“అలసిన వేళనే చూడాలీ….”

 

అలా నా జీవితం నువ్వుపప్పు జీడిలా తియ్యగా కమ్మగా సా…….గుతూ వుండగా ,  ఒక వెచ్చని సాయంత్రం  ……

‘ సోగ్గాడిపెళ్ళం’ అనే పతిభక్త సినిమానుంచీ ” కొండకోన పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రాలేదు రామయ్యపైన ….రాయల్లెవున్న ఆ రామయ్యపైన ” అన్న ఏసుదాసు కీర్తనని భక్తితో ఆలకిస్తూ బిందె, చెంబూ బరబరా తోమి పడేసాను. ఉప్పూ చింతపండూ కలిపి తోమితే ఇత్తడి పుత్తడిలా మెరుస్తుందని ఆ మధ్యన మా అత్తగారు ఎవరికో చెపుతుంటే  పరధ్యానంగా  విన్నానేమో ….ఆ పాఠం అవసరానికి పనికొచ్చింది. (అదేవిటో నేను స్కూలుకెళ్ళి  శ్రద్ధగా నేర్చుకున్న పాఠాల కంటే , ఇలా అశ్రద్ధగా విన్న అత్తగారి పాఠాలే జీవితంలో ఎక్కువగా అక్కరకొస్తుంటాయి)

నే తోమి బోర్లించిన బుడ్డి చెంబు బాల భానుడిలా ప్రకాశిస్తుంటే , చెప్పొద్దూ ….నా తోముడు కళాప్రావీణ్యానికి నాకే తెగ ముచ్చటేసింది   . నా చేతిలో పడితే రాయైనా రత్నమై మెరుస్తుందేమో అన్న అనుమానం తన్నుకొచ్చింది. . “నువ్వు సూపరే పిల్లా” అని ఆయన అస్తమానూ  అనేది ఇందుకే కదా అని తలుచుకుంటే సిగ్గు ముంచుకొచ్చింది .  ఆ సిగ్గుతోనే  వంచిన నడుం ఎత్తకుండా రెండెకరాల   వాకిలీ గాలివాలుకు గబా గబా తుడిచేసి , ఓ  రెండు గాబుల నీళ్ళు తోడి కళ్ళాపు చల్లేసి , ఈ చివర్నించీ ఆ చివరికి  నాకొచ్చిన చుక్కలముగ్గులూ, చిక్కులముగ్గులూ అన్నీ పెట్టుకుంటూ కూర్చునేసరికి  సూరిబాబు మొఖం  వేళ్ళాడేసుకుని చెట్లవెనక్కి జారిపోయేడు .

అమ్మో…! అపుడే వంట వేళయిందా .  పొద్దున్నేకదా వండి పడేసాం!’ అని విసుక్కోకుండా మళ్ళీ హుషారుగా వండేసి- మళ్ళీతినేసి, మళ్ళీతోమేసి – మళ్ళీతుడిచేసి…..చీ…చీ…ఇంతేనా వెధవ జీవితం అన్న పాడుఆలోచన  అణుమాత్రమయినా  రానీయకుండా ……’పతియే ప్రత్యక్ష దైవమూ …నా అత్తారిల్లే స్వర్గమూ’ అని  పతిభక్తి పాటలు పాడుకుంటూ ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా ఎప్పుడెప్పుడు కిందా మీదా పడుతూ ఈ పాచి పనులన్నీ చేసేసుకుందామా అని కలలు కంటూ పడుకోటం  ‘ఆహా …. జీవితమే సఫలమూ ‘అని అరమోడ్పు కన్నులతో నేను తన్మయం చెందుతుంటే ….

కత్తిపీటా కూరలబుట్టా పట్టుకుని అటుగా వచ్చిన అత్తగారు నీరసంగా అరుగు చివర కూలబబడ్డారు. “ పంచాయితీ ఆఫీసులో ఎమ్మారావో ఎవడో  వచ్చి కూచున్నాడట  .  భోజనం ఏర్పాట్లు చూడమని మీ మావయ్య కబురంపేరు ” అంటూ ఉల్లిపాయలు ఒలవటం మొదలుపెట్టారు.  నాకళ్ళల్లో నీళ్ళొచ్చాయి అత్తగారి అవస్థ తలుచుకుని  ( సందేహం అక్కరలేదు నిజంగా అందుకే )

“ అప్పుడప్పుడూ కసురుకున్నా,  విసురుకున్నా నరసమ్మ చేసిన చాకిరీ తక్కువేం కాదేవ్. పాపం బండ గొడ్డులాగా రోజల్లా ఎంత పని చేసేది “అన్నారు అత్తగారు ఉల్లిపాయ తరుగుతూ  .  ” బాగా చెప్పారు ” అన్నాను    కళ్ళొత్తుకుంటూ . ఇంటిపనితో నాకూ వంట పనితో అత్తగారికి ఒళ్ళుపులిసిపోతుంటే మా జీవితాల్లో నరసమ్మలేని లోటు బాగా తెలిసొస్తుంది.

“ఇప్పుడు ఎన్ననుకుని ఏం లాభంలెండి  ! చేసుకున్నవారికి చేసుకున్నంత మహదేవా అన్నారు. నరసమ్మని వదిలించుకున్నాం అనుకున్నాం కానీ, అదే  మనల్ని  విదిలించుకుని వెళ్ళిపోయిందని అది వెళ్ళాకే తెలిసింది” అన్నాను నరసమ్మ దివ్యమంగళ రూపాన్ని ఓసారి  స్మరించుకుని.

“ మీ కొంపలో కాపీ గిన్ని తోమలేక సచ్చిపోతన్నాను  తల్లో- అని పాపం ఎంత మొత్తుకునేది . కనపడ్డవాడినల్లా కాఫీకి పిలుకొచ్చే  ఈ మగ మహారాజులకేం తెలుసు గిన్నెలు తోమలేక ,కూరలు తరగలేక ఆడవాళ్ళు పడే అవస్థలు ” అంటూ  ఆవేశ పడ్డారు అత్తగారు .

నరసమ్మకీ మాకూ మధ్య  ఋణానుబంధం   తెగిపోయి చాన్నాళ్ళయింది  . మరో నరుసు కోసం మేం తీవ్రంగా  ప్రయత్నించాం కానీ ఇంతవరకూ  మాకాభాగ్యం కలగలేదు.

“ఇక్కడపుల్ల  అక్కడ పెట్టక్కరలేదని  పెళ్ళికి ముందు పలికితిరే ! అంతా  ఉత్తుత్తేనా  . మల్లెపువ్వులాంటి  ఇల్లాలిని  మసిగుడ్డ వలె  మార్చితిరి కదా  ప్రభూ తమకిది  తగునా  .  అని వీలుచిక్కినప్పుడల్లా దెప్పిపొడుస్తూ “ బ్రోచేవారెవరురా….. ! “   అని ముక్కుచీది  రాగంతీస్తే  ,” పొలం  పనులు బిగ్గా  దొరుకుతుంటే ఇంటిపనికెవరొస్తారు . ఒకవేళ వచ్చినా మీరు నిలబడనిస్తారా . అయినా ఎవరింటి పని వాళ్ళు చేసుకోటం కూడా బరువే !    జోడెద్దుల్లా ఇద్దరున్నారుగా ఎంచక్కా ఆడుతూ పాడుతూ దున్నేసుకోండి “  అంటూ కాడి మా భుజాన పడేసి చల్లగా గట్టెక్కిపోయేరు . (అకటా!  ఎంత దయలేనివాడు ఈ గండరగండడు)

” ఇందుకే బాబూ….ఈ పల్లెటూర్లంటే నాకు చిరాకు.  ఇదే   మా సిటీలో అయితేనా ఓ…అంటే వందమంది   …” అంటూ పుండుమీద కారం చల్లేసి వెళ్ళింది మా చెల్లాయమ్మ  .

” మీ కొంపలో పని చేయలేనని వెళ్ళిపోయిందటగా నరసమ్మ….ఇంకా ఎవరూ కుదరలేదా ? ఎలా చేసుకుంటున్నారో పాపం”  అని సానుభూతి చూపించడానికీ, కోడలుతో అత్తగారు చేయిస్తుందా లేక కోడలే అత్తగారికి పని పురమాయిస్తుందా అని  కనిపెట్టిపోడానికి    వంతులవారీగా వచ్చివెళుతున్నారు అమ్మలక్కలు .

అక్కడికీ ఒకరోజు “అయిందేదో అయింది…ఏరు మీద కోపగించి నీరు తాగడం మానేస్తే ఎండిపోయేది మనగొంతే కదా! అబ్బులు ద్వారా నరసమ్మకి రాయబారం పంపిద్దాం.   సంధి ప్రయత్నాలు కావిద్దాం  . ఏవంటారూ ?” అని  అలిసిన ఒళ్ళు  నొక్కుకుంటూ ఆశగా అడిగాను  .   “అప్రదిష్ట  “  అంటూ ఒక్క ముక్కలో తేల్చేసారు  అత్తగారు .

ప్రత్యక్ష దైవాలకి మా మీద కనికరం ఎలానూలేదు . కనీసం మీరయినా మా ప్రార్ధన ఆలకించండి  అంటూ పటాల్లో దేవుళ్ళకి మొక్కుకున్నాం. శుక్రవారంలోగా పనిమనిషి దొరికితే పాయసం వండి నైవేద్యం పెడతానని లచ్చిందేవికి మా అత్తగారు ఆశపెడితే ,   ఆలస్యం అయినా పర్లేదు ఆదివారం నాటికయినా పనయ్యేటట్టుచూడు స్వామీ  అంటూ నేను ఆంజనేయుడికి అప్పాలదండ మొక్కేసాను .  శుక్రవారాలూ ఆదివారాలూ  క్రమం తప్పక   వస్తూనేవున్నాయి .  పాయసం అప్పాలతో మాకు మొహం మొత్తిపోయాకా ….గ్రామ దేవతకి కోళ్ళూ కొబ్బరికాయలూ కూడా మొక్కేశాం. మా ఇంటికో పనిమనిషి వచ్చేవరకూ పండుగలూ , బంధువులూ రాకూడదనీ…..పంచాయతీ అఫీసులన్నీ మూతపడిపోవాలనీ కోరుకున్నాం.

అలా నే  కోరుకున్నవన్నీ జరిగిపోతే మూడు మూళ్ళు పదహారయ్యేది ,నా జడ రెండు బారలయ్యేది, మా తోడికోడలు ముక్కు తప్పడయ్యేది

మా అత్తగారు   ఉల్లిపాయలు తరిగిన పళ్ళెం నా చేతికిచ్చి  …నీరసంగా గోడకి ఘటం జారేసారు  . కాళ్ళు సాగదీసి మెల్లగా ఓ మూలుగు మూలిగి” ఏమేవ్…ఆ  జీడిపిక్కల కత్తిపీట ఇలా తగలెయ్ ….. గుప్పెడు జీడిపప్పు కొట్టి కోడిగుడ్డు  కూరలో వేద్దాం  . కాసేపట్లో సంతలోంచీ చేపలూ  రొయ్యలూ వచ్చిపడతాయ్ . ఉల్లిపాయ నూరి ఉంచితే  పలావూ , పులుసూ   చేసి తగలెయ్యొచ్చు. ( మా అత్తగారికి కోపం వస్తే అన్నిటినీ తగలేస్తానంటారు – అపార్ధం చేసుకోకూడదు మనం … అదొక ఊత పదం అంతే )  . నిచ్చెనేసుకుని అటకమీంచీ పలావుడేగీశా దించి, తోమి తగలెయ్ . అలాగే మూడు సేర్లుడికే తెపాళా తీసి ఎసరు పడెయ్. అంటానికి ఒక్కడే అంటారు కానీ , తినేటప్పుడు  నలుగుర్ని వెంటేసుకొస్తారు .   ఒక్కడికీ పెట్టి మిగిలినవాళ్ళని  మీ ఇంటికెళ్ళి తినండి అంటామా….హవ్వ…అప్రదిష్ట అంటూ పనిలో పడ్డారు.

నేను దేబ్యం మొహం పెట్టుకుని  కాకినాడలో కాపురం పెట్టిన మా పద్దూని  తల్చుకున్నాను. చీకటి పడుతందనగా రెండు గుప్పెళ్ళు బియ్యం కుక్కర్లో పోసి, ఒక అరటికాయో రెండు బంగాళాదుంపలో అలా అలా వేయించేసి, ఎంచక్కా చిలకలా ముస్తాబయ్యి  సన్నజాజులు మాల కట్టుకుంటూ  ” నీవులేక వీణా  …… “ లాంటి  ఎదురుచూపుల పాటలు పాడుకోవటం, వంట చెయ్యడం విసుగనిపిస్తే సుబ్బయ్య హొటల్నుంచీ  బోయినం పార్సిల్  తెచ్చుకోవటం, బోరు కొట్టినపుడల్లా సినిమాకో వాకలపూడి బీచ్ కో జంట గా వెళ్ళిరావటం ,  అహ ఏమి హాయిలే హలా ….అంటూ మధురస్వప్నాలు చూపించి  నన్ను పెళ్ళికి ఉసిగొలిపింది పాపాత్మురాలు కనిపిస్తే పీక పిసికేద్దును.

సంతలో దొరికిన జల చరాలు చాలవన్నట్టూ  , చేలోంచీ ‘గిన్నికోడి ‘ అనబడే  భూచరాన్నొకదాన్ని  భుజాన్నేసుకుని  ఒగుర్చుకుంటూ  వచ్చిపడిపోయాడు  అప్పడు .(  ఊర్లో ఉన్న నూటొక్క మంది అప్పయ్యలకు లేని భాగ్యం వీడికి ఉండటం మూలాన అందరూ వాడిని మెల్లకన్నప్పడు అంటారు . చేలో కోళ్ళనీ దూళ్ళనీ మేపుతుంటాడు . వాడి మకాం కూడా చేలోనే . ఇంటిమీద కాకి అరిచినా  రోడ్డుమీదకి గవర్నమెంటు జీపొచ్చినా  ఉరుకులు పరుగులమీద ఊళ్ళోకొచ్చి పడిపోతాడు )

” మళ్ళీ  ఇదెందుకురా   ఏ అరటికాయో ,ఆకాకరకాయో  వండుదాంలే ? ” అన్నారు అత్తగారు విసుగ్గా .

దానికి వాడు గిలగిచ్చకాయలా ఒళ్ళంతా  ఊగిపోయేలా నవ్వేసి “బలేవోరే అయ్యాగారూ….. ఎమ్మారావుగారికి  కాయా కసరా  ఏసి పత్తిం బోయినం ఎడతారా ! కక్కా ముక్కా ఒండి పులావు కబాబూ  సేయ్యాలండి   . ఆనక ఆరు ఒణ్ణం తిని సెయ్యి కడుక్కున్నప్పుడల్లా మన లోగిట్లో తిన్న బోయినo గేపకం  వచ్చీయాలండి. అసలుండీ …ఆరు బోయినానికుంటారని కబురు తెలుసుంటే , ఏజెన్సీనించీ ఏట మాసం అట్టుకొచ్చీద్దునండి. ఇలా ఉన్నపళంగా బోయినం అంటే ఉన్న దాంతోనే సర్దుకోవాలండి మరి “ అని కొంచెం నిట్టూర్చేసి,     తలకున్న తువ్వాలు  విప్పి దులిపి నడుముకి  ముడేసాడు.   “సిన్నయ్యగారూ  పెద్ద కత్తిపీట, మాసం కత్తీ   ఇలాగడెయ్యండి చనంలో ఈటిని వొంటకి రెడీ సేసేత్తాను అని   కదనోత్సాహంతో  కదులుతున్నవాడు నా కళ్ళకి కూర్మావతారంలా  కనిపించాడు.  “పోన్లేరాబాబు సగం భారం తగ్గించావు “అని మనసులోనే  ఒక నమస్కారం చేసుకుని వాడడిగిన   సరoజామా అందించాను  .   ఉత్తప్పుడు  మెట్ట తాబేలులా ముక్కుతూ మూల్గుతూ తిరుగుతాడా  ఇంటికెవరన్నా చుట్టాలో పక్కాలో వచ్చారని తెలిస్తేమాత్రం  పీత పరుగే …. పట్టపగ్గాలుండవు  .  ఊళ్ళోకి అప్పుల వసూళ్ళకి వచ్చే బేంకోళ్ళు, తగువులు తీర్చడానికొచ్చే పోలీసోళ్ళు, సీజన్లో వచ్చే పొగాకు బోర్డోళ్ళు పంచాయతీ మీటింగులకి హాజరయ్యే ఆఫీసర్లూ అంటే వాడికి  అదోరకమైన గౌరవం ఎందుకోమరి . ఇక ఎలక్షన్ల  ప్రచారంకోసం  పిడత మొహం పెట్టుకొచ్చే ప్రతి రాజకీయనాయకుడూ వాడికి  పవర్ స్టారే   .  పార్టీలతో సంబంధంలేకుండా అందర్నీ ఆదరించేయాలని తహతహలాడిపోతాడు .

గుమ్మంలోఅడుగుపెట్టినవాళ్ళకి   కాళ్ళు తొలుపుకోటానికి  చెంబుతో  నీళ్ళందించడం  దగ్గరనుంచీ  భోజనం పూర్తయ్యాకా చేతులుమీద నీళ్ళు పొయ్యటం వరకూ అన్నీ తానే  చేసేయలన్నట్టూ  తెగ  తారట్లాడిపోతాడు. ఆఖర్న చేతులు తుడుచుకోటానికి తువ్వాలు అందిస్తూ ” బోయినం ఎలావుందండీ ” అనడుగుతాడు మహా భక్తిగా . తిన్నవాడు  తనముందు  బ్రేవ్ మని ఒక్కసారయినా త్రేంచకపోతే……” సగం సగవే తిన్నట్టున్నారు  ఒంటకాలు బాగా కుదరలేదంటారా?” అని మామీదే అనుమానపడతాడు.  మనుషుల్ని మేపటమంటే మహా సరదా వాడికి రాజుగారి మల్లేనే.

తెచ్చినవాటికి తోళ్ళూ కీళ్ళూ పీకే పనిలో అప్పడు ,  తాలింపు చూడ్డంలో అత్తగారూ  వాళ్ళిద్దరికీ  అసిస్టెంటులాగా అవీ ఇవీ అందిస్తూ నేనూ ఫుల్ల్ బిజీగా వుండగానే …  పంచాయతీలో కూర్చుని ప్రైవేటు తగూలు తీర్చే పాత ప్రసిడెంటు సుబ్బరాజు గారి పాలేరు చందర్రావు    చేతులు నలుపుకుంటూ వచ్చి నిలబడ్డాడు . ”  సుబ్బరాజుగారు  …పది టీలట్టుకురమ్మన్నారండి   ” అంటూ .

అత్తగారు  పళ్ళు పటపటలాడించేరు  పైకి వినిపించకుండా . నేను తలబాదుకున్నాను  మా అత్తగారు చూడకుండా( ఏ నోముఫలమో…ఏ జన్మ వరమో అని తలపోస్తూ)   .

“బుల్లిరెడ్డిగారింట్లో అన్నదమ్ములిద్దరి మద్దినా తగువయ్యింది కదండీ . ఏడాదిబట్టి పీక్కున్నా ఎటూ  తెగలేదండి  . ఆ తగువు తెగ్గొడ్డటానికి   అనపర్తినుంచీ రెడ్లొచ్చేరండి.   సిన్నకోడలు గారిది  ఆవూరే  గావాలండి   . ఈళ్ళూ ఆళ్ళూ  మాటమీద మాట పెంచేసుకుంటన్నారండి. తగువు కోసం కూకున్నోళ్ళందరి బుర్రలు వీటెక్కిపోనియ్యండి. ఇయ్యాల ఎలా అన్నా ఈ తగూ అటో ఇటో తేలిపోవాలని  మా రాజుగారి పంతం అండి. ఎంకన్నా ఎల్లి టీలట్టుకురా తాగేసి తగూ తీర్చేద్దారి అని  నన్ను  పురమాయించేరండి ” అంటూ ….అన్నదమ్ములిద్దరి మధ్యనా అగ్గెలా పుట్టిందో అదెలా రాజుకుని మంటయ్యిందో దాంతో ఎవరికి ఎంత కాలిందో ….ఆ మంట ఇప్పుడెక్కడకొచ్చి ఆగిందో అన్ని గుక్క తిప్పుకోకుండా  సినిమా రిలీజు రోజున మొదటి ఆట చూసొచ్చినోడిలా చెప్పేసుకు పోతున్నాడు  మహోత్సాహంగా .

అదేం పట్టించుకునే స్థితిలో లేని అత్తగారు “  తగలేసినట్టేవుంది…అలాయితే తగువెట్టుకున్న బుల్లిరెడ్డి ఇంటికో , తగువు తీర్చేయాలని సరదా పడుతున్న  మర్యాదరామన్న  (సుబ్బరాజు గారన్నమాట) ఇంటికో వెళ్ళకుండా  మా ఇంటికొచ్చి టీ పెట్టమంటావేం రా ….అంత లోకువగా కనిపిస్తున్నామా ఊరుమ్మడి చాకిరీలు చేయడానికి “ అంటూ  వేడిపెనం మీద  నీళ్ళు చల్లినట్టూ  చిటపటలాడిపోయేరు .

” అయ్యబాబో. ..అలా కోప్పడకండి అయ్యగారు . బుల్లిరెడ్డిగారి ఇల్లు ఆ సివరెక్కడో ఉందండి. అక్కడనించీ అట్టుకొచ్చీసరికి టీలు సల్లారిపోవాండీ (  తగువు కూడా సల్లారిపోవచ్చు)…..ఇంక సుబ్బరాజుగారి అయ్యగారి సంగతి తవరికి తెల్దేటండీ.  అయినా మీకూ ఆరికీ పోలికేటండీ అయ్యగారూ ….. ఎన్నేళ్ళబట్టీ సూత్తనానండీ మిమ్మల్నీ …  మీ సేతికి ఎముకలేదండి మీ నోట్లో నాలుక లేదండి . మీకసలు ఇసుక్కోటమే తెలదండీ ….మీ అసుంటోరిని  నేనీ సుట్టుపక్కల మూడు  జిల్లాల్లో సూళ్ళేదండి అని అప్పటికప్పుడు  అలవాటయిన అస్టోత్తరం చదివేసి , చివరికి  గోడమీదఉన్న కాశీ అన్నపూర్ణమ్మని,   గరిటపట్టుకు కూర్చున్న మా అత్తగార్నీ మార్చి మార్చి చూసి “ఎన్నాళ్ళబట్టో అడుగుదారనుకుంటన్నానండి అయ్యగారూ ఆరు మీకేవవుతారండి “అనేసాడు  . అప్పటిదాకా గుంభనంగా కూర్చుని లోపల్లోపల మురిసిపోతున్న అత్తగారు ఈ అధిక మోతాదుకి  అవస్థపడ్డి  చాల్లేరా ఇక ఆపు  అని చిరుకోపం ప్రదర్శించారు  .    “ఫలానా ఊరెళ్ళాం పచ్చి మంచినీళ్ళు పుట్టలేదు అని చెప్పుకుంటే  మనకేసిగ్గుచేటు  . అయినా వాళ్ళకేం లేక వస్తారా …ఏదో పాపం పనిమీదొచ్చేరు . అంటూ యాలక్కాయలేసి డికాషన్ లేకుండా చిక్కగా టీ పెట్టిమ్మని నాకు  పురమాయించి  , “ఇంటికెళ్ళేటపుడు ఓసారి కనపడరా ….. పులావు  పెడతానూ “ అనేసరికి ఆ  బట్రాజు మొహం చేటంత చేసుకున్నాడు .

ఏవిటో  ఈ మాత్రం పొగడ్తలకోసం ఒళ్ళు హూనం చేసుకుని  పడీ పడీ చాకిరీ చెయ్యటం అబ్బే…. అత్తగారూ ఈ వరస నాకేం నచ్చలేదండి. అంతగా కావాలంటే చివర్లో ఎప్పుడో ‘మహా సాధ్వి  మా అత్తగారు’  అంటూ మీపేరుతో  ఒక వ్రత కథ, రెండు భజన కీర్తనలూ నేనే రాసి పెడతానుకదా   అని చింతిస్తూ   అత్తగారి ఆజ్ఞ శిరసా వహించాను చేసేదేంలేక.

వాడలా ట్రే పట్టుకుని గుమ్మం దాటాడోలేదో…..”చిన్నరాజుగారు గానుగ సెట్టుకాడ కూకున్నారండి . అయిసు     నీళ్ళట్టుకు రమ్మన్నారండి “అంటూ ఓ  పిల్లోడు పరిగెత్తుకొచ్చి నిల్చున్నాడు .   ఇదిగో ఇందుకే నాకు మండిపోయేది. వీధిలో కూర్చుని అదీ ఈదీ అని ప్రాణాలు తోడేస్తారు. పనులు తెమలనివ్వరు.

వంటింట్లో  పొయ్యిముందు బాసీపట్టం వేసికూర్చున్న అత్తగారు  గిన్నియ్యి, గరిటియ్యి, చింతపండు నానబెట్టు,  మసాలా నూరిపెట్టు అనీ……దొడ్లోంచీ ఆ కన్నప్ప గాడేమో  కత్తిపీటమీద నీళ్ళొయ్యండి, సేపలు తోమడానికి బూడిదియ్యండి , రొయ్యలమీదికి ఏణ్ణీళ్ళు  కాయండి  అనీ  నన్ను ఒక్క క్షణం కుదురుండనీయకుండా బొంగరంలా తిప్పేస్తున్నారు.   ఆ తిరుగుడు చాలదన్నట్టూ టీలనీ, మజ్జిగలనీ, మంచినీళ్ళనీ, వీధిలోంచీ వచ్చిపడే అబ్బాయిగారి ఆర్డర్లు  . కాళ్ళకి చక్రాలు కట్టుకుని  అందరికీ అన్నీ అవిర్చి నేనూ బోల్డంత కష్టపడినా చివరాకరికి నే చేసిన పని లెక్కలోకి రాదు . వంటెవరు చేసారు అంటే అన్నివేళ్ళూ అత్తగారివైపే చూపిస్తాయి  అన్ని నోళ్ళూ అత్తగారినే పొగుడుతాయి అదేవిటో !

ఏమాటకామాటే  మా అత్తగారు   ప్రారంభంలో విసుక్కున్నా  పనిలో పడ్డాకా మాత్రం   శ్రద్దగా దీక్షగా మనసంతా లగ్నం చేసేస్తారు .  శంకరశాస్త్రి సంగీతం పాడినట్టూ, ఆయనెవరో డోలు వాయించినట్టూ, మా పొట్టి బ్రహ్మం సన్నాయి మోగించినట్టూ ….ఆయాసపడయినా సరే  అంతుచూస్తారు .అబ్బా అదేనండీ…. అనుకున్న రిజల్ట్  రాబడతారూ అని.

రామాలయంలో భజన సంఘం తమ గొంతులు సవరించుకుంటూ  మైక్ టెస్టింగ్ చేసుకుంటున్న వేళకి  ఒక మహా యజ్ఞం పూర్తయినట్టూ అందరం హమ్మయ్యా అనుకుంటూ అరుగుమీద  చతికిలపడేసరికి  వీధి గేటు తీసుకుని ముందుగా పెద్దరాజుగారూ ఆయన  బృందంతోనూ , ఆ వెనకే చిన్న రాజుగారు మరో బృందంతోనూ వచ్చేసారు.   అత్తగారు ” నే చెప్పలేదూ…ఇద్దరూ చెరో బేచీని తీసుకొచ్చేసారు చూసేవా !”అన్నట్టూ కళ్ళెగరేసి  వడ్డన్లు చేయడానికి ఉపక్రమించారు. ఆ వెంటనే అప్పడు  వాకిట్లోకి ఒక్క గెంతు గెంతి మడతమంచాలూ , ఫ్రేము కుర్చీలూ సర్దేసి వచ్చినోళ్ళని కూర్చోబెట్టేసాడు.   మారాజుగారు బిత్తిరి చూపుచూసుకుంటూ వచ్చి…. “అమెరికాలో ఉంటున్న అచ్చిగాడి మావిడితోట కౌలు విషయం మాట్లాడ్డానికొచ్చేరోయ్ .   ఎలాగూ భోజనాల వేళయింది కదా అని   ఇంటికి తీసుకొచ్చేసాను . అందులో ఒకడు మనకి బాగా అలవాటయినోడే బాగోదుకదా మరి  “  అని కామెడీ హీరోలా భుజాలెగరేసుకుంటూ వెళ్ళిపోయేరు .

నాకు తిక్కరేగిపోయింది మా రాజుగారి ఘనకార్యానికి . మాంగారు కనీసం కబురయినా చెప్పేరు . ఏ కబురూ లేకుండా   వెంటేసుకొచ్చేస్తే వెంటనే   ఆకేసి అన్నం పెట్టేయడానికి ఇదేవన్నా చందావాళ్ళ సత్రమా . “అబ్బే….నాకు మీ వరసేం నచ్చలేదు . అయినా ఇదేం పద్ధతీ ..టాఠ్ “ అని ప్రైవేటు చెప్పేయాలనిపించింది . పొద్దుటినుంచీ పాడుకున్న పతిభక్తి పాటలు గొంతుకడ్డం పడ్డాయి కానీ లేపోతేనా ….పిక్కపాశం పెట్టి గోడకుర్చీ వేయించేయొద్దూ.

ఉత్తరంవైపు సావిట్లో  భోజనాల బల్లమీద మంచినీళ్ళతో సహా అన్నీ అమర్చేసి,  విస్తళ్ళలో  పచ్చళ్ళూ కూరలూ ఒక వరుసలో సర్ధి ,మధ్యలో  పులావు పెట్టి, నేతిగిన్నే …అన్నం పళ్ళెం, పెరుగు కేనూ ఇంకో బల్లమీద విడిగా వుంచి  అన్నిటినీ ఒక్కసారి పరకాయించి చూసి ” వడ్డనలయ్యాయని చెప్పరా ” అంటూ అప్పడికి   పురమాయించి, ఘోషా పాటిస్తూ  వంటింట్లోకి వచ్చేసారు అత్తగారు .

ఓ చేత్తో నీళ్ళ బకేట్టూ , ఇంకో చేత్తో ఇస్త్రీ తువ్వాలుతో  అరుగు చివర నుంచున్నాడు  అప్పడు. “కాళ్ళు కడుక్కుని భోజనానికి కూర్చోండి” అంటూ మాంగారు అతిధుల్ని ఆహ్వానిస్తే , అబ్బాయిగారు  ఫేనేసి కుర్చీలు జరిపేరు  .  మా భక్త కన్నప్ప    సావిడి గుమ్మానికి  అతుక్కుపోయి  తొండలా మాటిమాటికీ మెడసాగదీసి చూస్తున్నాడు  అన్నీ సరిగా  జరుగుతాయో లేదో అని ఊరికే టెన్షన్ పడిపోతూ   .  ఓసారొచ్చి,” అయ్యగారో…బలేవోరే నిమ్మకాయ సెక్కలు  మర్సిపోయేరు …ఏటండీ బాబూ మీరు” అని   విసుక్కుని వెళ్ళాడు . ఇంకోసారొచ్చి నెయ్యి ఏడిసేసేరా ఎక్కడా కమ్మని వోసనొత్తాలేదు” అని అనుమానపడ్డాడు .

వంటలన్నీ సరిగా కుదిరాయో లేదో, వడ్డనలు సరిగా జరుగుతున్నాయో లేదో అని అత్తగారు తెగ ఇదయిపోతూ వంటిల్లంతా  కలియ తిరిగేస్తున్నారు . కాసేపటికి    “చ…చ…చా…”అని చేతులు నలుపుకుంటూ తల బకురుకుంటూ  యమ యాతన  పడిపోతూ వచ్చాడు అప్పడు .

వాడి వాలకం చూసి కంగారు పడ్డ అత్తగారు ” ఏవిట్రా ?” అంటూ గుడ్లు తేలేసారు .   తెగబాధ పడిపోతూ  వాడు చెప్పుకొచ్చిన  చేట భారతాన్ని సంక్షిప్తం చేస్తే….

అనుమానిస్తూనే అందరితోపాటు భోజనానికి కూర్చున్న ఎమ్మారావు గారు , విస్తట్లో చెయ్యి పెట్టగానే  గండు చీమ కుట్టినోడిలా ఎగిరి పడీ  ముక్కూ కళ్ళూ చిట్లించి  ” రాజుగారూ …ఈవన్నీ  నాకు పరిచయంలేని పదార్ధాలండీ  అని మొహమాటపడి , అప్పటికీ అర్ధం కాక గుచ్చి గుచ్చి చూస్తున్నవాళ్ళతో ” మేం బ్రాహ్మలం అండీ ”  అనేసరికి మాంగారు “అచ్చొచ్చో….”అని నొచ్చుకుని , గిన్నెలన్నీ మూతలు తీసి చూస్తే ఒక్కదాంట్లోనూ ఎమ్మారావు గారు గుర్తుపట్టి తినగల  పదార్ధమొక్కటీ కనపడక పోయేసరికి , కంగారు పడిపోయి  “మీ పేరు చూసి పొరపాటుపడ్డాను చూశారా…అహ ఏం అనుకోకండి .   నిమషంలో వంట చేయిస్తాను కాసేపు  ఇలా వచ్చి కూర్చోండి “అన్నారట. దానికి ఆ ఎమ్మారావుగారు ఇంకా కంగారుపడిపోయి ….”అయ్యయ్యో …ఇప్పుడవన్నీ ఏం వద్దండీ “ అనేసి   మా అత్తగారు ఆచారంకొద్దీ దూరంగా పెట్టిన అన్నం లో పెరుగు  కలుపుకొని భోజనం అయిందనిపించేరట.  బంతిలో కూర్చున్న మిగతా అతిధులు   ముందు బాగా కంగారుపడి, ఆనక కొంచెం మొహమాటపడి , చివరికి తిండిలో పడ్డారట సుబ్బరంగా .

“అంతటి ఎమ్మారావు బాబుగారు అలా అసంటా కూకొని, పెరుగన్నంలో పచ్చడి నంజుకు తింటంటే నా పేణం ఉసూరుమనేసింది అయ్యగారో “ అని కన్నప్ప  అదే పనిగా బాధ పడిపోయాడు.

” అదేవిట్రా క్రితం సారొచ్చినపుడు ఎంచక్కా తిన్నాడు కదా . ఇంతట్లోనే  బ్రాహ్మెడెలా అయిపోయాడు ” అని అత్తగారు ఆశ్చర్యపోయారు.

అప్పటికీ అనుమానం తీరక …..ఒరేయ్….వచ్చినాయనకి బట్టతలుందా . చూడ్డానికి హైబ్రీడ్ బొబ్బాసి చెట్టులా బరువుగా భూమికి జానెడున్నాడా  ? అనడిగారు. ఇంకా ఏదో గుర్తుచేసుకోటానికి ప్రయత్నిస్తూ ….

” అచ్చిచ్చీ…..మట్టలు చెక్కేసిన తాటిసెట్టులా నిటారుగా అంతపొడుగుంటేనీ ……పైగా గిరజాల జుట్టండీ ఆరికి అన్నాడు ”

గిరజాల జుట్టు బట్టతలవ్వడానికి చాన్సుంది కానీ…..అటు సూర్యుడు ఇటు పొడిచినా బట్టతలమీద గిరజాలు మొలవటం అసంభవం కదా అని అర్ధం చేసుకున్న అత్తగారు…..” అయితే వచ్చింది  వేరే ఎమ్మారావా అని సాలోచనగా అనుకుంటూ ….

” అసలెంత మంది ఎమ్మారావులుంటారే……?”   అన్నారు నన్ను పట్టి కుదుపుతూ .

అసలే ఆకలికి సగం మతి పోయున్నానేమో ……ఒక వెర్రినవ్వునవ్వి సినిమాల్లో రామారావు నాగీస్ రావు లాగా   ఒక్కడే ఎమ్మారావు ఉంటాడనుకున్నారా ! ఎంతమందుంటారో సరిగ్గా లెక్క తెలీదు కానీ మొత్తానికి   ఎక్కువే వుంటారు … ఉన్నవాళ్ళు కుదురుగా ఉండకుండా అక్కడోళ్ళు ఇక్కడికీ ఇక్కడోళ్ళు అక్కడికీ మారుతుంటారు . అంటూ వెర్రి సమాధానం చెప్పేసాను .( అది ఆకలివేళ కాకపోతే ప్రభుత్వ శాఖలు  పరిపాలనా తీరుతెన్నులు వంటి మరిన్ని విషయాలు విశదీకరించేదాన్ని )

” ఏడ్చినట్టుంది . అంతమందిని పెట్టుకోటం ఎందుకూ ,అటూ ఇటూ  అలా పరుగులెత్తిచ్చడం ఎందుకూ  బుద్ధి  లేని గవర్మెంటు ” అనేసారు అత్తగారు .

” బాగాచెప్పారు …అయినా మావయ్య ముందే కనుక్కోవలిసింది కదా ” అని అనుకోకుండా అమోఘమయిన పాయింటందించేసాను  అత్తగారికి.

ఆ పాయింటుమీద జువ్వలా లేచిన అత్తగారు  ” అదీ….చూసావా  మీ మావయ్య నిర్వాకం .  అంతా  పుల్లయ్య యవ్వారం. బొత్తిగా వ్యవహారం తెలీని మనిషి అంటూ  నిప్పులు కక్కుతుంటే……    మొహం జేవురించుకుని       మాకేసి వస్తూ తూర్పు గుమ్మం దాటబోయిన మాంగారు ”  సడెన్ బ్రేకేసినట్టూ  అక్కడే ఆగిపోయి ” ఆ …ఆ….వస్తున్నా ” అని ఎవరో పిలుస్తున్నట్టూ పంచె సర్దుకుంటూ వేగంగా వెనక్కిమళ్ళేసేరు .

” ఏటండయ్యగారూ….ఆకురున కుంత పప్పుసారన్నా  కాసేరుగాదు ” అని  పెద్ద ఆరిందాలా అనేసాడు అప్పడు మా అత్తగారికేసి చూస్తూ ….( నన్నే అనాట్టా ….ఏమో?)

ఒళ్ళు చీరేస్తాను గాడిదా. వెధవ సన్నాసి సలహా ఒకటి పడేసి, ఇప్పుడేమో తప్పంతా మా మీదికి తోసేస్తావా అని ఒక్క టెంకి జెల్ల కొట్టాలనిపించింది నాకు.

“అందరూ సుబ్బరంగా తిన్నారు ఆ బాబొక్కడే అర్ధాకలితో చెయ్యి కడుక్కున్నారు “ అని తువ్వాలు నోట్లో కుక్కుకుని అదే పనిగా బాధ పడిపోతున్న భక్త కన్నప్పడిని ఓదారుస్తూ  “ సర్లేరా అయిందేదో అయింది ఎవరికెంత ప్రాప్తమో అంతే దక్కుతుంది . ఇలా జరగాలని రాసుంది.   …  తప్పించడం మన వశమా అని ,  ఆకేసి అన్నం పెట్టేరు అత్తగారు.  వాడు “ఇలా జరిగిపోయిందేటీ”  అని ముద్ద ముద్దకీ బాధపడుతూనే వున్నాడు  . ముద్ద  గొంతు కడ్డం పడి పొలమారిన ప్రతిసారీ మా అత్తగారు కొంచెం కొంచెంగా  గీతా మకరందం దానితో పాటూ  కాస్త కర్మ సిద్ధాంతం లాంటిదేదో  వడ్డిస్తూ వచ్చారు.

మొత్తానికి ఆద్యంతం బాధపడుతూనే  అప్పడు సుష్టుగా భోంచేసి ,మకాంలో ఉన్న  వాళ్ళావిడకీ, అమ్మకీ కూడా కేరేజీలు సర్దుకుని  ” ఇలా జరిగిందేటండీ అయ్యగారూ ” అని  తీవ్రంగా బాధ పడిపోతూ వెళ్ళిపోయాడు .

“హమ్మయ్యా…అందరి భోజనాలు అయిపోయినట్టేకదా .   రండి  మనంకూడా  మనకి ప్రాప్తమున్న పలావు మెతుకులు తినేసి త్వరగా బజ్జుందాం “ అని నేను అత్తగారిని కంగారు పెడుతుంటే ఆవిడ ,  తెల్లారితే శుక్రవారం వంటింట్లో అంటు ఉండటానికి వీల్లేదు  అన్నీ కడుక్కున్నాకే పడుకోటం అంటుంటే ……ఇంకేం చెప్పను హతవిధీ నా పై ప్రాణాలు పైకే పోయాయి

ముక్తాయింపు –  తాలింపు  :)

ఏది ఏవైనా  పతివ్రతా ధర్మాలంటూ కొన్ని ఉన్నాయికదా . ఒకటీ రెండూ పాటించాం కదా అని మూడూ నాలుగూ  అశ్రద్ధ  చేసి  ‘ సపతివ్రత ‘ అనిపించుకోటం  దేనికీ అనిచెప్పి,  విష్ణుమూర్తిలా ఒక పక్కకి తిరిగి హాయిగా నిద్రపోతున్న శ్రీవారి పాద పద్మములను చిన్నగా గిల్లి……కిటికీ దగ్గర చేరి పాత సినిమా హీరోయిన్లా ఒంటికాలిమీద వయ్యారంగా ఊగుతూ ”  రావోయి చందమామా…..  ” అని మంద్రస్థాయిలో  మొదలుపెట్టేసరికి   మబ్బులమాటునున్న  చంద్రుడు , మంచం మీదనున్న చంద్రుడు ఒకేసారి నాముందు ప్రత్యక్షమయ్యారు.

“చంద్రుడు వెండి కంచంలా లేడూ”  అన్నారు   ఆకాశంలోకి చూస్తూ.

నేను “ఊహు…” అని తల అడ్డంగా ఊపేను.

“పోనీ… వెన్నముద్దలా  ఉన్నాడా”అన్నారు.

నేను వూహుహు…అని తల అడ్డడ్డంగా ఊపేను.

పోనీ నువ్వే చెప్పవోయ్ అన్నారు  గారంగా.

నేను రెప్పవాల్చక చందమామని చూస్తూ,” మధ్యలో ఆ మసేవిటండీ మాడిపోయిన అన్నం తెపాళాలా  చిరాగ్గా . ఏవండీ ఓసారి చందమామను కిందికి దించండి సుబ్బరంగా తోమి బోర్లించేస్తాను “ అని  చూద్దునుకదా మబ్బు మాటున ఆ చందమామ , ముసుగు చాటున నా చందమామ భయం భయంగా నన్నే చూస్తూ ….

అయ్యో… ఏవయిందండీ …..ఎందుకలా బిక్కుబిక్కుమంటూ చూస్తున్నారు.

“రసికరాజ తగువారము కామా ….ఆఅ.ఆ..అ.ఆ.ఆఆ…………..….” అంటూ కిచకిచలాడేను వసంతకోకిల సినిమాలో శ్రీదేవిని తల్చుకుని .

మీ మాటలు

 1. కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్.. వచ్చేసారాండీ లలితమ్మగోరండీ .. మీరు సూపరెహే :-))

  • లలిత says:

   తృష్ణగారు , నేను సూపర్ అయితే మీరు ‘సూపర్ డూపరెహే….’ :))

 2. శ్రీనివాస్ పప్పు says:

  ఇలా అత్తగారి పేరు చెప్పుకుని బండి లాగించేస్తున్నారన్నమాట సెబాసో

 3. నేను శీర్షిక పేరు అలిగిన వేళనే చూడాలి అని తప్పు చదివి…సాంతం మీరు ఎప్పుడు అలుగుటారా అని ఆరాట పడుతూ చదివాను..మీరు ఎక్కడా అలగకుండా నన్ను చాలా నిరాశ పరిచారు…:)

  మీ చేయి తిరిగిన రాత గురించి పెసలు గా చెప్పటానికేమీ లేదండి చిన్నయ్యగోరూ…:)

  • లలిత says:

   దాందేవుంది లెండి ఆ ముచ్చటా తీర్చేసుకుందాం కాస్త వీలుచూసుకుని :)

 4. వేణూశ్రీకాంత్ says:

  సిన్నయ్యగోరు సింపేత్తన్నారండీ బావూ.. ఇంతకన్నా సెప్పేదానికి ఇంకేటి నేదు. :)

  ముక్తాయింపు తాళింపు ఘుమఘుమలాడిపోయింది :))

 5. వంశి పరుచూరి says:

  అద్భుతం లలిత గారు .. సూపర్ పోస్ట్ :)

 6. చాల చాల బాగుంది! :)

 7. పొద్దున్నే చదినానండి… బ్యూటిఫుల్ బిగినింగ్ ఆఫ్ ది డే! థాంక్ యు!

 8. తృష్ణగారి పుణ్యమా అని ఈకధ చదవగలిగాను.నిజంగానే సూపర్.చాలా చాలా బాగుంది.

 9. G.S.Lakshmi says:

  కిట్టయ్య అలిగినవేళంత బాగుందండి మీ అలసిన వేళ.. ఆయ్..

 10. అయ్యబాబోయ్ ముక్తాయింపు అదరగొట్టేసారండీ. తాలింపు ఘాటుకి నవ్వు తెరలు తెరలుగా…ఆగదే!! :)))

  • లలిత says:

   సౌమ్యా …ఈపాటికి ఆగేవుంటుందిలే …. ఆగకపోతే నా పేరు చెప్పి నెత్తిమీద గట్టిగా మొత్తుకో .థాంక్స్ నీ నవ్వులకి

 11. Susmitha says:

  chala andanga prati intilo jarige vishayalani vrasaru. ee sanchikanu naku parichayam chesina Deepa ki, idi inta andam ga rasina meeku hatsoff!!

  • లలిత says:

   సుస్మిత గారు మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు . మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చిన దీపగారికి కూడా థాంక్స్

 12. padmaja says:

  అబ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బాఆఆ’ఆఆఅహ్హ్హ్హాఅ;ఒహోఓ.

  • లలిత says:

   ఏంటి లొట్టలే !! సౌండ్ ఇక్కడివరకూ వచ్చేస్తుంది. :)
   థాంక్స్ పద్మజ గారు

 13. Sirisha says:

  పొట్టచెక్కలు ఐయట్లు నవ్వుకున్నాను :-) Hilarious !!!! ప్రతి వూరులో ఒక అప్పడు ఉంటాడు… మా ఊరి అప్పడి పేరు బొడిగాడు :-) ఎంత అమాయకుడొ అంతే మంచివాడు..
  Thank You so much for the post !!!

  • లలిత says:

   శిరీషగారు మీ వ్యాఖ్యకు థాంక్స్ అండీ .
   బోడిగాడిని అడిగానని చెప్పండి

 14. navy.laser@gmail.com says:

  అబ్బ !!! ఎంత బాగా రాసారో? మీ అత్తగారి వంటలంత రుచిగా ఉంది మీ రచన. అచ్చం గోదావరి జిల్లాల్లో తిరుగుతున్నట్లు అనింపించింది. మీరు నిజంగా మంచి రచయిత్రి. కక్క ముక్క తినని నా లాంటి వాళ్లకి కూడా తినిపించగలవు మీ రచనలు. అద్భుతం.

  • లలిత says:

   అబ్బ..!మీ వ్యాఖ్య ఎంత బావుందో .
   ‘ అద్భుతం ‘ అన్నది అధిక మోతాదే అయినా ….పర్లేదులెండి నేను అరాయించేసుకుంటాను .
   “గాల్లో తేలినట్టుందే……..”

 15. ” చంద్రుళ్ళో ఉండే తపాలా ..
  కింది కొచ్చిందా …..?
  కింది కొచ్చి తోమేసేమందా ….. !!! ”

  లలిత గారూ .. చాలా ఇళ్ళల్లో జరిగే మామూలు సంఘటనల లో మీకింత చమత్కారం కనపడటం .. పాఠకుల అదృష్టం !!

  • లలిత says:

   ధన్యవాదాలు రామ్ గారు
   నాదేం తప్పులేదండి . అంతా గోదావరి గాలి మహిమ అనుకోండి. మీ పేరడీ బావుంది

 16. ఎలా రాస్తారండి బాబూ! ఇలాంటి కథనాల్ని?

  ఏకబిగిన చదివేశానండీ!

  కెవ్వ్వ్వ్వ్ కెవ్వ్వ్వ్వ్వ్

  అధిరందండీ !
  పేరే అంతగా నప్పినట్టులేదు ఒకసారి క్రిందికి దించండి తోమి బోర్లిద్దాం!

  • లలిత says:

   ఎలా అంటేనండీ……మీరు కవిత్వాలు రాసేస్తారు కదండీ అలాగేనండి .
   అబ్బ్బే….ఇక తోమే ఓపికలేదండి. మరీ బాగోకపోతే కరిగించి వేరే పోయిద్దాం .

 17. హ్హ ..హ్హ..హ్హ..చాలా బాగుందండి.తృష్ణ గారు పోస్ట్ చూసి చదువుతుంటే కరెంట్ పోయింది.ఈ రోజు సడన్ గా గుర్తొచ్చి చదివా .హేవిటి తాలింపు చాలా పసందుగా ఉంది :)) క్రిందకి దించితే చంద్రుణ్నితోమేసి బోర్లించేస్తారా??

 18. ​హహ్హహా​.. భలే అందంగా ఉన్నారండీ మీరు అలసిన వేళన.. :D :D ​

 19. Satyabhama says:

  చిన్నయ్య గారూ, హాస్యాన్ని లైన్ లైన్ లోనూ పండించిన మగమహారాజుల్ని ఎంతోమందిని చూసాను గానీ భానుమతి గారి మచ్చు ఒకరో ఇద్దరో, అంతే. గుక్కతిప్పుకోలేకపోతున్నాం నవ్వులతో. నవ్వుకో వరహా చొప్పున చూసుకుంటే మీరు ఈ పాటికే బిలియనీర్ మరి. ఇంత ఆనందాన్ని పంచిపెడుతున్నందుకు బదులుగా నేనే దేవుడినైతే బతిమాలి మరీ మీకు అర్జెంటుగా పాతిక వరాలు ఇచ్చేసేదాన్ని.

 20. ఎంత బాగున్నాయో మీ ఈదేసిన గోదారి కథలు . మీ fan అయిపోయాను

 21. ఫ్లెఅస్ ఎప్లెఅసె ప్లీజ్ బుక్ ఎప్పుడు వస్తుందో చెప్పండి చిన్నయ్య గోరు. నేను డిసెంబర్ లో ఇండియా వచ్చినప్పుడు అర్జెంటు గా కోనేసుకోవాలకి కదండీ మరి.

మీ మాటలు

*