అక్షరాల్లో బతికిన మాట!

Velturu2

1

1980ల  చివరి రోజులు-

వొక శనివారం  సాయంత్రం పురాణం గారింటి మేడ మీద “సాక్షి క్లబ్” సమావేశం ముగిసింది. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్న సమయంలో  నండూరి గారు నన్ను ఆపారు. “నువ్వు కృష్ణశాస్త్రి కవిత్వం ఎంత చదివావ్?” అని అడిగారు. నిజానికి నేను అప్పటికి కొంత మాత్రమే చదివాను, నా  ప్రాణమంతా  ఇంగ్లీషు కవిత్వంలో  వుంది కాబట్టి! “కొంత కూడా చదవలేదు!” అన్నాను సిగ్గేమీ  పడకుండా! (సిగ్గేలా తెలుగు కవికి?!) “ఇవాళ్టి నించి రెండు నెలలు నీకు కృ.శా. క్రాష్  కోర్సు!” అని అప్పటికప్పుడు ఆయన వాళ్ళింటికి తీసుకువెళ్ళి, కృష్ణశాస్త్రి గారి పుస్తకాలు అరువిచ్చారు. అప్పుడు తన  దగ్గిర వున్న గొప్ప  నిధిని కూడా నాకు చూపించారు. అవి కృష్ణశాస్త్రి గారు మాట పడిపోయాక చేసిన లిఖిత సంభాషణల చీటీలు! మాట పడిపోయినా ఆయన మాట్లాడడం మానుకోలేదు. చిన్ని చిన్ని కాయితాల మీద రాతపూర్వక సంభాషణలు చేసే వారు. నండూరి ఆ చీటీలన్నీ ఎంతో శ్రద్ధగా దాచి పెట్టుకున్నారు. “మాట- విలువ మనకి తెలీదు నోరు పనిచేస్తున్నంత కాలం! కాని, ఆ నోరు పడిపోయినప్పుడు ఎంత వేదన లోపల గూడు కట్టుకొని వుంటుందో కృ.శా. ని చూస్తూ ఎంత బాధపడే వాడినో! ఈ  కాలంలో మనకి నోరుంది కాని మాటల్లేవ్. మాట్లాడాలీ అన్న ఆయన తపన ముందు మూగతనం వోడిపోయింది!” అన్నారొక సారి నండూరి!

నేను పెన్ యూనివర్సిటీకి వచ్చినప్పటి నించి నెలరోజులుగా రోజూ చదువుతున్న కవి – తోమాస్ ట్రాన్స్ ట్రోమర్ (Tomas Transtromer)! జీవితానికి ఎంత  దయలేదో ఎప్పుడూ అర్థం కాదు. పలికితే ముత్యాలు రాశిపోసినట్టుండే ఈ స్వీడిష్ మహాకవికి కూడా మన కృష్ణశాస్త్రిలాగానే మూగతనం వచ్చేసింది. ఇరవై ఏడేళ్ళ కిందట అంటే తనకి యాభై తొమ్మిదేళ్ళ వయసులో విపరీతమైన ప్రయాణాలూ, వెళ్ళిన చోటల్లా అద్భుతమైన ప్రసంగాలూ చేస్తూ వచ్చిన తోమాస్ కి గుండెపోటు, పక్షవాతం వల్ల నోరు పడిపోయింది. కాని, జీవితం పట్ల ప్రేమా తపనా తోమాస్ ని బతికించింది. కృష్ణశాస్త్రి గారు అన్నట్టు – “ముసలి తనంలో మూగతనం భయంకరం- శిథిల మందిరంలో అంధకారంలాగు!” కాని, ఆ ఇద్దరూ అక్షరాల్లో మాటల్ని వెతుక్కున్నారు. వాళ్ళ సమక్షం ఎవరికీ  మాటల్లేనితనాన్ని గుర్తుచేయలేదు, సంభాషణ ఎప్పటికీ ఆగిపోలేదు!

 

2

తోమాస్ ని ఎందుకు ఇంతగా చదువుకుంటున్నానో నాకు ఇంతదాకా తెలియదు. బహుశా, కొందరు కవులు మనతో పాటే కొంత దూరం నడుస్తారు, మన భుజాల మీద చేతులేసి! ఆ చేతుల స్పర్శలోని భద్రభావమేదో ఆ కవిని మనకి దగ్గిరగా తీసుకొస్తుంది. ఈ కవి  ఈ క్షణంలో నా తోడు నిలవాలి అనిపిస్తుంది. అలాంటి భావనే కావచ్చు!

మాట పడిపోయాక తోమాస్ కూడా కృష్ణశాస్త్రి గారిలాగానే చిన్న చీటీల మీద రాతపూర్వక సంభాషణలు చేసేవాడు. ఆ చీటీల్ని కూడా ఎంత ప్రేమించాడో తోమాస్! అతనికి అవి తన టీనేజ్ లో కాలేజీ పాఠాల మధ్య లెక్చరర్ల కన్నుకప్పి,  స్నేహితులతో పంచుకున్న చీటీల్ని గుర్తుకు తెచ్చాయట! అందుకే వాటికి “Inspired Notes” అని పేరు పెట్టుకున్నాడు తోమాస్!

తోమాస్ తో నా ప్రయాణం ఆ Inspired Notes అనే కవిత్వ పుస్తకంతోనే మొదలయింది. తోమాస్ అంటున్నాడు:

“నా కవితలు సంగమ స్థలాలు. సాంప్రదాయ భాషా, దృష్టీ అంతగా పట్టించుకోని వివిధ వాస్తవాల మధ్య ఆకస్మిక చుట్టరికాలు కలపడం కవిత్వం చేసే పని. వొక లాండ్ స్కేప్ లోని చిన్నా పెద్దా వివరాలన్నీ కలుస్తాయి, భిన్న సంస్కృతులు, మనుషులూ కలుస్తారు. ప్రకృతీ యాంత్రికత కూడా సంగమిస్తాయి. చూడగానే ఇదొక సంఘర్షణ అనిపించేది ప్రతీదీ కవిత్వంలోకి వచ్చేసరికి స్నేహమైపోతుంది!”

కవిత్వం ఎందుకూ అనే ప్రశ్నకి అనేకమంది అనేక సమాధానాలు వెతుక్కున్నారు. దేనితోనూ సమాధానపడకపోవడమే కవిత్వం అనిపిస్తుంది నా మటుకు నాకు! మాటపోయిందని మూగతనంతో సమాధానపడలేదు అప్పటి కృష్ణశాస్త్రి, ఇప్పటి తోమాస్!

The organ stops playing and there is deathly silence in

The church but only for a few seconds- అనుకున్నాడు తోమాస్.

ఇంకో కవితలో అంటున్నాడు:

మాటల్ని నింపుకొచ్చిన వాళ్ళందరితోనూ

విసిగిపోయాను

కేవలం మాటలే కదా, భాషలేని మాటలు!

 మంచు కప్పిన ద్వీపానికి వెళ్లాను

అక్కడ  మాటలేమీ లేవు

కాని,

రాయని పేజీలెన్నో

నల్దిక్కులా పరచుకొని వున్నాయి.

ఆ మంచులోనే

అడివి జింకల అడుగుల్ని దాటుకుంటూ వెళ్లాను

అదంతా భాషే,

మాటల్లేని భాష!

tomas-transtrc3b6merw

 

3

స్టాక్ హోం లో 1931 ఏప్రిల్ పదిహేను పుట్టాడు తోమాస్. తల్లి స్కూల్ టీచర్. తండ్రి విడాకులు ఇవ్వడంతో తోమాస్ తల్లితోనే వుండిపోయాడు. స్టాక్ హోం యూనివర్సిటీలో సైకాలజీ చదువుకున్నాడు. కేవలం పదిహేడు కవితలతో 1954 లో మొదటి పుస్తకంతో మొదలయింది తోమాస్ అక్షరయానం. 2015లో చనిపోయే నాటికి పదిహేను కవిత్వ సంపుటాలు అచ్చయ్యాయి. 2011లో కవిత్వానికి నోబెల్ అందుకున్నాడు.

తోమాస్ పిల్లల జైల్లో సైకాలజిస్ట్ గా పనిచేసే వాడు. కవిత్వం అంటే తోమాస్ కి ఎంత ప్రేమ అంటే- వొక సారి న్యూయార్క్ లో కవిత్వం చదివాక ఇష్టాగోష్టి జరుగుతోంది. “మీ వృత్తి అంటే పిల్లల జైల్లో పని మీ కవిత్వం మీద ప్రభావం చూపించిందా?” అని అడిగారు. దానికి ఆయనేదో సమాధానం చెప్పాడు కాని, ఆ సమాధానాన్ని ముగిస్తూ “ కాని, ఆ ప్రశ్న – మీ కవిత్వం మీ వృత్తి మీద ఏమైనా ప్రభావం చూపించిందా” అని అడిగితే చాలా సంతోషించే వాణ్ని” అన్నాడు. కవిత్వం అనేది దానికదే వొక స్వతంత్ర భావంగా మిగలాలని తోమాస్ చివరిదాకా కోరుకున్నాడు.

నిజానికి తోమాస్ తనదైన కవిత్వ లోకంలోనే బతికాడు. ఎక్కడ ఎలాంటి స్థితిలో వున్నా, కవిత్వమే అతని ఊపిరి. అతని ఆప్త మిత్రుడు, ప్రసిద్ధ అమెరికన్ కవి Robert Bly అన్నట్టు- “తోమాస్ కవితలు వొక రైల్వే స్టేషన్ లాంటివి. బహుదూరం నించి అక్కడికి రైళ్ళు వచ్చి, కాసేపు ఆగి మళ్ళీ వెళ్ళిపోతాయి. వొక రైలు కింద రష్యన్ మంచు కనిపించవచ్చు. ఇంకో రైలు చుట్టూరా  ఎక్కడివో పూల పరిమళాలు ఉండచ్చు. సుదూరం నించి పలకరించే వొక రహస్యమేదో అతని కవిత్వంలో వుంటుంది.”

 

4

నాకు చాలా నచ్చిన వొక కవితతో తోమాస్ నించి సెలవు తీసుకుంటాను ఇక-

 

వొక ఉత్తరానికి జవాబు

~

ఆ సొరుగు అట్టడుగున

వొక వుత్తరం-

ఎప్పుడో ఇరవై ఆరేళ్ళ కిందటిది.

వుద్విగ్నమైన ఉత్తరం

ఇప్పుడు తెరిచినా అది రొప్పుతూనే వుంటుంది.

 

యీ యింటికి అయిదు కిటికీలు

నాలుగు కిటికీల్లోంచి

పగలు మెరుస్తుంది ప్రశాంతంగా-

అయిదోది మటుకు

చీకటి ఆకాశంలోకీ, ఉరుములు మెరుపుల్లోకీ ముఖం తిప్పుకొని వుంటుంది.

 

ఆ ఐదో కిటికీ ముందు

నిలబడి వున్నాను,

అది ఆ ఉత్తరం-

 

అప్పుడప్పుడూ ఓ రెండ్రోజుల మధ్య

అగాధమేదో తెరచుకుంటుంది.

ఆ ఇరవై ఆరేళ్ళూ

జారిపోతాయి వొక్క క్షణంలో-

 

కాలం ముందుకే సాగిపోయే సరళ రేఖ కాదులే!

అదొక రహస్య వలయం.

ఎదో వొక గోడకి వొత్తిగిలి

హడావుడిగా పరిగెత్తే అడుగులూ గొంతుకలూ వింటావ్-

 

అవతలి వైపు నించి నువ్వే

గతంలోకి జారిపోతూ వుండడమూ వింటావ్-

ఆ వుత్తరానికి ఎప్పుడైనా జవాబంటూ వెళ్ళిందా?!

గుర్తు లేదు,

ఎప్పటిదో కదా  ఆ వుత్తరం!

 

ఎన్నో కెరటాలు అటూ ఇటూ తిరుగాడుతూనే వున్నాయి,

తడిసిన నేల మీద గంతులు వేసే కప్పలా-

మనసు

వొక్కో క్షణాన్నీ దాటుకుంటూ వెళ్ళిపోయింది.

తుఫానుల్ని కనబోతున్న కారుమబ్బుల్లా పేరుకుపోయాయి జవబివ్వని ఉత్తరాలు.

సూర్యకిరణాల వేడిని కూడా అవి చిన్నబుచ్చుతున్నాయి.

 

ఎప్పుడో వాటికి

జవాబివ్వాలి నేను!

ఎప్పుడో వొకప్పుడు వెళ్ళిపోతాను కదా

అప్పుడైనా వాటి వైపు కాసింత సేపు చూడాలి.

లేదూ

ఇక్కణ్ణించి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి

నన్ను నేను తవ్వుకోవాలి కనీసం-

 

ఎప్పుడో వాటికి జవాబివ్వాలి నేను

యీ నగరపు తొక్కిసలాటలో నలిగిపోక ముందే –

వేల వుత్తరాల సందోహంలో

ఆ పాత వుత్తరం కనుమరుగు కాకముందే-

*

 

 

 

నమ్మకమైన యింకో పడవ ప్రయాణం!

 

 

1

లెబనీస్ కవి ఖలీల్ జిబ్రాన్ కీ, అరుణ్ బవేరాకి చుట్టరికమేమీ లేదు; వాళ్ళ భాషా, వేషమూ, దేశమూ వొక్కటి కాదు. కాని, కవిత్వం అనేది భాషలకీ, వేషాలకీ, దేశాలకీ అతీతమైంది అనుకుంటే, అటు జిబ్రాన్ గుండెలోనూ, ఇటు అరుణ్ మనసులోనూ వొకే రంగు జెండా రెపరెపలాడుతోంది. వీళ్ళిద్దరూ వొకే పడవ మీద రెండు భిన్న సముద్రాల్ని ఎదుర్కొంటూ వెళ్తున్నారు. ఆ మాటకొస్తే, ప్రతి వర్తమాన కవిలోనూ నాకు ఎంతో కొంత జిబ్రాన్ అంశ కనిపిస్తూనే వుంటుంది, యీ కవిత్వ భాష విషయానికి వస్తే!

రంగస్థలం మీదికి  కవి ప్రవేశం వూరికే జరగదు. వచ్చేటప్పుడు కవి చాలా నిశ్శబ్దంగానే వస్తున్నాడు కదా అనిపిస్తుంది. కాని, అతను వెళ్ళిపోయాక అతనేమీ నిశ్శబ్దంగా రాలేదనీ, కొన్ని కొత్త శబ్దాల్ని పలికించి వెళ్ళిపోయాడనీ కచ్చితంగా తెలిసిపోతుంది. ఇలా అనిపించడానికి అతని కవి పేరుకి ముందు “మహా” అనే రెండక్షరాలేమీ అక్కర్లేదు. ఇంకో మాట అనాల్సి వస్తే, ఈ “మహా” అనేది చాలా పొడి మాట. అర్థంలేని అసంబద్ధ అబద్దం. అందుకే, నేను పనికట్టుకొని ఇప్పుడు ఎక్కడో వున్న జిబ్రాన్ నీ, ఇక్కడే మన పక్కనే వున్న అరుణ్ నీ కలిపి మాట్లాడుతున్నా.

జిబ్రాన్ అంటున్నాడు:

By poet, I mean the sailor who hoists a third sail on a ship that has only two, or the builder who builds a house with two doors and two windows among houses built with one door and one window, or the dyer who mixes colors that no one before him has mixed, in order to produce a new color for someone who arrives later on to give the ship of the language a new sail, the house a new window, and garment a new color. (1923)

అరుణ్ కవిత్వం అంతా చదివాక ఇతని కొత్త పదాలు ఏమిటీ, కొత్త సందర్భం ఏమిటీ అన్న ప్రశ్నలకి సమాధానాలు వెతికే పనిలో పడ్డాను. ఇతని కవిత్వానికి వొక వర్ణం వుందీ అనుకుంటే ఆ వర్ణానికి వొక పేరుందా అనీ అడుగుతూ ఉండిపోయాను నాలోని చదువరిని!

ఆ మూడు ముఖ్యమైన ప్రశ్నలకూ ప్రతి కవీ ఎంతో కొంత సమాధానం ఇవ్వగలిగి వుండాలని నా నమ్మకం. ఆ సమాధానం వచనంలో కాకుండా ఖాయంగా కవిత్వంలోనే  ఉండి తీరాలని యింకో గాఢమైన నమ్మకం.

 

2

సందర్భం తెలిసిన కవి అరుణ్. అంతే కాదు, యింకో ప్రత్యామ్నాయ కొత్త సందర్భం సృష్టించుకోవాల్సిన అవసరం వుందని నమ్ముతున్న కవి కూడా.

ఒక సందర్భం – క్రిక్కిరిసిన మనుషుల మధ్య గోలగా…

మరో సందర్భం ఖాళీగా…ఒంటరిగా…శూన్యంలా వేలాడుతూ.

ఈ రెండు వాక్యాలలోని రెండు సందర్భాలూ మనకి తెలుసు. మన చుట్టూ ఎంత శబ్దం వుందో, అంతటి నిశ్శబ్దం కూడా వుంది. కొన్ని విషయాలు ఎక్కువ మాట్లాడుకుంటున్నాం, అసలు ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలీనంతగా-  ఇంకా కొన్ని విషయాలు చాలా చాకచక్యంగా నిశ్శబ్దంలోకి నెట్టేస్తున్నాం, ఇంటర్నెట్లోకి! ఇప్పుడు నడిచేదంతా చరిత్రే అయితే, ఆ చరిత్రని ఎట్లా రికార్డు చేయాలన్న సందిగ్ధంలో పడేస్తున్నాం చరిత్రకారుడిని!

కాని, ఇంత సందిగ్ధంలోనూ అడగాల్సిన ప్రశ్నలు అడుగుతూ, రాబట్టుకోవాల్సిన సమాధానాలు రాబట్టుకోవడం ఏమిటో అరుణ్ కి తెలుసు. అతని ప్రతి కవితా వొక ప్రశ్నలోంచి మొలకెత్తి, సమాధానంలోకి ప్రయాణిస్తుంది. అదిగో, అలాంటి ప్రయాణాలే తన కవిత్వంగా నమోదు చేస్తూ వెళ్తున్నాడు అరుణ్.

అయితే, సందర్భాన్ని మాట్లాడే కవి చాలా సందర్భాల్లో వాచ్యమైపోతూ వుంటాడు. అరుణ్ కి అలాంటి ప్రమాదం లేదు. మరీ వాచ్యం అనిపించే సందర్భాన్ని కూడా తీసుకొని, అందులో కవిత్వాన్ని పొదగడం ఏమిటో, ఆ పరుసువేది ఏమిటో తెలిసిన వాడు అరుణ్. ఉదాహరణకి పైన పేర్కొన్న కవిత చూడండి, ఎలా ముగించాడో!

నువ్వో ఆకాశం, నేనో ఆకాశంగా

మాట్లాడుకుందాం

ఎప్పుడైనా-

ఈ నమ్మకాలు గుర్తొస్తే

జ్ఞాపకాలు జ్ఞాపకాలుగా

పెనవేసుకుందాం.

చాలా అందమైన భావనతో ముగిసింది ఈ కవిత. అరుణ్ ప్రతి సందర్భాన్నీ అంతే శ్రద్ధగా చెక్కుతాడు కవిత్వ శిల్పంగా- అది ఆ సందర్భం మీద పట్టు వున్నప్పుడే సాధ్యమవుతుందని వేరే చెప్పక్కర్లేదు కదా! ఇంతకుముందు జిబ్రాన్ అన్నాడే – the dyer who mixes colors that no one before him has mixed- అని, కచ్చితంగా అదే పని.

సందర్భం మాత్రమే కవిత్వం కాదు, సందర్భం తన రూపాన్ని తానే discover చేసుకోదు. నిపుణుడైన కవి ఇంకో కొత్త రూపంలోకి వెళ్తే, ఆ సందర్భం పదునెక్కుతుంది. అరుణ్ వొక కవితలో అన్నట్టు:

నాలోని ప్రతి పాత్రా

నిండుతున్నట్టే వుంటుంది,

కాని- మళ్ళీ మళ్ళీ మళ్ళీ ఖాళీ అవుతుంది.

అన్న వొక సంశయం కవికి నిరంతరం వుండాలి. అప్పుడు సందర్భాన్ని ప్రశ్నించే శక్తి కూడా అతనికి వస్తుంది. అలాంటి శక్తి నిండిన కవిత్వం యిక్కడి యీ ప్రయాణంలో ఎదురవుతుంది.

arun

3

తన ప్రయాణానికి వొక సందర్భం వుందీ అని నాలోని చదువరిని గట్టిగా నమ్మించాడు అరుణ్. ఇది చిన్న విజయమేమీ కాదు. అయితే, ఆ నమ్మకం దగ్గిరే నిలిచిపోయి, అరుణ్ చెప్పినదంతా/రాసిందంతా బంగారం అనుకునే స్థిరత్వం ఈ చదువరికి లేదు. ఇతని కొత్త పదాలేమిటీ అని మెతుకు మెతుకునీ పట్టి వెతుక్కునే దప్పికలో వున్నాను. కొన్ని అందమైన వాక్యాలకే ఈ దప్పిక తీరదు. వాక్యాలకి అతీతమైన జీవజ్వాల ఏదో కనిపించాలి. దాన్ని నేను “తాత్వికత” అనుకుంటున్నాను.

ముఖ్యంగా ఎటు చూస్తే అటు కవిత్వమే వినిపిస్తున్నప్పుడు ఈ తాత్వికత నాకు పెద్ద ప్రశ్నగా కనిపిస్తోంది. ఎక్కువ శాతం సమకాలీన కవిత్వంలో వాక్యాల వెంట పరుగు కనిపిస్తోంది. వాక్యాన్ని దీపంగా వెలిగించే ప్రయత్నం తక్కువగా కనిపిస్తోంది. వాక్యం దీపం కావాలంటే, కవికి దాని చుట్టూ వున్న చీకటిని సరిగ్గా చూసే కన్ను కావాలి.

అరుణ్ అన్నట్టు:

జీవితం

ఒక నిర్వచనం స్థాయి నుంచి ఎదగడం లేదు.

 అదే మాటని యింకాస్త విస్తరిస్తే, కవిత్వం కూడా వాక్యం స్థాయిని దాటి వెళ్ళడం లేదు. కవులు తమ వాక్యాల్ని తామే ప్రేమించుకోవడంలో తలమునకలై వున్నారు. తన నీడని తానే ముద్దాడుకుంటూ మురిసిపోయే narcissism బాహాటంగా పెరిగిపోతోంది. వొకానొక కాలంలో కవి చాలా సిగ్గరి. యిప్పుడు అలాంటి సిగ్గూ ఎగ్గూ లేదు. కొన్ని సార్లు కవిత్వం మీదనే వెగటు పుట్టించే స్థాయిలో ఆత్మ ప్రేలాపనలు సాగుతూ వున్నాయి. తనని తాను వెతుక్కునే అంతర్నేత్రం మూసుకుపోతోంది. అట్లాగని, బహిర్నేత్రం బలపడుతోందని కాదు. అది మరీ బలహీనమవుతోంది.

అరుణ్ కవిత్వం చదువుతున్నప్పుడు ఈ స్థితుల్ని దాటుకుంటూ వెళ్తున్న వొక composure కనిపిస్తోంది, బహుశా, అది అతని పునాదిలో వున్న వామపక్ష దృక్కోణం నించి వచ్చి వుండాలి. అతని వాక్యాల్ని వేటినీ మనం విడివిడిగా కేవలం కవిత్వంగా చదవలేం. ఉదాహరణకి:

  1. ఒక్క -కల కోసం

కొన్ని వేల సార్లు నిద్రపోవడం

ఒక్క- కరచాలనం కోసం

వేల శరీరాల్ని తవ్విపోయడం.

 

  1. వాన కురుస్తోందంటే

చెట్లు ఏం మాట్లాడుకుంటున్నాయో వినాలనుంది.

 

  1. మనుషులు ఖాళీ చేసిన వూరు

సామాన్లు సర్దుకొని వెళ్ళిపోతున్న దుఃఖం.

 

  1. ఈ జీవితాన్ని ముందెప్పుడో జీవించినట్టు

యిప్పుడంతా ఖాళీ.

  1. ఏదీ లేకపోవడం లోంచి

ఏదైనా రగిలే వాంఛ.

 

  1. యివాళ మనుషులందరూ

దీక్షా శిబిరాలుగా విడిపోయిన సందర్భంలో

బ్రతకడం అంటే –

దేనికి నిరసనో చెప్పాలి.

ఇవి కేవలం వాక్యాలు కావు. కావుకావుమనే సగటు కవిలోకపు cacophony లో సమాధి అయిపోయే నినాదాలూ కావు.

తన ప్రాణం పెట్టి మాటని బతికించే తపన ఇది. తన కన్నుని దారిదీపంగా వెలిగించి ముందుకు నడిపించే ప్రవాహపు ప్రయాణం  ఇది. యిలాంటి వెలుగు  ప్రయాణాలు మరిన్ని కావాలి, నిజమైన సందర్భాలు అసందర్భాలై పోతున్న ఈ కాలంలో!     *

*

ఆత్మ రంగు తెలుసుకున్న వాడు…

Velturu2

We live unsettled lives

And stay in a place

Only long enough to find

We don’t belong.

ఈ వాక్యాలు తన తొలినాళ్ళలో రాసుకున్నాడు Mark Strand – అంటే, 1960 లలో!

రెండు నెలల  కిందట కన్ను మూసేటప్పుడు కూడా అతని చివరి పదాలు అవే! జీవితంలోని అస్థిరత్వాన్ని, మనిషిని ఎక్కడా ఎప్పుడూ వొక్క క్షణం నిలవనీయని అశాంతినీ, మనం ఎప్పుడూ కోల్పోతూనే వుండే sense of belongingని దాదాపు వెయ్యి పేజీల కవిత్వం చేశాడు మార్క్.

జీవితం పట్ల వొక అంటీముట్టని తనాన్ని (detachedness) యింకో విధంగా చెప్పాలంటే- always living, always dying-లాంటి తత్వాన్ని చివరిదాకా అంటిపెట్టుకొని వుండిపోయాడు మార్క్. కాని, ఎవరూ చెప్పలేని మాటల్ని కవిత్వం అడ్డుపెట్టుకొని ధైర్యంగా చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. 1960ల తరవాతి ఆధునిక జీవితంలోని అంతస్సూత్రాన్ని అతి తేలికైన మాటల్లో ఎంత మృదువుగా పొదుగుతాడో, అంతే పదునుగా కూడా విసుర్తాడు. Everyone who has sold himself wants to buy himself back లాంటి వాక్యాలు వినడానికి తేలికగా వుంటాయి కాని, అలాంటి వాక్యాలు రాయడానికి కవి నరాలు తెగిపోయే బాధనే అనుభవించి వుంటాడు.

మొదటి సారి మార్క్ గురించి వినడం ఆ పైని చెప్పిన నాలుగు ముక్కల ద్వారానే! పదిహేనేళ్ళ కిందట మాడిసన్ లో వొక పాత పుస్తకాల షాపులో మొదటి సారి దొరికిన మార్క్ కవిత్వాన్ని ఆ తరవాత వెతికి  వెతికి పట్టుకొని  యింకొన్ని సార్లు చదువుకున్నప్పుడు అతనేమిటో నాకు  అంతగా అర్థమయ్యాడని అనుకోలేను. మార్క్ చెప్తున్న sense of belonging లో వుండే వేదన తెలీక కాదు. తెలిసిందే అయినా దాన్ని వొక తెలియనితనంగా  గుర్తుచేసే కవిత్వ లక్షణమే అది అనుకుంటా. మొదటి సారి చదివినప్పుడు అందులోని వొక్క అర్థం మాత్రమే రెక్క విప్పుకుంటుంది, పదే పదే చదువుతున్నప్పుడు ఇంకా కొన్ని అర్థాలకు రెక్కలొస్తాయి. ఏ రెక్కలో నిజమైన అర్థం వుందో తెలియకపోవడం కవిత్వంలోని మిస్టరీ. బహుశా, అలాంటి మిస్టరీ కోసమే కవిత్వం చదవాలనిపిస్తుంది. ప్రతీసారీ ఇంకో అర్థాన్ని వెతుక్కోవాలనిపిస్తుంది.

మొదటి సారి మార్క్ కవిత్వం చదివినప్పుడు అది నన్ను నిజంగా అలాంటి తెలిసీ తెలియనితనంలోకి తీసుకెళ్ళి సవాల్ చేసింది. నేను రాయడానికి నిరాకరించే చాలా విషయాలు నిష్పూచీగా రాసి చూపిస్తున్నాడు మార్క్. నా కవిత్వ వ్యాకరణాన్ని మార్చుకోవాలని మందలిస్తున్నాడు. జీవితంలోని బలహీనతలని ఇంకా బలంగా చెప్పవచ్చని, చెప్పి తీరాలని నన్ను నమ్మించాడు చివరికి-

అసలు జీవితంలోని ఖాళీని అప్పటికే చాలా మంది కవులు పాడడం నేను విన్నాను.

నాలోపలి పురుగుని తొలిచిన కాఫ్కా అంటే ఇష్టం అప్పటికే-

అసంబద్దతని తాత్వీకరిస్తూ సాహిత్యీకరించిన Becket ని మళ్ళీ మళ్ళీ చదువుకుంటున్నాను అలవాటైనంత తేలికగా-

Wallace Stevens వాక్య ప్రయోగాల చిక్కుముడులలో అసంతృప్త క్షణాల విచ్చిన్నతని అర్థం చేసుకుంటున్నాను. కష్టమే అయినా-

Walt Whitman పొడుగాటి వాక్యాల వూపిరాడనితనం అంటే ఎందుకో మహా ఇష్టమవుతూ వుంది ఆ సమయంలోనే!

అదిగో, అప్పుడు దొరికాడు మార్క్!

mark2

2

కవిత్వం చేయదగిన పనుల జాబితా ఏమిటో ఇంకా నాకు తెలీదు. ఎప్పటికైనా తెలుస్తుందన్న హామీ లేదు.

కాని, బహుశా అది కొన్ని నిజాలు చెప్పడం నేర్పుతుంది, అలాగే, కొన్ని అబద్ధాలు చెప్పడం కూడా నేర్పుతుంది. అబద్ధాలకు తొందరగా అలవాటు పడే కవులే మనకి ఎక్కువ, అబద్ధానికి వుండే తగరపు ఆకర్షణ వల్ల- అదనపు తక్షణ కీర్తి వల్ల; కాని, మార్క్ లాంటి కవులు ఎప్పుడూ నిర్వచనానికి అందని నిజంలో – కవిత్వం అద్దమే అయినా, ఆ అద్దం- అతనే  అన్నట్టు- The mirror was nothing without you- అన్న ధ్యాన నిమగ్నతలో రాస్తారు. కవి ఈ లోకంలోనే వుంటూ ఈ లోకాన్ని నిరాకరించే ధ్యాని లేదా అంతర్లోకపు పక్షి  అనుకుంటాను ఇలాంటి కవుల్ని చదువుతున్నప్పుడు.

నిజానికి మార్క్ మొదట్లో చిత్రకారుడు. యేల్ స్కూల్లో చిత్రకళ విద్యార్థిగా వున్నప్పుడు అనుకోకుండా Wallace Stevens కవిత్వాన్ని చదివాడు. అంతే, ఇక అతని లోకంలోంచి చిత్రకళ నిష్క్రమించింది; కవిత్వ చిత్కళ ప్రవేశించింది.  ఆ తరవాత చదువుతూ వచ్చిన అమెరికన్ కవిత్వం అతన్ని కట్టి పడేసింది. కవిత్వ విద్యార్థిగా 1960 లో ఇటలీ వెళ్ళాడు. 1964 లో అతని మొదటి కవిత్వ సంపుటి Sleeping with One Eye Open అచ్చయింది. అప్పటి నించీ మొన్న చనిపోయేదాకా మార్క్ వి పదకొండు కవిత్వ సంపుటాలు అచ్చయ్యాయి.

జీవితాన్ని నడిపించే సూత్రం Absence అంటాడు మార్క్. వొక లేనితనంలోంచి వాక్యాల్ని అల్లుకోవడమే కవిత్వం అంటాడు. “మనం అన్నీటికీ అర్థాలు వెతుక్కోగలం అనుకుంటాం. కాని, అలా వెతుక్కోలేకపోవడమే జీవితం అని ఎప్పుడూ అనుకోం. మనకి మిస్టరీ అంటే ఇష్టమే. కాని, జీవితం అన్నిటినీ మించిన మిస్టరీ అంటే మాత్రం వొప్పుకోం,” అంటాడు.

What cannot be seen will define us, and we shall be prompted

To say that language is error, and all things are wronged

By representation. The self, we shall say, can never be

Seen with a disguise, and never been seen without one.

అని వొక కవితలో అంటాడు కూడా-

అయితే, మార్క్ తన కవిత్వం అంతటా చెప్పే అసంపూర్ణత అనే భావనలో ఇదొక కోణం మాత్రమే. సంపూర్ణత అనేది మానవ సాధ్యం కాదని మార్క్ కచ్చితమైన అభిప్రాయం. అందుకే, కవిత రాస్తున్నప్పుడు కూడా కవి తనకే తెలియని వొకానొక స్థితిలోకి ప్రయాణమై వెళ్తాడు. అక్కడ ఎదురుచూడని/వూహించని మిస్టరీలాంటి నిజమే తనకి కనిపిస్తుంది. ఆ స్థితినించి వెనక్కి వచ్చి, దానికి మళ్ళీ అర్థం కల్పించాలని తను తపనపడ్తాడు, కాని- అది తపన మాత్రమే! అలా వెనక్కి చేరుకున్నప్పుడు తను అబద్ధాలు చెప్పడం మొదలెడతాడు, అంటే, ఆ కవిత్వ నిజస్థితిలో మాత్రమే తనకి తాను నిజదర్పణం. మిగిలిన వేళల్లో తను disguise కింద మారిపోతాడు.

mark1

3

ముసుగు తొలగిపోవాలి, ఆ ముసుగు ఎంత నిజాయితీగా ఎంత నిజంగా తొలగిపోతుందన్న దాన్ని బట్టి కవిత్వ తీవ్రత వుంటుంది.

మార్క్ కవిత్వంలో అలాంటి  ముసుగు తన కవిత్వాన్ని తనే  గుచ్చి గుచ్చి అడిగే ప్రశ్నల ద్వారా తొలగిపోయింది. కవిత్వం ఎందుకు రాయాలన్న విషయం మీద కనీసం పది కవితలు రాసుకున్నాడు మార్క్. ఉదాహరణకు చూడండి ఈ కింది వాక్యాలు:

For us, too, there was a wish to possess

Something beyond the world we knew, beyond ourselves,

Beyond our power to imagine, something nevertheless

In which we might see ourselves.

మనిషి తనని తాను నిక్కచ్చిగా చూసుకునే క్షణాలు తప్పకుండా వుంటాయంటాడు, కవికి అలాంటి క్షణాలు అతని వాక్యంలో దర్శనమిస్తాయని మార్క్ నమ్మకం. అలాంటి నమ్మకం గాయపడిన సందర్భాల్లో మార్క్ చాలా సార్లు మౌనంలోకి జారిపోయాడు, అందుకే అతని  కవిత్వ ప్రయాణంలో నిశ్శబ్దాలు ఎక్కువే వున్నాయి. అసలేమీ  తెలియని మౌనంలోకి కూరుకుపోయిన సందర్భాలు  చాలానే అతన్నివుక్కిరిబిక్కిరి చేశాయి. అలాంటి ఏదో  బలమైన బలహీన  సందర్భంలో మార్క్ అంటాడు, రచన అన్నది వొక  నిద్రలో నడకలాంటి స్థితి అని- ఆ వెంటనే అంటాడు మళ్ళీ, అసలు writing అన్నదంతా selfish act అని-

You were mine, all mine; who begged me to write, but always

Of course to you, without ever saying what it was for

Who used to whisper in my ear only the things

You wanted to hear….

మార్క్ కవిత్వం అంతా Self-assertive act – తనని తాను గుర్తుకు తెచ్చుకొని, తను వినాలనుకున్న లోపలి మాటేదో బయటికి నెట్టే మానసిక ప్రక్రియ.

As if there were something

You wanted to know, but for years had forgotten to ask

మార్క్ రోజువారీ జీవిత పదచిత్రాల్ని దాటి ఎక్కడికీ వెళ్ళడు. పైన చెప్పిన ఆ మరచిపోయిన something ఎలా వుండాలో చెప్తున్నాడు ఇలా-

నువ్వు రాసుకుంటున్న టేబుల్ మీద

ఏటవాలుగా వొంగిన సూర్యకాంతి

వొక తెలిసిన చెయ్యి ఎత్తినట్టు

వొక ముఖం నీ వేపు తిరిగినట్టు

దూరం నించి – కొండ మలుపులో వొక కారు మాయమైనట్టు-

మార్క్ కవిత్వం నిండా ఇలాంటి రోజువారీ కదలికలు అతని మానసిక స్థితితో అందంగా లీనమైపోతూ కనిపిస్తాయి. అంటే, ఏది రోజువారీ ప్రతీక, ఏది కవిత్వ భాష అనే గీత చెరిగిపోతుంది అతని కవిత్వంలో-

నాకు తెలిసీ అర్థమయ్యీ, ఇది అతనికి Walt Whitman నించీ, Wallace Stevens నించీ అలవాటైంది. ఇతర కవుల్ని చదవడం అంటే ఇదీ అని నాకు అర్థమైంది ఈ ముగ్గురికీ మధ్య ఏర్పడ్డ పరోక్ష కేవల కవిత్వ సాన్నిహిత్యం చూశాక- ఎప్పుడూ కలవని ఈ ముగ్గురు కవులు కవిత్వంలో వొకరికొకరు ఆత్మబంధువులు, ఆ ముగ్గురి మధ్యా అనురాగ పరాగం మార్క్ ప్రతి వాక్యంలోనూ ఇంకిపోయిన వర్ణ విశేషం.

4

మొన్న నవంబరు చివరి వారంలో మార్క్ చనిపోయినప్పుడు నాకు వొక్కటే అనిపించింది- నాకు తెలిసిన కవిత్వలోకంలో వొక రంగు – నాదైన ఇష్టమైన రంగు వొకటి- వెలిసిపోయిందని –

ఇంకో మార్క్ పుడతాడా అంటే పుట్టవచ్చు. కాని, ఆ రంగు -అదే తాజాదనంతో- మళ్ళీ కనిపించదు కదా అనిపించింది.

 -అఫ్సర్

 

 

 

 

అమ్మా నాన్నా… కొన్ని అన్నం ముద్దలు!

Velturu2

1

తెలీదు ఎందుకో, అన్నం ముందు కూర్చున్నప్పుడు  కాశిరాజు గుర్తొస్తాడు కొన్ని సార్లు!

ఇంకా

 అసలు ఎప్పుడొచ్చిందో,  చెప్పా పెట్టకుండా ఎప్పుడేలా  పెట్టే బేడా సర్దుకెళ్ళి పోయిందో తెలియని యవ్వనమూ గుర్తొస్తుంది. నోటి దాకా వచ్చిన అన్నం ముద్ద ఇట్టే జారిపోతుందేమో అన్నట్టు  భయపెట్టే జీవితాన్ని గట్టిగా పొదివి పట్టుకోవాలనే పిచ్చి తపన గుర్తొస్తుంది.

చాలా చిత్రంగానే  వుంటుంది జీవితం మరి! దాటిపోయిన మజిలీలన్నీఅలా ఎలా జారిపోయాయా అని కలతబెడ్తాయి. కాని, కవిత్వమనే మాయా లాంతరు పట్టుకొని ఆ దాటిపోయిన వీధుల్లో గాలి కిన్నెర మీటుకుంటూ, సంచారం చేస్తూ పోతున్న వాణ్ని ఈ మధ్య చూసాను నేను! అతనేవో పాడుకుంటున్నాడు, వొక్కో సారి తనలో తానే మాట్లాడుకుంటున్నాడు. వొక్కో క్షణపు అసహనంలో పక్కన ఎవరితోనో కాసేపు తగువు పడి, ఆ తరవాత పిల్లాడిలాగా కావిలించేసుకుంటున్నాడు. చాలా సార్లు అతను నేనే అనే ప్రతిబింబం అనిపిస్తాడు అందరికీ!

అతన్ని మనమూ మన లోకమూ  కాశిరాజు అని పిలుస్తున్నాం ఇప్పుడు  ఇంకేమని  పిలవాలో తెలియక!!

 

2

కాశిరాజు కవిత్వం చదువుతున్నప్పుడు ఆకలీ, యవ్వనమూ – వీటి చుట్టూ తిరిగే ఏదో వొక తాత్విక గానం వినిపిస్తుంది. ఇతని వాక్యాల్లో వొక తెలివైన అమాయకప్పిల్లాడు వొక తలుపు రెక్క సగమే  తెరిచి చిలిపిగా చూస్తూ వుంటాడు; ఎదో reflexive mood (స్వానుశీలన)లోకి మనల్ని తీసుకెళ్తాడు. ఇప్పటి కవుల దాదాపు అందరి కవితల్లోనూ మామూలుగానే కనిపించే ఈ స్వానుశీలన లక్షణం  కాశిరాజులో మాత్రం అదే ప్రధానంగా కేంద్రీకృతమై వుంటుంది.

Reflexivity – అంటే  తన లోపలికి తను చూసుకోవడం మాత్రమే కాదు, తలుపు ఓరగా తెరచి బయటికి చూడడమే కాదు. బయటికి ఎంత దూరం వెళ్తామో లోపలికీ అంతే దూరం వెళ్ళడం – అసలు సిసలు Reflexivity. కాశిరాజు కవిత్వమంతా ఈ Reflexive అలల చప్పుడు! కేవలం లోపలి మనిషి(insider)గా వుండే మామూలు Reflexivity ని కాశి కవిత్వం ఛాలెంజ్ చేస్తుంది. ఇతని కవిత్వంలోని ఈ స్వానుశీలన స్వభావం కేవలం తననే కాదు, బయటి పాత్రల్ని కూడా ప్రేమగా చూస్తుంది.

ఉదాహరణకి ఈ పంక్తులు చూడండి:

వర్షం వచ్చిన జాడ ఆ వాన కళ్ళకి తెలీదు
అమ్మది ఆకాశమంత దుఃఖం.
అమ్మకల్లకి నాన్న ఉపనది
మా దాహాలు తీరడానికి వాళ్ళు దు:ఖాల్లా ప్రవహిస్తారని
మాకెవ్వరికీ తెలీదు.

 

అమ్మా నాన్న కాశిరాజు కవిత్వంలో తప్పక కనిపించే పాత్రలు. కాని, అవి కాశిరాజు అనే వ్యక్తి తత్వానికి సంబంధించినంత వరకూ అతని లోపలి పాత్రలు కూడా! వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు కాశిరాజు ఎప్పుడూ తనలోపలికి వెళ్ళిపోయి, అలా తవ్వుకుంటూ కూర్చుంటాడు.  ఇది కవిత్వంలో చాలా  కష్టమైన విద్య. కవి చాలా ఉద్వేగ భారాన్ని మోస్తూ బాలన్స్ చేసుకోవాల్సిన సందర్భం. ఉద్వేగాన్ని కేవలం ఉద్వేగంగా కాకుండా, దాన్ని కాసేపు objective గా కూడా చూడగలిగిన నిబ్బరం వున్నప్పుడే పై వాక్యాలు వస్తాయి.

 

తన కవిత్వం చదివే  పఠితని  కూడా ఆ స్వానుశీలన మూడ్ లోకి తీసుకు వెళ్ళడం కాశి ప్రత్యేకత.  ఇతని వొక్కో కవితా చదివేటప్పుడు గుండె చప్పుడు కాస్త పెరుగుతుంది. చదవడం అయిపోయాక అసలే చప్పుడూ వినపడని నిశ్శబ్దంలోకి శరీరాన్ని బట్వాడా చేసి వచ్చినట్టు వుంటుంది. అందుకే, కాశిరాజు కవితని ఆగి ఆగి చదవాలి. అలా ఆగినప్పుడల్లా అతని వూరులాంటి మన ఊళ్లోకి, అతని అమ్మానాయన లాంటి మన అమ్మానాయనల దగ్గిరకీ, వాళ్ళతో తెగిపోతున్న మన “కమ్యూనికేషన్” లోకి, మనల్ని చుట్టేసి వూపిరాడనివ్వని నగరపు మాయలోకీ వస్తూ పోతూ వుంటాం. మన గురించి మనం ఆలోచించుకునే/ బాధ పడే వ్యవధి ఇస్తూ, వాక్యాల్ని కూర్చుతూ వెళ్తాడు కాశిరాజు. ఆ వ్యవధిలో అతను మనల్ని Reflexive గా మార్చి, తన అమ్మానాన్నా కథలో మనల్ని పాత్రలుగా ప్రవేశ పెడతాడు.

కాశిరాజు కవిత తెగిపోతున్న ఆ తొలి సంభాషణల  గురించి ఎప్పటికీ తెగని మనియాది. ఈ కవిత రాసిన శరీరం ఆ కవిత రాయడం ముగిసాక ఎలాంటి నిద్రలోకి వెళ్తుందో తెలీదు. ఆ నిద్రల్లో అతన్ని ఏ కలల సర్పాలు ఎలా చుట్టుకుపోతాయో తెలీదు. సగం మాత్రమే నిండిన అతని కడుపు ఎంత మారాం చేస్తుందో!

కాశిరాజు

కాశిరాజు

3

కమ్యూనికేషన్

ఇంతలేటైంది కదరా ఇంకా తినలేదా అని
అమ్మకి ఆకలైనట్టే అడుగుతావుంటే
ఓ దుఃఖపు జీర నా చెవికెలా చేరిందీ తెలుస్తూ ఉంది
దాన్ని నాదాకా మోసుకొచ్చిన ప్రేమది ఎన్ని సెకన్ల వేగమని
ఎవరినడిగితే తెలుస్తుంది

కాల్ కట్ చేస్తే

ఫోన్ టూ హార్ట్ , హార్ట్ టూ అమ్మా నాన్న
అన్న సంభాషణ సమాదైపోయి
రేపు చేయాల్సిన పనినంతా రివైండ్ చేసుకున్నా

దాహమైనట్టు అనిపించాక లెగాలని చూస్తే సహకరించని ఒళ్ళు
నీరసాన్ని బద్దకంగా చేసుకుని
బయట తినేద్దాం అని సర్ది చెప్పుకుంది

మెట్లుదిగి కాస్త ముందుకెళితే
ఆ మలుపు తిరిగాక ఉండే చపాతీలోడు సర్దేసుకున్నాడు.

నవ్వుకుని నేను పడుకుంటాననుకో పర్లేదు
అక్కడ మా అమ్మకి ఆకలేస్తేనో !

Reflexivity ప్రధాన లక్షణంగా వుండే కవితల్లో dialogue రూపంలో వ్యక్తం కావాల్సిన విషయాన్ని  monologue  కింద మార్చుకుంటాడు కవి. అంటే- బయటికి ఎంతకీ చెప్పలేని, ఎవరికీ చెప్పుకోలేని విషయాన్ని తనలో తానే చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. పైన చెప్పిన కవితలో ఈ కవి చేసిన పని అదే!

వొక మామూలు సంభాషణా వాక్యం- “ఇంతలేటైంది కదరా ఇంకా తినలేదా?”- అనే ఎత్తుగడలోనే కవి reflexive mood కి రంగం సిద్ధం చేసి పెట్టాడు. ఆ తరవాత చెప్పిన శారీరక మనఃస్తితులన్నీ ఆ mood కి భౌతిక ప్రతీకలు మాత్రమే!

ఈ కవితలో నిర్మాణపరంగా కవి వేసిన ఇంకో అడుగు: కవిత్వంలోకి కథనాత్మకత ప్రవేశపెట్టడం! తెలుగులో ఆరుద్ర, కుందుర్తి, శీలా వీర్రాజు, రంది సోమరాజు- మన తరంలో నందిని సిద్దా రెడ్డి, జూకంటి, కొన్ని కవితల్లో కొండేపూడి నిర్మల  కథనాత్మక కవిత్వం రాశారు. అవి దీర్ఘ కావ్యాలో, కవితలో అవ్వడం వల్ల వాటిల్లో కథ ప్రధానమై, కవిత్వం అప్రధానమైంది.

వాటికి భిన్నంగా కాశిరాజు చిన్న కవితలో కథనాత్మకతని తీసుకువచ్చాడు. అంటే, short narrative poem – చిన్న కథనాత్మక కవిత- అనే రూపానికి తనకి తెలియకుండానే నాంది పలికి, దాన్ని కొనసాగిస్తూ వస్తున్నాడు కాశి. దీర్ఘ కథనాత్మక కవితలకి భిన్నంగా ఈ తరహా కవితలో దీర్ఘమైన వర్ణనలు వుండవు. పాత్రలు బహిరంగంగా బాహాటంగా మాట్లాడుతూ కూర్చోవు. కథా, పాత్రలు రెండూ కవి అనుభూతిలో భాగమైపోతాయి, ఆ అనుభూతికి గోడచేర్పు అవుతాయి వొక విధంగా!

ఈ కవిత్వ నిర్మాణం సాధించడానికి కాశి వాక్యస్వభావాన్ని మార్చుకుంటూ వెళ్తున్నాడు. ఉప్పెనలాంటి వాక్యాలు వొకప్పుడు కవిత్వంలో బాగుండేవి. ఉదాహరణకి: శ్రీశ్రీ కవిత్వ వాక్యాలు సాధారణంగా వేగంగా ఉరవడిగా ప్రవహిస్తాయి. అలాంటి ధోరణి అలాగే కాకపోయినా వేర్వేరు రూపాల్లో ఇప్పటికీ వుంది. ఇప్పటి కవిత్వ వాక్యాలు సెలయేటి నడకలు అని నాకు అనిపిస్తోంది. ఆగిఆగి వెళ్తూ, తనని తానూ తరచి చూసుకునే reflexive mood ఆ నడకలో కనిపిస్తుంది.

ఈ సెలయేటి రహస్యం తెలిసిపోయింది కాశికి!

* 

పాత చొక్కా: వొక జ్ఞాపకం బతికొచ్చిన సంబరం!

Velturu2

అవును ఆ పాత చొక్కా ఎప్పుడూ అలా
నా మనసు కొక్కేనికి వేలాడుతూనే వుంది

బొత్తాం వూడిన ప్రతి సారీ అమ్మ కళ్ళు చిట్లిస్తూ
సూది బెజ్జంలో ప్రేమ దారాన్ని చేర్చి కుడుతున్నట్టు

స్నేహితుల తోపులాటలో చినిగి వస్తే నాతో పాటు
తననూ ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని నాన్న అతుకు వేస్తున్నట్టు

మాసి పోయినప్పుడల్లా నెమ్మదిగా పులుముతుంటే
రంగు వెలసిన జ్నాపకమేదో మసకగా కంటి నీటి పొర వెనక కదులుతున్నట్టు

యింకా వదలని పిట్ట రెట్ట మరక చెవిలో
ఆ కువ కువ వేకువనింకా పల్లవిగా ఆలపిస్తున్నట్టు

వీచే చల్లగాలిని ఆప్యాయంగా ఒడిసిపట్టి అలసిన
దేహానికి తన బిగువులో కాసింత సేద దీరుస్తున్నట్టు

ఆ జేబులో దాచుకున్న గులాబీ రేకు
తననింకా ఆ మలుపుకు గురుతుగా దాచి వుంచినట్టు

ఎంత కాలమైనా ఆ పాత చొక్కా చిన్ననాటి వాసనలను
మడతలలో దాస్తున్న మంత్రపు దారప్పోగుల నేత నాకు!!

 

1

IMG_6555

మంచి కవిత్వం ఎలా వుంటుందో యింతవరకూ యెవరూ చెప్పలేదు. చెప్పడానికి కావాల్సిన పదాలు లేవని మాత్రం అంటూనే వున్నాం. మంచి కవిత ఎందుకు మంచిదైందో చెప్పడానికి మళ్ళీ కవిత్వ వాక్యాలనే తిరగదోడుతూ వుంటాం. ఎందుకంటే, కవిత్వాన్ని కవిత్వంతో మాత్రమే కొలవగలమనీ, వచనంతో తూయలేమనీ అనుకుంటాం కనుక!

చాలా వరకు ఇది నిజమే! పరిమితమైన  నా అనుభవంలో నాకు తెలిసివచ్చింది కూడా ఇదే!

కవిత్వాన్ని గురించి మొత్తంగా మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి సమస్య మామూలే! కాని,  విడివిడిగా వొక కవిత తీసుకొని మాట్లాడుతున్నప్పుడు  చెప్పే మాటలు కూడా నాకు అంతగా తృప్తినివ్వవు. కవిత చదివాక కలిగే వొకలాంటి తృప్తినీ, ప్రశాంతతనీ వచనంలో రాయలేకపోయినా, కనీసం కొంత మాట్లాడితే బాగుణ్ణు అనుకొని, గత కొద్ది కాలంగా కొన్ని కవితల ముందు ఎంతో కొంత నేర్చుకోవాలని తపించే విద్యార్థిలా నిలబడి, మాటలు కూడదీసుకుంటున్న సమయంలో అనుకోకుండా వర్మ రాసిన ఈ “పాతచొక్కా” కవిత తారసపడింది.

పాత చొక్కా…!

కవిమిత్రుడు హెచ్చార్కె కలిసినప్పుడల్లా తనకీ నాకూ జరిగే అనేకానేక సంభాషణల్లో ఈ పాత చొక్కా వొకటి. ఖమ్మంలో నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు హెచ్చార్కె తరచూ విప్లవ రచయితల సంఘం బాధ్యుడిగా ప్రసంగాలు ఇవ్వడానికి వస్తూండే వాడు. అతని ప్రసంగాలంటే నాకు ఇష్టంగా వుండేది. అంతకంటే ఎక్కువగా – అతనెప్పుడూ వేసుకొచ్చే వొక నీలంరంగు చొక్కా అంటే మరీ  ఇష్టంగా వుండేది. టీనేజర్ని కదా, నా జర్నీ కొంచెం అలాగే వుండేది! నాకు కూడా కచ్చితంగా అలాంటి నీలం రంగు చొక్కానే – సన్నటి వైట్ చెక్స్- తో వుండేది.  ఇద్దరమూ ఆ చొక్కాల మీద నిజంగానే   ఇష్టంగానే  మాట్లాడుకునే వాళ్ళం, విప్లవ రాజకీయాలు కాసేపు పక్కన పెట్టేసి!

కొంత కాలానికి మా స్నేహం పాతబడింది, ఆ నీలం చొక్కా మాదిరిగానే!

కాని, ఆ జ్ఞాపకం వుందే, అది ఇప్పటికీ వర్మ చెప్పినట్టు-  “మనసు కొక్కేనికి వేలాడుతూనే” వుంది ఎప్పటికప్పుడు  కొత్తబడుతూ!

ఇప్పుడు ఈ కవిత  చదివాక వెంటనే అనిపించింది, అసలు ఇన్నాళ్ళుగా నాతో వున్న, నాలో వున్న ఈ అనుభవాన్ని నేనే  ఎందుకు రాయలేకపోయానా అని. బహుశా, మంచి కవిత అనేది మనలోని అలాంటి వొక అశక్తతని కూడా కొన్ని సార్లు గుర్తుచేస్తుందేమో!

ఈ  కవిత మొదట చదివిన కొద్దిసేపటికి, ఆ తరవాత ఇంకో రెండు సార్లు చదువుకున్నాక ఇంకా అనిపించింది, రాసినా  నేను  ఈ కవిలా రాయలేను అని! మరీ దగ్గిరగా వుండే అనుభవం రాయడం ఎంత కష్టం!?

వొక  మంచి కవిత చేసే యింకో గొప్ప పని ఏమిటంటే — అది మన మనసు తెలిసో తెలియకో విధించుకున్న కొన్ని పరిమితుల్ని కూడా గుర్తు చేస్తుంది. ఆ పరిమితుల్ని తెగ్గొట్టి ఆ అనుభవాన్ని తిరిగి ప్రేమించడానికి మనల్ని సిద్ధం చేస్తుంది!

అందరమూ అనుకున్నట్టు- ఇలాంటి పని చేసే కవిత్వానికి, ఆ శక్తి ఆ కవిత్వ వాక్యం నించి మాత్రమే రాదు. గొప్ప కవిత్వ వాక్యాలు రాసే కవులు మనకి చాలా మందే వున్నారు. కాని, వాక్యాలు ముందు పుట్టి తరవాత భావాన్ని చొక్కాలా వేసుకునేది మంచి కవిత్వం కాదని  ఖాయంగా చెప్పగలను.

2

ఈ కవితలో ప్రత్యేకించి చెప్పాల్సింది: metaphorization – పదచిత్రీకరణ.  సాధారణంగా చలనమున్న పదచిత్రాల్నీ(dynamic images),  ప్రతీకల్ని (ఉదాహరణకు: సెలయేరు) తీసుకోవడంలో వున్న సౌలభ్యం చలనరహితమైన పదచిత్రాల్ని(static images), ప్రతీకల్ని (ఉదాహరణకు: ఈ కవితలో పాత చొక్కా) తీసుకోవడంలో లేదు. ఇక అలాంటి చలనరహిత ప్రతీకల్ని చలనశీలమైన భావాల్ని పలికించడానికి ప్రయత్నిస్తే  చాలా సందర్భాల్లో కవిత శిల్పం దెబ్బతింటుంది. ఆ ఇబ్బందిని గట్టెక్కడం శిల్ప పరంగా ఈ కవితలో వొక నిర్మాణ  విశేషం.

ఆ ఇబ్బందిని గట్టెక్కడానికి ఈ కవి  చేసిన పనేమిటంటే, ఆ చలనరహితమైన ప్రతీకలూ వస్తువుల వెంటనే చలనశీలమైన వొక అనుభూతిని ఆసరా తీసుకున్నాడు.

ఉదాహరణకు ఇక్కడ “బొత్తాం” “చినుగు” చూడండి:

  1. బొత్తాం వూడిన ప్రతి సారీ అమ్మ…(బొత్తాం – కళ్ళు చిట్లించి, ప్రేమ దారంతో  అమ్మ)
  2. స్నేహితుల తోపులాటలో చినిగి… ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని నాన్న (చినుగు – దాన్ని కుట్టే నాన్న)

 

ఈ continuity ని  చివరంటా సాధించింది కవిత.

రెండో నిర్మాణ విశేషం: కవి ఎంతో జాగ్రత్తగా ఎంపిక చేసుకున్న క్రియా పదాలు. కవితలో రెండో పంక్తి లోని “వేలాడుతున్న” అనే పదం మొదలుకొని, చివరి పంక్తిలో వున్న “దాస్తున్న” దాకా క్రియ అనేది నిష్క్రియగా (dysfunctional)  కాకుండా, చాలా నిర్దిష్టమైన పని (very functional) కోసం వుపయోగించడం ఈ కవితలో బలంగా కనిపిస్తుంది.

మూడో విషయం: తన అనుభూతిని కవి ఎలాంటి frame నించి imagine చేస్తున్నాడో, ఆ ఊహకి ఎలాంటి రూపమిస్తున్నాడో అన్నదాన్ని బట్టి కూడా ఆ కవిత గుణం తెలుస్తుంది. అంటే, కవిత మొత్తంలో గుండె చప్పుడూ, ఆలోచనల అలజడీ కలగలిపే వాక్యాలు కొన్ని వుంటాయి. ఆ వాక్యాల్లో కవి పొదుపుగా దాచుకున్న అనుభూతి వినిపిస్తుంది. ఈ కవిత మొత్తం సాంద్రతని వొడిసిపట్టుకున్న వాక్యం నాకు అర్థమైనంత మటుకు ఇది:

ఎంత కాలమైనా ఆ పాత చొక్కా చిన్ననాటి వాసనలను
మడతలలో దాస్తున్న మంత్రపు దారప్పోగుల నేత నాకు!!

3

ప్రతి బతుకు పుస్తకంలో అనేక  జ్ఞాపకాలుంటాయి. కొన్ని యిట్టే స్మృతిలోంచి జారిపోతాయి. అవి అలా జారిపోయాయని కూడా మనకి తెలియదు.  అలా జారిపోకుండా పట్టుకోగలిగిన జీవితం ఎక్కువ సఫలమైనట్టు అనుకుంటాను నేను. అలా జారిపోయిన వాటిని పట్టుకొచ్చి మన చేతికిచ్చేది మంచి కవిత అనుకుంటాను. అలాంటి ఎన్ని విస్మృత జ్ఞాపకాల్ని బతికిస్తే అంతగా ఆ కవిత బతుకుతుంది.

ఆ కొలమానంతో ఈ  కవిత – a celebration of the retrieval of a  memory – వొక జ్ఞాపకం బతికొచ్చిన సంబరం!

 – అఫ్సర్