3456GB

 

 

(గమనిక : పాఠకుల సాలభ్యం కోసం ఇందులోని పాత్రలన్నీ తెలుగులోనే మాట్లాడతాయని మనవి )

 

మట్టి కుండీలోని వరి మొక్క చుట్టూ ఉన్న మట్టి పూర్తిగా తడిసే లాగ తన చేతిలోని పిడతలో ఉన్న నీళ్ళలోంచి 144 మి.లీ. నీళ్ళు పోసాడు చెన్నయ్య .

చేత్తో మొక్కని తడిమాడు అపురూపంగా. మొక్కంత పాల గింజ పట్టి ఉంది. ఇంకో రెండు రోజుల్లో కోసేయ్యవచ్చు ననుకున్నాడు.

దాదాపు రెండు కిలోల వరకు తూగవచ్చు ధాన్యం ఈ సారి అనుకుంటూ తృప్తిగా మొక్కనే గమనించసాగాడు.

ఇంతలోనే తన పర్సనల్ నెట్వర్క్ లో బీప్ శబ్దం వినిపించింది.

వరి మొక్క ముందు నుంచి లేచి, పక్కన తన బెడ్ పక్కనే ఉన్న గోడ వైపు తిరిగి, తన భుజం మీదున్న చిన్న సాంకేతిక పరికరాన్ని చేత్తో తడిమాడు. అందులోంచి గోడ మీదికి ఫోకస్ అయిన మెసేజ్ చూసి చిన్నగా నిట్టుర్చాడు.

‘నైరుతి ఖండపు అధినేత అయిదు నిమిషాల క్రితం తన గదిలోని ఆక్సిజన్ జనరేటర్ ని ఆఫ్ చేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.’

ఇదీ ఆ వార్త సారాంశం.

పెద్దగా కుంగిపోలేదు కానీ, ఏదో అనిశ్చితి ఆవరించింది మనసంతా. మరుక్షణం మాములుగా అయిపోయాడు చెన్నయ్య.

ఎందుకో హఠాత్తుగా ‘లక్ష్మి’ గుర్తొచ్చింది.

వెంటనే నెట్వర్క్ ఆన్ చేసి, మార్స్ (అంగారక గ్రహం) పై నున్న లక్ష్మి కి సిగ్నల్ పంపించాడు. క్షణంలో గోడ మీద ప్రత్యక్షమయ్యింది లక్ష్మి.

చీకటి కంతల్లో, తడి ఆరిపోయిన కళ్ళల్లో రవ్వంత వెలుగు, పెదవుల పై ఆనందపు చంద్ర రేఖ.

‘తెలిసిందా?’అడిగింది లక్ష్మి.

‘ఇప్పుడే తెలిసింది…..ఎందుకో నీతో మాట్లాడాలనిపించింది.’ చెన్నయ్య.

‘కారణమేమన్నా  కనుక్కున్నావా?’

‘ఆ  ….అదే కారణం….అలోన్ సిండ్రోమ్….ఒంటరి తనపు న్యూనత.’

‘నైరుతి ప్రెసిడెంట్ అయి ఉండీ అలా  చేస్తే….ఇక ప్రజలకి ఏ విధంగా ధైర్యం కలుగుతుంది’

‘అవును….ఇంత అనుకూల పరిస్థితుల్లో…రాబోయే మంచి రోజులకి మనకి మధ్య దూరం తరిగిపోతున్న కాలంలో….అందునా  సాంకేతికతలో ఎంతో అభివృద్ధి చెందిన నైరుతి ఖండపు ప్రెసిడెంట్…ఐ హేట్ థిస్’ అసహనం వెల్లగక్కాడు చెన్నయ్య.

‘నిజంగా భాధ కలిగించిన విషయమే అయినా …ఇంకా విషాదమేంటంటే…అప్పుడే…ఇంత వరకు ఈ వార్త విని దాదాపు రెండు లక్షల మంది ఆత్మహత్య చేసుకున్నారట’ లక్ష్మి గొంతులో నీరసం ధ్వనించింది.

‘అది నేనూహించిందే లక్ష్మి…ఇంకో రెండు మూడు నిమిషాల్లో మన ప్రెసిడెంట్, మన ఆగ్నేయ ఖండంలో ఉన్న ఇరవై కోట్ల మందిలో స్పూర్తి  రగిలించడానికి పర్సనల్ వీడియో మెసేజ్ పెట్టే అవకాశమూ ఉంది’. అత్యంత వేగంగా విశ్లేషించాడు చెన్నయ్య.

‘అది సరే….నీ రిసర్చ్ ఎలా సాగుతోంది’. టాపిక్ డైవర్ట్ చేసింది లక్ష్మి.

అది వెంటనే గ్రహించిన చెన్నయ్య. ‘ ఓకే …గుడ్.’ అన్నాడు నార్మల్గా.

‘నీ వరి పంట ఎలా ఉంది…ఈ సారి మొక్కకి ఎంత  దిగుబడి ఎక్స్పెక్ట్  చేస్తున్నావు…అట్లాగే నీ కూరగాయల పరిశోధనలో ఏవైనా కొత్త సంగతులున్నాయా?’ ఉత్సాహం కళ్ళల్లోకి ప్రతిఫలింప జేస్తూ అడిగింది లక్ష్మి.

‘ఫరవాలేదు…వరి పంట కాలం 30 రోజులు నుంచి 27 రోజులకి విజయవంతంగా తగ్గించడమే కాక, మొక్కకి దాదాపు 147 గ్రా. ధాన్యం ఎక్కువ అంటే దాదాపు 2కిలోల వరకు దిగుబడి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను’. గొంతులో ఉత్సాహం తొణికిసలాడుతుండగా కొనసాగించాడు చెన్నయ్య.

‘టమాట మీద చేస్తున్న రిసర్చ్ ఫలితాలు బాగున్నాయి. దేశవాళీ తీగ టమాట, ఒక్కసారి మొక్క నాటితే మూడు సంవత్సరాల పాటు  రోజూ మూడు కిలోల చొప్పున కాసే దేశవాళీ రకం. పరిశోధన  దాదాపు తుది దశలో ఉంది, అలాగే భూమి లోపల పెరిగే క్యారెట్, మొక్కకు ఒక్క దుంప కాకుండా వేరు సెనెగ పంట లాగా, పెద్ద ద్రాక్ష పళ్ళoత గుండ్రని సైజులో గుత్తులుగా, అంటే మొక్కకి సుమారుగా కిలోన్నర క్యారెట్ దిగుబడి వచ్చే విధంగా చేస్తున్న పరిశోధన సక్సెస్ అయింది. పేపర్స్ మన ప్రెసిడెంట్ కి పంపిస్తే అతను విశ్వ వ్యవసాయాభివృద్ధి మండలిలో ప్రవేశపెట్టాక, ప్రజలందరికి అందుబాటులోకి వస్తుంది’. ఆగకుండా చెప్పుకుపోతున్నాడు  చెన్నయ్య.

‘రియల్లీ…గ్రేట్’ ప్రశంసించింది లక్ష్మి.

‘కాని ఒకే ఒక్క ప్రాబ్లం…సేంద్రియ ఎరువుల ఉత్పత్తి బాగా తగ్గింది…నా నెక్స్ట్ రీసర్చ్ వాటి మీదే అనుకుంటున్నాను.’

‘గ్రేట్ చెన్నయ్య!……. ఐ యామ ప్రౌడ్ ఆఫ్ యు’ మనస్పూర్తిగా అభినందనలు తెలిపింది లక్ష్మి.

‘థ్యాంక్ యు సొ మచ్ లక్ష్మి’ స్వీకరించాడు .

కొద్ది సేపు మాటల విరామం…ఎలా మొదలు పెట్టాలో ఇద్దరికీ అర్థం కాలేదు.

‘నిజంగా! నువ్వు  ఆ వార్త వినడానికి ఉత్సుకతగా ఉన్నావా?’ చొరవ చూపింది లక్ష్మి.

‘అవును. ఐ యాం రియల్లీ ఎక్సయిటెడ్  టు హియర్ దట్ న్యూస్, ఇంకా మూడు నాలుగు గంటలు పట్టేటట్టుంది, ఆ శుభ వార్త వినడానికి,’  చెన్నయ్య కళ్ళల్లోకి వెలుగొచ్చింది.

‘నాకు కూడా…’ ఉత్సుకతతో తల నిమురుకుంటూ చెప్పింది లక్ష్మి.

ఈ భూగోళo మీద నివసించే ప్రతి మనిషి కీ వచ్చే అవకాశం పిల్లల్ని కనడం. అది ప్రభుత్వమే కలిగిస్తుంది. ఆగ్నేయం ఖండంలోని చెన్నయ్యకి అవకాశం వచ్చినప్పుడు తనకూ, తన శరీర తత్వానికి సరిపడే సరైన జోడు కోసం విశ్వవ్యాప్తంగా వెతికినపుడు మార్స్ పైకి కొన్ని తరాల ముందు వలసెల్లిన లక్ష్మి తాలూకు శరీర నిర్మాణo, తత్వం, ఇంకా అనేక భోగోళ, ఖనిజాల, ప్రాంతీయ సారూప్యాతలున్న చెన్నయ్యతో కూర్చి పరిక్షించినప్పుడు, అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు తెలియవచ్చింది. వెంటనే ఒకరికొకరు సంప్రదించుకుని ప్రభుత్వానుమతితో మార్స్ పైన ఉన్న లక్ష్మి లోని అండాన్ని, ఆగ్నేయ ఖండంలోని  చెన్నయ్య బీజాన్ని, ఈశాన్య ఖండపు నైరుతి మూలలో నెలకొల్పబడిన భావితరాల అభివృద్ధి మండలి పరిశోధనాశాలకి పంపించారు.

ఆ ప్రయోగ, పరిశోధనశాలలో వారి అండాన్ని బీజాన్ని పరీక్షా నాళికలలో సంయోగపరిచి, ఫలదీకరణ చెందించి, కృత్రిమ గర్భం ‘ఆర్టిఫిషియల్ ఊమ్బ్’లో ప్రవేశపెట్టి పెంచుతున్నారు. బిడ్డ ఆరోగ్యంగా అద్భుతంగా పెరుగుతున్నది. నెలలు పూర్తి కావచ్చాయి. ఇంకా కేవలం మూడు లేదా నాలుగు గంటల తరువాత తమకి జన్మించ బోయే బిడ్డ గురించిన తాపత్రయం వారి మాటల ద్వారా తెలుస్తూనే వుంది. అది శుభసూచకం.

లక్ష్మితో  మాటలనoతరం తన రోజు వారి కార్యక్రమాలలో మునిగిపోయేoదుకు సిద్దమయ్యాడు చెన్నయ్య. వృతి రీత్యా వ్యవసాయ శాస్త్రవేత్తయినా ప్రవృత్తి రీత్యా చెన్నయ్య చరిత్ర నిక్షిప్తకారుడు.

విశ్వవ్యాప్తంగా జరిగే ప్రతి సంఘటన చెన్నయ్య లాంటి ఎన్నుకోబడిన వెయ్యి మందికి వార్త లాగా అందించబడుతుంది. తమకి అందిన సమాచారాన్ని విశ్లేషించి ఒక చరిత్రగా రాసి విశ్వ చరిత్ర వేదికకి పంపించడం జరుగుతుంది. అక్కడ, ఉత్తమంగా, నిజాయితీగా, నిజంగా, ఉన్నదున్నట్టుగా, ఉన్నతంగా, ఉన్న వాటిని ఎన్నుకుని చరిత్ర పుటల్లో నిక్షిప్తం చేయడం జరుగుతుంది.

ఈ రోజు పొద్దున్నే నైరుతి ఖండాదినేత ఆత్మహత్య ఉదంతం తరువాత విశ్వవ్యాప్తంగా జరుగుతున్న ఆత్మహత్యల వార్తలు రాయడానికి ఉపక్రమించి, వాయిస్ ట్రాన్స్లేటర్ సిస్టం ముందు కూర్చున్నాడు.

తన గొంతుతో పలికే ప్రతి మాటని స్వీకరించి అక్షరాలుగా తర్జుమా చేసే వాయిస్  ట్రాన్స్లేటర్  సిస్టం అది. అవుట్ డేటెడ్, చాలా పాతది. VTS (వాయిస్ ట్రాన్స్లేటర్ సిస్టం)ముందు కూచున్నా ఏది మాట్లాడాలనిపించక విశ్వచరిత్ర వేదిక పుటలు వెనక్కి తిప్పసాగాడు చెన్నయ్య.

దాదాపు 1500 సంవత్సరాల క్రితం మొదలయ్యింది ఈ ప్రక్రియ అంతకు ముందు అంతా సెర్చ్ ఇంజన్లు, సర్వర్లు, పుస్తకాలు,తాటాకులు, శిలా శాసనాలు. మధ్యలో కొన్ని రోజులు డివిడి లు, బ్లూ రేలు, పెన్ డ్రైవ్ లు, హార్డ్ డిస్క్ లు వెల్లువలా వచ్చి అంతే వేగంగా అంతర్దానమైపోయాయి.

విటిఎస్ ముందు మాట్లాడాలనిపించక చరిత్ర పుటల్లోకి, లోలోకి, లోతుల్లోకి వెళ్ళసాగాడు.

……………రెండో ప్రపంచ యుద్ధం తరువాత మత జాడ్యం జడలు విప్పింది. 20వ & 21వ శతాబ్దంలో నయితే ఈ విశృoఖలత్యం పేట్రేగిపోయింది.

నవనాగారికతను, సాంకేతికత పాదాల కింద పడి నలిపివేయబడింది. సాంకేతికత మునుగులో మనిషి, మానవత్వం, ప్రకృతీ…అన్నీ…అన్నీ…నాశనం…సర్వనాశనం  అయిపోయాయి. ఒక విధ్వంసం రచింపబడింది.

2000-2100 వరకు జరిగిన సాంకేతికాభివృద్ధి, సమస్త భూగోళాన్ని …ఇంకా చెప్పాలంటే ఈ విశ్వాన్నే ఒక భారీ కుదుపు కుదిపింది.

3456

2043    -మూడవ ప్రపంచ యుద్ధం కేవలం …కేవలం బలనిరూపణ కోసం మాత్రమే జరిగిన యుద్ధం అది. మతం అనే    ముసుగేసుకొని, ప్రపంచ దేశాలన్నీ వారి వారి వద్ద మేటలుగా పేరుకు పోయిన ఆర్మేషన్ గోదాములు  ఖాళీ చెయ్యడానికి, అనేక కూటములుగా ఏర్పడి, ఒకరిమీద మరొకరు విధ్వంసం రచించుకున్నారు. కేవలం రెండ్రోజుల వ్యవధిలోనే అణుబాంబులు పేలని దేశం లేదనడం అతిశయోక్తి కాదు.

 

2136-2150   -మూడో ప్రపంచ యుద్ధం లో చనిపోయిన దాదాపు 60 కోట్ల మంది ప్రజల జనాభా కంటే రెట్టింపు జనాభా ఈ కాలంలో చనిపోయారు. కారణం…కరువు.

 

2160     -నాలుగో ప్రపంచ అణు యుద్ధం కేవలం ఆరు రోజులే జరిగింది. కాని అనేక దేశాల సరిహద్దులు మారిపోయాయి. ఆక్రమించుకున్న వారెవరో, కలిసిపోయిన వారెవరో రాయ వీలుగానంత చరిత్ర.  కారణం …నీరు….నీరు….నీరు…కరువు…కరువు…కరువు.

 

2190     -అంటార్కిటికా ఖండం అంతా కరిగిపోయింది. సముద్రమట్టాలు దాదాపు 150 మీటర్లు పెరిగాయి. 27 దేశాలు పూర్తిగా మునిగిపోయాయి. భూభాగం కుచించుకుపోయింది.

 

2213      –అడవులు అంతరించిపోయాయి. ఎడారులు పెరిగిపోయాయి. పశు పక్ష్యాదులు నశించిపోయాయి. కేవలం కొద్ది ప్రదేశంలో పండించే పంటలే, ప్రపంచమంతా పంచాల్సిన పరిస్తుతులు ఏర్పడ్డాయి.

 

2229      -గొర్బీ బాదల్ జననం. ఏడుసంవత్సరాల వయసులోనే ఆయన ప్రవచనాలకి ప్రపంచమంతా అతని దాసోహం అయిపొయింది. ప్రకృతి అతని మతం. పచ్చదనం అతని అభిమతం. ప్రకృతినే దైవంగా కొలవాలనే అతని తర్కానికి భూగోళమంతా ఏకమై అతనిని అనుసరించారు.

 

2260     -అయిదవ ప్రపంచయుద్ధం మళ్ళీ అదే కారణం. వంద సంవత్సరాల తరువాత కూడా మళ్ళీ అదే కారణంతో యుద్ధం జరిగింది. నీరు…నీరు….నీరు. భూగోళం మీద కేవలం వేళ్ళ మీద లెక్కపెట్టే సంఖ్యల్లో ఉన్న ప్రదేశాల లోనే నీరు లభించేది. ఆ ప్రదేశాల యొక్క దేశాలమీద, ఆధిపత్య దాడులకు లెక్కే లేదు.

GB గోర్బీ బాదల్ ప్రమేయంతో కొన్ని ప్రాంతాలు శాంతి తీర్థం పుచ్చుకున్నా, అది కొన్ని రోజులకే పరిమితం అయ్యింది.

 

2271GB   -GB గోర్బీ బాదల్ అస్తమయం. అప్పటికే జరగాల్సిన విధ్వంసం అంతా జరిగిపోయింది. ఎవరి ప్రతిష్ట అయినా, అతని తదనంతరమే కీర్తి శిఖరాలు చేరుకుంటుంది. మనుషులకి ఏదైనా పోగొట్టుకున్నాకే గదా దాని విలువ తెలిసేది. అతని జ్ఞాపకంగా, గౌరవసూచకంగా ఈ సంవత్సరం నుంచే సంవత్సరాల చివర A.D. లు, B.C. లు తీసివేయబడి, GB ని చేర్చింది.

 

కొంచం దాహంగా అనిపిస్తే లేచెల్లి తన బెడ్ పక్కగా నున్న కుండ లోంచి నీళ్ళు తీసుకుని తాగాడు చెన్నయ్య. చల్లగా, తియ్యగా ఉన్నాయి. ఆకలిగా అనిపించి పక్క ర్యాక్ లోని రాగి బిస్కెట్స్ నాలుగు ప్లేట్లో పెట్టుకుని వచ్చి మళ్ళీ VTS ముందు కూచున్నాడు – పాత చరిత్ర పుటల్లోకి పవేశిస్తూ…

 

2300GB    భూగోళం మీద భూభాగం తగ్గిపోయింది. తూర్పు నుంచి పడమర కు విభజించబడిన భూ మధ్య రేఖ తన ప్రభావం కోల్పోయినందువల్ల దాన్ని మార్చి,  ప్రపంచ భూ భాగమంతా నిలువుగా, అడ్డంగా నాలుగు సమ భాగాలుగా విభజించి, ఈశాన్య, ఆగ్నేయ, నైరుతి మరియు వాయువ్య ఖండాలుగా మార్చడ్డాయి.

 

2322 GB  –ప్రపంచమంతా, ఇంకా చెప్పాలంటే విశ్వవ్యాప్తంగా ఒకే డబ్బు చలామణిలోకి వచ్చింది. ఎగుమతి దిగుమతుల్లో డబ్బుని నిషేదించారు. అన్ని ఖండాల ప్రభుత్వాలది ఒకటే అజెండా, తినడానికి తిండి, తాగడానికి నీరు. వ్యవసాయమే అందరి ప్రధాన పరిశ్రమగా అందరూ ఓకే మాటకు కట్టుబడాలని నాలుగు ఖండాల అధినేతలు తీర్మానించారు.

 

2350 GB    –అణు యుద్ధాల ప్రభావం ప్రకృతి మీద ప్రతిబింబించడంతో భూమ్మీద నీటి ఊటే కరువైపోయింది. వాతావరణంలోని వాయువుల్లోంచి హైడ్రోజన్ని, ఆక్సీజన్ని సేకరించి నీటిని తయారు చేసుకోవాల్సిన దుస్థితి వచ్చి పడింది. కానీ…ఖర్చే చాలా ఎక్కువ. వాయువ్య ఖండంలో జనం లేరు, జలం లేదు. వాతావరణంలో గాలిలో తేమ శాతం ఎక్కువగా వుండడం చేత నీటిని తయారుచేసుకునే గనిలా ఆ ప్రాంతం ఉపయోగపడుతున్నది. అక్కడినుంచి నీళ్ళు లేని ప్రాంతాలకి తరలించడం ప్రారంభించారు.

 

2500GB   -ప్రపంచ జనాభా వంద కోట్లకి పడిపోయింది. అందులో సగం జనాభాకి ఒక్క పూట భోజనం దొరకడమే గగనం అయిపొయింది. జీవించడానికి ప్రభుత్వం మీద దాదాపు వంద శాతం ప్రజలు ఆధారపడుతున్నారు.

బీప్ మన్న శబ్దానికి, వచ్చిన వార్తని చూసాడు చెన్నయ్య.

తమ ఆగ్నేయ ఖండాధినేత పంపిన సందేశం అది.

         “ఈ రోజు తెల్లవారుజామున నైరుతి ఖండంలో జరిగిన సంఘటన యొక్క ప్రభావం మీమీద తప్పకుండా చూపిస్తోందని నాకు తెలుసు. గత అయిదు వందల సంవత్సరాలుగా మానవ ఉనికిని కాపాడుకోవడానికి మనం చేస్తున్న ఈ పోరాటం నిజంగా మెచ్చుకోదగ్గది. సంతోషం, ఆనందం, ఆహ్లాదం, హాయి, సుఖం వంటి భావోద్వేగాలు మనలో నశించిపోయినా…మనం భావితరాల కోసం, మనుష్య జాతిని ఉత్కృష్ట స్థితిలో చూసే అదృష్టం కోసం మనమంతా మర మనుషుల్లా, ఏ ఫీలింగూ లేకుండా చేస్తున్న త్యాగం ఎన్నటికీ మరువలేనిదనే సంగతి అందరికీ తెలిసిందే.

          సాంకేతికంగా మన అభివృద్ధిని తక్కువగా చెయ్యలేం…కానీ…కొన్ని సంవత్సరాలుగా ప్రకృతి కోసం తపిస్తూ…దాని ఉనికిని…మూలాలని సజీవంగా మళ్ళీ నిలపడానికి ప్రతిఫలాపేక్ష లేకుండా మనం చేస్తున్న త్యాగానికీ… ఉన్నత ఫలాలని రాబోవు తరాలకు అందించాలనే మన తపనని మనం ఎప్పటికీ తక్కువ చేసుకోకూడదు.

          ఈ రోజు తెల్లవారుజామున నైరుతి అధినేత ఆత్మహత్య మనల్ని కల్లోల పరిచింది నిజమే…కానీ…ఒక్క క్షణం ఆలోచించండి…మూడు నాలుగు గంటలు వేచి చూడండి, ఒక అధ్బుతమైన శుభవార్త మీ కోసం వేచి చూస్తున్నది.

         ఆ వార్తా మిమ్మల్ని తప్పకుండా సంబర పరుస్తుందని మీకు హామీ ఇస్తున్నాను, వేచి చూడండి. ప్రేమతో మీ ప్రెసిడెంట్.”

ప్రెసిడెంట్ సందేశం మంచి ఉత్ప్రేరకంగా పని చేసింది చెన్నయ్యకి. నైరుతి ప్రెసిడెంట్ ఆత్మహత్యని చరిత్ర పుటల్లోకి దాచడానికి ఏ ప్రయత్నం చెయ్యకుండానే తమ ప్రెసిడెంట్ ఇచ్చిన సందేశాన్ని పోస్ట్ చెయ్యడం ప్రారంభించాడు.

తరువాత మళ్ళీ… మరొక్కసారి చరిత్ర భాండాగారపు పుటల్ని వెనక్కి తిప్పాడు చెన్నయ్య.

2610GB    – GB గోర్బీ బాదల్ అస్తమయం తరువాతనే ప్రకృతిని కాపాడుకోవడానికి అంతా, విశ్వవ్యాప్తంగా మొదలైన ఉద్యమం మంచి ఊపు మీద కొనసాగింది. దాదాపు 350 సవత్సరాల క్రితం జరిగిన ఆఖరి ప్రపంచ యుద్ధం తరువాత ఇంకే యుద్ధమూ జరగకుండా అంతా ఒక్క తాటిపై నిలబడి ప్రకృతిని మళ్ళీ పునరుజ్జీవనం చేయడానికి తీసుకున్న నిర్ణయం మంచి మార్పులే తీసుకురాసాగింది. కానీ, మనిషి ప్రకృతిపై చేసిన అరాచకం మానడానికి చాలా సమయం పడుతుందని అందరికీ తెలిసిన సంగతే. ప్రకృతిని పాడు చేసే అన్ని  వస్తువుల తయారీకి అనుమతి నిషేదించడం ఆహ్వానించ దగ్గ పరిణామం.

2772GB   –కాలుష్యం మనిషిని కాల్చేయసాగింది. ప్రతి నలుగురికీ ఒక ఇంక్యుబెటర్ కేటాయించబడింది. అందులోనే కొద్దిపాటి భూమిలో వ్యవసాయం స్వంతంగా చేసుకుని, తమ తిండి తాము ఉత్పత్తి చేసుకుని, తమ నీరు తాము తయారు చేసుకుని, తమ ఆక్సిజన్ని (ఆక్సిజన్ జనరేటర్ ద్వారా)   తాము తయారు చేసుకుని  బతకాల్సిన పరిస్తితులు మొదలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా రాత్రి నిడివి చాలా తగ్గి పోయింది, ఇప్పుడు కేవలం ఆరున్నర గంటల రాత్రికే మనుష్యులు అలవాటు పడాలి.

 

2818GB     -ప్రపంచ జనాభా ఎనభై కోట్లకి పడిపోయింది. మనుషులందరూ ప్రభుత్వం కల్పించిన ఇంక్యుబేటర్లలోనే నివసిస్తున్నారు. మామూలు వాతావరణంలోమనుష్యులు బతకలేరు. ఆడ, మగలో పూర్తి నపుంసకత్వం ప్రజ్వరిల్లింది. మనుష్యజాతి శరీరం మీద రోమాలు అంతరించిపోయాయి…రోగాలు పేట్రేగిపోయాయి.

 

2835GB    -కృత్రిమ గర్భంలో మొట్టమొదటి బిడ్డ జననం. జలాన్వేషణ కొనసాగిస్తూ దాదాపు 153 గ్రహాలపై కాలు మోపాడు మనిషి. అందులోంచి మూడు గ్రహాలలో నీరు ఉనికిని కనిపెట్టగలిగారు. వలసలు మొదలయ్యాయి.

 

3012GB       -విశ్వవ్యాప్త జనాభా 40 కోట్లకి దిగజారింది. వ్యవసాయ పరిశోధనలు చాల మందికి తిండి పెట్టగలుగుతున్నాయి కానీ సమస్యంతా నీటిదే. సముద్ర జలాలు శుద్ధి చేయలేనంతగా లవణ విషంగా తయారయ్యాయి. కొద్దిలో కొద్ది ఉపశమనం ఏంటంటే భూగోళం మీద తాపం 72 డిగ్రీల నుండి 69 దిగ్రీలకి పడిపోవడం, ఆశ చిగురించసాగింది.      

 

3243GB      –ఈశాన్య ఖండపు చాన్ అనే ప్రదేశంలో చేసిన ప్రయోగంలో ఒక మొక్క మామూలుగా… ఇంక్యుబేటర్ లో కాకుండా మామూలు వాతావరణంలో చిగురించింది. ఈ సంవత్సరం సాధారణ వర్ష పాతం 171మి.మీ.  కంటే కొంచం ఎక్కువ 198మి.మీ. వర్ష పాతం నమోదు కావడం సంతోషదాయకం. ఆత్మహత్యల శాతం 60 నుండి 30 శాతానికి పడిపోవడం శుభసూచకం, అలాగే మనిషి యొక్క సగటు ఆయుర్దాయం 39 నుండి 42కు పెరగడం ఆనందకరం. రాబోవు రోజులన్నీ మంచి రోజులే.

 

సిస్టంని ఆఫ్ చేసి బద్దకంగా ఒళ్ళు విరుచుకున్నాడు చెన్నయ్య. నిద్ర రావటంలేదు. తెల్లవారుజామున మూడున్నర కావస్తూంది. సూర్యుడు ఆశలు రేకెత్తిస్తూ పైపైకి పాకనారంభించాడు. సోలార్ లైట్లు అన్నీ ఆఫ్ చేసాడు. వేకువ వెలుగు అద్వితీయంగా ఉంది. నీటి స్టోరేజి ట్యాంక్ చూసాడు. ఫర్లేదు ఇంకా వారం రోజుల వరకు సరిపోతాయి అనుకున్నాడు. గదిలోని నీటిని ఉత్పత్తి చేసే మెషీన్ని ఆఫ్ చేసాడు. వాతావరణ తాపం తానున్న ఇంక్యుబెటర్ గదిలో 30 డిగ్రీలు చూపించింది. బయటి వాతావరణం 54 డిగ్రీలుగా కనిపించింది.

మనసంతా ఆహ్లాదంగా ఉంది చెన్నయ్యకి. మొక్కలకి నీళ్ళు పట్టడానికి ఉపక్రమిస్తుండగానే బీప్ అనే శబ్దంతో లైవ్ మెసేజ్ వచ్చింది. వీడియోలో ప్రెసిడెంట్ చెన్నయ్యని చూడగానే మొదలుపెట్టాడు.

“కంగ్రాట్యులేషన్స్ చెన్నయ్యా! నువ్వు తండ్రివయ్యావు. ఇక నేను డైరెక్ట్ గా నీకు శుభాకాంక్షలు తెలుపడానికి కారణం, నీ బిడ్డ. నీ కూతురు. నిజంగా ప్రపంచవ్యాప్తంగా కాదు కాదు, విశ్వవ్యాప్తంగా మనం సంబరాలు జరుపుకునే శుభ శకున సమాచారం ఏంటంటే… నీ కూతురి తలపైన గుప్పెడన్ని వెంట్రుకలతో పుట్టింది. అందుకు నేనెంతో సంతోషిస్తున్నాను. ఇంకా ఈ వార్తా మన ఖండపు ప్రజలతో పంచుకోవడానికి ఉవ్విళ్ళూరుతున్నాను. ముందు లక్ష్మితో మాట్లాడాలి. మళ్ళీ ఒకసారి కంగ్రాట్యులేషన్స్”, తన బోడి గుండు నిమురుకుంటూ ఆనందం పట్టలేకపోతున్న ప్రెసిడెంట్ని అబ్బురంగ చూస్తూ చేష్టలుడిగి నిలబడిపోయాడు చెన్నయ్య.

తన జీవితంలో ఇంత కంటే ఆనందకరమైన సంఘటన ఇంకేదీ లేదు అన్నంతగా ఉద్వేగానికి లోనయ్యాడు చెన్నయ్య. కళ్ళ నిండా నీళ్ళతో చూపు మసకబారింది.

లైన్లో లక్ష్మి, తానైతే ఆనందానికి అసలు అర్థం ఆమే ననిపించింది. ఇద్దరు కలిసి తమకి పుట్టిన బిడ్డకి అప్పటికప్పుడు ఒక పేరు కూడా పెట్టేసారు ‘హరిత’ అని.

ఎందరో… ఎందరెందరో… హితులు…సన్నిహితుల శుభాకాంక్షల వెల్లువలో తడిసి ముద్దయిపోయాడు చెన్నయ్య.

ఓ వైపు అభినందనలందుకుంటూనే మరోవైపు మొక్కలకి వాటికి కావాల్సిన నీళ్ళు పట్టాడు చెన్నయ్య.

సోలార్ గ్లాస్ ప్యానెల్ మీద టీ చేసుకుని, దాన్ని చప్పరిస్తూ వచ్చి సిస్టంని ఆన్ చేసాడు. VTSలోని చరిత్ర పుటల్లో మరొక పేజీని కలపడానికి ఉపక్రమించాడు చెన్నయ్య.

 

3456GB   -దాదాపు 650 సంవత్సరాల క్రితం అంతరించిపోయిన మానవ శరీరం మీది వెంట్రుక తిరిగి కనిపించడం మహా అద్భుతం. విశ్వవ్యాప్తంగా విస్తరించి ఉన్న జనాభా అంతటికీ శుభవార్త అయిన ఈ సంఘటన మరెన్నో పాత మార్పులకు దోహదపడుతుందనడంలో సందేహం లేదు.

ఈ భూగోళం మీదకి అడుగుపెట్టబోయే భావితరాలకు ఒక అద్భుతమైన ప్రపంచాన్ని అందించాలనే ఈ తపన, త్యాగం ముందు ముందు తప్పకుండా ఫలిస్తుందనడానికి ఈ సంఘటన ఒక సజీవ సాక్ష్యం.

ఎప్పుడో పదిహేను వందల సంవత్సరాల క్రితం మన పూర్వీకుల ముందు చూపు లేమి, భాధ్యతారాహిత్యం, స్వార్థం, అత్యాశ మనల్ని, మన జీవితాలని ఇంకా దహించివేస్తూనే ఉంది.

ప్రకృతిని కాపాడుకోలేని వాడు ప్రపంచాన్ని ఏం బాగుపరుస్తాడు. మన GB-గోర్బీ బాదల్ అన్నట్టు ‘మనం అడిగిన వన్నీ ఇచ్చేవాడే దేవుడు అయితే, మరి మనకు కావాల్సిన వన్నీ మనం అడగకుండానే, మనల్ని అడగకుండానే ఇచ్చే ఈ ప్రకృతినేమనాలి. దేవుడే ప్రకృతి – ప్రకృతే దేవుడు.’

ఇన్ని వందల సంవత్సరాలుగా మనని మనం త్యాగం చేస్తూ, ఏ సుఖానికీ, సంతోషానికీ, ఆనందానికీ నోచుకోకుండా, నిర్జీవంగా జీవిస్తూ, భావితరాల అభ్యున్నతికి పాటు పడుతున్న మనకు ఈ రోజు నిజంగా పర్వదినం.

మరిన్ని మంచి మార్పులు మన జీవితాల్లోకి రావాలని ఆకాంక్షిస్తూ, అప్పటివరకూ మనం కలసికట్టుగా, మన పూర్వీకులని ఈ ప్రకృతి ఎన్నో సంవత్సరాలు కాపాడినందుకు ప్రతిగా ఈ సారి మనందరం కలసి ఆ ప్రకృతి మాత ఋణం తీర్చుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మన ప్రకృతిని మనం కాపాడుకుందామని, ఈ సందర్భంగా మనందరం మరొక్కసారి సంకల్పం చేసుకుందామని, ఈ శుభ దినాన్ని పండగలాగా జరుపుకోవాలని అందరినీ విన్నవిస్తున్నాను.

 

అందరికీ శుభాకాంక్షలు.

మీ

చెన్నయ్య.

VTSలో పొందుపరిచిన విషయాన్ని చరిత్ర పుటల్లోకి అనుసంధానిస్తూ…చివర ఉన్న తన పేరును చేతివేళ్ళతో మృదువుగా స్పృశించాడు చెన్నయ్య.

అది తన పూర్వీకుల పేరు.

***

 

 

 

మీ మాటలు

 1. Dr. Vijaya Babu, Koganti says:

  😀 బాగుంది. అయితే ఒక్క అబ్జర్వేషన్ . తినడం తాగడం లేకుండా దానికి ఒక చిప్ నో patch నో అంటించు కోవాలేమో. గమ్మత్తయిన ఊహ. బాగుంది.

 2. కథ ఎంతో నచ్చింది . అందుకు సైన్స్ ఫిక్షన్ మీద నాకున్న ఆసక్తి కూడా ఒక కారణం కావచ్చు . ఇందులో పెద్ద పెద్ద అద్భుతాలేమీ జరగలేదు . కాలంలోకి ప్రయాణాలు, పేరడాక్స్ లు , ఎంతకీ తెగని లూప్ లు, రోబోట్ లు , బయాట్ లు , ప్రీకాగ్ లు, ఎలియన్స్ ఏమీ లేవు . కానీ మనం చేస్తున్న పొరపాట్ల వల్ల మన తర్వాతి తరాలు ఎదుర్కోబోయే ప్రమాదాలనీ, విపత్తులనీ వాస్తవానికి దగ్గరగా ఉండే విధంగా ఊహించారు రచయిత. రచయితకి విజ్ఞాన శాస్త్ర విషయాల మీదా , చారిత్రక అంశాల మీదా , రాజకీయ పరమైన వ్యూహాల మీదా మంచి పట్టు ఉన్నట్టుగా అనిపించింది.

 3. ‘మనం అడిగిన వన్నీ ఇచ్చేవాడే దేవుడు అయితే, మరి మనకు కావాల్సిన వన్నీ మనం అడగకుండానే, మనల్ని అడగకుండానే ఇచ్చే ఈ ప్రకృతినేమనాలి. దేవుడే ప్రకృతి – ప్రకృతే దేవుడు.’

 4. Purama Venkateshwara Rao says:

  మొదటగా ఈ కథను ఎంచుకున్న సారంగా వెబ్ మగజినేవారికి థాంక్స్….చక్కటి కథను వీరు అందించారు

  రచయిత యొక్క వూహ అద్భుతం ….ప్రకృతిని నాశనం చేస్తే దాని యొక్క పర్యవసానం ఎలాగా ఉంటుందో కళ్ళకు కట్టి నట్టు చెప్పారు……..సో రచయిత చెప్పినట్టు నేను ఇప్పుడు 1441 భెఫొరె గోర్బి భాదల్ పీరియడ్ (1441 BGB )లో వున్నాను…..

 5. దేవరకొండ says:

  ఈ కథ ప్రపంచ భాష లన్నిటిలోకి అనువదిన్చబడాలి. సమ కాలీన మానవ జాతికి ఈ కథ ఒక హెచ్చరిక!

 6. కథ బాగుంది . కథకు అందించిన భవాని ఫణి గారి బొమ్మ కూడా అదిరింది. మరో గ్రహం లోని లక్ష్మి భూగ్రహం లో ఉన్న చెన్నయ్యకు “ప్రేమ” అందించే “ఇమాజినేషన్” భలే కుదిరింది. ఈ రచయిత “నూనె చుక్క ” (ప్రాతినిధ్య ) లాంటి కథలతో కంట తడి పెట్టించ గలడు . ఇలాంటి కథలతో గ్రహాల వెంట పాఠకులను పరిగెత్తించనూ గలడు :)

  • Bhavani says:

   ఇమేజ్ మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది . ధన్యవాదాలు

 7. Ramana Murthy says:

  మంచి ప్రయత్నం, మంచి కథ! టైమ్ లైన్ లో కథ చెప్పడం వల్ల కథకి ఓ కొత్త రూపం వచ్చింది. ముగింపు విషయంలో రచయిత ప్రయత్నం ప్రశంసనీయం. అభినందనలు రామకృష్ణారెడ్డి గారూ!

  (అచ్చుతప్పుల నివారణ విషయంలో సారంగ ఎలాంటి చొరవా చూపించదు కాబట్టి, రచయితలు ఎవరి జాగ్రత్తల్లో వాళ్లుండాలి..! )

  • కొట్టం రామకృష్ణారెడ్డి says:

   అమూల్యమైన అభిప్రాయాలు తెలియచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.

 8. నీహారిక says:

  ప్రస్థుత మనం చెన్నయ్య పీరియడ్ కూడా దాటేసాం.మంచు లక్ష్మి సరోగ్రసీ ద్వారా వేరే ఖండానికి చెందిన భర్తకి అమ్మాయిని కనేసింది.VTS కూడా ప్రస్థుతం అందుబాటులో ఉంది.గోర్బీ బాదల్ జననం కూడా జరిగిపోయింది.ఏ మనిషిని అయినా చనిపోయాక కాకుండా బ్రతికి ఉండగానే వారి గొప్పతనాన్ని తెలుసుకునేలా ప్రజల తెలివితేటలను పెంపొదించే ప్రయత్నాలు,పరిశోధనలు ప్రస్థుతం జరుగుతున్నాయి.

 9. Sai Yogi says:

  అద్భుతంగా అనిపించింది. రచయిత ఊహ పటిమకి జోహార్లు.

 10. విలాసాగరం రవీందర్ says:

  బాగుంది కథ. పచ్చ దనాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిది

 11. Dr. Vani Devulapally says:

  రచయిత ఊహ చాలా బావుంది ! సతతం హరితం జీవనం ! మంచి సందేశం !

 12. Very nice story ! I read it to my kids and they loved it.
  They said everybody in the world need to read this story.

మీ మాటలు

*