బ్రూక్లిన్ బుక్ ఫెస్టివల్ లో రాజ్ నవల విడుదల

All_Things_Unforgive_Cover_for_ebook

పదేళ్ళ నించీ రాజ్ కారంచేడు వొకే పనిలో రకరకాలుగా కూరుకుపోయి వున్నాడు. రోజు వారీ బతుకు కోసం అతని వుద్యోగమేదో అతను చేసుకుంటూనే, ప్రతి గురువారం సారంగ పత్రిక పనిలో తనదో చెయ్యి ఉంటూ వుండగానే – తనదైన ఇంకోటేదో లోకంలో తన వాక్యాల మధ్య తనే సంచరిస్తూ పరధ్యానమవుతూ ఆశ పడుతూ ఎక్కువసార్లు నిరాశ పడుతూ నిట్టూరుస్తూ యీ చీకటి గుహ చివర వెల్తురేదో వుంది వుందనుకుంటూ- ఇవాళ్టికి ఇదిగో ఇలా ఈ నవల్లో ఇలా తేలాడు రాజుకన్నా బలవంతుడైన ఈ రాజ్ అనే మొండివాడు.

ఈ వారం ప్రతిష్టాత్మకమైన న్యూయార్క్ బ్రూక్లిన్ బుక్ ఫెస్టివల్ లో ఎంపికైన అయిదు ఇంగ్లీషు నవలల్లో రాజ్ నవల All Things Unforgiven కూడా వుండడం మన ‘సారంగ’ కుటుంబీకులందరికీ సంతోష సమయం.

ఈ ఆదివారం అంటే 21 వ తేదీన న్యూయార్క్ బ్రూక్లిన్ బరో హాల్లో మెయిన్ స్టేజ్ మీద రాజ్ రాసిన ఈ నవలని పరిచయం చేయబోతున్నారు. ఈ నవల సారంగ బుక్స్ తొలి ఇంగ్లీషు సాహిత్య ప్రచురణ. అంటే, ఇదే సందర్భంలో సారంగ బుక్స్ మొదటిసారిగా అంతర్జాతీయ పుస్తకాల మార్కెట్లోకి అడుగుపెడుతోందన్న మాట.

RajKaramcheduరాజ్ కారంచేడు ఇప్పటిదాకా కవిత్వ అనువాదకుడిగానే మనకు తెలుసు. రాజ్ అనువాదం చేసిన తెలుగు కవితల ఇంగ్లీషు అనువాదాలు కొన్ని Oxford University Press త్వరలో ప్రచురించబోతున్న తెలుగు కవితల సంపుటంలో చేరాయి. అలాగే, రాజ్ అనువాదం చేసిన శివారెడ్డి, వరవర రావు, ఇస్మాయిల్ ల కవితలు వివిధ అంతర్జాతీయ సాహిత్య పత్రికల్లో ఈ ఏడాది రాబోతున్నాయి కూడా.

ఈ అనువాద కృషికి భిన్నంగా రాజ్ రాసిన ఈ నవల All Things Unforgiven మరచిపోలేని మైలురాయి. హైదరాబాద్ పాతబస్తీలో వొక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబం కేంద్రంగా సాగే ఈ నవల అటు హైదరాబాద్ నీ, ఇటు ఆధునికతలోకి అడుగుపెడ్తున్న బ్రాహ్మణ కుటుంబం బతుకు చిత్రాన్నీ, ఆ జీవితాల ఎగుడు దిగుళ్ళనీ బలంగా ప్రతిబింబిస్తుంది. బహుశా, ఇటీవలి కాలంలో హైదరాబాద్ పాతబస్తీ కేంద్రంగా వెలువడిన అరుదైన ఆంగ్ల నవల ఇదే కావచ్చు కూడా. ఈ నవల ప్రస్తుతం సారంగ బుక్స్ ద్వారా, అమెజాన్ ద్వారా కూడా అందుబాటులో వుంది.

 

మీ మాటలు

  1. shanti prabodha says:

    abhinadanalu raj garu

  2. buchireddy gangula says:

    కంగ్రాట్స్ రాజ్ గారు ——————–
    ——————————————
    బుచ్చి రెడ్డి గంగుల

మీ మాటలు

*