ఎందుకిలా —?

– ప్రసాద్  బోలిమేరు

~

ఈ లోలోపలి నది , ఈ ధ్యానం
అగరుబత్తి పొగలా అటూ  ఇటూ , ఎటో లాక్కెళుతూనే వుంటుందా?
నువ్వేమో వొంపుతిరిగిన మెత్తటి గాలంలా అమూర్తభావంలా-
చిరుతరగనై  కల్లోల తరంగాన్ని భరించాలని ప్రతిబింబించాలని
నేను
అందీఅందక అల్లంత దగ్గరలోనో దూరంలోనో
మనసు రెప్పలమీద వేలాడుతూ ,,
వన్నెలతో  ,వేళ్ళ కుంచెలతో
రాగాలు రంగరిస్తూ వాసనలద్దాలని,
కాంక్షల శిరస్సుపై నిప్పురవ్వలా భ్రాంతిని , మోస్తూ —
నువ్వేమో
ఈ పురాకృత నదీ నడుమన
అవిధేయ ప్రయాణానివి
గడుసైన అలవికాని చిత్రానివి
నా ప్రేరణకు అందని గేయానివి
మొదటి రాత్రిని ముద్దిడిన మొట్టమొదటి చంద్ర కిరణానివి–
ఎందుకు నేనిలా ?
ఒడ్డున ఆకులురాలిన పొదకు కట్టేసిన
లంగరు వేసిన భావాన్ని ,
రంగుల కళలు తాగని రాత్రిని
పురాతన ఇంద్రియ జ్ఞానాన్ని, మోహాన్ని–

శిశిరరేఖ

 

 

– ప్రసాద్  బోలిమేరు

~

ఓ పక్క
రాగాలు
పండుటాకుల్లా రాలి తేలుతుంటే
ప్రతికొమ్మా ఓ వాయులీనమే
వెర్రెక్కిన గాలికుంచెకు నేలనేలంతా
రాగక్షేత్రమే
 
మరోపక్క
వగరెక్కిన మోహం
పాటలపులకింతగా
రెమ్మరెమ్మా ఓ సింగారగానం
 
కాదా?
ఈ రుతువుల స్వరమేళనం
పురాతనగేయపునర్నవీకరణం
పులకరిస్తున్నప్రాణానుకరణం
పురిటినొప్పుల బృందగానం
 
ప్రతి సీతాకోకచిలుకా
నిలకడ లేని ఓ వన్నెల ఆలొచనే
రేపటివిత్తుని మోసుకెళ్తున్న
ఓ పరాగరేణువే
ప్రతి ఫలమూ ఓ పువ్వు ధ్యానమే

ప్రతి ఆరాటం
వీడుకోలు, ఆహ్వానాల సంయోగం
శిశిర పవనాల నీడ
వసంత కవనాల జాడ
చూలాలి బుగ్గ మీది

తీపి ఏడుపు చార.

నిన్నటి విషాదగానం గుర్తులేకుంటే
రేపటి నిషాద గీతాన్నెలా గుర్తుపట్టాలి?

*

నైరూప్య ఏకాంతం

 

 

– ప్రసాద్  బోలిమేరు
~
bolimeru
నువ్వే లేకుంటే
ద్వేషించలేక ప్రేమలో కూరుకుపోతా
ప్రేమించేలోపే ముడుచుకుపోతా
నువ్వేకదా హరివింటిలాటి ఉనికిని దానం చేసేది
గాయాలకి గర్వాలకి వేదికని చేసేది
ఎంత ప్రసవ వేదన ఎన్నిమార్లు
అనుభూతించి ఉంటావో చినుకులా
ఏకాంతమా
ఊదా, ఎరుపుల నడుమ ఎలా ఒదిగి పోవాలి
ఉదయాస్తమయాలను ఎలా రంగరించాలి
నువ్వే లేకుంటే !
నాలోకి పోతూ , ఇంకిపోతూ గుబురుగుబురుగా
ఆకుపచ్చటి ఆశల్ని ఎంతలా పోగేస్తావు
ఏ పువ్వును కోయబోతే
ఏ ముల్లు గుచ్చుకొంటుందో
మునివేళ్ళవుబికే వాసనల రక్తపు చుక్క
ఎర్రటి ప్రవక్తలా కొత్త రుచుల దారి
పువ్వునించి విడిపోతున్న పరిమళాన్ని
మనసు పొరల్లో
నైరూప్య శిలాజంలా బతికిస్తావు
నువ్వే లేకుంటే —
రంగులరెక్కలెవరిస్తారు ఈ ప్యూపా నిద్రకి ?
ఏకాంతమా
బుగ్గ మీది మల్లెతీగా , పెదవిపైని మెరుపుతీగా
నువ్వేలేకుంటే !?!
*