నాలుగు కాలాలు నిలిచే కథ రాలేదు — అనిల్ ఎస్. రాయల్

  1. 2016లో వచ్చిన కథల పై వస్తు పరంగా, శిల్ప పరం గా మీ అభిప్రాయాలు?

అభిప్రాయాలు చెప్పేముందో విషయం స్పష్టం చేయాలి. తెలుగులో ఏటేటా వెయ్యికి పైగా కథలు వెలువడతాయని ఓ అంచనా. వాటిలో – 2016లో వచ్చిన కథల్లో – నేనొక వంద చదివి ఉంటానేమో. మిగిలిన వాటిలో మంచివి, గొప్పవి ఉన్నా వాటి ప్రస్తావన నేనిక్కడ తెచ్చే అవకాశం లేదు.

2016లో అమరావతి, ఆత్మహత్య, అసహనం మొదలైన సీజనల్ అంశాల మీద కొన్ని కథలొచ్చాయి. అన్నిట్లోనూ ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. అస్థిత్వవాదాల కథలూ ఎప్పట్లానే చాలా వచ్చాయి. నాలుక్కాలాలు నిలబడేవి వీటిలోనూ దాదాపు లేవు. నాకిష్టమైన సైన్స్ ఫిక్షన్ విభాగంలో మధు చిత్తర్వుగారు రాసినవి రెండు (వాటిలో ఒకటి తర్జుమా కథ) కనబడ్డాయి. ఇక సస్పెన్స్, హారర్, క్రైమ్, డిటెక్టివ్, హాస్యం మొదలైన విభాగాలు అన్నీ కలిపినా ఐదారు కథలకన్నా లేవు. చరిత్ర నేపధ్యంలో ఉణుదుర్తి సుధాకర్ రాసిన ‘ఒక వీడ్కోలు సాయంత్రం’ అనే కథొకటి కనబడింది. మొత్తమ్మీద ఈ ఏడాది వస్తుపరంగా పెద్దగా వైవిధ్యం కనిపించలేదు.

ఇక శిల్పం. వస్తువుతో సంబంధం లేకుండా – పూర్తిగా చదివించగలిగే కథలన్నీ శిల్ప పరంగా నాణ్యమైనవే అనుకుంటే, అలాంటివి నాకు వేళ్లమీద లెక్కబెట్టేటన్ని మాత్రమే తగిలాయి. ఏం చెప్పాలనేదాని మీద పెట్టే శ్రద్ధ ఎలా చెప్పాలనేదానిమీద పెట్టకపోయే అలవాటు ఈ ఏడాదీ కొనసాగింది. ‘Well crafted story’ అనగలిగేది – నేను చదివినవాటిలో – ఒకే ఒకటి తగిలింది.

  1. మీకు నచ్చిన లేదా నచ్చని కథల గురించి కొంచెం వివరంగా –

ఎం. ఎస్.కె. కృష్ణజ్యోతి కథ ‘నా నేల నాకు ఇడిసిపెట్టు సారూ’ ఈ ఏడాది చదివిన కథల్లో నాకు బాగా నచ్చినది. ఇందాక ‘well crafted story’ అన్నాను కదా. ఇదే అది. షరీఫ్ వేంపల్లి ‘దారి తప్పిన కల’ కూడా నచ్చింది.

ఉణుదుర్తి సుధాకర్ రాసిన ‘కొంచెం గెడ్డపు నురగ, ఒక కత్తి గాటు’ కొలకలూరి ఇనాక్ ‘తల లేనోడు’ని గుర్తుకు తెచ్చింది. మంచి కథ. ఇదే రచయిత మరో కథ ‘ఒక వీడ్కోలు సాయంత్రం’ తెలిసిన విషయాలే చెప్పినా పూర్తిగా చదివించింది.

ఇంకా – మెహర్ ‘ఒరాంగుటాన్’, మధు పెమ్మరాజు ‘బౌండరీ దాటిన బాలు’, వెంకట్ సిద్దారెడ్డి ‘కస్తూరి నీడలు’, మన్నె ఏలియా ‘శ్రీమంతుడు’ కూడా బాగున్నాయనిపించిన కథలు. జూపాక సుభద్ర ‘కంపనపడ్డ కాళ్లు’ రొటీన్ కథాంశమే అయినా ఫర్వాలేదనిపించింది.

పైవన్నీ నచ్చిన కథలు అనుకుంటే, తక్కినవన్నీ నచ్చలేదన్నట్లు. వాటి గురించి ప్రత్యేకించి ప్రస్తావించటం అనవసరం.

  1. మీ దృష్టికి వచ్చిన కొత్త కథకులు?

కొత్తో పాతో తెలీదు కానీ – ఉణుదుర్తి సుధాకర్, ఎం. ఎస్. కె. కృష్ణజ్యోతి మరియు వెంకట్ సిద్ధారెడ్డి నుండి భవిష్యత్తులో మరిన్ని మంచి కథలు ఆశించవచ్చు. సరైన కథాంశాలు ఎంచుకుంటే సాంత్వన చీమలమర్రి కూడా మంచి కథలు రాయగలుగుతుంది.

  1. తెలుగు కథా సాహిత్యం లో 2016 లో వచ్చిన కథలు ఎలాంటి మార్పులని సూచిస్తున్నాయి? వ్యక్తిగతంగా, సాంఘికంగా, అంతర్జాతీయంగా వస్తున్న మార్పులని తెలుగు కథలు ఏమైనా స్పృశించ గలిగాయా?

మీరడిగిన మార్పుల్ని ఏదో ఓ స్థాయిలో స్పృశించే కథలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. ఈ ఏడాదీ అంతే. వాటిలో ఎన్ని పాఠకుల్ని స్పృశించగలుగుతున్నాయి అనేది ప్రశ్న. వాటిలో ఎన్ని మరో ఏడాది తర్వాతా గుర్తుంటాయి అనేది ఇంకా పెద్ద ప్రశ్న. సమాధానాలు అంత సంతోషకరంగా లేవు.

నా వరకూ నేను అస్థిత్వవాదాలు, సీజనల్ టాపిక్స్, మొదలైన ‘అజెండా’ కథలే కాకుండా ఇతర విభాగాల్లోనూ చెప్పుకోదగ్గ సంఖ్యలో కథలెప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్నాను. ఆ మార్పు ఈ ఏడాదీ కనపడలేదు.

  1. మంచి కథలు మీరు ఎక్కువగా ఎక్కడ చదువుతున్నారు?

తెలుగునాట వెలువడే అచ్చు పత్రికలు చదివే అవకాశం నాకు లేదు. అంతర్జాలంలో అందుబాటులో ఉన్నవే నేను చదవగలిగేది. ఆంధ్రజ్యోతి, సాక్షి, సారంగ – ఇవి మూడూ తరచూ చదువుతాను. వాటిలో వచ్చేవన్నీ మంచి కథలనలేను కానీ , ఉన్నంతలో ఈ పత్రికల్లో కథల స్థాయి మెరుగ్గా ఉంటుందని నా అభిప్రాయం. కినిగె పత్రిక – మూతపడక ముందు – కొన్ని మంచి కథలు ప్రచురించింది. ఇతర పత్రికల్లోనూ అడపాదడపా మంచి కథలొస్తుంటాయి. అవి ఎవరన్నా రికమెండ్ చేసి లంకెలు పంపిస్తే చదువుతుంటాను.

  1. కథావిమర్శ-2016 మీకు తృప్తినిచ్చిందా?

తెలుగులో నిఖార్సైన విమర్శకులు కరువైపోయినట్లుగా ఉంది. కథకులే విమర్శకుల అవతారాలు ఎత్తటంతో పరస్పర ప్రయోజనాలు అడ్డొచ్చి ఎలాంటి కథకైనా పొగడ్తలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాటిని వదిలేస్తే, విమర్శల పరిస్థితి ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్లుంది. గొప్ప కథలుంటేనే గొప్ప విమర్శలొస్తాయి. గత కొన్నేళ్లుగా జరుగుతున్నట్లే ఈ ఏడాది కూడా – ముఖ్యంగా ‘వాగు స్వాతంత్రం’ ఎక్కువైన వెబ్ పత్రికల్లో – కథల మీద చర్చలకన్నా రచ్చలు ఎక్కువగా జరిగాయి. ఏదైనా నచ్చటం, నచ్చకపోవటం అనేది సబ్జెక్టివ్. కానీ ఓ కథ బాగోలేదనిపిస్తే ఏం బాగోలేదో చెప్పాలి. అది విమర్శ. ఇంకెలా రాస్తే బాగుండేదో కూడా చెబితే అది సద్విమర్శ. వెబ్ కథా చర్చల్లో వ్యాఖ్యాతల మధ్య యుద్ధాలు ఎక్కువగానూ, అసలు సిసలు విమర్శలు అరుదుగానూ కనిపించాయి.

  1. కథాసంకలనాలు తెలుగు కథా ప్రయాణానికి ఏవిధంగా దోహద పడుతున్నాయి?

సంకలనాల్లో ఉన్నవన్నీ గొప్ప కథలు కాకపోయినా, మరీ చెత్త కథలయితే ఉండవు. ఏటేటా వేల సంఖ్యలో కథలొస్తున్నప్పుడు అన్నీ చదవటం ఎంతటి వీర కథాభిమాని తరమూ కాదు. ఏడాదిలో వచ్చిన కథలన్నిట్నీ వడకట్టి ఓ పదో పదిహేనో మంచివిగా ఎంచి కూర్చిన సంకలనంలో అన్నీ కాకపోయినా అధికం పాఠకులకి నచ్చే అవకాశం ఉంది. ఆ విధంగా పాఠకులకి ఈ సంకలనాలు చాలా సమయం ఆదా చేస్తున్నాయి అనుకోవచ్చు. ఓ పత్రికలో అచ్చైన కథ జీవిత కాలం ఒక వారమో నెల రోజులో అనుకుంటే, సంకలనాలు పది కాలాలు పదిలంగా దాచుకునేవి కాబట్టి వాటిలో ఉన్న కథల జీవితం చిరకాలం. అలా – సంకలనాలు పాఠకులకే కాక కథకులకీ మేలు చేస్తున్నాయి.

  1. మీరు చదువుతున్న ఇతర భాషల కథలకు, తెలుగు కథలకు తేడా కనిపిస్తోందా? అయితే అది ఎలాంటి తేడా?

నాకొచ్చిన ఇతర భాష ఆంగ్లం మాత్రమే. ఆ భాషలో- అడపాదడపా చదివే పాత క్లాసిక్ కథలు వదిలేస్తే – వర్తమాన కథలకన్నా సైన్స్, హిస్టరీ అంశాల్లో వచ్చే నాన్ ఫిక్షన్ రచనలు ఎక్కువగా చదువుతాను. కాబట్టి ప్రస్తుతం వస్తోన్న ఆంగ్ల కథల గురించి పెద్దగా తెలీదు. అందుచేత వాటితో తెలుగు కథల్ని పోల్చలేను. అయితే మన కథల్లో వైవిధ్యం తక్కువ అని మాత్రం చెప్పగలను.

సందర్భం వచ్చింది కాబట్టి ఓ సంగతి చెబుతాను. ఈ మధ్య కథాభిమాని, విమర్శకుడు, సంకలనకర్త ఐన ఒక ప్రముఖునితో పిచ్చాపాటి మాట్లాడుతుండగా “తెలుగు కథల్లో వైవిధ్యం తక్కువగా ఉండటానికి కారణం ఏమిటి?” అనే ప్రశ్న వచ్చింది. దానికాయన సమాధానం:

“అమెరికన్లవి, ఆంగ్లేయులవి కడుపు నిండిన జీవితాలు. అందువల్ల వాళ్లు సాహిత్యంలో ఆకలిమంటల్నే కాకుండా అన్ని రకాల అంశాలనీ స్పృశించగలిగే వెసులుబాటు ఉంది. మన భారతీయ సమాజం – ముఖ్యంగా తెలుగు సమాజం – ఇంకా ఆ స్థాయికి రాలేదు. ఇక్కడ సమస్యలెక్కువ. కాబట్టి ఎక్కువ కథలు వాటి చుట్టూనే తిరుగుతుంటాయి”.

నాకా సమాధానం సంతృప్తికరంగా అనిపించలేదు. 1945 – 1989 మధ్య కాలంలో రెండో ప్రపంచ యుద్ధం, దాని తదనంతర పరిస్థితుల్లో అంతులేని అణచివేతకి, అశాంతికి నిలయంగా మారిన పోలండ్ దేశం నుండి, మన తెలుగుతో పోలిస్తే సగం మంది మాత్రమే మాట్లాడే పోలిష్ భాషలో, అరవయ్యేళ్ల క్రితమే ప్రపంచ సైన్స్ ఫిక్షన్ సాహిత్యమ్మీద బలమైన ముద్ర వేసిన Stanislaw Lem వంటి మహా రచయిత రాగలిగినప్పుడు – చుట్టూ ఉన్న సమస్యల కారణంగా ఇతర విభాగాలపైకి కథకుల దృష్టి పోవటం లేదు అనేది సహేతుకమైన కారణం అని నేను ఒప్పుకోలేను.

—-అనిల్ రాయల్ , కథకుడు

రాక్షస గీతం

 

 

-అనిల్ ఎస్. రాయల్

~

 

“Reality is merely an illusion, albeit a very persistent one.” – Albert Einstein

 

—-

చెవులు చిల్లులు పడే శబ్దం. దాన్ననుసరిస్తూ, కాలం నివ్వెరపోయినట్లు క్షణమాత్రపు నిశ్శబ్దం. మరుక్షణం మిన్నంటిన రోదనలు.

దట్టంగా పొగ. చెదురుమదురుగా మంటలు. చిందరవందరైన పరిసరాలు. ఛిద్రమైన శరీరాలు. వాటినుండి రక్తపు చుక్కలు పైకెగరసాగాయి. ఒకటి, రెండు, పది, వంద. చూస్తూండగానే చిక్కబడ్డాయవి. నేలమీంచి నింగిలోకి కుండపోతగా రుధిరవర్షం కురవసాగింది. ఆకాశాన్ని చీలుస్తూ నల్లటి మెరుపొకటి మెరిసింది. సమీపంలో పిడుగు పడింది. దిక్కులు పిక్కటిల్లిన చప్పుడుతో –

దిగ్గున మెలకువొచ్చింది.

ఎప్పుడూ వచ్చేదే. అయినా అలవాటవని కల. పదే పదే అదే దృశ్యం. మానవత్వం మాయమైన మారణహోమం. రక్తంతో రాసిన రాక్షసగీతం.

అది నా ఉనికి దేనికో విప్పి చెప్పిన విస్ఫోటనం.

నిశ్చలంగా పైకప్పుని చూస్తూ పడుకుండిపోయాను – అది కలో, మెలకువో తెలీని అయోమయంలో.

మేలుకోవటమంటే – వాస్తవంలోకి వళ్లు విరుచుకోవటమా, లేక ఒక కలలోంచి మరో కలలోకి కళ్లు తెరుచుకోవటమా?

ఇదీ కలే ఐతే మరి ఏది నిజం?

“నువ్వేది నమ్మితే నీకదే నిజం,” అన్నాడెవరో మేధావి.

నిజమేనేమో. సత్యం సైతం సాపేక్షం! అందుకే లోకమంతా ఈ అరాచకత్వం. ఎవడికి నచ్చింది వాడు నిజంగా నమ్మేసి ఎదుటోడి నెత్తిన రుద్దేసే నైజం. అందులోంచి పుట్టేది ముందుగా పిడివాదం. ఆ తర్వాత అతివాదం. అది ముదిరితే ఉన్మాదం. అదీ ముదిరితే –

ఉగ్రవాదం.

ఆలోచనల్ని బలవంతంగా అవతలకి నెడుతూ మెల్లిగా లేచాను.

 

మరో రోజు మొదలయింది.

 

* * * * * * * *

 

“అవకాశం దొరకాలే కానీ … వాణ్ని అడ్డంగా నరికేసి ఆమెని సొంతం చేసుకుంటా,” అనుకున్నాడు వాడు పెదాలు చప్పరిస్తూ.

ఇరవైలోపే వాడి వయసు. ఇంజనీరింగ్ విద్యార్ధి వాలకం. చిరిగిన జీన్స్, చింపిరి జుత్తు, ఓ చేతిలో సిగరెట్, ఇంకో చేతిలో కాఫీ కప్, వీపున బ్యాక్‌పాక్. నిర్లక్షానికి నిలువెత్తు రూపం. యమహా మీద ఠీవిగా తిష్ఠవేసి నల్ల కళ్లద్దాల మాటునుండి నిష్ఠగా అటే చూస్తున్నాడు.

నేనూ అటు చూశాను. నాలుగు టేబుల్స్ అవతలొక పడుచు జంట. భార్యాభర్తల్లా ఉన్నారు. ఎదురెదురుగా మౌనంగా కూర్చుని ఒకే కప్పులో కాఫీ పంచుకు తాగుతున్నారు. ఆ యువతి సౌందర్యానికి నిర్వచనం. ఆమె భర్త పోతురాజు ప్రతిరూపం.

చింపిరిజుత్తు వైపు చూపు తిప్పాను. వాడింకా పెదాలు చప్పరిస్తూనే మర్డర్ ఎలా చెయ్యాలో, ఆ తర్వాత ఆమెతో ఏం చెయ్యాలో ఆలోచిస్తూన్నాడు. ఆమె వాడికన్నా ఆరేడేళ్లు పెద్దదయ్యుంటుంది. కానీ అది వాడి ఆలోచనలకి అడ్డురాని వివరం. ఈ రకం తరచూ తారసపడేదే. ఊహల్లో చెలరేగటమే తప్ప వాటి అమలుకి తెగించే రకం కాదు. ప్రమాదరహితం.

వాడినొదిలేసి ఆ పక్కనే ఉన్న టేబుల్‌వైపు చూశాను. అక్కడో ముగ్గురు అమ్మాయిలు. ఇవీ కాలేజ్ స్టూడెంట్స్ వాలకాలే. కాఫీకోసం‌ నిరీక్షీస్తూ మొబైల్‌ఫోన్లతో కాలక్షేపం చేస్తున్నారు. అలవాటుగా వాళ్ల బుర్రల్లోకి చూశాను. నిమిషంలోపే అర్ధమైపోయింది. పోసుకోలు కబుర్లు. ఎదురు బొదురుగా కూర్చుని ఒకరితో ఒకరు వాట్సాప్‌లో చాట్ చేస్తున్న నవతరం ప్రతినిధులు. హార్మ్‌లెస్ క్రీచర్స్.

వాళ్లమీంచి దృష్టి అటుగా వెళుతున్న యువకుడి మీదకి మళ్లింది. ముప్పయ్యేళ్లుంటాయేమో. వడివడిగా నడుస్తూ ఫోన్లో మాట్లాడుతున్నాడు. అతడి కవళికలు అనుమానాస్పదంగా తోచాయి. ఏమన్నా విశేషమా? వెంటనే అతడిని స్కాన్ చేశాను. ఫ్యామిలీ మాటర్. పట్టించుకోనవసరం లేదు. మరొకరి మీదకి దృష్టి మరల్చబోతూండగా అతను చటుక్కున ఆగిపోయాడు. నేనూ ఆగిపోయాను. ఆ పక్కనే దట్టంగా విరిసిన పూల మొక్క. అందులో ఒక పువ్వునుండి తేనె గ్రోలుతూ నీలిరంగు బుల్లిపిట్ట. నగరాల్లో అరుదైన దృశ్యం. అంత హడావిడిలోనూ అది చూసి ఆగిపోయాడంటే వీడెవడో భావుకుడిలా ఉన్నాడు. ఆటవిడుపుగా అతడిని గమనించాను. నాకూ కాసేపు కాలక్షేపం కావాలిగా.

అతను ఫోన్ మాట్లాడటం ఆపేసి, అదే ఫోన్‌తో ఆ పిట్టని ఫోటో తీసుకుని, తిరిగి ఫోన్‌లో మాట్లాడుతూ వడి నడక ప్రారంభించాడు. ప్రస్తుతాన్ని చిత్రాల్లో చెరపట్టి ఆస్వాదన భావికి వాయిదావేసే ఆధునిక భావుకుడు!

కాలక్షేపం కట్టిపెట్టి, అతన్నొదిలేసి చుట్టూ పరికించాను – ఆ పరిసరాల్లో అలల్లా తేలుతున్న ఆలోచనల్ని అలవాటుగా పరిశీలిస్తూ, ప్రమాదకరమైనవేమన్నా ఉన్నాయేమోనని అలవోకగా పరీక్షిస్తూ. నగరంలో నలుగురూ చేరే ప్రముఖ ప్రదేశాల్లో స్కానింగ్ చెయ్యటం నా బాధ్యత. సిటీ నడిబొడ్డునున్న పార్కులో, సదా రద్దీగా ఉండే కాఫీ షాపు ముందు అదే పనిలో ఉన్నానిప్పుడు. షాపు ముందు పచ్చటి పచ్చిక బయలు. దాని మీద పాతిక దాకా టేబుళ్లు. వాటి చుట్టూ ముసిరిన జనం. వాళ్ల నీడలు సాయంత్రపు నీరెండలో సాగిపోయి నాట్యమాడుతున్నాయి. వాతావరణం వందలాది ఆలోచనల్తో, వాటినుండి విడుదలైన భావాలతో కంగాళీగా ఉంది. ఆవేశం, ఆక్రోశం, అవమానం, అనుమానం, అసూయ, అపనమ్మకం మొదలైన ప్రతికూల భావనలదే మెజారిటీ. అదేంటోగానీ, మనుషులకి ఆనందం పొందటానికంటే ఆవేదన చెందటానికి, అసంతృప్తిగా ఉండటానికే ఎక్కువ కారణాలు దొరుకుతాయి! అదిగదిగో, అక్కడో అమాయకత్వం, ఇక్కడో అల్పానందం కూడా బిక్కుబిక్కుమంటున్నాయి. ఇవి కాదు నాక్కావలసింది, ఇంతకన్నా ముఖ్యమైనవి – అమానుషమైనవి. అదేంటక్కడ … ఆత్మహత్య తలపు? పట్టించుకోనవసరం లేదు. ఆ మధ్య టేబుల్ దగ్గరున్నోడి తలని అపరాధపుటాలోచనేదో తొలిచేస్తోంది. అదేంటో చూద్దాం. ఇంకాసేపట్లో భార్యని హత్య చెయ్యటానికి కిరాయి హంతకుడిని పురమాయించి ఎలిబీ కోసం ఇక్కడొచ్చి కూర్చున్న అనుమానపు మొగుడి తలపు. అది వాడి వ్యక్తిగత వ్యవహారం. నాకు సంబంధించింది కాదు. ఇలాంటివాటిలో కలగజేసుకుని జరగబోయే నేరాన్ని ఆపాలనే ఉంటుంది. కానీ ఏజెన్సీ ఒప్పుకోదు.

పావుగంట పైగా స్కాన్ చేసినా కలవరపెట్టే ఆలోచనలేవీ కనబడలేదు. అక్కడ రకరకాల మనుషులున్నారు. దాదాపు అందరూ మొబైల్ ఫోన్లలోనూ, టాబ్లెట్లలోనూ ముఖాలు దూర్చేసి ఉన్నారు. పొరుగింటి మనుషుల్ని పలకరించే ఆసక్తి లేకున్నా ముఖపరిచయం లేని మిత్రుల రోజువారీ ముచ్చట్లు మాత్రం క్రమం తప్పక తెలుసుకునేవాళ్లు. అన్ని సమయాల్లోనూ అన్ని విషయాలతోనూ కనెక్టెడ్‌గా ఉండే తహతహతో చుట్టూ ఉన్న ప్రపంచం నుండి డిస్కనెక్ట్ అయిపోయినోళ్లు. ఇ-మెయిళ్లు, ఎస్సెమ్మెస్‌లు, పోస్ట్‌లు, లైక్‌లు, పోక్‌లు, ఫోటోలు, వీడియోలు, ట్వీట్‌లు, ట్యాగ్‌లు, డౌన్‌లోడ్‌లు, అప్‌లోడ్‌లు, యాప్స్, గేమ్స్, ఫీడ్స్ … కిందటి తరం వినైనా ఎరగని విశేషాల్లో, విషాల్లో నిండా మునిగిన జనం. వాస్తవలోకాన్నొదిలేసి ‌సైబర్ వాస్తవంలో ముసుగులు కప్పుకు సంచరించే వెర్రితనం.

 

ముసుగులు. లేనిదెక్కడ?

ఇంటర్నెట్‌లోనే కాదు, ఈ లోకం నిండా ఉందీ ముసుగు మనుషులే. అందరు మనుషులకీ అవతలి వ్యక్తి ముసుగు తొలగించి, వాడి మదిలో మెదిలే వికృతాలోచనల్ని చదివే శక్తి ఉంటే? అప్పుడిక ప్రపంచంలో రహస్యాలుండవు. మోసాలుండవు. ఇన్ని నేరాలుండవు. కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉండవు. మాటతో పనుండదు. పిల్లల మనసెరగని తల్లిదండ్రులుండరు. తలలో పుట్టే తలపులకి మరుగన్నది లేనినాడు భయంతోనో, సిగ్గుతోనో వాటిని నియంత్రించటం మనుషులు నేర్చుకుంటారు. మెరుగుపడతారు. ప్రపంచానికిక నాలాంటివారితో పనుండదు. నా శక్తికేం ప్రత్యేకతుండదు.

శక్తి.

ఈ శక్తి నాకెందుకొచ్చిందో తెలీదు. ఎప్పుడొచ్చిందో మాత్రం లీలగా గుర్తుంది.

 

మొట్టమొదటిసారి నేను చదివింది అమ్మ ఆలోచనల్ని. అప్పుడు నాకు ఐదేళ్లుంటాయి. ఆలోచనల్ని చదవటం అనేదొక అద్భుతమైన విషయమని తెలీని వయసు. యథాలాపంగా అమ్మ మనసులో ఏముందో చదివేసి బయటకు చెప్పేయటం, దానికామె ఆశ్చర్యపడిపోవటం, మళ్లీ చదవమనటం, నేను మరోమారామెని ఆశ్చర్యపరచటం, ఆ సాయంత్రం అంతా ఇద్దరం అదే పనిలో ఉండటం … ఇంతే గుర్తుంది. ఆ వయసులో నాకదొక ఆటలా మాత్రమే తోచింది. తర్వాత మరి కొన్నిసార్లూ అమ్మ ఆలోచనలు చదివి చెప్పాను. అయితే, ఆమె మొదట్లో చూపించిన ఆసక్తి తర్వాత చూపకపోగా చిరాకుపడింది. నేను చిన్నబుచ్చుకున్నాను. ఎందుకో బోధపడకపోయినా, ఆమె ఆలోచనలు నేనలా చదివేయటం అమ్మకి ఇష్టంలేదని అర్థమయింది. దాంతో ఆమె దగ్గర నా శక్తి ప్రదర్శించటం మానేశాను. మొదట్లో అనుమానించినా, మెల్లమెల్లగా ఆమె కూడా నాకా శక్తి ఎంత చిత్రంగా వచ్చిందో అంత చిత్రంగానూ మాయమైపోయిందనుకుని కాలక్రమంలో ఆ విషయం మర్చిపోయింది.

అమ్మకి తెలీని సంగతేంటంటే – నా శక్తి రోజు రోజుకీ పెరిగిపోసాగింది. మొదట్లో ఆమెని మాత్రమే చదవగలిగిన నేను, కాలం గడిచే కొద్దీ ఇతరులనీ చదివేయసాగాను. అతి సమీపంలో ఉన్నవారి నుండి రెండు వందల మీటర్ల రేడియస్‌లో ఉన్న ప్రతి మనిషినీ చదవగలిగేవరకూ నా పరిధి విస్తరించింది. అందరిని చదవటం వల్లనో ఏమో, నాకు వయసుకి మించిన పరిపక్వత అబ్బింది. ఏడేళ్లొచ్చేటప్పటికే ఓ విషయం అర్థమైపోయింది: పరాయి వ్యక్తి తన మస్తిష్కంలోకి చొరబడి అందులో ఏముందో కనిపెట్టేయటం ఏ మనిషీ ఇష్టపడడు. మరి నాకీ శక్తున్న విషయం అందరికీ తెలిసిపోతే? ఇక నన్నెవరూ మనిషిలా చూడరు. నేనంటే భయమే తప్ప ఇష్టం, ప్రేమ ఎవరికీ ఉండవు. ఆ ఆలోచన భరించలేకపోయేవాడిని. అందువల్ల నా వింత శక్తి సంగతి ఎవరికీ తెలియకుండా దాచాలని నిర్ణయించుకున్నాను. దానికోసం చాలా కష్టపడాల్సొచ్చింది. నలుగురిలోకీ వెళ్లటం ఆలస్యం – అన్ని దిక్కులనుండీ ఆలోచనలు కమ్ముకునేవి. కళ్లు మూసుకుంటే లోకాన్ని చూడకుండా ఉండొచ్చుగానీ దాన్ని వినకుండా ఉండలేం. నా వరకూ పరుల ఆలోచనలూ అంతే. వద్దన్నా వచ్చేసి మనోఫలకంపై వాలతాయి. వాటిని ఆపటం నా చేతిలో లేదు. వేలాది జోరీగలు చుట్టుముట్టినట్లు ఒకటే రొద. తల దిమ్మెక్కిపోయేది. తప్పించుకోటానికి ఒకే దారి కనపడింది. ఆ జోరీగల్లో ఒకదాన్నెంచుకుని దాని మీదనే ఫోకస్ చేసేవాడిని. తక్కినవి నేపథ్యంలోకెళ్లి రొదపెట్టేవి. గుడ్డిలో మెల్లగా ఉండేది.

అలా, టీనేజ్‌కొచ్చేసరికి వేల మనసులు చదివేశాను. ఆ క్రమంలో‌ నాకో గొప్ప సత్యం బోధపడింది. కనిపించేదంతా మిథ్య. కనిపించనిదే నిజం. అది ఎవరికీ నచ్చదు. అందుకే ఈ నాటకాలు, బూటకాలు. కని పెంచిన ప్రేమలో ఉండేదీ ‘నా’ అనే స్వార్థమే. స్వచ్ఛమైన ప్రేమ లేనే లేదు. అదుంటే కవిత్వంతో పనుండేది కాదు. పైకి మామూలుగా కనపడే ప్రతి వ్యక్తి లోపలా పూర్తి భిన్నమైన మరో వ్యక్తి దాగుంటాడు. వాడి ఆలోచనలు అనంతం. చేతలు అనూహ్యం. ఆ పుర్రెలో ఎప్పుడు ఏ బుద్ధి ఎందుకు పుడుతుందో వివరించటం అసాధ్యం. మనిషి కళ్లకి కనిపించే విశ్వం – పొడవు, వెడల్పు, లోతు, కాలాలనే పరిధుల మధ్య గిరిగీసి బంధించబడ్డ మరుగుజ్జు లోకమైతే, ఆ పరిధులకవతలుంది మరోప్రపంచం. అది మంచికీ చెడుకీ మధ్య, నలుపుకీ తెలుపుకీ నడుమ, మానవ మస్తిష్కంలో కొలువైన అవధుల్లేని ఊహాలోకం. దాని లోతు కొలవటానికి కాంతి సంవత్సరాలు చాలవు. ఆ చీకటి లోకాల్లోకి నేను తొంగి చూశాను. పువ్వుల్లా విచ్చుకు నవ్వే వదనాల వెనక నక్కిన గాజు ముళ్లు. ఎంత తరచి చూస్తే అంత లోతుగా చీరేసేవి. ఆ బాధ పైకి కనపడకుండా తొక్కిపట్టటమో నరకం. అదో నిరంతర సంఘర్షణ. దాని ధాటికి స్థితిభ్రాంతికి లోనయ్యేవాడిని. చిన్న చిన్న విషయాలు మర్చిపోయేవాడిని. వేర్వేరు సంఘటనల్ని కలగలిపేసి గందరగోళపడిపోయేవాడిని.

అయితే వాటిని మించిన సమస్య వేరే ఉంది. తండ్రి లేకుండా పెరగటాన, అమ్మకి నేనొక్కడినే కావటాన, ఒంటరి నడకలో అలుపెంతో నాకు తెలుసు. ‘నా వాళ్లు’ అనే మాట విలువెంతో మరింత బాగా తెలుసు. కానీ నా శక్తి పుణ్యాన, నా వాళ్లనుకునేవాళ్లంతా లోలోపల నన్నేమనుకుంటున్నారో గ్రహించాక వాళ్లతో అంతకు ముందులా ఉండలేకపోయేవాడిని. ఈ లోకంలో నేనో ఏకాకిగా మిగిలిపోతానేమోననే భయం వెంటాడేది. దానికి విరుగుడుగా – నా వాళ్ల ఆలోచనలు పొరపాటున కూడా చదవకూడదనే నిర్ణయం పుట్టింది. వద్దనుకున్నవారి ఆలోచనల్ని వదిలేయగలిగే నిగ్రహం సాధించటానికి కిందామీదా పడ్డాను. కానీ చివరికి సాధించాను. నా వైట్ లిస్ట్‌లో అతి కొద్ది పేర్లే ఉండేవి.

 

వాటిలో ఒకటి షాహిదా.

తను ఇంజనీరింగ్‌లో నా సహచరి. చూపులు కలిసిన తొలిసారే మా మధ్య ఆకర్షణేదో మొగ్గతొడిగింది. ఆమె ఆలోచనలు చదవకూడదన్న స్థిర నిశ్చయానికి ఆ క్షణమే వచ్చేశాను. పరిచయం ప్రేమగా మారటానికి ఎక్కువరోజులు పట్టలేదు. చదువు పూర్తయ్యాక అమ్మని ఒప్పించి షాహిదాని పెళ్లాడటానికి కాస్త కష్టపడాల్సొచ్చింది. మొదట్లో ఇద్దరి మతాలూ వేరని అమ్మ బెట్టుచేసినా, తర్వాత తనే మెట్టు దిగింది. పెళ్లయ్యాక, అప్పుడప్పుడూ షాహిదా మనసులో ఏముందో చదివి తెలుసుకోవాలన్న కోరిక తలెత్తినా, దాన్ని తొక్కిపట్టేసేవాడిని.

అదెంత పెద్ద తప్పో తర్వాతెప్పటికో తెలిసింది. అప్పటికే ఆలస్యమయింది.

తల విదిలిస్తూ, స్కానింగ్ కొనసాగించాను. చుట్టూ జనాలు ఎవరి ఆలోచనల్లో వాళ్లు మునిగున్నారు. ఆశలు, అసూయలు, కోరికలు, కోపాలు, వల్గారిటీస్, పెర్వర్షన్స్ అన్నీ వాళ్ల తలపుల్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాయి. అవన్నీ నేను వింటున్నానని తెలిస్తే? అప్పుడా ఆలోచనలకి కళ్లాలేస్తారా? నో. నా మీద దాడికొస్తారు. తమ ప్రైవసీ హక్కుకి భంగం కలిగించానంటూ రాద్ధాంతం చేస్తారు. ఈ కారణంగానే ఏజెన్సీ అజ్ఞాతంలో ఉండిపోయింది.

anil

ఇందాకెప్పుడో తెచ్చుకున్న కాఫీ చల్లారిపోయింది. మరో కాఫీ కోసం లేచెళ్లి కౌంటర్లో ఆర్డరిచ్చి, అదొచ్చేలోపు ఎదురుగా గోడకున్న టీవీలో స్క్రోలింగ్ న్యూస్ చదవసాగాను. “ప్రత్యేక హోదా సాధించి తీరతాం – చంద్రబాబు”. “విదేశాల నుండి నల్ల ధనం వెనక్కి రప్పిస్తాం – నరేంద్రమోదీ”. “త్వరలోనే మెగాస్టార్ నూట యాభయ్యో సినిమా ప్రకటన – రామ్ చరణ్”. “ఈ దేశంలో పుట్టినోళ్లందరూ జై శ్రీరామ్ అనాల్సిందే – సాధు మహరాజ్”. రెండేళ్ల నుండీ రోజు మార్చి రోజు ఇదే బ్రేకింగ్ న్యూస్! కానీ సామూహిక అత్యాచారాలు, సంఘవిద్రోహ చర్యల వార్తల కన్నా ఇవే మెరుగు.

కాఫీ వచ్చింది. తీసుకుని వెనక్కొచ్చి ఇందాకటి టేబుల్ వద్దే కూర్చుని తాగబోతోండగా … తలలో చిన్న మెరుపు మెరిసింది. లిప్తపాటు మెదడు మొద్దుబారింది.

 

సందేశాలు రాబోతున్న సూచన. ఏజెన్సీ నుండి.

కాఫీ కప్పు కిందపెట్టి కళ్లు మూసుకున్నాను, అంతఃచక్షువులకి అల్ల్లంత దూరంలో కనబడుతున్న సూక్ష్మబిందువు మీదకి ఫోకస్ లాక్ చేయటానికి ప్రయత్నిస్తూ. కొత్తలో ఈ పని చేయటానికి రెండు నిమిషాల పైగా పట్టేది. ఇప్పుడు రెండే సెకన్లు.

ఫోకస్ లాక్ అవగానే సందేశాలు డౌన్‌లోడ్ కావటం మొదలయింది. మొదటగా ఎవరిదో ఫోటో వచ్చింది. అంత స్పష్టంగా లేదు. పురుషాకారం అని మాత్రం తెలుస్తోంది. నాతో సహా ఎవడైనా కావచ్చు. టెలీపతీ ద్వారా శబ్ద సంకేతాలొచ్చినంత స్పష్టంగా చిత్రాలు రావు. ఇంత అస్పష్టమైన ఫోటోలతో ఉపయోగం ఉండదు, కానీ టార్గెట్ ఎలా ఉంటుందో అసలుకే తెలీకపోవటం కన్నా ఇది మెరుగని ఏజెన్సీ వాదన.

ఫోటోని పక్కకి నెట్టేసి, తక్కిన సందేశాలని జాగ్రత్తగా విన్నాను. ఏదో రామదండు అట. కన్నుకి కన్ను, పన్నుకి పన్ను సిద్ధాంతంతో కొత్తగా పుట్టుకొచ్చిన మతోన్మాద మూక! మక్కా మసీదులో పేలుళ్ల పథకం. ముహూర్తం రేపే. దాని సూత్రధారుల పని మిగిలిన ఏజెంట్స్ చూసుకుంటారు. ప్రధాన పాత్రధారి పని మాత్రం నేను పట్టాలి. అందుకు అనువైన స్థలం కూడా సూచించబడింది. ‌ఆ ప్రాంతం నాకు చిరపరిచితమైనదే. అయినా కూడా ఓ సారి ఫోన్‌లో ఆ ప్రాంతానికి సంబంధించిన తాజా మాప్ తెరిచి పరిశీలించాను. నేను చివరిసారిగా అటువైపు వెళ్లి చాన్నాళ్లయింది. ఈ మధ్యకాలంలో అక్కడ ఏమేం మార్పులొచ్చాయో తెలుసుకోవటం అత్యావశ్యకం.

 

మాప్ పని పూర్తయ్యాక మళ్లీ కళ్లు మూసుకుని మిగిలిన వివరాలు విన్నాను. ఆఖర్లో వినపడింది వాడి పేరు.

చిరంజీవి.

 

* * * * * * * *

అరగంటగా అక్కడ కాపుకాస్తున్నాను. తమ అమానుష పథకాన్ని అమలుచేసే క్రమంలో- అర్ధరాత్రి దాటాక చిరంజీవి నగరంలో అడుగుపెడతాడని, ఇదే దారిగుండా తన షెల్టర్‌కి వెళతాడని ఏజెన్సీ పంపిన సందేశం. కచ్చితంగా ఏ వేళకొస్తాడో తెలీదు. ఎంతసేపు నిరీక్షించాలో?

అది నగరానికి దూరంగా విసిరేసినట్లున్న పారిశ్రామికవాడ. పగలు హడావిడిగా ఉండే ఆ ప్రాంతం అర్ధరాత్రయ్యేసరికి నిర్మానుష్యంగా మారిపోతుంది. అక్కడక్కడా భవనాలు. వాటి మధ్యగా ఓ డొంకదారి. దాని పక్కనున్న తుప్పలూ పొదలే తప్ప చెట్లూ చేమలూ పెద్దగా లేవు. కొన్ని భవనాల్లో విద్యుద్దీపాలు వెలుగుతున్నాయి. నేనున్న ప్రాంతం మాత్రం చీకట్లో మునిగుంది – మతం చీకటి కమ్మేసిన మనుషుల్ని గుర్తుచేస్తూ.

ఏదో ద్విచక్ర వాహనం ఇటుగా వస్తోంది. డుగుడుగు శబ్దం. ఎన్‌ఫీల్డ్. దాని మీద ఒక్కడే ఉన్నాడు. చిరంజీవి?

డొంకదారి పక్కనున్న పొదల వెనక నక్కి కూర్చుని స్కానింగ్ మొదలు పెట్టాను. ఊఁహు. చిరంజీవి కాదు. శృంగారతార సినిమా సెకండ్ షోకెళ్లి వస్తున్న రసిక ప్రేక్షకుడు. వాడి ఆలోచనలు అమానుషంగా లేవు. అసహ్యంగా ఉన్నాయి. వాటితో ఎవరికీ ప్రమాదం లేదు. ఉంటేగింటే వాడికే. అది కూడా, వాడి బుర్రలో ప్రస్తుతం ఏముందో చదవగలిగే శక్తి వాడి పెళ్లానికుంటేనే.

 

నన్నెప్పుడూ ఓ సందేహం తొలిచేది. ఈ శక్తి నాకొక్కడికే ఉందా, లేక నా వంటివాళ్లు ఇంకా ఉన్నారా?ఉంటే, వాళ్ల మనసులతో సంభాషించటం సాధ్యమవుతుందా? ఆ ప్రశ్న నన్ను ఎన్నో రోజులు వెంటాడింది. చివరికో రోజు సమాధానం దొరికింది. దానికి నెలముందో దారుణం జరిగింది.

ఆ రోజు – అన్నిరోజుల్లాగే నగరమంతటా – నాన్నలు ఆఫీసులకెళ్లారు. అమ్మలు షాపింగ్‌కెళ్లారు. ‌భార్యాభర్తలు సినిమాలకెళ్లారు. పిల్లలు ప్లేగ్రౌండ్స్‌కెళ్లారు. ప్రేమికులు పార్కులకెళ్లారు.

వాళ్లలో చాలామంది తిరిగి ఇంటికి రాలేదు.

అమ్మ కూడా.

 

ఆ సాయంత్రం ఆమె మందులకోసం మెడికల్ షాపుకెళ్లింది, నాకు కుదరకపోవటంతో.

దారిలోనే నకుల్ చాట్ హౌస్. దాన్ని దాటుతూ ఉండగా ఆమె పక్కనే మొదటి బాంబు పేలింది. ఆ తర్వాత పది నిమిషాల వ్యవధిలో నగరంలో వరుసగా మరిన్ని పేలుళ్లు. వందల్లో మృతులు.

ఏం పాపం చేశారు వాళ్లు? లోపాలపుట్టలే కావచ్చు. కానీ మనుషులు వాళ్లు. నాలాంటి మనుషులు. బతకటం వాళ్ల హక్కు. దాన్ని లాక్కునేవాళ్లు మనుషులు కారు. నరరూప రాక్షసులు. నరికేయాలి వాళ్లని.

ఆవేదనలోంచి ఆవేశం. అందులోంచి ఆలోచన. నా శక్తితో ఏదన్నా చెయ్యలేనా? ఇలాంటివి జరగకుండా ఆపలేనా? బహుశా, నేనిలా ఉండటానికో కారణముందేమో. అది, ఇదేనేమో!

ఆ రాత్రి పిచ్చివాడిలా నగరమంతా తిరిగాను. బాంబు పేలిన ప్రతిచోటికీ వెళ్లాను. అన్ని చోట్లా రాక్షస గీతాలాపన. ఏదో చెయ్యాలి. ఈ ఘోరం మళ్లీ జరక్కుండా నా శక్తిని అడ్డేయాలి. కానీ ఎలా?

సమాధానం నెల తర్వాత వెదుక్కుంటూ వచ్చింది – ఏజెన్సీ నుండి.

ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉండే టెలీపతిక్స్ సభ్యులుగా, ప్రభుత్వాల ప్రమేయం లేకుండా నడిచే అజ్ఞాత సంస్థ – ఏజెన్సీ. మైండ్ రీడింగ్ ద్వారా ఉగ్రవాద కార్యకలాపాల ఆచూకీ పట్టేసి వాటిని నిరోధించటం దాని పని. చాలా రోజులుగా నా మనసుపై నిఘా ఉంచి, నా శక్తిని మంచికోసం వాడాలన్న తపన చూసి, తమలో ఒకరు కమ్మనే ఆహ్వానం పంపింది ఏజెన్సీ. అంగీకరించటానికి అరక్షణం కన్నా ఆలోచించలేదు.

 

ఆనందం.

నేను ఒంటరిని కాను. ఉత్పరివర్తనాన్నో, ప్రకృతి వైపరీత్యాన్నో కాను. నాలాంటి వారు మరిందరూ ఉన్నారన్న ఆనందం.

అది నాలుగు నిమిషాలే.

సభ్యత్వానికి సమ్మతం తెలిపిన వెంటనే ఏజెన్సీ నుండొచ్చిన రెండో సందేశం నన్ను కలవరపరచింది: “నీ భార్య మనసు చదువు”.

ఎందుకో అర్ధం కాలేదు. అన్యమనస్కంగా, అయిష్టంగా ఆ పని చేశాను.

 

దిగ్భ్రమ!

షాహిదాని వైట్ లిస్ట్ చేసి ఎంత తప్పు చేశానో వెంటనే అర్ధమయింది.

ఆలస్యం చెయ్యకుండా ఆ తప్పుకి పరిహారం చెల్లించాను.

నాటి నుండీ, ఎదురైన ప్రతి వ్యక్తి ఆలోచనలూ చదవసాగాను. ఉగ్రవాద కుట్రల్ని పసిగట్టటం, వాటిని ఏజెన్సీతో పంచుకోవటం, కుదిరితే కుట్రదారుల్ని మట్టుపెట్టటం – ఇదే నా పని. ఆ జాబితాలో ఇప్పటికే ఐదురుగున్నారు.

చిరంజీవి ఆరోవాడు.

వచ్చేది వాడేనా?

రోడ్డు మీద దూరంగా ఏదో ఆకారం, వేగంగా ఇటే నడిచొస్తూ.

పొదలమాటున సర్దుక్కూర్చుని స్కానింగ్ మొదలు పెట్టాను. పదే క్షణాల్లో తెలిసిపోయింది.

వాడే.

వాడి మనసులో – రేపు సాయంత్రం – మక్కా మసీదు – సూసైడ్ బాంబింగ్.

నేనుండగా ఆ పథకం అమలయ్యే ప్రసక్తే లేదు.

 

పొదల వెనక పొజిషన్ తీసుకుని సిద్ధంగా ఉన్నాను. వాడు నన్ను దాటి రెండడుగులు వెయ్యగానే వెనకనుండి లంఘించి మీదకి దూకాను. వాడు నేలమీద బోర్లాపడ్డాడు. ఊహించని దాడికి విస్తుపోతూ వెనక్కితిరిగాడు. అంత దగ్గరనుండి మసక వెలుగులోనూ వాడి ముఖం స్పష్టంగా కనబడింది. గెడ్డం పెంచి, మీసాలు తీసేసి, మహమ్మదీయుడిలా అగుపిస్తున్నాడు.

మసీదు ముంగిట ఎవరికీ అనుమానం రాకుండా బాగానే వేశావురా మారువేషం!

అంతలోనే వాడు నోరు తెరిచాడు. అయోమయం నటిస్తూ అడిగాడు. “కోన్ హే తూ? ఏం కావాలి?”.

హైదరబాదీ యాస కూడా బాగానే పలికిస్తున్నావురా. కానీ నన్ను ఏమార్చలేవు.

“నీ ప్రాణం,” అంటూ ఒకచేత్తో వాడిని నేలకేసి తొక్కిపడుతూ రెండో చేత్తో ఆయుధం బయటకి లాగాను. వాడి కళ్లలో అయోమయం స్థానంలో భయం చోటుచేసుకుంది. కీచుగొంతుతో అరుస్తూ నన్ను నెట్టేయబోయాడు. కానీ నా బలం ముందు వాడి శక్తి చాల్లేదు.

“దొరికిపోయావు చిరంజీవీ. నీ పథకం పారదిక,” అంటూ ఆయుధం పైకెత్తాను.

“యే చిరంజీవీ కోన్? నేను రియాజ్ అహ్మద్. ఛోడ్ దే ముజే,” అని దీనంగా చూశాడు గింజుకుంటూ. ఒక్క క్షణం ఆగిపోయి వాడి మనసులోకి చూశాను.

“నా అబద్ధం నమ్మాడో లేదో. ఇప్పుడేమన్నా తేడావస్తే ప్లానంతా అప్‌సెట్ అవుద్ది,” అనుకుంటున్నాడు. ముఖంలో మాత్రం కొట్టొచ్చిన దైన్యం.

మృత్యుముఖంలోనూ ఏం నటిస్తున్నావురా! నీ ముందు ఐదుగురిదీ ఇదే తీరు.

షాహిదాతో సహా.

 

ఏడాది తర్వాత కూడా ఆమె మాటలు నా జ్ఞాపకాల్లో తాజాగానే ఉన్నాయి.

“పోయిన్నెల నకుల్ చాట్ పేలుడులో మీ అమ్మ పోవటమేంటి? ఆ కుట్రలో నా హస్తం ఉండటమేంటి? మన పెళ్లయ్యేనాటికే అత్తయ్య కదల్లేని స్థితిలో మంచాన పడుందని, అదే మంచంలో ఏడాది కిందట పోయిందని  … కైసే భూల్ గయే ఆప్? ఆమె పోయినప్పట్నించీ అదోలా ఉంటే దిగులు పెట్టుకున్నావేమోలే, మెల్లిగా నువ్వే బయట పడతావనుకుని సరిపెట్టుకున్నా. చూడబోతే నీకేదో పిచ్చెక్కినట్టుంది. ఏదేదో ఊహించేసుకుంటున్నావు. నేను జిహాదీనేంటి నాన్సెన్స్! ఐదేళ్లు కలిసి కాపురం చేసినదాన్ని …  మైగాడ్. ఆ కత్తెక్కడిది? ఏం చేస్తున్నావ్ … స్టాపిట్ … యా అల్లా… ”

 

అదే తన ఆఖరి సంభాషణ. మహానటి. చచ్చేముందూ నిజం ఒప్పుకు చావదే! పైగా నేను పిచ్చివాడినని నన్నే నమ్మించబోయింది.

ఈ ఉగ్రవాదులందరికీ ఇదో ఉమ్మడి రోగం. తమ పిచ్చి తామే ఎరగని ఉన్మాదం. బ్లడీ సైకోపాత్స్. వీళ్ల పిచ్చికి ఒకటే మందు.

ఎత్తి పట్టుకున్న కత్తి కసిగా కిందకి దిగింది. సూటిగా, లోతుగా చిరంజీవి గుండెలోకి.

 

వాడి కళ్లలో కొడిగడుతున్న వెలుగుని తృప్తిగా చూస్తూండగా ఎందుకో మేధావి మాటలు గుర్తొచ్చాయి.

“నువ్వేది నమ్మితే నీకదే నిజం”.

 

*

గమనిక: ఈ కథ ముగింపులోని అస్పష్టతపై వ్యాఖ్యలకి, విమర్శలకి ఆహ్వానం. అదే సమయంలో, ముగింపు బయట పెట్టేయకుండా సంయమనం వహించమని మనవి.

——–

 

కథల పరమార్ధం

 

 

కథల వల్ల ప్రయోజనం ఏమిటి?

 

ఇదొక ఎడతెగని చర్చకి దారి తీసే ప్రశ్న. ‘ఏ ప్రయోజనం లేదు’ నుండి ‘ప్రపంచాన్ని మార్చటం’ దాకా రకరకాల సమాధానాలొస్తాయి. వీటిలో నాకు నచ్చినది: “Entertain and inform” – ఆ క్రమంలో. పాఠకులని వినోదపరుస్తూ వాళ్లకి ఎంతోకొంత ఉపయుక్తమైన సమాచారాన్ని అందించగలిగేదే నా దృష్టిలో ప్రయోజనకరమైన కథ.

అయితే – ఏదేని సమస్య గురించిన సమాచారం తెలియజేయటానికి, దానిపై పాఠకులకి అవగాహన కలిగించటానికి సాహిత్యంతో పనేంటి? అందుకోసం కథలూ, నవలలూ రాయాల్సిన అవసరమేంటి? సదరు సమస్యపై సమాచారాన్ని క్రోడీకరించి, సంఖ్యలూ అవీ జతపరచి శుభ్రంగా ఓ వ్యాసం రాసేయొచ్చుగా. అది మరింత ప్రభావశీలంగా ఉంటుంది కదా.

లేదు. వ్యాసాల ద్వారా సమస్యల గురించిన సాధారణ సమాచారం లభిస్తుంది, స్టాటిస్టిక్స్ తెలుస్తాయి. కానీ ఆ సమస్య బారినపడ్డ మనిషి అనుభవించే వేదన ఈ వ్యాసాల్లో కనబడదు. కష్టసుఖాలకి మనుషులెలా స్పందిస్తారు, వాటినెలా ఎదుర్కొంటారు,  అవి మానవ సంబంధాలని ఎలా ప్రభావితం చేస్తాయి – ఇటువంటి సమాచారాన్ని పాఠకులకి అందించగలిగేది సాహిత్యం మాత్రమే.

ఇక్కడ గమనించాల్సిన విషయమొకటుంది. సాహిత్యం పని సమాచారాన్ని చేరవేయటమే. బోధించటం కాదు. హితబోధలు చేయటం కాదు. ఎందుకంటే, కథలు చదివి మనుషులు మారిపోరు. కథల వల్ల పాఠకుల నైతిక వర్తనం మారదు. కాబట్టి సందేశాలిచ్చే కథలకి బదులు సమాచారాన్నిచ్చే కథలు రాయటం మెరుగు. వీలైనంత కచ్చితమైన సమాచారాన్ని పాఠకులకందిస్తే, ఆసక్తి కలిగినవాళ్లు ఇతర మార్గాల ద్వారా మరింత లోతుగా వివరాలు తెలుసుకుంటారు. చదివినవారికి అందులో ప్రస్తావించిన విషయాల మీద ఆసక్తి, అవగాహన కలిగించగలిగితే ఆ కథ ధన్యమైనట్లే.

మరి వినోదం సంగతేమిటి? నా దృష్టిలో కథ – ఆ మాటకొస్తే ఏ కళకైనా – ప్రధమ పరమార్ధం వినోదం కలిగించటం. మిగతావన్నీ ఆ తర్వాతే. వినోదం పాళ్లు పిసరంతైనా లేకుండా సమాచారాన్ని బదిలీ చేయటమే ఏకైక పనిగా రాయబడ్డ కథల వల్ల ఎటువంటి ప్రయోజనమూ ఉండదు. ఇక్కడ ‘వినోదం’ అంటే నవ్వు తెప్పించటం, సంతోష పరచటం అని పొరబడకండి. ఆంగ్లంలో ‘entertainment’ అనే పదానికి ‘diversion’ అనే అర్ధమూ ఉంది. నేను ఆ అర్ధంలో వాడాను. వినోదాత్మకమైన కథలు చదవటాన్ని “escaping from reality” అంటూ వెక్కిరిస్తారు కొందరు. నేను మాత్రం దీన్ని “escaping into an alternate reality” అంటాను. కథ పని చదువుతున్నంతసేపూ పాఠకుడిని మరో ప్రపంచంలోనికి తీసుకుపోవటం. పాఠకుడికి కనీసం ఒకటైనా కొత్త విషయం చెప్పటం. ఆ మేరకి అతని/ఆమె దృష్టి పరిధి పెంచటం. అది చెయ్యలేని కథ రాయటం అనవసరం.

పైదంతా రచయిత కోణం నుండి కథ ప్రయోజనం ఏమిటో వివరించే ప్రయత్నం. దీన్నే పాఠకుడి కోణం నుండి ఇలా చెప్పొచ్చు:

“కథ పరమార్ధం పాఠకుడితో ఆస్వాదించబడటం”

అంతే.

*

నేను త్యాగరాయల్ని కాను!

 

 

 

“కథలు రాయడం ఒక పిచ్చి. సైకలాజికల్ ప్రాబ్లం. విపరీత ప్రవర్తన. కథలెందుకు రాస్తారంటే చాలామంది కథలు రాయకుండా ఉండలేక రాస్తారు. నేను ఈ మాట అంటున్నది కథను చాలా సీరియస్ గా తీసుకున్న రచయితల గురించి. ఇది చాలా ప్రమాదకరమైన పని. రాసినవాళ్లెవరూ బాగుపడలేదు. ఆరోగ్యంగా ఉండలేదు. కాపురాలు సజావుగా నిర్వహించలేదు. భ్రమలకు భ్రాంతులకు మానసిక అనారోగ్యాలకు ఆత్మహత్యలకు గురయ్యారు. ఒంటరితనంలోకి పారిపోయారు. చీకటి గదుల్లో బంధించుకున్నారు. మూర్ఛలు తెచ్చుకున్నారు. పిచ్చాసపత్రుల్లో చేరారు. _రచయితలు ఇంత త్యాగం చేసి ప్రాణాలు తోడేసుకుంటుంటే ….”

పైవి, కథా ఖధీరుడి తాజా పుస్తకంలోనివిగా చెప్పబడుతున్న వాక్యాలు. ఆ పుస్తకం నేనింకా చదవలేదు. గొప్పగా ఉంటుందనుకుంటున్నాను. అది నా చేతికంది, చదివాక దానిగురించి వివరంగా ముచ్చటించుకుందాం. ప్రస్తుతానికి పై వాక్యాలు నాలో కలిగించిన స్పందన మాత్రం రాస్తాను.

ఖదీర్ వ్యాఖ్యల్లో నిజమెంత? వృత్తిపరంగా ఉచ్ఛస్థాయికెదిగి వ్యక్తిగత జీవితంలో మాత్రం భ్రష్టుపట్టిపోయినవారు సాహిత్యంలోనే కాదు, ఇతర రంగాల్లోనూ కనిపిస్తారు. దానికి కారణాలేంటనేది వేరే చర్చ. అయితే అందరూ అలాగే ఉంటారా అంటే కాదని సమాధానమొస్తుంది. రచయితల్లోనే తీసుకున్నా ఖదీర్ ప్రస్తావించిన స్థాయిలో చిత్రహింసలు అనుభవించేవాళ్ల శాతం తక్కువ. బహుశా తను చెప్పదలచుకున్న విషయాన్ని ఎంఫసైజ్ చేయటానికి ఖదీర్ బాబు కావాలనే అతిశయీకరించినట్లు నాకనిపిస్తుంది. ఆ అతిశయాన్ని అవతలబెడితే, ఖదీర్ వాక్యాల్లో చివరిది నన్ను అమితంగా ఆశ్చర్యపరచింది.

రచయితలు ఇంత త్యాగం చేసి ప్రాణాలు తోడేసుకుంటుంటే ….”

రచన చేయటం పెద్ద త్యాగమా! అయితే ఆ త్యాగం ఎవరికోసం చేస్తున్నట్లు? ఎందుకోసం చేస్తున్నట్లు?

ఇతరుల సంగతేమో కానీ నా మట్టుకు నేను కథలు రాయటం కోసం చేసిన త్యాగాలు ఏమీ లేవని ఘంటాపధంగా చెప్పగలను.

నా కథాకోడి కూయకపోతే లోకానికి తెల్లారదా? లేదు. నా కథలు చదవకపోతే నిద్రపట్టని పాఠకులున్నారా? లేరు. నన్నెవరన్నా కథలు రాయమని బలవంతపెట్టారా? లేనే లేదు.

మరి నేను కథలెందుకు రాస్తున్నాను? జనాలకి సందేశాలీయటానికా? పాఠాలు నేర్పటానికా? దానికి ఇతర మార్గాలు బోలెడుండగా కథలే ఎందుకు రాయాలి?

ఎందుకంటే కథ రాయాలన్నది నా కోరిక కాబట్టి. కథ రాయటమంటే నాకు ఇష్టం కాబట్టి. కథలు రాయటం ఆషామాషీ వ్యవహారం కాదు. నిజమే. ఆలోచనల్ని మధించాలి. అందులోంచి అమృతం తీయాలి. ఆ క్రమంలో అష్టకష్టాలు పడాలి. అయితే అవన్నీ ఎందుకోసం? ఎవరికోసం? నాకు ఇష్టమైన పని చేసి, నా కోరిక తీర్చుకోవటం కోసం. ఇది నాకోసం నేను చేస్తున్న పని. ఇందులో త్యాగానికి తావెక్కడ?

కథలు రాయటం ద్వారా నేను కొన్ని విలువైన స్నేహాలు, మరిన్ని పరిచయాలు సంపాదించాను. పోగొట్టుకుంది మాత్రం ఏదీ లేదు. ఈ సంపాదించటాలూ, పోగొట్టుకోవటాలూ పక్కనపెడితే – కథ రాసే క్రమంలో నేను పడే కష్టం నాకు అమితమైన సంతృప్తినిస్తుంది. “ప్రయాణమే ప్రతిఫలం” అనే అర్ధమొచ్చే ప్రాచీన చైనీస్ నానుడొకటుంది. ఓ కథ రాస్తున్నప్పుడు నేను నేర్చుకున్న కొత్త విషయాలు, పొందిన అనుభూతులు, నాకు లభించే మెంటల్ ఎక్సర్‌సైజ్ – ఇవే ఆ కథ నాకిచ్చే బహుమతులు. తక్కినవన్నీ బోనస్. ఆ కొసరు గురించి ఆలోచించకుండా కథా ప్రయాణమిచ్చే అసలైన ప్రతిఫలాన్ని ఆస్వాదించగలిగిన కథకుడిని పొగడ్తలు, పిచ్చికూతలు, ఉక్రోషాలు, ఉన్మాదాలు … ఇవేవీ తాకలేవని నేను నమ్ముతాను. చప్పట్లు, అవార్డులు, రివార్డుల మాయలో పడ్డ కథకుడు తనకోసం తాను కాకుండా ఇతరులని మెప్పించటం కోసం రాస్తాడు. అది అతనికి మంచిది కాదు. అతని కథకి అంతకన్నా మంచిది కాదు. (కమర్షియల్ రచయితలకి ఇక్కడ మినహాయింపు. వాళ్ల లెక్కలు, కొలతలు వేరే. వారి గురించి వేరెప్పుడన్నా మాట్లాడుకుందాం) ఇతరుల మెప్పు, గుర్తింపు కోసం రాయటం ప్రధానమైపోతే ఎక్కడలేని సమస్యలూ చుట్టుముడతాయి. తన ‘సాహితీ సేవ’ ఎవరూ గుర్తించటం లేదన్న బాధ, పక్కోడిని పొగిడి తనని పట్టించుకోలేదన్న ఏడుపు … ఒకటా రెండా!

ఇతరుల కోసం రాయటంలో ఇన్ని తలకాయ నొప్పులున్నాయి కాబట్టి, మన కోసం మనం రాసుకోవటం ఉత్తమం. మిగతా కథకుల సంగతేమో కానీ నేను మాత్రం కథలు మొదటగా నాకోసమే రాసుకుంటాను. ఆ తర్వాతే ఇతరుల కోసం రాస్తాను. ఇందులో కొన్ని సౌలభ్యాలున్నాయి. నా కోసం రాసుకోవటం వల్ల నేను నాలాగే రాయగలుగుతాను. మరెవరిలానో రాయను. ఫలానావారికన్నా గొప్పగా రాయాలి, ఇంకెవరికన్నానో తీసిపోకుండా రాయాలి వంటి పోలికల్లేకుండా రాయగలుగుతాను. అది నా ఒరిజినాలిటీని నిలుపుతుంది.

రెండో సౌలభ్యం: నాకోసం నేను రాసుకోవటం వల్ల నా సొంత సమస్యలపైనే కథలు రాస్తాను. ఇక్కడ సమస్యలంటే ఉద్యోగం ఊడిపోవటం, భార్యామణితో గొడవలు, వగైరా మాత్రమే కాకపోవచ్చు. నాకు అమితమైన ఆసక్తి కలిగిన, లోతైన అవగాహన కలిగిన విషయాలు అని అర్ధం చేసుకోండి. ఇతరులకి ఆసక్తిగొలిపే విషయాలు, లేదా ప్రస్తుతం సేలబిలిటీ ఉన్న అంశాల్లోకి పక్కదోవ పట్టకుండా బాగా తెలిసిన విషయాలపైనే కేంద్రీకరించటం వల్ల మనం రాసేదానికి విశ్వసనీయత పెరుగుతుంది.

మూడో సౌలభ్యం: ఇతరుల కోసం రాస్తే – ఏ ఇద్దరి అభిరుచులూ ఒకేలా ఉండవు కాబట్టి ఓ కథతో అందరినీ మెప్పించటం ఎన్ని సాముగరిడీలు చేసినా అసాధ్యం. దీనికి బదులు ఒవరో ఒకరినే మెప్పించటం కోసం ఎందుకు రాయకూడదు? ఆ ఒక్కరూ నేనే ఎందుక్కాకూడదు? నా ఇష్టాయిష్టాలు నాకు బాగా తెలుసు కాబట్టి నాకోసం నేను రాసుకోవటం తేలిక.

అందువల్ల, నేను ప్రధానంగా నాకోసమే కథ రాసుకుంటాను. నా మొదటి కథ రాసినప్పుడు వేరే దారెటూ లేదు. అప్పట్లో నాకీ కథాలోకం గురించి ఏమీ తెలీదు. ఇప్పుడున్న పరిచయాలు, స్నేహాలు లేవు. కథని ఎలా అచ్చుకు పంపాలో, ఎవరికి పంపాలో తెలీదు. ఒకవేళ పంపినా దాన్నెవరన్నా స్వీకరిస్తారో లేదో తెలీదు. అదృష్టవశాత్తూ అచ్చైనా దాన్ని పాఠకులు ఎలా ఆదరిస్తారనే అంచనా అసలుకే లేదు. కాబట్టి అచ్చు గురించిన ఆలోచనా బాదరబందీలూ, అంచనాల బంధనాలూ లేకుండా స్వేఛ్చగా కేవలం నన్ను నేను మెప్పించుకోటానికి రాసుకున్న కథ అది.

ఒకవేళ నా తొలికథ (ఆనాటికింకా) అఖండాంధ్ర ఆంధ్ర పాఠకదేవుళ్లని ఆకట్టుకోవాలన్న కృతనిశ్చయంతో రాసి ఉన్నట్లైతే?

అది కచ్చితంగా ఎడిటర్‌గారి చెత్తబుట్టలోకి చేరుండేది.

ఆ కథని నాకోసం రాసుకోవటం ఓ కథకుడిగా నాకు నేను చేసుకున్న గొప్ప ఉపకారం. ఆ తర్వాతి కథలకీ అదే పద్ధతి పాటించటం అలవాటుగా మారింది.

ఇదంతా చదివాక – మీరూ నాలాంటివారైతే – వెంటనే ఓ ప్రశ్నేస్తారు. “నీ కోసం నువ్వు రాసుకుంటే దాన్నలాగే దాచుకోక అచ్చోసి మా ముఖాన కొట్టటమెందుకు?”

మీరో కథ చదివారు. లేదా ఒక సినిమా చూశారు. అది మీకు బాగా నచ్చింది. ఆ కథ/సినిమా మీక్కలిగించిన అనిర్వచనీయానుభూతిని లోలోనే దాచుకుంటే మీ శరీరం విస్ఫోటిస్తుందేమోననే సందేహంతో సతమతమౌతారు. మరో పదిమందితో ఆ కథ చదివించటం/సినిమా చూపించటం చేసేదాకా మీరు ఊరుకోలేరు. అవునా? మనోల్లాసం  కలిగించే విషయాలు, మనసుకి నచ్చిన సంగతులు ఇతరులతో పంచుకోవటం మానవనైజం. కళాకారులు తమ సృజనని బహిరంగపరచటమూ అందుకేనని నేననుకుంటాను. (చప్పట్ల కోసమూ కావచ్చు. అందులో తప్పేమీ లేదు. అవే ప్రధానమైనప్పుడే తేడాలొస్తాయి). నా కోసం నేను రాసుకున్న కథని నలుగురి కోసం అచ్చు వేయటానికి అంతకన్నా పెద్ద కారణం లేదు.

అయితే – నా కోసం నేను రాసుకునే దశలో కథ అచ్చమైన స్వచ్ఛమైన కళా రూపం. ఎప్పుడైతే దాన్ని ఇతరులకోసం బహిరంగపరచాలనుకున్నానో అప్పుడా కథ కళా పరిధి దాటి క్రాఫ్ట్ ఇలాకాలోకి అడుగు పెడుతుంది. వేరేవాళ్ల కోసం అనేసరికి కథని కాస్త ముస్తాబు చేయాల్సొస్తుంది. మెరుగులు దిద్దాల్సొస్తుంది. ఇంట్లో మనమే ఉన్నప్పుడు దాన్నెలా పెట్టుకున్నా, అతిధుల్ని పిలిచినప్పుడు ఇల్లు కాస్త పొందిగ్గా సర్దుతాం చూడండి. అలాగే కథకి పబ్లిక్ అప్పీల్ పెంచటం కోసం దానిక్కాస్త క్రాఫ్టింగ్ తప్పనిసరి. హీరోగారికి క్రాఫింగ్‌లా కథకి క్రాఫ్టింగ్ అన్న మాట! (ప్రాస కుదిరిందని వాడేశా. ఈ పోలిక గురించి మరీ ఇదైపోకండి). క్రాఫ్టింగ్ అనేది ఇతరుల కోసం తిరగ రాసే దశ. లక్ష్యిత పాఠకుల అభిరుచుల్ని దృష్టిలో పెట్టుకునే దశ. ఈ దశ దాటకుండా కథని అచ్చుకి పంపటం నేనైతే చేయను. “మొదటగా నాకోసమే రాసుకుంటాను. ఆ తర్వాతే ఇతరుల కోసం రాస్తాను” అనటం వెనక అర్ధం ఇదే.

అదండీ సంగతి. త్యాగం దగ్గర మొదలెట్టి ఎక్కడెక్కడో తిరిగొచ్చాం. చెప్పొచ్చేదేమంటే, కథలు రాయటం నన్నేమీ త్యాగమయుడిగా మార్చదు. ఎందుకంటే అది నాకోసం నేను ఇష్టంగా చేస్తున్న పని. ఇష్టమైన పని కాబట్టి అది కష్టంగానూ అనిపించదు.

ఇది చదువుతున్న వారిలో వర్ధమాన రచయితలుంటే, వాళ్లు స్వీకరించదలిస్తే, నా కొద్దిపాటి అనుభవంలోని ఇచ్చే చిన్న సలహా. మీకోసం మీరు కథలు రాసుకోండి. అది మీ దేహానికి, మనసుకి, అన్నిటికీ మించి మీ కథకి చాలా మేలు చేస్తుంది.

*

వ్యాఖ్యానాలు vs గతమెరుపులు vs చట్రబద్ధాలు

 

 

నవలా రచయితకి ఉన్నది, కథా రచయితకి లేనిది ఏమిటి?

ప్రధాన పాత్రల జీవితాలని విస్తారంగా చిత్రీకరించే వెసులుబాటు నవలా రచయితకుంది, కథా రచయితకి లేదు. కథల నిడివి పూర్తిస్థాయి జీవితాల చిత్రీకరణకి అడ్డుపడుతుంది. అందువల్ల “కథ అను పదార్ధమును నిర్వచింపుడు” అనే ప్రశ్న ఎవరన్నా వేస్తే “ప్రధాన పాత్ర జీవితాన్ని ప్రభావితం చేసిన ఓ కీలక సంఘటన, దానికి దారి తీసిన పరిణామాల సమాహారం” అని చింపొచ్చు. సాధారణంగా కథల్లో ఒకే ఒక ప్రధాన పాత్ర ఉంటుంది. ఆ పాత్ర జీవితంలోని కొద్ది రోజులు లేదా గంటల మీద మాత్రమే కథ కేంద్రీకరించబడుతుంది. పాత్ర నిర్మాణం కూడా ఆ మేరకే ఉంటుంది. ఏ కొద్ది కథల్నో మినహాయిస్తే ఎక్కువ శాతం కథలు ఇలాగే ఉంటాయి.

పై నిర్వచనాన్ని దృష్టిలో ఉంచుకుని – ఈ క్రింది కథాంశాన్ని కథగా మలిచే క్రమంలో ఏమేం అంశాలు పరిగణలోకి తీసుకోవాలో చూద్దాం.

అనగనగా ఓ బాలుడు. చిన్నతనంలో ఎదురైన కొన్ని సంఘటనల కారణంగా వాడి బుర్రలో ఏవో ప్రశ్నలు మొలకెత్తాయి. వాటికి సమాధానాలు అన్వేషిస్తూండగానే దశాబ్దాలు దొర్లిపోయాయి. ఆ అన్వేషణే వాడి జీవితాన్ని రూపుదిద్దింది; పెద్దయ్యాక వాడు ఏమయ్యేదీ నిర్దేశించింది. ఆఖరుకి, నడివయసులో, అతనికి సమాధానాలు లభించాయి.

ఈ ఇతివృత్తంతో రెండు విధాలుగా కథ రాయొచ్చు.

మొదటి పద్ధతిలో –  కథానాయకుడి బాల్యప్రాయంలో కథ మొదలు పెట్టి, సంఘటనలు జరిగిన కాలక్రమంలో (chronological order) చెప్పుకుంటూ పోవటం. అయితే ఇందులో రెండు సమస్యలున్నాయి.

1: ఎత్తు పల్లాలు, ఎటువంటి మలుపులూ లేని తిన్నని నున్నని రహదారిపై సాగే ప్రయాణంలా ఈ కథనం నడుస్తుంది. కథలో కొన్ని కీలకమైన వివరాలు తొక్కిపట్టి అదను చూసి బయటపెడితేనే పాఠకుడిలో ఉత్సుకత కలుగుతుంది, ఉత్కంఠ పుడుతుంది. లీనియర్ విధానంలో చెప్పే కథల్లో  ఇలా వివరాలు తొక్కిపట్టే అవకాశం పెద్దగా ఉండకపోవటంతో అవి నీరసంగా సాగుతాయి.

  1. బాల్యం నుండి మొదలు పెట్టి కథానాయకుడు నడివయసుకి చేరేవరకూ చెప్పుకుంటూ పోతే కథ పొడుగు పెరిగిపోతుంది. అంతకంటే ముఖ్యంగా, అది మనం చెప్పుకున్న కథ నిర్వచనంలోకి ఇమడదు.

రెండో పద్ధతిలో – కథని ముగింపుకి వీలైనంత దగ్గర్లో మొదలుపెట్టాలి. అంటే, కథానాయకుడి ప్రశ్నలకి సమాధానాలు లభించబోయే దశలో అన్నమాట. ఆ తర్వాత సందర్భానుసారం నేపధ్యాన్ని విడమరుస్తూ పోవాలి. అలా సమాచారాన్ని తొక్కిపట్టటం వల్ల కథకి ఉత్కంఠ జతపడుతుంది. లీనియర్‌గా కాకుండా ముందువెనకలుగా, గతమెరుపులు మెరిపిస్తూ చెప్పటం వల్ల పొరలు పొరలుగా రూపుదిద్దుకుని, కథ లోతు పెరుగుతుంది. పాత్రల్ని లోతుగా చిత్రీకరించేంత నిడివి లేకపోవటం కథలకున్న పరిమితి అని మొదట్లో చెప్పుకున్నాం. ఆ లోటుని కొంతలో కొంత ఈ లోతుద్వారా పూడ్చేయొచ్చు.

గతంలో జరిగిపోయిన సంఘటనలు చెప్పటానికి – ఆ విధంగా కథ లోతు పెంచటానికి – ప్రధానంగా రెండు మార్గాలున్నాయి: వ్యాఖ్యానం (exposition) మరియు ఫ్లాష్‌బాక్. గతించిన విషయాలు ‘చెబితే’ అది వ్యాఖ్యానం అవుతుంది. ‌చాలా కథల్లో పాత్రలు గతానుభవాలో, ఎప్పుడో జరిగిపోయిన సంఘటనలో నెమరేసుకోవటం కనిపిస్తుంది. ఇవన్నీ వ్యాఖ్యానం కోవలోకే వస్తాయి. ‌చాలామట్టుకు కథల్లో గతాన్ని చెప్పటం ఇలాగే జరుగుతుంది. చాలామంది పాఠకులు (కొందరు కథకులు కూడా) ఇలా చెప్పటాన్నే ఫ్లాష్‌బాక్‌గా పొరబడతారు. ఫ్లాష్‌బ్యాక్ ద్వారా రచయిత గతంలో జరిగిపోయిన సంఘటనలు చెప్పడు; ‘చూపుతాడు’. వ్యాఖ్యానానికి, ఫ్లాష్‌బాక్‌కి ఉన్న ముఖ్యమైన తేడా అది.

వ్యాఖ్యాన పద్ధతిలో గడచిపోయిన కథ చెప్పటంలో ఓ వెసులుబాటుంది. ఇది సహజంగా అనిపిస్తుంది. నిజజీవితంలో ఎవరైనా గడచిన విషయాలు చెప్పాలంటే ఇలాగే చేస్తారు. కాబట్టి పాఠకులు వ్యాఖ్యానాన్ని అనుసరించటం తేలిక. అదే ఫ్లాష్‌బ్యాక్ విధానంలోకొచ్చేసరికి – గడచిపోయిన సంఘటనలు, సన్నివేశాలు పాఠకుడి కళ్లకి కట్టేలా ‘చూపాలి’. అంటే, ప్రస్తుతం నడుస్తున్న కథని కాసేపు ఆపేసి పాఠకుడిని గతంలోంకి లాక్కుపోవాలి. నిజజీవితంలో ఎవరూ ఇలా గతంలోకి ప్రయాణించటం జరగదు. కాబట్టి ఈ విధమైన కథనం పాఠకులని గందరగోళపరిచే అవకాశం ఉంది. ఈ కారణంవల్ల కొందరు కథకులు ఫ్లాష్‌బ్యాక్స్ వాడకాన్ని ఇష్టపడరు. అవి కథాగమనానికి అడ్డొస్తాయని వాళ్ల అభిప్రాయం. అందులో నిజం లేకపోలేదు. అంతమాత్రాన వాటికి ఆమడ దూరంలో ఉండాల్సిన అవసరమూ లేదు. ఈ క్రింది జాగ్రత్తలు పాటిస్తే ఫ్లాష్‌బాక్స్ పండుతాయి. సరిగా రాస్తే ఇవి వ్యాఖ్యానం కన్నా ఎక్కువ ప్రభావం చూపిస్తాయి.

– కథలోకి ఫ్లాష్‌బ్యాక్ ఊహించని చుట్టంలా ఉన్నట్లుండి ఊడిపడకూడదు. ప్రస్తుతం నడుస్తున్న కథలో ఓ బలీయమైన కారణమేదో గతాన్ని తట్టి లేపాలి. వర్తమానం నుండి గతానికి తరలటం అతి సహజంగా జరగాలే తప్ప బలవంతాన పాఠకుడి నెత్తిన రుద్దినట్లుండకూడదు. అలాగే, గతం నుండి వర్తమానానికి మరలటమూ అంతే సహజంగా ఉండాలి. నేపధ్యంలో చెప్పాల్సింది ఐపోయింది కాబట్టి, చెప్పటానికి ఇంకేమీ లేదు కాబట్టి తటాలున ఫ్లాష్‌బ్యాక్ ముగించేయకూడదు. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే కథనంలో కుదుపులొస్తాయి.

– కథ మొదలెట్టీ పెట్టగానే పాఠకుల ముఖాన రింగులరాట్నం తిప్పేసి ఫ్లాష్‌బ్యాక్‌లోకి ఈడ్చుకుపోకూడదు. వాళ్లు కాస్త కుదురుకునే సమయమీయాలి. సాధారణంగా, ఫ్లాష్‌బ్యాక్‌ని ఎంత ఆలస్యంగా మొదలు పెడితే అంత ప్రభావశీలంగా వస్తుంది.

– ఫ్లాష్‌బ్యాక్ ఎప్పుడు ముగించాలనేదీ ముఖ్యమే. ఫ్లాష్‌బ్యాక్ పూర్తైన వెంటనే రెండు మూడు వాక్యాల్లోనే కథ పూర్తైపోకూడదు. అలాగే, గతమెరుపుల ముందు అసలు కథ వెలవెలపోకూడదు. ఫ్లాష్‌బ్యాక్ అనేది ఉపకథ మాత్రమే. అది గొప్పగా ఉండటం ముఖ్యమే కానీ, అది ప్రధాన కథని మింగేయకూడదు. అసలు కథ పిసరంతే ఉండి ఫ్లాష్‌బ్యాక్ దృశ్యాలే ప్రధానమయ్యాయంటే, ఫ్లాష్‌బ్యాకే అసలు కథన్న మాట. అప్పుడు దాన్ని ఫ్లాష్‌బ్యాక్‌లా కాకుండా ప్రధాన కథలానే చెబితే మెరుగు.

– కథనం ఫ్లాష్‌బ్యాక్‌లోకి మారటమూ, తిరిగి అందులోనుండి బయటకు రావటమూ పాఠకుడు తేలిగ్గా గమనించేలా ఉండాలి. లేకపోతే వాళ్ల బుర్ర తిరుగుతుంది.

– ఒక ఫ్లాష్‌బాక్‌లో మరో ఫ్లాష్‌బ్యాక్ విప్పే ప్రయోగానికి వీలైతే దూరంగా ఉండండి.

ఈ వ్యాసం మొదట్లో ఉదాహరణగా రాసిన ఇతివృత్తం నా తొలికథ ‘నాగరికథ’కి ఆధారం (goo.gl/H3lAsq). అది నేను ఫ్లాష్‌బాక్ వాడిన ఒకే ఒక కథ. అందులో పైన చెప్పిన జాగ్రత్తలన్నీ తీసుకోవటం మీరు గమనించొచ్చు. ఆ కథలో ఒక ఫ్లాష్‌బ్యాక్‌లో మరో ఫ్లాష్‌బ్యాక్ చెప్పాల్సిన అవసరం పడింది. అలాచేస్తే పాఠకులు గందరగోళానికి గురయ్యే అవకాశముంది కాబట్టి మొదటి గతాన్ని ఫ్లాష్‌బ్యాక్ రూపంలోనూ, దానిలోపలి గతాన్ని వ్యాఖ్యానం రూపంలోనూ చెప్పేసి నెట్టుకొచ్చాను. ఆ కథకి మొదటి డ్రాఫ్ట్ రాశాక తిరిగి చదివితే ఏదో లోపం కనబడింది. మరోమారు చదివాక కానీ అదేంటో అర్ధం కాలేదు: ఆ కథలో ఫ్లాష్‌బ్యాక్ మెరుపులు ఎక్కువైపోయాయి, పతాక సన్నివేశాలు తేలిపోయాయి. ఆ లోపం సరిచేయటానికి కథ ముగింపుని తిరగరాయాల్సొచ్చింది. ‘నాగరికథ’ ఆఖర్లో ఉండే ట్విస్ట్ అలా వచ్చిచేరింది.

ముక్తాయింపు:

కొన్ని కథల్లో మొదట్లో రెండు పేరాగ్రాఫులు, చివర్లో మరో రెండు పేరాగ్రాఫులు వర్తమానంలోనూ; మిగిలిందంతా ఫ్లాష్‌బ్యాక్‌గానూ నడవటం మీరు గమనించే ఉంటారు. సాధారణంగా ఇలాంటి కథల్లో ఆ మొదలు, చివర కలిపి కథ నిడివి పెంచటం తప్ప ప్రత్యేక ప్రయోజనమేమీ ఉండదు. ఇక్కడ ‘రెండు పేరాగ్రాఫులు’ అనే నిడివి కారణంగా అవి అనవసరమైనవిగా నేను తీర్మానించటంలేదని గ్రహించగలరు. పాఠకుడు కథలో కుదురుకోకముందే ఫ్లాష్‌బ్యాక్ మొదలైపోవటం, అది పూర్తైన వెంటనే కథ కూడా ఐపోవటం – ఈ రెండూ మాత్రమే నేనిక్కడ ఎత్తిచూపదలచుకున్నది.

అయితే, కొన్ని రకాల కథలు ఇలా రాయాల్సిన అవసరం పడొచ్చు. వర్తమానంలో కథ మొదలు పెట్టి, వెంటనే గతంలోకి జారుకుని, చివర్లో అందులోనుండి బయటికొచ్చేయటం. ఇందులో కథంతా గతంలోనే జరుగుతుంది. వర్తమానంలో జరిగేదానికి ఆ గతపు గాధతో ఏదో లంకె ఉంటుంది. దీన్ని framing the story అంటారు. దీన్ని ‘కథని చట్రబద్ధం చేయటం’ అని మనం తెనిగిద్దాం. ఇది ఫ్లాష్‌బ్యాక్ విధానం కిందకి రాదు. ఈ చట్రబద్ధీకరించటం  అనేది పురాణాలంత పాత టెక్నిక్. ఒకసారి మహాభారతాన్ని గుర్తుచేసుకోండి.

————

ఈ వ్యాసాల్లో నా సొంతవే కాకుండా ఇతరుల కథలనీ ఉదహరించమని హితుల, సన్నిహితుల సూచన. ఆ పని చేయలేకపోవటానికి పలు కారణాలున్నాయి. తెలుగులో గొప్ప కథలు లెక్కలేనన్ని వచ్చాయి, ఇంకా వస్తున్నాయి. కానీ వాటిలో నా అభిరుచికి సరిపడేవి తక్కువ. క్రైమ్, థ్రిల్లర్, డిటెక్టివ్, ఫాంటసీ, హారర్ వగైరా ‘లొల్లాయి’ కథలకే నా ఆసక్తి పరిమితం. ఆ తరహా కథలు – అందునా నాణ్యమైనవి – తెలుగులో దాదాపుగా రావటం లేదు. అస్థిత్వ వాదాల కథల్లాంటి ‘భారమైన’ సాహిత్యానిదే ప్రస్తుతం హవా. అటువంటివి నేను దాదాపుగా చదవను. అడపాదడపా చదివినా వాటిని ఇలాంటి వ్యాసాల సందర్భంగా తవ్వి తీసి ఉటంకించేస్థాయిలో గుర్తుపెట్టుకోలేను. అరుదుగా ఏ కథనైనా గుర్తంచుకున్నా, ఉదహరించాలనుకున్నప్పుడు అది చేతికి అందుబాటులో ఉండకపోవచ్చు – దాని కాపీ నా దగ్గర లేకపోవచ్చు. నా కథలైతే నాకెప్పుడూ అందుబాటులోనే ఉంటాయి కదా. అన్నిటికన్నా ముఖ్యంగా – నా కథల్లో ఎక్కడ ఏది ఎందుకు రాశాననే దానిపైన నాకు పూర్తిగా అవగాహన ఉంటుంది కాబట్టి ఆ విశేషాలు ప్రస్తావించటం తేలిక. ఇతరుల కథల విషయంలో అంత సాధికారికంగా వ్యాఖ్యానించే అవకాశం నాకు లేదు. అదీ సంగతి.

*

 

 

 

 

 

తిరగరాస్తే..బతికే కథలు!

 

 

మీరో పేరాగ్రాఫ్ రాశారు. తర్వాత దాన్ని చదువుకున్నారు. అద్భుతంగా అనిపించింది. అంతకన్నా గొప్పగా మరెవరూ రాయలేరనిపించింది. అప్పుడు మీరేం చేయాలి?

ఆ పేరాగ్రాఫ్‌ని కొట్టిపారేసి మళ్లీ రాయటం మొదలుపెట్టాలి.

గొప్పగా రాయాలనుకునే వ్యక్తికి ఉండాల్సిన సుగుణం – తాను రాసిన వాక్యాలతో మొట్టమొదటిసారే ప్రేమలో పడకుండా ఉండగలిగే నిగ్రహం.

 

— —

‘ది పిక్చర్ ఆఫ్ డోరియన్ గ్రే’ వంటి కళాఖండాల సృష్టికర్త ఆస్కార్ వైల్డ్‌ని ఓ రోజు మధ్యాహ్న భోజన సమయంలో పలకరించిన స్నేహితుడు “మిత్రమా, ఈ ఉదయమంతా ఏం చేశావు?” అన్నాడట.

“కష్టపడి పనిచేశాను,” అని బదులిచ్చాడు ఆస్కార్ వైల్డ్.

“అయితే చాలా పేజీలు రాసేసి ఉంటావేం?” స్నేహితుడి తిరుగు ప్రశ్న.

“లేదు,” అన్నాడు వైల్డ్. “కథ మధ్యలో ఓ చోట ఒక కామా పెట్టాను”

అదే సాయంత్రం డిన్నర్ సమయంలో ఆ స్నేహితుడు మళ్లీ తారసపడ్డాడు.

“ఏం మిత్రమా. మధ్యాహ్నమంతా ఏం చేశావేమిటి?”

“మరింత కష్టపడి పని చేశాను”

“అవునా. కథలో మరో కామా ఇరికించావా?,” స్నేహితుడి వ్యంగ్యం.

“లేదు. ఉదయం పెట్టిన కామా తొలగించాను”

 

——

పై పిట్టకథ అతిశయోక్తిలా అనిపించొచ్చు కానీ దాని వెనకో గొప్ప సాహితీ సత్యం ఉంది. చరిత్రలో ప్రసిద్ధి చెందిన రచయితలు చాలామందిలో ఉన్న సారూప్యత: తమ రచనల్ని  శ్రద్ధగా తీర్చిదిద్దటం. కొందరు దీన్నే ‘చెక్కటం’ అనీ అంటారు. అచ్చ టెల్గూలో చెప్పాలంటే ‘గివింగ్ ఫైన్ టచెస్’ అన్న మాట. సాహిత్యానికే కాదు – శిల్పాలకైనా, వర్ణచిత్రాలకైనా మరి ఏ ఇతర కళా రూపానికైనా ఈ చెక్కుడు ఎనలేని అందాన్నిస్తుంది. ఇది మీర్రాసే కథలకీ వర్తిస్తుంది. మీరు చేయాల్సిన పనల్లా మీ కథని కనీసం రెండు మూడు సార్లు తిరగరాయటం. కూరకి తిరగమోత ఎలాగో, కథకి తిరగరాయటం అలా.

అన్నట్లు – ‘చెక్కుడు’ అనే మాట వింటే కొందరు (తెలుగు) కథకులు, విమర్శకులు ఉలిక్కిపడటం నేను గమనించాను. చెక్కటం అంటే కథ ఆత్మని దెబ్బతీయటం అనీ, ఇంకోటనీ ఏవో వాదనలూ విన్నాను. వ్యక్తిగతంగా నేను ఇటువంటి వాదనల్ని కొట్టిపారేస్తాను. కథలోకి ఆత్మ ఎక్కడినుండో రెక్కలుకట్టుకుని ఎగురుకుంటూ వచ్చి తిష్టవేసుక్కూర్చోదు. అది కథకుడు పొదగాల్సిన పదార్ధం. చెక్కటం, సానబెట్టటం, మెరుగులు దిద్దటం – పేరేదైనా – ఆ ప్రక్రియ పొదిగే క్రమంలో ఓ భాగం. బహుశా చెక్కటం అంటే ‘నగిషీలు చెక్కటం’ అన్న అర్ధంలో తీసుకుని వాళ్లు పొరబడి ఉండొచ్చు. కథకి మెరుగులు దిద్దటం అంటే దానికి భాషాలంకారాలు జతచేయటమొక్కటే కాదు, అనవసరమైన చోట అలంకారాలు, పదాల పటాటోపాలు తొలగించటం, పునరుక్తులు పరిహరించటం, కథలోంచి  కొవ్వు కరిగించటం కూడా. ఇవన్నీ చేయాలంటే మీ కథని ఒకటికి రెండుసార్లు తిరగరాయటం తప్పనిసరి.

నా దృష్టిలో ఇదెంత ముఖ్యమైనదంటే – రచనకి సంబంధిన రహస్యాన్నొకదాన్ని చెప్పమంటే, నేనైతే “తిరగరాయటం” అనే చెబుతాను. కొందరు కథకులు “మేము మొదటిసారి ఏది రాస్తే అదే ఫైనల్” అని గొప్పగా చెబుతారు. వీరిలోంచి ఎన్నిసార్లు తిరగరాసినా మెరుగుపడని కథలు రాసేవారిని తీసేస్తే, మిగిలిన వారు చెప్పేదాంట్లో నిజానిజాలు వారికే ఎరుక. తిరగరాయటం అనేది తనకు అలవాటు లేని పనిగా షేక్‌స్పియర్ సైతం చెప్పుకునేవాడు. అందువల్లే ఆయన రచనల్లో చాలాచోట్ల ‘నస’ కనిపిస్తుందని బెన్ జాన్సన్ అనేవాడు. (బెన్ జాన్సన్ అంటే పరుగు వీరుడు కాదు. ఈ బెన్ జాన్సన్ వేరే. ఈయన షేక్‌స్పియర్ సమకాలీకుడు; ఆంగ్ల సాహిత్యానికి సంబంధించినంతవరకూ షేక్‌స్పియర్‌కి సరితూగే నాటక రచయిత, కవి, మరియు విమర్శకుడు).

నేను ‘కథాయణం’, ‘కథన కుతూహలం’ రెండు శీర్షికల్లోనూ కలిపి డజను దాకా అంశాలపై విపులంగా రాశాను. వాటన్నిట్లోనూ అతి తేలిగ్గా పాటించగలిగేది ఈ తిరగరాసే కార్యక్రమం. దీనికి కావలసిందల్లా కొంచెం సహనం, కాస్త సమయం. ఆ రెండిటికీ మించి, ‘కాకిపిల్ల కాకికి ముద్దు’ అనే సామెత మీకు వర్తించకుండా ఉండటం. కథ రాసిన వెంటనే దాన్ని ఆవేశంగా ఏ పత్రిక్కో పంపించేయకుండా దాన్ని తిరగరాసి చూడండి. తేడా మీకే కనిపిస్తుంది. ఆ పని చేయటం ద్వారా, మీ కథ ప్రచురణకి ఎంపికయ్యే అవకాశాన్ని పెంచుకుని మీకు మీరే ఉపకారం చేసుకున్నవారవుతారు. అయితే తిరగరాయటం ఎంత ముఖ్యమో, మరీ ఎక్కువసార్లు తిరగరాయకుండా ఉండటమూ అంతే ముఖ్యం. మొదటి రెండు మూడు సార్లలో లేని మెరుగుదల ఆ తర్వాత వచ్చే అవకాశాలు దాదాపు శూన్యం. దాని వల్ల మీ సమయం వృధా కావటం తప్ప వచ్చేదేమీ లేదు.

చివరగా – ‘If you got it right the first time, then you are an anomaly’ అనేది సాఫ్ట్‌వేర్ రంగంలో ప్రముఖ నానుడి. మీరు అలాంటి విపరీత మానవులైనా, లేక షేక్‌స్పియర్ అంతటి వారైనా మీ కథని తిరగరాయనవసరం లేదు. నాలాంటి మామూలు కథకుడైతే మాత్రం ఆ పని తప్పదు.

*

 

 

 

పూర్వనీడలు పరుద్దాం రా!

 

 

“పొదల మాటునుండి రెండు కళ్లు తననే గమనిస్తున్నాయని అప్పుడతనికి తెలీదు”

యండమూరి వీరేంద్రనాధ్ నవలలు విచ్చలవిడిగా చదివిన వాళ్లందరికీ చిరపరిచితమైన వాక్యమిది. అచ్చంగా ఇదే కాకపోయినా, ఇంచుమించు ఇటువంటి వాక్యాలు ఆయన నవలల్లో తరచుగా ఎదురవుతుంటాయి. నాకు తెలిసినంతవరకూ తెలుగులో ఫోర్ షాడోయింగ్ ప్రక్రియని ప్రభావశీలంగా వాడుకున్న- కొండొకచో దుర్వినియోగ పరచిన – రచయితల్లో అగ్రగణ్యుడు యండమూరి (నా పరిజ్ఞానం అంతవరకే పరిమితం. పాపము శమించుగాక!)

పందొమ్మిదో శతాబ్దపు ప్రముఖ కథా రచయిత ఆంటన్ చెకోవ్ కథల్లో క్లుప్తత ఆవశ్యకత గురించి నొక్కివక్కాణిస్తూ ఓ మాటన్నాడు: “మీ కథలో తుపాకీ ప్రస్తావన గనుక వచ్చిందంటే, కథ పూర్తయ్యే లోపు అది పేలి తీరాలి!”. కథలో అనవసరమైన ముచ్చట్లేమీ ఉండకూడదని చెకోవ్ ఉద్దేశం. ఇదే ‘చెకోవ్స్ గన్’ ఉపమానాన్ని తిరగేసి మరోరకంగానూ చెప్పొచ్చు: “మీ కథ చివర్లో తుపాకీ పేలిందంటే అంతకు ముందే దాని ప్రస్తావన వచ్చి తీరాలి!”.  ఇదే ఫోర్ షాడోయింగ్, లేదా తేటతెలుగులో ‘పూర్వనీడలు పరవటం’. దీనికి బ్రహ్మాండమైన ఉదాహరణ ‘అతడు’ సినిమాలో కనిపిస్తుంది. ఆల్రెడీ గుర్తొచ్చేసుండాలి మీకు.

కథకుల తూణీరాల్లో ఉండాల్సిన బాణాల్లో ఫోర్ షాడోయింగ్ ఒకటి. కొన్ని రకాల కథనాలని పదునెక్కించాలంటే దీన్నెలా వాడాలో తెలిసుండటం అవసరం.

ఇంతకీ కథనం అంటే ఏమిటి?

చాలా తేలిగ్గా చెప్పాలంటే – ‘కథనం’ అంటే కథలో సంఘటనలు జరిగే క్రమం. ‘ఓస్, అంతేనా’ అంటే ఇంకా చాలా చాలా చెప్పొచ్చు. కానీ మన ప్రస్తుత అవసరానికి ఈ నిర్వచనం సరిపోతుంది.

మొదట్లో జరిగే ఓ సంఘటన, ముగింపులో జరిగే మరో సంఘటన, ఆ రెండింటి మధ్యా జరిగే ఇతర ఘటనలు. ఏ కథలోనైనా ఉండేవి ఇవే. ఆయా సంఘటనల్ని వరుసగా చెప్పుకుంటూ పోవచ్చు, లేదా ముందువెనకలుగానూ చెప్పుకు రావచ్చు. ఎలా చెప్పినా, ఆ కథనం పాఠకుడిలో కుతూహలాన్ని కలగజేయాలి. తెలివైన కథకుడు ఏ వివరాన్ని ఎప్పుడు ఏ మోతాదులో బయటపెట్టాలో తెలిసినవాడై ఉంటాడు. కథలోని సంఘటనల కాలక్రమంతో కబడ్డీ ఆడుతూ దాన్ని రక్తి కట్టిస్తాడు. ఈ కబడ్డీలో కొన్ని పట్లున్నాయి. వాటిలో అందరికీ తెలిసినది ‘ఫ్లాష్‌బాక్’ అయితే, మనం ప్రస్తుతం మాట్లాడుకుంటున్న ‘ఫోర్ షాడోయింగ్’ అనేది మరో పట్టు. ఇవి రెండే కాక మరో మూడ్నాలుగు ‘కాలక్రమ కబడ్డీ పట్లు’ కూడా ఉన్నాయి. వాటి గురించి వీలునుబట్టి మరెప్పుడైనా ముచ్చటించుకుందాం.

ఒకరకంగా, ఫోర్ షాడోయింగ్ అనేది ఫ్లాష్‌బాక్‌కి వ్యతిరేక ప్రక్రియ. మతిమరపు కథానాయకుడి నెత్తిన ప్రతినాయకుడు కొట్టిన దెబ్బకి ‌గతమెరుపు మెరవటం చాలా సినిమాల్లో చూసే ఉంటారు. అద్గదిగో … ఆ రింగుల రంగులరాట్నమే ఫ్లాష్‌బాక్. ఈ విధానంలో – రచయిత గతంలో గడచిపోయిన కీలక ఘట్టాన్నొకదాన్ని కథలో అవసరమొచ్చినప్పుడు విప్పిచెబుతాడు. కథని ఆసక్తికరంగా మలచటానికి ఇదొక మార్గం. దానికి భిన్నంగా, ఫోర్ షాడోయింగ్ ప్రక్రియ ద్వారా రచయిత కథలో తర్వాతెప్పుడో ఎదురవబోయే సంఘటనలు, జరగబోయే పరిణామాలపై ముందస్తు అవగాహన కలగజేస్తూ పాఠకుల్లో ఉత్కంఠ, ఆసక్తి నింపుతాడు. సాధారణంగా, ఫ్లాష్‌బాక్‌లో పూర్తి స్థాయి సన్నివేశాలు దర్శనమిస్తాయి. ఫోర్ షాడోయింగ్ మాత్రం చిన్న చిన్న వాక్యాల ద్వారానే చేయొచ్చు.

ఈ ‘పూర్వనీడల’ ప్రక్రియని స్థూలంగా రెండు విధాలుగా వాడొచ్చు. అది ఫోర్ షాడోయింగ్ అని చూడగానే తెలిసిపోయేలా వాడటం ఒక రకం. ఇది ఉత్కంఠ పోషించటానికి పనికొచ్చే పద్ధతి. ఈ వ్యాసం మొదట్లో ఎదురైన యండమూరి శైలి వాక్యం దానికో ఉదాహరణ. ఈ విధమమైన పూర్వనీడలు పరవాలనుకునే కథకుడు గుప్పిట ఎంతవరకూ తెరవాలనేదీ బాగా కసరత్తు చేయాలి. “ఏం జరగబోతోంది?” అనేదీ ఉత్కంఠే, “ఎలా జరగబోతోంది?” అనేదీ ఉత్కంఠే. కాకపోతే మొదటిది కాస్త ఎక్కువ ఉత్కంఠ పుట్టించే విషయం. ఫోర్ షాడోయింగ్ మరీ ఎక్కువైపోతే ఉత్కంఠ స్థాయి పడిపోతుంది; తక్కువైతే ఉత్కంఠే ఉండదు. కాబట్టి సమతూకం సాధించటం ముఖ్యం.

అయితే, కొన్ని రకాల కథలకి ఉత్కంఠతో పనుండదు. ఇటువంటి కథల్లోనూ ఫోర్ షాడోయింగ్ చేస్తూ, కథ ఎటు దారితీస్తోందీ పాఠకులకి చూచాయగా తెలియజేయొచ్చు. ఇది రెండో పద్ధతి. ఈ తరహా పూర్వనీడలు అదృశ్య సిరాతో రాసిపెట్టిన వాక్యాల్లా కథలో దాక్కుని, రెండోమారు ‘వెలుగులో’ చదివినప్పుడు మాత్రమే కనబడి పాఠకుల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తాయి. నా ‘శిక్ష’ (goo.gl/kVEZ3S) కథలో ఈ రకమైన ఫోర్ షాడోయింగ్ కనబడుతుంది. ఇదే రకం అమాయకపు పూర్వనీడలు తొంగిచూసే మరో తెలుగు కథ, శివ సోమయాజుల (యాజి) రచించిన ‘పగడ మల్లెలు’ (goo.gl/2vlSb6).

వ్యక్తిగతంగా, నాకు కథల్లో పూర్వనీడలు పరవటమంటే సరదా. నా కథలన్నిట్లోనూ ఫోర్ షాడోయింగ్ కనిపిస్తుంది. ఉదాహరణకి ‘ప్రళయం’ (goo.gl/8rqOLP) ప్రారంభ వాక్యాలు చూడండి:

“ఈ ద్వారము తెరచిన ఎడల అమ్మవారు ఆగ్రహించును. లోకమునకు అరిష్టము దాపురించుము. ఓ మానవా, వెనుకకు మరలుము”

కథ ఎత్తుగడలోనే ఈ వాక్యాలు కనబడటం వల్ల పాఠకుల్లో ఆసక్తి కలుగుతుంది. తర్వాత జరగబోయేదానిపై చూచాయగా ఓ అంచనా ఏర్పడుతుంది. అది వాళ్లు మిగతా కథ చదివేలా ప్రేరేపిస్తుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవలసింది ఒకటుంది. పాఠకుడికి ఓ అంచనా కలిగించాక దాన్ని ఎట్టి పరిస్థితిలోనూ చేరుకోవలసిందే. లేకపోతే అతన్ని మోసం చేయటమే అవుతుంది. ఉదాహరణకి, పై వాక్యాలు ఓ ద్వారమ్మీద కనబడే అక్షరాలు. కథ మొదట్లో వాటినంత ప్రముఖంగా చూపించి, తర్వాత కథంతా దానికి సంబంధం లేకుండా నడిపించేసి, ఆనక తీరిగ్గా “కథానాయకుడు దారిన పోతుంటే అతని కళ్లబడ్డ సవాలక్ష చిల్లర వివరాల్లో అదీ ఒకటి, అంతకు మించిన ప్రాముఖ్యత దానికి లేదు” అని చప్పరించేస్తే కుదరదు. అప్పుడది ఫోర్ షాడోయింగ్ అవదు. ఫోర్ ట్వంటీ యవ్వారం అవుతుంది. పూర్వ నీడల పేరుతో పాఠకుల్ని మోసబుచ్చజూస్తే కథకుడి క్రెడిబిలిటీపై క్రీనీడలు కమ్ముకుంటాయి.

‘ప్రళయం’ కథలోనే మొదటి చాప్టర్‌లో ఈ క్రింది వాక్యాలొస్తాయి:

 

————-

ఈ మధ్య భారతదేశం ప్రయోగించిన తొలి వ్యోమనౌక కూడా ఇక్కడ దిష్టి తీయించుకున్నాకే పైకెగిరింది. శాస్త్రవేత్తలు సొంత శక్తియుక్తుల కన్నా శక్తిస్వరూపిణి మహిమల్నే నమ్ముకోవటం వింతే. నాకలాంటి మూఢనమ్మకాలేం లేవు. ఒకే ఒక గాఢ నమ్మకం మాత్రం ఉంది: డబ్బు.

————–

ఇక్కడ వ్యోమనోక ప్రస్తావన వేరే contextలో ఉన్నట్లు కనిపించినా, దాని అసలు ప్రయోజనం కథ చివర్లో తెలుస్తుంది. ఇదొక రకం ఫోర్ షాడోయింగ్.

చివరగా – కథలో ఫోర్ షాడోయింగ్ దేనికి అవసరం, దేనికి అవసరం లేదు అనేది గుర్తెరగటం ముఖ్యం. సాధారణంగా కథకి అత్యంత కీలకమైన విషయానికి ఫోర్ షాడోయింగ్ వన్నె తెస్తుంది. ప్రతి చిన్న విషయానికీ పూర్వనీడలు పరుస్తూ పోతే కథ పొడుగు పెరగటం, పాఠకులకి చిర్రెత్తటం తప్ప ఒరిగే ప్రయోజనం ఉండదు.

*

 

 

ఎండు చేపా, ఎండు చేపా, ఎందుకున్నావు కథలో?

artwork:"Artio" Mahy ( www.artioadvertising.com)

artwork:”Artio” Mahy (www.artioadvertising.com)

3

~

 

అనగనగా అప్పుడెప్పుడో పూర్వకాలంలో, అదేదో దూరదేశంలో కుక్కలకి వేట నేర్పటానికో పద్ధతి పాటించేవాళ్లు. ఫలానాదాని వాసన చూపిస్తే దేవులాడుకుంటూపోయి దాని ఆచూకీ పట్టేయటం శునకరాజావారి పని . కానీ ఆ ఫలానా వాసనకన్నా ఘాటైన పరిమళమేదో వాతావరణాన్ని కమ్మేస్తే రాజావారి పరిస్థితేంటి? కాబట్టి, ఎట్టి పరిస్థితిలోనైనా అసలు వాసన మీదనే మనసు లగ్నం చేసేలా జాగిలాలకి తర్ఫీదునీయటం ముఖ్యం. అందుకోసం శిక్షణాప్రాంగణాన్ని ఎండుచేపల తీవ్రాతితీవ్రమైన సుగంధంతో ముంచెత్తేవారు. ఆ కంపుదెబ్బకి దారితప్పుతుందా, లేక ఆనవాలు వాసనే ఆఘ్రాణిస్తూ పోయి ఆచూకీ కనిపెట్టేస్తుందా అన్నది పరీక్ష.

కథలు రాసే మెళకువలేవో దొరుకుతాయనొస్తే కుక్కల వేట చిట్కాలు ఎదురయ్యాయని కళవళపడకండి. ఈ ఉపోద్ఘాతమంతా కథారచనలో వాడబడే ‘రెడ్ హెర్రింగ్’ అనబడే ఒకానొక ప్రక్రియ గురించి.

‘హెర్రింగ్’ అనే ఒకరకం వెండి చేపని ఎండబెట్టి పొగలో పండబెడితే కాసేపటికది ఎర్రబారి ‘రెడ్ హెర్రింగ్’ అవుతుంది. అప్పట్లో శునక శిక్షకులు ఎలాగైతే ఈ యొక్క ఎర్ర హెర్రింగుతో కుక్కల్ని ఉద్దేశపూర్వకంగా దారి మళ్లించ ప్రయతించేవాళ్లో, అలాగే కొన్ని తరహా కథల్లో పాఠకుడి దృష్టి అసలు విషయం నుండి మరెటో మళ్లించటానికి కథకులు రకరకాల ఎత్తులు వేస్తారు. ఇవి సాహిత్యానికి సంబంధించిన రెడ్ హెర్రింగ్స్. పాత్రికేయులడిగే ప్రశ్నలకి రాజకీయ నాయకులు పొంతన లేని సమాధానాలు చెప్పి అసలు సమస్యనుండి దృష్తి మళ్లిస్తారు చూడండి – అది రాజకీయెర్ర హెర్రింగన్న మాట. మనకి రాజకీయాల్తో సంబంధం లేదు కాబట్టి కథల్లో ఎండు చేపలెందుకో మాత్రం చూద్దాం.

అన్ని రకాల కథలకీ ఎర్ర హెర్రింగులతో అవసరముండదు. వీటి ఉపయోగం అపరాధ పరిశోధన, సస్పెన్స్, హారర్, మిస్టరీ తరహా కథల్లోనే ఎక్కువగా ఉంటుంది. సాధారణీకరించాలంటే – చిక్కు ముడులు విప్పే తరహా కథలకి ఎండు చేపలతో ఎక్కువగా అవసరం పడుతుంది. ఈ కథల్లో ప్రధాన పాత్ర ఓ సమస్య పరిష్కరించటానికి పూనుకుంటుంది. ఆ సమస్య ఓ హత్యో, దొంగతనమో, మరే నేరమో కావచ్చు; నిధి నిక్షేపాల ఆచూకీ కనిపెట్టటం కావచ్చు; ఏదో రహస్యం గుట్టు విప్పటమూ కావచ్చు. ఆ పని చేసే క్రమంలో ప్రధాన పాత్రకి పలు ఆధారాలు లభించటం, వాటినో క్రమంలో పేర్చుకుంటూ పోయి చివరికి చిక్కుముడి విప్పటం – స్థూలంగా ఇదే కథ. రెడ్ హెర్రింగులేమీ లేకుండానే ఇలాంటి కథలు రాసేయొచ్చు. అయితే అవి చప్పగా ఉండే అవకాశాలెక్కువ. చేప కూరకి మసాలా ఎంత ముఖ్యమో, చిక్కుముడి కథకి ఎండుచేపలు అంత ముఖ్యం. ఎందుకో చూద్దాం పదండి.

మిస్టరీ, క్రైమ్, డిటెక్టివ్ తరహా కథలు ఇష్టపడే పాఠకులు వాటిలో ఎదురయ్యే చిక్కు ప్రశ్నలు కథానాయకుడి కన్నా ముందు తామే పరిష్కరించాలని ఉబలాటపడతారు. వాళ్లు ఇటువంటి కథలు చదవటానికి సదరు ఉబలాటమే సగం ప్రేరణ. కానీ ఈ పాఠకులతో వచ్చిన చిక్కేమిటంటే – వాళ్లు ఇలాంటి కథలు విరగబడి చదివేసి కథానాయకుడికన్నా ముందే సమస్యని పరిష్కరించే స్థాయికి చేరిపోయుంటారు! వాళ్లు వాసన పట్టలేనంత పకడ్బందీగా కథ నడపాలి. ముగింపుదాకా రాకముందే మిస్టరీ విడిపోయిన కథ తుస్సుమన్నట్లే. కాబట్టి ఇలాంటి కథల్లో పాఠకుల్ని చివరిదాకా దారి తప్పించాలి. వాళ్లనుద్దేశించి కథలో కొన్ని తప్పుడు ఆధారాలొదలాలి. అవి ఎంత పక్కాగా ఉండాలంటే, అవే అసలు ఆధారాలనుకుంటూ పాఠకుడు వాటి వెంటబడి పరుగుతీయాలి. చివరికొచ్చాక తన తప్పు గ్రహించి నాలిక్కరుచుకోవాలి. ఈ నాలిక్కరిపించేవే రెడ్ హెర్రింగ్స్ లేదా ఎండు చేపలు.

రెడ్ హెర్రింగ్స్ ఎలా ఉండాలో చెప్పమంటే కష్టం. చాలా అపరాధపరిశోధనా కథల్లో ఓ పోలిక్కనిపిస్తుంది: ఓ నేరం; ఏ అరడజను మందో అనుమానితులు; నేరం చేయటానికి అందరికీ సహేతుకమైన కారణాలు, అవసరాలు. ఇది రెడ్ హెర్రింగ్‌కి ఓ మూస ఉదాహరణ. అయితే రెడ్ హెర్రింగ్ అంటే ఇలాగే ఉండాలనేం లేదు. నిజమైన ఆధారం నుండి పాఠకుడి దృష్టి మళ్లింపజేసేది ఏదైనా – అదొక అసందర్భ వ్యాఖ్య కావచ్చు, జోక్ కావచ్చు, మరోటి కావచ్చు – అది రెడ్ హెర్రింగ్ కిందకే వస్తుంది.

సాధారణంగా రెడ్ హెర్రింగ్స్ అనేవి కథ పూర్తిగా రాసిన తర్వాత వేసే తాలింపులు. అప్పటికి కథ ఓ రూపానికొస్తుంది కాబట్టి ఎక్కడెక్కడ పాఠకుడి దృష్టిమళ్లించాలో రచయితకి అవగాహనొస్తుంది. అప్పుడు అవసరమ్మేర రెడ్ హెర్రింగ్స్ చల్లితే సరిపోతుంది. అయితే ఒకటి – పాఠకుడి దృష్టి మళ్లించటానికి రచయిత తోచినన్ని వేషాలేయొచ్చు, కానీ ఆ వేషాలు మితిమించకూడదు. మీరిచ్చే ఆధారాలు తప్పైనా ఒప్పైనా కథ పరిధిలోనే ఉండాలి, కథకి సంబంధించినవై ఉండాలి. మాన్య మంత్రివర్యులవారు సభలో ప్రతిపక్షం సంధించిన ప్రశ్నకి సంబంధం లేని అనర్ఘళ సమాధానమివ్వటాన్ని చూస్తున్న టీవీక్షకులకి ఎలా చిర్రెత్తుతుందో, రెడ్ హెర్రింగ్ అనుకుంటూ కథకి సంబంధంలేని చెత్తంతా రాస్తే చదివేవారికీ అలాగే చిరాకేస్తుంది. అవసరమైన వివరాలని కావాలని దాచిపెట్టి అనవసరమైన విశేషాలతో కథంతా నింపేసి చివర్లో అసలు సంగతి బయటపెట్టటం సరైన పద్ధతి కాదు. పాఠకుడికి ఎండుచేపలు ఎరవేయటానికీ, తొండిచేయటానికీ చాలా తేడా ఉంది. రెడ్ హెర్రింగ్స్ పని పాఠకుల్ని వక్రమార్గం పట్టించటం; వాళ్లని వెధవల్ని చేయటం కాదు.

కొన్ని రకాల కథల్లో రెడ్ హెర్రింగ్స్ ఉంటాయనే అంచనా ఉన్న పాఠకుడు కనబడ్డ ప్రతి ఆధారాన్నీ అనుమానంగానే చూస్తాడు. ఇలాంటివారిని బురిడీ కొట్టించటం కాస్త కష్టమే కానీ  అసాధ్యమేమీ కాదు. దానికోసం కథకుడు చేయాల్సిందల్లా, అది రెడ్ హెర్రింగ్ అని అనుమానం రాకుండా, అతి సాధారణంగా కనపడే వాక్యాలతో పాఠకుడి దృష్టి మళ్లించటమే. అంటే, కథలో ఎండుచేపలున్నా వాటి వాసన తెలీకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. వ్యక్తిగతంగా – నా దృష్టిలో పాఠకుడిని పూర్తిగా తప్పుదారి పట్టించకుండా, అన్ని వివరాలూ సక్రమంగా అందిస్తూనే వాటి పూర్వోత్తర సంబంధాన్ని (context) మాత్రం స్పష్టపరచకుండా వదిలేసి, పాఠకుడి దృక్కోణాన్ని కాస్త పక్కకి జరిపే రకం రెడ్ హెర్రింగ్స్ ఉత్తమమైనవి, అత్యంత ప్రభావశీలమైనవి. ఇటువంటి కథలు మొదటిసారి చదివినప్పుడు ఓ రకంగానూ, context బోధపడ్డాక తిరిగి రెండోసారి చదివినప్పుడు మరోరకంగానూ కనిపించి పాఠకులతో ఔరా అనిపిస్తాయి. నా ‘శిక్ష’ కథలో ( లంకె ) ఈ విధమైన ఎండుచేపలు దండిగా ఉంటాయి గమనించండి. ఎర్ర హెర్రింగుల్ని కేవలం చిక్కుముడి కథల్లోనే కాదు, సందర్భం కుదిరితే ఎలాంటి కథలోనైనా దర్జాగా వాడుకోవచ్చు అనేదానికీ ఈ కథ ఓ ఉదాహరణ.

ఇదే కథలో నేను వాడిన మరో ప్రక్రియ గురించి మరో భాగంలో తెలుసుకుందాం.

గమనిక: కథల్లో రెడ్ హెర్రింగ్స్ వాడకానికి ఉదాహరణలీయటానికి చాలా గొప్పకథలున్నాయి కానీ, వాటిని విపులీకరించటం వల్ల ఆయా కథల ముగింపులు బయటపడిపోయే ప్రమాదముంది. అందువల్ల ఈ వ్యాసంలో వాటి జోలికిపోలేదు.

*

ఇంతకీ క్లుప్తత అంటే ఏమిటి?

 

 

‘కథాయణం’ పరంపరకి కొనసాగింపుగా, అందులో స్పృశించకుండా వదిలేసిన అంశాలతో శీర్షికేదైనా రాస్తే బాగుంటుందన్న సారంగ సంపాదకులు అఫ్సర్ సూచనతో ఈ ‘కథన కుతూహలం’ రూపుదిద్దుకుంది. నిజానికి ఈ పేరు ‘కథాయణం’ కోసం అనుకున్నది; అప్పట్లో తప్పిపోయి ఈ రకంగా దాని కొనసాగింపుకి అమరింది.

‘కథాయణం’ విషయంలో – ఏమేం అంశాలపై ఏ క్రమంలో రాయాలో ముందే అనుకుని ఆ ప్రకారం రాసుకుపోయాను. ఈ సారి దానికి భిన్నంగా, సద్యోజనితంగా రాయాలని అనుకున్నాను. కాబట్టి ఈ ‘కథన కుతూహలం’ కథాయణానికి భిన్నంగా కనిపించొచ్చు. ఒక్కో భాగం ఒక్కోలా అనిపించొచ్చు కూడా. ఎలా కనిపించినా, ఇందులో ప్రధానాంశం మాత్రం కథనానికి సంబంధించిన సాంకేతికాంశాల వివరణ.

గత భాగంలో ‘బ్రహ్మాండం’ (అనువాద) కథ చదివారు. ఆ కథ పరిచయంలో అది నన్ను ఆకట్టుకున్న కారణాల్లో ఒకటి ‘క్లుప్తత’ అన్నాను. కథకుడు పదాల వాడకంలో పొదుపెందుకు పాటించాలంటే –  పొడుగాటి వాక్యాలు చదివి అర్ధం చేసుకోవటం కన్నా చిన్న వాక్యాలు అర్ధం చేసుకోవటం తేలిక కాబట్టి; అది పాఠకుల సమయాన్ని ఆదా చేస్తుంది కాబట్టి; అవసరమ్మేరకే వాడబడ్డ పదాలు అనవసరమైన కొవ్వుని కరిగించేసి కథ సొగసు పెంచుతాయి కాబట్టి.

ఇంతకీ క్లుప్తత అంటే ఏమిటి? అది ఏమి కాదో చెప్పటం తేలిక. క్లుప్తత అంటే – కథలో వాక్యాలు ఎడాపెడా తెగ్గోసి పుటల సంఖ్య తగ్గించేయటం మాత్రం కాదు. కథ ఎంత పెద్దగా లేదా చిన్నగా ఉండాలనేది దాని కథాంశం నిర్దేశిస్తుంది. ముప్పై పేజీలకి పైగా సాగే కథలో క్లుప్తత దండిగా ఉండొచ్చు, మూడే పేజీల కథలో అది పూర్తిగా కొరవడనూవచ్చు. కాబట్టి వర్ధమాన కథకులు అర్ధం చేసుకోవలసిన మొట్టమొదటి విషయం: కథ పొడుగుకి, క్లుప్తతకి సంబంధం లేదు. పది పదాల్లో చెప్పగలిగే భావాన్ని పాతిక పదాలకి పెంచకుండా ఉండటం క్లుప్తత. అంతేకానీ, పొడుగు తగ్గించటం కోసం అవసరమైన దాన్ని సైతం కత్తెరేయటం కాదు.

“ఈ ఉత్తరం సుదీర్ఘంగా ఉన్నందుకు మన్నించు. సమయాభావం వల్ల ఇంతకన్నా కుదించలేకపోయాను” అన్నాడట పదిహేడో శతాబ్దపు శాస్త్రవేత్త బ్లెయిజ్ పాస్కల్. క్లుప్తీకరించటమనేది ఆషామాషీ వ్యవహారం కాదని ఆ వ్యాఖ్య తెలుపుతుంది. “కవితలు రాయలేని వారు కథలు, అవి కూడా రాయలేని వారు నవలలు రాస్తారు” అనే అతిశయభరిత వ్యంగ్యోక్తి కూడా క్లుప్తత సాధించటం ఎంత కష్టమో వివరించేదే. అయితే, అది కష్టం కావచ్చు కానీ అసాధ్యమైతే కాదు.

కథలో క్లుప్తత సాధించాలంటే కథకుడికి మొదటగా కావలసినది చెప్పదలచుకున్నదానిపై స్పష్టత. ఏం చెప్పాలో తెలీనప్పుడు దాన్ని ఎలా చెప్పాలో తెలిసే అవకాశమే లేదు. ఇలాంటప్పుడే పదాడంబరం రంగప్రవేశం చేసి కథ పొడుగు పెంచుతుంది. ఇక రెండోది, చెబుతున్న విషయమ్మీదనే దృష్టి కేంద్రీకరించగలిగే శక్తి. ఇది కొరవడితే కథలోకి అనవసరమైన పాత్రలు, వాటిమధ్య సందర్భశుద్ధి లేని సంభాషణలు, వగైరా ప్రవేశిస్తాయి. ఈ రెండిటి తర్వాత ముఖ్యమైనది – తక్కువ పదాల్లో ఎక్కువ భావం పలికించగలగటం. ఇవేమీ బ్రహ్మవిద్యలు కావు. సాధనతో సమకూరే సుగుణాలే. కథాగమనానికి దోహద పడని వర్ణనలకి దూరంగా ఉండటం, పాత్రల సంఖ్య పరిమితం చేయటం, పునరుక్తులు పరిహరించటం, అనవసరమైన పాండితీ ప్రదర్శనకి పాల్పడకుండా నిగ్రహించుకోవటం … ఇలా చిన్న చిన్న చిట్కాలతోనే కథలో గొప్ప క్లుప్తత సాధించొచ్చు. వీటన్నింటికన్నా ముందు, క్లుప్తత కోసం ప్రయత్నించే కథకులు వదిలించుకోవాల్సిన దుర్గుణం ఒకటుంది. అది: పాఠకుల తెలివిపై చిన్నచూపు.

ఈ చివరిదానికి ఉదాహరణగా, ‘బ్రహ్మాండం’ అనువాదంలో అత్యుత్సాహంతో నేను చేసిన ఓ పొరపాటుని ప్రస్తావిస్తాను.

మూలకథలో చివరి వాక్యాలు ఇలా ఉంటాయి:

——–

“So the whole universe,” you said, “it’s just…”

“An egg.” I answered. “Now it’s time for you to move on to your next life.”

And I sent you on your way.

——–

ఆ వాక్యాలని క్రింది విధంగా తర్జుమా చేస్తే సరిపోయేది:

——–

“అంటే – ఈ విశ్వమంతా ఒక పెద్ద …”

“అండం” అని నీ భుజం తట్టి చెప్పాను.  “ఇక నీ మరు జన్మకి సమయమయ్యింది.”

ఆ తర్వాత నిన్ను పంపించేశాను.

——–

దానికి బదులు, నేను ఇలా తెనిగించ తెగించాను:

——–

“అంటే – ఈ విశ్వమంతా ఒక పెద్ద అండం! ”

 

“ఉత్తి అండం కాదు. బ్రహ్మాండం. అది బద్దలవటానికింకా చాలా సమయముంది,” అని నీ భుజం తట్టి చెప్పాను.  “ప్రస్తుతం నీ మరు జన్మకి సమయమయ్యింది.”

 

ఆ తర్వాత నిన్ను పంపించేశాను.

——–

పైన రెండో వాక్యం రాసినప్పుడు పదాల పటాటోపం పైన మాత్రమే దృష్టి పెట్టి, ఓ లోపాన్ని పట్టించుకోకుండా వదిలేశాను. ‘బ్రహ్మాండం’ అనే పదం ఇక్కడ వాడాల్సిన అవసరం లేదు. అది కథ పేరులోనే ఉంది. మరో మారు నొక్కి వక్కాణించటం వల్ల అదనంగా వచ్చిపడ్డ విలువేం లేదు. “ఇలా ప్రత్యేకంగా గుర్తుచేయకపోతే – బ్రహ్మాండం అనే పేరుకి, ఈ కథకి ఉన్న సంబంధమేంటో కొందరు పాఠకులు తెలుసుకోలేకపోవచ్చేమో” అన్న అనుమానం నన్నలా రాసేలా చేసింది. మరోలా చెప్పాలంటే, పాఠకుల తెలివితేటలపై అపనమ్మకం! అరుదుగా జరిగినా, పొరపాటు పొరపాటే. ‘బ్రహ్మాండం’ అనే పదాన్ని కంటిన్యుటీ దెబ్బతినకుండా ఇరికించటం కోసం వాక్యాన్ని సాగదీయాల్సొచ్చింది. అలా ఈ కథలో ఓ పునరుక్తి దొర్లింది. ఆ మేరకి క్లుప్తత కుంటుపడింది.

‘అనవసరమైన పాండితీ ప్రదర్శనకి తెగబడకుండా ఉండటం’ అనేదానికి కూడా ఈ ‘బ్రహ్మాండం’ మూలకథ మంచి  ఉదాహరణ. దాని గొప్పదనమంతా, ఉన్నతమైన భావాన్ని అతి సరళమైన రోజువారీ పదాలతో వివరించటంలో ఉంది. ఆ కారణంగా అనువాదంలోనూ తేలిక పదాలే దొర్లేలా జాగ్రత్త పడ్డాను. అందుకు బదులు – సందు దొరికింది కదాని గంభీర పద విన్యాసాలతో వీరంగమేసినట్లైతే మూలకథలో ఉన్న అందమంతా అనువాదంలోంచి ఆవిరైపోయుండేదని నా నమ్మకం.

ఈ విషయంపై ఇంకా రాసుకుంటూ పోవచ్చు కానీ, ‘క్లుప్తత’ అనే అంశమ్మీద కొండవీటి చాంతాడంత వ్యాసం చదవాల్సిరావటం కన్నా పెద్ద ఐరనీ ఉండదు. కాబట్టి దీన్ని ఇంతటితో చాలిద్దాం.

*

సంభాషణల్లోంచి కథనం!

 

~

ఒక చిన్న ఊహని తీసుకుని కేవలం సంభాషణల ఊతంతో గొప్ప కథగా ఎలా మలచవచ్చో చూపిన కథ ‘బ్రహ్మాండం’.

ఈ కథ రాసింది ఆండీ వెయిర్ (Andy Weir). ఆ పేరు చెబితే వెంటనే అందరూ గుర్తు పట్టకపోవచ్చు కానీ, ఇటీవలే విడుదలై విజయాన్నందుకున్న హాలీవుడ్ సినిమా ‘ది మార్షియన్’కి ఆధారమైన, అదే పేరుతో వచ్చిన నవలా రచయిత అంటే చాలామందికి తెలియవచ్చు. అంతగా గుర్తింపులేని కాలంలో అతను రాసిన ‘The Egg’ అనే కథకి అనువాదం ఈ ‘బ్రహ్మాండం’.

andy

ఈ కథలో వర్ణనల్లేవు, అనవసరమైన వివరాల్లేవు, ఎక్కువ పాత్రల్లేవు, ఉన్న రెండు పాత్రలకీ పేర్లు లేవు, ఆ పాత్రల హావభావ వివరణా విన్యాసాల్లేవు, వాతావరణ నివేదికల్లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే – చిట్టి కథకి అనవసరమైనవేవీ ఇందులో లేవు. అత్యవసరమైనదొకటి మాత్రం దండిగా ఉంది: క్లుప్తత. ఇంకా, చెప్పదలచుకున్న విషయమ్మీద గొప్ప స్పష్టత. దాన్ని సూటిగా చెప్పిన పద్ధతి. ఆ రెంటికీ అతి సరళమైన వచనంతో వడివడిగా సాగే కథనం జోడై అక్షరాల వెంట పాఠకుల కళ్లు పరుగులు తీసేలా చేస్తుంది.

‘బ్రహ్మాండం’లో ఎస్టాబ్లిష్‌మెంట్ గట్రా శషభిషలేవీ పెట్టుకోకుండా రచయిత ఎకాయెకీ కథలోకి దూకేస్తాడు. ఎత్తుగడలోనే ఉత్సుకత రేపెడతాడు. ఉత్కంఠభరితంగా కాకపోయినా, చివరికేమౌతుందోననో ఆసక్తి ఆఖరిదాకా నిలుపుతూ కథని ముగిస్తాడు. ‘మీ దృష్టిలో మంచి కథ ఏది’ అని ఆ మధ్య వేంపల్లి షరీఫ్ అడిగితే, ‘చదివించగలిగేది ఏదైనా మంచి కథే’ అన్నాను. అలా చదివించాలంటే దానిలో ఉన్న ‘విషయమే’ కాక దాని నిర్మాణ చాతుర్యమూ ఆకట్టుకోవాలి. అలాంటి చాతుర్యంతో రాయబడ్డ కథ ఇది. చదవండి.

అన్నట్లు – ఈ కథలో ఓ ప్రత్యేకత కూడా ఉంది. సాధారణంగా కథలు ఉత్తమ పురుష (first person) లేదా ప్రధమ పురుష (third person) దృక్కోణంలో సాగుతాయి. అత్యంత అరుదుగా మాత్రమే మధ్యమ పురుష (second person) దృక్కోణంలో రాయబడ్డ కథలు కనిపిస్తుంటాయి. ఈ కథ ఆ అరుదైన దృక్కోణంలో రాయబడింది. ఈ కథకి అదే సరైన విధానమని మీరే ఒప్పుకుంటారు, చూడండి.

ఈ అనువాదంలోనూ ఓ చిన్న విశేషముంది: ఆంగ్ల మూలకథని ఒక్క ఆంగ్ల పదమూ దొర్లకుండా తెనిగించటం.

*

 

 

andy1బ్రహ్మాండం

(Andy Weir ఆంగ్ల కథ  ‘The Egg’ కి మూల కథకుడి అనుమతితో తెలుగుసేత )

~

నువ్వు ఇంటికి వెళుతుండగా జరిగిందది.

రహదారి ప్రమాదం.

అందులో పెద్ద విశేషమేమీ లేదు – నువ్వు చనిపోవటం తప్ప.

పెద్దగా బాధపడకుండానే పోయావు. ఒక భార్యని, ఇద్దరు పిల్లల్నీ వదిలేసి వచ్చేశావు. నిన్ను కాపాట్టానికి వైద్యులు శక్తికొద్దీ ప్రయత్నించారు. కానీ నీ శరీరం ఎంతగా నుజ్జైపోయిందంటే – నువ్వు బతికుండటం కన్నా ఇదే మెరుగంటే నమ్ము.

అలా కలిశావు నువ్వు నన్ను. అదే మొదటిసారి కాదనుకో. కానీ ఆ సంగతి అప్పటికి నీకింకా తెలీదు.

“ఏం జరిగింది?”. నీ తొలి ప్రశ్న. “ఎక్కడున్నా నేను?”. రెండోది.

“చచ్చిపోయావు,” వెంటనే చెప్పేశాను. నాన్చుడు నాకు తెలీదు.

“పెద్ద వాహనమేదో వచ్చి నన్ను ఢీకొంది …”

“అవును”

“నేను … పోయానా!?!”

“అవును. అందులో బాధపడాల్సిందేమీ లేదు. అందరూ పోయేవాళ్లే ఏదో నాటికి”

నువ్వు చుట్టూ చూశావు. ఏమీ లేదక్కడ. ఉంది మనమిద్దరమే.

“ఎక్కడున్నాం మనం? పరలోకమా?” అన్నావు.

“అలాంటిదే”

“నువ్వు … దేవుడివా?”

“అలా కూడా పిలవొచ్చు”

“నా భార్య, పిల్లలు …” అంటూ ఆగిపోయావు.

ప్రశ్నార్ధకంగా చూశాను.

“వాళ్లకేమవుతుందిప్పుడు?” అన్నావు.

“ఏమో, చూద్దాం”, అన్నాను. “నీ విషయానికొస్తే – చనిపోయిన వెంటనే వాళ్లని తలచుకుని బాధపడుతున్నావు. మంచి గుణమే”

అప్పటికి కాస్త తేరుకున్నావు. నన్ను తేరిపారా చూశావు. నీకు నేనో దేవుడిలా కనబడలేదు. ఓ సాధారణ మానవ రూపంలో కనబడ్డాను. అది పురుషుడో లేక స్త్రీనో కూడా తేల్చుకోలేకపోయావు.

“బాధ పడొద్దు,” నేను కొనసాగించాను. “నీ పిల్లలు నిన్నెప్పటికీ ఓ మంచి తండ్రిగా గుర్తుంచుకుంటారు. వాళ్లకంటూ వ్యక్తిత్వాలు, ఇష్టాయిష్టాలు, రాగద్వేషాలు ఏర్పడకముందే పోవటం నీ అదృష్టం. ఇక నీ భార్య – లోకం కోసం ఏడ్చినా లోలోపల నీ పీడ వదిలిందనుకుంటోంది. మీ మధ్యన అంత గొప్ప అనుబంధమేమీ లేదు కదా”

“ఓహ్,” అన్నావు నువ్వు ఆశ్చర్యపోతున్నట్లు. వెంటనే సర్దుకున్నావు. “అయితే, ఇప్పుడేమవుతుంది? నేను స్వర్గానికో, నరకానికో పోతానా?”

“లేదు. మళ్లీ పుడతావు”

“ఓహ్,” మళ్లీ ఆశ్చర్యపోయావు. “అంటే, హిందువులు చెప్పేది నిజమేనన్న మాట!”

“అన్ని మతాలు చెప్పేదీ నిజమే,” అంటూ నడక ప్రారంభించాను. నువ్వు అనుసరించావు, “ఎక్కడికి?” అంటూ.

“ఎక్కడకూ లేదు. మనమున్న ఈ చోట ఎంత నడచినా ఎక్కడకూ వెళ్లం”

“మరి నడవటం ఎందుకు?”

“ఊరికే. నడుస్తూ మాట్లాడుకోటం బాగుంటుంది కాబట్టి”

కాసేపు మౌనంగా నన్ను అనుసరించాక నోరు విప్పావు.

“మళ్లీ పుట్టటం వల్ల ప్రయోజనమేంటి? ఈ జన్మలో నేను నేర్చుకున్నదంతా వదిలేసి మళ్లీ కొత్తగా మొదలెట్టటం … అంత అర్ధవంతంగా లేదు”

“లేదు. నీ గత జన్మల జ్ఞానం ప్రతి జన్మలోనూ నీ తోడుంటుంది. ప్రస్తుతానికి అదంతా నీకు గుర్తు లేదంతే,” అంటూ ఆగాను. నువ్వు కూడా ఆగిపోయావు.

నీకేసి తిరిగి, నీ భుజాలు పట్టుకుని కుదుపుతూ కొనసాగించాను. “ప్రస్తుత జన్మలో నలభయ్యేళ్లే నువ్వు మానవ రూపంలో ఉన్నావు. గత జన్మల సారాన్నంతటినీ అనుభూతించేంత సమయం నీకు దొరకలేదు, అంతటి వివేకం నీకింకా కలగలేదు”

నా మాటలు అర్ధం చేసుకోటానికి ప్రయత్నిస్తూ కాసేపు నిశ్చలంగా ఉండిపోయావు. తర్వాత అడిగావు.

“నాకెన్ని గత జన్మలున్నాయి?”

“లెక్కలేనన్ని. ఒక్కో సారీ ఒక్కో రకం జీవితం”

“రాబోయే జన్మలో నేనెవర్ని?”

“క్రీ. శ. 540, చైనా దేశంలో ఒక గ్రామీణ పడుచువు”

“ఏమిటీ!” అంటూ నిర్ఘాంతపోయావు. “కాలంలో వెనక్కి పంపుతున్నావా నన్ను??”

“సాంకేతికంగా చెప్పాలంటే అంతే. ఈ ‘కాలం’ అనేది నువ్వెరిగిన విశ్వానికి మాత్రమే వర్తించే లక్షణం. నేనొచ్చిన విశ్వంలో విషయాలు వేరుగా ఉంటాయి”

“ఎక్కడ నుండొచ్చావు నువ్వు?” అడిగావు.

“ఎక్కడ నుండో. నాలాంటి వాళ్లు మరిందరూ ఉన్నారు. వాళ్లూ ఎక్కడెక్కడ నుండో వచ్చారు. నీకా విషయాలన్నీ తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది. అవన్నీ నీకర్ధమయ్యేవి కాదు కాబట్టి వాటినలా వదిలేద్దాం”

“ఓహ్,” నిరాశగా నిట్టూర్చావు. అంతలోనే నీకో అనుమానమొచ్చింది. “అవునూ, నేనిలా కాలంలో ముందుకీ వెనక్కీ గెంతుతూ పునర్జన్మలెత్తుతుంటే ఎప్పుడో ఓ సారి నా అవతారాలు ఒకదానికొకటి ఎదురుపడవా?”

“అది తరచూ జరిగేదే. నీ అవతారాలు తన ప్రస్తుత జన్మని మాత్రమే గుర్తుంచుకుంటాయి కాబట్టి ఒకదాన్నొకటి గుర్తుపట్టవు”

“ఇదంతా దేనికోసం?”

“నువ్వు ఎదగటం కోసం. నీ ప్రతి జన్మ పరమార్ధమూ నువ్వు గత జన్మలోకంటే కొంత మెరుగుపడటం. అంతే. అందుకోసం ఓ విశ్వాన్నే సృష్టించాను – నీ ఒక్కడి కోసం”

“నా ఒక్కడి కోసం!?! మరి, మిగతా వాళ్ల సంగతేంటి?”

“మిగతా వాళ్లంటూ ఎవరూ లేరు. ఈ విశ్వం మొత్తానికీ ఉన్నది నువ్వొక్కడివి, నీకు తోడుగా నేను”

నువ్వు భావరహితంగా నాకేసి చూశావు. “మరి, భూమ్మీది ప్రజలందరూ …”

“వాళ్లంతా నీ వేర్వేరు అవతారాలే”

“ఏంటీ!! అందరూ నేనేనా?”

“అవును. ఇప్పటికి తత్వం బోధపడింది నీకు,” అన్నా నేను అభినందనపూర్వకంగా నీ వీపు తడుతూ.

“భూమ్మీద పుట్టిన, గిట్టిన ప్రతి మనిషీ నేనేనా?”

“పుట్టబోయే ప్రతి మనిషి కూడా నువ్వే”

“మహాత్మా గాంధీని కూడా నేనే?”

“నాధూరామ్ గాడ్సేవీ నువ్వే”

“అడాల్స్ హిట్లర్‌ని నేనే?”

“అతను ఉసురు తీసిన లక్షలాది మందివీ నువ్వే”

“ఏసు క్రీస్తుని నేనే?”

“క్రీస్తుని నమ్మిన కోట్లాది భక్తులూ నువ్వే”

నువ్వు మ్రాన్పడిపోయావు.

నేను చెప్పటం ప్రారంభించాను. “నువ్వొకరిని బాధ పెట్టిన ప్రతిసారీ నువ్వే బాధ పడ్డావు. నువ్వు పెట్టిన హింసకి నువ్వే బలయ్యావు. నువ్వు చూపిన కరుణ నీ మీదనే కురిసింది. ఆయుధం నువ్వే, దాని లక్ష్యమూ నువ్వే. కర్తవి నువ్వే. కర్మవీ నువ్వే”

నువ్వు దీర్ఘాలోచనా నిమగ్నుడివయ్యావు. అందులోనుండి బయటపడ్డాక అడిగావు.

“ఎందుకిందంతా చేస్తున్నావు?”

“ఏదో ఒక రోజు నువ్వు నాలా మారతావు కాబట్టి; నువ్వు నా బిడ్డవి కాబట్టి”

“అంటే … నేను … దేవుడినా??”

“అప్పుడేనా? ప్రస్తుతానికి నువ్వింకా పిండం దశలోనే ఉన్నావు. మెల్లిగా ఎదుగుతున్నావు. సర్వకాలాల్లోనూ వ్యాపించిన మానవ జన్మలన్నిట్నీ సంపూర్ణంగా అనుభవించాక, మనిషిగా పరిపూర్ణుడివయ్యాక, అప్పటికి – నువ్వు నీ అసలు అవతారమెత్తటానికి సిద్ధమౌతావు”

“అంటే – ఈ విశ్వమంతా ఒక పెద్ద అండం! ”

“ఉత్తి అండం కాదు. బ్రహ్మాండం. అది బద్దలవటానికింకా చాలా సమయముంది,” అని నీ భుజం తట్టి చెప్పాను.  “ప్రస్తుతం నీ మరు జన్మకి సమయమయ్యింది”.

ఆ తర్వాత నిన్ను పంపించేశాను.

 

*

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ఒక ప్రశ్నలోంచి పుట్టిన కథ !

10253980_10154027889035385_5076761124300498188_n

(కథ 2013 ఆవిష్కరణ సందర్భంగా – అందులో ఎంపికైన కొన్ని కథల నేపథ్యాలు వరసగా ప్రచురించాలని ఆలోచన. ఈ వారం అనిల్ ఎస్. రాయల్ కథ “రీబూట్” నేపథ్యాన్ని అందిస్తున్నాం)

కథ ఎలా పుడుతుంది? ఒక్కో కథకుడికీ ఒక్కో విధంగా.

నావరకూ అది ఓ ప్రశ్నలోంచి పుడుతుంది

‘ఇలా జరిగితే ఎలా ఉంటుంది?’ అనే ప్రశ్నలోంచి. 1898లో హెచ్.జి.వెల్స్ War of the Worlds రాశాడు. సైన్స్ ఫిక్షన్ సాహిత్యంలో అదో మైలురాయి. అంగారకవాసులు భూగ్రహమ్మీద దాడి చేసి దొరికినవారిని దొరికినట్లు చంపుకుతినటం ఆ నవల ఇతివృత్తం. మొదట్లో చెలరేగిపోయిన మార్స్ దళాలు, అనుకోనిరీతిలో భూమ్మీది బాక్టీరియా ధాటికి కుదేలవటం, దెబ్బకి తోకముడిచి తమగ్రహానికి పారిపోవటంతో ఆ నవల ముగుస్తుంది.

ఆ నవల చదివినప్పట్నుండీ నన్నో ప్రశ్న తొలిచేది. ‘అలా పారిపోయిన మార్షియన్స్ రోగనిరోధకశక్తి పెంపొందించుకుని తిరిగి మన మీద దాడి చేస్తే? వాళ్లని కాచుకోటానికి ఉన్న ఒక్క ఆయుధమూ నిర్వీర్యమైపోతే మనుషుల పరిస్థితేంటి?’.

నేను కథలు రాయటం ప్రారంభించిన తొలినాళ్లనుండి ఈ అంశంతో ఓ కథ రాయాలన్న ఆలోచనుండేది. అంటే, War of the Worldsకి సీక్వెల్ రాసే ఆలోచన అన్నమాట.

‘నాగరికథ’, ‘మరో ప్రపంచం’, ‘కల్కి’ తర్వాతో రెండున్నరేళ్లు విరామం తీసుకున్నాక, మళ్లీ కథ రాసే మూడొచ్చింది; సీక్వెల్ ఆలోచనకి దుమ్ము దులిపే వీలు కుదిరింది. అలా ఈ కథ మొదలయింది. దీనికి ముందు నేను రాసిన మూడిట్లో రెండు కథలు టైమ్‌ట్రావెల్ నేపధ్యంలో రాసినవే. అదే నేపధ్యంలో మరోటీ రాసేసి ‘ఇదిగిదిగో నా టైమ్‌ట్రావెల్ త్రయం’ అనాలనే దుగ్థ ఒకటి ఈ రెండున్నరేళ్లుగా తొలుస్తూనే ఉంది.

అందుకే, War of the Worldsకి కొనసాగింపు రాయటానికి సిద్ధమైనప్పుడు దానికి అనుకోకుండానే టైమ్‌ట్రావెల్ నేపధ్యమై కూర్చుంది. నా కథల్లో జరిగిన/జరుగుతున్న చరిత్ర, ఎప్పుడో జరిగిపోయిన/జరగని పురాణాల ప్రస్తావన లీలా మాత్రంగా చొప్పించటం నాకలవాటు – వాటిక్కాస్త సైన్స్ పూతపూసి. ‘రీబూట్’ దానికి మినహాయింపు కాదు. ‘మానవుల మధ్య కలహాలు ముదిరిపోయి ఒకరినొకరు సంహరించుకునే పనిలో మునిగితేలుతుంటే విసిగిపోయిన దేవుడు ప్రళయం ద్వారా మానవజాతిని మళ్లీ మూలాల్లోకి పంపటం’ అనేదో ప్రపంచవ్యాప్త నమ్మకం.

దీన్ని నా కథకి అనుగుణంగా వాడుకుందామనుకున్నాను. మూడో ప్రపంచ యుద్ధం, దాని తదనంతర పరిస్థితులు, మానవులు భూగృహాల్లో బతకటం, ఇలాంటివి అలా వచ్చి కథలో కలిశాయి. భవిష్యత్తులో జరిగే యుద్ధాల్లో మనుషుల బదులు మరసైనికులు పాల్గొనే అవకాశం ఉంది కాబట్టి (అది మరో విధంగా ఇప్పటికే జరుగుతుంది, నిజానికి), ఆ రకంగా కథలోకి రోబాట్స్ కూడా వచ్చి చేరాయి. మరమనిషి ప్రధాన పాత్ర అనగానే ఐజక్ అసిమోవ్ కథలు గుర్తొస్తాయి.

ఆ తరహా సాహిత్యమ్మీద ఆయన వేసిన ముద్ర అంత బలమైనది. ఆ మహారచయిత గురించి తెలుగు పాఠకలోకంలో ఎక్కువమందికి తెలీదు. అందుకే, ఆయన్ని పరిచయం చేసినట్లుంటుందని కథలో అసిమోవ్ ప్రస్తావన తెచ్చాను. ఈ పెద్ద కథని రెండు భాగాలుగా ఏప్రిల్ 6న అసిమోవ్ వర్ధంతి సందర్భంగా ప్రచురించటం జరిగింది.

-అనిల్ .ఎస్.రాయల్

 

 

 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

10253024_10202317416069206_1368318419_oరీబూట్

(a tribute to Isaac Asimov)

***

 

 

క్రీ.. 2372, సెప్టెంబర్ 1. సాయంత్రం నాలుగూ పది.

 

కిటికీలోకి చూస్తున్నాడు విక్రమాదిత్య. బయటకనుచూపుమేరంతా బూడిద వర్ణం. ఒకప్పుడదో మహానగరం. బహుళంతస్తుల భవనాలు, వాటిని కలుపుతూ రహదార్లు. పచ్చదనం పంచుతూ చెట్లు. వాటి కింద సేదదీరుతూ మనుషులు. ఇప్పుడో? శిధిల నగరం. సూర్యుడిని కమ్మేసిన ధూళి మేఘం. పగలూ రాత్రీ ఏకమైన సమయం. కమ్ముకున్న చిమ్మ చీకటి. దాన్ని చీలుస్తూ అప్పుడప్పుడూ లేజర్ మెరుపులుమార్స్ వాసులకీ, మరమనుషులకి మధ్య పోరాటానికి గుర్తుగా. 

 

విక్రమాదిత్య చూపులు బయటున్నా మనసు మాత్రం కొడుకు మీదుంది. ప్రయోగానికింకా రెండుగంటలే ఉంది. అన్నీ సరిగా ఉన్నాయోలేదో ఆఖరుసారి పరీక్షించాలి. వేరే విషయాలు ఆలోచించే సమయం లేదు. కొడుకు మీదనుండి బలవంతంగా మనసు మళ్లిస్తూ కిటికీ అద్దంలో కనిపిస్తున్న తన రూపాన్ని చూసుకున్నాడు. న్యూక్లియర్ ఫిజిక్స్ మరియు రోబోటిక్స్ జంటవిభాగాల అధినేతగా, రక్షణశాఖ కీలక సలహాదారుగా నిరంతరం ఎదుర్కొనే వత్తిడి నలభై ఐదేళ్లకే తెచ్చిపెట్టిన వార్ధక్యం వెక్కిరిస్తూ కనపడింది. ఎర్రబారిన కళ్లు రెండ్రోజులుగా కరువైన నిద్రని గుర్తుచేస్తున్నాయి. తన ముఖంలో గాంభీర్యం తననే భయపెడుతుండగా రిమోట్ అందుకుని ఆఫ్ బటన్ నొక్కాడు. మరుక్షణం కిటికీలోంచి అతని ప్రతిబింబం, దాని వెనకున్న అధివాస్తవిక దృశ్యం మాయమైపోయాయి. అప్పటిదాకా కిటికీలా భ్రమింపజేసిన త్రీడీ టెలివిజన్ తెర వెల్లవేసిన తెల్లగోడలా మారిపోయింది.

బాస్

వెనుకనుండి వినబడ్డ యాంత్రికమైన పిలుపుకి ఉలికిపడి తలతిప్పి చూశాడు. ఐజక్ నిలబడున్నాడక్కడ.

 ***

 

మనిషి పుట్టుక మీద లెక్కకు మిక్కిలి వాదాలు. కోతినుండి మనిషొచ్చాడనే వాళ్లు కొందరు. వేరేదో గ్రహం నుండి వలస వచ్చాడనే వాళ్లింకొందరు. అదనంగా, పురాణాలు ప్రవచించే ఆదిమానవుడి గాథలు. ఆవిర్భావంపై వివాదాలెలా ఉన్నా, మనిషి ఎలా అంతరిస్తాడనే విషయంలో మాత్రం ప్రస్తుతం ఎవరికీ అనుమానాల్లేవు. 

 

మొదట్లో అవసరాల్లోంచి యుద్ధాలు పుట్టేవి. తర్వాత యుద్ధాల కోసం అవసరాలు పుట్టుకొచ్చాయి. క్రమంగా యుద్ధమే అవసరంగా మారింది. అది కల్పించే విస్తారమైన వాణిజ్యావకాశాల కోసం ఇరవై మూడో శతాబ్దం రెండో అర్ధభాగంలో మూడో ప్రపంచ యుద్ధం మొదలయింది. విచ్చలవిడి అణువిస్ఫోటాలకి భూమండలం భస్మీపటలమయింది. ఎక్కడికక్కడ పుట్టగొడుగుల్లా పైకెగసిన అణుధూళి మేఘాలు సూర్యుడిని కమ్ముకుని ప్రపంచాన్ని అంధకారంలో ముంచేశాయి. సూర్యరశ్మి సోకక చెట్లు, అడవులు నశించిపోయాయి. వాటిమీద ఆధారపడ్డ జీవరాశి అంతరించిపోయింది. ఓజోన్ పొర ఆవిరైపోయింది. రేడియేషన్ వల్ల అపరిమితంగా వేడెక్కిన ఉపరితలం ఆవాసయోగ్యం కాకుండాపోయింది. అణుయుద్ధాన్ని తట్టుకోటానికి ముందస్తు సన్నాహాలు చేసుకున్న దేశాలు మాత్రం కొద్ది శాతం మనుషుల్ని, కొన్ని జాతుల జంతువుల్ని భూగర్భ బంకర్లలోకి తరలించి కాపాడుకున్నాయి. 

 

అప్పట్నుండీ మనుషులు పాతాళంలోనే బతుకుతున్నారు. పైన యుద్ధం కొనసాగుతూనే ఉంది. నూట ఎనభై ఏళ్ల సుదీర్ఘ సమరంలో ప్రపంచపటం పూర్తిగా మారిపోయింది. పాత దేశాలెన్నో కనుమరుగయ్యాయి. పాతిక దేశాలు, అవి కట్టిన రెండు కూటములు మిగిలాయి. వాటి తరపున మరసైనికులు భూమ్మీద  మొహరించి పోరాడుకుంటుండగా …. ఐదేళ్ల కిందటొచ్చిపడిందో ఊహించని ఉపద్రవం. దానివల్ల యుద్ధమైతే ఆగలేదు. కానీ యుద్ధ లక్షణాలు మారాయి. లక్ష్యమూ మారింది. 

 

అది క్రీ.. 2367. అరుణగ్రహం నుండి మొదటి బెటాలియన్ భూమ్మీద పాదం మోపిన ఏడాది. ఒకరినొకరు సంహరించుకునే పనిలో మునిగి ఆదమరిచిన మానవుల మీద ఆకస్మాత్తుగా విరుచుకుపడ్డాయి మార్స్ సైన్యాలు. అంగారకుడిమీద బుద్ధిజీవుల ఆనవాళ్లే లేవని అపార్చునిటీ మొదలు ఇరవైపైగా రోవర్లు పంపిన సమాచారమంతా తప్పులతడకని అర్ధమయేసరికే ఆలస్యమైపోయింది. వెలుపలి నుండి వచ్చిపడ్డ ప్రమాదాన్ని కాచుకోటానికి తప్పనిసరి పరిస్థితుల్లో తమ గొడవలు పక్కనబెట్టి ఏకమయ్యారు మనుషులు. 

 (మిగతా కథ – కథ 2013- సంకలనంలో చదవండి)

 

ప్రళయం

pralayam_illustration

అనిల్ ఎస్. రాయల్  పుట్టిందీ, పెరిగిందీ పల్నాడులో. పై చదువులు విజయవాడలో. ఆ పై చదువులు మద్రాసు లయోలాలో. పరిశోధన చేసింది గణిత శాస్త్రంలో. పనిచేస్తుంది కంప్యూటర్ రంగంలో. పద్నాలుగేళ్లుగా ప్రవాసం. సిలికాన్ లోయలో నివాసం. చిత్రలేఖనం చిన్నప్పట్నుండీ ఉన్న సరదా. కథా లేఖనం కొత్త సరదా. ‘ప్రళయం’ అతని ఏడో కథ.–వేంపల్లె షరీఫ్

ప్రళయం

 

* * 1 * *

 

“ఈ ద్వారము తెరచిన ఎడల అమ్మవారు ఆగ్రహించును. లోకమునకు అరిష్టము దాపురించును. ఓ మానవా, వెనుకకు మరలుము”

ఆ తలుపు మీద పెద్ద అక్షరాలతో చెక్కి ఉందా హెచ్చరిక. దాని కిందా, పైనా నోళ్లు తెరుచుకుని మింగటానికి సిద్ధంగా ఉన్నట్లు భయపెడుతున్న రెండు నాగుపాముల ఆకారాలు. వాటి కళ్ల స్థానంలో పొదిగిన జాతిరాళ్లు పై కప్పుకి వేలాడుతున్న గుడ్డి దీపం వెలుగులో మెరుస్తున్నాయి. ఆ పడగల కింద భారీ పరిమాణంలో ఉందో తుప్పు పట్టిన ఇనుప తాళం.

అది శ్రీ చండీ అమ్మవారి ఆలయం. వెయ్యేళ్ల పురాతనమైనది. ఏడాది క్రితం దాకా ఇది స్థానికంగానే ప్రసిద్ధం. ఆ కాస్త పేరు కూడా సమీపంలో ఉన్న శివకోట రాకెట్ సెంటర్ సైంటిస్టుల పుణ్యాన వచ్చిందే. అక్కడ నుండి ప్రయోగించబోయే రాకెట్లు, ఉపగ్రహాల నమూనాలు అమ్మవారి ముందుపెట్టి ప్రత్యేకంగా అర్చన చేయించటం ఆనవాయితీ. ఈ మధ్య భారతదేశం ప్రయోగించిన తొలి వ్యోమనౌక కూడా ఇక్కడ దిష్టి తీయించుకున్నాకే పైకెగిరింది. శాస్త్రవేత్తలు సొంత శక్తియుక్తుల కన్నా శక్తిస్వరూపిణి మహిమల్నే నమ్ముకోవటం వింతే. నాకలాంటి మూఢనమ్మకాలేం లేవు. ఒకే ఒక గాఢ నమ్మకం మాత్రం ఉంది: డబ్బు. భూమ్మీద దేవుడి అవసరం లేని వాళ్లున్నారు కానీ డబ్బవసరం లేని వాళ్లు లేరు. కాబట్టి నేను దైవానికన్నా ధనాన్నే ఎక్కువ నమ్ముతాను.

మొత్తానికి ఆ వెర్రి సైంటిస్టుల దయవల్ల చుట్టుపక్కల గ్రామాల్లో పేరుబడటమే తప్ప చండీ అమ్మవారి గురించి దేశంలో మరెవరికీ తెలీదు. అలాంటిది పోయినేడు అమ్మవారి పేరు ప్రపంచమంతా మార్మోగిపోయింది. ఆలయం అడుగునున్న నేలమాళిగల్లో లక్షల కోట్ల రూపాయల విలువైన సంపద బయటపడటం దానిక్కారణం. భూమికి యాభై అడుగుల లోతున ఉన్న నేలమాళిగల్లో శతాబ్దాలుగా పోగుపడి ఉన్న బంగారం, వజ్రాలు, ఇతర ఆభరణాలని లెక్కించటానికి ప్రభుత్వాధికారులకి నాలుగు నెలలు పట్టింది. నేలమాళిగలో మొత్తం ఆరు గదులుండగా, ఐదు గదుల సంపద వెలికి తీశాక – ఆరోగది తెరిస్తే అరిష్టమని గుడి ధర్మకర్తలు దావా వెయ్యటాన, అది తేలేవరకూ దాన్ని తెరవొద్దని కోర్టు ఆదేశించటాన, ఆరో గది తలుపులింకా మూతబడే ఉన్నాయి. ఆ గది ముందే ఉన్నా నేనిప్పుడు.

ఇంత సంపదున్న ప్రాంతానికి ఉన్న భద్రతల్లా ఇద్దరు సెంట్రీలు, నేలమాళిగ లోపలకి వెళ్లే ఇనప గేటుకి రెండు పెద్ద తాళాలు, కోర్టు తీర్పు వెలువడేదాకా గేటు తెరవొద్దన్న ఆదేశాలు. అమ్మవారి సొమ్ముని ఆమే కాపాడుకుంటుందన్న ధీమానేమో, కనీసం లోపల అలారం సిస్టం కూడా లేదు. నాలాంటి దొంగకి ఇందులోకి చొరబడటం నీళ్లు తాగినంత సులువు. తవ్వకాలు జరుగుతున్నప్పుడు కాంట్రాక్టు కూలీ అవతారమెత్తి నేలమాళిగలో ఎక్కడేముందో క్షుణ్నంగా తెలుసుకుని మరీ ఈ పధకం రూపొందించాను. తెల్లవారుఝామున మూడింటికి సెంట్రీలు డ్యూటీ మారే సమయంలో నేలమాళిగలోకి చొరబడి, ఆరో గది తలుపు బద్దలు కొట్టి, లోపలనుండి అందినంత బంగారాన్ని మూటగట్టుకోవటం; ఈ లోగా పైన తెల్లారిపోతుంది కాబట్టి మళ్లీ చీకటి పడేదాకా అందులోనే కాలక్షేపం చేసి తిరిగి తెల్లవారుఝామున మూడుగంటలకి బయటికి జారుకోవటం; ఆలయం గోడ పక్కన పొదల్లో దాచిన మోటార్‌సైకిల్ మీద ఉడాయించటం …. అదీ ప్లాన్. పధకం పక్కాగా ఉంది. అందులో సగం చక్కగా పూర్తయింది.

తలుపు మీదున్న వాక్యం మరోసారి చదివి నవ్వుకుంటూ నాతో తెచ్చుకున్న బ్యాక్‌ప్యాక్ తెరిచి అందులోని వస్తువుల్ని నేలమీద పరిచాను: రెండు బిరియానీ పొట్లాలు, నాలుగు మంచినీటి సీసాలు, ఒక టార్చ్ లైట్, చిన్న రంపం, అర డజను హ్యాక్ సా బ్లేడులు.

రంపం అందుకుని తాళం కొయ్యటం మొదలుపెట్టాను. గంటన్నర గడిచి, మూడు బ్లేళ్లు విరిగి, వళ్లు చెమటతో తడిసి ముద్దయ్యాక ఊడొచ్చిందది. రంపం కింద పడేసి గాఢంగా ఊపిరి పీల్చుకుని తలుపు బలంగా నెట్టాను. కిర్రుమనే శబ్దంతో తెరుచుకుందది.

ఎదురుగా, ఐదొందలేళ్లుగా మానవమాత్రుడు అడుగు పెట్టని గది.

టార్చ్ లైట్ వెలిగించి లోపలకు వేశాను. చాలా పెద్ద గదిలాగుందది. సొరంగంలా పొడుగ్గా ఉంది.

గుమ్మం దాటుకుని ఎడమ కాలు లోపల పెడుతుండగా …. టప్ మనే శబ్దంతో పైనున్న గుడ్డి బల్బ్ పేలిపోయింది. టార్చ్ వెలుగు తప్ప అంతా చీకటి.

“అపశకునమా?”. ఛత్. దొంగలకు చీకటి వరం. ఇది శుభశకునమయ్యుండాలి.

టార్చ్ లైట్ సాయంతో వెదకటం ప్రారంభించాను. బంగారం రాశులు ఏ మూల దాగున్నాయో?

పెద్దగా కష్టపడే పనిలేకుండా పావుగంటలోనే బోధపడింది. ఖాళీ గది వెక్కిరించింది. రాశుల్లేవు, రప్పల్లేవు. బంగారం మూటల్లేవు. నా ముఖంలో నెత్తుటి చుక్కలేదు. చిల్లర దొంగతనాలతో రోజులు నెట్టుకొస్తున్న నేను ఈ చివరి చోరీతో దొంగ బతుక్కి గోరీ కట్టి కొత్త జన్మెత్తొచ్చన్న ఆశలు ఆవిరయ్యాయి. కసిగా కాలితో నేలపై తంతుండగా టార్చ్ వెలుగులో ఓ మూల తళుక్కుమందది. వెంటనే వెళ్లి చూశాను.

ఇందాక వెదికినప్పుడు కనబడలేదు. ఎక్కడినుండో ఊడిపడ్డట్లు ఉందది. అమ్మవారి బుల్లి విగ్రహం. పదంగుళాల ఎత్తున పోతపోసిన పసిడి. అధమం కిలోన్నర బరువన్నా ఉంటుంది. పాతిక లక్షలకి తక్కువుండదు. పోనీలే, ఇంత కష్టపడ్డందుకు ఇదన్నా దక్కింది.

ఉదయం ఆరున్నరయింది. రాత్రంతా నిద్రలేకపోవటంతో కళ్లు మండుతున్నాయి. బయటపడటానికి ఇంకా ఇరవై గంటల పైన నిరీక్షించాలి. అప్పటిదాకా చేసేదేమీ లేదు కాబట్టి కాసేపు వళ్లు వాలిస్తే పోతుంది.

 

 

* * 2 * *

నేలమాళిగనుండి బయటపడే సమయం దగ్గర పడింది. లేచి అడుగులో అడుగేసుకుంటూ గేటు దగ్గరికొచ్చాను. బయటంతా చీకటి. ఎక్కడినుండో వస్తున్న వెలుగులో పరిసరాలు మసకగా కనబడుతున్నాయి. ఆ వెలుగులో గంతులేస్తున్న నీడలు అది విద్యుద్దీపాల కాంతి కాదని తెలియజెపుతున్నాయి. శీతాకాలం కదా. సెంట్రీలు చలి మంటలేస్తున్నారేమో.

గేటు తాళాలు తెరిచి బయటికొచ్చి శబ్దం కాకుండా తాళాలేశాను. చోరీ సంగతి ఎంత ఆలస్యంగా బయటపడితే తప్పించుకోవటం అంత తేలిక. గేటు తెరిచిపెట్టి పారిపోకుండా తిరిగి తాళాలేయటం అందుకే.

ఆలయం ఆవరణలో ఓ మూల విసిరేసినట్లున్న చిన్న మంటపంలోకి తెరుచుకుంటుందా గేటు. మంటపాన్ని ఆనుకునే ఆలయ ప్రాకారం ఉంది. చీకటి మాటున ప్రాకారం అవతలకి దూకి అక్కడ పార్క్ చేసున్న మోటార్‌సైకిల్ సాయంతో జారుకోవాలి.

పిల్లిలా గోడవైపు నడుస్తుండగా వచ్చిందా అనుమానం. ఏదో తేడా. ఆగిపోయి చెవులు రిక్కించాను. ఏమీ వినపడలేదు. ఏవో పురుగులు చేస్తున్న సొద. కీచురాళ్లేమో. అది తీసేస్తే రాత్రి పూట సాధారణంగా ఉండే నిశ్శబ్దం. తేడా అది కాదు. ఏమిటది?

జుత్తు కాలుతున్న వాసన. చర్మం కాలుతున్న వాసన కూడా. వాతావరణమంతా ఆవరించినట్లు, అన్ని దిక్కుల నుండీ దుర్వాసన.

మనసు కీడు శంకించింది. అక్కడే ఉంటే దొరికిపోయే ప్రమాదం. కానీ దాన్ని మించిన అపాయమేదో రానుందని మొరపెడుతున్న మనసు. సెంట్రీ గదివైపు చూశాను.

అక్కడ రెండు ఆకారాలు నేలమీద పడున్నాయి – నిశ్చలంగా.

“ఏం జరిగింది?”, కుతూహలం పురివిప్పింది. నా ప్రమేయం లేకుండానే అడుగులు అటుపడ్డాయి.

నిమిషం తర్వాత ….

నేను స్థాణువునై ఆ శవాల ముందు నిలబడి ఉన్నాను. వళ్లంతా బొబ్బలతో పడి ఉన్నాయా శరీరాలు. వాటి మీదున్న దుస్తులు వాళ్లు సెక్యూరిటీ గార్డ్స్ అని చెబుతున్నాయి. ఆ శవాల పైన రొదచేస్తున్న కీటకాలు, పురుగుల సమూహం. తట్టుకోలేని దుర్గంధం.

“ఎవరి పని?”. ఆలోచించే సమయం లేదు. ముందిక్కడినుండి పారిపోవాలి. లేకపోతే దొంగతనానికి తోడు హత్యానేరం నా మీద పడుతుంది. వళ్లంతా చెమటలు పట్టాయి. భయంతో కాదు, ఉక్కతో. ఆ సమయంలో అంత ఉక్కపోత అసాధారణం. అయితే నేను దాన్ని పట్టించుకునే స్థితిలో లేను. వెనుదిరిగి ప్రాకారం వైపు పరిగెత్తబోతుండగా నా దృష్టి సెంట్రీ గది అవతల వంద మీటర్ల దూరంలో ఉన్న ప్రధాన మంటపమ్మీద పడింది.

అప్రయత్నంగా నా గొంతునుండో గావుకేక వెలువడింది.

అక్కడ … పదుల సంఖ్యలో శవాలు. పారిపోయే ప్రయత్నం మానేసి అటు పరుగు పెట్టాను.

అక్కడికి చేరుకునేసరికి నా పై ప్రాణం పైనే పోయింది. ఎటు చూస్తే అటు నిర్జీవ దేహాలు. పెద్దలు, పిల్లలు, పూజారులు, స్త్రీలు, కుక్కలు, కాకులు, పిట్టలు …. గుట్టలు గుట్టలుగా శవాలు. సలసల కాగుతున్న నూనె కుమ్మరించినట్లు, ఆ శరీరాల నిండా బొబ్బలు. ఉడికీ ఉడకని మాంసం ముద్దల్లా, రక్తమోడుతూ. హృదయవిదారకమైన దృశ్యమది. చూడగానే కడుపులో తిప్పింది. నిన్న తిన్నదంతా వాంతయింది. అక్కడుండలేక దూరంగా పరిగెత్తాను. బ్యాక్‌ప్యాక్‌లోంచి నీళ్ల సీసా తీసి ముఖం కడుక్కుని, ఓ గుక్క నీళ్లు తాగి సీసా లోపల పెట్టేయబోతుండగా అందులో ఉన్న అమ్మవారి విగ్రహం చేతికి తగిలింది. దాన్ని తీసి ప్యాంట్ జేబులో దోపుకున్నాను.

కొంచెం స్థిమిత పడ్డాక చుట్టూ పరికిస్తే ఓ చివరన పార్కింగ్ లాట్‌లో అగ్నికి ఆహుతైన మోటారు వాహనాలు కనబడ్డాయి. వాటికి కాస్త అవతలో లారీ ఇంకా తగలబడుతూ ఉంది.

బాంబు దాడేమన్నా జరిగిందా?

అలా ఐతే గుడి కూడా ధ్వంసమై ఉండాలి కదా. పైగా పక్షులు కూడా రాలిపడున్నాయి. కాబట్టి ఇది బాంబు దాడి కాదు.

ఎవరన్నా చూసేలోపే ఇక్కడ నుండి వెళ్లిపోవటం మంచిది. బయట పార్క్ చేసున్న మోటర్ సైకిల్ వైపు నడవటం ప్రారంభించాను, జేబులో విగ్రహాన్ని తడిమి చూసుకుంటూ.

* * 3 * *

నా కళ్లనుండి నీళ్లు ధారలుగా కారిపోతున్నాయి. ఈ ఘోరకలి నమ్మటానికి మనసు నిరాకరిస్తుంది.

సెల్ ఫోన్ ఉదయం పదిన్నరైనట్లు చూపిస్తుంది. ఆ ఫోన్ అందుకు తప్ప మరెందుకూ పనికి రాదని అర్ధమై చాలాసేపయింది. ఎక్కడా సిగ్నల్స్ లేవు. ఆఖరికి సెల్‌ఫోన్ టవర్ల పక్కన కూడా. కరెంట్ కూడా లేదు.

నగరం నడిబొడ్డునున్న క్లాక్ టవర్ సెంటర్లో నిలబడున్నా నేను. అదో నాలుగు రోడ్ల కూడలి. రహదారుల్లో ఎక్కడికక్కడే ఆగిపోయిన వాహనాలు. కొన్ని పూర్తిగా, కొన్ని పాక్షికంగా తగలబడిపోయాయి. వాటి లోపలా, బయటా, రోడ్ల మీదా, పక్కనున్న షాపుల్లో కిటకిటలాడుతూ నిర్జీవదేహాలు. కనుచూపుమేరలో మరో ప్రాణి సడి లేదు. వళ్లు కాలిపోయి, బొబ్బలెక్కి, కమిలిపోయి … మనుషులు, మృగాలు, పక్షులు, కీటకాలు. కళ్లకు కనబడినమేరా కళేబరాలు. మధ్యలో నేను – ఒంటరిగా.

అనాధగా పెరిగిన నాకు ఒంటరితనం కొత్తకాదు. అది నన్నెప్పుడూ భయపెట్టలేదు. కానీ ఇది …. ఇది భయాన్ని సైతం బెదరగొట్టే భీభత్సకాండ.

అమ్మవారి ఆలయం నుండి ఇక్కడిదాకా అదే పరిస్థితి. కాలిపోయిన వాహనాలు, తగలబడుతున్న భవనాలు, మండిపోతున్న ఎండుచేలు, చెల్లాచెదురుగా శవాలు. పొదల మాటున దాచిన నా మోటార్ బైక్ కూడా తగలబడిపోయుంది. దారిలో ఓ శవం నుండి తస్కరించిన డొక్కు సైకిల్ తొక్కుకుంటూ నగరానికి రావటానికి మూడు గంటలు పట్టింది. రెండు టైర్లూ పాడైపోయిన సైకిలది. వేరే దారి లేకపోవటంతో అదే నా వాహనమయింది. నగరానికొచ్చే దారి పొడుగునా యుద్ధరంగాన్ని తలపించే వాతావరణం. కాదు, కాదు .. యుద్ధం కూడా ఇంత భయంకరంగా ఉండదేమో.

నేనా నేలమాళిగలో ఉన్నప్పుడు ఏదో జరిగింది.

శత్రుదేశం దాడి చేసిందా? ఆటం బాంబులేమన్నా ప్రయోగించిందా?

కాకపోవచ్చు. సమీపంలో అణుబాంబు పేలితే భూకంపం లాటిది రావాలి. అలాంటివేవీ నేను గమనించలేదు.

ఇంతకీ … ఇంత దారుణం జరిగి ఇరవై నాలుగ్గంటలయ్యాకా ఇక్కడ మీడియా వాలిపోలేదెందుకు? ప్రభుత్వం సహాయానికి సైన్యాన్ని దించలేదెందుకు?

అప్పుడొచ్చిందా అనుమానం. క్షణాల్లోనే అది పెనుభూతంగా మారి నన్ను ఆపాదమస్తకం వణికించేసింది.

ఈ మారణకాండ ఈ ఒక్క ప్రాంతానికే పరిమితం కాలేదేమో. దేశం యావత్తూ తుడిచిపెట్టుకుపోయిందేమో. బయటి నుండి కూడా సహాయం రాలేదంటే, అంతకన్నా కారణమేముండాలి?

అంటే …. నేనొక్కడినే బతికున్నానా?

ఆ ఊహకి – వెన్నులో మొదలైన జలదరింపు లిప్తలో వళ్లంతా పాకింది. ఉన్నచోటే కూలబడిపోయాను. ఆ వత్తిడికి జేబులో ఉన్న విగ్రహం గుచ్చుకుంటుంటే నా మస్తిష్కంలో ఓ మెరుపు మెరిసింది. “నేనే దీనికంతటికీ కారణమా?”.

తర్కానికి తాళం పడ్డ వేళది. గుట్టలుగా పడున్న శవాలన్నీ ఒక్కపెట్టున లేచి నన్ను చుట్టుముట్టినట్టూ, ఈ శాపం నా పాపమేనని నిందిస్తున్నట్టూ అనిపించింది. “ఆరోగదిలో అడుగుపెట్టి అమ్మవారికి ఆగ్రహం కలిగించానా? మూఢనమ్మకమంటూ కొట్టిపడేసిన విషయమే నిజమయిందా?”.

నాలో తొలిసారిగా పాపభీతి. ఇది నేనెన్నడూ ఎరగని అనుభూతి. “నో, నో. హేతుబద్ధంగా ఆలోచించు. దానికీ దీనికీ సంబంధమేమిటి?” అని నాకు నేనే నచ్చజెప్పుకుంటూ బ్యాక్‌ప్యాక్ లోంచి నీళ్ల సీసా అందుకుని ఓ గుక్క గొంతులో వంపుకున్నాను. అదే చివరి సీసా. ఎక్కడా మంచినీళ్ల జాడలేదు. మళ్లీ నీళ్లు దొరికేదాకా ఈ మిగిలిందొక్కటీ జాగ్రత్తగా వాడుకోవాలి. చూస్తుంటే విధ్వంసమంతా ఉపరితలమ్మీదనే జరిగినట్లుంది. నేలమాళిగలో ఉన్న నాకు ఏమీ కాకపోవటం దానికి సాక్ష్యం. భూమ్మీద నీరంతా ఆవిరైపోయినట్లుంది. నేల పొరల్లో నీరే నాకిప్పుడు గతి. బోరింగ్ పంప్ లాంటిదెక్కడన్నా కనిపిస్తే నీళ్లు తోడుకోవచ్చు. కానీ నగరాల్లో బోరింగులు ఎప్పుడో మాయమైపోయాయి. పల్లెల్లో ఏమన్నా మిగిలున్నాయేమో. తూర్పు దిక్కున పల్లెటూర్లున్నాయి. అటువైపు వెళితే? ఒకవేళ అక్కడ బోరింగ్స్ లేకపోయినా, ఇంకా ముందుకెళితే సముద్రం ఉంది. ఇసుక మేటలుండే సముద్ర తీరాల్లో కురిసిన వాన నీరు ఇసుక పైపొరల్లో నిలవుంటుంది. అక్కడ పైపైన తవ్వితే మంచినీరు ఊరుతుంది.

అప్పుడే మరో ఆలోచన స్ఫురించింది. “పరిసర ప్రాంతాల్లో నాలాగే అదృష్టవశాత్తూ విపత్తు తప్పించుకున్నవాళ్లుంటే? వాళ్లూ నీళ్ల కోసం వెదుక్కుంటూ సముద్రం దిక్కుగా సాగితే?”

ఆలస్యం చేయకుండా పైకి లేచాను. ఇరవై కిలోమీటర్ల లోపే ఉంది సముద్రం. సైకిల్ మీద నాలుగైదు గంటల్లో వెళ్లిపోవచ్చు.

ఎండ మందగించింది. తూర్పునుండి ముసురేస్తుంది. వర్షం మొదలయేలోపే తీరానికి చేరాలనుకుంటూ వాహనం అధిరోహించాను.

 

* * 4 * *

సముద్ర తీరం చేరటానికి అనుకున్నదానికన్నా ఆలస్యమయింది. సగం దూరం వెళ్లేటప్పటికే కారుమబ్బులు కమ్మేశాయి. మధ్యాహ్నం మూడున్నరకే చీకటి పడిపోయింది. యుద్ధభేరీ మోగించినట్లు ఉరుములు, చెవులు బద్దలయ్యే శబ్దంతో పిడుగులు. మార్గమంతా మృత్యువు వికటాట్టహాసాలే. మెరుపుల వెలుగులో దారి వెదుక్కుంటూ, దార్లో పడున్న శరీరాలని జాగ్రత్తగా దాటుకుంటూ ముందుకు సాగటానికి నాకు శక్తెక్కడినుండొచ్చిందో! ఎలాగోలా తీరానికి చేరితే నాలాంటి వాళ్లెవరన్నా కనబడకపోతారా అన్న ఆశ బలాన్నిచ్చిందేమో. సీసాలో మిగిలిన నీళ్లు మధ్యలోనే ఖర్చైపోయాయి. తీరా, తీరానికొచ్చాక నా ఆశ అడియాసయింది. తీరమంతా మనుషులు, పక్షులు, చేపల పార్ధివ దేహాలే. సముద్రపు అలలకి కొట్టుకొస్తూ, తిరిగి లోపలికెళుతూ. లెక్కించటం మొదలుపెడితే సంఖ్య వేలల్లోనే తేలేట్టుంది. వీళ్లు కూడా వళ్లంతా బొబ్బలతో రాలిపోయిన వాళ్లే.

అక్కడికొచ్చేటప్పటికి సాయంత్రం ఆరయింది. ఉరుముల ఉద్ధృతి రెట్టింపయింది. నీటి చెలమ తవ్వుదామనుకుంటుండగానే వాన మొదలయింది. సముద్రం ఉగ్రరూపం దాల్చినట్లు అలలు విరుచుకు పడటం మొదలు పెట్టాయి. తోడుగా హోరుగాలి. దాని ధాటికి సైకిల్ ఎగిరిపోయింది. కొన్ని దేహాలు ఎగురుకుంటూ నా పక్కగా దూసుకుపోతున్నాయి. ఒకట్రెండు – పక్షులవో లేక చేపలవో – ఎగిరొచ్చి నాకు తగిలాయి. చుట్టూ చూస్తే దూరంగా ఓ బోర్లించిన పుట్టి కనబడింది. గాలికి ఎదురీదుతూ దాన్ని చేరుకుని, కాసేపు తిప్పలు పడి కొంచెం పైకెత్తి దాని కింద దూరి ప్రాణాలు అరచేత పెట్టుకుని క్షణాలు లెక్కబెట్టసాగాను.

క్షణాలు నిమిషాలు, నిమిషాలు గంటలయ్యాయి. ఎన్ని గంటలయ్యాయో తెలుసుకోటానికీ లేకుండా సెల్ ఫోన్ వర్షానికి తడిసి మాడిపోయింది. గాలివాన అంతకంతకీ తీవ్రరూపం దాలుస్తుంది. పుట్టి ఏ క్షణంలోనైనా ఎగిరిపోయేలా ఉంది. అదే జరిగితే దానితో పాటు నేనూ గాలికెగిరిపోవటం తధ్యం. పుట్టి ఎగిరిపోకూడదని కోరుకుంటూ ప్రాణాలు చేతబట్టుకుని కూర్చున్నాను. అవసరం ఎవరినైనా అడుక్కునే స్థాయికి దిగజారుస్తుంది. కోరుకున్నవి దర్జాగా కాజేయటమే తప్ప అడిగే అలవాటు లేని నాకు, ఆ అవసరం మొదటిసారిగా వచ్చిపడింది. ఎప్పుడూ దేవుడిని ఏదీ అడగని నేను మొదటిసారిగా అడిగాను, నన్ను కాపాడమని. చేతులు జోడించి మరీ ప్రార్ధించాను. తీతువు కూతలు గుండెలదరగొట్టేవేళ హేతువు తోకముడిచి పారిపోతుందేమో.

ప్రార్ధన పూర్తవకముందే ఓ పెద్ద అల, సముద్రం చెయ్యి సాచినట్లు, వేగంగా దూసుకొచ్చి లిప్తలో నన్నూ పుట్టినీ గిరాటేసింది. నా నుదురు విసురుగా పుట్టికి తగిలింది. తల దిమ్మెక్కిపోయింది. కాసేపేం జరుగుతుందో అర్ధం కాలేదు. తేరుకునేసరికి అల నన్ను సముద్రంలోకి గుంజేసింది. ఉప్పునీరు నోట్లోకీ, ముక్కులోకీ పోయి ఉక్కిరిబిక్కిరవుతూ లోపలికి కొట్టుకుపోయాను. తలకి పెద్ద గాయమే ఐనట్లుంది. విపరీతమైన నొప్పి. కెరటం కాస్త తెరిపివ్వగానే పళ్ల బిగువున నొప్పి భరిస్తూ ఒడ్డుకేసి ఈదటం మొదలుపెట్టాను. అంతలోనే మరో అల నన్ను బలంగా వెనక్కి విసిరికొట్టింది. లేని ఓపిక తెచ్చుకుంటూ ఈత మళ్లీ మొదలుబెట్టబోయాను. అప్పుడే, పక్కనే తేలుతూ ఇందాకటి పుట్టి కనబడింది. వెంటనే ఎక్కేశాను.

ఈ గొడవలో నా బ్యాక్‌ప్యాక్ తప్పిపోయింది. ఓ పక్క దాహం, మరో పక్క ఆకలి. ఇంకోపక్క వణికిస్తున్న చలి. అలలు, ఉరుములు, ఈదరగాలి చేస్తున్న శబ్దాలు కలసికట్టుగా చెవులు పగలగొడుతున్నాయి. పైనుండి కుండపోతగా కురుస్తున్న వర్షం, నాలుగు దిక్కులనుండీ ఎడాపెడా కొడుతున్న కెరటాల మధ్యలో నానిపోతున్న నేను. కన్ను పొడుచుకున్నా కనబడని చిమ్మచీకటి. మెరుపులు మెరిసినప్పుడు మాత్రం సముద్రుడి ఉగ్రరూపం కళ్లముందు ప్రత్యక్షమై వళ్లు జలదరింపజేస్తుంది. ఆ మెరుపుల సాక్షిగా తీరానికి సుదూరంగా వెళ్లిపోయానన్న సంగతి అవగతమయింది. తల తడుముకుంటే చేతికి రక్తం అంటింది. బాగానే పోయినట్లుంది. తొడుక్కున్న చొక్కాలో కొంతభాగం చింపి అక్కడ బిగించి కట్టాను.

ప్రకృతి శక్తుల ముందు మనిషి అల్పత్వం గురించి నాకింకా అనుమానాలేవైనా మిగిలుంటే ఆ తర్వాత కాసేపట్లోనే అవి పూర్తిగా పటాపంచలయ్యాయి. చుట్టూ జరుగుతున్న విలయతాండవం నా కళ్లబడకుండా చీకట్లు కాపాడాయి. అంతెత్తున విసిరేస్తున్న అలల మధ్య పుట్టి తిరగబడకుండా ఉండటం అద్భుతమే. దాని లోపల నాలుగు చోట్ల బలమైన మోకులు కట్టున్నాయి. ఆ మోకులతో నన్ను నేను పుట్టికి కట్టేసుకుని, అలల ధాటికి దాన్నుండి దూరంగా విసిరేయబడకుండా కాపాడుకున్నాను. అలా ఎంత సేపు గడిచిందో తెలీదు. క్రమంగా నన్ను ఆకలి, అలసట ఆక్రమించుకున్నాయి. నీరసం కమ్ముకుంది. అలాగే నిద్రలోకి జారుకున్నాను.

 

* * 5 * *

 

కళ్లు తెరిచేసరికి …. చుట్టూ పండగ వాతావరణం.

ఆశ్చర్యం! నేనున్నది పుట్టిలో కాదు. అది నడిసముద్రమూ కాదు. శ్రీ చండీ అమ్మవారి ఆలయం. మంటపంలో ఓ మూల పడుకుని ఉన్నాను. ఆలయం నిండా భక్తజన సందోహం. తిరునాళ్లేదో జరుగుతున్నంత కోలాహలంగా ఉందక్కడ.

“ఏమిటీ హడావిడి?”, హారతీ గట్రా సరంజామాతో అటుగా వెళుతున్న పూజారిని ఆపి ప్రశ్నించాను.

“ఇంకా తెలీదా నాయనా? ఆరో గదిలో బంగారు బొమ్మ రూపంలో అమ్మవారు వెలిశారు”, ఆయన వింతగా చూస్తూ చెప్పాడు.

“ఆరో గదా? అదెప్పుడు తెరిచారు! తెరిస్తే అరిష్టమని కోర్టునుండి స్టే తెచ్చారుగా”, తెలీనట్టు అడిగాను.

“ఎవడో దొంగవెధవ నాయనా. రాత్రి నేలమాళిగలో చొరబడి గది తలుపులు తెరిచాడు త్రాష్టుడు. వాడి శ్రాద్ధం పెట్ట. తెల్లారి సెక్యూరిటీ గార్డులు వెళ్లి చూస్తే అమ్మవారి విగ్రహం కనబడింది. అపచారం ఉపశమించటానికి శాంతి జరిపిస్తున్నాం” అంటూ పూజారి హడావిడిగా ముందుకు సాగిపోయాడు.

అంటే, ఇందాకటిదాకా జరిగిందంతా నిజం కాదా!?! ఆరో గది తలుపు తెరిచాక, అందులో ఏమీ దొరక్కపోవటంతో బయటికొచ్చి మంటపంలో పడుకుని నిద్రపోయానా? ఆ మొద్దునిద్రలో ప్రపంచం నాశనమైపోయినట్లు కలగన్నానా?

హమ్మయ్య. గుండె తేట పడింది. ఎంత భయంకరమైన పీడకల! నిజంలా భ్రమ పెట్టిన కల.

అయినా, ఏమీ దొరక్కపోతే గప్‌చుప్‌న జారుకోకుండా మంటపంలో పడుకుని నిద్రపోవటమేంటి? ఇంకా ఎక్కువ సేపిక్కడే ఉండటం మంచిది కాదు. వెంటనే వెళ్లిపోవాలి. మోటార్ సైకిల్ తాళాలు ఎక్కడ పెట్టానో?

ప్యాంట్ జేబులు వెదుక్కున్నాను. కుడివైపు జేబులో ఎత్తుగా తగిలిందది. బయటికి తీశాను.

అమ్మవారి విగ్రహం! పదంగుళాల ఎత్తున బంగారు రంగులో మెరిసిపోతూ. ఇది నా దగ్గరుంటే మరి ఆ గదిలో వాళ్లకి కనిపించిందేమిటి?

సాలోచనగా చూస్తుండగానే అమ్మవారి బొమ్మ కదిలింది. ఆమె చెయ్యి అలా అలా పెరిగి పెద్దదై వచ్చి నా చెంపని బలంగా తాకింది. అదే సమయంలో ఆమె గొంతు ఉరిమింది.

“మూర్ఖ మానవాధమా. అనుభవించు”.

 

* * 6 * *

 

చెవిలో ఉరిమిన శబ్దానికి ఒక్కుదుటన మెలకువొచ్చింది. సమీపంలో పిడుగు పడినట్లుంది. కుండపోతగా వర్షం కురుస్తూనే ఉంది. సముద్రమింకా అల్లకల్లోలంగానే ఉంది. నా పుట్టి చిగురుటాకులా వణికిపోతూనే ఉంది. నుదుటి గాయం నొప్పి తట్టుకోనీకుండా ఉంది. తోడుగా తలనొప్పి మొదలయింది. జ్వరం కూడా వచ్చినట్లుంది. వళ్లంతా వేడి సెగలు. జ్వరానికి, చలికీ వణికిపోతూ నేనలాగే పుట్టిలో పడి ఉన్నాను.

ఇదేంటి … ఇంకా పుట్టిలో! మళ్లీ అదే కలా? లేక ఇదే నిజమా? ఇది నిజమైతే ఇందాకటిది అందమైన కలా?

ఏడుపొచ్చింది. కోపమూ వచ్చింది, అమ్మవారి మీద. “అంత చిన్న తప్పుకి ఇంత పెద్ద శిక్షా?”. దిక్కులు పిక్కటిల్లేలా అరవాలనుకున్నాను కానీ నోరు పెగల్లేదు. గొంతు పిడచగట్టుకుపోతుంటే వర్షం నీరు దోసిళ్లతో పట్టుకు తాగాను. దప్పిక తీరింది. ఆకలి అలాగే ఉంది. సమయం ఎంతయిందో తెలుసుకోటానికి సెల్‌ఫోన్ కూడా లేదు. పూర్వకాలంలో గడియారాలతో పనిలేకుండానే గంటెంతయిందో చెప్పగలిగేవాళ్లంట. ఆ విద్యేదో నేర్చుకుంటే ప్రస్తుతం పనికొచ్చుండేది. అయినా నా పిచ్చిగానీ, ఇప్పుడు టైమెంతయిందో తెలుసుకుని చేసేదేముంది?

బుర్రనిండా తలాతోకాలేని ఆలోచనలు. తల పగిలిపోతుంది. కళ్లు వాలిపోసాగాయి. అదృష్టవశాత్తూ మళ్లీ మగత కమ్ముకుంది. అది నన్ను నిద్రలోకో, మత్తులోకో …. మొత్తానికి  ఈ నరకం నుండి దూరంగా తీసుకుపోయింది. ఆ పరిస్థితిలో ఎంతసేపున్నానో, తిరిగి మెలకువ వచ్చేసరికి సూర్యుడు నడినెత్తినున్నాడు. వర్షం ఆగిపోయింది. పైన మబ్బుతునక లేదు. సముద్రం ప్రశాంతంగా ఉంది. దాని మీద నా పుట్టి తేలియాడుతుంది. కనుచూపు మేరలో భూమి లేదు. నలువైపులా నీళ్లు. పైన నీలాకాశం. మిట్ట మధ్యాహ్నం ఎండ మండిపోతుంది. సూర్యకిరణాలు సూదుల్లా గుచ్చుతున్నాయి. గొంతెండిపోతుంది. సముద్రపు నీరు దోసిళ్లతో చేదుకు తాగాలన్న కోరిక బలవంతంగా నిగ్రహించుకున్నాను. ఖాళీ కడుపుతో ఉప్పు నీరు తాగటమంటే చావుని ఆహ్వానించటమే.

నడిసంద్రంలో నేను. జతగా జ్వరం, ఆకలి, నిస్సత్తువ. తల మీది గాయం సలుపుడు. వంట్లో వేడికి తోడు పైనుండి మండించేస్తున్న ఎండ. తట్టుకోలేనంత ఉక్కపోత. దాని దెబ్బకి కాసేపట్లోనే కళ్లు తిరగటం మొదలయింది. వడదెబ్బ తగిలిందా? మరోసారి మగతలోకి జారిపోయాను.

* * 7 * *

ఎవరో పట్టి కుదుపుతున్న భావనకి మెలకువచ్చింది. నేల మీద వెల్లకిలా పడుకుని ఉన్నాను. జ్వరం, వణుకు తగ్గలేదింకా. మత్తుతో కళ్లింకా వాలిపోతున్నాయి. కష్టంగా వాటిని తెరిచి చూస్తే, నా ముఖంలో ముఖం పెట్టి చూస్తున్న అపరిచితులు. దృష్టి ఇంకా మసకగానే ఉండటంతో వాళ్ల ఆకారాలు స్పష్టంగా కనబడలేదు. మొల చుట్టూ ఈకల్లాంటివేవో కట్టుకున్న తుమ్మ మొద్దుల్లాంటి శరీరాలు. ఐదారుగురు ఉంటారేమో. చుట్టూ దడి కట్టినట్లు నిలబడి ఉన్నారు.

వాళ్ల చేతుల్లో ఏంటవి … శూలాలు!

నేనెక్కడున్నాను? ఇది కూడా కలేనా? ఈ విచిత్రాకారులెవరు యమకింకరుల్లా ….

యమకింకరులు!

అర్ధమైంది. నేను చచ్చిపోయాను. నన్ను నరకానికి పట్టుకుపోటానికొచ్చిన యమదూతలు వీళ్లంతా. ఒక్కడి కోసం ఇంతమందా?

కింకరుల్లో ఒకడు ముందుకొంగి నా తల మీద చెయ్యేశాడు. సరిగా గాయమైన చోట. నొప్పి. భరించలేని నొప్పి.

ఇంకా నొప్పేంటి? చచ్చిపోయాకా వదలదా!

కింకరుడి చెయ్యి నెట్టేసే ప్రయత్నంలో తల పక్కకి తిప్పాను. అప్పుడే, తక్కిన కింకరుల్లో కలకలం చెలరేగింది. గజిబిజి భాషలో గందరగోళంగా ఏదో మాట్లాడుకుంటున్నారు. కష్టమ్మీద కళ్లు పూర్తిగా తెరిచి చూశాను. వాళ్లలో ఒకడు కుడివైపుకి చేత్తో చూపిస్తూ ఏదో అరుస్తున్నాడు. నేనూ అటు చూశాను.

సుదూరంగా, ఆకాశంలో మండుతూ దూసుకొస్తున్న అగ్నిగోళం. క్షణక్షణానికీ దాని పరిమాణం పెరిగిపోతుంది. సూటిగా మేమున్న దిశలోనే వస్తుందది.

కళ్లు పెద్దవి చేసి చూడటానికి విశ్వప్రయత్నం చేశాను. అయినా వివరం తెలీకుండా బూజరగానే కనిపిస్తుందది. అంతలో కింకరుల్లో ఒకడు నా కాళ్లు, మరొకడు భుజాలు పట్టుకుని పైకి లేపారు. మిగతావాళ్లు ముందు పరిగెడుతుండగా నన్ను మోసుకుంటూ వాళ్లని అనుసరించారు. అందరి దృష్టీ అగ్నిగోళమ్మీదనే ఉంది. వేగంగా దగ్గరకొచ్చేస్తుందది.

కాసేపట్లో వాళ్లు నన్నో గుహలాంటి దాన్లోకి తీసుకుపోయారు. నేలమీద పడుకోబెట్టి బయటికి చూస్తూ పెద్దగా మాట్లాడుకోసాగారు.

నా చూపింకా మసకగానే ఉంది. అరుణవర్ణంలో ఆకాశం. దాన్ని చీల్చుకొస్తున్న అగ్నిగోళం. వస్తూ వస్తూ అది హఠాత్తుగా పక్షిలా మారిపోయింది. నాకు స్పష్టంగా కనిపించటం లేదు, కానీ అది బూడిద రంగు పక్షి కావచ్చు. ఆగాగు .. పక్షి కాదు … విమానం. అవును విమానమే. దాని పరిమాణం అంతకంతకీ పెరుగుతుంది.

ఎంతమందైనా పట్టేందుకు అనుగుణంగా పరిమాణం పెంచుకునే గుణం పుష్పక విమానానికొక్కదానికే ఉందని విన్నాను. ఇది .. అదేనా?

ఆలోచనల్లో కొట్టుమిట్టాడుతుండగానే విమానం వచ్చి రన్‌వే లాంటిదాని మీద దిగింది.

పుష్పక విమానానికీ రన్‌వే అవసరమా? వెర్రిగా నవ్వాలనిపించింది. నవ్వాలో వద్దో తేల్చుకునేలోపే విమానం ఇందాక నేను పడి ఉన్న ప్రాంతంలో వచ్చి ఆగింది. కాసేపట్లో అందులోనుండి నాలుగైదు ఆకారాలు బయటికొచ్చి మాకేసి నడవసాగాయి. ధవళవస్త్రాల్లో మెరిసిపోతున్నాయా ఆకారాలు.

ఎవరు వాళ్లు? నన్నీ కింకరుల బారినుండి కాపాడి స్వర్గానికి తీసుకెళ్లటానికొచ్చిన దేవదూతలా?

నాకంతా పిచ్చిపిచ్చిగా ఉంది. ముందు పుట్టిలో, తర్వాత గుళ్లో, మళ్లీ పుట్టిలో, ఇప్పుడిక్కడెక్కడో. అసలు నేనెక్కడున్నాను? తలకి తగిలిన దెబ్బకి వెర్రి కానీ ఎక్కలేదు కదా? నేను కలగంటున్నానా, ఏదో పిచ్చిలోకంలో ఉన్నానా, లేక చచ్చిపోయానా? సుడితిరుగుతున్న ఆలోచనలకి తోడుగా తల తిరగటం మొదలుపెట్టింది. మళ్లీ మత్తు కమ్ముతుంది. నో .. నో…. మత్తులో మునిగితే మరెక్కడ తే..ల…తా….నో…

* * 8 * *

హమ్మయ్య. మేలుకున్నాను. ఈ సారెక్కడున్నాను?

కళ్లు తెరిచి చూశాను. పైనెక్కడో కప్పు కనబడింది. పెద్ద గుహ అంతర్భాగంలా ఉంది. నేనింకా కింద పడుకునే ఉన్నాను, కానీ నేల మీద కాదు. మెత్తటి దేనిమీదో. గాయం పెద్దగా బాధించటం లేదు. వళ్లు కూడా తేలిగ్గా ఉంది. జ్వరం తగ్గిపోయినట్లుంది. లేచి కూర్చోబోయాను.

“మెల్లిగా. మీరింకా పూర్తిగా కోలుకోలేదు”. పక్కనుండి మృదువుగా వినబడిందా గొంతు. తల తిప్పి చూశాను. ఓ ధవళవస్త్రధారి, నా పక్కనే చిన్న బండరాయిమీద కూర్చుని ఉన్నాడు.

“ఎవరు నీవు? దేవదూతవా?”, నా గొంతు పీలగా ధ్వనించింది.

“లేదు. వ్యోమగామిని”

“నేనెక్కడున్నాను?”, సర్దుకుని కూర్చుంటూ ప్రశ్నించాను.

“ఆదిమాన్ ఐలాండ్స్‌లో ఉన్నారు. మీరున్న పుట్టి ఈ ద్వీపానికి కొట్టుకొస్తే ఇక్కడి ఆదివాసీలు కాపాడారు. నాలుగురోజులుగా కళ్లు తెరవనీయనంత జ్వరం. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు”

“ఆదిమాన్ ఐలాండ్స్, ఆదివాసీలు! మరి వ్యోమగాములకేం పనిక్కడ?”. హేతువు మళ్లీ నా దరిచేరింది. వళ్లు స్వాధీనంలోకొచ్చేసరికి బుర్ర కూడా పాదరసంలా పనిచేయసాగింది.

“ఈ ద్వీపంలో భారతీయ వ్యోమనౌకలు దిగటానికి అనువుగా రన్‌వే ఉంది”, అతను బదులిచ్చాడు.

అదీ సంగతి. నేను చూసిన అగ్నిగోళం అదన్నమాట! అవి వ్యోమనౌక భూవాతావరణంలో ప్రవేశించినప్పుడు రాపిడికి పుట్టే మంటలన్న మాట.

“మీరు బతికి బయట పడటం ఓ అద్భుతం”, నా ఆలోచనల్ని భగ్నం చేస్తూ మళ్లీ అతనే అన్నాడు.

“నిజమే. సముద్రంలో మునిగిపోకుండా ఇక్కడికి కొట్టుకు రావటం అద్భుతమే. అంతకు ముందు జరిగిన మారణహోమాన్ని తప్పించుకోటం మాత్రం నా అదృష్టం”

“ఎలా తప్పించుకున్నారు?”, అతను ఆసక్తిగా అడిగాడు.

చెప్పాలా వద్దా అని కాసేపు తటపటాయించి చివరికి నోరు విప్పాను. నా కారణంగానే అదంతా జరిగిందేమోనన్న న్యూనతాభావం ఇంకా ఏ మూలో ఉండటం వల్లనేమో, నా ఘనకార్యం ఎవరికన్నా చెబితే కానీ మనశ్శాంతి ఉండదనిపించింది. నేను నేలమాళిగలో ప్రవేశించటం దగ్గర్నుండి మొత్తం పూసగుచ్చినట్లు అతనికి వివరించాక మనసు తేలికపడింది.

“అయితే అసలేం జరిగిందో మీకు తెలీదంటారు”, మొత్తం విన్నాక అతను సూటిగా చూస్తూ ప్రశ్నించాడు.

“ఊఁహు. మీకు తెలుసా?”

“తెలుసు. సూర్యుడి క్రోధాగ్నిలో మానవులు మాడి మసైపోయారు”.

“వాట్?”, అయోమయంగా చూశాను.

“వివరంగా చెబుతాను వినండి”. అతను గట్టిగా ఊపిరి పీల్చుకుని చెప్పటం మొదలు పెట్టాడు. “వారం కిందట జరిగిందది. ఆ రోజు సూర్యుడినుండి విడుదలయ్యే శక్తి హఠాత్తుగా పదులరెట్లు పెరిగిపోయింది. సౌరశక్తిలో హెచ్చుతగ్గులుండటం సాధారణమైన విషయమే కానీ, ఈ సారది ఎవరూ ఊహించనంత ఎక్కువ స్థాయిలో విడుదలయింది. చరిత్రలో ఇటువంటి సంఘటన ఇంతకు ముందెన్నడూ జరిగిన దాఖలా లేకపోవటాన, జరగబోయేది ముందే ఊహించి మనుషుల్ని ఆప్రమత్తం చేసేందుకు అవసరమైన గణాంకాలు లేక మన అబ్సర్వేటరీలేవీ దీన్ని పసిగట్టలేకపోయాయి. హెచ్చరిక లేకుండా వచ్చిపడ్డ ఉత్పాతమది. దాని దెబ్బకి ముందుగా ఉపగ్రహాలు, వాటి మీద ఆధారపడ్డ సమాచార వ్యవస్థలు నాశనమయ్యాయి. భూవాతావరణం కొన్ని గంటల్లోనే అసాధారణ స్థాయిలో వేడెక్కింది. ఎలక్ట్రిసిటీ గ్రిడ్లు పేలిపోయాయి. కరెంట్ లేక, ఏసీలు పని చేయక జనం శలభాల్లా మాడిపోయారు. మండే స్వభావం ఉన్నవన్నీ మండిపోయాయి. నీటి చెలమలు ఆవిరైపోయాయి. సముద్రాల ఉపరితలమ్మీద నీరు మరిగిపోయింది. అక్కడుండే మత్స్య జాతి కళ్లు తేలేసింది. ఈ విలయం ఇరవై గంటల పైగా కొనసాగింది. భూమ్మీద అన్ని దేశాల్లోనూ ఇదే పరిస్థితి. ఈ లోగా, సముద్రాల మీది నీటి ఆవిరి పైకెళ్లి చల్లబడి కనీవినీ ఎరగని స్థాయిలో తుఫాన్లు కురిపించింది. ప్రపంచమంతటా కోస్తా ప్రాంతాలని వరదలు ముంచెత్తాయి ….”

అతని వాక్ప్రవాహానికి అడ్డొస్తూ ప్రశ్నించాను, “ఇదంతా మీకెలా తెలుసు?”

“ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లోనుండి ఈ ఘోరాన్ని ప్రత్యక్షంగా చూశాం మేము.  మూడు రోజుల తర్వాత కింద పరిస్థితులు కుదుటపడ్డాయనిపించగానే హుటాహుటిన తిరిగొచ్చాము. మా రీ-ఎంట్రీలో సహకరించటానికి కిందెవరూ మిగిల్లేరు. అయినా సాహసించి వచ్చేశాం”

“ఈ ఉత్పాతం వల్ల స్పేష్ స్టేషన్‌కి ప్రమాదమేం రాలేదా?”

“భూమ్మీదకన్నా రోదసిలో సూర్యకిరణాల ధాటి ఎక్కువ. కాబట్టి స్పేష్ స్టేషన్ ఇంతకన్నా ఎక్కువ ఉష్ణోగ్రతల్ని కూడా తట్టుకునేలా రూపొందించబడింది”

“బాగానే ఉంది. మరి, భూమ్మీద మిగతా అందరూ మాడిపోయినా ఈ ఆదివాసీలు క్షేమంగానే ఉన్నారేం?”

“ఆదివాసీలు కావటం వల్లనే వాళ్లు బతికిపోయారు. ప్రకృతితో మమేకమై ఉండటం వాళ్లని కాపాడింది. మనలాంటి నాగరీకులం ఎప్పుడైతే యంత్రాల మీద మితిమీరి ఆధారపడటం నేర్చుకున్నామో, అప్పుడే మనం ప్రకృతి భాష మర్చిపోయాం. ఫలితం? ఇదిగో …. ఇది. మనం రూపొందించుకున్న ఏ సాధనమూ ఈ ప్రమాదాన్ని ముందస్తుగా ఊహించి హెచ్చరించలేకపోయింది. టెక్నాలజీ దన్నుతో ప్రకృతిమీద పై చేయి సాధించానని విర్రవీగిన ఆధునిక సమాజం, తాను నమ్ముకున్న సాంకేతిక వ్యవస్థలన్నీ మూకుమ్మడిగా కుప్పకూలిననాడు జరిగేదేమిటో అంచనా వేయలేకపోయింది. మనకి భిన్నంగా, ఈ ఆదివాసీలు చుట్టూ ఉన్న ప్రకృతితో నిత్యం సంభాషిస్తారు. అది చెప్పేది శ్రద్ధగా వింటారు. ఈనాడు అదే వాళ్లని కాపాడింది”

“ఎలా?”

“ఇలాంటి ఉత్పాతాలని ముందుగా పసిగట్టగలిగే శక్తి పశుపక్ష్యాదులకుంది. ఈ విలయం మొదలవటానికి కొన్ని గంటల ముందే ఈ ద్వీపంలో ఉన్న జంతువులన్నీ ఎత్తైన ప్రాంతాలకేసి పరుగులు తీశాయి. అది గమనించి, ఏదో పెనువిపత్తు ముంచుకు రానుందని భావించి వీళ్లు కూడా కొండలపైకెళ్లి అక్కడున్న గుహల్లో దాక్కున్నారు. ఎక్కువ ఎత్తుకి వెళ్లే కొద్దీ వాతావరణంలో వేడి తగ్గుతుందని తెలిసిందే కదా. అదనంగా గుహాంతర్భాగాల్లో ఉండే సహజమైన చల్లదనం తోడై వాళ్లని కాపాడింది”

“అయితే నాగరీకులెవరూ బతికి బట్టకట్టలేదంటారా?”

“అందరూ పోయారనలేం. చల్లటి ధృవాల వద్ద, ఎత్తైన కొండప్రాంతాల్లో ఉండేవాళ్లు కొందరైనా తప్పించుకునే అవకాశం ఉంది. మీలా అదృష్టవశాత్తూ బతికిపోయినోళ్లు కూడా కొందరుండొచ్చు. కానీ వీళ్ల శాతం చాలా తక్కువ. మొత్తమ్మీద, ఆధునిక నాగరికతనేది అంతరించినట్లే. కానీ అంతమాత్రాన అంతా ఐపోయినట్లు కాదు. భూమాత చరిత్రలో మానవుడు లిఖించాల్సిన అధ్యాయాలు మరికొన్ని మిగిలే ఉన్నాయి. ఆ పని కొనసాగించే మహత్తర బాధ్యత ప్రపంచవ్యాప్తంగా మిగిలున్న ఇలాంటి ఆదివాసీలదే”

గుహ ద్వారం వద్ద ఏదో శబ్దమవటంతో సంభాషణాపి అటు చూశామిద్దరమూ. కొందరు ఆదివాసీలు నిలబడున్నారక్కడ. వాళ్లలో ఒకడు లోపలికొచ్చాడు. నేరుగా నా వద్దకొచ్చి నా చేతిలో ఏదో పెట్టాడు.

చండీ అమ్మవారి బంగారపు బొమ్మ. నా జేబులో ఉండాల్సింది.

దాన్ని తిరిగిచ్చేస్తూ ఉంచుకోమన్నట్లు సైగ చేశాను. నన్ను కాపాడినందుకు అంతకన్నా ఎలా కృతజ్ఞత తెలియజేయాలో తోచలేదు.

ఆదివాసీ తల అడ్డంగా ఊపి చాలాసేపు ఏదో గొణిగాడు. ఆస్ట్రోనాట్‌కేసి చూశాను. “ఏమంటున్నాడు?”

అతను నవ్వి చెప్పాడు.

“వాళ్లకు దానితో అవసరం లేదంటున్నాడు”

 ***

Story & Illustration: అనిల్ ఎస్. రాయల్

 

రాయల్ ‘రహస్యం’ వెనుక రహస్యం!

అనిల్ ఎస్. రాయల్ పరిచయం

అనిల్ ఎస్. రాయల్ పేరుగల పిల్లాడు పల్నాడులో పుట్టాడు, అప్పుడెప్పుడో. కథలున్నది వేరేవాళ్లు రాస్తే తను చదవటానికే తప్ప తానే రాయటానికి కాదన్న నమ్మకంతో పెరిగాడు. రోజులు మారాయి. ఎందుకో మరి చదివే కథలు నచ్చకుండా పోయాయి. జీవితాల్ని కాచి వడపోసే కథలు నచ్చక, వేరే రకంవి దొరక్క అల్లాడిపోయాడు. ఆఖరికి అవేవో తానే రాసుకుని చదువుకుంటే పోద్దని తీర్మానించేసుకుని, కథలు రాయటం మొదలెట్టాడు. కాబట్టి అతను కథలు తన కోసమే రాసుకుంటాడు. తనకో కొత్త కథ చదవాలనిపించినప్పుడే రాస్తాడు. నాలుగేళ్లలో ఆరు సార్లే అలా అనిపించటం అతని దురదృష్టం, అతని పాలబడ్డ పాఠకుల అదృష్టం.

 ‘రహస్యం’ కథానేపథ్యం


future

“సైన్స్ ఫిక్షన్ అనేది అద్భుతమైన ఆలోచనలకి వేదిక మాత్రమే కాదు, అది ప్రపంచాన్ని మెరుగుపరచేందుకు జరిగే ప్రయత్నాల్లో ఓ ముఖ్యభాగం. సాధారణ ప్రజానీకానికి తెలియని శాస్త్ర విశేషాలు విడమరచి, సైన్స్ తమపై చూపే ప్రభావాన్ని తెలియజెప్పే పనిముట్టు. సైన్స్ ఫిక్షన్ పఠితలకి ఈ విశ్వాన్ని పరిచయం చేస్తుంది; అందులో మనమెంత అల్పజీవులమో తెలియజెబుతుంది. అది వినమ్రత నేర్పుతుంది. బాలబాలికలకి మొదట్నుండే సైన్స్ ఫిక్షన్ చదవటమ్మీద ఆసక్తి కలగజేస్తే అది వాళ్ల మెదళ్లని వికసింపజేస్తుంది. అటువంటి మనుషులున్న సమాజం అనివార్యంగా జాగృతమవుతుంది”

పైవి నా మాటలు కావు. Hugo Gernsback అనే పెద్దాయన అరవయ్యేళ్ల కిందట అన్న మాటలవి. ఎవరీయన? సైన్స్ ఫిక్షన్ సాహిత్యానికి పితామహుడివంటివాడు. రచయిత, దార్శనికుడు, ఇన్వెంటర్. ఆయన పేరుమీద సైన్స్ ఫిక్షన్ మరియు ఫ్యాంటసీ సాహిత్యానికి ఏటేటా ప్రకటించే Hugo Awards సాహితీరంగంలో ప్రపంచప్రఖ్యాతిగాంచిన పురస్కారాలు.

ఇంతకీ సైన్స్ ఫిక్షన్ అంటే ఏమిటి? ఆ విషయంలో వాదోపవాదాలున్నాయి, కానీ అటూఇటూగా అందరూ అంగీకరించేది: ‘శాస్త్ర పరిశోధనలు, ఆధునాతన సాంకేతిక ఆవిష్కరణల ఆధారంగా ప్రత్యామ్నాయ ప్రపంచాలని సృష్టించేది సైన్స్ ఫిక్షన్’. కథలో సైన్స్ పేరిట ప్రస్తావించిన విశేషాలు గాలి కబుర్లు కాకుండా వీలైనంతవరకూ శాస్త్రీయంగా ఉంటే అది సైన్స్ ఫిక్షన్; లేకపోతే ఒట్టి ఫ్యాంటసీ.

ప్రధాన స్రవంతి సాహిత్యం నిన్నటి గురించీ, నేటి గురించీ ఐతే; సైన్స్ ఫిక్షన్ రేపటి గురించి. అది మనమెవరమూ అంతవరకూ చూసెరగని ప్రపంచాలని ఊహిస్తుంది. ఆ ఊహలు తదనంతరకాలంలో నిజాలైన సందర్భాలు లెక్కలేనన్ని. ట్రాన్సిస్టర్ల నుండి క్లోనింగ్‌దాకా మొదట సైన్స్ ఫిక్షన్ సాహిత్యంలో ఊపిరిపోసుకున్నవే. భవిష్యత్తు ఎలా ఉంటుందో/ఉండాలో ఊహించగలిగే శక్తినిచ్చేది సైన్స్ ఫిక్షన్. అంతేకాదు, అది ఎటువంటి భవిష్యత్తులని నిరోధించాలో కూడా తెలియజెబుతుంది. ఇంత శక్తివంతమైన సాహిత్యం దురదృష్టవశాత్తూ తెలుగులో అత్యంత అరుదు. ‘సైన్స్ ఫిక్షన్’ అనేదాన్ని అచ్చతెలుగులో ఏమంటారంటే తడుముకోవాల్సినంత అరుదు. ఏటా వివిధ మాధ్యమాల్లో విడుదలయ్యే పదిహేనొందల పైచిలుకు తెలుగు కథల్లో సైన్స్ ఫిక్షన్ కథలెన్నంటే వేళ్లు చూపించటానికీ వీల్లేనంత అరుదు. అందుకు కారణాలెన్నైనా ఉండొచ్చు. వాస్తవం మాత్రం ఒకటే: గతంలో ఒకరిద్దరు సాధికారికంగా సైన్స్ ఫిక్షన్ రచనలు చేసినవాళ్లున్నా, ప్రస్తుతం ఆ పని చేస్తున్నవారు దాదాపు లేరు.

నేను సైన్స్ ఫిక్షన్ కథలు రాయటానికి నేపధ్యం ఇది. ‘ఎవరూ రాయట్లేదని వాపోయే బదులు ఆ పనేదో మనమే చేస్తే పోలా’ అనుకుని కథన రంగంలోకి దూకాను, నాలుగేళ్ల కిందట. అప్పట్నుండీ ఆ తరహా సాహిత్యానికే పరిమితమయ్యాను. ఆ క్రమంలో రాసిన కథలు నాలుగు: ‘నాగరికథ’, ‘మరో ప్రపంచం’, ‘కల్కి’, ‘రీబూట్’.

సైన్స్ ఫిక్షన్ కథలు రాయటం ఇతర ప్రధానస్రవంతి కథలు రాయటం కన్నా కష్టం అంటాడు ఆర్ధర్ సి. క్లార్క్. ఇది ఇతర తరహా సాహిత్యాన్ని చులకన చేయటానికన్న మాట కాదు. పాఠకులకి అనుభవంలో ఉన్న ప్రపంచానికి చెందిన కథలు రాయటంలో ఉన్న వెసులుబాటేమిటంటే, వాళ్లకి ఆ ప్రపంచాన్ని ప్రత్యేకించి పరిచయం చెయ్యనక్కర్లేదు. ‘సుబ్బారావు ప్రభుత్వాఫీసులో గుమస్తా’ అంటే సరిపోతుంది. ప్రభుత్వాఫీసుల గురించి, గుమస్తాల విధుల గురించి వివరించనక్కర్లేదు. అదే ‘ఐజక్ ఓ బయాట్’ అని ఓ ముక్కలో రాసేస్తే కుదరదు. అధికశాతం పాఠకులకి బయాట్ అంటే ఏమిటో తెలిసే అవకాశం లేదు కాబట్టి అదేంటో వివరించాలి. కానీ, అది పనిగట్టుకుని పాఠం చెబుతున్నట్లుండకూడదు. ఏ సంభాషణలోనో యధాలాపంగా చెప్పినట్లు కనిపించాలి. మొత్తమ్మీద, పాఠకులకి పరిచయం లేని లోకాన్నొకదాన్ని వీలైనన్ని తక్కువ వాక్యాల్లో నిర్మించాలి, వర్ణించాలి. వర్ణన మరీ ఎక్కువైతే నిడివి సమస్య. అలాగని పొడిపొడిగా వివరిస్తే పాఠకులకి అర్ధంకాకపోయే ప్రమాదం.

ఇవి చాలనట్లు అదనంగా, తెలుగులో సైన్స్ ఫిక్షన్ రాయాలంటే భాషా సమస్యొకటి. Dark Matter, Causality Paradox, Wick Effect, Many Worlds Interpretation, Cryogenics, Androids vs Biots …. ఇలాంటివి తెలుగులో క్లుప్తంగా వివరించటమంటే కత్తిమీద సామే. ఈ సాముగరిడీలు నా మొదటి నాలుగు కథలకీ చెయ్యాల్సొచ్చింది. ఐదో కథకి మాత్రం అంత కష్టపడకూడదనుకున్నాను. తేలిగ్గా ఐపోయేదేదన్నా రాయాలనుకున్నాను. అలా పుట్టిందే ‘రహస్యం’.

ఈ మధ్య రీడర్స్ డైజస్ట్‌లో కనబడ్డ ఓ వ్యాసం నన్ను అమితంగా ఆకట్టుకుంది. దాని సారాంశం: ‘గత పదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాదం, అంతర్యుద్ధం, కరువుకాటకాల వల్ల కలిగే మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది’. ‘గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్’ అనే ఆర్యోక్తి అన్నిసార్లూ నిజం కాదనిపించింది అది చదివాక. భవిష్యత్తు ఎప్పుడూ భయంకరంగానే ఉండాల్సిన అవసరం లేదనిపించింది. అందులోనుండి ఓ ఆలోచన మొగ్గతొడిగింది.

టీవీల్లోనో, వార్తాపత్రికల్లోనో బాంబు పేలుళ్ల వార్తలు చూసినప్పుడు ఓ క్షణం ఉలిక్కిపడి, ఆ సమయంలో అక్కడ మనం లేనందుకు ఆనందపడతాం. ఆ ఘటన వెనకున్న తీవ్రవాదుల్ని తిట్టిపోస్తాం. దాన్ని అడ్డుకోలేకపోయిన పోలీసు, నిఘా వ్యవస్థల చేతగానితనాన్ని తూర్పారబడతాం. ఆ తర్వాత మన పనుల్లో మనం మునిగిపోతాం, మళ్లీ మరో సంఘటన జరిగేవరకూ. అంతే కానీ, ఓ వాస్తవం మాత్రం గమనించం. పేలిన ఒక బాంబు మాత్రమే మన దృష్టికొస్తుంది కానీ, పేలని వేల బాంబుల గురించి మనకెప్పటికీ తెలిసే అవకాశం లేదు. ‘రోజులు దారుణంగా ఉన్నాయి’ అనటమే మనకి తెలుసు. ‘అవి అంతకన్నా దారుణంగా ఉండొచ్చు …. కానీ లేవు’ అన్న నిజాన్ని మనం గుర్తించం. ‘ఎవరి పని వాళ్లు సరిగా చేస్తే ప్రపంచం ఇంతకన్నా భద్రంగా ఉండేది’ అనటమే మనకలవాటు. ‘ఎందరో నిజాయితీపరులు అవిశ్రాంతంగా వృత్తిధర్మం నెరవేరుస్తుండటంవల్లనే ప్రపంచం ఈ మాత్రమన్నా భద్రంగా ఉంది’ అనే విషయాన్ని మనం పట్టించుకోం. మనకి తెలీకుండానే అనుక్షణం మనల్ని ఎవరో ఒకరు కాపాడుతున్నారు. వాళ్లెవరో మనమెరగం. అయినా వాళ్లకి రుణపడి ఉన్నాం. గుర్తింపుకి నోచుకోని ఆ unsung heroes కి నివాళిగా ఓ కథ రాయాలనిపించింది.

నా కథలన్నీ larger than life విషయాల చుట్టూ తిరుగుతుంటాయి. ఈ కథకీ అటువంటి వస్తువే ఎంచుకోవాలనుకున్నాను. కథానాయకుడు హోల్‌సేల్‌గా భూమండలం మొత్తాన్నీ కాపాడటం …. టైపులో అన్న మాట. అంటే ముందు భూమండలానికో పెను ప్రమాదం ముంచుకొచ్చేలా చెయ్యాలి. ఎప్పుడో ఏవో సైన్స్ మేగజైన్స్ తిరగేస్తుంటే కళ్లబడ్డ ఓ విశేషం, తర్వాతెప్పుడన్నా కథగా మలచటానికి బాగుంటుందని గుర్తు పెట్టుకున్నది, ఇప్పుడు అక్కరకొచ్చింది. 1979లో డాక్టర్ బెంజమిన్ లిబెట్ అనే శాస్త్రవేత్త మెదడు పనితీరు గురించి నిరూపించిన ఓ ఆసక్తికరమైన విశేషం అది. (అదేంటో కథలో వివరించా కాబట్టి మళ్లీ ఇక్కడ రాయబోవటం లేదు). ‘భవిష్యత్తుని ముందే చూడగలిగే టెక్నాలజీ అందుబాటులోకొస్తే?’ అన్న ప్రశ్న అందులోంచి పుట్టుకొచ్చింది. దానివల్ల లాభాలూ ఉన్నాయి, నష్టాలూ ఉన్నాయి. ఓ సైంటిస్టు సాధారణంగా తన పరిశోధనా ఫలితాలు కలిగించే లాభాలనే దృష్టిలో పెట్టుకుంటాడు. దీనికి విరుద్ధంగా, ఓ నిఘా నిపుణుడు అటువంటి టెక్నాలజీ వల్ల వచ్చే ప్రమాదాలనే ముందుగా అంచనా వేస్తాడు. ఈ రెండు రకాల వ్యక్తుల మధ్య ఉన్న వైరుధ్యం, వాళ్ల వృత్తి జీవితాలు వాళ్ల ఆలోచనల్ని , నమ్మకాల్ని ప్రభావితం చేసిన విధానం ఆధారంగా ప్రధాన పాత్రల మధ్య ఘర్షణ పుట్టించి చక్కని ఉత్కంఠతో ఓ కథ రాసే అవకాశం ఉంది. అలా ఈ కథ మొదలయింది. సైంటిఫిక్ సమాచారానికి కొంత కల్పన తాలింపుతో అది ‘రహస్యం’గా మీ ముందుకొచ్చింది. ఇందులో ‘అరక్షణం తర్వాత జరగబోయేది ముందే చూడగలగటం’ మాత్రం శాస్త్రీయంగా నిరూపితమైన విషయం. మిగిలిందంతా నా ఊహ.

ఇది ఉత్తమ పురుషంలో సాగే కథ. కథానాయకుడే తన కథ చెప్పుకుంటున్నాడు. కథ చివర్లో అతనో తీవ్రమైన నిర్ణయం తీసుకుంటాడు. అధమం రెండు జీవితాలు దాని మీద ఆధారపడి ఉంటాయి. తాను చేస్తున్నది సరైన పనే అన్న గట్టి నమ్మకం లేనిదే అతనా పని చేయలేడు. కాబట్టి అతనేమాత్రం ఊగిసలాట లేకుండా, మరో ఆలోచనకి తావీయకుండా తన నిర్ణయాన్ని అమలుచేసినట్లు రాయటం జరిగింది. పాఠకులకి అతను చేసిన పని నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఇదే కథని ప్రొఫెసర్ కోణం నుండి రాస్తే దీని ముగింపు ఇంకోలా ఉండొచ్చు. రాసింది ఏజంట్ కోణం నుండి కాబట్టి, కథ అతని చర్యల్ని సమర్ధించేలా ఉంటుంది. ఆ తేడా పాఠకులకి అర్ధమవుతుందన్న నమ్మకంతో, ఈ నేపధ్యాన్ని ముగిస్తున్నాను.

రహస్యం

ఈ లోకం – లోపాలూ, లోటుపాట్లూ లేనిది కాదు. అందరూ కోరుకునేంత అందమైనదీ కాదు. నలుమూలలా నేరాలు, ఘోరాలు, అవినీతి, అరాచకత్వం.
ఇది ఇంతకన్నా దారుణంగా ఉండొచ్చు. కానీ లేదు.
లోకం ఈ మాత్రమన్నా భద్రంగా ఉండటానికి వెనక ఎందరిదో శ్రమ దాగుంది. అకుంఠిత దీక్షతో తమ పని తాము చేసుకుపోయే పాత్రికేయులు, పోలీసులు, సైనికులు, సైంటిస్టులు, మరెందరో. వాళ్ల చర్యలు అనునిత్యం ప్రపంచాన్ని కాపాడే అదృశ్యహస్తాలు. వాళ్లలో కొందరి సాహసాలు చరిత్రలకెక్కే విజయాలు. కొందరి త్యాగాలు చీకట్లలో మగ్గే రహస్యాలు.
ఇది అలాంటి ఓ వ్యక్తి గాధ.

* * *

ఆయన్ని ప్రొఫెసర్ అందాం. వయసు అరవై ఐదు.

ప్రొఫెసర్‌కి చాలా పేరుంది. మనిషి మెదడు నిర్మాణమ్మీద ఆయన చేసిన పరిశోధనలకి నోబెల్ బహుమతొచ్చింది. ఆ తర్వాత అతి సహజంగా ఆయనకి మనదేశంలోనూ గుర్తింపొచ్చింది. ప్రభుత్వం ఆయనకి ‘భారతరత్న’ ప్రకటించి గౌరవించింది. ఆయన్ని రాష్ట్రపతిగా చేసి తమని తాము గౌరవించుకోవాలని రాజకీయపక్షాలన్నీ ఉబలాటపడ్డాయి. కానీ ప్రొఫెసర్‌కి ఆసక్తి లేకపోవటంతో ఉసూరుమన్నాయి.

ఆయన ఎక్కువగా బయటికి రాడు. నెలల తరబడి డిఆర్‌డివో లాబొరేటరీలో గడిపేస్తుంటాడు. ఆయనకంటూ ఓ ఇల్లున్నా అక్కడికి వెళ్లేది తక్కువే. ఓ కుటుంబం కూడా లేదు. వృత్తికే అంకితమైన జీవితం. రక్షణశాఖ కోసం రకరకాల పరికరాలు, పద్ధతులు రూపొందించటం ఆయన పని. ఎప్పుడూ ఏదో ఓ రహస్య పరిశోధనలో మునిగుంటాడు. తేలటం తక్కువే.

దేశభద్రత మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన పరిశోధనలవన్నీ.

ఇదంతా నాకెలా తెలుసు? నేనో ఇంటలిజెన్స్ ఏజెంట్‌ని కాబట్టి. నేను పనిచేసేది నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీలో. ప్రజల భద్రత మా ప్రధాన బాధ్యత. కరడుగట్టిన నేరస్థులు, ఉగ్రవాదుల నుండి నిజాలు కక్కించటం, వాటిని విశ్లేషించి ఎటువంటి ఘోరాలకు ఒడిగట్టబోతున్నారో ముందుగానే కనిపెట్టి వివిధ రాష్ట్రాల పోలీసు విభాగాలకి ఉప్పందిచటం ఇతర బాధ్యతల్లో ఒకటి. రెండేళ్ల కిందటివరకూ అదో పెద్ద సవాలుగా ఉండేది. ప్రొఫెసర్ కనిపెట్టి అభివృద్ధిపరచిన మైండ్‌రీడింగ్ ప్రక్రియ ఆ పరిస్థితిలో మార్పు తెచ్చింది. లై డిటెక్టర్, పాలీగ్రఫీ వంటి పాత పద్ధతులు ఇవ్వలేని ఫలితాలు దీనితో సాధ్యపడ్డాయి. మనిషి మెదడు పొరలని స్కాన్ చేసి అందులో ఎక్కడే సమాచారం నిక్షిప్తమై ఉందో చిటికెలో కనిపెట్టే పరికరం అందుబాటులోకి రావటంతో నేరపరిశోధన తేలికయింది. నూటికి తొంభై ఐదుగురి విషయంలో ఈ పరికరం పనిచేస్తుంది. అత్యంత మనోనిబ్బరం కలిగిన ఏ కొందరి విషయంలోనో మాత్రం ఇది ఉపయోగపడదు. ఉపయోగాలతో పోలిస్తే, అదో పెద్ద సమస్య కాదు. సమస్యలు వేరే ఉన్నాయి.

సాంకేతికత అనేది రెండువైపులా పదునున్న కత్తి. దాని ఉపయోగం వాడేవారినిబట్టి మారుతుంది. ఈ వినిమయ యుగంలో మిలటరీ అవసరాల కోసం పుట్టిన సాంకేతికత ఆ హద్దుదాటి కన్స్యూమర్ ఉత్పత్తుల్లోకి అడుగుపెట్టటానికి ఎంతో కాలం పట్టదు. ఇంటర్‌నెట్ నుండి సెల్‌ఫోన్లదాకా అదే కథ. అనతికాలంలోనే మైండ్ రీడింగ్ పరికరాలు సైతం అదే బాట పట్టాయి. వాటి వినియోగమ్మీద ఎన్ని ఆంక్షలున్నా అవి ఏదోలా బహిరంగ మార్కెట్లలో లభిస్తూనే ఉంటాయి. వాటి వల్ల దేశంలో విడాకుల కేసులెక్కువైపోయాయి. ఇదొక సైడ్ ఎఫెక్ట్. ఇలాంటివి మరిన్నీ ఉన్నాయి. కానీ అవన్నీ అప్రస్తుతం.

ప్రస్తుతంలోకొస్తే, ఈ సాయంత్రం ఏజెన్సీ అధినేత నుండి నాకో అత్యవసర సందేశమొచ్చింది – ఉన్న పళాన ప్రొఫెసర్ దగ్గరికెళ్లి ఆయనకి కాపలా ఉండమని. ప్రముఖుల భద్రత కూడా మా ఏజెన్సీ పరిధిలోకే వస్తుంది. నేనిలా అత్యవసరంగా వీఐపీల భద్రత చూడాల్సిన అవసరం పడ్డ సందర్భాలు ఇంతకు ముందూ ఉన్నాయి. కాబట్టి ఇది నాకు కొత్తకాదు. కొత్తగా తోచింది వేరే ఉంది. ప్రొఫెసర్ అత్యంత నిరాడంబరజీవి. రక్షణ శాఖలో కీలక సైంటిస్టుగా ఆయన క్షేమం దేశ ప్రయోజనాల రీత్యా అతి ముఖ్యం. ఆ కారణంగా గతంలోనే ప్రభుత్వం ప్రొఫెసర్‌కి కమాండోల సెక్యూరిటీ ఏర్పాటుచెయ్యబోగా ఆయన సున్నితంగా తిరస్కరించాడు. అటువంటిది, ఈ రోజు తనకి రక్షణ కావాలని స్వయానా ప్రొఫెసర్ నుండే అభ్యర్ధన రావటం వింత. ఓ పార్టీలో ఉండగా ఫోనొచ్చింది. వెంటనే బయల్దేరాను.

* * *

డిఆర్‌డీవో కాంప్లెక్స్ నగరం నుండి విసిరేసినట్లుంటుంది. కొండల మధ్యలో లోయలా ఉన్న ప్రాంతంలో, నాలుగువేల ఎకరాల విస్తీర్ణంలో నెలకొని ఉంది. నేనక్కడికి చేరుకునేటప్పటికి రాత్రి పది కావస్తుంది. ప్రధాన ద్వారం వద్ద సెక్యూరిటీ వాళ్లు ఆపారు. నా గుర్తింపుకార్డు చూశాక తూతూమంత్రంగా తనిఖీ చేసి గౌరవంగా లోపలకి పోనిచ్చారు.

లోపల, అక్కడొకటీ ఇక్కడొకటీ భవనాలు. వాటిని కలుపుతూ నున్నటి తారు రోడ్లు. ఆ రోడ్ల మీద అడపాదడపా తప్ప లేని వాహన సంచారం. మొత్తమ్మీద ఆ ప్రాంతం నిర్మానుష్యంగా ఉంది. ప్రొఫెసర్ ఉండే భవనం మిగిలిన భవనాల నుండి మరీ దూరంలో ఉంది. నా వాహనం దాన్ని సమీపిస్తుండగా కళ్లు అప్రయత్నంగా పరిసరాలని క్షుణ్నంగా పరిశీలించటం ప్రారంభించాయి. అనుమానాస్పదమైనదేదీ కనబడలేదు.

తలుపుకున్న గాజుకన్ను ముందు నా బ్యాడ్జ్ కనపడేలా పట్టుకుని బజర్ మోగించాను. రెండు నిమిషాలకి ప్రొఫెసర్ వచ్చి తలుపు తీశాడు, ‘క్షమించండి. ఓ ప్రయోగం చివర్లో ఉన్నా. మధ్యలో వదిలేసి రావటం కుదర్లేదు’ అంటూ.

ఫరవాలేదన్నట్లు నవ్వి ఆయన్ని అనుసరించాను. మా వెనకే తలుపు మూసుకుంది. లాక్ అయినట్లు శబ్దమొచ్చింది.

అదో విశాలమైన గది. ప్రొఫెసర్ దాన్ని లివింగ్ రూమ్‌లా మార్చుకున్నట్టున్నాడు. ఓ మూల చిన్న మంచం. మరో మూల ఆఫీస్ డెస్క్; దాని మీద రెండు ల్యాప్‌టాప్స్, ఏవో పేపర్లు, ఓ కాఫీ మేకర్, పక్కనే ఫ్రూట్‌బౌల్. మరోపక్క గోడవారగా పెద్ద బుక్‌షెల్ఫ్; దాన్నిండా బరువైన సైన్స్ పుస్తకాలు. గది మధ్యలో ఓ సింగిల్ సీటర్ సోఫా, మరో త్రీ సీటర్ సోఫా. వాటికి ఎదురుగా ఉన్న గోడకి వేలాడుతూ పెద్ద ఎల్ఇడి టెలివిజన్. మొత్తమ్మీద పెద్దగా అలంకరణలు, ఆడంబరాలు లేకుండా ఉందా గది.

‘ఇంకొంచెం పని మిగిలుంది. పది నిమిషాల్లో వచ్చేస్తాను. కాఫీ కావాలంటే అక్కడుంది చూడండి’ అంటూ బుక్‌షెల్ఫ్ పక్కనే గోడకున్న తలుపు తెరుచుకుని పక్క గదిలోకి మాయమైపోయాడు ప్రొఫెసర్. అదాయన లాబొరేటరీ కావచ్చు.

నేను గది నలుమూలలా పరికించాను. సోఫాల కింద, అల్మైరా వెనక, ఆఫీస్ డెస్క్ దగ్గర, మంచం కింద .. ఇలా ముఖ్యమైన ప్రదేశాల్లో వెదికి చూశాను. ప్రమాదకరమైనవేమీ కనపడలేదు. ప్రొఫెసర్‌కి ఎవరి నుండి ప్రమాదముందో, ఉన్నపళాన ఆయనకి సెక్యూరిటీ అవసరమెందుకు పడిందో ఆ వివరాలేమీ నాకు తెలీదు. ఎట్నుండి ఏ ప్రమాదమొస్తుందో తర్వాత సంగతి. ప్రమాదం అంటూ వస్తే బ్యాకప్ వచ్చేదాకా ప్రొఫెసర్‌ని కాపాట్టానికి అనువైన ఓ ప్రదేశం అవసరం. అందుకు ఈ లివింగ్ రూమ్ అనుకూలమా కాదా అన్నది తెలుసుకోవటం నా తనిఖీల పరమార్ధం.

అన్నట్లుగానే పది నిమిషాల్లో తిరిగొచ్చాడు ప్రొఫెసర్. ‘అరె. ఇంకా నిలబడే ఉన్నారేం. కూర్చోండి, కూర్చోండి’ అంటూ సింగిల్ సీటర్ సోఫావైపు చూపించాడు, ఆఫీస్ డెస్క్ దగ్గరికి నడిచి ఏవో కాగితాలు ఫైల్లో సర్దుతూ.

‘ఫర్వాలేదు’ అన్నా నేను. గంటల తరబడి అలర్ట్‌గా నిలబడే ఉండటం నాకు అలవాటైపోయిన విషయం.

‘నో, నో. మీరంత ఫార్మల్‌గా ఉండనవసరం లేదు. కూర్చోండి. ఇంతకీ కాఫీ తాగినట్లు లేరే. చల్లారిపోయిందా? మళ్లీ పెడతానుండండి’ అంటూ డెస్క్ మీదనున్న కాఫీమేకర్ అందుకున్నాడు. ‘భయపడకండి. నేను కాఫీ కాయటంలో ఎక్స్‌పర్ట్‌ని’ అంటూ నావైపు చూసి కన్ను గీటాడు.

నేను సోఫాలో కూర్చున్నాను. ఐదు నిమిషాల్లో రెండు కాఫీ కప్పులతో వచ్చాడాయన. ఓ కప్పు నాకిచ్చి ట్రిపుల్ సీటర్‌లో ఆసీనుడయ్యాడు.

కాసేపు గదిలో మౌనం రాజ్యమేలింది. కాఫీ సిప్ చేస్తున్నా నా చూపులు పరిసరాలని పరిశీలిస్తూనే ఉన్నాయి. ప్రొఫెసర్ వెనక గోడకున్న పెద్ద కిటీకీ మీదకి నా దృష్టి పదే పదే మళ్లుతుంది. ఆ కిటికీ రెక్కలకి మరీ అంత మందంగాలేని గాజు పలకలు బిగించి ఉన్నాయి. ప్రమాదం అంటూ వస్తే అట్నుండే రావాలి.

నా చూపుల్ని ప్రొఫెసర్ గమనిస్తూనే ఉన్నాడు. తాగటం పూర్తి చేసి కప్పు కింద పెట్టి చెప్పాడు.

‘మరీ ఆ స్థాయి కాపలా అవసరం లేదు. కొంచెం రిలాక్స్ అవ్వండి. రేపు ఉదయం దాకా మీరు నాకు తోడుగా ఇక్కడుంటే చాలు. జస్ట్, నాకు కంపెనీ ఇవ్వటం అనుకోండి. ఓ కమాండోలా కాకుండా నా గెస్ట్‌లా ఉండండి. దయచేసి, ముందలా మరమనిషిలా చూట్టం మానేయండి’ అన్నాడు నవ్వుతూ.

నేనూ నవ్వి రిలాక్సయ్యాను.

‘ఇంకేమిటి విశేషాలు. బయట ప్రపంచం ఎలా ఉంది?’ అన్నాడాయన. ‘ఈ పరిశోధనల్లో మునిగిపోయి బయటేం జరుగుతోందో పట్టించుకోటం లేదు’ అన్నాడు మళ్లీ తనే సంజాయిషీ ఇస్తున్నట్లు.

‘మానభంగాలు, అరాచకాలు, హత్యలు, దొంగతనాలు, కుంభకోణాలు, ఉగ్రవాదం. అంతా యధాతధంగానే ఉంది. ఆసక్తికరమైన విశేషాలేం లేవు’

‘అంటే మీకు చేతినిండా పనన్న మాట’

‘అవును. నాగరికత పురోగమించేకొద్దీ మనిషి తిరోగమిస్తున్నాడు. అందుకే నేరాలు ఏ ఏటికా ఏడు పెరిగిపోతూనే ఉన్నాయి’

‘నిజమే. మనిషి బుర్రలో ఏం ఆలోచనలున్నాయో తవ్వి తీయగలుగుతున్నాం కానీ అందులో దురాలోచనలు దూరకుండా అడ్డుకోలేకపోతున్నాం’, ప్రొఫెసర్ నిట్టూర్చాడు.
మళ్లీ కాసేపు మౌనరాజ్యం. నా కప్పులో కాఫీ ఐపోయింది. అది కిందపెట్టబోతుంటే ప్రొఫెసర్ వారిస్తూ లేచి కప్పందుకున్నాడు. తన కప్పు కూడా తీస్కెళ్లి డెస్క్ మీద పెట్టేసి అక్కడున్న ఫ్రూట్‌బౌల్ నుండి ఓ అరటిపండు వలుచుకుని తినటం మొదలు పెట్టాడు. తిన్నంతసేపూ ఏదో ఆలోచనలో మునిగిపోయినట్లు శూన్యంలోకి చూశాడు. తర్వాత, ఇందాకటి సంభాషణ కొనసాగిస్తున్నట్లు చెప్పాడు.

‘ఐతే …. మనుషులకి వక్రబుద్ధులు పుట్టకుండా చేయలేకపోవచ్చు కానీ, అవి అమలు జరగకుండా ఆపగలిగే రోజు ఎంతదూరంలోనో లేదు’.

నేను ప్రశ్నార్ధకంగా చూశాను.

‘మైండ్ రీడింగ్ ద్వారా మనుషుల తలపులు గ్రహించి, వాళ్లు తలపెట్టిన ఘోరాలని ఊహించి వాటిని నివారించే ప్రయత్నం చేస్తున్నారు మీరు. ఆ ప్రయత్నంలో కొన్నిసార్లే విజయవంతమవుతున్నారు. ఎందుకు? ఈ సాంకేతికత మీకు కేవలం జరగబోయే నేరాల గురించి ఓ అంచనా మాత్రమే కల్పిస్తుంది కాబట్టి. ఆ అంచనా కొన్నిసార్లు తప్పూ కావచ్చు. అందుకే, మనకి మైండ్ రీడింగ్‌ని మించిన టెక్నాలజీ అవసరం’, ప్రొఫెసర్ వివరించటం మొదలు పెట్టాడు. ‘దాన్ని సాధించే పరిశోధనల్లోనే నేను రెండేళ్లుగా తలమునకలయ్యున్నాను. అందుకే రాష్ట్రపతి పదవిని సైతం వదులుకున్నాను. ఈ ప్రయోగంలో విజయవంతమైతే దేశానికి ఒనగూడే ప్రయోజనం కన్నా ఆ పదవి ముఖ్యం కాదు’.

నాకాయన మీదున్న గౌరవం అమాంతం రెట్టింపయింది. ‘మీకభ్యంతరం లేకపోతే, ఆ పరిశోధనేంటో చెబుతారా?’, ఆసక్తిగా అడిగాను.

‘అభ్యంతరమేం లేదు. ఎలాగూ రేపీపాటికి ఇది దేశమంతా తెలిసిపోయేదే’

‘అంటే ..?’

‘అవును. పరిశోధన ఫలించింది. అఫ్‌కోర్స్, ఈ ప్రక్రియలో మనమింకా తొలిదశలోనే ఉన్నామనుకోండి. దీన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి మిలటరీకి, మీ ఏజెన్సీకీ అందుబాటులోకి తేవటానికి మరో రెండు మూడేళ్లు పట్టొచ్చు. ప్రస్తుతానికైతే, రేపు ఉదయాన్నే ప్రెస్‌మీట్‌లో కొన్ని విశేషాలు వెల్లడిస్తున్నాను. పిఆర్ కోసం చేసే తప్పనిసరి తంతన్నమాట. పైగా, ప్రాజెక్ట్‌లో మిగతా దశలకి ఫండింగ్ కోసం కూడా ఇలాంటివి తప్పదు’

‘ఇంతకీ, ఏంటా పరిశోధన’, ఉత్కంఠ భరించలేక మళ్లీ అడిగాను ఆయన వాక్ప్రవాహానికడ్డొస్తూ.

‘చెబుతాను. దానికి ముందు మీక్కొంచెం నేపధ్యం చెప్పాలి’ అంటూ మొదలుపెట్టాడు ప్రొఫెసర్. ‘చూపు, వినికిడి, స్పర్శ, వాసన, రుచి – మనిషిని పరిసరాలతో అనుసంధానించే పంచేంద్రియాలు. కళ్లు, చెవులు, చర్మం, ముక్కు, నాలుక …. ఇలా శరీరంలో ఒక్కో భాగం ద్వారా ఒక్కో జ్ఞానం మనకి కలుగుతుంది. ఆయా భాగాలు నాడీవ్యవస్థ ద్వారా సదరు సమాచారాన్ని మెదడుకి చేరవేస్తాయి. దాన్ని మెదడు ప్రాసెస్ చేసి శరీరం ఎలా ప్రతిస్పందించాలో నిర్ణయిస్తుంది. 1979లో డాక్టర్ బెంజమిన్ లిబెట్ అనే శాస్త్రవేత్త దీనికి సంబంధించిన ఓ విశేషాన్ని కనిపెట్టాడు. అదేంటంటే, శరీరం సేకరించిన ఇంద్రియజ్ఞానం మెదడు స్వీకరించి, తిరిగి శరీరం ఎలా ప్రతిస్పందించాలో తెలియజేసేసరికి కనీసం అరక్షణం గడుస్తుంది’

‘అర్ధం కాలేదు’

‘ఐతే మీకు సోదాహరణంగా చెబుతా. ఇది తింటూ వినండి’ అంటూ ఫ్రూట్‌బౌల్ నుండి ఓ ఆపిల్ అందుకుని మెరుపులా నా వైపు విసిరాడు. సూటిగా నా ముఖమ్మీదకి దూసుకొచ్చిందది. మరో లిప్తలో అది నా ముఖాన్ని పచ్చడి చేస్తుందనగా నా చెయ్యి లాఘవంగా దాన్ని ఒడిసిపట్టింది.

‘గుడ్ రిఫ్లెక్సెస్. చాలా చురుగ్గా కదిలారు. కమాండో శిక్షణ ఊరికేపోలేదు’ అంటూ ప్రొఫెసర్ వచ్చి మళ్లీ తన సోఫాలో కూర్చున్నాడు. ‘రెటీనా మీద పడ్డ వెలుతురు అక్కడినుండి మెదడులోకి చేరటానికి, మెదడు దాన్ని దృశ్యంగా మార్చటానికీ మధ్య కనీసం అరక్షణం గడుస్తుంది. మరోలా చెప్పాలంటే, నేను ఆపిల్ విసిరిన అరక్షణానికి కానీ అది మీరు చూడలేరు’ అన్నాడు సోఫాలో సర్దుకుంటూ.

‘అయితే?’

‘నేను విసిరిన వేగానికి, ఆ లోపే ఆపిల్ మీ ముఖానికి తగిలుండాలి. కానీ తగల్లేదు. మీరు సరిగా సమయానికి దాన్ని పట్టేసుకున్నారు. అంటే, నేను ఆపిల్ విసిరిన విషయం తెలీకముందే మీ శరీరం దాన్ని ఎదుర్కోడానికి సిద్ధమైపోయింది’

‘అదెలా సాధ్యం!?!’

‘ఎలాగంటే …. అరక్షణం తర్వాత ఏం జరగబోతుందో మీ మెదడు ముందే గ్రహించింది కాబట్టి. అంటే అది భవిష్యత్తులోకి తొంగిచూసిందన్న మాట. అందుకే మీరు అరక్షణం ఆలస్యంగా కాకుండా, నేను ఆపిల్ విసిరిన వెంటనే రియాక్ట్ కాగలిగారు. ఇది మనందరి మెదళ్లూ చేసే మాయ. మనం దీనికి ఎంతగా అలవాటుపడిపోయామంటే, ఇదిలా జరుగుతుందన్న ఊహే నమ్మశక్యంగా అనిపించదు’

ఈ విషయం ఇంకెవరన్నా చెబితే కొట్టిపారేసేవాడినేమో. కానీ మెదడు పనితీరు గురించి ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ తెలిసిన వ్యక్తి వెల్లడించే విశేషం నమ్మకతప్పదు. ఐతే ఒకటి మాత్రం నాకర్ధం కాలేదు. అదే అడిగాను.

‘భవిష్యత్తులోకి చూట్టం ఎలా సాధ్యం? భవిష్యత్తు ఇంకా జరగలేదుగా’

‘అది అందరూ అనుకునేది. నిజానికి భూత, భవిష్యత్, వర్తమాన కాలాలనేవి విడివిడిగా లేవు. అవన్నీ మనుషులు తమ వెసులుబాటు కోసం సృష్టించుకున్న పదాలు మాత్రమే. ఉన్నది ఒకటే కాలం’

‘ఏమిటది?’

‘గతం’

‘??’

‘అవును. జరగాల్సింది, జరిగే అవకాశం ఉన్నది మొత్తం ఇప్పటికే జరిగిపోయింది. అదంతా మన దృష్టిలో ఇంకా పడలేదంతే. మనం ఇప్పటికే గమనించినది గతం. ప్రస్తుతం గమనిస్తున్నది వర్తమానం. ఇంకా గమనించనిది భవిష్యత్తు. దట్సాల్’

‘అంటే …. భవిష్యత్తు కూడా ఇప్పటికే జరిగిపోయింది కానీ అది మనకింకా అనుభవంలోకి రాలేదంటారు’

‘ప్రిసైజ్‌లీ. ఐతే, ఈ భవిష్యత్తనేది ఒకటి కాదు. కొన్ని వందల భవిష్యత్తులుంటాయి. వర్తమానంలో మనం ఏం చేస్తున్నామనేదాన్నిబట్టి ఆ వందలాది భవిష్యత్తుల్లో ఏదో ఒకటి మన అనుభవంలోకొస్తుంది. అదే మన గతంగా మారుతుంది’

‘ఒకటికన్నా ఎక్కువ భవిష్యత్తులంటే …. ముందేం జరగబోతుందో తెలిస్తే దాన్ని మార్చుకునే అవకాశం ఉందన్న మాట’

‘అవును. ఇందాక జరిగిందదే. నేను ఆపిల్ విసరడానికి అరక్షణం ముందే మీ మెదడు దాన్ని చూడగలిగింది. అందువల్లే ఆపిల్ మీ ముఖమ్మీద కాకుండా చేతిలో పడింది. లేకపోతే దానికి వ్యతిరేకంగా జరిగుండేది’

‘బాగానే ఉందిదంతా. ఇంతకీ మెదడు అరక్షణం తర్వాతేం జరుగుతుందో ముందే ఎలా పసిగట్టగలుగుతుంది?’

‘ఆ సమాచారమంతా మెదడులోనే ఉంటుంది. గతం ఎలాగైతే మెదడు పొరల్లో ఓ జ్ఞాపకంగా బంధించబడి ఉంటుందో, మనకున్న వందలాది భవిష్యత్తులు కూడా అలాగే జ్ఞాపకాలుగా మెదడులోనే భద్రంగా ఉంటాయి. కాకపోతే, మనకి గతం మాత్రమే గుర్తుంటుంది. భవిష్యత్తులేవీ గుర్తుండవు. మన వర్తమానానికి తగిన భవిష్యత్తుని ఎంచుకుని ఆ జ్ఞాపకాలని ఓ అరక్షణం ముందే తవ్వి తీసే శక్తి మన మెదళ్లకుంది. అంతకు మించి ముందుకెళ్లగలిగితే ఎలా ఉంటుందనే ఊహ నా పరిశోధనకి పునాది’

‘అంటే?’

‘భవిష్యత్తులోకి మరింత లోతుగా తొంగిచూసే పద్ధతి కనిపెట్టటం ఆ పరిశోధన లక్ష్యం. అందులో నేను విజయం సాధించాను కూడా’

‘కంగ్రాచ్యులేషన్స్’, చెప్పానే కానీ నా గొంతులో నమ్మకం ధ్వనించలేదు. అదాయన గమనించాడు.

‘మీరు నమ్ముతున్నట్లు లేరు. ఉండండి మీకిప్పుడే డెమో ఇస్తాను’ అంటూ నన్ను సోఫాలోంచి లేచి నిలబడమని సైగ చేశాడు. ఆయన చెప్పినట్లే చేశాను.

‘కొంచెం రిలాక్స్ అవండి. కళ్లు మూసుకుని ఓ నిమిషం శ్వాస పీల్చి వదలండి’ అంటూ నన్నో ప్రత్యేకమైన భంగిమలో నిలబెట్టాడు. ఆ తర్వాత నా చెవిలో ఓ పొడుగాటి వాక్యం చెప్పాడు.

‘మీ మెదడు పొరల్లో నిద్రాణంగా ఉన్న భవిష్యత్తు జ్ఞాపకాలని వెలికితీసే ఫార్ములా ఇది. దీన్ని ఏకాగ్రతతో పదేపదే మననం చేసుకోండి. అప్పుడు మీకు మీ భవిష్యత్తు గోచరిస్తుంది’ అన్నాడు.

నాకు నవ్వొచ్చింది. ‘ఇది సైన్స్ ప్రయోగంలా లేదు. ఒంటికాలి మీద నిలబడి తపస్సు చేస్తున్నట్లుంది’ అన్నాను నవ్వాపుకుంటూ, కళ్లు తెరవకుండానే.

‘ఓ దశ దాటిపోయాక ఆ రెంటికీ పెద్దగా తేడా లేదులే. చెప్పింది చెయ్యండి’ అన్నాడాయన ఆజ్ఞాపిస్తున్నట్లు.

* * *

నేను మళ్లీ కళ్లు తెరిచేసరికి సోఫాలో కూర్చుని ఉన్నాను. ఆ స్థితిలో ఎంతసేపున్నానో, సోఫాలోకి ఎలా వచ్చానో గుర్తురాలేదు. కళ్లెదురుగా ప్రొఫెసర్ ముఖం కనబడింది.

‘ఎంతసేపయింది?’, అన్నాను అర్ధోక్తిలో.

‘ఎంతో సేపెక్కడ. ఒక్క నిమిషం లోపే. చెప్పాను కదా, ఈ ప్రయోగం ఇంకా తొలిదశలోనే ఉంది. ప్రస్తుతానికి మీరు వెలికితీయగలిగేది మీ …’

‘…. చిట్టచివరి జ్ఞాపకం’ ఆయన వాక్యాన్ని నేను పూర్తి చేశాను.

‘అవును. మీ కళ్లు చూసే చివరి దృశ్యమన్న మాట. మీ జీవితంలో ఆఖరి ఘట్టం. ఇంతకీ ఏం చూశారు?’

‘నన్ను ఉరి తీయటం’, మెల్లిగా చెప్పాను. ఇంకా కళ్లముందే మెదులుతుందా దృశ్యం. నా నేరాన్ని చదివి వినిపించటం, తర్వాత ముఖానికి ముసుగేసి ఉరితాడు బిగించటం, కాళ్ల కింద చెక్క పక్కకి తొలగటం, మెడ విరిగిన శబ్దం. అంతా నిమిషం లోపే.

నా ముఖమ్మీద చెమటలు పట్టాయి. వళ్లంతా వణుకు. అంత ఏసీలో కూడా ఉక్కపోతగా అనిపించింది. మెడలో టై వదులుచేశాను.

‘భయపడకండి. మీరు చూసేశారు కాబట్టి అది జరగకుండా తప్పించుకోవచ్చిక’, అనునయంగా చెప్పాడు ప్రొఫెసర్.

నాకు వణుకింకా తగ్గలేదు. లేచి చిరాగ్గా గదిలో పచార్లు చేయటం మొదలు పెట్టాను. టై మెడనుండి ఊడిపడి చేతిలోకొచ్చి గిరగిరా తిరుగుతుంది. బుర్రలో ఆలోచనలు గింగిరాలు తిరుగుతున్నాయి. ఇంకా ఏ మూలో అపనమ్మకం. నేను చూసింది నిజమేనా?

‘చూశారుగా. ఎలాంటి పరికరాలు అవసరం లేని ప్రక్రియ. పురాతన కాలంలో దీన్నే దివ్యదృష్టి అనేవాళ్లు. దీనిక్కాస్త పదునుబెట్టి భవిష్యత్తుని మరింత వివరంగా చూడగలిగితే, అప్పుడది దేశభద్రతకి పనికొచ్చే అద్భుతమైన ఆయుధమవుతుంది. భవిష్యత్తులో జరగబోయే నేరాలు ముందే సవివరంగా తెలుసుకుని ఆపటం సాధ్యమవుతుంది. ఇంకెంత.. మహా ఐతే రెండు మూడేళ్లు చాలు’, సోఫాలో కూర్చుని ఆనందంగా చెప్పుకుపోతున్నాడు ప్రొఫెసర్.

నేనాయన మాటలకి అడ్డు తగిలాను.

‘ప్రొఫెసర్. ఇంతకీ మీరు మీ భవిష్యత్తులోకి చూశారా?’

‘అఫ్‌కోర్స్. చూడకుండా ఎలా ఉంటా?’

‘ఏం కనబడింది?’

‘నా చివరి క్షణాలు … ఎవరో వెనకనుండి నా గొంతు నులుముతున్నారు. ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతున్నాను. గింజుకుంటున్నాను. కళ్ల ముందు ఈ గది గిరగిరా తిరుగుతుంది. నిమిషం పాటు అదే దృశ్యం. ఆ తర్వాత కళ్లలో మెరుపులు మెరిశాయి. అంతా నల్లగా మారిపోయింది. అంతే’

నా కళ్లు పెద్దవయ్యాయి. అపనమ్మకం మటుమాయమయింది. మా ఇద్దరి భవిష్యత్తులూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఐతే ఆ విషయం నాకు మాత్రమే తెలుసు, ప్రొఫెసర్‌కి తెలీదు. ఇద్దరం ఒకే భవిష్యత్తు చూశామంటే – ఇది కచ్చితంగా నిజమే.

తక్షణం నేనేం చెయ్యాలో బోధపడింది. తలతిప్పి ప్రొఫెసర్‌కేసి చూశాను. సోఫాలో అటుతిరిగి కూర్చుని ఉన్నాడాయన. నన్ను గమనించే స్థితిలో లేడు. ఇంకా చెప్పుకుపోతున్నాడు,

‘రేపు ప్రెస్‌మీట్ తర్వాత ఈ ఫార్ములాని భద్రంగా ప్రభుత్వానికి అందజేస్తాను. అందాకా నేను క్షేమంగా ఉండటం అత్యవసరం. అందుకే మిమ్మల్ని పిలిపించాను’.

‘ఈ ఫార్ములా ఇంకెవరికన్నా చెప్పారా?’, ఆత్రుత ధ్వనించకుండా జాగ్రత్తపడుతూ అడిగాను.

‘లేదు. ఇప్పుడు మీకు చెప్పేవరకూ అసలీ పరిశోధన గురించి కూడా ఎవరికీ తెలీదు’, ప్రొఫెసర్ వెనక్కి తిరిగి చూడకుండానే చెప్పాడు.

చాలు. నాక్కావలసింది అదే. వెంటనే మెరుపులా ముందుకొంగాను. లిప్తపాటులో నా చేతిలోని టై ప్రొఫెసర్ మెడచుట్టూ బిగుసుకుంది. వణుకుతున్న చేతుల్లోకి బలమంతా తెచ్చుకుంటూ మౌనంగా ఉచ్చు బిగించసాగాను. కాసేపు గింజుకున్నాక, నా బలం ముందు ఆయన వృద్ధదేహం ఓడిపోయింది. మూడే నిమిషాల్లో అంతా ముగిసిపోయింది. ఆయన ప్రాణం పోయిందని నిర్ధారించుకున్నాక నోరు విప్పి చెవిలో చెప్పాను, ‘సారీ ప్రొఫెసర్. నా నేరమేమిటో చెప్పలేదు కదూ. అది, దేశద్రోహం. మిమ్మల్ని చంపినందుకు నా మీద మోపిన అభియోగం’.

నా వంట్లో వణుకు తగ్గిపోయింది. గుండె కుదుటపడింది.

* * *

ఆ భవనం అగ్నికీలలకి ఆహుతవుతుంది. నేను దాని ముందున్న బెంచ్ మీద కూర్చుని ఉన్నాను. లోపల ప్రొఫెసర్ దేహం, దానితో పాటే ఆయన పరిశోధనకి సంబంధించిన సాక్షాధారాలన్నీ బూడిదైపోయాయి. దూరంగా సెక్యూరిటీ వాహనం సైరన్ మోగించుకుంటూ ఇటే వస్తుంది. ఫైర్ అలార్మ్ పనిచెయ్యకుండా చేసి భవనంలో ఉన్నవన్నీ తగలబెట్టేశాక నేనే వాళ్లకి ఫోన్ చేశాను.

భవిష్య దర్శన ప్రక్రియ మంచివాళ్ల చేతుల్లోనే ఎల్లకాలమూ రహస్యంగా ఉండే అవకాశం లేదు. అది అందరికీ అందుబాటులోకి వచ్చిననాడు ప్రపంచం ఈ మాత్రం క్షేమంగా కూడా ఉండదు. ఒక మోసకారి స్టాక్‌బ్రోకర్ దీన్ని వాడుకుని ప్రపంచ ఆర్ధికవ్యవస్థలన్నిట్నీ అతలాకుతలం చెయ్యొచ్చు. ఓ దగుల్భాజీ రాజకీయనాయకుడు దీనితో ప్రత్యర్ధుల ప్రాణాలు తీయొచ్చు. ఓ తీవ్రవాది దీని సాయంతో ఎప్పటికీ పట్టుబడకుండా తప్పించుకు తిరగొచ్చు. దీనివల్ల ఒరిగే లాభాలకన్నా జరిగే నష్టాలే మిన్న. అందుకే ఈ ప్రక్రియ వెలుగులోకి రాకూడదు. ఆ సంగతి ప్రొఫెసర్‌కి వివరించినా ఉపయోగం ఉండదు. ఇంత కీలక పరిశోధనా ఫలితాన్ని నావంటి అపరిచితుడికి వెల్లడించిన మనిషిని నమ్మటం ఎలా? అందుకే ఆయన్ని తుదముట్టించటం మినహా దారిలేకపోయింది. ఇప్పుడా ఫార్ములా తెలిసిన వ్యక్తి ఒకడే మిగిలున్నాడు – నేనే. నేను ఎక్కువకాలం బతికుంటే ఆ ఫార్ములా అవసరానికో, స్వార్ధానికో బయటపెట్టొచ్చు. కాబట్టి నేనూ వీలైనంత త్వరగా అంతమైపోవాలి. ఆత్మహత్య అంత తేలిక్కాదు. ఇక మిగిలిన దారి, లొంగిపోవటం. లొంగిపోతే నా భవిష్యత్తేంటో నాకు తెలుసు. అన్నాళ్లూ ఈ రహస్యం నా దగ్గర భద్రంగా ఉంటుందన్న విషయమూ తెలుసు; మైండ్ రీడింగ్ ప్రక్రియతో ఇంటరాగేట్ చేసినా బయటపడనంత భద్రంగా. ఎందుకంటే, మైండ్ రీడింగ్‌కి లొంగని ఐదు శాతం మందిలో నేనూ ఒకడిని.

సెక్యూరిటీ వాహనం ఎదురుగా వచ్చి ఆగింది. గార్డులు తుపాకులు ఎక్కుపెడుతూ నన్ను చుట్టుముట్టారు. ప్రతిఘటించే ఉద్దేశం నాకు లేదు.

ఈ లోకం – లోపాలూ, లోటుపాట్లూ లేనిది కాదు. అందరూ కోరుకునేంత అందమైనదీ కాదు. నలుమూలలా నేరాలు, ఘోరాలు, అవినీతి, అరాచకత్వం.

ఇది ఇంతకన్నా దారుణంగా ఉండొచ్చు. కానీ లేదు.

లోకం ఈ మాత్రమన్నా భద్రంగా ఉండటానికి వెనక ఎందరిదో శ్రమ దాగుంది. అకుంఠిత దీక్షతో తమ పని తాము చేసుకుపోయే పాత్రికేయులు, పోలీసులు, సైనికులు, సైంటిస్టులు, మరెందరో. వాళ్ల చర్యలు అనునిత్యం ప్రపంచాన్ని కాపాడే అదృశ్యహస్తాలు. వాళ్లలో కొందరి సాహసాలు చరిత్రలకెక్కే విజయాలు. కొందరి త్యాగాలు చీకట్లలో మగ్గే రహస్యాలు.

ఇది అలాంటి ఓ వ్యక్తి గాధ.

ఇది, నా కథ.

(The End)

 (All rights on the above  text are reserved. It should not be printed or redistributed without the author’s permission.)