ఆ శ్వాసలోనే నేను!

993814_10203124635462493_466792128_n

1.

ఊరు చివర్న ఆ ఎత్తైన  బండరాయికి

బొత్తిగా గుండె లేదనుకునే వాణ్ణి!

నా మీద నేనలిగినపుడో

నా మధ్యలో  నేనే నలిగిపోయినపుడో

హఠం పట్టి దానిపై పీఠమేసుకుని  కూర్చుంటే

తానో నులక పానుపై పలకరించి అలక తీర్చినపుడు గానీ

తెలిసేదికాదు  దాని జాలి గుండె!

Sketch296113337-1

2.

రోడ్డు చివర్న ఊడలమర్రికసలు బుర్రలేదనుకునే వాణ్ణి!

అలసిన నా వయసుని కాసేపు ఒళ్లో కూర్చోబెట్టుకుని

ఆకుల వింజామరలతో వీచి

పునర్యవ్వనాన్ని నిమిరితే  గానీ తెలిసేది కాదు

ప్రాణ వాయువునంతా ప్రోదిచేసి

ఊడల సెలైన్లు దింపి మరీ

నర నరాల్లోనూ  సేద తీరుస్తోందని!

౩.

ఏపుగా పెరిగి వంగిన వరి చేనుకు

వెన్నుపూస అసలే లేదనుకునే వాణ్ణి!

ఒక్కసారి పంటచేల ముందు మోకరిల్లితే చాలు

నా విషాదపు  కంటి రెటీనా మీద ఓ పచ్చటి రంగుల తైల చిత్రం

ఆహ్లాదంగా ఆవిష్కరింపబడ్డప్పుడు గానీ

తెలియలేదు కునారిల్లిన నా  మనసుకది

ఎంత వెన్నుదన్నుగా నిలిచి ఊతమిస్తోందో!

4.

మట్టిమశానానికి అసలు

శ్వాసే లేదనుకునే వాణ్ణి!

ఏ తొలకరి జల్లో

ఎండిపోయిన నా వలపు మడిని

తాకినపుడు ఆశాపరిమళంలా ఎగిసిన మట్టివాసన

పీల్చినప్పుడుగానీ తెలియలేదు, పుట్టినప్పటినుంచి

గిట్టేవరకూ దాని శ్వాసే నా నేస్తమని!

–వర్చస్వి

మీ మాటలు

  1. వర్చస్వి గారూ బండ రాయీ , మర్రివూడా , వేపచెట్టు , మట్టీ ప్రతి బతుకుల్లోనూ ఉంటాయి . ఇలా అందంగా గుండె నిండేట్టు చెప్పడం బాగుంది . ఎంతైనా చిత్రకారులు కదా ! మీ కవిత మీ చిత్రం కంటే చాలా చాలా బాగుంది . కవితకు తగ్గ చిత్రాన్ని కూడా ఇక్కడ ఇవ్వడం బాగుంది . ధన్యవాదాలు

  2. Varchasvi says:

    ధన్యవాదాలు kaasi raju గారూ! నా రాతా, గీతా మీకు నచ్చినందుకు !

  3. “ఏ తొలకరి జల్లో/ ఎండిపోయిన నా వలపు మడిని/ తాకినపుడు ఆశాపరిమళంలా ఎగిసిన మట్టివాసన / పీల్చినప్పుడుగానీ తెలియలేదు, పుట్టినప్పటినుంచి / గిట్టేవరకూ దాని శ్వాసే నా నేస్తమని!” వర్చస్విగారు మీ హృదయ క్షేత్రంలో కురిసిన ఆ తొలకరి జల్లు సహృదయ పాఠకుని ఉల్లాన్ని రంజింపజేసిందనడంలో ఎటువంటి విప్రపత్తి లేదు. మట్టి వాసనను మల్లెల వాసనలా మనస్సులో గుబాళించేట్టు రసానుభూతిని రమణీయంగా అందించినందుకు ధన్యవాదాలు.

    మంగు శివ రామ ప్రసాద్, విశాఖపట్నం, సెల్: 9866664964

  4. వర్చస్వి గారు చాలా బాగా చెప్పారు. మన చుట్టూ వున్న ప్రాకృతిక అంశాలు మనలోలోపలి అనుభూతులను తట్టిలేపుతాయని వాటితో మన అనుబంధాన్ని చక్కని కవితలో బాగుంది. చిత్రం కూడా తగ్గట్టుగా వుంది. అభినందనలు.

  5. balasudhakarmouli says:

    కవిత మంచి అనుభూతిని యిచ్చింది.

  6. Thirupalu says:

    అవును. ఇక్కడ శిలాజాలై పోయిన శిలలకు ప్రాణ వాయువునందిస్తున్నాడు. బావుంది.

  7. వర్చస్వి says:

    కవితాంతరంగం లో రసానుభూతి చిందిందన్న మంగు శివరామ ప్రసాద్ గారికీ, ప్రాకృతిక అనుభూతిని మిగిల్చిందన్న కేక్యూబ్ వర్మ గారికీ, మౌళి గారికీ, అలాగే పాషాణం లొ ప్రాణ వాయువుని కన్న తిరుపాలు గారికీ…… ధన్యవాదాలు!

  8. బాగుందండి,

మీ మాటలు

*