అనంతమూర్తి అనిర్దిష్ట యాత్ర

Krish.psd

‘ముందు నిరాకారం, తర్వాత నిరాకారం. అపూర్వమైన అనుభవాన్ని అనుగ్రహం చేసి అదృశ్యమైందా పవిత్ర ముహూర్తం. ఆ క్షణం అనుభవానికి వస్తే ఆ అనుభవం మళ్లీ కావాలనిపిస్తుంది..’ అనుకుంటాడు వేదాంత శిరోమణి, పండితుడు ప్రాణేశాచార్యులు. ఆ అనుభవం ఏమిటి? ఆ అనుభవం ముందు సమస్త ఆచారాలు, సాంప్రదాయాలూ, మడులూ, నిష్టలూ, పూజలూ, పునస్కారాలు గాలిలో కొట్టుకుపోతాయి. మనిషిని మనిషిగా గుర్తింపచేసే అనుభవం అది. ఆ అనుభవం తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది?

‘మత్స్యగంధిని గర్భవతి చేసి వ్యాసమహర్షికి జననమిచ్చిన ఆ పరాశరుడు నాకు మాదిరిగానే ఇలా వ్యాకులపడ్డాడా? లేక వాళ్లంతా ఈ జీవితమే ఒక మోక్ష సన్యాస మార్గమనీ, భగవన్నిర్దిష్టమనీ సమన్వయించుకుని, అన్యోన్య విరుద్దసంఘర్షణలకు అతీతమై, ప్రకృతి కాంత సృష్టించి సమర్పించిన వివిధ సంవిధాలకూ తలయొగ్గి నివసించి, చివరకు నిరాకారమైన ఈ అనంత విశ్వంలోకి లీనమై పోయారా? నదులు సముద్రంలో విలీనమైనట్లు?’ అని తనను తాను ప్రశ్నించుకుంటాడు ప్రాణేశాచార్యులు చంద్రితో అనుభవం తర్వాత.

ఆ అనుభవం ఏమిటి? తడి నేలనుంచి నీలంగా విష్ణుక్రాంత పుష్పాలలో నుంచి సుగంధాలు విరజిమ్ముతున్నై. వాటితో పాటు స్త్రీ వంటి నుంచి పడుతున్న చెమట బిందువుల పరిమళమూ కలిసిపోతున్నది. ఆశీర్వాదానికి సాచిన చేయి విరబోసిన ఆమె జుట్టును నిమరసాగింది. ఆశీర్వాద మంత్రం ఆయన కుత్తుకలోనే ఇమిడిపోయింది. ..

అనంతమూర్తి సంస్కార నవలలో వివరించిన అనుభవం ఇది.అనుకోకుండా జరిగిన ఒక స్పర్శ అతడిలో సంస్కారాన్ని తట్టిలేపింది. అతడిని మార్చివేసింది. ఒక్క స్పర్శ అతడి ఆధిపత్యాన్ని విధ్వంసం చేసింది. ఒక్క కలయిక అతడిని బయటిప్రపంచం మట్టిమనుషులతో మమేకం చేస్తుంది. ఒక్క అనుభవం అతడిని తక్కువజాతి వారిని కలిసి కాఫీ తాగేందుకు ప్రోత్సహిస్తుంది. ఈ అనుభవం శాస్త్రాలకు అతీతమా? లేక శాస్త్రాలు వాటిని నిషేధించాయా? లేదు.. లేదు.. బ్రాహ్మణత్వం నిలుపుకోవడానికి వేదాలు, శాస్త్రాలు, పురాణాలు చదవాలి కంఠోపాఠంగా.. వాటిని అర్థం చేసుకోకుండా.. అందులో ఇంగితమై ఉన్న ప్రేమోద్రేకాల స్వభావం తెలుసుకోకుండా. దాని సంకేతాలకు అనుగుణంగా వ్యవహరించకుండా.. తన జ్ఞానంలోనే దాగి ఉన్నదొక నిప్పురవ్వ..

ఆ అనుభవం తర్వాత ప్రాణేశాచార్యులకు మళ్లీ బాల్యంలోకి ప్రవేశించినట్లనిపించింది. అగ్రహారంలో శవం కుళ్లిన వాసనతో మురుగుపడ్డ ఆయన ముక్కుకు పచ్చగడ్డి వాసన ఎంతో సుఖం కలిగించింది. మట్టి కప్పుకున్న గరిక వ్రేళ్లు ఆయనను ఆనందాబుధిలో ముంచివేశాయి.

ananthamurthy-630

అనంతమూర్తి రచనలు చదివినప్పుడల్లా మన చుట్టూ ఉన్న సమాజం, మనం నిర్మించుకున్న నియమనిబంధనలు, మన పిచ్చుక గూళ్లూ, మన కృత్తిమ మందహాసాలు, రక్తం ప్రసరించని మన కరచాలనాలు, మన ఇంట్లో వ్రేళ్లాడుతున్న పటాలు అన్నీ గాలిలో తేలిపోతున్నట్లు కనిపిస్తాయి. అవన్నీ నీవైపు చూస్తూ పరిహాసం చేస్తాయి. మర్యాదలు విధ్వంసమవుతాయి. మనకు తెలియకుండానే మన పాదాలు వెనుతిరుగుతాయి. మూసుకున్న మన మెదడు కిటికీలు తెరుచుకుంటాయి. మనకు తెలియకుండానే మనం ప్రశ్నించడం మొదలుపెడతాం.

‘సంస్కార’ నవలలో నారాయణప్ప అనే ఒక బ్రాహ్మణుడి ఒక శవం తగలబడడానికి ఎదురు చూస్తుంది. ఎందుకంటే అది బ్రాహ్మణ్యాన్ని వదిలిపెట్టినా, బ్రాహ్మణత్వాన్ని వదలని శవం. బ్రాహ్మణత్వం  వదిలి, సుఖలోలుడై, సుఖంలోనే విముక్తిని కోరుకున్న వాడికి బ్రాహ్మణ్యం ఏమిటి? అయినప్పటికీ అతడు బ్రాహ్మణుడుగానే మరణించాడు. కనుక అతడి శవాన్ని ఇంకో బ్రాహ్మణుడే ముట్టుకోగలుగుతాడు. ముట్టుకుంటే దోషపరిహారానికి ప్రాయశ్చిత్తమేమేమిటి?

ananta3

ఆ బ్రాహ్మణ శవం చేసిన పాపమేమిటి? అందరూ పూజచేసుకునే సాలిగ్రామాన్ని ఎత్తి ఏట్లో పారేశాడు. తురక వాళ్లతో తాగితందనాలాడాడు. కుందాపురం నుంచి కుందనపు బొమ్మలాంటి ఒక తక్కువకులం స్త్రీని తెచ్చిపెట్టుకున్నాడు. ఆమె చంద్రి. ఆమెను చూస్తే ఒక బ్రాహ్మణుడికి రవివర్మ చిత్రంలో ఉన్న మత్స్యగంధి సిగ్గుతో వక్షోజాలను కప్పుకుంటున్నట్లుగా అనిపించింది. ఈ బంగారపుతునకను ఎవరు తీసుకురారు? వాత్సాయన కామసూత్రాల్లో వర్ణించినట్లుగా సున్నితమై, సునిశితమైన వర్చస్సు. భీత హరిణేక్షణల నయనాల వంటి కళ్లు. సంభోగ క్రీడలో మనిషిని సంపూర్ణంగా ముంచి తేల్చగల ప్రభావం ఉన్నది ఆమె శరీరంలో. నారాయణప్ప ఆమెకోసం సాలగ్రామాన్ని ఏట్లో విసిరిపారేశారంటే, మద్యమాంసాలు భుజించాడంటే ఆశర్యం ఏమున్నది? తురకరాజు కూతురు లవంగిని పెళ్లి చేసుకుని జగన్నాథపండితుడు ఆ మ్లేచ్ఛ కన్య వక్షోవైభవాన్ని వర్ణించలేదా?

అనంతమూర్తి బ్రాహ్మణ్యంతో క్రీడిస్తాడు. బ్రాహ్మణ్యాన్ని ప్రశ్నిస్తాడు. నారాయణప్ప శవానికి కర్మకాండలు జరిపేందుకు వెనుకాడిన బ్రాహ్మణులు, వారి గృహిణులు అతడు ఉంచుకున్న చంద్రి నగలకోసం తహతహలాడిన వైనాన్నివర్ణిస్తాడు.బ్రాహ్మణ్యానికి అవతల సాధారణ మనుషుల జీవితాల్లో జీవన సౌందర్యాన్ని చిత్రిస్తాడు. చివరకు బ్రాహ్మణ్యాన్నే అస్తిత్వ పరీక్షలో పడవేస్తాడు. మానవ విలువలు ముఖ్యమా? ఆచార వ్యవహారాలు ముఖ్యమా అన్న చర్చ అనంతమూర్తి సంస్కార లో లేవనెత్తుతాడు. చంద్రి, పద్మావతి, పుట్టప్పలో ఉన్న సంస్కారం తోటి బ్రాహ్మణుల్లో లేదని నిరూపిస్తాడు.

ఇదంతా ప్రశ్నించడం వల్లే వచ్చింది. సంశయాత్మా వినశ్యతి.. (సంశయించేవాడు నశిస్తాడు)అని, శ్రద్దావన్ లభతే జ్ఞానం (విశ్వాసం వల్లే విజ్ఞానం లభిస్తుంది) మన శాస్త్రాలు చెబుతాయి. కాని సంశయించకపోతే నిష్కృతి లేదని, గుడ్డి విశ్వాసం వల్ల ఉన్న విజ్ఞానం నశిస్తుందని అనంతమూర్తి చెబుతారు. అంధ విశ్వాసంతో కొనసాగించే సంస్కృతి మనుగడ సాధించగలదా ? అని ఆయన ప్రశ్నించారు. తన రచనల్లో సాంప్రదాయ హిందూ సమాజంపై సామాజిక, ఆర్థిక, రాజకీయ మార్పులను ఆయన నిశితంగా గమనించారు. వాటి వల్ల కుటుంబాల్లో వచ్చిన అంతస్సంఘర్షణను చిత్రించారు. సంప్రదాయాన్ని వ్యతిరేకించిన బుద్దుడు, బసవన్న, అల్లమప్రభులను అనంత మూర్తి ఆరాధించారు. తన నవ్యవాదం అన్ని ఆధునిక వాదాల మాదిరి కాదని, నెహ్రూ కాలపు ఆదర్శ సిద్దాంతాలు పటాపంచలై ఉద్భవించిన వాదమని ఆయన ఒక చోట చెప్పారు.

ఆయన ‘భారతీపుర’ నవల కూడా ఆధునిక భావాలు ఉన్న జగన్నాథుడనే ఒక బ్రాహ్మణుడు ఇంగ్లండ్‌లో చదువుకుని తన సమాజంలో కి వచ్చి అక్కడ భావాలపై ఆధిపత్యం వహిస్తున్న ఆలయవ్యవస్థను గమనిస్తాడు. సమాజంలో నిమ్మజాతీయులైన హోలెయారులు ఆలయంలో ప్రవేశిస్తే రక్తం కక్కుకుని చచ్చిపోతారన్న ప్రచారాన్ని ఆయన ఢీకొంటారు.’సమాజంలో మీరు అధికంగా ఉన్నారు. మీరు తిరగబడాలి..’ అని వారిని ప్రేరేపిస్తాడు. ‘నేను హోలెయారును ఆలయంలోకి తీసుకువెళ్లాలి. శతాబ్ధాలుగా సాగుతున్న సాంప్రదాయాల్ని ఒక్క అడుగుతో మార్చేయాలి. మంజునాథను బ్రద్దలు చేయాలి. హోలెయారు ఒక్క కొత్త అడుగు వేస్తే మనమందరం చచ్చిపోయి కొత్తగా జన్మిస్తాం.. ‘అని జగన్నాథుడు పిలుపునిస్తారు. హోలెయారును మందిరంలోకి ప్రవేశించేలా చేయనంతవరకూ తాను మనిషిని కానని గుర్తిస్తాడు. అనంతమూర్తి ‘ఘట శ్రాద్ద,’ ‘సూర్యన కుదురే’, ‘అక్కయ్య’, ‘మౌని’ తో పాటు అనేక క థలు వ్యవస్థలోని మూర్ఖత్వాలను ప్రశ్నిస్తాయి. దళితులనే కాదు, స్త్రీలను కూడా ఆయన అణగారిన వర్గంగా భావించారు. వార్ని ప్రశ్నించమని ఆయన ప్రేరేపిస్తారు. విలియం బ్లేక్, కీట్స్ కవితలంటే ఆయన కెంతో ఇష్టం. ఆయన కవితలు వాన వెలిసిన తర్వాత నేల పరిమళాన్ని గుర్తు చేస్తాయి.

ananta2

అనంతమూర్తి వ్యక్తిత్వంలోనే తిరుగుబాటు ఉన్నది. ఆయన దేన్నీ ప్రశ్నించకుండా అంగీకరించలేరు. అందుకే ఆయన సాంప్రదాయాన్ని ప్రశ్నించారు. ఆచారాల్ని ప్రశ్నించారు. సమాజంలో రుగ్మతల్ని ప్రశ్నించారు. పౌరహక్కుల ఉద్యమంలో పాల్గొన్నారు. ఒక సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చి తనను తాను ప్రశ్నించుకున్నందువల్లే ఆయన హిందూత్వను ఒక రాజకీయ తాత్విక దృక్పథంగా అంగీకరించలేకపోయారు. ఆక్రమంలో ఆయన బిజెపిని కూడా వ్యతిరేకించారు. కాంగ్రెస్‌ను అభిమానించారు. నరేంద్రమోదీ ప్రధాని అయితే ఈ దేశం నుంచి వెళ్లిపోతానని సంచలనాత్మక ప్రకటన కూడా చేశారు. ఆయన ఈ దేశం పయనిస్తున్న దారిని వ్యతిరేకించారు కాని పలాయనవాదం చిత్తగించే ఉద్దేశం ఆయనకు లేదు.

అనంతమూర్తి పారిపోయే వ్యక్తి కాదు. ప్రశ్నించే వ్యక్తి. ప్రశ్నించే క్రమంలో ప్రతిఘటించే వ్యక్తి. జీవితాంతం ఆయన ప్రతిఘటిస్తూనే రచనలు చేశారు. కొత్త విలువల్ని సృష్టించారు. మానవ సంబంధాల్ని ప్రేమించారు. సామాజిక కార్యకర్తగా మారారు. ఆయనొక ప్రజ్వలిస్తున్న ప్రవాహం.సాహిత్యం రాజకీయాలకు అతీతమైనదా? కానే కాదంటారు. అనంతమూర్తి. ‘నాకు రాజకీయాలతో సంబంధం లేదు..’ అని చేసే ప్రకటనకూడా రాజకీయమైనదేనని ఆయన అభిప్రాయం. ‘నీలో నీవు తరచి చూసుకోకపోతే మంచి రచయితవు కాలేవు’.. అని ఆయన పలు సందర్భాల్లో చెప్పారు.

అనంతమూర్తి ఒక సామాజిక జీవితానుభవం. వేల వేల చెట్లు కూలిపోతున్న చప్పుడు ఆయన రచనల్లో ప్రతిధ్వనిస్తుంది. చంద్రి కౌగిలిలో ప్రాణేశాచార్యుడు పునీతుడైనట్లే, అనంతమూర్తి రచనలు చదివితే మనం వేనవేల వ్యవస్థల దుర్మార్గాల చితిమంటల్ని విన్నట్లవుతుంది. అనంతమూర్తి నిర్దిష్ట యాత్ర చేశాడని చెప్పలేం. బ్రాహ్మణత్వం చనిపోయినా బ్రాహ్మణుడు చనిపోలేడు కదా.. అనంతమూర్తి అంత్యక్రియలను ఆయన బంధువులు స్మార్త బ్రాహ్మణ ఆచారాల ప్రకారమే చేశారు.

 ~~

మీ మాటలు

 1. bathula vv apparao says:

  nice

 2. ఆర్.దమయంతి. says:

  అనంత మూర్తి గారి మీద దాక్యుమెంటరీ ఫిల్మ్ ఈ మధ్యనే చూసాను.
  ఆయన చెప్పిన నిజాలు ఆలోచింపచేసిన మాట వాస్తవం.
  మీ వ్యాసం ద్వారా మరిన్ని సంగతులూ తెలిసాయి.
  ఈ అన్యాయాలూ, అక్రమాలు, దుర్మార్గాలూ, దోపిడీలు, వెలివేతలు అన్ని చోట్లా జరుగుతూనే వుంటాయి.
  కొన్ని ప్రాంతాలలో, మరి కొన్ని వర్గాలలో ఇంతకన్నా ఘోరమైన సంఘటనలే జరగడం అవి మనం వార్తల్లో వింటం వింటూనే వున్నాం. చూస్తూనే వున్నాం.
  ఇక్కడ చెప్పుకోవాల్సిన గొప్పతనం ఏమిటంటే –
  అనంతమూర్తి – చాలా మంది లా తమ తమ కుల మత ప్రాంత వర్గాల ఆధిపతులకు భయపడకుండా జంకన్నది లేకుండా..వాస్తవాలకి అద్దం పట్టారు. ఎన్నో విమర్శలని ఎదుర్కొని ధైర్యంగా నిలబడగలిగారు. పోరాడాగలిగారు. ఢీ కొనగాలిగారు.
  నిప్పులాటి నిజాలతో సమాజాన్ని మేల్కొలిపారు.
  లోపాలెక్కడున్నా ఏ రూపంలో వున్నా, ఏ మనిషైనా పోరాడాల్సిందే. ఎదిరించాల్సిందే. తప్పు లేదు.
  ఎందరికో అనంత మూర్తి ఆదర్శ రచయిత గా నిలుస్తారనడం లో ఎలాటి సందేహమూ లేదు.
  వారికి నా శ్రద్ధాంజలి ఘటిస్తూ..

 3. అనంతమూర్తి గారి ఫై తీసిన డాక్యుమెంటరీ ఎక్కడ చూడ వచ్చు?

 4. కె. కె. రామయ్య says:

  “ అనంతమూర్తి రచనలు చదివినప్పుడల్లా మూసుకున్న మన మెదడు కిటికీలు తెరుచుకుంటాయి. మనకు తెలియకుండానే మనం ప్రశ్నించడం మొదలుపెడతాం.

  ఒక సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చి తనను తాను ప్రశ్నించుకున్నందువల్లే ఆయన సాంప్రదాయాన్ని ప్రశ్నించారు. ఆచారాల్ని ప్రశ్నించారు. సమాజంలో రుగ్మతల్ని ప్రశ్నించారు. పౌరహక్కుల ఉద్యమంలో పాల్గొన్నారు.

  సాంప్రదాయ హిందూ సమాజంపై సామాజిక, ఆర్థిక, రాజకీయ మార్పులను ఆయన నిశితంగా గమనించారు. సంప్రదాయాన్ని వ్యతిరేకించిన బుద్దుడు, బసవన్న, అల్లమప్రభులను అనంత మూర్తి ఆరాధించారు. దళితులనే కాదు, స్త్రీలను కూడా ఆయన అణగారిన వర్గంగా భావించారు. వార్ని ప్రశ్నించమని ఆయన ప్రేరేపిస్తారు.

  అనంతమూర్తి ఒక సామాజిక జీవితానుభవం.”

  ఓ అద్భుతమైన వ్యాసం ఇచ్చిన పాలమూరు కృష్ణుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ

  అనంతమూర్తి గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ..

 5. కృష్ణుడు says:

  నిజమే దమయంతి గారూ. మనం చాలా వాటిని ప్రశ్నించకుండా అంగీకరించడం అలవాటు చేసుకున్నాం. రామయ్య గారికి పాలమూరు కృష్ణుడి ధన్యవాదాలు

 6. కృష్ణుడు గారూ,
  అనంతమూర్తిగారికి ఇది మంచి నివాళి. చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను. ధన్యవాదాలు

 7. కృష్ణుడు says:

  మూర్తి గారూ,ధన్యవాదాలు

 8. నారాయణస్వామి says:

  అద్బుతంగా రాసావు కృష్ణుడూ! అనంతమూర్తి గారి సారాంశాన్ని పట్టుకున్నావు మాకందరికీ అందించావు! సంస్కార నవల మనని ఊపేస్తుంది ఘటశ్రాద్ధ కన్నీరు పెట్టిస్తుంది ! సంస్కార సినిమా దొరక లేదు – పఠాబి యెట్లా తీసారో చూద్దామని తపన!
  నెనర్లు కృష్ణుడా!

 9. కృష్ణుడు says:

  నారాయణ స్వామీ, ధన్యవాదాలు

 10. కృష్ణుడు గారూ, చాన్నాళ్ళకి తెలుగులో సమీక్ష చదవగలిగాను. పెక్కు ధన్యవాదాలు!
  ఉమా

 11. చాలా బాగా సమీక్షి0చారు.

మీ మాటలు

*