నిలువు దోపిడీ

 

చింతామణి .. వేశ్య
సుబ్బిశెట్టి: కొత్త విటుడు

 

చింతా: ఏమండీ, నా మీద యింత ప్రేమ కురిపిస్తున్నారే, మరి రంగనాయకి యింటికి ఎందుకు వెళ్ళారు?
సుబ్బి: బుద్ధి గడ్డితిని – సెప్పుకుంటే సిగ్గుచేటు. నువ్వు నువ్వనే కానీ, ఒక్క మాటైనా మీరనలేదు. మీ మర్యాద చూస్తే, కడుపు నిండిపోయి కళ్ళంట నీళ్ళొస్తున్నాయి.
చింతా: పెంపుడు ముండ, మర్యాద దానికేం తెలుస్తుంది.
సుబ్బి: పెంపుడు ముండంటే?
చింతా: మాజాతి కిప్పుడు సంతానయోగం తగ్గిపోయింది. అందువల్ల నానా రకాల కులాల్లో పుట్టిన ఆడపిల్లల్ని కొనుక్కొచ్చి వాళ్ళను సానితనంలోకి దింపుతున్నారు. దాంతో మాకులంలో ఆట పాటలు చచ్చి దురాశ పెరిగింది. వినయం నశించి చెడ్డనడత పెరిగింది. కట్టుబాట్లు మారి పోయాయి. సంకరజాతులు పెరిగి పోయాయి. కులం నాశనమై పోతోంది.
సుబ్బి: అయితే, మరి ఆళ్ళకేం గిట్టుద్ది?
చింతా: ఇప్పుడు వాళ్ల పనే వాటంగా వుంది. మెరకవీధిలో పెద్ద మేడ కట్టిన చిట్టిసాని, బండి మీద తప్ప బయటికి రాని నాగరాణి, నాలుగు దివాణాల్ని నిలువునా దోచేసిన ఇందీవరిక, వీళ్ళంతా తక్కువ జాతుల్నించి కొనుక్కొచ్చిన బాపతే! పాతిన మొక్కల కంటే, పడి మొలిచిన మొక్కలు బలంగా ఎదిగినట్టు బయటి నుంచి వచ్చిన వాళ్ళే ఇప్పుడు పెద్ద సానులుగా చలామణీ అవుతున్నారు.
సుబ్బి: పోనీ మంచి పిల్లలనే పెంచుకోరాదూ?
చింతా: మంచి పిల్లలు మాకెక్కడ దొరుకుతారు? పోన్లెండి, ఈ మాటలకేం గానీ, కూర్చోండి.
సుబ్బి: నువ్వో మరి? నువ్వు కూడా కూకుంటేగానీ నాకు బాగోదు. (వేళ్ళకున్న ఉంగరాలు కనపడేట్లు చేస్తున్నాడు)
చింతా: (లోపల) వీడి నటన పాడుగాను! వచ్చిన దగ్గర్నుంచి ఆ ఉంగరాలు నాకు కనబడేట్లు చెయ్యాలని ఒకటే తపన. (పైకి) కూర్చోడానికేం గాని శెట్టి గారు, డబ్బుకు లోటు లేని వాళ్ళు కదా, గాజురాళ్ళ ఉంగరాలు పెట్టుకొన్నారేంటి?
సుబ్బి: గాజురాళ్ళా? గరభాదానం నాడు గదిలో కెల్లనంటే మా మావ మూడొందలోసి కొనిపెట్టిన రవ్వ లుంగరాలు, గాజురాళ్లుంగరాలన్న గాడిదెవడు?
చింతా: ఎవరంటారు? తిన్నగా కనబడక నేనే అన్నాను.
సుబ్బి: అయితే యీ పాలి తిన్నగా సూడు. (అని చేయి చాపాడు)
చింతా: మీ వేలి కుంటే వాటి నాణ్యం నాకెలా తెలుస్తుంది?
సుబ్బి: అయితే అంత అనుమానమెందుకు? నీ వేలికే పెట్టుకొని నిదానంగా సూడు.
చింతా: (వేలికి పెట్టుకొని) నాకంత అందంగా లేదేంటి?
సుబ్బి: అయితే రెండోది కూడా పెట్టుకొని సూడు, అబ్బెంతరవేవుంది? (తీసి యిచ్చును)
చింతా: (రెండో వేలికి పెట్టుకొని, తిప్పి తిప్పి చూసి) ఇప్పుడు అందంగానే ఉన్నాయి కానీ వీటిని నాకిచ్చినట్టు తెలిస్తే మీ రంగనాయకి మిమ్మల్ని బతకనివ్వదేమో!
సుబ్బి: (తనలో) ఓరిదేముడా! ఈ ఉంగరాలిది మింగెయ్యాలనుకుంటోంది కావాసు! అరువు సొమ్మని చెప్పినా బాగుండేది.
చింతా: ఏంటాలోచిస్తున్నారు? ఎందుకిచ్చానా అనా? అట్లయితే, ఇవిగో మీ ఉంగరాలు.
సుబ్బి: తియ్యకు, తియ్యకు. అమ్మతోడు, తీస్తే వొట్టు. నన్ను సంపుకు తిన్నట్టే. యెక్కడో ఎర్రిమొగం లాగున్నావు.
చింతా: అంత వొట్టు పెట్టారు కాబట్టి ఆగాను. లేకపోతే ఎల్లకాలం దెప్పుతారు. సరే, కొంచెం అత్తరు రాస్తాను, కూచోండి. (బుగ్గలకు రాసింది)
సుబ్బి: (తనలో) వహ్వా! వహ్వా! యేవి సుకం, యేవి సుకం. యిన్ని సేతులు సూశాను గానీ, యీ పాటి సెయ్యి కాపళ్ళేదు. ఎదవ సొమ్ము, ఏం పొతే ఏం లెక్క? సచ్చినా యిట్టాంటి దాని కాళ్ళ కాడ పడి సావాలి; వో తాపు తగిల్నా! సరే కానీ, వోపాలి ముద్దెట్టుకుందునా?…. (లోపలి నుంచి ‘అమ్మీ! ఎవరో మేళం కావాలని వచ్చారు. ఓసారి కిందికిరా!’ అని పిలుపు వినిపించింది)
చింతా: మా అమ్మ పిలుస్తోంది. పోయి ఇప్పుడే వస్తాను, కూర్చోండి!
సుబ్బి: పాడుముండ, పానకంలో పుడక లాగా సమయానికి సక్కా వచ్చి సరదా సంపేసింది.

*

మీ మాటలు

*