సాహిత్యం నన్నే కాదు ప్రపంచాన్నే ఓదారుస్తుంది:షాజహానా

shajahanaతెలుగు కవిత్వంలో షాజహానా ఒక సంచలన కెరటం. ముస్లిం మహిళల జీవితాల్ని మొదటిసారిగా కవితకెక్కించి అంతర్జాతీయ కీర్తిని అందుకున్న తొలి తెలుగు కవయిత్రి. తండ్రి దిలావర్ గారు స్వయంగా అభ్యుదయ రచయిత. ఆ వారసత్వపు వెలుగు ఆమెపై ప్రసరించినా, ఇప్పుడు తను రాస్తున్న తరహా కవిత్వానికి సంబంధించి , తను స్వయంగా ప్రతి అక్షరమూ దిద్దుకొని వొక కొత్త ఒరవడికి నాంది పలికే దారిలోకి నిస్సంకోచంగా  సాగిపోవడం ఆమెని విశిష్ట కవిగా నిలబెట్టాయి. 2005లో  ‘నఖాబ్’ ముస్లీం స్త్రీ కవిత్వంగా ఆమె కవిత్వం వెలువడినప్పటి నించీ ఆమె ప్రస్తావన లేకుండా సమకాలీన కవిత్వం లేదు. 2006లో  సహచరుడు స్కైబాబతో కలిసి ‘అలావా’ ముస్లీం సంస్కృతి కవిత్వం సంపాదకత్వం వహించారు.  తిరిగి 2009లో స్కైబాబతో  ‘చాంద్‌తార’  – మినీ కవిత్వం వెలువరించారు.  2012లో ‘దర్ది’ కవిత్వ సంపుటి ప్రచురించారు. 10 కథలు, ఎన్నో వ్యాసాలు రాశారు. అవి ఇంకా పుస్తకాలుగా రావలసి వుంది. పి.హెచ్.డి గ్రంధం ‘తెలుగులో ముస్లీంవాద సాహిత్యం’ పుస్తకంగా రాబోతున్నది.   రంగవల్లి మెమోరియల్ కథా అవార్డు, సంస్కృతి పురస్కారం, రంగినేని ఎల్లమ్మ అవార్డు అందుకున్నారు.   భారత ప్రభుత్వం తరఫున గౌరవ అతిథిగా ఫ్రాంక్‌ఫర్ట్ బుక్‌ఫేర్ (జర్మనీ)కి వెళ్ళారు. మాస్కో బుక్‌ఫేర్ (రష్యా)  కవితా పఠనం చేసారు.

 

మీ బాల్యం, కుటుంబం, చదువు గురించి చెప్పండి.

-నా చిన్నపుడు మా నాన్న ఉద్యోగరీత్యా ట్రాన్స్‌ఫర్లయి ఊర్లు మారుతుండడంతో ఎప్పటికప్పుడు మిత్రురాళ్లను కోల్పోయి ఒక్కదాన్నే ఎక్కువగా గడిపేదాన్ని. ఎక్కువగా పుస్తకాలు చదువుతూ ఉండేదాన్ని. న్యూస్‌ పేపర్‌లలో నాకిష్టమైనవి చదువుతూ ఉండేదాన్ని. చదువు మామూలుగానే చదివేదాన్ని. తెలుగులో, సైన్స్‌లో మాత్రం ఎక్కువ మార్కులు వచ్చేయి. అవి రెండు నాకు ఇష్టమైన సబ్జెక్ట్‌లు. లెక్కలన్నా ఇంగ్లీషన్నా కష్టంగా అనిపించేది. మా నాన్న దిలావర్‌. తెలుగులో ప్రసిద్ధ కవి, కథకులు, విమర్శకులు. తెలుగు లెక్చరర్‌గా రిటైర్‌ అయ్యారు. అమ్మ యాకూబ్బి. అక్క షంషాద్‌ బేగం. అన్న అక్బర్‌. నా సహచరుడు స్కైబాబ. అతను ప్రసిద్ధ కవి, కథకుడు.

Dardee

మీ సాహిత్య రంగ ప్రవేశం ఎప్పుడు, ఎలా జరిగింది?

– సాహిత్య రంగంలోకి చిన్నపుడే ప్రవేశించాను. ఏడవ తరగతిలో ఉండగా కవితలు రాశాను. అవి చాలా రోజుల వరకు ఎవరికీ చూపించలేదు. తరువాత మా ఆపా (అక్కయ్య) చూసి మా అబ్బా (నాన్న)కి చూపించింది. అబ్బా వాటిని బావున్నాయి అని మెచ్చుకున్నారు. నా మొదటి కవిత ‘ఎర’. తరువాత చాలా రాశాను. స్కూల్‌ మ్యాగజైన్‌లో అచ్చయ్యాయి. పదవ తరగతిలో ఉండగా అనాధ అనే కవితను భారతి (ప్రముఖ సాహిత్య మాస పత్రిక)కి పంపించాను. సెలక్టయ్యింది.. కానీ అది అచ్చుకాకుండానే భారతి మూతపడింది. దాంతో నేను కొన్నాళ్లు మౌనంగానే ఉన్నాను. 1997 నుంచి ముస్లిం స్త్రీల గురించి రాసిన కవితలే నా అసలైన అస్తిత్వంగా భావిస్తున్నాను.

మీ రచనల నేపథ్యం ఏమిటి?

– నా రచనల నేపథ్యం సమాజంలో ఉన్న అసమానతలు. ముస్లిం స్త్రీల పట్ల పురుషులు చూపించే అసమానతలు.. ముస్లింల పట్ల హిందూత్వవాదులు చూపించే అసమానతలు.. పేద రాజ్యాల పట్ల అగ్రరాజ్యాలు చూపించే అసమానతలు,  కులం పేర, మతం పేర స్త్రీల మీద కొనసాగుతున్న అణచివేత, వివక్ష.

ముస్లిం రచయిత్రులకు, అన్య రచయిత్రులకు ఉన్న తేడా ఏమిటి?

– ముస్లిం స్త్రీలు ముస్లిం స్త్రీల గురించి రాస్తున్నారు. ఇతర స్త్రీల గురించి కూడా రాస్తున్నారు.  ముస్లిమేతర స్త్రీవాదులు ముస్లిం స్త్రీల గురించి రాసింది తక్కువ. అయితే వారు ఎదుర్కొంటున్న అణచివేతల కన్నా ముస్లిం స్త్రీలు హిందూత్వవాదుల నుంచి, బ్రాహ్మణీయవాదుల నుంచి అదనపు అణచివేతను ఎదుర్కొంటున్నారు.

డాక్టరేటు పట్టా అందుకుంటూ షాజహానా

డాక్టరేటు పట్టా అందుకుంటూ షాజహానా

మీ రచనల నేపథ్యంలో తెలుగు స్త్రీవాద సాహిత్యాన్ని మీరెలా వ్యాఖ్యానిస్తారు? మీ నఖాబ్‌ అచ్చు అయినప్పుడు స్త్రీవాద, ఇతర విమర్శకులు ఎలా స్పందించారు?

– నేను స్త్రీవాద రచనల నుంచి కూడా ఇన్‌స్పైర్‌ అయ్యాను. కాకపోతే నఖాబ్‌ పబ్లిష్‌ అయినపుడు కొందరు స్త్రీవాద విమర్శకులు జీర్ణం చేసుకోలేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. కవితల్లో ఉండే ఉర్దూ మాటల్ని విమర్శించారు. మిగిలిన విమర్శకులు మంచిగానే స్పందించారు. బురఖా, తలాక్‌లు కాక చాలా వాటి గురించి నఖాబ్‌లో రాశాను. కాని విమర్శకులు ప్రధానంగా వాటినే చూశారు.

తెలుగులో స్త్రీ సాహిత్యం, పురుష సాహిత్యం అంటూ విడివిడిగా చూసే పద్ధతి ఉందా? ఉన్నట్టైతే అది అవసరమా?

– తెలుగులో స్త్రీ సాహిత్యం పురుష సాహిత్యం అంటూ ఏదీలేదు.. స్త్రీవాద సాహిత్యం పురుషవాద సాహిత్యం ఉన్నాయి. స్త్రీలు బాధిత వర్గం కాబట్టి స్త్రీల సాహిత్యానికి ప్రాముఖ్యత నివ్వడం అవసరం.

ముస్లిం స్త్రీవాదానికి, ముస్లిమేతర స్త్రీవాదానికి తేడాలేమైనా ఉన్నాయా? ఉంటే వాటిని మీరెలా విశ్లేషిస్తారు?

– ముస్లిం స్త్రీలు తమ మతంలోని లోపాలను గురించి రాశారు. ముస్లిమేతర స్త్రీవాదులు మతం ప్రాతిపదికన ఎక్కువగా రాయలేదు. వారు పితృస్వామ్యం గురించి మాత్రమే రాశారు. దానికి మూలమైన బ్రాహ్మణిజం గురించి రాయడం లేదు. ముస్లిం స్త్రీలు తమ సాహిత్యాన్ని స్త్రీవాదం అనడాన్ని ఒప్పుకోవడం లేదు. స్త్రీవాద స్థాయిలో ముస్లిం స్త్రీల గురించి రాసే పరిస్థితి ప్రస్తుతం లేదని మా భావన.

హిందూ ముస్లింల నడుమ అనుమానాలెందుకు పుడుతున్నాయి? దీనికి కారకులెవరు?

– హిందూ ముస్లింలు నిజానికి కలిసిమెలిసి ఉంటారు.. రాజకీయాల వలనే గొడవలు వస్తున్నాయి. ఇరు వర్గాలకు కూడా తమ మూలాలు, చరిత్ర, సామాజిక పరిస్థితుల పట్ల అవగాహన లేకపోవడం వల్లనే ఈ గ్యాప్‌ పెరుగుతోంది.

వర్తమాన హిందూ ముస్లిం రచయిత్రుల బాధ్యతలేమిటి?

– మతాల గురించి కులాల గురించిన అవగాహన తమ వర్గాల ప్రజలకు కలిగించడం, అపోహలు, అనుమానాలు తొలగించడం, అసమానతల గురించిన రచనలు చేయడం.

ముస్లిం రచయిత్రిగా మీరు ఎదురించిన సమస్యలేమైనా ఉన్నాయా?

– ముస్లిం రచయిత్రిగా నేను రాసిన రచనల్లో తలాక్‌, బురఖా, దూదేకుల స్త్రీల సమస్యలున్నాయి. వాటి పట్ల వ్యతిరేకత వచ్చింది.

సాహిత్య రచనలో మహిళా భాష అనేదుందా…దాని స్వరూపమేమిటి?

– ఉంటుంది కదా. వారి సమస్యలు ప్రత్యేకమైనవి అయినప్పుడు ప్రత్యేకమైన భాషలోనే అవి వ్యక్తీకరించబడతాయి. ఎన్నో కొత్త పదాలు, పదబంధాలు, కొత్త డిక్షన్‌ మనం చూడొచ్చు.

రాష్ట్ర విభజన అవసరమా? ఇందులో రాజకీయమెంత? ప్రజల బాగోగులెంత?

– రాష్ట్ర విభజన అత్యవసరం. సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలు అణగారిపోయారు. ఇప్పటికైనా వారికి స్వయం పాలన, ఆత్మగౌరవం, స్వేచ్ఛ కావాలి. రాజకీయ ప్రయోజనాలు ఎలాగూ ఉంటాయి. ప్రజల బాగోగులు క్రమంగా బలపడతాయి. మళ్లీ అందులోనూ ఆధిపత్య కులాల అధికారం పట్ల పోరాటం కొనసాగాల్సి ఉంది.

మీ కవితల్లో, కథల్లోలాగే తక్కిన ముస్లిం రచయితల రచనల్లోనూ ఉర్దూ పదాలెక్కువ కనబడతాయి. ఎందుకు? దీనివల్ల ప్రయోజనాలేమిటి? ఇది భాషా ఐడెంటిటీ కోసమా?

– కథల్లో, కవితల్లో ఉర్దూ పదాలు ప్రవేశపెట్టడం ముస్లిం వాద సాహిత్యం ప్రత్యేకత. దీనివలన తెలుగు మాట్లాడే ముస్లింలకి తెలుగు భాష కూడా దగ్గరవుతుంది. తెలుగువారికి ఉర్దూ పదాలు దగ్గరవుతాయి. తెలుగు, ఉర్దూ కలగలుపు సంస్కృతిని ఇది ప్రతిబింబిస్తుంది. ఉర్దూ ఒక భారతీయ భాష అనే స్పృహను ముస్లింవాదులు గుర్తుచేస్తున్నారు. చాలామంది ముస్లిం రచయితలు ఇంట్లో ఉర్దూ మాట్లాడతారు. కాని వారికి ఉర్దూ లిపి రాదు. కాబట్టి తెలుగులోనే ఉర్దూ పదాల ప్రయోగం చేసి తెలుగు భాషకు అదనపు శోభను తెచ్చిపెట్టారు.

మీ నఖాబ్‌ కవితలు చదివిన ముస్లింలు, తదితరులు ఎలా రియాక్ట్‌ అయ్యారు?

– నఖాబ్‌ చదివిన వారు హిందువులు చాలా బాగా స్పందించారు. ముస్లింలు చాలా మంది వ్యతిరేకించారు. తెలుగు ముస్లిం రచయితలు, కవులు ఆదరించారు.

తలాఖ్‌ వరమా శాపమా? ఆంధ్రలో తలాఖ్‌ తీసుకున్న మహిళల స్థితిగతులెలా ఉన్నాయి?

– తలాఖ్‌ చాలా సందర్భాలలో స్త్రీలకు శాపమే. అకారణంగా తలాఖ్‌కి గురైన స్త్రీల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వారిలో ఎంతోమంది కోర్టుల చుట్టూ తిరుగుతుంటారు. పురుషులకు అదొక వరమైంది. దాన్ని వాడుకొని రెండో పెళ్లికి వారు తయారవుతున్నారు.

షాజహానా కవిత్వ సంపుటి 'నఖాబ్'

షాజహానా కవిత్వ సంపుటి ‘నఖాబ్’

విద్యాధికత స్త్రీలను రక్షిస్తుందా?

– విద్యాధికత స్త్రీలను రక్షిస్తుంది… చాలా వరకు. ముస్లింలు చదువు లేక వెనుకబడిపోయారు. ముఖ్యంగా ముస్లిం స్త్రీల వెనుకబాటుతనానికి చదువు లేకపోవడం ఒక కారణం. చదువుకొని భార్యాభర్త ఉద్యోగాలు చేస్తేగాని ఈ రోజుల్లో బతకలేము. అలాంటిది ఒక పురుషుడే సంపాదిస్తే ఇల్లంతా గడవడం కష్టం. చదువుల వల్ల ఉద్యోగాలు రావడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. స్త్రీలు తమ హక్కులు తెలుసుకొని తమను వంచించే పురుషులతో పోరాడే నైతిక స్థైర్యాన్ని చదువు వారికి అందించే అవకాశముంది.

సాహిత్యం మిమ్మల్ని ఎలా ఓదారుస్తుంది?

– సాహిత్యం నన్నే కాదు ప్రపంచాన్నే ఓదారుస్తుంది. నా చుట్టూ ఉన్న సమస్యలకు సాహిత్యంలోనే సమాధానాలు దొరికేవి. సాహిత్యమే నన్ను నిలబెట్టింది. ప్రపంచం తెలిసి వచ్చింది. మనసులో బాధగా ఉన్నప్పుడు పుస్తకాలే తోడు.

నేటి తెలుగు కవిత్వంపై మీ అభిప్రాయం?

– శతాబ్దాలు కొనసాగిన బ్రాహ్మణీయ సాహిత్యం తర్వాత కొన్ని థాబ్దాలుగా దళితులు, స్త్రీలు, ముస్లింలు, బీసీలు సాహిత్యంలోకి వచ్చారు. వారి కవిత్వంతో నేడు తెలుగు సాహిత్యం సారవంతమైంది. బలమైన కవిత్వం, కథలు స్త్రీ, దళిత, ముస్లింవాదాల నుంచి వచ్చాయి.

మీ కవితలు ఏ ఏ భాషల్లోకి అనువదించబడ్డాయి?

– నా కవితలు ఇంగ్లీష్‌, జర్మనీ, హిందీ, కన్నడ భాషల్లోకి అనువదించబడ్డాయి.

పూర్వం ముస్లిం రచయితల రచనల్లో ఉర్దూ పదాలు చాలా తక్కువగా కనిపిస్తాయి. ఇప్పటివారి రచనల్లో ఎక్కువ. దీనికేమైనా కారణాలున్నాయా?

-ఇప్పటి వారి రచనలు ఎవరి గురించి వారే రాస్తున్న క్రమంలో స్వంత అస్తిత్వాల గురించి రాసే క్రమంలో స్వంత భాషను ఉపయోగిస్తున్నారు. అందు వలన ఉర్దూ పదాలు ఎక్కువగా కనిపిస్తాయి.

చెరబండరాజు, గద్దర్‌, వంగపండులా పాటలు రాసేవారున్నారా?

– పాటలు రాసేవారు తక్కువ. నిసార్‌ అనే ఒక వాగ్గేయకారుడు రాస్తూ పాడుతూ ఉన్నారు. పాటల పుస్తకం వేశారు.

మీరు గజళ్లు ఎందుకు రాయలేదు? మీ తరంలో ఎవరైనా రాస్తున్నారా?

– గజల్‌ ప్రక్రియ ఉర్దూ భాషలోనే బాగా పలుకుతుంది. మా తరానికి ఉర్దూ రాదు కాబట్టి మేమెవరమూ గజల్‌ రాసే ప్రయత్నం చేయలేదు. తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్‌లో దేశంలోనే పేరుపొందిన ఉర్దూ  కవులు ఉన్నారు. వారు ఎంతో రాసివున్నారు.

 

                                                                                                                ఇంటర్వ్యూ: స.రఘునాథ