ఒక్క నీకు మాత్రమే…

Ravi_Verelly

మలుపు మలుపులో మర్లేసుకుంటూ

ఏ మైలురాళ్ళూ లేని తొవ్వలో

ఏ కొలమానమూ లేని కాలాన్ని మోస్తూ

తన కోసం కాని నడక నడుస్తూ

నది.

అట్టడుగు వేరుకొసని

చిట్టచివరి ఆకుఅంచుని

కలుపుతూ పారే

మూగ సెలయేటి పాట వింటూ

తనలోకి తనే వెళ్తూ

చెట్టుమీదొక పిట్ట.

 bird

నడిచి నడిచి

అలసి

ఏ చిట్టడివి వొళ్లోనో

భళ్ళున కురిసే కరిమబ్బులా

కనిపించని నీ దోసిట్లో

ఏ ఆకారమూ లేని

ఏ స్పర్శకూ అందని

ఒక్క నీకు మాత్రమే కనిపించే

ఒకానొక పదార్ధంగా కరిగిపోతూ

నేను.

కరిగి ప్రవహించడం తెలిసాకే-

మట్టిని ఇష్టంగా తాకే కాలి గోటికి

మింటిని గర్వంగా కొలిచే కంటి చూపుకి మధ్య

చుట్టరికం తెలిసింది.

– రవి వీరెల్లి

మీ మాటలు

 1. Harikrishna mamidi says:

  కరిగి ప్రవహించడం తెలిసాకే-

  మట్టిని ఇష్టంగా తాకే కాలి గోటికి

  మింటిని గర్వంగా కొలిచే కంటి చూపుకి మధ్య

  చుట్టరికం తెలిసింది.
  Wonderful lines ravi veerelli garu..

 2. ns murty says:

  రవి గారూ,

  అద్భుతమైన Synthesis .

  హృదయపూర్వక అభినందనలు.

 3. Subrahmanyam Mula says:

  చాలా బావుంది రవి గారు.

 4. రవి గారూ,
  చాలా బావుంది. భలే రాస్తారండీ మీరు సింపుల్ గా, గ్రేస్ ఫుల్ గా. అభినందనలు.

 5. Chaalaa baavundi Ravi garu.

 6. చివరి పాదాలు హత్తుకున్నాయి సార్.. చాలా హృద్యమైన చిత్రాన్ని కవితగా ఆవిష్కరించారు.. అభినందనలతో..

 7. చాలా బావుంది, రవి గారూ! మామూలు పదాలతో గాఢమైన భావాన్ని సృష్టించడం మీలాంటి చాలా కొద్ది కవులకే సాధ్యమౌతుందండీ!

  ఇవి బాగా నచ్చాయి…

  “నడిచి నడిచి

  అలసి

  ఏ చిట్టడివి వొళ్లోనో

  భళ్ళున కురిసే కరిమబ్బులా..”

 8. balasudhakarmouli says:

  కవిత వొక అలలా కదిలింది. నీటి పాయలా కనువిందుగా సాగింది. నిర్మాణం అద్భుతంగా వుంది. ప్రకృతితో మీ మానసికమైన అనుభవాన్ని కవిత్వం రూపంలోకి అద్భుతంగా అనువదించారు. కవిత్వ శిల్పానికి ముందుగా నా అభివాదములు. థ్యాంక్యూ రవి గారూ…………….

 9. Thirupalu says:

  నిర్మాణం అద్భుతంగా వుంది.

 10. రవి వీరెల్లి says:

  స్పందించిన మిత్రులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు!

 11. SREEDHAR BABU PASUNURU says:

  హాయిగా.. అద్భుతంగా ఉంది మీ కవిత రవి వీరెల్లి గారూ..

మీ మాటలు

*