‘సమైఖ్య’గీతిక అనబడు బిస్కెట్టు కవిత

అవ్వారి నాగరాజు

అవ్వారి నాగరాజు

 

ఈ రోజు  ముఖంలో ముఖం పెట్టి

అంటోంది ప్రేమించవేం ప్రియా ?

“సమైఖ్యం” గా ఉందామని

 

ఫ్రెండ్స్, మనకిక పాట కావాలి ఒక ధూమ్ ధాం లాగా ఒక గద్దర్  గోరటోని లాగా

అన్నీ కుదిరాయి కానీ అదొక్కటే కదా ఇక-

 

చచ్చుపుచ్చు గెంతులు గావుకేకలూ వయస్సు మళ్ళీ ఎముకలు కుళ్ళీ

ఒక్కటీ ఇమడక జవజవలాడక తెర మీద ప్రణయం మాదిరి

ఒక చేత యాసిడ్ సీసా మరో చేత వేట కొడవలి బలవంతప్ప్రేమ లాగా

 

చీచ్చీ ఒళ్ళు తెలియడంలేదు సుమీ

తలుచుకుంటే కొన్ని సార్లు ఒళ్ళు అదుపు తప్పుతుంది సుమీ

ఎండాకాలపు ఒరిపిడిలోనూ ఇగరని జీర పాటల ప్రవాహ సవ్వడి సుమీ తెలంగాణం

 

స్వవచో వ్యాఘాతం ఉపశమించు గాక! స్వవచో వ్యాఘాతం ఉపశమించు గాక!

images1

నిజంగానే ముఖంలో ముఖం పెట్టి మాటాడుదాం

రావేం ప్రియా అని బతిమాలుడుదాం

విడిపోతే ఎలా మనం అని విరహాలు పాటిద్దాం

 

కవి గాయక వైతాళికులను రమ్డోయ్ రారమ్డోయ్ అని నినదిద్దాం

ఒక ప్రణయ గీతికను రాయించి నీ కోసం ప్రత్యేకం అని కన్ను గీటుదాం

చెలియలికట్ట దాటకు చెలీ అని గొంతుక మీద కాలునలాగే కొనసాగిస్తూ మురిపెంగా బుజ్జగిద్దాం

అదీ కాక పోతే చరిత్ర తెలియదా అని శపిద్దాం

పొంగుకొచ్చే బాన కడుపులను

అల్లరిగా కాసేపు దాపెట్టి ఒక్క బిసెట్టు కూడా ముట్టలేదు సుమీ అప్పటి నుండి అని అతిశయంగా గారాలు పోదాం

 

జనం ఎటూ పైకెగయని గొంతుకలు కదా

గాలి పారాడని ఆవరణంలో ముముక్షువులై ముడుచుక పడుకున్న జెండాలు కదా

పొద్దునే లేచి లెక్కలేసుకొని జీవితాన్ని జేబిలో పొందికగా మడచి పెట్టుకో జూసే అకాల స్వప్నాలు కదా

చదువుకొని శిక్షణలు పొంది

కనీస్టూబుల్లలాంటి పంతుల్ల సాంగత్యంలో కారాగారాల్లాంటి కలల్ని కావలించుకొని పడుకొనే అర్భక ప్రాణులు కదా

 

ఇంకా ఇక  ఉద్యోగాలుండవని అరుద్దాం

నీళ్ళుండవ్ నేలుండదు చివరాఖరుకు ముడ్డి  మీద గోసి గుడ్డకూడా అని గావు కేకలు పెడదాం

జనం మీద జనాన్ని బంధిఖానా మీద బంధిఖానాను పోటీగా నిలబెడదాం

జారి పోకుందా ఉండేందుకు

అందరమూ కలిసి

సామూహిక ప్రణయ గీతిక రాద్దామని కాణిపాకం వినాయక సామ్మీద సత్యప్రమాణాలు తీసుకుందాం

 

నిజంగానే ఒక్క ప్రేమలేఖయినా రాద్దాం

కాలపు రేఖలమీద ఐక్యతను విడగొడుతూ ‘సమైఖ్యత’నొక ప్రతీకగా నిలబెడదాం

 

ఈ రోజుటి ముఖమ్మీద

తాగి పడేసిన సీసా గాజుముక్కతో వికృతంగా గజిబిజి ఒక్క ప్రేమ లేఖనయినా-

 

-అవ్వారి నాగరాజు

 

 

 

 

 

 

 

 

 

 

 

మీ మాటలు

  1. ఆలోచనలను ఉరకలెత్తించడంలో నాగరాజు గారు అందెవేసిన చేయి. ఐక్యత లేని సమైక్యత గూర్చి గట్టిగా ముడ్డి మీద తన్నినట్టు రాసారు. బాగుంది సార్..

  2. మెర్సీ మార్గరెట్ says:

    నిజమైన ప్రేమ లేఖ చదివాక ఏ ప్రేయసి వద్దంటుంది . అది కాక వద్దు పొమ్మంటే ప్రేమోన్మాదిలా మారితే తన్నులు తిని
    మళ్ళీ కనిపించక పోవచ్చు గాక .
    మొత్తానికి మీ ప్రేమ రాయబార లేఖా ప్రయత్నం బాగుంది నాగరాజు గారు

Leave a Reply to కెక్యూబ్ వర్మ Cancel reply

*