Archives for July 2015

వెలుగు కాదు, నీడ గురించి…

 

కందుకూరి రమేష్ బాబు

Kandukuri Rameshఒక ప్రశ్న తరచూ ఎదురవుతుంది.
ఎంతకాలం? అని!
ఎంతమందీ? అని!

దైనందిన జీవితం ఎప్పుడూ ఒక ప్రవాహమే కదా? అందులో ఎన్ని చిత్రాలు తీస్తూ ఉంటావని!
మనుషుల గురించి రాయడం అన్నదానికి ఒక పరిమితి ఏమైనా ఉంటుందా? ఎంతమందిపై రాయడం అని!

తలవంచుకుని తమ మానాన తాము పనిచేసుకునే ఎవరికైనా ఇలాంటి ప్రశ్నలు చికాకు పెడతాయి.
కానీ జవాబు వేస్టు. చెప్పడం వేస్టే.

రోజూ వాకిలి ఊడ్చి ముగ్గు పెట్టే స్త్రీ ఏమి ఆలోచిస్తుందని చెబుతాం?
ప్రతి రోజూ వండివార్చి ఇంటిల్లీపాది కోసం జీవించే గృహిణి ఏందుకని నిర్విరామంగా ఆ పని చేస్తుందని వివరించాలి!

ఇష్టం అనీ చెప్పలేం.
కర్మా అనీ అనలేం.

కొన్ని పనులు ప్రశ్నతో జవాబుతో నిమిత్తంగా జరగాలి.
అంతే. జరగాలి.

అయితే ఒక మాట.

కొందరు ఒక శతాబ్ద కాలానికి సరిపడా ముద్ర వేస్తారు.
మరికొందరు కొన్ని దశాబ్దాల పాటు గుర్తుంచుకునే మార్పూ తెస్తారు.
ఇంకొందరు ఏండ్ల పాటూ మరచిపోని స్థితిని కలగజేస్తారు.
అటువంటివారిని గుర్తు పెట్టుకోవడం మన ధర్మం. వారు ప్రాతఃస్మరణీయులు.
నిజమే వారిని కొలుచుకుందాం.

ఒక కలాం గారు పోతే, మరొక చలసాని ప్రసాద్ గారు మరణిస్తే జాతి జీవనం ఒక్కపరి ఆగి గుండె తీవ్రంగా కొట్టుకుంటుంది. కలాలు, గళాలూ గోషిస్తాయి. వారంతా కొన్ని బృందాలకో లేదా కొన్ని భావజాలాలలో లేదా మరే దానికో ప్రాతినిథ్యం వహించే మనుషులు. అందువల్ల వారు ఎంచుకున్న బాటలో… నడిచిన దారిలో మరిన్ని అడుగులు వేయాలనుకునే చాలామంది చాలా కదిలిపోయి రాస్తారు. బాగుంటుంది చదివితే!

వారు ప్రతినిధులు. మహనీయులు. సామాన్యులు కానేకాదు.
తమ అసామాన్య కార్యాలతో, జీవన శైలితో, నిరాటంకమైన పనితీరుతో చరిత్రలో వారు చిరస్మరణీయులుగా గుర్తింపు పొందుతారు. కానీ, వారెంతమంది ఉంటారు? నూటికి ఇరవై ఉంటే మహా ఎక్కువ.

కానీ, మిగతావారి సంగతేమిటి?
వారంతా మామూలు వాళ్లు. ద్వితీయులు. వారివి సాధారణమైన జీవితాలు.
అద్వితీయమైన కార్యమేదీ చేపట్టనందున వారి బ్రతుకూ, మరణమూ వార్త కాదు..వార్తా కథనం కాదు.. లైవ్ టెలికాస్ట్ కానేకాదు.
నిజం.

ఎక్కడా తమ ఉనికి గురించి ఎవరికీ తెలియకపోవచ్చు.
అలా అని వారు లేరా?

ఒక న్యూస్ లేదీ ఈవెంట్ లేదా ఒక ఇంపార్టెంట్ సిట్యుయేషన్.
ఈ మూడింటికీ చెందని జీవన కథనం వారిది.

సెలబ్రిటీ స్టేటస్ వారికి ఎన్నడూ దక్కకపోవచ్చు.
దక్కాలన్న ఆశా అక్కర్లేదు.
అలా అని వారిది జీవితం కాదా?

గుండె స్పందిస్తూ ఉంటే, లబ్ డబ్ అని అంటూ ఉంటుందని చెప్పుకుంటాం.
ఇందులో నీకు లబ్ ఇష్టమా? డబ్ ఇష్టమా? అంటే ఏం చెబుతాం?
అన్ని కలిస్తేనే శృతి తప్పని జీవితం కదా!
అందుకే దైనందిన జీవితంలో పనిముట్ల గురించిన పని అన్నది జరుగూతూ పోవాలె.
ఎంతమందిపై అనీ, ఎంతకాలమనీ అంటే ఏం చెబుతాం?

మరెందుకో కలాం గురించి రాస్తారు?
విరసం నేతల గురించి వ్యక్తి పూజను మరిపించేలా రాస్తారు?

వారి గురించి రాయద్దొనికాదు. కానీ, ప్రశ్నలు అడగడమే చికాకు.
సామాన్యుల వద్దకు రాగానే అమూర్తంగా ఉండటం ఎందుకని ఒక మాట.
ఏం చేసినా- అది ఎవరికో ఒకరికి, దేనికో ఒకదానికి… ప్రాతినిథ్యం వహించేది కావాలన్న స్వార్థం ఎందుకో?

అయినా ఇవ్వన్నీ ఎందుకుగానీ, ఒక మాట.

మీ వాడకట్టులో చనిపోయిన ఒక మనిషి గురించి ఈ వారం రాశారా?
తమరు నివసించే ప్రాంతంలో ఒక స్మశానం ఉంటుంది. అక్కడ అంత్యక్రియలు జరిగిన ఒక సామాన్యుడి జీవితకాలం కృషి గురించి ఒక పూట ఆలోచించారా?

పోనీ, ఇదిగో…. వీరు ఉదయాన్నే పనికి వెళుతున్నారు?
వారు ధరించిన పనిముట్ల నీడ వారి భుజంపై పడగా ఎప్పుడైనా చూశారా?

చూడకపోతే చూడండి.
శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ చదివి స్ఫూర్తిపొందడం గొప్ప విషయమే…
కలాం ‘వింగ్స్ ఆఫ్ ఫైర్’ తో ఉత్తేజితులు కావడం మంచిదే.
కానీ కండ్లెదుట… కష్టం, సుఖం మాదిరిగా వారిని అంటిపెట్టుకునే నీడ కూడా సాహిత్యమే.
వారిని వెన్నంటి నిలిచే కళ కూడా జీవకళే…
కడమదంతా నాకు నిరర్థకమే.

– కందుకూరి రమేష్ బాబు

పెద్దకోతుల ధర్మం

సత్యమూర్తి

‘‘ఇది ఒక నిండు ప్రాణంతో ముడిపడిన సమస్య నాయనా! నిదానంగా ఆలోచించు. ఆప్తులను పోగొట్టుకున్న మనకు ప్రాణం విలువేంటో బాగా తెలుసు. అందుకే తొందరపడొద్దని అంటున్నాను. నామటుకు నాకు ఆ చిన్నకోతిని చంపేయకుండా.. జీవితాంతం అలా చెట్టుకు కట్టేస్తేనే మేలనిపిస్తోంది. మన వానరజాతి ధర్మగ్రంథాలు, శిక్షాస్మృతులు అలానే చెబుతున్నాయి. ఆ కోతిని మనం పట్టుకోలేదు. పశ్చాత్తాపంతో అదే లొంగిపోయింది. నేరం ఒప్పుకుంది. చెరలోనే ముసలిదైపోయింది. ఆ జీవచ్ఛవాన్ని అలా వదిలెయ్. అయినా అది మహా బతికితే రెండు, మూడేళ్లకంటే ఎక్కవ బతకదు. అంతేకదా.. ఆ మాత్రం దానికి ధర్మభ్రష్టులం కావడమెందుకు?’’

తెల్లగడ్డమున్న ముసలి కోతి పున్నమి చంద్రున్ని చూస్తూ అంది. అడవి వెన్నెల్లో తమకంతో స్నానమాడుతోంది. ముసలి కోతి కూర్చున్న రావిచెట్టు చిటారుకొమ్మ ఆ వెన్నెల్లో జాబిల్లిని ముద్దాడుతున్న నెమలీకలా ఉంది. ఆ కోతి తలపైనున్న పూలకిరీటం నుంచి పరిమళాలు బలహీనంగా వస్తున్నాయి.

‘‘మీరన్నది నిజమే కావచ్చు. కానీ, ఆనాడు చిన్నకోతులు చేసిన దారుణాన్ని తల్చుకుంటుంటే రక్తం మరిగిపోతోంది. అవి చంపేసిన పెద్దకోతుల పెళ్లాం పిల్లలు ధర్మగంటను వాయించని రోజంటూ లేకుండా పోతోంది. కంటికి కన్ను, పంటికి పన్ను పీకాల్సిందేనంటున్నాయి అవి. ఇప్పుడీ చిన్నకోతిని వదిలేస్తే.. మిగతా చిన్నకోతులన్నీ రెచ్చిపోతాయి. మన పెద్దకోతులకు రక్షణ ఉండదు.. అరాచకం రేగుతుంది.. ’’

నడీడు బవిరిగడ్డం కోతి ఆవేశంగా చెప్పుకుపోతోంది. దాని కోరలు విషపు పుట్టగొడుగుల్లా తెల్లగా మెరుస్తున్నాయి. అది తల విసురుగా అటూ ఇటూ ఊపుతోంది. తలపై ఉన్న వట్టివాసనవేళ్ల కిరీటం ఆ వెన్నెల్లో తాచుపాము చుట్ట కదులుతున్నట్లు కదులుతోంది. దాని తోక రోమాంచితమైంది.

ముసలి కోతి చిన్నగా నవ్వింది. ఓ ఆకును నోట్లో పెట్టుకుని మునిపంట కొరికింది.

‘‘నాయనా, ఈ రాజ్య లాంఛన పెద్దగా నేను చెప్పాల్సింది చెప్పాను. ఇక నీ ఇష్టం! కానీ ఒకటి మాత్రం గుర్తించుకో.. అంతరాత్మకు మించిన ధర్మశాస్త్రం లేదు…!’’

‘అంటే, మేం చేస్తున్నది అధర్మం అంటారా? తలపండిన న్యాయకోతులు ఇచ్చిన తీర్పు తప్పంటారా? నన్ను ఎంతో అభిమానంతో, నమ్మకంతో ధర్మసంస్థాపనార్థం రాజ్యనిర్వాహక కోతిగా ఎన్నుకున్న ఈ అశేష వానరజాతి అభీష్టాన్ని నెరవేర్చడం ధర్మవిరుద్ధం అంటారా?’’

‘‘హ్హు.. అశేష వానరజాతి అభీష్టం! అంటే ఏమిటి నాయనా? మన పెద్దకోతులు కోరుకునేదేనా? చిన్నకోతులకు అభీష్టాలుండవా? ధర్మగంట వాయించడానికి కాదు, అసలు దాని ఛాయలకు రావాలంటేనే వణికిపోతున్న వేలాది చిన్నకోతులకు కోరికలేమీ లేవా? అసలు ఈ గొడవంతా ఎందుకొచ్చిందో నీకు మాత్రం తెలియదా?’’

బవిరిగడ్డం కోతి విసుగ్గా ముఖం పెట్టింది. ముసలి ఘటం ఇక చరిత్ర మొదలుపెడుతుంది కాబోల్రా బాబూ అంటూ బుర్ర గోక్కోబోయింది. కానీ అది తన అంతస్తుకు భంగమనుకుని ఆ చీకట్లో గంభీరంగా ముఖం పెట్టుకుంది. అంతే గంభీర గొంతుకతో..

‘‘మీతో చరిత్ర చెప్పించుకోవాల్సిన సమయం కాదిది. ఆ చిన్నకోతిని మూడో ఝాము మొదలవగానే ఉరితీయాలని న్యాయకోతులు తీర్పిచ్చాయి. ఆ శుభఘడియ కోసం రాజ్యమంతా ఎదురుచూస్తోంది. ఆ దెయ్యపు కోతి చివరిసారిగా మీకు మొరపెట్టుకుంది కనుక లాంఛనప్రాయమైన మీ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాం. ఇక ఒక ఝాము మాత్రమే గడువుంది. మీరు దాని మొరను తిరగ్గొట్టి, ఉరితీతకు ఒప్పుకుని తీరాలి..‘’

‘‘ఒప్పుకోకపోతే..?’’

‘‘మీ స్థానంలో మా మాట వినే ఆ జులపాల కోతి వస్తుంది..’’

ముసలి కోతి నిట్టూర్చుంది. దానికి మనసంతా కెలికినట్లు అయింది. ఉన్నపాటున మల్లెపూల కిరీటాన్ని తీసి కిందికి విసిరికొడదామనిపించింది. కానీ భయమేసింది. కొమ్మ నుంచి కొమ్మకు ఎగరలేని ముసలితనం గుర్తుకొచ్చింది. రాజ్యపెద్దగా చిటారుకొమ్మన గంధపు పుల్లలపై కూర్చుని అనుభవిస్తున్న లాంఛనాలు, గౌరవాలు, విలాసాలు, జుర్రుకుని, కొరుక్కుని తింటున్న తియ్యతియ్యని పళ్లు, ఒళ్లుపడుతున్న పరువాల ఆడకోతులు గుర్తుకొచ్చాయి. కానీ దాని అంతరాత్మ మాత్రం ఎందుకో ఎదురు తిరుగుతోంది. మళ్లీ అంతలోనే జావగారి పోతోంది..

‘‘నాయనా, నువ్వు రాజ్యనిర్వాహక కోతివి. అధికారమంతా నీదే. కాదనే శక్తి నాకు లేదు. కానీ నా అంతరాత్మ మాత్రం ఆ చిన్నకోతిని వదిలేయాలనే ఘోషిస్తోంది. నీకు విసుగ్గా ఉన్నా వినక తప్పదు. చేసిన పాపం చెబితే పోతుందంటారు.. చిన్నకోతులకు మనం అన్యాయం చేయబట్టే కదా, అవి ఆనాడు ఆ దారుణానికి ఒడిగట్టింది! ఆ ఘోరానికి ముందు.. వారం రోజులపాటు మన అల్లరి పెద్దకోతులు ఏం చేశాయో నీకూ తెలుసు కదా. ఆ చిన్నకోతుల చెట్లపైకి వెళ్లి, వాటిని పీక పిసికి చంపాయి. గోళ్లతో, నోళ్లతో రక్కి చంపాయి. వాటి పళ్లను, కాయలను దోచుకున్నాయి. వాటి ఆడకోతులను చెరిచాయి. వాటి పిల్లలను చితగ్గొట్టి చంపేశాయి. ఇంకా.. నోటితో చెప్పరాని పాడుపనులన్నీ చేశాయి. ఎందుకు చేశాయి? అవి చిన్నకోతులని, తిరగబడే శక్తి లేదని. వాటి వల్ల రాజ్యంలో చెట్లకు, పళ్లకు కొరతవచ్చిందని పెద్దకోతులను రెచ్చగొట్టి, వాటి అభిమానం సంపాయించి గద్దెనెక్కాలని. చిన్నకోతుల్లో అల్లరివి లేవని చెప్పను. కొన్ని ఉన్నాయి. కానీ వాటిని సాకుగా చూపి మొత్తం అవన్నీ చెడ్డవని తీర్పివ్వకూడదు నాయనా. బలహీనులను కాపాడాలని మన ధర్మం ఘోషిస్తోంది. మన పెద్ద కోతుల అకృత్యాలకు ప్రతీకారంగా ఆ చిన్నకోతి కుటుంబం సర్వనాశనమైంది. అలాంటి మరికొన్ని చిన్నకోతులు కలసి ఎక్కడో పాము విషం సంపాయించి, దాన్ని మన చెట్లపైని పళ్లకు పూశాయి. అవి తిని మన పెద్దకోతులే కాక, కొన్ని చిన్నకోతులు కూడా చచ్చాయి. ఉరికంబమెక్కబోతున్న ఈ కోతి కంటే ఘోర నేరాలు చేసిన చిన్నకోతులు పక్కరాజ్యంలో దాక్కున్నాయి. వాటిని తీసుకురావడం మన అరివీరశూర భయంకర పెద్దకోతులకు చాతకాలేదు. ఆ కోతులకంటే పెద్ద ఘోరాలు చేసిన పెద్దకోతులతో సాక్షాత్తు నువ్వే అంటకాగుతున్నావు. నీ అనుంగులూ అంటకాగుతున్నాయి. పట్టుకొచ్చి ఉరితీయాల్సిన మరెన్నో కోతులు మతపీఠాలపై, రాజ్యపీఠాలపై బోరవిడుచుకుని కూచుని నీతిన్యాయాలను శోష వచ్చి పడిపోయేలా వల్లిస్తున్నాయి.

నాయనా, మనం.. అంటే నువ్వనుకుంటున్నట్లు పెద్ద కోతులం మాత్రమే కాదు, చిన్నకోతులం కూడా.. ఆనాడు తెల్ల చింపాంజీల నుంచి స్వాతంత్ర్యం సంపాదించుకోవడానికి చేతులు కలిపి తిరగబడ్డాం. చింపాంజీల దాడిలో చచ్చిన కోతుల్లో వేలాది చిన్నకోతులు కూడా ఉన్న విషయాన్ని మరవొద్దు. స్వాతంత్ర్యం వచ్చాక లెక్కలేనన్ని ధర్మపన్నాలతో పెద్ద ధర్మగ్రంథం  రాసుకున్నాం. రాజ్యంలోని కోతులన్నింటికి చిన్నకోతి, పెద్దకోతి అనే తేడాల్లేకుండా అన్ని హక్కులూ ఉంటాయని హామీ ఇచ్చాం. కానీ, ఆ హామీలు మనం కొరికి పారేసే నేతిబీరకాయలైపోయాయి, మేడిపళ్లయిపోయాయి, గుడ్డిగవ్వలైపోయాయి, గురివిందగింజలైపోయాయి. అన్నిచోట్లా పెద్దకోతులు చెబుతోందే వేదమైపోతోంది. వాటి రెట్టమతమే రాజ్యమతమైపోతోంది. అవి చేసేది పుణ్యమూ, చిన్నకోతులది పాపమూ ఐపోతోంది. వాటి పిల్లలు దేశభక్తులూ, వీటి పిల్లలు దేశద్రోహులూ అయిపోతున్నాయి. చివరకు ఆ చిన్నకోతులకు రెండు పిల్లలను కనే స్వేచ్ఛకూడా లేకపోతోంది. పక్కరాజ్యానికి పోవాలని బెదిరింపులూ.. ఆ చిన్నకోతులు అక్కసుతో తిరగబడితే అరాచకకోతులని ముద్రవేసి చెట్లకు కట్టేస్తున్నాం, పీక పిసికి చంపేస్తున్నాం…’’

ముసలి కోతి ఆయాసంతో రొప్పుతోంది.

బవిరి కోతి ముఖం క్రోధంతో ఆ వెన్నెల్లో నిద్రలేని పులికన్నులా ఎర్రబారి తళుక్కుమంది.

‘‘చాలుచాలు. ఇక ఆపండి. మీకు ముసలితనంలో మతి చెడింది. దేశద్రోహికంటే ఘోరంగా మాట్లాడుతున్నారు. నోరు అదుపులో పెట్టుకోండి. అసలు ఉరి తీయాల్సింది ఆ చిన్నకోతిని కాదు, మిమ్మల్ని. మీ ధర్మపన్నాలకు కాలం చెల్లింది. మీ కాలం వేరు, మా కాలం వేరు. దండం దశగుణం భవేత్ అన్నారు. హక్కులు, గిక్కులు అంటూ కూర్చుంటే రాజ్యం అల్లకల్లోలమవుతుంది. మన కర్మభూమి విశ్వప్రేమిగా, శాంతిదూతగా ఎదగదు. శాంతికి, ప్రేమకు, కరుణకు మారుపేరైన పెద్దకోతులకు, వాటి ధర్మానికి ఉనికే లేకుండా పోతుంది. మీ పనికిమాలిన మాటలతో అప్పుడే అరఝాము గడిచిపోయింది. అక్కడ ఉరికి అంతా సిద్ధమైంది. తలారికోతి తాడు లాగడమే మిగిలింది. ఈ భువికి వన్నెతెస్తున్న మన మహోన్నత పరమపావన స్వర్గతుల్య పూజనీయ శాంతికాముక కర్మరాజ్యంలోని కోతులన్నీ ఆ మరణదండన శుభముహూర్తం కోసం వేచిచూస్తున్నాయి. ఈ తాటాకుపై సంతకం పెట్టి, ఆ తెగపండిన రేగుపళ్లను కొరుక్కు తినండి..’’

బవిరి కోతి కోపం, వెటకారం కలగలిపి తిట్టింది. ముసలి కోతి స్థాణువైపోయింది. బవిరి కోతి ఇచ్చిన తాటాకుపై కలలో మాదిరిగా సంతకం చేసింది. బవిరి కోతి ‘‘శభాష్’’ అంటూ ఓ రేగుపండును రాజ్యపెద్ద నోట్లో ముద్దుగా కుక్కి, తాటాకును నోట్లో కరచిపట్టుకుని ఆ చీకట్లో ఎంతో లాఘవంగా చెంగుచెంగుమంటూ చిన్నకోతిని ఉరితీస్తున్న చెట్టుమీదికి దెయ్యపు పిల్లిలాగా దూసుకుపోయింది.

 

 

 

 

 

 

 

 

గమనమే గమ్యం -8

 

శారద తండ్రి పోయిన దు:ఖం నుంచి తేరుకోటానికి సుబ్బమ్మ చేసినంత కృషి, ఏ తల్లీ ఏ కూతురికీ చేసి ఉండదు. ఆవిడ తన దు:ఖాన్ని పక్కనబెట్టి కూతురి బాధ్యత మీద వేసుకుంది. ఇంట్లో ఉన్నంతసేపూ శారదను ఒక్క నిమిషం కూడా ఒంటరిగా ఒదలలేదు. పగలూ , రాత్రి అంటిపెట్టుకుని తిరిగింది. శారద కన్నీరు తుడిచి నవ్వించటమే పనిగా పెట్టుకుంది. శారద గలగలా నవ్వుతుంది ఎప్పుడూ. శారద నవ్వే ఆమె అందం.

తండ్రి మరణించాక శారద దాదాపు నెలరోజులు  నవ్వలేదు. మళ్ళీ శారద నవ్వు చూడగలనా అని భయపడింది సుబ్బమ్మ. ఏదో ఒకటి చెబుతూ కూతురి వెంటవెంట తిరిగి అలిసిపోయింది. నాలుగు నెలలు గడిచిన తర్వాత మళ్ళీ శారద గలగలా నవ్వుతూ ఇంట్లో తిరుగుతుంటే సుబ్బమ్మ ఎవరూ చూడకుండా కరువుతీరా కంటారా ఏడ్చి సేదతీరింది. శారదకు ఈ నాలుగు  నెలలూ అన్నపూర్ణ ఉత్తరాలు  కూడా తన దు:ఖం నుంచి తేరుకోటానికి సహాయపడ్డాయి.

ఇప్పుడు అన్నపూర్ణ, అబ్బయ్య కాకినాడలో ఉంటున్నారు. అబ్బయ్య కాకినాడ కళాశాలలో ఉద్యోగం సంపాదించాడు. పెళ్ళయిననాటి నుంచీ తామిద్దరం భర్త సంపాదనతో బతకాలనే అన్నపూర్ణ కోరిక తీరింది. చూస్తుండగానే రోజులు  గడిచిపోతున్నాయి.

ఆ సంవత్సరం  కాంగ్రెస్‌ మహాసభలు  కాకినాడలో జరుగుతున్నాయి. అన్నపూర్ణ శారదను రమ్మని మరీ మరీ కోరింది. గాంధీ జైలు లో  ఉన్నాడు. గాంధీ లేకుండా జరిగే మహాసభలకు రావాలని లేదంది శారద. గాంధీని చూడాలని, మాట్లాడాలనీ శారద మనసులో చాలా రోజుల నాడు పుట్టిన కోరిక అడయారు మర్రి వృక్షమంత అయింది. కాంగ్రెస్‌ మహాసభలకు వెళ్ళి అక్కడ గాంధీని తప్ప అందరినీ చూడటం ఆ అమ్మాయికి అంత ఆసక్తిగా లేదు

. చివరికి అబ్బయ్య ‘‘వాళ్ళను చూడటం, వీళ్ళను చూడటం కాదు సభకు రావటమంటే ` ఎవరేం మాట్లాడతారు? ఎలాంటి రాజకీయ చర్చలు  జరుగుతాయి `? రాజకీయ వాతావరణం ఎలా ఉంది? ఏ తీర్మానాలు  చేస్తారు? ఇవి తెలుసుకోవటానికి రావాలి’’ అని ఉత్తరం రాశాక గాని శారదకు తన ఆలోచనలో తప్పు తెలిసిరాలేదు. తప్పు ఒప్పుకుంటూ శారద రాసిన ఉత్తరానికి అబ్బయ్య ‘‘ఆకర్షణ వ్యక్తుల పట్ల ఏర్పడుతుంది. ఉద్యమాల్లోకి వ్యక్తి ఆరాధన వల్ల అనేకమంది వస్తారు. కానీ అక్కడే ఆగిపోకూడదు. వ్యక్తులను దాటి రాజకీయాలను అర్థం చేసుకోవాలి ’’అని సమాధానం రాశాడు. గాంధీని ఆరాధించకుండా ఉండటం నా వల్ల కాదు  అనుకుంది శారద. కాకినాడ వెళ్ళటానికి సుబ్బమ్మ సులభంగానే ఒప్పుకుంది. ఏదో ఒక సందడిలో పడి శారద మామూలు  మనిషి కావాలనేదే ఆమె కోరిక.

తల్లీ కూతుళ్ళనిద్దరినీ ఆత్మీయంగా అక్కున చేర్చుకుంది అన్నపూర్ణ. వీళ్ళు వచ్చేసరికే కాకినాడలో సభల హడావుడి మొదలైంది. అన్నపూర్ణా వాళ్ళ ఇల్లు  చూసి శారద ఆశ్చర్యపోయింది. ఇంట్లో ఎక్కడా దేవుడి పటాలు  లేవు. పూజగది లేదు. ఇల్లు  చాలా నిరాడంబరంగా ఉంది. ఇంటి ముందు పెద్ద తోట పెంచుతున్నారు. కాకినాడలో అబ్బయ్యకు గోపరాజు రామచంద్రరావనే గురువు దొరికాడనీ, ఇదంతా ఆయన ప్రభావమనీ అన్నపూర్ణ చెప్తే సుబ్బమ్మ ఆశ్చర్యంగా ‘‘ఐతే ` నువ్వు కూడా నాస్తికురాలివయ్యావుటే’’ అంది. శారద ‘‘అమ్మా ` నాకూ దేవుడి మీద నమ్మకం లేదు. నీ కోసం నమస్కారం పెడుతున్నా అంతే’’ అంది.

‘‘మరి ఇక్కడ నా పూజా పునస్కారాలెలా?’’ సుబ్బమ్మ విలవిలలాడింది.

‘‘అన్నీ ఏర్పాట్లు చేస్తాను’’ అంటూ అన్నపూర్ణ ఎక్కడినుంచి తెప్పించిందో సీతారాముల పటం తెప్పించింది. వంటింటి పక్కనున్న చిన్నగదిలో ఒక పీటవేసి దానిమీద ఈ పటం పెట్టింది. సుబ్బమ్మ ఆ పటానికి పసుపు కుంకుము దిద్దేసరికి అన్నపూర్ణ, శారదా తోటలో నుంచి బుట్టెడు పూలు  కోసుకొచ్చారు. సుబ్బమ్మ పూజ దివ్యంగా జరిగింది.

అన్నపూర్ణ శారదకు కాకినాడంతా చూపించింది. బులుసు సాంబమూర్తిగారు అంత హడావుడిలోను శారద రామారావు కూతురని చెప్పగానే పదినిముషాల పాటు ఆగి శారదను ఆప్యాయంగా పలకరించి, క్షేమ సమాచారాలడిగాడు.

ఇక సభలు  జరిగే ప్రాంతంలో హడావుడి చెప్పనలవి కాదు. సభ కోసం నిర్మించిన పెండాల్‌ అద్భుతంగా ఉంది. దానిని జాగ్రత్త  చేస్తే మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు కూడా. మంచి ఖద్దరు విరివిగా ఉపయోగించారు. ఎక్కడెక్కడి భాషలవారు. ఎన్నో జాతులవారు, భారతదేశపు చిన్నరూపంలా ఉంది కాకినాడ. శారద ఉత్సాహంగా కాకినాడ తన స్వంత ఊరులా తిరుగుతోంది. వాలంటీర్ల దళంలో అన్నపూర్ణతో పాటు తనూ చేరింది. శారద రామారావు కూతురనే విషయం తెలిసి చాలామంది వచ్చి పలకరించి వెళ్ళారు. శారద గలగలా నవ్వుతూ, బొంగరంలా తిరుగుతూ ఏ పనీ భారమనుకోకుండా చేస్తోంది.

ఆ రోజు ఉదయం వాలంటీర్ల రిక్రూట్‌మెంట్‌ జరిగే దగ్గర చిన్నపాటి గొడవ జరుగుతోందని తెలిసి శారద అక్కడకు వెళ్ళింది. అక్కడ ఒకమ్మాయి తననూ వాలంటీర్‌గా చేర్చుకోవాని పట్టుబడుతోంది. చిన్నపిల్లవని పెద్దలు  ఆ పిల్ల  మాటను తోసి పుచ్చుతున్నారు.

‘‘నేను గాంధీగారికి నా నగలన్నీ ఇచ్చాను. హిందీలో బాగా మాట్లాడగలను. హిందీలో నాలాగా మాట్లాడగలిగే వాళ్ళు ఎంతమందున్నారో చూపించండి. ఉత్తరాది నుంచి వచ్చే ప్రతినిధులతో హిందీలో మాట్లాడుతాను. వాళ్ళ అవసరాలు  కనుక్కుంటాను. ఈ సభకు నేను పోగు చేసినన్ని విరాళాలు  ఎంతమంది పోగుచేశారో చెప్పండి’’ అంటూ ఆవేశపడుతోంది.

‘‘వయసుకంటే నైపుణ్యం  ముఖ్యం కదా. హిందీలో మాట్లాడగలవాళ్ళు మనకు అవసరం కదా’’ అని శారద ఆ అమ్మాయి పక్షం వహించింది.

‘‘మనం వయసు నిబంధనగా పెట్టుకున్నాం కదా. దానిని పాటించాల్సిందే. మనం పెట్టుకున్న నిబంధనను మనమే ఉల్లంఘిస్తే ఎలా’’ వాళ్ళమాటలూ  సబబుగానే ఉన్నాయి.

ఆ అమ్మాయి భుజంమీద చెయ్యివేసి ‘‘నీ పేరేంటోయ్‌’’ అనడిగింది.

‘‘దుర్గాబాయి’’ ఆ అమ్మాయి కోపంగానే చెప్పింది.

‘‘దుర్గాబాయి వలంటీరుగా ఉంటుంది. ఐతే సభ లోపలకాదు. బైటనే. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో కొందరి బాధ్యత దుర్గాబాయికి అప్పగించుదాం’’ అంది శారద.

‘‘అలా ఎలా కుదురుతుంది? చిన్నపిల్ల కదా ` తెలియక ఏదైనా పొరపాటు చేస్తే ? ’’

olga title

‘‘దుర్గాబాయి మాట్లాడే పద్ధతి , ఆమె వాదన చూస్తే అందరికంటే పెద్దదిలా ఉంది గానీ చిన్నపిల్లలా లేదు. హిందీ బాగా వచ్చునంటున్నది. ఈ ఉత్సాహం మీద చన్నీళ్ళు చల్లకండి’’ శారద దుర్గాబాయి తరపున మాట్లాడింది.

చివరకు సభ ప్రవేశ ద్వారంలో పని చేయటానికి, కొందరు ఉత్తర భారతదేశ మహిళా ప్రతినిధులతో మాట్లాడి వాళ్ళ అవసరాలు  తీర్చటానికి దుర్గాభాయి బాధ్యత వహించేలా ఒప్పించగలిగింది శారద.

‘‘మీరు ఎక్కడినుంచి వచ్చారు?’’ దుర్గాబాయికి శారద బాగా నచ్చింది.

‘‘నన్ను మీరు అనకు. మనం ఇక స్నేహితులం. నేను మద్రాసు నుంచి వచ్చాను. నా పేరు శారద. ఇంటర్‌ పరీక్షలు రాశాను’. దుర్గాబాయి మెచ్చుకోలుగా చూసింది.

‘‘ఇంటర్‌ పాసయితే ఇంకా చదువుతావా? పెళ్ళి చేసుకుంటావా?’’

‘‘పెళ్ళా ? నేనా? నేను మెడికల్‌ కాలేజీలో చేరాలి డాక్టర్‌నవుతాను. పెళ్ళి చేసుకోను. పెళ్ళి చేసుకుంటే ఇలా సభకు స్వేచ్ఛగా రాగలమా?’’

‘‘నాకు పెళ్ళయింది. ఐనా వచ్చాను’’.

అప్పుడు గమనించింది శారద. దుర్గకు పెళ్ళయిన గుర్తులున్నాయి.

‘‘ఐతే నువ్వు చాలా గొప్పదానివి. ఇంట్లో ఒప్పుకున్నారా?’’

‘‘నేను ఎవరినైనా ఒప్పిస్తా. ఒప్పుకోకపోయినా వస్తా’’.

శారద ఆప్యాయంగా రెండుచేతులతో దుర్గాబాయిని దగ్గరకు తీసుకుంది.

‘‘నువ్వు నాకంటే మొండిదానివిలా ఉన్నావు. నాతో స్నేహం చేస్తావా?’’

‘‘ఓ! ఎందుకు చెయ్యను? నాకు కాలేజీలో చదువుకోవటం చాలా ఇష్టం. కుదరలేదు. హిందీ మాత్రం బాగా నేర్చుకున్నా.’’

అన్నపూర్ణకు దుర్గాబాయి గురించి చెబితే ‘‘ఆ అమ్మాయి గురించి ఈ ప్రాంతాలో తెలియని వారు లేరు. బులుసు సాంబమూర్తి గారి ప్రియ శిష్యురాలు’’ అంది. అబ్బయ్య కూడా దుర్గాబాయి గురించి చాలా మంచిగా చెప్పాడు. శారద దుర్గాబాయిని చూసి ప్రేరణ పొందిందనే చెప్పాలి.

‘తనకంటే చిన్నది. తనకున్న అవకాశాలు  లేవు. పెళ్ళయింది. చదువుకునే అవకాశం లేదు. ఐనా అన్ని ఆటంకాలనూ దాటుకుంటూ వస్తోంది. తనకు రామారావు కూతురనే మాట ఒక్కటి చాలు. ఎక్కడికి వెళ్ళినా ఎదురుండదు. ఇలాంటి తండ్రి ఎందరికుంటాడు. చదువుకోటానికే పుట్టినట్లు చదువుతోంది. ఎందరికి ఇలాంటి అవకాశం ఉంటుంది? వీటన్నిటినీ దేశం కోసం వినియోగించాలి. మరింత ఎక్కువగా’ అనుకుంది తనలో తానే.

ఇంగ్లీషు, హిందీలో చకచకా మాట్లాడుతున్న శారదను చూస్తే దుర్గాబాయిలో చదువుకోవాలన్న కోరిక పెరిగింది. చదవాలి. ఇంగ్లీషులో మాట్లాడాలి. హిందీ మంచిదే. కానీ చూస్తోంది గదా ` ఇంగ్లీషు చదివిన వారికే ఎక్కువ విలువ.

గాంధీ, నెహ్రూ, సాంబమూర్తిగారు, ప్రకాశం గారూ ఎవరు చూడు ఇంగ్లీషులో పెద్ద చదువు చదివారు. పెద్ద డిగ్రీలు  సంపాదించారు తనూ చదవాలి.

సభ ప్రారంభమయ్యాక దుర్గాబాయికి మరింత బాగా అర్థమైంది స్త్రీకి  ఎన్ని తెలివితేటలున్నా పెద్ద చదువు, డిగ్రీలు  లేకపోవటం వల్ల  వాళ్ళను మగవాళ్ళు తేలికగా వెనక్కి నెడుతున్నారని. నెల్లూరు  నుంచి వచ్చిన కనకమ్మ గారు చాలా బాగా మాట్లాడటం, హిందీలో ధారాళంగా మాట్లాడటం చూసి దుర్గాబాయి ఆమెను చాలా గౌరవంతో చూసింది. కానీ పెద్ద నాయకురాలు  ఆమెకు ఇవ్వాల్సినంత గౌరవం ఇస్తున్నారా అనే అనుమానం కూడా వచ్చింది. ఆమె నెల్లూరులో బాలిక పాఠశా స్థాపించి గాంధీ గారితో శంకుస్థాపన చేయించారని విని దుర్గ ఆమె పరిచయం చేసుకుంది.

‘‘నేను మా ఇంట్లోనే ఆడపిల్లలను  పోగు చేసి హిందీ నేర్పుతున్నానండి’’ అని వినయంగా చెప్పింది.

కనకమ్మ దుర్గాబాయిని అభిమానంగా చూసి ‘‘మంచిపని చేస్తున్నావమ్మా దేవుడు నిన్ను చల్లగా  చూస్తాడు’’ అని దీవించింది.

‘‘మీరు బాలిక పాఠశాల  పెట్టారట’’

‘‘ఔను అదిప్పుడు చాలా అవసరం. ప్రతి ఊళ్ళో ఆడపిల్లలకొక బడి కావాలి. ఆడవాళ్ళు మగవాళ్ళతో సమానంగా చదువుకోవాలి’’.

‘‘లేకపోతే మగవాళ్ళు మనల్ని ఎక్కి  రానివ్వరు. లెక్కచెయ్యరు ` కదండీ?’’ దుర్గ మాటకు కనకమ్మ నవ్వేసింది.

‘‘ఒకళ్ళు ఎక్కిరానిచ్చేదేమిటి? మన పని మనం చెయ్యాలి. ఫలితం భగవంతుడికి ఒదలాలి. గాంధీగారు ` ఇంకా అంతకు ముందు గీతలో శ్రీకృష్ణుడు అదేగదా చెప్పారు’’.

దుర్గాబాయికి ఎందుకో ఆ మాట నచ్చలేదు. ఎవరు చెప్పినా సరే ` ఫలితం గురించి ఆలోచించాలనే అనిపించింది ఆ అమ్మాయికి. చేసేపనికి ఫలితం లేకపోతే ఎలా? ఇంత ఉద్యమం చేస్తున్నాం. దీనికి ఫలితంగా స్వరాజ్యం రాకపోతే ఎట్లా? పని చేశామంటే ఏదో ఒకటి సాధించాలి.

తన ఆలోచనను శారదతో చెబితే ఆమె కూడా దుర్గ మాటనే బలపరిచింది.

‘‘ఫలితం రానపుడు మరీ నిరాశపడకూడదని అలా అంటారు గానీ ఫలితం వచ్చి తీరాలి. ఈ సభలు  ఇంత వైభవంగా ఇంత కష్టపడి జరుపుతున్నాం. దీనికి ఫలితం ఉండాలి కదా’’.

శారద తనలా ఆలోచించినందుకు దుర్గ మనసు తేలికయింది. శారదను కనకమ్మ గారికి పరిచయం చేసింది. ‘‘రామారావు గారి అమ్మాయివా’’ అమ్మా అంటూ కనకమ్మ శారదను దగ్గరకు తీసుకుని తల నిమిరి ఆశీర్వదించింది.

బెంగాల్‌నుంచి వచ్చిన స్త్రీలు, బొంబాయి నుంచి వచ్చిన స్త్రీలు  చాలా చురుగ్గా  ఉన్నారు. కలకత్తా, బొంబాయి నగరాల  ప్రభావం కావచ్చు. శారదకు చాలా మందితో స్నేహం కలిసింది. సిక్కులు  చేసే ప్రార్థనలు, వాళ్ళు పంచే ప్రసాదాలు  అందరికీ నచ్చాయి. ఆ సమయాల్లో చాలామంది ప్రార్థనలు జరిగే చోటికి చేరేవారు. కస్తూర్భాగాంధి మాటు వింటుంటే గాంధిని విన్నంత అనుభూతి కలిగింది. దుర్గ, అన్నపూర్ణ ముందు గాంధీని చూసి ఇపుడు కస్తూర్బాను చూస్తున్నారు. శారద గాంధీని వినే అదృష్టం తనకు లేదా అని దిగుపడింది. ఈ పైపై విషయాలను గమనిస్తూ, అనుభూతి చెందుతూనే సభలో జరిగే చర్చ సమాచారం ఎప్పటికప్పుడు రాసుకుంటోంది శారద.

అక్కడ జరుగుతున్నవన్నీ శారదకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఆవేశం రగిలిస్తున్నాయి.

అన్నిటికంటే ముఖ్య విషయం గాంధీగారు బోధించి కార్యక్రమం రూపొందించిన విదేశీ వస్తు బహిష్కరణకు విరామం ఇవ్వాలని తీర్మానం పెట్టారు. దానికే శారద అదేమిటని ఆవేశపడుతుంటే ఆ తీర్మానాన్ని దాదాపు అందరూ బలపరిచారు. ఇంతమంది ఒద్దనుకుంటున్న కార్యక్రమం గురించి గాంధీ మాట్లాడినపుడు వీరంతా తలూపినవారే ` ఆఖరికి చిత్తరంజన్‌దాస్‌ కూడా ఆ తీర్మానాన్ని గెలిపించటానికి కృషి చేశాడని చెప్పుకుంటుంటే శారదకు ఏం చెయ్యాలో తెలియలేదు. ఇంతమంది తనకు వ్యతిరేకులున్నారని గాంధీ గారికి తెలుసా?  ప్రకాశం గారు పెట్టిన తీర్మానం ఒక్క ఓటుతో ఓడిపోయింది. ఆయన ఆంధ్ర కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి రాజీనామా చేశాడు. ప్రతిపూటా ఒక సంచలనమే. నాయకు వాగ్యుద్ధాల  శారదకింత వరకూ పరిచయం లేదు. ఇక్కడ మొదటిసారి చూసి విస్తుపోయింది. మోతీలాల్‌ నెహ్రూ, గాంధీ చెప్పినదానికి, పూర్తి వ్యతిరేకమని, అబ్బయ్య చెబుతుంటే నమ్మబుద్ధి కాలేదు. అందరూ కాంగ్రెసే అయితే ఇన్ని విభేధాలేమిటని రాత్రుళ్ళు ముగ్గురూ కూచుని చర్చించుకున్నారు.

బహిష్కరణోద్యమం తదితర విషయాల మీద ఇంత వ్యతిరేకత ఉందని గాంధీ గారికి తొసా? జైల్లో ఉన్న ఆయనతో వీళ్ళు చర్చిస్తున్నారా అనే సందేహం శారదది.

‘‘చర్చించినా చర్చించకపోయినా వీళ్ళు నమ్మింది వీళ్ళు చేస్తున్నారు. గాంధీగారు నమ్మింది ఆయన చేస్తున్నాడు’’ అన్నాడు అబ్బయ్య ఇవన్నీ కాచి వడపోసినవాడిలా.

‘‘ఒక పార్టీలో ఒక పద్ధతి ఉండొద్దా? ఏం అన్నపూర్ణా?’’

‘‘ఉంటే మంచిదే. కానీ ఆ పద్ధతి గురించి నమ్మకం లేనివాళ్ళకు, ఇంకో పద్ధతి మంచిదన్న ఆలోచన ఉన్నవాళ్ళకు కూడా తమ ఆలోచను ఆచరణలో పెట్టే అవకాశం ఉండాలి గదా. లేకపోతే ఒకరి మాట మీదే చర్చ కూడా లేకుండా నడుచుకుంటే తీరా అది చెడు ఫలితాలనిస్తే ` అబ్బయ్య చెప్పిన మాటల్లో కూడా తప్పుపట్టటానికేమీ లేదనిపించింది. కానీ అందరూ గాంధీ మాట ప్రకారం నడిస్తే బాగుండనిపించింది.

‘‘మనకు ఈ విషయాలు  తెలిశాయి గానీ, ప్రజందరూ, అంతా గాంధీ గారు చెప్పినట్టే జరుగుతుందనుకుంటున్నారు. ఇంతమంది నాయకులు  నేను నేనని పోటీ పడుతున్నారు గానీ ప్రజలకు మాత్రం గాంధీ ఒక్కడే నాయకుడు’’ అంది అన్నపూర్ణ.

‘‘ఆయన ఎలా సాధించాడది?’’ శారద విస్మయంగా అడిగింది.

‘‘మొండితనంతో, నిరాడంబరంతో. కొన్ని విశ్వాసాలను త్రికరణశుద్ధిగా పాటించడం వల్ల ` ప్రజలకు ఎవరు నిజమైన నాయకుడో తెలిసిపోతుంది. నాయకుడికి నిర్భయం, మొండితనం ఉండాలి. అవి ఉంటే దానికి సత్యం, చిత్తశుద్ధి తోడయితే ఇక తిరుగులేదు. గాంధీగారిలో ఇవన్నీ ఉన్నాయి. ఆయన కోర్టులో చెప్పిన మాటలు  విన్న తర్వాత ఇక ఆయన నాయకత్వానికి తిరుగులేదంది దేశం  ’’

కాకినాడ సభ వల్ల  శారదకు రాజకీయ పరిణితి వచ్చింది. సభలు  పూర్తయ్యాక కూడా వారం రోజులు  అన్నపూర్ణ దగ్గరే ఉండిపోయింది. అబ్బయ్య, అన్నపూర్ణతో కలిసి చేసిన చర్చలకు అంతే లేదు. వీటన్నిటితో తండ్రి మరణం కాస్త వెనక్కువెళ్ళి, ఉత్సాహంగా, ధైర్యంగా మద్రాసు తిరిగి వచ్చింది. తండ్రి మరణంతో అంతా శూన్యమనిపించిన భావన పోయి దేశమంతా తనతో ఉన్న భావన, బోలెడు బలం  వచ్చాయి. ముఖ్యంగా కనకమ్మగారు, దుర్గాబాయి చెరొక విధంగా శారదకు స్ఫూర్తి నిచ్చారు. తను చెయ్యవసిన పనులెన్నో ఉన్నాయి.

‘‘తనవల్ల  దేశం ఒక్కడుగన్నా ముందుకు వెయ్యాలి’’ అని ప్రతిన పూనింది.

శారదలో ఉత్సాహాన్ని చూసి సుబ్బమ్మ అన్నపూర్ణను నూరేళ్ళు చల్లగా  ఉండమని మనసులోనే మరీ మరీ దీవించింది.

***

శారద మెడికల్‌ కాలేజీలో చేరిన రోజు సుబ్బమ్మ పండగ చేసింది. రామారావు మాట నిలబెట్టానన్న ఉత్సాహంతో ఆమె బంధువులందరికీ విందు చేసింది. శారద తండ్రిని తలచుకుని బాధ, ఆయన కోరిక తీరుస్తున్నందుకు సంతోషమూ..

రోజులు  సంవత్సరాలవుతున్నాయి. శారద ఇంటిని యువజన విద్యార్థి కేంద్రంగా చేసింది. శారదతో పాటు చదివేవాళ్ళే కాదు, ఏ చదువుకో మద్రాసు వచ్చిన ఉద్యమపు ప్రవాహంలో పడినవాళ్ళు, చదువు, ఉద్యమం రెండిరటిలో రెండు            కాళ్ళుంచినవాళ్ళు, చదువు మాని ఉద్యమంలోకి దూకిన వాళ్ళు, ఉద్యమంలో ఇమడలేక బైటికి వచ్చి నిరాశలో మునిగిన వాళ్ళు ఇలా ఎంతమంది యువకులకో మద్రాసులో శారద ఇల్లొక నెలవు. కొందరు నెలల తరబడి ఉండిపోయేవాళ్ళు. వాళ్ళందరి చర్చతో ఆ ఇల్లు  వేడెక్కేది.

నిరాశతో కుంగి వచ్చిన వాళ్ళలో శారద ఉత్సాహం నింపేది. భుజం తట్టి పంపేది. అందరూ శారదనూ ‘‘అక్కా’’ అని ఆత్మీయంగా పిలిచేవారు. శారదకంటే పెద్దవారు ‘‘అమ్మా శారదా’’ అంటూ ఆప్యాయంగా పిల్చేవారు. శారద ఇంటికి ఉద్యమం అని పేరు పెట్టింది. చిత్రకళలో ప్రవేశమున్న విద్యార్థి ఒక చిత్రాన్ని ఉద్యమమనే పేరుని గట్టి అట్టమీద గీసి ఇంటి వరండాలో తగిలించాడు.

Image (12)

‘‘పోలీసు అడిగితే నీ పేరే చెప్తా’’ అని అతన్ని ఏడిపించేది శారద. రామారావు ఉన్నరోజుల్లో ఆ ఇంటికి వయసులో, పాండిత్యంలో, అనుభవంలో తలపండిన పెద్దలొచ్చేవారు. ఇపుడు వేడిరక్తపు ఉరకు, దేశం కోసం సర్వం అర్పించానే తపన ఉన్న యువకులు  వస్తున్నారు. సుబ్బమ్మకు ఎవరైనా ఒక్కటే. అందరికీ అన్నం పెట్టి ఆదరించటం వారి ప్రేమను పొందటం.

శారద అపుడపుడూ కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు  గారి దగ్గరకు, ప్రకాశం పంతులు  గారింటికీ వెళ్ళొస్తుంది. హరిగారు వచ్చి వీరి యోగక్షేమాలు  విచారించి వెళ్తారు. రామారావు మరణం వీరిద్దరినీ ఎంత తాకిందో హరిగారినీ అంతే తాకింది. శారదను చూసి తన స్నేహితుడిని చూసినట్లు సంతోషపడేవారు. వీరి ముగ్గురి నుంచీ ఆమెకు పిత్రువాత్సల్యం దొరుకుతోంది.

ప్రజను ఉత్తేజపరిచేలా ఉపన్యాసాలివ్వటం నేర్చుకోవాలనుకుంది శారద. కాకినాడ సభలో ఉపన్యాసాలతో ప్రజను ` ఉత్సాహ పరిచిన పొణకా కనకమ్మ ఇంకా ఇతర మహిళా నాయకులను చూసిన తర్వాత శారదకు మాటకున్న శక్తి అర్దమయింది.

ఒకనాడు ఉదయాన్నే లేచి మైలాపూర్‌ బీచికి బయలు దేరింది. ఇంకా సరిగా తెల్లవారనే లేదు. సముద్రపు ఒడ్డున జన సంచారం పెద్దగా లేదు. శారద అలలకు దగ్గరగా వెళ్ళింది. ఆ ప్రశాంతమైన ఉదయాన కూడా అలలు ఎగసిపడుతున్నాయి. హోరెత్తుతూనే ఉన్నాయి. శారద గొంతెత్తి ఆ అలలనుద్దేశించి మాట్లాడటం మొదలు పెట్టింది. స్వాతంత్య్రం అవసరమేమిటో ఆ అలలకు అర్థమయ్యేలా, ఎక్కడో దూరాన సాగరగర్భంలో పుడుతున్న అలలకు వినిపించేలా గంభీరంగా, గట్టిగా మాట్లాడుతోంది శారద. కంఠస్వరానికి, వాగ్ధోరణికి ఇది మంచి వ్యాయామ మనిపించింది. ఆ రోజు నుంచీ ప్రతిరోజూ తెల్లవార్జు ఝామునే  లేచి కాసేపు చదువుకుని, ఆ తర్వాత సముద్రపు ఒడ్డుకి చేరటం, అలలకు ఒక ఉపన్యాసం ఇవ్వటం శారదాంబకు అవాటైంది. అసలే మాటకారి. ఏం మాట్లాడినా సూటిగా స్పష్టంగా, అర్థవంతంగా మాట్లాడే శారద మరింత పదును తేలింది.

ఎవరూ వినటం లేదనే ఆలోచన స్వేచ్ఛనిచ్చేదేమో. ఎంతో సంతోషపడేది ఆ ఉదయపు ఉపన్యాసానికి.

ఆ శనివారం ఉదయం కూడా శారద తనను తాను మర్చిపోయి, ఉపన్యాసంతో అలల హోరుని చిన్నబుచ్చుతుండగా పక్కన ఎవరో నవ్వినట్లయి తిరిగి చూసింది. ఎవరో యువకుడు నవ్వుతున్నాడు. శారదకు కోపం వచ్చి వెంటనే ముఖం పక్కకు తిప్పుకుంది. అతను మరింత దగ్గరకు వచ్చి ‘‘ఎవరికి నీ ఉపన్యాసం?’’ అని అడిగాడు.

‘‘వినగలిగిన వాళ్ళందరికి’’ శారద తొణకకుండా సమాధానమిచ్చింది.

‘‘ఉపన్యాసం ఇవ్వాలని ఉందా? ఎవరూ వేదిక మీదకు పిలవటం లేదా? నాకు ప్రకాశం గారు తెలుసు. ఆయనతో నీ గురించి చెప్పి నిన్ను పిలిచేలా చెయ్యగలను.’’ కాస్త చిలిపితనం కగలిపి మరీ నవ్వాడు.

‘‘నేనెవరో తెలుసా?’’ తీవ్రంగా అడిగింది.

‘‘నాకెలా తెలుస్తుంది? మొదటిసారి చూస్తున్నా. సహాయం చేద్దామనుకున్నా. అంత కోపం వచ్చే పని నేనేం చేశాను. అలా చూస్తున్నావు?’’ పరిహాసం ఆగనంటూ అతని గొంతులోంచి బైటికొస్తోంది.

‘‘మొదటిసారి చూసి పలకరించే వాళ్ళను మర్యాద లేకుండా ఏకవచనంలో మాట్లాడతారా? అడగని సహాయానికి హాస్యంగా పూనుకుంటారా?’’

ఆ యువకుడికి తన ఎదుట ఉన్న యువతి సామాన్యురాలు  కాదని అర్థమైంది.

‘‘క్షమించండి. నా పేరు సత్యనారాయణ మూర్తి. లా చదివాను. ప్రకాశంగారి దగ్గర పనిచేస్తుంటే ఆయన కాస్తా ప్రాక్టీసు మానేశారు. నా తిప్పలు  నేను పడుతూ, స్వతంత్ర ఉద్యమంలో చేయగలిగింది చేస్తున్నా’’.

‘‘నా పేరు శారదాంబ. మా నాన్నగారు రామారావుగారు. చరిత్ర పరిశోధకులు. ఇపుడు కీర్తిశేషులు. నేను మద్రాస్‌ మెడికల్‌ కాలేజీలో మూడవ సంవత్సరం చదువుతున్నాను. ప్రకాశం గారు నాకు పినతండ్రి వంటి వారు.’’

మూర్తి మొఖం వెలవెలబోయింది. ఆ యువతితో ఆషామాషీగా మాట్లాడటం ఎంత తప్పో తెలిసి వచ్చింది. తెలివి, తీక్షణత, ధైర్యంతో మెగుతున్న ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయాడు.

శారద అక్కడినుంచి కదిలి ముందుకు నడిచింది.

‘‘నన్ను క్షమించండి. అపరాధం చేశాను’’ అన్నాడతను.

‘‘అలాగే క్షమించాను. మళ్ళీ ఎవరిదగ్గరా ఇలాంటి అపరాధాలు  చేసి క్షమాపణు అడిగే పరిస్థితిలో పడకండి’’ అంటూ ధీమాగా నడుచుకుని వెళ్ళిపోయింది శారద.

మూర్తి అలాగే నిబడిపోయాడు. శారద రూపం, వ్యక్తిత్వం అతని మనసులో అలజడి రేపాయి. ఆ అలజడి అతనికి అర్థం కాలేదు.

‘‘ఎంత అపురూపం ఇలాంటి యువతి’’ అనుకున్నాడు. అర్థంకాని ఆలోచనలతో సతమతమవుతూ ఆలస్యంగా ఇల్లు  చేరుకున్నాడు. మర్నాడు ఉదయం శారద కోసం ఎదురు చూస్తూ సముద్రపు ఒడ్డున నిలబడక తప్పని మానసిక స్థితిలో పడ్డాడు.

శారద అతన్ని గమనించనట్టు తనురోజూ నిబడే చోట నిబడి ఉపన్యాసం ప్రారంభించింది. అరగంట గడిచాక ఆ వాక్ప్రవాహం ఆగింది. మూర్తి మెల్లగా  శారద పక్కన చేరాడు.

‘‘మీరు చాలా బాగా మాట్లాడారు. కానీ ఒక పొరపాటు చేశారు.’’

‘‘పొరపాటా? ఏంటది’’ ఆశ్చర్యంగా అడిగింది శారద.

‘‘పొరపాటంటే పొరపాటు కాదు. బ్రిటీష్‌వాళ్ళు మన కులవృత్తున్నిటినీ నాశనం చేశారనే మాట ఒకసారి అన్నారు.’’

‘‘ఔను’’

‘‘కులవృత్తులు  ఉండాలా?’’

‘‘అంటే?’’

‘‘అంటే ఏ కులంలో పుట్టినవాళ్ళు ఆ వృత్తే చెయ్యాలా?’’

‘‘కాదు. కాదు. అది నా ఉద్దేశం కాదు’’.

‘‘అది కాదని నాకు తెలుసు.  అలాంటపుడు కులవృత్తునే మాట ఎందుకు? చేతివృత్తులంటే  సరిపోదా?’’

శారద ఇపుడు అతన్ని తేరిపార చూసింది. తెలివిగా ఉన్న అతని ముఖంలో సన్నని చిరునవ్వు ప్రకాశిస్తోంది. ఎత్తుగా, బలంగా, తెలివిగా ఉన్న ఆ యువకుని చూసిన శారదకు మొదటిసారి ఒక పురుషుని చూసిన స్పందన కలిగింది. ఆ స్పందన అంతకు ముందు ఎరగనిది. ఒక నిముషం పాటు సర్వం మర్చిపోయి అతన్ని చూస్తూ ఉండిపోయింది. అతనికి శారద అనుభూతి అర్థమైంది. అర్థమై ఒక రకమైన గర్వం కలిగింది. దానిని దాచుకునే వ్యవధానం తీసుకుని అతను మళ్ళీ మాట్లాడాడు.

Image (12)

‘‘ఇంకొక విషయమేమిటంటే మీరు బ్రిటీష్‌వాళ్ళ నుంచి స్వతంత్రం పొందిన అమెరికా స్వతంత్ర పోరాటాన్ని గురించి మాట్లాడుతున్నారు. బాగుంది. అమెరికా స్వతంత్ర పోరాటానికి, మన ఉద్యమానికి మీరు తెచ్చిన పోలికా బాగుంది. వాళ్ళు బ్రిటీష్‌వాళ్ళ తేయాకును బహిష్కరించినట్లే మన విదేశీ వస్తు బహిష్కారం ఉంది. అంతా నిజమేకాని మనకివాళ అమెరికా ఆదర్శం కాదు అనిపిస్తుంది. అమెరికాలో నల్ల వాళ్ళ బానిసత్వం అలాగే ఉంది. సోవియట్‌ యూనియన్‌లో సమానత్వం రాజ్యమేలుతోంది’’.

శారద ఆలోచనలో పడింది.  సోవియట్‌ యూనియన్‌ గురించి ఆమె విన్నది. కొంత అక్కడా, అక్కడా చదివింది ` ఉన్నవ వారి ‘‘మాలపల్లి’’ నవల చదివి రష్యా విప్లవం గురించి తండ్రినడిగి కొంత తెలుసుకుంది. కానీ దాని గురించి సాధికారికంగా ప్రస్తుతం మాట్లాడలేననుకుంది.

‘‘మీరు చెప్పిన విషయా గురించి ఆలోచిస్తాను. రేపు కలుద్దాం’’ అతనికి నమస్కారం చేసి చకచకా నడిచి వెళ్ళిపోయింది.

‘‘రేపు కలుద్దాం’’ అనే మాట మూర్తిలో ఎన్నో అనుభూతులు  రేపింది. ఉత్సాహంగా ఇంటికి వెళ్ళాడు.

శారద ఆ రోజు కాలేజీలో ఉన్నదన్నమాటేగాని మనసంతా సోవియట్‌ యూనియన్‌ గురించిన ఆలోచనలే నిండిపోయాయి.

ఆ ఆలోచనలు  పంచుకోటానికి విద్యార్థి మిత్రులు, వార్తాపత్రికా విలేఖరులూ  నిత్యం శారదా వాళ్ళింట్లో ఉండనే ఉంటారు.

ఆ రోజు సాయంత్రం వాళ్ళందరి మనసుల్లో సోషలిజం అనే భావన నిండేలా మాట్లాడింది  శారద. వాళ్ళంతకు ముందు ఆ మాట వినలేదని కాదు. కానీ శారద ఆ మాట వాళ్ళ మనసుల్లో ఇంకేలా మాట్లాడిరది. మొదటిసారి అందరికీ సోషలిజం గురించి నిజమైన ఆసక్తి కలిగింది. ఒకరిద్దరు యువకులు  మన మతాచారాలకు అది సరిపడదన్నా మిగిలిన యువకులందరూ సోషలిజం గురించి కగనటం మొదుపెట్టారు. అదొక కొత్త కల. దేశంలోని యువతరానికి అప్పుడప్పుడే అందుతున్న కల. అస్పష్టమైన ఆశను రేకెత్తించే అందమైన ఊహ. ఆ ఊహ గురించిన స్పష్టమైన రూపాన్ని దర్శించేందుకు ఆరోజు సాయంత్రం శారద చేసిన ప్రయత్నంలో అప్రయత్నంగా భాగస్వాములై పోయారు.

‘‘మన కాంగ్రెస్‌ పెద్దలు  సోషలిజం అంటే ఎందుకింత భయపడుతున్నారు’’ రామకృష్ణ అసహనంగా అడిగాడు.

‘‘గాంధీగారు కూడా టాల్‌స్టాయ్‌ గురించి మాట్లాడతాడు గానీ లెనిన్‌ గురించి మాట్లాడడేం’’.

‘‘రష్యాకూ మనకూ తేడా లేదా? లెనిన్‌ వాళ్ళ దేశపు నిరంకుశ రాజరికంతో యుద్ధం చేశాడు. మనం పరాయి ప్రభువుతో యుద్ధం చేస్తున్నాం. దానికి ఇక్కడి రాజు, ధనికు సాయం కూడా కావాలి కదా ` లేకపోతే వాళ్ళు పూర్తిగా బ్రిటీష్‌ వాళ్ళతో కలిసిపోతారు.’’

‘‘కలిస్తే వాళ్ళకేం కలిసొస్తుంది? నాశనమవుతారు.’’ సుదర్శనం కసిగా అన్నాడు.

‘‘బ్రిటీష్‌ వాళ్ళు వాళ్ళకు రొట్టె ముక్క విసిరేసి లోబరుచుకుంటారు.’’

‘‘అందుకని మనం రొట్టెంతా వాళ్ళకివ్వాలా? ఏ రాయి అయితేనేం పళ్ళూడగొట్టుకోటానికి’’ విశ్వనాధం కోపంగా అడిగాడు.

‘‘ముందు బైటి శత్రువుని తరిమితే తర్వాత లోపలి వాడి సంగతి చూడొచ్చు’’ బాపయ్య తన లోపలి ఆలోచన బైటపెట్టాడు.

‘‘ఏమో నాకు నమ్మకం లేదు’’. మల్లికార్జునరావు ఎప్పుడూ ఈ మాటే అంటాడు. అతనికి దేనినైనా నమ్మటం గురించి నమ్మకం లేదు.

‘‘అందుకే నిన్ను నిరాశావాది అంటాం’’ గోవిందరెడ్డి వెక్కిరించాడు.

‘‘కాంగ్రెస్‌లో ఆశ కన్పించకపోతే ఇక నిరాశేనా? వేరే దారు గురించి ఆలోచించాలి గదా’’ రామకృష్ణయ్య.

‘‘వేరే దారి కనిపించేదాకా కాంగ్రెస్‌లో ఉండాంటే కంపరంగా ఉంటోంది. రాజు, జమీందార్లు, కాంగ్రెస్‌ అధికార పీఠాలకెక్కుతుంటే మనం వాళ్ళకు విధేయుమై ఉండాలా.’’ సుదర్శన్‌ కళ్ళు ఊరికే ఎర్రబడతాయి.

‘‘గాంధీని చూసి ఉండాలి’’.

‘‘నాకు గాంధీ మీద కూడా నమ్మకం పోతోంది.’’

‘‘నీది మరీ విడ్డూరం. ఎవరెలా ఉన్నా గాంధీ దేశానికి మేలు చేస్తాడు’’.

‘‘చూస్తాంగా’’

‘‘కాంగ్రెస్‌ని కాదని ఏం చేస్తాం? ప్రజంతా దానితో ఉన్నపుడు కొత్త దారిలో నడవటమంటే జనం మనల్ని పిచ్చి వాళ్ళంటారు. ఆ ముద్ర పడిందా  మనకు మోక్షం లేదు.’’ బాపయ్య బాధగా అన్నాడు.

‘‘కాంగ్రెస్‌లో ఉంటూనే కాంగ్రెస్‌ని మార్చాలి’’.

‘‘నువ్వే మారతావేమో’’ అందరూ నవ్వారు.

‘‘ఊరుకోండి. రామకృష్ణ, శారదక్క చెప్పింది నిజం. మనం కాంగ్రెసులో ఉంటూనే ఒక గ్రూపుగా మనదారి వెతుక్కొవాలి. మన గమ్యం ఒట్టి స్వతంత్రం కాదు. శారదక్క చెప్పిన సోషలిస్టు స్వతంత్రం’’ గోవిందరెడ్డి మాటతో అందరూ నిశ్శబ్ధమై పోయారు.

శారద ఆ ఉద్రిక్త వాతావరణాన్ని మార్చాలనుకుంది. అందరూ కాస్త చల్ల బడేలా సన్నగా ఒక పాట అందుకుంది. అది దుర్గ కాంగ్రెస్‌ సభలో పాడిన పాట. ఆ సభలో బాలికలు  యువతులూ  దుర్గ వెనకా నడుస్తూ దుర్గ గొంతులో గొంతు కలిపి ఆ పాట పాడేవారు.

‘‘మేలు  కొనుమా భరతపుత్రుడ

మేలు  కొనుమా సుజన మిత్రుడ

వేడుకను జాతీయత అను

వేగుచుక్కా పొడిచెనదిగో

కూడి వందే మాతరమ్మని ` కుక్కుటము రచెన్‌’’.

ఒకవైపు రాత్రయిపోయింది. నువ్వు మేలుకోమంటున్నావక్కా.

ఇపుడు నిద్రొస్తోంది. రేపు కోడి కూసే వేళకు పాడుతూ లేపు’’ అంటూ లేచాడు సుదర్శనం.

‘‘లేదు. లేదు. మనం అర్థరాత్రే నిద్రలేవాలి’’.

‘‘అసలు  నిద్ర పోకూడదు’’.

‘‘నిద్ర పోకపోతే ఇంక మేలుకొలుపు గీతాలెందుకు? ఎవరికి?’’ అందరూ గోలగోలగా అరుస్తూ నవ్వుతూ లేచి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళారు.

మర్నాడు శారద పెందలాడే లేవలేకపోయింది. బీచ్‌కి వెళ్ళటం కుదరలేదు. కాలేజీకి వెళ్ళటానికే హడావుడి అయింది.

సాయంత్రం కాలేజ్‌ నుంచి వచ్చాక కొన్ని పుస్తకాు తెచ్చుకోవాని కాశీనాధుని నాగేశ్వరరావు గారింటికి వెళ్ళేందుకు తయారైంది. సుబ్బమ్మ తానూ వస్తానంది గానీ తీరా బయల్దేరే సమయానికి బంధువులొచ్చారు.

కాశీనాథుని వారింటి గేటు తీసుకుని లోపలికి వెళ్తూ ఎదురుగా వస్తున్న యువతిని చూసి ఆగింది శారద. ఎక్కడ చూశానీమెను? అనుకుంటూ దగ్గరకు వెళ్ళింది. ఇద్దరూ ఆగి ఒకరినొకరు పరిశీలనగా చూసుకున్నారు. ‘‘శారద’’ అంటూ దుర్గ ఒక్కసారిగా శారద భుజాూ చేతుూ పట్టుకుని కుదిపేసింది. శారద దుర్గను చూసిన సంతోషంతో ఉక్కిరిబిక్కిరయింది. కాకినాడలో  చూడటమే ` ఐదేళ్ళు దాటిపోయింది. అప్పటి పద్నాుగేళ్ళ దుర్గ ఇరవై ఏళ్ళదయింది. శారద మరో మూడేళ్ళు పెద్దది. దుర్గ ముఖంలో కాకినాడ రోజునాటి అల్లరి, అమాయకత్వం పోయి గాంభీర్యం, ధీమా వచ్చాయి. శారద ముఖం జ్ఞానంతో, ప్రేమతో ప్రకాశిస్తోంది. ఒకరినొకరు పరిశీలనగా చూసుకుని ఎదుటివారిలో వచ్చిన మార్పు చూసి నవ్వుకున్నారు.

‘‘దుర్గా! బాగున్నావా? ఎప్పుడొచ్చావు? ఎక్కడుంటున్నావు?’’

‘‘ఇక్కడే ` పంతులు  గారింట్లోనే. మా ఆయనగారి ఆరోగ్యం బాగోలేదు. ఇక్కడ వైద్యానికని తీసుకొచ్చా’’

‘‘అలాగా ` నేను చూడనా?’’ కాస్త కంగారు పడిరది శారద.

‘‘నువ్వు డాక్టర్‌వై పోయావా?’’

‘‘ఇంకా పూర్తి కాలేదు. రెండేళ్ళు ఆగాలి. కానీ కొంత తొసు. ఊరికే చూస్తాను. మా కాలేజీ ఆసుపత్రిలో పెద్ద వైద్యులున్నారు. చూపిద్దాం’’.

‘‘ఆచంట లక్ష్మీపతి గారు చూస్తున్నారు. వారి అనుమతి లేకుండా ఎవరికీ చూపించను’’.

ఇద్దరూ లోపలకు వెళ్ళారు. శారద తనొచ్చిన పని పక్కన బెట్టి దుర్గతో మాట్లాడుతూ ఉండిపోయింది.

ఇద్దరూ దేశ పరిస్థితుల గురించి ముచ్చటించుకున్నారు.

‘‘ఇలా మందకొడిగా ఉంటే లాభం లేదు. ఉప్పెన రావాలి’’ అంది దుర్గ.

‘‘గాంధీగారు ఎందుకిలా చేస్తున్నారు. ఆయన పిుపు ఇస్తే ఉప్నెనలాగా లేస్తారు ప్రజు’’.

‘‘తగిన సమయం కోసం చూస్తున్నారు. నాకు గాంధీజీ బాగా తెలుసు. ఆయన ఇంకెన్నాళ్ళో చూస్తూ ఊరుకోరు. ఆయన పిలుపు కోసం చూస్తున్నా. ఒక్కసారి ఆ పిలుపు వచ్చిందో ` ఇంక అన్ని బంధాలు  ఒదిలించుకుని వెళ్ళిపోతాను.’’.

‘‘నీ భర్త ` సంసారం’’. ఆశ్చర్యంగా అడిగింది శారద.

‘‘దేశం కంటే నాకు ఏదీ ఎక్కువ కాదు. ఇంతకూ ఇక్కడికి ఎందుకొచ్చావు?’’

‘‘ఏవో పుస్తకాల  కోసం. సరేగాని దుర్గా నీ భర్తను నువ్వు ప్రేమిస్తున్నావా?’’

‘‘ప్రేమంటే ఏమిటి శారదా?’’

‘‘నాకూ తెలియదు. చలం గారి శశిరేఖ, ఉన్నవవారి మాలపల్లి చదివాను. ప్రేమ గురించి అస్పష్టంగా ఏదో అర్థమైంది. స్త్రీలు  భర్తను ప్రేమించరా? నీ భర్త మీద నీకున్నదేమిటి? ప్రేమ కాదా?’’

‘‘ధర్మం. కర్తవ్యం. ఈ రెండే నాకు తొసు. ఆయన చాలా మంచి మనిషి. నేను దేవతననుకుంటారు. నాకు కష్టం కలిగించకూడదనుకుంటారు. అలాంటి మనిషిని సేవించటం నా ధర్మం అనిపిస్తుంది. కానీ దేశం గురించి ఆలోచిస్తే ఈ బంధం నివదనిపిస్తుంది. నువ్వన్న ప్రేమ నాకు దేశం మీద ఉందేమో ` దేశం గురించి ఆలోచించానా ఇక దేనిని లెక్కచెయ్యను. చివరికి ప్రాణాన్ని కూడా.’’

ఇద్దరూ కాసేపు దేశభక్తి భావనతో పుకితులై మౌనంగా ఉండిపోయారు.

‘‘నువ్వు పెళ్ళి చేసుకోవా శారదా?’’

‘‘పెళ్ళా ` చేసుకోను. నాకూ దేశం గురించి చాలా ఆలోచనున్నాయి. డాక్టర్‌గా నా వృత్తిధర్మం ఉంది. నేను ఈ రెండింటి మధ్యే నలుగుతున్నాను.’’

‘‘ఆ రెండింటి మధ్యలోకి పెళ్ళి, చేసుకున్నవాడిని ప్రేమించటం, ఇవన్నీ వచ్చి పడితే నీకు మరింత కష్టమేమో ` ’’

ఇద్దరూ నవ్వుకున్నారు.

‘‘పతిసేవే పరమార్థం అనేది ఒట్టిమాటనే అనిపిస్తుందా దుర్గా నీకు ` ’’

‘‘ఔను శారదా! కానీ ఎవరి పట్లా మన కర్తవ్యాన్ని మర్చిపోకూడదు. మోక్షం, పరమార్థం ఇవన్నీ నాకిప్పుడు దేశ స్వాతంత్య్రంలోనే కనిపిస్తున్నాయి’’.

‘‘అదృష్టవంతురాలివి. నీకు ఒకటే లక్ష్యం ఉంది’’ నిట్టూర్చింది శారద. ఉద్యమం గురించిన మాటతో వారికి సమయమే తెలియలేదు. దుర్గ ఒకవైపు భర్తకు కావాల్సినవి అమరుస్తూనే శారదతో మాట్లాడుతోంది. రాత్రి పొద్దుబోయాక ఇల్లు చేరిన శారద తల్లితో దుర్గ కబుర్లు చెబుతూ ఆమె పక్కనే పడుకుని నిద్రపోయింది.

భళ్ళున త్లెవారాక లేచిన శారద ‘‘ఈ రోజూ బీచ్‌కి వెళ్ళలేనా’’ అనుకుంది.

‘అతను ఒస్తాడేమో’ ఆ ఆలోచనే ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. త్వరత్వరగా పనులు  ముగించుకుని బీచ్‌కి పరుగులాంటి నడకతో చేరింది.

దురాన్నించే అతన్ని పోల్చుకుంది. సముద్రాన్ని తన వెనక ఉంచుకుని శారద కోసం చూస్తున్నాడతను. శారద అతని దగ్గరగా రాగానే ‘‘నేనూ సముద్రమూ, రెండు రోజుగా మీ కోసం చూస్తున్నాం’’ శారద గలగలా నవ్వింది. శారదకు నవ్వే అందం. ఆమె ఆనందంగా నవ్విందంటే ఆ సౌందర్యాన్ని పట్టలేం. ఆ నవ్వు చూసి మూర్తి ఏమయ్యాడో అతనికే తెలియాలి.

‘‘ఏంటలా చూస్తున్నారు?’’

‘‘మీ నవ్వు ` ఎంతో బాగుంది’’

శారద మళ్ళీ నవ్వింది.

‘‘ఇంకా బాగుంది’’.

మళ్ళీ మళ్ళీ సముద్రపు హోరులో జలపాతపు జడి కగలిసినట్లు నవ్వింది.

‘‘శారదా’’ అని ఉద్వేగంతో ప్రేమతో పిలిచాడు మూర్తి.

ఆ పేరు తనదనీ, ఆ పేరే తననీ మొదటిసారిగా శరీరంలోని ప్రతి అణువుతో అనుభూతి చెందింది శారద.

‘‘మళ్ళీ పిలవండి’’

‘‘శారదా’’ గాఢానుభూతితో పిలిచాడు.

అంతవరకూ శారదను అందరూ పేరుపెట్టి పిలుస్తూనే ఉన్నారు. కానీ ఇంత హాయి అయిన  అనుభూతి ఆమెకెన్నడూ కలగలేదు. ఆ ధ్వని తరంగాలు  ఆమె శరీరంలోని ప్రతి అణువునీ స్పందింపచేశాయి. చలింపజేశాయి. అనుకోకుండానే ముందుకు సాచిన మూర్తి చేతులో తన చేతుంచింది శారద. ఐదు నిముషాపాటు ఆ స్పర్శ వారిని ఈ లోకంలోంచి ఎక్కడికో తీసుకెళ్ళింది. శారద మెల్లిగా తన చేతిని అతని చేతి నుంచి ఒదిలించుకుని వెనక్కు తిరిగి నడుచుకుంటూ ఇంటికి వెళ్ళింది.

ఈ కొత్త అనుభూతి గురించి అన్నపూర్ణకు చెప్పాలనిపించింది. అబ్బయ్య, అన్నపూర్ణ ఎంతో ప్రేమగా ఉంటారు. ఏం చేసినా వాళ్ళిద్దరూ కలిసి చేస్తారు. అలాంటి తోడు తనకు లేదు. స్నేహితులు  చాలామంది ఉన్నారు. కానీ ఇలా చేయి పట్టుకుని ఏదో తెలియని బలాన్నీ, విశ్వాసాన్ని ఇచ్చే వ్యక్తి ఇంతవరకూ తారసపడలేదు. అతని పేరు, వృత్తి తప్ప ఇంకేమీ తెలియకుండా ఇంత అలజడి ఏమిటి? జీవితంలో పెళ్ళికి చోటు లేదని గట్టిగా అనుకున్న తను ఇలాంటి అలజడికి లోనవ్వకూడదని శారదకు ఒక్కపక్క అంతరాత్మ హెచ్చరిస్తోంది. డాక్టర్‌గా సేవ, దేశ స్వతంత్రం ఈ రెండింటితో ఇంతవరకూ మనసు నిండింది.

ఇప్పుడు కొత్తచోటు ఏర్పడుతోందా? ఇన్నిటిని సంబాళించుకోగనా అనే ఆలోచనతో సతమతమయింది శారద. కాలేజీలో కూడా అన్యమనస్కంగానే గడిపింది.

సాయంత్రానికి ఈ ఆలోచను కట్టిపెట్టి తన పనిలో శ్రద్ధ పెట్టానుకుంది. ఆ రోజు రాత్రి చాలాసేపు చదువుకుంది. దానితో మనసులో ఆరాటం తగ్గి తన మీద తనకు విశ్వాసం కలిగి తృప్తిగా నిద్రపోయింది.

***

 

 

వాళ్ళ ‘ఇడా’, మన ‘దువిధా’!

 

ల.లి.త.

lalitha parnandiఇప్పుడు వస్తున్న చాలా సినిమాలు గతవైభవాల స్మరణా, భజనా చేస్తున్నాయి.  కాస్త పెద్ద బడ్జెట్ అయితే చాలు ఒకప్పటి అద్భుత మానవుల సంశయాలు, విజయాలే కథా వస్తువులు. Period films పేరుతో  ప్రేమ, ఈర్ష్య, బానిసత్వం, దురాశ లాంటి మానవ లక్షణాలు అన్నిట్నీ ముదురు రంగుల్లో ముంచి తీసి సినిమాకు పులుముతున్నారు.  ఆ కాలానికి చెందిన కుండా, చట్టీ, చెప్పూ, కారూ సినిమాలోకి ఎంత కరెక్ట్ గా తెచ్చి చూపించామా అన్నది  అసలు సినిమా కంటే పెద్ద గొడవై కూచుంది.  దాని తర్వాతది రక్తధారలు ధారాళంగా కురిపించటం. ఒక్క మాటలో Period,  Detail,  Graphic violence… ఈ మూడిటి మధ్యే  ఈనాటి సినిమా కుదించుకు పోయింది. 

ఈమధ్య ప్రపంచానికి అమెరికా ‘Game of Thrones’ అనే మహత్తర టీవీ సీరియల్ ను ప్రసాదించటంతో ఈ మూడు దినుసుల గిరాకీ మనకీ మరింత ఎక్కువ కాబోయే ప్రమాదం  కనిపిస్తోంది.  ఇంత పెద్ద పెద్ద డైనోసార్లలాంటి దేశ విదేశ సినీ హీరోల సినిమాల, సీరియళ్ళ హంగామా మధ్య వింతగా ఓ చిన్ని కుందేలు పిల్ల లాంటి  సినిమా మన వొళ్ళోకి వచ్చి కూర్చుని అలరించింది.  అది  2014 సంవత్సరానికి ఉత్తమ విదేశీ చిత్రంగా అకాడమీ అవార్డ్ అందుకున్న పోలిష్ సినిమా ‘ఇడా’. ఆస్కార్ ఆర్భాటాలే గానీ  ఉత్తమ విదేశీ చిత్రం అవార్డ్  పొందే సినిమాలు మన సినిమా హాళ్ళలోకి రావు. నిజానికి కొన్నిసార్లు ఇవే ఆస్కార్ లు గెల్చిన అమెరికన్ సినిమాల కంటే బాగుంటాయి.

‘ఇడా’ గురించి సినిమాప్రియుల్లో  చర్చ బాగా జరిగింది.  ఇదీ గతకాలపు కథనే చెప్పినా, ఇప్పటి గ్రాఫిక్ మహిమల మహా గాథలకూ ఏ అలంకారాలూ లేని ‘ఇడా’ కథకూ పోలికే లేదు.  దర్శకుడు పావెల్ పావ్ లోవ్ స్కీ, సినిమాటోగ్రాఫర్  లుకాస్ జాల్ కలిసి ఈ సినిమాను బెర్గ్ మన్,  బ్రెస్సోఁ  ల పక్కన కూచోబెట్టే ప్రయత్నం చేశారు. ఆ మహా దర్శకులను గుర్తుకు తీసుకొచ్చింది ‘ఇడా’.

తనవారు ఎవరూ లేని ‘ఇడా’ ఓ కాన్వెంట్ లో పెరుగుతుంది. సన్యాసినిగా ప్రతిజ్ఞలు తీసుకోబోయే ముందు ఆమెకున్న ఒకే ఒక్క బంధువు, ఆమె పిన్నిని ఓసారి చూసి రమ్మని పంపిస్తుంది కాన్వెంట్ మదర్.  తనకో పిన్ని ఉందని తెలియటం ఇడా కు పెద్ద ఆశ్చర్యం అయితే, తన  తల్లిదండ్రులు యూదులనీ,  రెండో ప్రపంచ యుద్ధకాలంలో బలైపోయారనీ తెలియటం ఊహకందని మరో వ్యథ.  వాళ్ళు ఎలా చనిపోయారో, ఎవరు చంపారో తెలుసుకునే అన్వేషణలో ఈ ఇద్దరు ఆడవాళ్ళూ బయలుదేరుతారు. ఒద్దికైన ఇడాకు పూర్తి వ్యతిరేక స్వభావం ఆమె పిన్నిది. ఈ ఇద్దరి అనుభవాలూ, భావాలూ, సహానుభూతులూ వైరుధ్యాల కెలైడోస్కోప్ ఈ సినిమా.

 

photo 2ఫ్రేమ్ ల పొదుపరితనంలో బ్రెస్సోఁ స్థాయి పరిపక్వతకు దగ్గరగా వచ్చేసింది ‘ఇడా’. మరి మొత్తమంతా ఓల్డ్ మాస్టర్స్ లాగే తీసేస్తే మన ముద్ర ఏదని ఆలోచించుకున్నారో ఏమో, ఫొటోగ్రఫీలో ఈ మధ్య ఎక్కువగా వాడుతున్న  ‘negative space’ ను సినిమాలోకి తెచ్చిపెట్టారు దర్శకుడూ సినిమాటోగ్రాఫర్ కలిసి.  జాగ్రత్తగా వాడకపోతే బెడిసికొట్టే మందు ఈ ‘negative spacing’.  ఫ్రేమ్ లో సబ్జెక్టు ఆక్రమించిన ప్రాంతం తప్ప, ఖాళీగా ఉన్న మిగతాదంతా negative space.   ఫ్రేమ్ లో సబ్జెక్టు (positive space) సైజు కంటే ఎక్కువగా వదిలేసిన ఆ ఖాళీకి సరైన అర్థం, తూగు ఇవ్వగల్గితే మంచి ఫోటో అవుతుంది.  ఇవ్వలేకపోతే అది అతి మామూలు  ఫోటోగా కూడా కాదు, వెర్రి ఫోటోగా మిగుల్తుంది.  ఇడా లో ఈ  ‘negative spacing’ సరిగ్గా సమకూడింది.  ప్రారంభంలోనే  ఇడా క్రీస్తు బొమ్మకు రంగేస్తూ సినిమా ఫ్రేమ్ కు కిందున్న ఎడమ మూలలో కనిపిస్తుంది. ఇలా సినిమా అంతా చాలావరకూ మూలల్లోనూ, ఫ్రేమ్ కి అడుగుభాగానా సర్దుకుంటారు ఇద్దరు ఆడవాళ్ళూ.  వాళ్ళ ఒంటరితనం, నిస్సహాయ పరిస్థితిని తోపింపచేయటం ఈ  ఫ్రేమ్ ల లక్ష్యం అనిపిస్తుంది. చివర్లో ఇడా తన బ్రతుకు గురించిన నిర్ణయాన్ని తీసుకుని అడుగులు వేసేటప్పుడు ధీమాగా  ఫ్రేమ్ లో సరిగ్గా కనిపిస్తుంది.

photo 3

సినిమా అంతా ఉట్టిపడే  పిక్టోరియల్ ఫోటోగ్రాఫిక్ దృశ్యాల గురించి చెప్పనే అక్కర్లేదు. వాటితో వచ్చే క్లాసిసిజం తిరుగు లేనిది.  అందులోనూ మళ్ళీ అందంగా కొత్తరకంగా పిక్టోరియల్ నియమాలు దాటేస్తూ వచ్చారు.  ఒక్కటి కూడా అనవసరమైన ఫ్రేమ్ కనిపించదు. 1:1.33 academy ratio లో తీయటం వల్ల ఈ పోకడలన్నీ సాధ్యపడ్డాయి. అంటే ఇప్పుడు మనం చూస్తున్న సినిమా స్కోప్ (దీర్ఘ చతురస్రం) కాకుండా పాత సినిమాల్లాగ నలుచదరంగా అన్నమాట. ఇంకా, ఒక సీన్లో మంచు మధ్యలో గుండ్రటి గట్టు మధ్య నిలబడి ఉన్న క్రీస్తు విగ్రహాన్ని  “Christ is the Key” అని తోచేట్లుగా తీసిన కెమెరా కోణం ఎంతటి ఊహ ఉంటే సాధ్యపడుతుంది?  ‘ఇడా’ కు వాడిన లైటింగ్ పధ్ధతి కూడా సినిమాటోగ్రాఫర్ లకు తెలిసిన పాఠాలనే మళ్ళీ కొత్తగా నేర్పుతుంది.  Linear narrative  గా ఉంటూనే  ‘ఇడా’ రూప ప్రధానమైన సినిమా కూడాను.  ఈ సినిమాటోగ్రఫీ విధానం చాలా ఆకర్షణీయంగా కొత్తగా ఉండటంతో ‘ఇడా’ ప్రేమలో పడి ఎడాపెడా దాన్ని చాలామంది దర్శకులూ సినిమాటోగ్రాఫర్ లూ వాడే అవకాశం కూడా ఉంది.  ఆ పని ఇప్పటికే మొదలైపోయి ఉండవచ్చు.

photo 4 (1)

 

మన దర్శకులూ, సినిమాటోగ్రాఫర్ లలో తెలివికి ఏ లోటూ లేదు. ‘ఇడా’ను సృష్టించినవాళ్ళు పడిన కష్టంలో పదోవంతైనా వీళ్ళు ఎప్పుడైనా పడి మనదైన సినిమాను తీస్తారా? ఏమో !

మనదైన సినిమా కోసం తపన పడ్డ దర్శకుడు రిత్విక్ ఘటక్.  ప్రాచీనం కాని సినిమా మీడియంలో ప్రాచ్యాన్ని దర్శింపజేయాలన్న ఆశయం ఆయనది.  భారతీయ సినిమాలో మణి కౌల్, కుమార్ సహానీలది రిత్విక్ ఘటక్ స్కూల్.  ఇది రూప(form) ప్రధానం. దీన్ని సాధించి ఒప్పించటం కష్టం.  ‘మో’ కవిత్వంలా, త్రిపుర కథలా సరిగ్గా కుదిరితే formalist  సినిమా బ్రహ్మానందాన్నిస్తుంది.  ఏపాటిగా అటుదిటైనా తేలిపోయి నవ్వులపాలై పోతుంది. కుమార్ సహానీ తీసిన ‘మాయా దర్పణ్’, మణి కౌల్ తీసిన ‘ఉస్కీ రోటీ’  1970ల్లో formalist సినిమాలు గా చెల్లిపోయినా ఇప్పుడు చూస్తే అర్థంపర్థం లేనట్టు ఉంటాయి. అనురాగ్ కాశ్యప్ 2007 లో తీసిన ‘నో స్మోకింగ్’ ఓ మంచి formalist సినిమా.  కానీ కాశ్యప్ కు మన కళలతో, భారతీయాత్మతో పెద్దగా అనురాగం లేదు.

‘ఇడా’ చూశాక మణి కౌల్ పూర్తిగా శిల్ప ప్రాధాన్యతతో  ఏ తడబాటూ లేకుండా 1970 ల్లో తీసిన ‘దువిధ’ గుర్తుకు వచ్చింది. ‘దువిధ’ ఒక రాజస్తానీ జానపద కథ.  విజయ్ దన్ ధేతా కథనం. ఈయన కథలన్నీ ‘సందిగ్ధ’ పేరుతో సంకలనంగా తెలుగులోకి కూడా అనువాదం అయాయి.  దువిధ అంటే సందిగ్ధత. కొత్తగా పెళ్ళయిన అమ్మాయి, అబ్బాయి పల్లకీలో వెళ్తుండగా చెట్టునున్న ఒక దయ్యం చూసి, ఆ అమ్మాయిని ప్రేమిస్తాడు.  ఎంతసేపటికీ కాసులు లెక్క పెట్టుకునే ఆ అబ్బాయి కొత్త పెళ్లి కూతుర్ని తన తల్లిదండ్రులతోనే వదిలేసి వేరేచోటికి వ్యాపారం చెయ్యటానికి వెళ్ళిపోతాడు. ఈ అవకాశం పోగొట్టుకోకూడదని ఆలోచించిన దయ్యం ఆ అబ్బాయి రూపంలో ఈమె దగ్గరకు వచ్చి భర్తగా ఉండిపోతాడు. (నిజాయితీగా తానెవరో ఆమెకు చెప్పి మరీ).  కొన్నేళ్ళు దయ్యంతో సుఖంగా గడిపేక ఆమె గర్భవతి అవుతుంది. తమ వంశం కొత్త చిగురు వేస్తోందని పెద్ద షావుకారు ఊరందరికీ బెల్లం పంచుతాడు.  ఈమె పురిటి నొప్పులు పడుతున్న సందర్భంలో అసలు భర్త తిరిగొస్తాడు. ఈ ఇద్దరు అబ్బాయిల్లో ఎవరు తన కొడుకో పోల్చుకోలేక గాభరా పడతాడు పెద్ద షావుకారు.  చివరకు ఒక గొర్రెల కాపరి తన జిత్తులమారితనాన్నంతా ఉపయోగించి, దయ్యాన్ని పట్టిస్తాడు.  ప్రేమను ఇచ్చి పుచ్చుకున్న దయ్యం అంతమైతే ఆమె మాటలేక మౌనమైపోతుంది.

photo 5

photo 6

ఈ కథను formalist cinema గా తీయటానికి పూనుకున్నాడు మణి కౌల్. భారతీయ చిత్రకళ అతను ఎంచుకున్న form.  మన చిత్రకళలో పొడవూ, వెడల్పేగానీ మూడో కొలత అయిన లోతు కనిపించదు. ఈ చిత్రకళా రూపాన్ని సినిమాలోకి తర్జుమా చెయ్యాలంటే ఎలా?  దానికోసం ఎక్కువగా లాంగ్ ఫోకస్ లెన్స్ ను వాడాడు.  అది ఫ్రేమ్ లో ‘లోతు’ కొలతను అసలు రానివ్వదు. అంటే  ఫ్రేమ్ లో దగ్గరగానూ దూరంగానూ ఉన్న వస్తువులూ, మనుషులూ, బ్యాక్ గ్రౌండ్, అన్నీ కూడా మన పెయింటింగ్స్ లా ఒకే తలంలో కనిపిస్తాయి.  ఈ flatness మీద  గాఢమైన రంగులు, విభిన్నమైన కెమెరా కోణాలు ప్రయోగించి మేజిక్ చేశాడు మణి కౌల్.  (కాఫీని ‘వట్టి గోధుమరంగు వేడి ఊహ’ గా మార్చిన త్రిపురలా)  ‘హై కీ’ ఫోటోగ్రఫీని వాడటంతో లేతరంగు గోడలు, ఆర్చ్ లూ నీటి రంగుల చిత్రంలో తడి ఆరుతున్న కుంచె గీతల్లా కానవస్తాయి. కదిలే ఇంప్రెషనిస్టిక్ పెయింటింగ్ లా ఉంటుంది ‘దువిధ’ సినిమా.  వేదనా భరితమైన రాజస్తానీ జానపద గీతాలూ, రంగుల తలపాగాలూ పెయింటింగ్ లోని ముఖ్యమైన డీటెయిల్స్ లాగా భాసించాయి.  ఇన్ని చేసీ,  ఇంత గొప్ప డ్రమటిక్ కథలోంచి ‘డ్రామా’ ను (డ్రామా మన భారతీయ పద్ధతే అయినా!) పూర్తిగా బైటకు గెంటేసి non-narrative style ను అనుసరించాడు మణి కౌల్.  అయినా ‘దువిధ’ చూస్తుంటే విషాదాన్నీ ఆనందాన్నీ తూలికతో మనసుమీద ఎవరో తేలికగా అద్దిన భావనకు లోనవుతాం. అలా అది ఓ అర్థవంతమైన formalist  సినిమాగా నిలుస్తుంది. తూర్పుమీద కాస్తగా పడమరను పూసి  తనదైన కళ నిండిన సినిమాను సృష్టించాడు మణి కౌల్.

photo 7

photo 8

‘ఇడా’, ‘దువిధ’ … రెండూ తీరికగా ఆలోచించి, ధ్యానించి తీసిన సినిమాలు.  రెండిటిలోనూ స్త్రీ ‘సందిగ్ధ’ యే.  రెండిటిలోనూ రూప సారాలు ఒకదానికొకటి మంచి నేస్తాల్లా నిలబడ్డాయి.  రెండిట్లోనూ అవి పుట్టిన నేల వాసన బలంగా  వస్తుంది. ‘ఇడా’ కొన్ని క్లాసిక్ ఫోటోల కూర్పులా ఉంటే దువిధ పెయింటింగ్ ల సమాహారంలా ఉంటుంది.  తేడా ఒకటే. ‘ఇడా’ మామూలు పద్ధతిలో చెప్పిన కథ. ‘దువిధ’ non narrative గా మరింత ఎక్కువగా మేథో విన్యాసం చేస్తుంది.

ఆఖరుగా దర్శకుడు రాబర్ట్ బ్రెస్సోఁ ని మరోసారి స్మరిద్దాం. ఆయన అభిప్రాయంలో ఫిల్మ్ మేకర్ పని సృష్టించటం కాదు. జరుగుతున్నదాన్ని గుర్తించటం. కెమెరా ఆన్ చేసి దృశ్యాన్ని, కదలికలనూ చూస్తూ పోతుంటే ఎక్కడో ఒక సరైన కదలిక, ఒక సరైన ఫ్రేమ్,  చాలా యాదృచ్చికంగా వస్తుందట. దాన్ని గుర్తించటమే  ఫిల్మ్ మేకర్ పని అంటాడు. కంప్యూటర్ గ్రాఫిక్స్ గ్రహణం సినిమాను కమ్మేస్తున్న రోజుల్లో ఇంతటి జెన్ ధ్యానం చెయ్యగల సినీ మహానుభావులు నూటికి ఒకరైనా ఉంటారా? ఉండకపోరు. వాళ్ళ వల్లే ఇలాటి సినిమాలు ఎప్పుడైనా ఓసారి వస్తుంటాయి.

*

 

 

 

 

 

 

 

 

 ప్రేమ మటుకే…

 

ఆకెళ్ళ రవి ప్రకాష్

నేను నిరాశగా
ఆనందం నించీ బహిష్క్రుతుణ్ణయి వున్నపుడు
ఎల్లపుడూ
ప్రేమ మటుకే
తనదారుల్ని తెరిచింది.
అందుకే నేననుకుంటాను
ప్రేమ మటుకే బ్రతికించగలదని.

బిడియాలని
సంకోచాలని విడిచి
ప్రేమలోకి ఎగరడానికి
ధైర్యం చేయగలిగితే
మనమంటే ఏమిటొ
వెలుగంటే ఏమిటొ
ప్రేమ మటుకే తేటతెల్లం చేస్తుంది

నిజానికి ప్రేమించడం అంటే
మన చుట్టూ మనం నిర్మించుకున్న
కారాగారాల గోడల్ని కూల్చడమే!

akella

గోదావరి గుండె తడి ఎండ్లూరి కవిత్వం

 

లక్ష్మణ్ ఆదిమూలం 

Lakshman copyనదీ పరివాహక ప్రాంతాలలోనే నాగరికత అభివృద్ది చెందుతాయి . నాగరికత ఉన్న చోటనే సాహిత్యం పుడుతుంది . నదికి సాహిత్యానికి అవినాభావ సంబంధం ఉంది .  . దక్షిణ భారత దేశంలోనే అతి పెద్ద నది గోదావరి . ప్రాచీన కాలం నుంచి ఆధునిక కాలం వరకు సాహిత్యంలో గోదావరి పయనాన్ని , తీర ప్రాంతాలలోని దేవాలయాలను వర్ణిస్తూ సాగిన సాహిత్యం అపారం.

ఆధునిక కాలంలో వచ్చిన దృక్పదంలో  కవిత్వంలో మార్పు వచ్చింది . సాహిత్యంలో కొత్త కోణం వెలుగులోనికి రావడం జరిగింది . అటువంటి కవిత్వం లోని రెండు కోణాలు ఎండ్లూరి సుధాకర్ రావు గోదావరి నది పై రాసిన కవిత్వంలో కన్పిస్తాయి . ఒక ప్రక్క గోదావరి అందాలను , గోదావరితో తనకు ఉన్న అనుబంధాన్ని కవిత్వీకరిస్తూనే , మరొక వైపు గోదావరి గుండె ఆవేదనను ఆవిష్కరించారు ఎండ్లూరి సుధాకర్ .

గ్రీష్మ కాలంలో గోదావరి స్వరూపాన్ని , ఎండిపోతున్న గోదావరిని చూసిన రచయిత తన గుండెలోని బాధని వ్యక్తం చేసాడు …

“నాన్న కొట్టినప్పుడు /ఒక మూల ముడుచుకొని

పడుకున్న అమ్మలా ఉంటుంది …

ఎండాకాలపు గోదావరి /నీటి కొవ్వు కరిగిపోతూ

పలచబడుతున్న  జలచర్మంతో /ఎనీమియా  పేషెంటులా ఎంతో జాలిగొలుపుతుంది “

గోదావరి నది చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యం , అందాలను వర్ణించడం , వాటిని చూసి మురిసిపోవడమే కాదు మరో కోణాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు రచయిత “ఒక సాయంత్రం గోదావరి “ అనే కవిత లో ….

“గోదావరికే గొంతుంటే / జల భాషలో శతాబ్దాల గుడిసె కథలు చెప్పేది /

సాయంత్రం షిఖారులో /  గోదావరి మనోహరిలా కాదు /గొప్ప భారాన్ని దాచుకున్న తల్లిలా కనిపిస్తుంది “.

నాకు ఈ  జన్మ నిచ్చిన  తల్లిదండ్రుల ఆప్యాయతలను , అనురాగాలను స్మరణకు తెచ్చావు అంటూ “నువ్వు అమ్మా నాన్నవే గోదావరి” అనే కవిత లో “ నా బాల్య జ్ఞాపకాల అంతర్ ఝరీ !!/ ణీ ఒడ్డు ఒడిలో తలపెట్టుకున్నప్పుడు /అమ్మ దగ్గిర వున్నట్టుంటుంది ,ణీ ఇసుక మేనిపై పోర్లాడుతున్నప్పుడు /నాన్న గుండెల మీద ఆడుకుంటున్నట్లే వుంటుంది / నువ్వు అమ్మా నాన్నవే గోదావరి ! “

ఒకవైపు గోదావరిని ప్రత్యక్ష దేవతగా కొలిచే వారే ఆ నదీ  గోదావరిని కలుషితం కావడానికి కారణం అవుతుంటే చూసి భరించలేని కవి ఆవేదన కవిత్వ రూపంలో కన్పిస్తుంది .  పరిశుభ్రత పాటించాలని వచ్చిన కవితలు ఉన్నాయి .

భారతదేశంలో ముఖ్యమైన పన్నెండు నదులకు ఒక్కొక నదికి ఒక సంవత్సరానికి పుష్కరాలు జరుగుతాయి . ఆ సమయంలో నదులు ఎలా కాలుష్యానికి గురి అవుతున్నాయో   రచయిత  గత గోదావరి పుష్కరాల సమయంలో  వెలువరించిన పుష్కర కవితలు ఈ కోణం  నుంచి  ఆలోచించి వచ్చిన కవితలే ….

గోదావరి పుష్కరాలకు వచ్చే లక్షల యాత్రికులు శుభ్రత  పాటించక పోవడం  వల్ల గోదావరి ఎంతగా కలుషితం అయ్యిందో , గోదావరి పుష్కరాల తర్వాత గోదావరిని చూసిన కవి ఆవేదన ఇలా వ్యక్తీకరించారు .

“పుష్పాలు రాలిపోయిన కొమ్మల్లా /పుష్కరాల తర్వాత /రాత్రిపూట గోదావరి

రహస్యంగా దగ్గడం గమనించాను /దుర్భరమైన దుర్వాసనలో

మూగతల్లి ముఖం మీద /మురికి టీగలు వాలడం పసిగట్టాను

గోదావరి నీటినాడి  పట్టుకుంటే తెలిసింది/ఆమె పుష్కర జ్వరంతో బాధపడుతోందని “………కలుషితంగా మారుతున్న ఆ గోదావరమ్మ నీటికి నిలువెత్తు సాక్ష్యం ఈ ఖండిక .

పుష్కరాల సమయంలో గోదావరి కలుషితం కావడం వలన స్నానానికి వచ్చే యాత్రికుల ఇబ్బందులను గుర్తు చేస్తారు రచయిత ఈ కింది ఖండికలో …

“యాత్రికులకు గమనిక …పుష్కర స్నానాలయ్యాక

ఏ డెట్టాలు తోనో మళ్లీ ఒళ్లు కడుక్కోండి

ఎంత ధర్మ వుఆదుల వారికైనా

చర్మ వ్యాధులు రాకమానవు

అద్దర్లో మినిగినా …ఇద్దర్లో మినిగిగా …దద్దుర్లు తప్పవు “.

పుష్కరాలు అంటే అందరికి గుర్తుకు వచ్చేది రాజమండ్రి ,కొవ్వూరు , బాసర , ధర్మపురి ,కోటిపల్లి ఇలా ప్రసిద్ధ మైన ప్రదేశాలు అందరు అక్కడే స్నానాలు ఆచరించి గోదావరిని మురికి చేయకండి , ఇలా చూడండి ప్రకృతి ఒడిలోని గోదావరమ్మ ను అంటూ పాపికొండల మధ్య ఉన్న గోదావరిని స్పురణకు తెస్తాడు రచయిత

“పుష్కర యాత్రికులారా /మురికి రేవుల్లో ఏం మునుగుతారు ?

/అలల నగల ధగధగల /గిరిజన ప్రకృతి గోదావరి

/పాపికొండల నడుమ /పసుపు పూలదండలు దాల్చి

/అమ్మవారిలా కనబడుతుంది /ఆమెను చూసిరండి

అనుభూతి పుణ్యం లభిస్తుంది”.

అందుకే భక్తుడు కానీయండి ,  సగటు మనిషి కానీయండి గోదావరి కలుషితం కావడానికి కారణం  అయ్యామని మమ్మల్ని క్షమించమని ఆర్తిగా అర్దిస్తాడు ఈ  క్రింది ఖండికలో ఎండ్లూరి

“తల్లీ గోదావరి  /మేము జలహంత కులం

మాది విషవింత కులం  /నీ  అందాల

జల మంగళ  సూత్రాలను  /మలమూత్రాలతో అపవిత్రం చేశాం

పాపాత్ములమూ /అమ్మ వొడిని  పాడు చేసే పసిపాపలము

మన్నించవమ్మా  /పుష్కర పునీత మాతా !”

Yendluri_sudhakar

గోదావరి గొప్పతనాన్ని కీర్తిస్తూ గడిపేయడమే కాదు , కలుషితమై పోతున్న గోదావరిని  నిర్మలంగా  చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని ,అందరు నడుం కట్టి పరిశుభ్రం చేయాలని పుష్కరాల తరవాత చేయావల్సిన కర్తవ్యాన్ని ఉపదేశిస్తాడు రచయిత ఈ ఖండికలో …

“గోదావరి /మురికి నీటి అద్దంలో

ముందు ముందు /ఎవరి ముఖాలూ కనబడవు

రండి నడుం కడదాం !/గోదావరి మురికి ముఖం కడుగుదాం !

శాస్త్రాలతో కాదు /శాస్త్రీయంగా /శాశ్వతంగా . . .

ఈ విధంగా గోదావరి నదీ ప్రస్థానం ఎంతటి వైశిష్ట్యాన్ని పొందిందో , సాహిత్యంలోను గోదావరి కవిత్వ రూపంలోనూ అంతే ప్రాచుర్యం సంపాదించుకుంది . మరీ ముఖ్యంగా పుష్కర సమయంలో గోదావరి నది కలుషితం అవుతుందో ఈ కవిత్వం నిదర్శనం . సగటు మనిషికి అనుభూతిని కలిగించడంలోను ,వాస్తవాలను ప్రబోధించడమే నేటి కవిత్వం యొక్క ఉద్దేశ్యం వాటితో పాటు గోదావరి వ్యధను ప్రతి వ్యక్తి ఆలోచించేలా చేస్తుంది  ఎండ్లూరి  కవిత్వం .

*

 

మనిషి పగిలిన రాత్రి

షాజహానా 
shajahanaఆఫీసు నుంచి వచ్చేసరికి మంచం మీద నాకోసం ‘రాత్రి రావడానికి లేటవుతుంది’ అనే నోట్‌ రాసి పెట్టి ఉంచాడు తను. ఎప్పుడు ఇంటికి రాకపోయినా అలా రాసి వెళ్ళి పోవడం అలవాటు. ఇవాళ నా దోస్తులతో తాగి తందనా లాడతానని దానర్ధం. ఇక నేను మౌనినై లేదా టివీ చూస్తూ సజీవ సమాధినై పోతాను. నాకు లేని దోస్తులతో మాట్లాడుతూ నేను పిచ్చిదానినవుతాను. కాసేపు రాక్షసిని కాసేపు దేవతని అవుతాను. తొలి యవ్వనంలోనే వెంటపడ్డ ఏ వెధవతోనో లేచిపోనందుకు, ఉండి ఉండి వీడిని కట్టుకున్నందుకు బాధపడతాను. ఇప్పుడు కూడా లేచి ఎవరింటికైనా ఎందుకు వెళ్ళలేక పోతున్నానో.. ఆలోచిస్తాను.
చాలా సార్లు ఇలా చేసి చేసి విసుగేసింది. జీవితంలో ఒంటరితనం నాచు ఎంతలా పేరుకు పోయిందంటే.. నేను అసలు కనపడడం లేనంత. ఇవాళ నేనేం చేయను? ఈ ప్రశ్న నన్ను కొన్ని ఒంటరి సంవత్సరాలుగా వేధిస్తున్నా నన్ను కాదనుకొని నాలో నేనే దాక్కొంటూ.. ఒంటరిగా దాగుడుమూతల ఆట. ఒక్కోసారి ఇల్లంతా సర్దేస్తాను. అప్పుడు, ఎపుడో దాచిన బొమ్మలో, డబ్బులో దొరికి కొంతసేపు ఆనందపడతాను. ఒక్కోపుడు ప్రేమగా తొడుక్కున్న పాత డ్రస్సు దొరికి అది వేసుకుని కొత్త డ్రస్సు వేసుకున్నంత ఆనందాన్ని పొందుతూ…!! ఈరోజు అలాక్కాదు. కొత్తగా గడపాలి. వీలైతే తను ఎలా గడుపుతాడో అలా! మొత్తం ఇల్లంతా వెదకగా తను ఎపుడో తాగి మిగిల్చిన క్వార్టర్‌ బాటిల్‌ కనిపించింది. ఎందుకు తాగుతారో, సాయంత్రాలను తాగడానికి ఎందుకు తాకట్టు పెడతారో తెలుసుకోవాలనే ఒక ఉత్సాహం.. ఫ్రిజ్‌లో ఉన్న బిస్‌లరి సోడా ఆమ్లెట్‌ అన్నీ తనలాగే… టీపాయ్‌ మీద పెట్టుకుని… ఏయ్‌ నువ్వొక్కడివే తాగగలవా? నేనునూ తాగగలను? చీర్స్‌!
భూగోళం తిరగడం మానేసింది. ఇప్పుడు నేనే భూగోళాన్ని! ఎవరో నన్ను బొంగరంలా తిప్పేస్తున్నారు. అందరూ నోరెళ్ళపెట్టుకుని చూస్తున్నారు… అబ్బా వాంతొచ్చేలా వుంది.. ఎందుకిలా.. పట్టుకో వాణ్ణి.. గోడెక్కుతున్నాడు.. లాగెయ్‌ కిందికి.. వాడు ఇప్పుడే రాడు… ఎపుడో తెల్లారు ఝామున వస్తే వస్తాడు… లేదంటే… అంతే…
అర్ధరాత్రి.. గోడమీద వాడి మొహం కాక సుధీర్‌గాడి మొహం కనిపిస్తోంది… చేతిలో గ్లాసుని సూటిగా చూసి కొడ్తే సుధీర్‌గాడి మొహానికి బదులు గ్లాసు బద్దలైనది.. మరో గ్లాసుని విసరగా అది కూడా పగలబడి నవ్వింది.. అసలు వీడి మీద తనకెందుకు కోపం? ఎందుకంటే వీడు తన మగనికి (లోపల ఎవరో పగలబడి నవ్విన శబ్దం) వచ్చే ఉద్యోగాన్ని రాకుండా చేశాడు.. చేయడంలో సఫలీకృతు డయ్యాడు.. వాడిని బొందపెట్ట.. అవును, హాయిగా ఊరి బూతులన్నీ తిట్టుకోవచ్చుగా.. ఈ గదిలో పక్క గదిలో గూడా ఎవర్లేర్‌.. ఎవరూ ఉండరు గూడా.. మరి ఎవరూ ఉండని ఈ సముద్ర గర్భమున ఎందుకు ఆక్సిజన్‌ కోసం ఎదుర్చూపులు?
ఎందుకంటే నాకంటూ ఒకళ్ళుండాలి.. గ్యారంటీ కార్డు ఇచ్చే షాపు ఓనర్లలా నీతోనే ఉంటాను చెలీ.. నిను వీడి వెళ్ళను మరి అంటూ మన చుట్టూనే తిర్గుతూ ఉండాలి.. దాని కోసం ఎన్ని జన్మలైనా.. ఈ జన్మలోనే- ఎన్ని జన్మలైనా ఎదుర్చూస్తూనే ఉంటాన్‌.. ఎవరన్నా వస్తారన్న గ్యారంటీ ఉంటే కదా చూసినా లాభం.. అదేంటి ప్రతీది లాభం.. దీన్ని చేసుకుంటే పది లక్షల రూకలు.. అమెరికా పోవుటకు సరిపోవును.. ఆ తర్వాత మరల మరల అదే ఫేస్‌ను.. ఏం చూస్తాం.. చంపేయ్‌..  బతికి చేసేదేం ఉంది.. అసలందుకే టీవీలు పేపర్లు చూడకూడదు.. అధవా చూసినా.. అధవా ఏంటి వెధవ లాగా.. ఎందుకనగా ఏ ఎన్నారై వెధవ ఎలా భార్యలను చంపింది, చంపబోతుంది, మానసికంగా రోజుకు గ్రాముల చొప్పున ఎలా మెర్సీలెస్‌ కిల్లింగ్‌ చేస్తున్నది.. తెలిసిపోతుంది.. అపుడు మనకనవసరంగా బాధేస్తుంది.. మనలని మనం కాసేపు తిట్టుకోవటమో లేదా మనం ఎంత మంచోల్లమో తలచుకోవటం.. వాక్‌.. తాగాక కక్కొచ్చి నట్టుంటది.. ఎందుకంటే ఇక్కడి ప్రబుత్వాలే కాదు తెల్లోడి గవర్నమెంటూ అంతే.. నేరస్తులను ఎవరేం చేయలేరు.. అసలు రింగిచ్చావా.. రింగు రింగు బిళ్లా రూపాయి దండా దండ కాదురా దామర మొగ్గ మొగ్గ కాదుర.. ఏదో ఉంది.. గుర్తుకు రావట్లే.. గుర్తుకు.. ఆఁ.. గూట్లో రూపాయ్‌.. నీ మొగుడు సిపాయ్‌.. అసలెవరి మొగుడైనా సిపాయేనే ఎర్రి మొహమా.. రింగిస్తే బయట బండి ఆగిన శబ్దం కావాలె కదా..
Kadha-Saranga-2-300x268
గోడ మీద కూకోనున్నాడు ఎందులకు? ఎయ్యి ఒక్క గ్లాసు సూటిగా సూసి ఏస్తే గోళీకాయ పగిల్నట్టు పగలాల వాడి ముక్కుదూలం.. భళ్ళున బద్దలయినది.. చార్మినారులో ఇష్టపడి మోజుపడి కొనుక్కున్న గ్లాసుల్లోంచి ఒక్కొక్కటే గోడకేసి తలకొట్టుకుంటున్నాయి.. మనం ఏదికొన్నా అంతే మన టేస్టుకు దగ్గట్టుగా అందంగా చాలా కాలం మన్నేలా.. కొనుక్కుని పెట్టుకుంటాం కదా.. మొగుళ్ళని పెళ్ళాలు పెళ్ళాలని మొగుళ్ళు కొనుక్కున్నట్టు! అందులో ప్రేమతో కొనుక్కునే వాళ్ళు కూడా ఉంటారు సుమండీ! వీరికి పొగరెక్కువ.. పేమ పెపంచకాన్ని జయిస్తదని ఎర్రినమ్మకం.. ఉత్తదే ! అసలెప్పటికీ ఎవర్నీ.. దేనితోని జయించ లేము.. ఇది నిజం.. నిఝంగా అర్ధగంట్లో  ఇంట్లో ఉంటానన్న నా మగధీరుడు ఎటుపోయెను.. ఏ రాజ్యము లేలుచుండెను?
అదిగో మళ్ళీ మధ్యలో అతనెందుకు.. అయినా అతను అనాలా? వాడు గదా! అవును మనం గూడా.. ఎక్కించుకుని ఉన్నాం కదా..! గాలిలో తేలిపోతున్నాం గదా! వాడికి మనకి తేడా ఏం లేదు.. తేడా ఏం లేదూ? ఏమోలే తరువాత కొలుచుకుందుము! ఇప్పుడు పన్చూసుకో.. ఓహో చార్మినారుతో గొడవపడి బేరమాడి కొనుక్కున్న కప్పులు సాసర్లు.. సాసర్లంటే గుర్తొచ్చింది.. ఫారినర్లంతా వేరే గ్రహాలను, అక్కడ జీవజాలాన్నీ జలాన్నీ ఊహిస్తుంటారెందుకు.. మరల వారితో యుద్ధ ములు.. వారితోనూ ప్రేమ వ్యవహారములు.. (అహో మనకి  ఊహలలోనూ పాతివ్రత్యమే!) ఎందుకంటే ఇక్కడివారితో గడిపి బోరుకొట్టి బీరుపట్టి.. వారు సినిమాలు తీయుదురు.. అట్లా ఒక సాసరు వస్తే ఎంత బావుండు.. ఆ సాసర్లో ఒక.. ఆఁ, ఒక? ఒక.. అసలెవరుక్కావాలి నీకు..!
ఏమో? మరి సాసరెందుకు? అవును సాసరెందుకు? కాబట్టి.. అందుచేత.. పనికిరాని సాసర్లు ఉంటే ఏం లేకపోతేం.. సాసర్లని ఒకసారి ఫ్లైయింగ్‌ చేయి.. ఎంత బాగా ఎగుర్తున్నయి..? ఎగిరి దుంకి చిన్న చిన్న సాసర్లైతున్నయి.. భలే ఉంది కదూ.. ఈ సాసర్లలో చాయినే ఎందుకు తాగాలి? ఇంకేమైనా ఎందుకు తాక్కూడదు? ఇంకేమైనా అంటే ఏంటి? మరే, ఇంకా రాలేదేం? ఎవరైనా అమ్మాయి అందంగా కనిపిం చిందా.. ఇంకంతే.. అసలు అందంగా కనిపించకపోయినా పర్లేదు.. అమ్మాయైతే చాలు.. ఎంత బ్రాడు మెదడ్లు.. సొంగకార్తా ఉంటది.. సొమ్మల రోగం ఉన్నోళ్ళకు మల్లే.. ఇంట్లో ఒకత్తే ఒంట్లో వేడితో కంట్లో దు:ఖంతో కాలిపోతా నలిగిపోతా ఉంటే.. వాడక్కడ కార్చుకుంటా ఎదురింట్లో కుక్క మాదిరి.. కుక్కే కాదు అక్క కూడా ఉందాయింట్లో.. నాకు అక్క, వాడికి.. వీడే కుక్క.. ఇక అక్కెలా అవుద్ది? సొ.. ఓయ్‌ అసలు నీకేం కావాలి.. ఏమైనా కావాలా? అవును ఏదో కావాలి.. ఎవరో రావాలి సాసర్లో! పిల్లి ఎవరూ ముఖ్యంగా నేను చూడట్లేదనుకుని, పాలన్నీ.. హాయిగా తాగేసింది.. తాగుబోతు పిల్లి.. నేనేం చెయ్యలేదు.. ఎందుకంటే నేను పిల్లిని  కాను, కనీసం పాలన్‌ కూడా కాను.. మరి  నేనెందుకు భాధ పడటం.. పిల్లి కూడా పాలు తాగింతర్వాత ఇలా వొత్తుల్‌ దీర్గాల్‌ మార్చి మాట్లాడ్‌తుందా?
mandira1
అతనిలాగే.. అతనేంటి? వాడు! అదిగో.. మళ్ళీ మధ్యలో వారి ప్రస్తావ నెందుకు? పరాయివాళ్ళ నెందుకు తల్చుకోవడం, రింగులివ్వడం? మాట్లాడ్డానికి ఎవరైనా దొరికితే బాగుండు! ఎందుకు? మాటలు తర్వాత చూపులు తరువాత రాసుకోటం గేదెలు గోడలకేసి రాసుకున్నట్లు! అంతే.. అదే ప్రేమ! దానికోసమే.. తన్నుకులాట! పునుకులాట! ఏం వెదుకుతున్నావు, విడిచిపెట్టిన వెన్నెలకుప్పలాటలో పుల్లను  ఈ జీవితకాలంలో నువ్‌ తేలేవ్‌! ఆ పుల్ల ఈ ధూళిలో దుమ్ములో కలిసి ఎక్కడ మాయమైందో.. మనం మాత్రమే మిగిలామ్‌. మనం ఏంటి రాణిలాగ! నేను అనుకోలేవా? లేను, ఇప్పుడంతే నేనే రాణి సేవకి పడక మంచం కంచం మెతుకులు సాసరు కుక్క అక్క దూదుంపుల్ల పిల్లిపిల్ల అన్నీ నేనే అన్నీ మనమే!
 డాక్టరు నవ్వమని చెప్పాడు! ప్రిస్కిప్షన్‌లో నవ్వమని  చెప్పిన మొదటి డాక్టరతను పేషంట్‌ నేను అయ్యుంటామ్‌. అప్పటివరకు తనకు తెలీనే లేదు… తాను నవ్వక ఎన్ని సంవత్సరాలైందో.. నవ్వి ఎన్నేళ్లయిందో.. రెండూ ఒకటేనే ఎంకట్లచ్మీ.. అయినా కోల్పోయిన నవ్వుల్‌ పప్పటికలో దొరుక్తయా నా శాంతనం కాపోతే? డాక్టరేంటి మొగుడికంటే కరెక్ట్‌గా చెప్పేస్తున్నడూ.. మొగుళ్ళ కంటే డాక్టర్లే నయం లాగుందే.. అలాక్కాదే ఎర్రిపప్పా.. ఈ డాక్టరుకి పెళ్ళాం ఉంటుంది కదా.. ఆమెక్కూడా వేరే డాక్టరు దగ్గరే.. ట్రీట్‌మెంట్‌.. సొంత పెళ్లానికి ఏ సైంటిస్ట్‌ మందు కనుక్కోలేడు.. ఒక డాక్టరు మొగుడు కాలేడు.. మొగుడయిన డాక్టరు వేరేవాళ్లకు డాక్టరు.. పెళ్లానిక్కాదు.. అసలే లెక్కల్లో పూరు.. ఏప్పియస్సి చూయింగమ్ము బిట్లు మనక్కెందుకు చెప్పు? అవునూ ఇప్పుడు ఉద్యోగం మనిషి లక్షణమయిన తర్వాత ఉద్యోగాలు తరాజులో పెట్టేసి పెచ్చాపలో.. అనమ్ము కుంటున్రు.. గదా.. లేదంతావేటి?
నిజం చెప్పవే అమ్ములు? అయినా నీదేం పోయింది.. చదువుంతా పోయింది.. కదా.. నీదేం పోయింది.. ముక్కు కళ్లు చెవులూ అన్నీ మూసుకో.. ఛీ.. ఈ సలహా బాలేదు.. అసలు తెరిచిందే.. ఇందాక.. అపుడే మూసేయాలా.. మూసుకోవాలమ్మా.. లేకపోతే దుంపనాశినం.. ఆయేషాను చేసినట్లు చేస్తారు తెలుసా? నిఝంగా.. ఆ తరువాత నీ శవం మీద క్కూడా పేలాలకు బదులు ఉద్యోగాలు జల్లుతారు.. సాక్ష్యాల్లేకుండా హత్యలు చేయించబడును.. అంతర్జాతీయ మార్కెట్‌లో తాజా బోర్డ్‌.. ఒసేవ్‌ నోర్మూసుకో.. గట్టిగా మాట్లాడబోకు.. గోడ్లకి చెవుల్‌ ముక్కు నోరు.. కండ్లు అన్నీ ఉంటయ్‌.. వేలిముద్రల్‌ తప్ప.. ఏం దమ్మీ సెప్తా ఉంటే నీక్కాదూ.. అందుకే టీవీలు పేపర్లు సూడకూడదనేది.. అయినా ఎవరింటున్నరు.. గట్టిగా చద్దరు ముసుగు తన్ని ఏ విషయం లోపట్కి దూరకుంట పండు! చద్దరికి చిల్లుల్లేవు.. ఎన్ని విషయాలు దూరుకుంటొత్తన్నయో..! ఆ అమ్మాయి అంతందమైన సున్నితమైన అమ్మాయి.. నిండా ఇంకా పద్నాలుగేళ్లు నిండా లేనమ్మాయి.. ఎవడి కోసమో యాసిడ్‌ తాగిం దాట! అదేమైనా కొబ్బరి బొండామా లట్టలట్ట తాగడానికి.. పెద్దాపరేషనై.. మంచాని కతుక్కుపోయి.. నీళ్లు తాగినంత వీజీగా విషం తాగుతున్న సీరియళ్లు చూసుకుంటా శేష జీవితాన్ని గడిపేయి నా చిట్టితల్లీ..! ఎవరో లబోదిబో మొత్తుకుంటున్రు.. ఎవరబ్బా.. మొన్నే పెళ్లి చేసి అమెరికాకు ఎగుమతి చేసిన కూతుర్ని.. శవంగా మార్చి దిగుమతి చేశాడంట.. అల్లుడు.. అమ్మా అబ్బా అయ్యుంటారు.. అమెరికాంటని అసూయపడ్డ బందుగుల్‌.. స్నేయితుల్‌.. వాక్‌.. అంతా శవాలమయం! అమెరికా అంటే చాలు.. పొర్లు దండాలు పెడ్తా అమ్మాయిల నిచ్చేస్తారు! నవ్వుతా తుళ్లుతా చలాగ్గా తేలిగ్గా కంప్యూటర్‌ కోర్సులు చదివేస్తుందా.. అయితే మీ అమ్మాయిన్‌ గూడా అమెరికా పంపించండీ! మౌనంగా.. దీనంగా.. దిక్కు లేకుండాగా.. మీ అమ్మాయి పెట్లో పడుకుని వచ్చేస్తుంది.. ఇవన్నీ చేసేందుకు గాను.. ఆ రౌడినాకొడ్కులకి మళ్లీ కట్నం డబ్బుల్‌ గుడా ఇవ్వండేం మర్చిపోకండి…
ఇంతకీ మంది మొగుళ్ల గురించి నీకెందుకే.. అసలు నీ మొగుడేడి? ఏం చేయుచున్నాడు.. ఎక్కడ తప్పిపోయినాడు? ఏ గుర్రాల మీద తిరుగుతున్నాడు? అదిగో మళ్లీ వాడి గురించి.. నీకెందుకు? నువ్వు కావాలన్న రాడు.. వద్దనుకుంటే పోడు.. వాడిష్టం వాడిది.. నీ ఇష్టం నీది! అంతే కదా.. మళ్లీ ఎందుకు ఆలోషన పట్టాలు తప్పుతుంది.. విడిపోదామనుకునే కాడికి ఏడికి పోతేంది.. పోకుంటేంది? వస్తేంది.. రాకుంటేంది..? అసలేంటి నీ సదుద్దేశం.. ఇంత జరిగాక మళ్లీ అదే ముఖాలతో ఎలా కాపురం.. కాపరమా అదేంటి? ఎలా ఉంటుంది? ప్రపంచ మంతా ఇంతే.. సరిగ్గా కాపురం చేయడమే సమాజంలో బతకడానికి అర్హతనుకుంటుంది.. అన్నీ దొంగ కాపురాలు దగా కాపురాలు..! ఎవని కాపురం సొక్కంగుందో జర సెప్పు సెల్లె నీ బాంచన్‌ కాళ్ళిరగ్గొట్ట.. దుడ్డు.. రొక్కం.. రూకలు.. మనీ.. పైసా.. మేక్స్‌ మెనీ థింగ్స్‌.. అంతేనంటావా.. ఎక్కడా స్త్రీలు సంపబడని సోటు.. పోనీ అవమానింపబడని సోటు ఎక్కడైనా ఉందా ఇలా తలంలో.. అని.. సజలాం.. సరక్తాం.. గాహే.. తవ జయగాధా.. గాహే.. ఎహే.. ఇన్ని సప్పుళ్ళకి పక్కింటివాళ్ళు లేవరెందుకు? లేస్తారు.. మనం.. ఇప్పుడు.. మనసు ఖరాబు చేసుకుని లేదా పరిశుద్ధం చేసుకుని సుకంగా నిద్రమాత్రలు మింగేమే అనుకో.. అప్పుడు తెల్లారి నేనెందుకు తలుపు తీయలేదా అన్న క్యూరియాసిటి మొదలవుద్ది.. ఆ తర్వాత.. దుర్వాసన రావడం మొదలవుద్ది.. వాసనే రాకపోతే ఎన్ని శవాలు అనామకమయ్యేవో.. తట్టుకోలేక పోలీసుల కుప్పందిత్తారు.. అంతే.. ఎందుకంటే పెజానీకం పోలీసుల్తో సత్సంబంధాల్‌ పెట్టుకునేంత తెలివి తక్కువగా లేరిప్పుడు.. ఎలాగు తరువాత పట్టించుకోవాల గదా.. ఆ మాత్రం దానికి ఇప్పుడు పట్టిన నిద్రని పోగొట్టుకోవడం దేనికి?
మిగిలిన ఒకే ఒక కప్పు.. లతలతో.. అందంగా కనిపిస్తుంది.. ఇంతందంగా ఎందుకు పుట్టావే..? అదీ పింగాణీవై ఎందుకు పుట్టావే.. హఠాత్తుగా దానిమీద ఎక్కడలేని పేమ ముంచుకొస్తుందెందుకో? వదిలెయ్‌.. నీకే దిక్కు దివాణం లేదు.. దానిమీద నీకెందుకు మమకారం? అదేమైనా నీ కడుపున పుట్టిందా? కడుపునే పుట్టాలా? పుట్టితీరాలా? పుట్టడమో చావడమో ఏదో ఒకటి చేసి తీరాలి! అయితే దీని గురించి రాద్దామా? రాసి తీరాలి కానీ రాయడానికి కూడా స్వేచ్ఛలేదు నీకు!
mandira1నేనేం రాయాలి రాసి ఎవరికివ్వాలి ఎవరితో మాట్లాడాలి అన్నీ వాళ్ళే  నిర్ణయిస్తారు.. అలా ఉంటే ఏం లేదు.. లేదంటే లం..లైపోతారు.. నా కొ…రా అని నేననలేనా? సాహిత్యముతో కూడా పగలు తీర్చుకోవచ్చు.. అయినా ఈ ఎదవలకి మనస్సాక్షి ఉండదా? రేపటి కూచిపూడి డాన్సరుకి సాక్షి అట..పేద్ద హోర్డింగు.. ఎక్కిరిత్తంది.. ఆయేషా! నువ్వు దేనికమ్మా సాక్షి? ఆహా! అపర సత్యవతీ.. ఏ కాలంలో మాటలాడుచున్నావు తల్లో.. తీసుకున్నోడు తీసుకున్నానని చెప్పడు.. చంపినోడు చంపినా అని చెప్పడు.. సపోర్టిచ్చినోడు ఇచ్చినా అని చెప్పడు.. దోచుకున్నోడు దోచుకున్నా అని చెప్పడు.. అదే పెజాస్వామ్యం! అన్నీ అర్దమవుతానే ఉంటయ్‌.. నిజం.. నిప్పులాగా ఔపడతా ఉంటది.. అయినా అంతే మనం వింత చూసేలోపు దొంగ దొరవుతాడు.. దొర దొంగవుతాడు.. నువ్వు నేను ఇట్లా మంచాల మధ్యలో ఉద్యోగాల వేటలో రోజూవారి సోదిలో పడి కొట్టుకు పోతుంటాం.. ఐదేళ్ళకోపాలి ఏలికింత రంగేయిచ్చుకుని.. ఆ తర్వాత నెత్తికింత బుర్ద రాయిచ్చుకుని.. అసలు ఈ కుర్చీల కూర్చి గురించి ఒక నవల రాస్తే బాగుంటదేమో.. ఒక మానవ దేహం ఫలానా కుర్చీలో కూర్చోగానే.. ఎందుకట్టా మారిపోద్ది.. అప్పటి వరకున్న లక్షణాలన్నీ మరచిపోయి.. కుర్చీ లక్షణాలన్నీ ఔపోసన పట్టించేద్ది.. మనిషి అనుకరించటంలోంచే పైకొచ్చాడప్పా.. ఈ నిజం చెప్పినోడెవరోగని ఇది కుర్చిలో కూసోంగనే తెలిసిపోద్ది.. అసలు ముందు మనం.. మనం అంటే మనం కాదుగానీ.. కుర్చీ టేబులు ముందు కూర్చునే వాళ్ళుంటారే.. చూసి చూసి ఎంత ఇసుగేసి పోయినాదంటే.. టేబుళ్ళతోని కుర్చీలతోని అతుక్కుని పుట్టినారేమి?
పని గురించి ముందుకుపోయి  నిలబడినామంటే చాలు నాయాళ్ళ/ల్దికి కూర్చోమనే సంస్కారం కూడా ఉండక పోగా నువ్వేదో వాడి జన్మజన్మల సొమ్మంతా నొక్కేసినట్లు.. వాడి ఆముదం ముఖంలో నా….! నిజం.. వాడి కాలికింద ఏదైనా ఉద్యోగమే ఉందనుకో.. ఇంకంతే భూగోళం చివర్న కుర్చీ ఏసుకుని కూర్చున్నట్లు ఫీలింగు.. ఒరే.. ఎన్ని రకాల కుర్చీలు కావాలంటే బంగారం ప్లాటినం కుర్చీ ఏసుకుని ఫెవికాలంతా ఎనక్క్రాసుకుని కూసున్నా ఆ కుర్చీ భూగోళం పైన ఆగదు కన్నా.. భూమిలోకే పోద్ది.. నువ్వూ అంతే.. ఏకాలం ఏలుకుంటా కూచ్చోవు..
మా నాన్న చెప్పేవాడు.. సిన్నప్పుడు.. నీతన్న మాట.. అంటే ఏంలేదు.. ఏది నిలవదురా కన్నా బుజ్జీ.. నువ్వు చేసిన మంచో చెడో అదే నిలబడుతుందని.. ఇప్పుడ్‌ గూడ చెప్పాలనుంటది గామోసు.. మనం పెద్దగయిపోయినం గదా! పెపంచమంతా చిన్నప్పటి నీతులు తుచ తప్పకుంట పాటిస్తే ఎంత బాగుండు.. కానీ ఇప్పుడు మనం చేసేది మంచా చెడా? ఇదంతెందుగ్గానీ.. శాశ్వతం గానీ కుర్చీల మీద శాశ్వతం గానీ శరీరాలను పడేసి.. ఇంద్రుణ్ని చంద్రుణ్ని.. ఫోజులు కొట్టమాకండ్రా.. కుక్కక్కూడా మంచి రోజొస్తుందట.. మరి నీకు రాటంలో పెద్ద ఆశ్చిర్యం ఏం లే.. అయినా సరే ఇప్పటికిప్పుడు నా దగ్గరున్న అత్యంతాధునిక.. పురాతనాయుధం ఇదొక్కటే కాబట్కి.. నేను తిట్టకుంట దుమ్మెత్తి పోయకుంట ఉండన్రా.. దొంగనాయాళ్లారా.. నోటికాడి కూడు లాక్కోని మీరేం సుఖపడి పోతార్రా.. మీ చేతులకి పక్షవాతం రాను.. ఆ నోటితోనే కదా.. కుట్రలు కుతంత్రాలు చేసేది.. మీ నోరు పడా.. మీ నోట్లో.. అది.. ఇది.. అన్నీ..! ఒరే కళ్లు సల్లపడ్డయా.. ఇంకేమైనా మంటుందేమో.. రండ్రా.. మొన్న ఆపరేషనయిన అమ్మాయి మూత్రం ఇంకా బాటిళ్ళలోనే పడుతున్రు..!
నిజం, మనుషుల్లో మనసున్నోల్లు షానా తక్కువ! నిజం దోస్త్‌..పెద్ద కుర్చీల్లో కూసోనున్నం కదాని మనుషులమనే విషయం మర్చిపోకూడదు గదా.. ముఖ్యంగా మా తాత చెప్పేటోడు.. ఏడన్నా కొట్టు గని పొట్ట మీద మాత్రం కొట్టమాకు..! ఎదవలు ఎఫెక్ట్‌ రావాలని ఆడ్నే కొడుతుర్రు.. కంత్రీలు.. ఎఫెక్టంటే గుర్తొచ్చింది.. ఒంటరిగా ఉంచి ఈ కప్పుని ఎందుకు జీవహింస చేయడం.. జీవాత్మని పరమాత్మలో కలిపేస్తే పోలె..! ఏస్కో.. కప్పు.. పేద్ద కుర్చీ కనపడతందా.. వేసేయ్‌ పపంచంలోని కుర్చీలన్నీ విరిగిపోవాల.. అందరూ కింద కూర్చుని ఉద్యోగాల్‌ చేయాలె.. ఊళ్ళేలాలె దేశాలేలాలె! అయ్యో ఆమ్టే చచ్చిపోయాడు కదా .. మళ్ళింకెందుకు పుడతాడు.. ఈ పాపిష్టి లోకంలో..!
అయినా కప్పిసిరితే.. ఇంత మార్పు వస్తుందంటవా.. ఇసిరి చూస్తే పోలా.. భళ్ళున శబ్దం.. అయినా లోకం కిక్కురు మన్లా! కిక్కెక్కిందేమో..! అబ్బా.. లోకమంతా నా కళ్ల ముందున్నా.. వీడు మాత్రం లేడు రాడు పోడు! పోరా.. ఎన్ని పోయాయ్‌? చిన్నప్పుడు నాదే ననుకున్న ఇల్లు పోలే.. పెంచుకున్న పూలతోట.. కరిగిపోలే.. పెంచుకున్న పేమ తోట.. రాలిపోలే.. పూయించిన స్నేహ కుసుమాల్‌ వాడిపోలే.. నాదనుకున్న ప్రతీది రాలి మాడి వాడి మసైపోయాక.. ఇంకేంది నాది.. ఇప్పుడు తాగావే నీటి చుక్కలు అవి నీవే.. నిన్న పొద్దున్నెప్పుడో.. పుల్సిపోయిన పిండితో వేసుకుని తిన్నవే.. దోశే.. అది కూడా నీదే.. నువ్వెవరి మోచేతి నీళ్లు తాగట్లేదమ్మా.. కానీ ఎవరిదో.. ఒకరి మోచేయి కింద బతికి ఉండాలి! అదీ జీవితం.. నీకింకా సొతంత్రం రాలేదు.. రాదు.. రానివ్వరు! నీకెంత సొతంత్రం ఉందోనని అనుకుంటుర్రు.. ఉత్తదే.. పైకే.. షాపూర్‌కాడ.. ఆడపిల్లలాని.. చంపకుండనే బొందపెడ్తున్నరంటా! ఆడాడ్నో.. ఆడపిల్లలనమ్మే రాకెట్‌ బయటపడ్డదంట.. మనకెంత పరిజ్ఞానమో.. ఎన్ని రాకెట్లు చేయడం వచ్చో..! అన్నీ పీడకలలే వస్తాంటే దేన్ని గురించి కలలు కనమంటారు కలామ్‌ గారు?
ఏందమ్మీ టీవి పెడుతున్నవ్‌.. అప్పుడే ఎలచ్చన్‌ల మురిక్కంపు గొడవలన్నీ బయటికొచ్చేస్తా ఉంటయ్‌.. ఎందుకు చెప్పు.. అయినా ఏ పార్టీ ఇంతవరకు లేడీ ముఖ్యమంత్రిని చేద్దామని ఒక్కపాలి గూడ అనలేదెందుకని? ఎక్వతక్వ నఖరాల్‌ చేయబాకు.. బేనజీర్‌ ఆరిపోయిన రక్తం చింది మీద పడి పగలబడి నవ్వగలదు! ఆడ ముక్యమంత్రిణినా? గీ సంవత్సరపు పేలని జోకు.. విరగబడి నవ్వు అదే జీవితం ఎక్కడేది క్లిక్కవ్వుద్దో ప్లాపవ్వుద్దో.. ఏదీ ఎటూ తేలని రాయికట్టిన బెండు బతుకు! అడుగులో అడుగునై నవ్వులో నవ్వునై అన్న మొనగాడు.. కిడ్నీలు పాడవుతున్నయంటే ఏడికి పారిపోయిండో.. జీవితం నుంచి ఇట్లా తప్పించుకుంటే ఎట్లనబ్బ.. స్కూలి పిలకాయలమా? క్లాసు బాలేదని దెంకపోనీకి? అమ్మా బాపుల్ని బస్టాండులో దొబ్బేసినాడంటెదవనాయాలు.. పాపం అడుక్కుని తింటున్రు.. ముసిలోల్లు.. అగ్రరాజ్యాల సరసన భారత్‌.. పేపర్లో భలే సరసం చదివినానబ్బ.. ఏయ్‌ నిన్నెవరు పేపరు చదవమంది! ఒక్క కేసు రెండుక్కేసులు.. ఇలా జరిగితే ఇక దేశాన్నంతా తిట్టుడేనా? నీ మొగడు మంచోడు కాపోతే.. మగాళ్ళంతా గంతేనా! ఏమోనబ్బ.. పపంచంల ఒక పెద్ద కోర్టు, దాన్ల ఒకే ఒక కేసు.. ఒకేపంతా ఆడ.. ఒకేపంతా మగ! ఎవరు మంచోరన్నది కేసు, ఇద్దరు జడ్జిలు ఒక ఆడ మగ ఇద్దరు లాయర్లు ఆడ మగ ఇగ ఇది తేలినప్పడు తేలిద్ది లేకపోతే మగ జడ్జి ఆడజడ్జిని బెదిరించి మగ లాయరు ఆడ లాయర్ను చంపేసి, కేసు విత్‌ డ్రా..! న్యాయ శాస్త్రంలో ఎంత సౌకర్యం ఉందంటే ఆడ మగ ఇద్దరూ కలిసి ఉన్నా పిల్లల్ని కన్నా.. అది పెళ్ళి కాదంటా.. మరి పెళ్ళంటేందో.. కొద్దిగన్ని నిర్వచనాలు ఇచ్చుకుంటే బావుండు..  సినిమా నాన్నే కాదు.. మీ నాన్నయినా మా నాన్నయినా అంతే.. ఎంత విశాల భారద్దేశం అయినా మళ్ళీ అంతా ఇరుకే.. అవునూ ఆకలేయట్లే.. ఇప్పుడు మనం విషాదంలో అలకలో కోపంలో దు:ఖంలో ఉన్నాం కదా.. కంట్లో నుంచి ఏడుపు.. ఎవరైనా తినిపించే వాళ్ళు బుదగరించే వాళ్ళు.. నా తల్లీ బంగారు కొండ.. ఒక్క ముద్ద తిను.. అబ్బా- ఎవరైనా పుట్టించడానికే కాదు పుట్టాక్కూడా సరోగేట్‌ మదర్సు ధెరిస్సాలుంటే ఎంత బాగుండు.. అవునూ సరోగేటు ఫాదర్సుండరెందుకని? లేనిదే కావాలెప్పుడు దీనికి!
ప్లేట్లో అన్నం, ఎప్పటిదో వారాలనాటి పప్పు ఫ్రిజ్జులో.. మనలాగా ఫ్రీజయిపోయింది.. పొయ్యి మీద పెట్టు.. వేడయ్యిద్ది.. తినిపించుకో.. చూస్తావేంటి నా కన్నవు కదూ.. ఏడవకు కళ్ళు తుడుచుకో.. ఇదుగో.. ఇది అమ్మ ముద్ద నాన్న తాత కాలేజిలో సునంద ముద్ద.. చేతికి గోరింటాకు పెట్టించుకున్న పూలుపళ్ళప్పటి అత్త ముద్ద పెళ్ళప్పటి ముద్ద పెళ్ళయిన కొత్తల్లో మొగుడి ముద్ద.. అయినా మనకు మనమే బతిమిలాడుకుని మనమే తినిపించుకోవడం.. ఎంత గొప్ప అనుభూతం! సింకులో వేసేయ్‌.. ఈ భూగోళం కూడా సింకులో పడితే బాగుండు.. నర్సమ్మకు చెప్పి బాగా రుద్దిస్తే బాగుపడిపోయేది!
మంచం ఉరుకుతుందేంటలా.. పట్టుకో.. యా ఇలాగే.. ఇప్పుడు గది తిరుగుతుంది.! దీన్నే గది తార్కిక వాదం అంటరు.. అయినా ఎప్పడూ ఏదో ఒకటి తిరుగుతూ ఉండాలి.. అప్పుడే చలన శీలతున్నట్లు.. మరేమో మా ఆయనకి ఈ శీలతెక్కువ! ఎహే ఎవడి గురించి నీకెందుకు? తల పగిలి పోయే నొప్పితో ఉండి.. నిద్రపోతే తప్ప ఇంకేలాగూ తగ్గదు.. నిద్ర.. రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా.. ఇలా అంటే వస్తుందా.. ఏక్‌బార్‌ ఆజా ఆజా.. ఎందుకొస్తాడు? ఎందుకొస్తుందీ నిద్ర.. కిడ్నీలో నొప్పి.. గుండెలో నొప్పి.. కీళ్ళ నొప్పి కాళ్ళ నొప్పి.. కళ్లు దేహమంతా మనసుతో పాటు నొప్పులమయం! కిడ్నీలమ్ముతున్రు.. మనుషుల్నమ్ముతున్రు.. భూమినమ్ముతున్రు.. అమ్మని దేదైనా ఉందా? నిద్రపో తల్లీ.. సుఖంగా.. వాడు రాలేదు.. రాకపోతే పోనీ.. టైమెంతయ్యిందో.. నాలుగో ఐదో.. పడుకోమ్మా నా తల్లివి కదూ.. తరతరాల నుంచి కోపాల్‌ తాపాల్‌ అణచిపెట్టి నిద్రబుచ్చడమే గదా మన జాతిలో 99.99 శాతాన్ని చేయిస్తున్నది.. పడుకోమ్మా.. నా పండువి కదూ.. నా దానివి కదూ… నేనే కదూ ఇంకెవరి దానని కాదు కదూ.. నిద్రపో తల్లి నీలాల నీ కంట నీరు నే చూడలేను… ఇంకెప్పుడూ ఇలా చేయొద్దు కదూ! మా బంగారు కదూ! నా చిన్నారి కదూ..!
*

ప్రకంపనం..

 

కృష్ణుడు 

 

జీవితం ప్రకంపిస్తోంది
ఎక్కుతున్న మెట్లపై నుంచి
రాలిపడుతున్న
తెగిన తీగల స్వరాలు

తెరుచుకున్న తలుపులోంచి
జలదరిస్తున్న గాలి
కదులుతున్న మంచం నుంచి
రోదనకూ, మూలుగుకూ మధ్య
సంఘర్షిస్తున్న గొంతు

ఎత్తిన విశాల నేత్రాలనుంచి
గుండెల్ని చీల్చేసే చూపు
రాలుతున్న అశ్రువుల్లో
కదులుతున్న కలల ప్రపంచం

లేవలేని శరీరంలో
పేరుకున్న గత స్మృతుల భారం
అప్రమేయ కదలికల మధ్య
నిస్సహాయంగా నడుస్తున్న కాలం

నిన్నటినీ, రేపటినీ
కప్పేసే నల్లటి భయంకర తెర రాత్రి
కనురెప్పలు మూతపడుతున్న వేళ
తడుముతున్న అస్వస్థ కరాంగుళులతో
నిక్కబొడుచుకున్న రోమాలు
వణుకున్న పెదాల స్పర్శలో
జీవన నాదపు దేహార్తి
అర్థనిమీలిత నేత్రాలతో
శ్మశానసౌందర్య ఆలింగనం

పుచ్చిపోయిన చీకట్లను
చేధించి
బయటపడ్డ నెత్తుటి పిండంలా సూర్యుడు
ఆర్తనాద సుప్రభాతం తర్వాత
జీవితం
అసిధారనుంచి బొట్లుబొట్లుగా కారుతున్న నెత్తురు
బతుకు
మొదళ్లతో కూల్చివేయబడ్డ చెట్ల వ్రేళ్ల తడి
ప్రాణం నిత్య ప్రకంపనల మధ్య
దగ్ధమవుతున్న దేహంలో
చిటపటల మృతధ్వని..

*

krishnarao

థ్యాంక్యూ చీతా!

సుధా శ్రీనాథ్

 

sudhaతెల్లవారుతున్నట్టే అమ్మనుంచి ఫోనొచ్చింది. మధ్యరాత్రి అమేరికా చేరుతున్నట్టే ఫోన్ చేసి అమ్మకు తెలిపాను కదా, నేను క్షేమంగా చేరానని అనుకొంటూనే ఫోనెత్తాను. “పాపడూ! రాత్రి బాగా నిద్రపట్టిందా? మాకిక్కడ రాత్రవుతూంటే నీకక్కడ పగలవుతూంది కదూ? అమేరికాలో హోటెల్లో ఉన్నావుగా, అక్కడ నీకు టీ దొరుకుతుందా?” మొదలయ్యాయి అమ్మ ప్రశ్నలు. నేను ఏకైకసంతానమయినందువల్ల అమ్మకు నేనే ప్రపంచం. నేనూర్లో లేనప్పుడు రోజుకు రెండు సార్లైనా నాతో మాట్లాడ్డం కుదరక పోతే బెంగ పెట్టుకొని ఏడుస్తుంది అమ్మ. ఇదే మొదటి సారి విదేశంలోఉన్నానని అమ్మ మామూలు కంటే ఎక్కువ బెంగ పడ్తూందేమో.

“అన్నీ దొరుకుతాయి అమ్మా! నువ్వేమీ బెంగ పడొద్దు.” అంటున్నట్టే అమ్మ “పాపడూ! నువ్వు నా కోసం అక్కడ్నుంచి ఓ ట్యాబ్లెట్ తీసుకు రాగలవా?” అనడిగితే కలో నిజమో తెలీక“ఏమన్నావమ్మా?” అని అమ్మను మళ్ళీ మళ్ళీ అడిగి తెల్సుకొన్నాను. ఎప్పుడూ నా నుంచీ ఏమీ కోరని అమ్మ తన కోసం ఈ రోజు ట్యాబ్లెట్ కొని తెమ్మంటుంటే నా చెవులను నేనే నమ్మ లేకపోయాను. బి.ఎస్సి. దాకా ప్రతి క్లాస్లోనూ టాపర్‌గా వున్నట్టి అమ్మ పెళ్ళయిన తర్వాత పూర్తిగా మారాల్సి వచ్చిందట. పద్ధతులు, సంప్రదాయాల పేరుతో అమ్మకు అన్ని రకాల పనులు అప్పజెప్పారుఅత్తగారూ తోడికోడళ్ళు. అందర్లో చిన్నదైన అమ్మపై ఆడపడుచులు కూడా అధికారం చెలాయిస్తారు. అత్తగారింట్లో ఆడపిల్లల చదువులకు ఏ మాత్రమూ విలువ లేదని తెల్సి, ఇంట్లో మిగతా ఆడవాళ్ళమాదిరి ఇంటి పని, వంట పని, పూజలు, వ్రతాలే తన జీవితం చేసుకొనిందమ్మ. రాజీ చేసుకోవడమే జీవితం అంటుందమ్మ. ఇప్పుడు ఆడపడుచులు పెళ్ళిళ్ళయి, తోడికోడళ్ళు అందరూ విడి విడిగాజీవిస్తున్నా కూడా అత్తగారింటి పద్ధతులను తూచా తప్పకుండా పాటిస్తుంది. బహుశః భయం వల్లనేమో! అమ్మ మళ్ళీ ఒక తరం వెనకటి వాళ్ళలా ఆలోచించేదనిపించేది. నేనెప్పుడూ అమ్మతోకంప్యూటర్ల గురించిగానీ, ట్యాబ్లెట్ గురించిగానీ మాట్లాడిన జ్ఞాపకం లేదు. అమ్మకు ఉన్నట్టుండి ట్యాబ్లెట్ వాడటం నేర్చుకోవాలన్న ఆసక్తి ఎలా పుట్టిందా అని ఆశ్చర్యపడ్డాను.

“అదేంటమ్మా? ఉన్నట్టుండి ట్యాబ్లెట్ కావాలంటున్నావు? ఎప్పుడూ నన్నేమీ అడగని నువ్వు ట్యాబ్లెట్ తీసుకురమ్మని అడుగుతుంటే నమ్మలేక పోతున్నాను.” నా ఆశ్చర్యం నా గొంతులోనేఅమ్మకు తెల్సిపోయి ఉంటుంది. అసలు విషయం అప్పుడు తెల్సింది. బెంగళూర్లో ఉంటున్న అమ్మ వాళ్ళ చిన్నాన్న చెప్పారట అమేరికా నుంచి ఒక మంచి ట్యాబ్లెట్ తెప్పించుకొమ్మని,  అది చాలాఉపయోగపడుతుందని! తల్లిదండ్రులు పోయిన తర్వాత అమ్మకు ఈ చిన్నాన్నే తల్లిలా, తండ్రిలా పలకరించడం, పండగలకు రమ్మని ఆహ్వానించడం నాకు తెల్సు. తను కెమిస్ట్రి ప్రొఫెసర్‌గా పని చేసిపదేళ్ళ క్రితమే నివృత్తి పొంది, తమ కూతురితో ఉంటున్నారు. నేనతన్ని చిన్ని తాతయ్యా అని పిలిచేదాన్ని. ఆరోగ్యమే మహాభాగ్యమని నమ్మే తను రోజూ తెల్లవారుతున్నట్టే కనీసం ఐదు మైళ్ళదూరం పరుగెత్తుతారు. తన పరుగులు యువకుల పరుగుల కంటేనూ చురుగ్గా ఉండి నాకైతే చీతాని గుర్తు తెస్తాయి. కాబట్టి నేను చిన్ని తాతయ్యను అభినందించి షార్ట్‌గా చీతా అని కూడాపిలుస్తుంటాను.

అలా పిలవ కూడదని అమ్మ నాపై కోప్పడింది. అయితే తను “ఏంటోయ్! నన్ను మళ్ళీ చీతాతో పోలుస్తున్నావు” అని నవ్వారంతే. ఆ నవ్వులో సగర్వ సంతోషం కూడా ఉండింది.అమ్మకీ చిన్నాన్నంటే భలే ఇష్టం. చిన్నాన్న ఏం చెప్పినా తన మంచికేననే భావం అమ్మలో. అందుకే నేనెన్ని రోజులుగా కంప్యూటర్ వాడే విధానం నేర్పుతానన్నా అవన్నీ తనకెందుకనినేర్చుకొనేందుకు అస్సలు ఒప్పుకోని అమ్మ, ట్యాబ్లెట్ వల్ల చాలా ఉపయోగమవుతుందని చిన్నాన్న చెప్పగా ఒప్పుకొన్నట్టుంది. నా స్నేహితుల్లో ఒకరు కూడా తన కోసం ఒక ట్యాబ్లెట్ వీలైతేతెమ్మన్నారు. అయితే అందరూ అమ్మ తర్వాతే కదా! ఈ రోజుల్లో తాంత్రిక జ్ఞానం ఎన్నో విధాలుగా ఎంతగానో తోడ్పడుతుందని వివరిస్తూ పలు విధాల ప్రయత్నించినా కూడా అమ్మెందుకో నాకంప్యూటర్ వైపుక్కూడా రాలేదు.

అట్లాంటిది ఇప్పుడు చీతా సలహా వల్ల అమ్మ ఒప్పుకొనిందంటే, అంత కంటే భాగ్యమా అనుకొన్నాను. అమ్మ కోసమని ట్యాబ్లెట్ కొనేందుకు సంతోషంతో ఎగిరిగంతేశాను. వాళ్ళ చిన్నాన్న మాటను గౌరవించి, ఆయన చెప్పిన కంపెనీదే కొంటే అమ్మకు సంతోషమవుతుందని దాని గురించి అమ్మనడిగాను. ఇంజినీయర్ని కాబట్టి నాకు తెల్సినంతగా చీతాకుతెల్సుండదనే భావం మనసులో కదిలింది. అయితే ఏ మాడెల్ అయితేనేం? ఏ కంపెనీదైతేనేం? శుభస్య శీఘ్రం. అమ్మ దాన్ని వాడటం నేర్చుకొంటే, నేనెక్కడున్నా ఒకరినొకరు చూస్తూ రోజూమాట్లాడవచ్చు, ఈమేల్స్ రాసుకోవచ్చు, ఫోటోస్ చూసుకోవచ్చు. అది ముఖ్యం కదూ అనుకొన్నాను. ఒక్కొక్కటిగా అన్ని టూల్స్ వాడేందుకు అలవాటు చేసుకోవచ్చు. సంస్కృతం, సంగీతం,సాహిత్యం మున్నగు వాటిలో ఆసక్తి ఉన్న అమ్మకు ఇంట్లోనే ఒక లైబ్రరి దొరికినట్టవుతుంది.

తనకిష్టమైన ఎన్నో విషయాల గురించి ఒక క్లిక్కులో తెల్సుకోవచ్చు. కోరుకొన్న సంగీతంవినిపించుకోవచ్చు. తనక్కావల్సిన పుస్తకాలను ఇ-షాపింగ్ ద్వారా తెప్పించుకోవచ్చు. Technology nullifies distance! టెక్నాలజీని మనకు సహాయకారిగా మల్చుకొంటే జీవితం స్వర్గసమానమనిపించింది. అప్పుడు నేనింట్లో లేనని అమ్మకు ఒంటరితనమనిపించదు. నాపై ప్రాణాలు పెట్టుకొన్న అమ్మ మనసుకు ఇబ్బంది పెడ్తున్నానన్న బాధ ఇంటి నుంచి దూరంగా ఉన్నప్పుడునాకుండదు. ఆలోచనలు ఒక్కుమ్మడిగా దూసుకొచ్చాయి. మనోవేగాన్ని మించిన వేగం లేదు కదూ.

“కంపెనీ పేరు కూడా కావాలా? ట్యాబ్లెట్ పేరు సరిగ్గా తెల్సుకొని చెప్తాను. చిన్నాన్న నిన్ననే కాశీ యాత్రకు బయలుదేరారు. వస్తున్నట్టే అడిగి చెప్తాలే. నువ్వింకా ఒక నెల్రోజులు అక్కడే ఉంటావుగా.”అనింది అమ్మ ఫోన్ పెడ్తూ.

నాతో తీసుకొచ్చిన ఇన్‌స్టంట్ ఉప్మా మిక్స్‌ను నీళ్ళతో కలిపి రైస్ కుక్కర్లో ఉంచి స్నానానికెళ్ళాను. నేను తయారయ్యేంతలో ఉప్మా కూడా తయారుగా ఉండింది. గబగబా ఉప్మా తినేసి, ట్యాక్సీలో మాఆఫీస్‌కెళ్ళేటప్పటికి తొమ్మిది దాటింది. కొందరప్పుడే ఫోన్లో మాట్లాడ్డం వల్ల బాగా పరిచయమున్నవాళ్ళే. మిగతా వాళ్ళను మా మ్యానేజర్ ఒక్కొక్కరినీ పరిచయం చేశారు. చిరునవ్వుల స్వాగతాలతోఆ రోజు అక్కడ నా పని మొదలయ్యింది. అమ్మ ఫోన్ వల్ల శుభారంభమైన ఆ రోజు నాకు అతి ఉల్లాసంగా, ఆనందంగా గడిచింది. అమ్మతో నా అనుభవాలన్నీ ఇంటర్నెట్ ద్వారా పంచుకొంటున్నట్టుఊహించుకొంటూ ఆనందపడ్డాను. సంతోషంతో ఊగిపోయాను. స్వర్గానికి ఈ ట్యాబ్లెట్టే మెట్టనిపించింది. నా ఇన్నాళ్ళ కలలు నిజం చేస్తున్న చీతాకు మనసులోనే జోహార్లర్పించాను.

అమేరికాలో ఉన్నన్నాళ్ళూ అమ్మ రోజూ ఫోన్లో మాట్లాడింది. పూట పూటకూ సరిగ్గా భోజనాలు చేయాలని, ఎండలెక్కువ కాబట్టి పండ్లు, నీళ్ళు ఎక్కువగా తీసుకొని ఆరోగ్యం కాపాడుకోవాలనే వైపుకేసాగాయి మా కబుర్లు. తను ట్యాబ్లెట్ గురించి మళ్ళీ గుర్తు చేయక పోయినా, నా మనసులో దాని గురించి ఆలోచనలు పీట వేసుకొని కూర్చొన్నాయి. నేను మాల్స్‌లో కొద్దిగా విండో షాపింగ్ చేశానుట్యాబ్లెట్ కోసమని.

ఆన్ లైన్లో కూడా వెదికాను మంచి ట్యాబ్లెట్ కొనాలని. మూడు వారాల సమయం గడిచింది. నేనొచ్చిన ఆఫీస్ పని అద్భుతంగా ముగించి అందరి అభినందనలతో వీడ్కోలుతీసుకొన్నాను. ఇక ట్యాబ్లెట్ కొనే విషయంలో జాప్యం చేయకూడదనుకొని దాని గురించి అమ్మనడిగితే చిన్నాన్నింకా యాత్రల నుంచి రాలేదని తెల్సింది. చివరి వారమంతా ట్రావెలింగ్‌లో ఊర్లుతిరుగుతుంటాను కదాని అమ్మకు చెప్పకుండా నేనే ఒక మంచి ట్యాబ్లెట్ కొన్నాను అమ్మ కోసమని. ఇది ఖచ్చితంగా చీతా సూచించే దాని కన్నా మెండే అయివుంటుందన్న గట్టి నమ్మకంతోనే అదికొన్నాను. మూడు వారాల పాటు టెక్సస్ ఎండలననుభవించిన తర్వాత ఫ్లారిడా బీచుల్లో తిరగడం సర్గతుల్యంగా ఉండింది నాకు.  కెనడి స్పేస్ సెంటర్లోకెళ్ళడం చంద్రలోకానికే అడుగు పెట్టినంతసంతోషాన్నిచ్చింది. న్యూయార్క్‌లోని లిబర్టి స్టాచ్యూ చూస్తే మన లుంబిని స్టాచ్యూ గుర్తొచ్చి హోమ్ సిక్నెస్ ఎక్కువయ్యింది.

క్యాలిఫోర్నియాలోని గోల్డెన్ గేట్ దగ్గరుండగా అమ్మనుంచి ఫోనొచ్చింది. “చిన్నాన్న యాత్రలు ముగించుకొని వచ్చారోయ్. నాక్కావల్సిన ట్యాబ్లెట్ పేరు మూవ్ ఫ్రీ అని. నీకు వీలైతే అది తీసుకొని రా.నా కాళ్ళ నొప్పులు దాని వల్ల బాగా తక్కువవుతాయంట.” అమ్మ మాటలు విని గొంతులో వెలక్కాయ పడ్డట్టయి, అవాక్కయ్యాను. అంటే అమ్మ ఇన్ని రోజులూ ట్యాబ్లెట్ అన్నది మాత్రల కోసమా!అమ్మ మాటని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం నా తెలివి తక్కువ పని అనిపించింది. అయితే ఈ కంప్యూటర్ల యుగంలో అమ్మకు ట్యాబ్లెట్‌కున్న ఇంకో అర్థం తెలియజెప్పని నా ఇంజనీయర్ పదవికేసిగ్గనిపించింది. నా చదువుల గురించి, కంప్యూటర్ల గురించి అమ్మకు చెప్పేందుకు ఒకటి రెండు సార్లు ప్రయత్నించానంతే. అయితే అమ్మ మొహంలోని నిరాశ, నిస్పృహ, నిరాసక్తి నా ప్రయత్నాలనుమానుకోజేసేవి. అమ్మ స్నేహితుల్లో కూడా ఎవరూ కొత్త విషయాలను తెల్సుకొనే ఆసక్తి లేనివారనిపించేది. తప్పు నాలో కూడా ఉంది. అనుకొన్నది సాధించక ముందే నా ప్రయత్నాల నుంచివిరమించడం నా తప్పే కదా.

అమ్మ ఎక్కువగా మాట్లాడక పోయినా, తను కీళ్ళ నొప్పితో బాధపడటం నాకు తెల్సు. అయితే అమ్మ ట్యాబ్లెట్ అన్నప్పుడు ఒక్క సారైనా అది కీళ్ళ నొప్పికి మాత్ర అయివుండొచ్చనే అనుమానంనాకు ఆవ గింజంతైనా రాలేదు. అది నా మూర్ఖతనమంతే! దానికి ఎవర్ని దూషించి ఏం లాభం! నేను మళ్ళీ అంతగా కలలు కనడం నా తప్పేమో. అయితే మనసులోనే నా తక్షణ కర్తవ్యం గురించిఆలోచించి, తీర్మానించుకొన్నాను.

మరుసటి రోజే అమ్మ చెప్పిన ఆ మాత్రలు కొన్నాను. అమ్మకని కొన్న ట్యాబ్లెట్ వేరే ఎవరికీ ఇవ్వాలనిపించలేదు. నేను కన్న కలలు నిజం చేసుకోవాలంటే నాప్రయత్నాలు మానకూడదనుకొన్నాను. ఈ సారి ఊరెళ్ళినప్పుడు అమ్మకు ఇంటర్నెట్ వాడే విధానం నేర్పించి తీరాలనే పట్టుదలతో ఇంటికి చేరాను రెండూ ట్యాబ్లెట్స్ తీసుకొని. రెంటినీ అమ్మ చేతిలోఉంచుతూ అసలు విషయం చెప్పాను. ఆ నెల్రోజులూ నేను అమ్మ గురించి కన్న కలల్ని, తడబడుతూ, వివరిస్తుంటే నా కళ్ళలో విషాదం నిండుకొంది. అమ్మకు నా తపన అర్థమయ్యుండాలి. నన్నుదగ్గరికి తీసుకొని నొసటిపై ముద్దుపెట్టిందమ్మ. తన చేతిలో నేనుంచిన ట్యాబ్లెట్టుక్కూడా ముద్దు పెట్టింది.

అమ్మ కోసం నేను ఆశతో కొని తెచ్చిన మొదటి కానుక అది. అమ్మ నన్ను నిరాశ పర్చలేదు.పిల్లల సంతోషం కోసం అమ్మలు ఏమైనా చేయగలరు. అమ్మ కోసమని నేను తెచ్చిన ట్యాబ్లెట్ అమ్మలోని కాలేజ్ స్టూడెంట్‌ను మేల్కొలిపిందేమో. అమ్మలోని చదువుల ఆసక్తిని తట్టి లేపింది. ట్యాబ్లెట్వాడటం చీతా వేగంతో నేర్చుకొనిందమ్మ. ఇంట్లోనే లైబ్రరి ఉన్నట్టుగా ఉందోయ్ అనిందమ్మ. మొత్తానికి ఈ ట్యాబ్లెట్ ఒక కొత్త ప్రపంచాన్నే అమ్మ కళ్ళ ముందుంచి, నాకు మూవ్ ఫ్రీస్వాతంత్ర్యాన్నిచ్చింది. అమ్మతో ఈమేల్ ద్వారా మరియు ఫేస్ బుక్, వాట్సాప్ల ద్వారా రోజూ అన్ని విషయాలు పంచుకోవడం వల్ల నేను ప్రపంచంలో ఎక్కడున్నా అమ్మతోనే ఉన్నట్టుగా ఉంది.

అమ్మఇంటర్నెట్ ద్వారా తన చిన్నన్నాటి స్నేహితులను, టీచర్లను ఎందర్నో కలిసింది. ఇంటర్నెట్ ద్వారా రోజూ కొత్త విషయాలు తెల్సుకొంటూ ఇది అర చేతిలో వైకుంఠం చూపిస్తుంది పాపడూ అంటూమురిసిపోయింది అమ్మ. ఇవన్నీ కనిపెట్టిన వారు ధన్యులంటూ ‘ఎందరో మహానుభావులు! అందరికీ వందనములు!’ అని పాడిందమ్మ. ముభావంగా మూడు ముక్కలు మాట్లాడే అమ్మ ఇప్పుడుగలగలా మాట్లాడుతుంది. అంతే కాదు, ఇంటర్నెట్ ద్వారా సంస్కృతం నేర్చుకొని సంస్కృతంలో ఓపన్ యూనివర్సీటీలో ఎం.ఎ. చేస్తూందమ్మ! మన పూర్వజుల భాషైన సంస్కృతం నేర్చుకొనివేదోపనిషత్తులను చదివి ఆనందించాలనే అమ్మ కల నిజమవుతూంది.

చీతా చెప్పిన కీళ్ళ నొప్పి ట్యాబ్లెట్లో నాన్వెజిటేరియన్ అంశాలున్నాయని వాటిని శుద్ధ శాకాహారియైన అమ్మ వాడనేలేదు. అవి వాడదగిన తన స్నేహితులకెవరికో ఇచ్చేసింది. ఆ మూవ్ ఫ్రీ ట్యాబ్లెట్వాళ్ళ కీళ్ళ నొప్పి పోగొట్టిందో లేదో తెలీదు. అయితే ఈ ట్యాబ్లెట్ తెచ్చిన సరికొత్త చదువుల సంతోషాలతో అమ్మ కీళ్ళ నొప్పి వచ్చినట్టే మాయమయ్యింది! వీటన్నిటి క్రెడిట్ నూటికి నూరు పాళ్ళుచీతాకే అంటే అమ్మా వాళ్ళ చిన్నాన్నకే చెందాలి. ఎందుకంటే వీటికంతటికీ మూల కారణం చీతా ఇచ్చిన ట్యాబ్లెట్ సలహాయే!

థ్యాంక్యూ చీతా!

*

కొనాలి

మొయిద శ్రీనివాస రావు

 

పొద్దున్నే… పదిగంటలకే

పండు మిరపకాయలా

ఎండమండిపోతుంటే

అంతవరకూ … ఆ ఊరిలో

కాకిలా తిరిగిన నేను

తాటికమ్మల కింద

తాబేలులా వున్న

ఓ బడ్డీ కాడ

కాసేపు కూర్చున్నాను

ఎండిన రిట్టకాయ రంగున్న

ఓ పిల్లాడు

ఒత్తైన జుత్తు బొమ్మలున్న

రెండు ‘చిక్’ షాంపూలు పట్టుకెళ్ళాడు

పలచగా పలకర్రలా వున్న

ఓ పిల్ల… డొర్రి పల్లెల్లబెట్టి నవ్వుతూ

‘క్లోజప్’ లా కదిలిపోయింది

శొంటి కొమ్ములాంటి

ఓ ముసలాయిన

‘నవరత్న’ ప్యాకెట్ లా నడిచిపోయాడు

సగముడికిన కూరలాంటి

ఓ ముసాలామె

‘ప్రియా’ పచ్చడి ప్యాకెట్టై

వడివడిగా ముందుకు సాగిపోయింది

లేగదూడకు సైతం పాలివ్వలేని

గోమాతలాంటి ఒకామె  ‘విశాఖ డైరీ’

పాల ప్యాకెట్టై పరుగులు తీసింది

నోట్లోంచి నువ్వుగింజే నాననట్టున్న

ఒకాయిన

‘రిలయన్స్’ రీచార్జ్ కార్డై

రింగుటోనులా రివ్వున పోయాడు

పల్లె కొట్లలో… చిన్న ప్యాకెట్లలో దాగిన

వ్యాపార సూత్రం వడగాలై తాకి

నా గొంతెండిపోతుంటే

‘ఇప్పుడన్నీ చిన్నవేలాగున్నాయ’న్న  నా ప్రశ్నకు

‘అందరూ కొనాలి కద సార్’ అన్న సమాదానం

ఓ స్మాల్ ‘కోలా’ డ్రింకై

కూలుగా నా చేతిలో వాలింది

       * * *

Moida

“చింటూ.. అమ్మెక్కడ?”

వినోద్ అనంతోజు 

 

Vinod Anantojuఇల్లు దగ్గరపడుతున్నా కొద్దీ సౌజన్య గుండె వేగంగా కొట్టుకోసాగింది. కారు వాళ్ళింటి మట్టిరోడ్డులోకి ప్రవేశించింది. రోడ్డు మీది గతుకులకి కారులోని సామానంతా కదిలిపోతోంది. వాటిలో సగానికి పైగా చింటూగాడి కోసం తెచ్చిన బొమ్మలే. వాడికిప్పుడు రెండు నెలలు తక్కువ రెండేళ్ళు.

ఆ రోజు Airport లో వాడి ఏడుపు ఆపడం దాదాపు అసాధ్యమయ్యింది. ఆకలేస్తోందేమో అని సౌజన్య పాలు కూడా పట్టింది. శ్రీధర్ వాణ్ని ఎత్తుకుని అటూ ఇటూ ఒక అరగంట నడిచాడు. ఇమ్మిగ్రేషన్ అనౌన్సుమెంటు వస్తోంది. వాడింకా ఏడుపు ఆపలేదు. చేసేది లేక ఏడుస్తున్న వాడినే అమ్మ చేతికి అప్పగించి ట్రాలీ నెట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు ఇద్దరూ. అప్పుడే సంవత్సరం గడిచిపోయింది.  ఇప్పుడు వాడు నడుస్తున్నాడు, పరిగెడుతున్నాడు, బోలెడు మాటలు చెపుతున్నాడు.

గేటు తెరుచుకున్న చప్పుడు అవ్వగానే ఇంట్లోంచి హైమావతి గబగబా బయటికొచ్చింది. తడి చేతులు కొంగుతో తుడుచుకుంటూ కూతురిని కౌగిలించుకుంది. శ్రీనివాసరావు అల్లుడికి సామాను దించడంలో సాయం పట్టడానికి కారు దగ్గరికి వెళ్ళాడు. సంవత్సరం తరవాత వచ్చారు కూతురు అల్లుడు. హైమావతి కళ్ళు ఇంత పెద్దవి చేసుకుని కూతురుని తేరిపార చూస్తోంది. ఆవిడ సంతోషానికి అవధుల్లేవు. సౌజన్య కళ్ళు మాత్రం చింటూ గాడి కోసం వెతుకుతున్నాయి.

“ఏడి వాడు? నిద్రపోతున్నాడా?” అడిగింది సౌజన్య.

“లేదమ్మా.. లేచే ఉన్నాడే.. దొడ్లో ఆడుకుంటున్నాడు అనుకుంటా. చింటూ…!!” కేకేసింది హైమావతి.

దొడ్డి గుమ్మంలోంచి కర్రపుల్ల ఒకటి పట్టుకుని ఊపుతూ వచ్చాడు చింటూ. తనని చూడగానే “అమ్మా” అని ఎగిరి గంతేసి వాటేసుకుంటాడు అనుకుంది సౌజన్య. కాని వాడి కళ్ళలో ఎవరో కొత్త మనుషులని చుసిన బెరుకు కనపడింది. దగ్గరికి రాకుండా అమ్మమ్మ కాళ్ళ వెనకాలే దాక్కున్నాడు. సౌజన్య గుండె కలుక్కుమంది.

“ఛీ.. ఎంత సినిమాటిక్ గా ఉహించుకున్నాను.” అని తనలో తాను సిగ్గుపడింది.

వాణ్ని దగ్గరికి తీసుకుని “నేను చింటూ… అమ్మని” అని పరిచయం చేసుకునేటప్పుడు ఎందుకో ఆమె గొంతు వణికింది. శ్రీధర్ కూడా దగ్గరికి తీసుకోవాలని ప్రయత్నించాడు. చింటూ ఇబ్బందిగా మూలుగుతూ వాళ్ళ చేతులు విడిపించుకుని అమ్మమ్మ వెనక పరిగెత్తాడు.

“అమ్మా నాన్నా వచ్చారమ్మా.. దగ్గరికెళ్ళూ..” హైమావతి అల్లుడికి కుర్చీ వెయ్యాలి, ఫ్యాన్ స్విచ్ వెయ్యాలి, మంచి నీళ్ళివ్వాలి అనే హడావిడిలో ఉంది. చింటూ దూరంగా నిలబడి పుల్ల నోట్లో పెట్టుకుని బెరుకుగా చూస్తున్నాడు.

“ఏమయ్యింది వీడికి? రోజు Skype లో బాగానే మాట్లాడుతాడు కదా!” సౌజన్యకి దుఃఖం కలుగుతోంది.

chinnakatha

నడవడం కూడా రాని బిడ్డని వదిలి అమెరికా వెళ్ళడం సౌజన్యకి అంతగా ఇష్టంలేదు. కానీ తప్పలేదు. శ్రీధర్, సౌజన్య ఇద్దరూ ఒకే సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఇద్దరికీ ఒకేసారి Onsite కి అమెరికా వెళ్ళే అవకాశం వచ్చింది. ఎంత అదృష్టం ! ఈ అవకాశాన్ని వదులుకోవడం శ్రీధర్ కి ఎంతమాత్రం ఇష్టం లేదు. “ఒక్క సంవత్సరం ఓపిక పడితే లైఫ్ సెట్ అయిపోతుంది. ఎంత కాదనుకున్నా ఇద్దరి మీదా కలిపి యాభై లక్షలు అయినా మిగుల్చుకుని రావొచ్చు.” అన్నాడు శ్రీధర్. సౌజన్యకి కూడా అమెరికా వెళ్లాలని డ్రీమ్. కాకపొతే బాబు గురించి ఆలోచిస్తోంది.

“బాబుని ఇక్కడే ఉంచుదాం. అక్కడ మనిద్దరం ఆఫీసు కి వెళితే బాబు నెవరు చూసుకుంటారు?” అన్నాడు శ్రీధర్.

“మంచి Babysitter ని పెడదాం. ఏమంటావ్?” అడిగింది సౌజన్య.

“వద్దు టీవీల్లో చూస్తున్నాం కదా. Babysitter లు పసి పిల్లల మీద ఎలాంటి అకృత్యాలు చేస్తారో. అయినా మన బిడ్డని పరాయి వాళ్ళ చేతుల్లో పెట్టడం ఎందుకు? మీ అమ్మా నాన్నా ఉన్నారు కదా !”

“ఉన్నారులే కానీ….”

“ఒక్క సంవత్సరమేగా… కావాలంటే నేను అడుగుతాను మీ అమ్మానాన్నలని“

అమ్మానాన్నా చాలా సంతోషంగా ఒప్పుకున్నారు. ఇంట్లోకి ఒక కంప్యూటర్ పెట్టించి, నాన్నకి Skype Call ఎలా మాట్లాడాలో నేర్పించింది సౌజన్య.

అమెరికాలో ఎంత ఉరుకులు పరుగులు ఉద్యోగమయినా కనీసం రెండు మూడు రోజులకి ఒకసారయినా Skype Call మాట్లాడేది సౌజన్య. మొదట్లో అమ్మానాన్న మాత్రమే మాట్లాడేవారు.

“ఈరోజు చింటూ నన్ను ‘అమ్మా’ అన్నాడమ్మా!”, “లేచి కాళ్ళమీద నిలబడ్డాడమ్మా”, “పడిపోకుండా అంత దూరం నడిచేశాడమ్మా!”, “వాళ్ళ తాతయ్య చెప్పులేసుకుని డింగ్ డింగ్ అని పరిగెత్తాడమ్మా!” అని హైమావతి చెపుతుంటే సౌజన్యకి ఆనందంతో కళ్ళు చెమర్చేవి. అదే సమయంలో ఇవన్నీ చూడటానికి తను చింటూ దగ్గర లేనే అని బాధ కలిగేది. తన ప్రమేయం లేకుండానే తన బిడ్డ పెరిగిపోతున్నాడనే భావన ఆమెని చాలా కాలం వెంటాడింది.

రాను రాను Call లో అమ్మానాన్నల మాటలు తగ్గిపోయి చింటూ గాడి కిలకిలలు పెరిగిపోయాయి. ఎన్ని కబుర్లు చెప్తున్నాడో వాడు! Skype Call లో సౌజన్య తో మాట్లాడకపోతే అన్నం తినేవాడు కాదు. అందుకని సౌజన్య ప్రతిరోజూ తప్పకుండా Call మాట్లాడేది.

ఇండియా కి వచ్చెయ్యడానికి ఇంకా నెల ఉండగానే సౌజన్యలో చింటూ గాడిని కలవబోతున్నాననే ఆత్రుత మొదలయ్యింది. ఎన్నెన్నో ఉహించుకుంది. ఎన్నో రకాల ఖరీదైన బొమ్మలు, చాక్లెట్లు కొనింది. వాటన్నిటినీ వాడికిచ్చి సంవత్సర కాలంగా పెరిగిన దూరాన్ని ఒక్క క్షణంలో చెరిపెయ్యాలనుకుంది.

ఆరోజు సాయంత్రానికి గానీ చింటూ దగ్గరికి రాలేదు. నలుగురూ చెప్పగా సౌజన్యని అమ్మా అని పిలిచాడు. బొమ్మలు, చాక్లెట్లు అన్నీ ఇచ్చి నవ్వించారు. వాడి నవ్వు సౌజన్యకి వర్షంలో తడిసిన అనుభూతినిచ్చింది. వాణ్ని గట్టిగా హత్తుకుని ముద్దుపెట్టుకుంది.

“చింటూ.. ఆం తిందూరామ్మా!” హైమావతి పిలిచింది.

చింటూ పరిగెత్తుకుంటూ వెళ్లి కంప్యూటర్ ముందు కూచున్నాడు.

“ఏంటి నాన్నా అక్కడ కూచున్నావు… ఇక్కడికి రా”

చింటూ కంప్యూటర్ మౌస్ ని ఆడిస్తూ “అమ్మని చూపిచ్చూ…” అన్నాడు.

సౌజన్యకి ఏమి అర్థం కాలేదు. చింటూని ఎత్తుకుంది. హైమావతి దగ్గరికొచ్చి వాడి బుగ్గ పట్టుకుని “అమ్మని చూపించేదేంట్రా వెర్రి నాగన్నా ! ఇదిగో అమ్మా!”

“ఉహు.. ఈ అమ్మ కాదు కంప్యూటర్ లో అమ్మ చూపిచ్చూ!” అన్నాడు సౌజన్య చేతుల్లోంచి విడిపించుకోవాలని ప్రయత్నిస్తూ.

“నేనే నాన్నా ఆ అమ్మని… ఇటూ చూడు…” అంటూ సౌజన్య చింటూని వదలకుండా వాడి తల తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నించింది.

“ఉహు.. ఊహు… ఊ…..హు…” చింటూ గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు.

ఆ తల్లి మౌనంగా ఉండిపోయింది.

 

****

ఇరవయ్యేళ్ళ తరవాత కూడా…ధ్యేయం!

 

కొల్లూరి సోమ శంకర్

కొల్లూరి సోమశంకర్

సుమారు పాతికేళ్ళకు పైగా సాహిత్య రంగాన్ని ప్రభావితం చేసిన ఓ సుప్రసిద్ధ రచయిత రచించిన పుస్తకాలలో ఏది మంచిది లేదా ఏది ఉత్తమమైనదనే ప్రశ్న తలెత్తినప్పుడు పాఠకులందరూ ఒకే నవలని లేదా ఒకే పుస్తకాన్ని ది బెస్ట్‌గా పేర్కొనడం చాలా అరుదు.

యండమూరి వీరేంద్రనాథ్! ఈ పేరు చదవగానే ఎన్నో అద్భుతమైన నవలలు మనసులో మెదులుతాయి. వెన్నెల్లో ఆడపిల్ల, ఆనందోబ్రహ్మ, అంతర్ముఖం, అంకితం, యుగాంతం, చీకట్లో సూర్యుడు, కాసనోవా 99, ఆఖరి పోరాటం, 13-14-15, డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు, డబ్బు మైనస్ డబ్బు, మరణ మృదంగం, రాక్షసుడు, అనైతికం, రెండు గుండెల చప్పుడు, ప్రార్థన, నల్లంచు తెల్లచీర, ప్రేమ, డేగ రెక్కల చప్పుడు, ఓ వర్షాకాలం సాయంత్రం… ఇలా నవల ఏదైనా… విభిన్నమైన ఇతివృత్తాలతో చదువరులలో ఉత్కంఠను రేకెత్తిస్తూ, ఆసక్తి కలిగేలా వ్రాయగలడంలో దిట్ట శ్రీ యండమూరి వీరేంద్రనాథ్. కమర్షియల్ నవలలోనూ చక్కని సందేశాన్ని అంతర్లీనంగా జొప్పించి పాఠకులకు, ప్రచురణకర్తలకూ ఉభయతారకంగా ఉండేలా వ్రాయగల నేర్పరి ఆయన.

యండమూరి గారు నవలలతో పాటు మనోవిశ్లేషణ/వ్యక్తిత్వ వికాసం పుస్తకాలు కూడా రచించారని పాఠకులందరికీ తెలుసు. “మిమ్మల్ని మీ పిల్లలు ప్రేమించాలంటే?” అనే మనోవిశ్లేషణా రచన వెలువడిన తర్వాత సుప్రభాతం పక్షపత్రికకి ధారావాహిక వ్రాయాల్సి ఉన్నప్పుడు – “నాకు కమర్షియల్ గిమ్మిక్కులు లేకుండా సామాజిక ప్రయోజనం ఉండేట్లు నిజ జీవితాన్ని ప్రతిబింబించేలా ఒక నవల వ్రాయండి” అని ఆ పత్రికాధిపతి రత్తయ్య గారు అడిగారట! ఫలితమే “ధ్యేయం” అనే నవల!

20 జనవరి 1993 నుంచి 5 మార్చి 1994 వరకు, కథనానికి తగ్గ బొమ్మలతో (చిత్రకారుడు ‘గడియారం శ్రీ’) సుప్రభాతం పత్రికలో సీరియల్‌గా వెలువడింది [సీరియల్‌ పూర్తయ్యాక ఈ నవలని నేను బైండ్ చేసి ఉంచుకున్నాను… ఈ తేదీల వివరాలన్నీ అందులోంచే…]. తొలిసారి ప్రచురితమై దాదాపు 21 ఏళ్ళు దాటినా నవల ప్రాసంగిత ఏ మాత్రం తగ్గలేదనడంలో అతిశయోక్తి లేదు.

సీరియల్ ఆఖరి భాగంలో ‘ఇదీ కథ’ అనే బాక్స్ ఐటమ్‌లో “చెట్టుని చూసి మనిషి నేర్చుకోవలసింది చాలావుంది. కాండాన్ని కత్తిరించినా పక్కనుంచి చిగురేస్తుంది. కానీ మనిషి – చిన్న కష్టానికే బెంబేలు పడిపోతాడు. అలా పడకూడని శక్తి, పిల్లలకి పెద్దలే ఇవ్వాలి. .. పెద్దలకే ఆ శక్తీ, అవగాహన లేకపోతే మరి పిల్లల భవిష్యత్? తన లక్ష్యాన్ని చేరుకోడానికి మనిషేం చేయాలన్నదే ‘ధ్యేయం’ ఇతివృత్తం.” అంటూ నవల సారాంశాన్ని క్లుప్తంగా చెప్పారు.

***

పిల్లల ఎదుగుదలలో కౌమార, యవ్వన దశలు అతి ముఖ్యమైనవి. వారి జీవితాలను నిర్దేశించే దశలు కూడా ఇవే. ‘చిన్న పిల్లలు, వాళ్ళకేం తెలుసు’ అనుకునే తల్లిదండ్రులు కొందరు; ‘పిల్లల్ని స్వేచ్ఛగా వదిలేస్తే, వాళ్ళే నేర్చుకుంటారు’ అనుకునే అమ్మానాన్నలు మరికొందరు. ఇద్దరిదీ తప్పే!

తాము చేరుకోలేని గమ్యాలకి తమ పిల్లలని చేర్చి తృప్తి పడాలనుకునే తల్లిదండ్రులది మరో రకం తప్పు. తాము తప్పులు చేస్తూ, ఆత్మవంచన చేసుకుంటూ, ఎదుటి వారి గోరంత పొరపాట్లను కొండంత చేసి ఎగతాళి చేసే పెద్దలది మరో తరహా తప్పు.

ఇన్ని తప్పుల మధ్య ఒప్పుగా పిల్లలని పెంచడం అతి తక్కువ మందికే సాధ్యమవుతుంది. పిల్లల బాల్య, యవ్వన దశలు తల్లిదండ్రులకే కష్టమైన కాలం. పిల్లల వయసుని దృష్టిలో పెట్టుకుని ఆ స్థాయిలోనే ఆలోచించాలి.

ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలలో పెద్దల ప్రేమా, ఆప్యాయతల మధ్య హాయిగా గడిచేది బాల్యం. కౌమార యవ్వనాలలో ఇబ్బందులు ఎదురైనా తమవారంటూ కొందరున్నారనే భరోసాతో సమస్యలని ఎదుర్కునేవారు.

మారుతున్న కాలంతో పాటు (.. నిజానికి ఈ పద ప్రయోగం సరైనది కాదు. కాలం ఎన్నడూ ఒకేలా ఉంటుంది. మారేది మనుషులే.) సమిష్టి కుటుంబాలు అంతరించి, వ్యష్టి కుటుంబాలు ఏర్పడ్డాకా బంధాలు సడలుతున్నాయి. జీవనాన్ని వేగవంతం చేసుకుని, బ్రతుకుని దుర్భరం చేసుకుంటున్నారు జనాలు. పిల్లలకి మార్గదర్శకులుగా ఉండాల్సిన పెద్దలే దారి తప్పుతున్నారు.

పిల్లలకి మొదటి పాఠశాల ఇల్లు. తల్లిదండ్రులే మొట్టమొదటి ఉపాధ్యాయులు అన్న సత్యాన్ని ఈ నవల మరోసారి చాటుతుంది.

***

Yandamooriఒకే కాలనీలో నివాసముండే ఐదు జంటలు, వారి పిల్లల చుట్టూ నడిచే కథ ఇది. దశరథ్, కౌసల్య ఒక జంట. రాము, నిఖిత వీరి సంతానం. విశ్వేశ్వర్, అన్నపూర్ణ మరో జంట. మహతి, సుకుమార్ వీళ్ళ పిల్లలు. కృష్ణమూర్తి, రుక్మిణి ఇంకో జంట. ప్రియతమ్, ప్రీతి వీళ్ళ పిల్లలు. శంకరం, పార్వతి నాల్గవ జంట. అవినాష్ వీళ్ళ కొడుకు. విష్ణు, శ్రీలక్ష్మిలది ఐదవ జంట. ధాత్రి వీళ్ళ అమ్మాయి.

నిఖిత, రాము, ప్రీతి, ప్రియతమ్, ధాత్రి, అవినాష్, సుకుమార్, మహతిల బాల్యం ఒకే చోట గడచినా, కొన్నేళ్ళ పాటు వాళ్ళంతా ఒకే కాలనీలో పెరిగినా వాళ్ళ ఆలోచనలు, దృక్పథాలు వేర్వేరు. పిల్లల పట్ల తల్లిదండ్రుల ప్రవర్తన ఒక్కో ఇంట్లో ఒక్కోలా ఉంటుంది.

చదువు పేరుతో కొడుకుని పుస్తకాలకే పరిమితం చేసి, ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేసి తమ అదుపులో ఉంచుకోడానికి ప్రయత్నిస్తారు శంకరం, పార్వతి. నృత్యం, టెన్నిస్ పేరుతో కూతురికి ఊపిరాడనివ్వదు శ్రీలక్ష్మి.  విష్ణు సెక్స్ పర్వర్ట్. కృష్ణమూర్తి, రుక్మిణిల ప్రవర్తన వాళ్ళ సంతానం అదుపు తప్పేలా చేస్తుంది. మగపిల్లాడిపై మోజుతో తొలి కాన్పు ఆడపిల్ల పుట్టిన తర్వాత, అబార్షన్లు చేయించుకుని చివరికి కొడుకుని కంటారు విశ్వేశ్వర్, అన్నపూర్ణ. వీళ్ళందరికి భిన్నంగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, పిల్లలకి అనురాగం పంచుతారు దశరథ్, కౌసల్య.

ప్రేమించిన ముగ్గురు కుర్రవాళ్లూ మూడు రకలుగా మోసం చేస్తే – వారి మీద పగబడుతుంది ప్రీతి. తనకన్న పదిహేనేళ్లు పెద్దయిన ‘ఆంటీ’ని మంచి చేసుకుంటే ‘జేబు ఖర్చుకు’ లోటుండదని భావిస్తాడు పద్నాలుగేళ్ల ప్రియతమ్. తాను చెడిన ప్రియతమ్ సుకుమార్‌నీ చెరుపుతాడు. ప్రియతమ్‌తో స్నేహం చేసి అతనితో బాటు తాను ఊబిలో కూరుకుపోతాడు సుకుమార్. ప్రియతమ్ చేతిలో వంచనకి గురవుతుంది ధాత్రి. చిన్నప్పుడు తనని నిర్లక్ష్యం చేసినందుకు, గొప్పింటి కోడలుగా వెళ్ళి తల్లిదండ్రులను సాధించాలనుకుంటుంది మహతి. సర్వనాశనమైపోయాడనుకున్న స్థితి నుంచి ఎదగడానికి ప్రయత్నిస్తాడు అవినాష్. తల్లిదండ్రులిద్దరూ అయిదు నిముషాల వ్యవధిలో రెండు వేర్వేరు ఆస్పత్రుల్లో మరణిస్తే, అన్న చదువులకు భంగం రాకుండా తన కర్తవ్యం నిర్వర్తిస్తుంది నిఖిత.

***

తను నిరంతరం శ్రమిస్తూ, ఎదుగుతూ, తనతో పాటు మరికొందరికి ఎదిగే మార్గం చూపించిన నిఖిత లాంటి వ్యక్తులు ప్రస్తుత యువతరానికి ఎంతో అవసరం. “When the going gets tough, the tough get going” అనే నానుడిని నిజం చేస్తుంది నిఖిత పాత్ర!

అలాగే తక్కువ నిడివి ఉన్నా, తన పరిధిలో ఒక ప్రయోజన కార్యాన్ని సాధించి, సమాజం పట్ల తన నిబద్ధతని చాటుకుంటుంది ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ పాత్ర. ఆమె పేరు సాధన. ఎంసెట్ ర్యాంకుల భాగోతాన్ని ఆధారాలతో సహా బయట పెట్టి అక్రమార్కులను జైల్లో పెట్టిస్తుంది. కోచింగ్ సెంటర్ల మోసాలు, పలుకుబడి ఉన్న వ్యక్తుల పైరవీలు… ఇలా వ్యవస్థలోని లోపాలని ప్రస్తావిస్తూ తన పరిధిలో తాను చేయగలిన పనిని సక్రమంగా చేస్తుందీ పాత్ర.

“జీవితంలో ఏదో ఒక ఎదురుదెబ్బ తగిలే వరకూ మనిషి ఎంత దూకుడుగా ప్రవర్తిస్తాడో తెలియడానికి తరాలు, అంతరాలు ఉంటాయా?” అని అడుగుతుందో పాత్ర. అందరూ ఆలోచించాల్సిన ప్రశ్న ఇది.

***

యండమూరి గారి నవలలు చదివాక, అందులోని కొన్ని వాక్యాలను కోట్స్‌గా వ్రాసుకునే వాళ్ళు చాలా మందే ఉంటారు. ఈ నవలలోనూ అలాంటి అద్బుతమైన వాక్యాలున్నాయి. ఎన్నో విధాలుగా ప్రేరణిస్తాయి. మచ్చుకు కొన్ని:

జ్జానం పుస్తకాల్లో ఉండదు. అనుభవాల్లో ఉంటుంది. అనుభవాలన్నీ కూర్చి గుచ్చిన జీవితపు దండతో ఉంటుంది.

కష్టం గురించి నిరంతరం ఆలోచించడం కన్నా, దాంట్లోంచి బయటపడే మార్గం ఆలోచించడం మంచి పద్ధతి. కానీ, చాలామందికి మానసికంగా అది సాధ్యం కాదు. కొంతమంది మాత్రమే తమకొచ్చిన కష్టాల్ని భవిష్యత్తులో విజయాలకి సోపానాలుగా వాడుకుంటారు.

విజయం సాధించాలంటే నిరంతర ఘర్షణ ఉండాలి. ఒక ధ్యేయం ఉండాలి. ఆ ధ్యేయం వైపు సాగిపోవాలన్న కృషి, దీక్ష ఉండాలి. కష్టపడాలి.

అస్థిత్వం ఋజువు చేసుకోడం జీవిత ధ్యేయం అయినప్పుడు మనిషి సిన్సియర్‌గా కష్టపడతాడు. అందులో ఆనందం పొందుతాడు.

పరమపద సోపానంలో పెద్ద పాము చేత మింగబడి మొదటికి వచ్చిన వ్యక్తి ఆట మానేస్తే నష్టం అతనికే. చిన్న చిన్న మెట్లు మళ్ళీ ఎక్కి పైకి వెళ్ళడానికి ప్రయత్నించడమే జీవితం.

వర్షిస్తే బరువు తగ్గి మేఘం తేలికపడుతుంది. రోదిస్తే బరువు తగ్గి మనసు తెరిపిన పడుతుంది.

ముందుకు పోవడం తప్ప వెనుకడుగు వేయడం కాలానికి తెలియదు. అందుకే జరిగిన దాన్ని గురించి విచారించకు. జరగబోయేదాని గురించి ఆలోచించు.

***

వయసులో పెద్దలైనా, బుద్ధులలో పిల్లల కంటే హీనంగా ప్రవర్తించేవారున్నట్లే, వయసులో చిన్నవారైనా పెద్దరికం ఆపాదించుకుని హుందాగా ప్రవర్తించేవారు అరుదుగానైనా ఉంటారని చెబుతుంది ఈ నవల.

ఆధునిక జీవితాలకు అద్దం పడుతూ… మధ్యతరగతి మనస్తత్వాలను చిత్రిక పడుతూ… ఎదిగొస్తున్న బాల్యానికి… భవిష్యత్ చిరునామాను వెతుక్కుంటున్న యవ్వనాలకు భాష్యం చెప్పిన నవల ఇదని “సుప్రభాతం” పత్రిక పేర్కొంది. ఏ మాత్రం అతిశయోక్తి లేని వ్యాఖ్యానం ఇది.

టీనేజ్ పిల్లలు… కొత్త కొత్త ప్రలోభాల బారిన పడే ప్రమాదం ఒకప్పటికంటే ఇప్పుడు మరింత అధికంగా ఉంది కాబట్టి ఈ నవల ఇప్పటికీ ఉపయుక్తమనే అనే భావించాలి.

విజయవాడ నవసాహితి బుక్ హౌస్ వారు ప్రచురించిన “ధ్యేయం” నవల అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో లభిస్తుంది. పుస్తకం వెల రూ. 90/-

గమనిక:

సీరియల్‌లో ప్రీతి అని ఉన్న పేరు నవల పుస్తకంగా ప్రచురితమయ్యాకా, వరూధిని అని మారింది.

~

 

ప్రాణవాయువు ఊదే పేజీలు..

ఎన్నో మాటలానంతరం పరుచుకునే నిశ్శబ్దం.. ఎంతో పని ఒత్తిడి తర్వాత తొంగిచూసే ఖాళీతనం.. కదిలిపోతున్న మేఘాలతో పాటు మనమూ కదిలిపోయే ప్రయాణాలు.. నిద్ర రానప్పుడూ.. అసలు నిద్రే వద్దనుకున్నప్పుడూ..

అలవాటుగా, ఆత్మీయంగా కౌగిలించుకునే మిత్రుడు పుస్తకం!!

పొగమంచు ఉదయాలపై పరుచుకునే ఉదయకాంతిలా నులివెచ్చగా పొదవుకుంటాయి అక్షరాలు.
అశాంతితో ఉగ్గపట్టి, కొనఊపిరితో బ్రతికే ఘడియల్లోకి సవ్వడి లేకుండా  ప్రాణవాయువు ఊదే పేజీలు..

ఏ తలుపులూ మూయకుండానే మనలో మనం నిమగ్నమయ్యీ, ఒక సీతాకోకచిలుకై, రెప్పలు పడని తీరాలు చేరి, జీవన మృత్యు రహస్యాలకి అతీతంగా మనల్ని మనం బ్రతికించుకునే అవకాశఒ ఇచ్చే పుస్తకానికి కృతజ్ఞత కంటే ఇంకేమీ చెప్పలేని నిస్సహాయతతో….

 

ఒకే ఒక్క శబ్దంనేస్తం

ఏ స్నేహితుల సాయమూ లేకుండానే
వెళ్ళబుచ్చేశాను రోజంతా..
కాస్తంత నాకు నేనే అపరిచితుడనై,
ఇంకాస్త ఒంటరిగానూ, దిగులుగానూ
సముద్ర తీరాన రోజుని ముగించేసి
ఇంటికి తిరిగొచ్చాను
మళ్ళీ అవే నిశ్శబ్దపు, నిర్మానుష్యపు రహదారులన్నీ దాటుకుంటూ!
తలుపులు తెరిచానో లేదో
బల్ల మీద వదిలి వెళ్ళిన పుస్తకం
మంద్రంగా రెపరెపలాడుతూ అడిగింది కదా,

‘ఆలశ్యమయినట్లుంది నేస్తం!’


మూలం:

Be-yaaro-madadgaar hi kaata tha saara din..
kuchh khud se ajnabi sa,
tanha, udaas saa..
saahil pe din bujhaa ke main, laut aaya phir wahin,
sunsaan si sadak ke khaali makaan mein!

Darwaaza kholte hi, mej pe rakhi kitaab ne,
halke se phadphada ke keha,
‘Der kar di dost!’

————–

చావు తప్పి జీవనతీరానికి…

 

స్లీమన్ కథ-3

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

డొరోతియా 1841 నవంబర్ 28న హాంబర్గ్ లో బయలుదేరింది. అప్పటికి వాతావరణం బాగుంది. గాలి అనుకూలంగా వీస్తోంది.

హైన్ రిచ్ అంతవరకూ ఓడ ప్రయాణం చేసి ఎరగడు. ఓడ గురించి ఏమీ తెలియదు. ఓడలో పద్దెనిమిదిమంది సిబ్బంది; ముగ్గురే ప్రయాణికులు- హైన్ రిచ్, ఓ వడ్రంగి, అతని కొడుకు. అంత అనుకూల వాతావరణంలో కూడా సముద్రప్రయాణం అతనికి పడలేదు. మూడు రోజుల తర్వాత కక్సావెన్ అనే చోట స్వల్పకాలం ఓడకు లంగరేసారు. అప్పటికే అతను అస్వస్థతతో ఉన్నాడు. అక్కడినుంచి ఓడ బయలుదేరి ఉత్తర సముద్రంలోకి అడుగుపెట్టింది. రెండురోజులకే గాలివాన మొదలైంది. ఓడలోకి నీరు ఎక్కసాగింది. సిబ్బంది అదేపనిగా తోడిపొయ్యడం ప్రారంభించారు.

హైన్ రిచ్ ఆకలితో నకనకలాడిపోతున్నాడు. ఓడలో ఇచ్చిన బిస్కట్లతో అతికష్టం మీద ఆకలి చల్లార్చుకుంటున్నాడు. ఓ బెంచీకి తనను కట్టేసుకుని స్పానిష్ గ్రామర్ సాయంతో ఆ భాష నేర్చుకుంటూ ఉండిపోయాడు. ఒక్కోసారి ఓడ కుదుపుకి వచ్చి డెక్ మీద పడిపోతున్నాడు.

తుపాను ప్రచండంగా ఉంది. అలలు ఓడ అంచుల్ని విరగ్గొడుతున్నాయి. ఓడ మునిగిపోయే ప్రమాదం భయపెడుతోంది. పెద్ద తెరచాప సాయంతో ఓడ దారితప్పకుండా మాత్రం కొంతసేపు కెప్టెన్ చూడగలిగాడు. కానీ డిసెంబర్ 10 సాయంత్రానికి ఓడ దారితప్పి దక్షిణం వైపుకి కొట్టుకుపోవడం ప్రారంభించింది. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అలల తాకిడినుంచి ఓడను కాపాడడం కష్టమని అందరికీ అర్థమైపోయింది. ఇంకోవైపు మంచు భయంకరంగా కురుస్తోంది. సముద్రపు కొంగలు మందల కొద్దీ వచ్చి ఓడ చుట్టూ తిరగసాగాయి. అలా తిరగడం అపశకునం.

మరునాటి మధ్యాహ్నానికి తుపాను మరింత తీవ్రం అయింది. అలలు పర్వతప్రమాణంలో లేచి ఓడ మీద పడుతున్నాయి. అలలు అటూ ఇటూ ఎగరగొడుతుంటే ఓడ అక్షరాలా షటిల్ కాక్ లా మారిపోయింది. సాయంత్రానికల్లా పెద్ద తెరచాప విరిగిపోయింది. వెంటనే తుపాను తెరచాపను ఎగరేశారు. అదీ విరిగిపోయింది. అంతలో ఒక విచిత్రం జరిగింది. లిప్తకాలంపాటు మబ్బులు విడిపోయి అస్తమిస్తున్న సూర్యుడు కనిపించాడు. మళ్ళీ వెంటనే మబ్బులు మూసేశాయి. సూర్యుణ్ణి చూడడం అదే కడసారి అవుతుందని అందరూ అనుకున్నారు.

ఆ సమయానికి హైన్ రిచ్ మృత్యువు గురించి కూడా ఆలోచించలేనంత అస్వస్థతతో ఉన్నాడు. వడ్రంగి భయంతో వణికిపోతూ ఏవేవో మాట్లాడుతుంటే అతనివైపు అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు. ఆ వడ్రంగికి కలల మీద నమ్మకం ఎక్కువ. ముందురోజు రాత్రంతా దారుణమైన పీడకలలు. దానికితోడు రోజంతా పిల్లి శోకాలు పెడుతూనే ఉంది. కెప్టెన్ కుక్క మొరుగుతూనే ఉంది.

ఏడింటికి క్యాబిన్ బాయ్ టీ, బిస్కట్లు తీసుకొచ్చాడు. “ఇదే చివరిసారి, ఇంకెప్పుడూ ఏమీ తేలేను” అంటూ ఏడ్చేశాడు. మరి కాసేపటికి కెప్టెన్, అతని రెండో సహాయకుడు క్యాబిన్ లోకి వచ్చారు. దేనికైనా సిద్ధమవమని ఆ ముగ్గురికీ చెప్పారు. వారి మాటల్లో విషాద, గాంభీర్యాలు గూడుకట్టుకున్నాయి. అంతలో మొదటి సహాయకుడు వచ్చి దూరంగా రెండు దీపాలు కనిపించాయని కెప్టెన్ కు చెప్పాడు.  వెంటనే లంగర్లు దించమని కెప్టెన్ ఉత్తర్వు చేశాడు. దించిన క్షణాలలోనే అవి దారపు ముక్కలా తెగిపోయాయి. అప్పటికే సొమ్మసిల్లిపోయిన హైన్ రిచ్ దుస్తులు విప్పేసి పడుకుండిపోయాడు.

అర్థరాత్రివేళ క్యాబిన్ తలుపులు దడాలున తెరచుకున్నాయి. “అందరూ డెక్ మీదికి రండి. ఓడ మునిగిపోతోంది” అంటూ కెప్టెన్ పెద్ద పెట్టున అరిచాడు. మరుక్షణంలోనే ఓ బ్రహ్మాండమైన అల కిటికీలను ధ్వంసం చేసేసింది. క్యాబిన్ లోకి నీరు వరదెత్తింది.  ఓడ ఊగిపోతూ రేవు వైపు కొట్టుకుపోతోంది. హైన్ రిచ్ తన పడక మీంచి ఎగిరి పడ్డాడు. దుస్తులకోసం తడుముకున్నాడు. కనిపించలేదు. అలా నగ్నంగానే డెక్ మీదికి పరుగెత్తాడు. ఒంటి మీద గాయాలు. ఓడ అంచుల్ని ఎలాగో దొరకపుచ్చుకుని పై భాగం దాకా పాక్కుంటూ వెళ్ళి తాటి కొసల్ని పట్టుకున్నాడు. దేవుణ్ణి ప్రార్థిస్తూ, కుటుంబసభ్యుల్ని తలచుకుంటూ నిశ్శబ్దంగా ఉండిపోయాడు.  మేరీ మాతను ఉద్దేశించి వడ్రంగి చేస్తున్న ఆర్తనాదాలు అతని చెవిన పడుతున్నాయి. సొరచేపల్ని చూసి అతనెక్కువ భయపడ్డాడు. తుపాను విరుచుకుపడగానే అవి పైకి వచ్చాయి. ఓడ గంట నిరంతరాయంగా మోగుతూనే ఉంది. అది మృత్యుఘంటలా వినిపిస్తోంది.

ఏమ్ స్టడామ్ లో ఇంగ్లీష్ చర్చి

ఆ ఏడాది మొత్తంలోనే అతి శీతలరాత్రి అది. అతను నగ్నంగా ఉన్నాడు. చుట్టూ మంచు ముంచెత్తుతోంది. ఆకాశం ఓ పెద్ద కాలమేఘంలా ఉంది. అతను మీద పడబోయే మృత్యువును నిరీక్షిస్తూ ఉండిపోయాడు. ఓడ మునిగిపోతోంది. లైఫ్ బోట్లలోకి జనాన్ని ఎక్కించమని కెప్టెన్ ఆదేశించాడు. ఒక లైఫ్ బోట్ నీళ్ళలో నిట్టనిలువుగా పడి కొట్టుకుపోయింది. రెండోది ఓడ పక్కభాగాన్ని ఢీకొని నుగ్గునుగ్గు అయిపోయింది, ఓ చిన్న బోటు మాత్రం మిగిలింది. సిబ్బంది దానిని నీళ్ళలోకి దింపే సాహసం చేయలేకపోయారు.

అలాగే రెండు గంటలు గడిచాయి. నీళ్ళతో నిండిపోయి మునుగుతూ మునుగుతూ ఉన్న ఓడ ఎట్టకేలకు ఓ పెద్ద కుదుపుతో రేవువైపు దొర్లుకుంటూ వెళ్ళి కూరుకుపోయింది.  అప్పటికే హైన్ రిచ్ నీళ్ళలోకి జారిపోయాడు, కానీ వెంటనే పైకి తేలాడు. అంతలో ఓ ఖాళీ పెట్టె అతనివైపు తేలుకుంటూ వచ్చింది. అతను దాని అంచుల్ని పట్టుకుని ఉండిపోయాడు.

అలా సగం రాత్రి వరకూ ఆకాశానికి, సముద్రానికీ మధ్య వేల్లాడాడు. ఆ తర్వాత మొదటి సహాయకుడు వచ్చి అతణ్ణి నీళ్ళలోంచి లాగి లైఫ్ బోటులోకి ఎక్కించాడు. తెడ్లు కూడా లేని ఆ బోటు పద్నాలుగుమందితో పొద్దుటివరకూ దారీ తెన్నూ లేకుండా కొట్టుకెళ్లి చివరికి డచ్చి తీరానికి దూరంగా టెక్సెల్ అనే దీవిలోని ఇసుకతిప్పల మీదికి వచ్చి ఆగింది.

అప్పటికి తుపాను నెమ్మదించింది. ఒడ్డువైపు తేలుకుంటూ వస్తున్న సరకుకోసం ఆ దీవిజనం బిలాబిల్లాడుతూ వచ్చి వాలిపోయారు. హైన్ రిచ్ గాయాల నొప్పులతో గిలగిల్లాడుతున్నాడు. అతని ముందు పళ్ళు మూడు ఊడిపోయాయి. ముఖం మీదా ఇతర శరీరభాగాలమీద లోతైన గాట్లు పడ్డాయి. పాదాలు వాచిపోయాయి. బతికున్న వాళ్ళు అందరూ రొప్పుతూ ఇసుకతిప్ప మీద వాలిపోయారు. అంతలో ఓ దయగల రైతు ఓ బండి తీసుకుని అక్కడికి వచ్చాడు. వాళ్లందరినీ తన పొలం ఇంటికి తీసుకెళ్ళాడు. వాళ్ళు చలి కాచుకోడానికి పెద్ద మంట రాజేశాడు. వారికి వేడి వేడి కాఫీ, నల్ల రొట్టె అందించాడు. ఒంట్లో సత్తువను కూడదీసుకునేవరకూ మూడు రోజులు వాళ్ళు అక్కడే ఉండిపోయారు.

హైన్ రిచ్ కు కొయ్య బూట్లు, ఓ జత చినిగిపోయిన పంట్లాములూ, ఓ దుప్పటి, ఓ ఊలు టోపీ ఇచ్చారు. అతనికి ఆ రైతు మీద ఎంతో ఇష్టం కలిగింది. తన సముద్రపు పెట్టె ఒడ్డుకు కొట్టుకు రావడం అంతకంటే ఎక్కువ సంతోషం కలిగించింది. అందులో తన చొక్కాలు, స్టాకింగులు, పాకెట్ బుక్కు, లా గ్వైరా లో తన పరిచయస్తులకు హెర్ వెంట్ రాసిన సిఫారసు ఉత్తరం ఉన్నాయి. మిగతా అందరి పెట్టెలూ కొట్టుకుపోయి, హైన్ రిచ్ పెట్టె ఒక్కటే ఒడ్డుకు రావడంతో అతన్ని ‘జోనా’ అని పిలవడం ప్రారంభించారు(ఓల్డ్ టెస్టెమెంట్ ప్రకారం జోనా ఒక దేవదూత. అతను ప్రయాణిస్తున్న ఓడ మునిగిపోతుంది. అతన్ని ఓ తిమింగలం మింగేస్తుంది. మూడురోజుల తర్వాత అతను ప్రాణాలతో బయటపడతాడు). సరకుతో ఉన్న ఓ పెట్టె తనను చంపినంత పనిచేసి జీవితాన్ని మలుపు తిప్పింది, ఓ ఖాళీ పెట్టె తన ప్రాణాలు కాపాడింది, ఏదో అదృష్టం తన వెనక పనిచేస్తోందని అతను అనుకున్నాడు.

అతనక్కడ బోటు ఎక్కాడు. ముఖంలో అలసట, అస్వస్థత ఇంకా తాండవిస్తూనే ఉన్నాయి. బరువైన కొయ్య బూట్లతో, చంకలో పెట్టెతో అతను హాలెండ్ గడ్డ మీద అడుగుపెట్టాడు. బూటు పాలిష్ కుర్రాళ్ళు అతని వేషం చూసి తమ లాంటివాడే అనుకుని కేరింతలు కొడుతూ ఆహ్వానించారు.

మృత్యుముఖం నుంచి బయటపడడం, అస్వస్థత, చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా దేశం కాని దేశంలో అడుగుపెట్టడం… ఆలోచించకొద్దీ తను బతికి ఉండడమే ఓ అద్భుతంగా అతనికి అనిపిస్తోంది.  హాంబర్గ్ లో చన్నీళ్ళ స్నానాలతో శరీరాన్ని గట్టి పరచుకోవడం వల్లనే ఓడ మునక వల్ల కలిగిన విపత్తునుంచి బయటపడ్డానని అనుకున్నాడు. మిగతావాళ్ళు తిరిగి హాంబర్గ్ కు బయలుదేరుతుంటే, తనను అంతులేని కష్టాల్లోకి నెట్టిన ఆ నగరానికి రానని చెప్పేశాడు. తన అదృష్టాన్ని హాలెండ్ లోనే వెతుక్కోవాలని నిర్ణయించుకున్నాడు.

ఎముకలు కొరికేసే ఆ చలిలో  చింకిపాతతో నేరుగా ఏమ్ స్టడామ్ లోని మెక్లంబర్గ్ కాన్సూల్ కు వెళ్ళాడు. హెర్ క్వాక్ అనే అతను కాన్సూల్ గా ఉన్నాడు. తలుపు తీసిన నౌకరు, బిచ్చగాడనుకుని అతని మొహం మీదే తలుపు మూసేశాడు. తను మెక్లంబర్గ్ పౌరుణ్ణనీ, సాయం కోసం వచ్చాననీ ఓ కాగితం మీద రాసి మళ్ళీ బెల్లుకొట్టాడు. ఈసారి  నౌకరు అతను రాసిన నోటు తీసుకెళ్లి హెర్ క్వాక్ కు ఇచ్చాడు. అది చూసి రెండు గోడెన్లను, అంటే యాభై సెంట్లను నౌకరు చేతికిచ్చి పంపించాడు. దాంతో అతను మళ్ళీ తన దగ్గరికి రాడనుకున్నాడు. ఆ మొత్తాన్ని చూసి విస్తుపోయిన హైన్ రిచ్ తో, “ఈ మాత్రమైనా ఇచ్చినందుకు సంతోషించు” అని ఎకసెక్కంగా అని నౌకరు తలుపు మూసేశాడు.

ఏమ్ స్టడామ్-1840లలో

హైన్ రిచ్ కోపంతో కుతకుత లాడిపోయాడు. అది పేదవాడి కోపమని అతనికి తెలుసు. ఏమ్ స్టడామ్ లో రామ్స్కో అనే చోట ఉన్న నావికుల లాడ్జీకి వెళ్ళాడు. గ్లామెన్ అనే ఓ వితంతువు దానిని నడుపుతోంది. అద్దె రోజుకు ఒక గోడెన్. తన దగ్గరున్న మొత్తంతో మహా అయితే ఒకరోజు గడుపుకోవచ్చు. కానీ రేపేలా? అంతలో అతనికో ఉపాయం తట్టింది. తను తీవ్ర అస్వస్థతో ఉన్నానని, ఆసుపత్రిలో చేర్చవలసిందని హెర్ క్వాక్ కు ఉత్తరం రాసి పంపాడు. ఆ దరిద్రుడు తనకు చేయగలిగిన సాయం ఇదే ననుకున్నాడు. అతని భారం తన మీద ఎక్కడ పడుతుందోనని భయపడ్డ గ్లామెన్ ఆ ఉత్తరాన్ని హెర్ క్వాక్ కు అందించే ఏర్పాటు చేసింది. ఆ ఉపాయం ఫలించింది. ఎనిమిదిరోజులు ఆసుపత్రిలో గడిపాడు.

ఈలోపున హాంబర్గ్ లో తనకు పరిచయమైన ఓడల దళారీ హెర్ వెంట్ కు ఉత్తరం రాశాడు. అందులో ఓడ మునక గురించి, తన ప్రస్తుత దుస్థితి గురించి వివరించాడు. అతని అదృష్టం కొద్దీ ఆ ఉత్తరం అందే సమయానికి హెర్ వెంట్ కొంతమంది అతిథులకు విందు ఇస్తున్నాడు. ఆ ఉత్తరాన్ని బిగ్గరగా చదివాడు. అతనితోపాటు అతిథులందరూ అతని మీద జాలిపడ్డారు. అప్పటికప్పుడు 240 గోడెన్ల మొత్తం సమకూడింది. హెర్ వెంట్ ఆ మొత్తాన్నీ, అతనికి సాయం చేయవలసిందిగా అర్థిస్తూ ప్రష్యా కాన్సూల్-జనరల్ కు రాసిన ఉత్తరాన్నీ హైన్ రిచ్ కు పంపాడు.

కొద్ది రోజులకే అతనికి ఎఫ్.సి. క్వెన్ & కొ లో అకౌంట్స్ విభాగంలో మెసెంజర్ బాయ్ గా ఉద్యోగం దొరికింది. డిమాండ్ డ్రాఫ్టులను స్టాంపింగ్ చేసి నగదుగా మార్చడం అతను చేయవలసిన పని. ఈ ఉద్యోగంతో పచారీ కొట్టు జీవితం నుంచి తను శాశ్వతంగా బయటపడ్డాడనీ, అదృష్టాన్ని వెతుక్కునే మార్గంలో తొలి అడుగు పడిందనీ అనుకున్నాడు.

అంతే…ఆ క్షణం నుంచి అతను మళ్ళీ వెనుదిరిగి చూసుకోలేదు.

అపారమైన డబ్బు సంపాదించాలంటే, జీవితం మొత్తాన్ని అందుకు ధారపోయడం మినహా మరో మార్గం లేదని అతనికి అప్పటికే అర్థమైంది. తన తెలివితేటలకు మరింత సాన పట్టాడు. ఇదే తన జీవితం, ఇందుకు భిన్నంగా తను జీవించలేడని అనుకునే టంతగా తన లక్ష్యానికి అంకితమవడం అతనికి అలవడింది. ఖర్చును కనీస స్థాయికి తగ్గించుకున్నాడు. ఇప్పుడతని జీతం నెలకు 36 గోడెన్లు. అందులో ఎనిమిది గోడెన్లు లాడ్జీలో తనుంటున్న చవకబారు గది అద్దెకు పోతాయి. విందు వినోదాల ప్రశ్నే లేదు. సాయంత్రాలు ఊరంతా తిరగడం, గ్యాస్ దీపాల వెలుగులో జిగేలుమనే దుకాణాలను మెరిసే కళ్ళతో చూసి ఆనందించడం; లేదా రైల్వే స్టేషన్ కు వెళ్ళి, వచ్చిపోయే రైళ్లను చూస్తూ గడపడం…ఇవే అతని కాలక్షేపాలు. ఇక ఆడవాళ్ళ విషయానికి వస్తే, హెయిర్ డ్రెస్సింగ్ సెలూన్లలోని రంగు రంగుల మైనపు బొమ్మల్ని తనివితీరా చూసేవాడు. మిన్నాను తలచుకుంటూ ఉండేవాడు.

అతని దినచర్యలో ఉద్యోగం తర్వాత చదువుకే ప్రాధాన్యం. పుస్తకాలపైనా, తన చదువును ముందుకు తీసుకెళ్లే ప్రతి ఒక్కదానిపైనా ధారాళంగా ఖర్చు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. జర్మన్ అక్షరాలను దిద్దడంతో సహా మళ్ళీ కొత్తగా చదువు మొదలెట్టాడు. జర్మన్ లో తప్పులు లేకుండా ఒక మాదిరిగా రాయడమెలాగో ఇరవై పాఠాలతో నేర్చుకున్నాడు. ఆ తర్వాత డచ్చి, ఇంగ్లీష్ నేర్చుకోడానికి ఓ ట్యూటర్ ను పెట్టుకున్నాడు. పదాలను, వాక్యాలను బిగ్గరగా ఉచ్చరించేవాడు. వ్యాసాలు రాసి ట్యూటర్ తో దిద్దించుకునేవాడు. ఆపైన ఇంగ్లీష్ పై పట్టు సంపాదించడానికి ప్రతి ఆదివారం రెండుసార్లు ఏమ్ స్టడామ్ లోని ఇంగ్లీష్ చర్చికి వెళ్ళేవాడు. అక్కడి పాస్టర్ పలికే ప్రతి మాటనూ పదే పదే ఉచ్చరించేవాడు. అంకెర్షగన్ చర్చిలో వాళ్ళ నాన్న పలికిన ప్రతి మాటనూ, అర్థం తెలియకపోయినా ఉన్నదున్నట్టు అద్భుతంగా వల్లించగలిగిన హాపింగ్ పీటర్ ఒరవడిలో-తనూ తెలియకుండానే వెళ్ళాడు.

రాత్రిళ్లు అతని బుర్ర పాదరసంలా పనిచేసేది. నిద్ర కాచుకుంటూ పుస్తకపఠనం సాగించేవాడు. దాంతో నిద్ర తక్కువై పాలిపోయి జబ్బుమనిషిలా కనిపించేవాడు.  ఆ పుస్తకాలు కూడా అంతవరకూ తనకు విపరీతమైన ఆసక్తి కలిగిస్తూ వచ్చిన గ్రీకు, రోమన్ సామ్రాజ్యాలకు సంబంధించినవి కావు. వ్యాపారరంగంలో తను పైకి రావడానికి సాయపడే భాషలకు సంబంధించినది. ఇప్పుడు డబ్బు యావలో పడిపోయి ట్రాయ్ ని, చివరికి మిన్నాతో పెళ్లి తలపులనూ కూడా పక్కన పెట్టేశాడు.

వికార్ ఆఫ్ వేక్ ఫీల్డ్, ఇవాన్ హొలను… అవి దాదాపు కంఠస్థమయ్యేవరకూ చదివిందే చదువుకుంటూ పోయేవాడు. అలా ఆరునెలల్లో ఇంగ్లీష్ అతనికి ఒంటబట్టేసింది. మరోవైపు తను చదివింది, విన్నది గుర్తుండిపోయేలా; బుర్రలో పడిన ఒక్క అంకె కూడా జారిపోని విధంగా తన జ్ఞాపకశక్తికి శిక్షణ ఇచ్చుకుంటూ వచ్చాడు. నామవాచకాలు, క్రియాపదాలతో సహా అన్నీ వల్లె వేసుకుంటూ క్రమంగా ఓ జ్ఞాపక యంత్రంలా మారిపోయాడు.

ఇంగ్లీష్ నేర్చుకున్న పద్ధతిలోనే తర్వాతి ఆరునెలల్లో ఫ్రెంచ్ నేర్చుకున్నాడు. ఏడాది తిరిగేసరికి అతనిలో ఏకాగ్రత ఎంత పదునెక్కిందంటే; డచ్చి, స్పానిష్, ఇటాలియన్, పోర్చుగీస్ భాషల్ని ఆశ్చర్యం గొలిపేటంత త్వరగా నేర్చేసుకున్నాడు. గట్టిగా దృష్టి పెట్టి ఈ భాషల్లో ధారాళంగా చదవడం, రాయడం, మాట్లాడడం నేర్చుకోడానికి నాకు ఆరువారాల్ని మించి పట్టలేదని అతను చెప్పుకున్నాడు. దీనిని సాధించడానికి అతను కఠోరమైన కాలనియమాన్ని పాటించాడు. రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు కూడా పొడవైన పదాల పట్టికను ఎదురుగా ఉంచుకుని అదేపనిగా వల్లించేవాడు. పోస్టాఫీస్ లో స్టాంపుల కోసం ఎదురుచూస్తున్నప్పుడు పేరాలకు పేరాలను గుర్తుచేసుకుంటూ ఉండేవాడు. ఈ విషయంలో ఒక్క క్షణం కూడా అతను రాజీపడలేదు.  ఈవిధంగా ఏమ్ స్టడామ్ లో తన చుట్టూ ఉన్న సాధారణ ప్రపంచానికి దూరంగా తన ప్రపంచంలో తాను గడిపాడు.

ఏమ్ స్టడామ్ కు రావడానికి ముందు అతనికి జర్మన్…అది కూడా మెక్లంబర్గ్ మాండలికం, తగుమాత్రం లాటిన్ మాత్రమే తెలుసు. ఇప్పుడతను ఏడు భాషల్ని చదవగలడు, మాట్లాడగలడు, రాయగలడు; ఈ భాషల్లో వ్యాపార నివేదికలు తయారుచేయగలడు.

తనపై  తాను కఠిన క్రమశిక్షణను విధించుకుని చేసిన ఇంతటి కసరత్తుకూ త్వరలోనే తగిన ప్రతిఫలం ఉంటుందన్న  ఆత్మవిశ్వాసమూ అతనిలో ఉంది.

అతను ఊహించినట్టే మరోసారి అదృష్టం అతణ్ణి వెతుక్కుంటూ వచ్చింది…!!!

    (సశేషం)

 

 

 

 

తిరిగొచ్చిన సైనికుడు

 

పంకజం: ఒక వేశ్య

పైడినాయుడు: ఆమె మాజీ విటుడు

దొరస్వామి: ఇప్పటి ప్రియుడు

సత్తి: ఆమె దాసి

 

సత్తి:      (పరుగెత్తుకుంటూ వచ్చింది) అమ్మా, కొంప మునిగింది. పైడినాయుడు యుద్ధభూమి నుంచి వచ్చేశాడు. అతనొక పొడుగాటి కోటు తొడుక్కొని చుట్టూ చాలా మంది సేవకుల్ని పెట్టుకొని ఉన్నాడు. అతన్తో మాట్లాడటం కుదరలేదు. అతని స్నేహితుడు భిక్షపతిని కదిలించాను. ‘చెప్పవయ్యా భిక్షపతీ, మీ యజమాని మాకోసం విలువైన కానుకలేవైనా తెచ్చాడా?’ అని అడిగాను.

పంక:     అది తప్పు. నువ్వు అలాంటి మాటలు వాడకూడదు. దానిబదులు, ‘దేవుడి దయవల్ల మీరు క్షేమంగా ఉన్నారు. మా అక్క మీ క్షేమ సమాచారం కనుక్కోమంది’ అనాలి. దాంతో పాటు, పైడినాయుడి గురించి మా అక్క ఆలోచించని క్షణం లేదు, రోదించని రోజు లేదు’ అని చెప్తే మరింత పసందుగా ఉండేది.

సత్తి:      ముందు పలకరించగానే అట్లాంటి మాటలే అన్నాను. సరిగ్గా ఏమన్నానో ఇప్పుడు గుర్తుకు రావట్లేదు. నిన్ను హెచ్చరించాలనే ఆత్రం ఎక్కువై పోయింది. అప్పుడు నేనేమన్నానంటే, ‘ఏమయ్యా భిక్షపతీ, యుద్ధంలో ఉన్నప్పుడు మీ చెవులకు మా అక్క మాటలేమీ వినిపించ లేదా? మీరు వెళ్ళిందగ్గర్నుంచీ మా అక్క రోజూ మిమ్మల్ని తలచుకోవడమే! ఎవరైనా యుద్ధం వార్తలు మోసుకొచ్చి చాలామంది చచ్చిపోయారని చెప్పగానే మా అక్క జుట్టు పీక్కోవడం, గుండెలు బాదుకుంటూ ఏడవడం. కొట్లాటలంటే మా అక్కకి చచ్చేంత భయం’.

పంక:     చక్కగా సరైన మాటలు చెప్పావే సత్తీ!

సత్తి:      తర్వాత బహుమతుల్ని గురించీ, ఇతర విషయాల గురించీ అడిగాను. ‘సత్తీ! బ్రహ్మాండంగా కొట్టుకొచ్చాం’ అన్నాడు భిక్షపతి.

పంక:     ఐతేనూ సత్తీ, ‘పైడినాయుడు మీ అక్కను ఎప్పుడెప్పుడు చూస్తానా అని తహతహలాడు తున్నాడు’ అని అనలేదుటే ఆ భిక్షపతి?

సత్తి:      అచ్చంగా కాదుగానీ అలాంటి మాటలేవో అన్నాడు. ఐతే, నీ గురించి కంటే, వాళ్ళు కొట్టు కొచ్చిన డబ్బు గురించే ఎక్కువ మాట్లాడాడు. డబ్బు, బంగారం, బట్టలు, బానిసలు, దంతపు సామాన్లు… వీటి గురించి తెగ చెప్పాడు. డబ్బు… వేలూ, లక్షల్లో తెచ్చినట్టు కన్పిస్తోంది. భిక్షపతి చిటికెన వేలికి వజ్రపుటుంగరమొకటి మెరుస్తోంది. యుద్ధంలో వాళ్ళ ప్రతాపాన్ని గురించి ఏదో సోది చెప్పటం మొదలెట్టగానే, నేనిక అతన్ని వదిలి నీకు కబురందించాలని పరుగెత్తుకొచ్చాను. వాళ్ళిక్కడికి వచ్చేలోగా ఏం చెయ్యాలో నువ్వు ఆలోచించుకోవాలి కదా! పైడినాయుడిక్కడికి వచ్చేసరికి దొరస్వామి ఇక్కడే ఉంటే ఏం కొంప మునుగుతుందోనని నాభయం.

పంక:     ఇట్లాంటి విపత్కర పరిస్థితి తప్పుకోవాలంటే మంచి ఉపాయమొకటి పన్నాలి. దొరస్వామిని వదిలెయ్యటం అంత తెలివైన పని కాదు. నిన్న గాక మొన్న అతను మనకు ఆరువేల వరహా లిచ్చాడు. పైగా అతను పెద్ద వర్తకుడు. తరవాత్తరవాత ఇంకా చాలా ఇచ్చే అవకాశ ముంది. మరోవైపు పైడినాయుడు అంత డబ్బుతో తిరిగొచ్చినప్పుడు అతన్ని కూడా తిరస్కరించకూడదు. పాత విటుల్ని గౌరవించాలి. అది పద్ధతి. పైడినాయుడు మహా అసూయాపరుడు. అతను దరిద్రంలో ఉన్నప్పుడే భరించడం కష్టమయ్యేది. యుద్ధంలో గెలిచి వచ్చిన తర్వాత ఇప్పుడెలా ఉంటాడో ఊహించగలను.

సత్తి:      అదుగో వచ్చేశాడు.

పంక:     ఓరి దేవుడా, ఇప్పుడెలా? నాకేమీ తోచట్లేదు. సత్తీ, వణుకు పుట్టుకొస్తోంది. ఏం చెయ్యాలో ఆలోచించు.

సత్తి:      దొరస్వామి కూడా వచ్చేశాడక్కా!

పంక:     వామ్మో, నాఖర్మ ఇట్లా కాలింది. కాళ్ళ కింది భూమి చీలిపోయి నన్ను మింగేస్తే బాగుండు.

దొర:      (దగ్గరికొస్తూ) పంకజం, మనం అలా వెళ్లి కాస్త వైను తాగొద్దాం!

పంక:     అయ్యో నా మిండమగడా, చంపేశావు కదరా! (పెద్దగా) పైడినాయుడూ, ఇన్నాళ్ళూ ఎక్కడికి పోయావు?

పైడి:      పంకజాన్ని మద్యానికి ఆహ్వానించేంత ధైర్యం ఎవరికుందిక్కడ?

పంక:     (మౌనంగా ఉంది)

పైడి:      నువ్వేమీ మాట్లాడట్లేదు. మంచిది. ఇట్లాంటి ఆడదాని కోసం పదిరోజుల ప్రయాణాన్ని ఐదు రోజుల్లో పడుతూ లేస్తూ ముగించుకొచ్చాను. చాలా సంతోషంగా ఉంది. ఇట్లాంటి ఆహ్వానం నాకు దొరుకుతుందనుకోలేదు. ఈ క్షణం నుంచీ నువ్వెవడి వొళ్లైనా తోమొచ్చు.

దొర:      మిత్రమా! మీరెవరు?

పైడి:      ఏంటీ, సర్దార్ పైడినాయుణ్నే ఎరగవా? ఒకప్పుడు బుద్ధిలేక ఈ పంకజాన్ని ఉంచుకున్న వాణ్ణి.

దొర:      మంచిది సర్దార్! పంకజం ఇప్పుడు నాది. ఆమె కిప్పటికే ఆరువేల వరహాలు కట్నమిచ్చాను. రేపు ఇంకా ఇస్తాను. వెళ్దాం రా పంకజం. మన సర్దార్ గారు తనకు నచ్చిన చోట యుద్ధం చేసుకుంటాడు.

సత్తి:      మా అక్క తనకు నచ్చిన వారితో వెళ్తుంది.

పంక:     (చిన్నగా) ఏం చేద్దామే సత్తీ?

సత్తి:      ప్రస్తుతానికి లోపలికెళ్ళడం మంచిది. కొత్త విటుడితో కలిసి పాతవాడి కెదురుగా నిల్చోవటం మంచిపని కాదు. వాడికి అసూయ మరింత పెరగడం తప్ప ప్రయోజనం లేదు.

పంక:     సరే, లోపలికెళ్దాం పద!

పైడి:      ఇదే చెప్తున్నా! మీరిద్దరూ మరోసారి కలిసి తాగడానికి వీల్లేదు. యుద్ధంలో అంత మారణకాండ జరిగినా జయించుకొచ్చింది ఏదో ఆట కోసం కాదు. చంపేస్తా! భిక్షపతీ, భూపతివర్మా, సైనికుల్ని ఈ ఇంటి చుట్టూ మోహరించండి.

దొర:      ఏమోయ్ సర్దార్, మేము చిన్నపిల్లల్లాగా కన్పిస్తున్నామా నీకు? మమ్మల్ని భయపెట్టగలననే అనుకుంటున్నావా నువ్వు? మాటలు కోటలు దాటించేశావే! మనుషుల్ని కాదు, కోడిపుంజు నన్నా చంపినా మొహమేనా నీది? ఎక్కడ చేశావ్ యుద్ధం? చేస్తే గీస్తే ఏదైనా గార్డుగా పనిచేసుంటావ్! అదీ అనుమానమే!

పైడి:      యుద్ధం ఎక్కడ చేశానో నీకు త్వరలోనే తెలుస్తుంది. నేను కత్తి పట్టుకొనే దాకా ఆగు.

దొర:    సరే, రా చూసుకుందాం! నీ దండును కూడా తెచ్చుకో! నేనూ, నాస్నేహితుడూ కలిసి నీకు రాళ్ళదాడి ఎలా ఉంటుందో రుచి చూపిస్తాం. ఎందుకు పరుగెత్తుతున్నావో, ఎటు పారిపోతున్నావో కూడా తెలియకుండా దూసుకుంటావు!

అన్నం మెతుకు ఆత్మఘోష!

 

అరణ్య కృష్ణ

 

మహాశయా!
అద్భుతమైన కలలాంటి జీవితాన్ని చూపించి వెళ్ళిపోయావు
అందమైన కలల్ని దేశానికి దానం చేసి మరీ పొయావు

అది సరేకానీ
దేశమంటే ఎవరు మహాశయా?
వీధుల్లో పడవల్లా కార్లు తిరిగే నగరాలేనా?
విరిగిపోయిన తెడ్లతో బురద నదుల్ని దాటలేక
తిరగబడిపోయిన తెప్పల్లాంటి పల్లెలు కాదా!

ఇక్కడి చిన్నారుల కళ్ళు కలలు కనగలిగేవేనా?
పొయ్యిలో పడుకున్న గండుపిల్లి కళ్ళలాంటి ఆకలి
వీళ్ళ కన్రెప్పల్ని ఎత్తిపట్టి వుంచుతుంటే
ఇక నిద్రెలా పట్టేది చెప్పు!
గేదెల్ని కడుగుతూ గొర్రెల్ని మేపుతూ
సొమ్మసిల్లిన పసి కడుపుల్లో పసికర్లు నిండిపోతుంటే
ఆవులింతలు మాత్రం ఎలా వస్తాయి
అయ్య వలసపోతేనో అమ్మ కూలికెళ్తేనో
తమ్ముళ్ళని లాలించే పసితల్లులకి
నీ కలల మెరుపుల గురించి ఏం తెలుస్తుంది?

విశాల ప్రాంగణాల్లాంటి నువ్వు బోధించే కాన్వెంట్ కలలు
కూలే కప్పుల కింద పడిపోయిన బడిగోడల మధ్యనేం వికసిస్తాయి
మడత నలగని యూనిఫారాలతో తళతళలీనే టెర్లిన్ కలలు
ముడ్డిమీద పిగిలిపోయి మట్టిగొట్టుకు పోయిన
బట్టలమీదేం తళుక్కుమంటాయి
కాఫీ షాపుల్లో లాప్ టాప్ మీద అసైన్మెంట్లు చేయాలన్న కలలు
పశువుల కొట్టాల్లో కార్ఖానాల్లో ఏం కళకళలాడ గలవు?

చికెన్ పకోడా మంచూరియాల టిఫిన్ బాక్సులకి అర్ధమయ్యే నీ ఆదర్శాలు
అక్షరాలకోసం కాక అన్నం మెతుకుల కోసం బడికెళ్ళే
చిల్లులుపడ్డ సత్తు ప్లేట్లకేం బోధపడతాయి

జాతిద్రోహాల్ని ప్రశ్నించని క్షిపణిమహాత్మా!
నువ్వు ఆదర్శాలు మాత్రమే మాట్లాడే నిజాయితీపరుడివి
అందుకేనేమో
దేశం మొత్తం నీ కలల క్షిపణి మీదెక్కి
భ్రమల అంతరిక్షంలోకి చక్కర్లు కొడుతుంది.

*

కలాం వెనక వున్నది మనువాదమే!

 

పి. విక్టర్ విజయ్ కుమార్

హద్దులు దాటుతున్న కామెంట్ లను చూసి ” ఈ కామెంట్ లను moderate చేయమంటారా ? ” అంటూ తమ నైతిక బాధ్యతను నిర్వర్తించే క్రమం లో నన్ను సంప్రదించారు సారంగ టీం. అబ్బుర పడ్డా ఎడిటర్ కు ఉండాల్సిన sincerity చూసి. వ్యాస కర్తగా చెప్పా ” కలాం వెనకేసుకొస్తున్న మనువాద భావ జాలం నమ్ముకున్న వారి ప్రవర్తన ప్రతి ఒక్కరికీ తెలియాలి . మీరు అనుమతిస్తే అన్ని కామెంట్స్ ను కలుపుతూ ఒక ఫైనల్ నోట్ సబ్ మిట్ చేసుకుంటా అని. అనుమతించిన సారంగకు ధన్య వాదాలు .

” కలాం నిజాయితీ గా ఎదిగిన ప్రొఫెషనల్ కు తార్కాణంగా , మధ్య తరగతి ప్రజల కలల ఆదర్శంగా నిలిచాడు. ” లాంటి ఉపోద్ఘాతం తో తో మొదలు పెట్టి ” ఒక ‘ కెరీరిస్ట్ లిబరల్ ‘ ను ‘ ప్రజల మనిషి ‘ అనడం మాత్రం హత్యా పాతకం !! ” తో ముగిసిన వ్యాసమిది. ఒకరు ముందూ వెనకా చూడకుండా ” రబ్బిష్ ” అన్నారు, ఇంకొంచెం ముందుకెళ్ళి ” పిచ్చ నా ____ ” అన్నారు ( ఫిల్ ద బ్లాంక్స్ అని రిక్వెస్ట్ చేసినా ఫలితం లేకపోయింది…ప్చ్ ! ), మరొకరు వ్యాస కర్తను ” చెప్పుచ్చుకు కొట్టాలి ” అన్నారు, ఎవరో ” ఫూల్” అన్నారు, ఇంకొకరు ఉద్వేగం ఆపుకోలేక “ఆకుకు ____ తెలియని వ్యాసమిది ” ( ఫిల్ ద బ్లాంక్స్ రిక్వెస్ట్ చేయడానికి అది నాకొక్కడికే సంబంధించింది కాదు. మొత్తం స్త్రీ సమాజానికి సంబంధించింది) అని దుర్గా మాతగా కొలిచే ఆడ వాళ్ళను అలవోకగా వాడుకుంటూ అటాక్ చేయడానికి వెనుకాడ లేదు.

అసలు మనువాద ఆలోచన విధానం అన్నది ఈ దేశాన్ని సగం తినేసింది. వ్యతిరేక దృక్పథాన్ని సహించలేని ఓర్వలేని తనం ఆ మనువాదం నర నరాన ఉంది. దళితుల నాలుకలను తెగ కోసిన ” దుర్మార్గమైన అసహనం ” కలిగిన నీతి అది. అదే నీతి దేశం లో మత విద్వేషాలకు ఆజ్యం పోస్తుంది. అదే కుటిల నీతి – మీరు మొత్తం చరిత్ర చదవండి….ప్రెసిడెంట్ స్థానానికి నారాయణన్ కల్పించిన విలువ, ఇక ఏ ఒక్కరన్నా కల్పించి ఉండి ఉంటే చెప్పండి. దేశ అత్యున్నత స్థానం లో దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ కు తలూపే ప్రెసిడెంట్ లు తప్ప ఎవరూ కనిపించరు. దళితుడైన నారాయణన్ ప్రెసిడెంట్ కావడానికి కారణం బీసీ, దళిత కులాలను రెప్రెజెంట్ చేసే పార్టీలే . 1997 లో అతను ప్రెసిడెంట్ అవ్వడం కాంగ్రెస్ నిర్ణయం కాదు. అది వెనుకబడిన కులాలు, ద్రవిడ పార్టీలు ఎంచుకున్న వ్యక్తి నారాయణన్. అతను తీసుకున్న తిరస్కార నిర్ణయాలు కాంగ్రెస్ కు , బీ జే పీ పార్టీలకు కొరుకుడు పడ లేదు. మొదటి టర్మ్ లో నిజానికి పర్ఫార్మెన్స్ చూపినా , సెకండ్ టర్మ్ కు కాంగ్రెస్ , బీ జే పీ మద్దతుతో పైకొచ్చిన కలాం అవసరం లేకపోయింది.

ఇది నారాయణన్ ను ” గ్లోరిఫై ” చేయడం కాదు. నారాయణన్ పక్కా కాంగ్రెస్ పార్టీ వెనుదన్నుగా ఉంచుకుని పైకి వచ్చాడు. నిజానికి నాకూ గ్రీవెన్స్ ఉంది – ఒక పేద దళిత కుటుంబం నుండి వచ్చి, క్రియా శీలంగా, తనకున్న పరిమితుల్లో , తనకున్న రాజకీయ చాక చక్యం తో , తనకున్న స్థాయిలో ఈ దేశం లో అణగారిన దళితులకు తగినంత కృషి చేయలేదే అని.

ఐతే ఈ వ్యాసం మొత్తం అడిగిన ప్రశ్న ఒకటే – నిజాయితీగా గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి – మీరు ఏ గొప్ప కలాం లో చూసారో ఆ గొప్ప నారాయణన్ లో ఎందుకు కనిపించలేదు ? ఒళ్ళు తెలీకుండ మీదకెత్తుకునే తిరిగే కలాం లో ఉన్నదేంటి ? నారాయణన్ లో లేని దేంటి ? కలాం చేసిన తప్పుల్లో అర్థం చేసుకునేదేంటి ? నారాయణన్ తప్పుల్లో అర్థం కానిదేంటి ?….కలాం కు ఇచ్చిన స్థానం నారాయణన్ కు ఎందుకు కల్పించలేకపోయింది ?

Systemic bias అర్థం చేసుకోవాలంటే మనువాద ఆలోచనలు ముందుకు తోస్తాయి. ఇంత మీడియా ( అప్పట్లో వేదాలు ) తెగ నోరేసుకు తిరిగితే – ఇన్నాళ్ళు మాకున్న నమ్మకం బూటకమైతే – మేమెలా తట్టుకో గలం అనే ఒక భావన. అలాగే క్వశ్చన్ చేయడాన్ని మనువాద ఆలోచన అక్కడే ఆపేస్తుంది. తిరుగు బాటుకు తగిన గుణ పాఠమెంటో చెప్పాలనే ఉవ్విళ్ళూరుతుంది. ముఖ్యంగా హైందవ నాగుపామును తలకెత్తుకున్నాక – కరిపించుకోవాల్సిందే తప్ప విసిరి కొట్ట రాదు. ఇదీ మనువాద ఆలోచన !

” ఏ వ్యక్తినైనా మహానుభావుడిగా వర్ణించే మన దేశ ప్రజల సంస్కృతిలో మనువాదం బలపడిపోయింది. మన ప్రమాణాలు అతి తక్కువ స్థాయికి దిగ జారి కేవలం – నిజాయితీగా ఇబ్బంది కలగ కుండా తమ విధిని నిర్వర్తించడం కూడా ఒక మానవాతీత గుణం అయిపోయింది ” అని ఈ వ్యాసం చెప్పడం గమనించి ఉంటే కృతజ్ఞతలు.

అంబేద్కర్ మూడు సార్లు ఎలక్షన్ లలో పోటి చేసి డిపాజిట్ కూడా లేకుండా ఓడించబడ్డాడు. కోల్పోని ధైర్యం తో అంబేద్కర్ స్వాంతంత్ర్య సమరం peak లో ఉండగా – గాంధీ ని దుమ్మెత్తి పోసాడు. ( నిజానికి గాంధీ [ ఇమేజ్ ను బహిర్గతం చేసి ] నోట్లో దుమ్ము కొట్టాడు అంటే నిజమేమో ?! ) . అంబేద్కర్ ” నేను హిందువుల తోటలో పాము లాంటి వాడిని ” అని చేసిన తిరస్కార గర్జన ఇప్పటికీ చల్లార లేదు.

గాంధీ విమర్శకు అతీతుడా ? కలాం విమర్శకు అందని దేవుడా ?

మీరు ఆరిందం చౌదరి రాసిన పుస్తకాలు చదివారా ? కలలు అమ్మడం ఒక గొప్ప మార్కెటింగ్ కళ. అందునా అభివృద్ధి కరువైన మన దేశం లో అది మరీ సులభం. ఆరిందం చౌదరి పుస్తకాలు మిమ్మల్ని కలాం పుస్తకాలకు ధీటుగా ఇన్స్పైర్ చేయకుంటే చెప్పండి. Ayn Rynd వ్రాసిన ” సీక్రెట్ ” పుస్తకం చదవండి – మీలో ఉరికే పాజిటివ్ ఎనర్జీ మీరే చూసుకోండి . ఆరిందం చౌదరి స్కాం లో అరెస్ట్ అయ్యాడు. Ayn Rynd కోట్లకు పడగలెత్తింది – కేవలం కలలను అమ్మడం తోటే. నిమ్న దేశాల్లో, నిమ్న మనసులకు Emotional hype ఇవ్వడం గొప్పగా చిత్రీకరించడం మను వాదానికే చెల్లింది.

కలాం పబ్లిక్ లైఫ్ – మధ్య తరగతి మనిషి కెరీర్ కోరికలకు ప్రతిబింబంగా , వివాదాలకు అతీతంగా ఇమిడి పోయే అందమైన జీవితాన్ని ఎన్నుకోడానికి మార్గ దర్శంగా నిల్చాడు కాని , తన సైన్స్ తో మానవత్వం కలిపి ప్రాక్టికల్ గా ప్రజల కోసం చేసింది ఏమీ లేదు. మీ దగ్గర ఏవన్నా గట్టి సాక్ష్యాలు ఉంటే తీసుకు రండి. తెలుసుకోవడానికి అభ్యంతరం ఇసుమంత కూడా లేదు. We are inspired by Kalam’s life అంటే అది వ్యక్తి గత అభిప్రాయం And you need a model man to build a career to emulate, which is completely understandable. దానితో పేచీ లేదు. ” ప్రజల మనిషి / పీపుల్స్ ప్రెసిడెంట్ ” అంటేనే చిక్కు !! ఇక్కడ – ఒక Individual interest కలిగిన అభిప్రాయాన్ని , అందునా ఒక మంచి ‘ స్వంత జీవితం ‘ గడపాలనే ఒక closed view ను Public opinion for public good లా చూపడం తో ఈ వ్యాసం ఖచ్చితంగా విబెధిస్తుంది.

‘ అచ్చే దిన్ ‘ పేరుతో మభ్య పెట్టి , 60 సంవత్సరాలలో చేయనిది 5 సంవత్సరాలలో చేస్తానని మానవాతీతమైన ప్రమాణాలు చేసి, నల్ల ధనం వెనక్కు తెస్తాననే అత్యాశ కలిగించి – కనీ వినీ ఎరుగని రీతిలో అధికార దాహం లో కులం, మతం ను వెనకేసుకుని సిం హాసనం ఏలుతున్న మోదీ దీర్ఘ కాలము నిలవడు. ఆయన నమ్ముకున్న సిద్ధాంతాలు కూడా అంతే. ఆ రోజు – ఇంత మహనీయుడు కలాం పాత్ర మరి ఏంటి ఈ పాపం లో అంటే – గుండెలు తడుముకోవాల్సిందే.

దయ చేసి వ్యవస్థతో మమేకమైన ఒక వ్యక్తిని అంచనా వేయడానికి mid way లేదు గమనించండి.

కలాం కొటేషన్స్ మత్తెక్కిస్తాయి. అది విషయం కాదిక్కడ. బాబా ల ముందు సాగిల పడ్డం యే విజ్ఞానానికి ప్రతీక ? యే సెక్యులరిజానికి ప్రతీక ? కలాం కు కావాల్సింది పొగడ్త కాదు. నిజానికి బోలెడంత సానుభూతి !! తన కుటుంబం నమ్మని మత గ్రంథాలను చదివాడు, తన సైన్స్ నమ్మని స్వాములకు దండం పెట్టాడు, ఊచకోత జరుగుతున్నా ఒక పక్క నారాయణన్ ” ఈ అల్లర్లకు అక్కడి అడ్మినిస్ట్రేషన్ సపోర్ట్ ఉంది ” అని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంటే తన కళ్ళకు, తనలో మానవత్వానికి గంతలు కట్టేసుకున్నాడు . ఇదంతా తాను ఈ దేశం నమ్ముకున మను వాద వ్యవస్థ లో మనడానికి పడ్డ కష్టాలు. ఒక మైనారిటీ వ్యక్తి ఈ దేశం లో ముందుకెళ్ళాలంటే – ఎన్నొ పరీక్షలకు గురి అవ్వాలి. తన ఆత్మ గౌరవాన్ని పణం పెట్టి తన ఇమేజ్ ను పదే పదే చెక్ చేసుకోవాలి – అని కలాం తన జీవన విధానం లో చెప్పకనే చెప్పాడు. ఆయన ( నేను నమ్మని ) ఆత్మ , పనికి రాని పొగడ్తల కోసం కంటే సానుభూతి కోసం చూస్తుందని నా నమ్మకం !!

P S : సారంగ లో యాక్టివ్ గా ఉండే ఎంతో మంది మార్క్సిస్టులకు ఒక విఙప్తి ! మనమింకా అద్భుతమైన ఆదర్శ సమాజం ఏర్పరుచుకోలేదు. నారాయణన్ ఈ బూర్జువా వ్యవస్థ accommodate చేసిన దళిత వ్యక్తి. ఆయనకున్న పరిమితులు ఆయనుకున్నాయి. సమస్య అది కాదిక్కడ. వ్యవస్థీకృతమైన మనువాదాన్ని వ్యతిరేకించాలంటే – నారాయణన్ ను సపోర్ట్ చేయ డానికి వెనుకంజ వేయాల్సిన అవసరం లేదు.

గాంధీ ” sentiment ‘ అయితే అంబేద్కర్ ” Counter sentiment ” అవుతాడు. కలాం ” sentiment ‘ అయితే నారాయణన్ ” Counter sentiment అవుతాడు.

మన దేశం లో ఉన్నది ప్రధానంగా మనువాద బ్రాహ్మణీయ అగ్ర కుల సమాజం. కాబట్టి ” కలాం ఇమేజ్ ” కేవలం మత ఛాందస వాద సమస్యే కాదు. This is an issue of systemic bias this state is practicing
Dont hesitate to support Narayanan, if you truly believe , you have to fight out the menace of majority fundamentalism in this country and I am sure this casteist society will have one ” Counter sentiment “, it tries to hide, unless you really search for.
*

కలాం: హారతిలో ధూపం ఎక్కువ!

పి. విక్టర్ విజయ్ కుమార్ 
మన 11 వ రాష్ట్రపతి అయిన అబ్దుల్ కలాం మరణం తో సాధారణ మీడియా, సోషల్ మీడియా, ప్రభుత్వాలు, సంస్థలు శోక సంద్రం లో తేలాయి. ప్రతి చోటా, ప్రతి నోటా ఇంత వరకు ఏ రాష్ట్రపతికీ, ఇందిరా గాంధి తర్వాత కేంద్రం లో పరిపాలించినా ఈ ఒక్క నాయకుడికీ,  ఇంత స్థాయిలో Mourning  జరగలేదు. నిజానికి కలాం మన దేశం లో ‘ గాంధీ ‘ లా విమర్శకు అతీతమైన ఒక ‘ సెంటిమెంట్ ‘ లా రూపాంతరం చెందాడు. 
 
అబ్దుల్ కలాం వ్యక్తిగత జీవితం ఎన్నో ఒడిదుడుకులతో నడిచింది. పేద తమిళ ముస్లిం కుటుంబం లో పుట్టి ‘ రాకెట్ సైంటిస్ట్ ‘ గా ఎదిగి భారత్ దేశానికి 11 వ రాష్ట్రపతిగా నియమితుడయ్యాడు. కలాం భారత ప్రభుత్వానికి సైంటిఫిక్ అడ్వైజర్ గా , పోఖ్రాన్ – 2 కు ప్రధాన పాత్ర ధారి గా బాధ్యతలు నిర్వర్తించారు. సైన్స్ అండ్ టెక్నాలజీ ఫీల్డ్ లో ఇంత ప్రశస్తమైన పాత్ర పోషించిన వ్యక్తులు దేశం లో అరుదే. విక్రం సారాభాయ్, సతీష్ ధావన్ లు ఈ సైంటిఫిక్ రంగం లో ప్రముఖులుగా చెప్పుకోవచ్చు. అయితే కలాం గొప్ప తనం ఏమంటే – రాజకీయాల్లో ప్రవేశించి రాష్ట్ర పతిగా కూడా  2002-2007 మధ్య కాలం లో బాధ్యతలు నిర్వర్తించడం. రాష్ట్రపతిగా పదవి విరమించాక అధ్యాపకుడిగా ఎన్నో ప్రసిద్ధ కళాశాలల్లో కాలం గడిపాడు. కలాం నిజాయితీ గా ఎదిగిన ప్రొఫెషనల్ కు తార్కాణంగా , మధ్య తరగతి ప్రజల కలల ఆదర్శంగా నిలిచాడు. ( రాజకీయ పూరితమైన భారత రత్న, పద్మ విభూషణ్ లాంటి బిరుదులు అసలు గొప్ప తనంగా మాట్లాడ్డం గురించి వదిలి వేయద్డం ఉద్దేశ్య పూర్వకమే. దీనికి సంబంధించి వివేచన గురించి పాఠకులే ఆలోచించుకోవాలి )  
 
ఈ చిన్న ఉపోద్ఘాతం ను ఇక్కడ వదిలేద్దాం. కలాం కెరీర్ , నిజాయితీ , అధ్యాపకుడి పాత్ర – ఇవన్నీ చూసి , అతని మరణానికి ఈ ప్రభుత్వం , ఈ మీడియా, ప్రభుత్వ సంస్థలు ఇస్తున్న గొప్ప నివాళులను  Objective  గా గమినించకుండా వదిలేయడం సమయోచితమైన ప్రతిస్పందన అవ్వదు.
 
కలాం సైంటిస్ట్ గా తన కెరీర్ ను మలుచుకున్నాడు. ఒక ప్రొఫెషనల్ సైంటిస్ట్ గా మాత్రమే తన విధిని నిర్వర్తించి నిజాయితీగా పని చేసాడు. 2002 లో నారాయణన్ రాష్ట్రపతిగా రెండో సారి ఎన్నిక కావాల్సిన సందర్భం ఉండింది. ( 1997 జూలైలో గుజ్రాల్ నేతృత్వంలో ఉన్నా మైనారిటీ ప్రభుత్వం అధికారం లో ఉండగా నియమితుడయ్యాడు. తర్వాత వాజపేయి కాలం లో కొన సాగాడు ). ఇక్కడ నారాయణన్ గురించి కొద్దిగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది.  నారాయణన్, భారత దేశ రాష్ట్రపతులలో ఒక ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకుని ఉన్నాడు. పేద దళిత కుటుంబం లో పెరిగి, జర్నలిస్టుగా, ఎకానమిస్టుగా, భారత దేశ దౌత్య వేత్తగా, విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి గా, ఉపరాష్ట్రపతిగా ఆపై రాష్ట్రపతిగా ఎదిగాడు. నారాయణన్ రాష్ట్రపతిగా ఎన్నికయ్యాక అసంబద్ధ ప్రభుత్వ విధానాలను ఎన్నిటినో వ్యతిరేకించాడు.  ఆ స్థాయిలో వ్యతిరేకించిన రాష్ట్రపతికి మనకు లేడంటే అతిశయోక్తి కాదు.
డిసెంబర్ 1992 (ఉప రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ) బాబ్రి మసీదు అల్లర్లపై నీళ్ళు నమలకుండా ‘ గాంధి హత్య తర్వాత దేశం చవి చూసిన ఘోరమైన ఉదంతం ‘ గా వర్ణిచాడు. గుజ్రాల్ ప్రభుత్వం సంకీర్ణ రాజకీయాలకు తలొగ్గి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాన్ని కూల దోసి ప్రెసిడెంట్ రూల్ ను విధించాలనే నిర్ణయాన్ని, వాజ పేయి ప్రభుత్వం బీహార్ లో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోసి ఎమర్జన్సీని విధించాలనే నిర్ణయాన్ని చాలా ఎత్తుగడ తో సుప్రీం కోర్ట్ తీర్పును అడ్డుపెట్టుకుని వ్యతిరేకించాడు. ఒక రాష్ట్రపతిగా తాను రబ్బర్ స్టాంప్ కాదు, ప్రభుత్వ అప్రజాస్వామిక నిర్ణయాలకు తాను మడుగులొత్తననే  విషయాన్ని బహుశా నారాయణన్ తప్ప ఇంకెవరూ ప్రయత్నించలేదు. 2002 గూజరాత్ ఊచకోత  విషయం లో కూడా తానో మౌన పాత్రను ఎన్నుకోలేదు. క్రియాశీలంగా వాజ్ పేయి ప్రభుత్వానికి ‘ గుజరాత్ అల్లర్లకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క మద్దతు ఉంది ‘ అని నిర్మొహమాటంగా లేఖ  వ్రాసాడు. ఇక్కడ గమనించాల్సిందేమంటే – 2002 – 2007 మధ్యలో రాష్ట్రపతి ( అబ్దుల కలాం ) పక్కా రబ్బర్ స్టంపు గా పనిచేసాడే కాని – ప్రభుత్వానికి కించిత్తు ఇబ్బంది కలిగే అంశాలను తడుముకోలేదు. పైగా, ఉరిశిక్షలకు వ్యతిరేకంగా మాట్లాడే మనవతా వాది అబ్దుల్ కలాం తన వద్దకు వచ్చిన మెర్సీ పిటిషన్ ల విషయం లో ఏ మాత్రం వైవిధ్యంగా ప్రవర్తిచలేదు.
కలాం 2003 లో ‘ యూనిఫాం సివిల్ కోడ్ ‘ కు మద్దతు పలకడం చూస్తే అతని రాజకీయ అపరిపక్వతకు అద్దం పడుతాయి. ప్రధానంగా 2005 లొ  బీహర్ ప్రభుత్వం పై ప్రెసిడెంట్ రూల్ విధించడం లో తన సంతకం వేయడానికి  ఏ మాత్రం వెనుకాడ లేదు. నిజానికి నారాయణన్ రాజకీయ వ్యక్తిత్వం ముందు కలాం రాజకీయ జీవితం వెల వెల బోతుంది.
 
( కలాం గుండె జబ్బుల విషయం లో ఖర్చు తక్కువగా ఉండేట్టు హైదరాబాదు లోని పెద్ద కార్పోరేట్ హాస్పిటల్ సంస్థతో కలిసి ఒక ‘ స్టెంటు ‘ ను తయారు చేయడం లో పోషించిన పాత్ర – సైంటిఫిక్ రీసర్చ్ కు మానవత్వాన్ని కలగలిపిన ఒకే ఒక్క ఉదాహరణ – తప్పకుండా మెచ్చుకోదగ్గది ( అయితే ఇది ఎంత ప్రాచుర్యం లోకి వచ్చింది, ఎంత సఫలం అయ్యింది అని చెప్పడానికి తగిన ఆధారాలు లేవు ) . అంతే కాక తనకున్న ఉన్నత స్థాయిని ఉపయోగించుకుని సైన్స్ ను , మానవత్వం తో ప్రజా సంక్షేమం తో కలిపి కృషి చేసిన సందర్భాలు దాదాపు సున్న. 
 
బీ సీ , దళిత రాజకీయ పార్టీల మద్దతు కూడాగట్టుకున్న నారాయణన్  అప్పటికే ‘ తిరస్కార నిర్ణయాలకు ‘ నెలవుగా నిలిచి ఉండడం తో , 2007 లో మత వాద  NDA  రాజకీయ పార్టీలు ప్రత్యామ్నాయం కోసం వెదుకులాట మొదలు పెట్టాయి. అప్పుడు దొరికిన రాజకీయ అనుకూల ఆణిముత్యమే ‘ అబ్దుల్ కలాం ‘ !!   ఒక దళితున్ని దించి బ్రాహ్మణ అగ్రవర్ణాలను ప్రెసిడెంట్ ( కృష్ణకాంత్ , పీ సీ అలెగ్జాండర్ ) చేసి వ్యతిరేకతను కొని తెచ్చుకోవడం కన్నా , ‘ వెజిటేరియనిజం ‘ ను నమ్ముకుని బ్రాహ్మణ వాద పార్టిలకు అనుకూలంగా ఉన్న మేధావి అందునా ముస్లిం కావడం  NDA  ప్రభుత్వానికి లడ్డు దొరికినట్టయ్యింది. ఒక ముస్లిం కేండిడేట్ ను , దళిత కేండిడేట్ కు వ్యతిరేకంగా  నిల్చోబెట్టడం – మనువాద రాజకీయ పార్టీ అయిన ‘ సంఘ్ పరివార్ ‘ ఎత్తుగడలకే చెల్లింది.
kalam2
 
ఏ వ్యక్తినైనా మహానుభావుడిగా వర్ణించే మన దేశ ప్రజల సంస్కృతిలో మనువాదం బలపడిపోయింది. మన ప్రమాణాలు అతి తక్కువ స్థాయికి దిగ జారి కేవలం – నిజాయితీగా ఇబ్బంది కలగ కుండా తమ విధిని నిర్వర్తించడం కూడా ఒక మానవాతీత గుణం అయిపోయింది. ఇదే అబ్దుల్ కలాం ‘ కుడంకులం న్యూక్లియార్ ప్రాజెక్టును ‘ క్లియర్ చేస్తున్నప్పుడు , అక్కడి లోకల్ ప్రజలు, ఆందోళన కారులను కనీసంగా కూడా సంప్రదించకుండా పని చేయడం , ఆయనలో ఉన్న ‘ బూటక తటస్థ ‘ విధానానికి చిహ్నం.
 
కలాం కు నిజానికి గొప్ప గొప్ప ఆదర్శాలు లేవు. ఒక సాధారణ మధ్య తరగతి వ్యక్తికి ఉండే అభిలాష , ఒక లిబరల్ వాదిగా ఉండాలనే ఒక ఆదర్శ భావన తప్ప. అంత గొప్ప సైంటిస్ట్ గా ఉండి – దేశ ప్రజల్లోని ‘ స్పిరిచువాలిటీ ‘ పేరుతో ఉన్న మూఢ నమ్మకాల గురించి, బాబాల గురించి నోరు ఎత్తింది సున్న. ఆయన జీవిత కాలం మొత్తం లో ఒక్క వాక్యం దీనిపై వ్రాసి ఉన్న సందర్భం లేదు. పైగా కలాం ప్రతి బాబా , స్వాములను వారి ‘ స్పిరిచువాలిటీ ‘ ని కళ్ళ కద్దుకోవడం లో ఏ మాత్రం వెనుకాడే వాడు కాడు.
 
నిజానికి కలాం ను కేవలం శాస్త్రవేత్తగా మాత్రమే చూస్తే – మన దేశం సీ వీ రామన్, చంద్ర శేఖర్, రామానుజం (మేథ్స్), విక్రం సారాభాయి లాంటి ఎంతో గొప్ప శాస్త్రవేత్తలను మన కిచ్చింది ( వీళ్ళెవరూ రాజకీయ ప్రధాన పాత్రలు ఆశించలేదు ) .   
 
 కలాం జీవన విధానాన్ని ‘ ఓవర్ రొమాంటిసైజ్ ‘ చేస్తున్న విధానం – మోడల్ ప్రజా జీవితం గురించి కొన్ని అంశాలను ముందుకు తెస్తుంది. కెరీర్ మీద బుద్ధిగా శ్రద్ధగా లగ్నం చేయడం, ఎవరికీ నొప్పించని విధంగా అంటే ప్రధానంగా బ్రాహ్మిణిక రాజ్యానికి వ్యతిరేకంగా ఎటువటి దృక్పథం పెట్టుకోకుండా లిబరల్ వాదం తో లోతుల్లోకి వెళ్ళకుండా సాధారణ అంశంగా పేదరికం గురించి బాధ పడ్డం, విశ్లేషించకుండా ప్రజల మధ్య సామరస్యాన్ని బోధించడం తదితర క్వాలిటీస్ కలిగి ఉండే వ్యక్తి మన దేశానికి ఎంతో అవసరం అన్నట్టు తెలుపుతుంది.
 
నిజానికి ఒక సైంటిస్ట్ గా – మత వాదాన్ని బలంగా ఎంతో చాక చక్యంగా ఎదురించాల్సిన కలాం అందులోనే ఇరుక్కు పోవడం బాధాకరం. కొశాంబి లాంటి చరిత్ర కారులు – ప్రజలకు ఉపయోగ కరమైన చరిత్రను వినిపించారు  గాని , కెరీర్ మీద మాత్రమే దృష్టి పెట్ట లేదు.
 
ఒక ‘ కెరీరిస్ట్ లిబరల్ ‘ ను ‘ ప్రజల మనిషి ‘ అనడం మాత్రం హత్యా పాతకం !!
*

స్నేహమే ఉద్యమం, ఉద్యమమే ప్రాణం!

 

పుస్తకాలూ, ప్రజల మధ్య చలసాని!

 నారాయణస్వామి వెంకట యోగి

  మా ఆఫీసు లో నాతో పాటు పనిచేసే అనిల్ అనే మిత్రుడు నెలరోజుల సెలవుపై వైజాగ్ వెళ్ళి,  వచ్చీ రాగానే ‘సార్ మీకో సర్ప్రైజ్ ఉంది’ అంటూ ఒక పాకెట్ తెచ్చి యిచ్చాడు. విప్పి చూద్దును కదా ‘సాహిత్య సమాలోచన’ కృష్ణా బాయి  గారి పుస్తకం, అందులో అందమైన దస్తూరి తో కృష్ణక్క ఉత్తరం – ఒక ఐదారు వాక్యాలతో మరో ఉత్తరం – ‘స్వామీ యెలా ఉన్నావ్ విద్యా పిల్లలూ  యెలా ఉన్నారు – ఈ ఒక్క పుస్తకం మా వదిన కోసం పంపి హెల్ప్ చెయ్యి – నినూ యెప్పటికీ మరవం’ అంటూ – వెనక నిన్నెట్ల్లా భరిస్తుందో అమ్మాయి అంటూ ఒక చురక – తనకు మాత్రమే సాధ్యమయ్యే పలకరింపు  వాక్యాలు – ప్రసాద్ గారి ఉత్తరం – చాలా సంతోషపడ్డా – గత దినాల స్మృతులన్నీ ఒక్క సారి చుట్టుముట్టినయి –

వెంటనే ఫోన్ చేసా వైజాగ్ కి – ‘యేమి నారాయణస్వామీ పూర్తిగా అమెరికనైజ్ అయిపోయావా  – ఇంక అక్కడే ఉండిపోతావా ‘   చాలా ఆత్మీయంగా,  హాయిగా పలకరింపు – ‘లేదండీ …’ అని నేనేదో అనబోతుంటే ‘అండీ యేమిటి నీ బొంద కొత్తగా ..’ అని ప్రేమగా చీవాట్లు – అదే చనువు అదే ఆత్మీయత అదే ఆర్తి గొంతులో..  యే మాత్రం మారలేదు – తనకి 83 యేండ్లు అంటే నమ్మ బుద్ది కాలేదు – పసి పిల్ల వాడిలా మాటలు – ఒక నాలుగైదు పుస్తకాల పేర్లు చెప్పి ఇవి వెతికి పంపు వెంటనే – వదిన (కృష్ణక్క) అడిగిన పుస్తకం వెంటనే పంపు – అని చనువుగా పురమాయింపు – పుస్తకాలు పంపాక ఫోన్ చేస్తే ‘అందినయి పుస్తకాలు చాలా థేంక్స్ – యెప్పుడొస్తావు ఇండియాకు – వచ్చేటప్పుడు మరిన్ని పుస్తకాలు తీసుకు వద్దువు కాని ‘ – పుస్తకాలే పుస్తకాలే ఇంకా యేమీ యెప్పుడూ అడగ లేదు,  కోరుకోనూ లేదు –

2005 లో అప్పటి వై ఎస్సార్ ప్రభుత్వం చర్చల ప్రహసనం ముగించి ‘ఎంకౌంటర్’ ల వేడి  నెత్తురు చిందించి ,  విరసం నిషేధించినప్పుడు, నిషేధం  యెత్తివేయాలని (అప్పుడు వీవీ ని కూడా జైల్లో పెట్టారు‌ )   సం తకాల సేకరణ కోసం శివారెడ్డి గారూ , వేణూ  నేనూ, యెం. టీ. వాసుదేవన్ నాయర్, కే. సచ్చిదానందన్ ల సంతకాల సేకరణ కోసం వెళ్ళినప్పుడు కలిసాం ప్రసాద్ గారిని – (నేనప్పుడే యేడేళ్ళ ప్రవాసం తర్వాత ఇండియా వెళ్ళి ఉండినాను) – ఒక డొక్కు స్కూటర్ వేసుకొని వచ్చారు – అదే ఇస్త్రీ లేని ముడుతల అంగీ , పాంటూ , బుజానికి సంచీ , లావుపాటి మసక కళ్ళద్దాలు – యేమివోయి స్వామీ యెప్పుడొచ్చావు – రాగానే నిషేధమా – నాకు సన్ ట్సు ‘ఆర్ట్ ఆఫ్ వార్ ‘ఒరిజినల్ స్పెషల్ ఎడిషన్ కావాలి – సంపాదించి పంపు యెట్లయినా ‘ – అప్పుడూ పుస్తకమే అడిగారు.

1984 లో శ్రీకాకుళం (మాకివలస) విరసం మహాసభల్లో చూసాను మొదటి సారి ప్రసాద్ గారిని – నేనంతకు ముందు సంవత్సరమే విరసం లో చేరాను. అప్పల్నాయ్డు గారి అధ్వర్యం లో చాలా గొప్పగా అద్భుతంగా జరిగినయి ఆ సభలు – అక్కడే నేను విరసం మహామహులందరినీ కలిసాను – కేవీ ఆర్, త్రిమరా, ప్రసాద్ ,సురా, అప్పల్నాయ్డు – ఇంకా చాలా మందిని మొదటి సారి కలిసేను –
సభ ప్రారంభం లో విరసం జెండా యెగరేసినాక

‘యెత్తినాం విరసం జెండా
అలలలుగా వరదలొత్తు
పోరు పోరు జెండా’
అధ్బుతమైన మమేకతతో ఆర్తితో నిండిన కంఠస్వరం తో కళ్ళు మూసుకుని గానం చేస్తుంటే ‘ఆయనే చలసాని ప్రసాద్’ అని చెప్పారెవరో – అప్పట్నుండీ ప్రతి విరసం సభలో సమావేశం లో రుద్రజ్వాల రాసిన పతాక గీతం ప్రసాద్ గారు పాడాల్సిందే!

‘సుబ్బారావు పాణిగ్రాహి సంధించిన కళల త్రోవ
మా యెన్నెస్ ప్రకాశరావ్ మండించిన కథనంలో ..
పరిటాలా రాములన్న ప్రతిఘటనా మార్గంలో
మా చెర యేతం పట్టిన విప్లవాల గానంలో ‘

గొప్ప తాదాత్మ్యం తో పాడే వారు ప్రసాద్ గారు – నాకూ నేర్పించండి పాట అంటూ వెంట పడ్డాను ఆయన వెంట – అప్పుడు నాకు 18 యేండ్లు – నవ్వి బుజం తట్టి ఓ తప్పకుండా అన్నారాయన ఆత్మీయంగా –

తర్వాత సభలో

‘ఈ విప్లవాగ్నులు యెచ్చటివని అడిగితే
శ్రీకాళం వైపు చూడమని చెప్పాలి
వెంపటాపు సత్యమెవరని అడిగితే
గిరిజనుల సత్యమని గొప్పగా చెప్పాలి

సత్యమూ మాస్టారు స్థానమెచటని అడుగ
గిరిజనుల హృదయాలు గుర్తుగా చూపాలి’

కళ్ళు పూర్తిగా మూసుకుని ఒక చేత్తో బల్ల మీద దరువేస్తూ మూసిన కళ్ళ వెనుక తడి ఉబుకుతుండగా చాలా ఆర్ద్రంగా గొప్పగా గానం చేసారు ప్రసాదు గారు. సభ అంతా పూర్తి నిశ్శబ్దంగా లీనమై పోయి విన్నారా పాటను. పాట తర్వాత నినాదాలు మిన్నంటాయి. అట్లే మరో పాట కూడా పాడే వారు – నాకు పూర్తిగా గుర్తు లేదు కానీ తనకు మాత్రమే సాధ్యమయ్యే గొంతు తో పలికే వింతయిన గమకాలతో పాడే వారు ‘స్టాలినో నీ యెర్ర సైన్యం ఫాసిజ వినాశ సైన్యం ‘ అంటూ – ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ నుండి ఉద్యమాల్లో ఉన్న అపారమైన అనుభవం ప్రసాద్ గారిది.

పల్లెర్లమూడిలో విరసం తరగతులు నిర్వహించినప్పుడు మాకు మార్క్సిస్టు తత్వశాస్త్రం – గతితార్కిక చారిత్రిక భౌతిక వాదాల పైన పాఠం చెప్పారు ప్రసాద్ గారు. అంత సంక్లిష్టమైన విషయాన్ని చాలా సులభంగా అర్థమయ్యేట్లు ‘in a nut-shell’ అనే పద్దతి లో గొప్పగా చెప్పారు పాఠాన్ని. నేనూ,  నా మిత్రుడూ సన్నిహితుడూ ఐన అమరుడు    మాధవస్వామీ పాల్గొన్నాం ఆ తరగతుల్లో – మాకు మార్క్సిస్టు తత్వశాస్త్రం  పునాదులేసింది ప్రసాద్ గారే. ఆ మొత్తం తరగతులైనన్ని రోజులూ మేమొకటి గమనించాం – ప్రసాద్ గారు గాడంగా యెప్పుడూ నిద్రపోయే వారు కాదు – వారిది పిట్ట కునుకే ! ఒక నాలుగైదు నిమిషాలు ఉన్నచోటే కూర్చునే కళ్ళుమూసుకుని కునికే వారు – తర్వాత మళ్ళీ యథాతథంగా చురుగ్గా ఉత్సాహంగా పనిచేసే వారు !

ప్రసాద్ గారు శ్రీ శ్రీ కి,  శ్రీ శ్రీ సమగ్ర సాహిత్యానికీ పర్యాయ పదం మా దృష్టిలో – శ్రీ శ్రీ అంటే వల్లమాలిన ప్రేమ – చిన్నపిల్లాడై పోయే వారు  శ్రీ శ్రీ పేరు చెపితే – ఈగ వాలినా  సహించే వారు కాదు – ఆయన యెప్పుడు యేది మాట్లాడినా రాసినా తప్పకుండా ఒక్క సారైనా శ్రీ శ్రీ కవితా వాక్యమో వచన వాక్యమో తప్పకుండా దొర్లుతుంది – శ్రీ శ్రీ సమగ్ర సాహిత్యం ప్రచురణ మొత్తం తన బుజాల మీద వేసుకున్నాడు – డబ్బుల సేకరణ దగ్గర్నుండీ, కవర్ పేజి డిజైన్ , ప్రూ ఫులూ, ఫుట్ నోట్సూ – సమస్తం ఆయనే – ఒక్కడే నెరవేర్చాడు అంటే అతిశయోక్తి కాదు –  సినిమా వాళ్లతో చాలా సంబంధాలుండేవి తనకి –తెలుగు సినిమా రంగంలో కొంత అభ్యుదయ భావాలున్న వారితోనే (ప్రత్యగాత్మ, కే.బి. తిలక్ తదితరులతో ..) సంబంధాలు – కొన్ని సినిమాలకి సహాయ దర్శకత్వం కూడా చేసారని విన్నాను – శ్రీశ్రీ  సమగ్ర  సాహిత్యం ప్రచురణ లో ప్రసాద్ గారు యెవరినీ ఇబ్బంది పెట్టలేదు – తన స్వంతపని లాగానే (యే విరసం పనైనా తాను అట్లే చేసేవారు గొప్ప కమిట్మెంటు తో డెడికేషన్ తో) అలుపెరుగకుండా చిరునవ్వుతో చేసారు – బాగా గుర్తు హైద్రాబాదు లో ఒకసారి కలిసినప్పుడు శ్రీ శ్రీ అనువాదం చేసిన 1968 ఫ్రెంచి విద్యార్థుల ఉద్యమం గురించిన గొప్ప పుస్తకం ‘రెక్క విప్పిన రివల్యూషన్’(The beginning of the End – Angelo Quattrochi) పుస్తకాన్నిచ్చి  – ‘యెట్లా వచ్చింది’ అని కనుబొమలెగరేసుకుంటూ కళ్లలో కించిత్తు సంతృప్తితో కూడిన గర్వం కదలాడుతుంటే అడిగారు – నిజంగా చాలా గొప్పగా అద్భుతంగా ప్రచురించబడిందా పుస్తకం.

విరసం సభలకే మరోమారు వైజాగ్ వెళ్ళీనప్పుడు ప్రసాద్ గారింటికి వెళ్ళాను. పుస్తకాలు,  పుస్తకాలు,  యెటు చూసినా పుస్తకాలే! విశాఖ సముద్రం ప్రసాదు గారింట్లో ఉన్నట్టనిపించిది – షెల్ఫ్ లో శ్రీ శ్రీ లండన్ మహాప్రస్థానం కనబడింది – ఆత్రంగా,  ఆకలిగా తీసుకుని చూడ్డం మొదలు బెట్టా! నా కళ్లలో వెలుగే చూసారో, పుస్తకా న్ని అంత వెల పెట్టి కొనుక్కోలేని నా అశక్తతనే గమనించారో  – ‘మా నారాయణస్వామికి ప్రేమతో’ అని రాసి సంతకం పెట్టి యిచ్చారా పుస్తకాన్ని – తనివితీరా శ్రీ శ్రీ నీ,  ప్రసాదు గారినీ  నీళ్ళు నిండిన కళ్ళతో గుండెలకు హత్తుకున్నా!

విరసం సంస్థాపక సభ్యులూ, జీవితాంతం నమ్మినదానికోసం నిలబడ్డ వారూ, అత్యంత సాధారణ జీవితం గడపిన వారూ, యెటువంటి ఆడంబరాలకూ, పటాటోపాలకు  పోకుండా చాలా సాదా సీదా గా జీవితాన్నీ , సాహిత్యసృజనూ కొనసాగించిన మహానుభావులు ప్రసాదు గారు. యెందరో రచయితలను ప్రచురించారు, వెన్ను దట్టి  ప్రోత్సహించారు – తాను స్వయంగా రాసిందానికన్నా యెక్కువగా,  ఆణిముత్యాల్లాం టి సాహిత్యాన్ని ప్రచురించారు విశాఖలో , తెలుగు నేలపైనా  విప్లవ సాహిత్యానికి మూలస్థంభంలా నిలబడ్దారు – యెంత సాదా సీదాగా ఉండే వారో అంతే సింపిల్ గా మాట్లాడినట్టున్నా గొప్ప లోతైన అర్థాన్నిచ్చేట్టుగా మాట్లాడే వారు – ‘ఆంధ్రప్రదేశ్ ఒక అందమైన అబద్ధం తెలంగాణ ఒక నిష్ఠూరమైన నిజం’ లాటి ఆణిముత్యాల్లాంటి వాక్యాలెన్నో ఆయన ముఖత చాలా యథాలాపంగా వచ్చేవి.

కేవలం పుస్తకాలే కాదు జీవితాన్ని, సమాజాన్నీ , ప్రజా ఉద్యమాలనీ క్షుణ్ణంగా చదివి పీడిత ప్రజా పక్షపాత ప్రాపంచిక దృక్పథాన్ని అణువణువునా వంటబట్టించుకుని అడుగడుగునా ఆచరించి చూపిన వారు ప్రసాద్ గారు. ఆయన ‘గాడిదా’ అని కానీ మరో రకంగా కానీ తిట్టినా చాలా ముద్దుగా ఉండేది. ఆక్షేపణీయంగా అసలు ఉండేది కాదు. ఆయన పాటలేకుండా విరసం సభలు ప్రారంభమవడం ఊహించడం కష్టంగా ఉన్నది. శ్రీ శ్రీ గురించి యెవరు యెక్కడ మాట్లాడినా వెంటనే స్పందించే వారు. ఆ మధ్య ఒడిస్సిస్ యెలైటిస్ ‘పిచ్చి దానిమ్మ చెట్టు’ పద్యాన్ని విన్నకోట అనువాదం చేస్తే వెంటనే స్పందించి ఇది శ్రీ శ్రీ యెప్పుడో అనువాదం చేసాడు – రవిశంకర్ అనువాదం కొంచెం తేడాగా ఉంది అంటూ స్పందించారు. సాహిత్యం , విరసం తదితర అంశాల మీద జరిగిన సుదీర్ఘ చర్చ లో వేల్చేరు తదితరులతో చురుగ్గా పాల్గొన్నారు. శ్రీ శ్రీ నిజమైన జయంతి యేప్రిల్ 30 అని చాలా పరిశోధించి నిర్ధారించారు. ఈ యేడాది,  ఆ రోజు వివిధలో విలువైన శ్రీ శ్రీ స్మృతులెన్నో పంచుకున్నారు. బహుశ అదేనేమో ఆయన చివరి ప్రచురితం.

నవంబర్ లో వచ్చేటప్పుడు తీసుకురా అని నాకో పుస్తకాల జాబితానిచ్చారు  ప్రసాదు గారు. అప్పల్నాయ్డు  గారితో పంపిద్దామనుకున్నా పుస్తకాలు.   నవంబర్ రాకముందే హడావిడిగా తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. తలుచుకుంటే గుండె బరువెక్కుతోంది. కళ్లలో నీళ్ళు నిండుతున్నయి. రావిశాస్త్రి అంటే విపరీతమైన అభిమానం  ప్రసాదు గారికి.  రావిశాస్త్రి కథల్లోని, శ్రీ శ్రీ కవిత్వం లోని  అథోజగత్సహోదరులకోసం. పతితులు, భ్రష్టులూ, బాధాసర్పదష్టులకోసం,  జీవితాంతం సాహిత్య, సాంస్కృతిక సామాజిక రంగాల్లో కృషి చేసిన ప్రసాదు గారు అందరి హృదయాల్లోనూ , ప్రజల నాలుకల పైనా యెప్పుడూ జీవించే ఉంటారు. ఆయనకూ ,  అసాధారణమైనదీ  అయిన ఆయన జీవన శైలికీ మరణం లేదు.

*

ఒక గుండెతడి మనిషి

 

పి.మోహన్

P Mohan‘‘మీ రాయలసీమ వాళ్లు మీరూ, గారూ అని పిలవరు కదా. మరి నువ్వేమిటోయ్ నన్ను మీరూ, గీరూ అంటావు? చక్కగా మీ కడపోళ్ల మాదిరి నువ్వు అనో, లేకపోతే అందర్లా సీపీ అనో ఏకవచనంలో పిలవబ్బాయ్!’’

చలసాని ప్రసాద్ పదేళ్ల కిందట వాళ్లింట్లో నాతో అన్నమాటలివి. అప్పటికి ఆయన వయసు 73, నా వయసు 26. చలసాని స్నేహం, ప్రేమానురాగాలు ఎంత కమ్మనివో ఈ ఒక్క ఉదాహరణ చాలనకుంటా. అలాంటి చలసాని శాశ్వతంగా దూరం కావడం తెలుగు సాహిత్య ప్రేమికులకు, వ్యవస్థలో మార్పు కోరేవాళ్లకు తీరని లోటు. అదృష్టంపై నాకు నమ్మకం లేదు కాని, ఆయన ప్రేమానురాగాలు పంచుకున్న వాళ్లంత అదృష్టవంతులు ఈ లోకంలో ఉండరు. ఆ అదృష్టం నాకు కాసింతే దక్కింది.

కాలేజీ రోజుల్లో శ్రీశ్రీ సాహిత్య సర్వస్వ సంపుటాలపై చలసాని, కృష్ణాబాయిల పేర్లు చూసి వాళ్లను కలవాలని ఆరాటపడేవాడిని. వాళ్లు విరసం సభల్లో పరిచయమైన కొత్తలో నాకు మామూలుగానే తొలుత వయోవృద్ధుల్లా కనిపించారు. అందుకే గౌరవంతోనే కాకుండా కాస్త భయంతోనూ ఉండేవాడిని. తర్వాత అర్థమైందేమంటే వాళ్లు కల్మశం లేని చిన్నపిల్లలని, మా తరానికంటే ఆధునికులనీ. అప్పట్లో కృష్ణక్కకు రాసే ఉత్తరాల్లో కృష్ణాబాయి గారూ అని రాసేవాడిని. ఆమె ‘‘నాపేరు ‘కృష్ణాబాయి గారూ’ కాదు కృష్ణాబాయి మాత్రమే. అలాగే రాయి’’ అని రాసింది. చలసానికి కూడా ఉత్తరాలు రాసేవాడిని కానీ చాలా తక్కువ. ఆయన ఉత్తరాలు బ్రహ్మరాతలో ఉండేవి. అందుకే అవసరమైతే ఫోన్లో మాట్లాడేవాడిని.

2004లో పుస్తకాల పనిపై విజయవాడ వెళ్లినప్పుడు ఆయన కూడా అక్కడికి వచ్చాడు. ఎవరిదో స్కూటర్ పై వాళ్లింటికీ వీళ్లింటికీ తిప్పాడు. 2006లో విరసంపై నిషేధం ఎత్తేశాక విజయవాడలో సర్వసభ్య సమావేశం జరిగింది. నిర్బంధపు పచ్చి గాయాలు, హాస్టల్ తిండి తెచ్చిన అల్సర్ తో వెళ్లాను. సమావేశం తర్వాత మిత్రుల సలహాపై చికిత్స కోసం విశాఖ వెళ్లాను. చలసాని ఇంట్లో వారం రోజులున్నాను. చలసాని నన్ను స్కూటర్ పై మూడు, నాలుగు రోజులు వరుసగా కేజీహెచ్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. డాక్టర్లకు, తెలిసినవాళ్లకు ఫోన్లు చేశాడు. ఆస్పత్రిలో వార్డువార్డూ తిప్పి ఎండోస్కోపీ, రక్తపరీక్షలు వగైరా చేయించాడు. ఓ పక్క పరీక్షలు.. మరోపక్క  వెయింటింగ్ బల్లపై కూచుని ఏవోవో ఎర్ర పాటలు పాడుతూ ఆయన. మధ్యలో మందులు తీసుకొస్తూ, మా వాణ్ని జాగ్రత్తగా చూడాలని డాక్టర్లతో చెప్పిందే చెబుతూ. నాకు కళ్లలో గిర్రున నీళ్లు తిరిగాయి. ఆయన నాకు పెద్ద రచయితలా, నాయకుడిలా కాకుండా మనసెరిగి మసలుకునే బాల్యమిత్రుడిలా కనిపించాడు. అప్పట్లో నేను కావాలని దూరం చేసుకున్న నాన్న, అన్నయ్యలు ఆయన రూపెత్తినట్లు అనిపించింది.

చలసాని ఇంట్లో ఉన్నవారం రోజులూ ఆయన తెచ్చిపెట్టే టిఫిన్లు, ఇంటి భోజనంతోపాటు  ఆయనింట్లోని పుస్తకాలతో విందుభోజనం చేశాను. ఇళ్లంతా ఎక్కడ చూసినా పుస్తకాలే. మేడ అయితే లైబ్రరీనే. వేలాది ఇంగ్లిష్, తెలుగు పుస్తకాలు. ఆర్ట్ అంటే పిచ్చి కనుక ఆ పుస్తకాల కోసం అరలన్నీ గాలించి 15 ఆర్ట్ పుస్తకాలు, 10 చరిత్ర, రాజకీయాల పుస్తకాలు ఏరుకున్నాను. ఒక అరలో కొక్కోకం వంటి పుస్తకాలు కనిపించాయి. ‘ఇవేంటి, ఇక్కడా?’ అని ఆశ్చర్యంగా అడిగితే, ‘ఏం, వాటిలో జ్ఞానం లేదా?’ అంటూ నవ్వాడాయన. ఆస్పత్రి నుంచి ఇంటికొచ్చాక మేడపైకెళ్లి లైబ్రరీని గాలించేవాడిని. నేను అక్కడ ఉన్నప్పుడు చలసాని అక్కగారు వచ్చారు. ఆమెతో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ ముచ్చట్లు చెప్పించుకోవడం మరో ముచ్చట.

తిండిలో, బట్టల్లో చలసాని నిరాడంబరత గురించి అప్పటికే కొంత విన్న నేను ఆ వారం రోజులూ ప్రత్యక్షంగా చూశాను. రచయితలంటే మడత నలగని ఖద్దరు బట్టలు వేసుకునేవాళ్లని అనంతపురంలో ఓ వెటకారం ఉండేది. ఇప్పుడూ ఉందేమో. ఇస్త్రీ చేయని బట్టల చలసానిని చూస్తూ ఉంటే ఆ రచయితలు కళ్లముందు కదిలేవారు. వస్త్రధారణ వ్యక్తిగతం కావొచ్చు కానీ, వ్యక్తిగతానికి, రాజకీయాలకు అణువంత తేడా చూపని చలసాని నిబద్ధత గురించి చెప్పడానికే ఈ పోలిక.

ఆస్పత్రిలో చూపించుకున్న తర్వాత తిరిగి అనంతపురం బయల్దేరాను. దాదాపు 30 పుస్తకాలను కర్రల సంచిలో సర్దుకున్నాను. పుస్తకాల విషయంలో చలసాని గట్టి లెక్కల మనిషి. ‘పుస్తకాలతో పనైపోయాక తిరిగి పంపిస్తేనే తీసుకెళ్లు. ముందు ఆ పుస్తకాల పేర్లు, రచయితల పేర్లు ఓ కాగితంలో రాసివ్వు’ అని అడిగాడు. సరేనని రాసిచ్చాను. మందులు కొనిచ్చి, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి, చేతిలో ఐదొందలు డబ్బు పెట్టాడు. తర్వాత స్కూటర్ పై ఎక్కించుకుని రైల్వే స్టేషన్కు తీసుకెళ్లి, తనే టికెట్ కొని, రైల్లో కూర్చోబెట్టాడు. రైలు కదులుతుండగా టాటా చెప్పాడు. నేనూ టాటా చెప్పాను. ఆయన ఫ్లాట్ ఫామ్ పై కనుమరుగు అవుతూ ఉంటే అప్పటి వరకు ఉగ్గబట్టుకున్న కన్నీళ్లు మౌనంగా గట్లు తెంచుకున్నాయి.

తర్వాత ఆయనను హైదరాబాద్ సభల్లో చూశాను కానీ మనసు విప్పి మాట్లాడుకునే అవకాశం లేకపోయింది. తన పుస్తకాలు తనకివ్వలేదని అలిగాడు కూడా. అలక తీర్చడానికి ఆ పుస్తకాలను సీతమ్మధార ఇంటి అడ్రసు పంపించాను. నేను గతంలో ఇస్తానని చెప్పిన నా సినిమా ఎన్సైక్లోపిడియా పుస్తకాలను ఇవ్వలేదని చాలాసార్లు నిష్టూరమాడాడు. సెట్టి లక్ష్మీనరసింహం ‘రవివర్మ చిత్రమాలికలు’ పుస్తకం జిరాక్సు కాపీని ఆయనకు గత ఏడాది పంపించాను. దాన్ని పునర్ముద్రిస్తే ఎలా ఉంటుందని, మీరు టీకా టిప్పణీ రాస్తారా అని అడిగాను. ముందు పుస్తకం చూద్దామని, సెట్టి వారసులు విశాఖలో ఉన్నారని, వారి సాయం తీసుకుందామని అన్నాడు. నెలకిందట ఆ పుస్తకం గురించే ఆయన కృష్ణక్కతో మాట్లాడాడట. కృష్ణక్క ఫోన్ చేసి.. ‘నువ్వు చలసానితో ఏదో పుస్తకం గురించి చెప్పావుట. ఏంటా పుస్తకం? తనకు గుర్తుకురావడం లేదు’ అని చెప్పింది.

ప్రేమానురాగాలకు కొనసాగింపు ఇవ్వని పరమయాంత్రికతలో కొట్టుకుపోవడం వల్ల చలసానితో కలిసి తిరిగే భాగ్యం దక్కలేదు. కృష్ణక్క పుస్తకావిష్కరణ సభలో ఆయనను చివరిసారిగా చూసి, నా ‘డావిన్సీ’ పుస్తకం ఇచ్చాను. జాగ్రత్తగా సంచిలో వేసుకున్నాడు, భిక్ష అందుకునే బౌద్ధసన్యాసిలా.

బతుకు తెరువు సుడిలో కొట్టుపోతూ ఆయనను కడసారి చూసుకునే భాగ్యానికి కూడా నోచుకోలేకపోయాను. వీలైతే ఇప్పుడే ఆయన మరీమరీ కోరిన సినిమా ఎన్సైక్లోపిడియా పుస్తకాలను విశాఖ తీసుకెళ్లి ఆయన చెంత ఉంచాలనిపిస్తోంది. దేని విలువైనా అది ఉన్నప్పటికంటే లేనప్పుడే బాగా తెలుస్తుంది. చలసాని కూడా అంతే. ఆయన విలువేమిటో విరసానికి, తెలుగు సాహిత్యలోకానికి, సమాజానికి ఇకపై మరింత బాగా తెలుస్తుంది. చలసాని పేరుప్రతిష్టల కోసం పాకులాడలేదు. శ్రీశ్రీ, కొ.కొ. సాహిత్యసర్వస్వాల కోసం తన రచనావ్యాసంగాన్ని త్యాగం చేసి, విరసం, ప్రజాపోరాటాల కోసం తన జీవితాన్ని కొవ్వొత్తిగా కరిగించుకున్నాడు. ఆ పని చేస్తే నాకేంటి లాభం? అని ఆలోచించే వర్తమానంలో చలసాని లాంటి వ్యక్తులు అరుదు. చలసాని విరసం నాయకుడు, కార్యకర్త, దాహం తీరని సాహిత్యపిసాసి. ఇంకా ఏమిటేమిటో కావచ్చు. కానీ తొలుత ఆయన సాటిమనిషిని ప్రేమగా దగ్గరికి తీసుకునే గుండెతడి మనిషి. ఇప్పుడు ఆయన లేరు. కానీ ఆయన నన్ను వెంటేసుకుని తిరిగిన కేజీహెచ్ ఆస్పత్రి జ్ఞాపకాలు మాత్రం నిత్యనూతనంగా ఉన్నాయి.

*

చలసానికి మావోయిజం ఒక way of life!

 

 కూర్మనాథ్

ఒక శిఖరం కూలిపోయింది.
మా ఉత్తరాంధ్ర పెద్దదిక్కు పోయింది.
తెలుగు సాహిత్యం ఓ చుక్కానిని,
విప్లవోద్యమం ఓ సహచరుడ్ని కోల్పోయింది.
తెలుగు ప్రజలకి ఒక తోడు లేకుండాపోయింది.
యారాడ కొండ చిన్నబోయింది.

***
స్వార్ధంలేని మనిషి వుంటాడా? వ్యాపారమయమైన, వస్తుమయమైన ఈ ప్రపంచంలో స్వార్ధంలేకుండా వుండగలిగే అవకాశం వుందా? ఉందనే నిరూపించాడు ప్రసాద్. విప్లవాసాహిత్యోద్యమానికీ, మిత్రులకీ సీపీగా తెలిసిన చలసాని ప్రసాద్ తనని తాను రద్దు చేసుకుని బతికేడు. రెండు రాష్ట్రాల్లో వందలాదిమందికి ఆయన ఆప్తుడు. మానవసంబంధాలు నిలబెట్టుకోవడంలో ఆయన తర్వాతే ఎవ్వరైనా.

ఆయన పరిచయాల  విస్తృతి చూసి ఎవరైనా ఆశ్చర్యపడక తప్పదు. వరంగల్ రైల్వే స్టేషన్లో కావచ్చు, నాంపల్లి పోస్టాఫీసులో కావచ్చు, పుస్తక ప్రచురణ కేంద్రాల్లో కావచ్చు, పత్రికాఫీసుల్లో కావచ్చు, రచయితల్లో కావచ్చు – ఆయనకి విస్తారంగా పరిచయాలుండేవి. అవి ఏవో మొక్కుబడి పరిచయాలు కావు. ఒకసారి పరిచయం అయితే, ఆయన లేదా ఆమె ఇక ఎప్పటికీ మిత్రుడో, మిత్రురాలో.

జీవితమంతా సాహిత్యం, సాహిత్య ప్రచారం, విప్లవం, పౌరహక్కులు తప్ప ఇంకోటి తెలియని సీపీ. అత్యంత నిరాడంబరుడు. జీవితంలో ఒక్కసారికూడా దువ్వెన వాడని, ఒక్కసారికూడా ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకుని, ఒక్క క్షణం కూడా టీవీ చూడని – సీపీ. ఆకలి దప్పులు లేనివాడు లేదా పట్టించుకోని వాడు. కానీ, ఆకలి దప్పులతో, అవసరాలతో వున్నవాళ్లని అనుక్షణం పట్టించుకున్నవాడు. సరిగ్గా యేనన్ ప్రసంగంలో మావో చెప్పినట్టు, నిజమైన మేధావి ప్రజల్లో ఒకడిగా, ఎలాటి బేషజాలు లేకుండా కలిసిపోవాలని చెప్పాడో, నిరాడంబరంగా వుండాలని చెప్పాడో, సీపీ సరిగ్గా అలా వుండేవాడు. మార్క్సిజాన్ని, మావోయిజాన్ని ఒక జీవిత విధానంగా మార్చుకుని, ఒక శ్వాసగా మార్చుకుని బతికినవాడు ప్రసాద్.

cp8

సీపీలేడన్న దుఖం రక్తంలోకి ఇంకుతున్నకొద్దీ ఆయన లేని లోటు లోతు పెరుగుతూ కనిపిస్తూవున్నది. ఏ కృష్ణా తీరాన్నుంచి ఎప్పుడు విశాఖ వచ్చాడోగాని ఉత్తరాంధ్రని సొంత వూరు చేసుకున్నాడు. శ్రీకాకుళం వుద్యమం ఆయన్నెంత కదిలించిందో, ఉత్తేజపరిచిందో, దిస్టర్బ్ చేసిందో ఆయన “ఈ విప్లవాగ్నులు ఎచటివని….” పాడినపుడు తెలుస్తుంది.
“మా ‘పంచాది’ ఎలావున్నాడు,” అని అడిగేవాడు, మా అమన్ గురించి అడుగుతూ. సీపీకి మనుషులు సతతహరితాలు. అంతిమంగా మనిషి నిలుస్తాడు అని నమ్మినవాడు.  అందుకే విప్లవోద్యమం ఒడిదుడుకులకు గురైనపుడు, సెట్ బేక్లకు గురైనపుడు, ఎదురుకాల్పుల్లో విప్లవకారులు మరణించినపుడు మ్రాన్పడి, దిగులుపడి ఏనాడూ కూచోలేదు. అసలు అలుపన్నదే, అనారోగ్యమన్నదే తెలియదు ప్రసాద్ కి.

పుస్తకాల మీద ప్రసాద్ కి ఎంత ప్రేమో చెప్పక్కర్లేదు. ఆయన ఇంట్లో మేడ మీద ఓ పెద్ద లైబ్రరీ.
వామపక్ష ఉద్యమాలకి, సాహిత్యానికి సంబంధించి ఎవరు ఏ యూనివర్సిటీలో పరిశోధన చేస్తున్నా, ఎవరికి ఏ సందేహం వచ్చినా విశాఖలో ఆయనింటికి వెళ్ళాల్సిందే. ఎక్కడ ఏ పుస్తకం వుందని చెప్పడమే కాదు, ఏ పుస్తకంలో ఏముందో, ఎవరు ఏం చెప్పారో అలవోకగా చెప్పేసేవాడు. ఇక శ్రీశ్రీ, రావిశాస్త్రి, కొకుల సాహిత్యం మీద ఆయనకున్న పట్టు గురించి కొత్తగా చెప్పాల్సింది ఏముంటుంది? ఆయనలేకుండా, వాళ్ళ సాహిత్య సర్వస్వాల ప్రచురణ ఊహించలేం.

అక్కడికెళ్లకుండా పని అయేది కాదు. ఓ మూడు సంవత్సరాలుగా లెక్కలేనన్ని సార్లు ఫోన్ చేసేడు – మా కొలీగ్  ఒకాయన ఇరవైఏళ్ల క్రితం తన దగ్గర తీసుకున్న పుస్తకాల గురించి. ఓ రోజు, రాసుకో ఏయే పుస్తకాలు తీసుకెళ్లాడో అని పేర్లు చెప్పేడు. అడిగేవా, ఇస్తానన్నాడా, ఎప్పుడిస్తాడట, అసలు ఇస్తాడా – అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసేవాడు. మా కొలీగ్ రెస్పాన్స్ చాలా పూర్ గా వుండేది. వున్నాయనీ చెప్పేవాడు కాదు, లేవనీ చెప్పేవాడు కాదు. ఇస్తానని ఒకసారి, ఇంతకుముందే ఇచ్చేశానని ఇంకోసారి, వున్నాయో లేదోననీ చెప్పేవాడు.

మూడేళ్ళ గొడవ తర్వాత మొత్తానికి ఆ పుస్తకాల్లో కొన్నిటిని ఇచ్చేడు ఈ మధ్యనే. ఆ సంగతి ఫోన్లో వెంటనే చెప్తే ఎంత సంతోషించాడో! కానీ ఆ పుస్తకాలు చూసుకోకుండానే వెళ్లిపోయాడు.

నాకు ప్రసాద్ పరిచయం చోడవరం లైబ్రరీ స్టడీ మిత్రులు వర్మ, వేణుల ద్వారా. ఆ తర్వాత విశాఖలో జర్నలిజం చదువుతున్నపుడు పరిచయం కొంచెం పెరిగినా, అనుబంధం ఏర్పడింది మాత్రం నేను హైదారాబాద్ వచ్చాక, విరసంలో చేరేకే. తనకి ఇష్టమైన చిన్ని నా సహచరి అయ్యాక, ఎంత సంతోషించాడో.

***

ఫోటోలు: కూర్మనాధ్ 

చీమల వైపే వుండాలి మనం!

 

 చలసాని ప్రసాద్

అది 30వ తేదీ, జనవరి నెల, 1948వ సంవత్సరం. సాయంత్రం ఏడుగంటల సమయం. గాంధీ గారిని కాల్చేశారని ఆకాశవాణి అరిచింది. నేనప్పుడు పదో తరగతి చదువుతున్నా కృష్ణాజిల్లా – చల్లపల్లిలో. మాఊరు అక్కడికి 4 మైళ్ళు. ఆ ఊళ్ళో రేడియో లేదు. హుటాహుటిని సైకిలేసుకుని వెళ్ళి గొట్టాంతో గోడ మీద నిలబడి గాంధీ గారిని కాల్చి చంపారని చెప్పాను. అయితే అప్పటికి ఎవరు చంపారో ఇంకా ఇదమిద్ధంగా తెలియరాలేదు. ముస్లిం చంపాడేమోననుకుని భయపడిపోయి ఎక్కడికక్కడ ముస్లింలు కమ్యూనిస్టు పార్టీ ఆఫీసులకి తరలి వెళ్ళారు. అప్పటికే కోస్తాజిల్లాలలో కమ్యూనిస్టు పార్టీ ఒక రాజకీయశక్తిగా రూపొందింది. బందరు, బెజవాడ, గుడివాడ, ఏలూరు, గుంటూరు, తెనాలి మొదలైన పట్నాల్లో కమ్యూనిస్టు పార్టీ ఆఫీసులు ముస్లింలతో నిండిపోయాయి. అలనాడు మైనారిటీలకు కమ్యూనిస్టు పార్టీ ఒక గొప్ప రక్షణ కవచం.

గాంధీ గారు చనిపోయి ఆరు నెలలు తిరక్కుండానే మా జిల్లాలు పళనియప్పన్ పోలీసు కాంపులతో నిండిపోయాయి. తీవ్రమైన నిర్బంధకాండ కొనసాగింది. కమ్యూనిస్టు కుటుంబాలు ఊళ్ళో ఉండలేని పరిస్థితి. అప్పుడు మా కుటుంబం మా ఊరి నించి చీమలపాడుకి వలస వెళ్ళింది. అది తెలంగాణా సరిహద్దున ఉన్న ఒక చిన్న జమీందారీ గ్రామం. మేము మా ఊళ్ళో ఉండగానే మా ఇంటికొచ్చి రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, రాజబహద్దూర్ గౌడ్ వారం రోజులున్నారు. అప్పటి తెలంగాణా మాకు రష్యాలాగా అనిపించేది.
chalasani1
       చీమలపాడులో ముస్లిం జనాభా ఎక్కువ. అందరూ మమ్మల్ని ఎంతో ఆదరించేవారు. అందరం వరసలు పెట్టి పిలుచుకునేవాళ్ళం. మా నాన్ననీ, అమ్మనీ ఎక్కువమంది అన్నయ్య, వదిన అనేవారు. మా అమ్మ ముస్లిం స్త్రీలాగానే ఉండేది కూడా. మేమూ అలాగే వాళ్ళని బాబాయి, పిన్ని, అత్తయ్య, మామయ్య అనే పిలిచేవాళ్ళం. నేను అలా పిలిచేవాళ్ళలో జంగ్లీ మామయ్య ఒకరు. అతను కష్టజీవి. ఆదరణకీ, ఆప్యాయతకీ పెట్టింది పేరు. జంగ్లీ మామయ్యకి ముగ్గురు కుమార్తెలు. ఒక కూతురు పేరు సాదఖున్. చాలా చలాకీగా ఉండేది. నిరంతరం నన్ను ఆటపట్టిస్తుండేది. మిగతా యిద్దరు మునవ్వర్, హజరా. తర్వాతి కాలంలో జంగ్లీ మామయ్య కూతురు మునవ్వర్ తో కౌముది పెళ్ళి జరిగింది.

పల్లెటూరుకి, పనిపాటలకి సంబంధించిన ఎన్నో విషయాలు అక్కడ నేను గ్రహించాను. నేను పుట్టి పెరిగిన ఊళ్ళలో కన్నా అక్కడ పేదరికం ఎక్కువ. అక్కడ నించి మేము బెజవాడకి వచ్చేశాక కూడా మా అనుబంధం అలాగే కొనసాగింది. మేము మస్తాన్ బాబాయి అని పిలిచే ఆయనకి కౌముది స్వయానా బావమరిది.

       కౌముది ఆ ఊరి వాడే అని విని నా మనసు పొంగులు వారింది. నాకు తెలిసిన కౌముది, మునవ్వర్ ల కన్నబిడ్డే అఫ్సర్ అని తెలిసి మరింత ఆనందం కలిగింది. బెజవాడలో ఒకసారి కలుసుకుని కబుర్లన్నీ కలబోసుకున్నాం. పల్లెపట్టులలో వుండే ప్రశాంతత,  కలుపుగోలుతనం ఇవి అజరామరం. ఇవి ఉద్యమాలకి ఊతం ఇస్తాయి. అలనాటి కమ్యూనిస్టు పార్టీ సాహిత్య, సాంస్కృతిక రంగాలలో సాధించిన విజయాలు ఎప్పటికీ మనకి గర్వకారణమే.

మనం చీమలవైపే ఉండాలని, పాముల పడగనీడలోకి దిగిపోగూడదనీ నేనక్కడే నేర్చుకున్నాను.

  14.01.2010

కౌముది కవిత్వ సంపుటి “అల్విదా” నుంచి …

(నాన్నగారి పుస్తక్తానికి చలసాని గారు రాసిన ఈ మాటల్ని వెంటనే సంపాదించి, టైప్ చేసి పంపిన కవిమిత్రుడు బాల సుధాకర్ మౌళి కి షుక్రియా)

బతుకు ‘బస్తా’ అయింది!

స్లీమన్ కథ-2

కల్లూరి భాస్కరం
కల్లూరి భాస్కరం

హైన్ రిచ్ తల్లి అప్పటికి చాలాకాలంగా అస్వస్థతతో ఉంది.  వంటమనిషిని ఉంచుకున్న భర్త ఆమెకు ఖరీదైన కానుకలు, నగలు, దుస్తులు, డబ్బు దోచి పెడుతుంటే నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోవడం తప్ప ఆమె ఏమీ చేయలేకపోయింది. మనోవ్యథ ఆమె శారీరక ఆరోగ్యాన్నీ దెబ్బతీసింది.

తను చనిపోవడానికి ముందు పెద్ద కూతురికి ఒక ఉత్తరం రాసింది. అది రక్తంతో రాసినట్టుగా కనిపించింది. దురదృష్టవంతురాలైన తల్లి మీద అంతకాలం చూపించిన ప్రేమకు అందులో కృతజ్ఞతలు చెప్పింది. తను జీవన్మరణ పోరాటం చేస్తున్నాననీ, తను చనిపోయినట్టు తెలిస్తే దుఃఖించవద్దనీ, ఎట్టకేలకు కష్టాలనుంచి విముక్తి లభించిందనుకుని సంతోషించమనీ కోరింది. ఇది కొంచెమైనా కనికరం లేని ప్రపంచమనీ; ఈ కడగండ్ల నుంచి తనను గట్టెక్కించమని రాత్రిళ్ళు నిశ్శబ్దంగా చేసిన ప్రార్థనలను ఆ దేవుడు ఆలకించలేదనీ, తన ఓరిమి నిష్ఫలమైపోయిందనీ నిష్టురమాడింది…

ఇదే ఆమె రాసిన చివరి ఉత్తరం. కొన్ని వారాలకే ఓ కొడుకును కని ఆమె కన్నుమూసింది.

ఆమె మరణానికి భర్తే కారణమని గ్రామస్తులకు తెలుసు. అతని మీద కోపంతో రగిలిపోయారు. తగిన శాస్తి చేయాలనుకున్నారు. కానీ అది చివరికి పిల్లలకు శిక్షగా పరిణమించింది. వారిని బంధువుల ఇళ్లకు పంపించే ఏర్పాటు చేశారు. హైన్ రిచ్ ను కల్కోస్ట్ అనే ఊళ్ళో పాస్టర్ గా ఉన్న అతని చిన్నాన్న ఫ్రైడ్ రిచ్ స్లీమన్ ఇంటికి పంపడానికి నిర్ణయం జరిగింది.

ఆ ఏర్పాటు ఒక కొలిక్కి రావడానికి ముందు కొన్ని వారాలు అతడు అంకెర్షగన్ లోనే ఉండిపోయాడు. ఇప్పుడతనికి దెబ్బ మీద దెబ్బ. అతన్ని కలవకుండా మిన్నాను తల్లిదండ్రులు కట్టడి చేశారు. గాట్ ఫ్రైడ్ రిచ్ కూతురు ఇంటికి వెళ్ళి, అచ్చం మిన్నా లానే ఉండే ఆమె తల్లి ఓల్గార్తా చిత్రపటం ముందు నిలబడి హైన్ రిచ్ నిశ్శబ్దంగా కన్నీరు కార్చేవాడు. “మిన్నా ఎడబాటు అమ్మ మరణం కన్నా వెయ్యి రెట్లు ఎక్కువ బాధించింది. నా అనంతర జీవితంలో అనేక దేశాలు తిరిగి అంతులేని కష్టాలు పడ్డాను. కానీ, నా తొమ్మిదో ఏట మిన్నాకు దూరమై నేను అనుభవించిన దుఃఖానికి అవేవీ సాటిరావు” అని ఆ తర్వాత అతను రాసుకున్నాడు.

తన జీవితమంతా అతను మిన్నా సాహచర్యాన్ని కలలు కంటూనే గడిపాడు. ఎప్పటికైనా ఆమెను కలసుకుంటానన్న ఆశ అతనిలో నిరంతరం తళుకుమంటూనే ఉండేది. మిన్నా, ట్రాయ్…రెండూ అతని కలల ప్రపంచంలో ఒకేలా భాగమైపోయాయి.

కల్కోస్ట్ లో చిన్నాన్న అతన్ని స్కూల్లో చేర్చాడు. ఆ స్కూల్లో ఉన్న హోమర్ శిలా విగ్రహం హైన్ రిచ్ ను ప్రత్యేకించి ఆకట్టుకుంది. చిన్నాన్న అతన్ని కన్నకొడుకులానే చూసుకున్నాడు. హైన్ రిచ్ చదువులో బాగా రాణిస్తున్నాడు. లాటిన్ అతనికి బాగా పట్టుబడుతోంది. లాటిన్ టీచర్ కార్ల్ ఆండ్రెస్ అది గుర్తించి అతని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. అతనికి ఆసక్తి ఉన్న విషయాల మీద సొంతంగా లాటిన్ లో రాయిస్తూ, వ్యాకరణ దోషాలు దిద్దుతూ సానపట్టాడు. తండ్రి వల్ల తమ కుటుంబం చెదిరిపోవలసివచ్చినా హైన్ రిచ్ ఆయనను ఇప్పటికీ అభిమానిస్తూనే ఉన్నాడు. 1832 క్రిస్టమస్ రోజున ట్రోజన్ యుద్ధాల పై లాటిన్ లో ఓ సుదీర్ఘ వ్యాసం రాసి తండ్రికి కానుకగా పంపాడు. అక్కడక్కడ దోషాలు ఉన్నా ఆ వ్యాసం తండ్రికి సంతృప్తి కలిగించింది.

చదువులో హైన్ రిచ్ తన ఈడు పిల్లలను మించిపోయాడు. దాంతో మరుసటేడు అతన్ని న్యూ స్ట్రెలిజ్ అనే ఊళ్ళోని జిమ్నాజియంలో మూడో తరగతిలో చేర్చారు. మిన్నా ఎడబాటు, కుటుంబ పరిస్థితులు ఒకపక్క కుంగదీస్తున్నా; పై పైకి ఎదగాలన్న తపన, అందుకు అవసరమైన పట్టుదల, శ్రమించే తత్వం అతనిలో నిలకడగా ఉన్నాయి. ఏ ఆటంకం లేకుండా చదువు సాగితే ఏ రోష్టాక్ యూనివర్సిటీలోనో ఉద్యోగం సంపాదించుకునేవాడు. రోష్టాక్ యూనివర్సిటీ జర్మనీలో అతి పురాతన, ప్రసిద్ధ యూనివర్శిటీలలో ఒకటి.

కానీ జిమ్నాజియం చదువు మూడు నెల్ల ముచ్చటే అయింది. గ్రామస్తులు తన మీద కత్తి కట్టినా తీరు మార్చుకోని తండ్రే అందుకు కారణం. దాంతో గ్రామస్తులు అతన్ని పూర్తిగా పట్టి పల్లార్చడానికి కంకణం కట్టుకున్నారు. ఇతర నిందలతోపాటు, చర్చి నిధులు దుర్వినియోగం చేశాడన్న అభియోగం తెచ్చారు. పాస్టర్ గా ఉండడానికి పనికిరాడని తేల్చారు. బిషప్ అతన్ని అభిశంసించి సస్పెండ్ చేశాడు. చర్చి నుంచే బహిష్కరిస్తామని హెచ్చరించాడు. రాబడి తగ్గిపోవడంతో కొడుకు జిమ్నాజియం చదువు అతనికి తలకు మించిన భారం అయింది.

హైన్ రిచ్ ఓ మామూలు స్కూలుకు మారాల్సి వచ్చింది. ఆ స్కూల్లో అతను మూడేళ్లు గడిపాడు. అక్కడా చక్కగా రాణించాడు. అంతలో మరో పిడుగుపాటు. ఆర్థికంగా పూర్తిగా అడుగంటిపోయిన తండ్రి  ఆ స్కూలు ఫీజు కూడా కట్టలేనని చేతులెత్తేశాడు. అప్పటికి హైన్ రిచ్ కు పద్నాలుగేళ్లు. చదువు సంగతి దేవుడెరుగు, తిండికోసం వెతుక్కోవలసిన పరిస్థితి. ఆ వయసులో అతను చిన్నాన్న మీద ఆధారపడలేడు. ఏదైనా చిన్న ఉద్యోగం చూసుకుని తన బతుకును తన చేతుల్లోకి తీసుకోవలసిందే.

తక్షణ సమస్య తిండి గడవడం. కనుక ఎంత చిన్న ఉద్యోగమైనా చేయకతప్పదు.  ఏ పచారీ కొట్లోనో కుదురుకుంటే కనీసం తిండి కైనా లోటు ఉండదనుకున్నాడు. ఈష్టర్ సెలవులు కాగానే పొరుగునే ఉన్న ఫర్ష్టెన్ బర్గ్ గ్రామంలో ఓ పచారీ కొట్టును వెతుక్కోవాలనుకున్నాడు. అంతలో అనుకోని ఓ ఘటన జరిగింది. అతనో రోజున న్యూ స్ట్రెలిజ్ గ్రామంలోని ఓ సంగీతవిద్వాంసుడి ఇంటికి వెళ్ళాడు. ఆశ్చర్యం… అక్కడతనికి మిన్నా కనిపించింది!

నల్లని దుస్తులతో చాలా నిరాడంబరంగా ఉంది.  ఆ నిరాడంబరతే ఆమె అందాన్ని ద్విగుణీకృతం చేస్తోంది. అతనిలానే ఆమెకూ పద్నాలుగేళ్లు. కానీ ఈడును మించి ఎదిగినట్టు కనిపించింది. ఒకరి చేతుల్లో ఒకరు వాలిపోయారు. నిస్సహాయంగా ఒకరినొకరు చూస్తూ మౌనంగా ఉండిపోయారు. ఇద్దరి చెక్కిళ్ళ వెంట కన్నీళ్లు ధారలు కట్టాయి. ఎంత ప్రయత్నించినా ఒక్కరికీ మాట పెగల్లేడు. అంతలో మిన్నా తల్లిదండ్రులు వచ్చి వారిని బలవంతంగా విడదీశారు.

అయిదేళ్ల వియోగం తర్వాత ,అదే వాళ్ళు మొదటిసారి కలసుకోవడం. అతను దుర్భరమైన ఏకాంతాన్ని, క్లిష్టపరిస్థితిని ఎదుర్కొంటున్న సమయంలో ఆ అమ్మాయి మెరుపు తీగలా కనిపించి మాయమైంది. చెక్కిళ్లపై కన్నీరు జారుతుండగా ఆ సంగీత విద్వాంసుని ఇంట్లో ఆమె నిలబడి ఉన్న దృశ్యం అతనికి జీవితాంతం గుర్తుండిపోయింది. “మిన్నా ఇప్పటికీ నన్ను గాఢంగా ప్రేమిస్తోందన్న నమ్మకం నా ఆశలకు, ఆకాంక్షలకు గొప్ప ఇంధనం అందించింది. నాలో అంతులేనంత శక్తీ, ఉత్సాహం కట్టలు తెంచుకున్నాయి. అలుపెరుగని కృషితో జీవితంలో అన్నివిధాలా పైకి వచ్చి ఆమెకు తగిన వాడిగా నన్ను నేను నిరూపించుకోగలనన్న తిరుగులేని ఆత్మవిశ్వాసం నాలో నిండిపోయింది. నా కాళ్ళ మీద నేను నిలబడేవరకూ ఆమెకు పెళ్లి కాకుండా చూడమని ఆ దేవుణ్ణి వేడుకున్నాను” అని ఆ తర్వాత అతను రాసుకున్నాడు.

కొన్ని రోజుల తర్వాత అతను ఫర్ష్టెన్ బర్గ్ కు ప్రయాణం కట్టాడు. అక్కడ హేర్ హోట్జ్ అనే ఓ వ్యక్తికి చెందిన పచారీ కొట్టులో నౌకరీకి కుదిరాడు. ప్రొఫెసర్ కావాలనుకున్నవాడు కాస్తా అలా పచారీ కొట్టులో తేలాడు.

***

ఆ కొట్టూ, దానికి సంబంధించిన ప్రతిదీ అతనికి కంపరం కలిగించాయి. యజమాని తన పేరులానే ఓ కొయ్య మనిషి. పొద్దుటే అయిదింటికి లేచి కొట్టు తెరవాలి. తుడిచి శుభ్రం చేయాలి. కౌంటర్ల దుమ్ము దులపాలి. యజమాని బూట్లు పాలిష్ చేయాలి. రాత్రి పొద్దుపోయేవరకూ పనే పని. ఆ తర్వాత  అక్కడే నిద్ర. అప్పుడైనా  కాసేపు పుస్తకం పట్టుకుందామనుకుంటె అలసటతో కళ్ళు వాలిపోయేవి. స్కూల్లో బట్టీ పట్టించిన వర్జిల్ పంక్తుల్ని కూడా మరచిపోతున్నాడు. ఆ పచారీ కొట్టు లోపల చీకటిగా, చలి చలిగా, దుర్భరంగా ఉండేది. అతని ఊహలకు మేత వేసే ఎలాంటి కథలూ అక్కడ వినబడవు. తగలబడుతున్న ట్రాయ్ లాంటి పురాతన చిత్రాలు కనబడవు.

రోజంతా ఒళ్ళు హూనం చేసుకున్నా గిట్టేది నామమాత్రం. ఊరు పేదది. ఒక్కోసారి యజమానికి కూడా పూట గడవడం కష్టమయ్యేది. రోజు మొత్తం మీద 12 టేలర్లు, అంటే ఇంచుమించు 3 పౌండ్ల విలువైన సరుకు అమ్మితే, అక్కడికి అదృష్టవంతులే. ఏడాదిలో 3,000 టేలర్ల వ్యాపారం జరగడం కనాకష్టం. లాభాలు తక్కువ, పని గంటలు ఎక్కువ.  త్వరగా ధనవంతుడైపోయి మిన్నా సాహచర్యాన్ని గెలుచుకోవాలనుకుంటున్న హైన్ రిచ్ కు అంతూపొంతూ లేని ఆ వెట్టి చాకిరీనుంచి బయటపడే దారి కనిపించలేదు.

పొద్దుట లేవగానే ఏకాంతంగా గడిపే ఒకటి రెండు గంటలు మాత్రమే అతని సొంతం. ఎనిమిదింటికల్లా యజమాని వచ్చి   బస్తాడు ఆలుగడ్డల మోతతో డిస్టెలరీకి పంపించేవాడు. మెక్లంబర్గ్ లో అంతా ఆలుగడ్డలనుంచి తీసిన విస్కీయే తాగుతారు. ఆ వెంటనే పరుగు పరుగున వచ్చి కౌంటర్ దగ్గర నిలబడాలి. చేపలు, వెన్న, పాలు, ఉప్పు, కాఫీ, చక్కెర, నూనెలు, కొవ్వొత్తులు, ఆలుగడ్డల విస్కీ వగైరాలు అమ్ముతూ రాత్రి పదకొండు వరకూ అక్కడే వేల్లాడాలి. సరకుతో వచ్చిన బరువైన పెట్టెలను కొట్లోకి దొర్లించడం, చేపల కేసుల్ని లెక్కపెట్టడం, సరకు సర్దడం చేస్తూ ఉండాలి. చదువుకోడానికి సమయం చిక్కకపోగా, అంకెలతో బుర్ర అరణ్యంలా తయారయ్యేది. చేప నూనెతో చేతులు జిడ్డోడుతూ ఉండేవి. బట్టల నిండా రంపంపొడి అతుక్కుని ఉండేది. ఉన్నది ఒకటే జత. దానికి కూడా మాసికలు. వేసవైనా, చలికాలమైనా అదే గతి.

ఇంతటి దుస్సహ పరిస్థితుల మధ్య కూడా అతని కలల ప్రపంచం పదిలంగానే ఉంది. దానికి అతనే రారాజు. చదువులో తను ఉన్నతశిఖరాలను అధిరోహించినట్టు, విపరీతంగా డబ్బు సంపాదించినట్టు, మిన్నాను పెళ్లాడి ఆమెతో కలసి ప్రణయసామ్రాజ్యాన్ని ఏలుతున్నట్టు ప్రతిక్షణం ఊహించుకునేవాడు. ఇప్పుడు అతని ఏకైక లక్ష్యం…డబ్బు, అంతులేనంత డబ్బు!

అరుదుగానైనా అతనిలో సంతోషాన్నీ, సంతృప్తినీ నింపిన క్షణాలు లేకపోలేదు. ఓ రోజు రాత్రి ఓ తాగుబోతు తూలుకుంటూ దుకాణానికి వచ్చాడు. చమురు దీపం ముందు నిలబడి హఠాత్తుగా హోమర్ నుంచి కొన్ని గ్రీకు పంక్తులు వల్లించడం ప్రారంభించాడు. హైన్ రిచ్ మంత్రముగ్ధుడై వింటూ ఉండిపోయాడు. అతను గ్రీకు చదవలేడు, అర్థంచేసుకోలేడు. కానీ ఆ భాషలోని లయ అతని హృదయతంత్రిని మీటింది. అలా ఆ తాగుబోతు వంద పంక్తులు పూర్తిచేశాడు. హైన్ రిచ్ మరోసారి …అప్పటికీ తనివి తీరక మూడోసారి అతని చేత వల్లింపజేసి విన్నాడు. సంతోషం పట్టలేక మూడు గ్లాసుల విస్కీ అతనికి ఉచితంగా తాగబొశాడు. దాని ఖరీదు, అంతవరకు తను పొదుపు చేసిన స్వల్పమొత్తంతో సమానం.

హైన్ రిచ్ ఆ తాగుబోతుతో పరిచయం పెంచుకున్నాడు. అతని కోసం రోజూ ఎదురుచూస్తూ ఉండేవాడు. అతని పేరు నీడర్ హోఫర్. వయసు ఇరవై నాలుగేళ్ళు. రోబెల్ కు చెందిన ఓ ప్రొటెస్టెంట్ పాస్టర్ కొడుకు. ఎందులోనూ రాణించలేకపోయాడు. చెడునడత కారణంగా అతన్ని స్కూలునుంచి బహిష్కరించారు. స్కూల్లో ఉండగా బట్టీ పట్టించిన ఆ వంద పంక్తులు మాత్రం అతనికి గుర్తుండిపోయాయి. వాటినే శ్రావ్యంగా వల్లిస్తూ ఉండేవాడు. ఆ పంక్తులు వింటున్నప్పుడు తన కళ్ల వెంట ఆనందబాష్పాలు జల జలా రాలాయనీ, తనకు గ్రీకు భాష తెలిసేలా చేయమని “ఆ క్షణం” నుంచే దేవుణ్ణి ప్రార్థించడం ప్రారంభించాననీ హైన్ రిచ్ ఆ తర్వాత రాసుకున్నాడు.

ఆ రోజుల్లోనే అతను అమెరికాకు పారిపోవాలని అనుకునేవాడు. అక్కడి వీథుల్ని బంగారంతో తాపడం చేశారనీ, ఆ దేశంలో కరువు తీరేలా కావలసినన్ని పుస్తకాలు కొనుక్కోవచ్చనీ చెప్పుకుంటుండగా విన్నాడు. అప్పట్లో పడమటి భూములనుంచి వేల సంఖ్యలో జనం అమెరికాకు వలసపోతూ ఉండేవారు. కొంత ఖర్చు భరించే మేరకైనా తన దగ్గర డబ్బు సమకూడితే న్యూయార్క్ పంపే ఏర్పాటు చేసేలా ఒక ఏజెంట్ తో ఒప్పందం చేసుకున్నాడు. అప్పుడతని వయసు పద్దెనిమిదేళ్లు. కొంత డబ్బు అప్పుగా ఇవ్వమని తండ్రికి రాశాడు. ఆయన సమస్యల్లో ఆయనున్నాడు. ఒకామెను పెళ్లి చేసుకుని, ఇద్దరు పిల్లల్ని కన్న తర్వాత వదిలేసి మళ్ళీ తెచ్చుకున్నాడు. ఇద్దరి మధ్యా ఎడతగని కీచులాట. చివరికి వ్యవహారం కోర్టువరకూ వెళ్లింది. తండ్రి నుంచి ఎలాంటి సాయం అందకపోవడంతో హైన్ రిచ్ తీవ్ర ఆశాభంగం చెందాడు. ఇక ఈ పచారీ కొట్టును, వెట్టి చాకిరీనీ తప్పించుకునే మార్గంలేదనుకున్నాడు. అంతలో అతని జీవిత గమనాన్నే మార్చేసే ఓ ఘటన జరిగింది.

heinrich

అతనో పెద్ద చికోరీ పెట్టెను దొర్లించబోయాడు. పెద్దదే కానీ మరీ అంత బరువైందేమీ కాదు. అదే అతనికి కష్టమై హఠాత్తుగా రక్తం కక్కుకున్నాడు. నేల మీద ఉన్న రంపంపొడి రక్తంతో ఎర్రబడిపోయింది. ఇంక తను ఆలుగడ్డల బస్తాలను, వెన్న చిలికే పెద్ద పెద్ద కవ్వాలను మోయగల స్థితిలో లేడని అతనికి అర్థమయింది. ఆ చీకటి కొట్లోనే తన జీవితం తెల్లారిపోతుందనుకుని భయపడ్డాడు.

వెంటనే హాంబర్గ్ వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. అది సముద్రతీరంలో ఉంది కనుక అక్కడినుంచి అమెరికాకు తేలిగ్గా వెళ్లిపోవచ్చు. అప్పటికతను 30 ప్రష్యన్ డాలర్లను, అంటే దాదాపు 7 పౌండ్లను పొదుపు చేశాడు. ఆ డబ్బు తీసుకుని కట్టుబట్టలతో కాలినడకన రోష్టాక్ మీదుగా హాంబర్గ్ కు బయలుదేరాడు. రోష్టాక్ లో కొన్ని రోజులు ఆగి బుక్-కీపింగ్ నేర్చుకున్నాడు. సాధారణ విద్యార్థులకు ఏడాది నుంచి ఏణ్ణర్థం పట్టే ఆ కోర్సును కొన్ని రోజుల్లోనే పూర్తిచేశాడు.

రోష్టాక్ నుంచి హాంబర్గ్ కు బయలుదేరిన హైన్ రిచ్ కు చిన్నాన్న కూతురు సోఫీ స్లీమన్ వీడ్కోలు చెప్పింది. హాంబర్గ్ లోని అయిదు ఎత్తైన బురుజుల్ని దూరం నుంచే చూసి ముగ్ధుడయ్యాడు. నిజానికి అతను తన చరమ జీవితం అంతా ఎత్తైన కోట బురుజుల్ని చూస్తూ ముగ్ధుడవుతూనే గడిపాడు. శివార్లలో నిలబడి సెప్టెంబర్ ఆకాశపు గొడుగు కింద ఆ నగర దృశ్యాన్ని చూస్తూ “హాంబర్గ్…హాంబర్గ్’’ అని మాటి మాటికీ గొణుగుతూ ఉండిపోయాడు. ఒక నగరాన్ని చూడడం అదే అతనికి మొదటిసారి. అక్కడి విశాలమైన ఆవరణల మధ్య ఠీవి ఒలికే వర్తక ప్రాసాదాలు, ఎక్కడబడితే అక్కడ మార్కెట్లు, తీర్చి దిద్దిన రహదారుల మీద చప్పుడు చేసుకుంటూ సాగిపోయే బళ్ళు, గడియారపు మోతలు, ఎత్తైన చర్చి గోపురాలపై గంటల గలగలలు…ప్రతిదీ అతన్ని ఉత్తేజితుణ్ణి చేశాయి. చెవులు చిల్లులు పొడిచే ఆ రణగొణ ధ్వనుల మధ్య తనను తాను మరచిపోయాడు. తన కష్టాలను మరచిపోయాడు. నిద్రలో నడుస్తున్నట్టు నడిచాడు. ఇక్కడ తన అదృష్టాన్ని ఎలా పండించుకోవాలన్న ఆలోచన చేశాడు. “హాంబర్గ్ నన్ను ఆకాశానికి ఎత్తేసింది. నన్నో స్వాప్నికుడిగా మార్చేసిం”దని సోదరికి ఉత్తరం రాశాడు.

అదృష్టం పండించుకోవడం అలా ఉంచి, మాటి మాటికీ రక్తం కక్కుకుంటున్న ఈ జబ్బుమనిషికి పని దొరకడమే గగనమైపోయింది. ఎట్టకేలకు నెలకు 14 పౌండ్ల జీతం మీద ఓ పచారీ కొట్టులో పని దొరికింది. ఎనిమిది రోజులకే అది ఊడిపోయింది. ఆ తర్వాత బుక్-కీపర్ గా ఉద్యోగం వచ్చింది. అదీ వారం రోజులకే ముగిసింది. దాంతో క్లిష్టపరిస్థితిలోకి జారిపోయిన హైన్ రిచ్ క్రిష్టమస్ వరకు కాలక్షేపం చేయడానికి సరిపోయే మొత్తాన్ని అప్పుగా పంపమని ఓ బంధువుకి ఉత్తరం రాశాడు. అతను వెంటనే కొద్దిపాటి మొత్తాన్ని పంపుతూ, అంతగా అవసరం లేకపోతే  ఆ డబ్బు తిప్పి పంపమని ఉత్తరం రాశాడు. ఆ మాట హైన్ రిచ్ కు అవమానంగా తోచింది. ఏమైతేనేం, ఆ స్వల్పమొత్తం అతన్ని చావకుండా మాత్రం కాపాడింది. తనను అంత మంత్రముగ్ధం చేసిన హాంబర్గ్ ను క్రిష్టమస్ నాటికి శాశ్వతంగా విడిచిపెట్టేశాడు.

అదెలా జరిగిందంటే…అతని తల్లికి పరిచయస్తుడైన హెర్ వెంట్ అనే ఒక  ఓడల దళారీ అనుకోకుండా తారసపడ్డాడు. అతన్ని ‘డొరోతియా’ అనే ఓడ కెప్టెన్ కు పరిచయం చేశాడు. ఆ ఓడ వెనెజులా లోని లా గ్వైరా అనే చోటికి బయలుదేరబోతోంది. దక్షిణ అమెరికాపై అప్పటికే ఆసక్తి పెంచుకున్న హైన్ రిచ్ ఈ ప్రయాణం గురించి తెలియగానే ఎగిరి గంతేశాడు. అయితే అతని ఆరోగ్యం దెబ్బతినిపోయింది. మరోవైపు చేతిలో చిల్లిగవ్వ లేదు. చివరికి ఒక దుప్పటి కొనుక్కోగల స్తోమత కూడా లేదు. అంతలో అతనికి తన వెండి వాచీ గుర్తొచ్చింది. దానిని మూడు డాలర్లకు అమ్మేసి సెకండ్ హ్యాండ్ మార్కెట్లో రెండు చొక్కాలు, ఒక కోటు, రెండు పంట్లాములూ, ఒక పరుపు, ఓ మాదిరి దుప్పటి కొనుక్కున్నాడు. ఓడ ఎక్కే సమయానికి జేబు ఖాళీ అయిపోయింది.

బయలుదేరిన కొన్ని రోజులకే ఓడ పెనుతుపానులో చిక్కుకుంది. హైన్ రిచ్ మరణం అంచులవరకూ వెళ్ళాడు…

                                                                                                               (సశేషం)

 

 

 

 

 

విహారి

 

కందుకూరి రమేష్ బాబు

Kandukuri Rameshమాయని, మరపును పదిలం చేయాలంటే నలుపు తెలుపు తథ్యం.
ఒక మాయని చెప్పాలన్నా, ఒక మరపును యాదిలో వుంచాలన్నా కూడా.

నిజం.
తొలిసారిగా ఒక నలుపు తెలుపు చిత్రం ప్రదర్శిస్తుండటం నాకే చిత్రంగా ఉన్నది.
కారణం ఏమిటీ అంటే ఏమీ లేదు.
విమానం లేదా విహారం.

ఎగిరిపోవాలని.
స్థిరపడాలనీ.

వెళ్లాలని.
చూడాలనీ.

చూడండి.
చిత్రాన్ని పరిశీలనగా చూడండి.
ఏమేమి ఉన్నాయో అన్నీ చూడండి.

తొలుత నిశ్శబ్దం ఫీలవుతారు.
ఎందుకంటే – దేనికదే హైలైట్ కాకుండా రంగుల ధ్వనిని మౌనం చేసి మొత్తంగా చిత్రాన్ని మాట్లాడనివ్వటం కదా నలుపూ తెలుపూ అంటే. అందువల్లే ఆ నిశ్శబ్దం.

తర్వాత ఆ నలుపులోంచి తెలుపు…
కమ్ముకున్న నల్ల మబ్బుల్లోంచి వెలుతురు మేఘం ఒకటి ఒల్లు విరుచుకున్నట్టు…
లేదా నలుపు కమ్ముకుంటుంటే తెలుపు అదృశ్యం కావడం.
వర్షం రానుంది మరి!

నిశ్శబ్దం తొలగి ఇప్పుడు మేఘ గర్జనా వింటారు.
కాసేపట్లో ఉరుములు అనంతరం మెరుపులు
తర్వాత వర్షం. చినుకు మాయమైపోయే చీకటీ…
తర్వాత అంతా చీకటై పోతుంది.
పైన ఆకాశం కింద నేల మధ్యలో మానవ నిర్మితమైనవన్నీ అదృశ్యం.
విమానపు శబ్దం కూడా ప్రకృతిలో కలిసి నిశ్శబ్దం.
కానీ, అవేవీ కాకముందే తీసిన చిత్రం ఇది.

మరొకసారి చూడండి.
మబ్బులు కమ్మిన ఆకాశంలో ఆ విమానం ఒక్కటే తళుక్కున మెరవాలని ఈ నలుపూ తెలుపు.
అంతకన్నా ముఖ్యం ఆ శిల్పసముదాయంలో ఆ ఇద్దరు మూర్తుల ఎదుగుదల. వికాసం చూడండి.
వారు ఆకాశ దర్శనానికా లేక స్వర్గారోహణకా తెలియదుగానీ, ఒక తృష్ణ అంటారా…ఏమో…
లేక మూలాల్లో కదలిక అంటారా? పంచభూతాల్లోకి తొంగి చూడటం అంటారా?

ఏమైనా కావచ్చు.

కానీ, చిన్నతనంతోనే రాస్తున్నాను. బాలుడిగా రాస్తున్నాను.
మీలో తరగని బాల్యానికి ఉద్దేశిస్తున్నాను.
విమానం వస్తుంటే ఎక్కడున్నా బయటకు వచ్చి, ఆకాశం కేసి చూడాలన్న తహతహను గుర్తుకు చేయడం కదా ఈ చిత్రం.

చిన్నతనం, పెద్దరికం అన్నీ కలగలసి…
ఎవరి అనుభవం నుంచి వాళ్ల నిదానంగా తలెత్తడం ఈ చిత్రం.
చిన్నగా అనుభూతి మొదలైందా ఇక ఆగదు.
ఒక ఒక్కపరి కెరటంలా ఎగియడం ఈ చిత్రం.

ఢిల్లీలో కుతుబ్ మినార్ పరిసరాల్లో నిలబడి ఉండగా ఒక విమానం వినవస్తుంటే చెవులు పసిగట్టగానే కళ్లతో పరిగెత్తగా నా వలే నిద్రలేచిన ఆ మానవ మూర్తులూ, పైన ఆ లోహ విహాంగమూ. దాంతో రెంటినీ ఒడిసి పట్టుకున్న తృష్ణ ఈ చిత్రం.

మరి, ఇదంతా నలుపు తెలుపుల్లో ఎందుకంటే – ఇదొక అనాది భావన.
చూడాలి. చూడాలి. చూడాలి.

అదృశ్యలోకాలు ధృగ్గోచరం కావాలి.
అదృశ్యం కాకముందే చూసి తీరాలి.

చూడవలె. చూడవలె. చూడవలసిందే.
దృశ్యాదృశ్యం.

నలుపు తెలుపుల్లో శిల్ప సముదాయమూ, ఆ లోహ విహంగమూ.
ఎంతో ఆత్రుత. చూడాలన్న తహతహ.
ఒక నాస్టాల్జియా కోసం రంగులను నిశ్శబ్దం చేసినప్పటి కుతూహలం ఈ చిత్రం.

బహుశా ఆ కుతూహలం ఎప్పటికీ ఉంటుందా?
ఉంటే అది గతమూ వర్తమానం భవితా – కదా!
మారనిది అన్నమాట!
అందుకే నలుపూ తెలుపుల్లో దృశ్యాదృశ్యం
దీర్ఘదర్శనం.

~

రూబా

కె.యన్. మల్లీశ్వరి 

 

malliswariఆఫీస్ నుంచి ఇంటికి వస్తూ మూలమలుపున ఆగి  భయంగా ఆకాశం వేపు చూసాను. ఈశాన్యం నుంచి కరిమబ్బు కమ్ముకొస్తోంది.  పాడు వాన!  కురిసి…పోదు. ఒకటే ముసురు. ఇదెన్ని రోజులుంటుందో! గిజాటుగా అనిపించి తల దించుకున్నాను. ఇంట్లోకి వెళ్ళగానే సతీష్ కనిపించాడు. అల్మయిరాలో కుదురుగా కూచున్న బొమ్మల వంక, ఇంట్లో హాయిగా ఎగురుతున్న పిట్టల వంకా దిగులుగా చూస్తున్నాడు. చేసంచిని దివాన్ మీదికి విసిరి ఉస్సురంటూ కూచోగానే వెనుకగా వచ్చి మెడ, రెండు భుజాలుగా చీలే చోట వేళ్ళతో మృదువుగా రాస్తూ ‘టీ చేసివ్వనా సంజూ ?’ అన్నాడు. తల వెనక్కి వంచి చూసాను. తెచ్చి పెట్టుకున్న మృదుత్వం. ముసురు పట్టిన మొహం. ‘నాకేం వద్దురా…’ ఇంకేదో అనాలనుకున్నా గొంతు పట్టుకుపోయినట్లుగా ఉంది.. మొహం కడుక్కోడానికి సింకు దగ్గరకి వెళ్లి యధాలాపంగా అద్దంలో చూసుకుని ఉలిక్కిపడ్డాను. అదే మొహం నాదీనూ.

ఎక్కడివక్కడ వదిలేసి పడకగదికి పరిగెత్తి మంచానికి అడ్డం పడి భోరుమన్నాను. కాస్త నిదానించి లోపలికి వచ్చి దూరంగా నిలబడి ఏడుస్తున్న నా వంక బెరుకుగా చూస్తూ నిల్చున్నాడు సతీష్. మనసు చివుక్కుమంది. తన గురించీ నా గురించి కూడానూ.

ఇద్దరం ఒక బంధంలోకి వచ్చాక చాలా కాన్షియస్ గా మా మధ్యకి చాలా తెచ్చుకున్నాం. పిచుకలు పుల్లా పుడకా ఏరి గూడు కట్టుకున్నంత ఓపికగా తెచ్చుకున్నాం. సతీష్ అయితే మరీను. ఎపుడూ వట్టి చేతులతో రాడు. రోజుకొక కొత్తరకం పూలను తెచ్చేవాడు. నన్ను ఆశ్చర్యపరచడం అంటే ఎంత ఇష్టమో! ఒక గాలీవానా రోజున వద్దన్నా వినకుండా మా ఇంటికి అరవై మైళ్ళ దూరంలో ఉన్న స్నేహితుడి తోటకి వెళ్లి అంటుగట్టిన సెంటుమల్లి మొక్కను తెచ్చాడు. రెండడుగుల పింగాణీ కుండీలో వేసి ఎంత పోషణ చేసేవాడో! దాని పరిమళం అంతా ఇంతా కాదు.

అరాచకంగా ఉండే మా ఇంటి పద్ధతులంటే ఎంత కోపం ఉన్నా సతీష్ వాళ్ళమ్మ అపుడపుడూ మమ్మల్ని చూడడానికి వచ్చేది. అలా వచ్చినపుడు ఒకసారి ఒక చిన్నసంచి నా చేతికిచ్చి “అవసరం అయినపుడు ప్రయోగించు” ముసిముసిగా నవ్వుతూ అంది. ఆవిడ అటు వెళ్ళగానే తీసి చూసాను. చెక్కతో చేసిన పాతకాలపు తీపిగవ్వల బల్ల. ఇలా ప్రయోగించి అవసరాన్ని కడతేర్చడం కూడా పాత కాలపు ఆలోచనే! నేనూ సతీష్ నమ్మము కూడా. కానీ సన్నటి పొడవాటి గీతల మధ్య బాగా అరిగి నున్నగా మారిన ఆ బల్ల సతీష్ వాళ్ళ అమ్మ, నాన్నమ్మ, తాతమ్మల  కవుర్లు చెపుతుండేది. అవి వింటూ గుట్టలుగా  తీపిగవ్వలు తయారు చేసి డబ్బాలకు ఎత్తేదాన్ని.

కొద్దిగా ఏకాంతం దొరికితే చాలు మా చుట్టూ పంచ వన్నెల సర్పం పడగ విప్పి ఆడుతుండేది. అపుడు సతీష్ ఎంత బావుంటాడో! బ్లష్ అవుతున్న తన మొహాన్ని చూడడం ఇష్టంగా ఉంటుంది…ఇపుడలా కనిపిస్తాడా! దూరంగా నిల్చున్న తన వంక మళ్ళీ చూసాను. చూస్తూనే ఉన్నాను. ఆశాభంగమయింది. ఇపుడు ఎట్లా కనిపిస్తున్నాడు సతీష్ నా కంటికి!? రెడీ, వాన్..టూ..త్రీ.. స్టార్ట్.. ఎగిరిపోతే ఎంత బావుంటుందీ…అతని కళ్ళలో సీతాకోక చిలుకల స్వైర విహారం.

ఈ ఇరుకిరుకు గదిని బోర్ గా చూస్తూ బిగబట్టుకున్న తన ఓపిక వెనుక ఉన్నది నా మీది ప్రేమేనా కాదా?  ఒకపుడు నేను అలిసిపోయి ఇంటికి రాగానే నా కన్నా ముందు ఇంటికొచ్చిన సతీష్ ‘టీ చేసివ్వనా?’ అన్నపుడు దాని అర్ధం కాక ఆ టోన్ ఎంత సేద దీర్చేది! క్రమేపీ ఆ స్వరం మాయమై, టీ టైం, ఒక అలవాటు సందర్భం కావడాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. కాలం తన పొరల్ని తాను ఒల్చుకుని ఊరుకోదు కాబోలు! ఎన్నెన్నో భయాలను మీదికి విసురుతుంది. తను నాతో ఉన్నాడు సరే, నాతోనే ఉన్నాడా?  ఇంద్రజాలికుడి మాజిక్ సంచి నుంచి మాజిక్కే మాయం అయిపోతే ప్రదర్శన రక్తి కడుతుందా!  ఈ మహా నౌకాయానంలో ఒంటరి నావికురాలిగా మిగిలిపోతానా? భయం. భయం. భయం వేలు చూపి బెదిరిస్తోంది.

Kadha-Saranga-2-300x268

 

ఇంట్లో చేరిన ముసురుకి భయపడి నేనూ సతీష్  వైజాగ్ సెంట్రల్ కి వచ్చాం. రెండు గంటల్ని విజయవంతంగా కిల్ చేసి సంపాదించిన రెండు చేతుల లగేజీని కారు లో డంప్ చేసాక తను ఫ్రంట్ మిర్రర్ కి  నేను సైడ్ విండో మిర్రర్ కి చూపుల్ని అతికించి బొమ్మల్లా కూచున్నాం. ఏం జరిగిందో తెలీదు, గురజాడ కళాక్షేత్రం దగ్గరకి వచ్చేసరికి కారు మొరాయించింది. మెకానిక్ కి ఫోన్ చేసి కారు అప్పగించి అరగంట సమయం పడుతుందనేసరికి ఓపెన్ ఆడిటోరియంలోకి వెళ్లాం.

ఎదురుగా బోర్డ్ మీద  ఫోక్ లోర్ ఫెస్ట్ – 2015 అన్న అక్షరాలు మిలమిల మెరుస్తూ కనిపించాయి. లోపలంతా చాలా హడావిడిగా ఉంది. తప్పెటగుళ్ళు, గరగలు, థింసానృత్యాలు వరుసలుగా ప్రదర్శనలు సాగుతున్నాయి. రకరకాల వాద్య విశేషాలు ఏకమై గమ్మత్తు స్వరాన్ని ఆలపిస్తున్నాయి. చిలక జోస్యకాడు ప్రలోభపెడుతూ చాలా సేపు వెంటపడ్డాడు. నవ్వుతూ తప్పించుకుని పై మెట్ల మీద మసక వెలుతురులో కూచున్నాం. మా పక్కనే ఒకామె అటు తిరిగి ఏవో సామాన్లు సర్దుకుంటోంది. ఆమెకి ఎడమ చేతివైపు పాత బట్టల మూట, ఒక చేట, చిన్న కర్రముక్క కనిపించాయి. వాటి వంక చిత్రంగా చూస్తూ  మాలో మేము సైగలు చేసుకుంటుండగా మా అలికిడికి ఇటు తిరిగిందామె. ఆకుపచ్చ రంగు ముతక నేత చీర కట్టుకుని ఉంది. పెద్దవైన కాటుక కళ్ళతో మమ్మల్ని చూస్తూ నవ్వింది. చేతిలో చిన్న కర్ర ముక్క పట్టుకుని దాంతో చేటలో ఏదో రాస్తూ ‘సోది సెపుతానమ్మ సోది…ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టు సెపుతానమ్మ’ అంటూ దగ్గరకి జరగబోతుంటే ఇద్దరం గాభరాగా లేచాం. ‘చాల్లెమ్మా సోది!’ సతీష్ వెక్కిరింపుగా అని కదలబోతుండగా వినపడింది ఉరుము లాంటి ఆమె గొంతు.

“ఆలుమగల మద్దెన ఉండాల్సిందే లేదు. వెళ్ళండిరా వెళ్లి వెతుక్కోండి. జగడాలు మాని జట్టు కట్టి కొండ కొన కొమ్ముకి చేరి వెతకండిరా! తలుపులమ్మోరుకి దండం బెట్టి లోయలోకి  చూడండిరా! అడివితల్లికి దండం బెట్టి అడివిని  జల్లెడ పట్టండిరా! జగడాలు మాని జట్టు కట్టి వెతకండి. వెతికి వెతికి ఒక కుక్కపిల్లని తెచ్చుకోండిరా. అంత వరకు మీకు శాంతి లేదు. కనకమాలచ్చిమి ఆన.”  పలుకు చెప్పి మరి మావైపు చూడకుండా పక్కకి తిరిగిపోయింది పౌరుషంగా. కొద్ది క్షణాల పాటు మాతో సహా లోకమంతా మాయమై ఆ ఒక్క స్వరమే రివైండ్ అవుతూ ఉంది. తలంతా ఒకటే హోరు. అక్కడ నుంచి ఎలా బయట పడ్డామో ఎలా ఇంటికి వచ్చి చేరామో గుర్తు లేదు.

***

శృంగవరపు కోట చేరగానే టీ తాగుదామని  అనడంతో అయిష్టంగానే బ్రేక్ వేసాడు సతీష్. మేము స్లో కాగానే సర్రున మా పక్క నుంచి దూసుకుపోయింది నల్లరంగు జాగ్వార్. అందులోంచి ఇద్దరమ్మాయిలు మొహాలు బైటకి పెట్టి హే..అంటూ అరిచి వేళ్ళు ముడిచి బొటనవేలు కిందికి చూపుతూ అల్లరిగా వెక్కిరించారు. నవ్వుతూ చేతులూపాను. రోడ్డు పక్కన చిన్న బండి మీద రకరకాల తినుబండారాలు కనిపిస్తున్నాయి. పక్కన స్టవ్వు మీద టీ మరుగుతోంది. కారు దిగి  రెండు టీలు తీసుకున్నాం.

“నాలుగైంది.. ఆరున్నరకల్లా అరకు చేరిపోతాం.” పక్కన ఉన్న సతీష్ మాటలు ఎక్కడో ఉన్నట్లు వినపడ్డాయి. అప్పటికే నా మనసు రెక్కలు కట్టేసుకుంది. సుదూరపు కొండల్ని ఆత్రుతగా చూస్తున్న నా వంక చూసాడు చూస్తున్నాడు సతీష్. ఏం కనిపించిందో ఏమో అకస్మాత్తుగా తన చూపుల్లో బెదురు.

మునుపెపుడో ఇలాంటి బెదురే చూసాను. ఎపుడబ్బా?!  ఆ… ఓ సారి  తంతడి బీచ్ లో నేను సర్వ సంకోచాలూ వదిలి ఆడుతూ నా ఎత్తు లేచిన అలకి ఎదురొడ్డి , కలియబడి చివరికి అదీ నేనూ రూపాలు వదిలి చుట్టుకుపోయి ఒక విన్యాసపు తహతహతో అంతెత్తుకు లేచి ఒక్కసారిగా విరిగిపడినపుడు  ఒడ్డున నిలబడి ఇలానే బెదురుగా చూసాడు. నేను  బైటకి వచ్చి టవల్ కోసం చేయి చాపితే ఒకడుగు వెనక్కి వేసి “ నువు చాలా అందంగా ఉంటావు…అది కాదు సమస్య. ఆ  సంగతి నీకు బాగా తెలుసు…అదే సమస్య” అన్నాడు. అదిపుడు గుర్తొచ్చి కొంచెం రిలీఫ్ గా అనిపించింది. నాకు ఏ భయం ఉందో, నాకు ఏ సందేహం ఉందో సతీష్ కీ అవే భయ సందేహాలు ఉన్నాయని  తెలిసినప్పటి రిలీఫ్. మునిగిపోవడంలో కూడా మరొకరు తోడున్నారన్న విచిత్రమైన రిలీఫ్.

ఈ సారి డ్రైవింగ్ సీట్ లోకి నేను వచ్చాను. సతీష్  నా పక్క సీట్లో కూచుని సీట్ బెల్ట్ చేతిలోకి తీసుకుని దానివంక విసుగ్గా చూసి పెట్టుకుంటూ “ ఇంత ప్రయాణం పెట్టుకున్నాం. కుక్కపిల్ల దొరుకుతుందంటావా?” అన్నాడు. నా ఆలోచనలు సోదెమ్మ మాటల మీదకి పోయాయి. ఆ స్వరం ఎందుకట్లా ఉందో!! అంత శక్తి ఏంటో! మా ఇద్దరి మధ్యా అన్నీ ఉన్నా, లేనిదేదో అంత సులువుగా ఎలా చెప్పగలిగింది? ఆ లేనిదే తెచ్చుకోమంది. ఒక కుక్కపిల్లని తెచ్చుకోమంది! ఆ మాటలు ఇప్పటికీ పక్కనే ఉండి నడుపుతున్నట్లుగా ఉన్నాయి. కంటికి కనపడకుండా ఆవరించి ఉన్న ఆ మాటల్ని పదేపదే తల్చుకుంటూ “ కుక్కపిల్ల తప్పకుండా దొరుకుతుంది. మనం మచ్చిక చేసి ఇంటికి తెచ్చుకుంటాం కూడా” ధీమాగా అన్నాను.

roobaకారు ఘాట్ రోడ్ ఎక్కింది. శృంగవరపు కోట నుంచి ఘాటీ మీదకి రాగానే ఒక లోకం లోంచి చప్పున ఇంకో లోకంలోకి దుమికినట్లు ఉంటుంది.  రోజుకి పదహారు గంటలు స్మార్ట్ ఫోన్ల వంటి బాగా దగ్గర వాటిని చూడటం అలవాటైన చూపుకి సుదూరంగా చూడమని చెప్పడం కష్టమే. అంతదూరంలోకి, ఆ దూరమంతా వ్యాపించి ఉన్న వెలుగులోకి వెళ్ళడం అలవాటు తప్పి కనుపాపలు ముడుచుకుని చూపు అల్లల్లాడిపోతోంది. కాసేపటికి అలవాటు పడ్డాం.

పోడు కోసం చదును చేసిన కొండవాలు పలకలుగా మెట్లుగా కనిపిస్తోంది. ఆ వైపంతా పసుపు పచ్చని వలిసెపూలవనం, అంతకి మరింత పైపైన దట్టమైన ఆకుపచ్చని అడవీ చేతులు చేతులు పట్టుకుని ఒప్పులకుప్పా ఒయ్యారి భామా ఆడుతున్నట్లున్నాయి. అసలకి ఆకుపచ్చ పసుపుపచ్చ రంగులు అందమైన అక్కచెల్లెళ్ళ వంటివి. వాటి సఖ్య సౌందర్యం ఇంత కన్నా బాగా ఎక్కడ చూడగలం!! లోయ పై అంచుకు కట్టిన సిమెంటు గట్టు మీద కోతులు గుంపులుగా కనిపించాయి. పసికోతుల్ని పొట్టకి అదుముకుని తాపీగా దిక్కులు చూస్తున్నాయి తల్లికోతులు. తామరతూడుల వంటి నునుపైన పొడవైన నూగారు తోకల్ని కిందకి వేలాడేసి తల మాత్రం పక్కకి తిప్పి చూస్తున్నాయి మరి కొన్ని. ఈ వాహనాల చప్పుళ్ళకి బెదిరేది లేదని  నిర్లక్ష్యంగా ఓ చూపు విసురుతున్నాయి.

సతీష్ ఏదో ట్రాన్స్ లోకి వెళ్ళినవాడిలా ఉన్నాడు. ఇపుడతని కళ్ళలో అరకులోయ స్వైర విహారం చేస్తోంది. ఉన్నట్లుండి నా తల నిమురుతూ “ ప్రియురాలా! నీ తల వెండ్రుకలు గిలాదు పర్వతము మీది మేకల మందను పోలి ఉన్నవి” అన్నాడు విస్మయంగా. మైండ్ బ్లోయింగ్! నేను పరిచయం అయిన కొత్తల్లో ఓ సారి తలారబెట్టుకుంటున్న నన్ను చాటుగా ఫోటో తీసి తన లాపీ డెస్క్ టాప్ మీద పెట్టుకుని, ఫోటోలోని శిరోజాల మీద బంగారపు రంగు అక్షరాలతో  ఈ కొటేషన్ టైప్ చేసుకున్నాడు. అది నేను చూసిన రోజే కదా, ఆ వాక్యం వెనుక ఉన్నది పైకి కనిపించే భావం కాదని గ్రహించడం! తను నాతో పరమగీతం ఆలపించడానికి సిద్ధంగా ఉన్నాడని అర్ధమై, అపుడు తనేం చెప్పకుండానే తనని కావిలించుకున్నాను! కావిలించుకున్నాను మళ్ళీ  ఒంటి చేత్తోనే.

సుంకరమెట్ట దాటుతుండగా గాలికొండ మీద మెరుపు మెరిసింది. ఆకాశంలో దాక్కున్న గొప్ప ఇంజినీరు ఎవరో విద్యుత్ రేఖలతో లోకం కాన్వాస్ మీద స్కెచ్ గీస్తున్నాడు. కొండ కొనకొమ్ము వంటి చోట కారాపి చేతులు చేతులు పట్టుకుని గట్టు మీద కూచుని కుక్కపిల్ల కోసం ఆశతో లోయ లోకి తొంగి తొంగి చూసాం.. అప్పటివరకు సన్నగా వీస్తున్న గాలి వేగం పెంచుకుని విసురిసురుగా తోసేయడం మొదలు పెట్టింది.  అకస్మాత్తుగా వ్యాపించిన మసకచీకటికి పిట్టలు గోలగోల చేస్తున్నాయి.

మేం కూచున్న కొండకీ ఎదురుగా ఉన్న కొండకీ మధ్య కొన్ని మైళ్ళ దూరం విస్తరించిన లోయ మీదుగా వాన తెర ఒయ్యారంగా ఊగుతూ వస్తోంది. అదుగో వచ్చేస్తోంది…వచ్చేసింది..సంబరంతో కెవ్వున అరుస్తూ పరిగెత్తి కారులో దూరిపోయాము. గాల్లో ఎగురుతున్న దూదిపింజెలా కనిపించిన వాన మమ్మల్ని ఎంత బలంగా తాకిందో కారు పైభాగంలో డమడమ చప్పుళ్ళను వింటే అర్ధమవుతుంది.

వాన ఉధృతికి గాలి కూడా తోడయి ఎత్తైన చెట్ల కొమ్మలు విరిగి పడుతున్నాయి. వాటి ఆకులు గాల్లోకి లేచి ఆకాశాన్ని కమ్మేస్తున్నాయి. ఆ చీకట్లో, ఆ భయానకమైన  చప్పుళ్ళ మధ్య కారు స్టార్ట్ చేసాను. రెండు ఫర్లాంగులు పోగానే చిన్న చిన్న కొండరాళ్ళు రోడ్డు మీదికి దొర్లి పడటం మొదలైంది. ఏ బండరాయో వచ్చి కారు మీద పడితే! నాలుక పొడారిపోయి చెమట్లు పట్టాయి. ఎడం చేతి వైపు చెట్లు ఎక్కువ ఉన్న చోట కారు పక్కకి తీసి ఆపుతూ ఎదురుగా చూసి అరవబోయి బలవంతంగా ఆపుకున్నాను. అప్పటివరకూ చెట్టు చాటున ఉన్న ఆకారం ముందుకు రావడం హెడ్ లైట్స్ కాంతిలో కనపడింది.

“ఫర్వాలేదు. ఎవరో మనలాగే.” లిఫ్ట్ అడుగుతున్న అతన్ని పరిశీలనగా చూసి అన్నాడు సతీష్. వాన విసిరివిసిరి కొడుతోంది. వేరు ఆలోచనకి సమయం లేదు. అతను లోపలికి వచ్చాడు. దాదాపు నలభై ఏళ్ల వయసు ఉండొచ్చు. మాటల వల్ల తెలిసింది అతని పేరు సింహాద్రి. వైజాగ్ లో ఒక పెద్ద ఫాక్టరీలో చిన్నవర్కర్.  సతీష్ బాగ్ లోంచి తన చొక్కా, తువ్వాలు తీసిచ్చి మార్చుకోమని చెప్పాడు. అవలా చేతిలో పట్టుకునే ఎన్నో విషయాలు చెప్పాడు. ఫాక్టరీ యజమానులతో సమస్యలు, సమ్మెలూ, తిరుగుబాట్లూ  పోరాటాలూ, చిరు విజయాలు, భరించలేని ఓటములు…ఒక్కో మాటా అగ్నికణం. చీకట్లో అగ్నికణం.

అతని మాటలు వింటుంటే నాకు మల్లేనే సతీష్ కి కూడా  గాభరాగా అనిపించింది కాబోలు, మధ్యలోనే  అడ్డు తగిలి చొక్కా మార్చుకోమని చెప్పాడు . అపుడు చూసాము అతని చొక్కా మాటున తడిచిపోయి గిజగిజలాడుతున్న కాకిని. “ఇద్దరికి లిఫ్ట్ ఇస్తున్నాం” సతీష్ నా చెవిలో గొణిగాడు. నవ్వొచ్చింది.

rooba

దానిని పదిలంగా పక్కన కూచోబెట్టి తను చొక్కా మార్చుకుని మళ్ళా చేతిలోకి తీసుకుని దానితో ఏదో మాట్లాడుతున్నాడు సింహాద్రి. అచ్చం మనిషితో మాట్లాడినట్లే. మా సీట్ల లోంచి వెనక్కి తిరిగి ఆ సంభాషణని ఆసక్తిగా చూస్తున్నాము. చిలుకల్నీ కోయిలల్నీ రంగురంగుల పిట్టల్నీవెంటపెట్టుకు తిరిగే వాళ్లకి కొదవ లేని లోకంలో ఇలా కాకిని మోసుకుంటూ తిరిగే సింహాద్రి కొత్తగా ఉన్నాడు. వానకి తడవడం వల్లనేమో కాకి తల మీద బూడిద రంగులో ఉన్న ఈకలు నిక్కబొడుచుకుని ఉన్నాయి. వాటిని వేళ్ళతో పుణుకుతూ “ ఏటే! జావేద్ అబీబ్ కెల్లి కటింగు సేయించు కొచ్చినవేటే లంజికూతురా!  సోకు సూసుకుంతవేటే? అద్దం తెచ్చీమందువా?” అంటూ సింహాద్రి దానితో పరాచకాలాడుతుంటే సతీష్ అయోమయంగా తన స్పైక్స్ తలకట్టుని తడుముకుని, పగలబడి నవ్వుతున్న నన్ను చూసి సిగ్గుపడిపోయాడు.

కదలడానికి వీలులేని ఆ కాళరాత్రిని దాటడానికి సతీష్  గోలగోలగా సింహాద్రికి తన బాధలన్నీ చెపుతూనే ఉన్నాడు. మధ్య మధ్య నేను కూడా అతనికి అర్ధం అవుతుందా లేదా అన్న నిమిత్తం లేకుండా చెప్పుకుపోయాను.  విని విని ‘అలగయితే ఏటి సేస్తారు!  ఎవళ దోవ ఆళు సూసుకోండి’ అన్నాడు తాపీగా. బిక్కచచ్చిపోయాం. “ మాకు ఇంత పెయిన్ ఉందని చెపుతుంటే అసలేమాత్రం కన్సర్న్ లేకుండా…” సతీష్ ఆవేదనగా ఇంకా ఏదో అనబోతుంటే  అతను తల అడ్డంగా ఊపేసి తీవ్రంగా ఉన్న  గొంతుతో ‘మన నొప్పుల్తో లోకానికేటి పని? దాని ఒళ్ళు ఆ ఫళంగా సీల్చి సూడుమీ! గుండె కాయన్నదే అవుపడదు. నీవైనా నానైనా అలగే ఉన్నాం..” అన్నాడు. మేమట్లా నివ్వెరపోయి చూస్తుండగా గాలికొండ మీద పిడుగు పడిన వెలుగుని చూస్తూ చెప్పాడు సింహాద్రి  ‘అల్లందుకే నాను ఏటకుక్క కోసం పారొచ్చీనాను.’

తెల్లారింది.

వాన తగ్గగానే రోడ్డుకి అడ్డంగా ఉన్న చిన్న చిన్న రాళ్ళనీ చెట్ల కొమ్మల్నీ తొలగించుకుంటూ అరకు చేరుకున్నాం. రణజిల్లెడ జలపాతానికి వెళ్ళే తోవలో చుట్టూ రకరకాల పచ్చని చెట్లు. పూతకొచ్చిన మావిడి చెట్ల నుంచి వగరు వాసన వస్తోంది. అడ్డుకట్టు చీరతో, పక్క కొప్పు చుట్టి, బులాకీలు పెట్టుకున్న గిరిజన స్త్రీలు కొడవళ్ళు పట్టుకుని మట్టసంగా ఉన్న కాళ్ళని నేలకి గుచ్చుతూ చులాగ్గా గుట్టలు మిట్టలు ఎక్కేస్తున్నారు. ఒక వైపు కొండరాళ్ళ మధ్య నుంచి జలజల దూకుతున్న ధార, మరోవైపు చూపు నిలవని లోయ. సింహాద్రి లోయ అంచున నిలబడి మా ఇద్దరి చేతులూ చెరోవైపూ పట్టుకుని, ‘అమ్మా! అడివి తల్లీ  మా వొరాల దేవతా! నానొచ్చీనాను. ఇల్లిదిగో ఇద్దరు బిడ్డల్నీ తెచ్చినాను. కనికరం సూపుమీ. మా కోరికలు విన్నవించుకుంతాం ఆలించుమీ!’ అంటూ రాగంతో మాట్లాడటం మొదలు పెట్టాడు.

లోకం చీదరించుకునే కాకుల్ని, భుజాన మోసే ఆ మనిషితో కలిసి సాయంత్రం వరకూ అడవిని జల్లెడ పట్టి అలిసిపోయాం. కుక్కపిల్ల దొరకనే లేదు. రాత్రయ్యేసరికి గెస్ట్ హవుస్ కి చేరుకున్నాం. ఎత్తైన దేవదారు చెట్ల మధ్యనుంచి కిందికి రాలిపడిన పువ్వులా ఉంది ఆ కట్టడం. బడలిక తీరేలా గోర్వెచ్చని నీళ్ళతో స్నానం చేసి వచ్చేసరికి ఆరుబైట వేసిన నెగడు చుట్టూ కొటియా జాతి స్త్రీలు నృత్యం చేస్తున్నారు. వాళ్ళు వడ్డించిన బాంబూ చికెన్, రొట్టెలు తింటూ నెగడు వద్ద ఉండిపోయాం చాలా సేపు. రాత్రి చిక్కనయ్యాక అనిపించింది, రాత్రిలో అడవిని, అడవిలో రాత్రిని నిసర్గంగా చూడాలని. చలో అంటే చలో అనుకున్నాం.

ముందుకు నడుస్తున్న కొద్దీ వెనుక అలజడి పల్చబడుతోంది. రోడ్డు, ఎత్తు నుంచి పల్లానికి దిగుతోంది. విద్యుత్ వెలుగుల్ని దాటి ముందుకు వచ్చేసాక వెన్నెల బాగా కురవడం స్పష్టంగా కనపడుతోంది. రాత్రి పన్నెండున్నరకి ఉండే చల్లదనంతో పాటు సముద్ర మట్టానికి ఐదువేల అడుగుల ఎత్తులో ఉన్న కొండ మీద ఉండే చల్లదనం కూడా తోడయింది. వీచే గాలితో వచ్చే చల్లదనం కాదు. కదలక మెదలక స్థిరంగా ఉండే చల్లదనం. చెట్లమీదా గట్లమీదా కొండల్లోనూ లోయల్లోనూ అన్నింటా కుదురుగా కూచున్న చల్లదనం.

రోడ్డు పక్కన గుబురుగా గుండ్రంగా ఎత్తుగా ఉన్న ఒక చెట్టు, రోడ్డు మీద ఇరవై అడుగుల మేరా నల్లటి నీడని పరిచింది. అదెంత చిక్కని నీడంటే  మేము దాని మధ్య నిల్చున్నామన్న జాడే కనపడదు. కాస్త దూరంలో మూసేసిన కాఫీ హవుస్ నుంచి కాఫీ గింజల అరోమా చుట్టూ వ్యాపించింది. అక్కడ ఆరుబయట వేసిన నల్లని తెల్లని ఇనుప కుర్చీలు, రాజులూ రాణులూ మంత్రులూ సామంతులూ సైనికుల తలల ఆకారంలో చిత్రంగా ఉన్నాయి. అదాటున చూస్తే వారంతా ఒక చోట కొలువు తీరి మంతనాలాడుతున్న గుసగుస ధ్వనులు.

మా మధ్య మాటలు లేవు. అర్ధరాత్రి అడవి చేస్తున్న ప్రతి చిన్న సవ్వడినీ గ్రహించడానికి ధ్యానంలోకి జారిపోయాం. పక్షులూ అడవి జంతువులూ మత్తులోకి సోలినట్లున్నాయి. రోడ్డుకడ్డంగా ఒక ముంగిస అటు నుంచి ఇటు పరిగెత్తింది. వినగా వినగా, నిశ్శబ్దం లోంచి పుట్టే శబ్దాల్ని వినగా వినగా చెవికి ఆనించుకున్న శంఖం నుంచి వినిపించే అతి సన్నని హోరు. పర్వతాగ్రం నుంచి కిందకి దూకుతున్న కొండవాగు హోరు. ‘అమ్మా గోస్తనీ తల్లీ!’ గొణిగి ఊరుకున్నాడు సింహాద్రి.

మళ్ళీ నిశ్శబ్దం. కాలి పక్కన  కొఱివిచీమలు పాకుతున్న చప్పుడు కూడా వినిపిస్తోంది.. చెట్లని అల్లుకున్న అడవితీగెల ఉయ్యాల నుంచి బరువైనదేదో జారి దబ్బున తుప్పల్లో పడింది. మళ్ళీ తెరలు తెరలుగా నిశ్శబ్దం కమ్మేసింది. చుట్టూ వెన్నెల పాలమున్నీరులా పొంగుతుంటే దాని మధ్య గుండ్రని పుట్టిలా ఉంది మేము నిల్చున్న చెట్టునీడ. ఉద్విగ్నంగా సతీష్ చెయ్యి పట్టుకోబోతుండగా కొండ గుండెలు ఝల్లుమనేలా వినిపించిందొక గొంతు. “రూ….బా…”

అంతెత్తున అదిరిపడ్డాం. ఎవరిదా గొంతు!! ఎవరిని పిలుస్తున్నారు? భయంభయంగా చూస్తూ చెట్టు నీడ నుంచి వెన్నెల్లోకి వచ్చి చుట్టూ చూసాం. అనాదిగా మనిషి వెతుకులాట బెంగనీ  దిగులునీ  బరువునీ  మోస్తున్న గొంతుతో పిలుస్తున్నారెవరో! “ రూబా…”

ఇంత రాత్రిలో ఇంత నిశ్శబ్దంలో ఆ గొంతు ప్రకంపనలతో అడవి మార్మోగిపోతోంది. ఎవరు, ఎందుకోసం ఇంత అల్లాడిపోతున్నారు!! చుట్టూ భయంగా చూస్తుండగా మాకు కాస్త దూరంలో ఎండిన చెట్ల ఆకుల మీద ఏదో పరిగెడుతున్న చప్పుడు వినపడింది. ఒళ్ళు జలదరించింది. శ్రద్ధగా వినగా  అది మా వైపే వస్తున్న అలికిడి.. అప్రయత్నంగా ముగ్గురం దగ్గరగా చేరాం. ఆ చప్పుడుని వెంబడిస్తూ వస్తోంది “ రూబా ”  అన్న పిలుపు కూడా.  అటే చూస్తూ నిల్చున్నాం. రెండు నిమిషాలకి చెంగుచెంగుమని దూకుతూ సరాసరి మా వద్దకే వచ్చింది నల్లని తెల్లని మచ్చల కుక్క ఒకటి.

ఇదేనా రూబా! ఇదేనా మేం వెతుకుతున్న గమ్యం! మా మధ్య ఉండాల్సిన కుక్కపిల్ల ఇదేనా? దగ్గరకి వెళ్లి పట్టి పట్టి చూసాము.

ఉద్వేగం ఆపుకోలేక కేకలు వేస్తూ ‘అవును ఇదే మాకు కావలిసిన కుక్కపిల్ల’ పదేపదే అరుస్తూ నేనూ సతీష్ ఉద్రేకంగా దానిని నిమరబోతుండగా సింహాద్రి అడ్డంగా వచ్చి నిలబడ్డాడు. ‘ ఇది నాకు కావలసిన వేటకుక్క’ అన్నాడు. ముగ్గురం ఒకరి మొహాల్లోకి మరొకరం అయోమయంగా చూసుకుంటూ వాదులాడుకుంటూ ఉండగా తుడుం దెబ్బలా వచ్చాడొక కోదు జాతి గిరిజనుడు. రూబాని వెంబడిస్తూ వచ్చినవాడు. ఎండు కొమ్మ మాదిరి ఉన్న ఒంటికి చిన్న గోచీ పెట్టుకుని చేతిలో పంగల కర్ర పట్టుకుని ఉన్నాడు.

అలిసిపోయినట్లు అక్కడ ఉన్న బండరాయి మీద కూచుని మా వాదులాటని ఆలకించి రూబా వంక చూస్తూ నిర్లిప్తంగా, ‘ రూబా మచ్చిక కాదు, ఏట సెయ్యదు. అది మందబేపి ( ఆవులు, మేకలమందని కాపలా కాసే కుక్క ) దాని ఎనకాల మనము పడిపోవడమే’ అన్నాడు. వినగానే నిశ్చేష్టులమయ్యాం.

“మరి మా కుక్కపిల్ల?! అది లేకుండా వెనక్కి ఎలా వెళ్ళడం? రోజుకో భయంతో ఎలా బతకడం?” సతీష్ దిగులుగా అంటుంటే ఆ గిరిజనుడు నిట్టూర్చాడు. “మీ మద్దెన కుక్కపిల్ల ఉండాలంటే ఉట్టినే వస్తాదా! దానికో తల్లి కడుపు ఉండొద్దా? ముందుగాలా రూబా వెంట నడిస్తే అదే కుక్కపిల్లని పెసాదిస్తాది. అల్లదిగో… మల్ల పారిపోతున్నాది. పాండి… ఎలగైనా సూపు దాటకుండా సూసుకుందారి” మా అందరినీ వదిలి అల్లిబిల్లిగా పరుగులు తీస్తున్న రూబా వెంటబడ్డాడు. అదెప్పటికీ మచ్చిక కాదు. అది ఎవరి పెరటి జంతువు కాదు. మేము కూడా దాని వెంటపడాలి, పరిగెత్తాలి. చూపు దాటకుండా చూసుకుంటూ ఉండాలి.  ఓపిక కూడగట్టుకుంటూ “రూబా…” అంటూ అది వెళ్ళిన తోవలోకి  ఆ గిరిజనుడితో పాటు నేనూ సతీష్ దారి తీస్తూ సింహాద్రిని రమ్మని పిలిచాము.

“ రూబా మా లావు గొప్పదాయే! కానీ దారి తప్పిపోనాది. దానెంట నానెలగ ఒచ్చీదీ!?” అంటూ కాకుల్ని మోసే సింహాద్రి మాతో రానన్నట్లు తల అడ్డంగా ఆడించి వేటకుక్కని వెతుక్కోడానికి కాబోలు ఇంకో తోవలోకి మాయమయ్యాడు.

*

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ఆ హిమాలయమే రమ్మని పిలిచిన వేళా…!

సాహిత్ యలమంచి
సవాళ్ళు విసురుతూ , ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయడానికి యత్నిస్తూ ప్రకృతి ఆడే ఆటలో,  మంచు చరియలు ఎప్పుడు  విరిగిపడి తమలో కలిపేసుకుంటాయో తెలియని ప్రాంతంలో ముందుకు సాగడం అంటే అదో పెను సవాల్. అది దాటి మాచ్రా పూచ్రే బేస్ క్యాంప్ చేరడం గొప్ప సాహసమే. అదీ వాతావరణం అంతగా అనుకూలంగా లేని సమయంలో.

కళ్ళముందు కదలాడే హిమ పర్వత అందాల కంటే ముందు నాలుగు ముక్కలు నా ప్రయాణపు నేపథ్యం మీ ముందు పెట్టొచ్చా .. అయితే సరే ..
అద్భుత సౌందర్యంతో మనసును లాక్కెళ్ళిపోయి కట్టిపడేసే హిమాలయ పర్వత శిఖరాలు నన్ను రా రమ్మని ఆహ్వానిస్తున్నట్లుగా ఉండేది వాటి ఫోటోలు చూసినప్పుడల్లా.  అక్కడికి వెళ్ళిరావాలన్న ఇష్టాన్ని తట్టిలేపుతూ,  మరింత గట్టిబరుస్తూ నా మనసునాక్రమించి అందుకు సన్నద్ధం కమ్మని నన్ను పోరు బెడుతూ…  ఏనాటికైనా..  ఒక్కసారైనా వాటిని తాకిరావాలన్న కోరిక మనసు పొరల్లోంచి ఉవ్వెత్తున ఎగుస్తూ …  కలలు కనడం కాదు ఆ కలల్ని సాకారం చేసుకొమ్మని నన్ను నేను ఉత్సాహపరుస్తూ .. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి.

పర్వతారోహణ మాత్రమే కాదు, నిరంతర బాటసారిలా అలా ప్రపంచమంతా చుట్టేసి రావాలని పిచ్చి కోరిక.  అదీ ఒంటరిగా.  నేను గమ్యం గురించి ముందే తెలుసుకోవడం కాకుండా, ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు లేకుండా సాగిపోవాలని అనుకునే వాడిని.  కారణం ముందే తెలిసి ఉంటే కొత్తదాన్ని చూస్తున్నానన్న ఉద్వేగం, ఉత్సాహం మాయం అయిపోతాయేమోనన్న భావన కావచ్చు.  లేదా నేను చూసే దృష్టికోణం మారుతుందన్న ఆలోచన కావచ్చు.  నేను కోరుకున్న అనుభూతులకు భిన్నంగా ఉంటే నిరాశ కల్గొచ్చు.  ప్రతి ప్రదేశాన్ని ఆ ప్రత్యేకతలను ఆస్వాదిస్తూ, అనుభూతి చెందుతూ సాగడంలో ఉండే థ్రిల్ కోల్పోకూడదు అని అనుకునే వాడిని .
మార్గమధ్యలో ఎలాంటి అవాంతరాలు, అడ్డంకులు  ఎదురైనా వాటిని ఎదుర్కొంటూ ముందుకు సాగిపోవడమే నా ధ్యేయంగా పెట్టుకోవాలి వగైరా వగైరా … గజిబిజిగా సాలెగూడులా ఆలోచనలు కలుగుతుండేవి.  ట్రావెలింగ్ చేయాలన్న ఆలోచన మొదట్లో వచ్చింది చెన్నై లో నేను ఇంజనీరింగ్ చదివేప్పుడు.   అసలు అంతకు ముందే ట్రెక్కింగ్ చేయాలన్న కోరిక ఉండేది. బహుశ ,  నేను 6తరగతిలో ఉండగానో ఇంకా ముందేనో ఆ కోరికకు బీజం పడిందనుకుంటా..   ఆ కలను నిజం చేసుకోవాలి. ఎలా ..? తెలిసేది కాదు . నాలో నేనే మదనపడుతూ ఉండేవాడిని.
యునివర్సిటి ఆఫ్ ఇల్లినాయిస్ లో ఎమ్మెస్ పూర్తి చేసి ఉద్యోగంలో చేరిన తర్వాత నా కలకి రెక్కలు వచ్చాయి.  కలను సాకారం చేసుకొమ్మని నా లోపల్నుంచి ఒకటే పోరు. అప్పటివరకూ నాలో నేను కలలు కనడమే గానీ ఎప్పుడూ ఎవరితోనూ వాటిని పంచుకోలేదు.  ఈ విషయం ఇంట్లో చెబితే ఎలా స్పందిస్తారోనన్న సంశయం. చివరికి నాకు ప్రపంచ యాత్ర చేయాలన్నఆలోచన ఉన్న విషయం మా ఇంట్లో వాళ్లతో చర్చించాను. నా ప్రపోజల్ విని ముందు భయపడ్డారు. బాధపడ్డారు. ఉద్యోగం వచ్చింది. ఇక జీవితంలో స్థిర పడతావనుకుంటే ఈ వింత ఆలోచనలు ఏమిటని దిగులుపడ్డారు.  ప్రమాదకరమైన ప్రాంతాలకి ఒక్కడినే వెళ్ళాలని అనుకోవడం కూడా వాళ్ళ భయాలకి కారణం కావచ్చు.   వాళ్లకి అర్ధమయ్యే విధంగా నేను  చెప్పగలిగానో లేక వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా నా సంతోషాన్ని కాదనలేకో గానీ ఒప్పుకున్నారు.
పూన్ హిల్ దగ్గిర...

పూన్ హిల్ దగ్గిర…

నా కుటుంబ సభ్యులు మనస్పూర్తిగా సరే అన్నాక పెద్ద రిలీఫ్.  వాళ్ళు వద్దన్నా నేనువెళ్ళవచ్చు. కానీ నాకలా ఇష్టం లేదు. అలా నాకల సాకారం చేసుకోవడానికి ఒక అడుగు ముందుకు పడింది.  అందుకు కావలసిన ఆర్ధిక వనరులన్నీనేనే సమకూర్చుకోవాలనుకున్నా.  అప్పటి నుండి నా సన్నాహాలు మొదలయ్యాయి. మిత్రులతో చెప్పాను . కొందరు పిచ్చా మంచి ఉద్యోగం వదిలి వెళ్తావా అని  అంటే కొందరు ఆ భావం చూపుల్లో చూపించారు.  కొన్నాళ్ళు ఆగితే తానూ నాతో వస్తానన్నాడు ఓ మిత్రుడు.
నాకు అలా ఇష్టం లేదు. నాకు నచ్చిన విధంగా నేను వెళ్ళాలి. ఒక ప్రేంలో నన్ను నేను ఇముడ్చుకోవడం లేదా ఇతరుల ప్రేం లో ఒదిగిపోవడం నాకు నచ్చదు.  ఓపెన్ గా ఉండడం నాకిష్టం .    నా ప్రతి చర్యకి కర్త కర్మ క్రియ అన్నీ నేనే కావాలి. మరొకరి ప్రమేయం ఉండకూడదు అనుకున్నాను.   ఒక చోటునుండి మరో చోటుకి వెళ్ళడానికి కూడా నేను ఎక్కడా  టైం లిమిట్ పెట్టుకోదలుచుకోలేదు.  అదే విధంగా ముందే టికెట్లు బుక్ చేసుకోవడం వంటి ఏర్పాట్లేమీ లేకుండా అప్పుడున్న పరిస్థితిని బట్టి స్పందించి నిర్ణయాలు తీసుకోవడం, అలా వెళ్తూ అప్పటికప్పుడు పరిస్తితికనుగుణంగా వ్యవహరించడమే అని నాకు నేను చెప్పుకున్నాను. అదే విధంగా ఎలాంటి లగ్జరీ లేకుండా అతి సామాన్యంగా ఉండాలనుకున్నాను. నాకంటూ ఏ కష్టాలూ లేకుండా పెరిగాను.  క్యుబికల్స్ మధ్య కూర్చొని డబ్బులు సంపాదించడమే జీవితమా ..పెళ్లి , పిల్లలు, ఇల్లు , ప్లాట్లు లగ్జరీ కార్లు..  ఇదేనా జీవితం?  అన్న ప్రశ్నలు ఉద్యోగంలో జేరిన తర్వాత మొదలయ్యాయి.  నా ప్రయాణం, నాకల నేరవేర్చుకోవడం కోసమే కాదు.  జీవితం అంటే..? నాలోంచి వచ్చే ప్రశ్నకి అన్వేషణ కూడా అని తర్వాత అర్ధమయింది.

నా ప్రయాణానికి ఏర్పాట్లంటే మరేమీ లేదు లైట్ వెయిట్ ఉండే లాప్ టాప్,  సోనీ 6000 కెమెరా ..బ్యాక్ ప్యాక్ వంటివి కొన్నాను. . ట్రెక్కింగ్ కి మార్చి చివరి నుండివాతావరణం  అనుకూలంగా ఉంటుందని ముందే తెలుసు.  అందుకే చేస్తున్న ఉద్యోగం ఫిబ్రవరి రెండో వారంలో వదిలేసి రెక్కలు కట్టుకుని ఇండియాలో వాలిపోయాను.  వచ్చే దారిలో చిన్న హాల్ట్ దుబాయ్ లో.  ఆకాశ సౌధం బుర్జ్ ఖలీఫా 148 అంతస్తు లోంచి దుబాయ్ నగర అందాలను చూడడం వింత అనుభవం.
మార్చి10 న ఇంటి నుండి బయలుదేరి డిల్లీ వెళ్ళడంతో  నా ప్రయాణం ప్రారంభం అయింది. 

నిరంతర బాటసారిలా కొంతకాలం తిరగాలన్నది నా ఆలోచనతో నేపాల్ లో అడుగు పెట్టాను. అయితే ఇక్కడ నేను నా పర్వతారోహణ అనుభవాలు మాత్రమే మీతో పంచుకోవాలని మీ ముందుకోచ్చాను.

రోడ్డు మార్గం ద్వారా డిల్లీ నుండి నేపాల్ లోని బర్దియా వెళ్లాను. అక్కడి నుండి హిమాలయ పర్వత సానువుల్లో  ప్రకృతి సౌందర్యంతో అలరారే పోఖార చేరాను. అక్కడ డ్రీం పొఖార హోటల్ లో నా బస. అన్నపూర్ణ పర్వతం ఎత్తు 8091 మీటర్లు.  4,130 మీటర్లు అంటే 13,550 అడుగుల ఎత్తులో ఉన్న అన్నపూర్ణ పర్వతం  బేస్ క్యాంపు వెళ్ళాలని నా ఆలోచన. ప్రపంచంలోని ప్రముఖ పర్వతాలలో అన్నపూర్ణ కూడా ఒకటి.  ఎత్తులో 10 వ స్థానంలో ఉంది మౌంట్ అన్నపూర్ణ.  ACAP (Annapurna Conservation Area Entry Permit) & TIMS (Trekkers’ Information Management System) కార్డ్    ట్రెక్కింగ్ కోసం తప్పనిసరి . TIMS కార్డ్ ఎవరెస్ట్ , అన్నపూర్ణ , లమ్తంగ్ పర్వతాలు ట్రెక్ చేయాలంటే తప్పనిసరిగా తీసుకోవాల్సిందేనట) వాటిని తీసుకునే  ఏర్పాట్లలో హోటల్ వాళ్ళు నా శ్రమని కొంత తగ్గించారు.  సహాయం అందించారు.  నాది టూర్  గైడెడ్ ట్రిప్ కాదు. ఇండివిడ్యువల్ గా వెళ్తున్నాను. కాబట్టి అన్నీ నేనే స్వయంగా ఏర్పాటు చేసుకోవాలి. అదే గైడెడ్ ట్రిప్ అయితే అవసరమయిన డబ్బులు ఇస్తే అన్ని ఏర్పాట్లు వాళ్ళే చేస్తారు. ఎప్పటికప్పుడు తగిన సలహాలూ సూచనలు ఇస్తారు .  ముందే చెప్పానుకదా .. నా ప్రోగ్రాం అంతా నా చేతుల్లోనే ఉండాలంటే గైడెడ్ టూర్ లలో కుదరదు.  అయితే ఇక్కడో చిన్న ఇబ్బంది కుడా ఉంది సోలో ట్రెక్ లో . ప్రతికూల పరిస్తితుల్లో, అవాంచనీయ సంఘటనలు జరిగినప్పుడు నా లాంటివారికి ఇబ్బందే. గైడెడ్ ట్రిప్ లో టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేస్తారు.  అయినా సోలో ట్రిప్ వైపే మొగ్గింది నా మనసు.

నా బ్యాక్ ప్యాక్ మోస్తూ ట్రెక్ చేయడం కష్టం అదీగాక మొదటిసారి వెళ్ళడం కాబట్టి షేర్ పా ఉండడం మంచిదనిపించింది.   కాబట్టి అది మోయడానికి షేర్పాని మాట్లాడుకున్నాను. షేర్పాని మాట్లాడుకోవడంలో కూడా హోటల్ వాళ్ళు సహాయం చేశారు. అశోక్ అనే షేర్పా నాకు ట్రెకింగ్ లో చాలా సహాయకారిగా ఉన్నాడు.

హిమాలయాల ఒడిలో  3000 అడుగుల ఎత్తులో ఉన్నపట్టణం పోఖర.  అక్కడికి  వెళ్ళిన మూడు రోజుల తర్వాత పర్వతారోహణ ప్రయాణం ఆరంభమైంది.  అన్నపూర్ణ కి వెళ్ళడానికి మూడు మార్గాలున్నాయి . నేను గొరేపాని, పూన్ హిల్ , తడపాని మీదుగా వెళ్ళే దారి ఎంచుకున్నాను.   అక్కడి నుండి నయాపూల్ వరకూ (44 కి. మీ ) టాక్సీలో వెళ్ళాను. ఒక మాదిరిగా ఉన్న సింగిల్ రోడ్డులో ఒక గంటన్నర  ప్రయాణం. ఆ తర్వాత ఉదయం పదిన్నరకు నుండి ట్రెక్కింగ్ మొదలయింది. ఎవరికి వారు నాలాగే ఒంటరిగా ట్రెక్ చేసేవాళ్ళు కొద్ది మందయితే, సమూహంగా వచ్చేవాళ్ళు కొందరు. గైడెడ్ టూర్ చేస్తున్నవాళ్లు మరికొందరు. వారందరి మధ్య నిలువుగా ఉండే రాతి మెట్లు ట్రెక్ చేస్తూ దాదాపు సాయంత్రం 5 గంటలకు ఉల్లేరి చేరా. మొదటి రోజు ట్రెక్ చేసి దాదాపు 1960 మీటర్ల ఎత్తుకు చేరాను . ఆరోజుకి  ఉల్లేరిలో టీ హౌజ్ లోబస.  అక్కడ  టీ హౌస్ లు అంటే చిన్న హోటళ్ళు ఉన్నాయి. నాలాంటి ట్రెక్కర్స్ తో కాసేపు పిచ్చాపాటి కబుర్లతో ఆరోజు గడచిపోయింది. టీ హౌస్ లో కనీస అవసరాలు తీరేలా చిన్న చిన్న రూమ్స్  సౌకర్యంగానే ఉన్నాయి. అక్కడే కావాల్సిన ఆహారం దొరుకుతుంది. ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యేప్పటికి చాలా సంతోషం .  వెంటనే నా స్టేటస్ అప్డేట్ చేశా.  దాదాపు పది  నుండి  పదిహేను రోజులు నేను ఎవరికీ అందుబాటులోకి రాకపోవచ్చని కుటుంబసభ్యులకి , మిత్రులకి చెప్పి ఉన్నాను కదా .. నా అప్డేట్స్ నా వాళ్లకి ఎంతో సంతోషాన్నిచ్చాయి.

ప్రతి ఏడాది ఎందరో పర్వతారోహకులకి షేర్పాగా హిమ పర్వతారోహణలో అనుభవం ఉన్న అశోక్ తో కబుర్లు.  ఆ కబుర్ల మధ్యలో అడిగాడు మీది ఏ దేశం అని. ఇండియా అంటే అతనికి ఆశ్చర్యం .. అవును ,చూస్తుంటే ఇండియన్ లాగే ఉన్నావు.  కానీ ఇండియన్స్  ఇలా ట్రెక్కింగ్ కి రావడం చాలా తక్కువ కదా అనడం  ఆశ్చర్యం కలిగించింది.  ఆ తర్వాత  చదువు , డబ్బు , ఆస్తుల సంపాదన మీదే దృష్టి పెడతారట  కదా.. అన్న ప్రశ్నలు . నిజమే కావచ్చు అనిపించింది నాకు తెలిసిన వాళ్ళందరినీ చూశాక. అందుకేనేమో వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ నా మార్గంలో ఇండియన్స్ ఎవరూ కనిపించలేదు. మరి,  ప్రపంచంలో ఎత్తైన ఎన్నో పర్వతాలధిరోహించిన భారతీయుడు మస్తాన్ బాబు మాటేమిటి ? అతని మిస్సింగ్ గురించి నేను ట్రెక్కింగ్ మొదలు పెట్టిన రోజే ప్రపంచానికి తెలిసింది. అంతకు కొద్ది రోజుల ముందే మస్తాన్ బాబు పర్వతారోహణ గురించి విని ఉన్నాను.   నేను తిరిగి వచ్చే సరికి అతను ఇకలేడు అన్న వార్త .
మొదటి రోజు అలసటతో మంచి నిద్ర పట్టింది. గబగబా లేచి మళ్లీ ఉదయం బ్రేక్ ఫాస్ట్ ముగించుకుని 8గంటల నుండి నా ట్రెక్ మొదలయింది గోరేపానికి.  రెండో రోజు 2750 మీటర్లు ఎత్తులో ఉన్న గోరేపాని చేరి అక్కడే టీ హౌస్ లో బస చేశాను.   మరుసటి రోజు 5గంటలకే బయలుదేరి పూన్ హిల్ వెళ్ళాలని నిర్ణయించుకున్నా.
Machrapuchre mountain from its base camp

Machrapuchre mountain from its base camp

అనుకున్న సమయానికి అంటే సరిగ్గా సూర్యోదయం అయ్యే సమయానికి అక్కడికి చేరా.   దాదాపు 3200 మీటర్ల ఎత్తులో  ఏటవాలుగా పైన మొనలాగా ఉన్న పర్వతం పూన్ హిల్ .  నాలాగే ఇంకా కొంతమంది పర్వతారోహకులు ఆ సమయానికి అక్కడ చేరారు. ఉదయభానుడు వెదజల్లే తొలి కిరణాల కాంతిలో తడిసే హిమ పర్వతాలు  వింత సోయగాలతో కన్నుల పండుగ చేశాయి. మమ్మల్ని మైమరపించాయి.  అద్భుతమైన ఆ సూర్యోదయాన్ని చూడడం మధురాతి మదురమైన అనుభూతి.  చాలా ఎంజాయ్ చేశా.
అంతలో మా తలల మీదుగా ఎగురుతున్న హెలికాప్టర్.  నీలాకాశం బాగ్రౌండ్ లో పూన్ హిల్ నుండి ఎత్తైన పర్వత శిఖరాలు కనువిందు చేస్తుంటాయి.  ఫిష్ టెయిల్ , అన్నపూర్ణ , అన్నపూర్1, 2, 3, 4, అన్నపూర్ణ సౌత్, నీలగిరి, లాంజుంగ్, హించులి , దవులగిరి, మాచ్రేపుచ్రే ,హిమాలూ, టుకుచే పర్వత శిఖరాలపై  వెండి కరిగించి గుమ్మరించినట్లు, ఆ హిమ రాశులపై పడే కిరణాలు  మిలమిలా మెరిసిపోతూ.. కొన్ని చోట్ల బంగారు కాంతులీనుతూ.. మదిని పులకింపజేస్తుండగా..  మరుసటి రోజుల్లో నేను వెళ్లబోయే  చిన్న, పెద్ద  పర్వతాల మధ్య నిలిచిన  మౌంట్ అన్నపూర్ణ ఠీవిగా రాజసం ఉట్టిపడుతూ తలెత్తుకుని నుంచున్నట్లు గా .. నేనున్నది ఈ ప్రపంచం లోనేనా .. అనేలాగా అత్యద్భుతంగా . అన్నపూర్ణకి  నేను అన్నను అన్నట్లుగా మరింత ఎత్తుగా మెరిసిపోయే దవులగిరి పర్వతం.
Mt. Daulagiri from poonhill

Mt. Daulagiri from poonhill

నేను వెళ్ళాల్సిన  దోవలో మౌంట్ అన్నపూర్ణ చుట్టూ మంచు దుప్పటి కప్పుకున్న పర్వతాలని చూస్తూ..  ప్రకృతి అందించిన మహాద్భుత సౌందర్యాన్ని మదిలో ముద్రించుకుంటూనే  చేతిలోని కెమెరాలో బంధిస్తూ అనిర్వచననీయమైన ఆనందం పొందుతూ ముందుకు సాగాను. నడవలేము అనుకున్న వాళ్ళు పున్ హిల్ దగ్గర వరకూ గుర్రాల మీద వచ్చి వెనక్కి తిరగడం చూశాను.  గోరేపాని , తడపాని , పూన్ హిల్ మార్గ మధ్యలో కూడా నడవలేని వాళ్ళు గుర్రాలని మాట్లాడుకుని వాటిపై కూర్చొని ప్రయాణం చేస్తుంటారు.మళ్లీ  వెనుకకు  ప్రయాణం గోరేపానికి.  అక్కడ నుండి తడపని 2 600 మీటర్ల ఎత్తులో ఉన్న  పర్వతం పై బస . అక్కడనుండి మరింత కిందకి దిగితే,  చోమ్రోంగ్ అనే  2350 మీ ఎత్తులో ఉండే మరో చిన్న పర్వతం చేరా .
అక్కడనుండి బాంబూ , దేవురలి చేరా ..అప్పటి వాతావరణ పరిస్థితిని చూసి దేవురలి నుండి చాలామంది వెనక్కి తిరిగారు. క్షణ క్షణం ప్రకృతి విసిరే సవాళ్ళని స్వీకరిస్తూ జాగ్రత్తతో వ్యవహరిస్తూ మచ్రాపుచ్రే బేస్ క్యాంపు చేరే సరికి ఆరు రోజులు పట్టింది.  రోజూ పర్వతాలు ఎక్కడం దిగడం మరో పర్వతం ఎక్కడం. సవాళ్ళు విసురుతూ , ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయడానికి యత్నిస్తూ ప్రకృతి ఆడే ఆటలో, ఎప్పుడు మంచు చరియలు విరిగి పడి తమలో కలిపేసుకుంటాయో తెలియని ప్రాంతంలో ముందుకు సాగడం అంటే అదో పెను సవాల్. అది దాటి మాచ్రా పూచ్రే చేరడం గొప్ప సాహసమే.  అక్టోబర్ నవంబరు మాసాల్లో అయితే మంచు చరియలు విరిగిపడే ప్రమాదం తక్కువట. కానీ నేను వెళ్ళింది మార్చిలో. 
దేవురాలి – మాచ్రాపుచ్రే మధ్య ప్రాంతమే మంచు చరియలు (avalanches ) విరిగిపడే అపాయకర ప్రాంతం. అవి ఎప్పుడో ఒకసారి విరిగి పడడం కాదు.  సర్వ సాధారణంగా ఎప్పుడూ మంచు పెళ్ళలు  విరిగి పడుతూనే ఉంటాయి.  అవి ఎప్పుడు పడతాయన్న ముందస్తు సూచనలు ఏమీ ఉండవు. అకస్మాత్తుగా పడతాయి. వాటి కింద మనని దాచేసుకుంటాయి. ఉదయం 9 గంటల లోపయితే  మంచు చరియలు విరిగి పడే ప్రమాదం చాలా తక్కువ . ఎండ ఏ మాత్రం వచ్చినా, ఎండ పెరిగినా ముందు రోజు కురిసిన మంచు కొంత కరిగిపోతూ .. మళ్లీ దానిపై మంచు కురిసి పేరుకు పోతూ , గడ్డ కట్టిపోతూ .. పెద్ద పెద్ద పలకలుగా జారి పడిపోతూ ఉంటుంది ఆ ప్రాంతంలో.  avalanche prone area దాటగానే మృత్యువును జయించినంత ఆనందం.  మాచేపుచ్రే బేస్ క్యాంపు చేరేప్పటికి విపరీతమైన వర్షం .  దేవ్రాలి నుండి మాచ్రాపుచ్రే బయలు దేరేతాప్పుడే ముందుకు వెళదామంటే నా షేర్పా, గైడ్ అయిన అశోక్ అసలు ఒప్పుకోలేదు .  అనుక్షణం మారిపోయే ప్రతికూల  వాతావరణ పరిస్తితుల్లో ముందుకు సాగడం అసలు మంచిది కాదని అతని హెచ్చరిక . ఓ అరగంట తర్వాత వర్షం తగ్గింది . మేఘాలు కాస్త దూరంగా జరిగాయి .ఎదుట ఉన్నవి కనిపిస్తున్నాయి. 
Warning sign by ACAP - Avalanche risk area

Warning sign by ACAP – Avalanche risk area

వెలుతురు రేఖలు విచ్చుకుని సన్నని ఎండ మంచు శిఖరాలపై పడి స్వచ్చమైన వెండి పోతపోసినట్లుగా మెరిసిపోన్నాయి పర్వతాలు. ఇప్పుడు పర్వాలేదుగా అని ముందుకు కదిలా .. కానీ షేర్పా రానని మొండికేశాడు .  అంతకు ముందు రోజు కురిసిన హిమ వర్షంలో ఇద్దరు చైనీయులు సమాది అయ్యారని కొద్ది క్షణాల క్రితమే ముందు రోజు అక్కడికి చేరిన షేర్పా చెప్పిన విషయం చెప్పాడు.  అందుకే తాము ముందుకు వెళ్ళే సాహసం చెయ్యడం లేదని చెప్పాడు అక్కడే ఉన్న మరో షేర్పా .  షెర్పాలకు తెలుసు అక్కడి వాతావరణ పరిస్థితి. పర్వతారోహకుల సామాన్లు మోస్తూ వారిచ్చే సొమ్ముతో జీవనం సాగించే వాళ్ళకి అక్కడి పరిస్థితులు కొట్టినపిండి .  అందుకే వారి మాటను కాదనలేక నేనూ ఆగిపోయా ..వర్షం పడుతోంది, వాతావరణం అనుకూలంగా లేదని చాలా మంది వెనక్కి వెళ్లి పోయారు. మరుసటి రోజు ఉదయం ఎనిమిదింటికి మాచ్రాపుచ్రే కి ప్రయాణం. దారిలో సన్నని చినుకులు ..ABC నుండి వచ్చే వాళ్ళని అడిగితే పర్వాలేదు వెళ్ళవచ్చు అన్నారు. అలా ముందుకు సాగా. అలా కొంత దూరం వెళ్లేసరికి చిన్నగా  మంచు కురవడం మొదలయింది.  అలా మంచు వర్షంలోనే ఉదయం పదిగంటల లోపే మాచ్రేపూచ్రే చేరాను.
ఎవరైనా ఉదయం పది పదకొండు గంటల లోపే అక్కడికి చేరాలి. లేకపోతే avalanches తో క్లిష్ట పరిస్తితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. వాతావరణం బాగుంటే ముందుకు సాగుతారు. లేదంటే ఆ రోజుకి ఆగిపోతారు.  నేను వెళ్ళిన రోజు  రాత్రి పదింటివరకు అలా మంచు వర్షం కురుస్తూనే ఉంది.  మధ్యాహ్నం మూడుగంటల సమయంలో రెండు సార్లు  మంచు చరియలు విరిగిపడిన శబ్దాలు .  బయటికి వెళ్ళడానికి లేకుండా ఆ రోజంతా అలా ఉండడం చాలా ఇబ్బందిగా ఉంది.   ప్రపంచపు వార్తలు మోసుకొచ్చేఇంటర్నెట్ తడపాని తర్వాత లేదు.  ఏమ్బిసి లో ఉన్న వాళ్ళలో ఒకతను 200 డబ్బులు కట్టి అతి కష్టం మీద ఆ రోజు వాతావరణ పరిస్థితి తెలుసుకోగలిగాడు. పైకి అన్నపూర్ణ బేస్ కాంప్ పై వాతావరణం పోర్ క్యాస్ట్  తెలుసుకోగలిగాడు. పైకి వెళ్ళాలంటే  హిమపాతం చాలా ఎక్కువగా ఉంది. .ఉన్న ఒకే ఒక్క టీ హౌస్ (హోటల్ ) లో చేరిన మేమంతా ఒకరికరు మాట్లాడుకుంటూ, ట్రెకింగ్ కి సంబంధించిన విషయాలు పంచుకుంటూ .. పేకాడుకుంటూ .. కొందరు హాట్ డ్రింక్స్ తాగుతూ .. దేవతలు తిరుగాడే ఆ ప్రాంతంలో నాన్ వెజ్ తినరట . వాతావరణం అననుకూలంగా ఉన్న సమయంలో అయితే ఎక్కువమంది అక్కడికి చేరితే చాలా ఇబ్బందే.  చివరగా వచ్చినవాళ్ళకి రూమ్స్ దొరక్కపోతే ఏ చిన్న స్థలం దొరికితే అక్కడే అడ్జస్ట్ అవ్వాలి.  సాధారణంగా డైనింగ్ ప్లేసులో షెర్పాలు ఉపయోగించుకుంటారు. 
Avalanche from the previous day

Avalanche from the previous day

కానీ, ఎక్కువమంది పర్వతారోహకులు ఉంటే వాళ్ళూ ఆ ప్రదేశాన్ని పంచుకుంటారు. నేను వెళ్ళిన సమయంలో నాకు ఇబ్బంది లేకుండానే గది దొరికింది. ఆ టీ హౌస్ లలో రూమ్స్ చాలా చాలా చిన్నవిగా ఉన్నాయి. కామన్ టాయ్లెట్, బాత్రూం  ఉన్నాయి.  డైనింగ్ హాల్ లో హిటర్ ఆ శీతల వాతావరణాన్ని వెచ్చగా చేయడానికి ప్రయత్నం చేస్తూ .. అది ఒక సారి ఆన్ చేస్తే అక్కడున్న వాళ్ళంతా తలా 150 రూపాయలు కట్టాల్సిందే.  రూంలో హిటర్ ఉండదు.   తడపాని వరకూ ఉన్న టీ హౌసెస్ లో అలా డబ్బు కట్టే పని లేదు. కొందరు టీ హౌసెస్ లో ఉండకుండా టెంట్ వేసుకుంటారు. అందుకు చెల్లించే అద్దె తక్కువేమీ కాదు. అదీ దాదాపు గది అద్దెతో సమంగానే ఉంటుంది.   తాగడానికి మంచి నీటి ప్లాంటులు షెల్టర్ ఉన్న దగ్గర ఉన్నాయి.  ఆ వాటర్ నేపాలీ రూపాయల్లో బాటిల్ కి రెండొందలు. ఎక్కడంటే అక్కడ మల మూత్ర విసర్జన చేయకూడదట.

పిజ్జా , బర్గర్ , ఫ్రైడ్ రైస్ , నూడిల్స్ , పాస్తా , దాల్ , సపగెత్తి , చిప్స్ , స్నికెర్స్ (ఎనర్జీ చాక్లెట్స్ ), హాట్ డ్రింక్స్,  కూల్ డ్రింక్స్ , వాటర్ బాటిల్ , అన్ని రకాల టీ లు  , సిగరెట్ లు అన్ని దొరుకుతాయి . రేట్లు కింద నుండి పైకి వెళ్ళిన కొద్దీ పెరుగుతూ ఉంటాయి . ఎవరికీ వారు తమ ఇష్టం వచ్చినట్లు అమ్మరు . అంతా ఒకే ధరకు అమ్ముతారు .   ఒక్కో పర్వతం ఎక్కేకొద్దీ  దూరం పెరిగే కొద్దీ టీ హౌస్ ల సంఖ్య తగ్గిపోయాయి . నేను వెళ్ళేటప్పటికే అంటే ఉదయం 10 గంటల సమయం అక్కడ 20 మంది లోపు  ఉన్నారు. వాళ్ళలో కొంత మంది ముందు రోజే అక్కడికి వచ్చారట. వాతావరణం అనుకూలించక ఆగారట.  ఏం చేయాలో తోచలేదు . కాసేపు వాళ్ళతో సొల్లు కబుర్లు చెప్పుకున్నాం. కాసేపు పేకాట. అప్పటికే విసుగోచ్చింది. 
మరుసటి రోజు చేరువలోనే ఉన్న అన్నపూర్ణ బేస్ క్యాంపు సిద్దమయ్యాను. అంతలో  మంచు కురవడం ఆరంభమైంది.   పైకి వెళ్ళిన కొద్దీ మంచు ఇంకా చాలా ఎక్కువగా ఉంటుందట. కొన్ని క్షణాల్లోనే మన చుట్టూ మంచు దట్టంగా పేరుకుపోయి అడుగు ముందుకు వేయలేక ఆ మంచులోనే కూరుకుపోయి చనిపోతుంటారని అప్పటికే షేర్పా చెప్పి ఉండడంతో ఇక ముందుకు వెళ్ళే సాహసం చేయలేక పోయాను.  కిందకు వెళ్తే అది తక్కువట. ఇక అక్కడ ఉండడం అనవసరం అనిపించింది.  తోటి పర్వతారోహకులు కొందరు అనుకూల వాతావరణం కోసం ఎదురుచూస్తూ ఉంటే మిగతావాళ్ళు తిరుగు ముఖం పట్టారు. తీవ్ర పరిస్తితుల్లో హెలికాప్టర్ ద్వారా అక్కడనుండి బయట పడడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందట . దానికి చాలా ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతుంది. ప్రతికూల వాతావరణ పరిస్తితుల్లో  నాకక్కడ ఉండాలనిపించలేదు. ఏమాత్రం తేడా వచ్చినా చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని వెనక్కి తిరగమని సలహా ఇచ్చింది నా మనసు.
పది అడుగుల దూరంలో ఉన్నవి కనిపించనంత దట్టమైన మేఘాలు, వర్షం , మంచువర్షం తీవ్రమైన మార్పులతో.  ఫోటోలు కూడా తీసుకోలేకుండా .. తీసినా  ఏమీ కనిపించకుండా .. వాతావరణం కొద్దిగా అనుకూలించగానే తిరుగు ప్రయాణం మళ్లీ మామూలే .. మంచు చరియలు విరిగిపడే అత్యంత ప్రమాదకరమైన వాతావరణం ఉన్న ప్రాంతం దాటేశాను. పర్వతాలు ఎక్కుడుతూ దిగుతూ .. కిందకి వచ్చేప్పటికి  మోకాళ్ళలోంచి విపరీతమైన వణుకు .. నొప్పులు .. మార్గ మధ్యలో జీనూ లో ఉన్న వేడి నీటి గుండాల (hot springs ) లో స్నానం పోతున్న ప్రాణానికి ఊపిరి పోసినట్లు అనిపించింది. కాసేపు నా మోకాళ్ళ నొప్పులు మటుమాయం అయ్యాయి. ఆ నీటిలో ఉన్నంత సేపూ శరీరం చాలా తేలికగా .. కానీ మళ్లీ నడక మొదలయ్యాక షరా మామూలే. నొప్పి మళ్లీ మొదలయ్యింది.  పోఖారో చేరి రెండు  రోజులు రెస్ట్ తీసుకున్నాక కాని తగ్గలేదు.  దిగడానికి నాలుగు రోజులు పడుతుంది అంటారు కానీ రెండు రోజుల్లో వచ్చేయొచ్చు . నాది ఒంటరి ప్రయాణం కదా .. నాలాగే చాలా మంది కనిపించారు .  అయితే గ్రూపులుగా వచ్చిన వాళ్ళు , ఇద్దరు ముగ్గురు కలసి వచ్చిన వాళ్ళు , అక్కడ పరిచయమై ఒక గుంపుగా ముందుకు సాగే వాళ్ళు  రకరకాలుగా .. నడవలేని కొంతమంది గుర్రాలపై సీనువా అనే ప్రదేశం వరకూ వచ్చి దూరంనుంచి కనిపించే రమణీయ దృశ్యాల్ని కళ్ళలో నింపుకునే వాళ్ళు, . పూన్ హిల్ వరకు వచ్చి వెనక్కి మళ్లే వాళ్ళు .. ఎవరికి ఎలా అనువుగా ఉంటే అలా .. అంతా ప్రకృతి ఒడిలో ఓలలాడుతూ ..

 దారిలో ఓ బ్రిటిష్ మహిళ తో పరిచయం యింది . ఆవిడ వయసు డెబ్బై కి దగ్గరలో ఉందట.  నాలాంటి యువకులతో సమంగా ముందుకు సాగుతోంటే  ఆశ్చర్యం.  ఆ మాటే తోటి పర్వతారోహకుడితో అంటే అతనికి ఎనభై పైనే ఉన్న జర్మన్ మహిళ తారసపడిందని ఆమెకది 32 వ సారి రావడం అని చెప్పాడు. ..  మా అమ్మమ్మ వయసు అంతకంటే కూడా చాలా పెద్దవాళ్ళయిన వీళ్ళు ఎంతో  ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగడం నాకెంతో స్పూర్తినిచ్చింది. ఆవిడ స్టేమినా చూస్తే చాలా ఆశ్చర్యం . చక చకా ముందుకు సాగేది.  ఒక క్రమబద్దమైన జీవితం, శరీరానికి శిక్షణ, పోషణ  ఉంటే  వయస్సు ఏమాత్రం అడ్డుకాదనిపించింది ఆ క్షణం ..    వాళ్ళు  తమ శరీరారోగ్యాన్ని చక్కగా కాపాడుకోవడమే కాకుండా  ఇలాంటి సాహసాలు చేయడం చాలా గొప్పగా అనిపించింది. అన్నపూర్ణ మౌంట్ సర్క్యూట్ కి అంటే దాదాపు 250 కిలోమీటర్లు పర్వతాలు ఎక్కుతూ దిగుతూ కొందరు.

Annapurna South from MBC

Annapurna South from MBC

ప్రపంచంలోనే అత్యద్భుత ట్రెక్కింగ్  ప్రాంతం అన్నపూర్ణ.  చేతిలో ట్రెక్కింగ్ పోల్స్ తో అడవుల్లో రకరకాల మొక్కలు, చెట్లు  రెండు కొండల్ని కలుపుతూ ఉయ్యాలల్లా ఊగుతూ ఇనుప తీగతో తయారయిన suspention bridges పై లోయ హోయల్ని, వాటిలో ప్రవహించే నదుల్ని ఆస్వాదిస్తూ సాగే ట్రెక్కింగ్.  మార్గమధ్యలో అక్కడక్కడా కనువిందు చేసే చిన్న చిన్న గ్రామాలు, వారు కొండవాలులో చేసే వ్యవసాయం, మంచు కరిగి పారే సెలయేర్లు , హోరెత్తుతూ దూకిపడే జలపాతాల గలగలలూ , పచ్చని కొండల్లో రంగులోలికే పుష్పాలూ .. సన్నగా సాగిపోయే బాటల్లో .పాకుడు రాళ్ళూ .. నిలువాటి బండలు దాటుకుంటూ గమ్యంవైపు సాగేది నడక.

ఆ అద్భుతమైన ఆహ్లాదకరమైన  వాతావరణంలో ఏటవాలుగా పైకి వెళ్ళడం, లోయలలోకి జారే నడక, కాళ్ళకింద కదిలి సర్రున జార్చడమో  లేదంటే చుట్టూ పేరుకుపోవడమో చేసే మంచు విన్యాసాలు ఏవీ అసలు అలసట తెలియనిచ్చేవి  కాదు.  అణువణువునా నిండిన ఉత్సాహం .. ఉత్తేజం.. ఉద్వేగం .. లక్ష్యం వైపు పయనింప జేస్తూ .. కానీ ఒక్కటే వెలితి .. అన్నపూర్ణ బేస్ క్యాంపుకి అతి కొద్ది దూరంలో అంటే మరో 400 మీటర్ల దూరంలో వెనక్కి మర్లడమే.. అప్పుడే నా మనసు అవిష్కరించుకుంది తదుపరి ప్రయాణపు చిత్రం.

*

కవిత్వం, కొన్ని ప్రశ్నలు మరియు ఓ మరణానుభవం……

           మామిడి హరికృష్ణ 
mamidi harikrishna
1. కవిమిత్రులెప్పుడు కలిసినా అడిగే ప్రశ్న
పుస్తకం ఎప్పుడు తెస్తున్నావ్ ?
సాహితీ పెద్దలనెప్పుడు పలకరించినా అడిగే లెక్క
ఎన్ని పుస్తకాలు తెచ్చావ్?
అభిమానులెక్కడ తారసపడినా వెల్లడించే కుతూహలం
మీ రచనలన్నీ ఎక్కడ దొరుకుతాయ్?
అక్షర ప్రేమికులెక్కడ ఎదురైనా వెదికే సమాధానం
కొత్తగా ఏం రాయబోతున్నారు ?2. గట్లలో, హద్దులలో ఇమడలేని వాణ్ని
టెరేస్ గార్డెన్ లలో, ఎస్టేట్ లలో, ఫామ్ లలో, ఫీల్డ్స్ లో
Bonsaiలా కుంచించుకుపోలేని వాణ్ని
డ్రాయింగ్ రూమ్ లోని షెల్ఫ్ లో
hard bound bookలా  ఒద్దికగా కూచోలేని వాణ్ని
Branding ముద్రలను నుదుటిపై దిద్దుకోలేని వాణ్ని
Identityల శిలువను భుజంపై మోయలేని వాణ్ని
Miniature గా మారలేని వాణ్ని
3. భూగోళ మంతటినీ నా క్షేత్రమని నమ్మి
ఖగోళాలు అన్నిటినీ నా స్తోత్రం లా జపించే వాణ్ని
Between the lines మాత్రమే కాదు
Beyond the lines చదివే వాణ్ని

నాకు ఆకాశమంత canvass
సముద్రమంత paper కావాలి
విశ్వమంత wall – అంతరిక్షమంత screen కావాలి

అమ్మ కళ్ళంత dreams
అమ్మాయి హృదయమంత space కావాలి4. నేనూ రైతునే కదా-
అక్షరాల విత్తనాలు చల్లుకుంటూ వెళ్ళడమే తెలుసు
సేద్యకారున్ని కదా-
దారి వెంట వాక్యాల మొక్కలు నాటడమే తెలుసు
భూమి బిడ్డను కదా-
పదాల చెమట చుక్కలకి అంటు కట్టడమే తెలుసు
కావ్య పొలానికి నాట్లు పెట్టడం- నీరు పట్టడమే తప్ప
పంట నూర్చడం – ఏమార్చడం తెలీని వాణ్ని కదా
భద్ర జీవితపు కుక్కకి మాలిమి కాలేను
శిలా ఫలకాల గార్డెన్ కు తోటమాలిని కాలేను
5. ఇలా అయితే
నీ పద్యం ఎలా బతుకుతుంది?
నీ అక్షరం “అక్షరం”గా ఎలా మారుతుంది ?
నీ కవిత్వం పది కాలాల పాటు ఎలా నిలుస్తుంది?
నీ సాహిత్యం తరతరాల దాకా ఎలా కొనసాగుతుంది?అయినా–
పది కాలాలు-తరాల పాటు ఎందుకు బతకాలి?
మన అంతిమ ఘడియ అనంతరం కూడా
ఇంకా జీవించాలనే అత్యాశ ఎందుకుండాలి?
మనతో పాటే మన సమస్త సృజన-సృష్టి అంతం కాకూడదా?
చచ్చినా, ఇంకా బతుకు hanger కె వేళ్ళాడుతూ ఉండాలా?
చచ్చినా చావకుండా చింకి పాతలలోనే దొర్లుతూ ఉండాలా ?
6. అందరూ  ప్రసవ వేదన అంటారు
కానీ,కవిత్వ రచన ఓ మరణానుభవం
జనించేది ఏదైనా మృత శిశువే
జన్మ నిచ్చేది ఎవరైనా విస్మృత కళేబరమే
7. కవిత్వం నన్ను ఆవహిస్తున్న క్షణాలలోనే
నన్ను ఆసన్న మరణ లక్షణాలు ఆక్రమిస్తాయి
అక్షరాన్ని రాయడం మొదలెట్టినప్పటి నుండి
నేను నా హోం లోంచి hospice కి షిఫ్ట్ అవుతాను
మరణ భీభత్సాన్ని అనుక్షణం అనుభవిస్తూ
నాలోంచి నేను విముక్తం కావాలని పెనుగులాడతాను
ప్రతీ సృజనలో నేను మరణిస్తాను
ఆఖరి అక్షరం తడి ఆరక ముందే చచ్చి పోతాను8. నేను అల్లిన భావాలు – నే రాసిన ఉద్వేగాలు
నే చెక్కిన భావనలు – నే చిత్రించిన కవితలు
అన్నీ ఎప్పటికప్పుడు
గాలిలో కలిసిపోవాలనుకుంటాను
పూలు వెదజల్లిన పరిమళం లాగా…
ఎప్పటికప్పుడు మబ్బుల్లో కరిగిపోవాలనుకుంటాను
వర్షం కురిపించిన చినుకుల్లాగా….
ఎప్పటికప్పుడు నదిలో నిమజ్జనం కావాలనుకుంటాను
ప్రవాహం చెక్కిన రాళ్ళలాగా…..
ఎప్పటికప్పుడు చెరిగిపోవాలనుకుంటాను
సముద్రపు అల కలిపేసుకున్న ఇసుకలాగా…9. frame లలో – పీథాల దిగువన ఒదగలేని వాణ్ని
ism నీ, సంకుచిత prism నీ ధ్వంసం చేద్దామనుకున్న వాణ్ని
stereotype నీ- hypocrisy ని బద్దలు చేద్దామనుకున్న వాణ్ని
చచ్చి పోయిన తర్వాత కూడా జీవించాలనీ-
గగనమెక్కి ధ్రువ తారగానో
జఘనమెక్కి Tattoo గానో,
భవనమెక్కి సువర్ణాక్షరం గానో
పాటక జన నాల్కల మీద మంత్ర పుష్పం గానో కావాలని
కోరుకోను గాక కోరుకోను10. జీవితమే కవిత్వం
జీవితాంతం కవిత్వం
అంతే కానీ, జీవితానంతరం కూడానా?
11. మన కవిత్వాన్ని
మనతో పాటే సహయానం చేయించ కూడదా …
బొందితో కైలాసం లాగా !
మనతో పాటే బొంద పెట్టకూడదా….
పిరమిడ్ – రాకాసి గుళ్ళ లాగా !
మనతో పాటే దహనం చేయకూడదా…
సతీ సహగమనంలో లాగా!

జీవితం లోనే Mendelian భావజాలం చెంప చెల్లుమనిపించి
వారసత్వ సహజాతానికే ఫుల్ స్టాప్ పెట్టిన వాణ్నికదా

నేను ఇలాగే ఆలోచిస్తాను12. కవి మిత్రమా- సాహితీ స్రష్టా – అక్షర ప్రేమికా – అభిమానీ

మరణానంతర కొత్త జీవితంలో
పాత కవిత్వపు పురావాసనలేల?కొత్త కవితలో మళ్ళీ పునర్జన్మిస్తాను!
*

పసిఫిక్ మజిలీ కథలు ప్రారంభం!

 

సాధారణంగా చదువుల కోసమో, ఉద్యోగాల కోసమో ఎంతో మంది ఇండియా నుండి అమెరికా కి వస్తూంటారు. అలాగే పెళ్లి చేసుకొన్న వాళ్ళు లేదా సరదాగా విజిట్ చేయడం కోసమో కూడా ఎంతో మంది భారతీయులు అమెరికా కి వస్తూంటారు. అలా వచ్చిన వాళ్ళలో రకరకాల మనుషులు, రకరకాల మనస్తత్వాలు. అలాంటి వాళ్ళ కథలే ఈ “పసిఫిక్ మజిలీ కథలు”. చాలా వరకు సంభాషణలు ఇంగ్లీష్ భాషలో ఉన్నా, వాటిని తెలుగులోకి అనువాదం చేయడం జరిగింది.

 

ఇంకో మనిషి!

నా పేరు సహస్ర. నేను సియాటల్ కి వచ్చి మూడు నెలలు అయింది. కొత్తగా పెళ్లి అయింది. వచ్చిన పది రోజులు అంతా బాగానే ఉంది. మా వారు నన్ను బాగా చూసుకుంటున్నారు. కానీ నాకు ఏదో అసంతృప్తి. మా ఇంటి దగ్గర అంతా నిశబ్దంగా ఉంటుంది. ఒక్కోసారి ప్రశాంతంగా ఉన్నా కూడా, ఒక్కోసారి భయం వేస్తుంది. ఆదే ఇండియాలో ఎంతో సందడిగా ఉండేది. నాకు రెండు వారాల తరువాత ఇంట్లో కూర్చొని కూర్చొని పిచ్చెక్కడం మొదలయ్యింది. అసలు ఇండియాలో ఉన్నప్పుడు అమ్మ నన్ను తిడుతూ ఉండేది, ‘ఎప్పుడు చూసినా స్నేహితులతో బయట ఉంటావేంటి? ఇంట్లో ఉంది మాతో కాసేపు కబుర్లు చెప్పు’ అని. అప్పుడు అర్ధంకాలేదు, ఇప్పుడు అర్ధమయినా ఏమీ చేయలేను.

పెళ్ళయిన కొత్త కాబట్టి మా వారితో ‘నాకు ఇంట్లో ఉంటోంటే విసుగ్గా ఉంది’ అని చెప్పలేకపోయాను. అసలే నాకు సిగ్గు, మొహమాటం. కాని తాను గ్రహించాడు అనుకుంటాను. ఒక రోజూ పొద్దున తను ఆఫీసు కి వెళ్తూ “రోజూ ఆ టి‌వి ఏం చూస్తావు గాని, అలా వాకింగ్ చెయ్యి మన కమ్యూనిటి లోపల” అనొక సలహా ఇచ్చాడు. కొత్త ప్రదేశం నాకు భయం అని చెప్పాలనుకున్నాను. తిడతాడేమో అని “సరే” అనేశాను. ఇంకేముంది వాకింగ్ షూస్ వేసుకొని ఆ రోజున సాయంత్రం సుమారు నాలుగింటికి వాకింగ్ కి వెళ్ళాను. ఒక పది అడుగులు వేశాను, ఒక అమెరికన్ అంకుల్ ఎదురయ్యాడు. నన్ను ఎవరు అనుకున్నాడో ఏమో మరి చూసి నవ్వాడు. నేను తిరిగి నవ్వలేదు.  మరి నాకు ఆయన తెలియదు కదా? ఇంకాస్త ముందుకి నడిచాక ఇంకొక అమెరికన్, ఈ సారి ఒక ఆంటీ. నన్ను చూసి నవ్వింది, నేను నవ్వాలా లేదా అనుకుంటూ నవ్వాను. “హవ్ ఆర్ యు” అని అడిగేసి నేను జవాబు ఇచ్చేలోపలే వెళ్లిపోయింది. ఓహో అమెరికా లో ఇలా పలకరించడం అనేది మామూలే కాబోలు అనుకున్నాను.

ఎంతో అందమయిన చెట్లు చుట్టూరా ఉన్నాయి. మంచి గాలి వీస్తోంది. వాకింగ్ బాగా ఎంజాయ్ చేస్తున్నాను. కాసేపయ్యాక ఇంక చాలు అని, తిరిగి ఇంటికి వాకింగ్ చేస్తుండగా ఒక చిన్న పిల్ల ఎదురయింది. చాలా ముద్దుగా ఉంది. చూసి నవ్వాను, పాప నవ్వలేదు. కానీ పాప పక్కనే ఉన్న తన అమ్మ నన్ను చూసి నవ్వింది. నేను హెలో అన్నాను. తిరిగి ‘హలో, హావ్ ఎ నైస్ డే’ అని అంది. “టు యు టూ” అనేసి నా వాకింగ్ కంటిన్యూ చేస్తుండగా ఒక ముసలావిడ తన కార్ దగ్గర ఏదో పని చేస్తోంది. కొంచం దగ్గరకెళ్లి చూస్తే, ఆవిడ వాకింగ్ స్టిక్ సహాయంతో కుంటుతూ నడవటం గమనించాను. నేను పలకరించగా, తిరిగి హాయ్ చెప్పింది. ఏదైనా సహాయం కావాలా అని అడిగాను. ముందర మొహమాటపడి ‘అక్కర్లేదు’ అని చెప్పింది. సరేలే నాకెందుకు అని నేను వెళ్లిపోదాము అనుకున్నాను.

కానీ ఒక్క క్షణం మళ్ళీఆలోచించాను. ఇదే పరిస్థితి లో నా అమ్మమ్మో, నాయనమ్మో ఉండి ఉంటే నేను ఏం చేసుండేదానిని? ఇలా అనుకోని ఆవిడని మళ్ళీ హెల్ప్ కావాలంటే చెప్పండి అని అన్నాను.  ఆవిడ కాస్త మొహమాట పడుతూనే ‘ఈ కార్ బ్యాటరీ చార్జ్ చేయాలి’ అని అంది. ఓసంతెనా అనుకోని నేను చేస్తాను, నాకు ఇవ్వండి అని పవర్ సోక్కెట్ చూపించమన్నాను. ఆవిడ చూపించి, బ్యాటరీ లో ఏది పాజిటివ్. ఏది నెగెటివ్ అని చెప్పబోతుంటే నేను ఆవిడని ఆపి, నేను ఎంజినియర్ ని , నాకు తెలుసు అన్నాను. అలా నేను బ్యాటరీ కనెక్ట్ చేస్తుంటే నేను ఇంజనీరింగ్ ఎక్కడ చేశానో అడిగితే, ఇండియా అని చెప్పాను. ఓహో ఇండియా నా, నేను రోజూ యోగా చేస్తాను అని చెప్పింది. ఆవిడకి సుమారు అరవై అయిదేళ్లు ఉంటాయి. ఆవిడ యోగా అనగానే ముచ్చట వేసింది.

పని అయిపోయింది, చాలా థాంక్స్ అని ఆవిడ చెప్పగానే నాకొక సందేహం కలిగింది. కార్ నుండి ఇంటి దాకా ఆ వైర్ పాకుతోంది, ఎవరైనా తట్టుకొని పడే అవకాశం ఉంది. అందుకే ఒక టేప్ ఇమ్మన్నాను. ఆవిడ టేప్ తెచ్చి ఇవ్వగా, ఆ పని కూడా ముగించేశాను. ఆవిడకి సహాయం చేసినందుకు, వేరే వాళ్ళ జాగ్రత్త గురించి ఆలోచించినందుకు చాలా ఆనందపడింది.  నేను కూడా చాలా సంతోషంగా నా వాకింగ్ పూర్తిచేసుకొని ఇంటికి తిరిగొచ్చేశాను. ఒక మంచి పని చేశాను, ఒక తోటి మనిషికి సహాయాపడ్డాను అన్న భావం నాకు ఎంతో తృప్తి ని ఇచ్చింది.

మరుసటి రోజున మళ్ళీ వాకింగ్ కి వెళ్ళాను. ఈ సారి ఆ ముసలావిడ మళ్ళీ కనిపించింది. నేను ఆగి ఎలా ఉన్నారు అని అడిగాను. నేను ఆప్యాయంగా అడిగిన ఆ ఒక్క మాటకే ఆవిడ సంతోషించి, సూప్ ఇస్తాను ఇంట్లోకి రమ్మంది. నా వాకింగ్ అయ్యాక వస్తాను అని చెప్పాను. అన్నట్టుగానే వాకింగ్ అయ్యాక వాళ్ళింటికి వెళ్ళాను. ఇల్లు పెద్దగా ఉంది. కానీ ఇంక ఎవరూ ఉన్నట్టులేరు ఇంట్లో.

ఆవిడ నాకు సూప్ తెచ్చి ఇచ్చింది. నేను సూప్ తాగుతుండగా, తాను ఒకత్తే ఈ ఇంట్లో ఉంటోంది అని, ఒక కొడుకు ఉన్నాడు కానీ ఎప్పుడూ తనని చూడటానికి ఒక్కసారైనా రాడనీ వాపోతోంది. నాలో ఏం కనిపించిందో మరి మనసువిప్పి మాట్లాడింది. మానవ బాంధవ్యాలు అంటే ఇదేనేమో! నేను మాత్రం పెద్దగా ఏమి మాట్లాడలేదు. ఆవిడ మాటలు వింటూ సూప్ లాగించేశాను. ఆ రోజుకి సెలవు తీస్కున్నాను ఇంక.

ఇప్పటికీ నేను వాకింగ్ కి వెళ్లినప్పుడు ఒక వేళ ఆవిడ కనిపిస్తే పలకరిస్తుంటాను. మళ్ళీ సూప్ కి పిలుస్తుందేమో అని!

*

Prajna-1

   గ్రీన్ గేబుల్స్ ఇంట్లో ఆన్ -12

 

                                  గ్రీన్ గేబుల్స్ ఇంట్లో ఆన్ -12 [ Anne Of Green Gables by L.M.Montgomery ]

ఆన్ పెట్టుకు వెళ్ళిన పూల దండల టోపీ గురించి  శుక్రవారం వరకూ మెరిల్లాకి తెలీలేదు. ఆ రోజు మిసెస్ రాచెల్ ఇంటినుంచి వస్తూనే ఆన్ ని పిలిచి సంజాయిషీ అడిగింది.

    ” మిసెస్ రాచెల్ చెప్పింది – గుట్టలు గుట్టల పూలు   నీ టోపీకి చుట్టుకుని పోయావటగా , ఏం పుట్టింది నీకు ? వెర్రిమొహం  లా ఉండిఉంటావు కదా , నా ఖర్మ ! ”

  ” అనుకుంటూనే ఉన్నాను , పసుపు రంగూ గులాబి రంగూ నాకు నప్పవని …” ఆన్ మొదలెట్టింది.

 ” నప్పటమా నీ తలకాయా ” మెరిల్లా గర్జించింది – ” అసలు పూలెందుకు టోపీకి ? అలా చుట్టుకోవాలని ఎందుకనిపించింది నీకు ? ఒక్కోసారి నిజంగా పిచ్చెక్కిస్తావు కదా ”

  ” గౌన్ లకైతే పెట్టుకోవచ్చా మరి ?  ? అక్కడ బోలెడంతమంది  గౌన్ లకి పూల గుత్తులు పిన్ లతో గుచ్చుకుని వచ్చారు తెలుసా ? టోపీకి పెట్టుకుంటే తప్పేమిటి  ”  – ఆన్ వాదించింది.

మెరిల్లా అంత తేలిగ్గా ఏమారే మనిషి కాదు .

” అలా ఎదురు సమాధానాలు చెప్పకు నువ్వు..చేసింది చాలక..! మళ్ళీ ఇలాంటి వెధవపని చేశావంటే చంపేస్తాను . నీ పిచ్చి వాలకం చూసి మిసెస్ రాచెల్ కి సిగ్గుతో చచ్చిపోవాలనిపించిందట… దగ్గరికి వచ్చి చెప్పాలంటే ఎక్కడో దూరంగా ఉన్నావట నువ్వు. ఆ లోపు అంతా చూడనే చూశారు , చెవులూ కొరుక్కున్నారు. నిన్ను అలా తయారు చేసి పంపేందుకు  నా బుద్ధేమైందా అనుకుని ఉంటారు…’’

” అయ్యో , మెరిల్లా ! ” – ఆన్ బిక్కచచ్చిపోయింది  – కళ్ళనీళ్ళు కారిపోతున్నాయి .” నీకు అంత బాధ కలుగుతుందని అనుకోలేదు  నేను….ఆ పూలు చూట్టానికి ఎంతో చక్కగా ఉన్నాయి , టోపీకి పెట్టుకుంటే  బావుంటుందనిపించీ…చాలామంది కాయితం పూలు పెట్టుకుంటుంటారు కదా అని ..! నిన్ను ఇలాగే వేధిస్తుంటానేమో , నన్ను వెనక్కి పంపించెయ్యి పోనీ … నాకు చాలా చాలా కష్టంగానే ఉంటుంది ..ఇంత సన్నగా ఉంటాను కదా , క్షయ జబ్బు పట్టుకుంటుందేమో నాకు …అయినా సరే, వెళ్ళిపోతాలే, నిన్ను యాతన పెట్టేకంటే ”

” చాల్లే, నోరు ముయ్యి ” పిల్లని ఏడిపించినందుకు తనని తను తిట్టుకుంది మెరిల్లా. ” నిన్ను వెనక్కి పంపించేది  లేదు , ఎప్పటికీ. పిచ్చి వేషాలు వెయ్యకుండా అందరు పిల్లల్లాగా ఉండు, చాలు.  ఏడవకు ఇంక. చెప్పటం మర్చిపోయాను – డయానా బారీ ఊర్నించి వచ్చేసింది తెలుసా ! వాళ్ళమ్మ తో నాకు కొంచెం పని ఉంది, వాళ్ళింటికి వెళుతున్నాను- నువ్వూ వస్తావా ? డయానా ని చూడచ్చు కదా  ”

ఆన్ దిగ్గున లేచి నిలుచుంది. నీళ్ళు నిండి ఉన్న కళ్ళు తళ తళా మెరుస్తున్నాయి.

” నాకు భయంగా ఉంది మెరిల్లా ! తను ఎప్పుడొస్తుందా అని ఇప్పటిదాకా ఎదురుచూశాను, ఇప్పుడు  తనకి నేను నచ్చకపోతేనో ? గొప్ప విషాదపూరిత ఆశాభంగం నాకు ..”

” ఊరికే కిందా మీదా అయిపోకు. అంత పెద్ద మాటలు వాడద్దన్నానా , భూమికి జానెడున్నావో  లేదో  !  డయానా కి నువ్వు బాగానే నచ్చుతావులే, వాళ్ళమ్మ తోనే జాగ్రత్తగా ఉండాలి . ఆవిడకి నచ్చకపోతే డయానా కి ఎంత నచ్చినా లాభం లేదు. నీ పూలటోపీ వ్యవహారం ఈపాటికే తెలిసిపోయి ఉంటే ఆవిడ ఏమనుకుంటోందో అనుమానమే. మర్యాదగా పద్ధతి గా ఉండు అక్కడ , నీ విపరీతపు  ఉపన్యాసాల్లాంటివి ఇవ్వకు , తేడాలొస్తాయి .. . అరే, పిల్ల వణికిపోతోందే …” కంగారు పడింది మెరిల్లా.

ఆన్ నిజంగానే వణికిపోతేంది. మొహం ఉద్రేకం తో పాలిపోయింది…ఆ సంగతి ఆమెకీ తెలుసల్లే ఉంది –

” నీకు ప్రాణ స్నేహితురాలు అవబోయే వాళ్ళని నువ్వు కలుసుకోబోతూ ఉంటే, వాళ్ళమ్మకి నువ్వు నచ్చవేమోననే భయం ఉంటే – నువ్వైనా నాలాగే అవుతావు మెరిల్లా ” – టోపీ తీసుకుని బయల్దేరింది .

‘ తోట వాలు ‘ [ బారీ ల ఇంటి పేరు అది ] కి వాగు పక్కని అడ్డదారిలోంచి, ఫర్ పొదల గుట్ట ఎక్కి   వెళ్ళారు ఇద్దరూ. వెనకవైపు న వంటింటి తలుపు తట్టారు. మిసెస్ బారీ వచ్చింది- ఆవిడ పొడుగ్గా ఉంది ,  నల్లటి కళ్ళూ నల్లటి జుట్టు , పట్టుదలని సూచించే పెదవులు. పిల్లలని మంచి క్రమశిక్షణ లో ఉంచుతుందని పేరు.

” బాగున్నావా మెరిల్లా ” – పద్ధతిగా పలకరించింది . ..” లోపలికి రా. నువ్వు పెంచుకుంటున్న అమ్మాయి ఈమేనా ? ”

” అవును. పేరు ఆన్ షిర్లే ” మెరిల్లా చెప్పింది.

Mythili

” అవునండి. స్పెల్లింగ్ లో ‘ ఇ ‘ ఉండాలి ” – ఆన్ అంది. అంత ఉద్విగ్నపు స్థితిలో కూడా ఆ ‘ ముఖ్య విషయాన్ని ‘ విస్మరించకూడదని ఆన్ అభిప్రాయం.

మిసెస్ బారీ ఆ మాటలేమీ పట్టించుకున్నట్లు లేదు , ఆన్ కి షేక్ హాండ్ ఇచ్చి ” ఎలా ఉన్నావు ? ” అని కొంచెం దయ గానే అడిగింది.

” ఆత్మ లో నలిగిపోతూ ఉన్నా, శారీరకం గా బాగానే ఉన్నానండీ, ధన్యవాదాలు ” ఆన్ గంభీరంగా జవాబిచ్చింది. తర్వాత మెరిల్లా చెవిలో రహస్యంగా –  ” పర్లేదు కదా మెరిల్లా, విపరీతంగా ఏమీ లేదు గా ”

మెరిల్లా అదృష్టం కొద్దీ ,  మిసెస్ బారీ – ఆ  మాటలూ  శ్రద్ధగా వినలేదు  …ఎందుకంటే ఆ క్షణం లోనేఎవరో తలుపు తడితే వెళ్ళింది… ఈ లోపు    డయానా  బారీ వచ్చింది అక్కడికి…. సోఫా మీద కూర్చుని పుస్తకం చదువుకుంటోంది, వీళ్ళని చూసి దాన్ని వదిలేసి లేచింది. నిజంగా అందమైన పిల్ల. తల్లి జుట్టూ కళ్ళూ గులాబి రంగు బుగ్గలూ వచ్చాయి. మొహం ప్రసన్నంగా, ఉల్లాసంగా ఉంది- అది మటుకు తండ్రి పోలిక.

” ఇది మా పాప డయానా . డయానా, ఆన్ ని తీసుకెళ్ళి తోటలో నీ పూల మొక్కలు చూపించమ్మా. నీ కళ్ళకీ కాస్త పచ్చదనం మంచిదే, ఇందాకట్నుంచీ చదువుతూనే ఉన్నావు . అస్తమానమూ చదువుతునే ఉంటుందీ పిల్ల- చూపు దెబ్బ తినదూ ? ” ఈ మాటలు మెరిల్లా తో అంది మిసెస్ బారీ. ” నేనేమీ చెయ్యలేని ఆ విషయం లో , వాళ్ళ నాన్న వత్తాసు దీనికి. పోన్లే, ఆరుబయట ఆడుకుందుకు ఒక తోడు దొరికితే నయమే ”

అప్పటికి పొద్దు కుంకుతూ ఉంది.  తోట కి పడమటి వైపున నల్లగా కనిపించే  ఫర్ చెట్లు. వాటిలోంచి ప్రవహిస్తూన్న నారింజ రంగు వెలుతురు లో ఆన్, డయానా – ఒకరి మొహాలొకరు మొహమాటంగా చూసుకుంటూ నిలుచున్నారు.

బారీ   ల ఇంటి తోట ఒక పువ్వుల అరణ్యం లాగా ఉంటుందిడయానా తో స్నేహం గురించి ఆదుర్దాగా ఉందిగానీ , . ఇంకెప్పుడైనా అయితే ఆన్ మనసు అది చూసి పొంగిపోయి ఉండేది. తోట చుట్టూరా పెద్ద పెద్ద ఫర్ చెట్లు , విల్లో చెట్లు – బాగా పురాతనమైనవి అవి. వాటి కిందని నీడ లో పెరిగేకొత్త రకం పూల మొక్కలు. చక్కగా తీర్చి దిద్దిన కాలిబాటలకి అటూ ఇటూ విసనకర్రల్లాంటి గవ్వలు అమర్చారు. ఆ కాలి బాటల మధ్యని సాంప్రదాయికమైన  పూల మళ్ళు మహా వైభవంగా ఉన్నాయి. కెంపు వన్నె లో  ధగధగమంటున్న పియొనీ లు, తెల్లగా ఘుమఘుమలాడుతున్న నార్సిసస్ లు, ముళ్ళలోంచి పరిమళిస్తున్న స్కాచ్ గులాబీలు , నీలి రంగు కొలంబైన్ లు , ఊదా రంగు బౌన్సింగ్ బెట్ లు ….గుంపు లు గుంపు లు గా సదరన్ వుడ్, రిబ్బన్ గడ్డి , పొదీనా …ధూమ్రవర్ణం లో ఆడమ్ అండ్ ఈవ్ పూలు , డాఫోడిల్ లు. గుబురు గుబురు గా క్లోవర్ గడ్డి – దాని పల్చటి   పూలు , వాటి సున్నితమైన సువాసన. సంధ్య కాంతిలో  ఎర్రబడుతూన్న శ్వేత వర్ణపు కస్తూరిపూలు . ఆ తోటలో వెలుగులు ఆగుతున్నాయి …మృదువుగా  కదిలే  గాలులతో   తేనెటీగలు జుమ్మని మాట్లాడుతున్నాయి.

” డయానా ” – ఆన్ పిలిచింది చివరికి ,  మెల్లిగా. ” నేను నీకు నచ్చానా , కొంచెం ? నిన్ను చూడాలని ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నాను ”

డయానా నవ్వింది…ఆ పిల్ల మాటకి ముందు నవ్వుతుంటుంది.

” నచ్చావనే అనిపిస్తోంది. నువ్వు గ్రీన్ గేబుల్స్ కి రావటం చాలా సంతోషంగా ఉంది నాకు. ఆడుకుందుకు ఎవరూ అంత దగ్గర్లో లేరు…నా చెల్లెళ్ళేమో చిన్న వాళ్ళు ”

” ఎప్పటికీ..ఎప్పటికీ నాతో స్నేహం గా ఉంటానని ఒట్టేస్తావా ? ” ఆన్ ఆత్రంగా అడిగేసింది.

డయానా కంగారుపడిపోయింది.

తేరుకుని ,  ” అలా ఒట్లూ అవీ వెయ్యకూడదు , తప్పు ” కొంచెం నిరసనగా అంది.

” లేదు లేదు. నేను చెప్పే  ఒట్టు మంచిదే. ఒట్లు రెండు రకాలు కదా .. ”

” నాకొక్క రకమే తెలుసే మరి ” – డయానా సందేహించింది.

” ఇంకో రకం ఉంది..నిజ్జంగా. అది అస్సలు చెడ్డది కాదు , మాట ఇవ్వటం లాంటిది , అంతే ”

” అయితే సరే. ఎలా వె య్యాలి ? ”

” ఇదిగో, ఇలా  – కదిలే నీళ్ళ మీద చేతులు కలపాలి. ఈ కాలిబాటని నీళ్ళుగా ఊహించుకోవచ్చులే. ముందు నేను చెప్తానూ , తర్వాత నువ్వు అలాగే నా పేరుతో చెప్పాలి …సూర్యచంద్రులున్నంత వరకూ , ఆన్ షిర్లే అనే నేను – నా ప్రాణ స్నేహితురాలైన డయానా పట్ల – విశ్వాసం తో వ్యవహరిస్తానని వాగ్దానం చేస్తున్నాను !!!!! ఊ.. ఇప్పుడు నువ్వు – ”

తెరలు తెరలుగా వస్తున్న నవ్వుని ఆపుకుంటూ డయానా ఆ మాటలు ఆన్ పేరిట వల్లించింది .

” నువ్వు వింత పిల్లవి ఆన్ …ఎవరో అంటే విని ఏమో అనుకున్నాను గానీ… అయినా పర్వాలేదులే, నువ్వంటే నాకు     ఇష్టమే ”

కొంతసేపటికి మెరిల్లా, ఆన్ గ్రీన్ గేబుల్స్ కి తిరిగి వెళ్ళేప్పుడు డయానా వాళ్ళతో బాటు కర్రవంతెన వరకూ వెళ్ళింది. స్నేహితురాళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు చేతులు వేసుకుని  నడిచారు. వాగు దగ్గర విడిపోతూ మర్నాటి మధ్యాహ్నం తప్పకుండా కలుసుకోవాలని వాగ్దానాలు చేసుకున్నారు.

తర్వాత మెరిల్లా అడిగింది – ” ఊ.అయితే డయానా నీకు సంబంధీకురాలేనా ? [kindred spirit ]  ”

మెరిల్లా వెటకారం ఆన్ కి అర్థం కాలేదు  ” ఓ , నిజంగా ” – ఆనందంగా  నిట్టూర్చింది.

anne12-2

” ఈ ప్రిన్స్ ఎడ్వర్డ్ దీవి మొత్తం లో నా అంత ఆనందంగా ఎవ్వరూ ఉండరు ఇప్పుడు. ఈ రాత్రి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తాను. విలియం బెల్  వాళ్ళ బర్చ్ తోపు లేదూ , అక్కడ రేపు మేమిద్దరం బొమ్మరిల్లు కడుతున్నాం. మన కొట్టం లో పగిలిపోయిన పింగాణీ సామాను ఉంది కదా , అది తీసుకుపోవచ్చా నేను ? డయానా పుట్టినరోజు ఫిబ్రవరి లో, నాదేమో మార్చ్ లో- భలే సరిపోయాయి కదూ ?  తను నాకో పుస్తకం ఇస్తానంది…చా..లా ఆసక్తి..గా ఉంటుందట అది. ఇంకానేమో, అడవి లో రైస్ లిల్లీ లు ఎక్కడుంటాయో చూపిస్తానంది. డయానా కళ్ళు ‘ భావపూ..ర్ణంగా ‘ ఉంటాయి కదూ ? నాకూ భావపూర్ణమైన కళ్ళుంటే బావుండేది.  ‘ హేజెల్ కనుమ లో నెల్ ‘ అనే పాట నేర్పిస్తానంది నాకు. నా గదిలో తగిలించుకుందుకు మంచి కాలండర్  ఇస్తానంది.  దాన్లోనేమో,  లేత నీలం రంగు పట్టు గౌనువేసుకుని  చాలా అందమైన అమ్మాయి ఉందట ,   కుట్టు మిషన్ లు అమ్మే షాప్ వాళ్ళు డయానాకి  ఇచ్చారట దాన్ని.  తనకి ఇవ్వటానికి నా దగ్గర కూడా ఏమైనా ఉంటే బావుండేది…నేను డయానా కన్నా ఒక అంగుళం పొడుగున్నాను ..కాని తను నా కంటే బొద్దుగా ఉంది. తనూ సన్నగా ఉంటే బావుండేదని అంది , సన్నగా ఉంటే నాజూగ్గా ఉంటారట ..ఊరికే నా తృప్తి కోసం అని ఉంటుంది అలా. ఎప్పుడో ఒక రోజు సముద్రం ఒడ్డుకి వెళ్ళి గవ్వలు ఏరుకుంటాం మేము…

ఆ కర్రవంతెన కింది వాగు కి ‘ జలకన్య సెలయేరు ‘ అని పేరు పెట్టాము , బావుంది కదూ ? ఒకసారెప్పుడో ఆ పేరుతో ఒక కథ చదివాను . జలకన్య అంటే గంధర్వ కన్య లాంటిదే..కొంచెం పెద్దది అన్నమాట….”

” డయానాని మరీ  ఎక్కువ విసిగించలేదు కదా  ? ఇంట్లో పని, చదువు అయాకే ఏ ఆటలైనా , మీ ‘ ప్రణాళిక ‘ లో ఇది గుర్తు పెట్టుకోవాలి ” మెరిల్లా అంది.

ఆన్ సంతోషపు పాత్ర అప్పటికే పూర్తిగా నిండి ఉంటే , మాథ్యూ దాన్ని పొంగి పొర్లేట్లు చేశాడు ఆ రోజు. పట్నం నుంచి అప్పుడే తిరిగి వచ్చి ఉన్నాడు వీళ్ళు వెళ్ళేప్పటికి. జేబులోంచి చిన్న పొట్లం తీసి ఆన్ కి ఇస్తూ మెరిల్లా వైపు ఏం అనద్దన్నట్లు చూశాడు.

” నీకు చాకొలెట్ లు ఇష్టం అన్నారెవరో….అందుకని ….తెచ్చాను ”

”హు ” ముక్కు చిట్లించింది మెరిల్లా. ” దాని పళ్ళూ పొట్టా రెండూ పాడైపోతాయి….ఆ..ఆ..లేదులే, మొహం  వేలాడెయ్యకు – మాథ్యూ తెచ్చాడు కదా, తినచ్చు ఈసారికి- అన్నీ ఒకేసారి లాగించెయ్యకు , జబ్బు చేస్తుంది. పిప్పరమెంట్లు తే వాల్సింది మాథ్యూ , అవైతే హాని చెయ్యవు ”

” అన్నీ తినెయ్యను మెరిల్లా. ఒక్కటే తింటాను ఈ రాత్రికి. వీటిలో సగం డయానాకి ఇవ్వచ్చా నేను ?తనకి ఇచ్చేందుకు ఏదో ఒకటి ఉండటం బావుంటుంది నాకు … ఇస్తే ఇవి రెట్టింపు తియ్యగా ఉంటాయి ..”

ఆన్ తన గదికి వెళ్ళాక మాథ్యూ తో అంది మెరిల్లా – ” ఇంకేమైనా అవునో కాదోగాని, పిసినారిది మటుకు కాదు ఈ పిల్ల. పిల్లలు పిసినారిగా ఉంటే అస్సలు భరించలేను నేను. ఇది ఇక్కడికొచ్చి మూడు వారాలే కదా అయింది- ఎప్పట్నుంచో ఇక్కడే ఉన్నట్లుంది నాకు ! ఆ..అలా చూడక్కర్లేదులే, ‘ నేను చెప్పలేదా ? ‘ అన్నట్లు…ఒప్పుకుంటున్నాను, దీన్ని అట్టే పెట్టుకోవటం మంచిదైందని…కాని నువ్వు నన్ను వెక్కిరించక్కర్లేదు ”

                                                           [ ఇంకా ఉంది ]