భార్య, దాసి, కొడుకు….

ఈ కథానిర్మాణం ఎంతో ఆసక్తికరమైన ఒక పురాసామాజిక సత్యాన్ని వెల్లడిస్తోంది. పుత్రుడు,    శిష్యుడితోపాటు దాసుణ్ణి కూడా చేర్చి, ఋషుల భాషలో ఈ మూడు మాటలకూ అర్థం ఒకటే నని రాంభట్ల కృష్ణమూర్తి అంటారు(జనకథ).  శునశ్శేపుడనే బాలుణ్ణి యజ్ఞపశువును చేసి హరిశ్చంద్రుడు రాజసూయయాగం చేస్తున్నప్పుడు, ఆ యాగానికి విశ్వామిత్రుడు వందమందిని వెంటబెట్టుకుని వెళ్లి శునశ్శేపుని రక్షించిన కథ ఉంది. నిజానికి ఆ వందమందీ విశ్వామిత్రుని శిష్యులు. కానీ పురాణాలు వారిని విశ్వామిత్రుని పుత్రులన్నాయి. రామాయణంలో దశరథుని అశ్వమేథయాగానికి వచ్చిన బ్రాహ్మణులలో విద్వాంసులు కాని వారూ, వందమంది అనుచరులను వెంటబెట్టుకుని రానివారూ (నా విద్వాన్ బ్రాహ్మణస్తత్ర  నా శతానుచర స్తథా) లేరని ఒక శ్లోకం చెబుతోంది. ఆ వందమంది అనుచరులూ  వారి శిష్యులన్నమాట. ఆ యాగంలో నిత్యం బ్రాహ్మణులు, నాథవంతులు, తాపసులు, శ్రమణులు భోజనం చేసేవారని ఆ తదుపరి శ్లోకం చెబుతోంది. నాథవంతులు అంటే యజమాని, లేదా గురువు కలిగినవారు. అంటే, యజమాని అనేవాడు  దాసులకు, బానిసలకే కాక శిష్యులకు కూడా ఉంటాడన్నమాట. బానిస యజమానిని ఇంగ్లీష్ లో మాస్టర్ అంటారు. రూట్స్ నవలలో మాస్టర్ కు మాసా అనే మాట వాడారు.

 

నీవును బ్రహ్మచారివి, వినీతుడ, వేనును కన్యకన్; మహీ

దేవకులావతంస! రవితేజ! వివాహము నీకు నాకు మున్

భావజశక్తి నైనయది; పన్నుగ నన్ను పరిగ్రహింపు సం

జీవిని తోడ శుక్రు దయ; చేయుము నాకు ప్రియంబు నావుడున్

                                                             -నన్నయ

(శ్రీమదాంధ్ర మహాభారతం, ఆదిపర్వం, తృతీయాశ్వాసం)

బ్రాహ్మణకులానికి వన్నె తెచ్చేవాడా, సూర్య తేజస్సు కలిగినవాడా, ఓ కచుడా! నువ్వు బ్రహ్మచారివి, వినయశీలుడివి; నేను కన్యను. మన్మథమహిమతో మనిద్దరికీ ముందే పెళ్లైపోయింది. శుక్రుని దయతో సంజీవినితో సహా నన్ను స్వీకరించు, నాకు ప్రియం కలిగించు…

దేవయాని కచునితో ఈ మాటలు అంటుంది.

***

కచుని చూసి కానీ అన్నం ముట్టనని మంకుపట్టు పట్టి అదేపనిగా ఏడుస్తున్న కూతురిని చూసి శుక్రుడు కరిగిపోయాడు. యోగదృష్టితో చూసేసరికి భూమి మీద ఎక్కడా కచుడు కనిపించలేదు. చివరికి తను సేవించిన సురలో బూడిద రూపంలో కచుడు ఉన్నట్టు కనుగొన్నాడు. సురాపానం ఎంత చేటు తెచ్చిందనుకున్నాడు. ఇక నుంచి మద్యపానం ఎవరు చేసినా పాపపు పనుల మీద ఆసక్తితో పతితులైపోతారని శపించాడు. ఆ తర్వాత తన కడుపులో ఉన్న కచుని సంజీవినీ విద్యతో బతికించాడు. అప్పుడు కచుడు, ‘మీ అనుగ్రహం వల్ల దేహాన్నీ, ప్రాణాన్నీ, బలాన్నీ పొందాను. మీ కడుపులోంచి బయటపడే మార్గాన్ని కూడా ఉపదేశించం’ డని శుక్రుని కోరాడు.

శుక్రుడు ఆలోచనలో పడ్డాడు. నా కడుపును భేదించుకుని కానీ ఇతడు బయటకు రాలేడు, అప్పుడు నా ప్రాణాలు పోతాయి, నేను తిరిగి జీవించాలంటే ఇతనికి సంజీవినిని ఉపదేశించడమే మార్గమనుకున్నాడు. సంజీవినిని ఉపదేశించాడు. తూర్పుకొండ గుహా ముఖం నుంచి ఉదయించిన పూర్ణచంద్రుడిలా కచుడు శుక్రుని కడుపులోంచి బయటకువచ్చాడు. శుక్రుడు ప్రాణాలు కోల్పోయాడు. అప్పుడు కచుడు అతనికి సంజీవినితో ప్రాణం పోశాడు.

కచుని పాత్రను రాజకీయకోణం నుంచి అన్వయించుకునే అవకాశం పుష్కలంగా ఉంది. అతడు రెండు ఉద్దేశాలతో శుక్రుని ఆశ్రయించి ఉండచ్చు. మొదటిది, శత్రురహస్యాలను సంగ్రహించడం. రెండోది, శుక్రుని నుంచి కొన్ని విద్యలు నేర్చుకోవడం. శుక్రునికి రాజనీతి కోవిదుడన్న పేరుంది. శుక్రనీతి ప్రసిద్ధం. అయితే, శుక్రుడు శత్రువుల గురువు. కనుక కచునికి అతని ఆశ్రయం లభించడం అంత సులభం కాదు. ఎంతో యుక్తిని కనబరఛాలి. శత్రువర్గానికి చెందిన కచుని  శిష్యునిగా స్వీకరించడం కూడా శుక్రునికి అలాంటిదే. ఆవిధంగా, కచుని యుక్తికీ; శుక్రుని  జాగ్రత్తకూ ఇక్కడ పోటీ. ఆ పోటీలో  కచుడు నెగ్గాడు. శుక్రుని కడుపులో ఉండి మృతసంజీవినిని ఉపదేశం పొందడం, ఆ తర్వాత శుక్రుని కడుపు చీల్చుకుని బయటకు రావడం, శుక్రుని నుంచి తను నేర్చుకున్న విద్యతోనే తిరిగి అతనికి ప్రాణదానం చేయడం కచుని పైచేయిని చాటతాయి.

దీనినే గురు-శిష్య సంప్రదాయం నుంచి చెప్పుకుంటే, కచుడు గురువును మించిన, లేదా గురువుతో సమానుడైన శిష్యు డయ్యాడు. గురువు మృతుడైనా అతని విద్య శిష్య, ప్రశిష్యుల ద్వారా సంజీవినిగా మారి అతని కీర్తి కాయాన్ని బతికిస్తూనే ఉంటుందన్న ధ్వని కూడా ఇందులో ఉండచ్చు. కచుడు వామనుడి పాత్రను గుర్తుకు తెస్తాడు. వామనుడు కూడా ఇలాగే యుక్తిపరుడు. బలి చక్రవర్తిని మూడడుగుల నేల మాత్రం అడిగి చివరికి అతన్ని పాతాళానికి తొక్కేశాడు. గణనిర్బంధాలనుంచి బయటపడి నూతన సామాజిక వ్యవస్థకు వేగుచుక్కగా మారిన బ్రాహ్మణులు, ఇతర సామాజికవర్గాలతో పోల్చితే బుద్ధి కుశలతను పెంచుకుంటున్న సంగతిని ఈ రెండు పాత్రలూ ప్రకటిస్తూ ఉండచ్చు.

అదలా ఉంచితే, మృతసంజీవిని పేరిట చనిపోయినవారిని బతికించే విద్య ఏదో  ఉండేదని భావించనవసరం లేదు. అది, కచునిలోని యుక్తిపరుని పైకెత్తడానికి ఉద్దేశించిన ఒక చక్కని పౌరాణిక కల్పన కావచ్చు.

కచుడు శుక్రుని ఇంట అడుగు పెట్టే ముందే వ్యూహరచన జరిగినట్టు పౌరాణికుడు చెప్పనే చెప్పాడు. తను శుక్రుని ఒక్కడినే మెప్పిస్తే చాలదని కచునికి తెలుసు. శుక్రుని అతి పెద్ద బలహీనత అయిన అతని కూతురు దేవయాని మనసునూ గెలుచుకుని, ఆమెను తండ్రిపై ఒడుపుగా ప్రయోగించాలి. అలా రెండు వైపులనుంచీ కచుడు నరుక్కు వచ్చాడు. అతడు కరడుగట్టిన ప్రయోజనవాదిగానూ, శత్రుస్థావరంలోకి అవలీలగా అడుగుపెట్టి, రహస్యాలను కొల్లగొట్టి అజేయంగా తిరిగి రాగలిగిన సుశిక్షితుడైన గూఢచారిలానూ కనిపిస్తాడు. ఏ బలహీనతలకూ లొంగని లక్ష్యశుద్ధి అతనిది. దేవయాని తనపట్ల మనసు పడేలా అద్భుతంగా నటించాడు. తండ్రిని ప్రభావితం చేసి, రాక్షసుల బారినుంచి తనను కాపాడే కవచంలా ఆమెను ఉపయోగించుకున్నాడు. అదే సమయంలో ఆమె ఆకర్షణ వలయంలో తను  చిక్కుకోకుండానూ జాగ్రత్త పడ్డాడు. దేవయానిని పెళ్లాడే ఉద్దేశం అతనికి లేనే లేదు.

ఇందుకు భిన్నంగా దేవయాని కచుని మాయలో పడిపోయింది. శుక్రుడు కూతురి మీద మమకారానికి తలవంచాడు. కచుడు వచ్చిన పని చక్కబెట్టుకుని విజయగర్వంతో స్వస్థలానికి తిరుగు ప్రయణమయ్యాడు. అప్పుడు దేవయాని అతనితో అన్న మాటలే, పై పద్యం.

కచునిలా దేవయాని కూడా తెలివైనదే, గడుసుదే; అయితే ఆ తెలివి అతితెలివి అంచులు తాకుతూ ఉంటుంది. ఆ పైన ఆ తెలివిని కచునిపై మోహం మబ్బులా కమ్మేసింది. ఎక్కడ కాదంటాడో నన్న శంకతో, సంజీవినితోపాటు నన్ను కూడా స్వీకరించు అంటూ, సంజీవినిని కట్నంగా ఎర వేసింది. అది కూడా,  ‘శుక్రుని దయతో’ అనడంలో, తను తండ్రి చాటు బిడ్డననీ, అయితే తండ్రి ఈ పెళ్ళికి కాదనడనీ, ఆయనను ఒప్పించే బాధ్యత తనదనే ధ్వని ఉంది. అంత తెలివిగా మాట్లాడే దేవయాని ఎక్కడ తప్పటడుగు వేసిందంటే, ఒక కచ్చితమైన రాజకీయలక్ష్యంతో వచ్చిన కచుని ఇంగితాన్ని అర్థంచేసుకోలేకపోవడంలో! వ్యక్తిగత ప్రేమకూ, కనికరానికీ తావులేని అతని విశాల రాజకీయ వ్యూహంతో, ఆమె వ్యక్తిగత ఆకాంక్ష పోటీ పడి, ఓడిపోయింది. దేవయాని నిలువునా మోసపోయింది.

ఆమె మాటలు కచునికి ఎంతో విషాదాన్నీ, నొప్పినీ కలిగించాయట. లోకమంతా తప్పు పట్టే మాటలు మాట్లాడడం నీకు తగునా అన్నాడు. నా మనసులో నీకున్నది సోదరి స్థానమే ననేశాడు. ఆ తర్వాత, అంతకంటే ముఖ్యమైన ఒక సత్యాన్ని ప్రస్తావించాడు. గురువులకు శిష్యులు పుత్రులే, ఇదే లోకధర్మం, గురుపుత్రి వైన నువ్వు దీనిని గమనించకుండా మాట్లాడా వన్నాడు. దాంతో హతాశురాలై ఆగ్రహించిన దేవయాని నా కోరికను నువ్వు కాదన్నావు కనుక నీకు సంజీవిని పనిచేయకుండు గాక అని శాపమిచ్చింది. అప్పుడు కచుడు, సంజీవిని నాకు పని చేయకపోయినా నా నుంచి ఉపదేశం పొందిన వారికి పని చేస్తుంది; నువ్వు ధర్మవిరుద్ధమైన ప్రతిపాదన చేశావు కనుక నిన్ను బ్రాహ్మణుడు పెళ్లిచేసుకోడని ప్రతిశాపమిచ్చి వెళ్లిపోయాడు.

kacha and devayani

నువ్వు నాకు సోదరివని కచుడు ఇప్పుడు దేవయానితో అన్నా, అంతకాలమూ  ఆమెతో సోదరభావనతో  మెలగలేదని స్పష్టమే. అంటే, తన లక్ష్యానికి ఆమెను పరికరంగా వాడుకుంటూ ఆమెలో లేనిపోని ఆశలు కలిగించాడు. కనుక, గురువులకు శిష్యులు పుత్రులన్న ధర్మం పట్ల అతనికి ఎంత నిబద్ధత ఉందో మనకు తెలియదు. ఏమైనా, తన రాజకీయ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడమే తప్ప దేవయానిని పెళ్లాడే ఉద్దేశం అతనికి ఎలాగూ లేదు కనుక అతన్ని పక్కన పెడితే; ఆ పెళ్లి విషయంలో, కథ చెబుతున్న పౌరాణికునికీ, బహుశా శుక్రుడికీ కూడా నిజంగానే అభ్యంతరాలున్నాయి. ఎందుకంటే, తప్పించుకునే ఉద్దేశంతోనే చెప్పినా, కచుడు నిజం చెప్పాడు. గురువులకు శిష్యులు పుత్రులే! అదేదో ఆలంకారికం (figurative) గా అన్న మాట కాదు, శాస్త్రనిర్ధారణ!

కచ, దేవయానుల పెళ్లి ధర్మబద్ధమా కాదా అనేది నిర్ణయించడంలో వారిద్దరినీ, శుక్రునీ కూడా పక్కన పెట్టేసి ఇక్కడ పౌరాణికుడే స్వయంగా రంగప్రవేశం చేశాడు. వారిద్దరిదీ సోదర-సోదరీ సంబంధమేనని చెప్పడంపై పౌరాణికునికి ఎంత పట్టింపు అంటే, కేవలం ఆ మాట అని అతడు ఊరుకోలేదు. దానికో సన్నివేశాన్ని సృష్టించాడు. కచుడు శుక్రుని కడుపులో పునర్జన్మ ఎత్తి, ఏకంగా అతని కడుపునే చీల్చుకుంటూ బయటకు వచ్చినట్టు చెప్పాడు. కచుడు శుక్రుని పుత్రుడే తప్ప మరొకటి కాదని మరింత నొక్కి చెప్పడమే ఆ కల్పనలో ఉద్దేశం. ఇలా పౌరాణికుని కోణం నుంచి చూస్తే, గురు-శిష్య సంబంధం తండ్రీ-కొడుకుల సంబంధమేనని చెప్పడానికే అతనీ మొత్తం కథను నిర్మించినట్టు కనిపిస్తుంది.

ఈ కథానిర్మాణం ఎంతో ఆసక్తికరమైన ఒక పురాసామాజిక సత్యాన్ని వెల్లడిస్తోంది. పుత్రుడు, శిష్యుడితోపాటు దాసుణ్ణి కూడా చేర్చి, ఋషుల భాషలో ఈ మూడు మాటలకూ అర్థం ఒకటే నని రాంభట్ల కృష్ణమూర్తి అంటారు(జనకథ).  శునశ్శేపుడనే బాలుణ్ణి యజ్ఞపశువును చేసి హరిశ్చంద్రుడు రాజసూయయాగం చేస్తున్నప్పుడు, ఆ యాగానికి విశ్వామిత్రుడు వందమందిని వెంటబెట్టుకుని వెళ్లి శునశ్శేపుని రక్షించిన కథ ఉంది. నిజానికి ఆ వందమందీ విశ్వామిత్రుని శిష్యులు. కానీ పురాణాలు వారిని విశ్వామిత్రుని పుత్రులన్నాయి. రామాయణంలో దశరథుని అశ్వమేథయాగానికి వచ్చిన బ్రాహ్మణులలో విద్వాంసులు కాని వారూ, వందమంది అనుచరులను వెంటబెట్టుకుని రానివారూ (నా విద్వాన్ బ్రాహ్మణస్తత్ర  నా శతానుచర స్తథా) లేరని ఒక శ్లోకం చెబుతోంది. ఆ వందమంది అనుచరులూ  వారి శిష్యులన్నమాట. ఆ యాగంలో నిత్యం బ్రాహ్మణులు, నాథవంతులు, తాపసులు, శ్రమణులు భోజనం చేసేవారని ఆ తదుపరి శ్లోకం చెబుతోంది. నాథవంతులు అంటే యజమాని, లేదా గురువు కలిగినవారు. అంటే, యజమాని అనేవాడు  దాసులకు, బానిసలకే కాక శిష్యులకు కూడా ఉంటాడన్నమాట. బానిస యజమానిని ఇంగ్లీష్ లో మాస్టర్ అంటారు. రూట్స్ నవలలో మాస్టర్ కు మాసా అనే మాట వాడారు.

ఇంకా విశేషమేమిటంటే, పుత్రుడు, శిష్యుడు, దాసులు, చివరికి పశువుల వరసలోనే భార్యను కూడా చెప్పారు. ‘రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయా’ అనే వాక్యం ప్రసిద్ధం.  పశువులు, భార్య, కొడుకు రుణానుబంధంగా సంక్రమిస్తారనే వేదాంతార్థంలో ఈ వాక్యాన్ని చెప్పుకుంటూ ఉంటాం. రుణం తీసుకునేటప్పుడు తాకట్టు పెట్టడానికి వీరు పనికొస్తారనే ఈ వాక్యానికి అసలు అర్థమని రాంభట్ల అంటుండేవారు. వీరందరూ యజమానికి ఆస్తే. ఇల్లాలు అనే మాటలోని ‘ఆలు’ కు పనివారు, బానిస అని కూడా అర్థం ఉందని రాంభట్ల అంటారు. వ్యవసాయ భూముల్ని పొందిన గణజనాలు, వ్యవసాయ కూలీలు, వ్యవసాయం పనులకు సాయపడే చేతివృత్తులవారు కలసి ఆ భూములకు దగ్గరగా నిర్మించుకున్న గ్రామాలను ‘ఆల’ అనే వారు. ఇప్పటికీ అనేక తెలుగు ఊళ్ళ పేరు చివర ఆల అనే మాట కనిపిస్తుంది(పరిటాల, దోర్నాల వగైరా). పశువులను కూడా ఆలమంద లంటారు. భర్తకు తనను చరణదాసిగా భార్య చెప్పుకోవడం నిన్నమొన్నటివరకూ ఉంది. దాసుల్లో కూడా క్రీత దాసులు, గర్భదాసులు అని రెండు రకాలు. క్రీతదాసులు అంటే డబ్బు ఇచ్చి కొనుక్కున్న దాసులు. గర్భదాసులు అంటే పుట్టించిన దాసులు. వీరినే గృహదాసులు అని కూడా అనేవారు. యుద్ధాల్లో దొరికిన స్త్రీలనుంచి యజమానులు ఈ గృహదాసుల్ని పుట్టించేవారు. ఇంట పుట్టిన పశువులానే వీరు కూడా మచ్చికగా ఉంటారని యాజమానుల నమ్మకం. గర్భదాసుల్ని పుట్టించడం బానిసవ్యవస్థ ఉన్న ప్రతిచోటా ఉండేది. అంతేకాదు, బానిసలకు పుట్టిన సంతానం కూడా యజమాని ఆస్తే. వారు ఆ సంతానాన్ని ఇంకో యజమానికి అమ్మేసేవారు.

రూట్స్ నవలలో కుంటా కింటే యజమాని మాసా వేలర్; కుంటాకీ, బెల్ కీ పుట్టిన కిజ్జీని మాసా లీ అనే మరో బానిస యజమానికి నిర్దాక్షిణ్యంగా అమ్మేస్తాడు. తల్లిదండ్రులకు కూతుర్ని శాశ్వతంగా దూరం చేసే ఆ ఘట్టం హృదయవిదారకంగా ఉండి, ఎంతటి కరకు గుండెలనైనా కదిలించివేస్తుంది.  కిజ్జీని మాసా లీ బలాత్కారంగా  అనుభవించిన ఫలితంగా ఆమెకు కొడుకు పుడతాడు.  అంటే, అతడు గర్భదాసుడన్నమాట.  మాసా లీ కి ఆ అబ్బాయి తన రక్తం పంచుకుని పుట్టినవాడని తెలిసినా అతన్ని బానిసగానే చూస్తూ ఊడిగం చేయించుకుంటాడు.

dasaradhi-rangacharya-rachanalu-chillara-devullu-400x400-imadg3749yfdfexh

రక్తసంబంధాలనూ; ప్రేమ, కరుణ, కడుపుతీపి, వాత్సల్యం వంటి మానవీయ సహజాతాలనూ కాలరాసే బానిసత్వపు కర్కశరూపాన్ని మన దాశరథి రంగాచార్యగారు కూడా ‘చిల్లర దేవుళ్ళు’ నవలలో కళ్ళకు కట్టిస్తారు. అందులో రామారెడ్డి అనే దొరకు మంజరి అధికారిక సంతానమైతే, వనజ అడబాపకు కలిగిన సంతానం. అంటే, గర్భదాసి. రామారెడ్డి మంజరినే తన కూతురుగా భావిస్తాడు. ఆమె మీదే ప్రేమాభిమానాలు చూపిస్తాడు. వనజను అడబాపగానే ఉంచుతూ గడీకి వచ్చిన అతిథులకు అప్పగిస్తూ ఉంటాడు.

ప్రాచీన గ్రీకు, రోమన్ సమాజాలలో; ఇటీవలి అమెరికాలో ఉన్నట్టు మన దేశంలో ప్రామాణిక బానిసవ్యవస్థ లేకపోవచ్చు. అందుకు భౌగోళిక కారణాలతోపాటు ఇతర కారణాలు ఉన్నాయని కొశాంబీ తదితరులు అంటారు. అయితే, మన దేశంలో దాస, దాసీ వ్యవస్థ ఉంది. పుట్టింటి అరణంగానో, విజేతలైన రాజులకు కప్పంగానో, కానుకగానో; పండిత సత్కారంగానో దాస,దాసీలను ఇవ్వడం మన పురాణ, ఇతిహాసాలలో కనిపిస్తుంది. ఇలాంటి దాస,దాసీలు కలిగిన గృహ ఆర్థికవ్యవస్థ మన దేశంలో ఎలా అవతరించి అభివృద్ధి చెందిందో రొమీలా థాపర్ From Lineage to State అనే రచనలో ఆసక్తికరంగా వివరించారు. గృహ ఆర్థికవ్యవస్థలోని యజమానికీ, బానిసల యజమానికీ పోలికలు ఉంటాయి.

ప్రస్తుతానికి వస్తే, తనను పెళ్లాడమని యయాతిని కోరబోతున్న దేవయాని, అందమైన తన దాసీలను కూడా అతనికి ఎర వేయబోతోంది. అంతేకాదు, తనకు సంతానం ప్రసాదించమని యయాతిని అడగబోతున్న శర్మిష్ట; ‘భార్య, దాసి, కొడుకు అనేవి వారించలేని ధర్మాలు సుమా’ అని అతనికి గుర్తుచేయబోతోంది.

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

 – కల్లూరి భాస్కరం

 

 

 

 

 

 

 

 

 

 

మీ మాటలు

  1. శ్రీను says:

    ఆసక్తికరం. కానీ నాకు తెలిసి, దాస్యమూ, బానిసత్వమూ – రెండు వేరువేరు విషయాలు. ఈ రైటప్ లో గ్రంథ ప్రామాణ్యం ఇవ్వలేదు. అనేక విషయాల్ని ముడిపెట్టారు. ఏ మూలో లెఫ్ట్ వాసనలు ఘాటుగా సోకుతున్నాయి. నావి రెండు పైసలు. తెలుగూళ్ళ పేర్లలో చివర వచ్చే లకారం బహువచన ప్రత్యయపు ఔపవిభక్తికం. ఆలు అంటే బానిస కాదు, స్త్రీ. ఇది మూలద్రావిడ పదం. తమిళాది భాషల్లో ఇప్పటికీ ఉంది. తెలుగులోనూ, సంస్కృతంలోనూ కొడుకనే పదానికి ఉన్న పర్యాయపదాలు ఈ వ్యాసంలో చెబుతున్న అర్థాన్ని ఇవ్వడం లేదు. అదీ గాక తగినన్ని ప్రాస్తావిక ఆధారాలు (circumstancial evidence) లేకుండా కేవలం పదాల మీద ఆధారపడి చేసే పిండితార్థాలకు ప్రామాణ్యం తక్కువ.

    • కల్లూరి భాస్కరం says:

      ధన్యవాదాలు శ్రీను గారూ…నేనన్నది, మన దేశం లో ప్రామాణిక బానిసవ్యవస్థ లేకపోవచ్చు కానీ; దాస దాసీ వ్యవస్థ ఉందనే. దాస దాసీ వ్యవస్థకు కావలసినంత గ్రంథ ప్రామాణ్యం ఉంది. దేనికి గ్రంథ ప్రామాణ్యం ఇవ్వలేదని మీరు అంటున్నారో నాకు అర్థం కాలేదు. ఆలు-ఆల విషయంలో నేను రాంభట్లను ఉటంకించాను. ఆలకు సంబంధించిన వ్యాకరణాంశం ద్వారా మీరు ఏం చెప్పదలచుకున్నారో స్పష్టం కాలేదు. కొడుకు విషయం… శిష్యుడు పుత్రుడే నన్న సాంప్రదాయిక అర్థాన్నే ఇచ్చాను తప్ప కొత్త అర్థం ఇవ్వలేదు.కాకపోతే, ఋషుల భాషలో శిష్యుడు, పుత్రుడు, దాసుడు అనే మాటలకు ఒకే అర్థమన్న రాంభట్లను ఉదహరించాను. ఇవి సంప్రదాయానికీ, ఆనవాయితీకి చెందినవి తప్ప నిఘంటువుకు, వ్యాకరణానికి చెందినవి కావు. లెఫ్టు వాసనలు సోకడం గురించి…పురాచారిత్రాన్వేషణకు తోడ్పడే రైటు వాసనల ఘాటు ఎక్కడైనా సోకితే స్వీకరించడానికి అభ్యంతరం లేదు.

      • pavan santhosh surampudi says:

        ఆలు అనే పదం మూల ద్రావిడమని, దానికి స్త్రీ అనే అర్థమే తప్ప బానిస అనే అర్థంతో వాడుక లేదని చెప్తున్నాడాయన. ఆలకూ, ఆలుకూ కేవల శబ్దసామ్యమున్నంతనే ఒకే అర్థాన్నిచ్చేవన్న వాదన అప్రామాణికమనీ అంటున్నారు. ఆ వాదన సమంజసమైనదిగానే ఉంది. ఆలు శబ్దానికి ఆ అర్థాన్ని ఏ ప్రమాణంతో ఇవ్వవచ్చును?

  2. కల్లూరి భాస్కరం says:

    ఆల, ఆలు ఒకే అర్థాన్ని ఇస్తున్నాయన్న సూచన నా వ్యాసంలో లేదు.ఆ రెండు మాటలకు సంబంధించి రాంభట్లను కోట్ చేశాను. ఆ వాక్యాలు రెండూ పక్క పక్కన ఉండడంవల్ల ఆ రెండూ పరస్పర సంబంధమున్నవన్న అభిప్రాయం కలుగుతున్నట్టుంది.

  3. kalluri bhaskaram says:

    ‘ఆలు’ గురించి మరికొంత…

    తిరుమల రామచంద్రగారు తమ ‘సాహితీ సుగతుని స్వగతం’ అనే వ్యాస సంపుటిలో ‘ఆలు’ శబ్దం గురించి చర్చించారు. ఆయన ప్రకారం తమిళం, కన్నడం, మలయాళం, తుళు భాషల్లో ఆణ్-ఆళ్ అనే శబ్దం పురుషవాచకం, మనుష్య సామాన్య వాచకం, ఉభయలింగం. ఇల్లాలు అనే మాటకు, ఇల్=ఇంటిలోని, ఆలు=మనిషి అని అర్థం. క్రమంగా ఇల్ అనే మాట వాడుకలోంచి పోయి ఆలు అనే మాట గృహిణీ వాచకంగా రూఢమయింది.

    విశేషమేమిటంటే, మహాభారతం, అరణ్యపర్వం, తృతీయాశ్వాసం లోని ఒక కథ ప్రకారం; ఒకప్పుడు ‘శూద్రుడు’ గృహపాలకుడిగా ఉండేవాడు. అంటే పై వివరణ ప్రకారం ఇల్లాలు అన్నమాట. శూద్రునికి దాసత్వం ఉంది కనుక స్త్రీని కూడా దాసిగా పరిగణించారా?!

  4. kalluri bhaskaram says:

    ఇల్ అనే మాట వాడుకలో లోపించిందని రామచంద్రగారు అన్నారు.

మీ మాటలు

*