మీ జాతి ఏది?! అని అడగొచ్చా!?!

సుధా శ్రీనాథ్ 

~

సుధా శ్రీనాథ్

సుధా శ్రీనాథ్

అది అక్టోబర్‌లోని మొదటి ఆదివారం కాబట్టి మా తెలుగు క్లాస్‌లో కబుర్లు మహాత్మా గాంధీజీ గురించి మొదలు పెట్టారు టీచర్. ఎప్పటిలా కొద్దిగా రాతలు, చదువులు అయిన తర్వాతనే మొదలయ్యాయి ఈ కబుర్లు. అది తెలుగు క్లాస్ అయినా కూడా ఈ కబుర్లెప్పుడూ తెలుగు ఇంగ్లిష్ కలిపిన తెంగ్లిష్లో ఉండేవి. పిల్లలకు మనలాగే అక్టోబర్ అంటే గాంధీ తాత గుర్తు రావాలని టీచర్ ఉద్దేశమట. అక్టోబర్ రెండున గాంధీ జయంతి అని గుర్తు చేసి అందరికీ స్వీట్స్ పంచారు టీచర్. అంతలో తలుపు తట్టి లోనికొచ్చారు డాక్టర్ షా. వారి వెనకాలే వచ్చారు వారి క్లాస్ విద్యార్థుల్లోని ఐదుగురు అమేరికాంధ్ర యువతీ యువకులు. ప్రఖ్యాత కార్డియోథొరాసిక్ తజ్ఞుడైన డా. షా గారు కోవెల్లో ప్రతి ఆదివారం యువతకు మరియు వారి తల్లిదండ్రులకూ కలిపి భగవద్గీత క్లాస్ నడిపేవారు. వారి క్లాస్లో భారతీయులతో పాటు అమేరికన్లు కూడా ఉండేవారు. ఆయనతో వచ్చిన ఆ యువ విద్యార్థులకు మా క్లాస్లోని విద్యార్థులతో కలిసి మా కబుర్లలో పాల్గొనేందుకు అవకాశమివ్వాలని కోరారు డాక్టర్ షా. ఇదే మొదటి సారి ఆయనిలా కోరడం. పిల్లలు తమలా అమేరికాలో పుట్టి పెరుగుతున్న యువత నుంచి విషయాలు తెల్సుకోవడం సులభమవుతుందని ఈ ప్రయత్నమని నవ్వారు డాక్టర్ షా గారు.

ఆ ఐదుగురు క్లాసుకు తమ పరిచయం తెలిపారు. వాళ్ళందరూ పదిహేడు, పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఉన్న హైస్కూల్ విద్యార్థులు. పిల్లల గమనం అందులో ఒకబ్బాయి వివేక్ చేతిలోనున్న మూడు కోతుల బొమ్మ పైనే ఉండింది. వివేక్ తాను తెచ్చిన మూడు కోతుల బొమ్మని పిల్లలకు చూపెట్టి ఇది గాంధీజీకి ప్రియమైన సిద్ధాంతమని తెలిపాడు.

“I know what is meant by these 3 wise monkeys. `see no evil, hear no evil, speak no evil’  చెబుతున్న చిన్నారి కళ్ళలో తనకిది తెలుసనే మెరుపు కనబడింది.

“దాన్నే తెలుగులో చెప్పాలంటే ‘చెడును చూడకూడదు; చెడును వినిపించుకోకూడదు; చెడును పలకకూడదు’ అని అర్థం.” పిల్లలు హైస్కూల్ అమ్మాయి వినీత అనువాదం వింటూ తలూపారు.

చెడుని పలకకూడదంటే అది మన కన్‌ట్రోల్లో ఉంటుంది. అయితే చెడును చూడ కూడదు, చెడు వినకూడంటే అది మన కన్‌ట్రోల్లో ఉండదు కదూ అని పిల్లలు ప్రశ్నించారు. అదీ నిజమే, మన చుట్టూ చెడు జరుగుతుంటే అదే కదా మన కళ్ళకు కనిపించేది. ఎవరైనా చెడ్డది మాట్లాడితే చెడు మనకి వినిపిస్తుంది. అంటే చెడు జరిగేటప్పుడు కళ్ళు మూసుకోవాలా? చెడ్డ మాటలు వినిపిస్తే తక్షణమే చెవులు మూసుకోవాలా? పిల్లల్నుంచి ప్రశ్నలు ఒకటి తర్వాతొకటి రావడానికి మొదలయ్యాయి.

“కాదు. కాదు. మనం చెడ్డ సహవాసంలో ఉంటే కదా చెడుని వినడం, చెడుని చూడడమూనూ. మనం మంచి స్నేహితులతో ఉన్నామంటే అలాంటి సందర్భమే రాదు” తక్షణమే వివరించి చెప్పింది ఇంకో హైస్కూల్ అమ్మాయి లాస్య. “మనమేం చూస్తామో, ఏం వింటామో అదే కదా మన మాటల్లో కూడా ఉంటుంది. అందుకే మంచినే చూస్తూ, మంచినే వింటుంటే మనం మంచినే మాట్లాడుతాం. మంచితనమే మన మనసులోనూ, మన నడతలోనూ ఉంటుంది.” లాస్య మాటలను టీచర్ కొనసాగించారు.

“Gandhiji used this very principle by turning a blind eye and deaf ear to the colonial atrocities of the British. But he silently fought against the injustice in a peaceful nonviolent way until we got freedom.” ఇంకో హైస్కూల్ అబ్బాయి వివరణ గాంధీజీని స్వాతంత్ర్య యోధుడిగా పిల్లల ముందుకు తెచ్చి అతని మనోబలానికి తిరుగు లేదని నిరూపించేలాగుండింది.

గాంధీజీ ప్రపంచానికే అహింసా తత్వాన్ని చాటారని, మార్టిన్ లూతర్ కింగ్ జూనియర్ కూడా దాన్నే పాటించారని లాస్య అనగానే పిల్లలు మార్టిన్ లూతర్ కింగ్ గురించి తమకు తెల్సిన విషయాలు వల్లించసాగారు. అమేరికాలో చదువుతున్నారు కాబట్టి వర్ణబేధాలు నిర్మూలించేందుకని మార్టిన్ లూతర్ కింగ్ పోరాటం గురించి స్కూల్లో చదవడం వల్ల వాళ్ళందరికీ తెలుసు. మార్టిన్ లూతర్ కింగ్ గాంధీజీగారి శాంతియుత స్వతంత్ర పోరాటాన్నే ఆదర్శంగా పెట్టుకొని తమ పోరాటాన్ని కొనసాగించారని లాస్య పిల్లల మనసుకు నాటేలా చెప్పిందింకో సారి.

సమానత కోసం ఎప్పుడూ ఎక్కడో ఒక దగ్గర పోరాటం  జరుగుతూనే ఉంటుందన్నాడో చిన్నారి. చేసే పనిని బట్టి వర్గీకరణానికి ఇప్పుడు అర్థం లేకపోయినా ఇండియాలో జాతి పద్ధతులు ఇంకా ఉన్నాయి. జాతుల బట్టి రిజర్వేషన్స్ కూడా ఉన్నాయి. రాజకీయంలో కూడా జాతుల ప్రభావం చాలా ఉంటుందని ఆ విషయాలను చర్చించారు హైస్కూల్ పిల్లలు. చిన్న పిల్లలకు అదంత నచ్చ లేదు అర్థం చేసుకోలేకపోయారు కాబట్టి. గాంధీజీ అన్ని మతాలు, కులాలు ఒకటేనని చాటి ‘జాతిపిత’ గా జనాదరణ పొందారని తెలుపుతూ ఆ చర్చను త్వరగా ముగించేశారు.

“ఇండియాలో హిందువుల్లో ఒక్కటే కాదు, సంగీతంలో కూడా జాతులున్నాయి. అంటే శాస్త్రీయ సంగీతంలో తాళాల్లో కూడా జాతులున్నాయి.” వేసవి సెలవుల్లో తను తాతగారి ఊరెళ్ళినప్పుడు అక్కడ కర్నాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకొంటానని చెప్పింది పాప నవ్వులతో. తాళాల్లో లఘువు అనే అంశం ఉంది. లఘువులో ఉన్న అక్షర కాలాన్ని బట్టి తాళ విభజనలుంటాయి. ౩ అక్షరాల లఘువున్న తాళం త్రిశ్ర జాతి తాళమంటారు. అలాగే తాళంలో 4,5,7,9 అక్షరాల లఘువుంటే అది క్రమంగా చతురశ్ర, ఖండ, మిశ్ర మరియు సంకీర్ణ జాతి తాళమనాలి.

మన జాతిగోడల నుంచి దూరంగా అమేరికాలో పుట్టి పెరుగుతున్న మన పిల్లలకు జాతి విషయాలు బహుశః విచిత్రమనిపిస్తాయి. ‘జ’ అంటే పుట్టుక; పుట్టుక నుంచి వచ్చేది జాతి అన్న టీచర్ మాటకు తక్షణమే వచ్చింది ప్రశ్న. మన సంగీతంలో ఎందుకు జాతి అనే పేరుతో విభజన అని. ఏం చెప్పాలో తోచక నవ్వేశారావిడ.

“My mom uses jaati even for plants and animals. It’s just like we use the word family. For example, we say both lemon and orange belong to the same family of citrus fruits. She would say ‘అవి రెండూ ఒకే జాతి ఫ్రూట్స్’ అని.” పిల్లల నవ్వులెక్కువయ్యాయి.

“A cat and a tiger are from the same family according to the classification rules in biology. The classification is done depending on the similarity in certain key characteristics. But in everyday language, jaati is used interchangeably to mean a community or species. ” హైస్కూల్ విద్యార్థి పిల్లలకు అర్థమయ్యేలా స్కూల్లో నేర్చుకొనే వర్గీకరణ విధానం మరియు దైనందిన భాషలో వాడే విధానం వేరేగా ఉంటుందని వివరించాడు.

జాతుల గురించి పిల్లలకు వివరించడం చాలా కష్టమైన పని. ఎందుకంటే జాతి విధానాల్ని ఒప్పుకోలేం, తప్పుకోలేం లాంటి స్థితిలో ఉన్న మనం తర్కబద్ధమైన వివరణ ఇచ్చేదెలా? మీ చుట్టుపక్కల నివసించే వాళ్ళ జాతి ఏదో మీకు తెలుస్తుందట ఇండియాలో, అదెలా సాధ్యమని అడిగారు మా విదేశీ ప్రొఫెసరొకాయన. కొన్ని సముదాయాల్లో జాతి పేరు కూడా పేర్లో ఒక భాగమై వాడబడుతుందని విని ఆశ్చర్యపడ్డారు. మీ దేశంలో మీ జాతి ఏది అని ఒకరినొకరు అడగొచ్చా అని కూడా అడిగారింకొకరు. అది వారి వ్యక్తి స్వాతంత్ర్యానికి భంగం చేసినట్టు కాదా అనడిగారు. మీది జాత్యాతీత దేశం కాబట్టి చట్టం ప్రకారం అందరూ సమానులు కదూ అని మా అమేరికన్ స్నేహితులడిగితే ఏమనాలో, ఎలా బదులివ్వాలో తెలియలేదు. కొన్ని ప్రశ్నలకు మౌనమే సరియైన బదులిస్తుంది. వివేక్ బోర్డ్ పైన ఏదో రాయడం చూసి నా ఆలోచనల నుంచి బయటికొచ్చాను.

బోర్డ్ పైన గాంధీజీని రాసి తనకిష్టమైన వారి మాటలను ఉల్లేఖించాడు వివేక్. అతి సులభంగా రెండే రెండు గీతల్లో రాసినట్టున్న ఆ గాంధీజీ బొమ్మ అందరికీ భలే నచ్చింది. అందరూ దాన్ని చూసి తమ నోట్‌బుక్లో అలాగే రాసుకొన్నారు.

హైస్కూల్ విద్యార్థి విజయ్ పిల్లలతో

జన్మనా జాయతే శూద్రః  కర్మణా ద్విజ ఉచ్యతే |

వేదపాఠాత్ భవేత్ విప్రః బ్రహ్మజ్ఞానేతి బ్రాహ్మణః ||

శ్లోకాన్ని చెప్పించి పుట్టుకవల్ల మనుషుల్ని విభజించకూడదని వాళ్ళు చేసే పనుల వల్ల ప్రతియొక్కరూ ఉత్తమ వ్యక్తిత్వాన్ని రూపుదిద్దుకోవచ్చనేది దీని అభిప్రాయమని విడదీసి చెప్పాడు. “At birth all is equal. But by their deeds they differ. We all have the same opportunity to become great. Anyone can become the highest class individual by doing the right things in life. ” తెలుగులో చెప్పినదాన్ని ఇంగ్లిష్‌లో కూడా చెప్పారు.

హిందువుల్లో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని నాల్గు వర్గాలుండేవి. ఈ శ్లోకం ప్రకారం పుట్టుకతో అందరూ శూద్రులే. వారు చేసే కర్మల వల్ల, వారి పఠనం మరియు సాధనల వల్ల బ్రహ్మ జ్ఞానమును పొంది బ్రాహ్మణులవుతారని తెలిపారు టీచర్. మంచి నడవడికతో ఉంటూ, మంచి పనులు చేసి, సాధనతో మంచి జ్ఞానాన్ని పొంది శ్రేష్ఠులుగా జీవితాన్ని రూపొందించుకోవచ్చని దీని అర్థమన్నారు. బ్రహ్మ జ్ఞానమంటే ఏమన్న పిల్లల ప్రశ్నకు బ్రహ్మ జ్ఞానమంటే ఉన్నతమైనదని, దాన్ని పొందాలంటే ప్రతి రోజూ క్రమం తప్పకుండా నిజాయితీతో ప్రయత్నించాలన్నారు. పరిసరా;అను పరిశుభ్రంగా ఉంచుకొని, పరిశుద్ధ మనస్సుతో సాగే బ్రతుకే పరిపూర్ణ జీవితమనవచ్చు. గాంధీజి బోధించినదీ, పాటించినదీ అదే. అందుకే ఆయన మహాత్ముడనిపించుకొన్నారు. అందర్నీ, అన్నిటినీ సమానంగా గౌరవించినప్పుడు అది క్రమేణా సాధ్యమవుతుందన్నారు టీచర్.

“అవును. మా తాతయ్య దీన్నే ఇంకోలా చెప్పారు. HEART and EARTH are anagrams. So, we have to care for the EARTH just like we care for HEART for good health. We become global citizens by respecting everything and everyone on the globe.” చిన్నారి చెప్పగా పిల్లలకది చాలా నచ్చినట్టనిపించింది. పిల్లలకలాగే. తమ తోటి పిల్లల మాటలు, మనస్సు త్వరగా అర్థమవుతాయి. అదీ గాక HEART and EARTH are anagrams అన్నది వాళ్ళకు అతిసులభంగా గుర్తుంటుంది.

ఆ రోజు హైస్కూల్ విద్యార్థులే టీచర్లలాగ పిల్లల జతలో చర్చల్లో పాల్గొనడం కొత్తగా అనిపించినా ఒక మంచి అనుభవాన్నిచ్చింది. ఏ విధమైన తయారీ లేకుండానే కబుర్లు బాగా జరిపారని డాక్టర్ షా గారు ప్రతియొక్కర్నీ పేరు పేరునా అభినందించారు. గాంధీజీ అలోచనలపై అత్యధిక ప్రభావం చూపిన గ్రంథం భగవద్గీత అంటూ, అది గాంధీజీకి పరమప్రియమైనదంటూ ఆ ఐదుగురు విద్యార్థులకు డా. షా గారు భగవద్గీత పుస్తకాలను ఇచ్చి గౌరవించారు కూడా.

దేశం వేరైనా, భాషలు వేరైనా మనుషుల భావనలొక్కటే. అన్ని చోట్లా అన్ని రకాల మనుషులుంటారు; విభజనలూ ఉంటాయి. ఎందరెట్లాంటి వాళ్ళనే శాతం కొంచెం మారుతుందంతే. మనం మంచి భావనలతో, మంచి పనులతో, ఈ విభజనలకు అంటీ అంటన్నట్టు ఉంటూ, ఆదర్శనీయమైన జీవితం ఎలా గడపాలని భగవద్గీతలో మీరందరు చదివి తెల్సుకోవాలి వాట్ని పాటించి మహాత్ములు కావాలన్న డాక్టర్ షా గారి మాటలతో ముగిసిందా క్లాస్.

*

 

 

 

 

 

మీ మాటలు

 1. BUCHI REDDY GANGULA says:

  గీత లో కూడా రాజకియెం లేదా ???యిప్పటి అమెరికా లో ని పిల్లల కు
  అ ఆ లు రావు —-యూనివర్సిటీ ల లో తెలుగు — 3 పూలు –6 కాయలు —
  ఫండ్ రేసింగ్ అంటూ తెలుగు మేధావి ప్రకటన జారి చేశారు ???
  పేరుకే తెలుగు సంగాలు అమెరికా లో — అందులో తెలుగు ఉండదు — వినిపించదు
  కనిపించదు —-
  mom.అండ్ dad.. కల్చర్ లో —- ???? బ్రహ్మ జ్ఞానం అర్థం అయి0ధా పిల్ల ల కు ?? జోక్
  ——————————————————————
  బుచ్చి రెడ్డి గంగుల

 2. వనజ తాతినేని says:

  ఎంత పెద్ద సవాల్ ఉందండీ పిల్లల ముందు . వాళ్ళని ఆ మార్గం వైపు గాంధీ గీత తీసుకెళుతుందా !?

  మీరు వ్రాసే విషయాలు ఆసక్తిగా ఆలోచనాత్మకంగా ఉంటున్నాయి సుధా గారు . థాంక్ యూ !

 3. అజిత్ కుమార్ says:

  ఈ వ్యాసం పాత రోజులకు చెందినది. నేటి కాలానికి ఇంకా కొనసాగించాల్సిన అవసరం ఉన్నట్లుగా లేదు. స్వాతంత్ర్య సాధన కోసం ప్రజలను కూడగట్టుట అనే ఎత్తుగడలో భాగంగా జవహర్ లాల్ నెహ్రూ తన పార్టీ లోని ప్రతి సభ్యుడూ గాంధీగారిని గౌరవించాలనీ, వారిని గూర్చి గొప్పగా ప్రచారం చెయాలని సూచించారు.
  నేడు విద్యాలయాలలో మత గ్రంధాలను గాంధీగారి పేరుతో ప్రవేశపెడుతున్నారన్నమాట. పిల్లలలో ఉన్నత విలువలు పెంచాల్సిన అవసరాన్నిఈ వ్యాసం వెల్లడిస్తుంది. ఈ పిల్లల మానసిక స్ధితిని జ్ఞాన సంపదనూ చూస్తుంటే నోట మాట రావడం లేదు.

 4. Nageswara Rao says:

  చాలా మంచి వ్యాసం.. విభజన వాదంతో ఏటికొకళ్ళు – పాటికొకళ్లు గా విడిపోతున్న జాతిని కలిపే ఏ కైక సూత్రం సంస్క్రుతి మాత్రమే .. మరొక గాంధీ పుట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది సమాజానికి..వ్యాఖ్యలలో మత ప్రస్తావన అనవసరంగా తెస్తున్నారు..ఏ విషయాన్ని రాయడానికి గొప్ప గొప్ప వాళ్లే తలకిందులవుతారో దాన్ని చాలా నేర్పుగా చెప్పారు.. సుధాగారికి అభినందనలు

మీ మాటలు

*