నా చింత

కందుకూరి రమేష్ బాబు
.

Kandukuri Rameshచెట్లని చూసినప్పుడల్లా నాకు ఈ చెట్టే గుర్తొస్తుంది.
ఈ ఒక్క చెట్టు ఒక దృశ్యం. కానీ, అనేక చెట్లు దృశ్యాదృశ్యం అనిపిస్తుంది.

ఎందుకంటే ఈ చెట్టుకు చరిత్ర ఉంది. మూసీ వరదల్లో యాభైవేల మంది మరణిస్తే కనీసం నూటా యాభైమందికి పైగా బతికారంటే ఆ బతికిన మనుషులు ఈ చెట్టును ఆశ్రయించి ప్రాణాలతో బతికి బట్టకట్టిన వారే. అందువల్ల ఈ చెట్టును ‘ప్రాణదాత’గా పిలుస్తారు. ఫారెస్టు శాఖ వారు ఒక తపాళా బిల్లను కూడా ముద్రించారు. అందుకే ఈ చెట్టు సరైన విధంగానే పేరు పడింది. 28 సెప్టెంబర్ 1908– ఒక ప్రాణదాత.  

కానీ, మిగతా చెట్లు?
అవన్నీ ఏ ఒక్కరికీ నీడ ఇవ్వలేదా?
మరెవ్వరికీ ఫలాలనివ్వలేదా?
మన బాల్యపు ఆటలకు తానూ ఒక కోతి కొమ్మచ్చి ఆట కాలేదా?
మన యవ్వనపు దాహాలకు తెరచాటుగనైనా నిలవలేదా?
ఇక నా వల్ల కాదనుకున్న వారికి ఉరికొయ్యగ మారలేదా?

బతుక్కీ మరణానికీ ఏ చెట్టు ఏం చేయలేదని చెప్పగలం?

కానీ, ఈ చెట్టును మాత్రం గుర్తించుకున్నాం. అక్కడి పరిసరాలను శుభ్రం చేసి చక్కగా మెట్లుకట్టుకున్నాం. ఏడాదికి ఒక సారి అక్కడకు వెళ్లి ఆ విలయాన్ని గుర్తు చేసుకుని, చెట్టను ప్రేమతో తడిమి వస్తుంటాం. ఆ చెట్టు మీదినుంచే తన కుటుంబం యావత్తూ నీట మునుగుతుంటే చూసి భయభ్రాంతుడైన ఉర్దూ కవి అమ్జద్ ఖాన్ నూ ఇక్కడకొస్తే యాది చేసుకుంటాం. ఆయన ఒక కవిత రాశాడనీ చెప్పుకుంటాం. తర్వాత కవితలూ రాసిన కవుల గురించీ చెప్పుకుంటాం.

కానీ ఒక సందేహం.
ఒక విలయంలోనో, ప్రళయంలోనో తప్పా, వాటినుంచి తప్పించుకుంటే తప్పా మనిషి దేన్నీ గుర్తుంచుకోడా?
‘రామా’ అనిపిస్తుంది!

మనుషులు చెట్లనైనా. తోటి మనుషులనైనా కృతజ్ఞత వల్లే గుర్తించుకోవాలా? అని -లోలోన బాధేస్తుంది. చిరాకూ వేస్తుంది.

వీధినుంచి బయలుదేరి రోడ్డుమీదికి వస్తే ఇవన్నీ ప్రశ్నలు.
ఏ చెట్టును చూసినా మనిషి విధ్వంసం గుర్తొస్తుంది.

అవును. ఏ చెట్టును చూసినా సామాన్య జనం మాదిరి తలవంచుకుని తన పని తాను చేసుకుంటూ పోతున్నట్టే అనిపిస్తుంది. కానీ, కొన్ని మొక్కలు మాత్రం అనుభవ రాహిత్యం వల్లో ఏమో, ‘నువ్వు మీడియా మనిషివా?’ అన్నట్టనిపిస్తుంది. ‘ఎదిగివస్తే తప్పా, సెలబ్రిటీ అయితే తప్పా నన్ను గుర్తించవా?’ అని ప్రశ్నిస్తున్నట్టే అనిపిస్తుంది. ‘మై డియర్…నాకా ప్రాబ్లం లేదు’ అని చెప్పి, చిర్నవ్వుతూ ఆ చెట్టును ఫొటో తీస్తూ పోతాను. ఆ మొక్కను దానంత సహజంగానే చిత్రిక పడతాను. అదే విధంగా చెట్టంత మనుషులనూ తీస్తూ  పోతాను.

కానీ చెప్పాలనే అనిపిస్తుంది. ఎప్పుడైనా, ఎక్కడైనా, వార్త కాకుండా, విశేషం కాకుండా, విచారం నుంచి కాకుండా, కృతజ్ఞతా భావంతో సంబంధం లేకుండా, ఏ చెట్టునైనా ఫొటో తీసుకోవాలనిపిస్తే, ఏ మనిషినైనా తన పేరు, ప్రఖ్యాతి, అధికారం, హోదా – వీటితో నిమిత్తం లేకుండా ఫొటోలు తీయాలనుకుంటే తెలియకుండానే మొదట ఆ చెట్టే గుర్తొస్తుంది. ఉస్మానియా ఆస్పత్రి ప్రాంగణంలో ఉన్న ఆ చింతచెట్టే నాకు తొలుత  యాదికొస్తుంది.

అన్ని చెట్లలో అదొక చెట్టుగానే నేను చూస్తాను.

~

మీ మాటలు

 1. Mamata Vegunta says:

  “బతుక్కీ మరణానికీ ఏ చెట్టు ఏం చేయలేదని చెప్పగలం?” very nice!
  “వార్త కాని, విశేషం కాని” చెట్ల గురించి, non-celebrity మనుషుల గురించి మీరే రాయగలరు.
  Thoughtful article!

 2. kandukuri ramesh babu says:

  థాంక్యూ మమతగారు.

 3. N.RAJANI says:

  విశేషమైన విషయాన్ని ప్రముఖులను,పేరొందిన చెట్లను పుట్టలను గురించి రాస్తే ప్రత్యేకత ఏముంది.ఏంటో మంది అన్సంగ్ హీరోలు ఉన్నట్టే ఎన్నో అన్సంగ్ వృక్షాలు ఉంటాయి. కొన్నిటికి గుర్తింపు వస్తుంది. మరి కొన్నింటికి రాదు .రానంత మాత్రాన వాటివిలువ వాటికే ఉంటుంది. గుర్తింపు లేని అంశాలకు గుర్తింపు తెచే మీ ప్రయత్నం బాగుందండీ

 4. kandukuri ramesh babu says:

  నా ఆలోచన కు వ్యతిరేకత వస్తుందేమొ అన్న శంక ఉండే. థాంక్ యు రజని గారు.

మీ మాటలు

*