మార్మికతా మరకలు

                                   Tripura

త్రిపుర కథాసర్పాలు నన్ను చుట్టేశాక

దిగులుచీకటి నిండిన గదిలో

పొగిలిపోవటమే పనైంది నాకు

లోపలి తలుపులు ఒకటి తర్వాత వొకటి

తెరుచుకుంటూ మూసుకుంటూ తెరుచుకుంటూ

బయటి కోలాహలం బాధానలమైతే

లోపలి ఏకాంతపు చీకటి

తాపకారకమైన నిప్పుకణిక

మనసును గాజుపలక చేసి

మరకల్తో అలంకరించుకున్నాక

దుఃఖజలంతో కడిగేసుకోవటం

చక్కని హాబీ

వెలుతురు లేని కలతబోనులో

సుఖరాహిత్య శీర్షాసనమే

నిను వరించిన హారం

ఎటూ అవగతం కాని భావం

ఎప్పట్నుంచో గుండెను కెలుకుతున్న బాకు

ఏమీ చెప్పలేనితనపు శూన్యత్వం

అంతరంగపు లోతుల్లో

కోట్ల నక్షత్రాల ద్రవ్యరాశి

అన్ని పొరల్నీ రాల్చుకున్న అస్తిత్వాన్ని

నిర్భీకతా వలయాల్లోకి విసిరేసి

నిప్పుల నదిలో స్నానించే ఆత్మకు

సాటి వచ్చే సాఫల్యత యేదీ

‘భగవంతం కోసం’ అల్లిన

అసంబద్ధ వృత్తాంతపు అల్లికలో చిక్కి

వెల్లకిలా పడుకోవటం ఊరట

‘కనిపించని ద్వారం’ కోసం

ఫలించని తడుములాట యిచ్చిన

ఉక్కిరిబిక్కిరితనపు కొండబరువు కింద

ఆఖరి నివృత్తితో అన్ని బాధలకూ సమాప్తి

‘సుబ్బారాయుడి’ ఫాంటసీ ప్రవాహంలో

ఆత్మన్యూనతా గాయానికి అందమైన కట్టు

‘కేసరి వలె’ వీకెండ్ విన్యాసాల్లో

కీడు అంటని చిన్నారి విజయరహస్యం

‘హోటల్లో’ కొలాజ్

మనోహరమైన మాంటాజ్

‘జర్కన్’ లో జవాబు దొర్కెన్

కథాసర్పాలు చుట్ట విప్పుకుని

కనుమరుగై పోయినా

మనోచేతన మీది మార్మికతా మరకలు

పరిమళిస్తూనే వుంటాయి

పది కాలాల పాటు

(సెప్టెంబర్ 2 త్రిపుర జన్మదినం)

-ఎలనాగ

elanaga

మీ మాటలు

  1. dasaraju ramarao says:

    లోపలి ఏకాంతపు చీకటి

    తాపకారకమైన నిప్పుకణిక…..త్రిపుర కథాత్మక కవిత ఆవిష్కరణకు సరిగ్గా సరిపోతాయి…ఒక కొత్త ఆలోచనను సమర్థ వంతంగా నిర్వహించినారు, శుభాకాంక్షలు.

  2. కె. కె. రామయ్య says:

    “త్రిపుర కథాసర్పాలు మనోచేతన మీది మార్మికతా మరకల్లా, పది కాలాల పాటు పరిమళిస్తూనే వుంటాయి “
    అన్న ఎలనాగ గారు ఆత్మానందం కలిగించారు.

  3. దాసరాజు రామారావు గారూ, కె. కె. రామయ్యమ గారూ,

    మీ యిద్దరికీ నా కవిత నచ్చినందుకు, ఆత్మానందం కలిగించినందుకు నాకు సంతోషంగా వుంది. కృతజ్ఞతలు

మీ మాటలు

*