‘సంభాషణ’ అవసరాన్ని గుర్తిద్దామా?

 

-భాస్కరం కల్లూరి

కల్లూరి భాస్కరం

చావు అనేది అంతిమం.  ఆ తర్వాత ఏమీ ఉండదు. సహజీవనం, సామరస్యం, సంభాషణ లోపించినప్పుడు ఏర్పడే ఒక శూన్యంలో మనిషి సాటి మనిషి ప్రాణం తీయడం జరుగుతుంది. ఆ దశలో అతన్ని మనిషి అనడానికి వీల్లేదు. పశువు అని కూడా అనకూడదు. అంటే పశువును అవమానించడం అవుతుంది. ఎందుకంటే పశువుకు ఆలోచించే శక్తీ, సంభాషించే శక్తీ ఉండవు. ఆ రెండూ ఉన్న మనిషి ఇంకో మనిషిని చంపినప్పుడు అతనికి ఇంకో పేరు సృష్టించుకోవలసిందే.

కల్బుర్గి హత్యను ఖండించడం ‘మనిషి’ అనిపించుకోడానికి ఇష్టపడే ప్రతి ఒక్కరి బాధ్యత. అందులో కల్బుర్గి సమర్థకులే కాదు, వ్యతిరేకులు కూడా వస్తారు. చావు ఇంకో చావును మాత్రమే పుట్టిస్తుంది. చావులోంచి బతుకు పుట్టదు. ఈరోజు కల్బుర్గి హత్య జరిగితే, రేపు కల్బుర్గి భావజాలాన్ని వ్యతిరేకించేవారి హత్య జరగచ్చు. ఈ హత్యల గొలుసుకట్టు ప్రయాణంలో మనిషి పూర్తిగా గల్లంతైపోతాడు. మనిషి అనిపించుకోవడానికి ఇంకో షరతు ఏమిటంటే, కల్బుర్గి హత్యను ఖండించినట్టే, రేపు కల్బుర్గి వ్యతిరేకుల హత్యను కూడా అంతే గట్టిగా ఖండించాలి.

ప్రకృతి ఏర్పాటుకు విడిగా ఒక మనిషిని సృష్టించే శక్తి మనిషికి ఎలా లేదో, ప్రకృతి ఏర్పాటుకు విడిగా ఒక మనిషిని చంపే శక్తి కూడా ఉండకూడదు. అన్ని మతాలూ అదే చెబుతాయి. కానీ మతం పేరుతోనే చంపడం– మనిషితనానికి మనిషి ఎంత దూరమయ్యాడో తెలిపే కొండగుర్తు(అనేకానేక సందర్భాలలో సామూహిక హత్యలు జరుగుతుంటాయి. వాటిలో కొన్నింటిపై ‘దేశభక్తి’ ముద్ర కూడా ఉంటూ ఉంటుంది. చంపడం అన్నప్పుడు నేను వీటన్నింటినీ ఉద్దేశించడం లేదు. ఈ  రకమైన సామూహిక హత్యాకాండ నుంచి  మానవాళి ఎప్పటికైనా బయటపడుతుందో లేదో తెలియదు. ఈ లోపల నివారించగలిగిన హత్యల గురించే నేను మాట్లాడుతున్నది).

కల్బుర్గి హత్యపై ఆయన సమర్థకులు, వ్యతిరేకుల స్పందనలు రెండింటిలోనూ ఒకే విధమైన ఆవేశం కనిపిస్తోంది. అది ఎంత సహజమే అయినా, ఇది ఆలోచనకు కూడా సందర్భం. కల్బుర్గి సమర్థకులకు, వ్యతిరేకులకూ కూడా! కల్బుర్గి దైవదూషణకు, విగ్రహాలపట్ల దారుణ అపచారభావనకు పాల్పడ్డారని, మా మనోభావాలు గాయపడ్డాయని ఆయన వ్యతిరేకుల ఆరోపణ. కల్బుర్గి హత్యను ఖండించడంలో ఆయన సమర్థకులు, ఆయన వ్యతిరేకుల మనోభావాలను మరింత గాయపరచడానికి పూనుకున్నారు. దాంతో కల్బుర్గి వ్యతిరేకులు పరోక్షంగానో, ప్రత్యక్షంగానో కల్బుర్గి హత్యను సమర్థించేవరకూ వెళ్లారు. ఇద్దరూ చెరో చిటారు కొమ్మా ఎక్కి కూర్చున్నారు. చావు అనే అంతిమం చర్చనీయం కావాల్సింది పోయి, కల్బుర్గి చేసింది తప్పా ఒప్పా అన్నది చర్చనీయంగా మారింది. కారణం, రెండువైపులా ఆవేశం, ఆవేశం…ఆలోచన లోపించిన వీరావేశం!

అసలెందుకిలా జరుగుతోంది, ఎందుకిలా జరగాలి, దీని చరిత్ర ఏమిటి, ఈ చరిత్రను ఇప్పుడైనా మార్చలేమా అని రెండు వర్గాలూ ఆలోచించుకోవలసిన సందర్భం ఇది. అంటే రెండు వర్గాలలోనూ, వర్గాల మధ్యా అంతర్విమర్శా, సంభాషణా జరగాలన్నమాట.

రెండు శత్రుదేశాల సంబంధాలతో దీనిని పోల్చిచూసినప్పుడు మనకేమైనా మార్గం కనిపిస్తుందా?!

ఉదాహరణకు భారత, పాకిస్తాన్ లనే తీసుకుందాం. రెండింటి మధ్యా నిరంతర సమరవాతావరణం ఉంటూనే ఉంది. అదే సమయంలో శాంతి అవసరాన్నీ, అందుకు రెండు వైపులా జరగవలసిన కృషినీ నొక్కి చెప్పడమూ జరుగుతూనే ఉంది. ఒక్కోసారి రెంటి మధ్యా ఎలాంటి సంభాషణా జరగడానికి వీలులేదనే వైఖరిని తీసుకోవడం, ఒక్కోసారి దానిని పూర్తిగానో, పాక్షికంగానో సడలించి సంభాషణ జరగాలనే వైఖరి తీసుకోవడం చూస్తూ ఉంటాం. ఇందులో మళ్ళీ ఎన్నో తేడాలు. ఎలాంటి పరిస్థితులలో నైనా సంభాషణ ఆగకూడదనేవారూ, పాకిస్తాన్ పూర్తిగా దారికి వస్తే తప్ప సంభాషణ జరగడానికి వీల్లేదనేవారూ, పరిస్థితులు ఎలా ఉన్నాసరే, శత్రుత్వపు మంటను నిర్విరామంగా రాజేసేవారూ-రెండు వైపులా ఉన్నారు. ఇన్నేళ్లలో కాల్పుల విరమణ సంధి ఉల్లంఘనలు పదేపదే జరుగుతూనే ఉన్నాయి. ఇందులో ఇంకొకటి కూడా చెప్పుకోవాలి. అధికారంలో లేనప్పుడు పాకిస్తాన్ తో సంభాషణ జరగడానికి వీల్లేదని శాసిస్తూ వచ్చినవారే, అధికారంలోకి వచ్చాక సంభాషణ అవసరాన్ని నొక్కి చెబుతూ ఉంటారు. అంటే, అధికారంలో లేనప్పుడు గుర్తించని బాధ్యతను అధికారంలోకి వచ్చాక గుర్తిస్తున్నారన్నమాట. ఇక్కడ ‘బాధ్యత’ అనే మాటను దృష్టిలో ఉంచుకోవాలి.

దాంతోపాటు, భారత-పాకిస్తాన్ సంబంధాల సమరస్వభావం అలా ఉండగా, దండలో దారంలో ‘సంభాషణ’ కూడా చర్చలోకి వస్తుండడాన్నీ దృష్టిలో ఉంచుకోవాలి.

ఇదే అంశం తీవ్రతా భేదంతో భారత-చైనా సంబంధాలకూ వర్తిస్తుంది. 1986 వరకూ చాలాకాలంపాటు రెండు దేశాల మధ్యా సంభాషణ కానీ, రాకపోకలు కానీ లేని పరిస్థితి కొనసాగింది. ఆ తర్వాత అసలు వివాదమైన సరిహద్దు వివాదాన్ని పక్కన ఉంచుతూ, సంభాషణకూ, రాకపోకలకూ తెరతీయడం; వాణిజ్యం తదితర రంగాలలో సంబంధాలను పునరుద్ధరించుకోవడం సంభవించింది.

కల్బుర్గి హత్య దగ్గరికి మళ్ళీ వద్దాం. రెండు దేశాల మధ్య ఘర్షణలానే, రెండు భావజాలాల మధ్య ఘర్షణను ఈ హత్య సంకేతిస్తోంది. పైగా భారత-పాకిస్తాన్, భారత-చైనాల శత్రుత్వం కన్నా ఇది అతి పురాతనం. ఎంత పురాతనమో స్థూలంగా చెప్పాలంటే, రామాయణమంత పురాతనం. అందులో రాముడు పరలోకాన్ని, విశ్వాసాన్ని నొక్కిచెప్పే ఋషుల భావజాలానికి ప్రతినిధి అయితే, జాబాలి దానికి భిన్నమైన భావజాలానికి ప్రతినిధి. వారిద్దరి మధ్యా ఒక సందర్భంలో వాదోపవాదాలు జరుగుతాయి. అలాగే మహాభారతంలో కురుక్షేత్రయుద్ధం జరిగిన తర్వాత ధర్మరాజు హస్తినాపురానికి వస్తుంటాడు. అప్పుడు చార్వాకుడు అతన్ని అడ్డుకుని ఇంతటి యుద్ధానికీ, రక్తపాతానికీ, విధ్వంసానికీ కారణం నువ్వే నంటూ తూలనాడతాడు. అప్పుడు ధర్మరాజు వెంట ఉన్న బ్రాహ్మణులు అతన్ని చంపేస్తారు. ఆ తర్వాత కూడా రెండు భావజాలాల మధ్య శత్రుత్వపు పాయ చరిత్రపొడవునా కొనసాగుతూనే ఉంది.  బుద్ధుడు, వేమన లాంటివారు ఈ ఘర్షణకు ప్రాతినిధ్యం వహిస్తూనేవచ్చారు. అంబేడ్కర్, కల్బుర్గి, పనాసే, ధబోల్కర్, యూ. ఆర్, అనంతమూర్తి లాంటివారు వీరికి ఆధునికమైన కొనసాగింపులు మాత్రమే.

రెండు దేశాల మధ్య శత్రుత్వంతో పైన చెప్పిన రెండు రకాల భావజాలాల మధ్య శతృత్వాన్ని పోల్చడంలో నాకైతే ఎలాంటి అనౌచిత్యం కనిపించడంలేదు. ఒకటి బాహ్యశక్తులతో ఘర్షణ. ఇంకొకటి అంతర్గత శక్తుల మధ్య ఘర్షణ. ఇక్కడ నా ప్రశ్న ఏమిటంటే, బాహ్యశక్తులతో ఘర్షణలో శాంతి, సామరస్యం, సంభాషణల అవసరాన్ని గుర్తించి నొక్కి చెబుతున్నప్పుడు; అంతర్గత శక్తుల మధ్య భావజాలాల ఘర్షణలో ఎందుకు నొక్కి చెప్పడం లేదు, ఎందుకు నొక్కి చెప్పకూడదు?! అంతర్గత శాంతి, సామరస్యాలు కూడా అంతే ముఖ్యం, బహుశా అంతకంటే ఎక్కువే ముఖ్యం కదా? బాహ్యశక్తులను కలసికట్టుగా ఎదుర్కోడానికైనా అది అవసరమే కదా?!

రెండు దేశాల మధ్య సమర వాతావరణం నిరంతరాయంగా కొనసాగడం మంచిది కాదు కనుక, శాంతి సామరస్యాలను నెలకొల్పడానికి సంభాషణను ఆశ్రయించడంలో అధికారంలో ఉన్నవారు ‘బాధ్యతా’ స్పృహతో వ్యవహరిస్తున్నారన్నమాట. మరి రెండు అంతర్గత భావజాలాల ఘర్షణ ఇలా హింసకు, రక్తపాతానికి దారితీస్తున్నప్పుడు ఆ బాధ్యత ఏమైపోయింది; ఆ ఘర్షణను నివారించి శాంతి, సామరస్యాలకు కృషి చేయవలసిన బాధ్యత ఎవరు తీసుకోవాలి? దానికి ‘పౌరసమాజం’ అన్నది ఒకానొక జవాబు అనుకుంటే, పౌరసమాజం తన బాధ్యతను విస్మరించిందనుకోవాలా?!

పైగా మనం భిన్న భావజాలల శాంతియుత, సామరస్యపూర్వక సహజీవనానికి అవకాశమిచ్చే ప్రజాస్వామ్యంలో ఉన్నాం. అందుకు వీలైన రాజ్యాంగాన్ని 65 ఏళ్లుగా అమలుచేసుకుంటున్నాం. భారత రాజ్యాంగం దేశాన్ని ఒక నూతన సందర్భంలోకి తీసుకెళ్లింది. ఆ సందర్భాన్ని మనం గుర్తిస్తున్నామా? భిన్న భావజాలాల ఘర్షణలో ఏ వైఖరి తీసుకోవాలి, ఆ రెంటి మధ్యా ఎలాంటి సర్దుబాటు చేసుకోవాలనే విషయంలో రాజ్యాంగమే బ్లూ ప్రింటు ఇస్తోంది. ఏ చర్చకైనా రాజ్యాంగం ఉనికే ప్రాతిపదిక కావాలి.  స్వీయబాధ్యతను గుర్తించే ఏ పౌరసమాజమైనా రాజ్యాంగం ఉనికిని పదే పదే గుర్తుచేస్తూ భిన్న భావజాలాల శాంతియుత సహజీవనాన్ని నొక్కి చెబుతూనే ఉండాలి. రాజ్యాంగం నిర్వహించేది మధ్యవర్తి పాత్ర.

రెండు దేశాలు తమ ఇరుగు పొరుగును తమకు కావలసిన పద్ధతిలో సృష్టించుకోలేవనీ, సామరస్యంతో సహజీవనం చేయక తప్పదనీ మనకు తెలుసు. ఇదే సూత్రం అంతర్గత భావజాలాలకూ వర్తిస్తుంది. నాస్తికులూ-ఆస్తికులూ, హేతువాదులూ, విశ్వాసవాదులూ…ఇలా భిన్న భిన్న భావజాలాల వాళ్ళు సొంత ఇష్టాయిష్టాలు ఎలా ఉన్నా సహజీవనం చేయకతప్పదు. కనుక దేశాల మధ్య లానే వీళ్ళ మధ్య సంభాషణ, సర్దుబాటు ఉండాలి. ఆ అవగాహన సరళి రేఖామాత్రంగా ఇలా ఉండచ్చు :

 1. ఆస్తికత్వాన్నీ, విశ్వాసాన్నీ విమర్శించే, వ్యతిరేకించే ప్రజాస్వామిక హక్కు నాస్తికులకు, హేతువాదులకూ ఉంది. తమ భావజాలాన్ని ప్రచారం చేసుకునే హక్కు కూడా ఉంది. అలాగని ఆస్తికుల మనోభావాలను గాయపరచే హక్కు; ఆస్తికులు పూజించే దేవుళ్ళను దూషించే హక్కు వారికి లేదు. చట్టం, రాజ్యాంగం అనుమతించిన పరిమితుల్లో మతస్వేచ్ఛలానే; భావజాలస్వేచ్ఛను కూడా అన్ని పక్షాలూ గుర్తించాలి.
 2. తమ ఆస్తికత్వాన్నీ, విశ్వాసాన్నీ ఉద్ఘాటించుకుని ప్రచారం చేసుకునే హక్కు, నాస్తికత్వాన్నీ, హేతువాదాన్నీ విమర్శించే హక్కు ఆస్తికులకు ఉంది. అలాగని నాస్తికులను, హేతువాదులను దూషించి, దేశద్రోహులుగా చిత్రించే హక్కు; వారిపై భౌతిక దాడులకు దిగి హతమార్చే హక్కు వారికి లేదు. ఆస్తికులు అధికసంఖ్యాకులు కూడా కనుక ఈ విషయంలో వారిపై మరింత బాధ్యత ఉంటుంది. ఈ భౌతికసంఖ్యాధిక్యం నుంచి వారు అదనపు ప్రయోజనం పొందడానికి చూడకూడదు.
 3. నాస్తిక, ఆస్తిక ఉద్యమాలు రెండూ చిరకాలంగా పట్టువిడుపులు లేని ఆత్యంతిక వైఖరి(extreme)నే తీసుకుంటూ వచ్చాయి. పరస్పర శత్రుత్వానికి పదును పెడుతూనే వచ్చాయి. ఈ మార్గంలో ఏ ఉద్యమమూ ఫలితం సాధించలేకపోయింది. నాస్తికత్వం ఆస్తికత్వాన్నీ, ఆస్తికత్వం నాస్తికత్వాన్నీ కొంచెమైనా తుడిచిపెట్టలేకపోయాయి. ఈ వాస్తవాన్ని ఎప్పుడైతే గుర్తిస్తాయో అప్పుడు చరిత్ర పొడవునా తమ మధ్య జరుగుతున్నది ఒక విఫలపోరాటమన్న సంగతి అర్థమవుతుంది. విఫల పోరాటాన్ని కొనసాగించడంలో అర్థం, ఔచిత్యం లేని సంగతి బోధపడుతుంది. ఆ గుర్తింపు సంభవించినప్పుడు రెండూ ఒక సరికొత్త ఉమ్మడి ప్రాతిపదికపై సహజీవనం చేయడానికి సాధ్యమవుతుంది. సరిహద్దు వివాదాన్ని పక్కన పెట్టి వాణిజ్యం తదితర ఉమ్మడి ప్రయోజనాలపై భారత-చైనాలు సంబంధాలను పునరుద్ధరించుకున్న ఉదాహరణను ఇక్కడ గుర్తుచేసుకోవచ్చు. అలాగే ఉమ్మడి కార్యక్రమం పై పార్టీలు ఏకమై సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్న ఉదాహరణను కూడా.
 4. ఆస్తిక, నాస్తికవాదుల మధ్య సర్దుబాటు సరళి ఇలా ఉండచ్చు: అ)నాస్తికులు ఆస్తిక స్వేచ్ఛను అగౌరవపరచకూడదు. ఆస్తికుల మనోభావాలను నొప్పించకూడదు. అదే సమయంలో ఉమ్మడి కార్యక్రమం ప్రాతిపదికపై దేశ ఇతరేతర ప్రయోజనాలకు వారిని కలసిరమ్మని ప్రతిపాదించవచ్చు. రాజ్యాంగం పేర్కొన్న సైంటిఫిక్ టెంపర్ ను అభివృద్ధి చేయడం వాటిలో ఒకటి. అలాగే కొన్ని విపరీత స్వభావం కలిగిన విశ్వాసాలకు అడ్డుకట్ట వేయమనీ, విశ్వాసరంగాన్ని తగిన మేరకు సంస్కరించవలసిందనీ కోరవచ్చు. విశ్వాసం ముసుగులో జరుగుతున్న రకరకాల వ్యాపారాలను, మోసాలను నియంత్రించమని అడగచ్చు. మతాన్ని, దేవుణ్ణి వీలైనంత వరకు ప్రైవేట్ కు పరిమితం చేసి పబ్లిక్ జాగాను సామాజిక కార్యకలాపాలకు, అవసరాలకు విడిచిపెట్టమని అడగవచ్చు. మతాన్నీ, విశ్వాసాన్నీ రాజకీయంగా వాడుకోజూసే శక్తులను దూరంగా ఉంచమని కోరవచ్చు. ఆ) ఆస్తిక, విశ్వాసరంగం చాలాకాలంగా అంతర్గత సంస్కరణలకు దూరంగా ఉందన్న సంగతిని ఆస్తికవాదులూ గుర్తించాలి. గతంలో వివిధ కాలాలలో ఈ రంగంలో జరుగుతూ వచ్చిన సంస్కరణలు ఇప్పుడు ఎందుకు లోపించాయో ఆస్తికవాదులూ, ఆధ్యాత్మికమతనాయకులూ, పౌరాణికులూ ప్రశ్నించుకోవాలి. ఆత్మవిమర్శ చేసుకోవాలి. సమాజం పట్ల తమ బాధ్యతను వారు గుర్తించాలి. నాస్తికత్వం సహా భిన్న భిన్న భావజాలాలు వైవిధ్యవంతమైన, సృజన శీలి అయిన సామాజిక స్వభావానికి అద్దం పడతాయనీ, ప్రజాస్వామ్యం ఉనికిని చాటి చెబుతాయనీ గ్రహించాలి. అంతిమంగా నాస్తికులూ, ఆస్తికులూ కూడా అభిప్రాయభేదాలను నాగరిక పద్ధతుల్లో, ప్రజాస్వామిక పరిమితుల్లో వ్యక్తం చేసుకోవాలి.

అన్నింటి కన్నా ముందస్తు షరతు; భిన్న భావజాల శిబిరాల మధ్య ‘సంభాషణ’ అవసరాన్ని గుర్తించడం. దానికి తెర తీయడం. సంభాషణ అంటూ మొదలయ్యాక అది ఎలాంటి ఫలితాలవైపు పయనిస్తుందన్నది తర్వాతి ప్రశ్న.

ఈ వ్యాసంలోని అనేక అంశాలతో  ఏకీభావం ఉండచ్చు, ఉండకపోవచ్చు. ఎక్కడైనా వ్యక్తీకరణ లోపాలు ఉన్నా ఉండచ్చు. కానీ ఈ రెండు శత్రుశిబిరాల మధ్య సంభాషణ అవసరమన్న అభిప్రాయంతో బహుశా ఎవరూ విభేదించరు. ఆ అవసరాన్ని గుర్తించడమే కల్బుర్గి వంటివారికి తగిన నివాళి అవుతుంది.

*

 

 

 

మీ మాటలు

 1. “అలాగని ఆస్తికుల మనోభావాలను గాయపరచే హక్కు” లేదనడం బాగానే వుంది గానీ, ఏది గాయపరుస్తుంది, ఏది పరచదు అనేది నిర్వచించలేము. గాయపరచుకొనేవాళ్ళు దేనికైనా గాయపరచుకుంటారు. అలాగని భావవ్యక్తీకరణ స్వేచ్చను నిరోదించకూడదు. నిరోధించడమంటూ మొదలయితే కొత్త భావాలు పుట్టడానికి సంకోచం మొదలవుతుంది. భావం చెడ్డదయినా, మంచిదయినా, గాయపరచేదయినా సరే మొగ్గ తొడగాలి. అది చెడ్డదయితే సమాజ అంగీకారం లేక తనంతటదే వాడి పోతుంది. అంతేగానీ ఏ కారణంగానైనా భౌతిక దాడి చేయటం తప్పు. అది మానవాళి మనుగడకే ముప్పు.

 2. Srinivas Vuruputuri says:

  మీ మంచి వ్యాసం చదువుతుండగా నాకు తట్టిన కొన్ని విషయాలు:

  నిన్ననే కన్నడ సీమలో మరో రచయిత బెదిరింపు లేఖను అందుకున్నాడని వార్త వచ్చింది. అది ఉత్తుత్తి బెదిరింపే అవ్వాలనీ, ఆ రచయిత క్షేమంగా ఉండాలనీ, వ్యవస్థ సకాలంలో మేల్కొని హంతకులను, విద్వేష హింసోన్మత్తులను శిక్షిస్తుందని ఆశిద్దాము.

  మొదటగా చెప్పాలనుకున్నది – పెరుగుతున్న లంపెన్ సంస్కృతి గురించి. ఇప్పటికే అన్ని తర్కాలకు సంవాదాలకు సంభాషణలకు అతీతులుగా ఉంటున్న వారిని మనం మార్చలేమేమో కానీ రానున్న తరాల వారినైనా ఎలా కాపాడుకోవాలో ఆలోచించుకోవాలేమో. ఈ విషయంలో TV, సోషల్ మీడియా పెద్ద దోషులేమో. మన పబ్లిక్ డిస్కోర్స్ ప్రమాణాలు ఎలా మెరుగు పరచాలో అర్జెంటుగా ఆలోచించుకోవాలేమో మనం.

  “ఆస్తికుల మనోభావాల విషయంలో జాగ్రత్త పడటం” గురించి – మీరు గమనించారా? ఫైనల్ అనాలిసిస్‌లో అగ్రెసివ్‌గా నిరూపించబడే వారి మనోభావాలే తరచుగా గాయపడేవి. తార్కికమైన జవాబు చెప్పలేకపోవటమే హింసకి దారితీస్తుందనుకుంటాను. కళాకారుల ఆలోచనాపరుల స్వేచ్ఛకు వీలైనన్ని తక్కువ ప్రతిబంధకాలుండటమే సరైనది కదా.

  ఎదుటివాడి అభిప్రాయాల పట్ల వ్యతిరేకతను ప్రజాస్వామిక పద్ధతుల్లో ప్రకటితమయ్యేలా చూసుకోగలిగితే చాలు. అది వివిధ సంస్థలు/సంఘాలు తమ కార్యకర్తలకి తప్పనిసరిగా ఇవ్వాల్సిన శిక్షణ. చట్టాలు సరిగా ఉండి అమలు జరిపే వాళ్ళు నిష్పాక్షికంగా, సచేతనంగా ఉండేందుకు ఏం చేయాలో మనం ఆలోచించాలి.

  చివరగా – “సంభాషణ”ను కొనసాగించటం, నిజంగా కావాలి మనకిప్పుడు.

 3. *రెండు దేశాల మధ్య శత్రుత్వంతో పైన చెప్పిన రెండు రకాల భావజాలాల మధ్య శతృత్వాన్ని పోల్చడంలో నాకైతే ఎలాంటి అనౌచిత్యం కనిపించడంలేదు*

  భావజాలం వేరు, దేశాల మధ్య శత్రుత్వం వేరు. వేరు వేరు భావజాలం వారు ఇంటి లో నుంచి దేశ పార్లమెంట్ లో వరకు కలసి మెలసి పనిచేయవలసిన అవసరం ఉంట్టుంది. రెండు దేశాలకు అది వర్తించదు. పాలసిని బట్టి దేశాల మధ్య ప్రాధాన్యత మారిపోతుంది.

  దేశ రాజకీయాలలో పాకిస్థాన్ అంశం ఇంత ప్రాముఖ్యత వహించటానికి కారణం పంజాబీలు. కాందిశీకులుగా వచ్చి డిల్లిలో స్థిరపడి, బ్యురోక్రసిలో ,డిల్లి రాజకియాలో కీలక పాత్ర వహించటం మూలాన, పాకిస్థాన్ తో సయోధ్య ఒక ప్రధాన అజెండా గా మారింది. దీని మూలంగా మనదేశం నార్త్ ఈస్ట్ ప్రజలను నిర్లక్షం చేసింది. అక్కడ ప్రజల నిరసన, అసంత్రుప్తి డిల్లి లో పట్టించుకొనే వారు లేకపోయారు. కారణం నార్త్ ఈస్ట్ చెందిన వారు డిల్లి లో గాని, కేంద్ర బ్యురోక్రసి లో గాని పంజాబిలంతగా లేకపోవటం.

  ఈ తప్పును మోడి ప్రభుత్వం సరిదిద్దటం మొదలు పెట్టింది. నార్త్ ఈస్ట్, బంగ్లాదేశ్, మయన్మార్ అన్నిటిని కలుపుతూ రహదారులు నిర్మిస్తున్నారు.భవిషత్లో అక్కడి పరిస్థితి మారుతుంది.

  పాకిస్థాన్ తో మనకు సత్సంబంధాలు లేకపోతే వచ్చే నష్టమేమిలేదు. వాజ్ పాయ్ మనస్పూర్తిగా ఉభయ దేశాల మధ్య సయోధ్యకు ప్రయత్నిస్తే దానిని తూట్లు పొడిచారు. అంతకన్నా మనదేశం చేయగలిగేది ఎముంది? వాళ్ళు చేయగలిగిందల్లా కాష్మీర్ లో కాల్పులు. అది దశాబ్దాలుగా చేస్తున్నరు. అదే పని భవిషత్ లో కొనసాగిస్తారు అంతే కదా!

  వాళ్ల మీద ఆధరపడటానికి వారి దగ్గర ఎమి ఉన్నాయని? చక్కెర, ఆలు,ఉల్లిపాయలు తక్కువ ధరల కోసం, వారు ఎన్ని వెధవ వేషాలు వేసినా, వారితో నెయ్యం నెర్పుతూండాలా? మోడీ అధికారంలో కి వచ్చిన తరువాత మనదేశం పాకిస్థాన్ ఇగ్నోర్ చేయటం మొదలు పెట్టింది. పాకిస్థాన్ లేకుండా భారత ఉపఖండా దేశాలు కూటమిని ఏర్పరచుకొని, సార్క్ ను రద్దు చేసి, పాకిస్థాన్ కు బాయ్ బాయ్ చెపితే ఒక పనై పోతుంది :)

 4. మనోభావాలు గాయ పడటం అనేది కొత్తగా ప్రవేశించిన పదబంధం . వినాయకుడి విగ్రహాలు వీధుల్లో పెట్టి సినిమా రికార్డులు పెట్టడం , చందా ఇవ్వకపోతే దౌర్జన్యం చేయడం లేదా బెదిరించడం —-వీటిని విమర్శిస్తే మనోభావాలను గాయపరిచాడని అభియోగం. కల్లూరి గారన్నట్లు సంభాషణ కు అవకాశం, భావ సంఘర్షణ కు అవకాశం ఉండాలి. పరస్పరం చంపుకుంటే ఫలితం శూన్యం.

 5. అజిత్ కుమార్ says:

  “ఈ వ్యాసంలోని అనేక అంశాలతో ఏకీభావం ఉండచ్చు, ఉండకపోవచ్చు. ఎక్కడైనా వ్యక్తీకరణ లోపాలు ఉన్నా ఉండచ్చు. కానీ ఈ రెండు శత్రుశిబిరాల మధ్య సంభాషణ అవసరమన్న అభిప్రాయంతో బహుశా ఎవరూ విభేదించరు ” అని మీరు అన్నారు. కానీ
  నేను విబేధిస్తాను. వాస్తవానికి మీరు రెండు శిబిరాలను గురించి చెప్పారు. మొదటివి రెండు వేర్వేరు మతాలు అనుకోండి వాటిమధ్యన తగవు నిరంతరం ఉంటుంది. అంటే భావవాదులలో (మతమును నమ్మే వారిలో) చర్చల ద్వారా ఏకాభిప్రాయానికి రావడం కుదరదు. భావవాదమంటే ఉదాహరణకు ఒక పేపరుపై ముద్రించబడివున్న ఏదైనా బొమ్మను కళ్ళతో చూడకుండా ఇతర శరీర భాగాల సహాయంతో కనుక్కోవడం.వాళ్ళు ఎంతగా చర్చించుకున్నా ఏకాభిప్రాయానికి రాలేరు.తాము ఊహించుకున్న అభిప్రాయాలను ఇతరులు ఖండిస్తే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. ఖర్చులేకుండా కోవం వస్తుంది.తరువాత ఎదుటివారి బాధపెట్టే పనులు చేయాలనిపిస్తుంది.కనుక సంభాషణలు అవసరమనే తమ అభిప్రాయాన్ని నేను సమర్ధించలేక పోతున్నాను.

  ఇక రెండవ రకం వారు నాస్తికులు. వీళ్ళు కూడా రెండు రకాలు. 1.భావవాద నాస్తికులు 2.భౌతికవాద నాస్తికులు. భావవాద నాస్తికులలో భావవాదుల లక్షణాలు అన్నీ ఉంటాయి. భావవాదులంటే ఉదాహరణగా మనం చెప్పుకున్న పేపరుపైనున్న బొమ్మను కళ్ళతో చూడకుండా ఊహించే పనిలో ఈ రకం భా.నా.లు అసలు అక్కడ బొమ్మే లేదని కళ్ళతో చూడకుండా ఇతర శరీర భాగాలతో పరీక్షంచి తమ నిర్ణయాన్ని చెబుతారు. కాబట్టి వీరితో కూడా చర్చల వల్ల లాభం లేదు. వీరు చెప్పినట్లుగా మతవాదులు వినకుండా తమ వాదనను ఖండిస్తున్నారు గనుక వీరుకూడా వారికి బాధ కలిగేలాగా మాటలద్వారా చేతలద్వారా ప్రయత్నించడం జరుగుతుంది. నిజానికి కల్బర్గి చేసింది అదే. వారి మనోభావాలు దెబ్బతినేలాగా మాట్లాడడం వల్ల వారు హింసకు పాల్పడివుండవచ్చు. ఇవి చర్చలద్వారా పరిష్కారం కావని నా అభిప్రాయం.

  నేను రెండవరకం నాస్తికుడను అనుకుంటున్నాను అయినప్పటికీ నా మాటలు మీమాటలను ఖండిస్తున్నాయిగనుక వీటిని పై మూడింటిలోని ఖండనలమాదిరిదిగా అనుకోవద్దు. ఇటీజ్ డిఫరెంట్.

 6. buchi reddy gangula says:

  ఒక మనిషి యింకో మనిషిని చంపే అధికారం ఎవరు యిచ్చారు — మార్క్స్ — మావో —

  లు చెప్పారా —-

  రచయితల సంగాల లో కుల మత పట్టింపులు అవసరమా —-

  Nehru గారి రాజ్య ఖా0 క్ష — తో నే కదా దేశం విడిపోయింది —పాకిస్తాన్ తో — శత్రుత్వం
  దేనికి ????

  మతం చూపు తో ముస్లిం ల ను చూడటం ఎందుకు —

  సంభాషణ ల తో సమస్యలు పరిష్కారం కావా సర్

  just..doubts….

  ————————————-బుచ్చి రెడ్డి గంగుల ———————-

మీ మాటలు

*