వ్యక్తిగతం

Photo Garimella Narayana

 

తాడు మీద నడిచే విన్యాసపు మోళీ పిల్లలా

కట్టగట్టి గుంపులో నిలబెట్టదు.

పిల్ల మదిలో గూడు కట్టుకున్న

దిగులు  మాత్రమే  అనిపిస్తుంది.

ఆకాశం పైకెక్కి కనివిందు చేసే

ఇంద్రధనుస్సు సోయగంలా కట్టిపడెయ్యదు.

కాని దానిని నేసిన

సూర్యరశ్మి, నీటిబిందువుల పొందికైన కలయికే అయ్యుంటుందనిపిస్తుంది.

చిత్తడి చిరుజల్లుల చిటపటల చిందులా

పలకరించి పోయేలా ఉండదు.

గోప్యంగా మేఘాలకు గాలినిచ్చి పోయిన

ఋతుపవనుడి దానగుణంలా అనిపిస్తుంది.

కనిపించకుండా నిమిరేసిపోయిన

పిల్ల గాలి మంత్రంలానూ

అనిపించదు.

కానీ కెరటాల నుండి చెట్లమీదుగా

జుట్టును రేపిన  లీలేనేమో అనిపిస్తుంది.

 182447_10152600304780363_1937093391_n

విమానంలా గాలిలో గిరికీలు కొట్టదు

రైలులా బస్సులా పడవలా నదిలా

నదిని కట్టిన వంతెనలా

వంతెన కలిసే వడ్డు మీది మొక్కల్లోని పువ్వులా

పువ్వు మీద వాలిన తుమ్మెదలా …

అసలు  యిలాగా  అని

చెప్పేలా ఉండనే ఉండదు

వేరుల్నుండి కాండపు కేశనాళికలలో

చప్పున ఎగసి

ఆ చివరెక్కడో ఆకుల నిగారింపులో

మెరిసి ద్విగుణీకృతమైన

నీటీ జాడ

చేసిన చమక్కేనేమో వ్యక్తిగతమంటె….

వ్యక్తిగతం ఎవరిదైనా ఒక్కటే

ఎవరికైనా ఒక్కటే

వ్యక్తిగతాన్ని తెలుసుకోవడమంటె

చెట్టును నరికేసి నీరు వెళ్ళిన జాడల గురించి తరచి చూడటమేనేమో..

వ్యక్తిగతాన్ని తెలుసుకోవడమంటె

బాతు పొట్టకోసి  బంగారు గుడ్ల కోసం పడే దురాశేనేమో…

వ్యక్తిగతాన్ని తెలుసుకోవడమంటె

వెంబడించి వెంబడించి

మరీ పొట్టన పెట్టుకున్నఅపురూపమైన డయానా ప్రాణమేనేమో…

 నారాయణ గరిమెళ్ళ

మీ మాటలు

 1. రవి వీరెల్లి says:

  నరేన్,
  పోయెమ్ చాలా బాగుంది. కొత్తగా ఉంది.

  “వేరుల్నుండి కాండపు కేశనాళికలలో
  చప్పున ఎగసి
  ఆ చివరెక్కడో ఆకుల నిగారింపులో
  మెరిసి ద్విగుణీకృతమైన
  నీటీ జాడ”
  వావ్! సూపర్!

 2. నారయణ గారు! గొప్ప కవుల జాబితాలో చేరే తరుణం ఎంతో దూరం లేదనిపిస్తుంది…భలేగా ఉంది మీ కవిత ..ఇలాంటి మరిన్నీ గొప్ప గొప్ప కవితలు మీ కలం నుండి జాలువారాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తూ ..మీ కలం అభిమాని ..చంద్ర

 3. రెడ్డి రామకృష్ణ says:

  తాడు మీద నడిచే విన్యాసపు మోళీ పిల్లలా
  మనల్నికట్టగట్టి గుంపులో నిలబెట్టదు.
  పిల్ల మదిలో గూడు కట్టుకున్న
  దిగులు మాత్రమే అనిపిస్తుంది.
  బాగుంది.
  వ్యక్తిగతం అన్నది ఎప్పూడూ ఒంటరే,వ్యక్తిగతమైనదేదీ బహిర్గతమైనది కాదు అది ఎప్పుడూ తనచుట్టూ ఒక తెరను కప్పుకునే ఉంటుంది.

  అభినందనలు నారాయణ గరిమెళ్ళ గారూ

మీ మాటలు

*