కోలాహలం

10325745_574651602650328_7994500965816693952_n 

ప్రయాణమిది

మనసు ప్రాణాయామమిది

యోగత్వమా…

ప్రాణాలను ప్రేమతో సంగమించే

వేదనా యమున సమ్మోహమా…

ఒప్పుకోలేని విన్నపాలు కళ్ళబడలేని కలలు

అర్థమయ్యే పదాలు ఆశల సవ్వడులు

ఇన్నిటినీ ఇన్నాళ్ళూ మోసుకొచ్చిందీ కాలం

కొన్ని దూరాలు సృష్టిస్తూ అలుస్తాను

కొన్ని గుండెచప్పుళ్ళు వింటూ కలుస్తాను

ప్రశ్నలు సంధించే పొరపాట్లు

మనసు భూకంపాల నడుమ

కొత్త ఆలోచనల శిఖరాగ్రాలు మొలుస్తాయి

ఒక్కో చినుకు కూర్చుకుని

గుండె చప్పుడులో

ఆశల అరణ్యాలు పరుస్తాయి

నాలో నువ్వూ

భౄమధ్యం లో ఉత్తర దక్షిణం

కలల కాన్వాసులో పెనవేతల భూమధ్యరేఖలు

అంతమూ లేదు ఇది ఆదీ కాదూ

మనసు సత్యం

మోహ కోలాహలం

-జయశ్రీనాయుడు

jaya

(painting: Anupam Pal)

త్యజిస్తూ.. సృజిస్తూ

 jya
నిన్ను నన్ను గా చూసుకున్నాను
నాకు నేనే బందీనయ్యాను
ఒక ఖైదు వెలిసింది
వెతల వేల గదులు
నన్ను నేను త్యజించుకున్నాను
నాకైనేను సృజించుకున్నాను
గుణిస్తూ.. విభజిస్తూ..
విడదీస్తూ.. కలిపేస్తూ
గాలిపటంలా ఓ ఆశ
ఎటు పోతున్నానో తెలియని ఆకాశం
అకస్మాత్ ఆధారం లా నువ్వు
దారంగా మలుచుకోవాలని నేను
క్షణాల పయనం
నవ్వుల్లో గుండెలా నువ్వు
చప్పట్ల పసితనంలా నేను
ఊహల దారుల ఆహ్వానం
జ్ఞాపకాల నీడ ఇల్లు
పొద్దుసోకని సూరీడంటి ఆశ
చీకటి నీడలో వెలుగూ
వెలుగు వెంటే వెన్నెలా
త్యజించేతనం
సృజించుకొనే గుణం
ఎన్ని ఖైదుల్నైనా పెకలిస్తాయి
కొత్త ఆలోచనల  విత్తల్లే నువ్వు
సంతోషపు క్షణాలు మొలకలేస్తూ నేను
 త్యజిస్తూ…. సృజిస్తూ మనలోని కాలపు మడులు