దృశ్యం అంటే జీవితానికి దగ్గిరగా వెళ్ళడం..!

కందుకూరి రమేష్ బాబు

Kandukuri Rameshచాలాసార్లు ఫొటోలు తీస్తూ ఉంటే ఎందుకు తీస్తావని ఆ సదరు వ్యక్తులు అడుగుతూ ఉంటారు.
నిజంగా సమాధానం చెప్పడం కష్టం అనుకుంటాం గానీ, కాదు. ఎవరికైనా త్వరగానే అర్థమౌతుంది.
అనేకసార్లు ఆ అవతలి వ్యక్తి అడుగుతుండగానే ఆమె పక్కన ఉన్నామె స్వయంగా నా తరఫున సమాధానం చెప్పడం నేను గమనించాను. నా వలె ఆలోచించేవాళ్లు, నా మాదిరే నలుగురి జీవితం పదుగురికి తెలియజేయడంలో ఒక ఔచిత్యం ఉందని గుర్తించిన వాళ్లూ ఎందరో ఉన్నారని తెలిసిపోయింది. అందుకే అనిపిస్తుంది. మనం ఎంతో సంక్లిష్టం చేసుకుని జీవితాన్ని అర్థం చేసుకుంటాం గానీ అంత అవసరం లేదని!
జీవితానికి తనదైన సరళత్వం ఉందని! మనుషులు మనం అనుకున్నంత మోటుగా ఏమీ లేరని! అంతకన్నా ముఖ్యం సమాధానం చెప్పవలసినంతటి పనేమీ మనుషులకు అంతగా లేనేలేదని!

నిజం.

ఈ ఉపోద్ఘాతం ఎందుకూ అంటే, ‘నువ్వు ఫొటోలు తీస్తూ ఉండగా ఎవరేం అనరా?’ అని నన్ను చాలామంది చదువుకున్న వాళ్లు, నా తోటి పాత్రికేయులు, కవులూ, రచయితలూ అడుగుతూ ఉంటారని చెప్పడానికి. కానీ ఎపుడో ఒకసారి మాత్రమే నా కెమెరా సబ్జెక్టు ఈ కెమెరామెన్ ను ప్రశ్నించడం జరుగుతుంది తప్పా అసలుకి చాలాసార్లు ప్రశ్నే ఉండదు. కానీ ఎప్పుడో ఒకసారి చుక్క తెగిపడ్డట్టు నేను కెమెరా పక్కనపెట్టి వాళ్లకు చెప్పవలసి వస్తుంది. కానీ, అది నిజంగా అరుదైన దృశ్యం.

అసలు ఆ దృశ్యాదృశ్యం ఎలా ఉంటుందీ అంటే ఇలా.

నిజంగా నిజం.
చెబుతుంటే నవ్వులు పువ్వులు.
అంతే మరి! అవును.
చెప్పాక మరింత ఆహ్లాదమైన చిత్రం వస్తుందే తప్పా సమాధానం చెప్పాక చిత్రం అదృశ్యం కావడం అస్సలు ఉండదు. అందుకే కెమెరా భుజం ఎన్నడూ తొణకదు.

ఈ చిత్రం తీస్తూ ఉన్నప్పుడు కూడా అందులో ఉన్న ఒక స్త్రీ అడిగింది.
‘ఎందుకయ్యా అట్ల ఫొటో తీస్తున్నవ్’ అని!

అది లోయర్ ట్యాంక్ బండ్. బండిమీద పోతుంటే కట్ట మైసమ్మ గుడి దగ్గర వాళ్లు కనబడ్డరు.
చప్పున ఆగి తీశాను, ఒకట్రెండు ఫొటోలు. వాళ్లు చూస్తూనే ఉన్నారు. అందులో ఒకామె చురుగ్గా చూసి అడిగిందామాట.

నేనన్నాను, ‘ మీరు మున్సిపల్ పని మీద వచ్చారా, కట్ట మైసమ్మను దర్శించుకోవచ్చారా అన్నది నాకు  తెలియదుగానీ ఒకటి మాత్రం తెలిసింది. మీరంతా అక్కలే అని’ అన్నాను. ‘కానీ ఒక అక్క లెక్క ఇంకో అక్క లేదు. మస్తు తేడా ఉంది. కట్టు బొట్టు నడకా అంతా ఎవల్ది వాళ్లదే. వేరు వేరు. ముదురు రంగుల చీర కట్టుకున్న ఈ అక్క వేరుంది. తెల్ల బుష్షర్టు వేసుకున్నఆ అక్కా వేరేగా ఉంది. ఒక కుటుంబంలనే గింత తేడా ఉందని ఎవరు చెప్పాలె. గిట్ల మారుతున్నమని నోరెతెరిచి చెప్పాల్నా? బొమ్మ చాలదా?’ అన్నను. ‘ఇవన్నీ రేపటికి పనికొస్తయి. మనదాంట్ల మనమే చాలా వేరుగా ఉన్నమని తెలుపుతయి. అన్నిటికన్నా ఈ అక్క అయితే మనందరికీ పెద్దక్క లెక్కనే ఇంకా అట్లనే ఉన్నది. ఏం మారలేదు. ఆ సంగతి కొంచెమైనా చెప్పాలంటే ఫొటో పనికొస్తది. మిమ్మల్ని ఉన్నదున్నట్లు ఇట్ల చరిత్రకోసం దాసిపెడత. రేపెప్పుడైన పనికొస్తది’ అని వివరించిన.

వాళ్లు నవ్విండ్రు.
ఒక నాలుగైదు ఫొటోలు తీసుకున్న.
మామూలే. లాంగ్ షాట్లూ రెండు. రెండు మూడు క్లోజప్సూ.

ఇట్లా – చాలా చిత్రంగా ఉంటుంది జీవితం. తీస్తే అది చిత్రమౌతుంది.
అందుకే ఎవరేమనుకన్నాగానీ, తీసుకుంటూ పోవడమే మంచిది.
ఎవరన్నా ఏదైనా అడిగితే అప్పటికి చెప్పబుద్దయింది చెప్పడం తప్పా నా దగ్గరేమీ సమాధానం లేదు. సమాధానం కోసం తయారుగా వెళితే ఏ దృశ్యమూ ఉండదు.
అనుభవం అది. అందుకే, భుజానికి వేలాడే కెమెరా ఒకటి ఆమె భుజం మీద కండువా వలే చెమెట పెడితే తుడుచుకోవడానికా అన్నట్టు నేనూ ఒక స్వేద బింధువును ఇలా కెమెరా కంటితో తుడుచుకుంటూ భద్రపరుస్తాను. ఇదొక పద్ధతి. విశ్రాంతి. తృప్తి. అంతే.

దృశ్యాదృశ్యంలో ఒక దృశ్యం అది.
ఇప్పుడు చూడండి.
ఒక్కొక్కరు ఎలా ఉన్నారో.
ఒక్కొక్కరిలో ఎంత మార్పో.

అందుకే చూడండి.
ఆ తల్లి కాళ్లు…కడియాలు. కడియాల కింద పట్టగొలుసులూ…ఆ చెప్పులూ..
మడిచిన ఆ శిఖ…కట్టిన ఆ చీరా .

అట్లే మిగతా స్త్రీలు.

వాళ్ల చెవి దుద్దులు. ముక్కు పోగులు.
రవికలు. పువ్వులు, చారలు. చుక్కలు.
పసుపు తాళ్లు.
వాళ్ల ముసిముసి నవ్వులు.
సిగ్గులు.

ఇంకొందరు. వాళ్లు ధరించిన అంగీలు…వాళ్ల ఎనర్జీ…ఆ ఎక్స్ ప్రెషన్…బాడీ లాంగ్వేజూ. 
పనిపాటల్లో నిమగ్నమయ్యే ఆ శ్రామికులూ.
అంతానూ స్త్రీలే. అక్కలే.
దూరంగా వాళ్ల ఇనుప పలుగూ పారలు…దగ్గరగా వాళ్ల మానవత్వం

జీవితాన్ని ఇంత సన్నిహితంగా ప్రతిబింబించే మాధ్యమం ఇంకొకటి లేదు మరి!
అందుకే చూడండి. సమస్తంగా ఒక జనత.

~  

మీ మాటలు

  1. P Mohan says:

    ‘నువ్వు ఫొటోలు తీస్తూ ఉండగా ఎవరేం అనరా?’ అని అడుగుదామని నాకూ అనిపించింది. అడక్కుండానే చెప్పినందుకు థ్యాంక్స్. ఈ అక్కల జీవనసౌందర్యం ముందు తమన్నాల, గిమన్నాల మేకప్ మెరుగులు ఏపాటి?

  2. నిశీధి says:

    ఫోటో గ్రాఫర్స్ డైలమా కదా అది , కొన్ని దృశ్యాలు చప్పున బంధించాలి అదే సమయంలో అవతల వాళ్ళ పర్మిషన్ లేకుండా అలా చేయటం మోరల్ ఆబ్లిగేషన్ . ఏదేమయితేనే కొన్ని తప్పులు ఇలా అందంగా ఉంటాయన్నమాట , భలే నవ్వులు .

  3. kandukuri ramesh babu says:

    తప్పులు కావనే ఇలా రాయడం అని గమనిచగలరు. ఫోటోగ్రఫీ అన్నది వ్యక్తి కన్నా ఎక్కువ అని, అది మనుషుల సామూహిక జీవనాన్ని ప్రతిపలిస్తుందని నమ్మకం కుదిరితే ఇక మోరల్ abligation అన్నది రివర్స్ అవుతుంది. ఫోటోగ్రాఫర్ కు సహకరించడం మన ధర్మం అవుతుంది. అసలైన నవ్వు అది. దాన్ని నేను సూటిగా చెప్పే అవకాశం ఇచ్చినందుకు మీకు థాంక్సండి.

మీ మాటలు

*