భారతం విప్పని బాధలు ఈ చీకటి నాటకం!

 

DharmaveerBharatiiఇప్పుడే ధరం వీర్ భారతి హిందీ నాటకం  ‘ అంధా యుగ్ ‘ కి అశోక్ భల్లా  ఇంగ్లీష్ అనువాదం ముగించాను. యుద్ధానంతర భీభత్సం ఒకటే కాదు, చాలా సంగతులు ఉన్నాయి ఇందులో. గాంధారి దృక్కోణం ప్రధానంగా ఉంది. ఆవిడ గర్భశోకం, కృష్ణుడిని శపించటం, ఆయన దాన్ని శాంతంగా స్వీకరించటం…వీటిలో కొత్త ఏమీ లేదు. అశ్వత్థామ ఉన్మాదాన్నీ   పైశాచికత్వాన్నీ ఎక్కువ చేసి చెప్పినదీ  లేదు. పాండవ శిబిరం వాకిట రుద్రుడు ఉండటమూ నిజమే, లయాత్మక ప్రతీక గా.. అయితే అశ్వత్థామ చేసిన[ముఖ ]  స్తుతికి ఆయన పొంగిపోయాడని చెప్పటం? పాండవులు ధర్మం తప్పారు కనుక నువ్వు వెళ్లి నిద్రపోయేవారందరినీ చంపేయవచ్చునని హామీ కూడా ఇస్తాడు అశ్వత్థామకి, నాటకం లో.  

andhayug1

ఇంకొక కొత్తదనం ఏమిటంటే అశ్వత్థామ చేసిన నీచాతినీచమైన పనిని గాంధారి సమర్థించి, అందుకు  అమితంగా సంతోషించి  అతన్నీ వజ్రకాయుడుగా దీవించటం. ఆ సౌప్తిక ప్రళయాన్ని సృష్టిస్తున్న అశ్వత్థామ తల చుట్టూ దివ్యకాంతులు ఉండిఉంటాయని ఆమె తలపోస్తుంది,అతన్ని చూసేందుకు దివ్యదృష్టిని అడుగుతుంది. దుర్యోధనుడి తొడలు ఎందుకు విరిగాయో, ఎక్కడ కూర్చోమని పాంచాలిని పిలిచిన ఫలితమో చెప్పకుండా వదిలేశారు. నిజమైన ఒక మంచి విషయం చెప్పాలంటే దుర్యోధనుడు రాజ్యాన్ని  పద్ధతిగానే ఏలాడు[ఈ విషయం కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత ధృతరాష్ట్రుడికి   ప్రజా ప్రతినిధులు చెబుతారు భారతం లో ] .  ద్రౌపది  వస్త్రాలని తొలగించే ప్రయత్నం చేసి అవమానించినందుకు దుశ్శాసనుడి రొమ్ము చీలిందని కూడా నాటక కర్త మర్చిపోయినట్లు కనిపిస్తారు .[అనువాదకులు తమ ముందు మాటలో  గుర్తు చేసుకున్నారు కాని]. దుర్యోధనుడు పడిపోయినప్పుడు   బలరాముడు కృష్ణుడిని’ unprincipled rogue ‘  అని తిడతాడు, హిందీ సమానార్థకం ఏదో తెలియదు.

గాంధారి శాపాన్ని అనుభవించిన నాటికి కృష్ణుడు ఇంచుమించు వృద్ధుడైనాడు, యుగం ముగుస్తోంది. కృష్ణనిర్యాణం ఆయన అందరి భారాన్ని మోసిన ఫలితంగా చిత్రించబోయారు.  ఆయన మృత్యువుని  ఒక బలిదానంగా ఎందుకు చూపించారో తెలియదు, ఏ పోలిక కోసం చేసిన ప్రయత్నమో. ఉత్తర గర్భం లోని పరీక్షిత్ ని రక్షించటానికి కృష్ణుడు తన జీవితాన్ని ఒడ్డలేదు, అంత అవసరం రానేలేదు. ఆ పరీక్షిత్ కూడా క్రోధానికి లోబడి శాపగ్రస్తుడైన నాటికి చాలా కాలం పాలించి ఉన్నాడు. కృష్ణుడు రక్షిస్తేనేమీ, అతనూ మరణిస్తాడు అంటారు,  అసలే మరణించనివారెవరు?

andhayug2

మరీ వింతగా తోచినదేమంటే కురుక్షేత్రం ముగిసిన తర్వాత ధర్మరాజు చివరి వరకు,  నిత్య వ్యాకులత తో బాధపడ్డాడని చెప్పటం . పౌరులు ఈయనేమి రాజురా, గుడ్డివాడే నయం అనుకున్నారట.  భీముడు మందబుద్ధి, అహంకారి అని, అర్జునుడికి అకాలవ్యార్థక్యం వచ్చిందనీ జనం అనుకుంటున్నారట. భీముడు ధృతరాష్ట్రుడిని సూటిపోటి మాటలనేవాడన్నంతవరకు నిజం, యుద్ధం అంతమైనాక గాంధారీ ధృతరాష్ట్రులని  పరామర్శించేందుకు పాండవులు  వచ్చినప్పుడు ధృతరాష్ట్రుడు భీముడిని  చంపే ప్రయత్నం చేస్తాడని ఇక్కడ గుర్తు చేసుకోవలసి ఉంది.   అర్జునుడు అశ్వమేధయాగాశ్వం వెంట వెళ్లి దిగ్విజయం చేసినది కురుక్షేత్రం తర్వాతే. నకులుడు అజ్ఞాని అని[ కాదనేందుకు ఆధారం లేదు కానీ అవునని అనేందుకో ? ] , సహదేవుడు పుట్టుకతో బుద్ధిమాంద్యుడని [ ఆయన వివేకపు ప్రశంస భారతం లో చాలా సార్లు వస్తుంది ] ….

పాండవుల వైపున పోరాడిన కౌరవుడు ,  యుయుత్సుడి తల్లి గాంధారి కాదు. నాటకం లో యుద్ధం ముగిశాక ఆయన, తను  సరయిన పని  చేయ  లేదని కుమిలిపోతూ ఉంటాడు. విదురుడికి భగవంతుడిమీద సందేహాలు వస్తూ ఉంటాయి.

ద్వాపరం నాటికి అధర్మాన్ని ఎదుర్కొనే పద్ధతిలో కొంత అధర్మాన్ని వాడవలసిన పరిస్థితి వచ్చింది. దాన్ని ఆధారం చేసుకుని భారత కథని  తమకు తోచినట్లుగా  నిరూపించే  ప్రయత్నాలు చాలా జరిగాయి. వాటిలో ఇది ఒకటి. అనువాదకులు ఈ నాటకాన్ని తరగతి గది లో బోధించేటప్పుడు దాదాపు అందరు విద్యార్థులూ గాంధారి దే న్యాయం  అనటమే కాకుండా కృష్ణుడిని తీవ్రంగా ద్వేషించేవారట. ఆ పరిస్థితి ని మెరుగు పరిచేందుకు సక్రమమైన అనువాదం చేద్దామని ఆయన భావించారట. కాని అది నెరవేరినట్లేమీ లేదు.  ధృతరాష్ట్రుడి పుట్టు గుడ్డితనం ఆయన పుత్రప్రేమలోఅన్నంతవరకు మాత్రమే ఔచిత్యం కనిపించింది నాకు.

 

                                                                       – మైథిలి అబ్బరాజు

maithili

మీ మాటలు

*