PK:చీకటి మత గురువులపై చెర్నాకోల

imagesHJG8UATD

ఆ మధ్య ఆఫీసులో ఒక స్నేహితుడు నాకు సంగీతమంటే ఇష్టమంటే యే సంగీతం ఇష్టం ఏ సంగీత కారులు ఇష్టం అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. ఆయనకూ సంగీతమంటే ప్రాణమని ఉపోద్ఘాతమిస్తూ ! నాకు హిందుస్తానీ అంటే చాలా ఇష్టం – ముఖ్యంగా బడే ఘులాం అలీ ఖాన్ అంటే అని నేను చెప్ప గానే నొసలు చిట్లించి యేం ఇక గాయకులే కరువా? ఆయన తప్ప మరొకరు లేరా? అంటే యెందుకు లేరు ఉస్తాద్ హమీద్ అలీ ఖాన్ , ఉస్తాద్ రషీద్ ఖాన్ ఉస్తాద్ అమీర్ ఖాన్ అని నేను పేర్లు చెప్తుంటే నన్ను ఆపేసాడు. వద్దు వద్దు ఇంక ఆపు – ఇంకెవరూ లేరా అంటే అప్పుడు కానీ నాకు తట్ట లేదు – ఉన్నారు పండిట్ భీం సేన్ జోషి పండిట్ జస్రాజ్ పండిట్ శివకుమార్ శర్మ అంటూ పేర్లు చెప్తుంటే ఆయన ముఖం కొంచెం వికసించింది. అయినప్పటికీ ముఖం గంభీరంగా పెట్టుకుని నాకందుకే ముస్లిం లు పాడే హిందుస్తానీ సంగీతమన్నా, ఖాన్ లు  డామినేట్ చేసే  హిందీ సినిమాలన్నా అసలు ఇష్టం ఉండదు. మొత్తం వాళ్ళే డామినేట్ చేస్తున్నారు అంటూ అసహనం ప్రదర్శించాడు. అదేమిటీ అవడానికి ముస్లిం లైనా హిందుస్తానీ సంగీతాన్ని ఔపోసన పట్టి భజనలు కూడా పాడుతున్నారు కదా అన్నాను. యేమో నాకసలు పడదు. హాయిగా కర్ణాటక సంగీతమే బాగుంటుంది హిందుస్తానీ అంటే నాకసలు పడదు అని చివాల్న లేచి వెళ్ళిపోయాడు.

ఒక భిన్నమైన వాతావరణంలో ఉన్నాం మనమిప్పుడు ముఖ్యంగా గత యేడాది కాలంగా, పార్లమెంటు యెన్నికలు జరిగి బీ జే పీ ఆర్ యెస్సెస్స్ శక్తులు అధికారంలోకి వచ్చాక! మనుషుల్ని ఫలానా అని ముద్ర వేసింతర్వాత కానీ వారి టాలెంటుని కానీ విజయాల్ని కానీ అపురూపమైన వారి వ్యక్తిత్వాల్ని చూడడానికి నిరాకరిస్తున్న వాతావరణం. ఒక సంగీత కారుడేమిటి, ఒక నటుడేమిటి ఒక సినిమా యేమిటి యేదైనా అది ఫలానా మతానికి చెందిన వారయితే దాని పట్ల యేహ్య భావం లేదా ముభావం ప్రకటించడం జరుగుతున్న వాతావరణం. ముఖ్యంగా ఇది మతానికీ, మతాచారాలకు , మత గురువులకు, మత సంప్రదాయాలకు సంబంధించిందయితే అది మరీ సున్నితమైన అంశంగా మారి వాగ్వివాదాలకు, ఘర్షణలకు దారి తీయడం జరుగుతోంది.

మతం మీద, దేవుడి మీదా, మత సంప్రదాయాలమీద, మత గురువుల మీదా విమర్శ చేసేటప్పుడు చేసే విమర్శ యేమిటి అది సరయిందా సవ్యమేనా కాదా అందులో నిజమెంత కల్పితమెంత అనే చర్చ కాకుండా విమర్శ చేసిన వాడెవడు, వాడి మతమేమిటి, వాడి కులమేమిటి, వాడి ఫలానా మతం మీదనే యెందుకు చేసాడు, వేరే మతాల మీద యెందుకు చెయ్యలేదు – మిగతా మతాలు సవ్యంగా ఉన్నాయని వాడి ఉద్దేశ్యమా లేక విమర్శ చేస్తే ఆయా మతాల వారి ఊర్కోరు గనక అన్ని విమర్శలనీ  గంగిగోవుల్లా మనమే భరిస్తున్నాం కాబట్టి మనమే తేరగా దొరికామా వాడికి – అంటూ అనేక భిన్న కోణాల్లో విమర్శ చేసిన వాడి మీద దాడి చేస్తారు. ఈ విమర్శ అంతా మనల్ని తెగిడి వేరే మతాల వారిని పొగడడానికీ నెత్తికెక్కించుకోవడానికీ మాత్రమే అని తేల్చి పారేస్తాం.

యింతకీ ఈ చర్చంతా ఈ మధ్యే విడుదలయిన పీకే అనే సినిమా గురించి అని వేరే చెప్పనక్కరలేదనుకుంటా!

పీ కే సినిమాలోకి వెళ్ళే ముందు 2012 లో వచ్చిన మరో సినిమా గురించి చెప్పుకోవాలి. ‘ఓ మై గాడ్ ‘ అనే పేరుతో వచ్చిన సినిమా దేవుని పేరు మీద జరిగే వ్యాపారాల మీదా , తంతుల మీదా, అర్థం పర్థం లేని మత సంప్రదాయాల మీద తీవ్రమైన విమర్శలే చేసింది. ఆ సినిమా లో పరేష్ రావల్ అనే నటుడు ప్రదాన పాత్ర పోషించాడు. ఉమేష్ శుక్లా దర్శకత్వం వహించాడు. అయితే అన్ని విమర్శలు హేతువాద దృక్పథంతో చేసిన OMG సినిమా ఆసాంతం కృష్ణ భగవానుని పాత్ర పై ఆధారపడి నడుస్తుంది. బహుశా తన హేతు వాద విమర్శలకు, మత గురువులపై, సంప్రదాయా లపై  విమర్శలకు తీవ్రమైన వ్యతిరేకత వస్తుందనేమో కృష్ణుని పాత్రని తోడు తెచ్చుకున్నా రు.

అయితే సినిమా గురించి సర్వత్రా ప్రశంసలూ పొగడ్తలూ  సద్విమర్శలూ మాత్రమే వినబడ్డాయి, నటుడు  పరేష్ రావల్ పై ప్రశంసల జల్లు కురిసింది. ఇప్పుడు మూడేళ్ళ తర్వాత దాదాపు అట్లాంటి కథాంశం తోనే (అట్లా అంటే పీకే సినిమాని చిన్నది గా  చేసి  చూసినట్టు అవుతుందేమో ) వచ్చిన సినిమా పీ కే,  ఓ యెం జీ ఎక్కడ ఆగిపోయిందో  అక్కడ్నుంచి విమర్శని ముందుకు తీసికెళ్ళింది, యెక్కడ ఓ యెం జీ అధైర్య పడి విఫలమైందో  అక్కడ ధైర్యం చేసి విజయం సాధించింది (పూర్తి అని నేననను – కానీ ఓ యెం జీ కన్న ఒక పది మెట్లు ఎక్కువే) యేది చెప్పడానికి ఓ యెం జీ కృష్ణున్ని యెంచుకుందో దాన్ని మించి చెప్పడానికి పీకే మనిషిని యెంచుకుంది! అందుకే పీకే ఓ యెం జీ కన్నా చాలా అడుగులు ముందుకేసింది . అయితే మరి యెందుకు పీకే కు ఓ యెం జీ కన్నా నిందలు, తిట్లూ, శాపనార్థాలూ  ఎక్కువ వస్తున్నాయి. యెందుకు పీకే గురించి చర్చ మోడరేట్ గా జరగడం లేదు – అయితే ఒక చివర లేదూ మరో చివర అనే తీవ్ర స్థాయిలో యెందుకు జరుగుతోంది. ఓ యెం జీ వచ్చినప్పుడు యెవరూ ఆ సినిమాలో ఒక ఫలానా మతాన్నే యెందుకు విమర్శించారు యితర మతాలనెందుకు విమర్శించలేదు అని యెవరూ అడిగినట్టు గుర్తు లేదు – పీకే ను మాత్రం యెందుకు యితర మతాలని విమర్శించలేదు అని తీవ్రంగా దూషిస్తున్నారు.

నా మట్టుకు నాకు కొన్ని  కారణాలు కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. మొదటిది పరేష్ రావల్ మతం, అతని రాజకీయ విశ్వాసాలు, అతని రాజకీయ పార్టీ – రెండోది –పోయిన యెన్నికల్లో ఆ పార్టీ భారీ మెజారిటీ తో గెలిచి అధికారాన్ని చేజిక్కించుకోవడం జరిగింది. గత యెన్నికల విజయం తర్వాత భారత దేశ రాజకీయాలని శాసిస్తున్న అభిప్రాయాలు విశ్వాసాలు, యెటువంటి విమర్శలనూ యెంతమాత్రమూ సహించలేని ఒక తీవ్రమైన అప్రజాస్వామిక పరిస్థితి  దేశంలో భౌతికంగానూ, ప్రపంచ వ్యాప్తంగా దేశీయుల virtual world లోనూ నెలకొని ఉన్నది. తామనుకున్న అభిప్రాయాలపై  యెటువంటి  విమర్శను కానీ చర్చను గానీ సహించక దాడులకు దిగే ఒక అప్రజాస్వామిక పరిస్థితి. ముఖ్యంగా ఒక మతం వారిపై ప్రకటిత అప్రకటిత ద్వేషాలతో రగిలిపొతూ వారిని తీవ్రంగా isolate చేసే పరిస్థితి. అందుకే పీకే సినిమా వెనుక ప్రదానంగా ఉండి, తెరపై ఆ పాత్ర పోషించిన ఆమిర్ ఖాన్ ముస్లిం కావడం వల్లా సినిమా పై విమర్శలూ దాడులూ ప్రధానంగా ఆ కోణం నుండే జరుగుతున్నాయి.

యింతకీ పీకే సినిమా లో ఉన్నదేమిటి? అందులో చిత్రించిదేమిటి, చర్చించిదేమిటి? యెందుకింత రభస జరుగుతోంది? స్థూలంగా పీకే కథ ఇది – మనుషులు నివసించడానికి అనువైన మనలాంటిదే మరో గ్రహం (కొన్ని కాంతి సంవత్సరాల దూరం లో ఉన్నది) నుండి ఒక అంతరిక్షనౌక లో ఒక గ్రహాంతరవాసి భూమి మీద అడుగు పెడతాడు. అడుగు పెట్టీ పెట్టడం తోనే తాను వచ్చిన అంతరిక్షనౌక ను తిరిగి పిలవడానికి ఉపయోగించే రిమోట్ కంట్రోల్ చోరీ అవుతుంది. యిక తర్వాత ఆ గ్రహంతర వాసి తన రిమోట్ కంట్రోల్ ని తిరిగి సాధించుకోవడానిక్ చేసే నానా ప్రయత్నాలే సినిమా కథ.

తన గ్రహంపై బట్టలు లేకుండా నగ్నంగా ఉండే గ్రహాంతర వాసి భూమ్మీద మనుషుల్ని చూసి బట్టలు  కట్టుకోవడం తెల్సుకుంటాడు. పోయిన తన రిమోట్ కోసం దేవుళ్ళని ప్రార్థించాలనీ , అందుకు భూమ్మీద అనేక దేవుళ్ళున్నారనీ  , ఆయా దేవుళ్ళకు వేర్వేరు నివాసాలున్నాయని (చర్చి, గుడి, మసీదు వగైరా ), ఆయా దేవుళ్ళకు బ్రోకర్లు, మేనేజర్లు అనేకం ఉన్నారని, ఆయా దేవుళ్ల దగ్గరికి చేర్చడానికి అనేక మార్గాలూ మతాలున్నాయని అర్థం చేసుకుని తన ప్రార్థనలు మొదలు పెడతాడు. అన్ని ప్రార్థనలూ విఫలమౌతాయి. యే  దేవుళ్ళూ ఆయన ప్రార్థనలు వినరు. యింక విసుగొచ్చి, నిరాశ నిస్పృహ లకు లోనయి దేవుళ్ళు కనబడడం లేదు అని కరపత్రాలు పంచుతున్నప్పుడు జగ్గు అనే ఒక టీ వీ రిపోర్టర్ కు పరిచయమౌతాడు. ముందు యితని కథ నమ్మక పోయినా , చేతులు పట్టుకుని మనసుల్ని చదవగలనని నిరూపించిన జగ్గు  తర్వాత అతనికి సాయం చెయ్యాలనుకుంటుంది. పోయిన రిమోట్ కంట్రోల్ తన కుటుంబం అమితంగా గౌరవించి కొలిచే తపస్వి అనే మత గురువు తనకు హిమాలయాల్లొ దొరికిన శివుని గజ్జె అని ప్రచారం చేసుకోవడం చూసి యెట్లాగయినా దాన్ని తిరిగి పీకే కి ఇప్పించాలనుకుంటుంది. అమాయకత్వం తో పీకే వేసే సూటి ప్రశ్నలు మతగురువులు దేవున్ని చేరుకోడానికి రాంగ్ నంబర్లని వాటిని వ్యతిరేకించాలని మీడియా ద్వారా  ఒక ఉద్యమం లేవదీస్తుంది.

అయితే జగ్గు తాను బెల్జియం లో చదువుకునేటప్పుడు పాకిస్తాన్ కు చెందిన ఒక ముస్లిం యువకున్ని ప్రేమిస్తుంది. తన కుటుంబ గురువు అయిన తపస్వి ముస్లిం  మతానికి చెందిన వారంతా నమ్మక ద్రోహులు  కాబట్టి ఆ యువకుడు కూడా ఆమెకు ద్రోహం చేస్తాడని చెప్పడం నిజంగానే తనకు ద్రోహం జరగడం ఆమె మనసులో చెరగని ముద్ర వేస్తుంది. సినిమా చివరి ఘట్టానికి ముందు తీవ్రవాదుల (ముస్లిం) బాంబు దాడిలో తనకు తొట్ట తొలుత ఆశ్రయమిచ్చిన భైరన్ సింగ్ తన రిమోట్ చోరీ చేసిన వ్యక్తీ మరణించడంతో తన చివరి ఆశా కోల్పోయిన పీకే చివరి ఘట్టం లో టీవీ స్టూడియో లో తపస్వి తో తలపడతాడు. దేవుళ్ళనీ , ‘ధర్మాన్నీ’  రక్షించే మహా బాధ్యత మత గురువులు తీసుకోవాల్సిన అవసరం లేదనీ, అన్నిటికన్న మానవత్వం గొప్పదనీ, దాన్ని కాపాడాలనీ, యెవడూ ఈ భూమ్మీద ఫలానా మతస్తుడనే స్తాంపుతో పుట్టరనీ, అట్లే ఫలానా మతస్తులంతా మోసగాళ్ళో నేరస్తులో కారనీ అందరూ ఆ సృష్టికర్తముందు సమానమనీ, ఆ సృష్టికర్త తన రక్షణ తాను చూసుకుంటే మనుషులు మానవీయతను కాపాడాలనే సందేశంతో ముగుస్తుంది.

మొత్తం సినిమాలో పొరపాట్లు లేవని కాదు . కొంత నాటకీకరణ, కొని నమ్మశక్యం కాని కల్పనలు, సినిమాటిక్ స్వేచ్చలూ, డాన్సింగ్ కార్ల లాంటి వెకిలి తనమూ ఉన్నది. సినిమా హాస్య ప్రదానంగా సాగినా అటువంటివి సినిమాని పలుచన చేస్తాయి. ఒక వేశ్య దగ్గర 6 గంటల్లో భాష మొత్తం నేర్చుకున్న(సినిమాలో తీసుకున్న ఇదో  స్వేచ్చ) పీకే కాండోమ్స్ గురించి తెలవనట్టు ప్రశ్నించడం వెకిలితనానికి పరాకాష్ట. అయినప్పటికీ  ఈ లోపాలనన్నింటిని అధిగమించి సినిమాని ఉన్నత స్థానానికి తీసుకెళ్ళింది దాని కథాంశం. దాదాపుగా ఇదే కథాంశంతో ఓ యెం జీ వచ్చిన పీకె ఆ సినిమాని దాదాపు అన్ని అంశాల్లోనూ మించిపోయింది. పాత్ర చిత్రీకరణే ప్రదాన తేడా! పీకే లో ప్రధాన పాత్ర ఒక అమాయకుడు. ఈ లోకం పోకడలు తెలువని ఒక పసివాడి లాంటి వాడు. ప్రశ్నించడం, హేతుబద్ధంగా ఆలోచించడం, మానవీయంగా ప్రవర్తించడం మాత్రమే అతనికి తెలుసును.

ఓ యెం జీ లో ప్రదాన పాత్ర ఒక వ్యాపార వేత్త – వ్యాపార దృష్టి తోనీ దేవుళ్ళనీ దేవుళ్ళ పేర్ జరిగే తంతునీ వ్యతిరేకిస్తాడు. పీకే లో కేవలం ఒక మతం పైననో ఒక దేవుని పైననో మాత్రమే విమర్శ చేయలేదు. అందరు దేవుళ్లనూ అన్ని మతాలనూ హేతుబద్దంగా ప్రశ్నించారు. దేవుళ్లకి బ్రోకర్లుగా మేనేజర్లుగా తమను తాము చెప్పుకుంటున్న వారిని విమర్శించారు. దేవునితో మాట్లాడుతున్నాము, మాట్లా డుతాము మాట్లాడిస్తాము అని,  మనుషుల భయాలనీ, అభద్రతలనీ  మూఢ భక్తి గా మార్చుకుని కోట్లకు పడగలెత్తుతూ,  రాజకీయ పలుకుబడులతో  అండదండలనీ, భోగభాగ్యాలనూ  అనుభవిస్తూ భారతీయ సమాజం శాస్త్రీయంగా హేతుబద్దంగా ముందుకు పోకుండా అంధకారం లో కి నెట్టి వేస్తున్న నియంతల్లాంటి మతగురువులను యెండగడుతుందీ సినిమా! వారిని గుడ్డిగా నమ్ముతున్న కోటానుకోట్ల భక్త జనానికి కనువిప్పు కలిగించే ప్రయ్నం చేస్తుందీ సినిమా! ఆ ప్రయత్నం లో సినిమా సఫలీకృతమయ్యిందనే చెప్పాలి.

అయితే సినిమా మీద వస్తున్న విమర్శలు చిత్రంగా ఉన్నయి. ఒకటి ఆమిర్ ఖాన్ ముస్లిం కావడం వల్ల హిందూ మతాన్ని విమర్శించాడనీ (సినిమా దర్శకుడు రాజ్ కుమార్ హీరానీ, నిర్మాత విధు వినోద్ చోప్రా  హిందువులే మరి) , సినిమా లో పాకిస్తాన్ కు చెందిన ఒక ముస్లిం యువకున్ని మన దేశానికి చెందిన మతగురువు కన్న యెక్కువ నమ్మకస్తునిగా చూపించి మన మతాన్నీ ప్రజలకు ఆరాధ్యులైన మతగురువులని మన ‘శత్రు దేశమైన’ పాకిస్తానీయుని కన్నా హీనంగా చూపించడం ఘోరమైన నేరమనీ మరో  విమర్శ. హిందూ దేవుళ్ళని, విగ్రహారాధనీ తూలనాడాడని, ముస్లింలని క్రైస్తవులనీ యెమీ విమర్శించలేదని యింకో విమర్శ! యివేవీ నిజాలు కావు.

అయినా నిజమైన మానవత్వం యెక్కడున్నా దాన్ని స్వీకరించాలనే కనీస యింగిత ఙ్నానాన్ని మన పొరుగు దేశమ్మీద ఉన్న ద్వేషం మింగేయడం విచారకరం. ప్రతి దాన్నీ మత దురహంకారమూ  , విమర్శ సహించలేని చాందసవాదమనే  నల్ల కళ్ళద్దాలని పెట్టుకుని చూస్తే అట్లానే అనిపిస్తుంది. అయితే కొన్ని సార్లు అమాయకత్వంతోనో  , వినికిడి ఙ్నానంతోనో కూడా అటువంటి అభిప్రాయం కలగవచ్చు. మన మతాన్ని విమర్శించారు అన్న కోపం కన్నా వేరే మతాలను విమర్శించలేదు అనే క్షోభ సరైంది కాదు. అది మనల్ని ఒక్క అడుగు కూడా ముందుకు వేయనీయదు. పైగా వెరే మతాలు వెనుకబడి ఉన్నాయి, మూర్ఖంగా ఉన్నాయి కాబట్టి మేమూ  అట్లే యింకా వీలయితే అంతకన్నా హీనంగా ఉండడమే బాగుంటుంది అనుకుంటే అది  మనం హాయిగా మరింతగా తిరోగమించడానికి దోహదం చేస్తుంది.

సినిమాలో ప్రొజెక్ట్ చేసి, చర్చించిన అంశాలమీద దృష్టి వుంచి చర్చ జరిగితే అది మన పొరపాట్లని సరిదిద్దుకోవడానికీ మానవీయంగా, శాస్త్రీయంగా, హేతుబద్దంగా  ముందుకు పోవడానికి ఉపయోగబడుతుంది. లోపాల్ని యెత్తి చూపే చూపుడు వేలు యెటువంటిది అది యెవరిది అనే శుద్ద చాందస తర్కంలోనే మునిగిపోతే మనకు ఆ చూపుడు వేలే తప్ప మన లోపాలెప్పుడూ మనకు కనబడవు – మనల్ని మనం యెప్పుడూ సరిదిద్దుకునే అవకాశమూ రాదు యెప్పుడూ మన చూపుడు వేలు వేరే వాళ్ల వైపు ఎత్తి చూపడం తప్ప!

-నారాయణస్వామి వెంకట యోగి

swamy1

మీ మాటలు

 1. ఇవాళే FBలో పీకే మీద ఓ విమర్ష చూశాను. అందులో సినిమాను మెచ్చుకుంటూనే హిందూమతగురువులనే ఎందుకు విమర్శించారు, ముస్లిం ముల్లాలని ఎందుకు చేయలేదు అన్న పాయింటు లేవదీశారు.

  నాకేమనిపించిందంటే అవతల తుప్పు పట్టిన ముస్లిం చెంబు వుంటే నా హిందూ చెంబునే ఎందుకు తోముతున్నాడు అన్నట్లు. ఎవరైనా విమర్షలు చేస్తే బాగుపడేది హిందూమతమే కదా! చేయకనే, ఎవ్వరినీ చేయనివ్వకనే కదా అవతలి చెంబు తుప్పుపడుతున్నది. ఎంతమంది తోమితే చెంబు అంత తళాతలా మెరుస్తుంది!

 2. మీ అభిప్రాయమే నా అభిప్రాయంకూడా. OMG ఒక పిరికి సినిమా. దాంతో పోల్చితే తెలుగులో ఈమధ్య వచ్చిన కార్తికేయలోనే హేతువాదభావాలు ఎక్కువగా ఉన్నాయి (except for the very last dialogue). OMGతో పోల్చితే PK చాలా ధైర్యవంతమైన సినిమా. కాకుంటే సినిమా చివరిలో అసలు చర్చను ప్రక్కనపెట్టి, ప్రేమికుల్నీ, కుటుంబాన్నీ కలపడంతో సినిమా ముగించడం సినిమాను ధీంనుంచి ప్రక్కకు తీసుకువెళ్ళిపోయింది. కొన్ని లోపాలూ, కొన్ని template scenes లేకుంటే బాగుండేది.

  ఒక పుస్తకంలో ఒకమాట చదివాను. చిన్నపిల్లలకున్న ఉత్సాహంతో, inquisitivenessతో మతం, దేవుడు అన్న భావనల్ని ప్రశ్నిస్తూపోతే, దేవుడిగురించి, మతం గురించి చెప్పే కబుర్లను మనం నిజజీవితంలో ప్రతిరోజూవాడే లాజిక్‌తో ఆలోచించడం మొదలుపెడితే, అన్నిమతాల పునాదులూ కదిలిపోతాయి. కానీ ఆపనిచేస్తే ధైర్యం ఎదిగినవారికి ఉండదు. ఎందుకంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే మనం ఎక్కడ లాజిక్‌వాడాలో ఎక్కడ వాడకూడదో తల్లిదండ్రులు training ఇచ్చేస్తారు, brain washing చేసేస్తారు. దేవుడు నిజంగా ఉన్నాడనుకున్నా విశ్వం యొక్క పరిమాణాన్ని గురించి (15,000,000,000ల కాంతిసంవత్సరాల వ్యాసార్ధం!!!) కనీస అవగాహన ఉన్నవాళ్ళు, అలాంటి విశ్వానికి అధిపతైన దేవుడు, అంతపెద్ద విశ్వంపరిమాణంతో పోల్చితే ఒక quarkకన్నా చిన్నదైన భూమ్మీది ఒక జాతిలోని కొందరి బాగోగులు పట్టించుకుంటూ, వారి పొగిడితే పొంగిపోయి వరాలిస్తాడని అనుకోవడం sheer nonsense. బహుశా మనం సందర్శించిన విశ్వపు తునకలో మనకు మనల్నిమించిన బుధ్ధిజీవులు తారసపడలేదుకాబట్టి మనమేదో special అన్న గర్వంలోంచి ఇలాంటి egoistic భావనలు పుడతాయేమో! నాకెందుకో ఈ సినిమాలో “భూమి ధూళికణంకన్నా చిన్నది”, “మనకు ఎవరూ సహాయం చెయ్యరు. మనుషులుగా మనకు మనమే సహాయం చేసుకోవాలి”, “ఉన్న అందరు దేవుళ్ళలో, ఎవరు నిజమైన దేవుడు?” అని చెప్పే లేదా అడిగే సన్నివేశాలు Carl Sagan నుంచి inspired ఏమో నని అనిపించాయి. We need more movies like PK. But then, సినిమా చూసినవాళ్లలో ఎంతమంది దాన్ని బుర్రకెక్కించుకుంటారు? ఎక్కించుకునుంటారు? ఆలోచించేవారెవ్వరు? తరువాతిరోజు గుడికెళ్ళి ప్రమోషన్లకోసమో, పరీక్షల్లో పాసవ్వడంకోసమో, డబ్బు గురించో, ఆరోగ్యం గురించో దేవుణ్ణి మొక్కనివాళ్ళుంటారా? సినిమాలూ, పుస్తకాలూ మనలో ఎంతమందిమీద ప్రభావం చూపిస్తాయి? ఏమాత్రపు?

  “వేలెవరిది?” అని ఆలోచించేవాళ్ళూ, “నాపిచ్చి నయంచేసే హక్కు నీకులేదు” అనేవాళ్ళూ, “వాడిక్కూడా ఇంజక్షనిస్తేగానీ, నీ ఇంజెక్షను మంచిదని ఒప్పుకోను” అనేవాళ్ళూ వాళ్లమీద జోకులేసుకొని నవ్వుకోవడానికితప్ప ఎంకెందుకూ పనికిరారు. అందరి పిచ్చీ కుదరాలనీ, అందరి పిచ్చికీ మందులు మార్కెట్‌లోకి రావాలని కోరుకుంటున్నాను.

 3. మొన్ననే చూశాను. మొదట ఒ ఎం జి సినిమాకు గ్లామరస్ వర్షన్ అనిపించింది. సినిమా చివర్లో సందేశాన్ని ఇవ్వటం కంటే ఎక్కువ డ్రమటైజ్ చేశారనిపించింది. చివర్లో అమీర్ ఖాన్ కొద్దిగా దడిచాడా అని కూడా అనిపించింది. అయితే తప్పకుండా ఇది ఒ ఎం జి కంటే మెరుగైన సినిమా.
  మా పిల్లలూ, వాళ్ళ క్లాస్ మేట్స్ కూడా ఈ సినిమాను ఇష్టపడటం ఆనందం కలిగించింది.

 4. ఇలాంటి మత విద్వేషాలను రెచ్చగొట్టి ఎంత కాలం పబ్బం గడుపు కుంటారు ? ఆర్ధిక సమానతలు పెరుగుతున్న కొద్ది ఇది మరింత ఎక్కువవుతున్నది. నిరంతర ప్రక్రియ గా కోన సాగుతుంది. అవతల వాణ్నిలేక అవతల మతాన్నో, కులాన్నో తక్కువ చేస్తే గాని తన గొప్ప తనం ఐ లైట్ కాదనే అహంకారం అదికార దాహం లో ఇమిడి వున్నదే! ఇది కొత్తగా వచ్చింది కాక పోయినా అది మరింత ఐ లైట్ అవటం ఇటీ వలీ కాలం లో పేట్రేగి పోతుంది. విశ్లేషణ చాలా బాగున్నది.

 5. భవాని says:

  బాగా చెప్పారు

 6. పవన్ సంతోష్ says:

  అసలు పాయింటేంటంటే హీరోలు తమ మాస్ ఇమేజ్ గురించి చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎమ్.జి.ఆర్. ‘‘రాముడు-భీముడు’’ సినిమా తమిళంలో తీస్తూన్నప్పుడు అందులో భీముడు పాత్ర హోటల్ నుంచి డబ్బులేక తర్వాత వచ్చిన రాముడు ఆ బిల్లు కట్టుకోవాల్సివస్తుంది. ఈ సీన్ రామారావు చేయగా ఎం.జీ.ఆర్. ఒప్పుకోలేదట. ‘‘నన్ను నా ప్రేక్షకులు దొంగగా చూడనేకూడదు’’ అని మొండికేస్తే చివరకు రైటర్ బయటకు వెళ్తున్న రాముడు పాత్ర ‘‘అయ్యో ఇలాంటి పని చేయాల్సివచ్చింది. నా చేతికి పది పైసలు వస్తే పదిపైసలు ముందు ఈ హోటల్కి వచ్చి ఇచ్చే తీరుతాను’’ అనుకుని వెళ్ళిపోయేలా రాశార్ట. తర్వాతి కాలంలో ఆయన సినిమారంగంలోని ఇమేజిని ఏం చేశారో మనకు తెలియంది కాదు.
  ఇక అమీర్ ఖాన్ అయినా మరెవరైనా తన స్క్రీన్ అప్పియరెన్స్, మీడియా ఇమేజ్ వంటివి రకరకాల కారణాలతో నిర్మించుకుంటూంటారు. షారూఖ్ ఖాన్ మార్కెట్ కీ, అమీర్ ఖాన్ మార్కెట్ కి తెడా తెలిసిన వారు ఇప్పుడు అమీర్ వేసిన అడుగు వెనుక అంతరార్థం తెలుసుకోగలుగుతారు.

  • పవన్ సంతోష్ says:

   ఈ కామెంటులో రాముడు-భీముడు తారుమారవడంతో కింద క్లియర్ గా మరోటి రాశాను. పాఠకులు కిందిది చదువుకోగలరు.. సంపాదకులు పై కామెంటు తొలగించగలరు.

 7. పవన్ సంతోష్ says:

  అసలు పాయింటేంటంటే హీరోలు తమ మాస్ ఇమేజ్ గురించి చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎమ్.జి.ఆర్. ‘‘రాముడు-భీముడు’’ సినిమా తమిళంలో తీస్తూన్నప్పుడు అందులో భీముడు పాత్ర హోటల్ నుంచి డబ్బులేక దొంగలా పారిపోగా తర్వాత వచ్చిన రాముడు ఆ బిల్లు కట్టుకోవాల్సివస్తుంది. ఈ సీన్ రామారావు చేయగా ఎం.జీ.ఆర్. ఒప్పుకోలేదట. ‘‘నన్ను నా ప్రేక్షకులు దొంగగా చూడనేకూడదు’’ అని మొండికేస్తే చివరకు రైటర్ – దొంగలా బయటకు వెళ్తున్న భీముడు పాత్ర ‘‘అయ్యో ఇలాంటి పని చేయాల్సివచ్చింది. నా చేతికి పది పైసలు వస్తే పదిపైసలు ముందు ఈ హోటల్కి వచ్చి ఇచ్చే తీరుతాను’’ అనుకుని వెళ్ళిపోయేలా రాశార్ట. ఇంతగా రామచంద్రుడు మంచి బాలుడు అని నిర్మించుకున్న ఇమేజిని పెట్టుకుని తర్వాతి కాలంలో ఆయన సినిమారంగంలోని ఇమేజిని ఏం చేశారో మనకు తెలియంది కాదు.
  ఇక అమీర్ ఖాన్ అయినా మరెవరైనా తన స్క్రీన్ అప్పియరెన్స్, మీడియా ఇమేజ్ వంటివి రకరకాల కారణాలతో నిర్మించుకుంటూంటారు. షారూఖ్ ఖాన్ మార్కెట్ కీ, అమీర్ ఖాన్ మార్కెట్ కి తెడా తెలిసిన వారు ఇప్పుడు అమీర్ వేసిన అడుగు వెనుక అంతరార్థం తెలుసుకోగలుగుతారు.
  ‘‘చినచేపను పెదచేప చినమాయను పెనుమాయ
  ఇది స్వాహా… అది స్వాహా..’’

 8. నారాయణస్వామి says:

  ప్రసాద్ గారూ, మినర్వా గారూ. రమాసుందరి గారూ – మీ అభిప్రాయాలకు నెనర్లు.

  తిరుపాల్ గారూ – ఒక మతం లో ఉన్న దురాచారాలని మూఢనమ్మకాలని దొంగ మతగురువులని విమర్శించినంత మాత్రాన అది మత విద్వేషాలని రెచ్చగొట్టినట్టు కాదనే నా అభిప్రాయం. మతాలూ మతాచారాలూ మతగురువులూ (అది యే మతమైనా సరే) విమర్శ లకు అతీతమైనవేమీ కావు అని నా అభిప్రాయం.

  పవన్ సంతోష్ గారూ – మీరు చెప్పినది నా కంత స్పష్టంగా అర్థం కాకపోయినా – ఆమిర్ ఖాన్ తన యిమేజి పెంచుకోవడం కోసం మాత్రమే ఈ సినిమాలో భాగమయ్యాడంటే అది నాకు నమ్మశక్యంగా లేదు. అందుకోసం మతగురువులనే సింహాల నోట్లో తల పెట్టాల్సిన అవసరం లేదు. యింక వేరే సినిమాలు కూడా తీయొచ్చు .

  • నారయన స్వామి గారు,
   నా వ్యాఖ్యను మీరు అపార్ధం చేసుకున్నట్లున్నారు. నేను మీరు విమర్శ తో రెచ్చగొట్టినారనలేదు. మతవాదులు రెచ్చగొటుతున్నారని నాబావం. హెతుబద్దమైనా ఆలోచనలు పెర్గకుండా మత వాదులు అడ్డుకుంటున్నందౌ వల్ల దేశ సామాజిక ప్రగతి ఎంతో కుంటుపడున్నది నా భావం కూడా. నాభావాన్ని సరిగా వ్యక్తం చేయలేక పోయినందుకు క్షమించాలి.

   • నారాయణస్వామి says:

    తిరుపాల్ గారూ – అయ్యో! ఇంత మాత్రానికే క్షమించడం యెందుకు సార్ ! బహుశా నేనే మీరు వెలిబుచ్చిన అభిప్రాయాన్ని సరిగా అర్థం చేసుకోలేక పోయానేమో! యిప్పుడు స్పష్టమైంది! నెనర్లు!

 9. వెల్లంపల్లి అవినాష్ says:

  నారాయణ స్వామి గారూ, మంచి సమీక్ష ఇచ్చారు. ధన్యవాదాలు!

  “ఓహ్ మై గాడ్” హేతువాద ధోరణిని కన్వీనియంట్ గా వాడుకుంటూ, అంతిమంగా దైవత్వాన్నే సమర్థించినట్టు అనిపించింది. “పీకే” ఈ విషయంలో చాలా మెరుగు. చివరి వరకూ అదే ధోరణిని అంటిపెట్టుకొన్నది. ఇట్లాంటి కథాంశాలకు ప్రేక్షకులందరూ మెచ్చే ముగింపు ఇవ్వడం దుర్లభం అని నా అభిప్రాయం! ఎట్లాంటి ముగింపునిచ్చినా సరే, ప్రేక్షకులందరినీ సంతృప్తి పరచలేరు.

 10. రవికుమార్.బడుగు says:

  నా అభిప్రాయలో ఓ మై గాడ్ ఈజ్ బెటర్ దెన్ పీకే. పీకేలో చిల్లరదేవుళ్లని తిట్టడానికి ఎక్కడ్నించో ఏలియన్ని తీసుకొచ్చారు. ఓ మైగాడ్ లో సగటు మనిషితోనే ఆపని చేయించారు. స్క్రిప్టు పరంగా చూస్తే ఓ మైగాడ్ లో అద్భుతమైన డ్రామా ఉంది. పీకేలో కేవలం డైలాగ్ లు, ట్విస్టులే(యూత్ ని ఆకట్టుకునే) ప్లస్ పాయింట్స్. పీకేలో ఏలియన్ కావడంతో తనతో ఏంచేయించినా ఔచిత్యం దెబ్బతినదన్న వెసులుబాటు ఉంది. కానీ ఓ మై గాడ్ లో ఆ అవకాశం లేకున్నా పకడ్బందీగా కథ నడిపించారు. ఇక రెండు సినిమాల్లోనూ చిల్లరదేవుళ్లే రాంగ్ నెంబర్లు, అసలైన దేవుడు కరెక్టే అంటూ పిరికితనాన్ని ఆశ్రయించారు. కిల్ ద గాడ్ అని చెప్పేంత ధైర్యం ఇద్దరిలో లేదు. లోపల ఉన్నా పైకి చెప్పలేకపోయారని అనిపించింది. బట్ నా ఓటు మాత్రం ఓ మైగాడ్ కే.

 11. buchireddy gangula says:

  P.K.. VERY..GOOD..PICTURE.
  ఇలాంటి సినిమాలు యింకా రావాలి

  స్వామి గారు — చాల చక్కగా రాశారు

  మనిషి
  బతకడానికి
  కులం — మతం — అవసరమా ???

  ———————————————————————————————–
  బుచ్చి రెడ్డి గంగుల

మీ మాటలు

*