విభిన్న వస్తు, కోణాల సమాహారం


Katha-15 Cover

పాతికేళ్ల సుదీర్ఘమైన చరిత్ర ఉన్న కథాసాహితి వారి కథాసంకలనాల్లో నేను కూడా ఈ రకంగా ఓ స్థానం సంపాదించుకున్నందుకు కొంత సంతోషంగానూ, కొంత గర్వంగానూ అనిపించినా- ఆ తర్వాత ఆ బాధ్యతని నెత్తిన వేసుకున్న బరువు మాత్రమే తెలిసివచ్చింది. కథల ఎంపిక అనేది అత్యంత సున్నితమైన ప్రక్రియ. మన ఇష్టాయిష్టాలకు అనుగుణంగానే ఎంపిక జరిగినా- అవి చదువరులని చేరి, వాళ్ల ఆలోచనల్లో రేపవలసిన అవసరమైన కల్లోలాలని ఊహించి మరీ కథలని ఎంపిక చేయడం చాలా కష్టమైన పని. అందరూ చర్చించుకున్న కొన్ని కథలని- ఈ ప్రక్రియలో అదనంగా ఉన్న సామాజిక బాధ్యత దృష్ట్యా- పక్కన పెట్టేయాల్సి రావడం కూడా బాధాకరమైన పనే!

ఈ కథాసంపుటాన్ని తయారుచేయడంలో, 2015 సంవత్సరంలో 42 పత్రికలలో వచ్చిన 1780 కథలని పరిశీలించాం. వచ్చిన కథలని ఎప్పటికప్పుడు చదువుతూ ఉండటం వల్ల, ప్రతి కథకీ దానికి తగినంత సమయం కేటాయించడం జరిగింది. ఇంత ప్రక్రియ తరువాత, చివరి వడపోతలో కేవలం 12 కథలు మాత్రమే మిగలడం కొంత నిరాశని కలిగించడం మాత్రం వాస్తవం.

****

కథకి వస్తువు ఎంత ముఖ్యమో- ఆ కథని ఏ స్వరంతో చెబుతున్నామనేదీ అంతే ముఖ్యం. కథని రచయిత తను అనుకున్న పద్ధతిలో పాఠకుడికి చేర్చగలిగింది ఈ కంఠస్వరమే. ఆ స్వరం వైరుధ్యాలు లేకుండా ఉంటే, ఆ సూటితనాన్ని పాఠకుడు అప్రయత్నంగానే పసిగట్టగలుగుతాడు. అలాంటి సూటితనం, నిజాయితీ పాఠకుడి మేధస్సుకి సంబంధించిన అన్ని భద్రతా వలయాలనూ ఛేదించుకుని వెళ్లి, తాకవలసిన చోటుని తాకుతుంది. ఈ సంకలనంలో ఉన్న కథల్లో ఆ స్వరరచన ఎలా జరిగింది?

ప్రథమపురుష కథనంలో, ఆ తర్వాత వివిధ పాత్రల దృష్టికోణంలో నడిచిన చివరి చర్మకారుడూ లేడు… కథలో పాత్రలని బట్టి స్వరం మారడం గమనించవచ్చు. కథలో రచయిత వీలైనంత తక్కువ జోక్యం చేసుకుని, కథని మొత్తం నేపథ్యంలో ఉన్న డాక్యుమెంటరీలాగా నడుపుతారు. రచయిత పాటిస్తున్న ఈ దూరం వల్ల పాఠకుడు కథలో మరింత శ్రద్ధగా లీనమవ్వడానికి అవకాశం కలుగుతుంది. ఇలాంటి ముక్తసరి కథనమే సావిత్రి కథలో కూడా గమనించవచ్చు. క్లుప్తమైన కథనం, సన్నివేశాల్లో మరింత బరువుని నింపుతుంది. చిత్తూరు మాండలీకంలో ఓ హోరుగా సాగే రాతిమిద్దాయన చిన్న కుమార్తె కథన ప్రవాహం, చివర్లో ఓ ఆశ్చర్యకరమైన క్షణంలో ఆగిపోతుంది. అక్కడ ఆ పాత్రకి లభించిన ఎపిఫనీ తాలూకు నిశ్శబ్దాన్ని, అంతవరకూ సాగిన హోరు వల్ల పాఠకుడు మరింత ఆస్వాదించగలుగుతాడు.

తొమ్మిదో నెంబరు చంద్రుడు కథలో కథకురాలి స్వరం ఇప్పటి తరం తాలూకు తాజా స్వరం. ఆ స్వరం వల్ల ఆ పాత్రని గుర్తించడానికీ, ఆ పాత్ర భావావేశాలపట్ల అవగాహనని ఏర్పరచుకోవడానికీ పాఠకుడికి ఎక్కువ సమయం పట్టదు. చివరివరకూ సాధికారికంగా, అద్భుతంగా సాగే ఆ స్వరమే ఈ కథకి ప్రత్యేకత. శతపత్ర సుందరి కథ చెప్పే నీలవేణి మానసిక, బౌద్ధిక స్థితి కథ మొదట్లో రెండుమూడు పేరాల్లోనే ఆవిష్కరించబడుతుంది. పాఠకుడిని అలా సిద్ధం చేయడం వల్లా, కథకురాలి స్వరం అదే ప్రశాంతోత్పాత స్థితిలో కొనసాగడం వల్లా ఆ పాత్ర తాలూకు జీవనవిధానం, దానిలో అంతర్గతంగా ఇమిడివున్న సంఘర్షణ పట్ల పాఠకుడి కుతూహలం చివరివరకూ కొనసాగుతుంది. చరిత్రకి సంబంధించిన మూడు కోణాలు కథలో ఉత్సుకతని ఎక్కడా చెదరనివ్వకుండా నడపడానికి కారణం కూడా, కథలో కథకుడు ఉపయోగించిన అధిక జోక్యం లేని కంఠస్వరమే!

నెల్లూరు మాండలీకంలో సాగే నేను తోలుమల్లయ్య కొడుకుని కథలో కథకుడు (narrator) ప్రధానపాత్ర భాషలోనే కథని చెప్పడం వల్ల, ఆ పాత్ర పరిస్థితుల పట్ల పాఠకుడు ఆసక్తి చూపగలుగుతాడు. ‘కడగొట్టోళ్ల లోకి కడగొట్టుది ఆడదే,’ అన్న అర్థవంతమైన ఆవేదన కూడా ఆ పాత్ర భాషలోంచి రావడం వల్ల ఆ ఆవేదన మరింత భారవంతంగా ఆవిష్కారమౌతుంది. ఈ స్వరాలన్నీ ఒక ఎత్తైతే, క్రైస్తవ పద్ధతిలో జరిగే వివాహాల గురించీ, ఆ వివరాల గురించీ చెప్పే పరిశుద్ధ వివాహము: మూడో ప్రకటన కథలోని స్వరం విభిన్నమైనది. అన్ని వివరాలను వాస్తవిక స్వరంతో చెబితే ఆ కథ ఒక వ్యాసంలా తయారవుతుంది కాబట్టి, ఈ కథలోని కథకుడి స్వరానికి వ్యంగ్యాన్ని అద్దారు రచయిత. కథలో తను నిరసించదలచుకున్న అంశాన్ని ఎద్దేవా చేయడానికే కాకుండా, కథ మొత్తాన్నీ ఆపకుండా చదివేలా చేయడానికి ఈ వ్యంగ్యం చాలా కీలకమయింది.

తాతిల్‌ కథనంలో ఉపయోగించిన స్వరంలో ఉండే తెలంగాణ మాండలీకపు అమాయకపు స్వచ్చత- కథాంశంలో అంతర్లీనంగా ఉన్న ఆప్యాయతాస్పూర్తిని రెండింతలు చేసి చూపించడానికి సహాయం చేస్తుంది!

****

ఈ సంకలనంలో చర్మకారుల కథలు రెండు ఉన్నాయి. రెండు కథలూ, రెండు విభిన్న వాస్తవాలను చూపిన కథలు. చివరి చర్మకారుడూ లేడు… కథ-సమాజంలో వచ్చిన మార్పుల వల్ల చర్మకారులు ఇప్పుడు కనిపించకపోయినా, ఆ తరువాతి తరాలు ఒక్కొక్క మెట్టూ ఎక్కి సమాజంలో స్థిరపడటాన్ని చూపిస్తుంది. కులవృత్తులు నశించిపోతున్నాయి అనే అర్ధసత్యానికి సమాధానం ఈ కథ. కానీ, నేను తోలుమల్లయ్య కొడుకుని కథలో చెప్పులు కుట్టుకుంటూ బతుకుతున్న మారయ్య పరిస్థితిలో మాత్రం మార్పు లేదు. మార్పేదైనా ఉంటే అది అదనంగా వచ్చి చేరే సమస్యల జాబితానే. అతను ఇంకా సమాధానాలు వెతుక్కుంటూనే ఉన్నాడు. ఈ రెండు కథలూ వాస్తవాన్ని చిత్రీకరించేవే. వాస్తవం అనేది భిన్న పరిస్థితుల్లో ఒకదానితో ఒకటి పొంతన లేకుండా ఎలా ఉండగలదో నిరూపిస్తాయి ఈ రెండు కథలూ.
చరిత్ర ఆధారంగా రాయబడిన రెండు కథలు ఈ సంకలనంలో చోటుచేసు కున్నాయి. ఆంగ్లేయుల పాలనలో సర్వే పనుల నేపథ్యంలో రాయబడ్డ మూడు కోణాలు మంచి సమగ్రమైన కథ. కథలో అన్ని పాత్రల అన్ని కోణాలనూ అవసరమైనంతమేరకు స్పృశించే ఈ కథ- ముగింపులో భారతీయుల గురించి ఒక వాస్తవికమైన పరిశీలన చేస్తుంది. ‘నైపుణ్యం ఉన్నచోట శాస్త్రం లేదు; శాస్త్రం ఉన్నచోట నైపుణ్యం లేదు…’ అని. ఆ పరిస్థితిలో ఇప్పటికీ చెప్పుకోదగిన మార్పు లేకపోవడమే ఈ కథ తాలూకు వర్తమానత. అందుకే డుంబ్రిలాంటి వాళ్లు, తోలు మల్లయ్య కొడుకు మారయ్యలాంటి వాళ్లు అలాంటి పరిస్థితుల్లోనే చిక్కుబడి పోయి వుంటారు. తెలంగాణ ప్రాంతంలో గతంలో జరిగిన చెరువుల అభివృద్ధి, దాని వెనక ఉన్న సాంకేతికమైన శాస్త్రీయతా అంతా కాలగర్భంలో కలిసిపోయి, నీరెటుకాడి కల కథలో పెద్దయ్యలాంటి వాళ్లని జీవన్మృతులుగా మిగిల్చింది. వాళ్ల ఆశ తీరదు, కోరిక చావదు, కలలు నిలవనీయవు, జీవితం బతకనీయదు! తెలంగాణ ప్రాంతంలోని బతుకమ్మల నేపథ్యంలో వచ్చిన అంటరాని బతుకమ్మ మరో మంచి కథ. ఉద్యమాలనాడు బతుకమ్మలు ఆడటానికి అడ్డురాని కులాలు, ఆ ఉద్యమం కాస్తా దాటుకుని ఇప్పుడు జీవితాలు స్థిరపడ్డాక, మళ్లీ యథాప్రకారం కొనసాగుతున్నాయి. రాజకీయాల అవకాశవాదాన్ని, వ్యక్తిగత భావావేశాల నేపథ్యంలో విమర్శించిన కథ ఇది.

రైతుల కథలు ఎన్ని వచ్చినా ఇంకా రాయబడని కథలు మిగిలే ఉంటాయి. ప్రకృతీ, ప్రభుత్వాలూ, పీడకులూ- అందరివల్లా దగా పడుతున్న రైతు క్షోభకి ఎన్ని కోణాలున్నాయి? ఆత్మహత్యే శరణ్యం అని పరిస్థితులు సూచిస్తున్నా, లేచి నిలబడి చుట్టూ చూసి స్థైర్యం తెచ్చుకున్న నారాయణ కథ ఊరవతల ఊడలమర్రి.
కుటుంబ నేపథ్యంలో వచ్చిన కథలు రెండు ఉన్నాయి ఈ సంకలనంలో. అభద్రతతో, అశాంతితో బతకడం కంటే, కొంత త్యాగం చేసైనా సరే (ఆ త్యాగమైనా తన తోబుట్టువు కోసమే కదా!) వాటిని వదిలించుకోవడం మంచిదన్న తాత్వికస్థితికి చేరుకోవడానికి ముందు రాతిమిద్దాయన చిన్నకుమార్తె కథలో నాగేస్పరి చాలా ప్రయాణమే చేసింది. చివరికి- వొళ్లు దెలవకుండా నిద్రపోగల సులువుని తెలుసుకోగలిగింది. అలాగే, మనుషుల్లోనూ, సమాజంలోనూ ఉండే నెగటివ్‌ ధోరణుల నేపథ్యంలో ఎక్కువగా సాగే కథల మధ్య తాతిల్‌ కథ కుటుంబంలో ఉండే అనురాగాలకి సంబంధించిన ఆహ్లాదకరమైన కథ. ప్రత్యేకంగా కనిపిస్తుంది.

ఈ సంకలనంలో స్త్రీవాదం పునాదిగా మూడు మంచి కథలు ఉన్నాయి. ఉపరితలంలో పొసెసివ్‌నెస్‌గా కనిపించే సదాశివ ప్రేమ వెనకాల నిజాయితే ఉందో, ముందరికాళ్లకు బంధం వేసే తెలివితేటలే ఉన్నాయో నీలవేణికి తెలీదు శతపత్ర సుందరి కథలో. బహుశా, ఆమెకి స్త్రీ సహజమైన ఓర్పు, క్షమ, ప్రేమలాంటి ‘బలహీనతలు’ ఉన్నంతకాలం, సదాశివకి తన ఆధిక్యం ప్రదర్శించడానికి అవకాశం దొరుకుతూనే ఉంటుంది. ఈ  ఆటలో  తెలిసో,  తెలీకుండానో  ఓడిపోతూనే ఉండే నీలవేణిలాంటి స్త్రీలకి ఉన్న ఏకైక బలం- మారాకులు వేయగలగడం. అందుకే ఆమె శతపత్ర సుందరి. వచనానికీ, కవిత్వానికీ మధ్య హద్దులు చెరిపేసి, అతి క్లుప్తమైన కథనంతో, స్త్రీపురుష సంబంధాల గురించి పలు ప్రశ్నలు రేపి ఆలోచింపజేసే కథ ఇది. ఈ తరానికి చెందిన మోహిత, తన అస్తిత్వాన్ని తను సంపూర్ణంగా ప్రేమించుకుంటూ, తనని తను ప్రేమించుకోవడంలోనే తన అస్తిత్వం దాగివుందన్న నిజాన్ని గ్రహిస్తుంది తొమ్మిదో నెంబరు చంద్రుడు కథలో. పోగొట్టుకోవడం అంటే ఓడిపోవడం కాదన్న నిజాన్ని కూడా గ్రహిస్తుంది, అందుకే ముగింపులో ధైర్యంగా అందర్నీ పక్కకి తోసేసి నడుస్తుంది. నిడివి విషయంలో కొంచెం పెద్దదే అనిపించినా, రాసిన ప్రతి వాక్యం చదివించగల శక్తి ఉన్నదవ డంతో కథనం చురుగ్గా సాగిపోతుంది. ఉద్యమాల నేపథ్యంలో రాసిన సావిత్రి కథలోని ఆ పాత్ర జీవితం ఏమిటో తెలుసుకునేలోపలే తన ప్రమేయం లేకుండానే అది తన చేతిలోంచి జారిపోయింది. భర్త పోరాటాలని కొంతవరకూ అర్థం చేసుకోగలిగినా, జీవితం తాలూకు వాస్తవికత సృష్టించే అవరోధాలను అధిగమించడం తన వయసుకీ, శక్తికీ మించిన పనైంది. ‘నువ్వు ఉండటానికి, చనిపోవటానికి మధ్య తేడా కనపడటం లేదయ్యా నాకు…’ అన్న సావిత్రి మాటల్లో ఆమె ఆవేదన వ్యక్తమవుతుంది. జీవితంలో కోరుకున్నది దొరకకపోగా, దొరికింది కూడా చేజార్చుకోవలసి వచ్చిన దైన్యమైన స్థితి. మూడు కథల్లోనూ స్త్రీ జీవితం తాలూకు వివిధ పార్శ్వాలు కనిపిస్తాయి.

****

ఈ సంకలనంలో ఉన్న పన్నెండుగురు కథారచయితలలో ఆరుగురు రచయిత/త్రులు మొదటిసారిగా ఈ కథాసాహితి వార్షిక సంకలనాలలో చోటుచేసుకోవడం విశేషం! ఈ ఆరుగురిలోనూ, ముగ్గురికి ఇదే తొలికథ. అది మరో విశేషం!
ఇలా విభిన్న వస్తు, కథన విశేషాలతో- అట్టడుగు జీవితాల నుంచి ఆధునిక జీవనశైలుల వరకూ ప్రయాణించిన ఈ కథలు మిమ్మల్ని కూడా ఆకట్టుకోవాలని మా ఆకాంక్ష!

హైదరాబాద్‌, 22 ఆగస్ట్‌ 2016

ఆమె అంతరంగం, అతని కథనం!

nadustunna katha

 మే నెల కథలు

మే నెలలో కథల సంఖ్య బాగా పెరిగింది.ఈ వ్యాసం రాస్తున్న ముగ్గురం కలిపి సుమారు 200 కథలు చదివాము. ఒక నెలలో ఇన్ని తెలుగు కథలు వస్తున్నాయా అన్న ఆశ్చర్యం, ఆనందం కథల నాణ్యత విషయంలో కలగటం లేదు. కొన్ని పత్రికలలో వార్తలు, వ్యాసాలు కథలుగా చలామణీ కాగలగడం సంపాదకుల అభిరుచిలేమిని సూచిస్తోందా లేక రచయితలలో అవగాహనాలేమిని సూచిస్తోందా అని బాధపడాల్సిన పరిస్థితి. మొత్తం మీద మొదటి వడపోతలో 26 కథలను ఎన్నుకోని, వాటి గురించి మేము ముగ్గురం కలిసి చర్చించాము. ఆ చర్చల పర్యవసానమే ఈ వ్యాసం. (మా దృష్టికి రాని మంచి కథ ఏదైనా వుంటే సూచించండి. ఈ నెల (జూన్) కథల గురించి మేము జరుపబోయే చర్చలో పాల్గొనాలనుకునేవారికి, సాదర ఆహ్వానం. ఫేస్ బుక్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి)

మే నెలలో కొన్ని చిత్రాలు జరిగాయి. కొంత మంది పురుష రచయితలు స్త్రీల సమస్యను కథాంశంగా ఎన్నుకోని కథలు రాశారు. కాండ్రేగుల శ్రీనివాసరావు “జీవన మాధుర్యం” అన్న కథలో వక్షోజాల కేన్సర్ గురించి రాస్తే, కె. వి. నరేందర్ “డబ్బుసంచీ” అన్న కథలో గర్భసంచి తొలగింపు గురించి రాశారు. “మరుగు” కథలో కూడా స్త్రీల సమస్యనే ప్రస్తావించారు వాణిశ్రీ. అలాగే డా. వి. ఆర్. రాసాని “తృతీయ వర్గం” గురించి కూడా రాయడం గమనింఛవచ్చు.

గత మాసం (ఏప్రిల్ 2014) ప్రముఖ రచయితలు పాత్రలుగా రెండు కథలు వచ్చిన సంగతి ప్రస్తావించాము. ఈ నెల కూడా అలాంటి కథ ఒకటి వచ్చింది. భగవంతం రాసిన “గోధుమరంగు ఆట” కథలో త్రిపుర ఒక కనిపించని పాత్రధారి.

ఇక ఈ నెల కథల్లోకి వెళ్దాం –

సాక్షి: శిరంశెట్టి కాంతారావు

టెక్నాలజీ పెరిగిపోతున్న కారణంగా, సాంప్రదాయక వృత్తుల వాళ్ళు పనులు కోల్పోవడం గత కొన్నేళ్లుగా జరుగుతూ వస్తోంది. అలా వృత్తిని కోల్పోయి, అప్పులు మాత్రం మిగుల్చుకున్న ఓ కాటికాపరి కథ ఇది. ఇలాంటి కథాంశాలపైన గతంలో ఎన్నో కథలు వచ్చినా ఇంతకు ముందూ ఏ రచయితా ఎన్నుకోని కులవృత్తిని ఎన్నుకోవటం వల్ల ఈ కథ కొంతవరకు ప్రత్యేకంగా మారింది. మంచి కథనం, ఇతివృత్తానికి అనుగుణమైన మాండలికం మరింత బలాన్ని ఇచ్చింది. అయితే అవసరాన్ని మించి నిడివి వున్నట్లనిపించింది.

 

మరుగు: వాణిశ్రీ

బలాత్కారం నుంచి తప్పించుకుందో అమ్మాయి. ఆ విషయం పంచాయితీకి వచ్చినప్పుడు అవతలి పక్షం రాజీ కోరారు. దెబ్బతిన్న ఆత్మగౌరవానికి వ్యక్తిగత స్థాయిలో వెల కట్టడం ఎలా? ఈ కథలో సీతారత్నం పాత్ర అలా వ్యక్తిస్థాయిలో ఆలోచించలేదు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో ఆ కారణాల్లోకి వెళ్ళింది. వెళ్ళి, అందరికీ పనికివచ్చే పరిష్కారాల అమలు తనకు చెల్లించాల్సిన మూల్యం అని స్పష్టం చేస్తుంది. వ్యక్తిగత స్థాయిలో జరిగిన అన్యాయానికి సామాజిక స్థాయిలో పరిష్కారాన్ని కోరడమనే కొత్త పరిహారాన్ని చూపించిన కారణంగా, ఇది నలుగురూ చదవాల్సిన కథ అయ్యింది. మంచి ఎత్తుగడ, ముగింపు, సామాజిక స్పృహ, ఇతివృత్తంలో సమకాలీనత, క్లుప్తత. చదివించే కథనం. అందరూ చదవదగ్గ కథ.

 

జీవన మాధుర్యం: కాండ్రేగుల శ్రీనివాసరావు

బ్రెస్ట్ కాన్సర్ కారణంగా ఒక వక్షోజాన్ని తొలగించడంతో వకుళలో అంతర్మథనం మొదలౌతుంది. ఈ అసమగ్ర రూపంలో భర్త తనను ఎలా చూస్తాడు అన్నది ఆమెని వేధించే ప్రశ్న. అయితే, భార్య పోగొట్టుకున్న భౌతికమైన విషయాన్ని లెక్కచేయనంత విశాలహృదయం భర్తకి ఉంది కాబట్టి కథ సుఖాంతంగా ముగుస్తుంది. దానిలో సంభావ్యతే ప్రశ్నార్ధకం. కథలో చూపించినది ఆదర్శవంతమైన పరిష్కారమే అయినా, అలా కాకపోతే ఎమౌతుందీ అన్న కోణం ఎవరికి వారు ఆలోచించుకోవచ్చు. ఒక వినూత్నమైన అంశాన్ని, ఇంకో సున్నితమైన అసంతృప్తి కోణంతో ముడిపెట్టి రాసిన మంచి కథ. వాస్తవికతని కొంచెం హద్దులు దాటించి శృంగారపరమైన అంశాలు స్పృశించడంతో వస్తువులో ఉన్న గాంభీర్యం కొంత చెదిరిపోవడం ఈ కథలో మనం గమనించవచ్చు.

 

సంస్కృతం మాష్టారు ఇస్మాయిల్: సాయి బ్రహ్మానందం గొర్తి

భాషకీ మతానికీ సంబంధం లేదని ఒక వైపు చెపుతూనే – మతం శాశ్వత అనుబంధాల ఏర్పాటుకు ఎలా ఆటంకమవుతుందో చెప్పటానికి ప్రయత్నించిన కథ. ఇస్మాయిల్ అనే ముస్లిం కుర్రవాడు తెలుగుకంటే సంస్కృతమే నయమని విశ్వం మాస్టారి దగ్గర చేరి సంస్కృతం భాషాజ్ఞానమే కాకుండా ఆయన ప్రేమాభిమానాలనీ సంపాదించి చివరకు సంస్కృతంలో ఉన్నత విద్యాభ్యాసం చేస్తాడు. విశ్వం మాస్టారికి ఇస్మాయిల్ అంటే ఎంత అభిమానం అంటే, చివరికి తన మనవడికి ‘ఇస్మాయిల్’ అనే పేరు పెడతారు. అయితే ఈ మనవడు, ఇస్మాయిల్ కూతుర్ని ప్రేమించడంతో మాస్టారు ‘నానా యాగీ’ చేసి శిష్యుణ్ణి దూరం పెడతారు. ఇరుమతాల మధ్యన ప్రేమ, అభిమానాలు ఉండగలిగిన అవకాశాలు ఉన్నా, మతం అనే సరిహద్దు దగ్గర అవన్నీ కనుమరుగైపోతాయన్న కుదుపు లాంటి వాస్తవికతని కథ పాఠకుడికి స్ఫురింపజేస్తుంది. ఈ వాస్తవికతని పట్టుకురావడమే కథలోని మంచి విషయం అనుకుంటూ ఉండగా, కథ ఒక ‘కొసమెరుపు’ లాంటి ఒక అందమైన విషయంతో ముగుస్తుంది. వాస్తవికత వేరు, ప్రేమాభిమానాలు వేరు అని పాఠకుణ్ణి రెండోసారి కుదుపుతుంది. మంచి కథాంశం, వాస్తవిక కథనం. మొదలు ముగింపులలో రచయిత చాకచక్యం గమనించతగ్గవి..

 

డబ్బు సంచీ: కె వి నరేందర్        

కడుపునొప్పికి పరిష్కారంగా గర్భసంచీని తొలగించాలని డాక్టర్లు మాధవికి చెప్పారు. మిత్రురాలి సలహా మీద ఓ ఆయుర్వేద వైద్యుణ్ణి సంప్రదిస్తే, ముందు కొంత వైద్యం చేసి చూద్దాం అంటాడాయన. ఇలా వైద్యం చేద్దామన్న ధోరణి లేకపోగా, సమస్య ఉన్న ప్రతివాళ్ళకీ గర్భసంచీలు తొలగించడం వెనకాల కుట్ర ఏదైనా ఉందా? ఆరోగ్యశ్రీ పథకాలు ఇలా అమలవుతున్నాయా? మరికొంత సమాచారం తెలుసుకున్న మాధవి, దీన్ని రిపోర్ట్ చేసి దర్యాప్తు చేయించాలనుకుంటుంది. శరీరంలోని సమస్యలని వ్యవస్థలోని లొసుగులతో ముడిపెట్టి, సామాజికమైన పరిష్కారం వైపుగా మాధవి ఆలోచించడం బావుంది. కానీ, కథలో కొంత భాగం వ్యాస రూపం సంతరించుకుంది. ఒక వార్త ఆధారం చేసుకుని కొన్ని గణాంకాలను దృష్టిలో పెట్టుకుని రాయడం వల్ల ఈ కథ కొన్ని కథా లక్షణాలను కోల్పోనట్లైంది. ఆ గణాంకాలలో కూడా శస్త్రచికిత్సల సంఖ్యే చెప్పారు తప్ప అవసరం లేకుండా చేసినవెన్ని అనే ముఖ్యమైన విషయంపై దృష్టి పెట్టకపోవడం మరో లోపం.వస్తువు పరంగా ఆలోచింపజేసే కథ అయినా, రూపం విషయంలో మరింత శ్రద్ధ వహించి ఉంటే, కథ స్థాయి చాలా పెరిగి ఉండేది.

 

దో దివానే దో షెహర్ మే: పూర్ణిమ తమ్మిరెడ్డి

మధ్యతరగతి భారతీయుడి సొంతింటి కల! ఆ కల సాధారణ స్థాయిలో ఉన్నా, ఉన్నదానికీ కొనవలసినదానికీ ఉండే గాప్ ఉండనే ఉంటుంది. ఆ కల స్థాయి పెరిగే కొద్దీ ఈ గాప్ పెరుగుతూ ఉంటుంది. అలాంటి ఓ పెద్ద కల కన్న నేటి తరం భార్యాభర్తలు, పెళ్లి అయ్యీ అవగానే, లోన్ వాయిదాలు కట్టడానికి మరింత సంపాదన కావాలి కాబట్టి అలా సంపాదించడం కోసం చెరో దేశంలో ఉంటారు. ప్రేమించి పెళ్ళిచేసుకున్న ఆ జంట మధ్య దూరం తెచ్చిన వ్యధ, కన్నీళ్ళు మిగతా కథ. కథనం చాలా గొప్పగా ఉన్నా, భార్యాభర్తలు స్కైప్ ద్వారా మాట్లాడుకుంటున్నట్లు సృష్టించడం వల్ల, కథంతా ఆ మూసలో ఒదిగే క్రమంలో క్లుప్తత లోపించినట్లుగా అనిపిస్తుంది. కథాంశంలో ఉన్న సంక్లిష్టత స్థాయికి తగ్గట్టుగా కథ నిడివి కూడా వుండి వుండుంటే బాగుండేది.

 

అమ్మ కడుపు చల్లగా: విజయ కర్రా

ఈ కథ గురించి మాట్లేడే ముందు, ఈ కథ వెనుక కథని కూడా తెలుసుకోవడం అవసరం. ఒక రచయిత ఇచ్చిన ఆలోచన ఆధారంగా మరో రచయిత సృష్టించిన కథ ఇది. ప్రక్రియపరంగా కొత్తగానూ, క్లిష్టంగానూ వున్నా విజయ కర్రా ఈ కథని సమర్థవంతంగా చెప్పడమే కాకుండా, మరో రచయిత ఇచ్చిన సమస్యకి ఆశావహమైన, సార్వజనీయమైన పరిష్కారాన్ని ఇవ్వగలిగారు. ఈ ప్రక్రియ ఫేస్ బుక్ లోని “కథ” గ్రూప్ లో జరిగింది.

 

ఓ చిన్న సమస్య మనసులో దూరి, మనసుని తొలుస్తూ మెలిపెడుతూ – మానవత్వపు ప్రాథమిక విలువలని గురించి ప్రశ్నిస్తూ వేధిస్తుంటే? ఓ తాతకి రెండు రూపాయలు దానం చేయలేని రాజుకి పట్టుకున్న సమస్య ఇది. సమస్య పెరిగి పెద్దదైపోయి పెనుభూతమైపోయి, జ్వరం తెచ్చుకొని కలవరించేదాకా వస్తుంది పరిస్థితి. ఈ సమస్య గురించి భార్య తెలుసుకొని, దానికి పరిష్కారం చూపించడం కథాంశం. ఇవ్వకపోవడానికి లక్ష కారణాలుండవచ్చు గానీ, ఇవ్వదలచుకుంటే ఇవ్వాలనే ఒక్క కారణం చాలు అన్న అంశాన్ని చాలా సున్నితంగా చెప్పిన కథ ఇది. కథకి మూల కారణం వృద్ధుడు – కానీ రచయిత్రి అతడి గతం గురించి ఒక్క పేరా మాత్రమే రాస్తుంది. కారణం కథకి వృద్ధుడి వర్తమానం ముఖ్యం. గతం కాదు. అది రచయిత్రి గ్రహించటం, అంతవరకే రాసి వదిలేయటం ఆ పాత్ర చిత్రీకరణంలో ఆమె చూపించిన జాగ్రత్తకి నిదర్శనం. అదే జాగ్రత్త – చంద్రంలో జాలిగుణం, అతడిలో సంఘర్షణ, దాని పట్ల భార్య సహానుభూతి – ఒక పద్ధతి ప్రకారం మోతాదు మించకుండా చిత్రించటంలో కనపడుతుంది. ‘అత్తత్తత్తా అని పగలంతా (చిన్నపిల్లవాడి) ఒకటే పాట, రాత్రేమో తాత.. తాత.. అని నీ కలవరింతలు’ లాంటి సందర్భోచితమైన వాక్యాల కథనం కథకి సరీగ్గా జతపడింది. కథలో చూపించిన పరిష్కారం, జీవితాల్లో చాలా విషయాలకి అన్వయించుకోదగ్గది కావడం వల్ల మంచి కథలని గుర్తుపెట్టుకొనే వాళ్ళ మనసుల్లో కొన్నాళ్ళపాటు ఈ కథ నిలిచి ఉంటుంది.

 

ఇరుకు పదును: బి పి కరుణాకర్

మరణించిన స్నేహితుడి భార్య అంటే రచయితకి ఒక సాఫ్ట్ కార్నర్. కానీ ఆమెకి తన భర్త మీద సదభిప్రాయం ఉండదు. భర్త ప్రవర్తన మీద రకరకాల అనుమానాలతో, కొన్ని ఆధారాలు తెచ్చి భర్త వ్యక్తిత్వం గురించి రచయిత దగ్గర కూపీలు లాగటానికి ప్రయత్నిస్తుంది. తమ స్నేహం కారణంగానో, లేక స్నేహితుడితో సంబంధం వున్న మరో మనిషి పక్కనే వుండటం వల్లో రచయిత ఆ విషయాలు చెప్పడు. కానీ కథ జరుగుతూ ఉండగా స్నేహితుడి భార్య పట్ల రచయిత అభిప్రాయం మారటం చూచాయగా పాఠకుడికి తెలుస్తుంది. ఇన్ని రకాల మానసిక కోణాలకి కథనం తావు ఇచ్చినా ఒక్క కోణం కూడా రచయిత నేరుగా పాఠకుడికి చెప్పకపోవటం కథలో ప్రత్యేకత.

 

చిన్న కథలో రచయిత ప్రతిభావంతంగా చొప్పించిన ప్రశ్నలను గమనించిండి.

 

అత్యంత విషాదకరమైన సన్నివేశంలో ఓ వ్యక్తిని చూసి, మనస్సులో ఎక్కడో ఏర్పరచుకున్న సానుభూతి – ఆ తరువాత ఎప్పుడో ఆ మనిషితో సంభాషించే క్రమంలో ఆవిరైపోతూ ఉండటం ఎలా ఉంటుంది? చనిపోయిన మనిషి గురించి సాక్షాత్తూ ఆ వ్యక్తి భార్యే నిందిస్తూ మాట్లాడుతూ ఉంటే దాన్ని స్వీకరించడం ఎలా ఉంటుంది? చనిపోయిన వ్యక్తితో సంబంధం ఉన్న మరో మహిళ ఇవన్నీ అక్కడే కూచుని వినడం ఎలా ఉంటుంది? అసలు ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ చనిపోయిన వ్యక్తి నిజంగా చేసిన తప్పులేవిటి? ఇప్పుడు అన్నీ అయిపోయాక, ఏది తప్పు, ఏది ఒప్పు? మనుషుల్ని మనం చూసే దృష్టికోణాలు రియల్ టైమ్ లో డైనమిక్ గా మారిపోవడం ఎలా ఉంటుంది? ఇలాంటి ప్రశ్నలకీ; ముగింపు వ్యూహాత్మకంగా, పాఠకుడికి ఊహాత్మకంగా వదిలివేసినందువల్ల ఉత్పన్నమయ్యే మరిన్ని ప్రశ్నలకి ఈ కథలో పాఠకుడే జవాబులు వెతుక్కోవాలి. అది రచయిత, పాఠకుడి తెలివితేటల మీద ఉంచిన నమ్మకం!

 

ఇవి కాక వస్తుపరంగానో, శైలి పరంగానో ప్రస్తావించదగ్గవిగా మేము భావించిన కథలు కొన్ని –

 

24.05.14 త్రిపుర వర్ధంతి సందర్భంగా భగవంతం రాసిన కథ “గోధుమరంగు ఆట”. రచయిత పేరు త్రిపుర పాత్రల్లో ఒకటి కావటం – రచయిత పై త్రిపుర ప్రభావం ఎంతగా ఉందో చెప్పకనే చెపుతుంది. అది అబద్ధం కాదన్నట్లు ఈ కథ పోకడ రుజువు చేస్తుంది. గొప్ప కథనం. అందుకనే కథలో ఇతివృత్తం ఏంటో (అసలు ఉందా?) కథనం తెలియనివ్వదు. ఇది కథకి బలమా?కాదా? అన్న మీమాంస వదిలేస్తే మంచి అనుభూతిని కలగచేసిన ప్రయత్నం. త్రిపుర కథల స్ఫూర్తితో, ‘భగవంతం కోసం‘ కథ ధోరణిలో రాయబడ్డ కథ. త్రిపుర స్మృతికి అంకితం చేయబడ్డ కథ. “ఆకాశంలో నక్షత్రపు జల్లు. భగవంతం రాడు. అట్నుంచి ఏడో నంబర్లోనూ రాడు, ఇట్నుంచి పదమూడో నంబర్లోనూ రాడు. నా పిచ్చి గాని.” అన్న నిరాశతో ముగిసిన ఆనాటి కథ, ఇవాళ రూపాంతరం చెంది “.. కానీ బయట ఆకాశం కింద ఒక అనంతమైన కాల్పనిక వేడుక నాకోసం ఎదురుచూస్తూ ఉంటే – మాటల్తో కాలాన్నెందుకు వృధా చేయడం అనుకుని – హోటల్లోంచి బయటకొచ్చేశాను” అనే నవీన స్ఫూర్తితో ముగియడం ఒక విశేషం!

 

ఈ నెలలోనే వచ్చిన మరో రెండు కథలను కథాప్రేమికులు పరిశీలించాలి. ఈ రెండు కథలు ప్రతీకాత్మకంగా రాసినవి కావటం మాత్రమే ఈ రెండింటి మధ్య వున్న సామీప్యం. వివిన మూర్తి రాసిన “జ్ఞానం కనిపించటం లేదు” కథ సామాజిక పరిస్థితుల మీద చేసిన వ్యాఖ్య అయితే, పూర్ణిమ తమ్మిరెడ్డి రాసిన “ఏనాడు విడిపోని ముడివేసెనే” కథ భార్యాభర్తల మధ్య పల్చబడే అనుబంధం గురించి వివరిస్తుంది.

 

ప్రతీకలతో కథ నడపడం కత్తి మీద సాములాంటిదని ఈ రెండు కథలు చెప్పకనే చెబుతున్నాయి. కత్తి మీద సాము ఎందుకంటే – జటిలంగా ఉన్న ప్రతీకలు సంక్లిష్టమైన పజిల్ లా తయారై, కథ పాఠకుడికి దూరం అవుతుంది. సులభంగా ఊహించగల ప్రతీకలు కథ మీద పాఠకుడికి ఉన్న ఉత్సాహాన్ని నీరుకారుస్తాయి. ప్రతి అంశానికీ ఒక ప్రతీక చొప్పున వాడుకుంటూ పోవడం వల్ల మొత్తం ప్రక్రియ పలుచబారే ప్రమాదం ఉంది. ప్రతీకలతో వున్న మరో సమస్య ఆ ప్రతీకలకు లేని అర్థాన్ని ఆపాదించే ప్రయత్నం. చిత్రకళ నుంచి సాహిత్యంలోకి వచ్చిన ఈ ప్రక్రియలో కొన్ని కొన్ని విషయాలకు ప్రతీకలు దాదాపు నిర్థారితంగా వున్నాయి. వాటిని వేరే అర్థంలో వాడటం వల్ల తెలివిడి కలిగిన పాఠకులకు కూడా కథ కొరుకుడు పడకపోయే సమస్య వుంటుంది. శిల్పంలో విభిన్నమైన ప్రక్రియగా వీటిని వాడటం ముదావహమే గానీ, కథలని ఇంత అస్పష్టంగా చెప్పడం వల్ల ప్రయోజనం ఏముంటుందన్నది పెద్ద ప్రశ్న. (ఏది ఏమైనా ఈ కథలను పాఠకులు చదివి, వారికి స్ఫురించినంత మేర సారాన్ని గ్రహించే అవకాశం వుంది కాబట్టి ఈ కథలు చదివి/చదివిన వారు తమ అభిప్రాయాలను వ్యాఖ్యల రూపంలో చెప్పాలని మనవి)

 

ఈ నెల ఉత్తమ కథ

ఇద్దరి మనుషుల సంభాషణల్లో – వ్యక్తం అయ్యే అంశాలు, అవ్యక్తంగా ఉంచబడ్డ విషయాల మధ్య ఓ సున్నితమైన గాప్ వస్తుంది. ఈ గాప్ ఆ సన్నివేశంలో ఉన్న వ్యక్తులకి అవగాహనలోకి వస్తే, ఆ సంభాషణల్లో ఓ ఇబ్బంది వచ్చిచేరుతుంది. ఇదీ ఈ కథలోని ప్రాథమిక చిత్రం. ఆ సన్నివేశంలో ఇంకో వ్యక్తి కూడా ఉంటేనూ, మరో వ్యక్తి కనబడకుండా ఉంటేనూ ఆ ఇబ్బంది స్థాయి ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుంది. ముఖ్యంగా – ఆ నలుగురు వ్యక్తుల మధ్యనా కొన్ని సంబంధాలో బాంధవ్యాలో మరోటో ఉన్నప్పుడు. ఇదొక సంక్లిష్టమైన చిత్రం. కథగా చెప్పడం కష్టం, చెప్పి ఒప్పించడం ఇంకా కష్టం. అలాంటి బాధ్యతని ప్రతిభావంతంగా నెరవేర్చారు బి పి కరుణాకర్ గారు ‘ఇరుకు పదును’ కథలో. ఎంతవరకూ చెప్పాలో దానికి కొంచెం తక్కువగానే చెప్పి, ఈ కథలో కరుణాకర్ గారు అటు క్లుప్తతనీ ఇటు అనుభూతి ఐక్యతనీ ఏకకాలంలో సాధించగలిగారు. అందువల్లా, పైన చెప్పిన ఇతర కారణాల వల్లా ఈ నెల వచ్చిన కథలలో “ఇరుకు పదును” ఉత్తమకథగా మేము భావించడం జరిగింది.

 

కథా రచయిత బి.పి. కరుణాకర్ గారికి అభినందనలు!! కరుణాకర్ గారితో “ఇరుకు పదును” గురించి సంభాషణ వచ్చేవారం.

 

ఈ వ్యాసంలో ప్రస్తావించిన కథలు:

సం. కథ రచయిత (త్రి) పత్రిక లింక్
1 అమ్మ కడుపు చల్లగా విజయ కర్రా ఆదివారం ఆంధ్రజ్యోతి, మే 4 http://goo.gl/3oY7up
2 ఇరుకు పదును బి. పి. కరుణాకర్ ఆదివారం ఆంధ్రజ్యోతి, మే 18 http://goo.gl/xxUKc5
3 ఏ నాడు విడిపోని ముడి వేసెనే పూర్ణిమ తమ్మిరెడ్డి ఈమాట – మే/జూన్ http://goo.gl/CPe5p6
4 గోధుమరంగు ఆట భగవంతం ఆదివారం ఆంధ్రజ్యోతి, మే 25 http://goo.gl/Adb8oF
5 జీవన మాధుర్యం కాండ్రేగుల శ్రీనివాసరావు నవ్య, మే 14 http://goo.gl/ixJHPR
6 జ్ఞానం కనిపించటంలేదు వివినమూర్తి అరుణతార, మే
7 డబ్బు సంచి కె. వి. నరేందర్ నమస్తే తెలంగాణ, మే 4 http://goo.gl/nsCq6P
8 తృతీయ వర్గం డా. ఆర్. వి. రాసాని నవ్య, మే 21 http://goo.gl/ZZ2TfQ
9 దో దీవానే దో షహర్ మే పూర్ణిమ తమ్మిరెడ్డి కినిగే పత్రిక, మే http://goo.gl/XZ1EpG
10 మరుగు వాణిశ్రీ నవ్య, మే 7 http://goo.gl/LJHBxF
11 సంస్కృతం మాష్టారు ఇస్మాయిల్ సాయిబ్రహ్మానందం గొర్తి ఈమాట, మే/జూన్ http://goo.gl/E5AuQy
12 సాక్షి శిరంశెట్టి కాంతారావు కౌముది, మే http://goo.gl/xiLhrE

– అరిపిరాల సత్యప్రసాద్, ఎ.వి. రమణమూర్తి, టి. చంద్రశేఖర రెడ్డి

aripirala02. T Chandra Sekhara Reddy01. Ramana Murthy

మన కథలలో రాశి తప్ప వాసి ఎక్కడ?

 

nadustunna katha

నడుస్తున్న కథ ఏప్రిల్ కథలు:

ఏప్రిల్ నెల కథల సమీక్ష మీరు ఇప్పుడు చదవబోతున్నారు. ప్రతి నెలా కథలను చదివి ఆ పై నెలలో ఆ కథల సమీక్ష రాయాలని మా సంకల్పం. అయితే కథల సంఖ్య పెరగటం; వ్యక్తిగత, ఉద్యోగ కారణాలవల్ల మా ముగ్గురికి ఏప్రిల్ కథల గురించి చర్చించే అవకాశం కుదరలేదు. ఏ నెలకానెల పాఠకుల పఠనానుభూతి జ్ఞాపకంలో వుండగానే వాటి సమీక్ష చదివితే వారి అనుభవాలనీ, అనుభూతులనీ మా అభిప్రాయాలతో పోల్చుకునే అవకాశం ఈ సందర్భంగా కోల్పోతున్నందుకు మాకూ బాధగానే వుంది. అందుకు పాఠకులకు క్షమాపణలు చెప్పుకుంటూ, రాబోయే వ్యాసాలు సకాలంలో అందించేందుకు కృషి చేస్తామని మనవి చేస్తున్నాము.

 

ఏప్రిల్ నెలలో వచ్చిన దాదాపు నూట డెబ్భై ఐదు కథలను పరిశీలిస్తే ఇప్పుడొస్తున్న తెలుగు కథలు రాశికే కానీ వాసి లెక్కకు రావన్న దిగులు మళ్ళీ కమ్ముకుంటోంది. నెల నెలా పది నుంచి పదిహేను కథలను మంచి కథలుగా పరిచయం చేస్తున్న మేము, ఈ నెల ఆ సంఖ్యను ఏడుకు మించి ఎంత ప్రయత్నించినా పెంచలేకపోవటం బాధాకరం. మా దృష్టిలోకి రాని మంచి కథలు ఒకటో రెండో వున్నా, మా అభిప్రాయాలతో విభేదించి మరో ఒకటి రెండు కథలను పాఠకులు సూచించినా, అవన్నీ కలుపుకుంటే కూడా మొత్తం కథలలో పది శాతం కూడా వుండదు కాబట్టి మేము పైన చెప్పిన వాక్యంలో ఏ మార్పు రాదు. ఇది తెలుగు కథకులు సమీక్షించుకోవాల్సిన విషయం.

 

ఈ నెల వచ్చిన కథలను పరిశీలించే ముందు ఏప్రిల్ నెలలో కొన్ని విశేషాలను గుర్తుచేసుకుందాం –

ఈ నెలలో గురజాడ ఒక పాత్రగా ఒక కథ (తనకు నచ్చిన కానుక: అనంత సురేష్, ఆదివారం ఆంధ్రజ్యోతి 4 ఏప్రిల్), శ్రీపాద ఒక పాత్రగా ఇంకో కథ (“మహావృక్షం”: సింహప్రసాద్, తెలుగువెలుగు) వచ్చాయి. అయితే, ఈ ప్రత్యేకత మినహా కథలు మాత్రం సాధారణంగానే వున్నాయి. అలాగే, ఒకే కథ ఇదే నెలలో రెండు ఇంటర్నెట్ పత్రికలలో రావటం కూడా గుర్తించవచ్చు.

 

ఇక మంచి కథల గురించి –

ఈ నెలలో వచ్చిన మంచి కథలలో వస్తుపరంగా వైవిధ్యం స్పష్టంగా కనపడుతోంది. “పరబ్రహ్మ”, “స్పార్క్” కథలు మంచి కథాంశాన్ని ఎన్నుకోని, ఆ నేపధ్యంలో మనుషుల మధ్య సంబంధాల గురించి చెబితే, “అస్తిత్వం”, “నేను నాన్న బిర్యాని”, “వెడ్డింగ్ ఇన్విటేషన్” వంటి కథలు అనుభూతి ప్రధానంగా నడిచాయి. ఈ కథలలో వున్న కథాంశం చాలా స్వల్పమైనదైనా కథని నడిపించిన విధానంలో ప్రతిభ వల్ల చదవతగ్గ కథలైనాయి. “పేరున్న రాజ్యం”, “తలుపులు” కథలువర్తమాన రాజకీయ పరిస్థితులమీద సంధించిన కథాస్త్రాలు. ఈ కథలన్నింటి గురించి స్థూలంగా పరిచయం చేసుకుందాం.

పరబ్రహ్మ: సింహప్రసాద్

గురువు నేర్పిన చదువుతో గురువునే మించి పోయాననుకునే శిష్యుడు మళ్ళీ గురువు గొప్పదనాన్ని తెలుసుకోవడం కథాంశం. స్వాతి కథల పోటీలో బహుమతి పొందిన ఈ కథని పరిశీలిస్తే కథాంశం పాతదైనా ఒక చెయ్యి తిరిగిన రచయిత చేతిలో ఎంత చక్కగా రూపుదిద్దుకోగలదో అర్థం అవుతుంది. ఇతివృత్తంలో నేటి గురువుల ట్రెండ్ ను ప్రస్తావించటం వల్ల సమకాలీన పరిస్థితులను సూచిస్తోంది. అయితే,కథ ప్రధమార్థంలో శిష్యుడికి గురువు లెక్కలు నేర్పే ప్రక్రియ అవసరాన్ని మించి జరిగిందేమో అనిపించింది.

 

అస్తిత్వం: శిరీష్ ఆదిత్య

ఢిల్లీ నగరంలో ఒంటరిగా వుంటున్న ఓ తెలుగు యువకుడు తెలుగు మాట్లాడే ఓ హోటల్ సర్వర్ తో పరిచయం పెంచుకుంటాడు. ఓనర్ కి తెలియకుండా అతనికి టిప్ ఇవ్వలేని చిన్న డైలమా. అది ఇవ్వకముందే సర్వర్ చనిపోవటం – ఇదీ కథాంశం. జీవితం తాలూకు అభద్రత, అజ్ఞానం, అనిశ్చితీ అసలే కుదిపేస్తున్న ఆ సమయంలో – వెంకటప్ప మరణం జీవితపు క్షణికత్వాన్ని కథకుడికి ఆవిష్కరింపజేసి, నాస్తికుడిగా ఉన్నవాడిని గుడి మెట్ల మీద నిలబెడుతుంది. ఈ కథ కూడా ముందే చెప్పినట్లు మంచి భాష, కథనం వల్ల చదివించేస్తుంది. చివర్లో యువకుడు వేసుకునే ప్రశ్నలు, మధ్యలో వెంకటప్ప వేసే ప్రశ్నలు ఆలోచనలు రేకెత్తిస్తాయి. కథాంశంలో మరి కొంత కసరత్తు చేసివుంటే కథకు కండపుష్టి కలిగుండేది.

 

స్పార్క్ : విజయభాను కోటే

ఒక వైపు నుంచి చూస్తే బాల్యంలో లైంగిక దురాచారానికి బలైన అమ్మాయి ఆత్మస్థైర్యంతో నిలబడిన కథ. అలాంటి పరిస్థితులు ఆ అమ్మాయిల్లో ఎలాంటి నిర్వికారాన్నీ, వ్యధనీ కలగజేస్తాయో వాస్తవికంగా పట్టుకోవడానికి మంచి ప్రయత్నం చేసిన కథ. మరో వైపు నుంచి చూస్తే ఓ కుర్రాడి ఏక పక్ష ప్రేమ కథ. తాను ప్రేమించే అమ్మాయి తిరిగి ప్రేమించకపోతే కోపం తెచ్చుకోకుండా ఎందుకని ఆలోచించిన ప్రేమికుడి కథ. నిజమైన ప్రేమ అంటే అదే అని చాలామంది గ్రహించక పోయినా ఈ కథలో హీరో గ్రహించటం ఈ కథలో విశేషం. ముగింపును కూడా రచయిత్రి అటో ఇటో తొందరపడి తేల్చదు. ప్రయత్నం లేకుండా ఫలితం రాదు కదా అని ప్రశ్నార్ధకంతో వదిలేస్తాడు. అబ్రప్ట్ గా మొదలైన కథ ఇన్‌కంక్లూసివ్ గా ముగియటం కొంత వెలితి అనిపించినా – ‘సర్వ’పాత్ర మనస్తత్వం, జీవన నేపథ్యం దృష్టిలో పెట్టుకుంటే కథకు అంతకన్నా ఆచరణాత్మకమైన ముగింపు సాధ్యం కాదేమో అనిపిస్తుంది.

 

పేరున్న రాజ్యం: పాలపర్తి జ్యోతిష్మతి

సుస్థిర రాజ్యం ఏర్పరచుకున్న ప్రభువులు – అధికారమే పరమావధిగా ప్రజలని ఎలా మభ్యపెట్టి మోసం చేస్తూ ఉంటారనే విషయాన్ని ప్రతీకాత్మకంగా రాసిన కథ. చివరికి విసుగెత్తిన ప్రజలు ఏం చేస్తారన్నది ముగింపు. చాలా విచిత్రంగా, ఈ కథ వచ్చిన కొద్ది రోజులకే మన దేశపు రాజకీయాల్లో ఇలాంటి పరిణామం సంభవించడం కాకతాళీయమే అయినా, ఒక రచన చూడగల వాస్తవ దృష్టికోణాన్ని అది స్పష్టపరుస్తోంది. తను చెప్పదలుచుకున్నది సూచ్యంగా తప్ప వాచ్యంగా చెప్పకూడదనుకున్న రచయిత్రి తనమీద తాను విజయవంతంగా ప్రయోగించుకోగలిగిన నియతి. అంతర్లీనంగా దాగి ఉన్న దారపు పోగును పట్టుకోగలిగితేనే మంచికథ. లేకుంటే మామూలు కథగా అనిపించి బురిడీ కొట్టించగలిగిన కథ.

 

నేను, నాన్న, బిర్యానీ: ఇండ్ల చంద్ర శేఖర్

బిర్యానీ తినాలన్న బలమైన కోరికతో ఇస్మాయేల్ హోటల్ చేరిన ఓ మాష్టారుకి అక్కడ తండ్రి కనిపించడం, ఆయనకు ఆ రోజు ఉదయమే డబ్బులేదని చెప్పిన కారణంగా ఆయన్నుంచి తప్పించుకోవాల్సిన అవసరం. ఈ పరిస్థితిలో కొడుకు ఇంకా ఏమీ తినలేదని తెలుసుకున్న తండ్రి అతన్ని మరో హోటలుకి తీసుకెళ్ళి బిర్యానీ తినిపిస్తాడు. తండ్రి ప్రేమ కలిసిన ఈ బిర్యానీనే అద్భుతంగా అనిపిస్తుంది మేష్టారికి. ‘ఎదిగిన కొడుకు – నిర్లక్ష్యం చేయబడ్డ తండ్రి’ ఇతివృత్తంతో ఇపుడు తామర తంపరగా వస్తున్న కథల్లో ఒక కొత్త కోణం ఆవిష్కరించిన కథ. కొడుకు నిర్లక్ష్యం చేసినా తండ్రి ప్రేమ చెక్కు చెదరదని చెప్పిన కథ. క్లుప్తతతో కథకు ప్రాణం పోసిన రచయిత తాను చెప్పదలుచుకున్నదాన్ని సూచ్యంగా చెప్పటం కథలో విశేషం.

అయితే, మేష్టారు తన ఇన్నేళ్ళ జీవితంలో తండ్రి ప్రేమని ఎప్పుడూ తెలుసుకోలేదా? అలా స్వార్థపరుడిగా ఎందుకు ఉన్నాడు? లాంటి ప్రశ్నలకి ఎలాంటి కార్యకారణసంబంధమూ చూపించకుండా సన్నివేశాలని తనకు కన్వీనియెంట్ గా రచయిత మలచుకోవడం వల్ల కథ తాలూకు సంపూర్ణత్వం కొంత దెబ్బతింది. ఆ విషయాలనీ కథ పరిధిలోకి తీసుకొని వస్తే, అనుభూతిని ఇంకొంచెం ఎక్కువ పండించగలిగి ఉండేది.

 

వెడ్డింగ్ ఇన్విటేషన్: డా. వంశీధర్ రెడ్డి

కథకుడిలో కథని ప్రతిభావంతంగా చెప్పగలిగిన నేర్పు ఉంటే, దానికి ఎక్కడా తడుముకోవాల్సిన అవసరం లేని భాషమీద పట్టు తోడైతే సూది అంత ఇతివృత్తంతో గడ్డిమోపంత కథ ఎలా సృష్టించవచ్చు అనటానికి మంచి ఉదాహరణ. గొప్ప వైవిధ్యం ఉన్న వాతావారణం, దానికి అత్యంత సహజమైన కథన ధోరణీ, కథ చెప్పడంలో అనుసరించిన ఒక మోనోలాగ్ లాంటి ప్రక్రియా, అందులో చెణుకులూ మరికొన్ని మెరుపులూ – ఇవన్నీ కథని నిస్సందేహంగా ఒక గొప్ప కథగా మలిచాయి.

విమర్శకులలో, విశ్లేషకులలో తప్పకుండా చర్చ లేవనెత్తే కథ ఇది. కథలో సహజత్వాన్ని ఇంకొంచెం పొడిగించి వాడిన బూతులు కథకి అవసరమా కాదా అన్న అన్ని చర్చల్లోనూ ఈ కథని ఉదహరించుకుండా వుండలేము. సభ్యత ముసుగు వేసుకుని చూస్తే అభ్యంతరకరంగానూ, కథనంలో సహజత్వాన్ని కోరుకునే వారికి ఆశ్చర్యకరమైనంత సహజంగా కనిపించే కథ. డాక్టర్ వంశీధర్ రెడ్డిని కథారూపం పరంగా ప్రత్యేకంగా ప్రశంసించాల్సిన కథ.

ఇన్ని విశేషణాలున్న ఈ కథ, ఒక విధివిలాసపు కథ కాకుండా, ఒక నిర్దుష్టమైన ప్రయోజనాన్ని, జీవితానికి సంబంధించిన ఏదైనా విశేషాన్ని అందించగలిగిన ఉద్దేశాన్నీ కూడా కలగలపుకొని ఉన్నట్టయితే, ఇంకొంత మంచి కథ కచ్చితంగా అయి ఉండేది.

 

తలుపులు: పెద్దింటి అశోక్ కుమార్

తెలంగాణ ఉద్యమం విజయవంతమైన తరువాత జరిగిన ఎన్నికల నేపధ్యంలో రాయబడిన కథ. కథకు సహజమైన తెలంగాణ మాండలికంలో రాయబడింది. పేదరికంతో పాటుతుఫాను చలిగాలి కూడా కమ్ముకున్న ఒక కుటుంబం గురించిన కథ. ఆ చలినుంచి చెల్లెల్ని కాపాడటం కోసం ఒక ఫ్లెక్సీని దొంగతనంగా తీసుకొచ్చి, తలుపుల్లేని ఆ ఇంటికి కొంత రక్షణ కల్పించాలి అనే ఆలోచనలో ఉన్న ఒక అన్న కథ. తీరా దాన్ని తెంపుకొని వచ్చాక, సదరు రాజకీయ పార్టీ కార్యకర్తలు నానా యాగీ చేసి ఆ కుర్రాణ్ణి కొట్టి ఫ్లెక్సీ లాక్కెళ్తారు. మంచి ఎత్తుగడ, పాఠకుడి దృష్టిని పక్కకు పోనివ్వని ముగింపు. ఇతివృత్తంలో సమకాలీనత. దానికి అనుగుణమైన భాష, కొరడా కొసలా చెళ్లుమనే ముగింపు. మంచి కథకి ఉండాల్సిన లక్షణాలు అన్నీ పుణికిపుచ్చుకున్న కథ.

 

ఇవీ ఏప్రిల్ లో వచ్చిన కొన్ని మంచి కథలు. ఈ కథలలో ఉత్తమమైన కథ కోసం పరిశీలించినప్పుడు, ఈ వ్యాసకర్తలు ముగ్గురూ ఏకగ్రీవంగా ఎన్నుకున్న కథ తలుపులు”.అశోక్ కుమార్ గారి రచన ఆ ఉద్యమస్ఫూర్తిని సజీవంగానే వుంచుతూ, ఉద్యమానంతర పరిస్థితిని ఎంతో బాధ్యతతో గుర్తు చేస్తుంది.

ఈ కథలో ఆయివు పట్టు ఆ ఫ్లెక్సీ మీద వున్న బొమ్మ. ఏ పసిపిల్లాడు చెల్లెలిని చలినుంచి కాచడానికి ఫ్లెక్సీ దొంగతనం చేశాడో ఆ పిల్లాడి తండ్రి బొమ్మే ఆ ఫ్లెక్సీ మీద వుంటుంది. ఆ కుటుంబం తెలంగాణా పోరాటంలో అమరుడైన ఓ వీరుడిది. ఈ విషయం ఎంత బలమైనదంటే కథని ఈ వాక్యంతో ముగించి ఒక ఆశ్చర్యాన్ని, రాజకీయనాయకుల పైన కసిని పాఠకుల మదిలో రగిలించి ముగించవచ్చు.

కానీ, అశోక్ కుమార్ గారు కథని అలాంటి ఒక టెక్నిక్ తో ముగించడానికి ప్రయత్నించలేదు. అదీ ఈ కథలోని నిజాయితీ! గొడవ చేసిన రాజకీయ పార్టీల వాళ్ళు వెళ్ళిపోయాక, తల్లి కొడుకు తల నిమురుతూ, “వీడి పోరాటం ఇంకా మిగిలే ఉంది” అనడంతో కథ ముగుస్తుంది. పోరాటాల వల్ల సాధించాల్సింది సాధించినా, పోరాటాల అనంతరం అందుకోవాల్సిన ఎత్తులు ఇంకా మిగిలే ఉంటాయన్న అన్యాపదేశం ఈ కథ సారాంశం. తెలంగాణా సాధనతో ఆగకుండా రాష్ట్ర నిర్మాణానికి, పేదరిక నిర్మూలనకీ సమాయత్తమవమని స్ఫూర్తిని రగిలిస్తుంది. అందుకే ఈ కథ తెలంగాణ నేపధ్యంలో రాయబడ్డ కథే అయినా అన్ని ప్రాంతాల వారికీ అన్వయం అవుతుంది. ఆ సార్వజనీతే ఈ కథని ఉత్తమ కథగా నిలబెట్టింది.

పెద్దింటి అశోక్ కుమార్ గారికి మరోసారి అభినందనలు!!

 

ఇక చివరిగా – ఈ వ్యాసంలో చర్చించిన కథల లిస్టూ,వీలైనచోట లింకులూ:

తలుపులు: పెద్దింటి అశోక్ కుమార్ (నమస్తే తెలంగాణ బతుకమ్మ, 27 ఏప్రిల్)http://goo.gl/WvdUpt

 

వెడ్డింగ్ ఇన్విటేషన్: వంశీధర్ రెడ్డి (కినిగే పత్రిక, ఏప్రిల్)http://goo.gl/Ud2D9g

 

నేను నాన్న బిర్యాని: చంద్రశేఖర్ ఇండ్ల (సాక్షి ఫన్ డే, 13 ఏప్రిల్)http://goo.gl/uhHZnC

 

పేరున్న రాజ్యం: పాలపర్తి జ్యోతిష్మతి (చినుకు, ఏప్రిల్)

 

స్పార్క్: విజయభాను కోటే(సాహితీ ప్రస్థానం, ఏప్రిల్)http://goo.gl/G69HD8

 

అస్థిత్వం: శిరీష్ ఆదిత్య (కినిగే పత్రిక, ఏప్రిల్)http://goo.gl/k9NkHD

 

పరబ్రహ్మ: సింహప్రసాద్ (స్వాతి వారపత్రిక, 11 ఏప్రిల్)

 

మంచి కథల కోసం ఒక అన్వేషణ!

2 (1)

ఇది ప్రస్తుతం వస్తున్న కథల గురించి మాటా మంతీ. ఒక నెలలో వచ్చిన కథలన్నీ పరిశీలించి, అందులో కొన్ని ఉత్తమమైన కథలని ఎన్నుకోవడం, ఆ కథలను, కథకులను అభినందించుకోవడం ఈ శీర్షిక ప్రధాన ఉద్దేశ్యం.

ఈ పనిని మేము నిర్వహించడానికి కొన్ని ముఖ్యమైన కారణాలున్నాయి.

వాటిల్లో ముఖ్యమైనదీ, మొట్టమొదటిదీ – ఇలాంటి ప్రయత్నం ఈ మధ్య ఏ పత్రికలోనూ జరగకపోవడం! ఏడాది తరువాత కొన్ని పత్రికలు ఒక సింహావలోకనాన్ని వెయ్యడం, కొన్ని సంవత్సర సంకలనాలలో సమీక్షా వ్యాసాలు రాయడం జరిగినప్పటికీ వాటికి ఎక్కువ కథలను స్పృశించే అవకాశం తక్కువ.

ప్రస్తుతం ఉన్న రకరకాల ప్రింట్ పత్రికల్లోనూ, ఆన్‌లైన్ పత్రికల్లోనూ కలిపి సగటున నెలకి దాదాపు నూట యాభై కథల దాకా వస్తున్నాయి. ఏ కథలో ఏముందో, ఏ కథ ఎవరు రాశారో, ఏ మంచి కథ ఎందులో వచ్చిందో, అసలు ఏ పత్రిక ఎప్పుడు వస్తోందో – ఈ విషయాలన్నీ పాఠకులకి ఓ పద్ధతి ప్రకారం చేరడం లేదని కొంతకాలంగా గమనిస్తూనే ఉన్నాం. అసలు పత్రికలు దొరకబుచ్చుకోవటమే ఓ శ్రమగా మారిన తరుణంలో మంచి కథ వచ్చిందని తెలియడం, ఆ పత్రిక కోసం ప్రయత్నం చేసి చదవడం పాఠకుడు చేస్తాడని అనుకోవడం అత్యాశే అవుతుంది. అదీగాక, ఇన్ని వందల కథలని దాటుకునిగానీ ఒక మంచి కథని అందుకునే దాకా పాఠకుడికి ఓపిక ఉంటుందా? అన్నది మరో ప్రశ్న. ఓ మంచి కథ పాఠకుడికి తెలియకుండానే మరుగున పడిపోవడం ఆ కథకీ, రచయితకే కాదు సాహిత్యానికీ సమాజానికి కూడా చెడు చేసినట్లే కదా? అలాంటి ఒక వెలితిని పూరించడం మా ప్రయత్నం తాలూకు మరో లక్ష్యం.

అంతే కాదు – కథల గురించిన మంచీ చెడ్డా మాట్లాడటం ఎవరో ఒకరు మొదలెడితే, అలాంటి సంప్రదాయాన్ని మిగతా పత్రికలు కూడా అనుసరిస్తే – ‘మంచి కథ’ గురించి ఆలోచనా, అవగాహనా, స్పృహా, అభిరుచీ అటు రచయితల్లోనూ, ఇటు పాఠకులలోనూ పెరిగి – మంచి కథలు మరిన్ని రావడానికి దోహదపడగలదన్న ఒక చిరు ఆశ కూడా మా ఈ ప్రయత్నానికి ఒక కారణం.

మంచి కథల వార్షిక సంకలనాలని ప్రచురిస్తున్నవారు, ఆన్‌లైన్ పత్రికల్లో వస్తున్న కథలని ప్రస్తుతం పరిగణనలోకి తీసుకోవడం లేదు. రాసిన కథకి డబ్బు రూపంలో ప్రతిఫలాన్ని ఆశించకుండా ఈ పత్రికలకి రాస్తున్న రచయిత/త్రులకి కనీసం గుర్తింపు రూపంలోనైనా సరైన న్యాయం జరగడం లేదన్న ఉద్దేశంతో, వాటిని కూడా మేము పరిశీలించాలీ అన్న సదుద్దేశంతో కూడా ఈ శీర్షిక ప్రారంభిస్తున్నాం.

***

 

ఇలాంటి ప్రయత్నాన్ని ఏ ఒక్కరో చేస్తే, వ్యక్తిగతమైన మమకారావేశాల వల్ల నిర్ణయాల్లో కొన్ని లోటుపాట్లు జరిగే అవకాశం వుంటుంది. అలాంటి అవాంఛనీయమైన పరిస్థితులు తలెత్తకుండా ఉండటం కోసం ముగ్గురం కలిసి కథలని విడివిడిగా చదివి; వస్తువు, కథానిర్మాణం, శైలి వగైరా అంశాల మీద మార్కులు వేసుకొని; తుది దశలో కథల బాగోగులు చర్చించుకొని మరీ మంచి కథలని నిర్ణయించడం జరుగుతోంది. ఈ మొత్తం ప్రక్రియలో – సబ్జెక్టివిటీ అనే అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టినట్టేనని మేము భావిస్తున్నాం!

ఇంత చేసినా ఇది ముగ్గురి సమిష్టి అభిప్రాయమే తప్ప ఏ విధంగానూ యావత్ పాఠకలోకానికో, సాహితీ ప్రపంచానికో ప్రాతినిధ్యం వహించే నిర్ణయం కాకపోవచ్చు. అలాగే కొన్ని పరిమితుల కారణంగా ఏదైనా మంచి కథ/పత్రిక మా పరిశీలనలోకి రాకపోయే అవకాశం లేకపోలేదు. అంచేత మీ దృష్టిలోకి వచ్చిన మంచి కథ/పత్రికలను మాకు ప్రతిపాదించి మా ప్రయత్నాన్ని ప్రోత్సహించాల్సిందిగా కోరుతున్నాము.

 

***

జనవరి కథలు

జనవరి నెలకు గాను దాదాపు 140 కథలని పరిశీలించడం జరిగింది. ఈ క్రింది పత్రికల్లోని కథలని పరిగణనలోకి తీసుకోవడం జరిగింది:

ఆదివారం అనుబంధాలు: ఈనాడు, ఆంధ్రజ్యోతి, ప్రజాశక్తి, విశాలాంధ్ర, నమస్తే తెలంగాణ, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, సాక్షి, వార్త

 

వారపత్రికలు: జాగృతి, ఆంధ్రభూమి, స్వాతి, నవ్య

 

మాసపత్రికలు: రచన, నది, ఆంధ్రభూమి, చినుకు, తెలుగు వెలుగు, పాలపిట్ట, మిసిమి, స్వాతి, చిత్ర, విపుల, ప్రస్థానం, స్వప్న, ఆంధ్రప్రదేశ్

 

అంతర్జాల పత్రికలు: కౌముది, సారంగ, ఈమాట, వాకిలి, విహంగ, కినిగె, గోతెలుగు

 

కథలన్నీ చదివితే ముందు మన దృష్టిని ఆకర్షించేది – విభిన్నమైన వస్తువులని ఎంచుకోవడంలో రచయితలు చూపిస్తున్న ఆసక్తి. ఈ పరిణామం ముదావహం. సామాజిక నేపథ్యాలు నిరంతరం మారుతూ ఉండే పరిణామక్రమంలో తరచి చూస్తే, కొత్త కొత్త సామాజికాంశాలూ, వైరుధ్యాలూ, మానసిక కోణాలూ కనిపించక మానవు. అలాంటి వస్తువులని ఎన్నుకొని కథల చట్రంలో ప్రతిభావంతంగా బిగించగలిగిననాడు ‘కథ’ అనేది వర్తమానాన్ని అర్థవంతంగా విశ్లేషించుకోవడానికి ఉపయోగపడగల మాధ్యమం అవుతుంది. అలాగే వస్తువు పాతదైనా అందులో కొత్త కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం కూడా గుర్తించతగినదే.

చిత్రం: కృష్ణ అశోక్

చిత్రం: కృష్ణ అశోక్

ఇప్పుడున్న సంక్లిష్టమైన, సందిగ్ధమైన సామాజిక నేపధ్యం అలాంటి వస్తువులనే ఇస్తుంది. అందువల్ల అవి రచయిత అధ్యయనశీలతనీ, శిల్ప సామర్ధ్యాన్నీ పరీక్షకు పెడుతున్నాయి. అయితే, చాలా మంది రచయితలు కొత్త కథాంశాలను అందిపుచ్చుకుంటున్నా, పూర్తిస్థాయి అధ్యయనం లేకపోవడం వల్లో, అనివార్యమైన మమకారావేశాల వల్లనో ఆ కథాంశాలను చిక్కగా, సమగ్రంగా అందిచలేకపోతున్నట్లుగా తోస్తోంది.

 

ఈ నెల వచ్చిన కథలలో చెప్పుకోదగ్గ కథలను విశ్లేషిస్తే –

 

“ప్లాసెంటా” – పెద్దింటి అశోక్ కుమార్ (అమెరికా ఉద్యోగం కోసం చంటి బిడ్డను వదిలించుకోవాలని ప్రయత్నం చేసే తల్లి), “సహజాతాలు” – విహారి (చదువులు, దొరకని ఉద్యోగాలు వల్ల డిప్రెషన్ లు, కొన్ని తప్పని నిర్ణయాలు)  “డేగలు తిరిగే ఆకాశం” – అరిపిరాల సత్యప్రసాద్ (పీడోఫైల్ ప్రపంచంలో ఓ తండ్రి ఆవేదన), “ఇద్దరు బిడ్డల తల్లి” – వేంపల్లె షరీఫ్ (ప్రాంత, మత జనిత ఉచ్ఛారణా దోషాలు కూడా వివక్షకి కారణమే) ఇవన్నీ వస్తువైవిధ్యాలకి ఉదాహరణలుగా నిలిచే కొన్ని కథలు.

 

కథ ప్రయోజనాల అంశాలని కాసేపు పక్కన పెట్టగలిగితే, ప్రశంసార్హమైన కథనశైలితో కథను నడిపిన ఉదాహరణలు కూడా కొన్ని కనిపించాయి. “సాంత్వనములేక” – తాడికొండ కె శివకుమార్ శర్మ (ముక్తపదగ్రస్త అలంకారంలా దుమికే కథనం), “నిద్రకు మెలకువకూ మధ్య” – పలమనేరు బాలాజీ (మిస్టిక్), “అసమయాల అమావాస్య” – సాయిపద్మ (మాంత్రిక వాస్తవికత), “మంచు” – మూలా సుబ్రమణ్యం (మిస్టిక్ మనిషి ప్రధానపాత్రగా). ఈ కథలలో శైలిశిల్పాలు ఎంత బలంగా వుండి చదివించాయో కథాంశం కూడా అంతే బలంగా వుండుంటే అద్భుతమైన కథలుగా మారే అవకాశం వుండేది. శివకుమార్ శర్మ కథ గొప్ప కథకు అడుగు దూరంలో ఆగిపోయింది. ఎంచుకున్న అంశాలను అన్నింటిని ముడి పెట్టడంలో కాస్త జారు ముడి పడిందని మా అభిప్రాయం.

 

కేవలం కథా కథనాలే కాకుండా సామాజిక/వ్యక్తిగత ప్రయోజనం రీత్యా ప్రస్తావించతగ్గ కథలు కొన్ని ఈ నెలలో కనిపించాయి. “ఆకలి” – పెద్దింటి అశోక్ కుమార్, “వారసులు” – జి. ఉమామహేశ్వర్, “ఇదేన్రీ హింగాయ్తూ” – ఓలేటి శ్రీనివాసభాను మెదలైనవి ఈ కోవకు చెందినవే. పాత కథా వస్తువు, సాధారణమైన కథనం ఉన్నప్పటికీ “సొంత సౌఖ్యము కొంత చూసుకు” – సింగరాజు రమాదేవి, (నవ్య, జనవరి 8), “పర్ణశాల” – దర్భా లక్ష్మీ అన్నపూర్ణ (స్వప్న మాసపత్రిక)  వంటి కథలలో పరిష్కారాన్ని కొత్త పుంతలు తొక్కించారు.

 

మొత్తం మీద చాలా కథలు ఆశావహ దృక్పధంతో ముగిసినట్లు, జనవరి కథలు ఆశావహంగానే అనిపించాయని చెప్పి ముగిస్తున్నాం.

 

జనవరి కథలని అనేక అంశాల ప్రాతిపదికన బేరీజు వేసుకుంటూ పోతే, ఈ కథ మా సమిష్టి అధ్యయనంలో జనవరి-2014 కథలలో ఉత్తమమైన కథగా నిలిచింది!

 

ప్లాసెంటా

తెలుగు వెలుగు

రచయిత: పెద్దింటి అశోక్ కుమార్

ఈ కథ గురించి మా విశ్లేషణ, రచయితతో ముఖాముఖి వచ్చే వారం…

 

మంచి ప్రయత్నం చేసిన ఇతర కథలు, పాఠకులు చదివి విశ్లేషించుకోగల వీలుగల మరికొన్ని కథలు:

  • సాంత్వనము లేక తాడికొండ కె. శివకుమార్ శర్మ (వాకిలి, జనవరి)
  • ఆకలి పెద్దింటి అశోక్ కుమార్ (నవ్య 22, జనవరి)
  • నిద్రకు మెలకువకూ మధ్య పలమనేరు బాలాజీ (నవ్య, 22 జనవరి)
  • డేగలు తిరిగే ఆకాశం అరిపిరాల సత్యప్రసాద్ (ఆదివారం ఆంధ్రజ్యోతి, 26 జనవరి)
  • అసమయాల అమావాస్య సాయిపద్మ (ఈమాట, జనవరి ఫిబ్రవరి సంచిక)
  • వారసులు జి. ఉమామహేశ్వర్ (ఆదివారం ఆంధ్రజ్యోతి, 19 జనవరి)
  • ఇద్దరు బిడ్డల తల్లి వేంపల్లె షరీఫ్ (నవ్య, 8 జనవరి)
  • ఇదేన్రీ హింగాయ్తూ ఓలేటి శ్రీనివాసభాను (నవ్య, 15 జనవరి)
  • సహజాతాలు విహారి (నవ్య, 1 జనవరి)
  • మంచు మూలా సుబ్రమణ్యం (ఈమాట, జనవరి-ఫిబ్రవరి)

– అరిపిరాల సత్య ప్రసాద్, ఎ.వి. రమణ మూర్తి, టి. చంద్ర శేఖర రెడ్డి.

   (లోగో :మహీ బెజవాడ)

02. T Chandra Sekhara Reddy03. Aripirala01. Ramana Murthy