మరచిపోతానన్న భయంతోనే రాస్తున్నా..

“Short stories are tiny windows into other worlds and other minds and other dreams. They are journeys you can make to the far side of the universe and still be back in time for dinner.”
Neil Gaiman
కథ రాయడం అంటే  మనసుకీ ఆలోచనకీ ఒక కొత్త రెక్క మొలిచినట్టే! అది సరదాగానే రాయచ్చు, లేదూ మహాగంభీరంగానూ రాయవచ్చు. లేదూ, ఇవాళెందుకో మనసు బాగుండక రాయచ్చు. కాని, కథ రాసినప్పుడు ఆ రచనలో రచయిత హృదయం  తనకే తెలియని కొత్త స్వేచ్చని అనుభవిస్తుంది. అసలు కథే ఎందుకు రాయాలి? అన్న ప్రశ్నకి ఆ స్వేచ్చలో ఒక సమాధానం ఉన్నప్పటికీ, వొక్కో రచయితా వొక్కో పద్ధతిలో ఈ స్వేచ్చని వెతుక్కుంటారు. ఆ వెతుకులాట గురించి ప్రతి గురువారం  ఈ  “కథన రంగం” శీర్షిక కింద ఒక కథా రచయిత మీకు చెప్తారు.

ఈ వారం : వంశీధర్ రెడ్డి

 

నేనెందుకు రాస్తానంటే.. నాకు భయం, నా అనుభవాల్ని నేనెక్కడ మర్చిపోతానేమో అని-

నిజంగా.. నాకు భయం, నేనెక్కడ నా బాల్యపు భాషనీ, మట్టివేర్ల వాసనల్నీ పోగొట్టుకుంటానేమోనని..

అప్పటికీ ఇప్పటికీ జీవిక కోసమో, జీవనం కోసమో, అసంకల్పితంగా చాలానే ఆత్మ పదార్ధాన్ని పోగొట్టుకుని ఉన్నప్పటికీ, ఎప్పటికప్పుడు ఙ్నాపకాల్లో పునర్నిర్మితమౌతుండే స్వకీయ నీడల రూపాల కలల్ని గుర్తుపెట్టుకోవాలంటే నాకున్న ఒకే ఒక్క దారి వాటిని రాసుకోడం,  లిఖితం చేసుకోడం, ఏదీ శాశ్వతంకాని ఈ వర్ధమాన చరిత్రలో వాటికి కాస్తంత స్వార్ధపూరిత మిధ్యా శాశ్వతత్వాన్ని ఆపాదించుకుని గుర్తుంచుకోడం..

అంతే, మరేంలే పెద్దగా.. ఎప్పుడైనా నాలాంటి అనుభవాలున్న మనుషులెవరైనా ఇవి చదివి పలకరిస్తే, పోగొట్టుకున్న ఆత్మశకలాలేవో ఎదురొచ్చినట్టు అనిపిస్తుంటుంది, ఆ అమూల్య క్షణాలకోసం తప్పితే పెద్దగా ఆశలేంలేవు రచనలద్వారా.. ఇక ,కథారచనే ఎందుకిష్టం అంటే, మన బ్రతుకుల్లోని ఒంటరితనం, అనిశ్చితత్వం, బానిసత్వం, కవిత్వంలో అర్ధరాహిత్యపు పదాల బడాయిగా దాచగలిగేంత క్లుప్తంగానూ అనిపించక, అలాని నవలీకరించగలిగే విస్తృత సామర్ధ్యమూ నాకు లేక..

కథారచన్లో శైలీ, శిల్పం టెక్నిక్కుల గురించి మాట్లాడేంత అవగాహన లేదుగానీ, నేను అనుభవించిన సంఘటనలని, మానసిక సామాజిక ఆర్ధిక రాజకీయ దృక్కోణాల పరిధుల్లో , నాకు తెలిసిన భాషలో , వీలైనంత సహజంగా చిత్రించే ప్రయత్నం చేస్తాను, నాతో నేను మాట్లాడుకునే ఒకలాంటి మిస్టిక్ మోనోలాగ్ లాగా, నాకది సౌకర్యం కూడా..

కథంటే “ఇలాగే ఉండితీరా”లన్న పురానియమాలేవీ లేకపోతేనే కథ మనగలుగుతుందేమో అలాంటి ఒక స్వేఛ్చావాతావరణంలో..

2

 

“బాసూ, అసల్నువ్వెందుకు రాస్తావ్రా” అని నన్నెవరైనా అడిగితే, ఏం చెప్పాలో తెలీదు నిజంగా..బలుపో కొవ్వో కాదుగానీ, నిజంగా..
ఎందుకంటే నేను రోజూ ముప్పయ్యారు గంటలూ అదే పన్లో ఉండను, కనీసం పేరుమోయించుకోవాలని పనిగట్టుకు అన్ని పుస్తకాలూ చదువుతుండే సీరియస్ సాహిత్యాభిమానిని కూడా కాదు..నేను చదూకున్నవి ఏవో పది నవలలు, కొంత కవిత్వమ్, అతి కొంత విమర్శ, నెగ్లిజిబుల్ గా కథలు…. అసల్నాకూ కథకీ సంబందమే లేదు మరీ మాట్లాడ్తే..
vamsidhar
ఎప్పుడో  నెలకో రెణ్ణెల్లకో ఒకరోజు అకస్మాత్తుగా ఓ పేరులేని విషాదమో, హాయో, ఆశ్చర్యమో, అనుభూతో లాగిపెట్టి ఫటేల్మని కొట్టెళ్ళినప్పుడు, ఎంత తాగినా కిక్కెక్కనితనంలాంటి అతిజాగరూక జాగృదవస్థలాంటి ఏదో మిస్టిక్ వాసన కళ్ళకి తగిల్నప్పుడో,  అదిగో అప్పుడు మాత్రమే నేనేదోటి రాస్తాను, ఏదోటి.. కథో, కవితో, సొల్లో, మరేదో.. అప్పటిదాకా మర్చిపోయిందేదో గుర్తొస్తుంది ఆ పవిత్రక్షణాల్లో, అప్పటిదాకా పోగొట్టుకున్న ఆత్మపదార్ధమేదో అర్ధమైనట్టు అనిపిస్తుంది ఆ విచిత్ర క్షణాల్లో.. మరి దానికి కాస్తంత సూడో శాశ్వతత్వాన్ని ఆపాదించుకుని గుర్తుపెట్టుకునే ప్రయత్నంలో చేతనైంది, సులువైందీ రాసుకోడమొక్కటేగా, నాకు మాత్రమే తెలిసిన నా భాషలో, నేను మాత్రమే తిరగ్గలిగే నా ఊహల్లో ఆ అనుభవాన్ని నిక్షిప్తం చేయడంతప్ప నేను చేసేదీ చేయగలిగిందీ ఏమీ ఉండదు..కేవలం అనిమిత్తమాత్రంగా శబ్దించుకోడంతప్ప..
 
నాకింకా నేనే పూర్తిగా తెలీదు,  అప్పుడప్పుడూ అనుమానపడ్తుంటాను, నేను నిజంగా ఉనికిలోనే ఉన్నానా, లేక ఇదంతా నా భ్రమా అని, మీకెప్పుడూ ఇలా అనిపించలేదా.. మీకెప్పుడూ మీ కలలో మీ సమాధిపక్కన మీరే ఏడుస్తున్నట్టు మెలకువ రాలేదా…మీకెప్పుడూ ఒక్కసారి చచ్చి చూద్దాం ఎలా ఉంటుందో అనిపించలేదా..ఎవ్రీ వన్ ఆఫ్ అజ్ హాస్ మెనీ లేయర్స్ ఆఫ్ బీయింగ్, ఆ ఒక్కో పొరా పరిచయించుకుంటూ పోవడమే మనం చేయాల్సింది అని నమ్ముతాన్నేను.. సామాజిక వైరుధ్యాలు రూపుమాపాలంటే  ముందు వైయుక్తిక సంఘర్షణల్ని మనం గౌరవించాలి, కనీసం అర్ధం చేసుకోవాలి.. అది సంపూర్ణంగా సాధ్యపడేది రాత ల్లోనే…కాస్త క్రిస్పీ గా ఉండే కథల్లోనే సాధ్యమది
మన ఏకాంతాల్నీ, బానిసతత్వాల్నీ, అనిశ్చితపు బ్రతుకును అర్ధరాహిత్యపు పదాల కవితల్లో దాచిపెట్టడం ఇష్టంలేక, అలాని నవలీకరించేంత సమగ్ర కృషి నాకులేక (పచ్చిగా చెప్పాలంటే చేతకాక) , కథల్రాసుకోడం సుఖం నాకు.. అల్టిమేట్ గా మనందరం ఇంకా బతికుంది సుఖపడ్డానికేగా..కాదా..
 
కవిత్వం పేరుతో కాస్తంత చెత్త రాసానుగానీ, నా కథలన్నీ (ఒకటో అరో తప్ప) నా అనుభవాల నీడలే..ఐనా వేరొకడి అనుభవాన్ని మనమెలా లిఖితం చేయగల్గుతాం..  నీతి కథలూ, పొలిటికల్లీ కరెక్ట్ కథలూ కాయితాల్లోనే కన్పిస్తాయ్, కాసేపు నవ్విస్తాయ్గానీ, వాటివల్ల పెద్దగా ఒరిగేదేంలేదు ఇప్పుడున్న టెక్నో ట్రెండీ కాలంలో… మనమున్న దేశకాలమాన పరిస్థితులుకూడా మన అనుభవాల పరిధులమీద నిర్మితమయ్యే అంతర్ఘర్షణలను నిర్దేశిస్తాయ్.. ఏ పాలస్తీనాలోనో సిరియాలోనో పుట్టుంటే పెన్నుకంటే గన్నే సేఫ్టీ అనుకునేవాళ్ళమేమో..అక్కడ యుధ్దం చేయగల్గేవాడే బ్రతుకుతాడు.. 
కొందరు భలే టైమింగుతో రాస్తారు ఊహా సామాజిక చైతన్యోన్ముఖులై, ఎన్నడూ కనీసం రోడ్డు పక్కన టీ కొట్టువాడితో నవ్వుతూ మాట్లాడకపోయినా, ఎప్పుడూ కనీసం ఇంటిపక్కన పారుతుండే మురిక్కాలవతో స్నేహించకపోయినా…ఎలా సాధ్యమో.. అదృష్టవంతులు వాళ్ళు..
 
ఈ కథల్ని అచ్చులో చూసుకోవాలనే కోరిక కూడా స్వార్ధపూరితమైందే, చదివిన వాళ్ళల్లో నాలాంటి ఒక్కరైనా ఉండకపోతారా అని,
అంతే మరేంలే.. ఇప్పుడున్న విపరీత పరిస్థితుల్లో సాహిత్యం నుంచి ఆశించేదికూడా పెద్దగా ఏంలే, ఒక్కో మనిషీ ఒక్కో సముద్రం కప్పుకున్న దీవయ్యాకా..ఎవరికీ ఎవరూ ఏమీ కాని శాపగ్రస్తపు ఒంటరులం మనమని మాటిమాటికీ రుజువౌతున్న నేటికాలంలో, అసలు బతికి ఉండడమే పెద్ద అచీవ్మెంట్ గా నిర్మొహమాటంగా నిరూపితమౌతున్న ఈ రోజుల్లో, అంతే..మరేంలే.. ఆశించిన ఆశాభంగం.. 

మీ మాటలు

  1. “సామాజిక వైరుధ్యాలు రూపుమాపాలంటే ముందు వైయుక్తిక సంఘర్షణల్ని మనం గౌరవించాలి, కనీసం అర్ధం చేసుకోవాలి.. అది సంపూర్ణంగా సాధ్యపడేది రాత ల్లోనే…కాస్త క్రిస్పీ గా ఉండే కథల్లోనే సాధ్యమది” – కదా వంశీధర్ రెడ్డి గారూ! చాలా బాగ చెప్పారు. అభినందనలు.

  2. Kuppili Padma says:

    నాకు మాత్రమే తెలిసిన నా భాషలో, నేను మాత్రమే తిరగ్గలిగే నా ఊహల్లో ఆ అనుభవాన్ని నిక్షిప్తం చేయడంతప్ప నేను చేసేదీ చేయగలిగిందీ ఏమీ ఉండదు..కేవలం అనిమిత్తమాత్రంగా శబ్దించుకోడంతప్ప… —- అంతే మరేంలే.. ఇప్పుడున్న విపరీత పరిస్థితుల్లో సాహిత్యం నుంచి ఆశించేదికూడా పెద్దగా ఏంలే, ఒక్కో మనిషీ ఒక్కో సముద్రం కప్పుకున్న దీవయ్యాకా..ఎవరికీ ఎవరూ ఏమీ కాని శాపగ్రస్తపు ఒంటరులం మనమని మాటిమాటికీ రుజువౌతున్న నేటికాలంలో – యివి మాత్రమే కాదు మీరు రాసిన అనేక వాక్యాలని తిరిగి యిక్కడ రాస్తే, మీరు రాసిన మొత్తం వ్యాసం యిక్కడ తిరిగి కనిపిస్తుంది. అంత నచ్చింది మీ యీ కథా అంతరంగం. వొక లోతైన భావాన్ని లేయ్యర్స్ గా చదివినప్పుడు కలిగే సంతోషం దిగులుతో సమ్మిళితమైయింది మనసు. నచ్చింది బోలెడంత వంశీ గారు.

  3. తిరుపాలు says:

    /ఎప్పుడో నెలకో రెణ్ణెల్లకో ఒకరోజు అకస్మాత్తుగా ఓ పేరులేని విషాదమో, హాయో, ఆశ్చర్యమో, అనుభూతో లాగిపెట్టి ఫటేల్మని కొట్టెళ్ళినప్పుడు, ఎంత తాగినా కిక్కెక్కనితనంలాంటి అతిజాగరూక జాగృదవస్థలాంటి ఏదో మిస్టిక్ వాసన కళ్ళకి తగిల్నప్పుడో, అదిగో అప్పుడు మాత్రమే నేనేదోటి రాస్తాను, ఏదోటి.. కథో, కవితో, సొల్లో, మరేదో.. అప్పటిదాకా మర్చిపోయిందేదో గుర్తొస్తుంది ఆ పవిత్రక్షణాల్లో, అప్పటిదాకా పోగొట్టుకున్న ఆత్మపదార్ధమేదో అర్ధమైనట్టు అనిపిస్తుంది ఆ విచిత్ర క్షణాల్లో.. /
    బావుదoడీ మీ అనుభవం. మీ శైలిలో నాకు వడ్డెర చoడీ దాస్ గారు కొంచెo, ఆంప శయ్య నవీన్ గారు కనిపిస్తున్నారు. నాది అతిశయం అయితే ఏమీ అనుకోవద్దు.

  4. Mythili abbaraju says:

    Neil Gaiman గొప్ప చదువరి, magnanimous writer.

  5. buchireddy gangula says:

    యీ – వ్యవస్థ లో —నేటి తెలుగు సాహితీ లోకం లో
    పేరు కోసం
    గుర్తింపు కోసం
    అవార్డ్స్ కోసం — రాసే వాళ్ళు లేకపోలేదు —
    2 పుస్తకాలు పబ్లిష్ చేసుకోగానే — బుచ్చి బాబు — తిలక్ —కాలోజి గార్ల లా —
    పోజు లు పెడుతూ —– గ్రూపులు — రాజకీయాలు — ఆధిపత్యాలు చేస్తూ —-
    త మంతా తెలివికల వాళ్ళు — లేరనుకుంటూ
    అమెరికా అయినా అమలాపురం అయినా — అదే తిరు — అదే పోకడ లు ???అదే వ్యాపారం ??
    ఎందుకో ?? దేనికో ???
    చెంచా గిరి — సొల్లు నాకుడు —బత్రాజు తనం — ఒక్క రాజకీయాల్లో నే కాదు —సినిమా ప్రపంచం లో — సాహితీ లోకం లో కూడా ఉంది ??
    అవసరమా ?????????????????????
    వంశీ అన్న — చక్కాగా రాశారు
    ——————————————-
    బుచ్చి రెడ్డి గంగుల

  6. ఒక ధీర్ఘకవిత లాంటి స్వగతం,.
    ఎబిలిటి విత్ ఫ్రెష్నెస్ & ఫ్రస్టేషన్,.
    వంశీ నడుస్తుండు నీదైన లయతో.,

  7. Chakrapani Ananda says:

    ఈ కథల్ని అచ్చులో చూసుకోవాలనే కోరిక కూడా స్వార్ధపూరితమైందే, చదివిన వాళ్ళల్లో నాలాంటి ఒక్కరైనా ఉండకపోతారా అని,
    అంతే మరేంలే.. ఇప్పుడున్న విపరీత పరిస్థితుల్లో సాహిత్యం నుంచి ఆశించేదికూడా పెద్దగా ఏంలే, ఒక్కో మనిషీ ఒక్కో సముద్రం కప్పుకున్న దీవయ్యాకా..ఎవరికీ ఎవరూ ఏమీ కాని శాపగ్రస్తపు ఒంటరులం మనమని మాటిమాటికీ రుజువౌతున్న నేటికాలంలో, అసలు బతికి ఉండడమే పెద్ద అచీవ్మెంట్ గా నిర్మొహమాటంగా నిరూపితమౌతున్న ఈ రోజుల్లో, అంతే..మరేంలే.. ఆశించిన ఆశాభంగం..

    చాలా బాగుంది వంశీ! కీపిట్అప్.

  8. భవాని says:

    బాగుంది…. మనలోకి మనం తొంగి చూసుకునేటప్పుడు చుట్టూ ఉన్నవారిని కూడా పరికించి రెండు చురకలు విసరాలనిపించడం మానవ నైజమేమో:)
    రచయితల మనోగతాలతో పాటుగా వారికి నచ్చిన వారి కథ కూడా ప్రచురిస్తే బాగుంటుంది .

  9. వంశి…నీ ప్రతీ లైనులో భావమూ నాకు తెలిసినదే అయినా, ఎంత బాగా వ్యక్తీకరించావు!!!!!!!! :) :)

  10. mallik arjun says:

    మీ రాతలన్నీ పుస్తకంగా రావాలని కోరుకుంటున్నాను.
    “అకస్మాత్తుగా ఓ పేరులేని విషాదమో, హాయో, ఆశ్చర్యమో, అనుభూతో లాగిపెట్టి ఫటేల్మని కొట్టెళ్ళినప్పుడు” ఎలా ఉంటుందో మీ రచనలలా ఉంటాయ్.

  11. Rajendra prasad Chimata says:

    నిజాయితీ గా నిర్మొహమాటంగా అంతరంగాన్ని ఆవిష్క రించారు

  12. Jagadeeshwar Reddy Gorusu says:

    గొప్పగా విశ్లేషించావు.
    మనకు తెలిసిన వాళ్ళు ఏదయినా రాసారంటే ఒక లుక్కేసాం . మనకు దగ్గరయిన వాళ్ళు రాసారంటే చదవాలనుకుంటామ్. మనసుకు దగ్గరయినవాళ్ళు రాస్తే ఏమి రాసుంటారబ్బా అని అలా తిప్పుతాం. మనసు లోపల తిష్ట వేసుకున్న వాళ్ళు ఏమి రాసినా గుండెకు హత్తుకుని , ప్రపంచాన్ని మర్చిపోయి , ఊపిరి బిగబట్టి చదువుతాం – వంశీ ఇప్పుడు నేను ఇలాగే చదివా.
    నీవు కథ కవిత నానీ గీనీ వ్యాసం గీసం ఏం రాసినా నేను చదవకుండా ఉండలేను.
    బహిరంగంగా నీ అక్షర ప్రేమికుల్లో ఒకడిని అని చెప్పడానికి ఏమాత్రం సంకోచించ లేని స్థితి కల్పించావు – గొరుసు

  13. “వంశీధర్ `రాత`” చాలా బాగుంది! ఆయన వ్రాశిన ప్రతి వరుసా మనందరినీ ప్రశ్నిస్తూనే ఉంది! మనమెంతకున్నాం…అసలు పనేంటి అని! బలంగా , అర్థవంతంగా అందరి బాధ్యతలను గుర్తు చేస్తున్నట్టు అనిపిస్తున్నాయి…. :-)

  14. mohan rushi says:

    dhummu!

  15. ఆర్.దమయంతి. says:

    అప్పటికీ ఇప్పటికీ జీవిక కోసమో, జీవనం కోసమో, అసంకల్పితంగా చాలానే ఆత్మ పదార్ధాన్ని పోగొట్టుకుని ఉన్నప్పటికీ, ఎప్పటికప్పుడు ఙ్నాపకాల్లో పునర్నిర్మితమౌతుండే స్వకీయ నీడల రూపాల కలల్ని గుర్తుపెట్టుకోవాలంటే ..
    ఇంకా సులువుగా చెప్పి వుంటే బావుండేదేమో!..మీ కథలు చదివేందుకు వీలుగా ఇక్కడ లింక్ ఇవ్వొచ్చేమో కదూ?

  16. mercy margaret says:

    నేను బీ ఇట్లానే అనుకుంటున్నా – అప్పుడప్పుడు అన్నీ త్యజించే ఒక యోగి కనిపిస్తాడు బాబు నిన్ను చూస్తుంటే నాకు .. ” అంతే మరేంలే.. ఇప్పుడున్న విపరీత పరిస్థితుల్లో సాహిత్యం నుంచి ఆశించేదికూడా పెద్దగా ఏంలే, ఒక్కో మనిషీ ఒక్కో సముద్రం కప్పుకున్న దీవయ్యాకా..ఎవరికీ ఎవరూ ఏమీ కాని శాపగ్రస్తపు ఒంటరులం మనమని మాటిమాటికీ రుజువౌతున్న నేటికాలంలో, అసలు బతికి ఉండడమే పెద్ద అచీవ్మెంట్ గా నిర్మొహమాటంగా నిరూపితమౌతున్న ఈ రోజుల్లో, అంతే..మరేంలే.. ఆశించిన ఆశాభంగం..

Leave a Reply to mohan rushi Cancel reply

*