అమ్మ కంటే ఎక్కువ…!

 

కందుకూరి రమేష్ బాబు

Kandukuri Rameshఒక తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణ.
అంతే.

ఎవరో ఒకసారి చెప్పారు, ‘ఇంకేం అక్కర్లేదు, ఏ దేవాలయమూ అక్కర్లేదు. ప్రతి రోజూ తల్లిని కలిసి మౌనంగా ఆమె అందించే ఆశీర్వాదాలు పొందితే చాలు’ అని!  తల్లి అనుగ్రహం పొందితే చాలని!’ ఇంకేం అక్కర్లేదని!

తల్లి అనుగ్రహం వుంటే ఇక ఎటువంటి మొక్క అయినా తప్పక ఎదుగుతుందని!
మరి, అంతటి ఇగురం ఎక్కడుంది?
ఇవ్వాళ్టి మనుషులకు అంత దృష్టి ఉందా అని!

కానీ, రోడ్డు మీదికి వెళితే, మనుషులను దర్శిస్తే ఎన్నెన్ని విశ్వాసాలని.
దృష్టాంతాలని!

ఈ ఆటో డ్రైవర్ వేయించుకున్న ‘తల్లిదీవెన’ అన్న పచ్చబొట్టు చూడగానే ఆ మాటలే గుర్తొచ్చాయి.
అడిగితే అదొక చిత్రమే అయింది.

‘ఇది మీ తల్లిదా?’ అని అడిగితే? ‘కాదు’ అని చెప్పాడు.
తన తల్లి ఎల్లమ్మ అట! నిజమే. కానీ తామందరికీ ఇంకో తల్లి ఉందట!!
‘అది మనిషి కాదు, దేవత’ అన్నాడాయన.
‘పెద్దమ్మ మా ఇలవేల్పు. ఆ తల్లి పేరుతో ఈ పచ్చబొట్టు వేయించుకున్నాను’ అన్నాడాయన.

‘ఎందుకు?’ అంటే…’తల్లి కన్నా ఎక్కువ?’ అన్నాడాయన.
‘తల్లితో అనుబంధం కూడా లౌకికమే కదా! అంతకుమించిన దయ కావాలి’ అన్నట్టు చెప్పాడాయన.
‘ఈ తల్లి నా తల్లిని కూడా మంచిగా చూసుకునే తల్లి’ అని చెప్పి కళ్లు తెరిపించాడాయన.
నిజం.
‘నన్నూ, నా కుటుంబాన్నీ, నా తల్లిదండ్రులనీ.. అందర్నీ చూసుకునే తల్లి వుండగా నా కన్నతల్లి పచ్చబొట్టు ఎందుకు వేయించుకుంటాను. నా రక్తంలో ఉన్న తల్లి కాదు, నాకు పైనుంచి అనుగ్రహం అందించే పెద్దమ్మ తల్లి ఆశీర్వాదం కావాలి’ అన్నాడాయన.

ముచ్చటేసింది.
మాట్లాడుతుంటే, ఎన్ని విశ్వాసాలో!

మాట్లాడకపోతే, ‘ఆ పచ్చబొట్టు తన తల్లి పేరుమీదే వేయించుకున్నాడు కాబోలు’ అనుకుని, ఒకనాడు విన్న ఆ మాట…’తల్లి అనుగ్రహం చాలు’ అన్నదగ్గరే నా దృశ్యం ఆగివుండేది. కానీ, కొత్తగా ఉందిది.

కౌటుంభిక, మానవీయ అనుబందాల కన్నా అతీతమైన శక్తిని వేడుకుంటానన్న ఆ ఆటో డ్రైవర్ ఆశయం బాగున్నది.
దృశ్యాదృశ్యం అంటే ఇదే.
తెలుసుకోవడం.
అవును. కనికట్టుకు దాసోహం కావడం కాదు, తరచి చూసుకోవడం.

వందనం ఎల్లమ్మా.. నీకూ, నీ బిడ్డకు.
పెద్దమ్మా…పరిపరి వందనాలమ్మా…నీ పరివారం తరఫున!

*

మీ మాటలు

  1. Satyanarayana Rapolu says:

    సాధారణ దృశ్యాలనే ఎంత అసాధారణంగా చూపిస్తవు రమేశ్ బాబు!

మీ మాటలు

*