ఒక బొమ్మ వెనక కథే…ఈ “ఊహాచిత్రం” !

satyaprasadప్రతి కళలో కొంత కష్టం వుంటుంది. ఆ కష్టం పేరు పురిటి నొప్పులు.

ప్రతి కళాకారుడికీ ఒక సుఖం వుంటుంది. ఆ సుఖం పేరు కూడా పురిటి నొప్పులే.

ఏదో చేసెయ్యాలన్న తపన వుంటుంది. ఏవేవో తలపుకొస్తుంటాయి. ఎన్నెన్నో తొలుపుకొస్తుంటాయి. ఒక కథ రాయాలన్నా, ఒక కవిత రాయాలన్నా, ఒక బొమ్మ వెయ్యాలన్నా అవి ఒక రూపాన్ని సంతరించుకునే వరకూ ఒక అసహనం, ఒక తపన, ఒక ట్రాన్స్ లాంటి మెలకువ కళాకారులందరికీ అనుభవమే. నిద్ర, ఆకలి లేకపోవటంతో పాటు మిగతా శరీరావయాలు పనిచెయ్యడం మానేసే సందర్భాలు. పక్కనే ఎవరో పిలుస్తున్నా వినపడదు, కళ్ళ ముందు టీవీ నడుస్తున్నా అది మెదడుదాకా వెళ్ళదు. ఇలాంటి ఒక సంధి కాలాన్ని అక్షరబద్ధం చెయ్యాలని చాలా రోజుల్నుంచి అనుకుంటూ వున్నాను.

ఒక మిత్రుడి (ప్రముఖ చిత్రకారుడు)తో పిచ్చాపాటి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఇలాంటి పరిస్థితిని యథాలాపంగా ప్రస్తావించారు. “ఏదో చెయ్యాలని ప్రయత్నం చేస్తున్నాను. అది చేసే లోపే నేను పోతే..” అన్నారు. అక్కడ కథకి బీజం పడింది. ఆయనతో మాట్లాడినప్పుడు దొర్లిన ఆర్టిస్ట్ కు సంబంధించిన అంశాలు కొంత ముడి సరుకును ఇచ్చాయి.

ఒక మాస్టర్ పీస్ పుట్టడం వెనక ఇంత తపన, ఇంత వేదన వున్నా అంత వేదనలో నుంచి పుట్టిన ఆ కళని గుర్తించడంలో ఈ ప్రపంచం విఫలం కావచ్చు. కనీసం ఆ కష్టాన్ని కూడా గుర్తించకపోవచ్చు. ఆ గుర్తించని ప్రపంచంలో పాఠకులు వుండచ్చు, స్నేహితులు వుండచ్చు, తల్లీదండ్రీ ఆఖరుకు భార్యాబిడ్డలు కూడా వుండచ్చు. కానీ కళాసృష్టి వెనక జరిగే మధనాన్ని మరో కళాకారుడు తప్పకుండా గుర్తిస్తాడు. ఆలా గుర్తించిన సాటి కళాకారుడి అభినందన మించిన అవార్డు వుండదేమో ఈ ప్రపంచంలో. ఇది కథలో కొసమెరుపు అయ్యింది.

కథానాయకుడు చిత్రకారుడు కాబట్టి కథ కూడా ఒక సర్రియల్ చిత్రంలా వుండాలని అనుకున్నాను. కొంత చైతన్య స్రవంతి ధోరణిలో సాగినా, కాస్త రీసెర్చ్ చేసి అరువు తెచ్చుకున్న ’ఆర్ట్’ సంబంధించిన సాంకేతిక పదాలు వున్నా  సామాన్య పాఠకుడికి కూడా అర్థం అయ్యేలా రాయాలనుకున్నాను. అందుకు కొంత పాశ్చాత్య సాహిత్యం చదివిన అనుభవం ఉపయోగపడింది.

చివరగా ఈ కథ ప్రచురించబడినప్పుడు ఎందరో చిత్రకారులు నాకు ఫోన్ చేసి అభినందించడం, ఫోన్ చేసిన ప్రతి ఒక్కరు “మీరు బొమ్మలు కూడా వేస్తారా?” అని అడగటం ఆనందాన్ని ఇచ్చింది. కీర్తిశేషుడైన ఓ చిత్రకారుడి భార్య ఫోన్ చేసి ఆయన అసంపూర్ణంగా వదిలేసిన బొమ్మలను నాకు ఇస్తానని అనడం ఈ కథకు నాకు లభించిన అతి పెద్ద అవార్డు.

***

ఊహాచిత్రం

నేను లేచాను. ఇంకా మత్తుగా వుంది. లేచిన చోట అలాగే కూర్చుని గట్టిగా కళ్లు నులుపుకొని కిందకి చూశాను. కాళ్లకింద ఆ బొమ్మ … “ఆన్ క్రాస్” చార్‌కోల్ ఆన్ తార్ రోడ్. దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం నేను గీసిన బొమ్మ లాగానే వుంది. ఇంకా ఇలా రోడ్డు మీద వుండటమే ఆశ్చర్యం. దీనంగా గీసిన క్రీస్తు ముఖంలో చిన్న చిరునవ్వు … నన్ను ఆహ్వానిస్తున్నట్టు నవ్వు. నేనున్న చోటు నుంచి ఆ బొమ్మని చెరపకుండ వుండాలని జాగ్రత్తగా కదిలాను. అదృష్టవశాత్తు పాదాలు నేలకి ఆనడం లేదు.

ఎదురుగా ఏముందో కనపడటం లేదు … మొత్తం మంచుతెర. మసక మసకగా ఎక్కడో దూరంగా ఏదో జరుగుతున్నట్టు అలికిడి. మంచు కరుగుతోంది … అలా ముఖం మీద రంగులై జారుతోంది. అంతా ఏదో సర్రియలిజం పెయింటింగ్‌లాగా … ఇంకా చెప్పాలంటే మాస్ సర్రియలిజంలాగా కనపడుతూ … కరుగుతోంది …!

ఎదురుగా ఒక టీ బండి. అలాగే చూస్తూ వుండిపోయాను. అదేదో కలిసిపోయిన రకరకాల పెయింటింగ్స్ గేలరీలాగా వుంది. ఆ గోడని చూస్తుంటే అక్కడక్కడ పెచ్చులూడి, రంగులు వెలసి ఒక అబ్‌స్ట్రాక్ట్ ఎక్స్‌ప్రెషనిజం … అదిగో అక్కడ గోడ కిందుగా ఆ మరకలు. అవి ఒంటికాలిపైన నిలబడి టీ తాగుతూ, రెండో కాలు గోడ మీద ఆనుకునే మనుషుల రకరకాల బూటు గుర్తులు, చెప్పు గుర్తులు … వాటిపైన ఎవరో పాన్ తిని వూసిన గుర్తులు. చూస్తుంటే డెభ్బైల్లో వచ్చిన ఏదో మినిమలిజం తాలూకు పెయింటింగ్ లాగా వుంది. జామెట్రిక్ అబ్స్‌ట్రిక్ట్ అన్నా కాదనలేను కాకపోతే ఆ మరకల్లో సిమెట్రీ లేదు! ఆయన పేరేంటి … అదే జామెట్రిక్ అబ్స్‌ట్రాక్ట్ కనిపెట్టిన రష్యన్ … కాజిమీర్ … కాజిమీర్ … ఏదో వుండాలి! “ఒక టీ” చెప్పాను బండి వాడితో.

పక్కనే ఒక పెద్ద రాయి. దాని మీద కూర్చున్నాను. రాయి చాలా మెత్తగా వుంది. నా వెనక గోడ మీద సగం చించేసిన సినిమా పోస్టర్. చించేసిన సగంలోనుంచి వారం క్రితం అంటించిన మరో పోస్టర్ కనపడుతోంది. కొలాజ్ …’రివీలిజం’ అనొచ్చా … అట్లాంటిది ఒకటి వుందా? ఏమో తెలియదు… టీ అమ్మే అతని వైపు చూశాను. నేనొకణ్ణి ఉన్నానన్న స్పృహే లేకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. ప్రత్యేకమైన ముఖం. మా గురువుగారు చెప్పినట్లు వృత్తం, త్రిభుజం, చతుర్భుజం ఈ మూడిటితోనే అతని ముఖం తయారైంది. రోజులో సగం కూడా గడవలేదు కాబట్టి … ఇంకా ఫ్రెష్‌గానే వున్నాడు. సాయంత్రం వచ్చి అతను చెమటతో తడిసిపోయి వున్నప్పుడు ఒక లైవ్ ఆర్ట్ చెయ్యాలి.

తల తిప్పి మళ్లీ ఎదురుగా చూశాను. నేను దాటి వచ్చిన కిటికీ ఎక్కడో దూరంగా వుంది. చూస్తుండగానే వెనక్కి వెనక్కి వెళ్లిపోయింది. ఎదురుగా జనం … పెద్ద గుంపుగా జనం. ఎంత అద్భుతంగా వుందో చెప్పలేను. అసలు జనాన్ని చూడటమే ఒక అద్భుతమైన అనుభవం. ఇంతింత చిన్న చిన్న ముఖాలలో ఎన్ని వేల ఎక్స్‌ప్రెషన్లు వుంటాయో! అదుగో అటు చూడండి … కూరగాయలకోసం వచ్చి అదంతా మర్చిపోయి గుంపు మధ్యలోకి తొంగి చూస్తున్న బట్టతలాయన … ఆయన ముఖంలో ఆత్రుత … ఆదుర్దా! ఆయన చెయ్యి పట్టుకొని “వెళ్దాం” అంటూ లాగుతున్న మూడేళ్ల పిల్ల. ఆ పిల్ల ముఖంలో చిరాకు, తొందర. పక్కనే వున్న ఆ అమ్మాయిని చూశారా … అహహ … ఆమె కాదు … ఆ లావుగా, మెరూన్ కలర్ చీర పక్కన … ఆ అదే ఆ కుక్కపిల్ల. ఆ అమ్మాయి కట్టుకున్న ఎర్ర రంగు చీరచెంగు గాలికి ఎగిరి పక్కనే వున్నాయన నల్లటి పాంట్‌మీద పడుతుంటే భలే వుంది. ఎరుపు నలుపు కాంబినేషనే అంత…!

ఇలాగే ఈ గుంపుని బొమ్మ గీసేస్తే బాగుంటుందేమో అనిపిస్తోంది … క్యూబిజంలో అయితే బాగుంటుందేమో … ఆ అమ్మాయిని మాత్రం క్యూబిజంలో ఇరికించేసి అన్ని వైపుల్నించి ఆ అమ్మాయి ముఖం గీసేస్తే … అబ్బా … మాస్టర్ పీస్ చెయ్యొచ్చు!
“ఎంతసేపు టీ ఇవ్వడానికి?” గట్టిగా అరిచి మళ్లీ గుంపువైపు తిరిగాను.

గుంపు మధ్యలోనించి ఏదో కదులుతూ బయటికి వస్తోంది. రంగు … ఎర్రటి రంగు … ఆ రంగుని చూడగానే మనసు వురకలేస్తోంది… క్యూబిజం పక్కన పెట్టి క్లాసికల్ రియలిజం వైపు మనసు పోతోంది. అవును అలాగే వెయ్యాలి. అప్పుడే నా ప్రతిభ తెలుస్తుంది … రియలిజం … నియోక్లాసిజం కలిపి … అవును నా బ్రష్‌లు ఎక్కడ పెట్టాను? నా ఇంట్లోకి ఎలా వెళ్లాలి? నల్లటి వర్షం మొదలైంది.

ఎన్ని నీళ్ళు పడ్డా ఆ ఎర్రరంగుకి ఏం కావడం లేదు… అది రంగు కాదు … నా కర్థమైంది … రక్తం! గుంపు మధ్యలో ఎవరిదో రక్తం … ఆదుర్దాగా లేచాను… పరిగెత్తాను. ఆ గుంపుని చీల్చుకొని లోపలికెళ్లి చూశాను.

ఆ శవం … ఆ శవం …

నాదే …!!

నేనే అక్కడ పడివున్నాను … ముదురు గోధుమరంగు ముఖం నాది … నా ముఖం మీద ఎర్రటి రక్తం … ఎంతైనా చెప్పండి … కాంబినేషన్ కుదరలేదు … వర్షం పచ్చగా మారింది.

***

akbar“నువ్వు నారాయణగారి పెయింటింగ్ వెయ్యాలి…”

ఈ మాట వినగానే ఎగిరి గంతేసాను. నా చేత్తో మా గురువుగారి బొమ్మగీసే భాగ్యం … అంత కన్నా ఇంక కావాల్సిందేముంది …! ఆయనంటే నాకెంత అభిమానమో చెప్పలేను…!

అసలు మొదటిసారి ఆయన్ని చూసినప్పుడు కత్తి తీసుకొని పొడిచేద్దామనిపించింది … చంపేస్తే ఏమౌతుంది? అని ఒక క్షణం ఆలోచన వచ్చింది … ఈర్ష్య సార్ … మహా చెడ్డది ఈ ఈర్ష్య!

ఆయన వయసు అరవై దాటుతోంది! అయినా ఏదైనా బొమ్మని చూస్తే ఇంకా పిల్లాడే …! ప్రతి బొమ్మనీ, ప్రతి గీతనీ ఆ కళ్లద్దాల సందుల్లోంచి తదేకంగా చూస్తుంటాడు … ఎంత చిన్న పిల్లాడు గీసిన బొమ్మైనా సరే … అది తినేసే చూపు! ఆ తరువాత తను గీస్తాడు … మళ్లీ మళ్లీ గీస్తాడు. తాను చూసిన ఆ ఆర్ట్ ఏదైనా సరే … తనకి పట్టుబడేదాకా వూరుకోని పట్టు వదలని విక్రమార్కుడు … అందుకే పోర్ట్రేట్స్ దగ్గర్నుంచి అబ్స్‌ట్రాక్ట్స్ దాకా, ఇలస్ట్రేషన్స్ నుంచి క్యారికేచెర్స్ దాకా అన్నీ చేశాడు. ఇంకా చేస్తూనే వున్నాడు.

“ఆకలి చాలా ముఖ్యం … ఆకలికి దాసోహమనని కళ లేదు” అన్నాడొకసారి.

“అవును వ్యాన్‌గో అంత గొప్ప బొమ్మలు గీసాడంటే పాపం కడుపులో రగుల్తున్న ఆకలే కారణం … కదా గురువుగారూ?” అన్నాను అజ్ఞానంగా. ఆయన నవ్వేశాడు.

“నేను చెప్పేది ఆ ఆకలి గురించి కాదు … కొత్తది ఏమైనా నోర్చుకోవాలనే ఆకలి … అది మనసులో భగభగ మండుతుంటే ఇలాంటివి ఇంకా ఎన్నో నేర్చుకోవాలనిపిస్తుంది …” చెప్పాడాయన. ఆ తరువాత తెరిచాడు ఆయన సేకరించిన రకరకాల బొమ్మల ప్రపంచాన్ని.

ఎక్కడో చైనాలో గీసిన అబ్స్‌ట్రాక్ట్ బొమ్మలు, జర్మనీ పత్రికల్లో వచ్చిన కార్టూన్ స్ట్రిప్స్, ఇంకెక్కడో మధ్యప్రాచ్యంలో గీసిన పోస్టర్ డిజైన్స్ … ఇలాంటివి ఎన్నో . ఒక్కొక్క బొమ్మ ప్రత్యేకతని, ఆ గీతల నైపుణ్యాన్నీ చూపిస్తుంటే … ఆయనలో మరింత వుత్సాహం … నాలో నైరాశ్యం! ఆ ప్రపంచాన్ని వదిలి ఏ రాత్రి వేళో ఇల్లు చేరాక నా మీద నాకే అసహ్యం వేసింది. అన్ని బొమ్మలు చూశాక, అంత మంది ఆర్టిస్టులను కలిశాక ఇంక నన్ను నేను ఆర్టిస్ట్‌నని చెప్పుకోడానికి అర్హత లేదనిపించింది. నా ఎదురుగా వున్న నాలుగు పెయింటింగ్స్ … నేను గీసినవే … నన్ను వెక్కిరిస్తున్నట్లు. వాటి మీద కసి కొద్దీ రంగులు చల్లేశాను. ఎర్రరంగు ఇండియన్ ఇంక్ బాటిల్ మొత్తం కుమ్మరించాను.

***

ఎర్రటి రక్తం రోడ్డు మీద పరుచుకుంటోంది. ఆ రక్తం నాదే … నా శవానిదే. నేను చచ్చిపోయాను అని తెలియగానే భలే ఏడుపొచ్చింది. నా భార్యా పిల్లలు గుర్తుకు రాలేదు. అమ్మా, నాన్న, బంధువులు, మిత్రులు … వీరెవ్వరూ గుర్తుకు రాలేదు! మా గురువుగారు కూడా గుర్తుకు రాలేదు.

నా కళ్లముందు అస్పష్టంగా కనిపించింది. నేను వేస్తున్న నారాయణగారి పోర్ట్రెయిట్ పెయింటింగ్! ఇంకా పూర్తి కాలేదు … స్ట్రక్చెర్ అయిపోయింది … బేస్ కలర్స్ వేసేశాను … ఇంకా చెయ్యాల్సిన పని చాలా వుంది. అదంతా ఎవరు పూర్తిచేస్తారు అనిపించింది. అసలు పూర్తి చేస్తారా? అని అనుమానం వచ్చింది. నా వూహల్లో తయారైన చిత్రం … దానికి ఈ భూమిమీద పుట్టే అవకాశం లేకపోయింది … నా చావుతో … ఆ బొమ్మ పుట్టకముందే చచ్చిపోయింది.

ఇలాంటిదొకటి మొదలు పెట్టానని ఎవరికీ తెలిసే అవకాశం కూడా లేదు. నాకు అడ్వాన్స్ ఇచ్చిన వ్యక్తి ఆ డబ్బుల కోసం వస్తాడేమో కాని, నేను గీసి సగంలో ఆగిపోయిన బొమ్మని తీసుకెళ్లడానికి మాత్రం రాడు … ఆ బొమ్మ అలా దీనంగా ‘ది క్రయింగ్ చైల్డ్’ బొమ్మలాగా అలా ఒక మూలన పడుండాల్సిందే.

ఏదో ఒక రోజు మా ఆవిడకి అదంతా అడ్డంగా తోస్తుంది. ఆ రోజు ఏ పాత సామాన్ల బండిమీద పడిపోతుందో … అంతకన్నా ఏం చెయ్యగలదు చెప్పండి … అంటే నా భార్యకి బొమ్మలంటే ఇష్టంలేదని కాదు, బొమ్మ మొత్తం గీస్తే అది బాగుందో లేదో చెప్పగలదు గానీ, ఏం బాగుందో చెప్పలేదు. అలాంటప్పుడు పూర్తిగా గీయని బొమ్మను చూసి, అది అర్థాంతరంగా ముగిసిపోయిన మాస్టర్‌పీస్ అని గుర్తించడం అసంభవం.

“ఏమిటా ఆ పరధ్యాన్నం” అంటుండేది అప్పుడప్పుడు.

“అబ్బే ఏం లేద”నే చెప్పాను చాలాసార్లు. అంతకన్నా ఏం చెప్తాను? నా మనసులో ఏదో మూల ఒక రష్యన్ చిత్రకారిణి గీసిన పెన్సిల్ ఆర్ట్ తొలుస్తోందని చెప్పనా? డావించీ కుంచె నా గుండెల్లో కస్సున దిగి రంగులు పులుముతోందని చెప్పనా … లేకపోతే నేను గీయబోతున్న బొమ్మ తాలూకు పురిటి నొప్పుల గురించి వివరించనా.

“ఇదిగో … ఒక కాలికి ఒక రకం చెప్పు, రెండో కాలికి ఇంకో రకం చెప్పు వేసుకున్నారు” చెప్పింది నేను బయలుదేరినప్పుడు.

కాళ్లవైపు చూసుకున్నాను. అవును కరెక్టే. ఇందాక వేసుకునేటప్పుడే అనుకున్నాను సిమెట్రీ లేదు అని.

నవ్వేసి “మా గురువుగారింటికి వెళ్లొస్తా …” అన్నాను చెప్పులు మార్చుకుంటూ.

“అలా ఏదో ఆలోచిస్తూ బండి నడపకండి …” జాగ్రత్త చెప్పింది పాపం.

ఆ మాటలు విన్నాను … కానీ ఆలోచనలు వూహలు కలలు మన చేతుల్లో లేవు కదా! అవి వచ్చి నన్ను కమ్మేసి ముద్దుల్లో ముంచేస్తుంటే … అరెరే నేను కుడి వైపు సందులోంచి వెళ్లాల్సింది. మాటల్లో పడి మర్చిపోయాను. కొంచెం ముందుకు వెళ్లి టర్నింగ్ తీసుకోవాలి. గురువుగారి పెయింటింగ్ ఎలా వెయ్యాలో దాదాపు ఖరారైంది … కొన్ని రిఫరెన్స్‌లు తీసుకోడానికి గురువుగారి దగ్గరకే వెళ్తున్నా. ఆయనకి బాగా పేరుతెచ్చిన మేజిక్ రియలిజం స్టైల్లో ఆయన బొమ్మ గీయాలి. దాటేస్తున్నా … దాటేస్తున్నా … మర్చిపోయి మళ్లీ కుడివైపుకి తిరగడం మర్చిపోయి, వున్నట్టుండి తిప్పడం … ఆ వెనకే వస్తున్న లారీ ఢీ కొట్టడం … అసలు ఎప్పుడు జరిగిందో తెలిసేలోగా నేను నేలమీద పడ్డాను …! నా బొమ్మ అనాథ అయిపోయింది.

***

నేనొక పిచ్చోణ్ణి. నా ముందు మసక మసకగా వున్న చిత్రాన్ని చూసి సర్రియలిజమో ఇంకేదో అనుకున్నా … ఆత్మలకి అలాగే కనిపిస్తాయేమో! పైగా టీ ఇవ్వలేదని కోపమొకటి! అలా ఎంతసేపు పెయింటింగ్‌కి పోజిచ్చినవాడిలా కూర్చోవాలో మరి. ఆత్మ అంటే ఎగురుకుంటూ పైకి వెళ్లి ఆకాశంలో కలిసిపోవాలి కదా!

నా శవం చుట్టూ జనం పెరుగుతున్నారు.

“అరెరే … హెల్మెట్ పెట్టుకోకపోతే చూశారూ …” ఆయనెవరో నీతి సూత్రం చెప్తున్నాడు.

“నేను చూస్తూనే వున్నా … అడ్డదిడ్డంగా నడుపుకుంటూ వస్తున్నాడు… తాగున్నాడేమో అనుకున్నా … వున్నట్టుండి తిప్పాడు” మరో ప్రత్యక్ష సాక్షి.

నాకు అక్కడ వుండబుద్ధి కావటం లేదు. కాని ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్దామంటే వెళ్లనివ్వకుండా ఏదో పట్టి లాగుతోంది.

భూమ్మీదే ఏదో శక్తి ఆపుతోంది.

పోలీసులు వచ్చారు. నా మొబైల్ తీసుకొని అందులో నెంబర్లకి ఫోన్‌లు చేస్తున్నారు. నాకు అర్థమయ్యింది. నా భార్యాపిల్లల్ని చూసుకోవాలనే అనుకుంటా నా ఆత్మ ఆరాటం.

అంబులెన్స్ వచ్చింది. నా భార్యాపిల్లలూ వచ్చారు. ఆమె ఒకటే ఏడుపు. నాకు ఏడుపు రాలేదు … ఎందుకో!

ఇంక అయిపోయింది. ఇంకాసేపట్లో తీసేస్తున్నారు. ఇకనైనా నా ఆత్మ కదలాలి … లేదే … ఇంకా ఏదో ప్రతిబంధకం!!

“ఏమైంది?” గుంపు చివర నిలబడి పక్కనే వున్న కుర్రాణ్ణి అడిగాడు ఒక ముసలాయన.

“ఏక్సిడెంట్ …. స్పాట్‌లో పోయాడు …” ఎవరో చెప్తున్నారు.

“అయ్యయ్యో … ఎవరో తెలిసిందా?”

“ఎవరో బొమ్మలేస్తాడట … ఆర్టిస్ట్” చెప్పాడతను. ముసలాయన గుంపును తోసుకొని లోపలికి వెళ్లాడు. నా శవం వైపు చూస్తూ చేతులు జోడించి నిలబడ్డాడు.

“ఏం బొమ్మ నీ కళ్లముందు కనపడతా వుండిందో నాయనా … నీ సావు నీకు కనపడలా…” అని బయటికి వచ్చాడు అతను. అదే నేను వినాలనుకుంది. నా చావుతో నా బొమ్మ మిగిలిపోయింది. నా వూహలో బొమ్మ అర్థాంతరంగా ఆగిపోయింది. కానీ, కనీసం ఒకరికైనా నా చావుకు కారణం తెలిసింది. అదే నేను వినాలనుకున్నది. నా ఆత్మ గాల్లోకి లేచింది.

ఆ ముసలాయన రోడ్డు మీద గీసిన క్రీస్తు బొమ్మపైన చిల్లర ఏరుకుంటున్నాడు. 

మీ మాటలు

 1. మీ అన్ని కథలూ ఒకెత్తు. ఈ ఒక్క కథా ఒకఎత్తు.

  • నిజం. ఈ కథ రాసిన తరువాత మళ్ళీ కథ రాయడానికి కాస్త జంకేలా చేసిన కథ ఇది. ధన్యవాదాలు

 2. అరిపిరాల సత్య ప్రసాద్ గారూ,

  అద్భుతం!

  కథ చదివి కాసేపు అది మనసులోకి sink అవాలని కాసేపు ఆగా. చదువు తున్నంత సేపూ ఒక చక్కని అనుభూతి ఆవరించింది. దాన్ని వదులుకోదలుచుకోలేదు.

  మీ కథ వెనక కథ చదివేక నాకు ఈ శ్లోకం గుర్తొచ్చింది: “విద్యానేవ విజానాతి విద్ద్వజ్జన పరిశ్రమం , నహి వంధ్యా విజానేతి గుర్వీం ప్రసవ వేదనాం.”
  అభివాదములు .

 3. రమాసుందరి says:

  గుండె బరువెక్కింది. నిజమే కళాకారుడి ఆర్తి ఇంకో కళాకారుడికే అర్ధం అవుతుంది.చాలా బాగా రాసారు.

  • అవునండీ… నేను పైన చెప్పినట్లు ఈ కథని చిత్రకారులు చాలామంది అభినందించారు అంటే అదే కారణం కావచ్చు..!! ధన్యవాదాలు.

 4. ఈ కథ చదివాక రచయిత ఎటువంటి సబ్జెక్ట్ అయిన ఎంత పొందికగా ఇమిడి పోగల డో తెలియచెబుతుంది . నన్ను ఈకథ ఇంతగా ఆకర్షించడానికి ఒక బాక్ గ్రౌండ్ వుంది ,నేను ఒక ఆర్టిస్ట్ ని బేసిక్ గా …చిన్నప్పటినుండి ప్రతి daanni ఒక బొమ్మగా వుహించుకునేదాన్ని.ఈ ఆటిట్యూడ్ మీరు టీ కొట్ట్టుదగ్గర నిలబడ్డప్పుడు ఎంత చక్కగా వర్ణించారో చెప్పలేను . నేను ప్రతినీడలోను, పెచ్చులూడిన గోడ లోను ఎన్ని చిత్రాలను చూసేదాన్నో చెప్పలేను . కలకత్తా లో రెండు సార్లు నా బొమ్మలు అంటే ఎక్కువగా వ్యర్థ పదార్తాలతో చేసినవి ,కొలాజ్ లు ప్రదర్సన చేసాను .చివరిగా రిటైర్మెంట్ తరువాత రచనలు చేస్తున్నా …అందుకే నేను ఇది చదివి రెండు విధాలుగా లాభ పడ్డాను . ఒకటి ఆర్టిస్టు గా మరోటి రచయితగా …మీకు అభినందనలు అరిపిరాలగారు ..మీ రచనలు ఆసక్తిగా చదివే వారిలో ఒకరిని నేను …అరవై అయిదేళ్ళలో ఇష్టంగా ఓక అభిప్రాయం చెప్పానని సంతృప్తిగా vundi . చిన్నవారైనా బాగా రాస్తారు .ఎన్నో నేర్చుకోవాలి మాలాటి వారు .అభినందనలు
  లక్ష్మి రాఘవ

  • మీ ఆదరానికి కృతజ్ఞతలు లక్ష్మీరాఘవ గారు. మీ ప్రోత్సాహం మరిన్ని మంచి రచనలు చేసేందుకు దోహదం కాగలదు.

 5. “ఏం బొమ్మ నీ కళ్లముందు కదలాడుతో ఉండిందో నాయనా..నీ సావు నీక్కనపడలా”. చెప్పదలచుకున్నదంతా ఒక్క వాక్యంలో చెప్పారు.కథ చాలా బాగుంది.అభినందనలు.

మీ మాటలు

*