స్టార్ బక్స్ మ్యాజిక్ టచ్!

 

 

Prajna-1“మంచి సంబంధం. ఈ సారి కూడా ఏదో వంక చెప్పి వచ్చేయటం కాదు. అర్ధమయ్యిందా?”

“సరేలే కానీ, అబ్బాయికి ఏం కార్ ఉందో తెలుసా?”

“ఈ కార్ల పిచ్చి పక్కన పెట్టు. లక్షణంగా ఉన్నాడు, చాలా డబ్బు ఉంది వాళ్ళకి. చూశావుగా ఫోటోని”

“అమ్మా , పెళ్లి అవ్వకుండా అమెరికా లో ఉన్న ప్రతి అబ్బాయి ఇలాగే మంచి రే-బాన్ గ్లాస్సెస్ పెట్టుకొని, యే మొన్యుమెంట్ ముందరో నిల్చోని ఫోటోలు దిగితే మీ లాంటి వాళ్ళు మోసపోతారు. అలాంటి ఫోటోలని మేము ‘పటేల్ షాట్స్’ అంటాము.  నేనే స్వయంగా చూసి మాట్లాడాక డిసైడ్ అయ్యి చెప్తాను”

“ఇదిగో ఈ తిక్క వేషాలే వద్దు అనేది. కొంచం జాగ్రత్తగా హ్యాండిల్ చెయ్యి. ఇంతకీ ఏం డ్రస్ వేసుకెళ్తున్నావు?”

“అదే ఇంకా అడగలేదు ఎంటా అనుకుంటున్నాను. ఫోన్ పెట్టేస్తే రెడీ అయ్యి వెళ్తాను. బాయ్”

“తిక్క పిల్లా, బాయ్. ఆల్ ద బెస్ట్”

శ్రేయ టెక్సాస్ యునివర్సిటి లో మాస్టర్స్ చేసి, ఇటీవలే ఉద్యోగం కోసం సియాటల్ కి వచ్చింది. జాబ్ లో చేరి పది రోజులైనా అవ్వలేదు, పెద్దవాళ్ళు తనకి పెళ్లి చూపులు అరేంజ్ చేశారు. ఇది తన పదమూడవ పెళ్లి చూపులు. మాస్టర్స్ చేస్తునప్పుడు మీట్ అయిన వాళ్ళలో కొంతమందికి ఆమె నచ్చకపోతే, ఆమెకి మిగితావాళ్లు నచ్చలేదు. శ్రేయ చాలా సింపుల్ గా ఉంటుంది. కానీ నారో మైండెడ్ వాళ్ళంటే చిరాకు. చూడిధార్ వేసుకుంటే ట్రడిషనల్ అని, జీన్స్ వేసుకుంటే మొడ్రెన్ అని అనుకొనే ‘స్టీరియోటైప్’ మనుషులు నచ్చకపోవడంవల్ల అలా సంబంధాలకి నో చెప్తూ వచ్చింది.  ఇప్పుడు తాను మీట్ అవ్వబోయే అబ్బాయి ఫోటో ని చూసింది, బాగానే ఉన్నాడు. మంచివాడైతే బాగుండు అని అనుకుంది. ఆ రోజు సాయంత్రం సియాటల్ డౌంటౌన్ లో ‘స్టార్ బక్స్’ లో ఆ అబ్బాయిని మీట్ అవుతోంది.

సాయంత్రం ఆరు గంటలయింది. “అమ్మా, ఆ అబ్బాయి రాలేదనుకుంటా” అని, అప్పటికే అక్కడకి వచ్చేసిన శ్రేయ, అమ్మకి కాల్ చేసి చెప్తోంది.

“ఓపిక పట్టు. అసలే చికాగొ నుండి రావాలి కదా”

“ఇదేమీ కాశ్మీర్ టు కన్యాకుమారి కాదు. ఫ్లైట్ లో ఎంతో సేపు పట్టదు” ఆన్ అంటూ తన వైపు ఒక అబ్బాయి రావడం గమనించి “వచ్చాడు. బాయ్” అని కాల్ కట్ చేసింది.

“హాయ్, నేను రిషీ, రిషికేశ్” అని ఆ అబ్బాయి సన్ గ్లాస్సెస్ మొహం మీద నుండి తీసి,  షేక్ హాండ్ కోసం చేయి చాచాడు.

‘అబ్బో అందంగానే ఉన్నాడు’ అని శ్రేయ అనుకుంటూ, “శ్రేయ” అని నవ్వుతూ తను కూడా షేక్ హాండ్ ఇచ్చింది.

“చల్లగా ఉంది కదా, లోపలకి వెళ్దామా? లేదా ఇక్కడే బయట కూర్చుందామా?” రిషీ అడిగాడు. స్పష్టమయిన తెలుగులో. శ్రేయ దగ్గర పాయింట్స్ కొట్టేశాడు. శ్రేయ కి ఫేక్ అమెరికన్ అక్సెంట్ నచ్చదు.

“బయటే కూర్చుందాము, మనుషులని చూస్తూ వాళ్ళని జడ్జ్ చేయచ్చు కదా?” రిషీ రెస్పాన్స్ కోసం చూస్తూ అడిగింది శ్రేయ.

“మీరు నన్ను అడగాల్సినవి డైరెక్ట్ గా అడగవచ్చు. ఇలా ఇండైరెక్ట్ గా తెలుసుకోవాలని చూడకండి. నేను చాలా ఫ్రాంక్” రిషీ భేళ్ళున కొట్టినట్లు సమాధానం ఇచ్చాడు.

“సారీ. ఒఫ్ఫెండ్ అయ్యారనుకుంటాను?” శ్రేయ ఖంగారుగా అంది.

“లేదులెండి. మొదటి సారి కలిసినప్పుడే ఎంత ఆనెస్ట్ గా ఉంటే అంత మంచిదని నా ఫీలింగ్” రిషీ నవ్వుతూ అన్నాడు.

“కరెక్ట్ అండీ. లేదంటే తరువాత చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో … ఏమైనా ఆర్డర్ చేద్దామా?”

ఇద్దరికీ ఏం కావాలో ఆర్డర్ చేసుకొని, తెచ్చుకొని, బయట కూర్చున్నారు.

 

“ఈ ప్లేస్ ఎందుకు చూస్ చేశారు? మీకు కాఫి ఇష్టమా?” శ్రేయ తన ‘చొకో ఫ్రాప్’ తాగుతూ అడిగింది.

“అన్నట్టే. ప్లస్ ఇది ఫస్ట్ స్టార్ బక్స్ కదా చూసినట్లు ఉంటుంది అని..”

“ఫస్ట్ అంటే?”

“ఒరిజినల్ ఇది. మొదట స్థాపించిన స్టార్ బక్స్ . మీకు తెలియదా?”

“లేదు. నేను వచ్చి రెండు వారాలు కూడా అవలేదు. మా అన్నయ్య ఇక్కడే ఉంటాడు ఫ్యామిలి తో. తను కూడా చెప్పలేదు మరి” శ్రేయ చెప్పింది.

“మీ వాళ్ళు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నట్లున్నరు కదా? ఇంకా కొత్త ఊరిలో సర్ధుకుంటుండగానే ఇలాగ పెళ్లి చూపులు అంటూ.. ” రిషీ ఎంతో concern తో అడిగాడు. మళ్ళీ మార్కులు కొట్టేశాడు.

“మీరు అనక్కర్లేదు. నువ్వు అనచ్చు. నేను కూడా ‘నువ్వు’ అనే సంభోదిస్తాను” శ్రేయ చిలిపిగా అంది.

“హమ్మయ్య. ఎప్పుడు ఆ మాట అంటావా అని వెయిటింగ్. సో నువ్వేం చేస్తుంటావు?” రిషీ రిలాక్స్ అవుతూ అడిగాడు.

“డౌన్ టౌన్  లో మైక్రోసాఫ్ట్ లో వర్కింగ్. నువ్వు కూడా మైక్రోసాఫ్ట్ కదా?”

“అవును. చికాగొ లోనే అయిదేళ్లుగా వర్కింగ్” రిషీ నవ్వుతూ అన్నాడు.

“ఓకే. నన్ను ఏమైనా అడగాలంటే అడగచ్చు” శ్రేయ అంది.

“ప్రశ్న లేదు కానీ ఒక కాంప్లిమెంట్ ఇస్తాను. నీ డ్రస్ చాలా బాగుంది. నేను భయపడ్డాను ఎక్కడ గంగిరెద్దు లా చీర కట్టుకొస్తావో అని”

“ఓహో నా ఫోటో చూసి అలా అనుకున్నావా? నేను చీరలు కట్టుకుంటాను. కానీ సందర్భం బట్టి. అంటే యే పెళ్ళికో, ఫంక్షన్ కొ అలాగా. అంతే కానీ సింపుల్ గా గుడికి, ఇలా పెళ్లి చూపులకి అంటే నా వల్ల కాదు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, మనం అమెరికా కి వచ్చి వీళ్ళ కల్చర్ కంటే మనదే గొప్పదని ప్రూవ్ ఎందుకు చేయాలని. మనం మనం కలిసినప్పుడు ఇండోర్ బాగుంటుంది అలా. అలాగని నేను టోటల్ గా అమెరికన్ కల్చర్ కి మారిపోలేదు. ఎక్కడ ఎలా ఉండాలో అక్కడ అలా ఉండాలి అని నా భావం” శ్రేయ చెప్పడం పూర్తి చేసింది. ఈ సారి మార్కులు కొట్టేయడం శ్రేయ వంతు.

“నువ్వు నాకు నచ్చావు” రిషీ అన్నాడు.

“ఏంటి? అప్పుడే? డ్రస్ బాగుంటే నేను నచ్చినట్టా? ఇంత తొందరగా ఎలా డిసైడ్ అవుతున్నావు?” శ్రేయ షాక్ అవుతూ అడిగింది.

“నీకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది. అది నాకు బాగా నచ్చింది. ఇష్టాఇష్టాలు మాచ్ అయిపోతే పెళ్ళికి రెడీ అని అనుకునే టైప్ కాదు నేను. ఒవెరాల్ గా ఒక అమ్మాయి నాకు నచ్చితే చాలు అనుకునే టైప్. ఇప్పటిదాకా నేను చూసిన అమ్మాయిల్లో ఇలా ఎవరు కన్పించలేదు. పైగా నీ ఆటిట్యూడ్ నాకు నచ్చింది. నేనింకో కాఫి తెచ్చుకోస్తాను, ఆలోచిస్తూ ఉండు ఈ లోగా” అని అనేసి, రిషీ లేచి వెళ్ళాడు.

రిషీ ఫేస్బుక్ ప్రోఫైల్ ఓపెన్ చేసి, రిషీ ఇష్టాలు చెక్ చేస్తోంది శ్రేయ. ముందర చూసి అనుకున్నట్లుగానే చాలా తక్కువ హాబీస్ కామన్ ఉన్నాయి. ఇది కుదిరే పనే నా అని ఆలోచించటం మొదలెట్టింది. ఫైనల్ గా ఒక విషయం తెలుసుకోవాలి. రిషీ రావడం చూసి, గొంతు సవరించుకొని నోరు తెరిచి శ్రేయ మాట్లాడే లోపల రిషీ నే మాట్లాడాడు.

“ఇంటి పేరు మార్చుకోమని నేను ఫోర్స్ చేయను, ఎందుకంటే అదొక పెద్ద తతంగం. పెద్ద ప్రాసెస్ అది, అన్నీ సర్టిఫికేట్ లలో మార్చాలి. సో అక్కర్లేదు. నేను బాగానే సంపాదిస్తున్నా కూడా నిన్ను ఉద్యోగం మానేయమని నేను చెప్పను. ఎందుకంటే ఇంట్లో కూర్చుంటే నువ్వు జీవితంలో ఎదగలేవు. నీకు కావాలంటే నేను సియాటల్ మూవ్ అవుతాను. ఎందుకంటే ఇపుడే జాయిన్ అయ్యావు కనక నీకు ట్రాన్సఫర్ కష్టమవచ్చు. నాకు ఇంకా ఈజీ అండ్ నాకు సియాటల్ బాగా నచ్చింది కూడా. నా దగ్గర BMW ఉంది. ఇంకో రెండేళ్లలో ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలని కూడా అనుకుంటున్నాను.  నేను చాలా ప్రాక్టికల్. నేను అమెరికా లో ఎన్నాళ్లు ఉంటానో తెలియదు. ఉన్నన్నాళ్లు మాత్రం ట్రావెల్ చేయాలని అనుకుంటున్నాను. అప్పుడే గా ఈ జీవితనికి ఒక అర్ధముండేది. నీకు ఇంకా చదువుకోవాలని ఉంటే నేను సపోర్ట్ చేస్తాను. నీ ఇష్టాలకు గౌరవం ఇస్తాను. మన అభిప్రాయాలు కలుస్తాయి అని నా నమ్మకం. ఏమంటావు? ఇంటికెళ్ళి బాగా అలోంచించుకో” రిషీ గబ గబా చెప్పేసినా, ఆ మాటలలో ఎంతో నిజాయితీ ఉంది. తన గురించిన ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పేశాడు.

ఇప్పటిదాకా తను మీట్ అయిన అబ్బాయిల్లో ఒకతను ఉద్యోగం అక్కర్లేదు అని, ఇంకొకతను త్వరలో ఇండియా తిరిగి వెళ్లిపోవాలని, మరొకతను చిన్న చిన్న ఆనందాలు అక్కర్లేకుండా మొత్తం డబ్బులని సేవ్ చేయాలని – ఇలా రకరకలుగా తన ఆలోచనలకు భిన్నంగా ఉన్నవారే. కానీ రిషీ అలా కాదు. వాళ్ళకి పూర్తిగా అపోసిట్. శ్రేయని చాలా కొద్ది సమయంలో ఏమీ చెప్పకుండానే అర్ధం చేసుకొన్నాడు. అది కూడా మొదటి మీటింగ్ లో. శ్రేయ ఆలోచించగా రిషీ తన అభిప్రాయాలకి, ఆలోచనాలకి విలువనిచ్చే వ్యక్తి అని, బాగా నచ్చాడని తెలుసుకుంది.

“నాక్కొన్ని ప్రశ్నలున్నాయి” శ్రేయ అడిగింది.

“ఓహో, ఈ ట్విస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అడుగు” రిషీ కొంచం భయపడ్డాడు, ఎక్కడ శ్రేయ ని కోల్పోతాడో అని.

“నాకు వంట రాదు. నీకు వచ్చా?” శ్రేయ అడిగింది.

“నాకు అంతగా రాదు, మ్యాక్స్ బయటే తింటాను. పరవాలేదు, కలిపి నేర్చుకుందాం, కలిపి చేద్దాం. ఇక్కడ కుకింగ్ క్లాస్సెస్ బాగుంటాయి అని విన్నాను” రిషీ తాపీగా చెప్పాడు.

“నువ్వు చాలా దూరం ఆలోచిస్తున్నావు. తొందరపడకు, నేను ఇంకా యెస్ చెప్పలేదు” శ్రేయ అంది. నిజానికి రిషీ ఇచ్చిన సమాధానం ఆమెకి చాలా నచ్చింది. ఇద్దరూ సమానమే అని తెలిపే ఆన్సర్ అది.

“నీ డిటేల్స్ నాకు తెలుసు, నా డిటేల్స్ నీకు తెలుసు. నువ్వు యెస్ చెప్తావాని నా గట్టి నమ్మకం. ఈ ‘స్టార్ బక్స్’ సాక్షిగా చెప్తున్నాను, నాకు నువ్వు బాగా నచ్చేసావ్. ప్లస్ నాకంటే మంచివాడు నీకు దొరికే ఛాన్స్ లేదు” రిషీ అన్నాడు.

పది నిముషాలు టైమ్ తీసుకొని “నువ్వన్నది కరెక్ట్. ఒకళ్ల గురించి ఒకళ్ళకి తెలుసు. నో చెప్పాల్సిన రీసన్ ఏం లేనప్పుడు, ముందుకు ప్రోసీడ్ అవ్వటమే బెటర్. నువ్వు కూడా నాకు నచ్చావు. ఇంకో రెండు మూడు సార్లు కలిశాక పెద్దవాళ్ళకి మన నిర్ణయం చేప్దాము” శ్రేయ అంది.

————

ఇరవై సంవత్సరాల తరువాత, అదే స్టార్ బక్స్ లో !

“డాడ్ తొందరగా ఏదోకటి ఆర్డర్ చేస్తే, కాస్త టైం స్పెండ్ చేసి, నేను నా ఫ్రెండ్స్ ని కలవాలి. అసలే ఇవాళ నాది స్పెషల్ బర్త్ డే” కేట్ అంటోంది.  శ్రేయ, రిషీ లు ఎంతో ప్రేమగా పెట్టిన ‘కాత్యాయిని’ అన్న పేరుని తనే కేట్ అని మార్చుకుంది.

ఆర్డర్ ఇచ్చాక,  “నీకు సిక్స్ టీన్ ఇయర్స్ వచ్చాక చెప్తా అన్నాను కదా మా లవ్ స్టొరీ. విను. ఎన్నో ఆలోచనలతో, సందేహాలతో వచ్చాము మీ మమ్మీ, నేను ఇక్కడకి” అంటూ శ్రేయ తో పరిచయం అయినప్పటినుండి తన కథని చెప్పటం మొదలు పెట్టాడు రిషీ.

కేట్ పుట్టినంతవరకు జరిగిన విషయాలు దాదాపు గంట సేపు చెప్తూనే ఉన్నాడు రిషీ.

“అండ్ ఇప్పుడు ఆ కన్ఫుజన్స్ అన్నీ తొలగిపోయి, ఇప్పుడు చూడు ఎంత హాపీ గా ఉన్నమో” రిషీ నవ్వుతూ అన్నాడు.

“వావ్. సూపర్ స్టొరీ డాడీ. మమ్మీ ఎక్కడ నో చెప్తుందో అని భయపడ్డావు కదా డాడీ నువ్వు?” కేట్ కాఫీ సిప్ చేస్తూ అడిగింది.

“అవును. నాకు శ్రేయ ని చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్. అందుకే తనని నా లైఫ్ లో మిస్ చేసుకోకూడదు అని, పెళ్లి చూపుల్లో బాగా ఇంప్రెస్ చేయాలని ప్రయత్నించాను. ఒఫ్ కోర్స్, వర్క్ అయింది” అని కన్నుకొట్టాడు.

“అసలు, రియల్లీ గ్రేట్ డాడీ.  ఒకే మీటింగ్ లో ఇంత తెలుసుకొని, ఇద్దరూ ఓకే ఎలా చెప్పేసుకున్నారు? ఏం మ్యాజిక్ జరిగింది స్టార్ బక్స్ లో?” కళ్ళలో మెరుపులతో అడిగింది కేట్.

“మంచి ప్లేస్ సెలెక్ట్ చేశాను కదా, పైగా మీ మమ్మీ నన్ను అంతలా మాయ చేసింది.  A lot can happen over coffee అంటే ఇదేనేమో!” అంటూ పదేళ్ళ క్రితమే ఆక్సిడెంట్ లో చనిపోయిన శ్రేయ ఫోటో ని ఫోన్ లో చూస్కుంటూ కళ్ళు మూసుకున్నాడు.

కేట్ కూడా అమ్మతో గడిపిన మెమోరీస్ ని గుర్తుచేసుకుంటూ తన డాడీ ని హాగ్ చేసుకుంది.

 

***

మీ మాటలు

 1. స్వీట్ గా ..క్యూట్ గా ఉంది కథ

  • చాల బాగుంది ఎండింగ్ అల వున్న పర్లేదు– మధ్యలొ జీవితము ఎమైంది అనే కన్నా– మనస్సులొ వున్న ఆ ఫీలింగ్ చాలు—–

 2. చాలా థాంక్స్ అండి :)

 3. చక్కగా పొందిగ్గా ఉంది కథ. చివర అనుకోని మలుపు గుండేని కదిలించింది.

 4. Nandoori Sundari Nagamani says:

  కథ చివరిలో శ్రేయ లేదని చనిపోయింది అని తెలిసాక ఎంతో వేదన కలిగింది. చాలా మంచి కథ ప్రజ్ఞా బాగా రాసావు. అభినందనలు!

 5. buchi reddy says:

  గుడ్ వన్—
  శ్రేయ — చనిపోవడం ఒక ట్విస్ట్ కథ కు — రిషి నిజమయిన ప్రేమ తో
  కూతురు కు చెప్పుకోవడం
  parents… పిల్లలతో time..spend..చేయడం ఎంతో అవసరం –లేకుంటే
  అవగాహన ,ఆత్మీయత పెంపోధ టానికి కావలిసింది –డబ్బు కాదు — సమయెం
  ——————————————————————-
  బుచ్చి రెడ్డి గంగుల

 6. Dr. Rajendra Prasad Chimata. says:

  ఆహ్లాదమైన కధను సినిమాటిక్ ట్రాజెడీ చేశారు.మరీ ఆదర్శంగా ముగించారు. అలా ఏక్సిడెంట్ జరిగిన తర్వాత మామూలుగా అమెరికాలో ఎక్కువ మంది ఏం చేస్తారో మీ హీరో ఎలా చేస్తే బాగుంటుందో, జీవితాల్ని వెల్తి చేసుకోకుండా కన్న పిల్లల్ని బాధ పెట్టకుండా చెయ్యడానికి అవకాశం కల్పిస్తూ కధ పెద్దదైన ముగించి ఉంటే బాగుండేదనిపించింది .

  • నా కథ చదివినందుకు ధన్యవాదములు. రిషి జీవితంలో శ్రేయ మరణం తరువాత ఎం జరిగింది అన్నది beyond the scope of the story. నిజ జీవితంలో జరిగే డ్రామా నే ఇందులో చూపించాను. ఈ కథ ఆదర్శంగా end అవటం అని మీరు అనటమే first. నాకు అర్ధంకాలేదు. కొంచం వివరంగా చెప్పగలరా ? Thank you.

 7. చందు - తులసి says:

  మీరు రాసిన తీరు నెరేషన్ క్యూట్ గా ఉంది.

 8. సింపుల్ అండ్ స్వీట్ నేరేషన్…….. :)

 9. స్టార్ బక్స్ ఫ్రాపులు చేతులో పెట్టుకుని పనీ పాటా లేకుండా కూచొని మనుషుల వేషాన్ని చూసి మనస్తత్వాన్ని, కవర్ పేజీ చూసి పుస్తకాన్ని జడ్జ్ చేసే “Know It All” అమెరికన్ వానబీ దేసీ అమ్మాయిలు కోకొల్లలు.

  మేము కూడా నవ్వుకుంటాం, ఈ రకాలని చూసినప్పుడల్లా. జుట్టు స్ట్రైట్ చేస్కొని, మెక్ అప్ వేస్కొని, గివించీ అద్దాలు, గూచి హాండ్ బాగ్ వేస్కొని వైట్ గర్ల్ అనుకరణలలో అస్తిత్వాలని కోల్పోయి, గౌన్స్ వేస్కుంటే దేసీ అబ్బాయిలు లేకి సూపులు సూత్తారని మిడిసిపోయి… పైన ఇండిపెండెంట్ అమ్మాయి కోటింగ్, లోపల గ్రీన్ కార్డ్ ఉన్న అబ్బాయితో అరెంజేడ్ మారేజీ మాచ్ కోసం ఆరాటం. బయట ఫుల్ ఇంగ్లీస్, ఇంటికొచ్చి తెలుగు మాస్ పాటలు.

  వీళ్ళకు పెద్దగా ఆశయాలు ఉండవు, అతిశయాలు మాత్రమె. అరగంట మాట్లాడితే కూడా ఎక్కడా సైన్ ఆఫ్ ఇంటలిజెన్స్ ఉండదు. రన్బీర్ కపూర్ మీద ఆరాధనా, నెక్స్ట్ పవన్ కళ్యాన్ సినిమా, తమ జుట్టూ, తమ హై సెన్స్ ఆఫ్ లివింగ్ స్టైల్ గురించి సొల్లు కబుర్లూ. నిజానికి ఈ స్టార్ బక్స్ కప్పులని ఎవడూ పలకరించడు. దూరంగా ఉంటాడు. వీళ్ళు కూడా గ్రీన్ కార్డ్ ఉన్న అరెంజేడ్ మాచ్ వుడ్ బీ ని తప్ప మిగతా దేసీ అబ్బాయిలని జడ్జ్ చేస్తూ, అమెరికన్లని అనుకరిస్తూ బతికేస్తారు.

  కథలో విషయం లేనప్పుడు పాత్రలని సంపినా … ఎందుకులే.. ఇద్దరి సమయం వృధా. హాయిగా ఫ్రాపులు తాగాతా జనాలని జడ్జ్ చేస్తూ బతికేయ్యక ఎందుకు మాకీ శిక్ష?

  • BLUE గారు, నా కథ చదివి మీ సమయాన్ని వృధా చేసుకున్నందుకు ధన్యవాదములు.

 10. k sivanageswararao says:

  బాగుంది

మీ మాటలు

*