ప్యారీ.. పారీ.. పారిస్!

సత్యం మందపాటి

satyam mandapati ప్రపంచమంతటా అందరూ ఏనాటికైనా చూడాలి అనుకునే నగరం పారిస్! (Bucket List అన్నమాట)

ప్రతిరోజూ కొన్ని లక్షలమంది ఎక్కడెక్కడినించో వచ్చి, విహరించే నగరం పారీ.. అదే పారిస్!

పారీ అని ఎందుకు అన్నానో, ఒక చిన్న కథ చెబుతాను.

నేను రెండు సార్లు బిజినెస్ పని మీద, ఒకసారి శ్రీమతితో కలిసి విహారయాత్రకి పారిస్ వెళ్ళాను. చాలాసార్లు పారిస్ చార్లెస్ డిగాల్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా వెళ్ళాను కానీ, మిగతా అంతర్జాతీయ విమానాశ్రయాలు  ఎన్నో చూసిన నాకు, ఏమాత్రం నచ్చని విమానాశ్రయాల్లో అదొకటి!

ఇక్ష్వాకుల కాలంలో మొట్టమొదటిసారిగా పారిస్ వెళ్ళినప్పుడు, ఒక చిన్న డిక్షనరీ కొన్నాను. ఇంగ్లీషు నించీ ఫ్రెంచిలోకి, ప్రయాణానికి కావలసిన చిన్న చిన్న వాక్యాలకి ఇంగ్లీషు అనువాదాలు. అంటే హలో బాగున్నారా, రెస్ట్ రూము ఎక్కడ, ఫలానా చోటుకి పోవాలి ఎలా వెళ్ళాలి, రైలు టిక్కెట్లు ఎక్కడ ఎలా కొనాలి… లాటి చిన్న చిన్న వాక్యాలు చెప్పటానికి సులువుగా వుంటుందని. నేను చైనా, జపాన్.. ఇలాటి భాష రాని ఏదేశమేగినా, ఎందుకాలిడినా, ఇలా డిక్షనరీలు కొనటం అలవాటయిపోయింది మరి. ఆ విషయమే స్నేహితుడు మూర్తిగారికి చెబితే, ఆయన పెద్దగా నవ్వాడు.

“ఫ్రెంచ్ భాష మాట్లాడటం అంత సులభం కాదు. వాళ్ళు వ్రాసిన సగం అక్షరాలు పలకరు. అదీకాక, ఆ యాస కూడా మీకు రెండు రోజుల్లో రావటం కష్టం. మన ఇండియన్ ఇంగ్లీషు యాస వాళ్లకి అసలు అర్ధం కాదు. అంతేకాదు మీ కొలీగ్ ఫ్రాంక్ కూడా మీతో వస్తున్నాడా?” అని అడిగాడు.

నేనూ, ఫ్రాంక్ ఒక ఇండియా రెస్టారెంటుకి వెళ్ళినప్పుడు, అక్కడికి వచ్చిన మూర్తికి పరిచయం చేశాను      అతన్ని ఒకసారి. అందుకే మూర్తికి అతను బాగా తెలుసు. అవును ఇద్దరం కలిసే వెడుతున్నామన్నాను.

పెద్దగా నవ్వుతూ అన్నాడు మూర్తి, “ఫ్రాంక్ అమెరికాలో వుంటున్నా, గట్టి బ్రిటీష్ యాసతో ఇంగ్లీష్ మాట్లాడతాడు. వాళ్లకి బ్రిటిష్ వాళ్ళంటే నచ్చదు. అందుకని మీరే మాట్లాడండి. ఇంగ్లీషులో కాదు. తెలుగులో.     కాస్త సంజ్ఞలు చేస్తూ, మాట్లాడితే వాళ్ళు అర్ధం చేసుకుంటారు”

అతను ఆ మాటలు సరదాగానే అన్నా, అక్కడ చాల చోట్ల అది నిజమేనని అనిపించిన సందర్భాలు కూడా వున్నాయి.

ఉదాహరణకి మా వూళ్ళో ఒకప్పుడు టీవీలో వార్తలు చదివే ఒకాయన పేరు బాబ్ బుడ్రో. బుడ్రో అనేది ఫ్రెంచి పేరు. దాన్ని ఇంగ్లీషులో ఇలా వ్రాస్తారు, Budreaux అని. ‘బు’ బాగానే వుంది కానీ, ఆ స్పెల్లింగులో ‘డ్రో’ ఎలా వచ్చిందో అర్ధం కాదు. ఆ అక్షరాలు అన్నీ పలికితే ఎవరికీ అర్ధం కాదు. అలాగే పారిస్ నగరాన్ని కూడా ఫ్రెంచి భాషలో పారీ అంటారు. వాళ్ళ భాష, వాళ్ళ ఇష్టం!

ఇలాగే కొన్ని మాటలు, మన తెలుగులోలాగా అన్ని అక్షరాలూ ఫ్రెంచిలో పలుకుతూ మాట్లాడుతుంటే, వాళ్ళు అర్ధంకాక మధ్యలోనే వెళ్ళిపోయేవారు!

పారిస్ గురించి రెండు మాటలు. ఈ నగరాన్ని, క్రీస్తు పూర్వం మూడవ దశాబ్దంలో, కెల్టిక్ ప్రజలు ‘పారిసై’ అనే పేరుతో స్థాపించారని, వల విసిరితే అంతర్జాలంలో చెప్పారు. క్రీస్తు శకం పన్నెండవ శతాబ్దం వచ్చేసరికీ పారిస్ యూరప్లోనే అతి పెద్ద నగరంగానూ, గొప్ప వ్యాపార కేంద్రంగానూ తయారయింది. పద్దెనిమిదవ శతాబ్దంలో ఫ్రెంచ్ రివల్యూషన్ జరిగాక, ఆధునికతతో పారిస్ ఎన్నో రంగాల్లో బాగా ఎదిగిపోయింది. ఈనాటికి పారిస్ నలభై ఒక్క చదరపు మైళ్ళ వైశాల్యంతో, ఇరవై మూడు లక్షల జనాభాతో, యూరప్లోనే ఒక పెద్ద నగరం. అంతేకాదు, ప్రపంచంలో గొప్ప విహారయాత్రా స్థలం అయిపోయి, సంవత్సరానికి దాదాపు ముఫై మిలియన్ల యాత్రీకులని ఆకర్షిస్తున్నది!

మేము లండన్ నించీ, ఇంగ్లీష్ ఛానల్ నీళ్ళ క్రింద నించీ వేసిన ట్యూబ్ రైల్లో పారిస్ చేరాం. అక్కడ మూడు రాత్రులు, అంటే మూడు నిద్రలు చేయాలని ముందే నేనూ, శ్రీమతీ ప్లాన్ చేసుకున్నాం

మేము మొట్టమొదటగా పారిస్లో చూసింది, అవును – మీరు అనుకున్నది రైటే, ఐఫిల్ టవర్. టిక్కెట్టు కొనుక్కుని లోపలికి వెళ్ళాక, ‘టవర్ పైకి వెళ్ళటానికి, లిఫ్ట్ తీసుకోవచ్చు, మెట్లు ఎక్కవచ్చు, ఇక మీ ఇష్టం’ అందంగా అన్నది అక్కడ అందంగా నుంచుని వున్న అందమైన ఫ్రెంచి సుందరి.

సరే, ఏదో చక్కటి పిల్ల ఇంకా చక్కగా చెప్పింది కదా అనుకుని, ఇంచక్కా మెట్లు ఎక్కి వెడితేనే, అన్నీ చూసుకుంటూ తీరిగ్గా వెళ్ళవచ్చు అని కూడా అనుకుని, మా కాళ్ళకి పని చెప్పాం.

paris1

 

ఈ ఐఫిల్ టవర్ 1887వ సంవత్సరంలో మొదలు పెట్టి, 1889లో పూర్తిచేశారు. అక్కడ అప్పుడు జరిగిన వరల్డ్ ట్రేడ్ ఫైర్ చూడటానికి వచ్చిన వారికి అదొక పెద్ద ఆకర్షణ అయింది. దీని మీద మనం వెళ్ళగలిగిన ఎత్తు 896 అడుగులు. దానిపైన ఇంకా కొంత నిటారుగా వున్న కట్టడంతో కూడా కలుపుకుంటే, దీని ఎత్తు 986 అడుగులు. దీన్ని కట్టిన కంపెనీ, “Compagnie des Etablissements Eiffel” అనే పేరు మీద దీనికి ఐఫిల్ టవర్ అనే పేరు వచ్చింది.

ఈ టవర్ కట్టడంలో ఉద్దేశ్యం, ఒకటి రేడియో ప్రసారం కోసం, రెండు దీనిని ఒక నగర వీక్షణ ఆకర్షణగా చేయటం.

దీనిలో మూడు పెద్ద అంతస్తులు వున్నాయి. మూడు చోట్లా టవర్ చుట్టూతా నగర వీక్షణకు ఒక డెక్ లాగా కట్టారు. ఈ మూడు అంతస్తులకీ వెళ్ళటానికి, తొమ్మిది లిఫ్టులు వున్నాయి. మేము పైదాకా వెళ్లి, పారిస్ నగరాన్ని అన్ని కోణాల్లోనూ చూసాం. ఎంతో అందమైన నగరం పారిస్ అని ఇంకోసారి అనుకున్నాం.

పారిస్లో తప్పకుండా చూడవలసిన ఇంకొకటి “ది లూవ్”. ‘లూవ్’ మ్యూసియం. లూవ్ స్పెల్లింగ్ కూడా ‘Louvre’ అని వ్రాస్తారు. ప్రపంచ ప్రఖ్యాత పెయింటింగులు, శిల్పాలు ఎన్నో వున్నాయి. మైకలాంజిలో,  రాఫయేల్,  డ వించి, రెంబ్రాంట్, పుస్సీన్, వాన్ డైక్.. ఇలా ఎందరో మహానుభావుల కళా వైదుష్యం ఇక్కడ చూడవచ్చు.

‘డ వించి’ చిత్రించిన ప్రముఖ చిత్రం “మోనా లిసా” ఇక్కడే వుంది.

ఆరున్నర మిలియన్ల చదరపు అడుగుల భవంతులలో, ఎంతో ప్రాచీన కాలంనించీ ఇప్పటి దాకా వేసిన చిత్రాలూ, చెక్కిన శిల్పాలూ దాదాపు ముఫై ఐదు వేల కళాఖండాలున్నాయి. అన్నీ పూర్తిగా చూసి ఆనందించాలంటే, ఒకరోజు చాలదు.

paris2

 

 

ఇక్కడి చిత్రాలకీ, శిల్పాలకీ ఫోటోలు తీయవచ్చు. కానీ “మోనా లీసా” చిత్రాన్ని రెండు అద్దాల  కేసులో బిగించటం వల్ల, ఆ అద్దాల్లో ప్రతిబింబం రాకుండా ఫోటోలు తీయటం కుదరలేదు. అదీకాక ఆ చిత్రపటం దగ్గర వున్నంత క్యూ ఇంకెక్కడా లేదు. తీరిగ్గా లైటు చూసుకుంటూ ఫోటో తీసే సమయమూ దొరకలేదు.

ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. ప్రపంచంలో రకరకాల జాతి మనుష్యులు, ఎవరి మతం వాళ్ళు సృష్టించుకుని, ఎవరి కథలు వాళ్ళు వ్రాసుకున్నాక, ఎన్నో పురాణగాథలు ఎక్కడినించీ ఎక్కడికి వెళ్ళాయో కానీ, ఇక్కడి చిత్రాలూ, శిల్పాలూ, వాటి వెనుక ఊహాగానం చూస్తుంటే అవి దాదాపు ఒకటిగానే కనపడ్డాయి నాకు.

ఉదాహరణకు కృష్ణుడు, ఏసుక్రీస్తు ఇద్దరూ గొల్లవారే. కృష్ణుడు పిల్లనగ్రోవి ఊదుకుంటూ గోవులు కాచుకుంటుంటే, క్రీస్తు పిల్లనగ్రోవి ఊదుకుంటూ గొర్రెలు కాచుకునేవాడు. మోసెస్ వెడుతున్నప్పుడు రెడ్ సీ విచ్చుకుని అతనికి దారి ఇస్తే, వసుదేవుడు వెడుతున్నప్పుడు యమునా నది విచ్చుకుని దారి ఇచ్చింది. కన్యగా వున్న మేరీమాత సూర్యుడి అంశతో క్రీస్తుకి జన్మనిస్తే, కన్యగా వున్న కుంతీదేవి సూర్యుడి అంశతో కర్ణుడికి జన్మనిచ్చింది. ఇక్కడి చిత్రాలు చూస్తుంటే, ఇలాటివి ఎన్నో వింతలు  కనపడ్డాయి. తర్వాత కొంతమంది మిత్రులని, ఇవి ఎక్కడి నించీ ఎక్కడికి వచ్చాయి అని అడిగితే, వారి వారి మతాల నించే ఇతర మతాలకి వెళ్లాయని ఆధారాలతో సహా బల్లగుద్ది మరీ చెప్పారు. అందుకని ఈ వ్యాసంలో ఈ విషయాన్ని ఊహామాత్రంగానే చూసి, ఈ విషయం మీద పరిశీలనో, పరిశోధనో  చేసుకునే వాళ్లకి ఈ వాదన వదిలేద్దాం!

ఇంకా పారిస్ వెళ్ళే వాళ్ళు చూడవలసిన వాటిల్లో ముఖ్యమైనది, నోటర్ డామ్ కేథడ్రల్. 1163లో కట్టటం మొదలు పెడితే, 1345లో పూర్తిచేసిన చర్చి ఇది. అంటే నూట ఎనభై ఏళ్ల పైన తీసుకుంది. దీని మీద ప్రముఖ ఫ్రెంచి రచయిత విక్టర్ హ్యూగో ఒక నవల కూడా వ్రాశాడు. మంచి అందమైన కట్టడం. 387 మెట్లు ఎక్కగలిగితే, పైదాకా వెళ్లి చూడవచ్చు.

paris3

 

పారిస్లో చెప్పుకోదగ్గ ఇంకో కట్టడం, చాంప్ ఎలీస్. ఇది అక్కడ రోడ్డుకి అడ్డంగా కట్టిన కట్టడం. దీని చుట్టూతా  కార్లు, బస్సులు వెడుతుంటాయి. ఇక్కడ మంచి షాపింగ్ కూడా వుంది.

 

 

పారిస్లో ఇంకా ఎన్నో అందమైన కట్టడాలు వున్నాయి. వాటి గురించి వ్రాసే కన్నా, ఫోటోలు పెడితే చూడటానికి మీకు బాగుంటుంది కానీ, ఈ వ్యాసంలో పేజీలు పెరిగిపోతాయి.

మీకు వీలున్నా, లేకపోయినా తప్పకుండా వెళ్ళవలసింది వెర్సాలీ (Versailles). ఇది పారిస్ నగరానికి పడమటి దిశగా పదిహేడు కిలోమీటర్ల దూరంలో వుంది. ముందే బుక్ చేసుకుంటే టూరిస్టు బస్సులు చాల వున్నాయి.

paris5

 

లూయి-14 మహారాజు కట్టిన ఈ కట్టడం, ఆయనకీ తర్వాత వచ్చిన రాజులు లూయి-15,  లూయి-16 లకు నివాసమయింది. తర్వాత వచ్చింది ఫ్రెంచి రివల్యూషన్. తర్వాత నెపోలియన్ ఇక్కడ ఒకే ఒకరోజు వుండి, వెళ్లిపోయాడుట.

ఇప్పుడిక్కడ ఎన్నో చిత్ర పటాలూ, శిల్పాలే కాక, అద్దాలతో అలంకరించిన గదులు, ఎంతో ఖరీదయిన సోఫాలు, డైనింగ్ టేబుల్సు, బంగారం పొదిగిన సామాన్లు, రంగురంగుల వేలాడే దీపాలు, పొడుగాటి కర్టెన్లు, ఒకటేమిటి ఎన్నో వున్నాయి. ఇవన్నీ ఆనాడు రాజులు ప్రజల సొమ్ముతో ఎంత దర్పంగా బ్రతికేవారో తెలుస్తుంది.

ఇక్కడ కూడా కనీసం ఒక రోజు గడపటానికి సమయం చేసుకుంటే బాగుంటుంది.

పారిస్ అందాల కట్టడాలకీ, దీర్ఘమైన చరిత్రకే కాక, ఫ్రెంచి భోజనానికీ (French Delicacies), ఫాషన్లకీ, అందమైన మనుష్యులకీ, వైన్ తదితర మధ్యపానాలకీ కూడా ఎంతో ప్రసిద్ధి. ప్రతివారూ కనీసం ఒక్కసారయినా చూడవలసిన నగరం.

౦                           ౦                           ౦

మీ మాటలు

  1. N.RAJANI says:

    సత్యం గారు మీరు ప్యారీ అంటే చాక్లెట్ గుర్తొచింది. చిన్నప్పుడు ప్యారీ ఆరంజ్ కలర్ ప్యాక్ లో కొబ్బరి చాక్లెట్ ఉండేవి అవి పారిస్ వీ నెమో

మీ మాటలు

*