ఏ ఇంటికి రమ్మంటావు?

1656118_10202631903851729_1639569211_n

ఇంటికి తిరిగి రమ్మని

పెదాల మీద అతికించుకున్న చిరునవ్వు పిలుపు

అరమూసిన కోరలపై మెరుస్తున్న నెత్తుటిబొట్టు

పిలిచే నోరు వెక్కిరించే నొసలు

దేన్ని నమ్మమంటావు?

ఒక క్షణం నెత్తుటికోరను మరచిపోతాను

నీ పిలుపే ఆత్మీయ ఆహ్వానం అనుకుంటాను

కానీ స్వామీ

ఏ ఇంటికి రమ్మంటావు?

మన ఇల్లు అనేదేదీ లేదు

నా ఒంటి నిట్టాడి గుడిసె ఎప్పుడో నేలమట్టమయింది

సర్కారు వారు నాకు దోచిపెట్టారని నువు గగ్గోలు పెట్టే

రేకుల ఇల్లు పాములకూ తేళ్లకూ నిలయమయింది

మురికి కాలువ పక్కన ప్లాస్టిక్ సంచుల మహాభవనమే నా ఇల్లు

ఆ నా పాత ఇంట్లోకి ఎట్లారాను బాబయ్యా?

నేను తొంగి చూడడానికైనా వీలులేని

నీ చతుశ్శాల భవంతి ఆకాశహర్మ్యమైంది

ఏడు కోటల పాత రాజప్రాసాదాల లాగ

దాటలేని ప్రాకారాల మధ్య నీ స్వగృహం

అడుగడుగునా విద్యుత్ తంత్రుల త్రిశూలాల సర్పవలయం

త్రిశూలాల కొసన కడుపు చీల్చిన రక్తపు చుక్కలు

నీ సరికొత్త ఇంట్లోకి ఎట్లా రాను తండ్రీ?

మనదనుకునే ఇల్లు ఎట్లాగూ లేదు

‘అసుంట’ ‘అసుంట’ అని నన్ను విదిలించి ఛీత్కరించి విసిరికొట్టి

నా కాలి ధూళిని మైల అని కడిగి కడిగి పారేసి

దర్వాజా అవతల నా దైన్యాన్ని వేలాడదీసిన

నీ ఊరి ఇంటికి రమ్మంటావా?

ఊరి చివర నీ పాదాల చిటికెనవేలు కూడ తగలని

నా వాడ ఇంటికి రమ్మంటావా?

నా గాలి సోకడానికి వీలులేని ఇంటికేనా ప్రభూ రమ్మనేది?

 

నన్ను ఖండఖండాలుగా నరికి గోనెసంచుల్లో కుక్కి

విసిరిపారేసిన కాలువ పక్కన నీ రాజప్రాసాదం లోకేనా?

నా అక్కచెల్లెళ్లనూ అన్నదమ్ములనూ బలగాన్నంతా

తోసి నిప్పుపెట్టి బైటికి పారిపోతున్న వాళ్లని

పట్టుకుని మంటల్లోకి విసిరేసిన గుడిసెలోకేనా?

 

నా చెమటలో తడిసిన

నా నెత్తుటిలో పండిన

ఈ దేశమంతా నా ఇల్లే

మరి ఏ ఇంటికి రమ్మంటావు?

అసలు నువ్వెవడివని రమ్మంటావు?

తరిమి తరిమి కొట్టిన

అట్టడుగుకు తోసేసిన

ఈ దేశంలో ఒక్క అంగుళమూ నాది కాదు

మరి ఏ ఇంటికి రమ్మంటావు?

                                               -వి.తమస్విని