గడియారంలో ముళ్ళు లా
దగ్గరయ్యీ..దూరమయ్యేతనం
దిగులు లాంటి గాయం చేస్తుంది..!అయితేనేం..కిటికీ ఊచలపై గువ్వపిట్ట
తడిసినరెక్కల సయ్యాట చూసినప్పుడో..
చెమరింతల చినుకుల తడికి
గరిక సవ్వడుల పదనిసలు విన్నపుడో..
నక్షత్రాల మీంచి నడిచొచ్చిన గాలిలో
నిండిన గమకాలు చుట్టేసినపుడో..
చిగుర్ల నించి వేర్లు వరకూ నింపుకున్న
ఆకుపచ్చని ఆశల వాసన కమ్మేసినపుడో..
నీ ఇరు కనుపాపలూ ఆర్తిగా
నన్ను మాత్రమే కాంచే వేళలో
గుప్పెడు సీతాకోకలు గుండెల్లో వాలినప్పుడో..
అప్పుడు..
అస్సలాశ్ఛర్యంగా..
బతికిన క్షణాలు కాసిని పోగేసుకుని..
కాలం చేసే విన్యాసాలు తట్టుకుని
నిలబడాలనిపిస్తుంది..
దూరమయ్యీ..దగ్గరయ్యేతనం కోసం..!
తాజా కామెంట్లు