పద్దెనిమిది గంటలు

417671_580561545289734_1052452842_n

రామాచంద్రమౌళి తొలికథ  ‘సువర్ణశతదళ పుష్ప రహస్యం’ 1964లో చందమామలో ప్రచురితమైంది. ఇప్పటివరకు 250 దాక  కథలు రాశారు. 18 నవలలు, 8 కవితాసంకలనాలు, రెండు విమర్శా పుస్తకాలు వెలువరించారు. అనేక సాహిత్య వ్యాసాలు రాశారు. అవి రెండు సంకలనాలుగా వచ్చాయి. ఇంగ్లీషు, తమిళ్‌, మలయాళీ, కన్నడ, పంజాబీ, బెంగాళీ భాషల్లోకి ఈయన రచనలు అనువాదమయ్యాయి. 2011లో గ్రీస్‌లో జరిగిన ‘22వ వరల్డ్‌ కాంగ్రెస్‌ ఆఫ్‌ పొయెట్స్‌’లో భారత ప్రతినిధిగా పాల్గొన్నారు.  అలాగే సార్క్‌సాహిత్య సమవేశాలకు ప్రత్యేక ఆహ్వానితులుగా వెళ్లారు. పలు టెలీఫిలిమ్స్‌ రాశారు. ఇప్పటికే అనేక పురస్కారాలు అందుకున్న రామాచంద్రమౌళి ప్రస్తుతం వరంగల్‌లోని గణపతి ఇంజినీరింగ్‌ కాలేజిలో వైస్‌ ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు.–వేంపల్లె షరీఫ్

***

 

 

   భారతదేశం.

                చెన్నై ఇంటర్‌నేషనల్‌ ఏర్‌పోర్ట్‌..అటు హార్బర్‌.

                హార్బర్‌నుండి పన్నెండువందల ముప్పయి కిలోమీటర్ల దూరంలో అండమాన్‌ నికోబార్‌ దీవులు.

                అండమాన్‌ రాజధాని పోర్ట్‌ బ్లైయర్‌.

                వీర్‌ సావర్కర్‌ అంతర్జాతీయ విమానాశ్రయం

                పోర్ట్‌ బ్లెయర్‌లో కేంద్రపాలిత ప్రాంత నగరం..సకల పాలనావ్యవస్థ కేంద్రీకృతమై.,

                నగరం నడిబొడ్డున 1896-1906 మధ్య బ్రిటిష్‌వాళ్ళచే నిర్మించబడిన.. భారతదేశ శుద్ధ స్వాతంత్య్ర సమరయోధులను కఠినాతికఠినంగా, రాక్షసంగా, అమానవీయంగా హింసించి వందలమందిని ఉరితీసిన 696 ఒంటరి కారాగార గృహాలు గల ‘సెల్యులర్‌ జైల్‌’

కేవలం పర్యాటక వ్యాపకాన్నే జీవనవనరుగా బ్రతుకులను వెళ్ళదీసే నిజాయితీ, అమాయకత్వం నిండిన జనం..,

పోర్ట్‌బ్లెయర్‌ నుండి..చుట్టూ తన మాతృకౌగిలిలో జోలబుచ్చే బంగాళాఖాత సముద్రంలో.. యాభై కిలోమీటర్ల దూరంలో ప్రశాంతంగా..హావలక్‌ ద్వీపం.

హావలక్‌ ద్వీప..శాంత గంభీర తూర్పు తీరంవెంట..,

యుగయుగాలుగా అమాయకులను కొల్లగొట్టి, ప్రకృతి వనరులను ధ్వంసించి, ఆక్రమించి, అతిక్రమించి, సకల మానవీయ ధర్మాలను ఉల్లంఘించి కొనసాగిస్తూ వస్తున్న దోపిడీ వర్గాల స్థావరాలు.. లగ్జరీ విల్లాలు..వరుసగా..సండేజ్‌ బీచ్‌ రిసార్ట్‌, అంజనా బీచ్‌ రిసార్ట్‌, బే వ్యూ రిసార్ట్‌, స్మైల్‌ గార్డెన్‌ రిసార్ట్‌, హాప్పీ రిసార్ట్‌, సీషెల్స్‌, ఎక్కోవిల్లా, అమెజాన్‌ బీచ్‌ రిసార్ట్‌..ఒక పరంపర.

‘చీమలుపెట్టిన పుట్టలు పాముల..’ ఒక అనుభవసూత్రం.. యుగయుగాలనాటి పాతది.

ఈ దీవులలో ఎక్కడా..స్థానీయ అండమాన్‌ మూలవాసి ఒక్కరుకూడా కనబడని అత్యంత విషాదకర సందర్భంలో.,

జైలుదేశమైన అండమాన్‌కు.. అవసరార్థమై, బానిస పనులకోసం, పొట్టకూటికోసం, దిక్కులేని పరిస్థితుల్లో, మనుషులు వలసలై..వలస పకక్షులై..ఏ చెట్టుపక్షో ఈ కొమ్మపైవాలి..ఏ కొమ్మ పూలో ఈ దండలో ఒదిగి.,

గ్రీన్‌ వ్యాలీ రిసార్ట్‌,

సాయంత్రం నాలుగ్గంటలు.. సూర్యాస్తమయానికింకా రెండున్నరగంటల వ్యవధి.

ఎదుట ప్రశాంతంగా.. నిశ్శబ్దంగా సముద్రం..నీలిరంగు నీరు..నీలిరంగుదే ఆకాశం. అది సిల్వర్‌ సాండ్‌ ప్రాంతం.. యిసుకంతా వెండిరజనువలె..మెత్తగా, సన్నగా, పొడిపొడిగా..మెరుస్తూ.,

అందమైన ఎనిమిది ఏర్‌కండిషన్డ్‌ గదులతో మనుషులు ముట్టుకుంటే మాసిపోయేట్టున్న మెరుగుపెట్టబడ్డ వెండిగోడలతో నిర్మించినట్టున్న నిశ్శబ్ద, సుందర, నిర్మానుష్య, నిసర్గ సౌందర్య భవనపు ముందున్న ‘బే సీ’ షెల్టర్‌ క్రింద..ఆమె..ముప్పది ఎనిమిదేళ్ళ ప్రౌఢ..చురుకైన జింక కళ్ళు, పదునైన పాదరసంవంటి మేధ, బంగారంతో పోతపోసినట్టున్న శరీరం, దేవతలందరూ పోటీపడి శిల్పించి తుదిరూపమిచ్చినట్టున్న కాంతులీనే మేను, లిప్తకాలంలో సూపర్‌ కంప్యూటర్‌ వేగంతో వ్యూహాలను రచించగల హృదయం.. ఆమె..అరుంధతి ఆడెపు. బి.టెక్‌..ఐఐటీ మద్రాస్‌, ఎమ్‌టెక్‌.. ఐఐటి కాన్పూర్‌, ఎమ్‌బిఎ ఐఐమ్‌ అహమ్మదాబాద్‌,

చూస్తోంది అరుంధతి సముద్రంలోకి, ఆకాశంలోకి, శూన్యంలోకి..శూన్యాంతరాల్లో.. మౌనంగా..నిశ్శబ్దంగా.. అభావంగా.

ఎమ్‌బిఎలో టాపర్‌ ఐ స్వర్ణపతకాన్ని సాధించి క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో ఎనిమిది బహుళజాతి కంపెనీల్లో ఏడాదికి అరవై లక్షల జీతంతో అవకాశాలను పొందగలిగిన తను.. ఏ ఒక్క అవకాశాన్నీ అంగీకరించలేదు.

స్వతంత్రత.. స్వతంత్ర జీవితం.. స్వతంత్ర అభివృద్ధి..స్వతంత్ర సంపాదన..స్వతంత్ర అధిపత్యం.

”డెసిషన్‌ మేకింగ్‌” చాప్టర్‌ను చెబుతున్నపుడు ప్రొఫెసర్‌ మౌళి చెప్పిన వాక్యాలు గుర్తుకొచ్చాయి అరుంధతికి చటుక్కున..ఆయనన్నాడు.. ‘జీవితంలో ఏ నిర్ణయం తీసుకున్నా భవిష్యత్తులో ఆ నిర్ణయం తీసుకున్నందుకు పశ్చాత్తాపపడవలసిన సందర్భం రావద్దు..’ అని.

చాలా లోతైన, పరమసత్యమైన, గంభీరమైన ప్రవచనమది. ఆ క్షణం చాలా ఆలోచించింది తను.

నిర్ణయం..డెసిషన్‌..దేని గురించైనా కావచ్చు..ఉద్యోగం..ప్రేమ..పెళ్ళి..పిల్లలు..వ్యూహాలు, పథకాలు, ప్రణాళికలు, రాజకీయాలు, క్రీడలు, కుట్రలు, కుతంత్రాలు..త్యాగాలు..చివరికి యుద్ధాలు.,

నిర్ణయమంటే..ఒకానొక ఎత్తుగడ.. ఒక అడుగు.. ఒక కదలిక.. ఒక ఆయుధం.

”ట్రణ్‌ణ్‌ణ్‌ణ్‌..” మొబైల్‌ మ్రోగింది. ఉలిక్కిపడ్డది అరుంధతి.. ఏదో తెగిపడ్డట్టు., ఏదో చిట్లిపోయినట్టు..ఎవరో   బలవంతంగా తట్టినట్టు.,

‘హలో..’ అంది మృదువుగా..తీయగా..గంభీరంగా.

‘మేడం వుయార్‌ రీచింగ్‌.. ఎక్స్‌ అండ్‌ వై’ అంది మృదుల అట్నుండి. మృదుల అరుంధతి పర్సనల్‌ సెక్రటరీ.

‘హౌ’

‘బై ఎ స్పెషల్‌ ఫెర్రీ’

‘వాటెబౌట్‌ ఎ అండ్‌ బి’

‘దె డు కం..బై ఎనదర్‌ వాటర్‌ వెహికిల్‌ సూన్‌.. మోస్లీ విథిన్‌ ట్వంటీమినట్స్‌’

‘మన షెడ్యూల్‌లో డిలే ఏమి లేదుకదా..ప్రాజెక్టు ఫర్‌ ఫోర్టీన్‌ అవర్స్‌’

‘నో డిలే మేడం..’

‘దట్స్‌ గుడ్‌.. డు కం’ – లైన్‌ తెగిపోయింది.

అరుంధతి ఎందుకో లేచి..రెండు నిముషాలు మెత్తని ఇసుకపై నడుస్తూ, అటు పశ్చిమాకాశంవైపు చూసింది. సూర్యుడు అలసి ఎర్రగా..ఎత్తైన కొండల చాటున,

ఉదయం..అస్తమయం..పొంగుట, కృంగుట.. గెలుచుట ఓడిపోవుట..జన్మించుట మరణించుట.. ఈ ద్వంద్వాలన్నీ పరమసత్యాలేననీ తెలిసి మనిసి.. హుఁ.,

నిట్టూర్చింది అరుంధతి చేతులను వెనక్కి ముడుకుని..నడుస్తూ.

చుట్టూ సముద్రపుటలల లయాత్మక ధ్వని..కొబ్బరిచెట్ల కొమ్మల వింతరొద, చెట్ల గుబుళ్ళలోనుండి పకక్షుల గోల.. వీటన్నింటి మధ్యా నిశ్శబ్దమైన గాలి శబ్దం.

కళ్ళుమూసుకుని ఈ పద్నాలుగ్గంటల ప్రణాళిక, రూపకల్పన, మనుషుల అంగీకారత, వాళ్ళ వాళ్ళ వాటాల వితరణ, సకల సుఖవంతమైన సౌకర్యాల ఏర్పాటు.. ఈ అన్ని విధులనూ తన అజ్ఞాత కంపెనీ ‘రైడర్స్‌’ ఉద్యోగులు ఎంతో క్రమశిక్షణతో నిర్వహించుట..,

ఎక్కడా రవ్వంత కూడా సడలని నిష్టాపూరితమైన క్రమశిక్షణ..జాగ్రత్త..సమర్థత కనిపించేది దొంగల్లో, దోపిడీ దారుల్లో, ఆక్రమణదారుల్లోనేకదా. అప్రమత్తత, వ్యూహాత్మకత, దీర్ఘదృష్టితో వీక్షణ.. ఇవన్నీ వ్యాపారాత్మక విజృంభణకు మూలలక్షణాలు.

‘మనిషిలోని బలహీనతలను సంపదగా మార్చుకోవడమే వ్యాపారం’ అనికదా ప్రొఫెసర్‌ మౌళి చెప్పింది.

బలహీనత..సంపద

సంపదే బలహీనత- సంపదకు లొంగనివాడెవరున్నారీ ప్రపంచంలో.. సంపదంటే డబ్బు, బంగారం, భూములు, ఆస్తులు, అందాలు, వయస్సు..దేహం..దేహసౌందర్యం..తెలివి..ప్రతిభ.. ఏదైనా.

కళ్ళు మూసుకుంది అరుంధతి సాలోచనగా.

‘ఆపరేషన్‌ ఫోర్టీన్‌ అవర్స్‌’ ఒకసారి వీడియో ఫిల్మ్‌వలె కదిలింది మదిలో.

‘ఈ ప్రపంచంలో, ఎవరైనా ఏదో ఒకదానికి తప్పనిసరిగా లొంగిపోతారు ‘అన్న సార్వత్రిక సూత్రం తన అజ్ఞాత సంస్థ ‘రైడర్స్‌’ ఆవిర్భవానికి మూలసూత్రం.. సంస్థకు అసలు ఆఫీసే ఉండదు. తనది ఒక ‘వర్చువల్‌ ఆర్గనైజేషన్‌’. ఉద్యోగులందరూ వర్కింగ్‌ ఫ్రం హోమ్‌ ఆర్‌ సెల్‌. అవసరమైతే తప్ప ఎవరికి ఎవరూ కనబడరు. రెండువందల నలభై రెండు మంది ఉద్యోగులని కలిగి, నెలకు పదిహేను కోట్ల జీతాలను బట్వాడా చేస్తూ కనీసం నెలకు పదివేలకోట్ల టర్నోవర్‌తో వందకోట్ల లాభమైనా సంపదించకుండా ఉండలేని తన కంపెనీ వాస్తవంగా ఒక వర్చువల్‌.. అభౌతిక సంస్థ. ఎక్కువమంది అరవైకి పైబడ్డ వయసు కలిగి..ప్రభుత్వ సెక్రటేరియట్లలో పూర్వ ప్రిన్స్‌పల్‌ సెక్రటరీస్‌, ఇంటలిజెన్స్‌ శాఖలో ఉన్నతోద్యోగులుగా, దేశ ప్రధాన వనరులు, పరిశ్రమలకు సంబంధించిన మాజీ ఎగ్జిక్యూటివ్స్‌, బ్యాంక్‌ల రిటైర్డ్‌ జి ఎమ్‌ స్థాయి ఉద్యోగులు.. ఎవరెవరికి కీలకమైన పదవుల్లో ఎన్నెన్ని ఎక్కువ పరిచయాలున్నాయో అటువంటి వ్యక్తులు.. వాళ్ళతో కూడిన విశాలమైన నెట్‌వర్క్‌ తనది. రిటైర్డ్‌ ఇండస్ట్రీస్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రిన్స్‌పల్‌ సెక్రటరీ రామనాథన్‌ పిళ్ళై యిప్పుడీ ప్రాజెక్ట్‌కు నేతృత్వం వహిస్తున్నాడు. అతనికి బొగ్గు, చమురు, గ్రానైట్‌ నిక్షేపాల నేపథ్యంతో సంబంధమున్న ఉన్నతాధికారుల, సంబంధిత రాజకీయ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు..అందరూ తెలుసు సన్నిహితంగా. అందరితోనూ బేరసారాలు చేయగలడు. రేట్లు ఫిక్స్‌చేసి అన్నిరకాల డీల్స్‌ కుదుర్చగలడు. రామనాథన్‌ పిళ్ళైవంటి రీజనల్‌, నేషనల్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ లెవల్‌ ఎగ్జిక్యూటివ్స్‌ ఎందరో తన దగ్గర.. ప్రకాశ్‌ సింగ్‌ ఝా, మధుకర్‌ ముండా, చిత్రా బన్సల్‌, సత్యరంజన్‌ ఘోష్‌, తాతినేని రాంబాబు..ఎందరో..నెలకు ఒక్కొక్కరికి నాల్గునుండి ఏడెనిమిది లక్షలవరకు జీతాలు, సౌకర్యాలు అదనం. అందరిపైనా వాళ్ళకు తెలియకుండా అదృశ్యనిఘా. ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎవర్తో మాట్లాడున్నారు..ఎవర్ని కలుస్తున్నారు..అన్నీ మరుక్షణంలో సమాచారమంతా తనముందు ప్రత్యక్షం.

మనిషికి సంపాదించడం మత్తు.. మెట్లెక్కుతూ పోవడం ఒక పిచ్చి.. ఎక్కడం ప్రారంభమైన తర్వాత.. ఎప్పటికైనా క్రిందకు దిగక తప్పదన్న స్పృహే ఉండని ఉన్మాదం. జీవితమంతా పరుగు..పరుగు..పరుగులో ఉన్నప్పుడు పూర్తిగా నశించిపోయే విచక్షణ. కనిపించేది కేవలం టార్గెట్‌..గమ్యం..గమ్యమంటే డబ్బు..సంపద..

ఎంత సంపద.. ఎంత డబ్బు

వ్చ్‌..ఏమో.

 

*                              *                               *                              *

 

 

చాలా రహస్య పర్యటన..కేవలం పదిగంటలే.

కేంద్రమంత్రి రాంకిషోర్‌ సన్యాల్‌.. గనులశాఖ..చదువు పదవ తరగతి ఫెయిల్‌.గనులంటే ఏమిటి..వనరులంటే ఏమిటి..ఏ ఖనిజాన్ని దేనికి ఉపయోగిస్తారు..తను కాగితంపై సంతకం పెడ్తే ఎందుకు కోట్లకు కోట్లు చేతులుమార్తాయో..తెలియదు అతనికి.

క్రింద బ్యూరోక్రాట్స్‌ ఏది చెప్తే అది. కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌..అన్నీ సెక్రటరీ రామ్‌సింగ్‌ ముద్గల్‌.. ఏది చెప్తే అది.

జెట్‌ ఏర్‌వేస్‌ విమానం..చెన్నై టు పోర్ట్‌ బ్లెయర్‌..ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌..రెండు గంటలు గాల్లో ఎగిరివచ్చి..వీర్‌ సావర్కర్‌ ఇంటర్నేషనల్‌ ఏర్‌ పోర్ట్‌లో ఆగింది..వెనుక ఎకానమీ క్లాస్‌లో సన్యాల్‌ పర్సనల్‌ సెక్యురిటీ.. ఎస్‌పిజి కమెండో రఘు సర్కార్‌.

సన్యాల్‌ వయసు యాభై ఎనిమిది..శరీరంనిండా రోగాలే అడవిలో చెట్లవలె.

‘ ఈ సెక్యూరిటీగాణ్ణి ఎలా తప్పించాలి’ అని ఆలోచిస్తున్నాడు సన్యాల్‌ అప్పట్నుండి.

ఏర్‌పోర్ట్‌ బయటికి రాగానే ఒక నల్లని ఆడి క్యూఫైవ్‌ కారొచ్చింది మెత్తగా.

అలా వస్తుందని తెలుసు మంత్రి సన్యాల్‌కు కార్లో కేవలం డ్రైవర్‌..నంబర్‌ చూచుకున్నాడు కార్‌ది. ఓకె.

‘రఘూ..తుమ్‌ ఐసా కరో..యహీ సిటిమే రహెజావ్‌.. ఏరాత్‌.. ఫిర్‌ సుబే ఛేబజే యహా ఆనా..యహీ ఏర్‌పోర్ట్‌మే..ఏలో..పాంచ్‌ హజార్‌..’

రఘు మంత్రి ముఖంలోకి చూశాడు. హత్యానంతరం హంతకుని ముఖంవలె ఉంది మంత్రి ముఖం.. అపరాధ భావరతో.

”ఠీక్‌హై..మై యహా సెల్యులర్‌ జైల్‌ దేఖ్‌నే జావూఁగా..కల్‌ ఛేబజే”.. రఘు ఎందుకో అప్రయత్నంగానే తన సఫారీ డ్రెస్‌ ప్యాంట్‌ జేబును తడుముకున్నాడు. లోపల బెరెట్టా 5 ఎంఎం రివాల్వర్‌ భద్రంగా.

తను ఒక పరమ అవినీతిపరుడైన, దేశాన్ని కొల్లగొడ్తూ వనరులను తోడుకుతింటున్న, దేశద్రోహమంత్రికి బాడీగార్డ్‌..రక్షకుడు.. కాపలాదారు.

ఛీ ఛీ…

కొన్నేండ్లుగా గుండెలను తొలిచేస్తున్న కుమ్మరిపురుగులాంటి భావన.. న్యూనత.. సిగ్గు..లోపల ఏదో దహించుకుపోతున్న.. ఏదో ధ్వంసమైపోతున్న ఫీలింగ్‌.

రఘు చూస్తుండగానే..ఆడి కార్‌ రబ్బర్‌ పలకపై గాజుగోళీలా జారిపోయింది మంత్రిని మోసుకుని.

పది నిముషాల తర్వాత..చత్తాం వార్ఫ్‌.. అక్కడ సిద్ధంగా ఉన్న ప్రత్యేక వాటర్‌ వెహికిల్‌.. కార్‌తో సహా నౌకలోకి ఎక్కి.. నౌక కదిలి..

చుట్టూ నీలిరంగు సముద్రం..సాయంసంధ్య..దూరంగా హవ్‌లక్‌ ద్వీపం..వరుసగా రిసార్ట్స్‌..లీలామాత్రంగా…

కుట్రలూ, దోపిడీలు, వ్యూహాలూ, ఆక్రమణలూ..అన్నీ ఎప్పుడూ నిశ్శబ్దంగానే జరుగుతాయి.

కేంద్రమంత్రి రాంకిషోర్‌ సన్యాల్‌ తలలో ఈ డీల్‌ద్వారా తన అకౌంట్‌లో జమచేయబడబోతున్న పద్నాలుగు కోట్ల ఎనభై లక్షల డబ్బు తాలూకూ స్పృహ తారాజువ్వలా విప్పుకుని వెలుగుతూ గిలిగింతలు పెడ్తోంది.

 

*                         *                               *                                *

 

క్విడ్‌ ప్రో కొ..ఇచ్చి పుచ్చుకునే ఒక పరస్పర ఒప్పందం.

ఏమి యిచ్చి…ఏమి పుచ్చుకుని.,

ఏదైనా.. బొగ్గుయిచ్చి.. డబ్బు పుచ్చుకుని, గ్రానైట్‌ యిచ్చి డబ్బు పుచ్చుకుని..పవర్‌ ప్రాజెక్ట్‌లు యిచ్చి డబ్బు పుచ్చుకుని.. సెజ్‌ల కింద ప్రభుత్వ భూములను చౌకగా యిచ్చి డబ్బు పుచ్చుకుని.,

యివ్వవలసిన వాటిగురించి చూచుకునేందుకు తన ఉద్యోగి పార్థసారధి రామన్‌.. ఐఎఎస్‌, పార్మర్‌ యిండియన్‌ అంబాసిడర్‌ టు సౌతాఫ్రికా, పుచ్చుకోవలసిన డబ్బు..కోట్ల రూపాయల డబ్బు బట్వాడా..వాళ్ల వాళ్ళ అకౌంట్లలోకి భద్రంగా చేర్చే ప్రక్రియను పర్యవేక్షించేందుకు అరవై ఐదేండ్ల చార్టర్డ్‌ అకౌంటెంట్‌ జొన్నవిత్తుల రామారావు..ఫార్మర్‌ ఆడిటర్‌ జనరల్‌.

మనుషుల ప్రతిభా వ్యుత్పత్తులను ‘చెల్లించి వినియోగించుకో’.. పే అండ్‌ యూజ్‌..లేటర్‌ యూజ్‌ అండ్‌ త్రో..సానిటరీ నాప్‌కిన్‌వలె..

ఆ రాత్రి తొమ్మిదిగంటల వేళ.. బంగాళాఖాత సముద్రతీరంపై.. ఆ రిసార్ట్‌ ముంగిట్లో..పరిచిన పిండివెన్నెల్లో..సన్నగా పాలకాంతిని విరజిమ్ముతున్న టేబుల్‌లాంప్‌ ప్రక్కన.. తళతళా మెరిసే గాజుగ్లాస్‌లో..బంగారురంగు ‘మెకల్లన్‌’ విస్కీని సుతారంగా చప్పరించి.. లోపల..దేహాంతర మోహాగ్ని జ్వాలల్లో నిశ్శబ్దంగా దగ్దమౌతూ.. అరుంధతి ఆడెపు.. లోపల..రిసార్ట్‌పై అంతస్తులో యింకో అరగంటలో తనకు స్వర్గ సుఖాన్నందివ్వబోయే తన రహస్య ప్రేమికుడు నాగరాజు గైక్వాడ్‌ను తలుచుకుంటూ.. కనలిపోతూ..అసహనంగా గడియారాన్ని చూచుకుంది.

తొమ్మిదీ యిరవై రెండు.

అరుంధతికి ఏ పనిచేసినా ఎటువంటి సాక్ష్యమూ, ఆనవాలూ లేకుండా..అవశేషాలు మిగలకుండా..నిశ్శబ్దంగా చేసుకుంటూపోవడం అలవాటు.. అనివార్యమైతే తప్ప తను పిక్చర్లోకి ప్రవేశించదు. ఎప్పుడూ కాగల కార్యాలను గంధర్వులతో చేయిస్తుందామె.

”వెధవలు స్వయంగా పనులు చేస్తారు.. మేధావులు తనక్కావలసిన పనులనే ఇతరులతో చేయించుకుంటారు’ అని నేర్చుకుందామె తన ఎంబిఎ హెచ్చార్‌లో.

అలల నిశ్శబ్ద లయను ఛేదిస్తూ మనిషి అలికిడైతే..తలెత్తి.,

ఎదుట మృదుల.. తన ఆలోచనలకు మానవరూపం..స్త్రీ రూపమెత్తిన విద్యుత్‌మెరుపు..నవ్వుతూ..

”చెప్పు మృదులా” అంది మృదువుగా..టేబుల్‌పైనున్న తందూరీ చికెన్‌ ముక్కనొకదాన్ని నోట్లో పెట్టుకుంటూ-

”ఫైనల్‌ రిపోర్ట్‌ మేడం”

”గివ్‌మీ”

”ఈ రోజు..షెడ్యూల్డ్‌ డీల్స్‌ మూడు మేడం.. ఒకటి..జార్ఖండ్‌ రాష్ట్రంలోని ధాడు బొగ్గుబ్లాక్‌ను, పశ్చిమబెంగాల్‌లోని మధుజోర్‌ బొగ్గు బ్లాక్‌ను, చత్తీస్‌గడ్‌లోని బ్రహ్మపురి బొగ్గు బ్లాక్‌ను..మూడు కలిపి ముప్పయి రెండు వందల మిలియన్‌ టన్నుల బొగ్గును ఐదువందల కిలోమీటర్ల విస్తీర్ణంలో పన్నెండేండ్లు తవ్వుకునేందుకు అనుమతినిస్తూ మంత్రి సంతకం చేసి విడుదల చేస్తున్న జివో. డీల్‌ వర్త్‌ ఆరువేల ఎనిమిదివందల కోట్లు..మంత్రికి..ఇతర ఖర్చులు నూటా ఎనభై కోట్లు. మన నికర కన్సల్‌టెన్సీ ఫీ యిరవై కోట్లు. రెండవది..ఆంధ్రప్రదేశ్‌..కరీంనగర్‌ జిల్లా.. నాల్గువందల ఎనభై రెండు గుట్టల గ్రానైట్‌ డిగ్గింగ్‌ అండ్‌ ఎక్స్‌పోర్ట్‌ లీజ్‌. ఎస్‌ఆర్‌ఆర్‌ ఎంటర్‌ప్రైజెస్‌..పన్నెండేండ్లు లీజ్‌ టోటల్‌ డీల్‌ ఐదువందల డెబ్బయ్‌ రెండు కోట్లు.లీడింగ్‌ మూడు పొలిటికల్‌ పార్టీల కన్సార్టియంతో ఎటువంటి గొడవాలేకుండా ‘తిను తినిపించు.. ఎంజాయ్‌’ పాలసీ కింద సెటిల్‌మెంట్‌. నాల్గు జివోల జారీ.. మన ఫీ పన్నెండుకోట్లు. మూడవది..ఉత్తరాంచల్‌లో.. వెనుకబడిన ప్రాంతాల్లో పారిశ్రామికాభివృద్ది ప్రాజెక్ట్‌ క్రింద ట్యాక్స్‌ హాలిడే పరిధిలో ఫార్మా సెజ్‌.. అరవింద ఫార్మా లిమిటెడ్‌కు ఐదువందల డెబ్బయి ఎనిమిది ఎకరాల ప్రభుత్వ భూమి అలాట్‌మెంట్‌..ఎట్‌ ది రేటాఫ్‌ థౌజండ్‌ రూపీస్‌ పర్‌ ఏకర్‌ .. నామినల్‌ రోటో..దీంట్లో మన ఫీ..ఎనిమిది కోట్లు. ఎక్స్‌ అండ్‌ వై రెండవ మరియు మూడవ డీల్‌, ఎ అండ్‌ బి కలిసి మొదటి డీల్‌ను కాగితాలపై సంతకాలు చేశారు మేడం. రవీంద్రన్‌ అన్ని పేపర్స్‌ తయారుచేస్తున్నాడు. ఫైనాన్సియల్‌ ట్రాన్సాక్షన్స్‌ అన్నీ ఫినిష్‌.. ఎవ్రిబడీ ఈజ్‌ హాపీ. నౌ వెట్‌ పార్టీ ఫాలోస్‌..ఆర్గురు గెస్ట్‌లకోసం ఎనిమిది మంది నికోబార్‌ నేటివ్‌ యంగ్‌ గర్ల్స్‌ రెడీగా ఉన్నారు. ఒకమంత్రి.. ముగ్గురు ఐఎఎస్‌ ఆఫీసర్స్‌..వన్‌ మీడియేటర్‌. పాల్‌ జాన్సన్‌ మన ఎగ్జిక్యూటివ్‌. అంతా ‘టర్మ్స్‌ యిన్‌ క్యాష్‌.. గెస్ట్స్‌ విల్‌ లివ్‌ బై ఫోర్‌ ఎ.ఎమ్‌. దె రీచ్‌ దైౖర్‌ డిస్టినేషన్స్‌ బై నైనోక్లాక్‌..ఓవర్‌..”

”గుడ్‌ మృదులా..ఫైన్‌..యు డిడేనైస్‌ జాబ్‌”

”థ్యాంక్యూ మేడం”

”యిదుంచుకో”- ఓ ఐదారు వేయి రూపాయల నోట్ల కట్టలనిచ్చింది తన వ్యానిటీ బ్యాగ్‌నుండి బయటికి తీసి.

చిర్నవ్వుతో అందుకుని అంది మృదుల ”మీరొకసారి అందరికీ మీ దర్శనమిచ్చి పార్టీకి అనుమతినిచ్చి.. అలా మీ రూఫ్‌ గార్డెన్‌వెళ్ళండి- అక్కడ అంతా రెడీ.. దేరెండ్స్‌ ది మాటర్‌. అక్కడే మీ నాగరాజున్నాడు ప్రాజెక్ట్‌ గెట్స్‌ కంప్లీటెడ్‌..’ అని

”ష్యూర్‌…” అంది అరుంధతి..అని లేచి మెరుపుతీగలా మృదుల వెంట నడిచి.,

బాంకెట్‌ హాల్‌లో.. తెల్లగా పాలనురుగులా వెలుగు.. నిశ్శబ్దంగా, విన్రమంగా, భయంభయంగా మంత్రీ, ఐ ఎ ఎస్‌లూ.,

ఆమె చిన్నగా నవ్వి..కవ్వింతగా చూచి..ఠీవిగా చేయూపి.,

‘అందని వస్తువెపుడూ అతిమధురం.. కీప్‌ ద థింగ్‌ ఎవే టు టెంప్ట్‌’

అరుంధతి ‘పిచ్చిలోకమిది..’ ఎక్కుతే వంగుతుంది.. వంగుతే ఎక్కుతుంది’ అనుకుంటూండగా.,

వెన్నెల రాత్రి కరిగిపోతూనే ఉంది.

*             *               *            *           *

స్పెషల్‌ పొటెక్షన్‌ గ్రూప్‌ కమెండో రఘు సర్కార్‌ మనసు దుఃఖంతో, వేదనతో, బాధతో కణకణలాడ్తున్న నిప్పులపై  మొక్కజొన్న కంకిలా ఉంది.

ఒక అతిపెద్ద అవినీతిపరుడైన మంత్రికి రక్షకుడు తను..తన కఠోరమైన యుద్ధవిద్యలశిక్షణ, రక్షణ మెళకువల పరిజ్ఞానం, చిన్ననాటినుండీ గుండెలనిండా జీర్ణించుకున్న దేశప్రేమ.. ఈ మట్టి.. ఈ గాలి.. ఈ సమాజం.. ఈ నీరు.,

దడదడలాడ్తున్న గుండెలతో అడుగుపెట్టాడు తను సెల్యులర్‌ జైల్‌లో.. హృదయం భళ్ళున పగిలింది గాజుపలక నేలపై పడ్డట్టు.

కేంద్రంలో నియంత్రణ భవనం కల్గి ఏడు రెక్కలుగా.. ఒక్కో రెక్కలో నాల్గంతస్తుల ఒంటరి జైలుగదులతో 696 సున్నం, యిటుకలతో నిర్మించిన ఇరుకు అరలు. ఒక్కో అరలో ఒక్కో ఖైదీ.. ఎంతకాలం.. జీవితాంతం..ఏమిటి వాళ్లు చేసిన నేరం.. తమ మాతృభూమిని ప్రేమించడం.. ‘వందేమాతరం’ అని ఎలుగెత్తి నినదించడం.. పరాయిపాలకులను ప్రశ్నించడం..

మనిషి ప్రశ్నగా పరిణమించినందుకు ఆజన్మాంత శిక్ష, ఏకాంత కారాగారవాసం.

మెడకు యినుప కడెం..రెండు చేతులకూ కడాలు..కాళ్ళకు యినుప రింగ్‌లు.. ఈ అన్నింటినీ కలుపుతూ యినుప కడ్డీలు.. గోనెసంచులతో కుట్టిన అంగీ, నిక్కరు..గానుగ ఎద్దులకు బదులు ఖైదీలచే నూనెతీత..దాహమైతే ఎవని ఉచ్ఛ వాడు తాగి, ఆకలైతే ఎవని పియ్యి వాడు తిని.,

ఉరిశాలలు..

ఉరికోసం నిరీక్షణశాలలు.

ఆ ఆవరణ.. ఆ జైలు ఊచలు..ఆ ఒంటరి పురాస్మృతులు..గోడలు.,

మనసునిండా కల్లోల బంగాళాఖాత సముద్రఘోష.,

సెంట్రల్‌ ఆఫీస్‌ గోడలమీది పాలరాతి పలకలపై 689 మంది ఖైదీలపేర్లు.. ఎప్పుడు ఖైదీ చేయబడ్డారో ఆ సంవత్సరాల వివరాలు.. ఎక్కువమంది బెంగాలీలు, బిహారీలు, పంజాబీలు.. వందలకు వందలు.,

యిందరు జీవిత ఖైదీల.. ఒకవీర సావర్కార్‌..తిలక్‌.. వంటి ఎందరెందరో త్యాగధనుల జీవితత్యాగ ఫలితంగా సిద్ధించిన స్వాతంత్య్రం.,

ఈ అరవై ఆరేళ్ళ తర్వాత.,

అవినీతిమయమై.. అనైతికతో, అరాచకత్వంతో, లంచగొండితనంతో, దోపిడీలతో, విలువలన్నీ పతనమైన దౌర్భాగ్య సంస్కృతితో.. విచ్చలవిడి రాజకీయాలతో.. చేవ చచ్చిన అర్థనపుంసక యువతరంతో..,

ఏమిటి..ఏమిటిది..?

రాత్రంతా గుండెలనిండా..అంతర్‌జ్వలనం..దహనం..లోపల ఏదో అరణ్యం తగలబడిపోతున్నట్టు క్షోభ…

ఉదయం.. ఐదు గంటలు.,

సెల్యులర్‌ జైలు ముందు..మొక్కుబడిగా పెంచుతున్న పార్క్‌.. ఒక సిమెంట్‌ చప్టాపై కూర్చుని తదేకంగా చూస్తున్నాడు రఘు సర్కార్‌.. ద పర్సనల్‌ సెక్యూరిటీ టు సెంట్రల్‌ మినిస్టర్‌.

ఎదురుగా.. ఎర్రగా..కాంస్య విగ్రహాలు..ఆరు..మెడలలో సంకెళ్ళతో..చేతులకు, కాళ్ళకు యినుప బేడీలతో.,

ఇందుభూషణ్‌ రాయ్‌ బెంగాల్‌, బాబా భాన్‌సింగ్‌ – పంజాబ్‌, పండిట్‌ రాంరఖా బాలి-పంజాబ్‌, మహావీర్‌ సింగ్‌-యు.పి, మోహన్‌ కిషోర్‌ నాందాస్‌, బెంగాల్‌, మోహిత్‌ మొయిత్రా-బెంగాల్‌.,

ఎవరు వీరు.,

దేశంకోసం ప్రాణాలను రాక్షసహింసననుభవిస్తూ పరిత్యజించి..,

యిప్పుడీ దేశం..ఏమౌతోంది.,

తన మంత్రి..బొగ్గు బ్లాక్‌లు.ఎవరికో ధారాదత్తం చేస్తూ..పైరవీలు..లాబీలు..అమ్మకాలు..కోట్లు..లక్షల వేల రూపాయల స్కాంలు…

ఏమిటిది..?

రఘు సర్కార్‌కు ఎందుకో దుఃఖం సముద్రంవలె ముంచుకొచ్చింది. కన్నీళ్ళు కెరటాలై విజృంభిస్తున్నాయి.

ఎందుకో..ఆక్షణం.. అతనిచేయి అనూహ్యంగానే తన కుడి చేయివైపున్న ప్యాంట్‌ జేబులోకి పోయింది.

చేతిలో బెరెట్టా రివాల్వర్‌..ధగధగా..బరువుగా..నిగనిగా.

నీళ్ళునిండిన కళ్ళతో రివాల్వర్‌ వైపు చూస్తున్నాడు..ప్రేమగా-

 

– రామా చంద్రమౌళి

మీ మాటలు

 1. ఇది పూర్తి కథా లేక సీరియల్లోని మొదటి భాగమా? ఒక వేళ కథే అయితే, పేజీలు మిస్ అయ్యి ఎడిటర్ చూసుకోలేదా?

 2. prof.raamaa chandramouli says:

  యాజీ గారూ ..మీరు గ్రహించింది కరెక్టే …సంపాదకులు వెంటనే సవరించి మిస్సయిన పేజీని చేర్చారు.దయచేసి ఎప్పుడు కథను చదివి మీ అభిప్రాయం రాయండి.
  మౌళి

 3. prof.raamaa chandramouli says:

  యాజీ గారూ ..మీరు గ్రహించింది కరెక్టే …సంపాదకులు వెంటనే సవరించి మిస్సయిన పేజీని చేర్చారు.దయచేసి ఇప్పుడు కథను చదివి మీ అభిప్రాయం రాయండి.
  మౌళి

 4. చెప్పదలుచుకున్న విషయం ఉదాత్తమైనధైనా, మీరు చెప్పిన విధానం సాగదీతగా అనిపించింది. చెప్పని విషయాలు కూడా ఎక్కువయ్యి కథకొక లో స్పష్టత లోపించిందేమో అని నా కనిపించింది. ఆవేదనతో రగిలిపోతున్న రఘు, తను తడుముకుంటున్న రివాల్వర్ తో ఏమి చేస్తాడో అన్న విషయం రీడర్స్ కే వదిలేద్దమనుకున్నట్లున్నారు. క్లూలు తక్కువై అర్ధాంతరంగా ముగిసిందనిపించింది.

 5. P.Madhavi says:

  భారత వర్తమాన సమాజంలో విశృంఖలంగా విస్తరించిన అవినీతి,దోపిడి,అసమర్థ ప్రభుత్వాల దుష్ట పాలన …ఇదంతా ఎంతో
  ఆర్థ్రంగా రాశారు మౌళిగారు..ధన్యవాదాలు.ప్రయోజనకరమైన ,ఆలోచింపజేసే కథ ఇది.చాలా బాగుంది.

  పి.మాధవి

 6. janarthan.R says:

  ‘ పద్దెనిమిది గంటలు ‘ ఒక మంచి కథ,రచయిత వేదన ఎంతో ఆలోచిన్చదగ్గది.రామా చంద్రమౌళి గారికి థాంక్స్.

  జనార్థన్.ఆర్

 7. k.purushotham says:

  సెల్యూలర్ జైలు లో అప్పటి దేశభక్తులు పడ్డ బాధలు ,త్యాగాలు చదువుతుంటే ఒళ్ళు జలదరించింది .అటువంటి స్వాతంత్ర్యాన్ని యెంత దుర్వినియోగం చేస్తున్నామోకదా .చాలా మంచి కథ.థాంక్స్ తో మౌళి గారు అండ్ ఎడిటోరియల్ బోర్డ్.
  – పురుషోత్తం

 8. ravibabu.k says:

  నేను గత పది సంవత్సరాలుగా మౌళి గారి కథలను…కవిత్వం పరిశీలనగా చదువుతున్నాను .అత్యంత సమకాలీన భారత రుజగ్రస్త సమాజాన్ని,పరిస్తితులను వస్తువుగా తీసుకుని ఆయన ఒక క్షోభతో రాస్తున్నారు..ఒట్టి ఉబుసుపోక సాహిత్య సృష్టి మౌళిగారు చెయ్యట్లేదు….ఈ కథ కూడా ఒక అశ్రు తప్త హృదయంతో తనదైన శైలిలో రాశారు.ఆలోచింపజేసే
  మంచి కథ ఇది..నా అభిమాన రచయిత మౌళిగారికి ధన్యవాదాలు.
  – రవిబాబు.కె

 9. amarajyothi says:

  కధ బావుంది సెల్యులర్ జైలు వాతావరణం అప్పటి ఖైదీల బాధలూవారి పరిస్థితి చదువుతోంటే మనసు వికలమైంది
  డబ్బుకోసం నేటి సమాజంలో జరుగుతోన్న అవినీతిని రచయిత విపులీకరించే తీరు బావుంది రఘు మానసికస్థితి అర్ధమైంది అందుకే అతని ఆచరణాత్మక ఆలోచనను పాటకులకేవదిలేసారనుకుంటా రచయిత రామా చంద్ర మౌళి గారికి అభివందనాలు సారంగ సారధుల కృషికి అభినందనలు

 10. చంద్రమౌళి గారిది ఒక ప్రత్యెక వేదన.సమాజం,మనుషులు,అవినీతిరహిత వ్యవస్థ,పారదర్శక మానవ కుటుంబాలు..ఇవీ ఆయన కలగానే ‘ రేపు ‘ ..ఈ కథలోకాడా అంతే.రఘు పాత్రతో తన హృదయాన్ని ఆవిష్కరించారు.ఈ స్పృహ ఇప్పుడెంతో అవసరం.మంచి కథనందిన్చినందుకు సంపాదకులకు..మౌళిగారికి కృతఙ్ఞతలు.

  రవి,సిడ్ని,ఆస్ట్రేలియా

 11. చాలా మంచి కథ.అర్థవంతమైంది,ప్రయోజనకరమైంది.మౌళి గారికి అభినందనలు.

 12. chandramouli raamaa says:

  నా కథ గురించి ఇంతవరకు తమ అభిప్రాయాలను తెలియజేసిన మిత్రులందరికీ ధన్యవాదాలు..కరచాలనం హృదయంలో కోటి కదలికల్ని తెస్తున్డికడా..

 13. jyothmouli says:

  ‘ పద్దెనిమిది గంటలు ‘ కథ వర్తమాన భారత అవినీతికర సమాజ స్వరూపాన్ని వివరించి చూపింది.అత్యున్నత స్థాయిలో జరుగుతున్న దోపిడిని కళ్ళకు కట్టినట్టు చూపారు రచయిత . అభినందనలు.
  – జ్యోతి.కె ..దుబాయ్

మీ మాటలు

*