కుక్క అంటే ఏమిటి?

1

ఈ నడుమ మా చిన్ని పాప తరుచూ ప్రతీ దానికీ కుక్క అనే పదాన్ని చేరుస్తుంది

 

మూడేళ్ళ పిల్ల, బొత్తిగా భాషాపాటవం తెలియనిది

ఇప్పుడిప్పుడే బడికి పోతూనో (హతవిధీ) పోబోతూనో

పోలేకనో, పోకుండా ఉండలేకనో ( దాని చేతుల్లో ఏముంది ) కింద పడి దొర్లి, కాళ్ళూ చేతులను నునుపాటి గట్టి గ్రానైట్ బండ మీద

ఇష్టారాజ్యంగా తపతపా విదిలించి కొడుతూ ఎక్కడ దెబ్బ తగులుతుందేమోనని గుండెలదరింపజేస్తూ

తన రోజు వారీ మాటల సమయాలలో అంటుంది కదా-

 

ఎక్కడికి పోయినావే కుక్కా, కుక్క నాకొడకా-

 

“ఇంక ఏమి తింటవ్ తల్లీ?”

కుక్క తింట-

 

“ఇట్లయితే ఎట్లనే?”

కుక్కనే-

dog

2

 

ఇంతకూ కుక్కా అనేది ఏ భాషావిశేషం?

 

పదే పదే మాటల తొక్కిసలాటలలో ఇరుక్కపోయిన భాషా క్రీడగానో, క్రీడించే సమయాలోకి సంభాషణగా కరిగే భాషగానో

మాటలుగా, వాక్యాలుగా అర్థాలు చెదిరి, అర్థాలతో పాటుగా సన్నివేశమూ అందలి పాత్రలూ చెదిరి

ఎటూ పొసగనీ లేదా ఇమడని ఉధ్విగ్నతలలోనికి పొగమంచుగా పాకి

విఫల యత్నమై బ్రహ్మ రంద్రాన్నిపగలగొట్టుకొని శూన్యంలోనికి పెగిలే నిట్టూర్పులా ప్రయత్నిస్తున్నపుడు

 

మనుషుల రణగొణ ధ్వనులలో మాటల బండరాళ్ళపై పడి

నాకూ కాళ్ళూ చేతుల్ని టపటపా కొట్టుకోవాలనిపిస్తుంది

 

కుక్క మాటలు

కుక్క సంభాషణలు

కుక్క కవిత్వమూ అని రాయాలనిపిస్తుంది.

avvariఅవ్వారి నాగరాజు

 

మీ మాటలు

 1. పసి పాపల అన్యాపదేశ, అమాయక స్థితి … జ్ఞానం తెలిసిన పరిణితి చెందిన మనిషికీ కూడా అప్పుడప్పుడూ అనుభూతికరించటం ఎంత సహజం! ఆ స్థితిని కవిత్వం చేయటం కాకుండా అందులో ప్రవేశపెట్టిన వ్యంగ్యం ఎంత నిజం! కొత్త పుంతలు తొక్కుతుంది మీ కవిత్వం.

 2. మెర్సీ మార్గరెట్ says:

  నాగరాజు గారు ఇందుకే మీ పేరు కనబడగానే వదలకుండా చదివేయాలనిపిస్తుంది మీ కవిత్వం..
  కుక్క మాటలు

  కుక్క సంభాషణలు

  కుక్క కవిత్వమూ అని రాయాలనిపిస్తుంది. :) :) దీని వెనక పరమార్ధం తెలియదు కాని .. నాకు మాత్రం అర్ధంయ్యేంతవరకు మాత్రం అర్ధమయ్యింది సుమీ

 3. బివి లక్ష్మీ నారాయణ says:

  శ్లేష.తో చెప్పినా…మనసులోని భావాల గాఢత స్పష్టమవుతోంది….సంధ్య వేళ మసక చీకటిలా వుంటేనే కదా కవిత్వానికి అందం

 4. ugandhar sharma says:

  కాదేది కవితకనర్హం అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ, కుక్కపిల్ల, వేయినోక్క రాగల సంగమం మమతల కలబోత చిన్నపిల్లల తత్త్వం. కాసేపు అమ్మ కాసేపు నాన్న ఇప్పుడు కుక్కపిల్ల. అద్భుతం నాగరాజు గారు.

 5. అన్న చంపుతున్నావ్

 6. వ్యక్తీకరణ బాగుంది

మీ మాటలు

*