కల


కల గనడం అధ్బుత ప్రక్రియే

పుల్లా పుడకలతో పక్షి గూడల్లినట్టు-

అలల మీద వెలుగు నురగ తేలిపోతున్నట్టు-


నిదురంటని సుదీర్ఘ రాత్రుల ఘర్షణలో

పొడుచుకొచ్చే వేగుచుక్క కల


పాదాలరిగిన ప్రయాణంలో

అలుపు సొలుపుల పోరాట పటిమలో

కల  పరిఢవిల్లుతది


కల ఎవరి సొంతమూ కాదు

పేటేంట్ హక్కుల్లేనిది


ఒకరి కలలోకి ఒకరం

నిరాటంకంగా దూరిపోవచ్చు

కలల కాపురంలో ఓలలాడవచ్చు


ఏమీ లేకున్నా

కలా స్పృహతో వున్నావనుకో

నీ రుజాగ్రస్త శరీరం

కలా కాంతులీనుతది


కలకు పునర్జన్మ లుంటయి

ఆరాటపడే ఆఖరిశ్వాస నుండి

పురిటి శ్వాస పీల్చుకుంటది


ఏ పూర్వీకుని కలో

నీలో నాలో  మనలో

మొగిలిపువ్వై విచ్చుకుంటది


కల గనడం ఈవలి ఒడ్డు

కల నెరవేరడం ఆవలి ఒడ్డు


రెండు ఒడ్డుల మధ్య

మనిషి జీవన పయనమొక

పవిత్ర యుద్దం…



—దాసరాజు రామారావు

మీ మాటలు

  1. పుల్లా పుడకలతో పక్షి గూడల్లినట్టు, అలల మీద వెలుగు నురగ తేలిపోతున్నట్టు-
    మీ కల బాగుంది! అభినందనలు.

  2. దాసరాజు గారూ!

    కవిత చాలా బాగా వచ్చింది. ముఖ్యంగా 2,3,4,5, పంక్తులు, మరికొన్ని ఇతర పంక్తులు కూడా. కలా స్పృహతో వుంటే రుజాగ్రస్త శరీరం కలాకాంతులీనుతుందనటం బాగుంది. ‘రుజగ్రస్త’ అన్నదే సరైన ప్రయోగం అనే పొరపాటు భావనలో ఉన్నాను ఇన్ని రోజులు. కాని మీ కవిత పుణ్యమా అని నిఘంటువులను సంప్రదించి చూడగా ‘రుజాగ్రస్త’ అనేదే సరైన ప్రయోగమని తేలిపోయింది. ఇక ఇది వచన కవిత కాబట్టి కలా స్పృహ, కలాకాంతులు – ఈ రెండు సమాసాలూ వైరి సమాసాలైనప్పటికీ ఏ యిబ్బందీ లేదు. పైగా మీరు కల గురించి చెప్తున్నారు కనుక ‘కలాకాంతులు’ సముచితంగా వుంది. ఛందోబబద్ధ పద్యాల్లో అయితే ‘స్వప్నస్పృహ’, ‘కళాకాంతులు/స్వప్న కాంతులు’ అనక తప్పని పరిస్థితి వుండేది కావచ్చు. మొత్తానికి మంచి కవితను రాసినందుకు అభినందనలు.

  3. MADIPLLI RAJ KUMAR says:

    రామారావుగారు … కేవలం వైయక్తికమైన కలను తడిమి ఊరుకోక…… తన నైజం మరవక a సామూహికమైన కలనూ కన్న మీ కలం కన్నుకు నమస్కారాలు.

  4. dasaraju ramarao says:

    రవి వీరెల్లి, ఎలనాగ, మడిపల్లి రాజ్ కుమార్ గార్ల సవివరణ స్పందనలకు కృతజ్ఞతలు.

మీ మాటలు

*