మరో చరిత్ర?

“హలో.. నన్ను గుర్తుపట్టారా?” ఆర్కాట్ రోడ్డుమీద నడుస్తున్న నన్ను ఆపి మరీ అడిగాడు ఆయన. చాలా వరకూ తెల్లగడ్డం. అక్కడక్కడా కొంచెం రంగు మారిన కేశాలు. అస్సలు గుర్తుకు రాలేదు.

“పోనీ ‘బి’ గుర్తుందా?” గుర్తుపడతాననే ఆశతో బేలగా నా వంక చూస్తూ అడిగాడు. “నిజం చెబుతున్నా. మీరెవరో నాకు గుర్తుకు రావడం లేదు. ఇహ మీరు చెప్పిన ‘బి’ అనే పేరు నేను విన్నదే. ఆమె నాకు తెలుసు. ఇంతకీ, మీరు ఆమెకేమవుతారు?” ఇబ్బందిగానే అన్నాను. కొన్ని విషయాలు నిజంగా ఇబ్బంది కలిగిస్తాయి. ఎవరో ఫోన్ చేసి “ఏమండి నేను గుర్తున్నానా?” అని అడిగితే ఏం చెప్పగలం. కనీసం పేరు కూడా చెప్పరు. “ఎవరో మీరు… మీరు నాకు గుర్తు రావడం లేదు.” అంటే మనమేదో వాళ్లని కించపరిచినట్టు భావిస్తారు. సింపుల్‌గా నా పేరు ఫలానా, ఫలానా చోట కలిశాం గుర్తున్నానా? అని అడిగితే ఎంత బాగుంటుంది…”ఊహూ! అంత సింపుల్‌గా జనాలుంటే ఇన్ని కాంప్లికేషన్స్ ఎందుకొస్తాయి..

“సారీ.. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టున్నాను. నా పేరు రంగరాజన్. అసలు పేరు రంగారావు. పక్కా తెలుగువాడ్ని. కాని యీ దిక్కుమాలిన అరవదేశానికొచ్చి ఓ ‘న్’  తగిలిస్తేగాని ‘మదింపు’ వుండదుగా. సరే.. మీరు ఓ సారి మా  యింటికి అదే ‘బి’ ఇంటికి వొచ్చారు. నేను ‘బి’ కి తండ్రిని. అఫ్‌కోర్స్ నిజంగా కన్నతండ్రినే!” తన మీద తనే జోక్ వేసుకున్నట్టు నవ్వాడతను.

‘బి’ అనడం ఇబ్బందిగా ఉంది కనుక ‘విమల’ అనుకుందాం. ఇప్పుడు గుర్తుకొచ్చింది. విమలా వాళ్లు అప్పుడు టి.నగర్‌లో మా ఇంటికి నాలుగు వీధుల అవతల వుండేవారు. ఆ పిల్ల చాలా అందంగా వుండేది. ముట్టుకుంటే కందిపోయేంత అందంగా వుండింది. సహజంగానే ఓ ప్రొడ్యూసర్ దృష్టిలో పడి ‘హీరోయిన్’ అవకాశం తెచ్చుకుంది. ఆ అమ్మాయికి ఓ తమ్ముడు కూడా వుండాలి. వాళ్ల ఇంటికి నేను వెళ్ళిన మాట నిజమే. ఆ అమ్మాయి స్వయంగా మా ఇంటికొచ్చి “రేపు నా పుట్టినరోజు అంకుల్. తప్పక రావాలి!” అని మరీ మరీ పిలిచింది. అప్పట్లో నేను మహా బిజీ రైటర్ని.

మర్రోజు గుర్తుంచుకుని మరీ వెళ్లాను. అచ్చు వాళ్లమ్మ పోలికే విమల. కొడుకు మాత్రం తండ్రి పోలిక. నాకు బాగా జ్ఞాపకం. లౌంజ్‌లో పార్టీ అరేంజ్ చేశారు. నేనూ ఓ తమిళ డైరెక్టరూ, ఇద్దరు ముగ్గురు అప్‌కమింగ్ హీరోలు, ఓ తెలుగు ప్రొడ్యూసరూ మాత్రం లోపల డ్రాయింగ్ రూంలో కూర్చున్నాం. అప్పుడే  రంగరాజన్ మాకు డ్రింక్స్ ఆఫర్ చేశాడు. నేను ‘మందు’ తీసుకుంటాగాని అది ‘ఇంటి’కే పరిమితం. జనాలలో కూర్చుని కబుర్లు కొడుతూ  ‘తాగటం’ నాకిష్టం ఉండదు. అదే మాట అతనితో చెప్పాను.

“గ్రేట్.. చాలా మంచి అలవాటు.. నేనయితే డ్రింక్స్ జోలికే పోను. అవంటే భయమే కాక నా వొంటికి పడవు కూడానూ!” అంటూ మిగతా వాళ్లకి సర్వ్ చేసాడు. 2 గంటలు ఉండి నేను మళ్లీ మా ఇంటికి వచ్చేశా.

“అవును.. ఇప్పుడు జ్ఞాపకం వచ్చారు. ఐనా ఒక్కసారేగా మిమ్మల్ని చూసిందీ! అప్పుడు చాలా హెల్దీగా ఉండేవారు. ఇదేమిటి ఇలా చిక్కిపోయారు,” అడిగాను. ఆయన్ని చూసి పదేళ్లు దాటింది.

“మీకు  తెలీదా.. విమలనీ, వాళ్లమ్మనీ పోలీసులు అరెస్టు చేశారు. ఇది నాలుగోసారి. నేను.. నేను ఆ యింటినించి బయటి కొచ్చా…!”  తలవొంచుకుని అన్నడు రంగారావు. అతని కళ్ళలో తిరిగిన నీళ్లని నేను గమనించాను.

“ఓహ్.. సారీ! ” ఏమనాలో నాకు తెలీలేదు. ‘బి’ని అరెస్టు చేశారని రెండు మూడు సార్లు విన్నాను గానీ అంతగా ఆ వార్త మీద ధ్యా స పెట్టలా.  అదీగాక మేము టి.నగర్ వదిలేసి ‘వలసరవాక్కం’లోని స్వంత యింటికి వచ్చేశాం.

“మీరేం చెయ్యగలరూ.. అయ్యా .. ఏమీ అనుకోకపోతే నాకో హాఫ్ బాటిల్ విస్కీ ఇప్పించగలరా? సిగ్గులేకుండా అడుగుతున్నాననుకోకండి. సిగ్గూ వుంది. లజ్జా వుంది. కానీ యీ మనసులోని బాధ వుందే… అది దేన్నీ లెక్క చెయ్యనివ్వదు. ఇవాళ నా వొళ్ళు బాగా లేదు మనసూ బాగా లేదు. నేనూ అందర్నీ  అడుక్కునే టైపు వాడ్ని కాదు. ఎందుకో మిమ్మల్ని అడగాలనిపించింది. పైన మీ ఇష్టం.” నా కళ్ళలోకి సూటిగా చూస్తూ అన్నాడు. అవ్వాళ సూట్‌లో వున్నాడు. ఇవ్వాళ బట్టలు నలిగి, మాసి వున్నాయి. భయంకరమైన బాధని మనసులో నిప్పులా దాచుకున్నట్టు మొహమే చెబుతోంది. ఓ అయిదొందల రూపాయల నోటు తీసి ఇచ్చాను.

“డబ్బులు వొద్దు సార్. మందు కావాలి. మందు ఎక్కడ బడితే అక్కడ ‘టాస్మాక్’ షాపుల్లో దొరుకుతుంది గానీ విశ్రాంతిగా కూచుని విషాన్ని తాగే చోటు యీ తమిళనాడులో దొరకదు. ఫ్రెండ్స్ బార్ అంటూ ఒకటి వుంది కాని లోపలికి వెళ్లాలంటే ‘పటాటోపం’ కావాలి!” నవ్వాడు. ఆ నవ్వులో ఏడ్పుంది. ప్రపంచం మీద ‘కచ్చ’ వుంది.

“సరే పదండి !” నా కార్లో ఎక్కించుకుని ఫ్రెండ్స్ బార్‌కి తీసికెళ్ళా. ఆ బార్ మా యింటికి దగ్గర్లోనే వుంది. ఓనర్ తెలిసినవాడే.

“రండి రండి. ఫస్ట్ టైమ్ కదూ మీరు రావడం!” మొహం ‘ఇంత’ చేసుకుని అన్నాడు నటేశన్ మొదలియార్ నన్ను చూస్తూనే.

“అవును. వీరు నా ఫ్రెండ్ రంగరాజన్‌గారు.” పరిచయం చేశాను. “వణక్కం. అదిగో ఆ స్పెషల్ రూంలో కూచోండి..” దగ్గరుండి ఆ రూంలోకి పంపించాడు మమ్మల్ని.

రెండు నిముషాల్లో విస్కీ రంగరాజన్ చేతుల్లో వుంది అందమైన గ్లాసులో తళుకులీనుతూ. ఆబగా ఒకేసారి ఒక్క గుక్కలో గ్లాసు  పూర్తి చేసాడు.
“చెప్పండి..” అన్నాను.

“సిగ్గూ లజ్జా తలొంచుకుని మీ దగ్గర మందుకి చెయ్యి జాచేలా చేసాయి గానీ, గుండెలోని బాధ బైటపడేలా చెయ్యలా! అది బయటపడాలంటే ఇంకో రెండు మూడు గ్లాసులు లోపల పడాలి. అప్పుడూ, అప్పుడే భూమిని చీల్చుకుని మొక్క బయటికొచ్చినట్టు మనసుని చీల్చుకుని బాధ బయటకొస్తుంది..” నవ్వాడు. బేరర్‌కి సైగ చేసి, “రంగారావుగారూ.. మీ మనసులో ఉన్నదేదో బయటకు తెప్పించాలని నా ప్రయత్నం కాదు.  అంత సమయమూ నాకు లేదు..” అన్నాను. బేరర్  రాగానే రంగారావుగారికి మందూ, భోజనం పెట్టి పంపమని చెప్పాను. “బిల్లుకి మాత్రం ప్రాబ్లం ఉండదు. సాయంకాలం ఇటువైపు వచ్చినప్పుడు ఎప్పుడైనా పే చెయ్యగలను” మళ్లీ రంగారావుతో అని లేచాను.

“ప్లీజ్! నాకోసం కాసేపు  ఆగండి. మీ సమయాన్ని ‘తినేస్తున్నా’నని తెలుసు. కానీ జరిగింది ఎవరితో ఒకరితో చెప్పుకోకపోతే నేను బ్రతకను. ఆ ఒక్కరూ మీరైతేనే నాకు బాగుంటుంది.” ఓ నిముషం ఆలోచించి కూర్చున్నాను.

ఇక్కడో  విషయం చెప్పాలి. మానవుడి శరీరంలో అత్యంత గొప్ప అవయవం ఏదీ అని ఓ రాజుగారు సభలో అడిగారట. కళ్ళు అని కొందరూ, కాళ్ళు అని కొందరూ, శిరః ప్రధానం  అని కొందరూ చాలా సమాధానాలు చెప్పారట. చివరికి ఒకడు లేచి, “అయ్యా, ఎవరన్నా బాధలో తపించేటప్పుడు ‘నేనున్నా’ నంటూ ఆ వ్యక్తి తలను తన మీద ఆనించుకునే ‘భుజాలు’, ఎవరన్నా దుఃఖంలో ఏడుస్తుంటే ‘నీకు నేనున్నా’ అంటూ కళ్లు తుడిచే ‘చేతుల’ కంటే విలువైనవి సృష్టిలోనే లేవు” అన్నాడట.

ఈ కథ నాకు ఎప్పుడూ నాకు జ్ఞాపకం వుంటుంది. ఇది మా అమ్మ నా చిన్నప్పుడు చెప్పిన కథ. ఆ కథ గుర్తుకొచ్చే కూర్చున్నాను. (చాంద్రాయణం కదూ!)  మరో గ్లాసు గబగబా తాగేసి  “అయ్యా, మాది మాంచి సాంప్రదాయమైన కుటుంబం. బెజవాడలో మెకానికల్ ఇంజనీరుగా పని చేసేటప్పుడు విమల తల్లి నాకు పరిచయం అయింది. నాది కుర్ర వయసూ + ఆమె అందగత్తె కావడంతో ప్రేమలో పడ్డాను. మా వాళ్లని ఎదిరించే ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాను. ఇద్దరు పిల్లలు పుట్టారు. కాలేజీలో ‘విమల’ ని బ్యూటీక్వీన్ అనేవాళ్ళుట. దాంతో విమలకి అందగత్తెనన్న భావం పెరిగింది. మెల్లగా బాయ్ ఫ్రెండ్స్  పెరిగారు.

ఓసారి వాళ్లని గవర్నర్ పేటలో నా కళ్ళతోనే చూశా. ఇక లాభం లేదని మద్రాస్ ‘అశోక్ లేలాండ్’ కంపెనీలో ఉద్యోగానికి ప్రయత్నించాను. లక్కీగా వెంటనే దొరికింది. దాంతొ బెజవాడ నించి కుటుంబాన్ని మద్రాసుకు మార్చేసా. కంపెనీకి దగ్గర్లోనే ‘ఎన్నూరు’లో వుండేవాళ్లం. ఏమైనా సరే టి.నగర్‌కి మార్చాలని మా ఆవిడ పట్టుబట్టింది. కూడదన్నాను. ఎవడో వాళ్ల మేనమామట. వాడే మాఆవిడకి పురెక్కించింది. రోజూ కొంపలో గొడవ పడలేక టి.నగర్‌కి మకాం మార్చాను. మా కంపెనీ బస్సు టి.నగర్‌కి కూడా పికప్‌కి వస్తుంది గనక పెద్దగా ఇబ్బంది పడలేదు. 15 రోజులు నైట్ షిఫ్ట్ కూడా ఉండేది,” ఆగాడు రంగారావు. ముఖంలో ఓ బాధ. మూడో పెగ్గు గుటుక్కున  తాగి సిగరెట్లు కావాలన్నాడు. తెప్పించాను.

“ఏమైనా తినకూడదూ!” అడిగాను.

“ఊహూ… తాగేటప్పుడు తినను. మీకో చిత్రం తెలుసా! తాగుడు అన్నా తాగే వాళ్లన్నా నాకు పరమ అసహ్యంగా ఉండేది. మొట్ట మొదటిసారి మీరు మా యింటికి వచ్చినప్పుడు నా కూతురి బలవంతం మీద ‘సర్వ్’ చేయాల్సి వచ్చింది. అఫ్‌కోర్స్. మీరు తాగలేదనుకోండి. అలాంటి వాడ్ని ఇలా తాగితేగానీ బతకలేని స్థితికి వచ్చాను!” నవ్వాడు. ఆ నవ్వులో విషాదం. నేనేమీ మాట్లాడలేదు. మనిషి మందుకి ఎందుకు బానిసవుతాడూ? మగాళ్ళేనా? కాదే? మీనాకుమారి.. సావిత్రి.. ఆ మధ్యే కేన్సర్‌తో చనిపోయిన నటి.. గిరిజ… వీళ్లందరూ ఎందుకు మందుకి దాసోహం అన్నారూ?”

ఒక్కొక్కరి జీవితాన్ని పరిశీలించి చూస్తే అర్ధమైంది. భరించలేని బాధ, భరించలేని వంటరితనం వాళ్లని మందు మనుష్యులుగా మార్చాయని. సినీ పరిశ్రమలో నమ్మినవాళ్లే, సొంతవాళ్ళే మోసం చేసినప్పుడు.. ఎవరైనా ఏమి చెయ్యగలరు? కాంచనలాంటివాళ్లు మాత్రం భగవంతుని నమ్మి ఆ భగవత్సేవలో మునిగి సర్వాన్ని క్షమించి శాంతంగా ఉండగలరు గానీ, అందరికీ ఆ స్థైర్యం రాదుగా!

“మిగతా కథ మీరే ఊహించవచ్చు సార్..! మొదట్లో మా అమ్మాయి అందం చూసి సినిమా వాళ్లు వేషం ఇచ్చారనుకున్నాను. కానీ కాదు. ఆ అవకాశం అప్రయత్నంగా రాలేదు. మా అవిడ మేనమామ అని పరిచయం చేసినవాడే ఆ ప్రొడ్యూసర్‌కి మా అమ్మాయిని చూపించాడు. అంతేగాదు. సినిమాలో కూతురికి ‘కేరక్టర్’ ఇప్పించడం కోసం మా ఆవిడ తన ‘కేరక్టర్’ని పణంగా పెట్టిందిట. ఆ విషయం నాకు తెలిసేసరికి జరగాల్సిన డామేజ్ జరిగిపోయింది. ఉద్యోగంలో పడి  నేను పట్టించుకోలేదు.

అసలు వాళ్లు నాకు ఏమీ తెలియనివ్వలేదు. సారూ, అసలు మా ఆవిడ సినిమా చాన్సుల కోసం ప్రయత్నించి ఆ సందర్భంగా ఆ ‘మామ’గాడితో రెండేళ్ళూ మద్రాసులొ వుందిట. చిన్న చిన్న వేషాలు కూడా వేసిందంట. చివరికి లాభంలేదని బెజవాడలో మకాం పెట్టిందంట. అక్కడ నేను దొరికాను. “నాలుగో పెగ్గు కూడా గుటుక్కున మిగాడు రంగారావు. దీర్ఘంగా నిట్టూర్చాడు.

“హీరోయిన్‌గా రెండు మూడు సినిమాలు చేసింది. ఇన్కమ్ ఎంతో నిజంగా నాకు తెలీదు. కారు కొన్నారు. డబ్బెక్కడిది అంటే ‘రెమ్యునరేషన్’ అని చెప్పారు. మా ఫాక్టరీలో కూడా నాకు పరపతి పెరిగింది. హీరోయిన్ తండ్రిగా తోటి ఉద్యోగులు మహా గౌరవం ఇచ్చేవారు. నా కొలీగ్స్‌ని నేను ఇంటికి పిలిస్తే మహాభాగ్యంలా భావించేవారు. దాంతో నేనో ఓ స్టేటస్‌ని అనుభవించాను!” మౌనం…బహుశా జరిగినవన్నీ గుర్తొస్తూ వుండాలి.

“ఒక రోజు ఇదిగో యీ ఎడమచేతి వేలు కట్ అయి పెందలాడే ఇంటికొచ్చేశా. ఏముంది తల్లీ కూతుళ్ళ బెడ్‌రూమ్స్‌లో అపరిచితులు. ఖంగారు పడ్డారు నా వైఫూ, కూతురూ.  ఆ క్షణంలోనే నాకు చావాలనిపించిది. “సారీ. ఇంకెప్పుడూ ఇలా జరగదు. తప్పనిసరి పరిస్థితిలో ‘ప్రొడ్యూసర్’నీ, ‘డైరెక్టర్’ ని ‘తృప్తి’ పరచాల్సి వచ్చిందని నా కాళ్ళు పట్టుకున్నారు.”  అసలేం మాట్లాడాలో కూడా నాకు తెలియలేదు.

అటువంటి సిచ్యుయేషన్‌లో ఎవరైనా ఏం చేస్తారు? చంపుతారు… లేదా చచ్చిపోతారు. నాకు నోట మాట రాలా..

“ఆలోచిస్తున్నారా గురూజీ! వాళ్లని చంపి నేను చచ్చిపోవాల్సింది. కానీ మరో బాధ్యత నన్నాపని చెయ్యనివ్వలా. మా నాన్న చనిపోయాక మా అమ్మ వొంటరిదైంది. ఆమె బాధ్యతలు నేను తీసుకున్నాను. నెల నెలా నా జీతంలో సగం ఇంటికి అంటే మా అమ్మకి పంపి మిగతా సగమూ మా ఆవిడ చేతుల్లో పెట్టేవాడ్ని. ఇప్పుడు నేను చచ్చిపోతే మా అమ్మకు దిక్కెవరు? ఆ ఆలోచనే నన్ను బ్రతికించింది. ఆ ఆలోచనే నన్ను హంతకున్ని కాకుండా కాపాడింది. మౌనంగా నా గదిలోకి వెళ్ళి కూర్చున్నాను. ఈ ఇన్సిడెంట్ జరిగి అయిదేళ్ళయింది. ఆ గదిలోనే అలమర్లో ఉన్నది ఏ బ్రాండో తెలీదుగానీ. తాగేశా.. గుక్కపెట్టి తాగేశా… “గ్లాసులో వున్న విస్కీని తాగేశాడు రంగారావు.. ఒక్క గుక్కలో.

“అయిపోయింది కథ… సినిమా చాన్సులు తగ్గినా ‘బిజినెస్’లో పండిపోయారు నా భార్యా కూతురూ.. నాలుగు సార్లు అరెస్టయ్యారు. ఆ ‘మామ’గాడు ఎలాగోలా బయటకు తెస్తాడు.మొదటిసారి వాళ్ళు అరెస్టయినప్పుడు నేను ఉద్యోగం మానేశా. కొలీగ్స్ ముందు ఎలా తలెత్తుకోనూ? ఆ తర్వాత ఇదిగో. యీ ‘ఏరియా’ కొచ్చి ఓ మెకానిక్ షెడ్‌లో మెకానిక్‌గా చేరాను. అమ్మకి డబ్బు పంపాలిగా. అదృష్టం ఏమంటే ‘విమల’ పేరు మార్చుకుంది సినిమాల్లోకి రాగానే. సరే.. మిమ్మల్ని ఎక్కువ సేపు కూర్చోబెట్టను. నిన్న.. నిన్న.. నిన్ననేనండి… మా అమ్మ చచ్చిపోయింది. శవదహనం మా అక్క కొడుకు చేశాట్ట. నన్ను వెదుక్కుంటూ వచ్చి ఆ ‘మామగాడు’ ఇంఫర్మేషన్ ఇవ్వాళ పొద్దునిచ్చాడు. సారూ.. ఏ అమ్మ కోసం మిగిలి వున్నానో ఆవిడ చచ్చిపోయింది…” ఏడవటం మొదలుపెట్టాడు రంగారావు.

“ప్లీజ్.. ఊరుకోండి. ప్లీజ్..” ఆయన భుజం నొక్కి అనునయించే ప్రయత్నం చేశా. ఓ ముప్పావుగంట తరవాత కళ్ళు తుడుచుకున్నాడు. మరో రెండు పెగ్గులు మౌనంగానే తాగాడు.

“ఏమన్నా తినకూడదా అని కదూ ఇందాక అడిగారు.. నాకు ‘పులిహోర’ తినాలని వుంది. ఇప్పిస్తారా?” అడిగాడు. రంగారావు కళ్ళు నిప్పుల్లా మెరుస్తున్నై.

మా ఆవిడ ఊరెళ్ళింది. ఎవర్ని అడగాలీ. కనకలత గుర్తుకొచ్చింది. ఆవిడా సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేస్తుంది గానీ, చాలా మంచిది. అరవై దాటినై. గవర్నమెంటు పేదవాళ్లకిచ్చే అపార్ట్‌మెంట్స్‌లో ఓ చిన్న గది సంపాయించుకుంది. ఆమెకి ఫోన్ చేశాను. పులిహోర ఏమన్నా ఏర్పాటు చెయ్యగలరా?”అని.

“రా నాయనా.. మీరు వొచ్చేలోగా నేనే చేస్తా.. ఎంతసేపు..” ఆదరంగా అన్నదావిడ. బహుశా నాకోసం అని అనుకుని వుండొచ్చు.

రంగారావుగార్ని కార్లో ఎక్కించుకుని టి.నగర్ తీసికెళ్ళాను. ట్రాఫిక్‌లో నలభై నిముషాలు పట్టింది.

రంగారావుగారికి బాగా మత్తెక్కిపోయింది. తూలిపోతున్నాడు. కనకలతగారు ఉండేది ఫస్టు ఫ్లోర్. రంగారావుని మెట్లు ఎక్కించడం చాలా కష్టమైంది.

“బ్రదర్.. వాడున్నాడే.. అదే నా కొడుకు. వాడు  తల్లీ అక్కా ఇచ్చే యీజీ మనీకి అలవాటైపోయాడు. రేపో ఎల్లుండో వాడూ పెళ్లి చేసుకుని భార్యని తార్చేస్తాడు బ్రదర్… తార్చేస్తాడు…నో డౌట్స్.. అవన్నీ నేను చూడలేను బ్రదర్.. థాంక్స్.. థాంక్స్ ఫర్ద్ ద లాస్ట్ డ్రింక్.. ఆండ్ లాస్ట్ ఫుడ్…”

పైకి వెళ్తూ వుండగా అని పైకి వెళ్లగానే నేల మీద పడిపోయాడు రంగారావు.

***

సినిమాకి ఇష్టం వచ్చిన ముగింపు ఇవ్వొచ్చు. మరి జీవితానికీ? నేను ముగింపు ఇవ్వలేను. ఇవ్వకూడదు కూడా . జరిగింది జరిగినట్టూ.. రంగారావు చెప్పింది చెప్పినట్టూ వ్రాయడం వరకే నా బాధ్యత. అంతేగానీ. వాళ్ల జీవితాల్లో ఇన్వాల్వ్ కావడం లేదు.

రంగారావు చనిపోవాలని నిర్ణయించుకున్నాడని అతను కథ చెబుతున్నప్పుడే నాకు అనిపించింది. అందుకే అతను కనకలతగారి ఇంటి దగ్గర పడిపోయినప్పుడు డాక్టర్‌ని పిలిపించే బదులు ఆంబులెన్స్‌ని పిలిచి అతన్ని హాస్పిటల్‌కి తరలించాను. జేబులో నిద్రమాత్రల సీసా దొరికింది గనక బహుశా అతను చివరిసారి ‘పులిహోర’  తిని జీవితం సమాప్తి చేసుకోవాలనుకున్న్నాడేమో అనిపించింది.

‘విమల’కి ఫోన్ చేసి విషయం చెప్పాను. ఆమే, రంగారావు భార్య ఇద్దరూ వచ్చారు. ఓ గంట సేపు మాట్లాడి రంగారావు ‘ఆత్మహత్యా’  యత్నం గురించి మాత్రమే చెప్పాను. వాళ్ల కథని రంగారావు నాతో చెప్పినట్టు చెప్పలేదు. అలా దాచటం మంచిదైంది.

“ఏం చేస్తాం అంకుల్. తెగ తాగేస్తున్నాడు డాడీ ! ” అన్నది కంప్లైంటుగా; డాక్టర్ బాగా తెలిసినవాడే.. “లివర్ పూర్తిగా చెడింది బ్రదర్.. ఇలాగే తాగితే ఎప్పుడేమవుతాడో చెప్పలేం” అన్నాడు. మూడు రోజుల తర్వాత  వాళ్లు రంగారావుని ఇంటికి తీసికెళ్ళారని తెలిసింది. అదీ డాక్టర్ ఫోన్ చేస్తేనే.. ఇది జరిగి అయిదేళ్లయింది.

విమల పెళ్ళి చేసుకుంది… ఆమెకిప్పుడో కూతురు. తల్లి అంత అందంగానూ వుంటుంది. ఆ పాపని లిటిల్ ఫ్లవర్ స్కూల్లో దింపుతూ ఉండగా నేను చూశాను. నన్ను చూసి విష్ చేసింది.

“మీ నాన్నగారు ఎలా వున్నారు?” అడిగా..

“విజయవాడలో ఓ వృద్ఢాశ్రమంలో చేర్పించాను అంకుల్. వాళ్ళు చాలా స్ట్రిక్టుగా వుంటారు. ఇక్కడుంటే ఆయన్ని తాగకుండా ఆపలేము… ఇదే మా అమ్మాయి. నాలుగేళ్లు. భలే డాన్స్ చేస్తుంది అంకుల్ !” కళ్లు మెరుస్తుండగా అన్నది. చిత్రపరిశ్రమకి ‘మరో’ హీరోయిన్ లభించబోతోందా?

ఏమో. ఎవరు చెప్పగలరూ?

మీ మాటలు

 1. రమాసుందరి says:

  హృద్యంగా రాసారు.

 2. కథ కాని కథ చదివి హృదయం భారంగా అయింది సర్
  మీరు భుజం నొక్కి ఓదార్చడం బావుంది మరిన్ని కథ కాని కథలు వెలుగులోకి వస్తాయి థాంక్స్ అండీ !

 3. Chennuri Sudarshan says:

  భువన చంద్ర గార్కి నమస్కారములు.
  యీ పత్రిక ద్వారా మిమ్మల్ని పలుకరించే భాగ్యం కల్గినందులకు చాలా సంతోషంగా ఉంది.
  సినిమాల్లోని నటీమణుల సిత్రాలు నా విద్యార్థి దశలో ఒక ప్రత్యేకమైన పత్రికలో చదివే వాన్ని. ఉన్న ఫళంగా ఆ పత్రిక పేరు గుర్తుకు రావడం లేదు. అలా రాస్తే పత్రిక వాళ్ళనేమనరా? అనే సందేహం కలిగేది. ఎందుకనరు?…అరెస్టులూ, కోర్టు కేసులు…మామూలే….అయినా రాతలాగవని మా ఫ్రెండ్స్ అనే వారు.
  సిన్మా క్రేజీకి బలైన వారెందరో…మనకి తెలియంది గాదు. అన్నింటికి మూలం ” పాకుడు రాళ్ళు ” యీసందర్భంగా అరచనకు ‘జ్ఞాన పీఠం’ బిరుదు మన శ్రీ రావూరి భరద్వాజ గారిని వరించాడాన్ని గుర్తు చేసుకోవడం నాభాగ్యం. నేను వారికి 1974 లో ఒక ఉత్తరం రాశాను. దానికి రెండు రోజుల్లోనే జవాబిచ్చిన మహాను భావుడాయన. దాదాపుగా వారి రచనలన్నీచదివాను.
  మీరూ సామాన్యులు గారు. నేను 10-02-2013 ఈనాడు ఆదివారం అనుబంధంలో రాసిన ” సువాలి” కథ చదివి వెంటనే నాతో ఫోన్లో మాట్లాడారు. నేనెంతగానో సంతోషించాను.
  కథా వస్తువు పాతదైనా మీరు కథను నడిపిన తీరు అమోఘం.
  మీలాంటి వారి స్ఫూర్తి తోనే నా పదవి నుండి విశ్రాంతి పొందాక కథానికలు రాయడం మొదలు పెట్టాను.
  నాహృదయ పూర్వక నమస్సులు.

  • BHUVANACHANDRA says:

   థాంక్స్ సుదర్శన్ గారూ …
   ”పాకుడు రాళ్ళు ”అద్భుతం…… నేను రాసే కధలు కొందరి నిజ జీవితాలే ….వారి పర్మిషన్ తీసుకునే రాస్తున్నాను చాలా తక్కువ ”కల్పన” తప్పదనుకొండీ ….సువాలీ …మంచికద ….ఇంకా ఇంకా వ్రాయండి ……నమస్సులతో భువనచంద్ర

మీ మాటలు

*