పాడౌతుంది.

    వ్యాపారాన్ని అర్థం చేసుకోవటంలో నేను మీతో పూర్తిగా విభేదిస్తున్నాను. సంప్రదాయక వ్యాపార పద్దతులకూ పెట్టుబడి పూర్తి స్థాయిలో వికసించినప్పుదు జరిగే వ్యాపారానికీ కత్తికీ అణుబాంబుకీ ఉన్నంత తేడా ఉంది. వర్తమానంలో కరడు కట్టకూడదనే నా ప్రయత్నం కూడా. పింగళి పాటను నేను romanticise చెయ్యటం లేదు. మనం టంగుటూరి సూర్య కుమారినీ నాగయ్యను కూడా విన్నాం. అంటే ఒక అయిదారు తరాల పాటల్ని ఆనందించాం. ఇప్పుడు పదేళ్ళ కిందటి పాటను ఎవరూ వినటం లేదు. ఈ కారణాలను సూక్ష్మంగా విశ్లేషించాలి కదా. అశ్లీలం అని నేను దేనినీ అనటం లేదు. Banality ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియటం లేదు మార్కెట్ తో ముడి పెట్టటం తప్ప. నేనూ ప్రభాకర్ గారూ అదే చేశాం.

    మనం ఇలా చాలా మాట్లాడుకోవచ్చు. ఇక్కడ స్పేస్ ని వాడుకోవటం మిగతా వారికి ఇబ్బంది ఏమో ! నా మెయిల్ ఇది. lalithap62@gmail.com. Please communicate whenever you want to share your ideas.

 2. అద్భతమైన విశ్లేషణ!!

 3. Vijay Koganti says:

  Mmm ! You touched all the essential aspects of life . What else to speak ? Wonderful analysis .

 4. ఎ కె ప్రభాకర్ says:

  చాలా బాగుంది. చివరి వ్యంగ్యం మరీనూ. ప్రగతికి వున్న వ్యాపార కోణాన్ని అది బహిర్గతం చేసింది. కల్లూరి భాస్కరంగారు దాన్నెందుకో మిస్సయ్యారు. ప్రతి పగటికీ వొక రాత్రి వెన్నంటి వుండడం న్యామేనని చెప్పి దీపం ముట్టించుకోవడం మానం గదా!!

 5. P V RAMA SARMA says:

  ప్రకృతి పట్ల మనిషి ప్రవర్తన ఎలా ఉంది ? అన్న విషయాన్ని వివిధ సినిమాల్లో ఎలా చెప్పారు అన్న మీ విశ్లేషణ చాలా బాగుంది. ఆదిలో చెట్లమధ్యే పెరిగి, ఆకులే ఆచ్చాదనలు గా గడిపిన మనిషి జీవన పరిణామ క్రమం లో క్రమేపీ విజ్ఞానాన్ని పెంచుకుని, కొంత విజ్ఞత తుంచుకుని ఈనాటికి ఆ చెట్లే తనకి అడ్డంకిగా భావిస్తున్నాడు. ఇప్పుడెంత వరకొచ్చేసామంటే ఇంక వెనక్కి పోలేము, ముందుకే వెళ్ళాక తప్పని స్థితి. 50+ వయసు వాళ్ళు గత కలం జ్ఞాపకాలతో మా వూరిలో ఇన్ని చెట్లుండేవి, ఇన్ని తోట లుండేవి అని అనుకోవడం తప్ప, ఈ కాలం software netizens కి అవేవీ ఆసక్తి కలిగించవు. మీరుదహరించిన ఆణిముత్యం లాంటి పాట మన తరానికే గానీ, ఈనాటి / రాబోవు తరాలకి రుచించదు. నీటిలో పడ్డ ఆకులా ప్రవాహ వేగానికి కొట్టుకుపోవడమే మనం చెయ్యగలిగేది. అయినా మన వరకు మనం ఎలా ఉండేవాళ్ళం? అని అనుకోవడం లో తృప్తి ఉంది. మంచి విశ్లేషణ చేసినందుకు అభినందనలు.

 6. బ్రెయిన్ డెడ్ says:

  ప్రతిసారి మీ విశ్లేషణ జీవితపు ప్రతి అస్పెక్ట్ని కలగలపి ముందుకు తెస్తుంది . చదివిన ప్రతిసారి చూసింది సేం ఫ్రేంస్ కదా నేనెందుకు ఇలా అలోచించలేదు అనిపిస్తుంది. కుడోస్

 7. భాస్కరం కల్లూరి says:

  మీ మెయిల్ ఇచ్చినందుకు ధన్యవాదాలు లలితగారూ…మీరన్నట్టు మనం చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు. ప్రస్తుతానికి మీ స్పందనపై ఇలా వీలైనంత క్లుప్తంగా:
  1. “ఇప్పుడు మనం పాడుచేసుకున్నంత స్థాయిలో ఎప్పుడైనా జరిగిందా అనేది కూడా ముఖ్యమైన టాపిక్ కదా”-
  మీ ప్రశ్న పరిమాణాన్ని చెబుతోంది. ఇలా పాడుకావడంలో తక్కువ, ఎక్కువలను చూసే ‘పరిమాణ’ దృష్టి సబ్జెక్టివ్ అవదంటారా? అలాంటి సబ్జెక్టివ్ దృష్టి సమస్యను శాస్త్రీయంగా అవగాహన చేసుకోడానికి తోడ్పడుతుందా? పుట్టినచోట పిల్ల నదిగా ఉన్న ఆ గోదావరే రాజమండ్రి దగ్గర అఖండగోదావరిగా మారుతోంది. అప్పుడప్పుడు వర్షాకాలంలో ప్రళయగోదావరిగా కూడా మారుతోంది. ఆ ప్రవాహంలో ఒక కంటిన్యూటీ ఉంది. పిల్ల గోదావరినుంచి అఖండ గోదావరిని వేరుచేయగలమా? ఒకదానిని అంగీకరించి ఇంకోదానిని నిరాకరించగలమా? అలాగే ఒక పరిణామం ఎప్పుడో బయలుదేరింది. అది దాని తార్కిక అంతానికి చేరుతోంది. అది ప్రళయసదృశం అవుతున్నప్పుడు మనిషి జాగ్రత్త పడడంలోనే అతని మనుగడ రహస్యం ఉందేమో! ఇదే సూత్రం వ్యాపారానికి, పెట్టుబడికి కూడా వర్తిస్తుందనుకుంటాను. “ఇప్పుడు మనం పాడుచేసుకున్నంత స్థాయిలో” అనే మాట ఎంత సబ్జెక్టివ్ అంటే, మన ముందు తరాలవారు, ఇంకా ఆ ముందు తరాలవారూ కూడా అలాగే అనుకుని ఉండరంటారా?
  2. కత్తి వల్ల మనిషికి నష్టం కానీ ప్రకృతికి కాదని మీరు బాగా చెప్పారు. అయితే, ఇక్కడ కూడా పై గోదావరి ఉదాహరణ వర్తిస్తుంది. సారంలో కత్తికి కొనసాగింపే అణుబాంబు. అలాగే, ప్రకృతిని నష్టపరచడం అనేది కూడా ఎప్పుడో మొదలైంది కనుక దానికీ గోదావరి సామ్యం వర్తిస్తుంది. కత్తి, విల్లమ్ముల కాలంలో జననష్టం, శాంతిభద్రతల రాహిత్యం ఎక్కువున్నాయా, లేక నేటి అణుబాంబు యుగంలో ఎక్కువున్నాయా అనేది కూడా ఇంకో ఆసక్తికరప్రశ్న.
  3. అయితే మనిషి తీసుకునే దిద్దుబాటు చర్యలు వర్తమానంలోనే జరుగుతూ ఉంటాయి. జరగాల్సిందే కూడా. మనిషి ఒక అవగాహనాపరుడిగా, యాక్టివిష్టుగా ఏకకాలంలో వ్యవహరిస్తూ ఉంటాడు. నేను అనేదల్లా సహస్రాబ్దాల మనిషి మనుగడ సరళిపై, చరిత్రపై అవగాహన వర్తమాన కార్యాచరణకు ఒక స్పష్టతను ఇచ్చి తోడ్పడుతుందని మాత్రమే.
  4. మీరన్న Benality అనేది కూడా కొత్తది కాదు. వివిధకాలాల్లో కనిపిస్తూనే ఉంది. క్షీణయుగాలు చరిత్రలో చాలా ఉన్నాయి. అలాగే నేటి తరం అభిరుచులను జెనరలైజ్ ఎంతవరకు చేయగలమనేది కూడా ప్రశ్న. ఇవన్నీ మీరన్నట్టు సూక్ష్మంగా విశ్లేషించాల్సినవే.

 8. rani siva sankara sarma says:

  విషయాలని అర్థం చేసుకోవడానికి అంతర్ద్రుష్టి అవసరం. గతాన్ని విశ్లేషించడం మీద మాత్రమె ఆధార పడ్డం పెద్ద లోపం. జ్ఞానానికి వోకోక్కసారి అనుభవమే అడ్డంకిగా వుంటుంది. ఈకారణం వల్లే కళాకారులు చెపే విధానం ఎక్కువ సత్య స్ఫోరకంగా ఉంటుంది. కళాకారుడు తర్కానికి తన హృదయాన్ని జోడిస్తాడు. అందువల్ల విషయాలు అర్థం అవుతాయి. కార్య కారణ తర్కం తో , చారిత్రిక విశ్లేషణతో నేటి ప్రపంచం ఎంతో మేలయినదని నిరూపించినా, మనం పట్టించుకోనక్కర లేదు. ఆభద్రమయిన దృశ్యం వెనుక వొక టైటానిక్ వొడ ప్రమాదం లాంటిది లేదని ఎలా చెప్పగలం? అంతకన్నా బ్రహ్మం గారి కాల జ్ఞానమే నయం. ఇటువంటి hrudayam లేని ఫక్తు ఆబ్జెక్టివ్ తర్కంలో తర్కం తప్ప జీవం లేదు ..

  • శర్మ గారూ, చరిత్రను తప్పించుకొని నిలవగలిగిన archemedian పాయింట్ ఏది మనిషికి అందుబాటులో లేదు. అలాగే సత్య వివేచనకు objective reasoning మినహా వేరే పద్ధతి లేదు.ఎందుకంటే సత్యాన్వేషణకు objectivity , విలువల ప్రతిపాదనకు చర్చా తర్కం (inter subjectivity ), రస ముల్యాంకనానికి అభిరుచి (subjectivity ) ప్రాతిపదికలు .లేకపోతే ప్రతి అంశాన్ని విలువలకో లేదా అభిరుచులకో సంబంధించిన అంశంగా అపార్థం చేసుకొని సంస్కృతి పరిరక్షనలోకో , తర్కాతీత ఇష్టారాజ్యనికో వెళ్లి పోతామేమో అని నా భయం.

  • భాస్కరం కల్లూరి says:

   తర్కాన్నీ, కార్యకారణ సంబంధ పరిశీలనను, జ్ఞానాన్ని తృణీకరించడం; అనుభవానికీ, జ్ఞానానికీ మధ్య వైరుధ్యాన్ని ఊహించుకోవడం; రెండింటి మధ్య లేని పోటీని తీసుకురావడం ఒక విపరీత, అసంబద్ధ పరిస్థితిని సృష్టిస్తాయి. అనుభవానికీ, జ్ఞానానికీ; హృదయానికీ, బుద్ధికీ మధ్య పరస్పర ఆధారతా, సమన్వయాలే తప్ప విరోధం లేదు. రెండూ ప్రకృతిదత్తాలే. ఏదో ఒకవైపు ఒరిగిపోయి మాట్లాడడం సాధారణ తర్కానికి కూడా నిలవని అయోమయవాక్యాలను సృష్టిస్తుంది.
   విషయాలను అర్థం చేసుకోడానికి అంతర్దృష్టి(అనుభవం నుంచి కలిగే?)అవసరమని శర్మగారు అన్నారు. మళ్ళీ ‘గతాన్ని విశ్లేషించడం మీద మాత్రమే ఆధారపడ్డం పెద్ద లోపం’ అన్నారు. అంటే, విశ్లేషణాత్మక జ్ఞానమూ, ఆవిధంగా తర్కమూ, కార్యకారణ సంబంధ పరిశీలనా ఒక మేరకు అవసరమే కానీ, అనుభవాన్ని దృష్టిలో పెట్టుకోవాలనీ, దానికే పెద్ద పీట వేయాలనీ ఆయన ఉద్దేశంలా కనిపిస్తోంది. నేను అనుభవాన్ని నిరాకరిస్తున్నానన్న అపోహను నాకు ఆపాదించే అవకాశాన్ని ఊహించే, మనిషి తీసుకునే దిద్దుబాటు చర్యలు వర్తమానంలోనే జరుగుతూ ఉంటాయనీ, జరగాల్సిందే ననీ, మనిషి అవగాహనాపరుడిగా, యాక్టివిష్టుగా కూడా ఏక కాలంలో వ్యవహరిస్తూ ఉంటాడన్నాను.
   ‘జ్ఞానానికి ఒక్కోసారి అనుభవమే అడ్డంకిగా ఉంటుం’దని శర్మగారి ఇంకో వాక్యం. ఈ వాక్యాన్నితిరగేసి ‘అనుభవానికి జ్ఞానమే ఒక్కోసారి అడ్డంకిగా ఉంటుం’దని కూడా అనచ్చు. అలాగే, ‘కళాకారుడు తర్కానికి తన హృదయాన్ని జోడిస్తాడు’ అనే వాక్యాన్ని కూడా తిరగేసి, ‘జ్ఞాని(వేదాంత పరిభాషలో కాదు)తన హృదయానికి తర్కాన్ని జోడిస్తాడు’ అనచ్చు. ఇలా తిరగేయగలగడం కళాకారుడికి, జ్ఞానికి; హృదయానికి, తర్కానికి మధ్య వైరుధ్యాన్ని కాక, సమన్వయాన్ని, పరస్పరాధారతను పరోక్షంగా సూచిస్తూ ఉండచ్చు.
   ‘కార్యకారణ తర్కంతో, చారిత్రక విశ్లేషణతో నేటి ప్రపంచం ఎంతో మేలైనదని నిరూపించినా మనం పట్టించుకోనక్కరలేదు’ అని శర్మగారి ఇంకో వాక్యం. ‘కార్యకారణ తర్కంతో, చారిత్రక విశ్లేషణతో నేటి ప్రపంచం ఎంతో పాడైం’దని నిరూపిస్తే? అప్పుడు ఆ కార్యకారణతర్కంతోనూ, చారిత్రకవిశ్లేషణతోనూ కూడిన నిరూపక జ్ఞానం శర్మగారి లాంటి హృదయవాదులకు నచ్చుతుందా? నేటి ప్రపంచం మేలైనదని నిరూపించే జ్ఞానం పనికిమాలినదై, పాడైందని నిరూపించే జ్ఞానం పనికొచ్చేదనడం ఎంత హాస్యాస్పదమో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.
   ‘ఆ భద్రమైన దృశ్యం వెనుక ఒక టైటానిక్ ఓడ ప్రమాదం లేదని ఎలా చెప్పగలం?’ అని ఇంకో వాక్యం. నేను నేటి ప్రపంచాన్ని భద్రమైన దృశ్యమని అనలేదు. కాకపోతే, అభద్రత అనేది ఇప్పుడున్నట్టే, గతంలోనూ ఉందన్నాను. ప్రపంచాన్ని పూర్తిగా అభద్రతలోకి నెట్టి క్షణాలలో భస్మీపటలం చేయగలిగిన అణుబాంబు ఇప్పుడు మనిషి దగ్గర ఉన్నా; విచిత్రంగా ఇప్పుడే గతంతో పోల్చితే శాంతి భద్రతలు ఎక్కువున్నాయన్నాను. ఇది స్థూలంగానూ, సాపేక్ష దృష్టితోనూ అన్నది. కరవు కాటకాల లేమినీ, ప్రజాస్వామిక వ్యవస్థలను, మానవ హక్కుల స్పృహను వగైరాలను కూడా దీనికి కలుపుకోవచ్చు. ఇదే సమయంలో బుద్ధి లోపించిన ఏ ఉన్మత్తుడైనా అణుబాంబు మీట నొక్కే అవకాశమూ లేకపోలేదన్నాను. ఇలా అనడంలో నేటి ప్రపంచాన్ని భద్రమైన దృశ్యంగా చూపించడం కాదు. బుద్ధిని కూడా మింగేసే స్థాయిలో హృదయవాదం వికటిస్తేనే నా వాక్యాలలో విపరీతార్థాలు కనిపిస్తాయి.

 9. “(తర్క) జ్ఞానానికి ఒక్కొక్కసారి అనుభవమే అడ్డంకిగా వుంటుంది”. — నిజం శివశంకర శర్మగారూ.. బైరాగి తత్వాలను నేను చాలా మిస్ అవుతున్నాను.

 10. లలిత గారి ఆలోచనల్లో ఒక పొరపాటు వుంది . ప్రగతి ని మనం ఎలా నిర్వచిస్తున్నాము? ప్రకృతిని తన అవసరాలకు వాడుకోకుండా మానవ జాతి బతక లేదన్న విషయం తెలిసిందే. సమస్య, ఆ వాడే క్రమం లో ప్రకృతి పునరుజ్జీవనానికి తగినంత విడుపు ఇస్తున్నామా లేదా అన్నది మాత్రమే. కేవలం బతకడానికి , ఉన్నత ప్రమాణాలతో నైనా సరే. బతకడానికి మాత్రమే ఉత్పత్తి సాగిస్తే, అది కూడా పునరుజ్జీవనానికి తగినంత్హ విడుపు ఇస్తూ సాగిస్తే సమస్య ఎక్కడుంది?
  సమస్య, వ్యక్తిగత లాభాపేక్ష తో, పెట్టుబడి అనియంత్రంగా ప్రకృతి వనరులను కొల్లగొట్టడం లో వుంది. ఈ గుట్టు బయట పడకుండా, ఈ నేరం తెలియకుండా ఉండేందుకు పెట్టుబడి సమాజానికి అలవాటు చేసే ప్రమథ్యు(promethian ) భావజాలంలో వుంది.ప్రకృతిని మనిషికి బాహ్యమైనదిగాపరిగణించే instrumentalism లో వుంది.అంతే తప్ప ప్రగతి అనే భావనలో లేదు.

 11. ప్రగతి అనే మాటను విస్త్రుతార్ధంలో వాడాను నేను భార్గవ గారూ. దానిని కాదంటే ఈ రోజు వరకూ నేను ఉండేదానినో లేక ఏ పెద్దమ్మ వారో సోకి ముప్పైలలోనే పోయేదాన్నో. ఎక్కువ న్యాయం, కొంత ప్రగతీ అంటే నా దృష్టిలో మీలాగే అవసరమైనంత ప్రగతి అనే. కానీ అది అక్కడితో ఆగుతుందా? ప్రగతి అనే భావనను నిరంతరం మనిషి పరీక్షించుకుంటే తప్ప ప్రకృతితో పాటు ఏ సమాజాలకైనా నష్టం తప్పదు. అంత నిరంతర పరీక్ష చేసే ఓపిక ఎన్ని సమాజాలలో ఉంది? ప్రకృతి పునరుజ్జీవనానికి తగినంత విడుపు ఇచ్చే పరిస్థితి అసాధ్యం కాకపోయినా ముసలితనంతో రోగంతో కూడా మనిషి ఎక్కువకాలం జీవిస్తున్న పరిస్థితుల వల్ల కూడా కొంతవరకూ కష్టం కావచ్చు. ఈ పునరుజ్జీవనాన్ని మనిషిలోని స్వార్థపు పార్శ్వాన్ని రెచ్చగొట్టే పెట్టుబడి మరీ అసాధ్యం చేస్తోంది. ఎంతో కష్టపడి చావును జయించే మందు కనిపెట్టారే అనుకోండి. అదీ ప్రగతే కదా, ముప్పు తెచ్చేదే అయినా సరే. మానవప్రకృతి మీద ఎంత నమ్మకం ఉంచగలమో భాస్కరంగారు చెప్పినట్టు అంత అపనమ్మకమూ మనకు తప్పదు (అణుబాంబు). ఒట్టి తర్కంతో చావుని జయించెంతవరకూ పోగల మనిషి ప్రగతికి కొంతైనా అడ్డుకట్ట వేసేది కాస్త విచక్షణతో పాటు వదులుకోవటం కూడా నేర్పగల అంతర్ద్రుష్టి.

 12. rani siva sankara sarma says:

  కాస్తంత నిజాయితీగా మాట్లాడుకుందాం. మార్క్సు కుడా పర్యావరణ విధ్వంసం గురించి మాట్లాడాడు అని yiTeevale అంటున్నారు కాని దశాబ్దాల క్రితం యిటువంటి చర్చే లెదు. చెర్నొబిల్ ప్రమాదం లాంటివి మన కళ్ళు తెరిచాయి. సైంటిస్టులు గగ్గోలు పెట్టడం కూడా కారణం. కాని విశ్వనాథ సత్యనారాయణ వేయి పడగలు నవలలో ముందుగానే ఎంతో హృదయంగమంగా యీపరిణామాలని చిత్రించాడు . అంతర్ద్రుష్టే దానికి కారణం. నిజానికి ఆధునిక తర్కం కళ్ళకు గంతగామారిపోయింది . కేవలం ద్రుష్టాన్తాలమీద ఆధారపడడం దాని లోపం . ..

 13. rani siva sankara sarma says:

  , కంటికి పొడగట్టే తక్షణ ద్రుశ్యాలూ మనని గుడ్డి వాళ్ళని చేసే ప్రమాదం వుంది. చర్మచక్షువులకు గల పరిమితులు గుర్తించాలి. ప్రపంచయుద్ధాలని వాటీ తరువాత మానవ ప్రగతిపై అంతకు ముందున్న ఆశావాదాన్ని వదులుకొన్న హెచ్ జి వేల్స్ లాంటి మెధావులని ఎలా మరిచిపోయారు భాస్కర్ గారు? కాలాన్ని తన జీవిత కాలానికి కుదించుకోవడమే దానికి కారణం. యింకప్రజాస్వామ్యమూ పౌరహక్కులు వంటివి పాశ్చాత్య పెట్టుబడిదారీ వ్యవస్తకి ముసుగులే. వాటి పేరుతొ ఎన్నో యుద్ధాలు చేసింది అమెరికా. కనబడేదే సత్యమైతే శాస్త్రమే అవసరం లేదు. లోచూపు అవసరం..

  • భాస్కరం కల్లూరి says:

   అవును, నిజాయితీగా మాట్లాడుకోవలసిందే. పర్యావరణ విధ్వంసం గురించి దశాబ్దాల క్రితం చర్చ లేదన్న మీ అభిప్రాయాన్ని ఒక చరిత్రపాఠకుడిగా నేను వెంటనే ఆమోదించలేను. కాకపోతే, ఆ పేరుతో ఉండకపోవచ్చు; అదొక పూర్తిస్థాయి నిర్దిష్టాంశంగా అభివృద్ధి చెంది ఉండకపోవచ్చు. పర్యావరణస్పృహ ను పెంచుకోవడంలో ఉద్దేశం ప్రకృతి పరిరరక్షణ, ప్రకృతిపట్ల దృష్టి అనుకుంటే; లేదా పర్యావరణస్పృహ అంటే ప్రకృతి స్పృహే ననుకుంటే ఆ స్పృహ మన ఇతిహాసాలనిండా, కావ్యాల నిండా, కళల నిండా ఉంది. నదులకు కృత్రిమంగా ఆనకట్టలు కట్టి దారి మళ్ళిస్తే ప్రకృతి ఉత్పాతాలు సంభవిస్తాయని పురాణాలలో ఉన్నట్టు మా నాన్నగారు చెబుతూ ఉండేవారు. మహారాష్ట్రలో చాలా ఏళ్ల క్రితం ఒక భూకంపం సంభవించిన సందర్భంలో అక్కడి కొయినా డ్యామ్ కు దానికీ సంబంధం ఉన్నట్టు ఒక అభిప్రాయం వ్యక్తమైంది. ఇంకా అధ్యయనం చేయాల్సిన కోణం కనుక ఇంతకన్నా లోతుకు వెళ్ళను.
   చెర్నోబిల్ తర్వాతే మనం కళ్ళు తెరిచామనడాన్నీ నేను సందేహిస్తాను. అంతకంటే చాలాముందు అణుబాంబు సృష్టించగల విధ్వంసాన్ని చూశాం. మనదేశంలో ఆ తర్వాత, అధికదిగుబడి సంకరవిత్తనాలతో, పురుగుమందులు, రసాయనిక ఎరువులతో హరిత విప్లవాన్ని తెచ్చుకున్నాం. ఇందువల్ల పర్యావరణానికి జరిగే హాని గురించి, భవిష్యత్తులో మళ్ళీ ఆర్గానిక్ పంటలవైపు మళ్ళాల్సిన అవసరం గురించి ఊహించడానికి విశ్వనాథ సత్యనారాయణగారికి ఉన్నట్టు మీరు చెప్పిన లోచూపే ఉండాల్సిన అవసరం లేదు. శాస్త్రదృష్టి ఉంటే చాలు. అదీగాక, ఆ లోచూపు, లేదా విచక్షణ ఎవరో కొందరు వ్యక్తులకు ఉన్నా, లేదా ఒక్కోసారి అందరికీ ఉన్నా సరిపోదు. ఇతరులను దేహీ అనకుండా పెరుగుతున్న జనాభాకు తిండి పెట్టడం- ఆ లోచూపును, విచక్షను మించిన ఆనాటి అవసరం.
   కనుక బలవత్తరమైన తక్షణ భౌతిక అవసరాలు మీరన్న అంతర్దృష్టిని జయిస్తాయి. ఆ అంతర్దృష్టి వ్యక్తుల స్థాయిలో ఉన్నా సరిపోదు, వ్యవస్థల స్థాయిలో, సమూహాల స్థాయిలో ఉండాలి. అది కలగడానికి తగిన భౌతిక పరిస్థితులు కూడా ఉండాలి. మనదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక అణగారిన సమాజాలు, సమూహాలు తమ అస్తిత్వం కోసమే కాక, ఆధునిక అభివృద్ధి(దానిని మీరు ఎంత వ్యతిరేకించినా సరే)లో తమ వాటాకోసం ఊర్ధ్వచలన ప్రయత్నంలో ఉన్నాయి. మీరిక్కడితో ఆగిపోయి వెనక్కి వెళ్లండని చెబితే వారు ఒప్పుకోరు. రెండువందల ఏళ్లపాటు ఇంగ్లీష్ చదువుల్లో పైకి వచ్చిన అగ్రకులాలవాళ్లు, ఇప్పుడు మాతృభాషే ముద్దు అంటూ చేస్తున్న ఉద్యమాన్ని కంచ ఐలయ్య లాంటి వ్యక్తులు ఎలా వ్యతిరేకిస్తున్నారో చూస్తున్నాం. విద్యుత్ సమస్యనే తీసుకుంటే, ఇటీవల జపాన్ లో అణువిద్యుత్ కేంద్రంలో ప్రమాదం సంభవించిన తర్వాత కూడా మన దేశంలో అణువిద్యుత్ కేంద్రాల స్థాపనకు అనుకూలంగా వాదాలు వినిపిస్తుండడం మనకు తెలుసు. విద్యుత్ అందరికీ అందుబాటులోకి వచ్చేవరకూ మీరు అణువిద్యుత్ కేంద్రాలు వద్దని ఎంత చెప్పినా వినరు. మీ వాదానికి అనుకూలంగా అందరినీ కూడగట్టుకునే వరకూ, లేదా మీరు చెప్పిన లోచూపు అందరికీ ఏర్పడేవరకూ మీరు పరిణామగతిని మార్చలేరు. ఆ సంగతి గ్రహించకుండా మీరు ఏకపక్షంగా ఎంత మాట్లాడినా అది కంఠశోషే అవుతుంది.
   ఇక ‘ఆధునిక తర్కం’ అంటూ జ్ఞానంలో కాలభేదాన్ని మీరు తీసుకురావడం; ప్రజాస్వామ్యం, పౌరహక్కులతో సహా నేటి మొత్తం ప్రపంచానుభవాన్ని పాశ్చాత్య పెట్టుబడిదారీ వ్యవస్థకు, అమెరికాకు మీరు కుదించడం మీనుంచి ఇంకా వివరణ అవసరమైన విషయాలు. మీ మొత్తం వాదాన్ని యాంటీ-అమెరికా ప్రిజమ్ నుంచి చూస్తున్నదిగా భావించే ప్రమాదం ఉంది. అలాగే, అంతర్దృష్టి, చర్మచక్షువులు అనే మాటలు వేదాంతసీమల్ని తాకుతూ సెక్టేరియన్ గా మిమ్మల్ని చూపిస్తున్నాయేమో కూడా మీరు పరిశీలించుకోవాలి,

 14. Thirupalu says:

  శాస్త్ర దృష్టే లేని వారికి పర్యావరణ దృష్టి ఉంటుందా ? ప్రకృతీ బీభస్తాలన్నీ దైవ కల్పనగా కొట్టి పారేసే దేశంలో పర్యావరణ దృష్టి పెరగడానికి ఎంతకాలం పడుతుందో? – అదీ ప్రజలంతా మధ్య యుగాలకు మళ్ళాలని అదేసిస్తున్నప్రభుత్వాలున్న దేశంలో !

  • Lalitha P says:

   మన ఆధునిక శాస్త్ర దృష్టి లేకుండా కూడా పర్యావరణ దృష్టి ఉంటుంది తిరుపాలు గారూ. ఆదివాసులు పర్యావరణాన్ని కాపాడుకునేది ఆధునిక దృష్టితో కాదు. దానిమీద బతుకుతున్నామనే చిన్న కామన్ సెన్స్ తో. శాస్త్రదృష్టితో చాలా దూరం వచ్చి డ్యాంలు కట్టి, ఇప్పుడు వెనక్కి తిరిగితే పెద్ద డ్యాంల వల్ల ప్రమాదం ఉందని అర్థం చేసుకుంటున్నాం. ఏ శాస్త్ర దృష్టిని అప్లై చేయాలనుకున్నా ముందు మనం అక్కడి ప్రజల time tested విజ్ఞతనూ తీసుకోవాల్సిందే. ఇప్పుడు వెనక్కు తిరగటం మన ఆధునికులకే ఎక్కువ కష్టం.

 15. కె.కె. రామయ్య says:

  పి.లలిత గారు, భాస్కరం గారూ … మనిషి ప్రగతి, గ్లోబలైజేషనూ, పర్యావరణ విధ్వంసం, ప్రకృతి పరిరరక్షణ, ప్రకృతి పునరుజ్జీవనం అంశాలపై చాలా ఆసక్తికరంగా చర్చ సాగిస్తున్నందుకు కృతజ్ఞతలు. దీన్నిమీ ప్రైవేట్ మెయిల్స్లో కాక ఇక్కడే కొనసాగిస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. ( పి లలిత అని వివరంగా ఎందుకు రాస్తున్నానంటే ఇదే సారంగలో దాట్ల లలిత గారూ కొన్ని మంచి కధలు రాసారు ).

  అభివృద్ది చెందిన (పాశ్చాత్య పెట్టుబడిదారీ) దేశాలైన అమెరికా, యూరోపు, జపాన్ వంటివి తమ ప్రకృతి సంపదను, పర్యావరణ సమతుల్యతను భద్రంగా కాపాడుకుంటున్నవైనము, బడుగు దేశాలలో జరుగుతున్నవిధ్వంసం గురించి కూడా ప్రస్తావించరా.

  Antonioni సినిమా ‘Deserto Rosso’ (ఎర్రని ఎడారి)కి youtube లింక్ వ్యాసం చివరిలో సరిగా కనిపించటంలేదు. దయచేసి మరోసారి ఇవ్వగలరా.

  • Lalitha P says:

   నేను కూడా మీలాగే దాట్ల లలితగారి అభిమానినే రామయ్యగారూ.

   జపాన్ అణు ప్రమాదం తరువాత జర్మనీ అణువిద్యుత్ వద్దనుకుంది. అమెరికాలో కూడా కొత్తవి లేవు. మిగతా మనలాంటి దేశాలన్నీ మహోజన్ గారు చెప్పినట్టు మనవాటా విలాసాల కలలు కంటూ ధ్వంసం కానిస్తున్నాయి. మన జనాభా అందరి కార్లూ తిరగటం కోసం ఎన్ని చెట్లు కొడితే, ఎంత ఇంధనం తవ్వితే అమెరికా రోడ్లనూ ఆ జీవనస్థాయినీ అందుకోవాలి మరి…

   ‘Deserto Rosso’ torrents లో దొరుకుతుంది. యు ట్యూబ్ లో లేదు.

 16. rani siva sankara sarma says:

  మీ నాన్నగారు పౌరాణికులు కావడం వల్ల అంతర్ద్రుష్టితో సత్యాన్ని గ్రహించారు. వారి సంప్రదాయ బలం అది . విశ్వనాథదీ అంతే. వాళ్ళకళ్ళకి చరిత్ర పురోగతి గంతలులేవు. మరి యిప్పుడు నరేంద్రమోడి ఆర్ష గ్రంధాలలో ఏం చూస్తున్నాడు. విచక్షణ రహితమైన అభి వృద్ధి నమునాని చూస్తునాడు. ఎందుకు? మీరు వేదాంత పరిభాసలో సేక్టేరియనిజాన్ని చూశారు. మరి మీకమ్యునిష్టు గురువు రాంభట్ల శంకరాచార్య వేదాంతం లో భౌతిక వాదాన్ని చూశారు. ఈసంగతి మీరు సారంగలోనే ప్రస్తావించారు. యీవిస్మ్రుతి ఎందుకు దాపురించింది మీకు? దాన్ని మాయ అందామా? పాశ్చాత్య వ్యామోహం మీలో అన్తస్సూత్రాన్ని మాయం చేసి ఫక్తు చారిత్రిక శుష్క తర్కాన్ని మిగిల్చిందా? కంచ ఐలయ్య గారు అవసరమైతే ఇంగ్లండుకి ఇంగ్లీషు లోకి వలస పోతారు. ఫక్తు తెలుగు రచయితగా, మంచి తెలుగు వచనం రాసే వాళ్ళుగా ముద్ర పడిన మీరు ఎక్కడికి పోతారు. ఆతెలుగు భాష నుంచి వేదాంత వైదిక పరిభాషలని ఎలా మినహాయిస్తారు? తత్వశాస్త్రం జ్ఞానం విద్య ప్రవక్త లాంటి పదాల మూలాలని ఏ ఆధునికతర్కంతో తెగనరుకుతారు? సంస్కృతినుంచి భాషని ఎలా వేరు పరుస్తారు. సంస్కృతిని భాషని , ప్రకృతిని మనిషిని యిలా ప్రతిదాన్ని సంబంధం లేకుండా వేరు పరుస్తూ పోవాలన్నదే ఆధునిక తర్కం. భాషని ప్రకృతిని మానవుడి తక్షణ అవసరాలకి ఉపయోగించడమే మానవ చరిత్ర పరమావధి. ప్రాగ్మాటిజమె తత్త్వం. దృష్టే సృష్టి. వేదాన్తమైనప్పటికీ యిదే సత్యం. kantha సోష మంచిదే. బ్రహ్మం గారి తత్త్వం వినలేదా? చెప్పలెదంటనకపొయారు అందుకే గొంతు చించుకోవడం. మీకు తక్షణ పరిష్కారాలు సమాధానాలూ కావాలి. వరల్డ్ యాస్ ఐ సి లో ఐనిస్టీన్ ఏమన్నాడు. నాలెడ్జ్ ఫోర్ నాలెడ్జ్ సేక్ అన్నాడు. మన వలస గుమాస్తా విద్య మనని బౌద్ధిక గుమాస్తాలుగా తక్షణ ప్రయోజన వాదులుగా మార్చింది. అందుకే మనం పరిష్కారం చూపించు అని వెంటనె అడి గేస్తాం. మనకి పరిష్కారాలు చూపించే తెల్లదొర కావాలి. నీకు నీవే దీపానివి అనే బుద్ధుని వేదాంత వాక్య మెకాలే మానస పుత్రులకి యెక్కడా తలకెక్కుతుంది?

 17. అసురుడు says:

  మేడమ్ లలితగారు చాలా బాగా రాశారు.

  • రాణి శివశంకర శర్మ గారి వాక్యాలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి.ఏది మాయ , ఏది వ్యామోహం ? ఒక బహిరంగ స్థలంలో చర్చ చేస్తున్నామన్న స్ప్రిహ కూడా లేకుండా ఈ వీరంగం ఏమిటి? ఈ ధోరణి ఏ మనస్తత్వాన్ని సూచిస్తున్నది . నేను చెప్పిందే వేదం అనుకునే ఒక కుపస్త మాండుక అవిద్యా పీడిత బ్రాహ్మణా దురహంకారం లా లేదూ ఇది ?సనాతన ధర్మాన్ని అంటే ఇది,హిందుత్వమంటే ఇది అని మీరు ఆధునిక తర్కాన్ని వుపయోగించి విశ్లేషణ సాగించవచ్చు , పాశ్చాత్య వలసవాదుల కుతన్త్రాలని ఎండగట్టి హిందుత్వ అన్నది క్రైస్తవానికి కాపి అని నిరూపించేందుకు మీరు చరిత్రలోకి ఎంత దూరమైనా పోవచ్చు, కాని ఇతరులకు మాత్రం చరిత్రలోకి ప్రవేశం నిషిద్దమా?మార్క్స్, ఐంస్టీన్ మొదలైన వాళ్ళ కొటేషన్ల తో మీరు సరిపెట్టుకోవచ్చు , మీకు వత్తాసు గా తెచ్చు కోను వచ్చు. కాని వాళ్ళ సిద్దాంత పద్ధతి మాత్రం పాశ్చత్యము, అపరిగ్రాహ్యమా? ఈ ఉష్ట్ర పక్షి చింతనా పద్ధతినే కదా మీరు సనాతన భారతీయ ఆత్మ అంటున్నది? మీ వాదన పద్ధతి బుద్దుడు , శంకరుని లాంటి మీకిష్టమైన ప్రాచిన తాత్వికుల పద్ధతి లాగ లేదు. త్రిపురనేని మధుసూదన్ రావు పద్ధతి లాగ వుంది . మీ పాత శిక్షణ ప్రభావం నుంచి తొందరగా బయట పడి, అక్కడ నేర్చుకున్నదానికి మార్క్సిసం కు ఏ సంబంధం లేదని గ్రహించి , ఓపెన్ మైండ్ తో నేర్చుకోవడానికి ,, ఓపిక గా వివరించడానికి సిద్దమైతే బాగుంటుంది.లేక పోతే మీరు సత్యాన్వేషణ ముగిసి అనుగ్రహ భాషణ మొదలుపెట్టిన పీఠాధిపతి లాగ కనిపిస్తారు.

 18. MSR KRISHNA says:

  spontaneous information

 19. ఈ వ్యాసాన్ని పూర్తిగా చదవకుండానే ఈ వ్యాఖ్య వ్రాస్తున్నందుకు క్షమించండి.

  ప్రతీదాంట్లోకీ ప్రజాస్వామ్యాన్నీ, సమ సమాజాన్నీ ఎత్తుకు రావడం అలవాటైన కాలంలో- ఉన్నత వర్గాల సుఖజీవనం (సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంకా అభివృద్ధి పేరిట జరుగుతున్న ప్రకృతి విధ్వంసం) లో తమకీ వాటా కావాలనీ ఉన్నతేతర వర్గస్థులు కూడా డిమాండు చేస్తున్నారు. వాళ్ళు చెయ్యకపోతే వాళ్ళ తరఫున మీడియా చేస్తుంది. ఇది ఓ రకం క్రమ్మరింపరాని డౌన్ స్లైడ్. It is an unstoppable run-away train. It will come to a halt only after a total world-wide collapse.

  • Lalitha P says:

   మహోజస్ గారూ.. వందనాలు.. వాటాల గొడవలో ఇలా మాట్లాడేవారి గొంతులు వినబడటమే లేదు…

  • ‘ నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష ‘ అన్నట్లు ఉన్న దాంట్లో నే పోటి పడు తున్నారు. ప్రకృతి అమెరికాకు మిగతా దేశాల ఉన్నత వర్గాలకు గుత్త సొమ్ము అని పోటి పడగూడదా? తమను అనుసరించాలని గదా ఉన్నత వర్గాలు కోరుకుంటున్నది? ఆ అనుసరణలో పోటి ఉమ్డ గూడదన్న మాటా? ఏమి తెలివి ఏమి తెలివి సామ్రాజ్య వాదానికి?

 20. rani siva sankara sarma says:

  మహోజస్ గారిది మహా వాక్యం. ఎంత గొప్పగా చెప్పారు. మహోజస్ గారు తప్పని సరిగా ఈ చక్కని వ్యాసాన్ని చదువుతారని ఆశిస్తున్నా.

  • భాస్కరం కల్లూరి says:

   ప్రతి దాంట్లోకీ ప్రజాస్వామ్యాన్ని, సమానాత్వాన్ని తీసుకురావడాన్ని; ఉన్నతవర్గాల సుఖజీవనంలో తమకు వాటా కావాలనడాన్నీ తప్పుపడుతున్న మహోజస్ గారి వాక్యాలను మహావాక్యాలుగా శివశంకరశర్మగారు ప్రస్తుతించడం; లలితగారు ఆయనకు వందనాలు చెబుతూ, వాటాల గొడవలో ఇలాంటి గొంతులు వినిపించడం లేదనడం నాకైతే ఆశ్చర్యం కాదు; దిగ్భ్రాంతి కలిగిస్తోంది. లలితగారూ…నిజానికి ఇటీవలి కాలంలో ఇలాంటి గొంతులే గట్టిగా వినిపిస్తున్నాయండీ. వివరాల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. మహోజస్ గారి మహావాక్యాలను అందరికీ అర్థమయ్యే భాషలోకి తర్జుమా చేసుకుంటే ఇలా ఉంటుంది: ప్రతి దాంట్లో ప్రజాస్వామ్యం పనికిరాదు. సమానత్వం పనికిరాదు. ఉన్నతవర్గాల సుఖజీవనంతో ఉన్నతేతరవర్గాలు; అంటే, దళితులు, పేదలు పోటీ పడకూడదు. ఎందుకంటే, పర్యావరణానికి ప్రమాదం ముంచుకొచ్చింది కనుక! యుద్ధ సమయాల్లో ఎమర్జెన్సీ విధించినట్టుగా పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజాస్వామ్యాన్ని, సమానాత్వాన్ని నిషేధించివేయాలి. ఇందుకు సంబంధించిన సామాజిక వ్యవస్థా బ్లూ ప్రింటుకు ఎంతో దూరం వెళ్లాల్సిన అవసరం లేదు. మన చాతుర్వర్ణ్య వ్యవస్థా బ్లూప్రింటు దీనికి అతికినట్టు సరిపోతుంది. చరిత్రలోకి వెడితే ఇందుకు సంబంధించిన మరో నమూనా కూడా మనకు దొరుకుతుంది. అది, రోమన్ గణతంత్రవ్యవస్థ. అందులో కూడా ఉన్నతవర్గాలకు, కులీనులకు మాత్రమే చోటు ఉండేది. మనం చేయాల్సిందల్లా కాలాన్ని వెనక్కి తిప్పడమే. ఎంత తేలికైన పరిష్కారం!
   విచిత్రంగా చూడండి…కార్బన్ ఎమిసన్స్ ను తగ్గించి పర్యావరణాన్ని రక్షించే విషయంలో అమెరికా లాంటి దేశాలు కూడా మనదేశం లాంటి దేశాలకు ఇదే బోధిస్తున్నాయి. కార్బన్ ఎమిసన్స్ కు ఎక్కువ బాధ్యత తమదే అయినా తమతో పోటీ పడద్దనీ, మీ కార్బన్ ఎమిసన్స్ ను తగ్గించుకోండనీ చెబుతున్నాయి. కానీ పైన చెప్పిన మహావాక్యాలు మనదేశం లాంటి దేశాల పాలకుల చెవినపడినట్టులేదు. ఇది అన్యాయమంటున్నారు. మేము కూడా ఒక స్థాయి అభివృద్ధికి చేరుకునేవరకూ సమయమిమ్మని అడుగుతున్నారు.

   • చాలా బాగా చెప్పారు సార్!
    రాణీ శివశంకరశర్మగారు భావ వాదంలో భౌతిక వాదాన్ని చూఅడ గలరు. భౌతిక వాదంలో భావవాదాన్ని చూడ గలరు! పాపం ఈయనకు భౌతిక వాదం గురించి మాటాడితే భావ వాదులతో భయం! భావ వాదాన్ని పూర్తిగా అంగీకరిస్తే ఆధునికుడు అని పించు కోరేమో నని భయం. ఆయన అగసాట్లు ఆయనివి.

   • Lalitha P says:

    వాటాలు అంటే నేనన్నది విధ్వంసంలో వాటాలు భాస్కరంగారూ. అందరికీ పోషకాహారం, ఉచిత వైద్యం అవసరాలు. పోషకాహారం అందరికీ భూమి ఇవ్వగలదు. వీటిలో వాటాలు పోరాడి మరీ సాధించుకోవాలి ఎవరైనా సరే. నిరంతరంగా జాగ్రత్తగా వాడుకోకపోతే నీరూ గాలీ కూడా దొరకవు. విధ్వంసక మోడల్ వల్ల అందరికంటే ఎక్కువగా నష్టపోయేదీ నశించేదీ పేదలే. ఉన్నవాడి విలాసాల కోసం జీవనాధారాలే పోతున్న పరిస్థితి ఉంది గనుకే కూడంకులం, సోంపేట, జెర్రెల… ఇలా దేశమంతటా పోరాటాలు… విలాసాలు అనుభవిస్తున్న అమెరికాలో జి.ఎం. ఆహారం వల్ల ప్రతి ముగ్గురిలో ఒకరికి కాన్సర్. ఆ రకం జీవనానికి పోటీ పడేకంటే ఆరోగ్యకరమైన మధ్యతరగతి జీవితం చాలు ఎవరికైనా సరే. “మెరుగు బంగారంబు మింగలేం”. మూడో ప్రపంచ దేశాలలో ఈ resistance movements వల్ల అమెరికా కంటే ఎక్కువగా తమని తాము రక్షించుకోగలిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడే నేను సంస్కృతికి ప్రాముఖ్యత ఇస్తున్నాను. అది ప్రగతి నిరోధకం కాదు. కార్బన్ ఏమిషన్స్ లో పోటీ కంటే మనిషి ఆరోగ్యకరంగా జీవించటంలో పోటీ పడటం మంచిది దేశాలన్నీ…

 21. ప్రకృతినీ, సంస్కృతినీ , మనిషిని ఒకే తలం లో నిలబెట్టి ఒక అవిభాజ్య అఖండ వాస్తవం గా భావించే ధోరణి ఒక అమాయక సత్తావాద ధోరణి. వాస్తవికత(రియాలిటీ) అన్నది మూడు దొంతరలుగా ఉంటుందని గ్రహించాలి. ఇంద్రియానుభవం లోకి వచ్చేది అన్నిటికన్నా పై దొంతర(empirical ). ఘటనలుగా వ్యక్తమయ్యేది రెండవ దొంతర-( actual ). అవ్యక్తంగా వుంటూ ఘటనలకు కారణమయ్యెది అట్టడుగు దొంతర ( real ). ఈ stratification గురించి అర్థం చేసుకోకుండా తత్వ చింతన చెయ్యడం అమాయకత్వం . తత్వ విచారం లో ప్రాచ్చ్య , పాశ్చ్చ్యాత్య విభేదం చూడడం తాత్విక దారిద్ర్యం. బౌద్ధిక పలాయనత్వం. తర్కాలకు వ్యతిరేకంగా తర్కాలు చేసిన వాళ్ళను చూసాం. జ్ఞానానికి సిద్ధాంతమే అక్కర లేదంటూ సిద్దాంతాలు చేసిన ప్రబుద్దులను కూడా చూసాం . వీళ్ళందరి ఆది గురువు Martin heideggar . ఈయన నాజీ పార్టీ లో చురుకైన సభ్యుడుగా వుండే వాడని ఆ తరువాత ఎప్పుడు పశ్చ్చాత్తాపం చూపలేదని మనకు తెలుసు. అందుకే మనిషిని సంస్కృతి చేతిలో కీలుబొమ్మగా , ప్రకృతి తో తాదాత్మ్యం చెందేవాడిగా ఎవరు వుహించినా అది తప్పక సమస్యకు దరి తీస్తుంది.

 22. rani siva sankara sarma says:

  నేను ఆధిపత్యాన్ని మాత్రమె ప్రశ్నిచాను . పాశ్చాత్యాన్ని కాదు. పాశ్చాత్య ఆధిపత్యమయినంత మాత్రాన అది ప్రగతిశీలంగా మారిపోదు.

  • మీరు పాశ్చాత్యం అని దేన్నీ అంటున్నారు ? వలసవాదం, పెట్టుబడి, ఆధునికత. ఇవి ముడింటినె కదా? వలసవాదం మనమందరం ఇన్నాళ్ళు గుడ్డిగా వాదించినట్లు మన సంస్కృతి లో పెద్దగా జోక్యం చేసుకోలేదు.
   సతి నిషేధ చట్టం కూడా మన వాళ్లు అడగగా ఇచ్చిందే. అందుకు వాళ్ళను తప్పు పట్టలేము కూడా. ఇక వాళ్ళ దోపిడీ, అణచివేత గురించి కొత్తగా కనిపెట్టేదేమి లేదు. వాళ్ళు వచ్చిందే అందుకు.

   కాని మన ఆంతరంగిక సాంస్కృతిక జీవనం లో వాళ్ళు చాలా మార్పు తెచ్చారు అనడం కుదరదు. అసలు వాళ్ళ పాలన స్థిర పడ్డదే స్థానిక ఆధిపత్య వర్గాల కులాల తో కుదిరిన ఒప్పందం తో.ఈ దేశ కుల సంస్కృతి వల్ల అత్యంత లాభ పడ్డ ఆధిపత్య కులాల మిత్రుత్వం తో, చురుకైన సహకారం తో స్థిరపడ్డ వలసవాదులు ఏ సంస్కృతిని మార్చగలరు? వాళ్ళకేమి అదనపు లాభం?

   జాతీయ ఉద్యమం ప్రజలను రాజకీయంగా సమీకరించడం మొదలైన తరువాత వలసవాదులు కూడా మన సామాజిక వ్యవస్థ లో జోక్యాన్ని ఒక విధానం గా ప్రాంభించారు. 1857 తరువాత మొదలైన బ్రిటిష్ హిందూ మైత్రి 1930 ల వరకు అవిచిన్నంగా కొనసాగింది . బ్రిటిష్ వాడు ఒక పద్ధతి ప్రకారం ముస్లిం లను marginalise చేస్తూ వచ్చాడు.గాంధి నాయకత్వాన ఆయన ప్రయోగించిన మత ప్రతీకల ప్రభావాన హిందూ ప్రజలు రాజకీయ క్రియాశీలురయ్యే కొద్ది వలసవాది కూడా భారత సమాజం లోని సామాజిక వైరుధ్యాలను
   వాని రాజకీయ ప్ప్రయోజనాలకోరకు వాడుకో చూసాడు. అయితే ఈ వైరుధ్యాలను వాడు సృష్టించాడని చెప్పడం అసత్యం . కుల, మత, లింగ ,శాఖ , తదితర వైరుధ్యాలు మన స్వంత ఆస్తి . సామాజిక అంతరాలు, అమానవీయ అణచివేతలూ పైగా వీటన్నింటికీ గంభీరమైన తాత్విక సమర్తనలూ, దైవిక అనుమతులూ ఇవన్ని మన స్వంత సాంస్కృతిక ఉత్పత్తులు.వీటిపై మనదే పేటెంట్ హక్కు . ఇక మన కుల పితృస్వామిక సంస్కృతి వలసవాదుల కన్నా నైతికంగా అధమమైనది. వాడు పరాయి వాడు. వీడు నీ పక్కింటి వాడు . వాడు వ్యాఘ్రం . వీడు నరమాంస భక్షకుడు. పేష్వాల కన్నా బ్రిటిష్ వాడు మేలు అని ఫులే అన్నది, పెరియార్ జస్టిస్ పార్టీలో చేరింది , అంబేద్కర్ గాంధీని తీవ్రంగా వ్యతిరేకించింది ఇందుకే. ఈ దేశ నాగరికత పుచ్చి పోయిందనే.ఆత్మ పరిసిలనా శక్తి, శర్మ విమర్శక సామర్థ్యం లోపించిన ఒక సంస్కృతి దుర్భర నిరంకుశ సంస్కృతి గా మారక తప్పదు. జవజీవాలు నశించి , నేర్చుకునే మార్చుకునే గుణం లోపించి మరణించాక తప్పదు.

 23. ఉన్నతేతర వర్గస్థులు ప్రకృతివిధ్వంసంలో వాటా కోరుతున్నారని అన్నందుకు ఇక్కడ ఒకరిద్దరు పెద్దలకు కోపం వచ్చింది. వారి కోపానికి కారణమైనందుకు క్షమాపణలు వేడుతున్నాను. పేదవాళ్ళని బాగుచేయడమంటే నా కాన్సెప్టు వేరు. వాళ్ళ బాధ్యతని ఓ ప్రభుత్వమో పార్టీయో తీసుకోవడం కన్నా వాళ్ళలో తమ జీవితాల పట్ల తమకి బాధ్యత నేర్పితే వాళ్ళు శాశ్వతంగా బాగుపడతారని నా అభిప్రాయం. ఉదాహరణకి- తెలంగాణ ప్రభుత్వం పేదలకి డబల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టించడం మొదలుపెట్టింది. చాలా మంచి అభ్యుదయకర పథకమే. ఆ ప్రభుత్వంవారి సహృదయాన్ని అభినందించాలి. కానీ ఓ పదేళ్లలో ఆ పేదవాళ్ళంతా మళ్లీ మొదటికొస్తారని నా అంచనా. అంటే మళ్లీ ఆ డబల్ బెడ్రూముల ఏరియాని ఓ మురికివాడగా తయారుచేస్తారు. కారణం- వాళ్ళ అలవాట్లు, అభిరుచులూ మంచివి కావు. జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకోవడం అంటే ఏంటో వాళ్ళకి తెలీదు. అందుచేత మళ్ళీ పదిహేనేళ్లు పోయాక మీరు వాళ్ళ పిల్లలక్కూడా ఇళ్ళు కట్టించి ఇవ్వాల్సి వస్తుంది. దీనికి అంతు లేదు.

  ఇహపోతే సైన్స్ అండ్ టెక్నాలజీ పెరగాలని అందరమూ కోరుకుంటాం. అవి మన సమస్యల్ని మంత్రదండంలా పరిష్కరిస్తుందనే ఆశ. గతంలో ఎప్పుడో కొన్నిటిని పరిష్కరించాయి కనుక ఇకముందూ అలాగే జరగబోతోందనే ఆశ. కానీ అలా జరగడం లేదు. అందుకు వ్యతిరేక దిశలో జరుగుతోంది. వ్యతిరేక దిశ అంటే ఇక్కడ – సైన్స్ అండ్ టెక్నాలజీ కొత్త సమస్యల్ని సృష్టించడం మొదలుపెట్టాయి. ఈ కొత్త సమస్యలు ఎవరూ పరిష్కరించలేని సమస్యలు. వాటి పరిష్కారం కోసం మళ్ళీ కేవలం ఆ సైన్స్ అండ్ టెక్నాలజీనే ఆశ్రయించక తప్పని సమస్యలు. ఇదో విషవలయంలా మారింది. ఉదాహరణకి- శ్కానింగ్ చేస్తే రోగాల మూలకారణం తెలిసిపోతోంది. కానీ రోగాల భయంతో మళ్ళీ మళ్లీ శ్కానింగులకి వెళ్ళడం చేత జనానికి క్యాన్సర్లొస్తున్నాయి. బీడుభూముల్ని ప్రాజెక్టులతో సస్యశ్యామలం చేశాక ఒక తరం వరకూ మనశ్శాంతి. ఆ తరవాత ఆ పంటల సమృద్ధికి జనాభా రెట్టింపై మళ్ళీ మహోద్యమాలు. ఈసారి ఆ ఉద్యమాలు కేవలం తిండికోసం కాదు. ఉన్నతోద్యోగాల కోసం, ప్రత్యేక రాష్ట్రాల కోసం. ఇంకా ఏవేవో కొత్త మానసిక అవసరాల కోసం. దీనికి అంతెక్కడ? అందుకే దీన్ని నేను Run-away train ((అదుపు తప్పిన, డ్రైవర్ లేని రైలుబండి) అన్నాను.

  చాలాసార్లు నాకు అనిపిస్తుంది. Probably we need a simple, less complex civilization depending on sustainable technology which could be within the reach of every village. బహుశా నేను పగటి కలలు కంటున్నానేమో!

  • Lalitha P says:

   తమ జీవితాలపట్ల బాధ్యతను ఎక్కువగా నేర్చుకోవాల్సింది occupy everything అనే పద్ధతిలో వెళ్తున్న ఉన్నత తరగతి వాళ్ళే. ఉన్నత తరగతి విలాసాలకు అడ్డొచ్చి విప్లవాలు లేవదియ్యకుండా పేదవాళ్ళకు పడేసే బిస్కట్లు డబల్ బెడ్ రూమ్ లు.. ఇక్కడ మీకో ఆసక్తికరమైన కథ చెప్తాను స్పేస్ తింటున్నానేమో అన్న భయం కూడా వదిలేసి… ఒక ఫ్రెండ్ ఉన్నారు. తను మధ్యతరగతి. దళితవాడలో ఉంటారు వాళ్ళతో కలిసి. “ఏవైనా కొనటానికి బజారు వెళ్ళేటప్పుడు చేతిసంచి తీసుకెళ్ళండి ప్లాస్టిక్ సంచులు తెచ్చుకోవద్దు” అని అందరికీ అక్కడ చెప్తారామె. తీరా తన ఇంట్లోని చెత్త బుట్టను చూసుకుంటే తనకు తెల్సింది ఏమిటంటే ఖాళీ ప్లాస్టిక్ రేపర్లు వాళ్ళకంటే తనదగ్గరే ఎక్కువగా ఉన్నాయని. ఎలా అంటారు? దళితవాడలో డబ్బు లేకపోవటం వల్ల తిండిసౌఖ్యం, దానితో వచ్చే ఖాళీ ప్లాస్టిక్ సంచులూ లేవు. తను ఎంత కంట్రోల్ లో ఉన్నా పేక్ చెయ్యబడిన కనీసావసరాల పప్పూ ఉప్పుల సంచులే ఎక్కువ కనబడ్డాయని చెప్తున్నారామె. కార్పోరేట్లు Lays లాంటి చిప్స్ ను అభిరుచికరంగా తయారు చేస్తుంటే రెండు రూపాయల చిప్స్ పేకెట్లు పేదల కోసం తయారు అవుతున్నాయి. డబల్ బెడ్రూమ్స్ వచ్చినా డబ్బు లేకపోతే రెండ్రూపాయల ఖాళీ చిప్స్ రేపర్లతో చెత్త నిండుతుంది. తాము పారేసే Lays రేపర్లను లెక్కేసుకోకుండా పేదలకు టేస్ట్ లేదు శుభ్రత లేదని మధ్యతరగతి అసహ్యించుకుంటుంది. మళ్ళీ స్వచ్చ భారత్ కోసం ఫండ్స్ అలాట్ అవుతాయి. ఆ ఫండ్స్ తింటూ కొంతమంది ఎదిగి అంతులేని చెత్త తింటూ రేపర్లను మర్యాదగా చెత్తబుట్టల్లోనే వేస్తూ కార్లలో రోడ్లను ఆక్రమిస్తారు. ఈ మోడల్ లో రుచులూ, అభిరుచులూ భాషలూ సంస్కృతులూ నిర్ణయించబడతాయి. డబ్బు చేత డబ్బు కోసం డబ్బు వలన…

 24. RANI SIVA SANKARA SARMA says:

  సరే భార్గవ గారు మీరు చెప్పిన విధంగా అన్ని విధాల పుచ్చిపోయిన మనం మళ్ళి తెల్లోడి పాలన కోసం పోరాటం చేద్దాం .
  అప్పటిలా వారు యిప్పుడు మనకు పెద్ద దిక్కుగా తోడు లేనందుకు బాధ పడ్తున్నారు.బాధ పడకండి . మోడీ గారి మేక్ ఇన్ ఇండియా పుణ్యమా అని మళ్ళి మీరు భాస్కర్ గారు కోరుకున్నట్లే వలస పాలన రావచ్చు. అప్పుడు మీరు వచ్చేనిదే బంగారు కాలం అని పాడుకోవచ్చు. బెస్ట్ ఆఫ్ లక్

 25. కె.కె. రామయ్య says:

  “ఆత్మ పరిశీలనా శక్తి, విమర్శక సామర్థ్యం లోపించిన ఒక సంస్కృతి దుర్భర నిరంకుశ సంస్కృతి గా మారక తప్పదు. జవజీవాలు నశించి , నేర్చుకునే మార్చుకునే గుణం లోపించి మరణించకా తప్పదు ” చక్కని విమర్శ చేసిన భార్గవ గారు, మనకా గతి పట్టదని కాల పరీక్షకు నిలిచిన మన సంస్కృతి నిరూపించుకున్నది, నిరూపించుకుంటుంది.

  ప్రియమైన రాణి శివశంకర శర్మ గారు, ప్రస్తుత పరిస్తితుల్లో భారత దేశంలోనే కాదు ప్రపంచంలో మరెక్కడైనా కూడా ప్రత్యక్ష వలసపాలన (తెల్లోడి చల్లని పాలన) సాధ్యం కాదు; సిరియాలో కాని, ఆఫ్ఘనిస్తాన్లో కాని, ఆఫ్రికాలో కాని.

  లలిత గారు, “డబ్బు చేత, డబ్బు కోసం, డబ్బు వలన…రుచులూ, అభిరుచులూ, భాషలూ, సంస్కృతులూ నిర్ణయించబడతాయి” అంటున్నారు. మరి ఈ జాడ్యానికి ఎలాంటి విరుగుడు ఉందో దయచేసి వివరించగలరు.

  మహాజన్ గారు, less complex civilization, depending on sustainable technology కాన్సెప్ట్ వినడానికి బాగున్నా, సమాజం ఓ మోస్తరు వర్గ సమతుల్యత సాధించే వరకైనా విద్య, సైన్స్ & టెక్నాలజి ల ఆవశ్యకతను కాదనగలమా ?

 26. శర్మ గారు, మీ వ్యాఖ్యల తో ఏకీభవిస్తాను. భాస్కరం గారి వ్యాసాలు రెగులర్ గా చదువుతాను. ఆయన జీవనబృందావనం పుస్తకానికి ముందుమాట రాసి ఉన్నారు. ఆయన పై కూడా ఆద్యాత్మిక గురువుల ప్రభావం ఉండవచ్చనుకొంటాను.

మీ మాటలు

*