ఎప్పుడైనా ఆత్మని చూశావా?

 

 

అసలు కళ్ళతో చూడగలమా? లేక గుప్పిళ్ళతో అందుకోగలమా??

మనల్ని మనం తనువుగా త్యజించడమా? లేక మనలోని మనల్ని స్పృశించగలగడమా??

ఎలా, ఎక్కడ చేజిక్కించుకోవడం ఆత్మని!?

ఆలోచలన్నీ ఆవిరైపోయి ఖాళీ మట్టికుండలా మనసు మిగిలినప్పుడు.. అప్పుడు అవగతమవుతుందా ఆత్మ అనే పదార్ధం!?

అలా కాకుంటే,

సముద్ర తుఫానులో చిక్కుకున్నట్టు ఆధ్యాత్మిక సందేహాలలో మునిగి, విసిగి, అలసి, దిక్కుతోచని దాహంతో చేష్టలుడిగినప్పుడు, దారి తప్పినప్పుడు మనపైకి వంగి కురిసే వానజల్లేనా ఆత్మంటే!?

నా మట్టుకు నాకు,

ప్రపంచం సాయంత్రాన్ని సిగలో ముడుచుకునే వేళల్లో.. పూలు గుచ్చుకుంటూనో లేక తల వంచుకుని ఒక కవిత రాసుకుంటూనో.. నాలోంచి నన్ను కొద్దిగా పక్కన బెట్టేసుకునే క్షణాల్లో… ఆ కాస్త నేను అరణ్యాలూ, అనంతాకాశాలూ చుట్టివచ్చేసే పయనాల్లో… అభావంతో ఆనందం మమేకమైనప్పుడు… జననమూ, మరణమూ మధ్యలో నేను అనబడే ఒక సంరంభం సంభవిస్తుందని అర్ధమైనప్పుడు… అప్పుడే అనుకుంటా, నాకు ఆత్మ అనేదేదో ఉందనిపిస్తుంది!

gulzar

 

ఎప్పుడైనా ఆత్మని చూశావా?

 

ఆత్మని చూశావా, ఎప్పుడైనా ఆత్మని అనుభూతి చెందావా?
సజీవంగా కదిలి మెదిలే పాల తరకల తెల్లదనపు పొగమంచులో చిక్కుకుని
శ్వాస తీసుకునే ఈ పొగమంచుని ఎప్పుడైనా స్పర్శించావా?

పోనీ, పడవ ప్రయాణంలో ఒక సెలయేటి మీద రాత్రి పరుచుకుంటూ
ఆపైన నీటి అలల తాకిడితో చప్పట్లు మోగిస్తున్నప్పుడు
వెక్కిళ్ళు పెడుతున్న గాలి ఉఛ్ఛారణ ఎప్పుడైనా విన్నావా?

వెన్నెల రాత్రి పొగమంచులో జాబిలిని అందుకోవడానికి
బోల్డన్ని నీడలు పరుగులు పెడుతున్నప్పుడు
నువ్వు తీరాన ఉన్న చర్చి గోడలని ఆనుకుని
నీ పొట్టలోనించి వస్తున్న ప్రతిధ్వనులని అనుభవించావా?

ఈ శరీరం, వందసార్లు కాలినా కానీ అదే మట్టిముద్ద
ఆత్మ ఒక్కసారి జ్వలిస్తే చాలు అది మేలిమి బంగారమే!
ఆత్మని చూశావా, ఎప్పుడైనా ఆత్మని అనుభూతి చెందావా?

 

మూలం:

Rooh daekhi hai, kabhi rooh ko mahsoos kiya hai?

Jaagate jeete hu e doodhiya kohre se lipatkar
Saans lete hu e is kohare ko mahsoos kiya hai?

Ya shikaare mein kisi jheel pe jab raat basar
aur paani ke chapaakoon pe baaja karti hon taliyaan
subkiyaan leeti hawaoon ke kabhi bain sune hain?

Chodhaveen raat ke barfaab se ek chaand ko jab
dher se saaye pakarne ke liye bhaagate hain,
tum ne saahil pe khare girje ki deewar se lagkar
Apni gahnaati hui kokh ko mahsoos kiya hai?

jism sau baar jale tab bhi wahi mitte ka dhela
rooh ek bar jalegi to woh kundan hogi

Rooh daekhi hai, kabhi rooh ko mahsoos kiya hai?

*

Painting: Satya Sufi

మీ మాటలు

 1. అనువాదం అద్భుతంగా ఉంది నిషిగంధ గారు , ఇక చిత్రం గురించి చెప్పడానికి పదాలు కూడా దొరకడం లేదు . సత్య సూఫీ గారు , మీరు నిజంగా చాలా గొప్ప ఆర్టిస్ట్

 2. అజిత్ కుమార్ says:

  ఆత్మలు నాకు కనిపించాయి.ఏమిటీ ఇంకా ఇలాగే ఉన్నావేం..పదపద… అంటూ.. నాతో ఏమో చెప్పబోయాయి. అయితే అవి పై బొమ్మలోలాగా లేవు. జగన్ బాబు రోడ్డుషోలకు హాజరైయ్యే జనాన్ని ఫొటోలో చూస్తే శరీరాలు లేకుండా అన్నీ తలలే కనిపించినట్లుగా – పది పదిహేను తలలు కనిపించాయి . వాటిలో నాకు తెలిసిన మొహాలు లేవు.నాలో సన్నగా భయం మొదలైంది. వీళ్ళు ఎవరు… ఏందుకొచ్చారు…నన్నేమన్నాచేస్తారా…అనుకున్నాను. వాటితో మాట్లాడే ఆలోచననాకు రాలేదు. బహుశా భయం వల్ల. వాటిని వెళ్ళిపొమ్మని గట్టిగా ఆత్మతోనే అంటే మనసులోనే అరిచాను. ఎవరుమీరు…ఏమిటిది…నన్ను భయపెట్టడానికి వచ్చారా… నేనేమీ భయపడను.నేను కమ్యూనిష్టుని. ఆత్మలను నమ్మను. అలాంటి నన్నే భయపెట్టాలనుకున్నరా… పొండి..పోండి.. అని అరిచాను. అంతే . అవి కనిపించలేదు.వెళ్ళిపోయాయి. నేను కళ్ళునులుముకుని మళ్ళీ పరిశీలనగా చూశాను. ఎవరూ లేరు. నేను భ్రమపడి ఉంటానని అను కున్నాను. అప్పుడు సమయం మధ్యాహ్నం 11.30 కావస్తుంది. నేనో గ్రామంలో జనాభా లెక్కలకోసం రోడ్లు, ఇళ్ళు పటం గీస్తున్నాను. అది జరిగిన తేదీ 26.4.2010.

 3. srivasthava says:

  చాల baagundhandi

 4. నిజమే..కళ్ళతో చూడలేము, గుప్పిళ్ళతో అందుకోలేము … It’s beautiful Nishi and Satya garu !!

 5. నిషిగంధ says:

  భవానీ గారు, అజిత్ కుమార్ గారు, శ్రీవాత్సవ గారు, రేఖ — థాంక్యూ సో మచ్!

  సత్య గారు, నేనున్నూ భవానీ గారు, రేఖలతో ఏకీభవిస్తున్నాను.. మీ చిత్రాలు అక్షరాలకి ప్రాణం పోస్తున్నాయి! :-)

మీ మాటలు

*