పాత బూతుల బూజు దులపాల్సిందే!

samvedana logo copy(1)
“పనిమనిషులు దొరకడం లేదండీ. అబ్బో, రోజొక గంట పనిచేయడానికి వేలు అడగుతున్నారు. ఇళ్లలోనే ఉండి పనిచేసే అమ్మాయిలు అయితే అసలే దొరకరు.” పట్నాల్లోమధ్యతరగతి బాధ ఇది. ఇంటి నిర్వహణ ప్రధానంగా ఆడవాళ్ల బాధ్యతే కాబట్టి వాళ్లే ఎక్కువగా బాధపడుతునట్టు కనిపించినా ఈ బాధకు జెండర్‌ అంటగట్టక్కర్లేదు.

“ప్లంబరండీ, ఇంటికొస్తే చిన్న ట్యాప్‌ బిగించడానికి కూడా మూడునాలుగొందలు పోయాల్సిందే. బట్టలు ఐరన్‌ చేసే దిక్కులేదు”. ఇలాంటి మాటలు కూడా ఎడా పెడా వినిపిస్తూ ఉంటాయి.

“కూలోళ్లు దొరడం లేదండీ, వ్యవసాయం సర్వనాశనం అయిపోయింది. ఈ గ్రామీణ ఉపాధి పథకం తెచ్చిఅందర్నీ సోమరులను చేసిపెట్టారు. మనకెందుకు పనిచేస్తారు”.ఇది పల్లెల్లో ఎక్కువగా వినిపించే మాట.

“డప్పు కొట్టే మాదిగ లేకపాయె, చాకలి, కమ్మరి, కుమ్మరి పనులు పాయె, గ్రామాలు పాడైపోయాయండి.” ఇది కూడా దాని పక్కనే వినిపించే మాట.

ఈ బాధలు ఎవరికైనా బాధలు కావచ్చు కానీ వర్కింగ్‌క్లాస్‌ తరపున మాట్లాడేవారికి  కావచ్చునా! శారీరక శ్రమకు డిమాండూ విలువా పెరగడం వర్కింగ్‌ క్లాస్‌ తరపున మాట్లాడేవారు సంతోషించాల్సిన విషయాలు. కానీ మనం చేసే మధ్యతరగతి ఉద్యోగాలకు మాత్రం వేతనాలు మెరుగ్గా ఉండాలని, మనకు సర్వీసెస్‌ అందించేవారు మాత్రం ఎప్పట్లాగే జోలె పట్టుకుని మనం ఇచ్చినంత తీసుకుని చిత్తం దొరా అనాలని చాలామంది కోరుకుంటున్నారు. గ్యాస్‌ బండమీద సబ్సిడీ తగ్గిస్తే గోలగోల చేసేసి గ్రామీణ ఉపాధి పథకాన్ని మాత్రం ఆడిపోసుకుంటుంది ఇలాంటి మధ్యతగరతి.

పేదలవైపున నిలవడమంటే పేదరికాన్ని ప్రేమించడంగా అర్థం చేసుకున్న మిత్రులు ఇంకో రకమైన ఏడుపును అవుట్‌ సోర్స్‌ చేస్తుంటారు. చాకలి, కమ్మరి, కుమ్మరి, మంగలి ఏమాయె, అంతా ఉంటేనే గదా ఊరు అని ఒకటే బాధ!  మనం కాలేజీలోనో, బ్యాంకులోనో, కోర్టులోనో, సాఫ్ట్‌వేర్‌ కంపెనీలోనో, పత్రికా కార్యాలయంలోనో  పనిచేయాల. స్థిరమైన వేతనం తీసుకుంటూ మధ్య మధ్యలో సాహిత్య సేవ చేస్తూ ఉండాల. కానీ ఊరిలో మాత్రం నాలుగు వీధులు, ఏ వీధిలో ఆ కులాలు, మధ్యలో రచ్చబండ, దాని మీద ఓ యాపచెట్టు ఉండాల.  బాడిస చప్పుడు, మగ్గం  చప్పుడు, కుమ్మరి సారె చప్పుడు వినిపిస్తూ ఉండాల. ఊరిని ఊరిలా ఉంచడానికి చాకళ్లు, మంగళ్లు, కుమ్మర్లు, కమ్మర్లు నానా చావు చస్తూ అలానే ఉండిపోవాల! లేకపోతే సర్వనాశినం అయిపోయినట్టే!

మనం పైన ట్యాంక్‌ కట్టుకుని ఎప్పుడంటే అప్పుడు నీళ్లు తిప్పుకుంటాం‌‌, కానీ కుండలు చేసేవాడు కావాల! మనం ఖాదీ వేయం‌. ఆధునిక పరిశ్రమ చేసిన బట్టలే వేస్తాం. కానీ సాలె బట్టలు నేయాల. ఇందులో ప్రాక్టికాలిటీ ఏమైనా ఉందా. జీవితమేమైనా కె విశ్వనాధ్‌ సినిమానా! వివేకానంద సూత్రం ప్రకారం అన్ని కులాలు గౌరవంగా తమపని తాము చేసుకుంటూ అంతిమంగా బ్రాహ్మణత్వాన్ని పొందడానికి! గతాన్ని నెమరేసుకోవడం తప్పుకాదు. గతం లేకుండా వర్తమానం ఎక్కడినుంచి వస్తుంది? అమ్మమ్మ ఒడిని, ఒడిలో విన్న కథలను, చీమచింతకాయ కోయబోయి కింద పడిన దెబ్బలను, ఊరిబావిలో కొట్టిన ఈతలను గుర్తు చేసుకోకుండా ఉండడం సాధ్యమా! కానీ జ్ఞాపకాలకు విలువలు అంటగట్టి ఎత్తుపీట వేసి కూర్చోబెట్ట కూడదు. మా కాలంలో స్కూలుకు ఆరేడు కిలోమీటర్లు నడిచిపోయేవాళ్లం. ఇపుడు ఎవరైనా నడుస్తున్నారా అసలు! కూలీలు పక్కూరి చేన్లో పనులకు పోవడానికి కూడా సెవన్‌ సీటర్లు ఎక్కుతా ఉంటే!  అని ఎవరైనా గతాన్ని తీపిగా గోక్కున్నారనుకోండి. మనమేం అనాల? పండితులారా! మన పూర్వీకులు కాశీకి పోయినా కాటికి పోయినా ఒకటే అనేవారు, యోజనాల దూరం నడిచేపోయేవారు, ఇవాళ మనం యాడికైనా అలావెళ్లి ఇలాగొచ్చేస్తున్నాం. మనం సోమరులైపోయామని మనం ఎన్నడూ అనుకోలేదు. మన తర్వాతి తరానికి మన కంటే కూడా శారీరక శ్రమ తగ్గింది. శారీరక శ్రమను తగ్గించుకుని సౌకర్యాలు పెంచుకునేందుకు మనిషి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాడు. అది తప్పు కాదు అనాలా! లేక భలే చెప్పావు బాస్‌ అని ఫ్యూడల్ భజన చేయాలా !

An-Indian-boy-breaks-coal-006

“మా కాలంలో మాదిరి కాదమ్మా, ఇపుడాడవాళ్లకు పనా పంగా, అన్నీ మెషీన్లే అయిపాయె” అని కోడళ్లను చూసి ఈర్ష్య పడే కొందరు పాతకాలపు అత్తల మాటలకు దీనికి తేడా ఏమైనా ఉందా! ఇదింకా చిన్నబూతే. ఆ మంగలేమాయె, చాకలేమాయె, ఊరేమైపాయె అనైదైతే బూతున్నర బూతు.
ఊరు ఊరిలాగా ఉంచడం కోసం చాకలి మన పిల్లల పీతిగుడ్డలు, ఆడవాళ్ల ముట్టుగుడ్డలు, మగవాళ్లు తాగి వాంతి చేసుకున్న గుడ్డలు ఉతుకుతూనే ఉండాలా?సాయంత్రం ఇంటిమందుకొచ్చి బిచ్చమెత్తుకున్నట్టు జోలెపట్టుకుని మనం వేసే అన్నం పచ్చడి తీసికెళ్లి తినాలా? నీ మాల్గుడి డేస్‌ ఆనందం కోసం ఈ అవమానాన్ని
భరిస్తూ మనకు వెట్టి చాకిరీ చేస్తూనే ఉండాలా? నువ్వు పిలిచినపుడల్లా మాదిగ తప్పెట తీసుకొచ్చి చాటింపు వేయాలా? నువ్వు చస్తే అతను చచ్చినట్టు వచ్చి డప్పేయాలా?
లేకపోతే పీనిగ లేవదా? కాలిస్తే కాలదా? పూడిస్తే పూడదా? పశువు చచ్చిపోతే అతనొచ్చి తీసేయాలా? లేకపోతే  ఊర్లు పాడైపోయినట్టా? ఏం నువ్వు తీయలేవా?
తిండికి లేక ఒకనాడు కళేబరాల మాంసం తిన్నందుకు అది పారంపర్యంగా అతని బాధ్యతే అవుతుందా? చెప్పులు కుట్టేవాడు చెప్పులు కుడుతూ బట్టలు నేసేవాడు బట్టలు నేస్తూ
బట్టలుతికేవాడు బట్టలుతుకుతూ వ్యవసాయం చేసేవాడు వ్యయసాయం చేస్తూ పాలించేవాడు పాలిస్తూ అప్పులిచ్చేవాడు ఎప్పుడూ అప్పులిస్తూ అప్పలు తీసుకునే వాడు ఎప్పుడూ అప్పులు తీసుకుంటూ ఉంటేనే ఊరు పచ్చగా ఉన్నట్టా? ఇదేనా మనం కోరుకునే ప్రజాస్వామ్యం?

బహిష్టు కావడమంటే అదేదో నేరమైనట్టు మూలన కూర్చొని ఏ గుడ్డలు వాడాలో తెలీక అవే చింపిరిగుడ్డలను పదే పదే వాడుతూ చివరకు గోనెసంచులను చించి కూడా వాడుతూ రోగాలు, కాన్సర్లు తెచ్చుకుని ఆడోళ్లు నానా అవస్తలు పడే రోజులు ఎంత బాగుండేవని ఆ పాత రోజులను మధురంగా తల్చుకుందామా! బహిర్భూమికి వెడుతూ నానా రోగాలు తెచ్చుకుంటూ, తెస్తూ సహజమైన జీవన క్రియను కూడా అవమానంగా దొంగదొంగగా తీర్చుకునే రోజులు బాగున్నాయనుకుందామా! బిపినో షుగరో పెరిగిపోయి హఠాత్తుగా మనిషికి చెమట్లు పట్టి స్పృహతప్పి చచ్చిపోతే అదేం రోగమో తెలీక దయ్యం పట్టిందేమో భూతం పట్టిందేమో అనుకుని కాటికి మోసుకుపోయే అన్యాయపు రోజులను అందంగా గుర్తు చేసుకుందామా! ఎవరికో ఎక్కడో ఏదో అయితే  చేతబడి, బాణామతి, చిల్లంగి అని పిచ్చిమాటలు మాట్లాడతా మంత్రగాళ్ల పేరుతో మనుషుల పళ్లు ఊడగొట్టి జుట్టు రాలగొట్టి రాళ్లతో చంపేసే ఆ గుంపున్యాయపు క్రూరత్వాన్ని తన్మయంగా నెమరేసుకుందామా!

ఊరు ఊరంతా అరె ఒరె అంటుంటే అలాగే బాబయా అని అలవాటైన భయంతో కూడిన సిగ్గువల్ల వచ్చిన నవ్వుని అభినయిస్తూ పనిచేసుకుంటూ పోయే సర్వీస్‌ కులాలు లేకుండా పోయాయని బాధపడదామా! కులవృత్తులనుంచి బయటకొచ్చినవాళ్లంతా వేరే పనుల్లో కుదురుకుంటే బాధలేదు,  నలిగిపోతున్నారు, రాలిపోతున్నారు, వారి కోసం రాస్తున్నాము అని సమర్థించుకోవచ్చు. నిజమే, ఆ బాధలో న్యాయమున్నది. కానీ అప్పుడు దాని స్వరం వేరే ఉండాలి. బ్రాహ్మణ, వైశ్య, కుమ్మరి, కమ్మరి, చాకలి అని కులవృత్తుల సంగమస్థలిగా నాలుగు వీధుల్లో  నడిచే చతుష్పాద వ్యవస్థ పోయినందుకు బాధపడకూడదు.. చాకలి ఏమాయె, కుమ్మరి ఏమాయె అని పలవరించకూడదు.

మనుషులను ప్రేమించడానికి ఆ కులవృత్తుల బానిసత్వాన్ని ప్రేమించడానికి తేడా ఉంది. వాస్తవానికి వృత్తి పనిచేసేవారిలో ఆర్టిస్ట్‌ లక్షణం ఉంటుంది. తాము చేసే పని స్వతంత్రమైనదనే భావన చాలామందిలో ఉంటుంది. కూటికి పేదోళ్లమే కానీ కులానికి కాదనే వాసన కొన్ని కులాల్లో ఉంటుంది. ‘ఒకడి కిందకు పనికిపోవడమంటే పరువుపోగొట్టుకోవడం’ అనే న్యూనత ఉంటుంది. దీన్ని వదులుకోగలిగినవారు లేదా వదులుకోక తప్పనిసరైన వారు నెమ్మదిగా వేర్వేరు పనుల్లో కుదురుకుంటున్నారు. ఆ మధ్యలో కొంత ఘర్షణ ఉంటుంది. ఏ మార్పులో మాత్రం ఘర్షణ ఉండదు?
ఒక్క వృత్తి కులాలనే కాదు, ఏ రకమైన కాయకష్టం చేసేవారయినా దానికి తగిన ప్రతిఫలం రానప్పుడు అంతకంటే తక్కువ శ్రమతోనో అదే శ్రమతోనో ప్రత్యామ్నాయ ఉపాధి కోసం ప్రయత్నించాలి. అలా ప్రయత్నించడం సరైనదనే చేతన మనం కలిగించగలగాలి. అటువంటి ధైర్యాన్ని ఇవ్వగలగాలి. ఏది ఏమైనా తన పొలంలో తాను చావనైనా చస్తాడు గానీ…అన్నట్టు రాసే వాళ్లు ఆలోచించుకోవాల్సిన విషయం ఇది. “తన పొలంలో తాను రాజులాగా బతికినవాడు ఇపుడు పాపం గార్డుగా” .. చొచ్చొచ్చొ అంటూ ఫ్యూడల్‌ వాసనను ప్రేమించాలా లేక శ్రమసంస్కృతిని పెంపొందించాలా? ‘బతికి చెడడం’ మీద పురోగామి రచయితలక్కూడా ఇలాంటి భావనలుండవచ్చునా! వర్కింగ్‌ కల్చర్‌ అంటే అంత ఏహ్యభావం ఉండవచ్చునా ? నువ్వో పక్క ఇది నీచం అదితక్కువ అని ప్రచారం చేస్తూ ఉంటే మార్పుకు సిద్ధపడే వాడు కూడా అదేదో చేయకూడని పని అనుకుని దాని బదులు చావుకు సిద్ధపడతాడు. నువ్వు మేలు చేస్తున్నట్టా! కీడు చేస్తున్నట్టా! ప్రత్యామ్నాయ ఉపాధి లేకపోబట్టే అందులో ఉన్నవారి గురించి వారి స్థితిగతుల గురించి బాధపడుతున్నాం అనొచ్చు. కానీ చేస్తున్న పని అదిస్తున్న బతుకు మిగిలిన శారీరక శ్రమల కంటే అన్యాయంగా ఉన్న విషయాన్ని గుర్తించాలా వద్దా, గుర్తింప జేయాలా వద్దా! అలవాటైన పని మిగిలిన శ్రమలకంటే మెరుగ్గా కనిపించే ధోరణి ఉంటుంది.

ఆ భావన నుంచి వారిని బయటపడేయాలంటే ఏదో ఒక వైపునుంచి ఇంటర్‌వెన్షన్‌ అవసరం. లేదంటే ఏదో ఒక టైంలో ఆకలి ఆ పని మరింత క్రూరంగా చేసి చూపిస్తుంది. ఇంటిల్లిపాదీ పనిచేసినా రోజుకు వంద రూపాయలు కూడా మజూరీ ఇవ్వని చోట మగ్గం పని గ్రామీణ ఉపాధి కూలీ కంటే ఏ రకంగా మెరుగు? మనుషులు దున్నపోతుల్లా కూర్చుని ఉంటే ఒక బక్కపల్చని మనిషి రెక్కలతో లాక్కుపోయే టాంగాను నువ్వెలా చూస్తావన్నదానిమీద నీ దృక్పథం ఆధారపడి ఉంటుంది. సాంకేతికత ఇంత పెరిగిన ఈ దశలో కూడా ఇది కొనసాగడం అమానవీయం, అన్యాయం అనే భావన నీకుంటే నీ భాష వేరే ఉంటుంది. లేకపోతే “పేదరికం, ఏం చేస్తారు” అని పరోక్షంగా సమర్థించే ప్రమాదం ఉంది. అవి ఉండడానికి వీల్లేదన్నవాళ్లంతా వాళ్లు ఆకలిచావులు చావాలని కోరుకుంటున్నవాళ్లేమీకాదు. ముందుగా అది అమానవీయం అని గుర్తిస్తే దాన్ని గట్టిగా ప్రకటిస్తే ఆ మేరకు వ్యవస్థ మీద ఒత్తిడి పెడితే ప్రత్యామ్నాయం ఏదో ఒకటి దొరుకుతుంది. ఎంతో చైతన్యవంతులం అనుకునే వారు కూడా గూడు రిక్షాలో బెజవాడలో తిరుగుతుంటే ఎంత బాగుంటుందో అనేసుకున్నారనుకో!

ఇక అది అన్యాయమనే చైతన్యం సమాజానికి ఎక్కడినుంచి వస్తుంది? అలవాటైన మనిషి మార్పుకు సిద్ధపడే ఒత్తిడేదో ఉండాలి. చైతన్యవంతులైన వ్యక్తులు శక్తులు దానికి చోదకశక్తిలాగా పనిచేయాలి. వెనక్కు లాగ్గూడదు. ఒంటిని చర్నాకోలతో కొట్టుకుని, బిడ్డలను తాడుమీద నడిపించే అడక్కతినే విన్యాసాలను చూసి “ఆహా ఏమి ఆర్ట్‌” అనుకునే వారుంటారు. రచయితలైనా కాకపోయినా వీరిలో చాలామంది పురోగామి ముసుగులోనే ఉంటారు. వీరిలో కొందరు చివరకు కళావతులు, దేవదాసీ వృత్తులను కూడా ఆరాధిస్తారు. గొప్ప కళ అండీ అంటారు. వర్కింగ్‌క్లాస్‌ కల్చర్‌ ఉన్నోళ్లమయితే మనమేమని అడగాల? అంత మంచి ఆర్ట్‌ అయితే మీ బిడ్డలెందుకు తాడుమీద ఎక్కరు సార్‌! అంత గొప్ప ఆర్ట్‌ అయితే ఆ దేవదాసీల్లో మీ వాళ్లెందుకు కనిపించరు సార్‌! ఓ అని ఒకటే పొగిడే మీరు ఆ ఆర్ట్‌లను ఎందుకు ప్రాక్టీస్‌ చేయరు సార్‌,ఏదైనా నేర్చుకుంటే వస్తాది గదసార్‌! అని అడగాలా, వద్దా! అడక్కతినే స్థాయిలో ఉన్న అన్యాయమైన పనిని ఎవరైనా ఆర్ట్‌ పేరుతో పొగిడితే తప్పనిసరిగా కఠినంగా స్పందించాల్సిందే. కోపం రావాల్సిన చోట రాకపోతే మనలో ఏదో లోపం ఉన్నట్టే లెక్క.

మార్పు అనివార్యమైనపుడు దానికి తగినట్టుగా సిద్ధం కావడం, సిద్ధం చేయడం మన బాధ్యత. ఈ మార్పులో సానుకూలమైనవేవో ప్రతికూలమైనవేవో బేరీజు వేసుకుని దానికి అనుగుణమైన చైతన్యాన్ని పెంపొందించుకోవడం మన బాధ్యత. కొత్త ఆర్థిక వ్యవస్థ మనల్ని వస్తువుల వెంట పరిగెట్టేట్టు చేస్తుంది. ఆ వస్తువుల ఉత్పత్తి నిరంతరం అవసరయయ్యేలా చేస్తుంది. భావజాల పరంగా ఆ అవసరాన్ని కూడా అది నిరంతరం సృష్టిస్తూనే ఉంటుంది. ఆ నిరంతర వినిమయం, ఉత్పత్తిలో భాగంగా ఉపాధి పెరుగుతుంది. ఆ పరుగు ఆగితే వ్యవస్థలో సంక్షోభం ఏర్పడుతుంది.  అదే సమయంలో ఆ పరుగుకు అడ్డు వచ్చే తాబేటి వ్యవస్థను దాని తాలూకు చిహ్నాలను మార్చుకుంటూ వెడుతుంది. కొన్నింటినైతే రద్దు చేస్తూ వెడుతుంది. అందులో ఇప్పటివరకూ అణచివేతకు వివక్షకు గురైన సమూహాలకు ఊరటనిచ్చే కొన్ని విషయాలుంటాయి.

ఇప్పటివరకూ కొన్ని పనులను నీచంగా విలువ తక్కవగా చూసిన వారు కూడా ఆ  పనులను చేయాల్సిన అవసరం కల్పిస్తుంది. ఆ పనికి అంతకుముందు లేని గౌరవాన్ని ఆపాదిస్తుంది. ఒక్క ముక్కలో ఆయా పనులను మార్కెట్‌ చేయడానికి అడ్డొచ్చే అనవసరమైన న్యూనతలను, అనవసరమైన గౌరవాలను రద్దుచేస్తుంది. కనీసం తగ్గిస్తుంది. కొత్త వ్యవస్థ కేవలం పట్నాలకే పరిమితం కాదు. టీవీ ఇంటర్‌నెట్‌ వంటి సాధనాలు, మెరుగుపడిన రవాణా సాధనాలు పల్లె-పట్నాల మధ్య తేడాను చెరిపేసుకుంటూ వస్తున్నాయి. ఈ చెరిపివేయడం వల్ల కొంతమందికి అలవాటైన సౌఖ్యాలు, గౌరవాలు, మర్యాదలు తగ్గిపోతాయి. అయ్యవారు అనో రెడ్డీ అనో రాజుగారు అనో దొరా అనో గౌరవ సంబోధనలను కోల్పోయిన వారికి ఉక్కపోత ఉంటుంది. ఆ ఉక్కబోతను అలాగే ప్రదర్శించుకుంటే దాని కథ వేరే!

అలా కాకుండా శ్రామిక కులాల పాత్రలను పెట్టి పెద్ద మెలోడ్రామాలను సృష్టించి ఇంకా అవసరమనుకుంటే పాత్రలను చంపేయడం లాంటి విన్యాసాలు చేసి నాలుగు పాదాల సంస్కృతి పోయినందుకు బాధపడితే మాత్రం బాధేస్తుంది! ప్రపంచీకరణ అనే భూతాన్ని పోటీగా నిలబెట్టినంత మాత్రాన అలాంటి వాదన న్యాయమైనదైపోదు! పీడిత కులాల నుంచి వచ్చినవారు, నిజంగా వర్కింగ్‌ క్లాస్‌వైపు నిలబడేవారు ఇక్కడ కన్ఫూజ్‌ అయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఈ మాయలో పడే ప్రమాదం ఉంది. అది సాహిత్యంలో చూచాయగా కనిపిస్తున్నది. కొత్త వ్యవస్థలో ఉన్న దుర్మార్గాలను ప్రశ్నించడమూ, అంత కంటే దుర్మార్గమైన పాత వ్యవస్థను ప్రేమించడమూ రెండూ ఒకటి కావు.

కొత్త ఆర్థిక వ్యవస్థ రెండు రకాల మార్పులు తెస్తుంది. ఒకటి- కులానికి వృత్తికి మధ్య ఉన్న బంధాన్ని తెంచేయడం, రెండు- సోషల్‌ మార్కర్స్‌ను మెటీరియల్‌ మార్కర్స్‌గా మార్చడం. పల్లెలో నీ ఉనికి నీ కులంతోనే ముడిపడి ఉంటుంది. ఏ ఊరిలో నైనా ఎవరిగురించైనా అడిగితే ఏంటోళ్లు అని ప్రశ్నిస్తారు. అదే పట్నంలో అయితే ఏం చేస్తారు అని అడుగుతారు. అక్కడ గుర్తింపు నీ కులం. ఇక్కడ గుర్తింపు నీ పని. నీ గుర్తింపు నీకు సంబంధం లేని పుట్టుకతో ముడిపడి ఉండడం కంటే నువ్వు చేసే పనితో ముడిపడి ఉండడం కచ్చితంగా మెరుగైన విషయం. కొత్త వ్యవస్థ  సంప్రదాయకంగా సాగుతున్న వృత్తి పనులను మార్కెట్‌ చేసి కొత్త విలువను ఇస్తుంది. అంతకు ముందు మార్కెట్‌ చేసుకోలేని విషయాలను బ్రాండ్‌గా మార్చివేసి కొత్త మేకప్‌ వేస్తుంది. ఆరోగ్యం కాస్తా ఫిట్‌నెస్‌ అనే మార్కెట్‌ పదంగా మారుతుంది.

సంప్రదాయ వ్యాయామశాలల స్థానంలో ఆధునికమైన జిమ్‌ మార్కెట్‌ ప్రవేశిస్తుంది. చిలకజోస్యాలు పిచ్చి లాజిక్కులతో న్యూమరాలజీ-వాస్తు రూపం తీసుకుంటాయి. బాత్‌రూమ్‌లు, లెట్రిన్‌లు క్లీన్‌ చేయడమనే పని మెయిన్‌టెయిన్స్‌ అనే రూపం తీసుకుని కొత్త డ్రస్ తొడుక్కుంటుంది. యూనిఫామ్‌, మెడలో ఐడెంటిటీ కార్డు లాంటివి కొత్త ఆత్మవిశ్వాసాన్ని, చైతన్యాన్ని ఇస్తాయి. కావాలంటే ఇళ్లలో పనిచేసే వారిని పరిశ్రమల్లో అదే పనిచేసేవారిని పోల్చిచూడండి. హౌస్‌ వైఫ్‌  అనే పదం దానికున్న న్యూనతను తొలగించుకుని హోమ్‌మేకర్‌ అనే ఆధునిక రూపం తీసుకుంటుంది. దర్జీపని  బాతిక్‌ రూపమెత్తుతుంది. చాకలి పని డ్రైక్లీనింగ్‌ రూపమెత్తి పరిశ్రమగా రూపుదాలుస్తుంది.  వంటపని కొత్త గౌరవాన్ని సంతరించుకుని గౌరవనీయమైన వృత్తిగా అవతరిస్తుంది. ఈ రంగంలో సూపర్‌ స్టార్‌ సంజీవ్ కపూర్‌ స్ర్తీ కాదు. వెంట్రుకలు కత్తిరించే పని ఇంతకుముందు లాగా అగౌరవంగా ఉండదు.

అందులో కులాన్ని తీసేసి కొత్త వర్గాల్ని ప్రవేశపెడుతుంది మార్కెట్‌. ఎదురుగా అద్దం తగిలించి కబుర్లు చెపుతూ బ్లేడుతో గడ్డం గీకడం ఒక వర్గం. కత్తెర చేత్తో పట్టుకుని ఏ స్టైల్‌చేయాలి సర్‌ అని అడిగేదొక వర్గం. పిలకజుట్టో పిల్లగడ్డమో పెట్టుకుని చొక్కా ఫ్యాంటు మీద అప్పటికప్పుడు ఒక బెల్టు లాంటిది తగిలించుకుని అందులోని ఆధునిక పొత్తి లోంచి కత్తెర్లు విలాసంగా ఎగరేసి తీస్తూ మీకు సెపరేషన్‌ కంటే సెపరేషన్‌లేకుంటేనే బాగుంటుంది సర్‌ అనేదొక వర్గం. పాత మంగలి పొత్తికి ఈ పొత్తికి మధ్య చాలా దూరం ఉంది. హబీబ్‌ ఇవ్వాల నేషనల్‌ స్టార్‌. ఆయన మంగలి కాదు. ఆయన శిష్యులు ప్రశిష్యులు వేలు లక్షలుగా మారి చిన్నచిన్న పట్నాల్లో కూడా సెలూన్లు తెరుస్తున్నారు. వాళ్లల్లో మంగళ్లు ఉన్నారో లేదో వెతుక్కోవాల్సిందే. మంగలిషాపు సెలూన్‌గా మారే ప్రక్రియ ప్రజాస్వామిక మైనది. ఇది వారి వృత్తిని దోచుకున్నదేమీ కాదు. ఎక్కువమంది ఆధారపడిన వృత్తి విషయంలో మార్పుసంక్లిష్టంగా ఉంటుందనేది వాస్తవం. కానీ ఆ సంక్లిష్టతలో మనం స్టేటస్‌ కోయిస్టుల పాత్ర పోషించరాదు.

పనికి పుట్టుకకు మధ్య ఉన్న సంబంధాన్ని తెంచడం వల్ల దానికి మార్కెట్‌ కల్పించడం వల్ల అన్ని కులాల వారు అన్ని పనులు చేయడంలో పోటీ పడే పరిస్తితి వస్తుంది. అత్యంత అమానవీయమైన వేశ్యావృత్తి కూడా రూపం మార్చుకుంది. ఇంతకుముందు కొన్ని కులాలకు పరిమితమైన వృత్తి ఇవాళ సెక్స్‌ వర్కర్స్‌ రూపమెత్తింది. అందులో వర్గాల వారిగా అన్ని కులాల వారు కనిపిస్తున్నారు. చివరకు ఆధ్యాత్మికత కూడా ఇండస్ర్టీగా మారిపోయి బోధకుల్లో గురువుల్లో బాబాల్లో బ్రాహ్మణేతర కులాల వాళ్లు చాలామంది రాణిస్తున్నారు. మంచి మాటకార్లకు బోలెడంత డిమాండ్ ఉంది. అమ్మోర్ల నుంచి బాబాల దాకా చాలా దూరమే ప్రయాణించాం. కాకపోతే సంప్రదాయకంగా మిగిలిపోయిన పూజారితనంలోకి శ్రామిక కులాలు రాకుండా ఆటకం ఉంది. డ్రైనేజీలో దిగి మురికిని బయటకు తోడివేసే పనిలోకి బ్రాహ్మణులు వస్తున్న పరిస్థితి లేదు.(ఇంత ఆధునిక యుగంలో కూడా ఇంకా మనుషులు డ్రైనేజీలోకి దిగాల్సి రావడం ఈ వ్యవస్థ శ్రామికుల పట్ల చూపిస్తున్న దుర్మార్గానికి దర్పణం) చేపలు పట్టే పనిలో  ఆధునికత తగినంత రాకపోవడం వల్ల అక్కడా లోటు కనిపిస్తున్నది. ఇలాంటి కొన్ని ఉదాహరణలు మినహాయిస్తే  మిగిలిన చాలా పనులతో కులబంధం బలహీన పడింది. ఇంతకుముందు చీప్‌గా చూసిన శ్రమలకు విలువ పెరుగుతున్నది.
ఆధునిక కత్తెర్ల పొత్తి మాదిరే మార్కెట్‌ వ్యవస్థ డబ్బు ఖర్చుపెట్టడంలో నీ శక్తి ఆధారంగా కొత్త రకమైన వర్గీకరణలను చేస్తుంది. మార్కెట్‌ కొత్త రకం కులాలను తయారుచేస్తుంది అని కూడా అనొచ్చు కానీ కులంలోఉండే పుట్టుక వ్యవహారం ఇక్కడ ఉండదని గుర్తించాలి. డబ్బు ఆర్జించడంలో నీకున్న శక్తి మాత్రమే ఇక్కడ పనిచేస్తుంది. పాతకాలపు స్టెనో గ్రాఫర్‌తో పోల్చదగిన మెడికల్‌ ట్రాన్‌స్క్రిప్షన్‌, బిపివో, కాల్‌ సెంటర్‌ల పని కూడా ఇప్పుడు గొప్ప గ్లామర్‌ను సంతరించుకుంటుంది. డబ్బు మహిమ! సహింపరానంత అసమానతలు పెరిగిపోతూనే ఉంటాయి. నిరంతరం పోటీ పడుతూనే ఉంటావు కాబట్టి సరిపోని తనం అనేది నీకు గుదిబండలాగా కట్టేసే ఉంటుంది. లేనితనం ఒకటి అందని ద్రాక్షలాగా నిన్ను శాశ్వతంగా ఊరిస్తూనే ఉంటుంది. మార్కెట్‌- మీడియా ఈ లేనితనాన్ని సరిపోని తనాన్ని ఎప్పటికప్పుడు సృష్టిస్తూనే ఉంటాయి.

న్యూనత అసంతృప్తి అనేవి ఎల్లప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి. నువ్వు చచ్చేదాకా ఊపిరాడకుండా నిలువనీయకుండా చేస్తూనే ఉంటాయి.  అది టాల్‌స్టాయ్‌  “హౌ మచ్‌ లాండ్‌ డస్‌ ఏ మ్యాన్‌ రిక్వైర్‌” కథలో పరుగులాంటిది . అలాంటి ఒత్తిడి నిరంతరం మనల్ని తరుముతూ ఉంటుంది.  కోతుల్ని చేసి ఆడిస్తుంది.  కొన్ని ఆలోచనలు,కొన్ని స్పందనలు ఉన్న మనిషిగా కంటే నిరంతరం వస్తువులు కొనే వినియోగదారునిగా మాత్రమే చూస్తుంది. నిలుచుని ఆలోచించే తీరిక లేకుండా చేస్తుంది. నీకు నిన్ను పరాయివాడిని చేస్తుంది. మాయా తెరలను సృష్టిస్తుంది. తెర సౌకర్యం స్థాయిని దాటిపోయి వ్యసనమై కూర్చుంటుంది. మనిషి తోటి మనిషితో కాకుండా తెరతో సంపర్కం చేసి మాయా సంతృప్తి పొందే తెరాధునికత లక్షణాన్ని మన జీవితంలోకి తెస్తుంది. ఇవన్నీ చర్చించాల్సినవే. కథనం చేయాల్సినవే. చాలామంది చేస్తున్నారు కూడా. కొందరే ఇంకా పాత మాయను మోసుకు తిరుగుతున్నారు. అది మాయ కదా, కొత్త జీవం కడుపులోంచి బయటపడ్డాక దానికి విలువ ఉండదు. ఆ తర్వాత కూడా మోసుకు తిరుగుదామంటే కంపు కొడుతుంది. ఆ కంపును వదులుకోవాల్సిందే. పుట్టుక ఆధారంగా నీ వృత్తిని దాని గౌరవాన్ని నిర్ణయించే నాలుగు పాదాల వ్యవస్థను ఏ సాకుతో కీర్తించినా అది అన్యాయం. శ్రామిక వ్యతిరేకం.

 

-జి ఎస్‌ రామ్మోహన్‌

మీ మాటలు

  1. చాలా బాగా చెప్పారండి. ప్రగతి ఎప్పుడు పర్సనల్ వ్యవహారమే చాలా మందికి.

  2. న్యాయమైన ఆవేదన. ఆత్మవంచకులకు చెంపపెట్టు. ముఖ్యంగా పాత బూజును పట్టుకు వేలాడే అమెరికా తెలుగు రచయితలకు . తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తూ అందరికీ తెలుగు మీడియం చదువులు కావాలని తెలివిగా వాదించే దొంగలకు..

  3. చాలా అద్భుతంగా ఉంది. పనికి పుట్టుకకు మధ్య ఉన్న సంబంధాన్ని తెంచడం చాలా గొప్ప విషయం. ప్రవాహంలా చదివింప చేసిన వ్యాసం. కుడోస్ డియర్ రామ్మోహన్.

  4. Excellent

  5. మీ విశ్లేషణ చాల బాగుంది

    ఆధునిక పెట్టుబడి దారీ వ్యవస్థ దాని మానస పుత్రిక ఐన మార్కెట్ భారత దేశం లాంటి కుల వ్యవస్తలో మార్పు చాల సక్లిష్టనగా ఉంటుంది. మన దేశం లో మార్కెట్-అధికార-రాజకీయ సంబంధాలు అంతిమంగా కుల అధరితంగానే ఉంటుంది. .

    మన దగ్గర కమ్యూనిస్ట్ ఆలోచనాదిపత్యంతో అంతిమంగా రాజ్యదికరం తోనే మార్పు వస్తుందనే అవగాహన ఉంది. కానీ సాహిత్యం ప్రధాన వస్తువుగా భౌదిక-భౌతిక శ్రమల మద్య అంతరాలు లేని సమాజమే లక్ష్యంగా ఉండాలని కోరుకుంటూ…..

  6. amarendra says:

    ఎప్పుడో రావలసిన వ్యాసమిది..ఇప్పటికయినా వచ్చినందుకు సంతోషం గా ఉంది ..కనీసం ఇది చదివిన రచయితలయినా తమ తమ భావాలను ఒక సారి ఉతికి ఆరేసుకొంటే బావున్ను!

  7. I feel like me talking to myself.

    చాలా మందికి రొమంటిక్‌గా ఆలోచించడం ఒక అలవాటైకూర్చుంది. మనమ్మాత్రం కారుల్లోనూ, విలాసాల్లోనూ మునిగితేలాలి. మిగిలివాళ్ళుమాత్రం పేదరికంలో మునిగిపోతూ సంస్కృతిని ఉధ్ధరిస్తుండాలి.

  8. Naraparaju vijaya sri says:

    నిజంగా ఇలాంటివి చదివి చదివించటం వలన వ్యక్తుల ఆలోచనలలో మార్పు తప్పకుండా వస్తుంది

  9. లక్ష్మణరావు says:

    “కొత్త జీవం కడుపులోంచి బయటపడ్డాక దానికి విలువ ఉండదు. ఆ తర్వాత కూడా మోసుకు తిరుగుదామంటే కంపు కొడుతుంది. ఆ కంపును వదులుకోవాల్సిందే. పుట్టుక ఆధారంగా నీ వృత్తిని దాని గౌరవాన్ని నిర్ణయించే నాలుగు పాదాల వ్యవస్థను ఏ సాకుతో కీర్తించినా అది అన్యాయం. శ్రామిక వ్యతిరేకం”. ఇది చాలా విలువైన మాట. అభ్యదయం పేరిట, ప్రగతి పేరిట, విప్లవం పేరిట తెలిసో తెలియక గతం గొప్పదంటూ సాహిత్య సేవ చేసే వారికి విడమరిచి చెప్పారు. విశాల ప్రపంచాన్నిచూపించారు. చూడాల్సిన కోణాన్ని కళ్లకు కట్టినట్లు చూపారు. ఇప్పటికీ ఎ.టి.ఎం. వద్ద గార్డు పని చేయడాన్ని చిన్న చూపు చూసే వాళ్లకి లోపం ఉందనే చెప్పాలి. కనీసం ఇప్పటికైనా వాళ్లు మారాలని కోరుకుంటున్నాను.

  10. రామ్ మోహన్ గారు థాంక్స్ ధైర్యం గా రాసారు ధైర్యం ఇచ్చారు . రాస్తూ ఉండండి ప్లీజ్

  11. మంజరి లక్ష్మి says:

    ” ఒంటిని చర్నాకోలతో కొట్టుకుని, బిడ్డలను తాడుమీద నడిపించే అడక్కతినే విన్యాసాలను చూసి “ఆహా ఏమి ఆర్ట్‌” అనుకునే వారుంటారు. రచయితలైనా కాకపోయినా వీరిలో చాలామంది పురోగామి ముసుగులోనే ఉంటారు. వీరిలో కొందరు చివరకు కళావతులు, దేవదాసీ వృత్తులను కూడా ఆరాధిస్తారు. గొప్ప కళ అండీ అంటారు. వర్కింగ్‌క్లాస్‌ కల్చర్‌ ఉన్నోళ్లమయితే మనమేమని అడగాల? అంత మంచి ఆర్ట్‌ అయితే మీ బిడ్డలెందుకు తాడుమీద ఎక్కరు సార్‌! అంత గొప్ప ఆర్ట్‌ అయితే ఆ దేవదాసీల్లో మీ వాళ్లెందుకు కనిపించరు సార్‌! ఓ అని ఒకటే పొగిడే మీరు ఆ ఆర్ట్‌లను ఎందుకు ప్రాక్టీస్‌ చేయరు సార్‌,ఏదైనా నేర్చుకుంటే వస్తాది గదసార్‌! అని అడగాలా, వద్దా! అడుక్కతినే స్థాయిలో ఉన్న అన్యాయమైన పనిని ఎవరైనా ఆర్ట్‌ పేరుతో పొగిడితే తప్పనిసరిగా కఠినంగా స్పందించాల్సిందే. కోపం రావాల్సిన చోట రాకపోతే మనలో ఏదో లోపం ఉన్నట్టే లెక్క.” ఇది నాకు బాగా నచ్చింది. ఈ మధ్యే పుస్తకం నెట్లో ఈ ఆర్ట్ కల్చర్ బతికుండాలంటే దేవదాసిలుండాలి, అడుక్కుతినే (డెక్కలి కులం?)వాళ్ళుండాలి. అన్ని రకాల సాంప్రదాయ కులాలు వర్ధిల్లాలి అని ఒకాయన రాస్తున్నారు. ఆ ఆలోచన ఎంత నీచమైనదో (మీ ప్రకారం ఎంత బూతో అనాలా?) ఎవరెంత చెప్పినా ఆయనకర్ధం కావటం లేదు. ఈనాడున్న పెట్టుబడి దారి వ్యవస్థలో ఉన్న ఘోరాలను చూపించి లక్ష తిట్లు తిట్టండి ఒప్పుకుంటాము కానీ దానికి ప్రత్యామ్నాయంగా ఫ్యూడల్ కల్చర్ ని గొప్పగా చూపించి, దాన్ని తీసుకురావాలి అనటం మాత్రం ఘోరమైన విషయం.

    • Thirupalu says:

      //అన్ని రకాల సాంప్రదాయ కులాలు వర్ధిల్లాలి అని ఒకాయన రాస్తున్నారు. ఆ ఆలోచన ఎంత నీచమైనదో (మీ ప్రకారం ఎంత బూతో అనాలా?) ఎవరెంత చెప్పినా ఆయనకర్ధం కావటం లేదు. //
      చాలా బాగా చెప్పారండి. విశ్వనాధ సత్యనారయణ అక్క డ వీ విహారం చేస్తున్నాడు.

      రమ్మోహన్‌ గారు, అద్బుతంగా ఉంది మీ వ్యాసం- అంత కంటె మీ శైలి మరీ అద్బుతం.

  12. వి. శాంతి ప్రబోధ says:

    మంచి విశ్లేషణ. ప్రస్తుత పరిస్తితుల్లో చాలా అవసరమైన విశ్లేషణ.

  13. kishore kumar says:

    నీ గుర్తింపు నీకు సంబంధం లేని పుట్టుకతో ముడిపడి ఉండడం కంటే నువ్వు చేసే పనితో ముడిపడి ఉండడం కచ్చితంగా మెరుగైన విషయం.
    చాలా బాగా రాశారు.. సార్.

  14. ఆలస్యంగా చదివాను. చాల మంచి వ్యాసం.

  15. E Sambookudu says:

    సార్, మీ వ్యాసాలు చాలా బాగుంట్నున్నాయి. యిలాంటి వ్యాసాలు చాలా రావాలి. ప్రజా రచయితలు అనుకుంటున్న వారిలోనే సరైన అవగాహన లేదు.ముందుగా వీరు మారాల్సి ఉందని భావిస్తున్నాను.అభినందనలు.

  16. madhusudanarao.v. says:

    adhbhutam

  17. Krishna Veni Chari says:

    Marvellous piece. Reading it a bit late.

  18. వాగీశ్ says:

    చాలా లేట్ గ చూసిన మీ వ్యాసాన్ని. గతాన్ని అర్థం లేకుండా రొమాంటిసైజ్ చేసే దుర్మార్గాన్ని ఎటువంటి మెతక ధోరణి లేకుండా చెప్పిన తీరుమంచిగున్నది. కులానికీ పనికీ నడుమ ఉన్న లింకు తెగిపోతున్నది నిజం.పాత కాలం చచ్చిపోతున్నప్పుడు ఆ పోతున్న పాత లోపట సర్వకాలాలకు పనికివోచ్చేది ఏమైన ఉన్నదా ,ఉండే అవకాశం ఉన్నదా అన్న ఆలోచన కొంత చెయ్యాల్సి ఉంటుందనీ అనిపిస్తుంది నాకు. పై వాక్యం అన్నప్పుడు అమానవీయమైన పాత ను నెత్తికిఎత్తుకొవలిసన అవుసరం లేదు . మేధస్సు శరీరశ్రమల( అవి రెండు ఏ మొతాడులోకలిసినా) కలయిక గా ఉన్న తెలివిడి కి ఆధునిక జ్ఞాన రాసికీ సంబంధం ఎట్లా కుదిరిచ్చాలే అనే ఆలోచన అవుసరం అనిపిస్తుంది.( ఈ మాట అంటున్నప్పుడు పై రెండు రకాల శ్రమల మధ్య ఉన్న ఉన్నత నిమ్న తేడాను తోసివేసే వ్యూహాలను సంస్కారాన్నీ మరిచిపోకూడదు )-.ఎందుకంటే సాకేతిక వికాసం స్థానికత ల నుకలిపే ఆప్రాప్రిఎట్ టెక్నాలజీ అనేది భిన్నతల మనుగడ దృష్ట్యా ,పర్యావరణం తొ సహజీవన రీత్యా ,పాత నుడి నుండి కొత్త లోకి ఇష్ట పూర్తిగానో బలవంతంగానో వొస్తున్నా వారికీ కొంత అదేరువుగా ఉంటుది గనుక జ్ఞ్యానాల కలయిక పై కొంత శ్రద్ధ అవుసరమెమెఒ అనిపిస్తుంది.పాతలోని అమానవీయ అంశాని తిరస్కరించే టప్పుడు కరుకుగా ఉండాలె అదే సంయమలో ప్పతలో పనికి వొచ్చే దాన్ని చూసే వొడుపు కూడా ఉన్ద్దలే . ఒకటి మాత్రం నిజం మీవ్యాసం నోస్టాల్జిక్ మొసలి కన్నీళ్లు కార్చే దొంగలకు మాత్రం చెంప పెట్టు ,మీ రెట్టకు ఎప్పుడూ అటువంటి సత్తువ ఉండాలని కోరుకుంటున్నాను.

  19. చా, ఎలా మిస్సయ్యానిది ఏడాది పాటు!!
    వెనుకటి రోజులు మంచివంటూ వ్యవస్థను రామరాజ్యం వైపు నడిపించాలనుకునే వారికి చెంపపెట్టు.

మీ మాటలు

*